సూపర్ వంచన
● బాబు ష్యూరిటీ.. లేదు గ్యారంటీ
బాండ్ల సంగతి మరచి.. సంక్షేమాన్ని విస్మరించి..
●
నాడు తలుపుతట్టిన సంక్షేమం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సంక్షేమం పేదింటి తలుపు తట్టింది. కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, పేదరికమే ప్రామాణికంగా అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సంక్షేమ లబ్ధి చేకూరింది. సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేసి నిర్ణీత తేదీన నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వ సాయం జమచేస్తూ వచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం తదితర సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో జిల్లాలోని పేదవర్గాల వారికి వందల కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చారు.
హామీలను ఎగ్గొట్టారు
ఎన్నికల హామీలను ఎగ్గొట్టడంలో చంద్రబాబు దిట్ట. తాను చెప్పింది చేయనని మరోసారి నిరూపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలుచేయకుండానే ఈ ఆర్థిక సంవత్సరాన్ని గడిపేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికే పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందేవి.
– గూడూరి ఉమాబాల,
వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం కన్వీనర్
దారుణంగా వంచించారు
కూటమి నాయకులు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక దారుణంగా వంచిస్తున్నారు. సంక్షేమం జాడలేక పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త సంవత్సరంలో అయినా వాటి అమలు ఉంటుందని ఆశిస్తే కేబినెట్ సమావేశం నిరాశనే మిగిల్చింది.
– బంధన పూర్ణచంద్రరావు,
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కో–ఆర్డినేటర్
బూటకపు హామీలతో..
సూపర్ సిక్స్ అమలుచేయకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లికి వందనం అమలుచేయలేదు. విద్యాదీవెన నిధులను కళాశాలలకు చెల్లించకపోవడంతో యాజమాన్యాల ఒత్తిడితో తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వానివి బూటకపు హామీలు.
– పొట్ల సురేష్, న్యాయవాది, తణుకు
ఆర్థికంగా ఇబ్బంది
గత ప్రభుత్వంలో అమ్మఒడి, చేయూత పథకాల ద్వారా మా కుటుంబం లబ్ధి పొందింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఏడాదైనా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలను ఆదుకోవాలని కోరుతున్నాం.
– నంద్యాల నాగమణి, మందపాడు, ఆకివీడు మండలం
2025.. సంక్షేమం అందదు
● 2024 జూన్ నుంచి సూపర్ సిక్స్ అంటూ బాండ్లు ఇచ్చిన కూటమి నేతలు
● ఆరున్నర నెలల పాలనలో ఊసెత్తని ప్రభుత్వం
● ఈ ఆర్థిక సంవత్సరానికి ఎగనామం పెడుతూ కేబినెట్ నిర్ణయం
● జిల్లాలో 1.74 లక్షల మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ దూరం
● 1.24 లక్షల మంది రైతులకు రూ.249 కోట్ల నష్టం
● 5.96 లక్షల మంది మహిళలకు అందని ‘ఆడబిడ్డ సాయం’
● మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
నిరుద్యోగ భృతి ఊసెత్తని వైనం
సాక్షి, భీమవరం: అధికారంలోకి రావడమే ఆలస్యం.. జూన్ నెల నుంచే సూపర్ సిక్స్ పథకాలు అమలులోకి తెస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు చెప్పారు. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికి వెళ్లి ఇంటిలోని కుటుంబ సభ్యులకు సూపర్ సిక్స్‌లో వర్తించే పథకాలు, చేకూరే లబ్ధితో బాండ్ పేపర్లంటూ సంతకాలు చేసి మరీ ఇచ్చారు. తల్లికి వందనం కింద ఎందరు పిల్లలుంటే అందరికి ఏడాదికి ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున ఇప్పించే బాధ్యత తమదన్నారు. అన్నదాతకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తామని చెప్పారు. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ నెలకు రూ.1,500లు జమచేస్తామన్నారు. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000లకు పెంచిన పాలకులు ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక్క గ్యాస్ సిలెండరే అంటూ మాట మార్చారు.
పేదల ఆశలపై నీళ్లు
కొత్త ఏడాదిలోనైనా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తుందేమోనన్న పేదవర్గాల ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లింది. గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఊసేలేదని తేల్చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పథకాల అమలుపైనా స్పష్టత ఇవ్వకుండా మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు మొండిచేయి చూపింది. కూటమి వంచనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తల్లికి వందనం పథకం అమలుకాక జిల్లాలోని సుమారు 1.74 లక్షల మంది విద్యార్థులకు గాను వారి తల్లులు రూ.261 కోట్లు కోల్పోయారు. అన్నదాత సుఖీభవ సాయం అందక సుమారు 1,24,645 మంది రైతులు రూ.249.29 కోట్లు నష్టపోయారు. ఆడబిడ్డ నిధి పథకానికి జిల్లాలో అర్హత కలిగిన మహిళలు సుమారు 5,96,313 మంది ఉండగా నెలకు రూ.1,500లు చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది నెలల కాలానికి రూ.894.46 కోట్ల సాయాన్ని కోల్పోయారు. జిల్లాలో 5.17 లక్షల కుటుంబాలకు గాను 50 శాతానికి పైగా చదువుకు తగిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు. వీరికి నిరుద్యోగభృతి అందించాల్సి ఉంది. తొమ్మిది లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు.
బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట కనిపిస్తున్న ఈ బాండ్ పేపర్‌ను గమనించారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 జూన్ నెల నుంచి ఇంటిలోని కుటుంబ సభ్యులకు వర్తించే పథకాలు, వాటి ద్వారా ఏడాదిలో చేకూరే లబ్ధి మొత్తాన్ని వివరిస్తూ కూటమి నేతలు ఇంటింటికీ పంపిణీ చేసిన పత్రాలు. పాలకొల్లు నియోజకవర్గంలోని ఒక మహిళ కుటుంబంలో నలుగురు సభ్యులకు గాను ఇద్దరు మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.36 వేలు, ఇద్దరు నిరుద్యోగ యువకులకు యువగళం పథకం కింద నెలకు ఒక్కొక్కరికీ రూ.3,000 చొప్పున ఏడాదిలో రూ.72 వేలు మొత్తంగా రూ.1.08 లక్షల లబ్ధి చేకూరుతుందని కూటమి నేతలు సంతకాలు చేసి మరీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో బాండ్ పేపర్ మేరకు ఆయా పథకాల ద్వారా ఆ కుటుంబానికి రూ.63,000 లబ్ధి చేకూరాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు ఆ పథకాల ఊసేలేదు.
Comments
Please login to add a commentAdd a comment