TS Special
-
ఐఆర్బీ టెండర్లపై సీఎం రేవంత్ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు టెండర్లలో అక్రమాలపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడంతో ఔటర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఔటర్ టోల్ లీజులో అక్రమాలకు బాధ్యులైన అధికారురులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఔటర్ లీజు వ్యవహారంపైన పూర్తి వివరాలను అందజేయాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ముఖ్యమంత్రి ఆదేశించారు. 158 కిలోమీటర్ల మార్గంలో టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఔటర్ రింగ్‌రోడ్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఐఆర్బీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు, పీసీసీ చీఫ్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. కనీస ధర వెల్లడించకపోవడంతో ఔటర్లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలపైన అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఆయనపైన పరువునష్టం దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పదంగా మారిన ఔటర్ లీజు అంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సమగ్రమైన విచారణ చేపట్టాలని ఆయన హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఓటీ పద్ధతిలో ఔటర్ లీజు... కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ (టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు 2022 ఆగస్టు11వ తేదీన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదే సంవత్సరం నవంబర్ 9వ తేదీన అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహా్వనించింది. గత సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 11 బిడ్డర్లు ఆసక్తిని ప్రదర్శించారు. బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా మూడుసార్లు బిడ్ గడువును పొడిగించారు. 30 ఏళ్ల లీజుపైన బేస్ ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ వెల్లడించారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన బేస్ప్రైస్పైన మాత్రం గోప్యతను పాటించడంతో ఈ లీజు వ్యవహారం వివాదాస్పదమైంది. మొదట్లో 11 సంస్థలు పోటీ చేయగా, చివరకు 4 సంస్థలు మాత్రమే పోటీలో మిగిలాయి. ఆ నాలుగింటిలోనూ ఐఆర్బీ ఎక్కువమొత్తంలో బిడ్ వేసి లీజును దక్కించుకుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో ప్రతి రోజు 1.5 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అప్పట్లో గత ప్రభుత్వం నిర్దేశించిన అంచనాల కంటే ఎక్కువ మొత్తంలో ఐఆర్బీ సంస్థకు టోల్ ఆదాయం లభిస్తున్నట్లు అధికారవర్గాల అంచనా. మరోవైపు ఏటా సుమారు రూ.550 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కామధేనువు వంటి ఔటర్‌ను ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం పట్ల ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గడువు కంటే ముందే రూ.7380 కోట్లు చెల్లించిన ఐఆర్బీ... ఇలా వివాదాల నడుమ ఔటర్ టెండర్‌ను దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ నిర్ణీత 120 రోజుల గడువు కంటే ముందే రూ.7380 కోట్ల లీజు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించింది..దీంతో 2008 నుంచి 2023 వరకు వరకు సుమారు 15 సంవత్సరాల పాటు హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు మొట్టమొదటిసారి ప్రైవేట్ సంస్థ నిర్వహణలోకి వెళ్లిపోయింది. నిబంధనల మేరకు రానున్న 30 ఏళ్ల పాటు ఈ లీజు కొనసాగవలసి ఉంటుంది. 8 వరుస లేన్లతో (1264 లేన్ కి.మీలు) కూడిన 158 కి.మీల ఔటర్ రింగ్రోడ్డుపైన ఉన్న సుమారు 120కి పైగా టోల్గేట్ల వద్ద ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థ టోల్ వసూళ్లను కొనసాగిస్తోంది. ఔటర్ రింగురోడ్డు నుంచి టోల్ వసూలు చేయడంతో పాటు రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, తదితర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలను కూడా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే చేపట్టవలసి ఉంటుంది. హెచ్‌జీసీఎల్ ఔటర్‌ను ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్‌ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితమైంది. -
Hussain Sagar: ‘90 ఎంఎల్’ ఇస్తేనే బయటకు వస్తా!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు పడితే అప్పుడు... ఎక్కడ పడితే అక్కడ డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తూ పోలీసులు మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లో దిగి పోలీసులకే చుక్కలు చూపించాడు. ‘90’ ఇస్తేనే బయటకు వస్తానంటూ ముప్పతిప్పలు పెట్టాడు. గత నెల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జనవరిలో ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ట్యాంక్‌బండ్ పై నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి దిగాడు. ఇతడు నడుము లోతు నీళ్లు ఉన్న ప్రాంతంలో నిల్చుని ఉండటాన్ని ట్యాంక్‌బండ్‌పై ఉన్న పర్యాటకులు చూపి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అగి్నమాపక శాఖ అధికారులనూ రప్పించారు. ట్యాంక్‌బండ్ మీది నుంచి తాడు వేసిన ఓ కానిస్టేబుల్ అది పట్టుకుని పైకి రావాల్సిందిగా ఆ యువకుడిని కోరాడు. ఆ ప్రాంతం దాటి ముందుకు వెళ్లవద్దని, అది చాలా ప్రమాదకరం అని హెచ్చరించాడు. ఈ విషయాన్ని సదరు యువకుడు పట్టించుకోకపోవడంతో సదరు కానిస్టేబుల్ ‘నీకు ఏం కావాలి?’ అంటూ ఉర్దూలో ఆ యువకుడిని అడిగాడు. దీనికి సమాధానంగా ‘90 (ఎంఎల్ పరిమాణంలో మద్యం) ఇస్తేనే బయటకు వస్తా’ అంటూ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న అనేక మంది దీన్ని వీడియో తీశారు. ఓ నెటిజనుడు బుధవారం దీన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ రోజు దాదాపు గంట కష్టపడిన తర్వాత పోలీసులు ఆ యువకుడిని బయటకు రప్పించగలిగినట్లు తెలిసింది. -
నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దాదాపు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేశారు. కాగా కొత్త ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది. -
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి రెండో వారంలోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావొచ్చనే అంచనాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డిలలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మోదీ శంఖం పూరించనున్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్లపై మోదీ రాజకీయ విమర్శలు సంధిస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభంతోపాటు సభల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోదీ 4వ తేదీన రాత్రి రాజ్‌భవన్‌లో బసచేస్తారు. ఇదీ మోదీ పర్యటన షెడ్యూల్... ► 4న ఉదయం మహారాష్ట్ర నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఎంఐ–17 హెలికాప్టర్లో బయలుదేరి ఉ దయం 10.20కు ఆదిలాబాద్‌కు చేరు కుంటారు. ► 10.30 నుంచి 11 గంటలదాకా ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు ► 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా బహిరంగసభలో పాల్గొంటారు ► 12.15కు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యా హ్నం 2.45 గంటలకు చెన్నైకి చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుని అక్కడే బసచేస్తారు. ► మార్చి 5న ఉదయం 10,15 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు ► 10.45 నుంచి 11.15 గంటల దాకా వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, పనులకు శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాలు చేస్తారు. ► 11.25 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు. 12.15 వరకు సభలో ప్రసంగిస్తారు. ► 12.30కు హెలికాప్టర్లో సంగారెడ్డి నుంచి బయ లుదేరి 12.55కు బేగంపేటకు చేరుకుంటారు. ► మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట నుంచి విమానంలో భువనేశ్వర్‌కు బయల్దేరుతారు. దీంతో మోదీ రాష్ట్ర పర్యటన పూర్తవుతుంది. -
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్‌లో 18.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చాలాచోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదు కాగా...ఆదిలాబాద్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతాచోట్ల ఒక డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉంటుందని, తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ వివరించింది. -
51 ఏళ్ల అర్హతను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు సడలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత భర్తీ చేస్తున్న గ్రూప్–1 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా పేర్కొందని, దీనిని 51 ఏళ్ల వరకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని, దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. గరిష్ట వయసు సడలింపు ఇస్తూ నోటిఫికేషన్లో మార్పు చేసేలా టీఎస్పీఎస్సీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఫణిభూషణ్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ల జారీలో చాలా జాప్యం జరిగిందన్నారు. దీంతో అనేక మంది గ్రూప్–1 పరీక్షలకు అర్హత కోల్పోయారని వివరించారు. ఈ దృష్ట్యా గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ ఆంశంలో మెరిట్ జోలికి వెళ్లడంలేదని, ఫిబ్రవరి 2న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 4 వారాల్లో దీనిపై నిర్ణయాన్ని తెలియజేయాలని స్పష్టం చేశారు. -
పక్కా నిఘా..పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,07,754 మంది విద్యార్థు లు పరీక్ష కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. మూడుచోట్ల మాల్ ప్రాక్టీసింగ్ జరిగినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, జనగాం జిల్లాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపింది. తొలి రోజు ద్వితీయ భాష పేపర్–1 పరీక్ష నిర్వహించారు. మూడు సెట్ల ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపి అందులో ‘ఎ’సెట్‌ను ఎంపిక చేశారు. ప్రైవేటుపై ప్రత్యేక నిఘా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 1,521 పరీక్షా కేంద్రాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశా రు. 880 ప్రైవేటు కాలేజీల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కార్పొరేట్ కాలేజీల జోక్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ఈసారి పోలీసు బందోబస్తు పెంచారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు సుడిగాలి తనిఖీలు చేపట్టాయి. 200 సిట్టింగ్ స్వా్కడ్స్ సమస్యాత్మక కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరిగేందుకు తోడ్పడ్డాయి. టెన్షన్... టెన్షన్... తొలి రోజు పరీక్ష కావడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం కన్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షకు గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం కన్పించింది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల్లో స్వల్పంగా సడలింపు ఇచ్చినట్టు జిల్లాల అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అవి సకాలంలో అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు విన్పించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు సొంత రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. -
మామునూరుకు పెద్ద విమానాలు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయాన్ని పెద్ద విమానాల ఆపరేషన్‌తోనే ప్రారంభించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించడంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. అవరోధంగా ఉన్న రెండు ప్రధాన అంశాలను వెంటనే కొలిక్కి తెచ్చేలా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం–పౌరవిమానయాన శాఖ మధ్య ఒప్పందం కుదరనుంది. విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుండగా 150 కి.మీ. నిడివిలో మరో విమానాశ్రయం ఉండకూడదన్న అంశాన్ని అధిగమించేలా హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో పౌర విమానయాన శాఖ చర్చలు జరపనుంది. ఈ రెండు కీలక ప్రక్రియలు పూర్తయితే ఏడాదిన్నరలోపే విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ భావిస్తోంది. ఈ ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగింది. ఇప్పటికే ఓ పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే.. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయమే అందుబాటులో ఉంది. బేగంపేటలోని పాత విమానాశ్రయం కేవలం ప్రముఖుల ప్రత్యేక విమానాల నిర్వహణకే పరిమితమైంది. దీంతో రెండో విమానాశ్రయం వెంటనే అవసరమని నిర్ణయించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయానికి చర్యలు చేపట్టింది. దాంతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలలో మరో ఐదు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మిగతా వాటి విషయంలో జాప్యం జరిగే పరిస్థితి ఉండటంతో వరంగల్ విమానాశ్రయాన్ని వెంటనే నిర్మించాలని చర్చల సందర్భంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయి. వరంగల్ శివారులోని మామునూరులో నిజాం కాలంలో ఎయిర్‌్రస్టిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్‌వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే ఉంది. దశాబ్దాలుగా వాటి వినియోగం లేకపోవటంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత్ ఎయిర్్రస్టిప్కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధీనంలోనే ఉంది. అక్కడే ఇప్పుడు కొత్త విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. పెద్ద విమానాశ్రయం నిర్మాణమంటే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున చిన్న విమానాలు ఆపరేట్ చేసేలా ప్రస్తుతానికి చిన్న రన్‌వేతో చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలో భావించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దాన్ని విస్తరిస్తూ పోవాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ ఒకేసారి పెద్ద విమానాలను ఆపరేట్ చేసే పూర్తిస్థాయి విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఖరారు చేశారు. ఇటీవల కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశంతో ఉండటంతో దీనికి మార్గం సుగమమవుతోంది. అదనపు భూసేకరణకు రంగం సిద్ధం.. అందుబాటులో ఉన్న భూమికి అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్కడికి చేరువలోనే పశుసంవర్థక శాఖకు చెందిన స్థలం అందుబాటులో ఉండటంతో దాన్ని సేకరించనున్నారు. ఒక గ్రామాన్ని తరలించాల్సి ఉంటుంది. త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం. విమానాశ్రయం వస్తే వరంగల్‌కు మరిన్ని పెట్టుబడులు.. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగా వరంగల్ విస్తరిస్తోంది. దాన్ని ఐటీ, ఇతర పరిశ్రమల స్థాపనతో వేగంగా అభివృద్ధి చేయాల్సి ఉందని చాలా ఏళ్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలే కాజీపేట శివారులో కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరింత వేగంగా పారిశ్రామీకరణ జరగాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు రావాలంటే స్థానికంగా విమానాశ్రయం ఉండాలన్నది పారిశ్రామికవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం హైదరాబాద్‌కు వరంగల్ 135 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్‌లో విమానం దిగి దాదాపు మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు కొంత ఆటంకంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. వరంగల్‌లోనే నేరుగా ల్యాండ్ అయ్యే ఏర్పాటు ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని తేల్చారు. ఇదే విషయాన్ని జీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని కేంద్రరాష్ట్రప్రభుత్వాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడికి 150 కి.మీ. నిడివిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఉండకూడదన్నది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో ఆ సంస్థకు ఉన్న ఒప్పందం చెబుతోంది. ఈ నిబంధన ఇప్పుడు వరంగల్ విమానాశ్రయానికి అడ్డంకిగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ఇందుకు త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు ప్రతినిధులు ఇందులో ఉంటారని సమాచారం. ఈ కమిటీ సభ్యులు జీఎంఆర్‌తో సంప్రదింపులు జరిపి ఈ సమస్యను కొలిక్కి తేనున్నారు. -
మెగా హెచ్ఎండీఏ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ఏడువేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ సుమారు పదివేల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో పురపాలక శాఖ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి కొత్తగా రానున్న ఆర్ఆర్ఆర్ మధ్య ఉండే ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకుని రావాలని ఆదేశించారు. రెండు రింగ్ రోడ్లను అనుసంధానించేలా రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా, ఆర్ఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న శివారు మునిసిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్– 2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఆమ్రపాలికి ‘టోల్ నివేదిక’ బాధ్యత ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం ఆదేశించారు. కనీస రేటు నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని ప్రశ్నించారు. టెండర్లలో ఏయే సంస్థలు పాల్గొన్నాయి? అవకతవకల్లో ఎవరెవరి ప్రమేయముంది? తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని చెప్పారు. టెండర్లకు అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరు, జరిగిన అవకతవకలపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి, టెండర్ల వ్యవహారంపై సీబీఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెండర్ విధానంతో రూ.15 వేల కోట్లకు పైగా నష్టం! టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ కింద ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కానీ కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించారని రేవంత్ ప్రశ్నించారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతో ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనా వేశారు. హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించగా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్‌ను ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయని సీఎం పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల్ని పరిరక్షించాలి హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలని, అలాగే ల్యాండ్ పూలింగ్ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ల్యాండ్ పార్శిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కాకుండా ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. కాగా హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉంటే.. అందులో 2,031 ఎకరాల పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘కమ్యూనిటీ’ స్థలాలపై తక్షణ సర్వే హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచి్చన స్థలాలు తమ అ«దీనంలోనే ఉన్నాయా? లేక ఆక్రమణకు గురయ్యాయా? వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పొరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. స్థానికులైన పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా కనీసం 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పారు. ప్రపంచ స్థాయి టూరిస్ట్ ప్లేస్‌గా హుస్సేన్‌సాగర్ పరిసరాలు హుస్సేన్‌సాగర్‌పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన, అందమైన జోన్‌గా తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇటు అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి నుంచి అటు నెక్లెస్ రోడ్డు, ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సూచించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలిగించాలన్నారు. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ, ల్యాండ్ స్కేప్లను అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్‌కు మళ్లించి పర్యాటక జోన్‌గా మార్చాలని చెప్పారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
