పాలన చేతగాకే అభాండాలు
హన్మకొండ: పాలన చేతగాక ప్రతిపక్షంపై సీఎం రేవంత్‌రెడ్డి, పాలక పక్షం అభాండాలు మోపుతున్నట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ చివరి రోజు జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తాము ఏమీ చేయలేక పోతున్నామని చేష్టలుడిగిన సమాధానం చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించారన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదై సంబరాలు జరుపుకున్న తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సంపద మూడున్నర రేట్లు పెరిగిందని చెప్పారు. పాలన చేయలేక, చేతగాక, చేసే శక్తి లేక, ఆదాయం పెంచుకోలేక ప్రతిపక్షంపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ప్రశ్నిస్తే, నిరసన తెలిపితే చెప్పులు, సీసాలు విసురుతారా..? ఇదేనా ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ అని ధ్వజమెత్తారు. దమ్ము, ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ బాస్కర్, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవ రెడ్డి పాల్గొన్నారు.
నిలదీస్తే చెప్పులు, సీసాలు విసురుతారా?
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
Comments
Please login to add a commentAdd a comment