రసాభాసగా పుర కౌన్సిల్ సమావేశం
వనపర్తి టౌన్: జిల్లాకేంద్ర పుర కౌన్సిల్ చివరి సమావేశం అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత ధూషణలతో రసాభాసగా మారింది. శుక్రవారం పుర కార్యాలయంలో చైర్మన్ మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ సభ్యుడు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, బండారి కృష్ణ, లక్ష్మీనారాయణ, నాగన్నయాదవ్ తదితరులు మాట్లాడుతూ.. పురపాలికలో తాగునీరు పుష్కలంగా ఉన్నా బోరుబావులు, మోటార్ల పేరుతో రూ.కోటి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పలు వార్డుల్లో అవసరం లేకున్నా రెండు, మూడు చోట్ల బోర్లు వేస్తున్నారని, ఎమ్మెల్యే నిధులతో బోర్లు వేయిస్తామని గతంలో చెప్పి ప్రస్తుతం పుర నిధులు ఎలా వాడుతారని ప్రశించారు. గతంలో కార్యాలయ ఫర్నీచర్ కొనుగోలుకు నిధుల కోసం ఆమోదించినా తిరిగి ఎజెండాలో పొందుపర్చడం ఏమిటని ప్రశ్నించారు. ఏడాది గడువు ముగిసినా రోడ్ల విస్తరణలో మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఒక్కో వార్డు అభివృద్ధికి రూ.5 లక్షల జనరల్ నిధులు కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డులకు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించడం అనైతికమన్నారు. దీంతో చైర్మన్ మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, వెంకటేష్, విభూది నారాయణ, చీర్ల సత్యం తదితరులు కల్పించుకోవడంతో సభ పరస్పర, వ్యక్తిగత ధూష ణల వరకు వెళ్లింది. 10 నెలల కిందట చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రాజీనామా చేసిన గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్ చివరి సమావేశానికిభ కౌన్సిలర్ హోదా లో రావడంతో పాటు ఎజెండాలోని అంశాలను లేవనెత్తడంతో ఆధ్యంతం సభ వాడీవేడిగా కొనసాగింది. ఓ దశలో సభ్యులు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థంగాని పరిస్థితి నెలకొంది. చివరి సమావేశం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రాజకీయలకు డెడ్‌లైన్ లేదు : ఎమ్మెల్యే
పదవులున్నా.. లేకున్నా ప్రజలకు సేవ చేసే సంకల్పం ఉండాలని, రాజకీయాలకు డెడ్‌లైన్ ఉండదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పుర చివరి కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పురపాలికను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని.. అన్నివేళలా సహకారం అందిస్తానన్నారు. పదవీకాలం పూర్తయిన సందర్భంగా అధికార, విపక్ష కౌన్సిలర్లకు అధికారులు పూలమాలలు వేసి జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించారు.
బోరుబావులు, ఫర్నీచర్ కొనుగోలు, రోడ్ల విస్తరణపై గళమెత్తిన బీఆర్‌ఎస్ సభ్యులు
సభలో తీవ్ర వాగ్వాదం.. పరస్పర ధూషణలు
Comments
Please login to add a commentAdd a comment