1.5 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్
రేగిడి: సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో 1.5 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయినట్టు ఏవీపీ పట్టాభిరామిరెడ్డి సోమవారం తెలిపారు. వర్షాలు కారణంగా వారం రోజుల పాటు చెరకు క్రషింగ్ నిలుపుదలచేశామన్నారు. ప్రస్తుతం వాతావరణం అను కూలంగా ఉండడంతో రైతులకు కటింగ్ ఆర్డర్లు అందజేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 3 వేల మెట్రిక్ టన్నుల చెరకు గానుగ ఆడుతున్నామన్నారు. కర్మాగారానికి చెరకును తరలించిన వారంరోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్టు వెల్లడించారు.
కొనసాగుతున్న గుంతలు పూడ్చే పనులు
● ఆర్‌అండ్‌బీ ఏఈ బీకేఏ రాజు
బొబ్బిలి: ఆర్‌అండ్‌బీ రహదార్లపై ఏర్పడిన గుంతలను కప్పే మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఆర్‌అండ్‌బీ ఏఈ బీకేఏ రాజు అన్నారు. ‘గుంతల పేరుతో నిధుల గల్లంతు’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 24న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతుల పనులు చేస్తున్నామని, ఆ పనులు జరుగుతుండగానే వర్షాలు కురవడంతో గ్యాప్ వచ్చిందని ఏఈ తెలిపారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ రామభద్రపురం–రాజాం రోడ్లో మరమ్మతులు చేస్తున్నామన్నారు. డొంకినవలస ఆర్‌ఎస్ రహదారిని వైట్‌మిక్స్ వేసి మరమ్మతులు చేశామన్నారు. దీనికి బీటీ రోడ్డు కూడా వేస్తామన్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మరమ్మతుల పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు.
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి వనంగుడి, చదురుగుడి హుండీల ఆదాయాన్ని అమ్మవారి కళ్యాణ మండపం ఆవరణలో సోమవారం లెక్కించారు. చదురుగుడి హుండీల నుంచి 73 రోజులకు రూ.46,98,625లు, 48 గ్రాముల 900 మిల్లీ గ్రాముల బంగారం, 671 గ్రాములు వెండి, వనంగుడి హుండీల నుంచి రూ.8,55,212లు, 1 గ్రాము 700 మిల్లీగ్రాములు బంగారం, 141 గ్రాముల వెండి లభించినట్టు ఆలయ ఇన్‌చార్జి ఈఓ, ఉప కమిషనర్ కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక అధికారిగా రామతీర్థం దేవస్థానం ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
● ఎస్సీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్: నూతన సంవత్సర వేడుకలను జిల్లా వాసులు ప్రశాంత యుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. 31న రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టంచేశారు. జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment