News
-
వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వికాస అధ్యక్షుడు టి.అనిల్‌కుమార్, నాయకుడు పి.రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈనెల 26న ఓ టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తానని వ్యాఖ్యలు చేయటం పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ గతంలో తీసిన రాజకీయ చిత్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని నాయకులు ప్రస్తుతం రాజకీయ చిత్రాలను తీసేందుకు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటే తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇవి చదవండి: Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు -
ఆలోచనాత్మకం.. 'వసంత రాజీయం!'
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నాటకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాలుగా ఉన్న నాటికలు, నాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ నటీనటుల నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. నటవిశ్వరూపం ‘నర్తనశాల’ ఇది మహాభారతం విరాట పర్వంలోని పాండవుల అజ్ఞాతవాస కథ. సీ్త్ర వ్యామోహంలో పడి అధర్మ మార్గాన నడిచే వారందరికీ అథఃపతనం తప్పదు. న్యాయమార్గాన నడిచేవారందరికీ ధర్మమే దైవమై నిలిచి కాపాడుతుందని ఈ నాటకం సందేశమిచ్చింది. రంగకృష్ణయ్య రచనకు, అర్జునరావు దర్శకత్వం వహించారు. ఆలోచింపజేసిన ‘మూడు ప్రశ్నలు’ నేటి బాలల చదువుల తీరును ప్రశ్నించింది ఈ నాటిక. తల్లిండ్రులు ర్యాంకులు, మార్కులు అంటూ బాల్యాన్ని నలిపేస్తూ అనవసర పుస్తకాల మోతతో పిల్లలను మానసికంగా, శారీరకంగా బాధలకు గురి చేస్తున్న తీరును ప్రశ్నించి చదువుల తీరు తెన్నులను మార్చాలని చెప్పిన నాటిక ఇది. రచన ఆకురాతి భాస్కర చంద్ర, దర్శకత్వం వాసు. యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారు ప్రదర్శించారు. నాన్న ప్రాధాన్యతను చాటిన ‘ఇంద్రప్రస్థం’ ప్రేమ అనేది సృష్టిలో గొప్పదే, కానీ, ఆ ప్రేమలు ఆనందించే విధంగా ఉండాలే తప్ప అనాలోచితంగా పరుగెడితే జీవితంలో విలువలు నాశనం అవుతాయని తెలియ జెప్పిందీ నాటకం. ఆదర్శవంతమైన తండ్రి తన బిడ్డల పెళ్లి విషయంలో ఎలా నడుచుకోవాలో నాటకంలో కనిపించింది. నాన్న ఉంటేనే ఏ ఇల్లు అయినా ‘ఇంద్రప్రస్థం’లా వెలిగిపోతుందని తెలియజెప్పటమే నాటక ప్రధాన ఉద్దేశం. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ప్రదర్శన ఇది. స్నిగ్ధ రచనకు ఎన్.రవీంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ధర్మనిరతిని చాటిన ‘మహాభినిష్క్రమణ’ రామాయణ కథలో శ్రీరాముడి అవతార పరిసమాప్తికి సంబంధించిన కథలను తీసుకుని నాటికగా మలిచారు. ఈ కథా సారాన్ని చక్కగా నాటికగా ప్రదర్శించి తమ్ముడైనా ధర్మం తప్పని శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని ఈ నాటిక ప్రకటించింది. ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ తెనాలి వారి ప్రదర్శన ఇది. ఆరాధ్యుల తేజస్వీ ప్రఖ్య రచనకు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వం వహించిన యువ కళాకారుల పౌరాణిక నాటిక ఇది. సందేశం, హాస్యం.. ‘పక్కింటి మొగుడు’ భార్యాభర్తలు సఖ్యతగా ఉంటేనే తమ ఆస్తి మనవడికి దక్కుతుందని, లేకుంటే ఆస్తంతా ఒక ఆశ్రమానికి చెందేలా వీలునామా రాసి కన్నుమూస్తారు ఓ తాత, బామ్మ. వీలునామాలో చూపిన రూ.రెండు కోట్ల ఆస్తిని కాపాడే క్రమంలో పడే కష్టాన్ని, సందేశం, హాస్యం రంగరించి ప్రదర్శించిన ఈ నాటిక ఆకట్టుకుంది. పండు క్రియేషన్స్ కొప్పోలు వారి ప్రదర్శన ఇది. రచన రామినేని నాగేశ్వర రావు, దర్శకత్వం బాలినేని నాగేశ్వరరావు వహించారు. ప్రేమ కావ్యం.. ‘వసంత రాజీయం’ వసంతోత్సవాలలో నాట్యం చేసి రాజును మెప్పించి రాజనర్తకి అవుతుంది లకుమ. లకుమ నాట్యం భూమికగా ‘వసంత రాజీయం’ నాట్యశాస్త్ర గ్రంథం రాస్తూ ఆమె ప్రేమలో పడతాడు రాజు. ఆమె రాజును ప్రేమిస్తుంది. లకుమను అడ్డం పెట్టుకుని రాజును చంపాలని చూస్తుంటాడు గూఢచారి మహేంద్రుడు. రాజును చంపమని లకుమను ఒత్తిడి చేస్తాడు. మళ్లీ వసంతోత్సవాలలో వీరనాట్యం చేస్తూ తన్నుతాను పొడుచుకుంటుంది లకుమ. రాజు దుఃఖించి, మహేంద్రుని బంధించి, వసంతరాజీయం అంకితమీయగా తీసుకుని తృప్తిగా లకుమ కన్నుమూస్తుంది. జానపద కథాంశాన్ని చక్కగా నాటకంగా మలచి చూపారు. శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారు తడకమళ్ల రామచంద్రరావు రచనకు డాక్టర్ మారంరాజు రామచంద్ర రావు దర్శకత్వం వహించిన పద్య నాటకమిది. నంది నాటకోత్సవంలో నాటక ప్రదర్శనలను మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఆర్డీవో శ్రీకర్, తహసీల్దార్ సాంబశివరావు తిలకించారు. నేడు నంది బహుమతుల ప్రదానం.. నంది నాటక పోటీల బహుమతి ప్రదానం సభ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 23 నుంచి జరుగుతున్న నాటక పోటీల విజేతల వివరాలు ప్రకటించి, వారికి 73 స్వర్ణ, రజిత, కాంస్య నందులు ప్రదానం చేస్తారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, డాక్టర్ వైఎస్సార్ రంగస్థల పురస్కార గ్రహీతలకు అవార్డు ప్రదానం చేస్తారని తెలియజేశారు. ఇవి చదవండి: ఆణిముత్యాలు -
jadcherla:తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్న పోలీస్‌స్టేషన్ సిబ్బంది!
జడ్చర్ల: రెండు జాతీయ రహదారులు కలయుకతో పాటు పారిశ్రామికంగా, వ్యాపార వాణిజ్యపరంగా, తదితర అనేక రంగాలకు సంబంధించి నిత్యం రద్దీని సంతరించుకున్న జడ్చర్లలో పోలీసుల సత్వర సేవల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సకాలంలో పోలీసుల సేవలు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక నేరాలు, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సరైన నిఘా పెట్టలేని పరిస్థితి నెలకొంది. వీటికి తోడు ట్రాఫిక్ సమస్యను కూడా స్థానిక పోలీసులే పర్యవేక్షించాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చోరీలు, తదితర నేరాల నియంత్రణ కష్టతరమైంది. వీటన్నింటి పరిష్కారానికి జడ్చర్లలో పోలీస్ సబ్‌డివిజన్ ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా రూరల్ పోలీస్‌స్టేషన్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తే తప్పా సమస్యల పరిష్కారానికి నోచుకోలేని పరిస్థితి నెలకొంది. రూరల్ స్టేషన్‌కు ఎదురుచూపులు.. జడ్చర్లలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. దశాబ్ద కాలంగా రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. పట్టణం రోజు రోజుకు నలుదిక్కులా విస్తరిస్తుండటంతో పాటు ఓ వైపు 44వ నంబర్ జాతీయ రహదారి, మరో వైపు 167 నంబర్ జాతీయ రహదారి ఉన్నాయి. వీటితో పాటు మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సెజ్, గ్రీన్ ఇండస్ట్రీయల్ ఏరియాతో నియోజకవర్గం కేంద్రంగా ఉన్న జడ్చర్ల పోలీస్‌స్టేషన్ బిజీబిజీగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న పలు సమస్యలు సకాలంలో పరిష్కారానికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బాదేపల్లి, కావేరమ్మపేట(జడ్చర్ల) జంట పట్టణంతో పాటు మండల పరిధిలోని 45 గ్రామపంచాయతీలు, వాటి పరిధిలోని 23 అనుబంధ తండాలు, తదితర నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లక్షకు పైగా జనాభా ఉంది. ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 80 వేలకు పైగా జనాభా ఉంది. ఇంత జనాభాకు సంబంధించి ఒకే ఒక పోలీస్‌స్టేషన్ ఉండటంతో ప్రజలకు సత్వర పోలీస్‌సేవలు అందడం లేదనే అపవాదు ఉంది. ట్రాఫిక్ సమస్యలతో.. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతుండటంతో ట్రాఫిక్ నియంత్రణ కూడా పోలీసులే చూడాల్సి వస్తుంది. పట్టణంలోని నడిబొడ్డున జాతీయ రహదారులతో పాటు అంతర్రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. దీంతో వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. రోడ్లు ఇరుగ్గా ఉండటంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. పనిభారంతో సతమతం.. జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్నారు. స్టేషన్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తుంది. మండల పరిధిలోని సెజ్‌లో పరిశ్రమల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడికి సంబంధించిన శాంతిభద్రతల సమస్యల పరిరక్షణ బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. జిల్లాలోనే అధిక నేరాలు నమోదవుతున్న పోలీస్స్టేషన్లలో జడ్చర్ల ప్రధానంగా ఉంది. ప్రతి ఏడాది దాదాపుగా 500–600 వరకు కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది దాదాపు 800 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు.. జడ్చర్లలో పోలీస్ సబ్‌డివిజన్‌తో పాటు రూరల్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు పంపించారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కూడా కొట్టారు. ఇటీవల ఎన్నికల ప్రచార సభకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ కూడా రూరల్, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా డివిజన్ కార్యాలయంతో పాటు రూరల్, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులో సేవలు.. జడ్చర్ల పట్టణంతో పాటు మండల ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. జడ్చర్ల మున్సిపాలిటీ మరియు గ్రామీణ ప్రాంతాలు, తండాలకు కలిపి ఒకే పోలీస్‌స్టేషన్ ఉంది. రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటయితే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. –రమేశ్‌బాబు, సీఐ, జడ్చర్ల ఏర్పాటుకు కృషి.. జడ్చర్లలో రూరల్ పోలీస్‌స్టేషన్ అవసరం ఎంతో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. తమ హయాంలో రూరల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తాం. – అనిరుద్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల -
స్వయం ఉపాధి ఒక మంచి త‘రుణం’
సంగారెడ్డి: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 481 స్వశక్తి మహిళా సంఘాల్లో 5,106 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపునకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నారు. ప్రతీ సంఘం ప్రణాళికలు రచించుకుంటూ సీనియార్టీ ప్రకారం బ్యాంక్‌లో రుణాలు పొందుతూ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. సభ్యుల ఏకగ్రీవ తీర్మాణంతో అప్పులు తీసుకొని వాటిని కీస్తీల వారిగా అప్పులు చెల్లిస్తూ బ్యాంక్‌లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 2024)గాను 99 గ్రూపులకు గాను 8.36 కోట్ల రుణాల టార్గెట్ విధించగా, ఇందులో 85 గ్రూపులు రూ.9.80 కోట్లు టార్గెట్‌ను మించి రుణాలు పొందారు. మరో రూ.1.50 కోట్లకు రుణాల ప్రతిపాదనలు పంపినట్లు మెప్మా సీఈఓ రాజు తెలిపారు. ఈ నిధులు మంజూరైతే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల కంటే హుస్నాబాద్ మెప్మా అగ్రగ్రామిగా నిలువనుంది. ఈ రుణాలతో మహిళలు ముఖ్యంగా టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడర్, పాడి పశువుల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీధి వ్యాపారులకు రూ.కోట్లలో.. హుస్నాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద చేయూతను అందిస్తుంది. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాన్ని బ్యాంక్‌ల ద్వారా అందిస్తున్నారు. ఈ ఏడాది హుస్నాబాద్ పట్టణంలో వీధి వ్యాపారుల గుర్తింపుపై సర్వే చేసి 1,566 మందిని గుర్తించారు. ఇందులో 1,365 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, 1332 మందికి మొదటి విడతగా రూ.10 వేల చొప్పున రూ.1.33 కోట్ల రుణం మంజూరు చేశారు. రెండో విడతగా 865 మంది వ్యాపారులకు టార్గెట్ చేయగా, 837 మందిని గుర్తించారు. ఇందులో 712 మందికి బ్యాంక్ అధికారులు సమ్మతం తెలుపగా, 690 మందికి రూ.20 వేల చొప్పున 1.38 కోట్లు రుణం అందజేశారు. మూడో విడతలో 161 మందిలో 154 మంది గుర్తించి 150 మందికి రూ.50వేల చొప్పున రూ.75 లక్షల రుణాన్ని బ్యాంక్ అధికారులు మంజూరు చేశారు. ఈ రుణాలను వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, మళ్లీ అధికంగా ఎక్కువ రుణాలు పొందేలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ జిల్లాలోనే టాప్‌గా నిలిచింది. మహిళా సంఘాలు ఆర్థిక పురోగాభివృద్ధికి అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారు. హుస్నాబాద్‌లోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు టార్గెట్‌ను మించి పొందారు. మరో కోటి రూపాయలు వస్తే జిల్లాలోనే హుస్నాబాద్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అగ్రభాగాన నిలువనుంది. అలాగే, వీధి వ్యాపారులకు ఇచ్చే పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ టాప్‌లో నిలిచింది. వీధి వ్యాపారులకు బ్యాంకు అధికారులు రూ.కోట్లలో రుణాలు ఇవ్వడం గమనార్హం. ఆర్థికంగా ఎదగడానికే.. మహిళలు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. వారు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. నెల వారి కిస్తీలు సక్రమంగా చెల్లిస్తూ బ్యాంకులకు నమ్మకం కలిగిస్తున్నారు. అలాగే వీధి వ్యాపారులకు బ్యాంక్‌ల ద్వారా రుణాలు అందిస్తున్నాం. జిల్లాలోనే అత్యధికంగా వీధి వ్యాపారులు రుణాలు పొందారు. – రాజు, మెప్మా సీఈఓ, హుస్నాబాద్ -
ఇకపై ఈ ప్రాంతాలకు 'ఆర్ ఆర్ ఆర్' (RRR)
గజ్వేల్: ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు)కు సంబంధించి ఉత్తర భాగంలో చేపట్టాల్సిన భూసేకరణ, సామగ్రి తరలింపు అంశాలపై సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో సహజంగానే ట్రిపుల్ ఆర్ వ్యవహారంలోనూ కొంత స్తబ్దత ఏర్పడింది. ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలన్నీ వేగవంతమవుతున్న నేపథ్యంలో ట్రిపుల్ఆర్ విషయంలో ముందడుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంశం కీలక దశకు చేరుకుంది. భూసేకరణ, రోడ్డు నిర్మాణం కోసం గుర్తించిన స్థలంలో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి పక్కకు తరలించే పనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఉత్తర భాగంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి) పనులు జరగనున్నాయి. భూసేకరణను చేపట్టడానికి రెవెన్యూడివిజన్ల వారీగా కాలా (కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వజైషన్)లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే చౌటుప్పల్, యాదాద్రి, అందోల్–జోగిపేటతోపాటు గజ్వేల్, తూప్రాన్, భువనగిరి కాలాల పరిధిలోనూ త్రీడీ నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఎనిమిది కాలాల పరిధిలోని 84 గ్రామాల్లో 4700 ఎకరాల వరకు భూసేకరణ జరగనుండగా.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలను సేకరించనున్నారు. ఉత్తర భాగం రీజినల్ రింగు రోడ్డు నిడివి 158 కిలోమీటర్లు కాగా ఇందులో 100 కిలోమీటర్ల వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తరించనున్నది. సామగ్రి తరలింపునకు చర్యలు ఉత్తర భాగంలో నిర్మించనున్న ట్రిపుల్ఆర్ రోడ్డు గుర్తించిన భూముల్లో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి తరలింపునకు చర్యలు తీసుకోనున్నాం. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయి. భూసేకరణ అంశంలోనూ ముందడుగు పడనుంది. – రాహుల్, ఎన్హెచ్ఏఐ డిప్యూటీ మేనేజర్ ఇవి చదవండి: కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'.. -
బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో..
మహబూబాబాద్: హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న హుజూరాబాద్ డిపోనకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఓవర్ లోడ్‌తో వెళ్తుండగా ఎల్కతుర్తి సమీపంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఓవర్ లోడ్ కారణంగా ఘటన జరగలేదని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవి కూడా చదవండి: అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి.. -
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. -
కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'..
కరీంనగర్: రేషన్‌కార్డుల జారీ ఎటూతేలకపోవడం కోడళ్లకు శాపంగా మారింది. ఇంటిపేరు మారినా రేషన్‌కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానమివ్వలేని పరిస్థితి. గత అయిదేళ్లుగా దరఖాస్తులు కుప్ప ల్లా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్తకార్డుల జారీలో మాత్రం అలసత్వమే. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లన్న అసహనం వ్యక్తమవుతోంది. ‘నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేశ్‌కు ఏడాది క్రితం వివాహమైంది. హుజూరాబాద్ నుంచి అఖిలను పెళ్లి చేసుకోగా ఆమెపేరును తల్లిగారింట తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న కోడళ్లది.' దరఖాస్తు చేసి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లు కొత్తకార్డుకు దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని వాపోతున్నారు. తనకు అయిదేళ్ల క్రితం వివాహమైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించారు. జిల్లాలో 512 రేషన్‌దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.70లక్షల కార్డుదారులున్నారు. పెళ్లికాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్కపేరు చేర్చలేదని తెలుస్తోంది. ఒక్కో కార్డుకు రూ.25 వసూలు రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులు ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలనపడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కోకార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అధికారులు విచారణచేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు. అయితే కొత్తకార్డుల జారీపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవని, కోడళ్లు తమ పేరును అత్తారింటి కార్డులో చేర్చేందుకు మీసేవలో నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: ఇకపై ఈ ప్రాంతాలకు 'ఆర్ ఆర్ ఆర్' (RRR) -
నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు..
ఆదిలాబాద్: విద్యార్థుల భవితకు బాటలు వేయాల్సిన కొంత మంది గురువులు ఆ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ బాధను భరించలేక కొందరు బయట పెడుతుండగా, మరికొంత మంది మౌనంగా భరించాల్సిన దుస్థితి. జిల్లాలో కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆ కీచకులపై నామమాత్రపు చర్యలకే పరిమితం కావడంతో వక్రబుద్ధి ఉన్న మిగతా వారి తీరులో మార్పు కానరాని పరిస్థితి. సంఘటనలు బయటకు వచ్చినప్పుడు రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలతో బయటపడుతున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి పోయి వారిపై అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. దీంతో విద్యాశాఖకే చెడ్డ పేరు వస్తోంది. ఇటీవల నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ కీచక గురువు విద్యార్థినులను వేధించడంతో వారు పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. గతంలోనూ జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు ఇటీవల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడడంతో వారు పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి కార్యదర్శి సైతం ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఈవోకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో ఈ ఏడాది మార్చిలో ఓ కోచ్ విద్యార్థినులను వేధించడంతో ఆ విషయం బయట పడింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టి అతడిని విధుల నుంచి తప్పించారు. వెకిలిచేష్టలకు పాల్పడినట్లు తేలడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. మావల మండలం వాఘాపూర్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతడిని అక్కడి నుంచి మరో పాఠశాలకు బదిలీ చేశారు. ఆ పాఠశాలలో సైతం ఆయన తీరు మారలేదు. విద్యార్థినులు ఆందో ళన చేపట్టినప్పటికీ విషయం బయట పొక్క కుండా విద్యాశాఖాధికారులు కప్పిపుచ్చారు. తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలను విద్యార్థినులకు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆయనను పాఠశాలలో బంధించారు. ఈ మేరకు విచారణ జరిపిన డీఈవో అతడిని మరో పాఠశాలకు పంపించారు. ఉట్నూర్ మండలం లక్కారం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విచారణ జరిపి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అలాగే అతడిపై పోక్సో చట్టం కింద కేసు సైతం నమోదైంది. వక్రబుద్ధితో.. విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయులు కొంత మంది వక్రబుద్ధితో వారి ని వేధిస్తున్నారు. ముఖ్యంగా ఈఘటనలు ఉన్న త పాఠశాలల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పాఠశాలల్లో సాధికారత క్లబ్‌లు ఏర్పా టు చేసినప్పటికీ అవి నామామత్రంగానే మిగిలాయి. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడే ఉపాధ్యాయులకు తోటి టీచర్లు మద్దతు పలకడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠాలు బోధించే సమయంలో బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, వెకిలిచేష్టలకు దిగడంతో వారు చదువుపై ఆసక్తి చూపలేకపోతున్నారు. విషయాన్ని తల్లిండ్రులకు చెప్పలేక మదనపడుతున్నారు. ఒకవేళ విషయాన్ని బయట పెడితే తమ చదువులకు ఆటంకం కలుగుతుందేమోనని వా రు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎవరి కై నా చెబితే సంగతి చూస్తామని ఈ గురువులే విద్యార్థినులను హెచ్చరిస్తు న్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీచర్ల మధ్య గొడవలు.. జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగుచూస్తుండగా, మరెన్నో బహిర్గతం కావడం లేదన్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని పాఠశాలల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని చెప్పిస్తున్నట్లు కూడా చర్చ సాగుతోంది. వీరి మధ్య గొడవలు విద్యార్థుల భవితపై ప్రభావం చూపుతున్నాయి. విద్యార్థులు నిరసనకు దిగడంతో విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. దీంతో అక్కడ పాఠాలు బోధించే టీచర్ల కొరత ఏర్పడుతోంది. గొడవల కారణంగా ఉపాధ్యాయుల పరువు పోవడంతో పాటు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. కొరవడిన పర్యవేక్షణ.. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పా టు తోటి మహిళ ఉపాధ్యాయులను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గతంలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో ఒక్క రెగ్యులర్ ఎంఈఓ లేకపోవడం, అలాగు జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఇన్చార్జి కావడంతో కొంత మంది ఉపాధ్యాయులు వారి మాటలను పెడచెవిన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఏవైన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. తప్పు చేసిన వారికి కనీసం మెమోలు కూడా ఇవ్వకుండా మెతక వైఖరి వ్యవహరించడంతో తమను ఎవరేమి చేయలేదనే ధీమాతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి ఉపాధ్యాయులు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు ఉపాధ్యాయులు వారి భవితకు బాటలు వేయాలి. విద్యార్థినులను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. కొంత మంది తీరు వల్ల విద్యా శాఖకు చెడ్డ పేరు వస్తోంది. ఎవరైన ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ప్రణిత, డీఈవో -
తిరుపతి రైలు ఇక నాలుగుసార్లు! హామీ నిలబెట్టుకున్న ఎంపీ బండి..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభవార్త. కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు సర్వీసులను పెంచాలని కొంతకాలంగా ప్రయాణికుల పక్షాన ‘సాక్షి’ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫ లించింది. ప్రస్తుతం ఆది, గురువారాలు మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో నాలుగు రోజులపాటు నడవనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రైల్వే పెండింగ్ పనుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని కో రారు. మంత్రి సానుకూలంగా స్పందించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలను సమీక్షించిన అనంతరం రెండుమూడు రోజుల్లో ఏయే రోజు రైలును నడపాలనే దానిపై ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్–హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు పూర్తిచేసి కొత్త రైల్వే లైన్ పనులు మంజూరు చేయాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు. జమ్మికుంటలో హాల్టింగ్ ఉండేలా.. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపారులు, సామాన్య ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారి సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్లో ఆపేలా (హాల్ట్) చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లే గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12590–89), యశ్వంతపూర్ నుంచి గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12592–91), హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (12723–23), సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12791–92), చైన్నె నుంచి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (12656–55) రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన రైల్వే మంత్రి సాధ్యాసాధ్యాలు పరిశీ లించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్‌కు సంబందించి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి దుర్వాస న వెదజల్లుతుండటంతో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులొస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని 11ఏ, 16ఏ, 26, 101, 123ఏ, 134ఏ, 140ఏ, 164, 175ఏ, 775ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) డ్రైనేజీలను మంజూరు చేయాలని సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. గతంలోనే ‘సాక్షి’ ద్వారా హామీ ఇచ్చిన సంజయ్.. గతేడాది పలుమార్లు తిరుపతికి వెళ్లే రైళ్లలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ‘సాక్షి’ ఎంపీ బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన కూడా తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను బైవీక్లీని మరిన్ని రోజులు పొడిగించేలా కృషి చేస్తానని సాక్షి ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు. ఎట్టకేలకు హామీ నెరవేరడంతో జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, మంచి ర్యాల జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నడి సంద్రంలో పెను ప్రమాదం! ఒక్కసారిగా..
అల్లూరి సీతారామరాజు: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో నడి సంద్రంలో పెనుప్రమాదం తప్పింది. పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ టూరిజం నిర్వహిస్తున్న స్పీడ్ బోటులో 8 మంది పర్యాటకులు గురువారం సాయంత్రం బోటు షికారుకు వెళ్లారు. అదే సమయంలో ఓ ప్రైవేటు బోటులో ఐదుగురు షికారుకు వెళ్లారు. ఈ క్రమంలో అతి వేగంగా వస్తున్న ప్రైవేటు స్పీడ్ బోటు ఏపీ టీడీసీ స్పీడ్ బోటును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ప్రైవేటు బోటు పూర్తిగా టూరిజం బోటు క్రిందకు చొచ్చుకుని పోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు పర్యాటకులు ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు. అయితే వీరు లైఫ్ జాకెట్ల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవి చదవండి: ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..! -
కోమాల్లోకి వెళ్లిన కొడుకు! న్యాయం కోసం ట్యాంక్ ఎక్కిన తల్లి.. చివరకి?
నల్గొండ: తన కుమారుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ గురువారం నడిగూడెం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో వాటర్ ట్యాంక ఎక్కి నిరసన తెలిపింది. వివరాలు.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన గుంజ యల్లయ్య, మురళి అన్నదమ్ములు. మురళికి, అతడి భార్యకు కొద్దిరోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. గత నెల మురళి, అతడి భార్య గొడవ పడుతుంగా.. యల్లయ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా కొందరు దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో యల్లయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లి ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని, కానీ తమకు ఇప్పటి వరకు న్యాయం చేయడం లేదని యల్లయ్య తల్లి అచ్చమ్మ గురువారం నడిగూడెం బస్టాండ్ సెంటర్లో ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఏడుకొండలు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అచ్చమ్మను కిందకు దించారు. ఇవి చదవండి: నడి సంద్రంలో పెను ప్రమాదం! ఒక్కసారిగా.. -
దేశంలోనే తొలి '3డీ ప్రింటెడ్ ఆలయం'.. ఎక్కడో తెలుసా!
సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోనే తొలి దేవాలయం! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్‌వేర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు. కంప్యూటర్లో రూపొందించి.. కంప్యూటర్లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ప్రారంభం.. సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు. ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత! దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్‌తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది. కూలీల పని తప్పింది 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు! -
పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతం! : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం ఆమె భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. మొదట ఆమె శ్రీరంజన్ సిల్క్ వీవ్స్ యూనిట్‌ను సందర్శించి దారం నుంచి వస్త్రం తయారయ్యే ప్రక్రియలను స్వయంగా పరిశీలించారు. కూకున్స్ నుంచి సింగిల్ యారన్ దారం తయారీ, దారాన్ని డబులింగ్, ట్విస్టింగ్, వార్పింగ్, వెప్టింగ్ చేసి చివరకు 2ప్లే దారాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు. పట్టుగూళ్ల నుంచి ముడి పట్టును తీసి, మేలు రకమైన పట్టుదారం తయారు చేయడం, దాని నుంచి పడుగు, పేకలను రూపొందించి రంగులద్ది, టై అండ్ డైలో డిజైన్లను రూపొందించడం, ఆసు యంత్రపై చిటికిపోసి పలు రకాల డిజైన్లతో చీరలు తయారు చేయడం తదితర విషయాలను శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి స్పందిస్తూ.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో టస్సార్ సిల్క్‌ను వినియోగిస్తారని, కానీ మల్బరీ సిల్క్ నాణ్యత బాగుందని తన స్వరాష్ట్రమైన ఒడిశాలో కూడా మల్టీ హ్యాండ్లూమ్ యూనిట్లు నెలకొల్పేందుకు తన పర్యటన ఎంతో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. థీమ్ పెవిలియన్‌లో పర్యటన.