తాగునీటి తంటాలు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వేసవి దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణకు దిగింది. నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో డెడ్‌స్టోరేజీ వరకు నీటిని పంపింగ్ చేసేందుకు అత్యవసర మోటార్లు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వేసవిలో తాగునీటి డిమాండ్ పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం సరఫరా చేస్తున్న 565 మిలియన్ గ్యాలన్స్ పర్ డే (ఎంజీడీ)లకు తోడు అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లకు సిద్ధమైంది. మహానగరానికి మంచి నీరు అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 516 అడుగులకు చేరింది. నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తుగా మోటార్లను బిగించి అత్యవసర పంపింగ్‌కోసం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ జలాశయంలో మినహా అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని జలమండలి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సగం వాటా కృష్ణా జలాలదే.. మహానగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అవుతున్న తాగునీటిలో సగం వాటా కృష్ణా జలాలదే. నాగార్జున సాగర్ నుంచి నిత్యం 270 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్ సమీపంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి పంప్ హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్‌లోకి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే పరిస్థితి ఉండదు. దీంతో సాగర్ నుంచి కష్ణాజలాల అత్యవసర పంపింగ్ తప్పనిసరి. గత ఐదేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించారు. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహా నగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 565 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103, ఉస్మా¯న్ సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. డెడ్ స్టోరేజీగా హిమాయత్‌సాగర్‌ను ఉంచినప్పటికీ వేసవిలో అవసరాల మేరకు ఈ రిజర్వాయర్ నుంచి పాతనగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి నుంచి తరలిస్తున్న 172 ఎంజీడీలో 40 ఎంజీడీలు మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారు. దానిని సైతం నగరానికి తరలించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు.. వేసవిని దృష్ట్యా డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధమైంది. నగరంలో ఇప్పటికే 72 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిమాండ్‌ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం జలమండలి చర్యలు చేపట్టింది. -
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆరి్టఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కారి్మకులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దురి్వనియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కారి్మకులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కారి్మకులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగి్నషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్‌రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్‌తో.. ఫేషియల్ రికగి్నషన్ను మొబైల్ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కారి్మకులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కారి్మకులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కారి్మకుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహా్వనించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది. -
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిరి్మతమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్‌కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచి్చనా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
మరో 4 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. 3 వేల నుంచి 4 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ ఒకరు తెలిపారు. సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పు జరిగి చేరికల్లో ఎక్కువ మందికి చాన్స్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. దీంతో ఆన్లైన్ కోర్సుల నిర్వహణ ద్వారా ఐఐటీలు కొంతమేర నిధులు సమకూర్చుకునే ప్రతిపాదన ముందుకు వస్తోంది. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ నేపథ్యంలో.. దేశంలో కంప్యూటర్ నేపథ్యం ఉన్న కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీల దృష్ట్యా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎన్ఐటీలు, ఐఐటీల్లోనూ కంప్యూటర్ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జేఈఈలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్ష¯న్గా పెట్టుకుంటున్నారు. మరోవైపు నైపుణ్యంతో కూడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సదస్సులోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీలు సైతం కంప్యూటర్ కోర్సుల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొంబయి ఫస్ట్..