Editorial
-
పౌర సమాజమా... పారాహుషార్!
అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పాయిజనస్ గ్యాస్ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్ వెపన్స్ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్ కంట్రీస్ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్ రోగ్స్ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్ జగన్ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్‌కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్‌లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్ విజిట్ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనే నల్ల చట్టాన్ని జగన్ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్‌కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి -
చిక్కుల్లో హరియాణా సర్కారు!
రాష్ట్రాల్లో అవకాశం చిక్కినచోటల్లా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచి, అధికారాన్ని చేజిక్కించు కోవటం అలవాటైన బీజేపీకి తొలిసారి సంకటస్థితి వచ్చిపడింది. హస్తినకు కూతవేటు దూరంలోవున్న హరియాణాలో ఆ పార్టీ ప్రభుత్వం సమస్యల్లో చిక్కుకుంది. సార్వత్రిక ఎన్నికల వేళ... రోడ్ షోలతో హోరెత్తించాల్సిన సమయంలో బీజేపీకి ఇదేమంత మంచి శకునం కాదు. అసలే ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడిందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కనుక హరియాణా మాత్రమే కాదు... ఎన్నికలు జరగాల్సిన వేరే రాష్ట్రాల్లో కూడా వోటర్లకు వేరే సంకేతాలు వెళ్తాయి.ఈ నెల 25న ఆ రాష్ట్రంలోని పది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా మంగళవారం ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. పైకి గంభీరంగా కనబడుతున్నా లోక్‌సభ ఎన్నికల హడావుడిలో తలమునకలైన బీజేపీకి దీంతో ఊపిరాడటం లేదు. ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇద్దరు బీజేపీ సభ్యులు రాజీనామా చేయటంతో అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం సాగాలంటే బీజేపీకి 45 మంది మద్దతు అవసరం కాగా ఇద్దరు ఇండిపెండెంట్లు, హరి యాణా లోక్‌హిత్ పార్టీ సభ్యుడు బీజేపీకి మద్దతునిస్తున్నారు. అంటే బీజేపీ బలం 43కి పడిపోయింది. రెండు నెలల క్రితం బీజేపీ–జేజేపీ కూటమి సర్కారుకు నాయకత్వం వహిస్తున్న ఖట్టర్‌ను తొలగించి ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం నయాబ్‌సింగ్ సైనీని తీసుకొచ్చింది. దాంతోపాటు పదిమంది ఎమ్మెల్యేలున్న జన్నాయక్ జనతాపార్టీ (జేజేపీ)తో తెగతెంపులు చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వున్న పది స్థానాలూ గెల్చుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో జేజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వదల్చుకోలేదు. సహజంగానే అంతవరకూ ఉపముఖ్యమంత్రిగా వున్న జేజేపీ నేతదుష్యంత్ చౌతాలాకు ఇది ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా చలవతోనే ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించు కున్నారన్నది వాస్తవం. అయితే కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే మద్దతిస్తామంటున్న జేజేపీ వాస్తవ బలమెంతో చెప్పలేం. ప్రస్తుత బేరసారాల్లో ఆ పార్టీకున్న పదిమంది ఎమ్మెల్యేల్లో ఎందరు మిగులుతారన్నది అనుమానమే. వారిలో నలుగురి మద్దతు తమకే వున్నదని సైనీ చెప్పు కుంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని జేజేపీ కోరినా అది బీజేపీకే తోడ్పడుతుంది. ఉన్న 88 మందిలో నలుగుర్ని అనర్హులను చేయగానే సభలో సభ్యుల సంఖ్య 84కి పడిపోతుంది. దాంతో 43 మంది మద్దతున్న బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా బయటపడుతుంది.లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుండగా ప్రభుత్వ అస్తిత్వానికే ముప్పు ఏర్పడటం హరి యాణా ప్రజానీకానికి మంచి సంకేతం పంపదు. ఎమ్మెల్యేల బేరసారాలు కళ్లముందు స్పష్టంగా కన బడుతుండగా సుదీర్ఘ క్యూ లైన్లలో ఓపిగ్గా నిలబడి వోటేసేంత ఉత్సాహం ఎందరికుంటుంది? వచ్చే అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ కుర్చీలాట మొదలుకావటం వింత. రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనటానికి ఈ సంక్షోభం సంకేతమని కాంగ్రెస్ నాయకుడు హుడా చెబుతున్నారు. నిజానికి జనం అలా అను కోవాలని, లోక్‌సభ ఎన్నికల్లో తమకే పట్టం కట్టా లని ఆయన ఆత్రుత పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులకు ఎవరు పాల్పడినా తప్పే. వేరే రాష్ట్రాల్లో బీజేపీ చేసినప్పుడు విమర్శించిన కాంగ్రెస్ హరియాణాలో అదే పనికి పూనుకోవటం నైతికంగా సరైందేనా? రాష్ట్రపతి పాలన కాంగ్రెస్ ఉద్దేశమని కొందరంటున్నారు. అందుకే మద్దతిస్తా మంటూ జేజేపీ ముందుకొచ్చినా హుడా సాను కూలత చూపలేదని వారి వాదన. లోక్‌సభ ఎన్నికల జంజాటం లేకపోతే కొన్ని గంటల్లోనే బీజేపీ సునాయాసంగా చక్కదిద్దగలిగేది. కేంద్రంలో తాముండగా హరియాణాలో సొంత ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనకు బీజేపీ సిద్ధపడటం కల్ల. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయపై పడింది. బీజేపీకి లబ్ధి చేకూరేందుకు వీలుగా ప్రస్తుత ఎన్నికలు ముగిసేవరకూ సంక్షోభాన్ని కొనసాగించటం మాత్రం మంచిది కాదు. పాలకపక్షం సత్తాపై సంశయం ఏర్పడినప్పుడు నేరుగా అసెంబ్లీలోనే బలపరీక్షకు సిద్ధపడాలని కోరటం అన్నివిధాలా శ్రేయస్కరం. సంక్షోభాన్ని కొనసాగనిస్తే అనారోగ్యకర పరిణా మాలకు చోటిచ్చినట్టవుతుంది. ప్రభుత్వాల బలాబలాలు చట్టసభల్లో తేలాలి తప్ప రాజ్భవన్లలో కాదని చాన్నాళ్ల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ వెంటనే బలపరీక్ష నిర్వహించటం సాధ్యంకాదనిపిస్తే కొంత వ్యవధి తీసుకోవచ్చు. అయితే ఈలోగా రాష్ట్రపతి పాలన విధించటమే ఉత్తమం. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంజాబ్ రైతులతోపాటు హరియాణా రైతులు కీలక పాత్ర పోషించారు. ఇటీవలి రైతు ఉద్యమంలో కూడా వారి పాత్ర తక్కు వేమీ కాదు. రిజర్వేషన్లు కావాలంటూ 2016లో జాట్లు సాగించిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. అది కులాల మధ్య కుంపట్లు రాజేసింది. మరోపక్క ఉపాధి అవకాశాలు కరువై యువ తలో తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఖట్టర్‌ను సీఎం పదవి నుంచి తొలగించి సైనీని ప్రతిష్టించటం జాట్లకు ఆగ్రహం కలిగించిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపు టెత్తుల్లో అధికార, విపక్షాలు రెండూ తలమునకలైతే ఇప్పటికే ఉన్న సమస్యలు రెట్టింపవుతాయి. కనుక ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే కోణంలో కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలి. -
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. -
అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్‌లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్‌ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్‌పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్‌తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్‌ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్‌ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్‌లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్‌లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం. -
గుట్టలుగా... అవినీతి కట్టలు
ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్‌లోని ఆ చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్‌లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్‌లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది. సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్‌లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం. జార్ఖండ్‌లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ. గత డిసెంబర్లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు. అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం. ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు. -
రాయ్‌బరేలీ వ్యూహం
ఎట్టకేలకు ఒక చర్చ ముగిసింది, మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ శుక్రవారం రాయ్‌బరేలీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో ఉత్తర ప్రదేశ్‌లో ఆయన పోటీ చేస్తారా, లేదా అన్న చర్చకు ఫుల్స్టాప్ పడింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతుల్లో ఓటమి పాలైన అమేథీని కాకుండా, ఇటీవల రాజ్యసభకు వెళ్ళేంత వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీని ఆయన ఎన్నుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు రాహుల్ తీసుకున్న నిర్ణయంపై అంచనాలున్నాయి, అనుమానాలూ ఉన్నాయి. ఈ పోటీతో ఎన్నికల వ్యూహంలోనూ, ఇటు విస్తృత రాజకీయ కథనంలోనూ కాంగ్రెస్ పార్టీ గట్టి మార్పు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి దీన్ని ఒక అవకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. అమేథీ స్థానంలో కాకున్నా కుటుంబానికి కలిసొచ్చిన రాయ్‌బరేలీని ఎంచుకోవడం ద్వారా యూపీ ఎన్నికల క్షేత్రంలో పార్టీకి రాహుల్ కొత్త ఉత్సాహం తెచ్చారనుకోవాలి. చిరకాలంగా గాంధీ కుటుంబ వారసులే పోటీ చేస్తున్న కంచుకోట లాంటి అమేథీ స్థానాన్ని... నియోజకవర్గం బాగోగులు చూసే మరో విధేయ నేత కేఎల్ శర్మకు కట్టబెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 ఎన్నికల్లో 17 సార్లు కాంగ్రెస్‌కే జై కొట్టిన స్థానం రాయ్‌బరేలీ. ప్రధాని ఇందిరాగాంధీ మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులకు పట్టం కట్టిన మరో కంచుకోట. అక్కడ పోటీ ద్వారా యూపీలో క్రియాశీలకంగా నిలవడమే కాక, తనపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాహుల్ వీలు చిక్కించుకున్నారు. అయితే, ఆఖరు నిమిషంలో ప్రకటించిన ఈ అభ్యర్థిత్వంతో అనేక సవాళ్ళూ తప్పవు. వాటిని ఎలా అధిగమించి, సంక్లిష్ట సామాజిక – రాజకీయ కోణాలున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లో పట్టు సాధిస్తారన్నది చూడాలి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నంత బలమైన ఎన్నికల యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ప్రస్తుతం కాంగ్రెస్‌కు లేకపోవడం లోటు. వాటిని అధిగమించి, ప్రస్తుత ఉత్సాహాన్ని ఎన్నికల లబ్ధిగా ఎలా మలచగలుగుతారో వేచిచూడాలి. నిజానికి, క్రితంసారి ఉత్తరాదిన కాంగ్రెస్ ఊపు తగ్గినా దక్షిణాదిలో ఉనికి నిలిపిన కేరళలోని వయనాడ్ స్థానమంటే సహజంగానే రాహుల్‌కు ప్రత్యేక అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాదిన హస్తం హవా కొనసాగేందుకు వయనాడ్ భావోద్వేగ బంధంగా ఉపకరిస్తుందని ఆయన ఆలోచన. అందుకే, ఈసారీ ఆయన అక్కడ నుంచి కూడా పోటీ చేశారు. వయనాడ్‌లో రాహుల్ స్థానికేతరుడనీ, యూపీలో గెలిస్తే ఈ స్థానాన్ని వదిలేస్తాడనీ ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నందు వల్లే అక్కడ ఎన్నికలయ్యేంత వరకు తెలివిగా తన రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఆఖరి వరకూ అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ అంశాన్ని సస్పెన్స్‌లోనే ఉంచుతూ, అధికార పార్టీని ఇరుకునపెట్టారు. బీజేపీ సైతం పోటీకి భయపడి రాహుల్ వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారంతో ఒత్తిడి పెంచింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, ముఖాముఖి పోరుకు వెరవడం లేదని నిరూపించేందుకు రాహుల్‌కు ఈ రాయ్‌బరేలీ అభ్యర్థిత్వం ఉపకరించనుంది. హస్తం పార్టీకి రాయ్‌బరేలీ ఎంత అడ్డా అయినా, రాహుల్ పోటీలో రిస్కులూ ఉన్నాయి. యూపీలోని మొత్తం 80 లోక్‌సభా స్థానాల్లో క్రితంసారి 64 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అలవాటైన స్థానం వదిలేసి, సాహసించారు. కానీ, ఆయన ఛరిష్మా, కాంగ్రెస్‌కు చిరకాలంగా ఉన్న స్థానిక సంబంధాలు పనికొస్తాయని భావిస్తున్నారు. అసలు అమేథీలో ప్రియాంక, రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ చేయాలన్న ఆలోచనా ఒక దశలో జరిగింది. కానీ, ప్రతిపక్షం ఆరోపిస్తున్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతికి ఊతమిచ్చినట్టు అవుతుందని దానికి స్వస్తి చెప్పారు. ఇక, అమేథీలో పోటీచేస్తున్న కేఎల్ శర్మ పంజాబ్ నుంచి వచ్చినవారైనప్పటికీ, ఇరుగుపొరుగు స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో గత 30 ఏళ్ళుగా పార్టీ తరఫున పనిచేస్తున్నారు. జనంతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన, స్టార్ అభ్యర్థి స్మృతీ ఇరానీపై గెలుస్తారని కాంగ్రెస్ ఆశ. 1977లో ఇందిరా గాంధీపై రాజ్‌నారాయణ్, గడచిన 2019లో రాహుల్‌పై స్మృతి గెలిచినట్టే, రేపు స్మృతిపై శర్మ గెలవకూడదని ఏమీ లేదు. అధిక సంఖ్యాక ప్రజల మద్దతే కీలకమైన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సదరు వ్యక్తుల, పార్టీల నిర్ణయం. అయితే, దేశంలోని అనేక ప్రధాన సమస్యల కన్నా అమేథీ, రాయ్‌బరేలీలలో రాహుల్ పోటీ చేస్తారా, లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా జాతీయ టీవీ ఛానళ్ళు దీనిపైనే చర్చోపచర్చలు చేయడం విచిత్రం. 1952లో ఫిరోజ్ గాంధీ, తర్వాత ఇందిర, అటుపైన సోనియా, ఇప్పుడు రాహుల్ పోటీతో రాయ్‌బరేలీతో కాంగ్రెస్ బంధం అమేథీ కన్నా పాతది, పట్టున్నది. కానీ, ఇల్లలకగానే పండగ కాదు. సాక్షాత్తూ ప్రియాంక యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ 398 స్థానాల్లో పోటీ చేసినా, రెండంటే రెండింట్లో గెలిచింది. ఇప్పుడు లోక్‌సభకు 17 స్థానాల్లో బరిలో నిలిచింది. అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ రేపు వయనాడ్, రాయ్‌బరేలీ – రెంటిలోనూ రాహుల్ గెలిస్తే, దేన్ని వదులుకోవాలన్నదీ చిక్కే. రాగల రోజుల్లో మరిన్ని విడతల పోలింగ్‌తో ఎన్నికల వేడి పెరిగాక కానీ, యూపీలో రాహుల్ పోటీ తాలూకు సిసలైన ప్రభావమేమిటో అర్థం కాదు. ఒకవేళ పాచిక పారి, రాయ్‌బరేలీలోనే కాక యూపీ అంతటా రాహుల్ ప్రభావం కనిపిస్తే రాజకీయాలు మళ్ళీ మలుపు తిరుగుతాయి. హస్తం పార్టీ ఆశ కూడా అదే! -
వేసవి అభ్యాసం
‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః -
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్‌కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్‌బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్‌బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్‌బుక్‌పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్‌లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్‌లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రగులుతున్న క్యాంపస్‌లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్‌లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్‌కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్‌లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్‌లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్‌యూ, జమియా మిలియా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి. -
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
రానున్న టీ20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు ఎంపిక జరిగింది. అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా జూన్ 2 నుంచి జరిగే పోటీలకు రోహిత్ శర్మ సారథిగా 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్ళను రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ ప్యానెల్ చేసిన ఎంపికలో కొందరు స్టార్ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు. అలాగని, ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన ఎంపికలూ లేవు. విధ్వంసకర బ్యాట్స్ మన్ రింకూ సింగ్‌కు చోటివ్వకపోవడం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయ్ ఇండియన్స్ (ఎంఐ) జట్టు సారథిగా విఫలమైనా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌ను చేయడం విమర్శలకు తావిచ్చాయి. అలాగే, స్పిన్నర్లనేమో నలుగురిని తీసుకొని, జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో ముగ్గురు పేసర్ల బృందానికే పరిమితం కావడమూ ప్రశ్నార్హమైంది. కొంత ఇష్టం, కొంత కష్టం, మరికొంత నష్టాల మేళవింపుగా సాగిన ఈ ఎంపికపై సహజంగానే చర్చ జరుగుతోంది.గత ఏడాదంతా టీ20లలో పాల్గొనకపోయినా సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీలకు సెలక్షన్ ప్యానెల్ పెద్దపీట వేసింది. నాలుగు గ్రూపుల్లో 20 జట్లతో, మొత్తం 55 మ్యాచ్‌లు సాగే ఈ స్థాయి భారీ పోటీలో, అమెరికాలోని అలవాటు లేని పిచ్‌లలో సీనియర్ల అనుభవం అక్కరకొస్తుందని భావన. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అబ్బురపరిచేలా ఆడుతున్న వికెట్‌కీపర్ – బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఎంపికతో గత రెండు వరల్డ్‌కప్‌లలో లేని విధంగా మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ ఆప్షన్ జట్టుకు దక్కింది. ఈసారి ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తూ, రాజస్థాన్ రాయల్స్‌ను అగ్రపీఠంలో నిలిపిన సంజూ శామ్సన్‌కు జట్టులో స్థానం దక్కింది. వెరపెరుగని బ్యాటింగ్‌తో, అలవోకగా సిక్స్‌లు కొట్టే అతడి సత్తాకు వరల్డ్ కప్ పిలుపొచ్చింది. మిడిల్ ఆర్డర్లో అతడు జట్టుకు పెట్టని కోట. స్పెషలిస్ట్ వికెట్ కీపర్లుగా శామ్సన్, పంత్‌లను తీసుకోవడంతో కె.ఎల్. రాహుల్‌కు మొండి చేయి చూపక తప్పలేదు. ఒకప్పుడు ఎగతాళికి గురైన ముంబయ్ కుర్రాడు శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో మిడిల్ ఆర్డర్లో సిక్సర్ల వీరుడిగా, ప్రస్తుతం భారత వరల్డ్ కప్ టీమ్‌లో కీలక భాగస్వామిగా ఎదగడం గమనార్హం.క్లిష్టమైన వేళల్లో సైతం బ్యాటింగ్ సత్తాతో జట్టును విజయతీరాలకు చేర్చే సత్తా, స్వభావం ఉన్న ఆటగాడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాతికేళ్ళ రింకూ సింగ్‌కు పేరు. అయితే, ఏ స్థానంలో ఆడించా లని మల్లగుల్లాలు పడి, చివరకు ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్‌కు జట్టులో చోటే ఇవ్వలేదు. రిజర్వ్ ఆట గాడిగా మాత్రం జట్టు వెంట అమెరికా, వెస్టిండీస్‌లకు వెళతాడు. పరుగుల సగటు 89, స్ట్రయిక్‌రేట్ 176 ఉన్న రింకూ లాంటి వారికి తుది జట్టులో స్థానం లేకపోవడం తప్పే. ఈ ఏడాది ఐపీఎల్లో బాగా ఆడుతున్న స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు జట్టులోకి మళ్ళీ పిలుపు వచ్చింది. అయితే, నలు గురు స్పిన్నర్లతోటి, అందులోనూ ఇద్దరు ముంజేతితో బంతిని తిప్పే రిస్ట్ స్పిన్నర్లతోటి బరిలోకి దిగడంతో మన బౌలింగ్ దాడిలో సమతూకం తప్పినట్టుంది. ప్రధాన పేసర్లు ముగ్గురే కావడం, బౌలింగ్‌లో హార్దిక్ ఫామ్‌లో లేకపోవడం, సీఎస్కేలో శివమ్‌కు గతంలో బౌలింగ్ ఛాన్స్ ఆట్టే రాకపోవడంతో టీ20 వరల్డ్ కప్‌లో మన పేసర్ల విభాగం బలహీనంగా కనిపిస్తోంది. వివరణలేమీ ఇవ్వకుండానే మే 23 వరకు ఈ ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకొనే అవకాశం సెలక్టర్లకుంది. కానీ, ఫైనల్ 15 మందిని మార్చడానికి అగర్కర్ బృందం ఇష్టపడుతుందా అన్నది అనుమానమే. అది అటుంచితే, 2007 తర్వాత భారత్ టీ20 టైటిల్స్ ఏవీ గెలవలేదు. నిజానికి, ధోనీ సారథ్యంలోని యువకుల జట్టు 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన తీరు మన క్రికెట్లో కొత్త మలుపు. టీ20లకు భారత్ అడ్డాగా మారిందంటే దాని చలవే. ఆ వెంటనే 2008లో ఐపీఎల్ ఆరంభంతో కథే మారిపోయింది. ఇవాళ ప్రతి వేసవిలో పేరున్న అంతర్జాతీయ ఆటగాళ్ళు భారత్‌కు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్స్ వచ్చినా, ఐపీఎల్‌దే హవా. ఇంతవున్నా 2014లో ఒక్కసారి శ్రీలంకతో ఫైనల్స్‌లో ఓడినప్పుడు మినహా ఎన్నడూ విజయం అంచుల దాకా మనం చేరింది లేదని గమనించాలి. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. యువ ప్రతిభను ప్రోత్సహించడం, ఆటకు తగ్గ ఆటగాళ్ళను ఎంచుకోవడమనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే కష్టం. ఆ సూత్రాన్ని పాటించడం వల్లే 2007లో మనకు కప్పు దక్కిందని గుర్తుంచుకోవాలి.గమనిస్తే, దశాబ్దిన్నర పైగా క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. మిగతావాటి కన్నా టీ20లు పాపులరయ్యాయి. బంతిని మైదానం దాటించే బ్యాటింగ్ విధ్వంసాలు, స్కోర్ బోర్డ్‌ను పరి గెత్తించే పరుగుల వరదలు, మైదానంలో మెరుపు లాంటి ఫీల్డింగ్ ప్రతిభలు సాధారణమై పోయాయి. టెస్ట్, వన్డే క్రికెట్లు సైతం తమ పూర్వశైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగానే కాక అనేక విధా లుగా వాటిని టీ20 మింగేసే పరిస్థితీ వచ్చింది. బ్యాట్స్మన్ల వైపు మొగ్గుతో ఈ పొట్టి క్రికెట్ పోటీలు బౌలర్లకు నరకంగా మారి, ఆటకు ప్రాణమైన పోటీతత్వాన్ని హరిస్తున్నాయి. అందుకే, 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏటికేడు క్రమంగా మునుపటి ఆసక్తినీ, ఆదరణనూ కోల్పోతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌ల తయారీ మొదలు టీ20 ఫార్మట్‌లో, ఐపీఎల్లో కొన్ని నియమ నిబంధనల సవరణ దాకా అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపిరులూదాలి. టీ20 వరల్డ్ కప్‌లో విజయం సాధించాలంటే ఆటలోనే కాదు... ఎంపికలోనూ దూకుడు అవసరం. రిస్క్ లేని సేఫ్ గేమ్‌తోనే పొట్టి క్రికెట్లో కప్పు కొట్టగలిగితే అది ఓ కొత్త చరిత్ర! -
సత్యానికి సవాల్!
కంటికి కనిపిస్తున్నదంతా నిజమేనా? ఏది సత్యం? ఏదసత్యం? వేసవి తాపానికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారపు వేడి ఎక్కువై, నేతలు పరస్పరం మాటల ఈటెలు విసురుకుంటున్న వేళ... కృతిమ మేధ (ఏఐ) సాయంతో ఇష్టారాజ్యపు మార్పుచేర్పుల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచార మవుతున్నందున... ఇప్పుడు అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. సాక్షాత్తూ కేంద్ర హోమ్‌మంత్రి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడినట్టు మరో వీడియో ప్రత్యక్షమవుతుంది. మరో ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ కాశీలోని గంగాతీరంలో తన పుణ్యక్షేత్ర దర్శనానుభూతిని పంచుకుంటే ఆ మాటలు మోదీ, బీజేపీలకు మద్దతు పలికినట్టుగా నకిలీ వీడియోలో మారిపోతాయి. ఇదీ వర్తమాన ఎన్నికల్లో రాజకీయ వీడియోల వైచిత్రి. గడచిన 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు వాట్సప్ యూనివర్సిటీల్లో తప్పుడు సమాచారం వీరవిహారం చేస్తే, ఈసారి ఏఐ ఆధారిత విశ్వామిత్ర సృష్టి వీడియోలు నేతలకూ, ఓటర్లకూ సరికొత్త సవాళ్ళు విసురుతున్నాయి. నాటి ఐటీ బాట్ల నుంచి నేటి ఏఐ డీప్‌ఫేక్‌ల దాకా మన ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తి వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయింది.తాజాగా ఈ నకిలీ వీడియోల సెగ అధికార బీజేపీ నేతలకు గట్టిగానే తగిలింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్‌షాలు ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే అందుకు నిదర్శనం. రిజర్వేషన్ల అంశంపై హోమ్ మంత్రి అనని మాటలను అన్నట్టుగా మార్చి చూపించిన ఫేక్ వీడియో ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారమైంది. సంచలనం రేపింది. తమతో సహా పలువురు బీజేపీ నేతల నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి, శాంతియుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయ డానికి ప్రతిపక్షాల వారు ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఆరోపించారు. ఎన్నికల వేళ పెద్ద తల నొప్పిగా మారిన ఈ అబద్ధపు వీడియోల వ్యాప్తిపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పోలీసులకూ ఫిర్యాదు చేసింది. అమిత్‌షాకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారనే ఆరోపణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వడంపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తోంది. మరోపక్క ఈ వీడియో వ్యవహారంపై అసోమ్‌లో ఒకరితో పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మంత్రం ఆశించినంతగా ఫలించడం లేదనీ, ‘ఈసారి 400 సీట్ల పైనే’ (అబ్ కీ బార్ 400 పార్) అన్న బీజేపీ నినాదం మంచి కన్నా చెడు చేస్తోందనీ ఒక విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో ఈ డీప్ ఫేక్ వీడియోలు మరిన్ని వర్గాలను అధికార పార్టీకి దూరం చేసే ప్రమాదం లేకపోలేదు. అయితే, ఈ నకిలీ వీడియోల ముప్పు అధికార పార్టీకే కాదు... ప్రతిపక్షం సహా అన్ని పార్టీలకూ ఉంది. ఇంకా చెప్పాలంటే, గడచిన 2019 ఎన్నికలు ‘సోషల్ మీడియా ఎన్నిక’లైతే, ఈ 2024 ఎన్నికలు ‘ఏఐ యుగపు ఎన్నికల’ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సగటు ఓటరుకు మునుపెన్నడూ లేనంతగా తప్పుడు సమాచారమందే ప్రమాదం ఈసారి పెరిగింది. చేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చిన స్మార్ట్‌ఫోన్‌లో వస్తున్నదంతా నిజమని నమ్మే ధోరణిని మార్చుకోక పోతే కష్టమే. వాట్సప్ సహా వివిధ మాధ్యమాల్లో షేర్ అవుతున్న వాటిలో ఏది అసలో, ఏది ఏఐతో మార్చిన నకిలీయో తెలుసుకోవడం తెలీక సామాన్యులు మోసపోయే ప్రమాదం మరీ ఎక్కువైంది. గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రచారాలు లేకపోలేదు. కాకపోతే ఫలానా వర్గం ఎక్కువ మంది పిల్లల్ని కంటోంది, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలను సైతం లాగేసుకుంటుంది లాంటి మాటలు ఈ తడవ మాత్రమే ఏలికల నోట విని పిస్తున్నాయి. సాంకేతికత వెర్రితలలు వేయడంతో ఈసారి మరింత చిక్కొచ్చి పడింది. మొత్తం మన రాజకీయ సమాచార ప్రసార, ప్రచారాలు శరవేగంతో మారిపోయాయి. 2019 ఎన్నికల ముందు మన ‘జనగణమన’ను ప్రపంచ అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందనే మెసేజ్ వాట్సప్‌లో తెగ తిరిగితే... ఇప్పుడు జనరేటివ్ ఏఐ సాయంతో మోదీ పెదాల కదలికకు అచ్చు గుద్దినట్టు సరిపోయేలా మూడు భాషల్లో ఆయన ప్రసంగపు యూట్యూబ్ షార్ట్ వంతు వచ్చింది. జనాన్ని ఎలాగోలా బురిడీ కొట్టించి, బుట్టలో వేసుకోవాలనే తపన, తాపత్రయం గడచిన అయి దేళ్ళలో కొత్త పుంతలు తొక్కింది. నిజానికి, సోషల్ మీడియా సంస్థలు సైతం ఫేక్ న్యూస్, ప్రాపగాండాలను అరికట్టడానికి కిందా మీదా పడుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ డీప్‌ఫేక్‌ను అడ్డుకొనేందుకు ప్రస్తుత చట్టాలను నవీకరించేందుకు భారత ప్రభుత్వమూ ప్రయత్నిస్తోంది. ఓట్లు, సీట్లు, అధికారమే పరమావధిగా మారిన కాలంలో ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తోంది. ఆన్లైన్ అసత్య ప్రచారాన్ని సైతం ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా అందరూ అనుసరిస్తున్న రోజులొచ్చిపడ్డాయి. సమాచారాన్ని వైరల్ చేసే బాట్లకు ఇప్పుడు విశ్వామిత్ర సృష్టి జనరేటివ్ ఏఐ కూడా జతపడేసరికి అగ్నికి ఆజ్యం తోడైంది. ఉచితంగా, కాదంటే కారుచౌకగా ఏఐ సహా రకరకాల ఉపకరణాలు అందుబాటులోకి రావడం ఆకతాయిలకూ వరమైంది. ఓ డీప్‌ఫేక్ వీడియో సృష్టికి మూడేళ్ళ క్రితం పది రోజులు పడితే, ఇప్పుడు మూడు నిమి షాల్లో చేయగలుగుతున్నారు. ఇవన్నీ సత్యాన్వేషణలో నేటి సవాళ్ళు. ఎన్నికల్లో అనియంత్రిత ఏఐ వినియోగానికి తక్షణం అడ్డుకట్ట వేయకుంటే అనర్థం తప్పదు. నేతలు, జర్నలిస్టులు, నటీనటులు ప్రధాన లక్ష్యంగా సాగుతున్న విషం చిమ్ముడుకు విరుగుడు వెతకాలి. లేదంటే, వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. యావత్ సమాజం, ప్రజాస్వామ్యం నకిలీలతో నిండిపోతుంది. -
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
దేశమంతా నివ్వెరపోయిన వివాదం ఇది. ఘన కుటుంబ వారసత్వం... దేశంలోని అత్యున్నత ప్రజా ప్రాతినిధ్య వేదికైన పార్లమెంట్లో సభ్యత్వం... ఇవేవీ మనిషిలోని మకిలినీ, మృగాన్నీ మార్చలేక పోయిన విషాదం ఇది. మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడూ, ఆయన తదనంతరం కర్ణాటకలో హసన్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన యువకుడూ అయిన ప్రజ్వల్ రేవణ్ణ నిస్సహాయులైన పలువురు స్త్రీలతో సాగించిన బలవంతపు లైంగిక చర్యల వ్యవహారం సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది. ఏప్రిల్ 26 నాటి లోక్‌సభ పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఆ వికృత వీడియోలు వందల కొద్దీ బయటకు రావడం సొంత కుటుంబపార్టీ జేడీ(ఎస్)ను సైతం ఆత్మరక్షణలో పడేసింది. అన్నిటికీ మించి సామాన్యులకు రక్షకులమంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే చివరకు భక్షకులుగా తయారవుతున్న రాజకీయ విలువల పతనానికి ఈ వ్యవహారం మరో నగ్నసాక్ష్యంగా నిలిచింది. 2019 నుంచి 2022 మధ్య పలుమార్లు తనను ప్రజ్వల్ రేవణ్ణ లైంగికంగా బలవంతం చేశారంటూ బాధితురాలు ఒకరు ఆరోపించారు. పనివారి నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగినుల దాకా పలువురితో ఈ మాజీ ప్రధాని మనుమడు ఇంట్లో, ఆఫీసులో ఇలానే వ్యవహరించారట. వాటిని స్వయంగా రికార్డ్ చేసి, బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారట. దాదాపు 3 వేల వీడియోలతో కూడిన ఆ వికృత చర్యల పెన్‌డ్రైవ్ ఇప్పుడు బయటపడింది. నిజానికి, ప్రజ్వల్ అకృత్య వీడియోల కథ కొత్తదేమీ కాదు. ఆయన వీడియోలు అనేకం కొన్నేళ్ళ క్రితమే బయటకొచ్చాయి. వాటి ప్రచురణ, ప్రసారాల్ని అడ్డుకొనేందుకు ఈ 33 ఏళ్ళ యువనేత అప్పట్లోనే కోర్టుకెళ్ళారు. మీడియా చేతులు కట్టేస్తూ హైకోర్టు నుంచి నిషేధపుటుత్తర్వులు తెచ్చుకున్నారు. తీరా ఇప్పుడు ఓ బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో మరోసారి తేనె తుట్టె కదిలింది. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొంది. ఈ మురికి చేష్టల కేసుపై ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ప్రజ్వల్ వివాదంలో రాజకీయాలున్నాయనే మాట వినిపిస్తున్నది అందుకే!వీడియోలు అయిదేళ్ళ పాతవనీ, బాధిత మహిళలకు న్యాయం చేసే ఉద్దేశమే నిజంగా ఉంటే, ఈ పార్లమెంట్ సభ్యుడి లైంగిక దుష్ప్రవర్తనపై సాక్ష్యాలు చాలాకాలంగా ఉన్నా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రస్తుత ఎన్నికల సమయంలోనే ఈ అస్త్రం ఎందుకు బయటకు తీసింది? ఇవీ బీజేపీ ప్రశ్నలు. బాధితురాలు కేసు పెట్టడం, వీడియోల వివాదాన్ని మీడియా బట్టబయలు చేయడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నది అధికార కాంగ్రెస్ జవాబు. ఆరోపణల పర్వమెలా ఉన్నా, నిందితుడు ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జెడీ(ఎస్), అలాగే దానితో పొత్తుపెట్టుకున్న బీజేపీలు నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పలేదు. బీజేపీ అగ్రనేత – సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం ఈ వివాదాస్పద వీడియోలను ఖండిస్తూ, నారీశక్తినే తాము బలపరుస్తున్నామని మంగళవారం వివరణనివ్వాల్సి వచ్చింది. ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణ విడిగా ఉంటారనీ, తమ కుటుంబంతో సంబంధం లేదనీ నిందితుడి బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి అనాల్సి వచ్చింది. ఈ సెక్స్ వీడియోల వివాదం ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా చూడాలనే తాపత్రయం తెలుస్తూనే ఉంది. చివరకు, ‘సిట్’ దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించడం అనివార్యమైంది. ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏదో నూటికో, కోటికో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. రాజకీయ బలిమిని చూసుకొని కన్నూమిన్నూ కానని కొందరు... బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడుతున్న కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ బడాబాబులు అధికారాన్నీ, హోదానూ అడ్డుపెట్టుకొని ఈ కేసుల నుంచి ఒంటి మీద దుస్తులు నలగకుండా బయటకు వచ్చేస్తున్నారు. మహిళా రెజ్లర్లతో లైంగికంగా అనుచిత రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ కేసు అంతర్జాతీయంగానూ వార్తల్లో నిలిచినా, ఇప్పటి దాకా అతీగతీ లేదు. బాధితులకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. సందీప్ సింగ్, ఖజన్ సింగ్ లాంటి పలువురు నేతల కేసుల కథ కూడా అంతే. గమ్మత్తేమిటంటే, గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్వల్ హైకోర్ట్ ‘గ్యాగ్’ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని, దర్జాగా గడిపేశాడు. సిగ్గుమాలిన నేరచర్యలు యథేచ్ఛగా కొనసాగించాడు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టడంతో కష్టాలు తప్పలేదు. పోలింగైన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఉడాయించాడు. ప్రజ్వల్ వ్యవహారశైలి, అతని వీడియోల పెన్‌డ్రైవ్‌పై స్థానిక బీజేపీ నేత ఒకరు గత డిసెంబర్లోనే తన పార్టీని అప్రమత్తం చేశారు. జేడీ(ఎస్)తో పొత్తునూ, హసన్‌లో ప్రజ్వల్ అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించారు. అన్నీ తెలిసినా బీజేపీ ముందుకెళ్ళి పొత్తు కొనసాగించడం, ప్రజ్వల్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినాయకత్వం స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరం. నారీశక్తికి వందనమంటూ కబుర్లు చెప్పి, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తంటాలు పడే పార్టీలు, ప్రతినిధులు ఆడ వారికి ఇస్తున్న అసలైన గౌరవం అంతంత మాత్రమే. పితృస్వామ్య భావజాలంతో స్త్రీని భోగ వస్తువుగా చూసే సంస్కృతి నుంచి ఇవాళ్టికీ మన సమాజం, నేతలు బయటపడనే లేదన్న చేదు నిజం పదే పదే రుజువవుతోంది. చివరకు తాజా లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం సైతం 15 శాతం లోపలే అన్నది మన మహిళా సాధికారత మాటల్లోని డొల్లతనానికి నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అధికారం మాటేమో కానీ, ముందుగా వారిని సుఖభోగ యంత్రాలుగా భావించడం మాని, మనుషులుగా గుర్తించాలి. ప్రజ్వల్ సహా కళంకిత నేతల్ని కఠినంగా శిక్షించడం ఆ క్రమంలో తొలి అడుగు. -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
ఆ పేరే.... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్‌ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్‌కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్‌గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్‌ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్‌లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్‌లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆ పేరే... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్‌ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్‌కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్‌గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్‌ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్‌లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్‌లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈవీఎం వివాదం చల్లారేనా!
సార్వత్రిక ఎన్నికల రెండో దశ కూడా పూర్తికావస్తుండగా శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వినియోగంపై వచ్చిన వ్యాజ్యాలను తోసిపుచ్చింది. విపక్షాలను విమర్శించటానికీ, ఆరోప ణలు సంధించటానికీ వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోని ప్రధాని నరేంద్ర మోదీ... ఇంకా అయిదు దశల పోలింగ్ జరగాల్సిన తరుణంలో మౌనంగా ఎందుకుంటారు? అందుకే కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టన్నారు. ఈవీఎంలపై సందేహాలు రేకెత్తించిన పాపానికి క్షమాపణలు చెప్పాలని కూడా మోదీ డిమాండ్ చేశారు. దేన్నయినా సందేహించటం దానికదే పాపం కాదు. పాపమే అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ సహా దాదాపు అందరికందరూ ఆ పాపం చేసినవారే. ఒకటి రెండు పార్టీలు మినహాయిస్తే పరాజితుల ప్రథమ కోపం ఎప్పుడూ ఈవీఎంలపైనే. వరసగా 2004, 2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు బీజేపీ ఈవీఎంలనే తప్పుబట్టింది. 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది. హ్యాకర్ల ద్వారా ఈవీఎంల సోర్స్ కోడ్ మార్చి అకాలీదళ్ తమ విజయాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఇక యూటర్న్ల సిద్ధ హస్తుడైన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకైతే ఇలాంటి ఆరోపణలు మంచినీళ్లప్రాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు ఈవీఎంలపైనే ఆయన ఆగ్రహం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినప్పుడు మాత్రం చప్పుడు చేయలేదు. మళ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాక ఈవీఎంలపై వీరంగం వేశారు. మధ్యలో ఈవీఎంలు దొంగిలించిన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి వాటిని తారుమారు చేయొచ్చని చూపించే ప్రయత్నం చేసింది కూడా చంద్రబాబే. మళ్లీ ఎన్డీఏ పంచన చేరినందువల్ల ఈవీఎంల వివాదంపై ఇప్పుడాయన కిక్కురుమనటం లేదు. ఇతరుల మాటెలావున్నా ప్రస్తుతం ఈవీఎంల వినియోగాన్ని సవాలు చేసిన సంస్థల్లో విశ్వసనీయతగల అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ కూడా వుంది. కనుక ఈవీఎంలను సందేహించటం స్వప్రయోజనాల కోసమేనని భావించలేం. అదో పెద్ద నేరంగా పరిగ ణించలేం. అలాగని పేపర్ బ్యాలెట్ విధానం సవ్యంగా సాగిందా? పోలింగ్ బూత్‌లు చేజిక్కించు కుని, బ్యాలెట్ పేపర్లు గుంజుకుని తమ గుర్తుపై ముద్రలు వేసుకుని పెత్తందారులు చెలరేగిపోలేదా? రిగ్గింగ్ ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు రీపోలింగ్ జరపక తప్పలేదు! ఈవీఎంల వల్ల ఈ జాడ్యం ఎంతో కొంత కట్టడి అయింది. నిమిషానికి కేవలం అయిదు ఓట్లు మాత్రమే వాటిల్లో నమో దయ్యే అవకాశం వుండటం వల్ల పోలింగ్ కేంద్రాలు ఆక్రమించిన దుండగులకు గతంలోని వెసులు బాటు పోయింది.వెనువెంటనే బలగాలు ఆ పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవ కాశం వుండటం వల్ల వారి ఆటలు సాగటం లేదు. 1982లో తొలిసారి ఈవీఎంలతో కేరళలో ఒక ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే తగిన చట్టం లేకుండా ఈవీఎంల వినియోగం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసింది. 1998లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కేవలం కొన్ని నియోజక వర్గాల్లో 45 ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈవీఎంలపై తరచు ఫిర్యాదులు వస్తున్నందువల్ల వాటికి ప్రింటర్లను అనుసంధానించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరిమితంగా దాన్ని అమలు చేసినా... ఆ తర్వాత కాలంలో వీవీ ప్యాట్ల పూర్తిస్థాయి వినియోగం మొదలైంది. ఓటరు తనకు నచ్చిన గుర్తుకు ఓటేసిన వెంటనే ప్రింటర్‌పై ఆ పార్టీ పేరు, గుర్తు ఏడు సెకన్లపాటు కనబడే ఏర్పాటుచేశారు. ఆ వెంటనే ఒక స్లిప్పై అది ప్రింటయి దానికి అనుసంధానించిన బాక్స్‌లో పడుతుంది. పోలింగ్ సమయంలోనైనా, కౌంటింగ్ సమయంలోనైనా ఈవీఎంలను దేనితోనూ అనుసంధానించటం సాధ్యంకాదని... రిమోట్ కంట్రోల్, బ్లూటూత్, వైఫైలతో నియంత్రించటం కూడా అసాధ్యమని ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన బెంగళూరు బెల్, హైదరాబాద్ ఈసీఐఎల్ వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. పోలింగ్‌కు ముందు ఈవీఎంల తనిఖీకి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. చిత్రమేమంటే ఈ ప్రక్రియపై ఓటర్లనుంచి ఎప్పుడూ ఫిర్యాదులు లేవు. ఇప్పుడు మళ్లీ బ్యాలెట్ పేపర్‌కు మళ్లాలన్న వినతిని తోసిపుచ్చటంతోపాటు వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లే తీసుకునేలా, పరిశీలించుకున్నాక వారే బ్యాలెట్ బాక్స్‌లో వేసేలా చూడాలన్న కోరికను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈవీఎంల ద్వారా వెల్లడయ్యే ఓట్ల సంఖ్యనూ, వీవీప్యాట్ స్లిప్‌లనూ లెక్కించి రెండూ సరిపోలినప్పుడే ఫలితం ప్రకటించాలన్న పిటిషనర్ల వినతిని కూడా తిరస్కరించింది. అయితే పార్టీల గుర్తులను కంప్యూటర్ ద్వారా ఈవీఎంలలో లోడ్ చేయటానికి ఉప యోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను ఎన్నికల పిటిషన్లు పడిన సందర్భాల్లో పరిశీలించేందుకు అనువుగా 45 రోజులు భద్రపరచాలని ఆదేశించింది. అంటే ఇకపై ఈవీఎంలతో పాటు ఎస్ఎల్యూలు కూడా సీల్ చేసివుంచటం తప్పనిసరి. అలాగే రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఫిర్యాదుచేస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ 5 శాతం ఈవీఎంలనూ, ఎస్ఎల్యూలనూ ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చు. అయితే ఫలితాలొచ్చిన ఏడు రోజుల్లో ఫిర్యాదులు చేయాలి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్‌లు లెక్కించే యంత్రాలు సమకూర్చుకునే ఆలోచన చేయాలని ఈసీని కోరింది. ఏదేమైనా బాహాటంగా బయట పడిన సంద ర్భాలుంటే తప్ప ఈవీఎంలపై అనవసర రాద్ధాంతానికి ముగింపు పలకటం అవసరం. ఇందుకు బదులు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవటం ఎలా అన్న అంశంపై పార్టీలు దృష్టి సారించాలి. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్‌లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్‌లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
మానవతకు 200 రోజుల మచ్చ
ఒకటీ, రెండూ కాదు... ఆరు నెలలు దాటింది. మంగళవారంతో ఏకంగా రెండు వందల రోజులు గడిచిపోయాయి. అయినా, పాలెస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. సంక్షోభానికి పరిష్కా రమూ కనిపించడం లేదు. సామూహిక సమాధులు, కూలిన ఆస్పత్రులు, శిథిలాల కుప్పగా మారిన భవనాలు, ప్రాణాలు పోయిన వేలాది జనం, ప్రాథమిక వసతులు పూర్తి విధ్వంసంతో పాలెస్తీనా బావురుమంటోంది.తీవ్రవాద హమాస్ బృందం తమపై ఆకస్మికంగా దాడి చేసి, 250 మందిని బందీలుగా చేసుకొని, 1200 మంది ప్రాణాలు తీసినందుకు బదులుగా గత అక్టోబర్ 7న సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 85 శాతం మంది ఇళ్ళు వదిలి పారిపోయారు. హమాస్ ఏరివేతకని చెబుతూ మొదలుపెట్టిన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో ఇప్పటికి 14 వేల పైచిలుకు పసిపిల్లలతో సహా 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క. నిజానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని సహాయక సంస్థల అంచనా. గాజా భూఖండపు ఉత్తర ప్రాంతంపై ఇటీవల ఎన్నడూ లేనంతగా శతఘ్నుల వర్షం కురిపిస్తూ, అక్కడ నుంచి జనాల్ని ఖాళీ చేయమంటున్న ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంత ప్రధాన నగరమైన రాఫాపై దాడికి సర్వసన్నద్ధమవుతుండడం తాజా విషాద పరిణామం. పశ్చిమాసియాలోని ఈ సంక్షోభం అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇరాన్ సైతం ఇటీవల ఇజ్రాయెల్‌తో ఢీ అనడం పర్యవసానాలపై ప్రపంచం భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది. పాలెస్తీనా శరణార్థులకు ఉద్దేశించిన ఐరాస సహాయ సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) ఉన్నా దానికిప్పుడు నిధులు లేని దుఃస్థితి.ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి ఆ సంస్థ సిబ్బంది కొందరు సహకరించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దాంతో ఆ సంస్థకు సహాయం అందిస్తున్న 16 దాతృత్వ దేశాలు నిధులు నిలిపివేశాయి. పర్యవసానంగా 45 కోట్ల డాలర్ల మేర నిధుల లోటు ఏర్పడి, వేలాది పాలెస్తీనియన్లు ఈ యుద్ధకాలంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్వి నిరాధార ఆరోపణలని స్వతంత్ర పరిశీలనలో ఈ వారమే తేలింది. అమెరికా సహా ఇతర దేశాలు మానవతా అవసరంగా గుర్తించి, నైతిక బాధ్యతతో యూఎన్ ఆర్‌డబ్ల్యూఏకు ఆర్థిక సాయం పునరుద్ధరించాలని అరబ్ లీగ్ తాజాగా డిమాండ్ చేస్తున్నది అందుకే. ఇజ్రాయెల్ భీకర దాడుల అనంతరం గాజాలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద 300కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక భారీ సమాధుల దృశ్యాలు సహజంగానే అంతర్జాతీయ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఇజ్రాయెలీ సైనికుల దాడుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందడానికి సమాధుల్లో కట్టేసిన చేతులతో, వివస్త్రంగా కనిపిస్తున్న శవాలే ప్రత్యక్ష సాక్ష్యం. అనుమానాలకు తావిస్తున్న ఈ సమాధులపై పారదర్శకంగా, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస ఇప్పటికే డిమాండ్ చేసింది.యూరోపియన్ యూనియన్ సైతం బుధవారం అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆగని ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బాధిత పక్షం వైపు అంతర్జాతీయంగానూ క్రమంగా మొగ్గు కనబడుతోంది. పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమే ప్రస్తుత సమస్యకు సత్వర పరిష్కారమని భావిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గాజా సమస్య అంతకంతకూ మానవతా సంక్షోభంగా పరిణమిస్తుండడంతో తాజాగా జమైకా ప్రభుత్వం పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనమనే ఐరాస నియమావళి పట్ల నిబద్ధతే ఈ నిర్ణయానికి ప్రేరణ అని జమైకా పేర్కొంది. ప్రతి 10 నిమిషాలకూ ఓ పసివాడు చనిపోవడమో, గాయపడడమో జరుగుతున్న పాలెస్తీనాలో, ఇప్పటికి కనీసం 75 వేల టన్నుల పేలుడు పదార్థాల తాకిడికి గురై 62 శాతం ఇళ్ళు ధ్వంసమైన భూభాగంలో, ఆహార కరవుతో 11 లక్షల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్న ప్రాంతంలో... సత్వరమే సంక్షోభాన్ని పరిష్కరించి, శాంతి స్థాపన జరపకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఒకప్పటి కీలకపాత్రధారి ఐరాస ప్రస్తుతం మాటలే తప్ప చేతలు లేక చేష్టలుడిగి చూస్తోంది.కాల్పుల విరమణకై ఈ ఆరునెలల్లో ఐరాస 4సార్లు తీర్మా నాలు చేసినా, అవన్నీ అగ్రరాజ్యాలు మోకాలడ్డడంతో వీగిపోవడం దురదృష్టం. ఐరాసలో అండగా నిలవడమే కాక, ఇజ్రాయెల్‌కు ఆయుధాలిస్తున్న అమెరికా ఆ దేశానికి ఇటీవలే 2600 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసి, శరణార్థులకేమో మొండిచేయి చూపడం పెద్దన్న ద్వంద్వనీతికి దర్పణం. గాజా పోరులో అమెరికా అధ్యక్షుడి విధానాలపై స్వదేశంలోనే నిరసనలు పెరిగాయి. పాలెస్తీనాకు అనుకూలంగా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది విద్యార్థులు వీధికెక్కడం విశేషం.పశ్చిమాసియాలో సమస్య పరిష్కారానికి అమెరికా, దాని భాగస్వాములు పాత కథ వదిలి, మళ్ళీ మథనం చేయాలి. భద్రత పరంగా ఇజ్రాయెల్‌కు ఉన్న ఆందోళనల్ని పోగొడుతూనే, పాలెస్తీనా ప్రజల ప్రత్యేక రాజ్య ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యేలా అటు ఇరాన్‌నూ భాగస్వామిని చేసి, శాశ్వత పరిష్కారానికై పాశ్చాత్య ప్రపంచం కృషి చేయాలి.ఇరాన్ సైతం పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కోసం లెబనాన్, గాజా, సిరియా, యెమన్లలో పరోక్ష శక్తులకు ఆయుధాలు సమకూర్చి, అండగా నిలిచే పని మానుకోవాలి. ఇలా పాముల్ని పాలుపోసి పెంచడం ఉద్రిక్తతల్ని పెంచే పాపమని గుర్తించాలి. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది మన ప్రవాసులున్నందు భారత్ సైతం ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో సత్సంబంధాల రీత్యా కీలక భాగస్వాముల్ని ఒక దగ్గరకు చేర్చి, పరిష్కారానికి యత్నించాలి. వాణిజ్యంలో, ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే... ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. -
ఛాంపియన్ దేశం
భారత చదరంగ క్రీడావనికి ఇది మరో శుభవార్త. మన దేశం నుంచి మరో చిచ్చరపిడుగు వచ్చాడు. తెలుగు కుటుంబానికి చెందిన దొమ్మరాజు గుకేశ్ పట్టుమని 17 ఏళ్ళ వయసులో ప్రపంచస్థాయిలో సత్తా చాటాడు. అరంగేట్రంలోనే ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) వారి ‘క్యాండిడేట్స్ 2024’లో గెలిచాడు. అదీ... చదరంగపుటెత్తుల్లో చలాకీతనం చూపుతూ, చులాగ్గా గెలిచాడు. కొద్ది నెలల్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ పోటీలకు ఎన్నికయ్యాడు. 138 సంవత్సరాల ప్రపంచ ఛాంపి యన్షిప్ చరిత్రలోనే చిన్న వయసువాడిగా వరల్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. ఒకవేళ ఆ విశ్వవేదిక పైనా గెలిస్తే, అతి పిన్నవయస్కుడైన వరల్డ్ ఛాంపియన్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఒక్క గుకేశ్ విజయమే కాక భవిష్యత్ ఆశాకిరణాలూ అనేకం ఉండడం గమనార్హం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్, విదిత్, ఆర్. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్‌దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్‌లో టాప్ 25లో అయిదుగురు భారతీయ పురుషులే. ఇక, మహిళల ర్యాకింగ్స్లో టాప్ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్ ర్యాకింగ్స్‌కు వస్తే టాప్ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్ 30 జూనియర్స్ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం. ‘చదరంగంలో భారత్ విశేష కృషి చేస్తోంది. అనతికాలంలో ప్రపంచంలో అగ్రశ్రేణి చదరంగ దేశమవుతుంది’ అని ప్రపంచ మాజీ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ గత ఏడాది వ్యాఖ్యానించారు. ఇప్పుడదే నిజమవుతోంది. నిజానికి, మన దేశంలో చదరంగ క్రీడ ఇంత శరవేగంతో విస్తరించడానికీ, విస్ఫోటనం చెందడానికీ అనేక కారణాలున్నాయి. ఇంటర్నెట్ డేటా ప్యాక్‌లు చౌక కావడం, మొబైల్ ఫోన్లలో సైతం సులభంగా అందుబాటులో ఉన్న చెస్ యాప్‌లు వగైరా వల్ల జనసామాన్యంలో ఈ క్రీడ వేగంగా, బలమైన పునాది వేసుకుంటోందని నిపుణుల విశ్లేషణ. ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని పిల్లలు సైతం మెట్రో నగరాల్లోని అత్యుత్తమ కోచ్‌ల నుంచి ఆన్ లైన్ చెస్ పాఠాలు నేర్చే వీలొచ్చింది. కరోనా అనంతరం ఆన్లైన్ టోర్నమెంట్లు పెరగడం కూడా భారతీయ యువకిశోరాలకు కలిసొచ్చింది. సూపర్ గ్రాండ్ మాస్టర్ల తోనూ, చివరకు ప్రపంచ మాజీ ఛాంపియన్లతోనూ తలపడి అనుభవం, ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించే అవకాశం దక్కింది. అగ్రశ్రేణి క్రీడాకారులు ఆట మానేశాక, కోచ్‌లుగా మారడమూ కొత్త తరానికి వరమైంది.గ్రాండ్ మాస్టర్లు ఆర్బీ రమేశ్ (ప్రజ్ఞానంద, వైశాలికి కోచ్), విష్ణుప్రసన్న (గుకేశ్‌కు కోచ్), శ్రీనాథ్ నారాయణన్ (అర్జున్, నిహాల్ సరీన్‌ల ట్రైనర్), సూర్యశేఖర్ గంగూలీ (విదిత్‌కు కోచ్) లాంటి వారు, వారి శిక్షణలో ఆరితేరిన ఆటగాళ్ళే అందుకు నిదర్శనం. గ్రాండ్ మాస్టర్లు కాకపోయినప్పటికీ, మంచి చదరంగం ఆటగాళ్ళు దాదాపు 50 వేల మందికి పైగా భారత్‌లో ఉన్నారని సాక్షాత్తూ ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) డైరెక్టర్ జనరల్ ఎమిల్ సుతోవ్‌స్కీ అనడం విశేషం. ఇవన్నీ కలసి దేశంలో చదరంగ క్రీడకు సంబంధించిన సువ్యవస్థిత వాతావరణ కల్పనకు దోహదం చేశాయి. ‘ఫిడే’ సహకారంతో టెక్ మహీంద్రా ధనసాయంతో నడుస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ లాంటి టోర్నమెంట్లు సైతం ఆటకూ, ఆటగాళ్ళకూ కొత్త ఉత్సాహం, ఉత్తేజం తెచ్చాయి. వీటన్నిటి ఫలితంగా ఇవాళ 64 చదరపు గడుల ఆటలో భారత్ అపూర్వంగా ముందుకు దూసుకుపోతోంది. ‘ఈ ప్రపంచంలో ఈ క్షణంలో అత్యంత అస్థిరమైనది ఏమిటంటే, చదరంగంలో భారత నంబర్ 1 స్థానం’ అని అజర్‌బైజాన్‌కు చెందిన ఓ గ్రాండ్ మాస్టర్ ఈ ఏడాది జనవరిలో ట్వీట్ చేశారు. ఛలోక్తిగా చెప్పినా, చెస్‌లో నిత్యం కొత్త ప్రతిభావంతులు రంగంలోకి దూసుకువస్తున్న మన దేశంలో ఇప్పుడది అక్షరసత్యం. ఈ ఏడాదిలో ఈ నాలుగు నెలల్లోనే ఆ నంబర్1 కిరీటం మన ఆటగాళ్ళు అయిదుగురి (విశ్వనాథన్ ఆనంద్, గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్) మధ్య ఎప్పటికప్పుడు మారుతూ వచ్చిందంటే మనవాళ్ళలో పెల్లుబుకుతున్న ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. యువజన – క్రీడాశాఖ సమకూరుస్తున్న నిధులు, ఆటగాళ్ళ శిక్షణకు అఖిల భారత చదరంగ సమాఖ్య అందిస్తున్న సహకారం, ప్రైవేట్ సంస్థల సహాయం ప్రతిభను పెంచి పోషించడంలో ప్రధానపాత్ర వహించాయి. ఇవాళ దేశంలో 84 మంది గ్రాండ్ మాస్టర్లు, 124 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, 23 మంది మహిళా గ్రాండ్ మాస్టర్లు, 42 మంది మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారంటే కారణం అదే! దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా రేటింగ్ పొందిన రెగ్యులర్ టోర్నమెంట్ చెస్ ఆటగాళ్ళు న్నారని ఒక లెక్క. ప్రపంచమంతటిలో ఇందరు ప్రతిభావంతులున్నది మన దేశంలోనే! ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ లాంటివారు చిరకాలంగా ఆదర్శంగా నిలవడంతో, ఎంతో మంది చెస్ వైపు ఆకర్షితులయ్యారన్నది నిజం. సమాజంలోని ఆ ధోరణుల్ని గమనించి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగినంత సహాయ సహకారాలు అందించి, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే ఏ క్రీడలోనైనా ఎంతటి అద్భుతాలు చేయవచ్చో భారతీయ చదరంగావని చాటిచెబుతోంది. కఠోర పరిశ్రమతో, కాలగతిలో ఆ ఆటలో ఛాంపియన్ దేశంగా ఆవిర్భవించిన మనం ఈ పాఠాలను ఇతర క్రీడలకూ అనువర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమూ, ఇతర క్రీడా సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తే మన క్రీడాలోకం మరిన్ని శుభవార్తలు అందించడానికి సదా సిద్ధంగా ఉంటుంది! -
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్‌లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్‌లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్‌లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
ప్రమాదపుటంచున...
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ రెండు దేశాల మధ్య నాలుగు దశా బ్దాల పైగా లోలోపల సాగుతున్న కుమ్ములాట బయటపడింది. ముందుగా ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి, ఒక జనరల్ సహా పలువురు సైనికాధికారుల మృతితో అగ్గి రాజుకుంది. ప్రతీకారంగా గత శనివారం ఇరాన్ పంజా విసరడంతో వ్యవహారం ముదిరింది. యుద్ధం ఊసెత్తకపోయినా దెబ్బకు దెబ్బగా టెహరా న్పై తగిన చర్య చేపడుతామంటోంది టెల్ అవీవ్. అసలే అస్థిరతలో మునిగిన పశ్చిమాసియా ఈ శరవేగ పరిణామాలు, వ్యాఖ్యలతో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధంలో చిక్కుకుపోవచ్చు. చాలాకాలంగా ఇరాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలకై పరోక్ష సహకారం అందిస్తూ ప్రాంతీయ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పౌరులపైన, వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఆస్తులపైన ప్రయోగిస్తూ వచ్చింది. అయితే, ఇజ్రాయెల్‌తో ఎన్నడూ నేరుగా ఘర్షణకు దిగలేదు. తెర వెనుక నుంచి తాను చేసినవి ఒప్పుకోనూ లేదు. ఇజ్రాయెల్దీ అదే పంథా. మూడేళ్ళ క్రితం ఇరాన్‌కు చెందిన ముగ్గురు అణుశాస్త్రవేత్తల హత్యలో తన పాత్రను ఆ దేశమూ అంగీకరించ లేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులతో గాజా భూఖండం సంక్షోభంలో పడింది. సదరు హమాస్ దాడుల వెనుక ఇరాన్ పాత్ర గురించి కథలు కథలుంటే, అదే అదనుగా పాలెస్తీనీయుల గాజాను ఇజ్రాయెల్ సమూలంగా ధ్వంసం చేసేసింది. ఐరాస సహా ఎవరెన్ని చెప్పినా నెలల తరబడి ఇజ్రాయెల్ ఆగలేదు, గాజాపై దాడులు ఆపనూ లేదు. ఈ నేపథ్యం నుంచి తాజా ఘటనల్ని చూడాలి. చివరకిప్పుడు ఇరాన్ నేరుగా తన గడ్డ మీద నుంచే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎన్నడూ లేనంతటి ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రయోగించిన 360 క్షిపణుల్లో చాలావాటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్‌ల సహకారంతో ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిగా స్వీయ రక్షణ కోసమే తాము దాడి చేశామనీ, విషయం ఇంతటితో ముగిసిందనీ ఇరాన్ అంటోంది. ఇక, క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నందున సంయమనం పాటించి, పరిస్థితి ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా చూడాలని అమెరికా సహా ఇతర మిత్రదేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అభ్యర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరేనన్నట్టు ఉంటూనే, ఇరాన్‌కు తగిన బదులిస్తామంటోంది. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్‌లు దేనికది మధ్యప్రాచ్యంలో తమదే పై చేయి అని చూపేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగమే రెండు దేశాలూ ఇప్పుడు దాదాపు నేరుగా కయ్యానికి దిగడం! పశ్చిమాసియాలో పరిస్థితికి ఇరు దేశాల బాధ్యతా ఉంది. ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా పాలెస్తీనా భూభాగాల్ని బలవంతాన దిగ్బంధించి, కథ నడుపుతుంటే ప్రపంచపు పెద్దన్నలెవరూ ఎన్నో ఏళ్ళుగా పెదవి విప్పలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. నిరుడు హమాస్ దాడితో ఇజ్రాయెల్ అహం దెబ్బ తిని, గాజాలో సామూహిక ఊచకోతకు దిగినప్పుడూ అమెరికా సహా ఎవరూ దాన్ని ఆపలేక పోయారు. ఇరాన్ సంగతికొస్తే, అదీ ఇష్టానుసారం వ్యవహరించింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటివన్నీ అది పరోక్షంగా పోషిస్తున్న పాములే. కొన్నేళ్ళుగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ పరోక్ష సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ తీవ్ర వాద మూకలను నిలువరించడమే ఇజ్రాయెల్, అమెరికాల పని అయింది. వెరసి, ఇరాన్, ఇజ్రాయెల్‌ల తప్పిదాలు, స్వార్థంతో పక్కన చేరిన దేశాలతో పశ్చిమాసియా చిక్కుల్లో పడింది. తాజా ఘటనలతో యుద్ధం అంచున నిల్చుంది. ప్రతి యుద్ధం ప్రపంచంలో అనిశ్చితిని పెంచేదే. మరీ ముఖ్యంగా, ప్రపంచానికి ఇంధన భాండా గారం లాంటి పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారితే ఇక చెప్పేదేముంది! తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొన్నది అందుకే! వ్యవహారాన్ని తెగేదాకా లాగి, ప్రపంచం రెండు శిబిరాలుగా చీలితే కష్టం. ఇరాన్ దాడితో పని లేకుండా గాజాలో యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అంటే, ఇరాన్ – ఇజ్రాయెల్ సంక్షోభం ముగియనే లేదని స్పష్టమవుతోంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం బరిలోకి దిగి, ముందు గాజాలో దాడులు, పాలెస్తీనాలో అమాయక పౌరుల మరణాలు ఆగేలా చూడాలి. ఇజ్రాయెల్‌కు 66 శాతం మేర ఆయుధాలిస్తున్న అమెరికా, అలాగే ఇతర ఆయుధ సరఫరా దేశాలు తమ సరఫరాలు తగ్గించగలిగితే మేలు. అంతకంతకూ అంతర్జాతీయంగా తాను ఒంటరి అవుతున్నానని ఇజ్రాయెల్ గుర్తించాలి. ‘అబ్రహమ్ ఒడంబడికల’ ద్వారా మితవాద అరబ్ దేశాలు నెయ్యానికి ముందుకు రావడంతో దానికి కలి గిన ప్రయోజనం పోతుంది. అయినా, ఇంతకు ముందు, ఇకపైన కూడా మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండు ప్రధాన సైనిక శక్తులు. ఇరుపక్షాలూ లక్ష్మణరేఖ దాటాయి. వాటి మధ్య ఘర్షణ చివరకు యుద్ధంగా పర్యవసిస్తే అది రెంటికీ నష్టమే. కాబట్టి, మంకుపట్టు వీడి, వెనక్కు తగ్గాలి. ప్రస్తుత ఉద్రిక్తతను చల్లార్చాలి. పొంచివున్న పెను యుద్ధం ముప్పును నివారించాలి. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు కొనసాగితే, ప్రపంచ చమురు సరఫరాలు సైతం అస్తవ్యస్తమై, ధరలు పెరుగు తాయి. రష్యా నుంచి చమురు సరఫరా కోసం ఎర్రసముద్రంపై ఆధారపడే మన దేశానికీ ఇబ్బందే. భారత్ సూచించినట్టు మళ్ళీ దౌత్యమార్గాన్ని ఆశ్రయించడమే అన్ని వివాదాలకూ పరిష్కారం. -
సంకల్పం సరిపోతుందా?
కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు దేశం సిద్ధమవుతున్న వేళ పాలక బీజేపీ తన ‘సంకల్ప పత్రం’తో ముందుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక రాగల అయిదేళ్ళలో తన ప్రణాళికలు ఎలా ఉంటాయో ప్రజల ముందు ఉంచింది. దశాబ్ద కాలంగా ఢిల్లీ గద్దెపై ఉంటూ, రాజకీయాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సైతం అందుకు తగినట్టే సాగింది. విశేష ప్రజాకర్షక పథకాల జోలికి పోలేదు. ప్రస్తుత విధానాల కొనసాగింపునే ప్రధానంగా ఆశ్రయించింది. పార్టీ కన్నా ప్రధాన రథసారథికే అధిక ప్రాధాన్యమిస్తూ, ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ ప్రచారం చేస్తోంది. ఇది మునుపెన్నడూ కాషాయపార్టీలో కనిపించని చిత్రం. ఎన్నికల్లో విజయం కోసం మోదీపై ఆ పార్టీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రచారంలో ప్రతిచోటా ప్రవచిస్తున్న ‘వికసిత భారత్’ స్వప్నానికి అనుసంధాయకంగా అభివృద్ధి, ప్రాథమిక వసతి కల్పన, సంక్షేమం, విద్య, పారిశ్రామిక రంగం, అంకుర వ్యవస్థ, ఉత్పాదక రంగం, రైల్వే వగైరాలకు సంబంధించి ‘మోదీ గ్యారెంటీ’లను ఈ మేనిఫెస్టోలో జొప్పించడం విశేషం. వరుసగా మూడోసారి సైతం తమ పార్టీకి అధికార పగ్గాలు దక్కడం ఖాయమన్న ఆత్మవిశ్వాసంతోనో ఏమో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను కొనసాగిస్తే చాలనే భావన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించింది. గడచిన కేంద్ర బడ్జెట్లో ఎన్నికల ముందస్తు వరాలు కురిపించకుండా ఆర్థికంగా పొదుపు మంత్రాన్ని పఠిస్తూ, పాత విధానాల కొనసాగింపునే కమలనాథులు ఆశ్రయించారు. ఇప్పుడీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే ధోరణిని అనుసరించారు. ప్రజల నుంచి వచ్చిన దాదాపు 15 లక్షల దాకా సూచనలను పరిగణనలోకి తీసుకొని, ‘వికసిత భారత్’ స్వప్నానికి అనుగుణంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని బీజేపీ చెబుతోంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి దిశానిర్దేశంగా ఈ ‘సంకల్ప పత్రం’ పనిచేస్తుందని కమలనాథుల ఉవాచ. వచ్చే 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా, విశ్వశక్తిగా మారుస్తామనేది వారు చూపిస్తున్న సుందర స్వప్నం. మోదీ ఆదివారం విడుదల చేసిన ఈ ‘సంకల్ప పత్రం’ ఇప్పటికే సర్కారు అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకం, సురక్షిత మంచినీటి సరఫరా, గృహనిర్మాణం లాంటి దారిద్య్ర నిర్మూలన పథకాలను ఏకరవు పెట్టింది. గత పదేళ్ళలో 25 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడేశామనీ, సామాజిక న్యాయానికి కట్టుబడి ఇతర వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, దళితులకు ప్రభుత్వంలో భాగం కల్పించామని చెప్పుకుంది. అదే సమయంలో ఈ ‘సంకల్పం’లో కొన్ని వివాదాలూ ఉన్నాయి. ఈసారి ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ ప్రారంభం చేసి చూపిన బీజేపీ మూడోసారి గద్దెనె క్కితే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తేవాలని చూస్తోంది. అయితే, తెలివిగా యూసీసీ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’, సార్వత్రిక ఎన్నికల జాబితా తదితర విస్తృత చర్చనీయాంశాలను తన సైద్ధాంతిక ఎంపికలుగా కాక, సుపరిపాలనకు తప్పనిసరి అన్నట్టు చిత్రిస్తూ మేనిఫెస్టోలో పెట్టింది. అదే సమయంలో 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న వివాదాస్పద ‘పౌరుల జాతీయ చిట్టా’ అంశాన్ని ఈసారి ప్రస్తావించలేదు. వ్యవసాయ చట్టాలపై ఎదురుదెబ్బ తగిలేసరికి, ఈ తడవ వాటి ఊసెత్తకుండా జాగ్రత్తపడింది. రైతులకు గట్టి హామీలివ్వకుండా దాటేసింది. ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌ల ఎన్నికల వాగ్దానపత్రాలను విశ్లేషకులు సహజంగానే పోల్చి చూస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టో విధానాల కొనసాగింపు ధోరణిలో సాగితే, కాంగ్రెస్ మేని ఫెస్టో ప్రజాకర్షక బాటన నడిచింది. ముందుగా ప్రకటించిన కాంగ్రెస్‌ది ‘న్యాయ్ (గ్యారెంటీల) పత్రం’ అయితే, ఆనక వచ్చిన బీజేపీది ‘సంకల్ప పత్రం’. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్‌లు అయిదు ప్రధానాంశాలుగా, 25 గ్యారెంటీలతో కాంగ్రెస్ ముందుకొచ్చింది. మహిళలు, యువతరం, అణగారిన వర్గాలు, రైతులు... ఈ నాలుగు వర్గాలూ దేశాభివృద్ధికి నాలుగు స్తంభాలని బీజేపీ సంకల్పం చెప్పుకుంది. కనీస మద్దతు ధరకు ‘చట్టపరమైన గ్యారెంటీ’ ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంటే, బీజేపీ మాత్రం పంటలకు కనీస మద్దతు ధరల్ని ‘ఎప్పటికప్పుడు’ పెంచుతామన్నదే తప్ప, చట్టంగా భరోసా ఇవ్వలేదు. కులగణనకు కాంగ్రెస్ కట్టుబడితే, అలాంటి డిమాండ్లపై బీజేపీ తన అభిప్రాయం పంచుకోనే లేదు. రెండు మేనిఫెస్టోల్లో కొన్ని మంచి విషయాలూ లేకపోలేదు. రాగల అయిదేళ్ళలో వ్యవసాయ పరిశోధనలకు రెట్టింపు నిధులిస్తామన్నది కాంగ్రెస్ వాగ్దానం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద త్వరితగతిన చెల్లింపులు జరుపుతామనీ, పంట నష్టాన్ని మరింత కచ్చితంగా అంచనా వేసేలా సాంకేతికతను వినియోగిస్తామనీ బీజేపీ హామీ ఇస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ రెండు పార్టీలూ వ్యవసాయ రంగానికి సరైన దిశానిర్దేశంలో విఫలమయ్యాయి. నీరు, ఎరువులు, ఇంధనాలను తక్కువగా వినియోగిస్తూనే ఎక్కువ దిగుబడి లాంటి వాటిపై అవి దృష్టిపెట్టలేదు. ఇక, సాంస్కృతిక జాతీయవాదంతో తమిళుల్ని ఆకర్షించేలా ‘తిరువళ్ళువర్ సాంస్కృతిక కేంద్రాల’ ఏర్పాటు, సామా న్యుల సాధారణ రైలు ప్రయాణ కష్టాల్ని పక్కనబెట్టి ఖరీదైన ‘వందేభారత్ రైళ్ళ’ విస్తరణ లాంటివి బీజేపీ అనవసర ప్రాధాన్యాలే. దేశంలో ప్రస్తుత ప్రధాన సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల అని సర్వేలన్నీ తేల్చినందున ఏ పార్టీ అయినా వాటిపై దృష్టి పెట్టడం ప్రయోజనం. ఆ మాటకొస్తే ఓటర్లను ఆకర్షించడమే కీలకమైన ఎన్నికల్లో, మేనిఫెస్టోలను తప్పనిసరిగా అమలు చేసి తీరాలన్న చట్టం లేని భారత్‌లో... ‘సంకల్పం’ శుష్కవచనమైతే నిష్ప్రయోజనం. -
కుట్రదారుల పనిబట్టాలి!
ప్రారంభమైంది మొదలు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు పోటెత్తుతున్న జనవాహినిని చూసి పుట్టగతులుండవని ఎంచిన ప్రత్యర్థులు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పన్నిన కుట్ర వెంట్రుకవాసిలో భగ్నమైంది. పైనున్న దేవుడి ఆశీస్సులూ, అశేష ఆంధ్ర ప్రజానీకం ఆశీర్వాదాలూ తనకు పుష్కలంగా వున్నాయని జగన్ తరచు చెబుతుంటారు. విజయవాడ సింగ్ నగర్లో గుర్తుతెలియని దుండగులు చీకటిచాటున పదునైన వస్తువును గురిచూసి ప్రయోగించినప్పుడు అదే రుజువైంది. నేరుగా కణతకు గురిపెట్టి హాని తలపెట్టాలన్న ఉన్మాదుల పన్నాగం ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగటంతో త్రుటిలో తప్పింది. ఎడమకన్ను పైభాగాన గాయమైంది. పక్కనే వున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సైతం ఈ దాడిలో గాయపడ్డారు. అంతక్రితం పాలనానుభవం లేని ఒక ముఖ్యమంత్రి అయిదేళ్ల అనంతరం ‘మీ ఇంట్లో మంచి జరిగుంటేనే ఓటేయండి’ అని అడుగుతుంటే ఇంత పెద్దయెత్తున ప్రజలు ఎదురేగి నీరాజనాలు పట్టడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే కూటమి నేతలు తట్టుకోలేకపోయారు. ఎడమవైపు కనుబొమ్మ పైభాగాన లోతుగా పడిన గాయం బాధిస్తున్నా... వాపు పూర్తిగా తగ్గకపోయినా జగన్ సోమవారం యధావిధిగా కొనసాగించిన బస్సుయాత్రకూ, గుడివాడలో నిర్వహించిన బహిరంగసభకూ మరిన్ని రెట్లు ఎక్కువగా జనవాహిని తరలిరావటం గమనించాక త్రికూటమికి, ప్రత్యేకించి టీడీపీకి తత్వం బోధపడి వుండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్నీ, పార్టీనీ కబ్జా చేసినప్పటికన్నా చాలా ముందే చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య, కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హతమార్చటం, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం వగైరాల్లో బాబుపై ఆరోపణలు రావటం యాదృచ్ఛికం కాదు. కేంద్రంలో తొలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వాజపేయి అంతటి నాయకుడే బాబు తీరుతెన్నులు గమనించి దిగ్భ్రాంతి చెందేవారని ఆ రోజుల్లో కథనాలొచ్చేవి. తెరవెనక పావులు కదపడం, జరిగింది ఒకటైతే బయటకు వేరేలా చూపటం, మంచిని తన ఖాతాలో వేసుకుని, పొరపాట్లు అవతలివారిపై రుద్దటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఫలానావారిని ప్రధానిని చేశాను... ఇంకొకరిని రాష్ట్రపతిని చేశాను అని చెప్పుకోవటం ఆయనకు అలవాటైన విద్య. రాజకీయాల్లో శత్రువులుండరని, ప్రత్యర్థులు మాత్రమే వుంటారని ఇన్నేళ్ల అనుభవం తర్వాత కూడా బాబు గ్రహించలేకపోయారని ఆయన తరచుగా మాట్లాడే మాటలు, చేసే ప్రసంగాలు రుజువు చేస్తున్నాయి. కనీసం ఈ అవసాన దశలోనైనా నలుగురికీ ఆదర్శంగా వుండాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా మరింత అధమస్థాయి రాజకీయాలు చేసే సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని ఆయన ఉన్మాదిలా రెచ్చిపోతున్న తీరు అందరికీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. సరిగ్గా ముఖ్యమంత్రిపై దాడి జరగడానికి కొన్ని గంటల ముందు తాడికొండలో బాబు చేసిన ప్రసంగమే అందుకు తార్కాణం. ‘ప్రతి ఒక్కరూ రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని ఆ దున్నపోతుపై దాడి చేయండి’ అంటూ ఆయన రెచ్చగొట్టారు. సొంత పార్టీ కార్యకర్తలను ఇలా గూండాలుగా, హంతకు లుగా మార్చాలనుకోవటం ఏ మార్కు రాజకీయమో ఆయనకు అవగతమవుతున్నట్టు లేదు. వయసు ముదిరిన ఈ దశలో బాబుకు పరిణతి రావటం అసంభవం. కనీసం చట్టమైనా దుండ గులను శిక్షించగలిగితే ఇతరులకు జ్ఞానోదయమవుతుంది. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేయదు’ అంటారు. రాజకీయాల్లోకొచ్చి దాదాపు పదేళ్లవుతున్నా, ఒకటి కాదు– రెండు మంత్రి పదవులు వెలగబెట్టినా ఏ భాషలోనూ తప్పుల్లేకుండా పలకడంరాని లోకేష్ వంచనలో, వాచాలత్వంలో మాత్రం తండ్రిని మించారు. ఇలాంటివారంతా ప్రజాస్వామ్యం మాటున వీరంగం వేస్తుంటే అవాంఛనీయ ఉదంతాలు జరగటంలో ఆశ్చర్యమేముంది? ఏం నేరం చేశారు జగన్? ఏ పథకం పెట్టినా దళారుల భోజ్యంగా మారే తీరును సమూలంగా మార్చారు. వాలంటీర్ల వ్యవస్థను నెలకొల్పి నేరుగా నిరుపేదల ముంగిటకే పథకాలు వెళ్లే సరికొత్త విధానం తీసుకొచ్చారు. గ్రామసచివాలయాలు ఏర్పాటుచేశారు. ఇళ్లులేని పేదలను గుర్తించి దరఖాస్తు చేయించి రూ. 10 నుంచి 15 లక్షల విలువైన ఆస్తుల్ని కట్టబెట్టారు. వాగ్దానం చేసిన నవరత్నాలే కాదు... మరిన్ని పథకాలు ప్రజలకందించారు. విద్య, వైద్యరంగాల ప్రక్షాళనకు నడుం బిగించారు. రైతుభరోసా కేంద్రాలు నెలకొల్పారు. రైతులకు అండగావున్నారు. విలేజ్ క్లినిక్‌లు, ఆరోగ్యశ్రీ తదితరాలతో జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి నేతను దుర్భాషలతో, దుశ్చర్యలతో ప్రజలకు దూరం చేయాలని చూడటం తెలివితక్కువతనమని ఆ ముఠాకు మరో నెలరోజుల్లో అర్థమవుతుంది. సత్సంకల్పంతో రాజకీయాలు నెరపేవారినీ, మంచి పాలన అందిస్తున్నవారినీ ప్రజలనుంచి వేరుచేయటం అసాధ్యం. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా బస్సు యాత్ర పొడవునా బడి పిల్లలు మొదలుకొని వృద్ధులవరకూ అన్ని తరాలవారూ, అన్ని వర్గాలవారూ కనబడటం జగన్ మంచి పనులకు నిదర్శనం. విజయవాడ దురంతం వెనకున్న సూత్రధారులనూ, పాత్రధారులనూ సత్వరం బంధించి, కఠినశిక్ష పడేలా చేసినప్పుడే హత్యారాజకీయాలకు అడ్డుకట్టపడుతుంది. నాయకులు బాధ్యతాయుతంగా మెలగటం నేర్చుకుంటారు. -
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
రాజ్యాంగ స్ఫూర్తే రణ దుందుభి
అంబేద్కర్‌ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో ఉన్నది. ఎనిమిది శతాబ్దాల కిందటి ‘మాగ్నాకార్టా’ దగ్గరి నుంచి ఎనిమిది దశాబ్దాల నాటి ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన’ (యుఎన్) వరకు ఆయా కాలాల్లోని డిక్లరేషన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఈ డిక్లరేషన్లన్నిటిలోకి నిస్సందేహంగా అగ్రగణ్యమైనది, అత్యున్నతమైనది భారత రాజ్యాంగం. మానవ హక్కుల కథా గమనంలో పంచమవేదంలా పుట్టిన మహాకావ్యం భారత రాజ్యాంగం. దేశంలో సాధారణ ఎన్నికల వడగాడ్పుల సందర్భం కూడా ఇది. రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశంపై చెలరేగుతున్న వాదోపవాదాలు కూడా ఈ సందర్భాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండేళ్ల కిందట కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆయనకా అవకాశం ఇవ్వలేదు. ఆయన్నే మార్చే శారు. కాలపరిస్థితులను బట్టి రాజ్యాంగంలో స్వల్ప సవరణలు సహజమే. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇప్పటికే భారత సర్వోత్తమ న్యాయస్థానం ఘంటాపథంగా చాటిచెప్పింది. మౌలిక స్వరూపం అంటే ఏమిటో దాని పీఠికలో ఉన్న ఆరు వాక్యాలు చదివితే అర్థమవుతుంది. బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు గెలిస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరో పణల్ని బీజేపీ వాళ్లు మొక్కుబడిగా మాత్రమే ఖండి స్తున్నారు. అనంత హెగ్డే వంటి కొందరు నాయకులు బహిరంగంగానే రాజ్యాంగం మార్పుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనే రాజకీయ వేదికకు సొంతదారైన ఆరెస్సెస్‌కు మన రాజ్యాంగం పట్ల మొదటి నుంచీ సదభిప్రాయం లేదన్నది సత్యదూరం కాదు. పైగా ఈసారి బీజేపీ వాళ్లు 400 సీట్లలో తమ కూటమి గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటం వెనుక ఉన్న మహ త్కార్యం రాజ్యాంగ మౌలిక మార్పులేనన్నది విమర్శకుల అభిప్రాయం. భారత రాజ్యాంగంలో ధ్వనించే సమతా నినాదం సంఘ్ పరివార్‌కు ఏమాత్రం కర్ణపేయం కాదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వపు పదేళ్ల పదవీకాలంలో 40 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల గుప్పెట్లోకి చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యవసాయరంగం నుంచి రైతు కూలీలను తరిమికొట్టి చీప్ లేబర్‌తో మార్కెట్లను నింపడం ఈ కూటమి విధానం. అందుకోసం తీసుకొచ్చిన వ్యవ సాయ చట్టాల ప్రహసనం తెలిసిందే. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలు గ్యారంటీగా ఎగిరిపోతాయని చాలామంది భావన. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ పదాలను జొప్పించారు. ఈ పదాలను తొలగించినప్పటికీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని 39 అధికరణాల రూపంలో వాటి పునాదులు బలంగానే ఉంటాయి. అయితే ఆ పునాదులనే పెకిలించే అవకాశాలుండవచ్చని దేశంలోని బుద్ధిజీవులు భయపడుతున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని సామెత. పెత్తందారీ వర్గాల తాబేదారు పాత్రలో జీవితాన్ని తరింప జేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి సహజ మిత్రుడు. ప్రస్తుత ఎన్నికలతో కలిసి గడిచిన ఆరు సాధారణ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన బీజేపీ కూటమిలోనే ఉన్నారు. రెండుసార్లు మాత్రమే దూరంగా ఉన్నారు. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో మాత్రమే ఆయన రెండుసార్లు దూరం జరిగారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఆర్థిక విధానాల్లో ఆయన బీజేపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల తన ఏహ్యభావాన్నీ, అసహ్యాన్నీ దాచుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు పార్టీ చేయదు. పేద ప్రజలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసి గుడ్డలూడదీసుకున్న వారి గురించి ఇంకేం మాట్లాడాలి? కుల, మత, ప్రాంత, రాజకీయ, లింగ వివక్షలేవీ లేకుండా నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రజలందరికీ అందజేయాలనే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు కూటమి ఈ యజ్ఞాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం విద్యకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యతిరేకంగా యెల్లో పెత్తందార్లు నడిపిన కుట్రల సంగతి కూడా తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఇదే తంతు. పేద వర్గాలను, మహిళలను వారి కాళ్లపై నిలబెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ యెల్లో పెత్తందార్లు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ఎంత పెరిగితే అంతగా పారదర్శకత పెరుగుతుంది. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ఇది సిసలైన లక్షణం. జగన్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకు చేర్చింది. వికేంద్రీకరణకు పెత్తందార్లు ఎప్పుడూ వ్యతిరేకమే. పాలనా వ్యవహారాలన్నీ వారి గుప్పెట్లోనే ఉండాలి. పారదర్శకత అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు. మాదాపూర్‌లో ఐటీ పార్క్ రాబోతున్నదనే రహస్యం వారికి మాత్రమే తెలియాలి. చుట్టూరా భూములన్నీ వారి వర్గంవారే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే పార్క్ ప్రకటన రావాలి. రాజధాని ఎక్కడ వస్తుందో వారికి మాత్రమే తెలియాలి. వారి వర్గం అక్కడి భూములన్నీ కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే రాజధాని ప్రకటన చేయాలి. ఈలోగా ఇతర వర్గం ఔత్సాహికులను తప్పుదారి పట్టించడానికి తప్పుడు లీకులు వదలాలి. చంద్రబాబు నాయకత్వంలోని పెత్తందార్ల కూటమి అనుసరిస్తున్న ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వారు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలను శిరసావహించినందుకు జగన్ పాలన విధ్వంసకర పాలనని మన తోలుమందం పెత్తందార్లు ప్రచారం చేస్తున్నారు. యావత్తు ప్రపంచం వాంఛిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా పెట్టుకున్నందుకు జగన్ పరిపాలన వారికి వినాశకరమైనదిగా కనిపిస్తున్నదట! దశాబ్దాలు గడిచిపోతున్నా అధికార పదవుల్లో ఆవగింజంత వాటా కూడా దొరకని వర్గాలను సమీకరించి సామాజిక న్యాయం బాట పట్టినందుకు జగన్ సర్కార్‌కు కొమ్ములు మొలిచా యట! కొవ్వు బలిసిన పెత్తందారీ వర్గాల ప్రచారం తీరు ఇది. ఎన్డీఏ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ సమస్య జడలు విప్పి నర్తిస్తున్నది. మన తెలుగు పెత్తందార్లకు ఆ జడల దయ్యం ముద్దొస్తున్నది. ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే జగన్ సర్కార్ హయాంలో వారి సంఖ్య ఆరున్నర లక్షలకు పెరిగింది. ఎకాయెకిన యాభై శాతం ఉద్యోగాలు అదనంగా కల్పించిన జగన్ ప్రభుత్వం వారికి విలన్‌గా కనిపిస్తున్నది. ఈ సంఖ్యలో వలంటీర్లను చేర్చలేదు సుమా! పరిశ్రమల స్థాపనలోగానీ, మౌలిక వసతుల కల్పనలోగానీ, ఉపాధి కల్పనలోగానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులోగానీ గణాంకాల ఆధారంగా జగన్ సర్కార్‌తో పోల్చడానికి ఈ పెత్తందార్లు ముందుకు రావడం లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, సర్వనాశనం అనే పడికట్టు మాటలతో శాపనా ర్థాలు పెడుతూ పూట గడుపుకొస్తున్నారు. యెల్లో మీడియా అనుసరిస్తున్న ఈ తరహా ఊకదంపుడు గోబెల్స్ ప్రచారం కాలం చెల్లిన చీప్ ట్రిక్. ప్రజల చైతన్యస్థాయి పెరిగింది. సమాచార మాధ్యమాలు పెరిగాయి. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో గుర్తించగలిగే వివేచనా శక్తి జనంలో పెరిగింది. రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను రక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమవు తున్నారు. కేంద్రంలో ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షం, విశ్వసనీయ ప్రతిపక్షనేత అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మరోసారి ఎన్డీఏను గద్దెనెక్కించవచ్చు. అదీ బొటాబొటీ మెజారిటీతో మాత్రమే! కూటమి ఆశిస్తున్నన్ని సీట్లు గెలవడం అసంభవం. పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ బలంగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో పేదవర్గాల జైత్రయాత్ర కొనసాగు తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 25 లోక్‌సభ స్థానాలతో పాటు నూటాయాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com