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌లో చేనేతకు సంబంధించిన పలు వస్త్రాల తయారీపై చేనేత కళాకారులు రాష్ట్రపతికి వివరించారు. పుట్టపాకకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. నూనెలో దారాన్ని నానబెట్టి ప్రాసెసింగ్ చేసి తేలియారుమాల్ వస్త్రాన్ని తయారు చేసే విధానాన్ని వివరించారు. తేలియా రుమాల్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించిందని చెప్పారు. భూదాన్‌పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరలు, గద్వాల సిల్క్ చీరలు, వరంగల్ రామప్ప చీర, భూపాలపల్లి టస్సర్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరల గురించి చేనేత జౌళిశాఖ డీడీ అరుణ్‌కుమార్ వివరించారు. నారాయణపేట సిల్క్, కాటన్ చీరలు, వరంగల్ దుర్రీస్ తివాచీలు, 14వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగాబాద్‌లో నేసిన హిమ్రా చీరల (అప్పట్లో రాయల్ ఫ్యామిలీలకు బహుమతిగా ఇచ్చేవారు) గురించి జౌళిశాఖ డీడీ వెంకటేశం రాష్ట్రపతికి వివరించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు ఇక్కత్ వస్త్రాలు, గద్వాల చీరలు, గొల్లభామ చీరల కోసం ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్రపతి సందర్శించారు. చేనేత కళాకారులు ఆమెకు ఆయా వస్త్రాల తయారీ గురించి చెప్పారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో వస్త్రాల అమ్మకం గురించి సాయిని భరత్, ఎన్జీఓ సుధ రాష్ట్రపతికి వివరించారు. పడుగు, పేకల కోసం వినియోగించే 30 చరఖా (రాట్నం)లను మహిళలు తిప్పుతుండగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వాటిని పరిశీలించారు. చరఖా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన మగ్గంపై నేత తీరును పరిశీలించారు. పద్మశ్రీ చింతకింది మల్లేషం రూపొందించిన ఆసు యంత్రాన్ని పరిశీలించి దాని పనితనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీరంజన్ వీవ్స్ మల్టీ యూనిట్లో పనిచేస్తున్న చేనేత కార్మికుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎన్ని సంవత్సరాలుగా మగ్గం పనిచేస్తున్నారని, ఈ వృత్తి వల్ల నెలకు ఎంత కూలి లభిస్తుందని అడిగి తెలుసుకున్నారు. ఒడిశా చేనేత కళాకారులను తాము మెహర్ అని పిలుచుకుంటున్నామని చెప్పారు. ఇక్కడి చేనేత కళాకారుల నేత నైపుణ్యం గొప్పగా ఉందని కొనియాడారు. అనంతరం చేనేత కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ దంపతులు రాష్ట్రపతికి సంబల్పురి డిజైన్ కలిగిన పోచంపల్లి ఇక్కత్ చీర, పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరను అందజేశారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సెక్రటరీ రచన సాహు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె.జెండగే ఉన్నారు. పోచంపల్లిలో రెండు గంటలు గడిపిన రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లిలో రెండుగంటల పాటు గడిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక చాపర్‌లో పోచంపల్లికి చేరుకున్నారు. శ్రీరంజన్ వీవ్స్ యూనిట్లో 20 నిమిషాల పాటు వీవింగ్, ట్విస్టింగ్ ప్రక్రియలను పరిశీలించారు. 10.55 గంటలకు బాలాజీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్‌ను సందర్శించారు. అనంతరం గాంఽధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చరఖా రూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భూదానోద్యమ చరిత్ర ఫొటో గ్యాలరీని తిలకించారు. అక్కడి నుంచి 11.30 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్నారు. చేనేత కార్మికులచే సన్మానం పొందారు. 12.15 గంటలకు రాష్ట్రపతి చేనేత కార్మికులనుద్దేశించి పది నిమిషాలు మాట్లాడారు. అనంతరం 12.30 గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. 12.40 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇవి కూడా చదవండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం! -
మేయర్.. 'మీరే మాకు పెద్ద దిక్కు!'
వరంగల్: గ్రేటర్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షమా? అన్నట్లుగా ప్రశ్నలు సంధించారు. కౌన్సిల్ సమావేశాల్లో మినహా పాలక వర్గం ఏర్పాటైన రెండున్నర ఏళ్లులో మేయర్‌ను ఎన్నడూ నేరుగా కలిసి సమస్యలు విన్నవించిన దాఖలాలు లేవు. కానీ అధికార మార్పిడితో పరిస్థితులు మారిపోయాయి. గతాన్ని వదిలేద్దాం అంటూ ఐక్యతారాగం అందుకున్నారు. ‘మేయర్ మీరే మాకు పెద్ద దిక్కు. మా డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి’ అంటూ పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు విన్నవించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో వరంగల్ తూ ర్పు, పరకాల నియోజక వర్గాల పరిధిలోని పలువురు కార్పొరేటర్లు భేటి అయ్యారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కరుగా ఏకరువు పెట్టారు. చాలామేరకు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చాలాచోట్ల పనులు మొదలు పెట్టలేదని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ ప్రగతి పథకం ద్వారా డివిజన్‌కు రూ.50లక్షలు కేటాయించారని, అందులో 20శాతం నిధులు ఎలక్ట్రికల్ పనులకు ఇచ్చారని, ఇప్పటికి పనులు ప్రారంభానికి నోచుకోలేదని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌కు జనరల్ ఫండ్ ద్వారా రూ.50లక్షల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు. తాగునీరు, వీధి దీపాల సమస్యలు, పారిశుద్ధ్య లోపం తదితర విషయాలను వివరించారు. దీనిపై మేయర్ గుండు సుధారాణి స్పందించారు. అభివృద్ధి పనులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించి, వేగవంతమయ్యే విధంగా చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, దిడ్డి కుమారస్వామి, గందె కల్పన, కావేటి కవిత, పోశాల పద్మ, గుండు చందన, రామా తేజస్విని, ముష్కమల్ల అరుణ, బైర బోయిన ఉమ, గద్దె బాబు, వస్కుల బాబు, చింతాకుల అనిల్ కుమార్, బస్వ రాజు శిరీష, బస్వరాజు కుమార స్వామి, సోమిషెట్టి ప్రవీణ్, మహ్మద్ ఫుర్కాన్, ఆకుల మనోహర్, బాల్నే సురేష్‌తోపాటు మహిళా కార్పొరేటర్ల భర్తలు తదితరులు ఉన్నారు. ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు.. -
ముక్కోటికి రెడీ! వీఐపీల తాకిడితోనే అసలు సమస్య!!
భద్రాచలం: ముక్కోటి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా ఈ నెల 22న రాత్రి గోదావరిలో హంసవాహనంపై రామయ్య తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 23న తెల్లవారుజామున ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరపనున్నారు. దీంతో ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానం, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. తెప్పోత్సవం జరిపే హంసవాహనం ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఉత్తర ద్వార దర్శనం వీక్షణకు సెక్టార్ల వారీగా విభజనతోపాటు ప్రధాన ద్వారాల వద్ద తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఏర్పాట్లపై కలెక్టర్ ప్రియాంక ఆల పలుమార్లు సమీక్షలు జరిపారు. ఎస్పీ వినీత్‌తో కలిసి పర్యవేక్షించి పలు సూచనలు అందజేశారు. వీఐపీల తాకిడితోనే అసలు సమస్య! ప్రతి ఏడాది వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనికి తోడు వీఐపీ సెక్టార్లలో అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించి కిక్కిరిసి ఉండటం, నిలబడి వీక్షించడంతో వెనుక సెక్టార్లలో ఉన్న భక్తులు ఉత్తర ద్వార దర్శనంను వీక్షించే అవకాశం ఉండటం లేదు. ఈ సమస్యను అధికారులు గుర్తించి నివారించాల్సి ఉంది. ఈ ఏడాది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకు అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సైతం హాజరయ్యే అకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రుల అనుచరులు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు. దీంతో రద్దీ పెరిగి సెక్టార్లు, అంతరాలయం వద్ద సామాన్య భక్తులు ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. ఈ సమస్యను దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులు గమనించి అధిగమించాలని పలువురు కోరుతున్నారు. -
కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు!
ఆదిలాబాద్: కోవిడ్.. రెండేళ్ల క్రితం ప్రపంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం విదితమే. మహమ్మారి ముప్పు తప్పిందని భావిస్తున్న తరుణంలో మరోసారి తాజాగా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. జేఎన్–1 వేరియంట్ రూపంలో ముప్పు పొంచి ఉండటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో కొత్త వేరియంట్ ప్రభావం ఇంకా కనిపించనప్పటికి కేంద్రం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. వైరస్ కట్టడి దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 14న కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు జిల్లాలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కోవిడ్ టెస్టుల నిర్వహణతో పాటు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పీపీఈ కిట్స్, మాస్కులను సిద్ధంగా ఉంచారు. వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే శ్రేయస్కరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ కలవరం.. ప్రస్తుతం జేఎన్–1 వేరియంట్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 2020–21లో ప్రబలిన కోవిడ్ వైరస్‌తో జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. రెండేళ్లుగా కొత్తగా కేసులేమి నమోదు కాకపోవడంతో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అందరూ భావించారు. అయితే వైరస్ మళ్లీ కొత్త రూపంలో నమోదు కావడం జిల్లావాసులను కలవరానికి గురిచేస్తోంది. శీతాకాలం కావడంతో పాటు ఈ నెలాఖరు వరకు శుభ కార్యాలు ఎక్కువగా ఉండటం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు రానున్నాయి. వీటిల్లో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశముంటుంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కట్టడికి వైద్యారోగ్యశాఖ సన్నద్ధం! ప్రమాదకరమైన కొత్త వేరియంట్ కట్టడికి జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 14న మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ బోఽధనాసుపత్రితో పాటు పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సివిల్ కమ్యూనిటీ ఆసుపత్రులు కలిపి 96తో పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిర్ధారణ పరీక్షలతో పాటు పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించేలా వారికి దిశా నిర్దేశం చేశారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన మాస్కులు 1,47,270, పీపీఈ కిట్స్ 12,740ని సిద్ధంగా ఉంచారు. రిమ్స్, ఇతర ఆసుపత్రుల్లో కలిపి 1436 బెడ్స్‌ను సిద్ధం చేశారు. రిమ్స్‌లో వంద పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌తో కూడిన 455 పడకలు, 135 పడకలతో ఐసీయూ, వెంటిలేటర్స్‌తో కూడిన 157 పడకలను రిమ్స్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 19 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు. జిల్లాలో కోవిడ్ టెస్టుల వివరాలు : 7,40,181 పాజిటివ్‌గా తేలిన కేసులు : 19,707 జిల్లాలో సంభవించిన మరణాలు : 92 ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు : 5,52,815 సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు : 5,55,884 ప్రికాషన్ డోస్ తీసుకున్న వారు : 2,65,780 ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండాలి కొత్త వేరియంట్ కట్టడికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాం. వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్కులు, పీపీఈ కిట్లతో పాటు చికిత్సకు అవసరమైన మెడిసిన్‌ను అందుబాటులో ఉంచాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స పొందాలి. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో -
ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది!
ఆదిలాబాద్: కలెక్టర్‌కు కోపమొచ్చింది.. ఎప్పుడు శాంతంగా, సరదాగా కన్పించే రాహుల్‌రాజ్ తొలిసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచిన అధికారులను తీవ్రంగా మందలించిన కలెక్టర్, పది, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా అధికారులేవరూ సెలవులో వెళ్లవద్దని ఆదేశించిన కలెక్టర్ ప్రజావాణిని లైట్‌గా తీసుకుంటే సహించబోనని కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. అర్జీదారులు వచ్చిన రాకపోయినా ప్రతి జిల్లా స్థాయి అధికారి ఉదయం 10.30 గంటలకు సోమవారం జరిగే ప్రజావాణికి విధిగా రావాలని లేకుంటే కుదరని తెల్చిచెప్పారు. ఈ నెల 21 న హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను సంక్షిప్త సమాచారంతో మంగళవారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెంచడంతో పాటు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం గుండె పోటుతో మరణించిన భీంపూర్ తహసీల్దార్ నారాయణ మృతికి సంతాప సూచకంగా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు! -
కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్..
సంగారెడ్డి: జహీరాబాద్‌లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం క్రషింగ్‌ను చేపట్టే పరిస్థితి కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రజా ప్రతినిధులు మర్చిపోవడంతో రైతాంగం వారిపై ఆశలు వదులుకొని తమ దారి తామే చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు కర్మాగారాలతో ఒప్పందం సైతం చేసుకున్నారు. జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 18 వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. 7 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇంత మొత్తంలో పంట జోన్ పరిధిలో ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పక్కనే ఉన్న కర్ణాటకకు పంటను తరలిస్తున్నారు. కర్ణాటకలోని చించోళి, బరూర్, మన్నాక్కెల్లి, గాంధీ చక్కెర కర్మాగారాలకు పంటను పంపిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, యాజమాన్యంపై ఆశలు వదులుకొని ఇప్పటికే జోన్ పరిధిలో సాగులో ఉన్న దాంట్లో 8 వేల ఎకరాల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలోని చించోళి యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో రైతులు చెరకు పంటను విస్తారంగా సాగు చేసుకున్నారు. కర్ణాటకలోని యాజమాన్యాలు టన్నుకు ధర రూ.2,650 మేర చెల్లించి, చెరకు కోత, రవాణా ఖర్చులను వారే భరిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. రూ.9 కోట్ల మేర బకాయి.. ‘ట్రైడెంట్’ కర్మాగారంలో 2022–23 క్రషింగ్ సీజన్‌కు గాను 2.55 లక్షల టన్నుల చెరకును గాను గాడించింది. టన్నుకు రూ.3,270 ధర నిర్ణయించింది. మొదటి విడత కింద టన్నుకు రూ.3 వేల వంతున చెల్లిస్తూ వచ్చింది. మిగితా రూ.270 పెండింగ్ పెట్టింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో చెరకును సరఫరా చేసిన రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో బిల్లులు పడ్డాయి. జోన్ పరిధిలో ఉన్న మొత్తం 2,287 మంది రైతులు కర్మాగారానికి చెరకును సరఫరా చేశారు. ఇందులో 1,699 మంది రైతులకు టన్నుకు రూ.270 వంతున బకాయి పడింది. మిగిలిన రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రూ.83 కోట్లకు గాను రైతాంగానికి ఇప్పటి వరకు రూ.74 కోట్ల మేర చెల్లించారు. ఇంకా రూ.9 కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చిన హామీని మరిచిన నేతలు! ఎన్నికల సందర్భంగా కర్మాగారంలో క్రషింగ్‌ను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, మొత్తం చెరకు బకాయిలు ఇప్పిస్తామని రైతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చి మర్చిపోయారని రైతులు వాపోతున్నారు. పలు సమావేశాల్లో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్ హామీ ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అవసరం అయితే తమ ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారని, వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలోనే క్రషింగ్ జరిపేలా చూస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. అధికారులు హామీ ఇచ్చి.. ఎన్నికల ప్రచారం నిమిత్తం నవంబర్ 23వ తేదీన జహీరాబాద్‌కు అప్పటి సీఎం కేసీఆర్ ప్రచారం నిమిత్తం వస్తుండడంతో సభను అడ్డుకునేందుకు రైతులంతా తీర్మానించారు. డిసెంబర్ మొదటి వారంలో బకాయిలను ఇప్పించడంతోపాటు క్రషింగ్‌ను జరిపిస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు, కేన్, పోలీసు అధికారులు హామీ ఇచ్చి తమ ఆందోళనను విరమింపజేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కొండల్‌రెడ్డి, రైతుసంఘం నాయకుడు, జహీరాబాద్ ఇవి చదవండి: వలస.. ఏదీ భరోసా? -
వలస.. ఏదీ భరోసా?
మంచిర్యాల: 'ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు వలసబాట పడుతున్నారు. ఉపాధి అవకాశంతో పాటు అధిక వేతనాలు, మరింత మెరుగైన జీవనం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం.. పల్లెల నుండి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరో దేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు.' నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారులు ఉజ్వల భవిష్యత్, తగిన గుర్తింపు కోసం తమ మాతృభూమిని వదిలి వేరొక దేశానికి వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 80 వేలకు పైగా కార్మికులు వివిధ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినట్లు గల్ఫ్ సంక్షేమ సంఘాలు పేర్కొంటున్నాయి. వీరే కాకుండా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన జిల్లావాసులు దాదాపు 2 లక్షల వరకు ఉంటారని ప్రవాసీమిత్ర కార్మిక సంఘాల నాయకులు పేరొంటున్నారు. జిల్లా నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వ్యక్తులకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఎక్కువ మంది కూలీలు గానే పనులు చేస్తున్నారు. తిరిగొచ్చిన తర్వాత కూడా సరైన ప్రత్యామ్నాయ, ఉపాధి మార్గాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల రమణ ఉపాధి నిమిత్తం దాదాపు 12 ఏళ్లక్రితం ఒమన్ దేశానికి వెళ్లి కొన్ని నెలలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడ స్వయం ఉపాధి పొందేందుకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు ఏదైనా రుణం మంజూరు చేయించాలని కొన్నిరోజులక్రితం కలెక్టరేట్, డీఆర్డీవో, తదితర కార్యాలయాల్లో విన్నవించుకున్నాడు. రుణం మంజూరు కోసం కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదని గాండ్ల రమణ పేర్కొంటున్నాడు. గల్ఫ్ నుండి వాసస్ వచ్చిన ఇలాంటి వారు ఎందరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి.. అమాయకులైన వలస కార్మికుల రక్షణకు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలతో సహా 18 దేశాలను ఈసీఆర్ దేశాలుగా వర్గీకరించిన 1983 లోని ఎమిగ్రేషన్ చట్టం యొక్క ప్రాతిపదిక ప్రకారం గల్ఫ్ బోర్డు ఏర్పా టు చేయాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి. గల్ఫ్‌కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తింపజేయాలి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి.. హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణం కూడా చేర్చా లి. రూ.325 చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో ఇన్సూరెన్స్ ఇస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎమిగ్రేషన్ యాక్టు–1983 ప్రకారం గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్వీస్ చార్జీగా అభ్యర్థి 45 రోజుల వేతనం (రూ.30 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంటుకు చెల్లించాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. ఇదీ నేపథ్యం.. వలస వెళ్తున్న పౌరులకోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే)గా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎంత స్వేచ్ఛా స్వతంత్రంగా విదేశాలకు వెళ్తున్నారో అంతే స్వేచ్ఛగా తిరిగిరావొచ్చని సభ తీర్మానం చేసింది. ప్రధాన డిమాండ్లు! తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా అమలుకు నోచుకోవడంలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో 6 వేలకు పై గా తెలంగాణ ప్రవాసీయులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందగా రూ.5 లక్షల ఎ క్స్ గ్రేషియా కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని, రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్‌కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చే యాలని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్, గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయిలో ఏర్పాటు చేసిన మాదిరి హైదరాబాద్‌లో ‘విదేశ్‌భవన్’ ఏర్పాటు చేయాలని, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లో పాస్‌పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్లు ఉండాలని, ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. వలసదారుల సంక్షేమానికి కృషి చేయాలి.. వలస కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. కేరళ తరహా ప్రత్యేక గల్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయాలి. వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. గల్ఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి. తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధికోసం ఆయా వ్యక్తుల నైపుణ్యాలను బట్టి ప్రభుత్వాలు తగిన చేయూతనివ్వాలి. – కృష్ణ, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర నాయకుడు ఇవి చదవండి: ఆ పథకాలకు బ్రేక్? దరఖాస్తు వారిలో ఆందోళన.. -
ఆ పథకాలకు బ్రేక్? దరఖాస్తు వారిలో ఆందోళన..
మంచిర్యాల: రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆ పథకాలతో కొంతమంది లబ్ధి పొందగా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు బీసీబంధు, మైనారిటీ బంధు పథకాలు ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి విడతలో కొందరు లబ్ధి పొందారు. ఇక సొంత ఇంటి కలను తీర్చేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి దరఖాస్తులను తీసుకున్నా అర్హులకు ఎలాంటి సాయం అందించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. పథకాలు కొనసాగుతాయా.. కొనసాగినా తమకు వర్తిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బీసీ, మైనారిటీ బంధు కొందరికే.. జిల్లా వ్యాప్తంగా బీసీబంధు కోసం దరఖాస్తు చేసుకున్న 11,107 మందిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హులుగా 7,734 మందిని గుర్తించారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది చొప్పున మూడు నియోజకవర్గాల నుంచి 900 మందికి రూ. లక్ష సాయం అందించారు. రెండో విడతలో మరో 900 మందిని గుర్తించినా, వారికి అందించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో పథకానికి బ్రేక్ పడింది. ఇక మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 2,709 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మందిని మొదటి విడతలో గుర్తించి, వారికి రూ.లక్ష చొప్పున అందించారు. మిగతావారికి సాయం అందించేందుకు నిధులు విడుదల చేయలేదు. ‘గృహలక్ష్మి’పై సందిగ్ధం.. సొంత ఇంటి స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 51,764 మంది దరఖాస్తు చేసుకోగా, 40,501 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.3 లక్షల అందించాల్సి ఉంది. నిర్మాణాలకు అనుగుణంగా మూ డు విడతల్లో దీనిని అందించాలని భావించింది. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50, జనరల్ కేటగిరీలకు 20 శాతం రిజర్వు చేశారు. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇవ్వాలని భావించినా గుర్తించడంలో జరిగిన ఆలస్యంతో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదు. -
లబ్ధి చేకూరేలా.. ఫైల్ తొక్కి పెట్టిందెవరు?
కరీంనగర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులు కమిషనర్లుగా పదోన్నతి పొందిన వ్యవహారం ఓ ఉన్నతాధికారి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. సదరు అధికారులపై చార్జెస్ ఫ్రేమ్ అయి ఉన్నా ఆ ఫైల్‌ను తొక్కి పెట్టి, దొడ్డిదారిన పదోన్నతి వచ్చేట్లు చేయడంలో గతంలో కరీంనగర్లో పనిచేసి, వెళ్లిన ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. ‘ఆరోపణలున్నా అందలం’ పేరిట ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో విచారణ చేపట్టాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ సీడీఎంఏను కోరిన విషయం విధితమే. రెండున్నరేళ్ల కిందటి ఈ వ్యవహారం ఇప్పటివరకు ఎందుకు వెలుగు చూడలేదు? ఆన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్)లో తప్పుడు సమాచారాన్ని ఎవరు సీడీఎంఏకు పంపించారన్న అంశాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో ఆదేశించినా లేఖ రాయలే.. 2021లో నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న అధికారి, అకౌంటెంట్లపై ఆరోపణలు రావడం, అప్పటి కమిషనర్ ఇరువురిపై చార్జెస్ ఫ్రేమ్ చేయడం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సీడీఎంఏకు నివేదించాలని అప్పటి కలెక్టర్ నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ ఈ విషయమై నగరపాలక సంస్థ సీడీఎంఏకు ఎలాంటి లేఖ రాయలేదు. దీంతో విచారణ అంశం అటకెక్కింది. అటు చార్జెస్ ఫ్రేమ్ ఫైల్‌ను, ఇటు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తొక్కి పెట్టి, అడ్డదారిలో ఇద్దరు అధికారులకు లబ్ధి చేకూరేలా చేయడంలో గతంలో పని చేసిన ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఉద్యోగి పదోన్నతికి ముందు సీడీఎంఏకు పంపించే ఏసీఆర్లోనూ చార్జెస్ ఫ్రేమ్ అంశాన్ని పొందుపరచకుండా, క్లీన్ ఇమేజ్‌తో పంపించడంలోనూ ఆ ఉన్నతాధికారిదే కీలక పాత్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీఆర్ను స్వయంగా ఉద్యోగి పూర్తి చేసినప్పటికీ, సంబంధిత ఉన్నతాధికారే సీడీఎంఏకు పంపించాల్సి ఉంటుంది. అన్నీ తెలిసి, సదరు అధికారులతో కుమ్మక్కవడం వల్లే తప్పుడు సమాచారాన్ని పంపించారన్న ఆరోపణలున్నాయి. నగరపాలక సంస్థ కోరిన మేరకు సీడీఎంఏ ఒకవేళ విచారణకు ఆదేశిస్తే నిజాలు వెల్లడి కానున్నాయి. ఇవి చదవండి: కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్.. -
కొత్త సర్కార్‌పైనే ఆశలు! ఆసరా కోసం ఎదురుచూపులు..
ఖమ్మం: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆసరా పెన్షన్ లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హామీల్లో భాగంగా సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజు ఆరు గ్యారంటీలపై సంతకం చేశారు. ఈ గ్యారంటీల్లో ఆసరా పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకు చేయూత పథకం కింద రూ.4,000 లకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడడం, రెండు పథకాలను ఇప్పటికే ప్రారంభించడంతో ఆసరా లబ్ధిదారులు తమ గ్యారంటీ కూడా అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేయూత కింద ఇచ్చిన హామీల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.10 లక్షలు పెంచి అమలు చేస్తున్న ప్రభుత్వం, పెన్షన్లను కూడా త్వరలోనే పెంచి అమలు చేస్తారని ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,11,008 మంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసరా పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులు 3,11,008 మంది ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఏఆర్టీ, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు ఉన్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ.4 వేల పెన్షన్ అందుతుండగా.. ఇతర లబ్ధిదారులకు రూ.2,016లు పెన్షన్ అందుతుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేయూత కింద వీరందరికి రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 1,91,548 మందికి నెలకు రూ.44,34,00,000లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,19,460 మందికి నెలకు రూ.26,96,67,000లు పైగా చెల్లిస్తున్నారు. కొత్త ప్రభుత్వం చేయూత అమలు చేస్తే ఉమ్మడి జిల్లాలో పెన్షన్లకు చెల్లించాల్సిన నగదు భారీగా పెరగనుంది. కేటగిరీల వారీగా పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఇవి చదవండి: లబ్ధి చేకూరేలా.. ఫైల్ తొక్కి పెట్టిందెవరు? -
నాలుగుసార్లు కోలిండియా స్థాయిలో.. సింగరేణిలోని గోల్డ్‌మెడలిస్ట్!
మంచిర్యాల: బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పతకాలతో బత్తుల వెంకటస్వామి విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. కోలిండియా స్థాయి పోటీల్లో రాణిస్తూ సింగరేణిలోని మందమర్రి ఏరియాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. మందమర్రి ఏరియాలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో ఫోర్‌మెన్‌గా బత్తుల వెంకటస్వామి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 4 నుంచి 6వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కోలిండియా బాడీ బిల్డింగ్(90 కిలోల విభాగం) పోటీల్లో బంగారు పతకం సాధించి సింగరేణి పేరు దేశవ్యాప్తంగా మారుమోగించాడు.. వెంకటస్వామి 2006లో సింగరేణి ఎక్స్టర్నల్ ఎలక్ట్రీషియన్ పరీక్షలు ఉత్తీర్ణుడై ఎలక్ట్రీ షియన్‌గా విధుల్లో చేరాడు. 2013లో డిపార్టుమెంటల్ పరీక్షలు ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్ పాసయ్యాడు. వ్యాయామంపై ఆసక్తితో జిమ్‌లో చేరాడు. ప్రతీరోజు రెండున్నర, మూడు గంటల వరకు సాధన చేశాడు. బాడీ బిల్డింగ్ పోటీలపై మక్కువ పెంచుకున్నాడు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ సింగరేణి స్థాయిలో ఐదేళ్లుగా రానిస్తున్నాడు. అభినందనీయం.. మందమర్రి ఏరియాలో ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వర్తించే వెంకటస్వామికి కోలిండియా పోటీల్లో గోల్డ్‌మెడల్ రావడం అభినందనీయం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెంది మరెన్నో గోల్డ్‌మెడల్స్ సాధించాలి. అందుకు సింగరేణి ప్రోత్సాహం ఉంటుంది. – మనోహర్, ఏరియా జీఎం ప్రతీ ఏరియాలో జిమ్ ఏర్పాటు చేయాలి! బంగారు పతకం సాధించడంలో సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహం బాగుంది. పోటీలకు వెళ్లే ముందు ప్రత్యేకంగా మరికొంత సమయం ఇస్తే బాగుంటుంది. యాజమాన్యం మరింత సహకరించి ప్రోత్సహిస్తే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటా. సింగరేణిలో యువ ఉద్యోగులు సుమారు 20 వేల మందికి పైగానే ఉన్నారు. ఫిట్నెస్ కోసం సింగరేణి వ్యాప్తంగా ప్రతీ ఏరియాలో జిమ్ ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన కోచ్‌లను నియమించాలి. యువ ఉద్యోగులు ప్రతీరోజు జిమ్‌కు వెళ్లడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు విధులకు గైర్హాజర్ కాకుండా హాజరై సంస్థ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిలో పాలుపంచుకుంటారు. – వెంకటస్వామి, కోలిండియా గోల్డ్ మెడలిస్ట్ సాధించిన పతకాలు ప్రతీ సంవత్సరం డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో సింగరేణిలో నిర్వహించే బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2018–19, 2019–20, 2020–21, 2022–23 సంవత్సరాల్లో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాలు సాధించాడు. కోలిండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో సింగరేణి తరఫున 2019లో మధ్యప్రదేశ్‌లోని సింగ్రోళిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని కాంస్య పతకం, 2020లో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నిర్వహించిన కోలిండియా పోటీల్లో కాంస్య పతకం, 2022లో పశ్చిమబెంగాల్లోని కోల్‌కత్తాలో నిర్వహించిన పోటీల్లో వెండి పతకం అందుకున్నాడు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం సాధించి దేశవ్యాప్తంగా మందమర్రి ఏరియాకు గుర్తింపు తెచ్చాడు. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీ బిజీగా ఉండే యువతకు వెంకటస్వామి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏదైనా సాధించాలనే తపన ఉంటే సాధనతో సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా తయారవుతారని నిరూపిస్తున్నాడు. ఇవి చదవండి: మారు పేర్లు మారేదెప్పుడు? చిక్కుముడి వీడేదెప్పుడు? -
ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం!
నిజామాబాద్: న్యాయబద్ధమైన తమ హక్కులను సాధించుకోవడానికి ముడుపులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులు వాపోతున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు అడిగినంత ఇచ్చినా పే స్కేల్ అమలులో సరైన న్యాయం జరుగలేదని ఉద్యోగులు సామాజిక మాధ్యమాలల్ల చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సెర్ప్ ఉద్యోగులు ఇప్పుడు గత ప్రభుత్వ పనితీరును తప్పుపడుతూ గత పది రోజుల నుంచి పే స్కేల్ అమలులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై చర్చించుకోవడం గమనార్హం. సెర్ప్ సంస్థలో కమ్యునిటీ కో–ఆర్డినేటర్లు, ఏపీఎం, డీపీఎం, ఏపీడీలు అందరూ గతంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించిన వారే. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల వరకు ఉండగా మన జిల్లాలో 216 మంది ఉన్నారు. పే స్కేల్ అమలు చేసినా ఉద్యోగుల క్యాడర్‌ను తగ్గించడంతో తాము ఆశించిన వేతనం లభించడం లేదన్నారు. సీసీలను జూనియర్ అసిస్టెంట్, ఏపీఎంలను సీనియర్ అసిస్టెంట్, డీపీఎంలను సూపరింటెండెంట్, ఏపీడీలను ఎంపీడీవో స్థాయి అధికారులుగా గుర్తించారు. క్యాడర్ గుర్తింపులో తేడా స్పష్టంగా ఉండటంతో పే స్కేల్ వర్తించినా ఆశించిన వేతనం దక్కడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దమొత్తంలో వసూలు చేసిన ఉద్యోగ సంఘం ప్రతినిధులు క్యాడర్ గుర్తించడంలో న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురాలేదని ఉద్యోగులు అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న పరిణామాలు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి. ఇవి కూడా చదవండి: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్‌డైరీలో బోధన్ ఏసీపీ పేరు..!