బాక్సింగ్‌లో స్వర్ణ పతకం
తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో 85 నుంచి 90 కేజీల విభాగంలో సత్తా చాటి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు స్థానిక జువ్వలపాలెం 16వ వార్డుకు చెందిన 19 ఏళ్ల కొండపల్లి సాయి వెంకట లవిత్ర. రెండు రోజుల క్రితం పిఠాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈనెల 26న పంజాబ్‌లోని గురుకాశి యూనివర్సిటీలో జరిగే పోటీలకు, జనవరి 6 నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. సాయి వెంకట లవిత్ర తండ్రి రాజేష్ ఆర్మీ కమాండర్ కావడంతో ఆయన ఉద్యోగ రీత్యా పంజాబ్ వెళ్లడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. ఈ సందర్భంగా లవిత్రను పలువురు అభినందించారు.
ఇద్దరు యువకులపై కేసు
ద్వారకాతిరుమల: విద్యార్థినులను వేధిస్తున్న ఇద్దరు యువకులపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం, వేంపాడు గ్రామానికి చెందిన యువకులు పెండ్లి సందీప్ కుమార్, జోనుబోయిన నాగ జితేంద్ర కొద్ది రోజులుగా పంగిడిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థినులను వెంబడిస్తున్నారు. పాఠశాల ఆవరణలోని బాత్‌రూమ్‌లోకి వెళ్లే సమయంలో స్కూల్ పక్కనున్న చెట్లు ఎక్కి, సెల్‌ఫోన్‌లతో విద్యార్థినులను ఫొటోలు, వీడియోలు తీసి లైంగికంగా వేధిస్తున్నారు. దీనిపై విద్యార్థినుల నుంచి సమాచారం అందుకున్న స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు సిరిబత్తుల నవీన, మద్దాల రాజు, గుర్జుల సురేష్, గోటూరు అంబేద్కర్ ఈనెల 20న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పాఠశాల వద్దకు వెళ్లగా యువకుల ఆగడాలను నేరుగా గమనించారు. వెంటనే వారు ఉపాధ్యాయులతో కలసి యువకులను పట్టుకునేందుకు వెంబడించగా పరారయ్యారు. దీనిపై ఎస్‌ఎంసీ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధీర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment