News
-
ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్' అలజడి!
నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్‌లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది. టెట్ నిబంధన సరికాదు డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్‌కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. -
ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్!
కరీంనగర్: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్ చేస్తే రాళ్లు వచ్చిన సంఘటన కోనరావుపేట మండలం కనగర్తిలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన కొల్లూరి వికాస్ ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కోసం జనవరి 1న బుక్ చేశాడు. 12న డెలివరీ ఇస్తామని షాపింగ్ సంస్థ స్పష్టం చేయగా.. ఆదివారమే పార్సిల్ ఇంటికొచ్చింది. డెలివరీ బాయ్‌కి రూ.2,718 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. పార్సిల్ తెరిచి చూడగా రాళ్లు కనిపించడంతో కంగుతినడం యువకుడి వంతైంది. మోసం జరిగిందని వెంటనే డెలివరీ బాయ్‌కి చెప్పగా ఐటమ్ రిటర్న్ పెట్టమంటూ వెళ్లిపోయాడు. -
మహాలక్ష్మి పథకానికి స్పష్టత ఇచ్చిన పరేషాన్! రెండుంటే చాలు..
మహబూబాబాద్: ప్రభుత్వం గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తులకు ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులను జత చేస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. అయితే కొంతమంది ఆధార్, రేషన్‌కార్డుతో పాటు కులం, ఆదాయం, నివాసం తదితర సర్టిఫికెట్లను కూడా జత చేసేందుకు మీసేవ, ఆధార్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. ఇదిలా ఉండగా గ్యాస్ ఏజెన్సీల ఎదుట ఈ–కేవైసీ కోసం సైతం జనం క్యూ కడుతున్నారు. రెండుంటే చాలు.. ప్రభుత్వం ఐదు గ్యారంటీల (మహాక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు) అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని గత డిసెంబర్ 28న ప్రారంభించి.. ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు పెట్టింది. కాగా దరఖాస్తులకు ఆధార్, రేషన్‌కార్డుల జిరాక్స్‌లు జత చేస్తే సరిపోతుంది. అయితే ప్రజలు అన్ని పథకాల కోసం అన్ని రకాల సర్టిఫికెట్లు అవసరమని భావించి ఆయా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా పింఛన్, రైతుబంధు వచ్చిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని చెప్పినా ప్రజలు వినడం లేదు. మీసేవ కేంద్రాల వద్ద రద్దీ.. జిల్లాలో 98 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఆరు గ్యారంటీల అమలు విషయంలో చాలా మంది కులం, ఆదాయం, నివాసం, ఆహార భద్రత కార్డుల కోసం ఆయా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరిగింది. కాగా మహా లక్ష్మి పథకానికి ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు అడుగుతారని ప్రచారం జరగడంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న ఆరు ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల కోసం ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు, బయో మెట్రిక్, పుట్టిన తేదీ, ఇతర మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద.. జిల్లాలో 13 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 2.14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా ఈ–కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాయితీపై సిలిండర్ సరఫరా చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులుదీరుతున్నారు. ఈ–కేవైసీతో రాయితీ సిలిండర్‌కు సంబంధం లేదని అధికారులు చెబుతున్నా.. ప్రజలు వినడం లేదు. వసూళ్ల పర్వం.. జనాల తాకిడిని ఆసరాగా చేసుకొని ఆధార్, మీ సేవ, జిరాక్స్ సెంటర్లలో అధికంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే పలు గ్యాస్ ఏజెన్సీలు ఈ–కేవైసీకి రూ.200వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో.. -
‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో..
నిజామాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. పథకాన్ని రద్దు చేస్తూ జీవో జారీచేసింది. దీంతో ఎన్నికలకు ముందు జారీచేసిన ప్రొసీడింగ్‌లు రద్దయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీల చెత్తబుట్టలో పారవేయాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల సాయాన్ని అందించడానికి గత ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఒక్కో నియోజకవర్గంలో 3వేల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి గుట్టుచప్పుడు కాకుండా ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ కాపీలపై కలెక్టర్ల ఆదేశాలతో జారీ చేసినట్లు ఎంపీడీవోల హోదాను పేర్కొంటూ రాసి ఉంది. కానీ కాపీలపై ఏ అధికారి సంతకం లేకపోవడం గమనార్హం. జిల్లాలో 16,500ల మందికి ప్రొసీడింగ్ కాపీలను అందించారు. ఎన్నికల తేదీ ఖరారైన తర్వాత కూడా కాపీలను లబ్ధిదారులకు అందించారు. అధికారుల సంతకాలు లేకపోవడంతో అవి చెల్లుబాటు కావని అప్పట్లోనే ప్రచారం జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5లక్షల చొప్పున సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన గత ప్రభు త్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకం కంటే ఇందిరమ్మ ఇంటికే ఎక్కువ సాయం అందుతుంది. అందువల్ల గతంలోని ప్రొసీడింగ్ల ద్వారా సాయం పొందడం కంటే కొత్తగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం మంజూరు చేయించుకుని లబ్ధి పొందడం మంచిదనే భావన కలుగుతుంది. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికై న వారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం పొందడానికి మరోసారి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇవి చదవండి: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం -
చైర్‌పర్సన్‌కు అండగా బీజేపీ, కాంగ్రెస్!
నిజామాబాద్: ఆర్మూర్ బల్దియాలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అవిశ్వాసం నెగ్గుతుందా.. వీగిపోతుందా.. లేదంటే వాయిదా పడుతుందా అనే సందిగ్ధత నెలకొంది. అయితే ఆర్మూర్‌లో బీఆర్ఎస్ను దెబ్బతీసే క్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతకు బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ముఖ్య నేతలు అండగా నిలుస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనే క్ర మంలో చైర్‌పర్సన్‌కు అండగా నిలుస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. మరోవైపు చైర్పర్సన్ కుటుంబానికి చెందిన బీజేపీ ముఖ్యనేత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకొనే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడేళ్లపాటు అదే బీఆర్ఎస్ పాలకవర్గం అవినీతి అక్రమాలపై బీజేపీ పోరాటం చేయడం గమనార్హం. సమావేశానికి ఏర్పాట్లు.. చైర్ పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ తెలిపారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని 36 మంది కౌన్సిలర్లతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సైతం తన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేతో కలిపి కోరం సభ్యులైన 25 మంది కౌన్సిలర్లు హాజరైన పక్షంలోనే అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు, చైర్ పర్సన్ పండిత్ వినీత వర్గానికి చెందిన కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపులకు వెళ్లారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్లలో ఎంతమంది సమావేశానికి హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారో వేచిచూడాల్సిందే. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో.. -
ర్యాంకుల కోసం ప్రణాలు పణం.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!
"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి రెండో ర్యాంకు వచ్చింది..' అంటూ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యలో విద్యార్థులు ఎంతటి ఒత్తిడి అనుభవిస్తున్నారు.. ఎలా చదువుకుంటున్నారు.. అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ విద్యాసంస్థలు చేతులు దులుపుకొంటే.. తల్లిదండ్రులు కడుపు కోతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.. మొత్తంగా తల్లిదండ్రుల అత్యాశ.. విద్యాసంస్థల ధనదాహం.. ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.." - మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఎప్పుడూ ప్రిపరేషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. రోజువారి సాధారణ తరగతులే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని కొందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్‌నగర్‌లోని మైనార్టీ గురుకులంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు తీవ్రమైన ఒత్తిడే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌లో చోటుచేసుకున్న పై సంఘటనలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యా సంస్థలకు విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. - గత వారం రోజుల క్రితం క్రిష్టియన్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలు పెడుతున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులే స్వయంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఎంఈఓతో విచారణ జరిపించారు. స్పెషల్ క్లాస్‌లు, పరీక్షల నిర్వహణ నిజమే అని తేలడంతో పాఠశాలను హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచే.. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఐఐటీ, నీట్లో సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ తరగతులు పూర్తయిన వెంటనే స్పెషల్ క్లాస్‌ల పేరిట ఐఐటీ, నీట్ కోసం శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షల సిలబస్‌పై దృష్టి సారించాలా.. లేక ఐఐటీ, నీట్ వంటి వాటిపై దృష్టిపెట్టాలా అన్న అంశాలతో గందరగోళానానికి గురవుతున్నారు. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
TS గవర్నమెంట్ కీలక నిర్ణయం! ఉపాధ్యాయుల్లో ఆందోళన..
ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రతీ అంశాన్ని కీలకంగా పరిగణిస్తూ విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావాలనే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయాన ఉపాధ్యాయుల పదోన్నతుల అంశంపై సైతం దృష్టి పెట్టింది. ఈక్రమంలోనే పదోన్నతుల కల్పనకు ముందు టెట్ నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పదోన్నతి కల్పించేందుకు టెట్ అర్హతను తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తుండగా, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 4,785మంది ఉపాధ్యాయులు జిల్లాలోని 1,232 ప్రభుత్వ పాఠశాలల్లో 4,785మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో టెట్ పూర్తయిన ఉపాధ్యాయులు సుమారు 300మంది ఉన్నట్లు తెలుస్తోంది. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేయాలనే భావనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో చర్చ మొదలైంది. 2012కు ముందు టెట్ లేకపోవడంతో జిల్లాలో సుమారు 4వేల మంది ఉపాధ్యాయులకు పదో న్నతులకు అర్హత కోల్పోతారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగ ణించి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఉండాలి.. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం... టీచర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా పదోన్నతులు కల్పిస్తేనే అర్హుల కు లబ్ధి జరుగుతుందని మరికొందరు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
సీతారామ ప్రాజెక్టుతో ఆగస్టు నాటికి సాగునీరు అందించాలి : మంత్రి తుమ్మల
ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆగస్టు నాటికి సాగునీరు అందించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని సీతా రామ లిఫ్ట్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలంలో మట్టి పనులు పూర్తి చేయాలని, మిగిలిన పనులు వర్షాకాలంలో చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో కూడా కాల్వలు తవ్వే పనులు వేసవికి ముందే పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలో రహదారులు, రైల్వే లైన్లు, అటవీ భూములు, పోడు భూములు, గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల వంటివి ఏవి ఉన్నా నిర్వాసితులకు పరిహారం కోసం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను సంప్రదించాలని చెప్పారు. కేంద్రం లేదా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ అనుమతి కావాలన్నా తనను కలవాలని, సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి సకాలంలో సాధిస్తానని భరోసా ఇచ్చారు. అనంత రం మ్యాప్ ద్వారా అధికారులు పనుల పురోగతిని వివరించారు. టన్నెళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఏజన్సీ లను సంప్రదించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. రూ.7,500 కోట్లు వెచ్చించినా ఇంకా పనుల్లో జాప్యం తగదన్నారు. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఏం చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో టన్నెళ్ల నిర్మాణం, జెన్కో టెండర్లు, పంపుల నిర్మా ణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు నీరు.. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు, వచ్చే ఏడాది మరో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల వివరించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు సమానంగా ప్రాజెక్టు ఎత్తును నిర్వహించడం ద్వారా ఎంత పెద్ద ఉప్పెన వచ్చినా తెలంగాణలో ముంపు ఏర్పడదని అధికారులు చెప్పారు. అనంతరం ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలను అఽధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా కొత్త కలెక్టరేట్‌కు ఇబ్బంది కాకుండా, మరెవరికీ ఆటంకం కలుగకుండా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో కొండరెడ్లు 80 ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నారని.. వారు అంతరించిపోతున్న తెగగా గుర్తించబడ్డారని.. వారికి రవాణా సౌకర్యం కోసం గతంలోనే తాను రూ.30 కోట్ల ఎల్‌డబ్ల్యూఈ నిధులను మంజూరు చేశానని కలెక్టర్ ప్రియాంక ఆలకు గుర్తు చేశారు. సంబంధిత అధికారులతో చర్చించి ఆ నిధులు వెనక్కు మళ్లకుండా వారికి రహదారి సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ వీ.పీ.గౌతమ్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ ఎ. శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అశ్వారావుపేట ఈఈ సురేష్‌కుమార్, డీఈఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: TS గవర్నమెంట్ కీలక నిర్ణయం! ఉపాధ్యాయుల్లో ఆందోళన.. -
తప్పును సమర్థించుకునే ‘డ్రామా’.. రామోజీ షో అట్టర్ ఫ్లాప్!
కర్నూలు: ఆకలైన వారికి అన్నం పెడితే ఎవరైనా వద్దంటారా? కడుపు నిండా భోజనం చేసిన వారిని తిను తిను అంటే ఎలా తింటారు. కర్నూలు డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత మూడు రోజులుగా ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంటోంది. ఒకసారి చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలే తప్ప, తిరిగి పదే పదే అదే తప్పును చేయబోయి ‘ఈనాడు’ చేతులు కాల్చుకుంటోంది. వండి వార్చిన తప్పుడు కథనాలను సమర్థించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. గత నెల 30న ‘మనసు లేని మామయ్య’ శీర్షికన ఈనాడు మొదటి పేజీలో కర్నూలు డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం వల్ల చలికి గజగజ వణికిపోతున్నట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే 31వ తేదీన వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ‘సాక్షి’ చేసింది. గత డిసెంబర్ 5న ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలలకు దుప్పట్లను సరఫరా చేయగా, ఈ పాఠశాలలో 6వ తేదిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ( మొత్తం 90 మంది విద్యార్థులు ) దుప్పట్లను పంపిణీ చేశారని, ఆధారాలతో ‘సాక్షి’లో ‘సిగ్గు సిగ్గు నవ్విపోతారు ... కర్నూలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో రామోజీ షో ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. మరో డ్రామాకు తెరలేపిన ఈనాడు తమ తప్పుడు రాతలను కప్పిపుచ్చుకునేందుకు మరో డ్రామాకు ‘ఈనాడు’ తెరలేపింది. యుగ తులసి ఫౌండేషన్ ద్వారా అదే పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లను అందించేందుకు డిసెంబర్ 31న ప్రయత్నించింది. అయితే తమకు ప్రభుత్వం అందించిన దుప్పట్లు ఉన్నాయని, దాతలు తీసుకొచ్చిన దుప్పట్లను తీసుకునేందుకు విద్యార్థులు తిరస్కరించారు. అనేక రూపాల్లో కాళ్లావేళ్లాపడినా విద్యార్థులు ససేమిరా అన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా చేసిన ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో తిరిగి తమదైన శైలిలో ‘జగన్ మామ.. ఇదేమి పైత్యం’ అంటూ మరో తప్పుడు కథనాన్ని ప్రచురించారు. ఒక్క దుప్పటైనా ఇవ్వండని విద్యార్థులు వేడుకున్నట్లు రాసుకోవడం ఆ పత్రిక పైశాచికత్వానికి నిదర్శనం. రెండు గంటలు వేచి చూసినా, విద్యార్థులు ఎవరు దుప్పట్లు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో తమ పంతం నెగ్గించుకునేందుకు సమీపంలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహంలోని విద్యార్థినీలకు దుప్పట్లను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. వేడుకోవడం అవాస్తవం దుప్పట్ల కోసం యుగ తులసి ఫౌండేషన్ ప్రతినిధులను విద్యార్థులు వేడుకోవడం అవాస్తవం. విద్యార్థులకు అవసరమైన దుప్పట్లను ఇప్పటికే పంపిణీ చేశాం. గత ఏడాది నవంబర్ 30న జిల్లాలోని మూడు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు 725 దుప్పట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయా పాఠశాలలకు పంపించాం. – ఎస్.శ్రీనివాసకుమార్, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి, కర్నూలు -
నూతన సంవత్సరంలో పింఛన్ పెంపు మహోత్సవాలు..
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేతి వృత్తిదారులకు ఇస్తున్న రూ.2,750 పింఛన్‌ను ఈ నెల నుంచి రూ.3వేలకు పెంచింది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు అన్ని మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలన్నారు. జనవరి నెలకు సంబంధించి 2,93,493 మంది పింఛన్‌దారులకు రూ.87.92 కోట్లు విడుదలైందన్నారు. ఇందులో కొత్తగా మంజూరైన పింఛన్లు 5,234 ఉన్నాయన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 2,31,513 మంది రూ.3వేల పింఛన్లు అందుకోనున్నారన్నారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరిగినప్పటి నుంచి పింఛన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఈ మార్పును పింఛన్‌దారులు గమనించాలని కోరారు. ఈ నెల మూడో తేదీ అనంతపురం అర్బన్, గార్లదిన్నె, గుమ్మఘట్ట, గుంతకల్లు రూరల్, గుంతకల్లు అర్బన్, కళ్యాణదుర్గం రూరల్, కూడేరు, నార్పల, రాప్తాడు, రాయదుర్గం రూరల్, శింగన మల, తాడిపత్రి అర్బన్, తాడిపత్రి రూరల్‌లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరుగుతాయన్నారు. 4న బెళుగుప్ప, అనంతపురం రూరల్, బొమ్మనహాళ్, బుక్కరాయసముద్రం, డి.హీరేహాళ్, గుత్తి రూరల్, గుత్తి అర్బన్, కళ్యాణదుర్గం అర్బన్, పెద్దపప్పూరు, 5న ఆత్మకూరు, కణేకల్లు, పామిడి రూరల్, పామిడి అర్బన్, పుట్లూరు, రాయదుర్గం అర్బన్, శెట్టూరు, ఉరవకొండ, యాడికి, యల్లనూరు, విడపనకల్లు, 6న వజ్రకరూరు, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు, కుందుర్పి, కంబదూరులో పింఛన్ పెంపు మహోత్సవాలు నిర్వహిస్తారన్నారు. వలంటీర్లందరూ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారన్నారు. పంపిణీ సమయంలో ముఖ్యమంత్రి లేఖను పింఛన్‌దారులకు అందజేస్తారన్నారు. నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర జరగనుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు పింఛన్ల పెంపు సహా మూడు ప్రధాన పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘ఆసరా’. ఈ నెల 23 నుంచి 31 వరకు ‘ఆసరా’ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పథకం కింద నాలుగో విడత ద్వారా జిల్లాలో 24,100 డ్వాక్రా సంఘాలకు రూ.183.59 కోట్ల లబ్ధి చేకూరనుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగో విడతలోనూ ఆర్థిక సాయం అందించేందుకు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1,18,881 మంది మహిళలకు రూ.35.96 కోట్లు అందజేయనున్నారు. ఇవి చదవండి: AP: బలంగా.. బడుగుల అడుగులు -
నేటి 'సీఎం'ను ఆనాడు రానివ్వనేలేదు!
