మార్కెట్‌కు రంగుల కళ
కడప కల్చరల్ : జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రత్యేకించి సంక్రాంతి పండుగకు ముగ్గుల పండుగగా పేరుంది. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల ముందు కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మహిళలు తెల్లవారుజామునే తమ ఇళ్ల ముందు మంచుముత్యాల్లాంటి తెల్లని ముగ్గుతో రంగవల్లులను తీరుస్తున్నారు. మరికొందరు ఓపిక చేసుకుని రంగులు కూడా వేస్తున్నారు.
రంగుల కళ
ప్రస్తుతం సంక్రాంతి పండుగ దగ్గర పడడంతో ముగ్గులు వేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియా విస్తృతం కావడంతో ముగ్గులపై మహిళలకు క్రేజ్ మరింతగా పెరిగింది. ఫలితంగా మార్కెట్లలో ముగ్గులు వేసేందుకు అవసరమైన రంగుపొడుల విక్రయాలు మొదలయ్యాయి. ముగ్గులు వేసేందుకు మహిళలు, యువతులు రంగుల ముగ్గు పొడులను ఇష్టంగా కొంటున్నారు. ముగ్గులు వేసే సీజన్ సంవత్సరంలో ఇదే గనుక తమ కళా ప్రతిభను ప్రదర్శించి రంగురంగుల ముగ్గులను తమ ఇంటి ముంగిళ్లలో తీర్చి ఇతరులను ఆకట్టుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ముగ్గులు వేసేందుకు అవసరమైన ముగ్గుపొడి, రంగులను విక్రయించేందుకు కడప మార్కెట్‌లో దాదాపు 20కి పైగా దుకాణాలు వెలిశాయి. తెల్ల ముగ్గుపిండితోపాటు రంగులు కలిపిన ముగ్గుపిండికి కూడా డిమాండ్ ఏర్పడింది. అలాంటి ముగ్గుపిండి పావు కిలో రూ. 15 చొప్పున విక్రయిస్తున్నారు. కిలో రూ. 70 –80 లుగా విక్రయిస్తుండగా, ముగ్గుపిండి కలిపిన రంగుపొడి కిలో రూ. 50 కు విక్రయిస్తున్నారు. కేవలం తెల్లని ముగ్గుపిండి కిలో రూ.20–25లు ఉండగా, ఏడు రంగుల పెద్ద చాక్‌పీస్‌లు రూ. 25–30 లకు విక్రయిస్తున్నారు. రంగుపొడులు గల ఐదు చిన్న ప్యాకెట్ల కవర్ రూ.25–30 లకు, 20 చిన్నప్యాకెట్లు గల కవర్ రూ. 60లకు విక్రయిస్తున్నారు. కళ్లాపి చల్లేందుకు వినియోగించే పేడ రంగు ప్యాకెట్ రూ. 5–10 లకు అమ్ముతున్నారు. కడప నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లో ప్రత్యేకించి రంగుపొడులు అమ్మే దుకాణాలు వెలిశాయి.
ఖర్చయినా.. ఇష్టంగా..
ఓ మోస్తరు ముగ్గువేసి రంగులు నింపాలంటే కనీసం రూ. 50 నుంచి రూ. 100 రంగు పొడులు అవసరమవుతాయి. ముందే రంగులు కలిపిన ముగ్గుపిండిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు గనుక మహిళలు రంగులు కొనాల్సిన అవసరం లేకుండా పోతోంది. చాక్‌పీస్‌లతో చిన్నసైజు గీతల ముగ్గు వేయాలంటే కనీసం రూ. 20 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కొక్క కట్టలో ఐదారు రకాల రంగుల చాక్‌పీసులు ఉంటాయి. ముగ్గులు వేయడం కంటే అందులో రంగులు నింపి తుది మెరుగులు దిద్దడానికే ఎక్కువ శ్రమపడాల్సి వస్తోంది. అయినా మహిళలు దీన్ని తమ ప్రతిష్టగా తీసుకుని ఇంటిలోని ఇతర మహిళలతో కలిసి తమ ఇళ్ల ముందు రంగులతో భారీ ముగ్గులను తీరుస్తున్నారు. ఏది ఏమైనా భోగి రోజుతోపాటు సంక్రాంతి రోజు కూడా ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు ఇంద్రధనస్సును తలపిస్తాయి.
సంక్రాంతి ముగ్గులకు సిద్ధమవుతున్న మహిళలు
మార్కెట్‌లో అందుబాటులో రకరకాల రంగులు
Comments
Please login to add a commentAdd a comment