చరిత్రకు సాక్ష్యంగా.. కలెక్టర్ బంగ్లా
హన్మకొండ అర్బన్: నిజాం కాలంలో, అప్పటి పాలకుడు సుబేదార్ నివాసం కోసం 1886లో జార్జ్ పామర్ సారథ్యంలో నిర్మించిన ప్రస్తుత హనుమకొండ కలెక్టర్ బంగ్లా చరిత్రకు సాక్ష్యంగా నిలవబోతున్నది. సుమారు 138 సంవత్సరాల ఈ పురాతన భవనాన్ని, చారిత్రక వారసత్వంగా (హెరిటేజ్ భవనంగా) అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ ప్రావీణ్య ఇటీవల నూతనంగా నిర్మించిన నివాసంలోకి గృహప్రవేశం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చారిత్రక నిర్ణయం
కలెక్టర్ ప్రావీణ్య కొత్తగా నిర్మించిన నివాస భవనంలోకి మారిన సందర్భంలో పాత భవనాన్ని చరిత్రకు గుర్తుగా నిలిపి ఉంచాలని నిర్ణయించా రు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసి, ఈ భవనాన్ని కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి(కుడా) అప్పగించారు. ప్రత్యే క నిధులతో అభివృద్ధి చేసి, సందర్శకులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చాలని ఆదేశించారు.
అభివృద్ధి ప్రణాళికలు
ఈ భవనాన్ని కాఫీ డే తరహాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలతోపాటు, ప్రజల ఆకర్షణగా సందర్శనీయ ప్రాంతంగా ఉండేందుకు ఇతర రూపకల్పనలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. పబ్లిక్ గార్డెన్‌లోని టౌన్ హాల్, సెంట్రల్ లైబ్రరీల మాదిరిగా విద్యార్థులు, ప్రజలు సందర్శించేలా తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పేరున్న కొన్ని ఏజెన్సీలు భవనాన్ని పరిశీలించి, అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పించాయి.
చరిత్రను గుర్తు చేసుకుంటూ..
సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో, నివాస భవనం, పరిపాలనా భవనం, పెద్ద బావి వంటి కట్టడాలు ఉన్నాయి. నిజాం కాలంలో ఇక్కడ కూరగాయలు పండించేవారని చెబుతారు. ఉమ్మడి జిల్లాల కాలంలో 52 మంది ఐఏఎస్ అధికారులు ఈ భవనంలో నివాసముండగా, విభజన అనంతరం ఐదుగురు కలెక్టర్లు వినియోగించారు.
రహస్యాలు.. గాథలు
ఒకానొక దశలో, ఈ భవనంలో దయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అమ్రపాళి కాటా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ వార్తలు సంచలనం సృష్టించాయి. స్వయంగా అప్పటి కలెక్టర్ అమ్రపాళి తన దయ్యం అనుభవాలు వెల్లడించడం ఆసక్తిగా మారింది. కానీ, దీనికి ఎలాంటి ఆధారాలూ లభించలేదు.
నగర ఐకాన్‌గా కలెక్టర్ బంగ్లా
ఈ భవనం చారిత్రక వారసత్వానికి నిలువెత్తు సాక్ష్యం. దానిముందు భాగంలో పెద్ద గడియారం, ప్రధాన రహదారిపై కూడలి వద్ద భవనం ఉండడం వల్ల చారిత్రక గుర్తింపుగా ఉంటూ వస్తోంది. దానిని కాపాడడంతోపాటు మరిన్ని ఆకర్షణీయమైన విధానాలతో అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇది నగరానికి ఒక చారిత్రక కీర్తిపతాకంగా నిలిచే అవకాశం ఉంది.
హెరిటేజ్ భవనంగా మార్పు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య నిర్ణయం.. ఉత్తర్వులు
1886లో బ్రిటీష్ హయాంలో
భవన నిర్మాణం
138 సంవత్సరాల చారిత్రక గుర్తింపు
ఇందులో 57మంది కలెక్టర్ల విడిది
నగరానికి ఐకాన్‌గా మార్చేందుకు
అడుగులు
Comments
Please login to add a commentAdd a comment