యునెస్కో గుర్తింపునకు మార్గం సుగమం
గ్యాడ్జి కాదు... గ్రాండ్ క్యానియన్
గండికోటకు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచ పటంలో స్థానం లభించనుంది. గ్యాడ్జి అంటే ఇరుకై న లోయ అని అర్థం. గండికోటలోని పెన్నా ప్రవాహం చాలా విశాలమైనది. రెండు కొండల మధ్య 300 మీటర్లకుపైగా వైశాల్యం ఉంది. ఇదే ఈ ప్రాంతానికి ప్రత్యేకతను సంతరించి పెడుతోంది. యునెస్కో దీన్ని గుర్తిస్తే ప్రపంచ వ్యాప్త ఖ్యాతి లభిస్తుంది.
– బాలగొండ గంగాధర్, చరిత్రకారులు
కడప కల్చరల్ : గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచ స్థాయిలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు సాధించిన మన గండికోట మరో మెట్టుపైకి ఎక్కనుంది. దాంతోపాటు సాధారణ పర్యాటక ప్రాంతంగానే భావిస్తున్న గండికోటను విలక్షణ భౌగోళిక ప్రదేశంగా పలు దేశాలతో పోటీపడి తన స్థానాన్ని మెరుగు పరుచుకుంటున్నది.
● ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సాధించే జాబితాలో గండికోట పదవ స్థానంలో చేరింది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చేందుకు భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) పది భూ విజ్ఞాన ప్రదేశాల జాబితాను పంపింది. ఈ విషయాన్ని భారతీయ గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు తెలియజేశారు. 10 భూ విజ్ఞాన ప్రదేశాలను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చేందుకు ఏఎస్‌ఐకి పంపగా, అవి పరిశీలనలో ఉన్నట్లు ఆయన వివరించారు. దేశంలో 100 భూ విజ్ఞాన వారసత్వ ప్రదేశాలను గుర్తించామని, అందులో 32 ప్రదేశాలను భూ విజ్ఞాన ప్రదేశాలుగా గుర్తించామన్నారు.
● 2015లో అంతర్జాతీయ జియో పార్కు ప్రోగ్రామ్ (ఐజీజీపీ)లో భాగంగా స్వీకరించిన యునెస్కో గ్లోబల్ జియో పార్కులు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన భౌగోళిక వారసత్వాన్ని గుర్తించి రక్షించే బాధ్యతను చేపడుతున్నాయి. దేశంలో మరో రెండు ప్రదేశాలతోపాటు మన రాష్ట్రంలోని గండికోట క్యానియన్ లాంటి అద్భుతమైన వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని గనులశాఖ కార్యదర్శి కాంతారావు అన్నారు. నిజానికి ఎక్కువగా గండికోటను పర్యాటక ప్రదేశంగా మాత్రమే గుర్తిస్తున్నారని, ప్రజలకు, వాటి భౌగోళిక ప్రాముఖ్యత గురించి తెలియదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియో లాజికల్ సైన్సెస్ (ఐయూజీఎస్)పేరుతో మరొక ప్రపంచ హోదా ఇచ్చే సంస్థ ఉందని, అందులో భాగంగా మన దేశంలో కొన్ని ప్రదేశాలను గుర్తించారన్నారు.
గ్రాండ్ క్యానియన్‌గా పిలవాలి
గండికోటను కేవలం చారిత్రక ప్రదేశమేగాక అద్భుతమైన భూ విజ్ఞాన వారసత్వ ప్రదేశమని భారత గనులశాఖ కార్యదర్శి అన్న మాటలు నిజమేనని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు గండికోటను ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ప్రత్యేకించి అద్భుతమైన కోటగల ప్రాంతంగా గుర్తించి గౌరవిస్తున్నామని, నిజానికి అంతకుమించి పెన్నా లోయ భూ విజ్ఞాన వారసత్వ సంపదగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయి ఉందన్నారు. చారిత్రక ప్రదేశం కంటే ఈ భూ విజ్ఞాన వారసత్వ ప్రదేశంగానే ప్రపంచ వ్యాప్తంగా విలక్షణమైన గుర్తింపు లభించ గలదంటున్నారు. గండికోటలోని పెన్నాలోయను గ్యాడ్జిగా సంభోదించవద్దని, దాన్ని గ్రాండ్ క్యానియన్‌గా పిలువాలని చరిత్రకారులు సూచిస్తున్నారు. గ్యాడ్జి అంటే ఇరుకై న లోయ ప్రదేశమని, క్యానియన్ అంటే సువిశాలమైన లోయ మైదాన ప్రాంతమని వారు తెలుపుతున్నారు. దీంతో కేవలం చారిత్రకంగానే కాకుండా భౌగోళిక విజ్ఞాన వారసత్వ ప్రదేశంగా ప్రపంచ స్థాయిలో ఖ్యాతి పొందేందుకు గండికోటకు అర్హత ఉందని తెలుస్తోంది. ఇక కేవలం యునెస్కో గుర్తింపు లభించడమే ఆలస్యమని, ఆ తర్వాత గండికోటకు దక్కే ఖ్యాతి ప్రపంచ స్థాయిలో ఉంటుందని పేర్కొంటున్నారు.
గండికోటకు జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు
జాతీయ భౌగోళిక ప్రదేశాల్లో చోటు
దేశంలోని 100 సైట్లలో స్థానం సాధింపు
Comments
Please login to add a commentAdd a comment