ఢిల్లీ, మద్రాస్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బొంబయి ఐఐటీకి ప్రతి ఏటా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ ఐఐటీని జేఈఈ అడ్వాన్స్‌డు ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఐఐటీ ఉంటోంది. గత ఏడాది ముంబై ఐఐటీలో ఓపె¯న్ కేటగిరీలో బాలురైతే 67, బాలికలైతే 291వ ర్యాంకు వరకు సీటు కేటాయింపు జరిగింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది. ఇక విద్యార్థులు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో భిలాయ్ ఐఐటీ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ఎన్ఐటీల్లోనూ అవకాశాలు దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు పెరిగితే ఎన్ఐటీల్లోనూ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల మెరుగైన ర్యాంకులు పొందినవారు ఐఐటీలో చేరుతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని, ఎక్కువమందికి సీట్లు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే, 2023లో బాలురకు 3115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుందంటున్నారు. తిరుచిరాపల్లి ఎన్ఐటీలో బాలురకు 2022లో 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోయాయి. గత ఏడాది మాత్రం బాలురకు 1509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్‌నే ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యతగా కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయో టెక్నాలజీలో 48 వేల వరకు సీటు వచ్చింది. -
రెండ్రోజులు తేలికపాటి వానలు!
సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా అదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. గతవారం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. సీజన్లో నమోదు కావాల్సిన స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదై ముందస్తుగా వేసవి హెచ్చరిక మాదిరిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చట్టబడింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణం కంటే కిందకు పడిపోయాయి. వేసవి సీజన్ చివరి దశలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండ్రోజులు ఇదే తరహా వాతావరణం ఉన్నప్పటికీ... తర్వాత పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 15.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. -
‘సబ్సిడీ సిలిండర్’ ఎందరికి?
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్‌కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా... తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్‌కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. 40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. -
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అప్పగించడం... ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్‌సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్‌సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్‌గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్‌్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్‌కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్‌్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీల్లో రెండు అమలు అవుతున్నాయి మరో రెండు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఉచిత బస్ ప్రయాణం వల్లే మేడారం జాతరకు మహిళా భక్తులు పోటెత్తారని అన్నారు. ఈయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం. ఉద్యోగులు గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో స్థానికతకు దూరంగా వెళ్లారు. జీవో 46, జీవో 317లను సమీక్షించేందుకు సబ్ కమిటీ వేయడం హర్షణీయం. ఉమ్మడి జిల్లా మొత్తం ఒక జోన్ ఉండేలా ఉంటే మంచిది. ఉమ్మడి కరీంనగర్ 4 జోన్లుగా విభజించారు.దీంతో జూనియర్లు చేరిన చోట ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండవు. సీనియర్లు అందరూ దగ్గరగా ఉండే చోటుకు వెళ్తే ఆ జోన్లో పదవీ విరమణ జరిగి ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే సవరణలు ఉంటాయి. ఏప్రిల్ చివరివారం లోపు కమిటీ నివేదిక ఇస్తే సంతోషం’ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. చదవండి: అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి -
తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాల్లో వానలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముంది. ఇక, ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా మారింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. -
Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే..
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్ స్కీంకు రేషన్‌కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మహానగర పరిధిలోని గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్ అర్హతకు సమస్యగా తయారైంది. 10 లక్షల కనెక్షన్లకే సబ్సిడీ వర్తింపు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్ వర్తించనుంది. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్రా కోసం వలస వచి్చన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన గ్యాస్ కనెక్షన్ దారులు కేవలం 10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. ఉజ్వలకు వర్తింపు ? ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్ యోజన పథకం కింద గల కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్‌పై రూ.300ల సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద లక్ష వరకు కనెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్ కంపెనీల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. కొత్త పథకం వర్తిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రెండు విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా? లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం సబ్సిడీ ఇలా కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం రూ.40.17 పైసలు సబ్సిడీ అందిస్తోంది. గత రెండేళ్లుగా వంట గ్యాస్ ధరతో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఏలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్‌పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేసే డీబీటీఎల్ పథకం 2014 నవంబర్ 10న అమల్లో వచి్చంది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ జరిగేది. డీబీటీ పథకం అమలు తొలిరోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేంది. తాజాగా సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ రూ 40.71 పైసలకు పరిమితమైంది. -
వనం చేరిన సమ్మక్క..