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీ అంటే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.. ఇక్కడ చదివే పిల్లల ఇబ్బందులు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఎదో ఒక విషయంలో ట్రిపుల్ఐటీ ఎప్పుడు వార్తల్లో నిలిచేది. బాసరలో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడి విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ రహస్య క్యాంపస్‌గా మారింది. మీడియాకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మేధావులకు ఎవరైనా సరే లోపలికి అనుమతించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు చదివే ఈ విశ్వవిద్యాలయంలో ఏమి జరుగుతుందోనని తెలియక పోషకులు ఆందోళనకు గురవుతున్నారు. మీడియాకు నో ఎంట్రీ 2022 ఆగస్టు 7న బాసర ట్రిపుల్ఐటీకి గవర్నర్ హోదాలో తొలిసారి వచ్చిన తమిళిసై పర్యటన కవరేజీకి వెళ్లిన మీడియాను అధికారులు అనుమతించ లేదు. ట్రిపుల్ఐటీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఉంచారు. మీడియాతో పాటు ఉదయం వేళ ట్రిపుల్‌ఐటీలో పనిచేసే సిబ్బందిని కూడా అనుమతించ లేదు. గవర్నర్ బాసర ట్రిపుల్ఐటీ నుంచి నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లే సమయంలో ప్రధాన ద్వారం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే మీడియాతో గవర్నర్ తమిళసై మాట్లాడారు. ఇప్పటికై నా మారేనా? నాటి ప్రభుత్వంలో బాసర ట్రిపుల్‌ఐటీలో ఆంక్షలపేరుతో ఎవరిని అనుమతించలేదు. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రజాభవన్‌గా మార్చి అక్కడే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మాత్రం నేటికి పాత ఆంక్షలే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతారని ఇక్కడి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తీరిక లేక.. విద్యార్థులకు ప్రతీరోజు క్రీడలు ఆడుకునేలా షెడ్యూల్ ఉంచాలి. ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే వరకు స్నానాలు, భోజనాలు, తరగతి గదులు వీటితోనే రోజు పూర్తి అవుతుంది. క్రీడల్లో ఉన్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాస్త దూరమవుతారు. వారంలో ఒక్కరోజైన చెవులకు ఇంపైనా సంగీతం, వినోద కార్యక్రమాలు తిలకించే ఏర్పాట్లు చేయాలి. అవేవి ఇక్కడ జరగడం లేదు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తూ మానసికస్థితిని తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిచి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయాలను చర్చించాలి. ఇకనైనా విద్యార్థులపై శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు. నేటి సీఎంకు అప్పట్లో నో ఎంట్రీ.. నేటి సీఎం రేవంత్‌రెడ్డికే అప్పట్లో బాసర ట్రిపుల్‌ఐటీలో అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోడ దూకివచ్చిన పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ గేటుద్వారా బయటకు పంపించారు. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇవి చదవండి: పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు -
విద్యార్థులు లక్ష్యంతో ముందుకుసాగాలి : ఎంపీ సోయం బాపూరావ్
ఆదిలాబాద్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగితే విజయం సాధిస్తారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థులు తోడసం వెంకటలక్ష్మి, నరసింహస్వామిలు ఆగాఖాన్ అకాడమీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీటు వచ్చిందుకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పాఠశాలలో సమస్యలపై ప్రిన్సిపాల్ కాంబ్లే అనిల్, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనం పూర్తయినా అనుమతి ఇవ్వలేదని నిర్వాహకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల.. -
అడ్లూరి, జీవన్‌రెడ్డి తులాభారం!
జగిత్యాల: మండలంలోని మల్లన్నపేట మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్నకు పూజలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎత్తు బంగారం ఇచ్చారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు, సర్పంచ్‌లు సిద్దంకి నర్సయ్య, నిశాంత్ రెడ్డి, చిర్ర గంగాధర్, రాజ్యలక్ష్మి తిరుపతి రెడ్డి, వెంకటపద్మ, మాజీ సర్పంచ్ బీమ సంతోష్, నేరెల్ల మహేశ్, బుచ్చిరెడ్డి, గంగాధర్, ఉమేశ్ పాల్గొన్నారు. -
ప్రజలు కోరిందే తీర్మానించాం!
సిరిసిల్ల: ప్రజాపాలన దరఖాస్తుల్లో పలు ఆప్షన్లను కోరారని వాటినే మున్సిపల్ ఎజెండాలో ఉంచి తీర్మానం చేశామని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ప్రజాపాలన కార్యక్రమంపై భేషజాలకు పోకుండా పలు అంశాలపై ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్‌కోసం ప్రత్యేకంగా ఆప్షన్లు ఇవ్వాలని కోరామన్నారు. ఈవిషయాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. కానీ కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, విలీన గ్రామాలను జీపీలు చేస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ ఎన్నికలకు ముందు బహిరంగ సభలో ప్రకటించారని పేర్కొన్నారు. రూ.వందల కోట్ల ఖర్చుతో బైపాస్‌రోడ్డు వేయించారని, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయించారని ఇవన్నీ విలీన గ్రామాల అభివృద్ధికి దోహదం చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. వస్త్ర పరిశ్రమలో నేతకార్మికులు, పద్మశాలీలను పూర్తిస్థాయిలో కేసీఆర్, కేటీఆర్ ఆదుకున్నారని, కేవలం రాజకీయ లబ్ధికోసం వారిని ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదన్నారు. సమావేశంలో టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, సత్తార్, వేణు, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్ -
New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం!
సాక్షి, పెద్దపల్లి: జిల్లావాసులు గతం మరిచి కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2023 మిగిల్చిన చేదు అనుభవాలను పక్కన పెట్టి.. నూతన వసంతాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నాతాధికారులు ఈఏడాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. అనేక ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున అవన్నీ నెరవేరాలని కోరుకున్నారు. తాము చేపట్టే పనులు, తీసుకున్న నిర్ణయాలు, లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే.. ప్రజలకు పథకాల ప్రయోజనాలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరువ చేస్తాం. ప్రభుత్వ ప్రాధాన్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఆరు గ్యారెంటీల పథకాలకు అర్హులైన ప్రతీఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానంగా జిల్లాలో విద్య, వైద్యం మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకుంటాం. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం, స్వచ్ఛత పనులు పకడ్బందీగా నిర్వహిస్తాం. – ముజిమ్మిల్ఖాన్, కలెక్టర్ ప్రగతిని పరుగులు పెట్టిస్తాం అధికారుల సహాయ సహకారాలతో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకున్నాం. ఇలాగే త్వరలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం. గ్రామ పంచాయతీలు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించాయి. వచ్చేఏడాదిలో సైతం అవార్డులు సాధించడంలో ముందుండేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాం. ప్రగతిని పరుగులు పెట్టిస్తాం. – అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అందరికీ అభివృద్ధి ఫలాలు కొత్తప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషిచేస్తాం. అభివృద్ధి పనులను వేగవంతంచేసి సకాలంలో పూర్తియ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా పెండింగ్‌లోని భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటాం. ప్రాజెక్టులకు కావలసిన భూసేకరణ చేసి పనులు వేగవంతం చేస్తాం. – శ్యాంలాల్ ప్రసాద్, అదనపు కలెక్టర్ మహిళల భద్రతకు పెద్దపీట మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం. మహిళలు, పిల్లలపై దాడుల అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. 2024 లో రోడ్డు ప్రమాదాలు, సై బర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడతాం. ప్రతీఇంట్లో, ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వాటితో నేరాల విచారణ ఎంతో సులభమవుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగహన కల్పిస్తున్నాం. – డాక్టర్ చేతన, డీసీపీ, పెద్దపల్లి -
‘గుర్తింపు’ ముందు అనేక సవాళ్లు!
పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సంస్థలో ఏడోసారి జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై 1,983 ఓట్ల మెజారిటీతో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరకు విజయాన్ని ౖకైవసం చేసుకుంది. సంస్థ వ్యాప్తంగా ఆరు ఏరియాల్లో ఐఎన్టీయూసీ, ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచాయి. ఈక్రమంలో ప్రధాన డిమాండ్ల సాధన బాధ్యత గెలిచిన యూనియన్‌పై సవాల్ విసురుతోంది. సొంతింటి పథకం, మారుపేర్ల మార్పు, నూతన భూగర్భగనుల తవ్వకం తదితర డిమాండ్ల సాధన అంతసులువు కానప్పటికీ.. పోరాటాల చరిత్ర కలిగిన గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ భవిష్యత్‌లో ఎలా ముందుకు సాగుతుందోనని సింగరేణి కార్మికులను ఆలోచింపజేస్తోంది. ఏఐటీయూసీ ఎన్నికల మెనిఫెస్టో ఇదీ.. సింగరేణిలో రాజకీయ జోక్యం నియంత్రిస్తాం. ఆర్థిక దుబారాను అరికడతాం. కోలిండియా మాదిరిగా పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది. కార్మికుల పిల్లల ఉద్యోగ వయోపరిమితి 35ఏళ్ల నుంచి 40ఏళ్లకు పెంచుతాం. సొంతింటి పథకం కింద 250గజాల ఇంటి స్థలం, రూ.20లక్షల వడ్డీలేని రుణం మంజూరు చేయిస్తాం. నూతన భూగర్భగనులు తవ్వించి ఉద్యోగాలు పెంచడం బొగ్గు వెలికితీసే ప్రాంతాల్లో కాంట్రాక్టు కార్మికులను తొలగించి పర్మినెంట్ కార్మికులను నియమించడం. మైనింగ్‌స్టాఫ్, ట్రేడ్స్‌మెన్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు, ఈపీ ఆపరేటర్లకు సర్ఫేస్‌లో అదే హోదా కల్పన. ప్లేడే, పీహెచ్‌డీలకు ఎన్–వన్ విధానం తొలగించి పాత పద్ధతి కొనసాగిస్తాం. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు డబ్బులు లేకుండా అందరికీ అన్‌ఫిట్ చేయిస్తాం సంస్థ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చి సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించేలా కృషి చేస్తాం. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యా బోధన అందుబాటులోకి తెస్తాం. సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు డస్ట్ అలవెన్స్ ఇప్పిస్తాం. రిటైర్డ్ రోజునే కార్మికులకు టర్మినల్ బెనిఫిట్స్ అందేలా చూస్తాం. చదువుకున్న కార్మికులకు సూటబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తాం. మహిళా కార్మికులను భూగర్బగనుల్లోకి దింపకుండా చూస్తాం. అన్నిఏరియాల్లో కార్మికులకు డబుల్‌బెడ్‌రూమ్‌లు ఇచ్చేలా చూస్తాం. క్యాంటీన్లలో నాణ్యమైన టిఫిన్స్ అందించేలా చూస్తాం. గని ప్రమాదాల్లో ఇంక్రిమెంట్లు కోల్పోయిన వారికి వన్‌టైం సెటిల్మెంట్కింద ఇంక్రిమెంట్ ఇప్పిస్తాం. తెలంగాణ ఇంక్రిమెంట్ బేసిక్‌లో కల్పించేలా చూస్తాం. సింగరేణి డీఎంఎఫ్ఐటీ, సీఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేసేలా చూస్తాం. మారుపేర్ల కార్మికులను సొంత పేర్లపై రెగ్యులరైజ్ చేసేలా చూస్తాం. 2022లో జరిగిన 9డిమాండ్ల ఒప్పందం అమలయ్యేలా చూస్తాం. కార్మికుల పక్షాన పోరు! మాపై నమ్మకంలో ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు. వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతాం. పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ, సొంతింటి కల నెర వేర్చుతాం. మారుపేర్లతో నిలిచిపోయిన డిపెండెంట్ ఉద్యోగాలను వన్‌టైం సెటిల్మెంట్ కింద క్లియర్ చేసేలా చూస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా దృష్టి సారిస్తాం. – సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
హెల్త్ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు! కానీ.. : మంత్రి కొండా సురేఖnews
వరంగల్: గత ప్రభుత్వ హయాంలో ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోయాయి.. హెల్త్ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు.. పేద ప్రజలకు సేవలందించే ఆస్పత్రి పాలన ప్రక్షాళనకు శ్రీకారం చుడతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుతున్న క్రమంలో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు.. పేద రోగులకు మరింత మెరుగైన సేవలు ఎలా అందించాలనే దానిపై ఆదివారం ఆస్పత్రి పరిపాలనాధికారులు, టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్పీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు సదుపాయలు అందుతున్నాయి.. గత ప్రభుత్వం హయాంలో నిధులు కేటాయించక మిగిలిన పనులు ఏమిటి.. ప్రస్తుతం కరోనా వార్డుల పరిస్థితిపై సమీక్షించిన అనంతరం మంత్రి వివరాలను విలేకరులకు వెల్లడించారు. కరోనా రోగులకు మెరుగైన సేవలు ఎంజీఎంలో కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.. జిల్లాలో గత నెల 21 నుంచి ఇప్పటి వరకు 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఏడుగురు మాత్రమే ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందన్నారు. కరోనా జేఎన్–1 వేరియంట్ విస్తరిస్తున్న కారణంగా రోగుల సంఖ్య పెరిగినా.. సేవలందించేందుకు ఆస్పత్రిలో 1,200 ఆక్సిజన్ పడకలు అమర్చే సామర్థ్యం ఉందన్నారు. 24 గంటలు ఆక్సిజన్ సరఫరా చేసేలా 3 ట్యాంక్‌లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నిధుల లేమితో నిలిచిన పనులు ఆస్పత్రిలో గత ప్రభుత్వ హయాంలో రూ.1.03 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్ పిలువగా కాంట్రాక్టర్ రూ.12 లక్షల పనులు మాత్రమే చేపట్టారని, పనులు పూర్తి చేసేలా సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలో ఫైర్ సెఫ్టీ కోసం రూ.35 లక్షల నిధులతో చేపట్టిన పనులకు నిధులు మంజూరు చేయకపోవడంతో చివరి దశలో ఆగిపోయాయని, వీటిని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. అధికారిక నంబర్లు ప్రదర్శించాలి ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌ఎంఓలు, పరిపాలనాధికారుల నంబర్లు ప్రజలకు తెలిసేలా బోర్డులపై ప్రదర్శించాలని చెప్పారు. ఆర్‌ఎంఓలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. రోగుల అటెండెంట్లకు ప్రత్యేక షెడ్డు ఎంజీఎంలో ప్రస్తుతం 14 ఆపరేషన్ థియేటర్లు వినియోగిస్తున్నారు.. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మూడు అపరేషన్ థియేటర్లు పనికిరాని స్థితికి చేరాయి.. వాటిని తొలగించి ఆ స్థానంలో రోగుల సహాయార్థం వచ్చే అటెండెంట్లకు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో హెచ్‌డీఎస్ సమావేశం.. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి సరేఖ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో డీజిల్ కొనేందుకు కూడా ప్రత్యేక నిధులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దుకాణాదారులు సరిగ్గా కిరాయి చెల్లించడం లేదని, వారికి నోటీసులు జారీ చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే తొలగించాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రికి ఆదాయ వనరులు సమకూరేలా రోడ్డు వైపున ప్రత్యేక షెడ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశాల్లో అటవీ శాఖ సిబ్బంది సహాయంతో ప్రత్యేకంగా గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆస్పత్రి పరిపాలనాధికారుల పనితీరు మెరుగుపరిచేందుకు భవిష్యత్‌లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని, వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు మురళి, శ్రీనివాస్, రోషన్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎస్ఈ దేవేంద్రకుమార్, డీఈ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్ -
కాకతీయుల కళావైభవం
కాకతీయుల కళాపోషణకు సజీవ సాక్ష్యాలుగా పలు కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. భారతీయ సంస్కృతికి ఒక కృతిని, ఆకృతిని కల్పించి.. తమలో దాగిన ఆగమజ్ఞాన నిధిని.. తత్వార్థ ఖనిని రాళ్లల్లో ఇమిడ్చిన కాకతీయుల ప్రతిభ అనన్యం అపూర్వం.. సుమధురం. కాకతీయుల కళామణిహారం లోంచి జాలువారిన కళాఖండాలు ఎన్నో నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మన చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని ఎలుగెత్తి చాటుతోంది ఇక్కడి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం. కాకతీయుల కళాపిపాసకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. – నర్వ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో కోటలు, సంస్థానాలు కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. నర్వ మండలం పెద్దకడ్మూర్‌లోని అనేక కట్టడాలు గత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలోని శాతవాహనులు, గుప్తులు, వాకాటములు, కదంబులు రాజ్యపాలన చేశారు. శాతవాహనుల తర్వాత దక్కను భాగమును విశేషంగా ఆక్రమించుకున్న వారు పల్లవులు. పల్లవుల నుంచి కర్ణాటక ఉత్తర భాగాన్ని విడిపించిన వారు కదంబులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం ప్రారంభం వరకు సర్వాధికారాలతో పరిపాలన సాగించారు. ఈ కదంబులు కుంతల దేశాన్నే కాకుండా కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గ, బీజాపూర్, ధారవాడ, బళ్లారిలతో పాటు కర్నూల్, అనంతపురం ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. వీటితో పాటు పాలమూరు జిల్లాలోని నారాయణపేట, మక్తల్ తాలుకా, తాండూర్, కోస్గి, కొడంగల్, ఆత్మకూర్, గద్వాల ప్రాంతాలతో పాటు అలంపూర్, అయిజ, కందూర్, కడుమూర్, కోడూర్ ప్రాంతాల్లో కదంబులతో పాటు కర్ణాటక ప్రభువులు ఏలుబడి ఉందని చరిత్ర చెబుతోంది. కదంబులు నాడు నిర్మించిన గ్రామమే కడుమూర్.. నేడు పెద్దకడ్మూర్గా పిలవబడుతోందని చరిత్రకారుడు, సాహితీ సేవకుడు కవి బాబు దేవిదాస్‌రావు ‘పాలమూరు చరిత్ర’ గ్రంథంలో పేర్కొన్నారు. చరిత్రకు సాక్ష్యంగా కల్యాణి చాళుక్యుల శాసనం పెద్దకడ్మూర్ బాలబ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్యాణి చాళుక్యుల శాసనం గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ శాసనాన్ని చరిత్రకారుడు బాబు దేవిదాస్‌రావు విపులంగా వివరించారు. కదంబుల కాలంలో పాలమూరు జిల్లాపై కర్ణాటక ప్రభువుల ఏలుబడి ఎక్కువగా ఉండేది. దీంతో నాటి కదంబూరు (కడ్మూర్), నాగలకడ్మూర్ గ్రామాలు ఆత్మకూర్ తాలుకాలో ఉండేవి. కడ్మూర్లోని బాలబ్రహ్మేశ్వర ఆలయ ఆవరణలో స్థాపించిన శాసనంలో అనేక అంశాలను పొందుపర్చారు. అహవమల్లరాయ నారాయణుడి పరిపాలన కాలంలో మూడవ ఏట వీరబలంజయ ధర్మప్రతిపాదకులైన ‘ఆయావోళేనూర్వర స్వాములు’ కర్ణాటక దేశాన 4వేల ఉభయ నానాదేశి వర్తకులు పెద్దకడ్మూర్‌లో కూర్చొని తమ సంఘం వారికై చేసుకున్న కట్టుబాట్లను శాసన రూపకంగా పొందుపర్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా.. గత వైభవాన్ని చాటే కాకతీయుల కళాఖండాలను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు. మరో కథ వెలుగులో.. నేటి పెద్దకడ్మూర్ ప్రాంతం జూరాల ప్రాజెక్టు అతి సమీపంలోని కృష్ణానది తీరంలో ఉండటంతో కాకతీయ రాజు రెండవ పులకేశి వేటకు వచ్చాడంటా. ఈ ప్రాంతం దట్టమైన అడవి.. కృష్ణనది సోయగాలతో రెండవ పులకేశిని మంత్రముగ్దులను చేసిందంటా. దీంతో ఇక్కడ ఓ గ్రామాన్ని నిర్మించాలని ఆయన తలంచారు. రాజులు తలచుకుంటే కొదవే ముంటుందన్న చందంగా సైనికులు, నిపుణులు, శిల్పులతో కలిసి రాజుకు ఇష్ట దైవమైన బాలబ్రహ్మేశ్వరుడి ఆలయం నిర్మించారని గ్రామంలో చెబుతున్నారు. ఆలయంతో పాటు గ్రామముఖ ద్వారం, గ్రామదేవత ఆలయం, నాగదేవతల ఆలయాలు రూపొందించారు. ఈ అద్భుతమైన కట్టడాలు, కాకతీయుల కళాపోషణకు నిదర్శనాలుగా నిలిచి, నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చారిత్రక ఆలయాన్ని సంరక్షించాలి కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చారిత్రక నేపథ్యం కలిగిన బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని సంరక్షించాలి. గ్రామస్తుల చైతన్యంతో కొంత అభివృద్ధి జరిగింది. ఆలయాన్ని ప్రాచీన ఆలయంగా గుర్తించి, విలువైన శిల్పసంపదను కాపాడాలి. – తంబలి నర్సింహయ్య, బాలబ్రహ్మేశ్వర ఆలయ అర్చకుడు అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం.. అద్భుత శిల్ప సౌందర్యాలకు నిలయం బాలబ్రహ్మేశ్వర ఆలయం. గ్రామముఖ ద్వారాలు, నాగదేవతల స్థలాలను సంరక్షించాలి. చారిత్రక నేపథ్యం కల్గిన ఈ కట్టడాలను పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సందర్శించి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామస్తుల సహకారంతో ఆలయాలను సంరక్షించుకుని ప్రస్తుతం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్ ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు -
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
రాహుల్‌గాంధీ ఇచ్చిన భరోసా హామీ కోసం చూస్తున్నా..
