● పవన్ వల్లే ప్యాకేజీ అంటున్న జనసేన ● బాబు వల్లేనని టీ
కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు ఉద్యమనేత అమృతరావు విగ్రహానికి పూలమాల వేస్తున్న గాజువాక జనసేన ఇన్‌చార్జ్ కోన తాతారావు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల ప్రకటన లేకుండా.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన గురించి కనీసం మాట్లాడకుండా.. ప్యాకేజీ ప్రకటనపై మాత్రం కూటమి పార్టీలు క్రెడిట్‌ను కొట్టేసేందుకు ఫీట్లు చేస్తున్నాయి. ప్రధానంగా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వల్లే స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ వచ్చిందంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఈ ప్యాకేజీ వచ్చిందంటూ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బాబు గొప్పతనమంటూ ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లు మోదీ 3.0 ప్రభావమంటూ ప్రకటనలు చేశారు. మొత్తంగా ఎవరికివారుగా కార్యక్రమాలు, ప్రకటనలు చేసుకుంటూ తమ గొప్పదనమంటూ చెప్పుకుంటున్నారు. మరోవైపు అసలు ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకుండా కేవలం ప్యాకేజీ ఇవ్వడమే తమ గొప్పంటూ మాట్లాడటాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించడంతో పాటు సెయిల్‌లో విలీనాన్ని ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ప్రత్యేక హోదా తరహాలోనే..!
వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుందని? ప్యాకేజీ వస్తే నిధులు వచ్చి అభివృద్ధి జరుగుతుందంటూ నాలిక మడతపెట్టేశారు. ఆ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపట్టినా.. చివరకు అదే పార్టీ పంచన చేరారు. తాజా ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా తరహాలో స్టీల్ ప్లాంట్‌పై కూడా కుట్ర జరుగుతోందనే అభిప్రాయాలను కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటివరకు కార్మికులకు వేతనాలు సకాలంలో రాకపోయినా పట్టించుకోని కూటమి నేతలు.. స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటన వచ్చిన వెంటనే తమదే క్రెడిట్ అంటూ ప్రకటనలు చేస్తున్నాయి. అదేవిధంగా ప్రైవేటీకరణ ప్రకటన వెనక్కి తీసుకోవాలని, సెయిల్‌లో విలీనం చేయాలంటూ గత నాలుగేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ధోరణిలో.. ప్యాకేజీ ప్రకటన బ్రహ్మాండం అనే రీతిలో కూటమి పార్టీలు ప్రకటిస్తుండటాన్ని కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. ప్రైవేటీకరణ ఆగకుండా కేవలం ప్యాకేజీతో నడిపిద్దామనుకునే ధోరణిలో ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment