TS Special
-
ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 పామాయిల్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేలా అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ. 1,050 కోట్లతో ఈ పరిశ్రమలను స్థాపించనున్నారు. తర్వాత రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ. 4.07 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని తీర్చిదిద్దేందుకు అవసరమైన రెండో ఫైలుపై సంతకం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికలను తీర్చిదిద్దుతామన్నారు. సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా.. మంత్రి మూడో ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కలి్పస్తూ నియామక పత్రం అందజేశారు. తర్వాత అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పుతామన్నారు. పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్లవేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులకు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే అంతరపంటలతో అదనపు ఆదా యం లభిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తుమ్మల తెలిపారు. -
హైదరాబాద్‌లో ‘గింబల్స్’ తయారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది. హైదరాబాద్‌లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్‌బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్‌సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. -
తెలంగాణలో 9మంది ఐఏఎస్‌లకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది ఐఏఎస్‌లకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(సీఎస్) శాంతికుమారి ఉత్వర్వుల్లో సంతకం చేశారు. తాజా పోస్టింగ్‌లలో.. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి శ్రీజా, జనగాం అడిషనల్ కలెక్టర్‌గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వట్సల్ టోప్పో, భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదివరన్ ఐఏఎస్‌లను నియమించారు. అలాగే.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్‌గా సురేంద్ర ప్రసాద్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత గంగువార్‌లను నియమిస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. -
IAS Amrapali: బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరున్న ఆమ్రపాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా ఇవాళ సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. బదిలీ ద్వారా పదోన్నతితో హెచ్ఎండీఏకు ఆమె నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను అభినందించారు. హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆపై మూసి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. హెచ్ఎండీఏకు ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్ మాత్రమే కొనసాగుతుండగా.. తాజాగా సంయుక్త కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి హెచ్ఎండీఏకు కమిషనర్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కొనసాగుతున్నారు. హెచ్ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో అర్వింద్‌ను హెచ్ఎండీఏలో కొనసాగిస్తారా.. ఆ స్థానంలో నూతన అధికారిని నియమించనున్నారా? అనే దానిపైనా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘కేంద్ర మంత్రి వైఖరి విచారకరం.. మహిళల బాధను విస్మరించారు’
సాక్షి, హైదరాబాద్: మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని తెలిపారు. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇదని అన్నారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్మృతీ ఇరానీ వ్యతిరేరించడాన్ని ఆమె తప్పుపట్టారు. కేంద్ర మంత్రి వైఖరి నిరుత్సాహపరిచిందని, మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారని ‘ఎక్స్’లో అసహనం వ్యక్తం చేశారు. రుతుక్రమ పోరాటాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి కొట్టిపారేయడం విచారకరమని, మహిళల బాధలను స్మృతీ ఇరానీ విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. “నెలసరి ఎంపిక కాదు. అది సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళలు అనుభవిస్తున్న బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోంది. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇది’ అని కవిత తెలిపారు. Disheartened by the Union Minister of Women and Child Development Smriti Irani Ji’s dismissal of menstrual struggles in Rajya Sabha. As a woman, it's appalling to see such ignorance, for our struggles, our journeys isn’t a consolation, it deserves a level playing field and that’s… pic.twitter.com/vj9wbb0A4f — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2023 గురువారం జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి.. నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాద అన్నారు. నెలసరికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: నెలసరి లీవ్ అవసరం లేదు -
GO 317 : మా గోడు వినండి.. మమ్మల్ని బదిలీ చేయండి!
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రజావాణిలో భాగంగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు కలిసారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సర్వీసు కోల్పోవడంతో పాటు 300 కిలోమీటర్లకు పైగా దూరానికి బదిలీ చేయబడ్డామని తెలిపారు. కార్యదర్శులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కింద ఏం జరిగింది? గత ప్రభుత్వం రెండేళ్ల కింద జీవో 317 తీసుకొచ్చింది. దీని వల్ల పల్లెల్లో విధులు నిర్వర్తిస్తోన్న గ్రామస్థాయి ఉద్యోగులైన పంచాయతీ కార్యదర్శులను ఏకాఏకీన దూరతీరాలకు బదిలీ చేశారు. ట్రాన్స్ఫర్లలో సుమారుగా 250 మంది పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. చట్టం ఏం చెబుతోంది? కొత్త గ్రామపంచాయతీలు.. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఏర్పడ్డాయి. చట్ట ప్రకారం గ్రామాలకు ఎలాంటి గ్రేడ్లు లేవు. అయినా నిబంధనలకు విరుద్ధంగా, చట్టంలోని అసలు ఉద్దేశ్యానికి భిన్నంగా బదిలీలకు గత ప్రభుత్వం దిగిందన్నది కార్యదర్శుల ఆవేదన. పంచాయతీరాజ్ శాఖ ఏం చేసింది? అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ రెండేళ్ల కింద ఒక ప్రోసిడింగ్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15, 2023న వచ్చిన ప్రోసిడింగ్ 2560/CRR&RE/B2/2017 ప్రకారం గ్రేడ్లు లేవని చెప్పారు. కానీ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన GO 81,84 ప్రకారం క్యాడర్ స్ట్రెంత్‌ను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరిపారు. గత ప్రభుత్వం పాత నిబంధనలను పట్టించుకోకుండా కేటాయింపు జరపడం వల్ల కార్యదర్శులు స్థానికతను శాశ్వతంగా కోల్పోవలసి వచ్చింది. దీనివల్ల పంచాయతీరాజ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని కార్యదర్శులు తెలిపారు. ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిలో ఏముందంటే? • గద్వాల జోగులాంబ జోన్ , చార్మినార్ జోన్ గ్రేడ్-1 కార్యదర్శులను మల్టీ జోన్ రెండు నుంచి మల్టీ జోన్-1 లోని బాసర జోన్, రాజన్న సిరిసిల్ల జోన్లకు కేటాయించారు. • దీనివల్ల సుమారు 125 మంది పంచాయతీ కార్యదర్శులు ఏకంగా 300 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు బదిలీ అయ్యారు. • రాజన్న సిరిసిల్ల జోన్, కాళేశ్వరం జోన్, బాసర జోన్ లోని గ్రేడ్-1, గ్రేడ్- 2 కార్యదర్శులను భద్రాద్రి జోన్‌కు బదిలీ చేశారు. • కాళేశ్వరం జోన్ లోని గ్రేడ్-2, అలాడే గ్రేడ్-3 కార్యదర్శులు సిరిసిల్ల జోన్ కి బదిలీ అయ్యారు. • దీనివల్ల 125 మంది కుటుంబాలు రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. • బదిలీ అయిన కొత్త ప్రాంతం సుదూరంలో ఉండడం వల్ల తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందని కార్యదర్శులు వాపోతున్నారు. గత రెండేళ్లుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని ఇబ్బందులకు గురయ్యామని ముఖ్యమంత్రికి తెలిపారు. పంచాయితీ కార్యదర్శి పోస్టు అనేది గ్రామస్థాయి పోస్టు కాబట్టి తమ పట్ల మానవతా దృక్పథంతో సొంత జోనులకు లేదా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఇవి చదవండి: TS: నేటినుంచి జీరో టికెట్ -
TS: నేటినుంచి జీరో టికెట్
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. మహిళలకు ఈ నెల 9 మధ్యాహ్నం నుంచి ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నా, వారికి ఎలాంటి టికెట్ జారీ చేయటం లేదు. అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయటం ద్వారా సమకూర్చనుంది. అందువల్ల ప్రతినెలా ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు, అందువల్ల ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయింది.. అన్న లెక్కలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. టికెట్‌పై చార్జీ సున్నా అని చూపించినా, ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్లో నమోదవుతుంది. అంతదూరం ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ జీరో టికెట్ విధానాన్ని సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావటంతో ప్రయోగాత్మకంగా గురువారం కొన్ని డిపోల్లో వీటిని జారీ చేసి పరిశీలించారు. శుక్రవారం నుంచి అన్ని డిపోల పరిధిలో జీరో టికెట్ జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గుర్తింపు కార్డు తప్పనిసరి తెలంగాణలో నివసించే మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. దీంతో శుక్రవారం నుంచి కండక్టర్‌కు మహిళలు కచ్చితంగా తెలంగాణ ప్రాంత నివాసితులుగా ధ్రువపరిచే ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా నివాస ప్రాంతాన్ని తెలిపే గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ చూపించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఎవరైనా గుర్తింపు కార్డు మరిచిపోతే, మళ్లీ మరిచిపోవద్దని హెచ్చరించి జీరో టికెట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత మాత్రం అనుమతించరని అధికారులు చెబుతున్నారు. నిధుల విడుదలపై హర్షం మహాలక్ష్మి పథకానికి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్టీసీకి రూ.374 కోట్లు విడుదల చేయటంపై కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బకాయి ఉన్న ఇతర మొత్తాలను కూడా అందించి ఆర్టీసీని ఆదుకోవాలని ఎన్ఎంయూ నేతలు నరేందర్, కమాల్‌రెడ్డి, చెన్నారెడ్డి, ఖదీర్ తదితరులు కోరారు. ఇక ప్రజావాణి మాదిరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు 15 రోజులకోసారి కార్మిక వాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కోరారు. -
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ప్రసాద్‌కుమార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు స్పీకర్‌ను గౌరవ పూర్వకంగా తోడ్కొని వెళ్లి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మంచి సాంప్రదాయానికి అందరి మద్దతు: సీఎం స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారని కొనియాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారన్నారు. ప్రసాద్‌కుమార్ తన సొంత జిల్లా నేత అని గుర్తు చేశారు. వికారాబాద్ అభివృద్ధిలో ప్రసాద్కుమార్ది చెరగని ముద్ర అని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఆయనకు బాగా తెలుసన్నారు. ఆయనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని, చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో వారందరి బాధ్యత తానే తీసుకున్నారన్నారు. ఈ అసెంబ్లీ కూడా ఒక కుటుంబమేనని, ఆ కుటుంబంలో మనమంతా సభ్యులమని పేర్కొన్నారు. ప్రతిపక్ష, పాలకపక్షం అందరూ కుటుంబ సభ్యులేనన్నారు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరని, సభలో అందరి హక్కులను కాపాడగలరని, ఆదర్శవంతమైన అసెంబ్లీగా దీన్ని తీర్చిదిద్దుతారనే పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు ప్రసాద్‌కుమార్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ మద్దతుకు కేసీఆర్ ఆదేశం: కేటీఆర్ స్పీకర్ ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డిలాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నానన్నారు. సామాన్య ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రసాద్‌కుమార్ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికయ్యారంటూ అభినందనలు తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు ఇదే శాసనసభలో చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పా ర్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్‌కుమార్ ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పిల్లలకు తండ్రి లాంటి పాత్ర ఆయన సభలో పోషించాలని ఆకాక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరి, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు. బీజేపీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి సైతం దూరంగా ఉన్న వారు గురువారం అసెంబ్లీకి హాజరయ్యారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్ శంకర్, పవార్ రామారావు పాటిల్, టి.రాజాసింగ్ వీరిలో ఉన్నారు. పార్టీల బలాలను బట్టి సమయం: స్పీకర్ తనను స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రసాద్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఏకగీవ్రంగా ఎన్నుకున్నందుకు అన్ని పా ర్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 57 మంది కొత్త సభ్యులు ఉన్నారంటూ..పా ర్టీల బలాలను బట్టి సమయం కేటాయిస్తానని చెప్పారు. స్పీకర్ స్థానం ఉన్నతమైనదే కాదు సంక్లిష్టమైనదని పేర్కొన్నారు. అంతకుముందు సభ మొదలైన వెంటనే గతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని వారి చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వీరిలో ఉన్నారు. -
షాపింగ్ మాల్ బుగ్గి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాజ్‌టాకీస్ రోడ్‌లోని అయ్యప్ప షాపింగ్ మాల్లో రాత్రి 11.20 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన నైట్ వాచ్‌మన్ మాల్ యజమానికి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అయితే ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించేలోపే భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎల్లారెడ్డి, గాంధారి, ఇందల్వాయి, రామాయంపేట, నిజామాబాద్‌ల నుంచి ఆరు ఫైర్ ఇంజన్లను, 50 మంది సిబ్బందిని రప్పించారు. భవనం నాలుగు అంతస్తుల్లో ఉండటంతో హైదరాబాద్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్విసెస్ విభాగం నుంచి భారీ స్కై లిఫ్ట్‌ను తెప్పించారు. ఆరు ఫైర్ ఇంజన్లతో పాటు స్కైలిఫ్ట్ ద్వారా మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుమారు 50 ట్యాంకర్ల నీటిని తీసుకు వచ్చి మంటలను ఆర్పారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అయితే మాల్లోని దుకాణాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. -
కరాచి బేకరీ పరిశ్రమలో..అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలోని కరాచి బేకరీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తిచెంది 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలో కరాచి బేకరీకి సంబంధించిన ఆహార తయారీ పరిశ్రమలో ఉదయం 9.40 గంటల సమయంలో ప్రధాన వంటశాలగా ఉన్న ప్రాంతంలో 20 మంది కార్మికులు కేక్‌లు, బిస్కెట్లు తయారు చేస్తున్నారు. పరిశ్రమలో భారీ స్టవ్‌లకు గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తుంటారు. స్టవ్‌ల వద్దకు వచ్చే పైప్‌లైన్‌లో ఓ చోట లీకేజీ ఏర్పడటంతో మంటలు ఒక్కసారిగా బయటికి వ్యాపించి అక్కడ పనిచేస్తున్న 15 మంది కార్మికులకు అంటుకున్నాయి. దీంతో వెంటనే గ్యాస్ సరఫరాను నిలిపివేసిన పరిశ్రమ యాజమాన్యం, గాయపడిన కార్మికులను పరిశ్రమకు చెందిన ఆటోల్లోనే శంషాబాద్ ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించింది. అనంతరం ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదంలో కార్మికులకు మంటలంటుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 మంది కార్మికుల్లో తీవ్రంగా గాయాలైన పదమూడు మందిని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మిగతా వారు ట్రైడెంట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా, అగ్నిప్రమాదంలో గాయపడిన పదిహేను మంది కూడా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారే. బలరాం (25), శుభం ప్రజాపతి (19), అదితి కుమార్ (19), సందీప్ ప్రజాపతి (27), దీపక్ శుక్లా (18), అన్వే‹Ùకుమార్ (20), ముఖే‹Ùకుమార్ (28), దారే సింగ్ (37), సోను (30), కోమల్ కిషోర్ (24), ప్రమోద్‌కుమార్ (23), సుజిత్ (19), సందీప్‌కుమార్ (25), సన్నీ (20), ప్రదీప్ (20)లలో ఐదుగురికి యాభై శాతం నుంచి ఎనభై శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గతంలోనూ ఇదే పరిశ్రమలో... గతేడాది అక్టోబర్‌లో కూడా ఈ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఘటన రాత్రి సమయంలో జరగడం, కార్మికులెరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దేశీయంగా, అంతర్జాతీయ బ్రాండెడ్‌గా ఉన్న పరిశ్రమలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కార్మిక శాఖతో పాటు పరిశ్రమ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి కరాచి పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీచేశారు. ఒక్కసారిగా మంటలంటుకున్నాయి.. మేము ఇరవై మంది అప్పుడే కేకులు, బిస్కెట్లు తయారీ ప్రారంభించాం. స్టవ్‌లకు సరఫరా అయ్యే గ్యాస్‌పైప్ లైన్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో 15 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. – ప్రమోద్‌కుమార్, బాధితుడు -
లింగంపల్లి నుంచి ‘దేవగిరి’కాచిగూడ నుంచి ‘అజంతా’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించే దేవగిరి ఎక్స్‌ప్రెస్ 17058/17057 ఇక నుంచి సికింద్రాబాద్‌కు బదులు లింగంపల్లి నుంచి దేవగిరికి రాకపోకలు సాగించనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అజంతాకు వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్(17064/17063) ఇక నుంచి మల్కాజిగిరి స్టేషన్లో అదనపు హాల్ట్‌తో కాచిగూడ స్టేషన్ నుంచి అజంతాకు రాకపోకలు సాగించనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ రెండు రైళ్ల టర్మినళ్లను మార్చినట్లు సీపీఆర్వో తెలిపారు. నగరంలోని పశి్చమ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణ, ప్రముఖ వ్యాపారసంస్థల ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని లింగంపల్లి నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించేవిధంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి స్టేషన్‌కు పొడిగించడం వల్ల ముంబైకి మాత్రమే కాకుండా నిజామాబాద్, బాసర్, నాందేడ్, మన్మాడ్, నాసిక్ వంటి ముఖ్యమైన పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు సదుపాయంగా ఉంటుంది. అజంతా ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ స్టేషన్‌కు మార్చడం వల్ల కాచిగూడ నుంచి షిర్డీ(నాగర్సోల్ స్టేషన్) మధ్య రోజువారీ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలుకు అదనంగా ఒక 2 టైర్ ఏసీని జతచేయనున్నారు. -
రానున్న మూడ్రోజులు గజ గజే..
సాక్షి, హైదరాబాద్: చలి తీవ్రత రాష్ట్రంలో క్రమక్రమంగా పెరుగుతోంది. చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. చలికాలం మధ్యస్థానికి చేరడంతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. -
హెచ్ఐవీ నియంత్రణకు కొత్త ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీని నియంత్రించేందుకు కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, వ్యాధి బారినపడిన వారికి వీటితో మంచి ఫలితం ఉంటుందని ప్రముఖ సంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ మోనాలిసా సాహు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఇంటిగ్రేస్ స్ట్రాండ్ ట్రాన్స్ఫర్ ఇన్హిబిటర్స్ (ఐఎన్‌ఎస్‌టీఐ)’ ఔషధాలు బాధితుల శరీరంలో హెచ్ఐవీ వైరస్ స్థాయిలను గణనీయంగా తగ్గించాయని వివరించారు. ఈ ఐఎన్‌ఎస్‌టీఐ, డోలుటెగ్రావిర్ వంటివి వైరస్‌ను అణచివేస్తాయని తెలిపారు. మన దేశంలో 24 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని, బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తింపు, చికిత్సలో సవాళ్లు.. 2021లో విడుదలైన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. దేశంలో హెచ్ఐవీ ఏటా 62 వేల మందికి సోకుతోందని డాక్టర్ మోనాలిసా సాహు తెలిపారు. ఎయిడ్స్ సంబంధిత మరణాల సంఖ్యను 2021లో 41,000గా అంచనా వేశారన్నారు. డోలుటెగ్రావిర్ను కలిగిన కొత్త అధునాతన ఐఎన్‌ఎస్‌టీఐ ఆధారిత ఔషధాలు హెచ్ఐవీ చికిత్సలో మంచి ఫలితాలను చూపుతున్నాయని తెలిపారు. కొత్త చికిత్స అవకాశాలు రోగులకు సౌకర్యవంతంగా ఉంటాయని, ఖర్చు కూడా తగ్గుతుందని వైరాలజిస్ట్ మేకా సత్యనారాయణ తెలిపారు. -
ఆ 181 ఎకరాలు హెచ్ఎండీఏవే..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని 181 ఎకరాల వివాదాస్పద భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కే చెందుతాయని హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అందులోని 50 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 2007 నుంచి శంషాబాద్ గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆస్తి పన్ను నోటీసులు, మున్సిపల్ అనుమతి, రెవెన్యూ రికార్డులు, విద్యుత్ బిల్లులు, ఫొటోలు, 2023 ఏప్రిల్ 20 నాటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంటి పన్ను రశీదులు, ఇంటి నిర్మాణ అనుమతి.. ఇలా అన్నీ నకిలీవేనని జ్యుడీషియల్ రిజిస్ట్రార్నివేదిక బయటపెట్టిందని స్పష్టం చేసింది. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు కల్పి త రసీదులు సృష్టించారని పేర్కొంది. 1990 సెపె్టంబర్ 4 నాటి ఉత్తర్వుగా పేర్కొంటూ.. 1992లో టైప్ చేసిన కాపీని పిటిషనర్ ఇచ్చారని, అది కూడా నకిలీదేనని తేలిందని వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించాక పిటిషనర్‌కు ఉపశమనం పొందడానికి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ‘పైగా’భూములని పేర్కొంటూ.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నంబర్ 725/21లోని 7.31 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లోని 10.07 ఎకరాలు, సర్వే నంబర్ 725/25లోని 12.34 ఎకరాలు సహా దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా (సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు క ల్పిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. రసీదులన్నీ నకిలీవే.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. తప్పుడు పత్రాలు, రసీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టిస్తున్నారని.. అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ కోర్టుకు వివరించారు. 2007, 2012లో జారీ చేసిన రసీదులు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల పత్రాలను ఆయన ఈ సందర్భంగా ధర్మాసనానికి అందించారు. 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం తెలంగాణ అని పేర్కొన్నారని.. అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందని వివరించారు. దాంతో ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం గతంలోనే జ్యుడీïÙయల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. రిజిస్ట్రార్విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇచ్చారు. పిటిషనర్ పేర్కొన్నట్టుగా 1997లో అసలు పిటిషన్లే నమోదు కాలేదని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచి్చంది. -
ఏడాదంతా..ఇడ్లీలు, బిర్యానీలే!
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీతో టిఫిన్.. బిర్యానీతో భోజనం... ఏడాదంతా ఇదే మెనూ! ఇద్దరు హైదరాబాదీ స్విగ్గీ కస్టమర్ల తీరిది. 2023లో ఓ ఇడ్లీ ప్రియుడు ఇడ్లీల కోసం వెచ్చించిన సొమ్ము అక్షరాల రూ. 6 లక్షలు. మరో బిర్యానీ ప్రియుడైతే ఏకంగా ఏడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే ఆరగించాడు. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే ఉందని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’వార్షిక నివేదిక వెల్లడించింది. అందులోని పలు ఆసక్తికర ఆర్డర్లివే.. బిర్యానీ తింటూ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్.. దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.5 బిర్యానీల కోసం ఆర్డర్లు వచ్చాయి. ప్రతి 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒక వెజ్ బిర్యానీ ఉంది. కొత్తగా 20.49 లక్షల మంది యూజర్లు స్విగ్గీలో బిర్యానీలు ఆర్డర్ చేశారు. చంఢీగఢ్లోని ఓ బిర్యానీ ప్రియుల కుటుంబం అక్టోబర్‌లో జరిగిన భారత్–పాక్ ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ రోజున ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది. దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను స్విగ్గీ డెలివరీ చేసింది. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ గతేడాది 16.64 కోట్ల కిలోమీటర్ల మేర విద్యుత్ వాహనాలు, సైకిళ్లపై ప్రయాణించి డెలివరీ చేశారు. గతేడాది అత్యధికంగా చెన్నైకి చెందిన వెంకటేశన్ 10,360, కొచి్చకి చెందిన సంథిని 6,253 ఆర్డర్లను డెలివరీ చేశారు. చిప్స్, బిస్కెట్ల కోసం రూ.31,748 ఖర్చు.. నిత్యావసరాలను విక్రయించే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కస్టమర్లు అత్యధికంగా పాలు, పెరుగు, ఉల్లిగడ్డల కోసం వెతికారు. జైపూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 67 ఉత్పత్తులను ఆర్డర్ చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కాఫీ, జ్యూస్, బిస్కెట్లు, చిప్స్ కోసం ఒక్క ఆర్డర్లో అత్యధికంగా రూ. 31,748 ఖర్చు చేశాడు. అత్యంత వేగంగా ఢిల్లీలో ఒక కస్టమర్‌కు 65 సెకన్లలో నూడుల్స్ ప్యాకెట్లను డెలివరీ చేశారు. హైదరాబాద్, ముంబై కంటే బెంగళూరు నుంచి మామిడి పండ్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క రోజులో 207 పిజ్జాలు.. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఒక్కో కస్టమర్ నుంచి గరిష్టంగా 10 వేల కంటే ఎక్కువే ఆర్డర్లు వచ్చాయి. భువనేశ్వర్‌లోని ఒక కస్టమర్ ఒక్క రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఓ పెద్ద పార్టీలో 269 ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. దుర్గా పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా 77 లక్షల రసగుల్లాల ఆర్డర్స్ వచ్చాయి. నవరాత్రి రోజుల్లో చాలా మంది ఫేవరేట్ ఆర్డర్ మసాలా దోశ. కేక్‌లే కేక్‌లు.. గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు కేక్ సిటీగా మారింది! 2023లో ఈ నగరంలో 85 లక్షల చాక్లెట్ కేక్స్ ఆర్డర్లు వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్ ఆర్డర్ చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 92 కేక్‌లు ఆర్డర్ చేశాడు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లోనూ కేక్‌లు ఆర్డర్ చేయడం గమనార్హం. 2023లో వేగాన్ ఆర్డర్లు 146 శాతం మేర పెరిగాయి. అలాగే మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు 124 శాతం మేర పెరిగాయి. బుక్ఫీట్, ఫాక్సీటేల్, జొవార్, బాజ్రా, రాగి, రాజ్గిరి వంటి డిషెస్ కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. -
విద్యుత్ శాఖలో భారీ మార్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సర్కారు విద్యుత్ శాఖలో భారీగా మార్పులు చేపట్టింది. ఆయా విద్యుత్ సంస్థల సారథ్య బాధ్యతల్లో ఉన్న రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారుల (నాన్ ఐఏఎస్)ను తొలగించి.. ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్‌తోపాటు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ఇన్చార్జి డైరెక్టర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని ఇంధనశాఖ కార్యదర్శిగా నియమించారు. అంతేగాక రాష్ట్ర విద్యుత్ శాఖలో కీలకమైన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో, జెన్కోలకు సీఎండీగా దాదాపు పదేళ్లు కొనసాగిన డి.ప్రభాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. దీంతో సర్కారు కొత్త సీఎండీని నియమించింది. ముర్తుజా రిజ్వీ 2013 జూలై 2 నుంచి 2014 జూలై 19 వరకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా వ్యవహరించారు. యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు కీలకమైన ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను ప్రభుత్వం నియమించింది. గత ఎనిమిదేళ్లుగా ఈ పోస్టులో కొనసాగిన సి.శ్రీనివాసరావుకు ఉద్వాసన పలికింది. డిస్కంలకు యువ అధికారులు: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు అధిపతులుగా యువ ఐఏఎస్ అధికారులను సర్కారు నియమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముషార్రఫ్ అలీ ఫారూఖీని.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్‌రెడ్డిని నియమించింది. ఐటీ–ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ ఝాను ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా బదిలీ చేసింది. టీఎస్ఎన్పిడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు తన పదవికి రాజీనామా చేయగా, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఇప్పటివరకు పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో రఘుమారెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆయనను తప్పించారు. ఇక కేంద్ర డెప్యుటేషన్ నుంచి తిరిగొచ్చి వెయిటింగ్లో ఉన్న కాటా ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. వెయిటింగ్లో ఉన్న బి.గోపికి వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. త్వరలో కొత్త డైరెక్టర్లు కూడా..! రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కొత్త సీఎండీలను నియమించిన ప్రభుత్వం.. త్వరలో కొత్త డైరెక్టర్లను సై తం నియమించనున్నట్టు చర్చ జరుగుతోంది. ప్ర స్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్కోలో ఆరుగు రు, టీఎస్ఎస్పీడీసీఎల్లో ఏడుగురు, టీఎస్ఎన్పి డీసీఎల్‌లో ఆరుగురు డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వారిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి, మరికొందరు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కొన్ని సంస్థల్లో నిర్దేశిత సంఖ్యకు మించి డైరెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న డైరెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిసింది. -
రిమ్స్ వైద్య విద్యార్థులపై దాడి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులపై బుధవారం అర్ధరాత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతికుమార్ బయటి వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థులు గాయాలపాలయ్యారు. డైరెక్టర్ చాంబర్ ముందు నుంచి బుధవారం సాయంత్రం కవిరాజ్, మరో ముగ్గురు విద్యార్థులు అతి వేగంగా కారులో వెళ్లారు. దీంతో డైరెక్టర్ జైసింగ్ వారిని మందలించగా, విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జైసింగ్ అభిమానులమంటూ కొందరు సదరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దీంతో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ గురువారం మెడికోలు తరగతులకు వెళ్లకుండా, ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దీంతో కలెక్టర్ రాహుల్‌రాజ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఘటనకు బాధ్యుడైన రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌ను టర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికోలకు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థులపై దాడికి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌తోపాటు బయట వ్యక్తులైన వసీమ్, శివ, వెంకటేశ్, శ్రీకాంత్‌పై కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై కూడా కేసు నమోదైంది. -
ఆయకట్టు ఎకరా పెరగలేదు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ వల్ల ఎకరా ఆయకట్టు అదనంగా పెరగలేదని, కేవలం వ్యయం మాత్రమే పెరిగిందని విమర్శించారు. రాష్ట్ర సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో గురువారం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీతారామకు పర్యావరణ అనుమతులు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల అంచ నా వ్యయాన్ని రీ డిజైనింగ్ పేరిట రూ.13 వేల కో ట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని భట్టి విక్రమా ర్క అధికారులను ప్రశ్నించారు. అదనంగా ఆయక ట్టు పెరిగిందా? అని ప్రశ్నించగా, పెరగలేదని అధికారులు బదులిచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇందిరా సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యారేజీ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వండి గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో ప్రజలపై భారం పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యేవి, 18 నెలల్లోగా పూర్తయ్యేవి, 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి, వాటి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపి వేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు విషయంలో వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీ హెడ్ వర్క్ నుంచి చివరి కెనాల్ వరకు ఫేజ్‌ల వారీగా జరిగిన పనుల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కనీస ప్రయత్నం కూడా జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సింగరాజుపల్లి రిజర్వాయర్, పాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గొట్టెముక్కుల రిజర్వాయర్, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన అనుమతులు, నిధులు తీసుకొస్తానని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. -
వచ్చే ఐదేళ్ల లక్ష్యంపై గవర్నర్ ప్రసంగం తయారీ!
రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఏమేం చేయనుంది, ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుందనే అంశాలతో శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, పథకాల అమల్లో లోపాలను ప్రస్తావించనుంది. ఈ మేరకు గవర్నర్ ప్రసంగ పాఠానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. గురువారం రాష్ట్ర శాసనసభ వాయిదా పడ్డాక అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్ భేటీ జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. గంటన్నరకుపైగా సాగిన ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగ పాఠంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనుండటంతో.. ప్రసంగ పాఠంలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై మంత్రివర్గం కసరత్తు చేసింది. పాలన, ఆర్థిక అంశాల్లో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, వచ్చే ఐదేళ్లపాటు కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలను గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ విధానాలపై సమీక్ష.. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యారోగ్యం, సంక్షేమ రంగాల్లో తాము అనుసరించే విధానాలను ప్రకటించాలని తీర్మానించింది. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటి అమలును పాక్షికంగా ప్రారంభించిన అంశాన్ని వివరిస్తూ.. ఇతర గ్యారంటీల అమలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల్లో ముంచిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో.. గవర్నర్ ప్రసంగంలో, తర్వాత ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో ఆయా అంశాలను ప్రస్తావించాలని కేబినెట్ భేటీలో నిర్ణయానికి వచ్చారు. ఇక రైతుబంధు, ధరణి పోర్టల్, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలపై త్వరలో మరోమారు సమావేశం అవుతామని మంత్రులకు సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. విభాగాల వారీగా శ్వేతపత్రాలు వివిధ ప్రభుత్వ శాఖల వారీగా అప్పులు, పనులు, పథకాల తీరుతెన్నులను వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. శ్వేతపత్రాల విడుదల మొక్కుబడిగా, హడావుడిగా కాకుండా పూర్తి వివరాలు, ఆధారాలతో ఉండాలని.. ఆ దిశగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కసరత్తు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మంత్రులు కూడా తమకు అప్పగించిన శాఖల్లో లోతుగా సమీక్షించి, అవగాహన పెంచుకోవాలని సూచించారు. శ్వేతపత్రాల విడుదల తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చే ప్రతిస్పందనకు దీటుగా సమాధానాలు ఇచ్చేలా మంత్రులు సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై తొందరపాటుతో స్పందించకుండా.. లోతుగా అవగాహన చేసుకున్నాకే ప్రతిస్పందించాలని సీఎం సూచించినట్టు తెలిసింది. ఉభయ సభల భేటీలో గవర్నర్ ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో.. సీఎం రేవంత్‌తోపాటు ట్రెజరీ బెంచ్ (అధికార పక్షం)నుంచి మాట్లాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినందున పూర్తి సన్నద్ధతతో రావాలని పేర్కొన్నట్టు సమాచారం. -
కరాచీ బేకరీలో పేలుడు.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ RGIA పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్‌లో పేలుడు సంభవించింది. ఓ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ గోడౌన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద దాటికి కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు స్థానిక కంచన్‌బాగ్ డీఆర్డీఓ తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెరుగైన వైద్య చికిత్స అందచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలూ అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కారికులున్నారని సీఎం రేవంత్‌కు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్‌బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. -
భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. భూకబ్జాలపై తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని.. తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్ పగబట్టి ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారు -
ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం చేశారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఇక, గృహ ప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ హోమం కార్యక్రమంలో భట్టి దంపతులు పాల్గొన్నారు. అనంతరం, భట్టి విక్రమార్క సచివాలయానికి బయలుదేరారు. కాసేపట్లో సచివాలయంలోని తన చాంబర్లో భట్టి ఛార్జ్ తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చింది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాగా, రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
ఆరు లేన్లు అయ్యేనా?
చౌటుప్పల్: త్వరలో హైవే విస్తరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్– విజయవాడ 65వ నంబరు జాతీయరహదారి ఆరు లేన్ల విస్తరణకు మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. మంత్రి ప్రకటనతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఓటీ పద్ధతిన నాలుగు లేన్లుగా విస్తరణ హైదరాబాద్ – విజయవాడ మధ్య 275 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వరకు, ఏపీలోని విజయవాడ నుంచి నందిగామ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విస్తరించారు. మిగిలిన 180 కిలోమీటర్లు మాత్రం బీఓటీ పద్ధతిన నాలుగులేన్లుగా నిర్మించారు. ఈ పనులను జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఈ పనులకు అప్పటి సీఎం రోశయ్య 2010 మార్చిలో నార్కట్‌పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసి మూడు ప్రాంతాల్లో టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుము వసూలు చేస్తోంది. కోర్టును ఆశ్రయించిన జీఎంఆర్ సంస్థ ఈ హైవేను ఆరులేన్లుగా విస్తరించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే హైవే విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ ముందస్తుగా కోర్టును ఆశ్రయించింది. తాము బీఓటీ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పనులు చేశామని, టోల్ వసూలు చేసుకునేందుకు తమకు ఇంకా గడువు ఉందని, పెట్టుబడి కింద టోల్ వసూళ్లు అనుకున్న మేరకు రానందున మరికొంత కాలం అనుమతి ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. దీంతో విస్తరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు హైదరాబాద్– విజయవాడ హైవే దేశంలోనే అత్యంత రద్దీ రహదారిగా గుర్తింపు పొందింది. టోల్‌ప్లాజాల లెక్కల ప్రకారం రోజూ సగటున 40వేల నుంచి 50వేల వాహనాలు ఈ మార్గంలో వెళుతున్నాయి. దీనిపై ఏ చిన్నపాటి ప్రమాదం జరిగినా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అన్ని విధాలుగా ప్రయోజనం హైవేను ఆరు వరుసలుగా విస్తరిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వాహనదారులు, ప్రయాణికులకు సమయం కూడా కలిసివస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం. – చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, చౌటుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు సర్విస్ రోడ్లు ఏర్పాటు చేయాలి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న హైవేపై నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించడానికి ఆరు వరుస లు అవసరం. విస్తరణతోపాటు హైవే వెంట ఉన్న అన్ని గ్రామాల వద్ద సర్వీసు రోడ్లు నిర్మించాలి. – బాతరాజు సత్యం, పంతంగి సర్పంచ్ -