ఆదిలాబాద్: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మూడ లక్ష్మి. నిర్మల్‌రూరల్ మండలంలోని కౌట్ల–కే గ్రామం. గల్ఫ్ కార్మికుడైన భర్తను పోగొట్టుకుంది. శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు అందించింది. గతేడాది నవంబర్ 6న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో తన పదినెలల పసిపాప సాత్వికతో కలిసి తన గోడును విన్నవించుకుంది. ఆ పసిపాపది మాట్లాడే వయసు కూడా కాదు. గల్ఫ్ మృతుడి భార్య దీనస్థితిని చూసి చలించిన రాహుల్‌గాంధీ తనతో పాటు యాత్రలోని కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆ కుటుంబానికి సాయం అందేలా చూడాలని సూచించారు. నిర్మల్ జిల్లాలోని కౌట్ల–కే గ్రామానికి చెందిన మూడ అశోక్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన అబుదాబి వెళ్లాడు. అక్కడ అనుకొని ఘటనలో మృతి చెందాడు. అయితే అతడికి అప్పటికే భార్య మూడ లక్ష్మితో పాటు ఆరేళ్లలోపు ఇద్దరు పిల్లలు, పది నెలల పసిపాప సాత్విక ఉంది. ఈ చిన్నారికి పుట్టుకతోనే అనారోగ్య సమస్య ఉండడంతో రాహుల్‌గాంధీని కలిసిన అనంతరం నాలుగు నెలలకే మృత్యుఒడికి చేరుకుంది. సంవత్సరం దాటిపోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరింది. అనంతరం ఆరు గ్యారెంటీల అమలు నిమిత్తం ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం గల్ఫ్ మృతుల కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని వేడుకుంటోంది. తన భర్త అశోక్ గతేడాది జూలై 24న అబుదాబి దేశంలో మరణించడంతో తన కుటుంబ జీవనం కష్టతరంగా మారిందని వాపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, తదితర నాయకుల హామీ మేరకు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవిస్తోంది. ఇదే అంశంపై శుక్రవారం నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించింది. -
దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ను అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో దరఖాస్తుల కొరత లేదని ప్రతి గ్రామం, ము న్సిపల్ వార్డులో ఉన్న కుటుంబాల కంటే పది శా తం అదనంగా పంపించామన్నారు. మీసేవ, జిరా క్స్ కేంద్రాలు, దళారులు విక్రయించినట్లైతే చర్యలు తప్పవన్నారు. మీసేవ కేంద్రాల లైసెన్స్ రద్దుతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరు గ్యారంటీల దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. దరఖాస్తు నింపేందుకు కొంతమంది రూ.50వరకు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా జరుగకుండా అన్ని చోట్ల వాటిని నింపేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీలకు ఒకే కా మన్ దరఖాస్తు పత్రం ఉంటుందని, అందులో అవసరమైన సాయంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రేషన్‌కార్డు లేని వారు, ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పింఛన్ పొందుతున్న ల బ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతుబంధు సాయం పొందుతున్న రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రేషన్‌కార్డు పొందాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అద్దె ఇళ్లలో నివసించేవారు గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అద్దె ఇంటి విద్యుత్ సర్వీస్ నంబర్‌తోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఇ బ్బందులు పడుకుండా ఉండేలా అన్ని కేంద్రాల్లో షామియానాలు, తాగునీటి వసతి కల్పించామన్నారు. జనవరి 6వరకు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, అప్పటికీ అందించలేని వారు కూడా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. డబ్బులిస్తే ఇప్పిస్తామని నమ్మబలికే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సంక్షేమ ఫలాల కోసం మహారాష్ట నుంచి వచ్చే వారికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తే మాత్రం బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉన్నందున ప్రతి వార్డుకు ఓ జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. -
ఇండ్లు.. రేషన్‌కార్డులకే ఎక్కువ!
కరీంనగర్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం అర్జీల స్వీకరణ జాతరను మరిపిస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లలో దరఖాస్తులు స్వీకరించగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం ఎక్కువ అర్జీలొచ్చాయి. ఈ నెల 28న ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజు 28,452 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం 48,230 వేల దరఖాస్తులు రాగా.. శనివారం 46 గ్రామాలతో పాటు 22 డివిజన్లలో ‘ప్రజాపాలన’ నిర్వహించనున్నారు. రేషన్‌కార్డు లేనివారికి అవకాశం! రేషన్‌కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశఽం కల్పించింది. వీరి కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులేనివారు ఆధార్ కార్డులను జత చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. ప్రభుత్వమే రూపొందించి ఇచ్చిన దరఖాస్తుఫారం నింపే క్రమంలో చాలామంది అయోమయానికి గురయ్యారు. మహాలక్ష్మి పథకానికి కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది ఉండటంతో ఒకే దరఖాస్తులో వివరాలు రాయాలా.. వేర్వేరు అందించాలా అన్న అయోమయానికి గురయ్యారు. రైతుభరోసాలో కౌలు రైతులు దరఖాస్తు చేసినప్పటికి ఫారంలో భూ యజమాని పట్టా పాసుపుస్తకం వివరాలు అందించలేకపోయారు. సబ్ మీటర్ లేకుండా అద్దె ఇళ్లలో ఉన్నవారు గృహజ్యోతికి కాలం పూరించే క్రమంలో సర్వీస్ నంబర్ లేకుండా దరఖాస్తు అందించారు. గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు సైతం సరైన సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. కరీంనగర్లో ఎక్కువ కొత్తపల్లిలో తక్కువ కరీంనగర్ సిటీలో అత్యధిక దరఖాస్తులు 15,551 రాగా.. కొత్తపల్లి మున్సిపాలిటీలో అత్యల్పంగా 332 వచ్చాయి. చొప్పదండి మున్సిపాలిటీలో 843, హుజూరాబాద్‌లో 1,956, జమ్మికుంటలో 1,955 దరఖాస్తులు వచ్చాయి. మండలాలవారీగా చూస్తే ఇక చిగురుమామిడి మండలంలో 1,253, చొప్పదండిలో 1,928, ఇల్లందకుంటలో 1,158, గంగాధరలో 2,311, గన్నేరువరం 1,391, హుజూరాబాద్ 1,826, జమ్మికుంట 2,067, కరీంనగర్ రూరల్ 1,605, కొత్తపల్లి 2,587, మానకొండూరు 2,170, రామడుగు 1,952, శంకరపట్నం 1,320, తిమ్మాపూర్ 1,458, సైదాపూర్ 2,183, వీణవంక మండలంలో 2,384 దరఖాస్తు వచ్చాయి. నేడు ప్రజాపాలన జరగనున్న ప్రాంతాలివే.. చిగురుమామిడి మండలంకొండాపూర్, లంబాడిపల్లి, ముదిమాణిక్యం, ముల్కనూరు, చొప్పదండి మండలం కొలిమికుంట, కోనేరుపల్లి, కుర్మపల్లి, మంగళపల్లి, ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి, మల్యాల, మర్రివానిపల్లి, పాతర్లపల్లి, గంగాధర మండలం హిమ్మత్‌నగర్, ఇస్లాంపూర్, కాచిరెడ్డిపల్లి, కాసారం, గన్నేరువరం మండలం హన్మాజిపల్లి, జంగపల్లి, ఖాసీంపేట, మాదాపూర్, హుజూరా బాద్ మండలం కాట్రపల్లి, మందాడిపల్లి, పెదపాపయ్యపల్లి, పోతిరెడ్డిపేట, జమ్మికుంట మండలం నాగంపేట, నగురం, పాపయ్యపల్లి, పాపక్కపల్లి, కరీంనగర్ రూరల్‌లో దుబ్బపల్లి, దుర్శేడ్, ఎలబోతారం, కొత్తపల్లి మండలంలో కమాన్‌పూర్, ఖాజీపూర్, మానకొండూరు మండలంలో చెంజర్ల, దేవంపల్లి, ఈదులగుట్టపల్లి, గట్టుదుద్దెనపల్లి, రామడుగు మండలం వెలిచాల, చిప్పకుర్తి, దత్తోజి పేట, శంకరపట్నం మండలంలో చింతలపల్లి, ధర్మారం, ఎరడపల్లి, గద్దపాక, తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్, జుగుండ్ల, కొత్తపల్లి, లక్ష్మీదేవిపల్లి, సైదాపూర్ మండలంలో గొడిశాల, గుజ్జులపల్లి, గుండ్లపల్లి, జాగిర్పల్లి, వీణవంక మండలం బ్రహ్మణపల్లి, దేశాయిపల్లి, ఎలబాక, గంగారం, కొత్తపల్లి మునిసిపాలిటీలో 5, 6వ వార్డులు, చొప్పదండిలోని 5,6వ వార్డులు, కరీంనగర్ నగరపాలకలో 3, 8, 16, 22, 27, 30, 35, 37, 48, 51 డివిజన్లు, జమ్మికుంట మునిసిపాలిటీలో 9, 10, 11, 12వార్డుల్లో, హుజూరాబాద్‌లో 9, 10, 11, 12 వార్డుల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. జిల్లాలో గ్రామాలు: 313, మునిసిపాలిటీలు: 5, జిల్లా మొత్తంగా వచ్చిన అర్జీలు: 76,682, శుక్రవారం వచ్చినవి: 48,230, కవరైన నివాసాలు: 2,13,218, దరఖాస్తులు స్వీకరించిన గ్రామాలు: 90, వార్డులు: 48 ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు!
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండడంతో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మొదట ఓ మహిళ సీటు కోసం రుమాలు వేసింది. ఆమెకంటే ముందు ఎక్కిన మరో మహిళ ఆ సీటులో కూర్చుంది. బస్సు నర్సంపేట రూట్లో వెళ్తుండగానే ఆ తరువాత ఎక్కిన మొదటి మహిళ నా సీటులో ఎలా కూర్చుంటావంటూ ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ తరువాత మరో మహిళ వచ్చి మా సీట్లో కూర్చున్నావంటూ అడిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని ఆపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇవి చదవండి: ఇండ్లు.. రేషన్‌కార్డులకే ఎక్కువ! -
సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఎమ్మెల్యే రాందాస్‌నాయక్
భద్రాద్రి: నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిండమేకాక పాలనలో ఇబ్బందులు రాకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషిచేస్తానని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తెలిపారు. పల్లె, పట్టనం, మారుమూల తండాలనే తేడా లేకుండా సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని.. సమస్యల పరిష్కారం ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనతో ప్రజలు నేరుగా మాట్లాడి సమస్యలు చెప్పుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యాన శుక్రవారం ‘హలో ఎమ్మెల్యే’ పేరిట ఫోన్ ఇన్ ఏర్పాటుచేయగా మంచి స్పందన లభించింది. సుమారు వంద మందికి పైగా ఫోన్ చేయగా ఎమ్మెల్యే 30 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన వచ్చినందునప్రతీ పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని తెలిపారు. గత పదేళ్లలో గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేని, ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఈమేరకు ప్రజల్లో కొందరు అడిగిన ప్రశ్నలు, ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి. ప్రశ్న : జూలూరుపాడులో శాశ్వత వ్యవసాయ మార్కె ట్ యార్డు ఏర్పాటు చేయాలి. గతంలో స్థలం కేటా యించినా నిర్మాణం చేపట్టలేదు. మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది. – వేల్పుల నర్సింహారావు, జూలూరుపాడు ఎమ్మెల్యే : రెవెన్యూ అధికారులతో మాట్లాడి యార్డు నిర్మాణమయ్యేలా చూస్తాను. త్వరలో రెండు శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రశ్న : చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు ఉన్నా డ్రెయినేజీలు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. – సూర్య, నూకలంపాడు / ఎల్.గోపాల్‌రావు తనికెళ్ల / రామకృష్ణ, కారేపల్లి ఎమ్మెల్యే : చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు ఉన్నా డ్రెయినేజీలు నిరిమంచలేదు. తప్పకుండా పూర్తి స్థాయిలో డ్రెయినేజీలు నిర్మాణం చేపట్టేలా అవసరమైన నిధులు మంజూరు చేయిస్తా. ప్రశ్న : పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో బోర్లు వేయిస్తే మా సమస్య పరిష్కారమవుతుంది. – రాంబాబు, మాణిక్యారం / బాలు, వినోభానగర్ / నారపోగు నాగరాజు, కేజీ సిరిపురం ఎమ్మెల్యే : పోడుభూములకు పట్టాలిచ్చే కార్యక్రమం చేపట్టి ఆ భూముల్లో బోర్లు వేయిస్తాం. ఐటీడీఏ ద్వారా గిరిప్రభ పథకం ద్వారా బోర్లు వేయించే కార్యక్రమం త్వరలోనే చేపడతా. ప్రశ్న : జూలూరుపాడులో 30 పడకల ఆస్పత్రి ఉన్నా వైద్యం అందడం లేదు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయించి వైద్యసేవలు అందేలా చూడండి. – పి.నాగరాజు, జూలూరుపాడు ఎమ్మెల్యే : ఆస్పత్రి ఆప్‌గ్రేడ్‌పై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడతాను. అవసరమైతే ఆరోగ్యశాఖ మంత్రికి సమస్యను తీసుకెళ్తా. ప్రశ్న : మా గ్రామంలో శివాలయానికి తొమ్మిది ఎకరాల భూమి ఉన్నా ఆలయ అభివృద్ధి జరగడం లేదు. – ఏ.రాంబాబు, పాపకొల్లు ఎమ్మెల్యే : దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆలయ అభివృద్ధితో పాటు నిత్యపూజలు జరిగేలా ఏర్పాట్లు చేయిస్తాం. ఇవి చదవండి: ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక -
ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్