తాగడంలో తగ్గేదేలే..!
దెందులూరు: సంక్రాంతి పెద్ద పండుగను పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మద్యం వ్యాపారం భారీగా సాగింది. పండుగ మూడు రోజుల్లో మొత్తంగా రూ.25 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. సంక్రాంతికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం, కోడిపందేల బరుల వద్ద యథేచ్ఛగా మద్యం విక్రయించడం, వీధివీధినా బెల్టు షాపులు ఉండటంతో ఎకై ్సజ్‌కు భారీగా ఆదాయం సమకూరింది.
రూ.120 కోట్ల అమ్మకాలు
ఉమ్మడి జిల్లాలో ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు రూ.120 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. ప్రధానంగా పండుగ రోజుల్లో భోగి (ఈనెల 13), సంక్రాంతి (ఈనెల 14), కనుమ (ఈనెల 15) నాడు ఏలూరు జిల్లాలో రూ.15 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.12 కోట్లకుపైగా విక్రయాలు జరిగాయి. గత నెలతో పోలిస్తే ఈనెలలో ఇప్పటివరకు 20 శాతం మేర అదనంగా మద్యం విక్రయించారు. ఏలూరు జిల్లాలో 144, పశ్చిమగోదావరి జిల్లాలో 175 మద్యం దుకాణాలు ఉన్నాయని, పండుగ మూడు రోజుల్లో సుమారు రూ.27 కోట్ల మేర విక్రయాలు జరిగాయని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రభుకుమార్ తెలిపారు.
నూరుశాతం ఆక్యుపెన్సీతో ఆర్టీసీ
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాకు పెద్ద సంఖ్యలో బంధువులు తరలిరావడంతో ఆర్టీసీ బస్సులు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. వందల సంఖ్యలో ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. ఏలూరు ఆర్టీసీ డిపో 131 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌కు 72, విశాఖకు 4 హైటెక్ బస్సులు ప్రత్యేకంగా ఉన్నాయి. రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ డీపీ టీఓ ఎన్‌వీ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 8 నుంచి 13 వరకు 131 సర్వీసుల ద్వారా రూ.43 లక్షల ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. దూర ప్రాంతాలకు సోమ, మంగళవారాల వరకు ప్రజలు రిజర్వేషన్లు చేసుకుంటున్నారని, రద్దీ దృష్ట్యా అప్పటికప్పుడు బస్సులు ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
పండుగ మూడు రోజుల్లో రూ.27 కోట్లకుపైగా మద్యం విక్రయాలు
ఈనెల 15 వరకు రూ.120 కోట్లకు పైగా అమ్మకాలు
Comments
Please login to add a commentAdd a comment