చదువుల తల్లిని చిదిమేసిన ప్రేమోన్మాదం
విద్యార్థిని హత్యోదంతంపై అంతటా దిగ్భ్రాంతి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన
బద్వేలు అర్బన్: ఉన్నత చదువులు చదివి అత్యున్నత శిఖరాలకు చేరి తన కుటుంబానికి అండగా నిలవాలనుకున్న ఆ విద్యా కుసుమం అంతలోనే నేలరాలింది. నూరేళ్ల బంగారు భవిష్యత్తు ప్రేమోన్మాదం కారణంగా అర్ధాంతరంగా ముగిసింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దస్తగిరమ్మ హత్యోదంతం అంతటా దిగ్భ్రాంతి కలిగించింది.
చదువులో టాపర్
బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్‌కు చెందిన హుస్సేనయ్య, హుస్సేనమ్మకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. హుస్సేనయ్య రైస్‌మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. తన కుమార్తె దస్తగిరమ్మకు చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదివిస్తున్నాడు. దస్తగిరమ్మ పదో తరగతి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివింది. పది ఫలితాల్లో 556 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూపు తీసుకుంది. ఆమె చదువులో ముందుంటుందని కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. చదువుపై ఆసక్తి ఉన్న దస్తగిరమ్మ అర్ధాంతరంగా ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడంతో తోటి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆవిరైన ఆశలు
అటు నివసిస్తున్న వీధిలో, ఇటు కళాశాలలో అందరితో స్నేహపూర్వకంగా మెలిగే దస్తగిరమ్మ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థితికి చేరుకుని తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలని బంధువులకు, స్నేహితులకు చెబుతుండే దస్తగిరమ్మ కన్న కలలు, ఆశలు ఆవిరై తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోవడం బాధాకరమని దస్తగిరమ్మ స్నేహితులు కంటతడి పెట్టారు.
మంచి విద్యార్థిని కోల్పోయాం
దస్తగిరమ్మ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ప్రతి రోజూ కళాశాలకు వచ్చేది. చదువులో కూడా బాగా రాణిస్తుండేది. కళాశాలలో ఏదైనా వర్క్ ఇస్తే అందరి కంటే ముందుగా చేసేది. చేతిరాత కూడా చాలా బాగుంటుంది. ఉత్తమ భవిష్యత్తు ఉన్న దస్తగిరమ్మ ఇలా అర్ధాంతరంగా దూరమవడం బాధాకరమైన విషయం. మంచి విద్యార్థిని కోల్పోయాం.
–బి.శివశంకర్‌రెడ్డి, కళాశాల అధ్యాపకుడు
కలుపుగోలుగా ఉండేది
దస్తగిరమ్మను ముద్దుగా టెడ్డీ అని పిలుచుకునేవాళ్లం. వీధిలో అందరితో కలుపుగోలుగా ఉండేది. కళాశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చదువుకుని ఇంటి పనులు చేసుకుని సరదాగా ఉండేది. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది. అందరితో స్నేహ పూర్వకంగా, గౌరవంగా మెలుగుతూ ఉండే దస్తగిరమ్మ మా మధ్య లేకుండా పోవడం బాధాకరం. దస్తగిరమ్మ మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలి.
–మాబున్నీసా, మృతురాలి మేనత్త
Comments
Please login to add a commentAdd a comment