మళ్లీ పులి భయం
పులి భయం మళ్లీ మొదలైంది. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నందిగూడ అటవీ ప్రాంత శివారులో రెండురోజుల కిందట పశువును చంపేసి.. పశువుల కాపరి గులాబ్‌పై దాడి చేసిన ఘటన దరిమిలా ఆ ప్రాంత సమీప ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ఘటనలో గులాబ్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడగా, చేతికి గాయాలయ్యాయి. ప్రతీ ఏడాది పత్తి తీసే ఇదే సీజన్లోనే పులుల సంచారం పెరుగుతోంది. దీంతో పత్తి చేన్లకు వెళ్లాలన్నా, జీవాలను మేతకు తీసుకెళ్లాలన్నా కాపర్లు జంకుతున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల మూడేళ్లుగా మనుషులపై దాడులు గత మూడేళ్లుగా నవంబర్ నుంచి జనవరి మధ్యే పులుల దాడులు అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా 2020 నవంబర్ 11న ఏ2 అనే పులి కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్(21) పత్తి చేనుకు వెళ్తుండగా దాడి చేసి చంపేసింది. అదే నెల 29న పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(18)ను పొట్టన పెట్టుకుంది. కేవలం మూడు వారాల వ్యవ«ధిలోనే ఇద్దరి మృతితో స్థానికుల నుంచి నిరసనలు వచ్చాయి. దాంతో అటవీ శాఖ సీరియస్‌గా తీసుకుని ఆ పులిని బంధించే ప్రయత్నం చేసినా.. సాధ్యపడలేదు. ఆ తర్వాత పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ గతేడాది నవంబర్లోనే కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము(69)ను పత్తి చేనులో ఉండగా దాడి చేసి చంపేసింది. తాజాగా పశువుల కాపరిపై దాడి జరిగింది. బఫర్ జోన్లోనే సంచారం ఉమ్మడి ఆదిలాబాద్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్‌గా ఉంది. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్‌గంగా, ప్రాణహిత తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. ఎనిమిదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడపులి కాగజ్‌నగర్‌లోనే స్థిర నివాసం ఉండటంతో సంతతి పెరిగింది. ఇలా అనేక పులులు ఒక్కొక్కటిగా తెలంగాణ భూభాగంలో ఆవాసం, తోడు వెతుక్కుంటూ అడుగుపెడుతున్నాయి. టైగర్ రిజర్వు పరిధి కోర్ ఏరియా మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కవ్వాల్‌లో మాత్రం ఇప్పటికీ ఒక్క పులి కూడా స్థిరంగా ఉండలేదు. కేవలం బఫర్ ప్రాంతాల్లోనే పులులు సంచరించడంతో సమస్య మొదలవుతోంది. ఆ ప్రాంతాల్లోనే పత్తి చేన్లు, మానవ సంచారం ఉండడంతో ఎదురుపడిన సందర్భంలో దాడి చేస్తున్నాయి. నిత్యం ఆదిలాబాద్ డివిజన్లో తాంసి, భీంపూర్, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో దహెగాం, పెంచికల్‌పేట, బెజ్జూరు, బెల్లంపల్లి, చెన్నూరు డివిజన్ల వరకు పులులు తిరుగుతుంటాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు పిప్పల్‌కోట్, కాగజ్‌నగర్ డివిజన్ అడవుల్లో అనేకసార్లు స్థానికులకు పులులు ఎదురుపడ్డాయి. అడవిలో వన్యప్రాణుల కంటే సులువుగా దొరికే మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెల పైనే దాడి చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అలా పశువులు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అటవీ శాఖ చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు మనుషులపై దాడి చేయడమే ఆందోళన కలిగిస్తోంది. జత కట్టే సమయంలో? పులులు జత కట్టే సమయం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యే కావడం, తోడు, ఆవాసం కోసం తోటి పులుల మధ్య ఆధిపత్య పోరు, వాగులు, నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న చోట సంచరిస్తూ అనుకోకుండా మనుషులు ఎదురుపడితే దాడులకు ప్ర«ధాన కారణమవుతున్నాయని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
సాగర్ కింద సాగు వద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లో నాగార్జునసాగర్‌తోపాటు కల్వకుర్తి, భీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ (స్కివం) కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా పెద్ద చిన్న ప్రాజెక్టులన్నింటి కింద కలిపి 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని సరఫరా చేయగలమని తేల్చింది. ఈ ఏడాది వర్షాభావంతో ఎగువ నుంచి ఆశించిన వరద రాక కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఇతర ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ (వానాకాలం) పంటల సాగే కష్టంగా కొనసాగింది. కొంత మేర ఉన్న నీళ్లూ దీనికే సరిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని స్కివం కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని యాసంగి సీజన్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించాలనే అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ నేతృత్వంలో బుధవారం జలసౌధలో స్కివం కమిటీ సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 2023–24 యాసంగిలో 28.95 లక్షల ఎకరాలకు 215 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గత ఏడాది యాసంగి లక్ష్యం 33.46 లక్షల ఎకరాలకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో కరువు నాగార్జున సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 157.61 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజీకిపైన వినియోగించుకోగలిగిన నీరు చాలా తక్కువ. దీనితో సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోనూ 57 టీఎంసీలే నీళ్లు ఉండటంతో.. ఏఎమ్మార్పి, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీరివ్వలేని పరిస్థితి. కేవలం నెట్టెంపాడు కింద 5వేల ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలకే సాగునీరు ఇవ్వగలమని అధికారులు పేర్కొన్నారు. గోదావరి బేసిన్లో కాస్త మెరుగ్గా.. గోదావరి బేసిన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 78.66 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 6.50 టీఎంసీలను తాగునీటికి, మిగతా నీటిని యాసంగి పంటల కోసం కేటాయించారు. ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉన్నా.. 8,28,297 ఎకరాలకే సాగునీరివ్వాలని లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో 3.87 లక్షల ఎకరాలు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలు తరి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు: స్కివం కమిటీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో.. అంటే 8 రోజులు నీటి విడుదల చేస్తూ, 7 రోజులు ఆపుతూ ఇస్తారు. ఇప్పటికే ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.