రూ.10.77 కోట్లు తాగేశారు
● కిటకిటలాడిన మద్యం దుకాణాలు ● ఆఫర్ల వర్షం కురిపించిన బార్లు ● మద్యం దుకాణాల్లో రూ.8.8 కోట్లు.. బార్లలో రూ.1.5 కోట్లు
విశాఖ సిటీ: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా సాగాయి. డిసెంబర్ 31న ఒక్క రోజే జిల్లాలో సుమారు రూ.10.77 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని తాగేశారు. దీంతో కూటమి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. ఒకటో తేదీన రూ.6.5 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు విక్రయాలకు అనుమతి ఉండడంతో అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత నెల డిసెంబర్ 22వ తేదీ నుంచే నగరంలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. రెండు ఆదివారాల్లోను, క్రిస్మస్ రోజున సుమారు రూ.35 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా గత మూడు రోజుల్లో మద్యం వ్యాపారులు భారీ స్థాయిలో స్టాక్ నిల్వలు సిద్ధంగా ఉంచుకున్నారు.
కోవిడ్ తరువాత అత్యధిక ఈవెంట్లు
2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నగరంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు. కోవిడ్ తరువాత నగరంలో అత్యధిక ఈవెంట్లు, కార్యక్రమాలు ఈ ఏడాదే జరగడం విశేషం. స్టార్ హోటళ్లు, రిసార్టులు, కొన్ని ప్రైవేటు స్థలాల్లో ప్రత్యేక ఈవెంట్లు, మ్యూజికల్ నైట్లు, డీజేలు నిర్వహించారు. రూ.2 వేలు నుంచి రూ.20 వేలు వరకు ప్రవేశ రుసుం, ప్యాకేజీ ధరలు పెట్టినప్పటికీ.. వీటిలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో కస్టమర్లు పోటీపడ్డారు.
డిసెంబర్ 31న లిక్కర్ విక్రయాల జోరు
సర్కిల్ వైన్‌షాపులు బార్లు స్టార్ హోటళ్లు క్లబ్స్ టూరిజం అమ్మకాలు
మహారాణిపేట 19 38 8 4 0 2,37,76,339
సీతమ్మధార 18 20 0 0 0 1,48,16,719
గోపాలపట్నం 13 18 1 0 0 1,09,41,441
గాజువాక 33 25 1 1 1 2,21,66,923
పెందుర్తి 34 16 1 0 1 2,23,37,529
భీమిలి 28 2 1 1 2 1,37,23,923
మొత్తం 145 119 12 6 4 10,77,62,874
మహారాణిపేట సర్కిల్ టాప్
న్యూ ఇయర్ వేళ నగరంలో మద్యం ఏరులై పారింది. ప్రతి మద్యంషాపు మందుబాబులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. జిల్లాలో ఎకై ్సజ్ శాఖకు సంబంధించి 6 సర్కిళ్లు ఉన్నాయి. విశాఖలో 12 స్టార్ హోటళ్లు, 6 క్లబ్‌లు, 4 ఏపీ టూరిజం, 145 వైన్‌షాపులు, 119 బార్లు ఉన్నాయి. వీటిల్లో డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజున రూ.10,77,62,874 విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. సాధారణ రోజుల్లో సరాసరి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల మేర అమ్మకాలు జరుగుతాయి. కానీ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మందుబాబులు రెట్టింపు స్థాయిలో తాగేశారు. ఇందులో ఒక్క మహారాణిపేట స్టేషన్ పరిధిలోనే 8 స్టార్ హోట ళ్లు, 4 క్లబ్‌లు, 38 బార్లు 19 వైన్‌షాపులు ఉండడంతో ఒక్క రోజులోనే అత్యధికంగా రూ.2,37,76,339 ల మద్యం అమ్ముడుపోయింది. ఆ తరువాత పెందుర్తి సర్కిల్ పరిధిలో రూ.2,23,37,529, గాజువాక పరిధిలో రూ.2,21,66,923 మేర విక్రయాలు జరిగాయి. ప్రధానంగా ఒక్క వైన్ షాపుల నుంచే అత్యధిక అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని సర్కిళ్లలో ఉన్న 145 వైన్‌షాపుల్లో రూ.8,88,62,085, 119 బార్లలో రూ.1,55,40,372, 12 స్టార్ హోటళ్లలో 16,67,890, ఆరు క్లబ్‌లలో రూ.7,89,657, నాలుగు ఏపీ టూరిజంకు సంబంధించిన వాటిలో రూ.9,02,870 లిక్కర్ వ్యాపారం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment