‘సైబర్’ వల?
నిరుద్యోగ యువతను ట్రాప్ చేసి ఆర్థిక నేరాలకు
పాల్పడుతున్న నేరగాళ్లు
● జిల్లాలో నమోదైన కేసులో రోజురోజుకు పెరుగుతున్న నిందితుల సంఖ్య
● ఇప్పటికే 14 మంది రిమాండ్‌కు..
● తవ్వే కొద్ది కొత్త
విషయాలు వెలుగులోకి..
వనపర్తి: అక్రమ మార్గంలో ఈజీ మనీకి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మారుస్తూ అమాయకులకు వల వేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇంతవరకు లక్కీలాటరీ, బంపర్ ఆఫర్, మనీ ప్రైస్‌లను ఎరజూపి సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఈ విషయంపై పోలీసులు, బ్యాంకర్లు ప్రజలను చైతన్యం చేయడంతో కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారి జాబితాను అనధికారికంగా సేకరించి ఆయా ప్రాంతాల్లోని ముందస్తుగా డబ్బు ఎరజూపిన యువతతో ఫోన్లు చేయించి ధని, ముద్ర పథకాల్లో ఇప్పిస్తామంటూ ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ అంటూ ముందస్తుగా డబ్బులు దండుకొని మోసం చేస్తున్నారు. ఇలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నమోదైనట్లు తాజాగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షిఖా గోయల్ వెల్లడించిన విషయం విధితమే. కోల్‌కత్తా, ముంబై, పాట్నా తదితర ప్రాంతాల సైబర్ నేరగాళ్లు జిల్లాకేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాల యువతకు డబ్బు ఎరజూపి ట్రాప్ చేస్తున్నట్లు ఇటీవల మూడుసార్లు నేరాలకు పాల్పడిన 14 మంది యువకులను కోర్టుల్లో హాజరుపరుస్తున్న సమయంలో పోలీసులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో జిల్లాకేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ రుణానికి ప్రయత్నించి మోసపోయి చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన విచారణలో తవ్వే కొద్ది నిందితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలించగా.. మరో 150 మందికి పైగా యువకులు ఈ ప్రాంతంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నెల 21న అరెస్టు చేసిన వారి నుంచి ఓ కారు, పొక్లెయిన్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్‌లో నమోదైన ఈ కేసులో పోలీసులకు లభించిన లింకు ద్వారా అతిపెద్ద సైబర్ నేరస్తుల గొలుసుకట్టు వెలుగు చూస్తోంది.
నిరుద్యోగులే టార్గెట్..
జల్సాలకు అలవాటు పడిన నిరుద్యోగ యువతను ఎంపిక చేసుకొని వారికి విలాసవంతమైన జీవనాన్ని అలవాటు చేసి సైబర్ నేరాల రొంపిలోకి లాగుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కోల్‌కత్తా, ఢిల్లీ, పాట్నా తదితర ప్రాంతాల నుంచి వచ్చే వివరాల మేరకు రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారితో ఫోన్లో మాట్లాడి లోన్ ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. లోన్ కోసం ప్రయత్నిస్తున్న వారితో స్థానికులతోనే మాట్లాడిస్తే సులభంగా నమ్మి ఫీజుల కోసం డబ్బులు పంపిస్తారనే ఉద్దేశంతో స్థానిక యువతను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రధాన సైబర్ నేరగాళ్ల భాషను ఇక్కడి వారు సులభంగా గుర్తించి నమ్మరనే ఈ పన్నాగానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.
సైబర్ ఉచ్చులో పడొద్దు..
డబ్బు ఎరజూపి జల్సాలకు అలవాటు చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడేలా చేస్తున్న ఇతర ప్రాంతాల వారి మాటలు నమ్మి ఉచ్చులో పడొద్దు. కొత్తవారు డబ్బు ఎరజూపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయండి. ఈజీ మనీకి ఆశపడితే జీవితాలు నాశనం అవుతాయని గమనించాలి. ఇతరులను మోసం చేసి సంపాదించే డబ్బుపై యువత ఆశ పడొద్దు. – రత్నం,
డీఎస్పీ సైబర్ క్రైమ్ విభాగం, వనపర్తి
Comments
Please login to add a commentAdd a comment