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర ముగిసింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను శనివారం సాయంత్రం వడ్డెలు (గిరిజన పూజారులు) ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరిరోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే వేడుక సమయంలో వాన జల్లులు కురవడం గమనార్హం. చివరిరోజు కార్యక్రమం ఇలా.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశం ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలై సుమారు రాత్రి ఏడున్నర వరకు సాగింది. తల్లులను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి అడవిలోకి చేర్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర గిరిజన ఆచారాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని వడ్డెల బృందం గద్దెలపైకి చేరుకుంది. పూజల తర్వాత సమ్మక్క తల్లిని గద్దెల ప్రాంగణం నుంచి భక్తులను దాటుకుంటూ బయటికి తీసుకెళ్లి రాత్రి 7.27 గంటల సమయంలో చిలకలగుట్టకు చేర్చారు. ఇలా ఓవైపు వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సంప్రదాయం ప్రకారం.. సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీరసారెలు, బంగారం, పసుపు కుంకుమలను స్థానికులు తీసుకునే కార్యక్రమం జరిగింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు పోటీపడ్డారు. దీనితో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. కన్నెపల్లికి సారలమ్మ.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దె వద్ద గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మొంటె (వెదురుబుట్ట)ను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. ఈ సమయంలో భక్తులు పూజారులను తాకడానికి ప్రయత్నించారు. మరోవైపు గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద కూడా చివరిరోజు పూజలు జరిగాయి. ఊరేగింపుగా పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు.. గోవిందరాజులును ఏటూరునాగారం మండలం కొండాయికి తీసుకెళ్లారు. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర ముగిసిందని ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రకటించారు. ప్రస్తుత మేడారం జాతరకు మొత్తంగా 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని.. వారు ఇక్కడికి చేరుకునేందుకు లక్షన్నర వాహనాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. బుధవారం తిరుగువారం పండుగ.. సమ్మక్క–సారలమ్మలకు ఈనెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని.. జాతరకు వచ్చిన భక్తులు చల్లంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు. తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం మేడారం గ్రామస్తులు, ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు ఇళ్లను అలికి శుద్ధి చేస్తారు. సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పూజారులు జాతర సమయంలో తమకు ఇళ్లకు ఆహా్వనించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతారు. మేడారం మహాజాతర తిరిగి 2026 మాఘమాసంలో జరగనుంది. గద్దెను వీడి వనప్రవేశం చేసినదిలా.. 5.10 గంటలకు గోవిందరాజులు 5.30 గంటలకు పగిడిద్దరాజు 7.27 గంటలకు సమ్మక్క వనప్రవేశం 7.40 గంటలకు సారలమ్మ వనప్రవేశం ఆనవాయితీ ప్రకారం తొలుతగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను గద్దెల మీది నుంచి సాగనంపుతారు. వారు వెళ్లగానే సమ్మక్క వన ప్రవేశ కార్యక్రమం ఉంటుంది. చివరిగా సారలమ్మను తీసుకెళతారు. -
భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వేసవి తీవ్రత అప్పుడే పెరుగుతుండడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. బోరుబావుల కింద వేసిన యాసంగి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి నెలలో తొలిసారిగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 15వేల మెగావాట్లను దాటింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది సరిగ్గా ఇదే రోజు 14,526 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ మాత్రమే నమోదైంది. గతేడాది మార్చి 30న రాష్ట్రంలో అత్యధికంగా 15497 మెగావాట్ల గరిష్ట విదుŠయ్త్ నమోదు కాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి 16,500 మెగావాట్లకు మించనుందని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్‌కు ఏర్పాట్లు 1,600మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 800 మెగావాట్ల నుంచి ఇప్పటికే వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కాగా, 800 మెగావాట్ల రెండో ప్లాంట్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సర్వంసిద్ధం చేశారు. పొరుగు రాష్ట్రాలతో 1200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్‌కు సైతం ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చి మన రాష్ట్రంలో లోటు ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో 6.9 శాతం, ఫిబ్రవరి నెలలో 4.6 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజువారీ విద్యుత్ వినియోగం 242.95 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 256.74 మిలియన్ యూనిట్లకు చేరింది. సాగునీరు లేక పెరగనున్న విద్యుత్ అవసరాలు కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో కాల్వల కింద ఆయకట్టు సాగుకు నీళ్లు లేవు. మరమ్మతుల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో బోరుబావుల కింద విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. గరిష్ట విద్యుత్ డిమాండ్ మార్చి చివరిలోగా 16500–17000 మెగావాట్ల మధ్య నమోదు కావచ్చని భావిస్తున్నారు. దక్షిణ డిస్కంల పరిధిలోనూ పెరిగిన వినియోగం దక్షిణ తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 6.67 శాతం, ఫిబ్రవరిలో 6.24 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. సంస్థ పరిధిలో ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 9043 మెగావాట్లు నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 9253 మెగావాట్లకు పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 158.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఈ ఏడాది ఇదే కాలంలో 169.36 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గ్రేటర్లో డిమాండ్ పైపైకి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 9.47 శాతం, ఫిబ్రవరిలో 12.27శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,930 మెగావాట్లుగా నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 3,174 మెగావాట్లుగా నమోదయ్యింది. నగరంలో గతేడాది జనవరి, ఫిబ్రవరిలో సగటు విద్యుత్ వినియోగం 51.69 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది జనవరిలో 57.34 మిలియన్ యూనిట్లు, ఫిబ్రవరిలో 65 మిలియన్ యూనిట్లకు పెరిగింది. -
27 నుంచి మరో 2 గ్యారంటీల అమలు
హుజూర్నగర్ (సూర్యాపేట)/ సింగరేణి(కొత్తగూడెం): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈనెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామంలో రూ 37.70 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ...ఈనెల 27 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ పథకాలకు చేవెళ్లలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ శ్రీకారం చుడతారని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.సభ అనంతరం దొండపాడుకు వెళ్తూ మార్గమధ్యలో మిరపతోట వద్ద మంత్రులు కారు దిగి వెళ్లి కూలీలతో ముచ్చటించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారా.. టికెట్ తీసుకుంటున్నారా అని మహిళలను అడిగారు. అందుకు వారు బదులిస్తూ ఉచితంగానే ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఈ పొలం ఎవరిది, కూలీ ఎంత ఇస్తున్నారని వారు మహిళలను ఆరా తీశారు. నేడు సోలార్ ప్లాంట్ ప్రారంభం సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలోని కొత్తగా నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను భట్టి విక్ర మార్క, ఇతర మంత్రులు ఆదివారం ప్రారంభించనున్నారు. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి సంస్థ ఇప్పటికే త్రీఇంక్లైన్లో 48 ఎకరాల్లో రూ.56.76 కోట్లతో 10.5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ నిర్మించింది. త్రీఇంక్లైన్, గరిమెళ్లపాడు ప్రాంతాల్లో 37 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. -
నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి కట్టుబడి ఉన్నాం
బోధన్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఫ్యాక్టరీలను తెరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. శనివారం బోధన్‌లోని ఫ్యాక్టరీని కమిటీ సభ్యులు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం ఫ్యాక్టరీని తెరిపించి లాభాల బాటలో నడిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామికరంగ నిపుణులతో చర్చిస్తున్నామని వివరించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణాలు వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫ్యాక్టరీలను ప్రభుత్వమా లేక సహకార విధానంలోనా లేక ప్రైవేటు రంగంలోనా ఎలా నడపాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకొనేందుకు ఆలోచించకపోతే నిజాం షుగర్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా అవుతుందని వ్యాఖ్యానించారు. మార్పు చేసి చూపుతాం.. ప్రజలు ఆకాంక్షించిన మార్పును చేసి చూపుతామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ నెల 27న రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హైదరాబాద్ శివారులో జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, నిజాం షుగర్స్ ఎండీ డాక్టర్ మక్సూద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్‌నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్‌యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్‌సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్‌కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ సబ్‌కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్‌లో కమిషనర్‌కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
‘ధరణి’ దరఖాస్తులను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బందిపడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల స్థాయిలో మార్చి తొలివారంలోనే దరఖాస్తుల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం సీఎం రేవంత్ రాష్ట్ర సచివాలయంలో ధరణి పోర్టల్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి కమిటీ ప్రాథమిక నివేదికను అందజేయగా.. కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ ఆ వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలు.. రాష్ట్రంలో 2020లో అమల్లోకి వచ్చిన కొత్త ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని, ఆ చట్టమే అన్ని అనర్థాలకు మూలమని ధరణి కమిటీ సభ్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో చిక్కులు వచ్చాయని, ఆ రికార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో భూసమస్యలు, భూరికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని వివరించారు. లక్షలాదిగా సమస్యలు పేరుకుపోయాయని, రికార్డుల్లో చిన్న అక్షర దోషమున్నా సవరించుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో 35 మాడ్యూల్స్ ఉన్నా.. ఎలాంటి సమస్యకు ఏ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని సీఎంకు వివరించారు. ఇప్పటికే లక్షలాది మంది రైతులు పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని.. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి రావడం రైతులకు భారంగా మారిందని తెలిపారు. ప్రస్తుత ధరణి పోర్టల్‌ను రైతులకు ఇబ్బంది లేకుండా మార్చాలంటే.. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని సవరించాలని, లేదా మరో కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా.. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో.. నిషేధిత జాబితాలోని భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరగడం, ఈ రికార్డుల ఆధారంగా రైతుబంధు జమచేయడంతో జరిగిన కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అంశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. తుది నివేదిక ఆధారంగా శాశ్వత చర్యలు వీలును బట్టి కొత్త ఆర్వోఆర్ చట్టానికి సవరణలు చేద్దామని.. లేదంటే మరో కొత్త చట్టం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిద్దామని సమీక్షలో సీఎం రేవంత్ చెప్పారు. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే భూముల సమస్యలపై శాశ్వత పరిష్కార చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడున్న సమస్యల పరిష్కారం కోసం తీసుకునే నిర్ణయాలతో.. భవిష్యత్తులో కొత్త సమస్యలు రాకూడదన్నారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితంగా భూరికార్డులు తయారుచేసేలా చర్యలు తీసుకుందామన్నారు. ఇందుకోసం లోతు గా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఐసీకా... సీజీజీకా? సమీక్షలో భాగంగా ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్య తలను ఎవరికి అప్పగించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. ప్రస్తుతం పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవే టు ఏజెన్సీ కాలపరిమితి కూడా ముగుస్తున్న నేపథ్యంలో.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) లేదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. ధరణి పార్ట్–బీ లో చేర్చిన 13.5లక్షల ఎకరాల భూముల విషయంపైనా సమీక్షలో చర్చించారు. ఈ భూముల సమస్య ను పరిష్కరించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎట్లా పరిష్కరిస్తారు? ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్, పారాలీగల్ వలంటీర్, ఒక సర్వేయర్‌తో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తారు. ఆ హెల్ప్‌డెస్క్ సదరు మండలం పరిధిలోని ధరణి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి నివేదిక ఇస్తుంది. తహసీల్దార్లు ఆ నివేదిక మేరకు తమ స్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. లేకుంటే ఉన్నతాధికారులకు (ఆర్డీవోలు/కలెక్టర్లకు) సిఫార్సు చేస్తారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గోప్యంగా ఉండాల్సిన వివరాలు.. ప్రైవేటుకు ఎలా? సమీక్షలో భాగంగా ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీ వ్యవహారశైలిపై చాలాసేపు చర్చ జరిగింది. బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన పోర్టల్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందని రెవెన్యూ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది రైతుల భూరికార్డుల డేటా, వారి ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లోకి.. తద్వారా విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు భూరికార్డులు సురక్షితంగా ఉన్నట్టా లేనట్టా? డేటాకు భద్రత ఉందా అని నిలదీశారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ అధికారులు మాట్లాడుతూ.. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్డింగ్‌ల ఆధారంగా అప్పటి ప్రభుత్వం ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్, డెవలప్మెంట్ బాధ్యతలను అప్పగించిందని వివరించారు. తర్వాత ఆ కంపెనీ దివాలా తీయడం, టెరాసిస్గా పేరు మార్చుకోవడం, డైరెక్టర్లు మారిపోవడం, ఆ తర్వాత మళ్లీ వాటాలు అమ్ముకుని ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా రూపాంతరం చెందడం వంటి పరిణామాలు జరిగాయని తెలిపారు. అయితే ఇలా బిడ్ దక్కించుకున్న కంపెనీ ఇష్టానుసారం పేర్లు మార్చుకుని కొత్త కంపెనీలను తెస్తే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని రేవంత్ ప్రశ్నించారు. భూరికార్డుల డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా నిబంధనలు ఎక్కడున్నాయని రెవెన్యూ అధికారులను నిలదీశారు. రూ.116 కోట్లకు ధరణి పోర్టల్ నిర్వహణ టెండర్లు దక్కించుకున్న కంపెనీ.. తమ వాటాలను ఏకంగా రూ.1,200 కోట్లకు అమ్ముకోవడం విస్మయం కలిగించిందన్నారు. రికార్డులు వారి వద్దే ఉన్నందున విలువైన భూముల యజమానుల పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గతంలో ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. అసలు ధరణి పోర్టల్ నిర్వహణపై ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు నియంత్రణ ఉందా? అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో సదరు ప్రైవేట్ ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు.