సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాం.. జెండాలు మోశాం.. కేసులనూ భరించాం.. తీరా అధికారంలోకి వచ్చాక పార్టీలు మారి వచ్చిన వారికే పదవులు దక్కుతున్నాయ్’ అంటూ ఓ కార్పొరేటర్.. ఓ చైర్మన్‌పై కీలక ప్రజాప్రతినిధి ఎదుట చర్చ పెట్టడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కలకలానికి దారితీసింది. ఈ చర్చ.. రచ్చకు హనుమకొండలో జరిగిన క్రిస్‌మస్ వేడుకలు వేదిక కావడంతో ఆలస్యంగా బయటకు పొక్కింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గొడవకు దారితీసిన వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ నడిబొడ్డున ఉన్న ఓ విద్యా సంస్థల అధినేత తన స్కూల్ ఆవరణలో శనివారం రాత్రి క్రిస్‌మస్ వేడుకలు నిర్వహించాడు. ఈ ఉత్సవాలకు ఓ కీలక ప్రజాప్రతినిధితో పాటు పలువురు కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను ఆహ్వానించారు. హాజరైన ప్రజాప్రతినిధి ముందుగా కేక్ కట్ చేసి సంబురాల్లో పాల్గొనగా.. రాత్రి 11 గంటల తర్వాత కార్పొరేటర్, ఇటీవల ఓ సంస్థకు జిల్లా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి అందరూ ఒకే చోట కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. అక్కడే ఉన్న ఓ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కేసుల పాలైన, దెబ్బలు తిన్న వారిని కాదని ఎన్నికల ముందొచ్చినా వారికి చైర్మన్ పదవులతోపాటు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సరికాదంటూ ప్రజాప్రతినిధి వద్ద చర్చకు తెర తీశాడు. దీంతో అక్కడే ఉన్న సదరు చైర్మన్, కార్పొరేటర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ కాస్త భౌతిక దాడులకు దిగే స్థాయికి చేరడంతో కీలక ప్రజాప్రతినిధి వెంట ఉన్న గన్‌మెన్‌లు తమ తుపాకులను ఎక్కుపెట్టి గొడవను సద్దుమణిగేలా చేసినట్లు సమాచారం. గొడవ సీరియస్ కావడంతో చైర్మన్ అక్కడి నుంచి వెళ్ల్లిపోగా.. ప్రజాప్రతినిధి కార్పొరేటర్‌తో పాటు మిగతా కేడర్‌కు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిసింది.
కీలక ప్రజాప్రతినిధి సాక్షిగా బయటపడ్డ విభేదాలు
అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకుల లొల్లి..
సర్దిచెప్పిన ప్రజాప్రతినిధి
తాత్కాలికంగా గొడవకు తెర..
Comments
Please login to add a commentAdd a comment