●అధికార పార్టీ అండ | - | Sakshi
Sakshi News home page

●అధికార పార్టీ అండ

Published Tue, Dec 10 2024 2:05 AM | Last Updated on Tue, Dec 10 2024 2:05 AM

●అధిక

●అధికార పార్టీ అండ

రాయచోటి/కలకడ : రేషన్‌ బియ్యాన్ని రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడతామని ఒకవైపు బీరాలు పలుకుతుండగా మరోవైపు అదే కూటమికి చెందిన ముఠా మాఫియా మాత్రం టన్నుల కొద్దీ బియ్యాన్ని యథే చ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సైతం పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం అవుతూ రేషన్‌ బియ్యం పంపిణీ వ్యవస్థపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని చెబుతున్నారు. ఎక్కడికక్కడ నిఘాను పెంచి అక్రమ తరలింపుకు పాల్పడుతున్న ముఠాలపై, అందుకు సహకరిస్తున్న అధికారుల పై ఉక్కుపాదం మోపుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనలు కేవలం ప్రజలు వినడానికి, పత్రికల్లో రాసుకోవడానికి మాత్రమే అన్న ప్రచారం జరుగుతుంది. అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల నుంచి లారీలకు లారీలు రేషన్‌ బియ్యాన్ని చెక్‌పోస్టులను దాటిస్తుండటమే ఇందుకు నిదర్శనం.దీనివల్ల కోట్లాది రూపాయల సొమ్ము టీడీపీ అనుయాయుల జేబులకు చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో స్థానికుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయా జిల్లాల పరిధిలోని ఒకరిద్దరు అధికారులు ధైర్యం చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తూ దాడులు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధిలోని సంబేపల్లి, కలకడ సరిహద్దు ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు, ఖాళీ గోడౌన్లలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లోనే 320 క్వింటాళ్ల అక్రమ రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.

ప్రొద్దుటూరు, కలకడ కేంద్రాలుగా..

వైఎస్‌ఆర్‌ జిల్లాలో ప్రొద్దుటూరు, ఖాజీపేట, అన్నమయ్య జిల్లాలో కలకడ, కలికిరి కేంద్రాలుగా రేషన్‌ బియ్యం అక్రమరవాణా దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఖాజీపేటకు చెందిన ఒక ముఠా, కలకడకు చెందిన మరో ముఠా అధికార పార్టీ నాయకులు కనుసన్నుల్లో పనిచేస్తూ.. కోట్లాది రూపాయల బియ్యాన్ని విక్రయిస్తూ.. లక్షలాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాల పరిధిలో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని తమకున్న అధికార బలంతో సమీపంలో ఉన్న రేషన్‌ మిల్లులకు తరలించి అక్కడ వాటికి పాలిష్‌ పట్టి కొత్త సంచుల ద్వారా లారీలకు లోడ్‌ చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ తరలింపులో పెద్ద పెద్ద గ్యాంగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఏజెంట్ల ద్వారా సేకరించిన బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ముందుచూపుతో మాఫియా రూటు మార్చి ఆయా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాలకు తరలిస్తోంది. ఏజెంట్ల దగ్గర కిలో పదహారు రూపాయలకు కొనుగోలు చేసి అవే బియ్యాన్ని మార్చి సాధారణ బియ్యంతో కలిపి విక్రయించి నెల నెల భారీ ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాల్లో పోలీసులు, ఆయా శాఖలకు చెందిన అధికారులు, కొంత మంది ప్రజాప్రతినిధులకు ప్రతి నెలా పెద్ద ఎత్తున ముడుపులు కూడా అందుతున్నట్లు సమాచారం.

వైఎస్సార్‌ అన్నమయ్య జిల్లాల నుంచి అక్రమ రేషన్‌ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. అన్నమయ్య జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శరాజేంద్రన్‌ ఆధ్వర్యంలో ఒకవైపు దాడులు కొనసాగిస్తున్నా మరోవైపు అక్రమరవాణా మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. దాడులతో కేసులు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నా ఫలితం లేదు.

ప్రభుత్వం ప్రజల కోసం ప్రతి నెల 1 నుంచి 15వ తేదీల వరకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యంలో 60 శాతం పైగా బియ్యం పక్కదారి పడుతున్నట్లు సమాచారం. మాఫియా ఏజెంట్లు బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిలువ చేసి వాటిని కొత్త సంచుల్లోకి మార్చి గుట్టుచప్పుడు కాకుండా ప్రొద్దుటూరు, ఖాజీపేట, కలకడ, కలికిరి, గాలివీడు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో 8291.785 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

అన్నమయ్య జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న 8291.785 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి 150 మందిపై కేసులు నమోదు చేసి 336 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసులు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన మాఫియా నేతలు గుట్టుచప్పుడు కాకుండా అక్రమరవాణాను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు రేషన్‌ డీలర్లతో సమావేశం అవుతూ అక్రమరవాణాకు కట్టడి చేయాలన్న ప్రయత్నాలకు అధికార పార్టీ నాయకులు ముందుకు సాగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా అందిన సమాచారం మేరకు కొంత మంది అధికారులు దాడులు చేసినా అధికార పార్టీ నాయకుల నుంచి రాజకీయ ఒత్తిళ్లు అధికమవుతున్నట్లు సమాచారం. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల పరిధిలో ఉన్న రైస్‌మిల్లులతో పాటు ప్రత్యేక గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని గుర్తిస్తున్నారు. అయితే అధికారం అడ్డుపెట్టుకొని ఆయా శాఖ పరిధిలోని కొంత మంది అధికారులను లోబరుచుకొని రేషన్‌ మాఫియా మాత్రం తమ దందాను రూటు మార్చి కొత్త మార్గాల్లో కొనసాగిస్తూనే ఉన్నారు.

అడ్డదారుల్లో బియ్యం రవాణా

అధికారమే అండగా

కొనసాగుతున్న వ్యవహారం

అన్నమయ్య జిల్లాలోని

కలకడ, కలికిరి, గాలివీడులోని

రైస్‌ మిల్లుల్లో పాలిష్‌

గుట్టు చప్పుడు కాకుండా

కర్ణాటక ప్రాంతాలకు అక్రమ రవాణా

చక్రం తిప్పుతున్న రేషన్‌ మాఫియా

అక్రమ రేషన్‌ బియ్యం తరలింపులో అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఏమాత్రం తీసిపోని విధంగా రేషన్‌ బియ్యం అక్రమరవాణా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండతోనే చౌకదుకాణం డీలర్ల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజులుగా కలకడ ప్రాంతంలో జరుగుతున్న అధికారుల దాడుల్లో ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి పాత్ర ఉన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
●అధికార పార్టీ అండ1
1/1

●అధికార పార్టీ అండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement