Editorial
-
ప్రశాంత కశ్మీర్‌కు మార్గం
జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదం, రాళ్లదాడులు, హర్తాళ్లు, సరిహద్దుల్లో అలజడి వగైరాలు లేకుండా ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదమ్‌పూర్ ర్యాలీలో ఎంతో ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటనను బహుశా విపక్షాలు కూడా స్వాగతిస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుల్వామాలో సైనికులపై ఉగ్రవాద దాడి, ఆ వెనువెంటనే పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం సాగించిన సర్జికల్ దాడులు విపక్షాలకు దేశంలో అప్పటివరకూ కొద్దో గొప్పో ఉందనుకున్న అనుకూలతలను ఆవిరిచేశాయి. బీజేపీకి భారీ మెజారిటీని అందించాయి. కనుక ఈసారి అంతా సవ్యంగా ముగియాలని అవి కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఆ మాటెలావున్నా మోదీ చెప్పిన స్థాయిలో ఉగ్రవాదం బెడద సమసిపోయిందనుకోలేము. ఆ ఉదంతాల సంఖ్య గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే అయినా అడపా దడపా వారి ఆగడాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. నిరుడు డిసెంబర్లో పూంచ్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడిన ఉదంతంలో నలుగురు జవాన్లు మరణించటమైనా, మరుసటి నెలలో అదేప్రాంతంలో సైనికులపై జరిగిన దాడి యత్నమైనా, శ్రీనగర్‌లో ఫిబ్రవరిలో ఒక పంజాబీ పౌరుణ్ణి కాల్చిచంపటమైనా మరింత అప్రమత్తత అవసరమన్న సంకేతాలిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయటమైనా, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమైనా అక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాయన్నది వాస్తవం. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. లోక్‌సభ ఎన్నికలకంటే అసెంబ్లీ ఎన్నికలకే జమ్మూ, కశ్మీర్లో ఎప్పుడూ అధిక ప్రాధాన్యత వుండేది. అయితే మారిన పరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో పట్టు సంపాదిస్తేనే భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం సాధ్యమవుతుందని ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కొత్తగా రంగంలోకొచ్చిన గులాంనబీ పార్టీ డీపీఏపీ భావిస్తున్నాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ పార్లమెంటులో తమ సంఖ్యను పెంచుకోవటానికి ఎంతో కొంత దోహదపడుతుందన్నదృష్టితో వున్నాయి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ది విషాద స్థితి. అంతక్రితం గెల్చుకున్న జమ్మూ, లద్దాఖ్‌లు రెండూ ఆ సార్వత్రిక ఎన్నికల్లో చేజారాయి. ఆ రెండూ బీజేపీ పరమయ్యాయి. కానీ మారిన పరిణామాలు లద్దాఖ్‌లో ఆ పార్టీకి ఆశలు పుట్టిస్తున్నాయి. ఉపాధి లేమి, హిల్ కౌన్సిళ్లను నీరుగార్చటం, పర్యావరణాన్ని దెబ్బతీసేలా సాగుతున్న కార్పొరేట్ సంస్థల భూదాహం లద్దాఖ్ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించాయి. దానికితోడు చైనానుంచి ముప్పువుండొచ్చన్న ఆందోళనతో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లద్దాఖ్‌ను చేరుస్తామన్న హామీనుంచి బీజేపీ వెనక్కి తగ్గింది. అలా చేరిస్తే ఆదివాసీ ప్రాంతాలకు కార్యనిర్వాహక, శాసన, న్యాయ, ఆర్థిక రంగాల్లో స్వయం నిర్ణయాధికారం లభిస్తుంది. తమ ప్రాంతాల్లోని అడవులు, నదులు, వ్యవసాయం, గ్రామపాలన, వారసత్వ ఆస్తి, వివాహం, విడాకులు, సంప్రదాయాలు తదితరఅంశాల్లో చట్టాలు చేసుకునే అధికారం వుంటుంది. పొరుగున చైనా వున్న నేపథ్యంలో ఇది సమస్యాత్మకం కావొచ్చని ఆలస్యంగా గ్రహించటంతో బీజేపీకి ఎటూ పాలుబోవటం లేదన్నది వాస్తవం. అక్కడి ఉద్యమాల పర్యవసానంగా లే ప్రాంతంలో ఆధిపత్యంవున్న బుద్ధిస్ట్లకూ, కార్గిల్‌లో పైచేయిగా వున్న ముస్లింవర్గాలకూ మధ్య సంప్రదాయ సరిహద్దులు చెరిగిపోయాయి. ఫలితంగా ఇటీవల జరిగిన 26 స్థానాల హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి రెండు మాత్రమే దక్కాయి. కనుక బీజేపీ సంకల్పం నెరవేరటం అంత సులభం కాదు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఇటీవల సమష్టిగా అడుగులేసినట్టు కనబడిన ఈ రెండు పార్టీలూ ఎన్నికలు వచ్చేసరికి దూరం జరిగాయి. గతంలో ఒప్పందాలకు కట్టుబడి వుండటం అలవాటులేని పీడీపీతో పొత్తు అసాధ్యమన్నది నేషనల్ కాన్ఫరెన్స్ వాదన. చిత్రమేమంటే ఎప్పుడూ ‘మరింత స్వయంప్రతిపత్తి’, జమ్మూ, కశ్మీర్లో శాంతి స్థాపన చర్చలు ప్రధాన ఎజెండాగా చేసుకునే ఆ పార్టీలకు మారిన పరిస్థితుల్లో ఆ అంశాల ప్రస్తావనకే అవకాశం లేకుండా పోయింది. డీపీఏపీ ఎత్తుగడలే ఈ పార్టీలను కలవరపరుస్తున్నాయి. ఆజాద్ తాను బలంగావున్న ఉదంపూర్–దోడా నియోజకవర్గాన్ని వదిలి అనంత్‌నాగ్–రాజౌరికి ఆయన వలస రావటం వెనక ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయాలన్న వ్యూహం వున్నదని వాటి అనుమానం. ఉన్న ఆరు లోక్‌సభ స్థానాలకూ అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించటం జమ్మూ, కశ్మీర్ వర్తమాన స్థితికి అద్దం పడుతుంది. అయిదేళ్లుగా నిద్రాణమైనట్టున్న ఈ ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత కదలిక వచ్చింది. ఇప్పుడు లభించే ఓట్ల శాతాన్నిబట్టి భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానం ఏమిటన్నది తేలిపోతుందని బీజేపీ గట్టిగా భావిస్తోంది. మిలిటెంట్ల స్వరం ఈసారి మూగబోయిందన్నది వాస్తవం. అయితే రాష్ట్రంలో హిందూ సీఎంవుండాలన్న బీజేపీ ఆశ నెరవేరాలంటే ఉగ్రవాదాన్ని అణిచేయటం ఒక్కటే చాలదు. అందుకు అభివృద్ధికి బాటలు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు పెంచటం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగపరిచే దిశగా చర్యలు తీసుకోవటం, మానవహక్కులకు ప్రాధాన్యతనీయటం తప్పనిసరి. సరిహద్దు ఆవల పాకిస్తాన్, చైనాలు వున్నాయన్న స్పృహతో మెలిగి, సున్నితంగా వ్యవహరించటం నేర్చుకుంటే ఆ ప్రాంత ప్రజల హృదయాలు గెల్చుకోవటం సులభమవుతుంది. -
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్‌యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్‌లో, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
అమెరికా–చైనా చర్చలపర్వం
ఎడతెగని చర్చలు జరుగుతున్నాయంటే, అయినా కనుచూపుమేరలో పరిష్కారం కానరా లేదంటే... కనబడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం. సమస్య తీవ్రంగా ఉన్నదని తాత్పర్యం. ఈనెల ప్రారంభంనుంచి అమెరికా–చైనాలమధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు నేరుగా ఫోన్లో సంభాషించుకున్నారు. నాలుగు నెలలక్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పనిబడటం గమనించదగిందే. వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ చైనా సందర్శనకొచ్చి ప్రధాని లీ కియాంగ్‌తోపాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. అంతకుమునుపే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చర్చించుకున్నారు. త్వరలోనే అమెరికా విదేశాంగమంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనా వెళ్లబోతున్నారు. ఇలా సంభాషణల పరంపర కొనసాగుతున్నది గానీ పరిష్కారం కానరావటం లేదు. వీటికి సమాంతరంగా చైనాను కట్టడి చేసే ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా 2021లో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ‘ఆకస్’ కార్యకలాపాలు చురుకందు కున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ రక్షణమంత్రులు ఇటీవల భేటీ అయ్యారు. ఇందులో మనదేశాన్ని కూడా చేర్చు కోవాలని అమెరికా తహతహలాడుతున్నా ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికే ఇంతవరకూ మన దేశం కట్టుబడివుంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగని మన దేశం మౌనంగా ఏమీ లేదు. దక్షిణ చైనా సముద్రంలో చైనానుంచి తరచు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనేవుంది. ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిప్పీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఆ దేశాన్ని సందర్శించి అండగా వుంటామని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది. నిరంతర గస్తీ కాస్తోంది. సమస్యేమంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో 60 శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది. అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దూకుడు ఊహించని పరిణామం. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలందించటం ద్వారా రష్యాను దారికి తేవొచ్చని భావించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. రష్యాకు ఇరాన్ నుంచి డ్రోన్లు అందుతున్నాయి. ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది. ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయసహకారాలందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దుందుడుకుతనంతో గాజా మండుతోంది. ఇజ్రాయెల్‌ను ఎలాగైనా దారికి తేవా లన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించటం లేదు. కనుకనే దౌత్యరంగంలో వున్నంత దూకుడు రక్షణరంగంలో కనబడటం లేదన్నది బైడెన్‌పై వున్న ప్రధాన విమర్శ. ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్‌ను కలవరపెడుతున్నాయి. పర్యవసానంగా చైనాతో చర్చోప చర్చలు సాగుతున్నాయి. వాణిజ్యపరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా వుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి. వాటివల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుకావటం కష్టమవుతోంది. అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నెల మొదట్లో జో బైడెన్, షి జిన్‌పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంశాలపై చర్చలు నడిస్తే... చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లెం వేయటంపై జానెట్ ఎలెన్ ప్రధాని లీ కియాంగ్‌తో చర్చించారు. దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా 50 లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్కొస్తాయన్నది అమెరికా అంచనా. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ తదితర అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తున్నదని చైనా ఆరోపణ. కనుకనే ఇరుదేశాల ఉన్నతాధికారులమధ్యా వరసగా నాలుగురోజులపాటు చర్చలు సాగినా... నేరుగా ఎలెన్, లీ కియాంగ్‌లు సంభాషించుకున్నా పరిష్కారం దొరకలేదు. చిత్రమేమంటే అమెరికా, చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నా వాణిజ్యపరంగా ఆ రెండు దేశాలూ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని స్థితి. అందుకే ఇండో–పసిఫిక్ అంశంలో దూకుడుగా వున్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదోవిధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు. వీటికి మరిన్ని జోడిస్తానన్న బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామన్న సంకేతాలు రెండు దేశాలూ ఇస్తున్నాయి. ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి. ఘర్షణల నివారణ ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే ఘర్షణలవల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమీ మిగలదు. అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా వుండాలి. చిత్తశుద్ధితో సాగాలి. లేనట్టయితే నిష్ఫలమవుతాయి. -
సుప్రీమ్ తేల్చిన ప్రత్యేక హక్కు
ఇది చరిత్రాత్మక తీర్పు. ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపగల తీర్పు. ‘‘పర్యావరణ మార్పుల దుష్ప్రభావం నుంచి విముక్తి’’ని సైతం ప్రత్యేకమైన ప్రాథమిక హక్కుగా భారత సర్వోన్నత న్యాయస్థానం తొలిసారిగా గుర్తించింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14), వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు (ఆర్టికల్ 21)ల విస్తృత పరిధిలోకే అదీ వస్తుందంటూ గత వారం సుప్రీమ్ పేర్కొనడం విశేషం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేక పిట్ట), లెస్సర్ ఫ్లోరికాన్ (గడ్డి నెమలి) లాంటి అంతరిస్తున్న పక్షుల పరిరక్షణకు సంబంధించిన ఓ కేసు విచారణలో కోర్ట్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షులను కాపాడడం, పర్యావరణ పరిరక్షణ... రెండూ కీలకమైన లక్ష్యాలంటూనే, ఒకదాని కోసం మరొకదాన్ని బలి చేయకుండా సమగ్ర వైఖరిని అవలంబించడం అవసరమని స్పష్టం చేసింది. పర్యావరణ మార్పులపై ఉదాసీనంగా ఉన్న పాలకులకు బాధ్యతను గుర్తు చేసింది. గతంలోకి వెళితే, పక్షుల రక్షణ కోసం 2021లో గుజరాత్, రాజస్థాన్లలోని 99 వేల చదరపు కి.మీ.ల పైగా ప్రాంతంలో ఎత్తైన విద్యుత్ లైన్లపై సుప్రీమ్ ధర్మాసనం పూర్తి నిషేధం విధించింది. సౌరఫలకాల ప్రాజెక్టుల వద్ద వేసిన ఎత్తైన వైర్లకు తగిలి పక్షులు మరణిస్తుండడంతో ఈ వివాదం రేగి, నిషేధం దాకా వచ్చింది. అయితే సౌర, పవన విద్యుచ్ఛక్తికి అవకాశం ఉన్న ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుళ్ళనే అనుమతిస్తే, స్వచ్ఛ ఇంధన లక్ష్యాలలో భారత్ వెనుకబడుతుందని కోర్ట్ తాజాగా భావించింది. పర్యావరణంపై ప్రపంచ ప్రయత్నాలకు అది అవరోధమనీ, పైపెచ్చు జీవించే హక్కు, సమానత్వపు హక్కు, ఇంధనం అందుబాటు లాంటి ప్రాథమిక హక్కులకు ముప్పు అనీ అభిప్రాయ పడింది. పక్షులను రక్షిస్తూనే, పర్యావరణాన్ని పరిరక్షించేలా సమతూకం పాటించడంపై దృష్టి పెట్టా లంటూ, విద్యుత్‌లైన్లపై ఏకపక్ష నిషేధాన్ని తొలగించింది. మార్చి 21న ఈ ఉత్తర్విచ్చినా శనివారం మొత్తం తీర్పును అప్లోడ్ చేయడంతో పర్యావరణంపై జడ్జీల విస్తృత చర్చ బయటకొచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి. పర్యావరణ మార్పులపై భారత్‌లో చట్టం లేనంత మాత్రాన వాటి దుష్ప్ర భావాల నుంచి భద్రతకు భారతీయులకు హక్కు లేదని కాదు అని కోర్ట్ కుండబద్దలు కొట్టింది. పర్యావరణ మార్పుతో సమానత్వపు హక్కుపై ఎంత ప్రభావం ఉంటుందో సోదాహరణంగా చర్చించింది. పర్యావరణ మార్పు వల్ల ఒకచోట తిండికీ, నీటికీ కొరత ఏర్పడితే ధనికుల కన్నా బీదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనీ, సమానత్వపు హక్కనే భావనే దెబ్బతింటుందనీ విశదీకరించడం విశేషం. క్లైమేట్ ఛేంజ్‌కూ, మానవ హక్కులకూ ఉన్న సంబంధాన్ని ప్యారిస్ ఒప్పందం గతంలోనే గుర్తించింది. అంతర్జాతీయ చట్టాల కింద గ్రీన్హౌస్ వాయువుల్ని తగ్గిస్తూనే, ఆరోగ్య వాతావరణంలో జీవించడానికి ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాపాడాలని సుప్రీమ్ పేర్కొనడం కీలకాంశం. ఇది స్వాగతించాల్సిన విషయం. ఆ మాటకొస్తే పర్యావరణ పరిరక్షణను హక్కుల కోణంలో నుంచి వ్యాఖ్యానించడం సుప్రీమ్ చాలాకాలంగా చేస్తున్నదే. కాలుష్యరహిత వాతావరణంలో బతకడమ నేది జీవించే హక్కులో భాగమని దశాబ్దాల క్రితమే పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, గాలి అనేవి ప్రజల హక్కు అని గత నెలలోనూ వ్యాఖ్యానించింది. తాజా తీర్పు వాటికి కొనసాగింపు. అయితే, దేశంలోని కోట్లాది ప్రజానీకాన్ని పర్యావరణ దుష్ప్రభావాల నుంచి విముక్తం చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త తీర్పు అయినా పూనిక నిస్తుందా అన్నది ప్రశ్న. అసలు స్వచ్ఛమైన, ఆరోగ్య కరమైన వాతావరణంలో బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ, వనరుల దుర్వినియోగం, మార్కెట్ శక్తుల ప్రకృతి విధ్వంసం, పెరిగిపోతున్న వినిమయవాదం ప్రాణాల మీదకు తెస్తోంది. తెలిసైనా, తెలియకైనా అలా పర్యావరణ హాని చేయడమంటే మనిషి జీవించే హక్కును నిరాకరించడమే! జీవితాలనూ, జీవనోపాధినీ దెబ్బ తీస్తున్న ఈ పరిస్థితులు మానవాళి ఉనికికే ఎదురైన సవాళ్ళు. పైపెచ్చు, ధనికులతో పోలిస్తే దారితెన్నూ లేని బీదసాదలపై ఈ ప్రభావం అధికమని అందరూ అంగీకరిస్తున్నదే. ఆ పరిస్థితులు కొనసాగరాదన్నదే సుప్రీమ్ ఆదేశం అందిస్తున్న సందేశం. వర్షపాతాల్లో మార్పులు, వేళ కాని వేళ వడగాడ్పులు రాగల కాలంలో మరింత పెరగనున్నాయని ప్రపంచ సంస్థలు భారత్‌ను ఇప్పటికే హెచ్చరించాయి. హిమానీనదాలు కరుగుతున్నా, సముద్రమట్టాలు పెరుగుతున్నా, రాజధానిలోనే స్వచ్ఛమైన గాలి కరవైనా అవేవీ పాలకులకు ప్రాధాన్యాలుగా కనపడక పోవడం దౌర్భాగ్యం. ఆ తలనొప్పి విద్యావేత్తలు, ఉద్యమ కారులు, పౌరసమాజ బృందాలదేనని పొరబడుతున్న వేళ సుప్రీమ్ తీర్పు చెంపపెట్టు. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసి, ప్రభుత్వాలు చేపడుతున్న అనేక విధానాలు ఇవాళ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయనేది నిష్ఠురసత్యం. దానికి తోడు కనీస స్పృహ లేకుండా నేల, నింగి, గాలి, నీరును కలుషితం చేయడంలో అందరం పోటీలు పడుతున్నాం. పర్యవసానాలే ఇప్పుడు చూస్తున్న అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, ఇంకా అనేకానేక పర్యావరణ దుష్ప్రభావాలు. ఈ పరిస్థితుల్లో సుప్రీమ్ గుర్తించిన ఈ ప్రత్యేక హక్కు పార్లమెంట్‌కు మేలుకొలుపు కావాలి. పర్యావరణంపై కుంభకర్ణ నిద్ర నుంచి ఇకనైనా పాలకులు మేల్కోవాలి. ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగాల్సి ఉంది. వనరుల సమర్థ వినియోగంపై చర్యలు చేపట్టి, అందరిలో అవగాహన పెంచాల్సి ఉంది. లేదంటే, ఈ తాజా తీర్పు ఆసరాగా పౌరులు తమ హక్కును కాపాడుకొనేందుకు చట్టపరమైన మార్గాలను అనుసరించే వీలు ఉండనే ఉంటుంది. -
ఆగని డ్రాగన్ దురాశ
ఇది ఆందోళన రేపే వార్త. తక్షణమే అడ్డుకట్ట వేయడానికి ఆలోచించాల్సిన వార్త. పొరుగు దేశం చైనా ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట తన వైపున మరో 175కు పైగా గ్రామాలను నిర్మిస్తోందట. మన అరుణాచల్ ప్రదేశ్‌కు అభిముఖంగా సాగుతున్న ఈ కొత్త నిర్మాణాలు ఇప్పటికే ఎల్ఏసీ వెంట డ్రాగన్ సాగించిన 628 ‘షియావోకాంగ్’ (సంపన్న గ్రామాలు)కు అదనం. ఎల్ఏసీ వెంట తన బలం, బలగం పెంచుకొనేందుకు బీజింగ్ మరోసారి దుష్టపన్నాగం పన్నుతోంది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన ఈ కథనం సంచలనం రేపుతోంది. ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు జమ్ము–కశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతం వెంట కూడా చైనా వైపున కొత్త గ్రామాలు వెలుస్తున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం. వెరసి, రానురానూ ఎల్ఏసీ మరింత వివాదాస్పదం కానుంది. ఇది మన బలగాలు, స్థానికులు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అంశం. నిజానికి, వాస్తవాధీన రేఖ అనేది భూతలంపై స్పష్టంగా నిర్ణయించిన సరిహద్దు ఏమీ కాదు. చైనీయుల నియంత్రణలో ఉన్న భూభాగాన్నీ, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాటంగా చేసుకొని, ఊహాత్మక సరిహద్దయిన ఎల్ఏసీ వెంట సైనిక సన్నద్ధతను పెంచుకోవాలనీ, ఆ క్రమంలో అక్కడ మరింత భూభాగంపై తమ హక్కును ప్రకటించుకోవా లనీ చైనా కుటిల ప్రయత్నం. అందుకే, ఆ జగడాలమారి దేశం ఎల్ఏసీ వెంట తన వైపున గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తూ వస్తోంది. దాదాపుగా 900 ఎల్ఏసీ గ్రామాలను నిర్మించాలనేది చైనా వ్యూహం. అందులో 200 దాకా గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో కట్టాలని దాని ప్రయత్నం. ఆ భారీ ప్రయత్నంలో భాగమే ఇప్పుడీ కొత్త నిర్మాణాలు. ఆ గ్రామాలు ఇటు గస్తీ పాయింట్లుగా, అటు భారత్‌తో ఘర్షణ తలెత్తితే చేతికి అందివచ్చే సైనిక స్థావరాలుగా ఉపకరిస్తాయనేది బీజింగ్ ఎత్తుగడ. చైనా సైనిక వ్యూహం మాట అటుంచితే, కొత్త ఆవాసాలతో అనేక దీర్ఘకాలిక ప్రభావాలున్నాయి. అది మన దేశాన్ని మరింత కలవరపెడుతోంది. గమనిస్తే, భారత – చైనాల మధ్య 2005 నాటి ‘సరి హద్దు రక్షణ సహకార ఒప్పందం’ (బీడీసీఏ) ఉంది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రజానీకం ప్రయోజనాలను ఇరుపక్షాలూ సంరక్షించాలి’’ అని బీడీసీఏలోని ఏడో ఆర్టికల్ పేర్కొంటోంది. ఎప్పుడైనా ఎల్ఏసీని కచ్చితంగా నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తే, అప్పటికి జనావాసాలైన ఈ కొత్త గ్రామాలను కదిలించడానికి వీలుండదు. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకోవాలనేది డ్రాగన్ దురా లోచన. అలా తన ప్రాదేశిక హక్కుల వాదనకు బలం చేకూర్చేలా ఈ కొత్త గ్రామాలు, అక్కడ తెచ్చి పెట్టిన జనాభాను వాడుకోవాలనేది దాని పన్నాగం. చైనా వైపు కడుతున్న ఈ కొత్త గ్రామాలకు ఎదురుగా భారత్ వైపున కూడా గ్రామాలు లేకపోలేదు. అయితే, వాటిలో జన సంఖ్య అంతంత మాత్రమే! విస్తరణ కాంక్షతో ఊగుతున్న చైనా ఈ గ్రామాల నిర్మాణంతో ఆగడం లేదు. టిబెట్‌లో, ఎల్ఏసీ సమీప ప్రాంతాల్లో పెద్దయెత్తున ప్రాథమిక వసతి కల్పన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే తన 14వ పంచవర్ష ప్రణాళిక (2021 –25)లో భాగంగా సిచువాన్ – టిబెట్ రైల్వేలైను సహా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను విస్తరించే పని పెట్టుకుంది. అలాగే, వాస్తవాధీన రేఖ వెంట, భారత భూభాగానికి సమాంతరంగా సాగే రెండు జాతీయ రహదారులను (జీ–219, జీ–318) అప్‌గ్రేడ్ చేసే పనులూ కూడా ఆ ప్రణాళికలో భాగమే. వాటిలో ఒకటి (జీ–219) లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఎదురుగా ఉంటే, మరొకటి (జీ–318) అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్లకు అభిముఖమైనది కావడం గమనార్హం. తద్వారా ఒకపక్క టిబెట్‌ను తమలో భాగంగా ప్రచారం చేసుకోవడం, మరోపక్క ప్రాథమిక వసతుల పెంపు అనే రెండూ చైనా పెట్టుకున్న లక్ష్యాలు. అసలు 1959 మార్చి 28న దలైలామా నేతృత్వంలోని టిబెటన్ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసి, టిబెట్‌ను ఆక్రమించుకున్న చరిత్ర బీజింగ్ది. కానీ, మొన్న షిజాంగ్ (టిబెట్)లో ప్రజాస్వామ్య సంస్కరణకు 65వ వార్షికోత్సవం అంటూ ఎల్ఏసీ వెంట డ్రాగన్ సంబరాలు జరపడం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమే! టిబెట్ నుంచి తైవాన్ దాకా అన్నీ తమవేననే డ్రాగన్ రాజ్య విస్తరణ వాదం ప్రపంచానికి కొత్త కాదు. చైనా సాగిస్తున్న ఈ కొత్త గ్రామాల నిర్మాణం నాటకాన్ని సైతం భారత్ గతంలోనే గమనించకపోలేదు. అందుకనే ఆ జనావాసాలను బీడీసీఏ కింద సరిహద్దు చర్చల నుంచి మినహాయించా లని తేల్చిచెప్పింది. డ్రాగన్ మాత్రం తన వంకర బుద్ధి వదులుకోలేదు. భారత్‌లోని లద్దాఖ్‌కు అభి ముఖంగా తాను చట్టవిరుద్ధంగా దురాక్రమణ చేసిన ప్రాంతాల్లోనూ చకచకా గ్రామాలు కట్టే పని చేస్తూనే ఉంది. ఇందుకు ప్రతిగా మన దేశం ఎదురుదాడికి దిగింది. ‘సచేతన గ్రామాల పథకం’ పేర ఆ సరిహద్దులోని మన జనావాసాలను ఏడాది పొడుగూతా జనంతో ఉండే ఆధునిక పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. అయితే అదింకా పూర్తి కాలేదు. పనులు సాగుతూనే ఉన్నాయి. తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనాకు ముకుతాడు వేయడానికి మనం చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో మనం మనవైపు నిర్మిస్తున్న గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మిగలకుండా స్థానిక ప్రజలు ఆవాసం ఉండేలా చూడాలి. దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే, స్థానికులు ప్రతి ఒక్కరిలో తామే సరిహద్దును కాపాడే సైనికులమనే భావన కల్పించాలి. మాతృభూమి పరిరక్షణ స్ఫూర్తి రగిలించాలి. అది జరగాలంటే, ముందుగా లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న ప్రజానీకపు న్యాయమైన కోరికలను మన్నించాలి. ప్రాంతీయ సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగా మన ఢిల్లీ పాలకులు వ్యవహరించాలి. సొంత ఇంటిని చక్కదిద్దు కొని, పొరుగు ప్రత్యర్థిపై పోరాడే క్రమంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పక్షాలూ కలసిరావాలి. -
ప్ర‘పంచాంగం’
విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళరేఖలో సాగదు; మానవజీవితమూ దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది; సూర్యుని చంద్రుడూ, నక్షత్రాలూ అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లూ ఉంటాయి. జీవపరిణామక్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పదునెక్కినకొద్దీ అతణ్ణి అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్రగమనం ఒకటి. మనుగడ పూర్తిగానూ, నేరుగానూ ప్రకృతివనరులపై ఆధారపడిన ఆదిమకాలంలో వేడి, వర్షం, చలి చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది, కడుపు నిండిన తర్వాత కలిగే జిజ్ఞాస కాదు; కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కుప్రశ్న. ఈ ఋతుపరివర్తనలో అతని చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోయి; తను ఆహారం కోసం ఆధారపడిన కొన్ని రకాల జంతువులు అదృశ్యమై, కొత్తవి అడుగుపెడుతున్నాయి! దీనిని అర్థంచేసుకోడానికీ, దీనికి ఎవరు కారణమో తెలుసుకోడానికీ సమయం పట్టింది. పెరిగి తరిగే చంద్రకళలే కారణమనుకుని వాటిని కాలానికి అన్వయించుకుని ఋతుచక్రానికి కాలచక్రాన్ని జోడించుకున్నాడు. అలా కాలగణనంలో చాంద్రమానం అడుగుపెట్టి ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొన సాగుతోంది. ఆ క్రమంలోనే రేపు, అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనం జరుపుకొంటున్నది స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఉగాది. ఉగాదిని ఇప్పుడు మనం ఒక పండుగగానే భావిస్తాం; గడిచిన ఏడాది ఎదురైన కష్టనష్టాలూ, ఆశాభంగాల పాత దుస్తులు విడిచేసి కొత్త ఆశలూ, ఉత్సాహాల ఉడుపులు ధరించే సందర్భమను కుంటాం; ఆరు రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం; పంచాంగ శ్రవణానికీ, కవితా శ్రవణానికీ కూడా చెవులు అప్పగిస్తాం. నూతనశోభకు, శుభానికి తలుపు తెరిచేలా తోచే ఏ సందర్భమైనా పండుగే. అయితే, ఉగాది పేరిట కొత్త సంవత్సర ప్రారంభాన్ని పండుగగా మలచడం వెనుక ఎంతో కథ ఉంది; అంతుబట్టని కాలచక్రపు తిప్పుళ్ళకు బిత్తరపోయి, తిరిగి నిలదొక్కుకోడానికి బతుకు చేసే పెనుగులాట ఉంది; కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి పడిన అంతులేని వైజ్ఞానిక ప్రయాస ఉంది; మనం అనాగరికునిగా పొరబడే ఆదిమానవుణ్ణే తొలి ఖగోళ వేత్తగా రూపించి నిరూపించే అద్భుత నేపథ్యం ఉంది. తప్పులు, సవరణల రూపంలో సాగిన ఆ కాలగణనం కసరత్తులోకి తొంగిచూసినప్పుడు నాటి మానవుల ఆరాటపోరాటాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు మన కళ్లను మెరుపులా తాకి ఆశ్చర్యం గొలుపుతాయి. చంద్రుని వృద్ధిక్షయాల ఆధారంగా కాలాన్ని గణించడం, యాభైవేల సంవత్సరాల క్రితమే పాతరాతియుగంలో మొదలైనట్టు శాస్త్రవేత్తలు నిరూపించారు. అప్పటి గుహాచిత్రాలలో కనిపించిన పొడవాటి దండాన్ని చంద్రకళల ఆధారంగా కాలాన్ని కొలిచే సాధనంగా గుర్తించారు. ఇప్పటికీ పన్నెండు రాశులలో ఒకటిగా ఉన్న మేషరాశిని సూచించే పొట్టేలు బొమ్మతో సహా వివిధ జంతు వుల బొమ్మలు ఆ దండంపై ఉన్నాయి. అనంతరకాలంలో పురోహితులు, మాంత్రికులు, పాలకులు ధరించే దండాలకు అదే మాతృక అయినట్టు తేల్చారు. చంద్రునితో ఋతువుల మార్పును ముడి పెట్టి చాంద్రమానానికి అలా తెరదీయడం గొప్ప ముందడుగే కానీ; ఋతుచక్రానికి, చాంద్రమానంలోని మాసచక్రానికి పొంతన కుదరకపోవడంతో, ఋతుపరివర్తనకు సూర్యుడు కారణమన్న ఎరుక పుట్టి సౌరమానం అడుగుపెట్టింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ; ఇరవైమూడున్నర డిగ్రీల ఒంపుతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా సంవత్స రానికి 300 నుంచి 400 రోజులను లెక్కగట్టడాన్ని నేటి శాస్త్రవేత్తలు అబ్బురంగానే పరిగణిస్తారు. చాంద్రమానం సంవత్సరానికి 354 రోజులను లెక్కిస్తే, మరింత నిర్దుష్టమైన సౌరమానం 365 పైచిలుకు రోజులను లెక్కించింది. రెంటిమధ్యా ఉన్న 11 రోజుల పైచిలుకు తేడాను సరిపెట్టి రెండు మానాలనూ సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలే అయింది. రోమన్, జూలి యన్, గ్రెగేరియన్ లాంటి ఎన్ని కాలగణన పద్ధతులు వచ్చినా ఇలాంటి సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని ‘కేలండర్ కథ’ అనే పుస్తకంలో డా. మహీధర నళినీమోహన్ అంటారు. మనదేశానికి చెందిన భాస్కరాచార్యులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఖగోళపండితులు సంవత్సరానికి 365 రోజుల పైచిలుకును సక్రమంగానే గుర్తించారు. కానీ అందులో ప్రకృతి సిద్ధంగా ఉన్న భిన్నాంకం వారి మేధకు లొంగేది కాదు. చాంద్రమానంలో భాగమైన నెలకు 29 రోజుల పైచిలుకు లెక్కా అలాంటిదే. భూభ్రమణంలో ఒంపు వల్ల కాలగణనంలో ఏర్పడే ఆ వైవిధ్యమే లేనప్పుడు ఋతుపరివర్తనే అంతరించి మరింత విషమసమస్య తలెత్తే మాటా నిజమే. మొత్తంమీద అప్పటినుంచీ ఇప్పటివరకూ కేవల చాంద్రమానం, కేవల సౌరమానం; చాంద్ర– సౌరమానాల సమన్వయం అనే మూడు పద్ధతులూ అమలులో ఉన్నాయి. విశేషమేమిటంటే, కాల గణనానికి అనుసరించిన పద్ధతుల్లోనూ, ఆ క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారంలో సాఫల్య, వైఫల్యాలలోనూ ప్రపంచానుభవం ఒక్కలాంటిదే. కనుక ‘పంచాంగం’ అనే మాటను ‘ప్రపంచాంగం’గానూ చెప్పుకోవడంలో తప్పులేదు. పైన చెప్పిన సౌర, చాంద్రమానాల సమన్వయాన్నే ‘యుగం’ అంటారని ‘జనకథ’ అనే పుస్తకంలో రాంభట్ల కృష్ణమూర్తిగారి వివరణ. అధికమాసాలను పాటించడం ఇందులో భాగమే. అప్పుడు కూడా రెండు మానాల సమన్వయం అయిదేళ్ళకోసారే సాధ్యమవుతుంది. అదే అసలైన ‘యుగాది’. ఇప్పుడు ‘ఉగాది’ పేరుతో ఏటా జరుపుకొంటున్నాం. -
ఒక అత్యాశ... ఒక అసూయ... ఒక మాయావి!
పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షురాలు. ఎన్టీ రామారావు కూతురు అనే అర్హత ఆమెకు రాజకీయ ఆశ్రయాన్ని కల్పించింది. తాజా హోదాకు కూడా కారణమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు, రామోజీల తర్వాత ఈమె పాత్రే ముఖ్యమైనదని లక్ష్మీపార్వతి ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. తండ్రి షాజహాన్‌కూ, పెద్దన్న దారాషికోకూ వెన్ను పోటు పొడిచిన ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్ పోల్చారు. చంద్రబాబు ఔరంగజేబయితే లక్ష్మీపార్వతి లెక్క ప్రకారం పురందేశ్వరిది రోషనారా పాత్ర అవుతుంది. అంతఃపుర కలహాల్లో చిన్నక్క రోషనారా చేసిన సాయానికి గుర్తుగా తాను రాజైన పిదప ఔరంగజేబు ఆమెను అందలాలెక్కించి కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబం ‘చిన్నమ్మ’గా పిలుచు కునే పురందేశ్వరి పట్ల చంద్రబాబు అటువంటి కృతజ్ఞత ప్రకటించుకోలేదని ఆమె క్యాంపు కినుకతో ఉండేది. చంద్రబాబు మోసంపై పురందేశ్వరి భర్త ఓ పుస్తకం కూడా రాశాడు. షర్మిల మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి. మూడేళ్ల కింద తండ్రి పేరుతో తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు. పార్టీ ఎందుకు పెట్టారన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఏపీలో అన్న ముఖ్యమంత్రి అయ్యారు కనుక తెలంగాణలో తానెందుకు కాకూడదన్న ఆరాటం తప్ప మరో హేతు బద్ధమైన కారణం కనిపించలేదు. కనుకనే ఆ ప్రాంతంలో వైఎస్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. అటువంటి వారికి షర్మిల ఘాటు గానే సమాధానం చెప్పారు. తెలంగాణ తాను మెట్టినిల్లనీ, తనకిక్కడ సర్వహక్కులున్నాయనీ ఢంకా భజాయించారు. అయితే తాను మెట్టినవారి ఇంటి పేరు మొరుసుపల్లిని మాత్రం ఆమె స్వీకరించలేదు. స్వీకరించాలనే రూల్ కూడా ఏమీ లేదు. తాను ఏ ఇంటి పేరు స్వీకరించాలో నిర్ణయించుకునే అధికారం ప్రతి మహిళకూ ఉంటుంది. కాకపోతే మెట్టినింటి ఆధారాలతో పొలిటికల్ క్లెయిమ్ పెట్టినప్పుడు ఇటువంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. తలెత్తాయి. చంద్రబాబు నాయుడు వయోభారం మీద పడింది. ఈసారి గెలిస్తేనే పార్టీ బతుకు తుంది. కొడుకు రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది. కానీ క్షేత్ర నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. ఆయన దగ్గర ఎన్నికల ఎజెండా లేదు. ఎజెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించేశారు. ‘నా పరిపాలన వల్ల మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి. మీ ఊరికి మంచి జరిగిందనుకుంటేనే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడండ’ని జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. చరిత్రలో ఇంత సూటిగా, ఇంత నిక్కచ్చిగా చెప్పగలి గిన నేత వైఎస్ జగన్ మాత్రమే. ఐదేళ్ల పారదర్శక పాలన ఇచ్చిన ఆత్మవిశ్వాసం అది. ఈ ఛాలెంజ్‌ను చంద్రబాబు స్వీకరించలేక పోతున్నారు. తాను పాలించిన ఐదేళ్లలో మంచి జరిగితేనే ఓటేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఛాలెంజ్ స్వీకరించకపోతే తాను చేసిన మంచి ఇసుమంతైనా లేదని అంగీకరించినట్టే! అందుకే ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఎజెండాల మీద చర్చలు జరగవద్దు. పొత్తులతో నెట్టుకుని రావాలి. దుష్ప్రచారంతో పబ్బం గడుపుకోవాలి. యెల్లో ముఠా ముందున్న ఆప్షన్లు ఇవే! పురందేశ్వరి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని నంజు కోవడం కుదరలేదు. లక్ష్మీపార్వతిని అడ్డు తొలగిస్తే కుదురుతుందని చంద్రబాబు, రామోజీ నమ్మబలికారు. ఎన్టీ రామారావును గద్దె దింపకుండా లక్ష్మీపార్వతి అడ్డును తొలగించలేమని తీర్మా నించారు. సోదర సోదరీమణులందరిలోకీ తెలివైనదిగా పేరున్న పురందేశ్వరికి కూడా ఈ తీర్మానంలో నిజాయితీ కనిపించింది. ఆపరేషన్ వైస్రాయ్‌కు తోబుట్టువులను సిద్ధం చేసింది ఆమేననే ప్రచారం ఉన్నది. వ్రతం చెడింది కానీ ఫలం దక్కలేదు. ఈసారి తాను మారిన మనిషినని బంధువర్గ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ప్రకటించారట! పులి ముసలిదైపోయింది. శాకా హారిగా మారిపోయింది. బంగారు కడియాన్ని కూడా నమల్లేక పోతున్నది. మనం కలిసుంటే పిల్లలు సంయుక్తంగా నములు కుంటారని ప్రతిపాదించారట! తాము మిస్సయిన బస్సు తమ వారసుడికి దొరికితే దగ్గుబాటి కుటుంబానికి ఇంకేమి కావాలి? చంద్రబాబు ఎటువంటి హామీ ఇచ్చారో తెలి యదు కానీ డీల్ కుదిరింది. పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడానికి చంద్రబాబు – రామోజీలు కలిసి ఆరెస్సెస్‌లో కదపాల్సిన పావులన్నీ కదిపి చివరికి కృతకృత్యులయ్యారని సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేలోగా ఆమె నిర్వహించవలసిన పాత్రకు సంబంధించిన స్క్రిప్టు పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టారు. షర్మిల తాను పాదయాత్ర చేస్తే ఓట్లు జలజలా రాలతాయనే మూఢ నమ్మకం ఏదో షర్మిలకు ఉండేదట! ఆ నమ్మకాన్ని యెల్లో మీడియా పెద్దలు మరింత ఎగదోశారు. తెలంగాణలో ఆ నమ్మకం వమ్మయింది. వైఎస్సార్, వైఎస్ జగన్‌లలో ఉన్న ‘మాట తప్పని – మడమ తిప్పని’ లక్షణం షర్మిలలో ఏ కోశానా కనిపించలేదు. తెలంగాణలోనే ఆమె పలుమార్లు నాలుక మడ తేశారు. దీంతో ఉన్న కొద్దిపాటి అనుచరుల్లోనూ భ్రమలు పటా పంచలైపోయాయి. ‘చావైనా బతుకైనా తెలంగాణ’తోనే అంటూ ఆమె చేసిన ప్రకటన హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ‘ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను, 119 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాన’ని పలుమార్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం తమ పనికాదని చెప్పారు. అదే నోటితో వ్యతిరేక ఓటును చీల్చడం ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్ పిలుపు కోసం తహతహలాడారు. రేవంత్‌రెడ్డిని తిట్టని తిట్టు లేదు. ఆయన సీఎం కావడమే తరువాయి, ఆమె స్వరంలో చిత్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె నిలకడలేనితనంపై అప్పటికే అవగాహన ఉన్నందువల్ల ఆమె స్వర విన్యాసాలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ దశలో యెల్లో పెద్దలు మళ్లీ రంగంలోకి దిగారు. చంద్రబాబుకు రెండు అవసరాలున్నాయి కదా! బీజేపీతో పొత్తు – పొత్తు ద్వారా కలిగే ప్రయోజనాలు పొందడం మొదటిది. ఇందుకోసం పురందేశ్వరి డీల్. రెండోది జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. యెల్లో మీడియా దిగంబర ప్రదర్శన జనంలో వెగటు పుట్టిస్తున్నది. కొత్త గొంతుకతో యెల్లో పలుకులు పలకాలి. ఆ గొంతుక జగన్ ఇంటి నుంచే వస్తే ఇంకేం కావాలి? చకచకా ఏర్పాట్లు జరిగాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి షర్మిలను వరించేట్టుగా శకుని పాచికలు విసిరాడు. తల బీజేపీలో, మొండెం టీడీపీలో ఉండే సీఎం రమేశ్‌కు చెందిన ప్రైవేట్ విమానాలు అటూ ఇటూ పరుగులు తీశాయి. కొస మెరుపు ఏమిటంటే మొన్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడు దల చేయడానికి కూడా సదరు బీజేపీ నాయకుడి విమానంలోనే షర్మిల కడపకు వెళ్లారు. తన ఉపన్యాసాల్లో మాటిమాటికీ రాజశేఖరరెడ్డి బిడ్డనని చెప్పుకునే షర్మిల ఆయన మరణానంతరం అవినీతి కేసులో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్‌లో చేరడంపై ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అలా చేర్చినట్టు సోనియాకూ, రాహుల్‌కూ తెలియదట! ‘ఈ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పార’ని షర్మిల చెప్పారు. క్విడ్ ప్రో కో కేసుల్లో విధాన నిర్ణయాలపై ప్రభుత్వాధి నేత పేరు లేకుండా బయటి వ్యక్తిపై కేసు ఎట్లా పెడతారు? సోనియాకు, రాహుల్‌కు తెలియదనడం చెవుల్లో పూలు పెట్టడంకాదా! చంద్రబాబునాయుడు అన్నిరకాల పొత్తుల్నీ జాగ్రత్తగానే అల్లుకుంటూ వచ్చాడు. ఇంటి ముందు ‘ఎన్డీఏ’ బోర్డు పెట్టుకున్నాడు. దొడ్లో ఇండియా కూటమిని కట్టేసుకున్నాడు. ఒక్క వైసీపీ తప్ప ఎవ్వరూ వ్యతిరేకం కాదు. అయినా గ్రాఫ్ వేగంగా పడిపోతున్నది. గుండె లయ తప్పుతున్నది. మాటలు తడబడుతున్నవి. దుష్ప్రచారాన్ని ఇప్పటికే ఆరున్నొక్క రాగంతో హైపిచ్‌కు తీసుకెళ్లారు. అయినా ఏదో వెలితి. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖల అధ్యక్షురాళ్లతో సమన్వయం కుదిరినా కూటమిలో కళ లేదు, కలవరం తప్ప! రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలను ఇద్దరు మహిళలే నడిపి స్తున్నందుకు గర్వపడాలో, ఒక ప్రాంతీయ పార్టీకి ఆ రెండు పార్టీల ఆఫీసులు సబ్–స్టేషన్లుగా మారినందుకు క్షోభ పడాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలది! యెల్లో కార్డ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియుక్తురాలైనప్పటి నుంచి టీడీపీ ప్రయోజనాలకే పురందేశ్వరి పెద్దపీట వేస్తున్నారని బీజేపీ కాషాయ టీమ్ వాపోతున్నది. టిక్కెట్ల పంపిణీలోనూ యెల్లో టీమ్‌కే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పోటీ చేస్తున్నదే 10 అసెంబ్లీ సీట్లకు! కానీ 22 మంది ఉన్నతాధి కారులను తొలగించాలని, వారి స్థానంలో ఫలానా వారిని నియ మించాలని బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఆమె ఎన్నికల సంఘా నికి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు – రామోజీల డ్రాఫ్టు కింద ఆమె సంతకం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక షర్మిల కూడా యెల్లో కూటమి ప్రయోజనాలకు అను గుణంగానే ప్రచారాన్ని ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రభుత్వాన్ని నిందించడం, ముస్లిం, మైనారిటీ ఓట్లను దూరం చేయడం అనే డబుల్ యాక్షన్ ప్రోగ్రామ్‌ను షర్మిలకు అప్పగించారు. ఈ కర్తవ్యంలో ఆమె టీడీపీ నేతలను కూడా మించిపోయి మాట్లాడుతున్నారు. మణిపుర్లో అల్లర్లు జరిగితే జగన్ ఖండించలేదట. మణిపుర్ అల్లర్ల నేపథ్యమేమిటి? దానికి మతం రంగు పులమాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కొండ ప్రాంతంలోని ప్రజలకూ, మైదాన ప్రాంత ప్రజలకూ మధ్యన చెలరేగుతున్న భూసమస్య. తెగల సమస్య. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం స్పందించాల్సిన సమస్య. భారత్‌లోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని కూడా ఖండించవచ్చు. కానీ ప్రయోజనముంటుందా? ఉక్రోషం ఎక్కువైతే చేసే విమర్శల్లో పస ఉండదు. బీజేపీకి జగన్ బానిసగా మారాడట! ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన వైఖరితో కేంద్రంతో సఖ్యంగా ఉంటే బానిసగా మారడమా? కేంద్రంలో జనతా పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఎంజీఆర్ సఖ్యంగానే ఉండేవారు. ఆయన బానిసగా మారినట్టా? ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారు. ఒడిషాకు ఈ విధానం వల్ల ప్రయోజనం కలుగుతున్నది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనేవి ఒక విధాన పరమైన నిర్ణయం. దీనికి పార్టీల ఐడియాలజీలతో సంబంధం లేదు. బీజేపీకి జగన్ బానిసగా మారితే ఎన్డీఏలోనే చేరేవాడు కదా! వైసీపీ సిద్ధాంతాలకూ, బీజేపీ సిద్ధాంతాలకు పొసగదు కనుకనే జగన్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తున్నది. ఇక వివేకా హత్యపై యెల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను మరింత బలంగా షర్మిల వినిపిస్తున్నారు. ఆమెకు చంద్రబాబు అప్పగించిన బాధ్యత కూడా అదే కదా! ఈ హత్యపై వివిధ కోణాల్లో తలెత్తుతున్న సందేహాలన్నీ షర్మిల పక్కన తిరుగుతున్న సునీత కుటుంబంవైపే వేలెత్తి చూపుతున్నాయి. అయినా విచారణ పూర్తి కాలేదు కనుక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎవరినీ హంతకులని సంబోధించడం లేదు. అటువంటి నాగరికమైన కట్టుబాటును కూడా షర్మిల గిరాటేశారు. చట్టాన్నీ, ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారు. అవినాశ్‌రెడ్డిని పదేపదే హంతకుడని సంబోధించారు. ఈ వైఖరిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అవి నాశ్ హుందాగా స్పందించారు. రెడ్‌కార్డ్ చంద్రబాబు, యెల్లో కూటముల కథ ముగిసింది. ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రెండు నెలలే. యెల్లో కూటమితో ఊరేగుతున్న ఉపగ్రహాలన్నీ పునరాలోచించుకోవాలి. కూటమి క్షుద్రవిద్యల కారణంగా, కుయుక్తుల కారణంగా జనంలో వారి పట్ల ఏవగింపు కలుగుతున్నది. క్షేత్ర సమాచారం ప్రకారం వైసీపీ ఓటింగ్ బలం 55 శాతానికి చేరుకున్నది. కూటమి ఉమ్మడి మద్దతు 41 శాతం. ఈ తేడా మరింత పెరగనున్నది. రాబోయే ఘోర పరాజయం తర్వాత యెల్లో కూటమి బతికి బట్టకట్టడం జరిగితే అదొక ప్రపంచ వింతే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇదా ప్రత్యామ్నాయం!
ఇది మేనిఫెస్టోల సీజన్. అధికార పక్షాల మాటెలావున్నా విపక్షాల మేనిఫెస్టోలు అమల్లోవున్న విధానాలను ధిక్కరిస్తున్నట్టు, నిలదీస్తున్నట్టు కనబడతాయి. తమ రాకను నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తాయి. ప్రజానీకానికి అలాంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. న్యూఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోకు అలాంటి లక్షణాలు లేశమాత్రమైనా కనబడవు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సెక్యులర్ విలువలకు తిలోదకాలిచ్చి హిందుత్వ రాజకీయాలనుపెంచి పోషిస్తున్నదని పదేళ్లుగా కాంగ్రెస్‌తో సహా వివిధ పక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ చిత్రంగా ‘న్యాయ్‌పత్ర’ పేరుతో విడుదల చేసిన 48 పేజీల మేనిఫెస్టోలో ఆ ప్రస్తావన లేదు. దర్యాప్తు సంస్థలు, ఇంటెలిజెన్స్ సంస్థలు చట్టబద్ధంగా పనిచేసేలా, వాటిపై చట్టసభల పర్యవేక్షణవుండేలా చర్యలు తీసుకుంటామన్న వాగ్దానం వినసొంపుగానే వుంది. కానీ తమ ఏలుబడిలోనే ఆ సంస్థలు భ్రష్టు పట్టడం మొదలైందని గ్రహించినట్టు లేదు! 27 పార్టీలున్న ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. గత ఆదివారం ఆ కూటమి ఆర్భాటంగా రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించింది. తీరా అధికార కూటమికి ప్రత్యామ్నాయం తామేనన్న విశ్వాసాన్ని కలగజేసే విధాన ప్రకట నకు మాత్రం కాంగ్రెస్ సిద్ధపడలేదు. వాగ్దానాలకేమి... మేనిఫెస్టోలో చాలావున్నాయి. వర్తమాన యుగంలో చాలా పార్టీలు అమలు చేయటం కోసం కాక జనాన్ని మభ్యపుచ్చటానికే ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి. వీటి మోహంలో పడి జనం ఓట్లు కుమ్మరిస్తారన్నది ఆ పార్టీల అంచనా కావొచ్చు. కానీ జనం తెలివిమీరారు. ఆచరణేమిటన్నది గమనిస్తున్నారు. ఉదాహరణకు ప్రజా ప్రతినిధులు ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే వారి సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటిస్తోంది. కానీ కళ్లముందు తెలంగాణలో బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌కు గోడ దూకుళ్లు స్పష్టంగా కనబడుతుండగా ఈ వాగ్దానానికి విలువుంటుందా? గతంలో బీఆర్ఎస్ చేసింది కనుక తామూ అదే చేస్తున్నామన్న సంజాయిషీ చెల్లదు. తానూ ఆ తానులోని ముక్కనేనని కాంగ్రెస్ చెప్పదల్చుకుంటే ఇలాంటి వాగ్దానాలకు చోటీయకూడదు. మేనిఫెస్టోలోని ‘పాంచ్ న్యాయ్–పచ్చీస్ గ్యారంటీస్’లో సామాజిక న్యాయం గురించిన హామీ వుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో ఈ అంశాలు ప్రస్తావన కొచ్చినవే. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, సమానత్వం వగైరాలు ఈ మేనిఫెస్టోలో వున్నాయి. బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలూ డిమాండ్ చేస్తున్న కులగణనకు కాంగ్రెస్ సంసిద్ధత తెలిపింది. స్వామినాథన్ కమిషన్ ప్రధానమైన సిఫార్సుల్లో ఒకటైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పిస్తామన్న వాగ్దానం కూడా వుంది. తమ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వహయాంలో ఈ పని ఎందుకు చేయలేకపోయారో మేనిఫెస్టో చెప్పలేదు. కనీసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులైనా వివరణనివ్వలేదు. విద్యార్థులు బ్యాంకులు నుంచి తీసుకొన్న విద్యారుణా లను రద్దు చేస్తామన్న హామీ నిరుద్యోగ యువతను ఆకర్షిస్తుంది. కానీ ప్రభుత్వరంగంలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని ఎందరు విశ్వసిస్తారన్నది అనుమానమే. ఎందుకంటే ఆ విష యంలో గత యూపీఏ సర్కారు తీరు నిరాశాజనకం. అటువంటి అసంతృప్తి ఉండబట్టే అప్పట్లో అన్నా హజారే నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో యువత భారీయెత్తున పాల్గొ న్నది. రిజర్వేషన్లపై ఇప్పుడున్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని, కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా కల్పిస్తామని మేనిఫెస్టో చెబుతోంది. అలాగే నిరుపేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు నేరుగా అందజేస్తామని అంటున్నది. 2018 ఏఐసీసీ సదస్సు దేశం మళ్లీ బ్యాలెట్ ఎన్ని కలకు మళ్లాలని తీర్మానించింది. కానీ చిత్రంగా మేనిఫెస్టో ఈవీఎం విధానంవైపే మొగ్గింది. అయితే ఎన్నికల చట్టాలను సవరించి ఈవీఎంలు, వాటికి అనుసంధానించే వీవీ ప్యాట్లు మరింత పార దర్శకంగా వుండేలా చూస్తామంటున్నది. అగ్నిపథ్ స్కీం రద్దు, జమ్మూ, కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా, న్యాయమూర్తుల నియామకాలకోసం ఎన్‌జేసీ, జీఎస్టీ చట్టాల ప్రక్షాళన వగైరా సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే అధికారపక్షంపై ఏయే అంశాల్లో విమర్శలున్నాయో చూసుకుని వాటన్నిటినీ మేని ఫెస్టోలో గుదిగుచ్చిన వైనం కనబడుతోంది. వోటర్లను ఆకర్షించటానికి అవతలి పార్టీకి మించి వాగ్దానాలు చేయటం, అధికారంలోకొచ్చాక వాటిని విస్మరించటం మన దేశంలో కొత్తగాదు. కానీ సైద్ధాంతికంగా అధికార పక్షానికి ప్రత్యా మ్నాయం అనే భావన కలగజేయటానికి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెద్దగా ప్రయత్నించలేదు. దాని ఆచరణ సైతం అదేవిధంగా వుంటున్నది. కేరళలోని వైనాడ్‌లో బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పార్టీ జెండాలు లేకుండానే రాహుల్ నిర్వహించిన రోడ్ షో చూస్తే ఈ సంగతి బోధపడుతుంది. బీజేపీపై ప్రధానంగా పోరాడుతున్నామంటూనే ఆ పార్టీ బలంగా వున్న ఉత్తరాదిని విడిచిపెట్టి రాహుల్ కేరళకు ఎందుకు వలస వచ్చారో కాంగ్రెస్ చెప్పలేకపోతోంది. ఆ సంగతలావుంచి రాహుల్ రోడ్ షోలో జెండాలు కనుమరుగవటానికి గల కారణాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. 2019లో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతోపాటు కనబడిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ జెండాతో పోల్చటంతో ఈసారి అవి రెండూ కనుమరుగయ్యాయి. ముస్లింలీగ్ జెండా ఏమిటో తెలియకుండానే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందా? సెక్యులర్ విలువలు పాటిస్తున్నామంటూనే ఇలాంటి విమర్శలకు బెదరటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో సైతం ఈ ధోరణినే ప్రతిబింబించింది. -
వృద్ధ జంబూకం ‘నాటో’
రెండు ఖండాలను కలుపుతూ ప్రపంచానికి శాంతినీ, సుస్థిరతనూ, రక్షణనూ వాగ్దానం చేస్తూ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పడిన నాటో కూటమి గురువారం తన 75 వసంతాల సంబరాలను జరుపుకొంది. అయితే ప్రకటిత సంకల్పానికీ, దశాబ్దాల దాని ఆచరణకూ ఎక్కడా పొంతన కనబడదు. నాటో నేపథ్యం, దాని ఉద్దేశాలు పూర్తిగా కొట్టిపారేయదగ్గవి కాదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ యూనియన్ సేనలు తూర్పు యూరప్ దేశాల్లో తిష్ఠవేసి కదల్లేదు. అవి తమవైపు చొచ్చుకు రావొచ్చన్న సందేహం పశ్చిమ యూరప్ దేశాలకుంది. తాము ఒక్కటై ఎదిరించకపోతే దురాక్రమణకు బలి కావటం ఖాయమన్న భయం వాటికి పట్టుకుంది. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జతకట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. సోవియెట్ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చటమే దీని ప్రధాన ధ్యేయం. నాటో దేశాలు రోజూ పరస్పరం సంభాషించుకుంటాయని, పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధ తలో వుంటాయని, తగిన నిర్ణయాలు తీసుకుంటాయని నాటో వెబ్సైట్ ఘనంగా చెబుతోంది. మంచిదే. కానీ ఇన్నేళ్ల దాని ఉనికిలో ఒక్కసారైనా సోవియెట్ యూనియన్ నుంచీ లేదా దాని ప్రస్తుత రూపమైన రష్యా నుంచీ ప్రత్యక్షంగా కావొచ్చు... పరోక్షంగా కావొచ్చు ఏనాడూ సవాళ్లు ఎదురు కాలేదు. సైనిక కూటమి ఆవిర్భావం దానికదే ప్రత్యర్థిని హద్దు మీరకుండా చేసివుండొచ్చన్న వాదన కూడా కొట్టి పారేయలేం. కానీ నాటో హడావిడి గమనించాక 1955లో సోవియెట్ యూనియన్ సైతం తన ఆధ్వర్యంలోని తూర్పు యూరప్ దేశాలను కలుపుకొని వార్సా కూటమి పేరుతో మరో సైనిక కూటమి నిర్మించింది. ఇరుపక్షాలూ అణ్వాయుధాలనూ, ఇతర భారీ ఆయుధ సామగ్రిని మోహరించటంతో ప్రచ్ఛన్న యుద్ధ దశలో యూరప్ ఖండం మొత్తం నిరంతర యుద్ధ భయంతో వణికింది. మరి ప్రపంచ శాంతి, సుస్థిరతల జాడెక్కడ? పరస్పర మోహరింపులతో నెలకొన్న ఒక రకమైన స్తబ్దతను శాంతిగా భావించటం సాధ్య మేనా? నాటో అంచనాకు తగ్గట్టు సోవియెట్ సేనలు దండయాత్రలు చేయకపోలేదు. 1956లో హంగరీ, 1968లో జెకొస్లోవేకియా, 1979లో అఫ్గానిస్తాన్ దేశాలను అవి దురాక్రమించాయి. కానీ యూరప్ ఖండంలోని తటస్థ దేశాలు ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వైపుగానీ... నాటో దేశాలవైపుగానీ చొచ్చుకొచ్చే ఆలోచన చేయలేదు. నిజానికి తాను కూడా నాటోలో చేరతానన్న సోవియెట్ యూనియన్ వినతిని 1954లో తోసిపుచ్చాకే వార్సా కూటమి ఏర్పడింది. 1989లో సోవియెట్ పతనం, అంతకుముందే తూర్పు యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా దాన్నుంచి దూరం జరగటం, వార్సా కూటమి కనుమరుగవటం వంటి పరిణామాల తర్వాత వాస్తవానికి నాటో అవసరం ఎంతమాత్రం లేదు. చిత్రం ఏమంటే... సోవియెట్ పతనానికి బాటలు పరిచిన నాటి అధ్యక్షుడు గోర్బచెవ్, ఆ తర్వాతకాలంలో ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం నాటోలో చేరటా నికి సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రతిపాదనను నాటో తోసిపుచ్చింది. అంతేకాదు... ఉభయ జర్మనీల విలీ నానికి సహకరించాలంటూ పశ్చిమ యూరప్ దేశాల నేతలు గోర్బచెవ్‌ను అర్థించినప్పుడు ఆయన కొక హామీ ఇచ్చారు. నాటోను ఒక్క అంగుళం కూడా విస్తరించబోమన్నదే ఆ హామీ సారాంశం. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. సోవియెట్ పతనం నాటికి నాటో సభ్య దేశాలు 16 కాగా, రష్యా అభ్యంతరాలనూ బేఖాతరు చేస్తూ మరో 15 దేశాలను చేర్చుకున్నారు. ఇందులో పూర్వపు వార్సా కూటమి దేశాలున్నాయి. కనీసం తన ఇరుగు పొరుగు దేశాలకు సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా ప్రతి పాదన సైతం బుట్టదాఖలా అయింది. పొరుగునున్న కెనడా, మెక్సికో దేశాలకు వార్సా కూటమి సభ్యత్వం ఇస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? నాటో పుట్టుకకు దారితీసిన మూలకారణమే మాయమైనప్పుడు విశాల యూరప్ భద్రత కోసం ఒక నూతన వ్యవస్థ ఏర్పాటు చేయటానికి బదులు రష్యాను ఏకాకి చేయాలన్న వ్యూహం వెనకున్న విజ్ఞతేమిటో ఆ కూటమి నేతలు చెప్పగలరా? నిజానికి నాటో చిత్తశుద్ధితో విశాల యూరప్ భద్రతపై దృష్టి సారించివుంటే పుతిన్ ఉక్రెయిన్ దురాక్రమణకు సాహసించేవారు కాదు. యూరప్ ఖండంలో అణ్వాయుధాల బెడద పూర్తిగా సమసిపోయేది. అసలు ప్రపంచ శాంతి, సుస్థిరతలకు దోహదం కలగటం మాట అటుంచి నాటో వల్ల ప్రపంచానికి వచ్చిన సమస్యలే అధికం. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ 200 సైనిక ఘర్షణలు చోటు చేసుకోగా అందులో 20 వరకూ విస్తృతమైనవి. వెళ్లినచోటల్లా విధ్వంసమే తప్ప నాటో సాధించిందేమీ లేదు. ఇందుకు లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా వగైరాలను ఉదా హరించవచ్చు. స్థానిక ప్రభుత్వాలను కూలదోసేందుకు విచ్చలవిడిగా మిలిటెంట్ సంస్థలకు నాటో ఆయుధాలందించటం పర్యవసానంగా ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ పురుడుపోసుకుంది. కనిపించని శత్రువుపై కత్తి ఝుళిపించటం కోసం నాటో సభ్యదేశాల్లో ప్రతి ఒక్కటీ తమ జీడీపీల్లో 2 శాతం నాటోకు అర్పిస్తున్నాయి. తన ఉనికి కోసం శత్రువును ‘సృష్టించుకునే’ ధోరణి నుంచి నాటో బయటపడనంతకాలం ఈ పరిస్థితి మారదు. ప్రపంచంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నించ టమా... నిరంతరం యుద్ధ భయంతో అణ్వాయుధాల నీడలో మనుగడ సాగించటమా అన్నది యూరప్ దేశాల ప్రజలే తేల్చుకోవాలి. -
నిప్పుల కొలిమి
ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి. వాస్తవానికి పదేళ్లుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగింది. పాత రికార్డులు బద్దలవుతున్నాయి. నిరుడు మార్చి ఎండ తీవ్రత 1901 నాటి రికార్డును అధిగమించిందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత వరసగా ఏప్రిల్, మే, జూన్ నెలలు వేటికవే అత్యధిక ఉష్ణోగ్రతల్లో కొత్త పోకడలను నమోదు చేశాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్న జోస్యాలు భయపెడుతున్నాయి. దీనికి తోడు ఈసారి వానలు సైతం అంతంతమాత్రం కావటంతో జలాశయాలు నిండుకున్నాయి. భూగర్భ జలాలు లోలోతులకు పోతున్నాయి. నిరుడు ఎల్‌నినో ప్రభావం కారణంగా దక్షి ణాసియా ప్రాంత దేశాలన్నీ తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. రివాజుగా జూన్ నెల మొదట్లో కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఏడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్ వరకూ మెరుగ్గానే వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడటంతో వరదలు కూడా ముంచు కొచ్చాయి. మొత్తానికి దాదాపు 94 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అక్టోబర్ మొదలుకొని మార్చి వరకూ వర్షాల మాట అటుంచి కనీసం మబ్బుల జాడైనా కనబడలేదు. ఇది చాలదన్నట్టు ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరగటంతో జలాశయాల్లో నీరు అంతంతమాత్రంగానే వుంది. ఈ మూడు నెలలూ సాధారణంగా అయితే నాలుగు నుంచి ఎనిమిది రోజులు మాత్రమే వడగాడ్పులు తీవ్రంగా వీచాలి. కానీ ఇది పది నుంచి 20 రోజుల వరకూ ఉండొచ్చని ఐఎండీ చెబుతోంది. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఉష్ణోగ్రతలూ, వడగాడ్పుల తీవ్రత అధికంగా వుండొచ్చని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. మండే ఎండలు, తీవ్ర వడగాడ్పులు, కుండపోత వర్షాలు, ముంచెత్తే వరదలు ఎవరూ ఆపగలిగేవి కాదు. కానీ ప్రపంచ దేశాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుని, సమర్థంగా అమలు చేయగలిగే కార్యాచరణను రూపొందిస్తే వీటి తీవ్రతను తగ్గించటానికి ఆస్కారం వుంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థలు(డబ్ల్యూఎంఓ) మొన్న మార్చి 19న విడుదల చేసిన ప్రపంచ వాతావరణ నివేదిక ఏమంత ఆశాజనకంగా లేదు. నిరుటికన్నా 2024 మరింత ప్రమాదకరంగా వుండగలదని హెచ్చరించింది. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు వంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో పరిమితులకు మించి పెరిగి పోవటం వల్ల ఉష్ణోగ్రతలు అధికమై సముద్ర ఉపరితల జలాలను వేడెక్కిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఆఖరికి అంటార్కిటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో భారీ మంచు పలకలు కరగటం నిరుడు బాగా ఎక్కువైందని వివరించింది. ఆర్థికవృద్ధి పేరుతో ప్రభుత్వాలు పర్యావరణానికి నష్టం చేకూర్చే విధానాలు అవలంబించటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. భారత, బంగ్లాదేశ్‌లలో పర్యావరణ విధ్వంసం వల్ల నిరుడు ఏప్రిల్ నెలలో వడగాడ్పుల తీవ్రత 30 రెట్లు పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు లెక్కేశారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల వల్ల సహజంగానే రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువకావొచ్చు. ఎన్నికల సీజన్ కావటంతో ఈ సమస్యపై వాగ్యుద్ధాల మోత కూడా ఎక్కువేవుంటున్నది. కారణం మీరంటే మీరని తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాలు మాటలు విసురుకుంటున్నాయి. ఆ మాటెలావున్నా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి వడ గాడ్పు లపై, ఎండల తీవ్రతపై ప్రజలను హెచ్చరించటం అవసరం. లేనట్టయితే వడదెబ్బ మరణాలు పెరిగే అవకాశం వుంది. మన దేశంలో వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించటం లేదు. చెప్పాలంటే వేటిని వడదెబ్బ మరణాలుగా లెక్కేయాలన్న అంశంలో ఎలాంటి కొలమానమూ లేదు. నిరుడు డిసెంబర్లో లోక్‌సభలో వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా లెక్కేసి, బాధిత ప్రజల సహాయపునరావాసాల కోసం నిధులందించాలని డిమాండ్ వచ్చింది. కానీ కేంద్రం నుంచి పెద్దగా స్పందన లేదు. పర్యవసానంగా బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందటం లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. ఎన్డీఎంఏ 2016 నుంచి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. అక్కడితో దాని పాత్ర ముగుస్తోంది. ఎండ తీవ్రత ఉన్నపుడు ఆరుబయట కార్మికులతో పనిచేయించకుండా చూడటం, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించటం, ప్రజారోగ్య సిబ్బందిని సంసిద్ధంగా ఉంచటం, అవసరమైన ప్రాంతాలకు సహాయబృందాలను తరలించటం కీలకం. ఇలాంటి జాగ్రత్తలతో వడగాడ్పు మరణాల నివారణ సాధ్యమే. అలాగే ఇరుకిరుకు ఇళ్లలో మగ్గి పోయే మురికివాడల ప్రజలనూ, మరీ ముఖ్యంగా వృద్ధులనూ, గర్భిణులనూ, బాలింతలనూ వడగాడ్పుల నుంచి సంరక్షించటానికి ఏం చేయగలమో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ కృషిలో స్థానిక సంస్థల పాత్ర పెంచటం, అందుకు అవసరమైన నిధులు అందించటం ప్రభుత్వాల బాధ్యత. అన్నిటికీ మించి వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి, ఆ విషయంలో పౌరులను అప్రమత్తం చేసేందుకూ, వారిని కాపాడేందుకూ అనుసరించాల్సిన విధానాలను రూపొందించటం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
చిరుదీవిలో ఎన్నికల చేపలవేట
ఎన్నికలంటే సాధారణంగా ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం లాంటివి ప్రస్తావనకొస్తాయి. కానీ, మూడు రోజులుగా ఓ విదేశాంగ విధానం ప్రధానాంశమై కూర్చుంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే తమిళనాట పోలింగ్ జరగనున్న వేళ ఆ రాష్ట్రానికి అతి సమీపంగా భారత – శ్రీలంకల మధ్యనున్న చిరుద్వీపం కచ్చతీవు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. స్టాలిన్ సారథ్యంలోని స్థానిక డీఎంకె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రి సహా సమస్త శక్తులనూ బీజేపీ కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికల మాట అటుంచితే, భారత సర్కారే ఒకప్పుడు శ్రీలంకకు అప్పగించిన ఓ ద్వీపప్రాంత ప్రాదేశిక హక్కులపై ఇప్పుడు రగడ చేయడం సబబేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా సముద్ర జలాల సరిహద్దులు మార్చేసే ప్రయత్నాలు ఎక్కడికి దారి తీస్తాయి? భారత్ – శ్రీలంకల మధ్య పాక్ జలసంధిలో 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పున్న చిన్న ప్రాంతం కచ్చతీవు. భారత్‌లోని రామేశ్వరానికి ఉత్తరాన 30 కి.మీ.ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు దక్షిణాన 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకమైనది. కచ్చతీవు చారిత్రకంగా జాఫ్నా రాజ్యంలో, ఆపైన రామ్నాడ్ సహా పలువురు రాజుల ఏలుబడిలో, బ్రిటీష్ వారి హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తాగునీటితో సహా ప్రాథమిక వసతులేవీ లేని ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చర్చి మినహా నివాసాలే లేవు. ఈ ద్వీపం తాలూకు ప్రాదేశిక హోదాపై భారత్, శ్రీలంకల మధ్య దీర్ఘకాలం వివాదం నెలకొంది. అయితే, 1974లో ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. శ్రీలంకతో పటిష్ఠ బంధానికై కేంద్రంలో ఇందిరా గాంధీ సారథ్యంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిరుద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించింది. ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత మోదీ నేతృత్వంలోని బీజేపీ భారత సమైక్యతకు విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్, డీఎంకెలు ‘నిర్లక్ష్యంగా’ ఆ ద్వీపాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసేశాయంటూ దాడికి దిగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల ‘సమాచార హక్కు’ పిటిషన్ ద్వారా ఇప్పటి దాకా బయటపడని ఈ ద్వీపం అప్పగింత వివరాలను తీసుకున్నారు. అవన్నీ మీడియాలో వచ్చాయి. దక్షిణాదిన, అందునా తమిళనాట బీజేపీ జెండా ఎగరేయాలని తరచూ పర్యటిస్తున్న ప్రధాని మోదీ దాన్ని అందిపుచ్చుకొన్నారు. ద్వీపం అప్పగింత తప్పుడు నిర్ణయమంటూ కాంగ్రెస్‌ను దుయ్య బట్టారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్వరం కలిపారు. సమీప శ్రీలంక జలాల్లో భారతీయ జాలర్లను పదే పదే అరెస్టు చేస్తున్నారంటే, అదంతా అప్పటి తప్పుడు నిర్ణయం ఫలితమేనని ఆయన ఆరోపణ. ఈ చిరుద్వీపానికి తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యం లేదని 1961 మేలోనే ప్రధాని నెహ్రూ అన్నారట. ద్వీపాన్ని అప్పగించినా చేపలు పట్టుకొనేందుకు భారతీయులకున్న హక్కుల్ని 1974 ఒప్పందంలో పరిరక్షిస్తున్నామంటూ పార్లమెంట్‌కు హామీ ఇచ్చిన నాటి సర్కార్ తీరా ఆ ప్రాంతంలో చేపలు పట్టే హక్కులను సైతం 1976లో వదులుకుందని జైశంకర్ నిందిస్తున్నారు. గత ప్రధానులు ఈ అంశంపై ఉదాసీనంగా ఉన్నా, భారత – శ్రీలంక సముద్రజలాల సరిహద్దు చట్టం అమలు, భారతీయ జాలర్ల హక్కులపై తమ సర్కార్ శ్రీలంకతో చర్చలు జరుపుతుందని ఆయన చెబుతున్నారు. గమ్మత్తేమిటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు గత పదేళ్ళుగా ఆ పని ఎందుకు చేయలేదో తెలీదు. అలాగే, ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనే పనిలో మోదీ సర్కార్ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ చెబుతోంది కానీ, అసలు ఇప్పటి దాకా ఆ అంశంపై మోదీ సర్కార్ నుంచి అధికా రిక సమాచారమే లేదని శ్రీలంక మంత్రి ఒకరు తేల్చేశారు. మరి, కచ్చతీవు అంశాన్ని బీజేపీ ఉన్న ట్టుండి ఎందుకు లేవదీసినట్టు? లోక్‌సభ ఎన్నికల తొలి దశలో భాగంగా ఈ నెల 19న తమిళనాట పోలింగ్ జరగనుంది. ప్రాంతీయ, భాషాభిమానాలు మెండుగా ఉండే తమిళనాట చొచ్చుకుపోవడా నికి తంటాలు పడుతున్న బీజేపీ దీన్ని ఓ అస్త్రంగా భావించింది. కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆ ద్వీపాన్ని ఇచ్చేస్తుంటే, అడ్డుకోని కరుణానిధి సారథ్యంలోని డీఎంకె సర్కార్‌దీ తప్పుందని బీజేపీ నిందిస్తోంది. తమిళ ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందడమే దాని అజెండాగా కనిపిస్తోంది. నిజానికి, ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేశాం. దీవి అప్పగింత విషయం అంతర్జాతీయ వ్యవహారం గనక అప్పట్లో కేంద్రం తమిళ సర్కార్‌కు సమాచారమిచ్చి ఉంటుందే తప్ప, సరేనన్న అనుమతి తీసుకొని ఉంటుందనుకోలేం. స్థానిక అనివార్యతల రీత్యా అప్పటి కరుణానిధి సర్కార్ నుంచి ఇప్పటి స్టాలిన్ సర్కార్ దాకా డీఎంకె ప్రభుత్వాలు శ్రీలంకతో ఒప్పందాన్ని నిరసిస్తూనే వచ్చాయి. చేపల వేటకు వెళ్ళే తమిళ జాలర్లు పదే పదే లంకేయుల చేతిలో అరెస్టవుతున్నారని చెబుతూనే ఉన్నాయి. ఆ మధ్య భారత – శ్రీలంక ప్రధానుల భేటీ ముందూ స్టాలిన్ ఈ సంగతి మోదీ దృష్టికి తెచ్చారు. అవేవీ పట్టించుకోని బీజేపీ ఎన్నికల ముందు ఈ అంశం పట్టుకోవడమే విడ్డూరం. ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం చూపే సున్నితమైన అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం తలకెత్తుకోవడం ప్రమాదకరం. నేపాల్ లాంటి పొరుగుదేశాలతోనూ అపరిష్కృత ప్రాదేశిక వివాదాలున్న భారత్ గతాన్ని తవ్వితే తలనొప్పులే. శ్రీలంకలో జాతుల యుద్ధం ముగిశాక వాణిజ్యం, ఇంధన, రవాణా రంగాల్లో ఇరు దేశాలూ ముందుకు సాగుతున్నాయి. పాత చరిత్రను ఆశ్రయిస్తే కొత్త దౌత్య యత్నాలకు చిక్కులు తప్పవు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో లంగరేయడానికి చైనా సిద్ధంగా ఉన్నవేళ కచ్చతీవు వివాదం అభిలషణీయం కానే కాదు. అయినా, మనమే వదులుకున్న ఈ దక్షిణాగ్ర ద్వీపంపై ఇంత ప్రేమ ప్రదర్శిస్తున్న పాలకులు ఉత్తరాన వేలాది చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకున్నట్టు వార్తలున్నా ఉలకరేం? పలకరేం? -
రాజధానిలో ప్రతిపక్ష గర్జన
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీ అనేక విధాల ప్రత్యేకమైనది. ‘లోక్తంత్ర్ బచావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) పేరిట సాగిన ఈ ర్యాలీకి నేతలే కాదు... ప్రజలూ పెద్దయెత్తున తరలిరావడం విశేషమైతే, ప్రతిపక్ష కూటమిని కొట్టి పారేస్తున్న విమర్శకులకు ఇది ఒక కనువిప్పు. అలాగే, క్రికెట్ లాగా ఈ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ర్యాలీలో చేసిన ఆరోపణ ఓ సంచలనం. కీలక ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం, పన్నుల భూతాన్ని పైకి తీసి పార్టీలను వేధించడం వగైరాలతో ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు లేకుండా చేస్తున్నారన్న వాదన కూడా జనసామాన్యంలోకి నెమ్మదిగా చొచ్చుకుపోతోంది. ఎన్నికల్లో తొలి ఓటు పడడానికి మరో మూడు వారాలైనా లేని పరిస్థితుల్లో... ప్రతిపక్ష కూటమి మొన్న జరిపిన మూడో ర్యాలీ అందరి దృష్టినీ ఆకర్షించింది అందుకే. మార్చి 3న పాట్నాలో ‘జన చేతన ర్యాలీ’, మార్చి 17న ముంబయ్‌లో రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ తర్వాత ఇది మూడోది. తాజా సభను ఎన్నికల ముందు సహజంగా జరిపే అనేక ర్యాలీల్లో ఒకటిగా చూడలేం. ఎన్నికలనగానే సర్వసాధారణంగా ఉపాధి అవకాశాలు, ధరల పెరుగు దల, ఇటీవల కులగణన, విభిన్న వర్గాల మధ్య సామరస్యం లాంటి అంశాలను ప్రతిపక్షాలు భుజాని కెత్తుకుంటాయి. కానీ, ప్రతిపక్షం ఈసారి ఏకంగా ఈ ఎన్నికలను జరిపే విధానంపైనే సందేహాలు వ్యక్తం చేయడం అసాధారణం. కేంద్రంలో గద్దె మీద ఉన్న బీజేపీ, దాని పెద్దలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వగైరాలను గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికల్లో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు సీఎంల అరెస్టు సహా పలు ఘటనల్ని కూటమి అందుకు ఉదాహరణగా చూపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకా శాల్ని కల్పించాల్సిన ఎన్నికల వాతావరణాన్ని ఇలా నాశనం చేశారంటోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, దుర్నీతి లేకుండా జరిగేలా చూడాలనే వాదనను బలంగా ముందుకు తెచ్చింది. సోరెన్, కేజ్రీవాల్‌ల సతీమణులు సహా మొత్తం 17 పార్టీలు పాల్గొన్న ర్యాలీ ఇది. కేవలం కేజ్రీవాల్‌కు సంఘీభావంగా కొలువు దీరారనే అపవాదు రాకుండా ఉండేందుకు వేదిక ముందున్న కటకటాల్లో కేజ్రీవాల్ బ్యానర్‌ను ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ పెద్దమనసుతో తొలగించడం విశేషం. మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి వారు గైర్హాజరైనా కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు సోనియా స్వయంగా పాల్గొన్న ఈ సభలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక, పలువురు ఇతర పక్షాల నేతలు నిప్పులు చెరిగిన తీరు వారి సమర్థకులకు ఉత్సాహజనకమే. అయితే, ఇంత చేసినా ఈ ర్యాలీ వెనుక అసలైన ఉద్దేశం పట్ల అనుమానాలు తొంగిచూస్తూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి కట్టుబడతామనీ, సమైక్యంగా ఉంటామనీ కూటమి పక్షాలు చెబుతున్నా వారి ఇమేజ్ ఎందుకో ఆశించినంతగా పెరుగుతున్నట్టు లేదు. ఇంకా ఏదో అపనమ్మకం, అనైక్యత, అస్పష్టత కొనసాగుతున్నాయి. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ – ఎల్డీఎఫ్, పంజాబ్‌లో కాంగ్రెస్ – ఆప్... ఇలా ‘ఇండియా’ కూటమి భాగస్వాములే పరస్పరం తలపడడం ప్రతిపక్ష ప్రయోజనాలకే భంగకరం. ఈ పరిస్థితుల్లో... తొలి దశ ఓటింగ్ దగ్గరపడు తున్నందున జనానికి తమపై నమ్మకం పెరిగేలా ప్రతిపక్షాలు అడుగులు వేయడం కీలకం. కేవలం మోదీని గద్దె దింపడమే కాదు... తమకంటూ స్పష్టమైన అభివృద్ధి అజెండా ఉందని కూటమి నమ్మకం కలిగించాలి. కలగూరగంప అంటూ అధికార పక్షం తక్కువ చేసి మాట్లాడుతున్న ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలు ఇకనైనా ఉద్యోగ కల్పన, ధరల నియంత్రణ, సంక్షేమం తదితర అంశాలపై కనీస ఉమ్మడి ప్రణాళికను ఓటరు దేవుళ్ళ ముందుంచాలి. కేజ్రీవాల్ సతీమణి సునీత పేర్కొన్న దేశమంతటా నిరంతర విద్యుత్ లాంటి అంశాలతో ప్రజానుకూల ఎన్నికల వాగ్దాన పత్రాన్ని ప్రకటించాలి. ‘మోదీ గ్యారెంటీ’కి పోటీగా ఇప్పటికే ప్రకటించిన అయిదు గ్యారెంటీలను కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్ళకుంటే ప్రయోజనం లేదు. ఢిల్లీ ర్యాలీతో వచ్చిన సానుకూలతను సద్విని యోగం చేసుకోవాలంటే దేశం నలుమూలలా ఇలాంటి సభలతో, ఇదే ఊపును కొనసాగించడం ముఖ్యం. కూటమిలో మమత ఉన్నట్టా లేనట్టా అని చెవులు కొరుక్కుంటున్న సమయంలో ఢిల్లీ సభలో ఆమె పార్టీ నేత పాల్గొని, కూటమిలో తృణమూల్ ఉంది, ఉంటుందని తేల్చిచెప్పడం ఊరట. దాదాపు 400 సీట్లలో బీజేపీతో ముఖాముఖి తలపడాలన్న కూటమి కల నెరవేరలేదు. బీజేపీ, దాని మిత్రపక్షాలు దాదాపు అభ్యర్థులందరినీ ఖరారు చేసి, ప్రచారం సాగిస్తున్నందున ఇప్పటికీ పోటీలో తమ అభ్యర్థుల్ని ఖరారు చేయని ప్రతిపక్ష కూటమి తక్షణమే కళ్ళు తెరవాలి. ఈ లోటుపాట్లు అటుంచితే, ‘నియంతృత్వాన్ని గద్దె దింపండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ఎన్నికల సంఘం ముందు కూటమి తాజాగా ఉంచిన అయిదు డిమాండ్లు అసంబద్ధమైనవని అనలేం. ప్రతిపక్షాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు ప్రభుత్వ సారథులు ప్రయత్నాలు సహా అనేకం అసత్యాలని అనలేం. అదే సమయంలో ఈ దొంగదెబ్బలను అడ్డుకొనేందుకు ఎన్నికల సంఘం తన పరిధిలో ఏమి చేయగలుగుతుందన్నదీ చెప్పలేం. అయితే, ప్రతిపక్షాల అనుమానాలు, ఆందోళనల్ని దూరం చేసి, నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక రాజ్యాంగబద్ధంగా తనకున్న విశేషాధికారాలను సద్వినియోగం చేయడం దాని చేతుల్లోనే ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికలను నిజాయతీగా, నిష్పక్ష పాతంగా నిర్వహించడమే దాని విధి. ఆ పని సవ్యంగా చేయడమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. ప్రతిపక్షాలు కోరుతున్నదీ అదే! -
ఇండియా ప్రయాణం
భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఒక ఆంగ్లేయుడి దృష్టి కోణంలో చూపే నవల ‘ఎ పాసేజ్ టు ఇండియా’. ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన ఇరవయ్యో శతాబ్దపు వంద గొప్ప నవలల్లో ఒకటిగా పరిగణన పొందిన ఈ రచనకు ఇది శతాబ్ది సంవత్సరం. తన బ్రిటిష్ రాజ్ అనుభవాలతో ఇ.ఎం. ఫార్స్టర్ 1924లో దీన్ని రాశారు. మరాఠా సంస్థానం దేవాస్ సీనియర్లో (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లో భాగం) మూడో తుకోజీరావ్ పవార్ వ్యక్తిగత కార్యదర్శిగా ఫార్స్టర్ 1921–22 మధ్య పనిచేయడమే కాకుండా, అంతకు పదేళ్ల ముందు ఒక ఏడాది పాటు ఇండియాలో పర్యటించారు. ఆ అనుభవాల సారాన్ని నవలకు వాడుకున్నారు. శీర్షికను మాత్రం అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ కవితా సంకలనం ‘పాసేజ్ టు ఇండియా’(1871) ప్రేరణతో తీసుకున్నారు. ఈ నవలను ఎంతోమంది సినిమా తీయాలని ప్రయత్నించినా, ఫార్స్టర్ పడనీయలేదు, సమతూకం తప్పుతారేమోనని! ఆయన చనిపోయాక(1970) అది సాధ్యపడింది. అదృష్టవశాత్తూ టైటిల్లోనే ఇండియా అనే మాటను నవల కలిగివుందనీ, వైభవోపేతమైన ఇండియాను గొప్పగా తెరకెక్కించవచ్చనీ ఉత్సాహపడ్డారు డేవిడ్ లీన్ . ‘ఎ పాసేజ్ టు ఇండియా’ పేరుతోనే, నవల వచ్చిన సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 1984లో సినిమా వచ్చింది. ఆ సినిమాకు కూడా ఇది నలభయ్యో సంవత్సరం. నల్లవాళ్లను చీవాట్లు పెట్టడం అతి మామూలు వ్యవహారంగా ఉండిన కాలం. మీదకు కారును తోలినా పశ్చాత్తాపం ప్రకటించాల్సినంతటి మనుషులు వీళ్లు కాదన్న అహంకారం తెల్లవాళ్లలో ఉన్న కాలం. ‘సామాజిక మేళనం’ అర్థంలేనిది అనుకునే కాలం. ‘వాళ్లందరూ ముందు పెద్ద మనుషులుగా ఉందామనే వస్తారు... అందరూ ఒకేలా తయారవుతారు; చెడ్డగా కాదు, మెరుగ్గా కాదు. నేను ఏ ఆంగ్లేయుడికైనా రెండేళ్లు ఇస్తాను... ఆంగ్ల మహిళకైతే ఆరు నెలలే’ అంటాడు డాక్టర్ అజీజ్. అయినా వాళ్లను ఆరాధించకుండా ఉండలేకపోవడం భారతీయుల బలహీనత అని అతడికి తెలుసు. అలాంటి కాలంలో అజీజ్‌తో స్నేహంగా ఉంటాడు హెడ్మాస్టర్ ఫీల్డింగ్. అజీజ్ తబ్బిబ్బయి పోతే, అదొక పెద్ద విషయంగా భావించడమే అర్థం లేనిదంటాడు. భార్య చనిపోయాక, ఇద్దరు పిల్లల్ని ఊళ్లో తల్లిదండ్రుల దగ్గర ఉంచి, సంపాదనంతా వాళ్లకే పంపుతుంటాడు అజీజ్. తనకు మించిన భారం అయినప్పటికీ తమ చంద్రాపూర్ పట్టణానికి వచ్చిన మిసెస్ మూర్, ఆమె యువ స్నేహితురాలు అడెలాను ‘మరబార్’ గుహల పర్యటనకు తీసుకెళ్తాడు అజీజ్. గుహలంటే అలాంటిలాంటివి కావు. ఎత్త్తైనవీ, చీకటైనవీ, నిర్జనమైనవీ. పరివారము, క్యాంపులు, ఖర్చులు! సిటీ మ్యాజిస్ట్రేట్ అయిన మూర్ కొడుక్కీ అడెలాకూ నిశ్చితార్థం అయివుంటుంది. తీరా అన్నీ ఒకేలా కనబడే ఆ చీకటి గుహల్లో, ఎండ మండిపాటులో, గుండె చప్పుడు సైతం ప్రతిధ్వనించే చోట మిసెస్ మూర్ అనారోగ్యం పాలవడమూ... విధిలేని పరిస్థితుల్లో అడెలా, అజీజ్ ఇద్దరే లోపలికి దారితీయడమూ, ఆ ఇరుకులో, ఆ గందరగోళంలో, ఆ భయంలో అజీజ్ తన మీద అత్యాచారం చేయబోయాడని రక్తమోడుతుండగా అడెలా కిందికి పరుగెత్తుకురావడమూ... తెల్లమ్మాయి మీద నల్లవాడి చేయా? ఆంగ్లేయులు పళ్లు కొరుకుతారు. నల్లవాడి మీద కేసు బనాయింపా? జనాలు వీధుల్లోకొస్తారు. కోర్టు కేసు సంచలనం అవుతుంది. ఇరుపక్షాలూ నిలబడి కలబడటమే తరువాయి! కథ ఏ బిందువు దగ్గర వచ్చి ఆగుతుంది, అక్కడి నుంచి పాత్రలు ఎలా పరిణామం చెందుతాయన్నది ఇందులో ముఖ్యం. తెల్లవాడికీ, నల్లవాడికీ మధ్య స్నేహం నిలబడుతుందా? ఒక పక్షం వహించని సమదృష్టి సాధ్యమేనా? వీటన్నింటిని మించిన మానవీయ విలువంటూ ఉండగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో మౌనంగా జవాబు దొరుకుతుంది. గుహల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ తన తలలో మొదలైన హోరు వల్ల అడెలా స్థిరంగా ఉండలేదు. పొరబడ్డానేమో అని కేసు ఉపసంహరించుకున్నాక హోరు పోతుంది. ప్రతి తెల్లమనిషిలోనూ గుబులు రేపుతున్న భారతీయుల స్వాతంత్య్రోద్యమపు నినాదాల హోరుకు సంకేతంగా దీన్ని తీసుకోవచ్చేమో! కేసు ఉపసంహరణ తర్వాత అడెలా ఇరవై వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నిశ్చితార్థం రద్దవుతుంది. అంత జరిమానా కట్టాలంటే అడెలా సర్వనాశనమై పోతుందనీ, దాన్ని ఉపసంహరించుకొమ్మనీ కోరినప్పుడు రెండు పక్షాలకూ హీరోగా నిలిచే డ్రామా ఆడుతున్నావని ఫీల్డింగ్‌ను నిందిస్తాడు అజీజ్. కేసు వల్ల పోయిన తన ప్రతిష్ఠ మాటేమిటని నిలదీస్తాడు. తెల్లవాళ్ల మెహర్బానీ కోసం జెంటిల్మన్ గా ప్రవర్తించాల్సిన అవసరం లేదనీ, వాళ్లతో కరాఖండిగానే వ్యవహరించడం తప్పదనీ అనుకుంటాడు. ‘దయ, మరింత దయ, ఆ తరువాత కూడా మరింత దయ’ను మాత్రమే ఫార్స్టర్ నమ్మారు. ‘నా దేశాన్ని మోసం చేయడమా, నా స్నేహతుడిని మోసం చేయడమా అని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నా దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంది’ అన్నారు. భారతీయులు పుట్టుకతో తాత్వికులు; రిక్షాను లాగేవాళ్లు కూడా కర్మ, పునర్జన్మల గురించి మాట్లాడుతారని మురిసిపోయారు. ఉర్దూ, హిందీ భాషలంటే ఇష్టపడే ఫార్స్టర్ హైదరాబాద్‌లోని ఉర్దూ హాల్ నిర్మాణానికి విరాళమిచ్చారు. ఆ గుహల్లో నిజానికి ఏం జరిగిందనేది నవల లోపల గానీ, బయట గానీ ఎప్పుడూ ఆయన వెల్లడించలేదు. అర్థవంతమైన మర్మం. ‘మనం ఎన్ని మానవ ప్రయత్నాలైనా చేయొచ్చు, కానీ ఫలితం ముందే నిర్ణయమైవుంటుంది’ అంటాడు నవలలో ప్రొఫెసర్ గోడ్బోలే. అడెలా ఇండియాకు రావడం కూడా అందులో భాగమేనన్నది ఆయన భావన. ఫార్స్టర్ ఇండియాకు వచ్చినప్పుడే ఈ నవల పుట్టుక నిశ్చితమైవుంటుంది! -
పెత్తందారుకు టిప్పర్ సవాల్!
మన సమాజం వర్గాలుగా విభజితమై ఉన్నమాట ఒక వాస్తవం. కులాలుగా విడిపోయి ఉన్న మాట కూడా నిజం. ఈ కుల–వర్గ వేర్పాటులో కొందరిది ఆధిపత్య స్థానం, మెజారిటీ ప్రజలది అణచివేతకు గురయ్యే స్థానం. అవమానాలను మోసే స్థానం. ఈ విభజన సత్యాన్ని గుర్తించే సాహసం మన రాజకీయ నాయకులు చస్తే చేయరు. ఆ సత్యం మీద మసిపూసి మాయం చేస్తారు. అందరి క్షేమం తమ ధ్యేయమంటారు. సకల జనుల శ్రేయోరాజ్యం తమ ఆశయమంటారు. సర్వేజనాః సుఖినో భవన్తని ఆశీర్వదిస్తారు. అభివృద్ధి–సంక్షేమం తమకు రెండు కళ్లంటారు. ‘పేదల కోసం సంక్షేమం, పెద్దలతోనే అభివృద్ధి’ అనే చిత్ర రచన చేస్తారు. పేదలకు తిండి దొరకని పరిస్థితిని ఈ సంక్షేమం అరికట్టగలిగింది. లేబర్ మార్కెట్ నిక్షేపంగా నిలబడేందుకు ఈ సంక్షేమాన్ని మన పాలకులు వెదజల్లుతారు. ఐదు రూపాయలకే భోజనం పెట్టేంత అపురూపమైన ఔదార్యాన్ని కూడా మన పాలకులు కనబరుస్తుంటారు. అది బాల్యవివాహమైనా సరే ఓ పాతిక వేలు సర్కారీ కట్నం చదివించి మంచి మనసును చాటుకుంటుంటారు. బాల్యవివాహం వల్ల పిల్ల చదువు ఆగిపోయినా లెక్క చేయరు. హిందూ,ముస్లిం, క్రైస్తవులకు ఒక్కో పండుగ చొప్పున ఓ సంచెడు ఉప్పూ, పప్పూ, చక్కెర వగైరాలతో స్వయం పాకాన్ని అందజేస్తారు. పండు ముదుసళ్లను పదిసార్లు తిప్పించుకున్నప్పటికీ ఓ వేయి రూపాయలను పెన్షన్‌గా అందజేసేంత విశాల హృదయం మన సంక్షేమ పాలకుల్లో ఉన్నది. కానీ, పేదలు సాధికారత సంతరించుకునే అవకాశాలు వీరి కార్యక్రమంలో ఉండవు. ఈ తరహా రెండు కళ్ల సిద్ధాంత ‘సంక్షేమ’ పాలకుల్లో మన చంద్రబాబు నాయుడు కూడా ఉంటారు. ఈ రెండు కళ్ల సిద్ధాంతంలో అభివృద్ధి – సంక్షేమం అనేవి రెండు సమాంతర రేఖలు మాత్రమే! ఒకదాన్నొకటి తాకదు. సంక్షేమం కోటాలోని జనం అభివృద్ధి కేటగిరీలోకి చేరిపోవడమనేది ఒక అరుదైన సన్నివేశం. లేబర్ మార్కెట్లోని ప్రజలు సంపన్న శ్రేణిలోకి చేరాలంటే వారికి నాణ్యమైన ఉచిత విద్య మొదటి షరతు. ఇక్కడే మన సంక్షేమ పాలకుల వర్గదృక్పథం బట్టబయ లయ్యేది. నాణ్యమైన ఉచిత విద్యకు మన పాలకులు ససేమిరా అంగీకరించరు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని ముఖ్య మంత్రి హోదాలోనే చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. విద్యారంగాన్ని వ్యాపారస్తుల రేస్‌కోర్స్‌గా మార్చిన ఘనుల్లో నిస్సందేహంగా చంద్రబాబు అగ్రగణ్యుడు. విద్యాబేహారులకు ప్రభుత్వ పాలనలో పెద్ద పీట వేసినవాడు చంద్రబాబు. పేదపిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య అందకుండా ఎన్ని విధాలుగా అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నించాడో మనం చూశాము. నాణ్యమైన విద్యకు బదులుగా నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ఎన్నికల సభల్లో చెప్పు కొస్తున్నారు. పైగా దాన్ని తక్కువ ధరలకే అందజేస్తారట. ఇంకో రెండు రోజులు పోతే డోర్ డెలివరీ కూడా చేస్తామంటారేమో! మద్యం ఆరోగ్యానికి హానికరమైనదని వైద్యులందరూ చెబు తారు. నాణ్యమైన మద్యమైతే నెమ్మదిగా చస్తారు. నాసిరకం మద్యమైతే వెంటనే చస్తారని ఆయన భావం కావచ్చు. ఈ చంపే యడంలో నాణ్యతా ప్రమాణాలు దేనికి? ప్రజలను సాధికారం చేసే విద్యలోనూ, ఆరోగ్య సమాజాన్ని నిర్మించే వైద్యంలోనూ నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పడం ప్రభుత్వం పనికాదనీ, అది ప్రైవేట్ వ్యాపారుల క్రీడాస్థలమనేది చంద్రబాబు సిద్ధాంతం. అందువల్లనే ఆయన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలమై పోయాయి. ఈ రెండు వ్యవస్థల్లోనూ కార్పొరేట్ రంగం రంకె లేసింది. ఐదేళ్ల జగన్ పరిపాలన అందుకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడమే కాదు, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాస్పత్రులు ఇప్పుడు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 58 వేల ఉద్యోగ ఖాళీలను 58 మాసాల కాలంలో భర్తీ చేయగలిగారు. అంటే నెలకు వేయి ఖాళీల చొప్పున భర్తీ. ప్రభుత్వం ఎంత ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇది సాధ్యమవుతుంది? వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాస్పత్రులను ఆధునికం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో పీరియాడికల్‌గా ప్రభుత్వ వైద్యుడు పర్యటిస్తాడు. రోగగ్రస్తులందరి రికార్డు ఆయన దగ్గరుంటుంది. క్రమం తప్పకుండా ఆయనే వాళ్లను పరీక్షించి మందులిస్తాడు. ఆ రకంగా ప్రతి పేదరోగికీ ఒక ఫ్యామిలీ డాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చిన ఉత్తమ విధానానికి ఈ ఐదేళ్లలోనే శ్రీకారం చుట్టారు. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. విద్య, వైద్య రంగాల్లో ఏ పాలకుని వైఖరి ఏమిటో తెలిస్తే ఆ పాలకుని వర్గ స్వభావమేమిటో చెప్పవచ్చు. చంద్రబాబు పుట్టుకరీత్యా పేదవాడే కావచ్చు. కానీ ఎత్తుజిత్తులతో పెత్తందారీ శ్రేణిలో చేరిన ఆయన ఆ వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఒక ఉగ్రవాదిగా మారిపోయాడు. ఇందుకు పూర్తి భిన్నంగా సంపన్న కుటుంబంలో పుట్టిన జగన్మోహన్రెడ్డి పేదల ఎజెండాను భుజానికెత్తుకున్నాడు. పేదవర్గాలు–మహిళల సాధికారతను తన పార్టీ సిద్ధాంతంగా ప్రకటించుకున్నాడు. సమాజంలోని రెండు వైరివర్గాల గురించి ప్రస్తావించడమే కాకుండా ఈ రెండు వర్గాల మధ్యన యుద్ధం జరుగుతున్నదనీ, ఈ యుద్ధంలో తాను పేద వర్గాల తరఫున అర్జునుడి పాత్ర పోషిస్తాననీ కూడా ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో క్లాస్ వార్ (వర్గ పోరాటం) గురించి మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే. కమ్యూనిస్టులు చెప్పే క్లాస్ వార్ వేరు. వర్గపోరు గురించి మాటలు చెప్పే కమ్యూనిస్టులు ఆచరణలో వర్గదృక్పథాన్ని కోల్పోయి ఉనికిని పోగొట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కమ్యూనిస్టులుగా ప్రకటించుకునే వారిలో కొంత మంది పెత్తందారీవర్గ ప్రవక్త చంద్రబాబు చుట్టూ చేరి చిడతలు వాయించే స్థితికి దిగజారిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలోనే పేదల విముక్తి కోసం క్లాస్ వార్‌కు పిలుపునిచ్చి భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని జగన్మోహన్రెడ్డి సృష్టించారు. ఈ క్లాస్ వార్ మరో సారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనాన్ని సృష్టించబోతున్నది. క్షేత్ర స్థాయి ప్రజా స్పందనల అంచనా ప్రకారం 2019 ఎన్నికల ఫలి తాలే పునరావృతం కాబోతున్నాయి. తాను పెత్తందారీ వర్గ ప్రయోజనాల కిరాయి మనిషిననే విషయాన్ని చంద్రబాబు తన చేతల్లోనే కాదు మాటల్లో కూడా పదేపదే వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగమే మొన్నటి టిప్పర్ ఎపిసోడ్. అనంతపురం జిల్లా సింగనమల నియోజక వర్గం నుంచి వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్‌కు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన విద్యాధికుడైనప్పటికీ బ్రతుకుతెరువు కోసం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పార్టీ కార్యకర్తగా కూడా పని చేస్తున్న అతని సేవలను గుర్తించి జగన్మోహన్రెడ్డి అతడిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. పెత్తందారీ మనస్తత్వం నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు ఈ ఎంపికను అవహేళన చేస్తున్నారు. సింగనమలలో జరిగిన టీడీపీ సభలో మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్ అనే మాటను పదేపదే వెటకారంగా ఒత్తి పలికారు. ఇటు వంటి నిశానీగాళ్లకు ఓటేస్తే ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతారని ఎద్దేవా చేశారు. అంటే పేదవాళ్లు అజ్ఞానులనీ, వాళ్లు రాజకీయాలకు అనర్హులనే అర్థంలో మాట్లాడారు. ఈవిధంగా మాట్లాడటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని మీడియా సమావేశంలోనే ఆయన తన మనస్తత్వాన్ని బయట పెట్టు కున్నారు. నాయీ బ్రాహ్మణ (బీసీ వర్గం) ప్రతినిధులను మీడియా సమక్షంలోనే ‘మీ తోకలు కత్తిరిస్తాన’ని బెదిరించారు. బీసీలకు జడ్జీ పదవులు ఇవ్వొద్దని, వారందుకు తగరని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వానికే ఆయన స్వయంగా లేఖ రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అని మహిళా విద్వేషాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు. నాయకుడి నుంచి ఈ స్ఫూర్తిని తీసుకొని పేదవర్గాలపై ఆయన అనుచరగణం చేసిన దాష్టీకం అంతా ఇంతా కాదు. ఎన్నికల యుద్ధంలో తలపడకుండా పేద వర్గాలను, సంఘ సేవకులను దూరం చేసిన భాగ్యశాలి కూడా చంద్రబాబే. ఎన్టీఆర్ మరణానంతరం ప్రజాదరణ పెద్దగా లేని తాను నెగ్గుకు రావడం కోసం ఉపఎన్నికల సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చుపెట్టి సంచలనం సృష్టించారు. అప్పటినుంచీ అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎన్నిక ఏదైనా సరే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయగలవారినే నిలబెట్టడం మొదలుపెట్టారు. ఆయన్ను చూసి మిగిలిన పార్టీల వాళ్లు కూడా అంతో ఇంతో అనుసరించక తప్పలేదు. పెట్టుబడి – రాజ కీయాల మధ్యన ఉండే పరోక్ష బంధం నాటినుంచి ప్రత్యక్షంగా మారిపోయింది. వందల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలిచి పోవడమనే అప్రజాస్వామిక ధోరణికి గేట్లు తెరిచినవాడు చంద్ర బాబు. ఈ అక్రమార్జనపరులైన కోటీశ్వరులపై సామాన్యులు విజయభేరి మోగించినప్పుడే మళ్లీ మన సిసలైన ప్రజాస్వామ్యం మన చేతికొస్తుంది. టిప్పర్ డ్రైవర్‌గా చంద్రబాబు అవహేళన చేసిన వీరాంజ నేయులు సింగనమలలో విజయఢంకా మోగిస్తేనే ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుంది. మడకశిరలో ఉపాధి హామీ కూలీ లక్కప్ప భారీ మెజారిటీతో నెగ్గితే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు వికసిస్తుంది. చదువుల సరస్వతీదేవిని అంగడి సరుకుగా మార్చి లక్షలాది సామాన్యుల రక్తం తాగి తెగబలిసి వేలకోట్లు ఆర్జించిన నారాయణ నెల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తు న్నాడు. వందల కోట్లు వెదజల్లి గెలవాలని చూస్తున్నాడు. అతడితో తలపడుతున్న సామాన్యుడు స్వర్ణకార వృత్తి చేసుకునే ముస్లిం మైనారిటీకి చెందిన ఖలీల్ అహ్మద్ గెలిస్తేనే ప్రజా స్వామ్యం గెలిచినట్టు! అనకాపల్లి లోక్‌సభ సీటుకు సీఎం రమేశ్ పోటీ చేస్తున్నాడు. ఈయన మనిషి బీజేపీలో ఉంటాడు. ఆత్మ తెలుగుదేశంలో ఉంటుంది. స్నేహం కాంగ్రెస్‌తో ఉంటుంది. కాంట్రాక్టుల పేరుతో భారీ ఎత్తున అక్రమార్జన చేశాడని ప్రతీతి. చంద్రబాబుకు బినామీగా కూడా చెబుతారు. ఇప్పుడు ఎంపీగా గెలవడం కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకూ వందకోట్ల చొప్పున ఖర్చు చేస్తాడట! డబ్బు విసిరితే గెలుస్తామనే ధీమా. ప్రజల వివేకం మీద చిన్నచూపు. ఇతని మీద పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు రాష్ట్ర మంత్రి. పేరుకు మంత్రే కానీ,ఆర్థికంగా సామాన్యుడు. ఇప్పుడిక్కడ బీసీ వెలమ వర్సెస్ ఓసీ వెలమ, లోకల్ వర్సెస్ నాన్ లోకల్, సామాన్యుడు వర్సెస్ సంపన్నుడి మధ్యన పోటీ జరగబోతున్నది. సామాన్యుడు గెలి స్తేనే ధనస్వామ్యం తోక ముడుస్తుంది. ప్రజాస్వామ్య పతాకం రెపరెపలాడుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిందలూ... నిజాలూ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఉదంతంపై అంతర్జాతీయంగా వచ్చిపడుతున్న వ్యాఖ్యానాలు, విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రకటనతో ఈ సంగతి రుజువవుతోంది. మొదట జర్మనీ, ఆ తర్వాత అమెరికా చేసిన వ్యాఖ్యానాలపై మన దేశం ప్రతిస్పందిస్తుండగానే ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి సైతం కేజ్రీవాల్ కేసులో నిష్పక్షపాతంగా, పారదర్శ కంగా వ్యవహరించాలని సూచించటం సాధారణ విషయం కాదు. పైగా ఢిల్లీలోని అమెరికా దౌత్య వేత్త గ్లోరియా బెర్బేనాను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి మన అసంతృప్తిని, అభ్యంత రాన్ని తెలియజేసి 24 గంటలు గడవకుండానే రెండోసారి కూడా కేజ్రీవాల్ కేసులో అమెరికా ఆందో ళన వ్యక్తం చేసింది. దాంతోపాటు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటాన్ని కూడా ప్రస్తా వించింది. ఇక అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటన సరేసరి. అన్ని టికీ అతీతమని భావించుకునేవారు సైతం అనుకోకుండా వచ్చిపడే పొగడ్తలకు లోలోన సంతోషపడకుండా వుండలేరు. అలాగే విమర్శలొచ్చినప్పుడూ, తప్పును ఎత్తిచూపినప్పుడూ పౌరుషం పొడుచు కురావటం కూడా సహజం. పాశ్చాత్య దేశాలు అవసరార్థమో, అనివార్య పరిస్థితుల్లోనో మన దేశాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఉదంతాలు కోకొల్లలు. అయితే వాటినుంచి వచ్చే విమర్శలు అలా కాదు. అవి అరుదే కావొచ్చుగానీ ఆలోచించదగినవి. ఇందిరాగాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించి దేశాన్నే జైలుగా మార్చినప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనంతరకాలంలో మేధావులనూ, పౌరహక్కుల సంస్థల నేతలనూ అరెస్టు చేసిన సందర్భాల్లో పాశ్చాత్య ప్రపంచంస్పందించకపోలేదుగానీ... ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై వెలువడుతున్న స్పందన తీవ్రత అధికం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలకూ, అవి ప్రాతినిధ్యంవహించే రాజ్యాలకూ అంతర్జాతీయంగా ఆమోదనీయత, విశ్వసనీయత వుంటాయి. అయితే అస మ్మతి విషయంలో వాటి వైఖరి ఎలావుందన్నదాన్నిబట్టి ఆ ప్రభుత్వాల నైతిక స్థితి నిర్ణయమవుతుంది. దాన్ని పొందాలంటే సంయమనం పాటించటం, విమర్శలను హుందాగా స్వీకరించటం, పాలనలో పారదర్శకంగా వుండటం అవసరమవుతాయి. అగ్రరాజ్యాలు అన్నాయని కాదుగానీ, మన దేశంలో అంతా సవ్యంగానే వున్నదని భావించగలమా? కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారమే తీసుకుంటే దాదాపు రెండేళ్లనుంచి మద్యం కుంభకోణం గురించీ, అందులో కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా పేరు వినిపిస్తూనే వుంది. కానీ తనను తక్షణం విడుదల చేయాలన్న కేజ్రీ వాల్ వాదనకు జవాబిచ్చేందుకు మూడు వారాల వ్యవధి కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానాన్ని కోరటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన వాదనను పూర్వపక్షం చేసే పకడ్బందీ ఆధారాలు ఆ సంస్థ వద్ద ఉంటే వాటిని న్యాయస్థానం ముందుంచి ఈ కారణాల రీత్యా కేజ్రీవాల్ వాదన చెల్లదని వెనువెంటనే చెప్పలేని స్థితిలో వుండటం ఈడీ తీరుతెన్నులపై అనుమా నాలు రేకెత్తించదా? ఆమధ్య మనీశ్ సిసోడియా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయనపై అప్రూవర్లు ఇచ్చిన ప్రకటనలు మినహా తమ వద్ద వేరే ఆధారాల్లేవని సుప్రీంకోర్టు ముందే ఆసంస్థ అంగీకరించింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆ అంశంపైనే నిలదీస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిపై ఎవరో ఆరోపణలు చేస్తే కేవలం వాటి ఆధారంగా అరెస్టు చేయటం సబబేనా అని న్యాయస్థానం ముందు వినిపించిన వాదనల్లో ఆయన ప్రశ్నించారు. దేనికైనా సమయం, సందర్భం చూసుకోవాలంటారు. ఒకపక్క సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో వున్నాయి. అన్ని పార్టీలూ తమ తమ సత్తా చాటేందుకు పొత్తులు ఖరారు చేసుకుని వ్యూహరచనలో మునిగాయి. ఇలాంటి సమయంలో విపక్ష కూటమి అధినేతను అరెస్టు చేయటం విమర్శలకు ఆస్కారమిస్తుందని తెలియనంత అమాయకత్వంలో ఈడీ వున్నదంటే నమ్మలేం. మరో మూడు నాలుగు నెలలు ఆగితే ఇందులో కొంపమునిగేది ఏముందన్న ప్రశ్నకు ఆ సంస్థ దగ్గర జవాబులేదు. నేరం నిరూపణయ్యేవరకూ నిందితుడు నిర్దోషేనని న్యాయ శాస్త్రం చెబుతుంది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో తప్ప నిందితులను జైలుకు పంపరాదని ఇటీవల సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కింది కోర్టులకు హితవు పలికారు. పౌరులకు రాజ్యాంగం కల్పించే ఈ రక్షణలను విస్మరించటం, నీరు కార్చటం బాహాటంగా కనిపిస్తుంటే విమర్శలు రావా? మన దేశంలో ఇప్పటికీ ఇతర వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థకు విశ్వసనీయత అధికం. దాన్ని మరింత పెంచేలా ప్రభుత్వ విభాగాల వ్యవహారశైలి వుండాలి. దానికి విఘాతం కలిగితే పాలకపక్షం సంగతలావుంచి దేశ పరువుప్రతిష్ఠలకే భంగం వాటిల్లుతుంది. అమెరికా రెండోసారి కూడా అన్నదనో, జర్మనీ విమర్శించిందనో, ఐక్యరాజ్యసమితి సైతం మాట్లాడిందనో కాదు... చట్టం ముందు పౌరులంతా సమానమన్న రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా లేదా అన్న అంశంలో ఆత్మవిమర్శ చేసుకోక తప్పదు. సహ ప్రజాస్వామిక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం విషయంలో బాధ్యతతో మెలగాలనీ, దాన్ని విస్మరించటం సరికాదనీ మన విదేశాంగ శాఖ హితవు పలికింది. కానీ మానవహక్కుల ఉల్లంఘనల అంశంలో మనం కూడా వేరే దేశాల తీరుతెన్నులను విమర్శించిన సందర్భాలున్నాయని గుర్తించాలి. మనం అన్ని విషయాల్లోనూ సక్రమంగానే వున్నామన్న భావన ఇంటా బయటా కలగజేయటం ప్రభుత్వ బాధ్యత. దానికి భిన్నమైన పరిస్థితులుంటే అవి ఎందుకు తలెత్తాయో సమీక్షించుకోవటం అవసరం. -
మంచు ఎడారిలో నిరసన మంట
ఆమిర్‌ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చాలామందికి తెలుసు. కానీ, అందులో ఆమిర్ పోషించిన ఫున్సుఖ్ వాంగ్దూ పాత్రకు స్ఫూర్తినిచ్చిన ఇంజనీర్, విద్యాసంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌ఛుక్ గురించి బహుశా కొందరికే తెలుసుంటుంది. ఇటీవల చేసిన నిరవధిక నిరాహార దీక్ష పుణ్యమా అని ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. ప్రపంచమంతటా మారుమోగి పోయింది. హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్‌లో శరీరం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆయన సాగించిన నిరశన ఉద్యమానికి మద్దతుగా వేలాది జనం ముందుకు రావడం విశేషం. 21 రోజుల అనంతరం మంగళవారం ఆయన నిరాహార దీక్ష ముగిసినప్పటికీ, లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి నుంచి అలవిమీరిన అభివృద్ధితో అపాయంలో పడుతున్న ఆ ప్రాంత జీవావరణం దాకా అనేక అంశాలు చర్చలోకి రాగలిగాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకున్నా, ప్రస్తుతానికైతే లద్దాఖ్ ప్రజలు తమ డిమాండ్లను పాలకుల ముందు మరోసారి ఉంచి, ఒత్తిడి తేగలిగారు. నిజానికి, దాదాపు 3 లక్షల జనాభా గల లద్దాఖ్‌లో మొత్తం 8 తెగల వాళ్ళుంటారు. 2019 ఆగస్ట్ 5న మునుపటి జమ్మూ – కశ్మీర్ నుంచి విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే ఈ ప్రాంత ప్రజలు లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలనీ, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనీ, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలనీ, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలనీ డిమాండ్ చేస్తున్నారు. 2020 నుంచి వారు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠ – తాజా ఉద్యమం. లద్దాఖ్ ప్రాంతపు ఉన్నత ప్రాతినిధ్య సంస్థ, అలాగే కార్గిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్’ (కేడీయే) మద్దతుతో నెలన్నర క్రితమే ఫిబ్రవరి మొదట్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో కూర్చొని లద్దాఖ్‌ను ఆడించాలనుకుంటే కుదరదంటూ ప్రజల్లోని అసమ్మతిని ఆ ప్రదర్శన తేటతెల్లం చేసింది. కీలకమైన విధాన నిర్ణయాలలో తమ స్థానిక స్వరాలకు చోటులేకపోవడమే ఈ నిరసనలకు ప్రధాన ప్రేరకమైంది. ఒకప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జమ్మూ–కశ్మీర్ విధాన పరిషత్‌కు స్పీకర్,ఎంపీ... ఇంతమంది ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతానికి ఉండేవారు. అలాంటిది ప్రస్తుతం అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికార గణపాలన. లద్దాఖ్‌కు మిగిలింది ఇప్పుడు పోర్ట్ ఫోలియో లేని ఒకే ఒక్క ఎంపీ. జిల్లాకు ఒకటి వంతున రెండు స్వతంత్ర పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళు ఉన్నప్పటికీ, అధికారాల పంపిణీపై స్పష్టత లేదు. ఇక, ఆర్టికల్ 370 రద్దు అనంతరం తీసు కున్న ప్రశ్నార్హమైన పాలనాపరమైన నిర్ణయాలు అనేకం. దానికి తోడు ఆకాశాన్ని అంటుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో జనం గగ్గోలు పెడుతున్నారు. భూ హక్కులలో మార్పులు, అలాగే స్థానిక ప్రయోజనాలకు విరుద్ధమైన పారిశ్రామిక విధాన రూపకల్పన లాంటివి ప్రజాగ్రహాన్ని పెంచాయి. లద్దాఖీ ఉద్యమకారుడు వాంగ్‌ఛుక్ దీక్షకు అంతటి స్పందన రావడానికి అదే కారణం. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున దాదాపు మంచు ఎడారిలా జనావాసాలు తక్కువగా ఉండే లద్దాఖ్ పర్యావరణ రీత్యా సున్నిత ప్రాంతం. అక్కడ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన అజెండా పైనా విమర్శలున్నాయి. పర్యాటకం ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థలో కీలకమే కానీ, దాన్ని అంతకు అంత పెంచాలని పర్యావరణానికి హాని కలిగిస్తే మొదటికే మోసం. లే ప్రాంతంలో మెగా ఎయిర్పోర్ట్,ఛంగ్థాంగ్ బయళ్ళలో 20 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సోలార్ పార్క్ లాంటి ప్రణాళికలపై ప్రభుత్వం పునరాలోచించాలని వాంగ్‌ఛుక్ లాంటివారు కోరుతున్నది అందుకే. పర్యావరణానికీ, స్థానికుల ప్రయోజనాలకూ అనుగుణంగానే అభివృద్ధి ఉంటే మేలు. లద్దాఖ్ సాంఘిక, సాంస్కృతిక ప్రత్యేకతల్ని పరిరక్షించేలా ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌నూ పాలకులు గుర్తించాలి. లద్దాఖ్, కార్గిల్‌లు రెండూ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, ఒకే ఎంపీ ప్రాతినిధ్యానికి తగ్గిపోవడమూ చిక్కే. ఈ రెండు విభిన్న ప్రాంతాలకు చెరొక పార్లమెంటరీ స్థానంపై ఆలోచించాలి. చైనాతో సరిహద్దులో నెలకొన్న లద్దాఖ్ కీలకమైనది. అందులోనూ హిమాలయ ప్రాంతంలో తన పరిధిని విస్తరించుకోవాలని డ్రాగన్ తహతహలాడుతున్న వేళ వ్యూహాత్మకంగానూ విలువైనది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకొనే భయాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. లద్దాఖ్ ప్రజల నమ్మకాన్ని చూరగొని, వారిని కలుపుకొని ముందుకు సాగడం ముఖ్యం. గతంలో శ్రీనగర్ నుంచి, ఇప్పుడేమో ఢిల్లీ నుంచి పాలిస్తున్నారే తప్ప స్వపరిపాలన సాగనివ్వడం లేదనే భావనను వారి నుంచి పోగొట్టడం ముఖ్యం. ఈ ఏడాది జనవరి మొదట్లో కేంద్ర హోమ్ శాఖ ఉన్నతాధికార సంఘాన్ని (హెచ్పీసీ) వేసింది. గత శనివారంతో కలిపి 3 భేటీలు జరిగినా పురోగతి లేదు. హెచ్పీసీ హోమ్ మంత్రి లేకపోగా, తాజా భేటీకి సహాయ మంత్రి సైతం గైర్హాజరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు వారికి చిత్తశుద్ధి ఉందా అన్నది అనుమానాలు రేపుతోంది. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ పాలనలోని పలు వైఫల్యాలను సహించి, భరించిన లద్దాఖ్ ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిర సన తెలిపారు. స్థానిక ఆకాంక్షలకు తగ్గట్టు న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఢిల్లీ పాలకులు సైతం ప్రజాభీష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం మేలు. లద్దాఖ్ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాటల్లోనే కాదు... చేతల్లోనూ చూపడం అవసరం. లేదంటే, మున్ముందు వాంగ్‌ఛుక్ దీక్షల లాంటివి మరిన్ని తలెత్తక తప్పదు. -
పాలస్తీనాపై అమెరికా ‘ప్రేమ’!
మన కళ్లను మనమే నమ్మలేని అరుదైన అసాధారణమైన ఉదంతాలు చరిత్రలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. సోమవారం భద్రతామండలిలో జరిగిందదే. గాజాలో ఇజ్రాయెల్ దాష్టీకాన్ని నిలిపేయాలని, తక్షణం బేషరతు కాల్పుల విరమణ పాటించాలని కోరే తీర్మానంపై జరిగిన వోటింగ్‌కు అమెరికా గైర్హాజరైంది. నిరుడు అక్టోబర్‌లో హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడిచేసి 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా తీసుకుపోయారు. ఆ ఘటనలో అనేకమంది గాయాలపాలయ్యారు. ఆ సంస్థ చెరలో ఇంకా 134 మంది వరకూ వున్నారని అంచనా. ఆనాటినుంచీ ఇజ్రాయెల్ పగబట్టి గాజాలోని జనావాస ప్రాంతాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. బాంబుల మోత మోగిస్తోంది. ఎడతెగని ఈ దాడుల్లో ఇంతవరకూ 32,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. లక్షలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆకలితో అలమటిస్తున్న వారు ఆహారం తీసుకొచ్చిన వాహనాలపైకి ఎగబడినప్పుడు వారిని అదుపు చేసే పేరిట అమానుషంగా ప్రవర్తించటంతోపాటు కాల్చిచంపుతున్న ఉదంతాలకు కొదవలేదు. మంచినీరు, ఆహారం,మందుల కొరతతో పాలస్తీనా పౌరులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథం, విధ్వంసం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనివి. ఇజ్రాయెల్‌ను సమర్థించటానికి అలవాటుపడిన అమెరికా, పాశ్చాత్య దేశాలు దీన్నంతటినీ నిర్వికారంగా చూశాయి. అదేమంత విషయం కాదన్నట్టు మొదట్లో వ్యాఖ్యానించాయి. భద్రతామండలిలో ఇజ్రాయెల్‌ను అభిశంసిస్తూ ఇంతవరకూ వచ్చిన మూడు తీర్మానాలను వీటో చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘యుద్ధం సాగుతున్నప్పుడు పౌరుల మరణాలు సంభవించటం రివాజే’ అని వ్యాఖ్యానిస్తే ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఒకపక్క ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి అందజేస్తూ, అంత ర్జాతీయ వేదికలపై దాని దురాగతాలను సమర్థిస్తూ... మరోపక్క పౌర ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ దేశానికి సుద్దులు చెబుతూ అమెరికా కాలక్షేపం చేసింది. హమాస్ అంత మొందేవరకూ ఇజ్రాయెల్ దాడులు ఆగరాదనీ, అలా ఆపితే అది ఆ మిలిటెంటు సంస్థకు బలం చేకూరుస్తుందనీ వాదించింది. అంతర్జాతీయంగానూ, స్వదేశంలోనూ వస్తున్న ఒత్తిళ్ల కారణంగా దాదాపు ఆర్నెల్లయ్యాక ఇన్నాళ్లకు ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే తీర్మానంపై వోటింగ్‌లో గైర్హాజరైంది. నిజానికి ఇది కంటి తుడుపు చర్య. ఆ తీర్మానాన్ని సమర్థించి, ప్రతీకారానికి కూడా హద్దులుంటాయని చెప్తే వేరుగా వుండేది. ఇకపై ఇజ్రాయెల్‌కు అన్ని రకాల సాయం నిలిపేస్తామని ప్రకటించివుంటే హుందాగా వుండేది. వాటన్నిటి బదులూ వోటింగ్‌కు గైర్హాజరు కావటంవల్ల పెద్దగా ఒరిగేది వుండదు. హమాస్ ఉగ్ర దాడిని ఎవరూ సమర్థించటం లేదు.దాని దుందుడుకు చేష్టలు స్వతంత్ర పాలస్తీనా లక్ష్యానికి విఘాతం కలిగిస్తాయని, రాజ్యాల అమానుష కృత్యాలకు సాధారణ పౌరులపై కక్ష తీర్చుకోవటం పరిష్కారం కాదని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు దుయ్యబట్టాయి. అయితే గత ఏడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలు తక్కువేమీ కాదు. నిజానికి పాలస్తీనా సమస్య సాకుగా ఇజ్రాయెల్‌లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్న మితవాద పక్షాల వైఖరివల్లే పరిష్కారం జటిలంగా మారింది. పాలస్తీనా పౌరుల నిరాశానిస్పృహలే మిలిటెంటు సంస్థ లకు ఊపిరులూదాయి. పాలస్తీనా మనోభావాలను బేఖాతరు చేసి ఇజ్రాయెల్ ఆవిర్భావానికి కారణమై, దాని దురాక్రమణలకు వంతపాడుతూ వచ్చిన అమెరికా, పాశ్చాత్య దేశాల వైఖరి సైతం మిలిటెంట్లకు బలం చేకూర్చింది. భద్రతామండలి తీర్మానాన్ని అమెరికా వీటో చేయకుండా గైర్హాజరు కావటం సహజంగానే ఇజ్రాయెల్‌కు మింగుడుపడటం లేదు. ఆ దేశ ప్రధాని నెతన్యాహూ అలకబూనారు. జో బైడెన్‌తో చర్చల కోసం వాషింగ్టన్ వెళ్లబోతున్న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటనను చివరి నిమిషంలో రద్దుచేశారు. చరిత్ర తిరగేస్తే ప్రతి మలుపులోనూ ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలబడిన సంగతి కనబడుతుంది. దాని అకృత్యాలను తక్కువచేసి చూపడం లేదా మూర్ఖంగా సమర్థించటం కళ్లకు కడుతుంది. అదే సమయంలో ప్రతి సందర్భంలోనూ అమెరికా హితవచనాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేయటం కూడా తేటతెల్లమవుతుంది. ఈ యేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలుండటం, ఇజ్రాయెల్ సేనలు నిరాటంకంగా ఊచకోతను కొనసాగించటం బైడెన్‌కు ఇబ్బందిగా మారింది. ఒకపక్క ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా సాయపడుతూ కూడా దాన్ని కించిత్తు కూడా ప్రభావితం చేయ లేని బైడెన్ తీరు ఆయన బలహీనతను ప్రస్ఫుటం చేసింది. ఇదంతా చివరకు తన విజయావకా శాలను దెబ్బతీసేలా వున్నదని ఆయన గ్రహించారు. పర్యవసానంగా భద్రతామండలిలో భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఇది తమ విధానానికి అనుగుణంగానే వున్నదని అమెరికా చెబుతున్నా ఇజ్రాయెల్ స్పందననుబట్టే నిజానిజాలేమిటో గ్రహించవచ్చు. ఏదేమైనా భద్రతామండలి తీర్మానం ఆశించిన విధంగా గాజాలో తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. రంజాన్ మాసం పూర్తయ్యే వరకూ ఇది అమల్లోవుండాలని తీర్మానం కాంక్షిస్తున్నా ఈ కాలంలో ఉద్రిక్తతలు ఉపశమిస్తే... బందీల విడుదల జరిగితే అది శాంతికి దోహదపడుతుంది. ఆ పరిణామం సమస్య శాశ్వత పరిష్కారానికి దారితీస్తే అంతకన్నా కావలసిందేముంది? ఇజ్రాయెల్ మంకుపట్టు విడనాడాలి. గాజాలో హంతక దాడులకు స్వస్తి చెప్పాలి. తన సైన్యం చేసిన దురాగతాలపై విచారణకు అంగీకరించాలి. -
అసమానతల భారతం
ప్రపంచం ముందుకు పోతోంది... దేశం శరవేగంతో సాగిపోతోంది... అని పాలకులు భుజాలు ఎగరేస్తున్న వేళ కళ్ళు తిరిగే గణాంకాల లెక్క ఇది. అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో కొందరు అంతెత్తున ఉంటే, అనేకులు అధఃపాతాళంలోనే ఉన్నారని తేలింది. భారతదేశంలో ఆదాయం, సంపదల్లో అస మానతలు గడచిన శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా తారస్థాయికి చేరాయని ‘వరల్డ్ ఇనీక్వా లిటీ ల్యాబ్’ అధ్యయన పత్రం వెల్లడించింది. నోబెల్ బహుమతి గ్రహీత థామస్ పికెట్టీ సహా నలుగురు ప్రసిద్ధ ఆర్థికవేత్తలు రూపొందించిన ఈ పత్రం ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని తెలిపింది. ఆదాయ అసమానతలో మన దేశం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాలను సైతం వెనక్కి నెట్టేసింది. బ్రిటీషు పాలనలో కన్నా ఇప్పుడే భారత్‌లో అసమానతలు ఎక్కువయ్యా యట. ఇది ఆందోళన రేపుతోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ‘భారతదేశ ఆదాయం, సంపదల్లో అసమానత 1922 – 2023: బిలియనీర్ల రాజ్య ఆవిర్భావం’ అనే ఈ పత్రం అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 2000ల నుంచి దేశంలో అసమానతలు తారాపథానికి దూసుకుపోయాయి. ప్రస్తుతం దేశ సంపదలో 40 శాతం పైగా కేవలం ఆర్థిక బలసంపన్నులైన అగ్రశ్రేణి 1 శాతం మంది దగ్గరే పోగుబడింది. దేశ ఆదాయం లెక్కన చూస్తే 22.6 శాతం ఈ కొందరి వద్దే ఉంది. ఇక, కింది 50 శాతం జనాభా జాతీయ ఆదాయం మాత్రం 15 శాతమే. వెరసి, గడచిన ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేనట్టు అత్యధిక స్థాయిలో ఒకేచోట సంపద పోగుబడుతోంది. మరో ముఖ్య విషయమేమంటే, భారత్‌లో ఆర్థిక సమాచార నాణ్యత అంతంతే గనక వాస్తవిక అసమానతా స్థాయులతో పోలిస్తే పత్రంలో పేర్కొన్న అంచనాలు ఇంకా తక్కువేనట. పైనున్న వర్గాలు పైపైకి పోతుంటే, కింది వర్గాలు ఇంకా కిందకు పోయేలా ఆర్థిక అసమానతలు పెరగడం ఆందోళన రేపుతోంది. సమాజంలో అశాంతి, అస్థిరత పెచ్చరిల్లే ముప్పుంది. ఇలాంటి అంతర్జాతీయ నివేదికలే కాదు దేశంలోని స్థానిక నివేదికలు సైతం అసమానతల్ని పట్టిచూపుతున్నాయి. కర్ణాటకలోని ప్రగతివాద బృందాల సమ్మేళనమైన ‘బహుత్వ కర్ణాటక’ సైతం దేశంలో, ముఖ్యంగా కన్నడ సీమలో పెరుగుతున్న ఆదాయ అసమానతల్నీ, ఉపాధి రంగంలోని ఆందోళనకరమైన ధోరణుల్నీ ఈ మధ్యే తన నివేదికలో వివరించింది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి వృద్ధి, ఆదాయ సమానత అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ‘గ్యారెంటీ’ ప్రకటనలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ మధ్య ఉన్న అంతరాన్ని వెల్లడించింది. నిజానికి, కేంద్రంలోని ప్రస్తుత పాలకులు పదేళ్ళ క్రితం అభివృద్ధి, ఆర్థిక సంస్కరణల అజెండాతో గద్దెనెక్కారు. తమ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వంతున వృద్ధి చెందిందనీ, ముఖ్యంగా 2023లో ఆఖరి మూడు నెలల్లో అత్యంత వేగంగా ఈ పురోగతి సాగిందనీ వారు జబ్బలు చరుస్తున్నారు. అయితే, వారు అధికారంలో ఉన్న ఈ రెండుసార్లలోనే బీద, గొప్ప తేడా బాగా పెరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. పైపెచ్చు, ఢిల్లీ సర్కార్ శతకోటీశ్వరులకు సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపణలు సరేసరి. గమనిస్తే 1991నాటి ఆర్థిక సరళీకరణ ఆసరాగా దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 1991లో వారి సంఖ్య కేవలం 1 కాగా, 2022 నాటికి 162కు పెరిగిందని ఫోర్బ్స్ పత్రిక కథనం. పికెట్టీ తాజా పత్రం ఫోర్బ్స్తో పాటు పలు పత్రికలనూ, ఇతర అధ్యయనాలనూ ఉటంకించింది. అవన్నీ దేశంలో ధనికులకూ, గ్రామీణ నిరుపేదలకూ మధ్య అంతరం పెరుగుతోందని నిర్ధారిస్తున్నాయి. అయితే, ప్రపంచంలో అసమానత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటనే మాట సత్యదూరమనే వారూ లేకపోలేదు. పికెట్టీ అధ్యయన విధానం పారదర్శకంగా లేదనీ, అసమానతల్ని పెంచి చూపేలా ఫోర్బ్స్ వగైరా నుంచి సంపన్నుల జాబితాలను ఎంచుకుంటున్నారనీ దశాబ్ద కాలంగా విమర్శకుల అభ్యంతరం. అయితే ఎంత ఎక్కువనే మాట పక్కనపెడితే... దేశంలో ఆర్థిక అసమానతలు ఇప్పటికీ గణనీయంగా ఉన్నాయనేది ఎవరూ కాదనలేనిది. వాటిని తగ్గించడానికి ప్రయత్నించడమే కర్తవ్యం. దారిద్య్రాన్ని తగ్గించడానికి వీలుగా వృద్ధిపై పెట్టడం వల్ల ఇటు ఆదాయ, సంపదల్లో అసమాన తలు పెరిగినప్పటికీ అదే పంథాను అనుసరించాలా అన్నది మరో ప్రాథమిక ప్రశ్న. 1960 – 80ల మధ్య పై శ్రేణిలోని 10 శాతంతో పోలిస్తే, దిగువనున్న 90 శాతం మంది గణనీయంగా వృద్ధి సాధించారు. ఆర్థికసరళీకరణ అనంతరం మాత్రం మిగతా జనాభా కన్నా అగ్రశ్రేణి వర్గమే పైకెదిగింది. ఇక, 2014–2022 నడుమ దిగువ 50 శాతంతో పోలిస్తే, మధ్య 40 శాతం జనాభా వృద్ధి నిదానించింది. అగ్రస్థాయి 10 శాతం వారి పురోగతేమో ఆపలేని వేగం అందుకుంది. ధనిక, పేద తేడాకు ఇది ప్రధాన కారణం. మొత్తానికి గత దశాబ్దిన్నరలోనే అసమానతలు హెచ్చాయనేది నిర్వివాదాంశం. శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిందనే వాస్తవాన్ని గుర్తిస్తే... ఆర్థిక వ్యత్యాసాల్ని చక్కదిద్దడానికి తాజా పత్ర రచయితలు చేసిన కొన్ని విధాన సూచనల్ని కొట్టిపారేయలేం. సంపద పంపిణీ దృష్ట్యా చూస్తే, పేదలతో పోలిస్తే ధనికులు తక్కువ పన్నులు కట్టే ఇప్పటి విధానంలో మార్పు తేవాలి. ఆదాయం, సంపదలు రెంటినీ పరిగణించేలా పన్ను షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించి, భారత్‌లోని బిలియనీర్ల పైన సూపర్ ట్యాక్స్ విధించాలని వారు సూచిస్తున్నారు. అలాగే, బీదాగొప్ప తేడాల్ని తగ్గించేందుకు వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలపై దృష్టి సారించాలి. స్వల్పకాలిక వరాల కన్నా సుస్థిర, దీర్ఘకాల దారిద్య్ర నిర్మూలన పథకరచన సాగించాలి. సంక్లిష్టమైన ఈ వృద్ధి, దారిద్య్రం, ఆర్థిక అసమానత లాంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనం చేయాలి. ప్రజాస్వామ్య భారతం ధనికస్వామ్యంగా మారితేనే కష్టం, నష్టం. -
ప్రపంచానికి మాస్కో పాఠం
ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. శుక్రవారం రాత్రి మాస్కో సమీపంలో క్రిక్కిరిసిన మాల్‌లోకి వచ్చి, ఓ సంగీత కార్యక్రమ హాలులోని జనంపై నలుగురు తీవ్రవాదులు జరిపిన విచక్షణారహితమైన దాడి ప్రపంచ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో కనివిని ఎరుగని ఈ స్థాయి దాడిలో దాదాపు 140 మందికి పైగా అమాయకులు ప్రాణాలు విడిస్తే, కొన్ని పదుల మంది గాయాల పాలయ్యారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ అయిదోసారి ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే ఈ దుశ్చర్య జరగడం గమనార్హం. యథేచ్ఛగా కాల్పులు జరిపి, భవనాన్ని తగులబెట్టిన దుండగులకు ఉక్రెయిన్‌తో లింకుందని రష్యా గూఢచర్య సంస్థల మాట. అయితే, 2022 నుంచి రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ మాత్రం తమకు సంబంధం లేదని ఖండించింది. కాగా, ఈ దాడి తామే చేసినట్టు తీవ్రవాద ‘ఐఎస్ఐఎస్’(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) శాఖ అయిన ‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరసాన్ ప్రావిన్స్’ (ఐఎస్ఐఎస్–కె) ప్రకటించడంతో కొత్త చర్చకు తెర లేచింది. జనబాహుళ్యం ప్రాంతాల్లో ఇస్లామిస్ట్ ఉగ్రదాడుల ప్రమాదం ఉందని అమెరికా మార్చి 7 నాటికే హెచ్చరించింది. అయినా, రష్యా పెడచెవిన పెట్టింది. అలా ఈ దాడులు మాస్కో స్వీయ భద్రతా వైఫల్యానికి అద్దం పట్టడమే కాక, ఆ దేశానికి తలవంపులయ్యాయి. మాస్కో శివారులోనే తీవ్ర వాదులు చులాగ్గా దాడి చేస్తుంటే, ఉక్రెయిన్‌పై యుద్ధంతో తీరిక లేని రష్యాకు తగిన ప్రత్యేక దళాలు అందుబాటులో లేకుండా పోయాయనే మాటా వినిపిస్తోంది. అయినా సరే, దేశంలో అసమ్మతిపై ఉక్కుపాదం మోపి, ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతంపైగా ఓట్లు తెచ్చుకొని, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రజామోదం ఉందని చెప్పుకుంటున్న రష్యా పాలకులు ఇప్పటికీ తప్పుడు దిశ వైపు చూస్తుండడం ఆశ్చర్యకరం. స్వయంకృతమని భావిస్తున్న తీవ్రవాద ముప్పుకూ పాశ్చాత్య ప్రపంచాన్నే నిందిస్తుండడం విచిత్రం. రెండు దశాబ్దాల పైగా ఉత్తర కాకసస్, చెచెన్యాలలో తీవ్రవాదంపై రష్యా తలపడుతోంది. సిరియా – ఇరాన్‌లతో దాని స్నేహం, మధ్యప్రాచ్యంలో దాని తీవ్రవైఖరి సరే సరి. ఇస్లామిజమ్ అణచివేతకూ దిగింది. దానికిప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విశ్లేషణ. నిజానికి, ఇరాక్, సిరియా దేశాల యుద్ధక్షేత్రాల్లో అసలైన ఐఎస్ఐఎస్ చాలా వరకు ఓటమి పాలైంది. అయితే, ఆ మాతృసంస్థ తాలూకు రక్తసిక్త వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న ‘ఐఎస్ ఐఎస్ –కె’ పడగ విప్పి, బుసలు కొడుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి పనిచేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్న ఈ వర్గం నిదానంగా తన విషవృక్షపు ఊడలను విస్తరిస్తోంది. ఇప్పటికే అటు అఫ్గానిస్తాన్‌లోనూ, ఇటు పాకిస్తాన్‌లోనూ అది అనేక దాడులు జరిపింది. ఈ జనవరిలో సైతం ఇరాన్‌లోని కెర్మాన్‌లో ఇరానియన్ జనరల్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా అది జరిపిన బాంబు దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా మాస్కో దాడితో ఈ తీవ్రవాద గ్రూపు భౌగోళికంగా తన పరిధిని విస్తరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2015 నాటి సిరియా అంతర్యుద్ధంలో రష్యా సేనలు అక్కడి అధ్యక్షుడు బషర్ అల్–అసద్ ఏలుబడిని సమర్థిస్తూ, ఐఎస్ వర్గానికి వ్యతిరేకంగా నిలిచాయి. సిరియాలో ప్రస్తుతం సద్దు లేనందున ‘ఐఎస్ఐఎస్–కె’ సారథ్యంలోని తీవ్రవాదులు అక్కడ తమ ఓటమికి ఇప్పుడిలా దాడి రూపంలో రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఉండవచ్చు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో మునిగిన పుతిన్ ఈ తాజా తీవ్రవాద దాడిపై స్పందించే తీరు రానున్న రోజుల్లో ప్రపంచ శక్తి సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయం. అసలు దాడికీ, ఉక్రెయిన్‌కూ సంబంధం ఉందన్న రష్యా మాట నమ్మశక్యంగా లేకపోగా, మధ్య ఆసియా ప్రాంతానికి విస్తరించాలని ‘ఐఎస్ఐఎస్–కె’ పడుతున్న ఆరాటానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. తజిక్ వర్గాల్లో ఈ తీవ్రవాద వర్గానికి ఆకర్షణ పెరుగుతోందనీ, ఈ ప్రాంతానికి విస్తరించే సత్తా దానికి ఉందనీ జనవరిలోనే ఐరాస భద్రతా మండలి తన నివేదికలో హెచ్చరించడం గమనార్హం. గత రెండు దశాబ్దాల్లో వివి«ద రకాల తీవ్రవాద ఘటనలు చూసిన మాస్కో కళ్ళు తెరిచి నిద్ర నటించడం మానాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శుష్క ఆరోపణలు మానేసి, సమస్య అసలు మూలాలపై దృష్టి పెట్టాలి. సొంత పెరట్లోనే ఈ తీవ్రవాద వర్గంతో పోరాటం చేస్తున్న అఫ్గానిస్తాన్ పాలకులతో కలసి కార్యాచరణ చేపట్టాలి. రష్యా ఘటన సాక్షిగా ఇప్పుడు కావాల్సిందల్లా... తీవ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ఒక స్పష్టమైన అవగాహన, అంగీకారం. అంతర్జాతీయంగా ఐఎస్ఐఎస్–కె ఊడలు మరింత లోతుగా దిగక ముందే వివిధ ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. మునుపు ఐఎస్‌ను మట్టి కరిపించడానికి కలసికట్టుగా కాలు కదిపినట్టే ఇప్పుడూ ముందుకు కదలాలి. ఐఎస్ఐఎస్–కె బలంగా వ్యతిరేకించే అఫ్గాన్ తాలిబన్‌తో అంతర్జాతీయ సమాజం సైతం సమన్వయం చేసుకోవాలి. సొంత గడ్డపై ఐఎస్ఐఎస్–కె, టీటీపీ లాంటి తీవ్రవాదుల కార్యకలాపాలను అనుమతించడం వల్ల చివరకు తమ దేశంతో పాటు, ఈ ప్రాంత భద్రతకే ప్రమాదమని అఫ్గానిస్తాన్ కూడా గ్రహించాలి. అందుకే, ఆ దేశం, దాని పొరుగునున్న ఈ తీవ్రవాద విషసర్పం కోరలు పీకే పనిలో ముందు వరుసలో నిలవాలి. ఇరాన్, చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు కలిసొచ్చి, ప్రాంతీయంగా ముప్పుగా పరిణమిస్తున్న ఈ తీవ్రవాద భూతాన్ని నిర్వీర్యం చేయాలి. ఏకాగ్ర దృష్టితో సునిశితమైన కార్యాచరణకు దిగితేనే ఫలితాలుంటాయి. అప్పుడే అసువులు బాసిన అమాయకుల పక్షాన నిలిచి, దోషులను వెంటాడి వేటాడగలం. పొంచివున్న సరికొత్త తీవ్రవాద వర్గపు ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడగలం. -
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్‌ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆ కంటెయినర్‌ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్‌పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్‌ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్‌తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్‌నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్‌ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్‌బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్‌ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్‌ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్‌తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్‌ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్‌ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్‌ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్‌ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్‌ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్‌ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్‌లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్‌ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్‌ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్‌ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఈడీ చెరలో కేజ్రీవాల్!
పీఠం ఎక్కింది మొదలు కేంద్రం కంట్లో నలుసులా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కటకటాల వెనక్కి వెళ్లక తప్పింది కాదు. గురువారం రోజంతా జరిగిన డ్రామాకు పతాకస్థాయిగా రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను అదుపు లోకి తీసుకున్నారు. దర్యాప్తునకు హాజరు కావాలంటూ తొమ్మిది దఫాలు ఈడీ పంపిన సమన్లను ఆయన బేఖాతరు చేస్తూ రాగా, పదోసారి నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్ అధికార నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించటంతో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్యవ హారం కీలకమలుపు తిరిగింది. మొన్న జనవరి 31న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను భూకుంభకోణంలో ఈడీ అరెస్టు చేయగా, ఆ వరసలో అరెస్టయిన రెండో ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అవినీతికి వ్యతిరేకంగా పుష్కరకాలం క్రితం అన్నా హజారే నాయకత్వాన ఢిల్లీలో రగిలిన నిరసనో ద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు చివరకు అలాంటి ఆరోపణల్లోనే చిక్కుకుని అరెస్టు కావటం ఒక వైచిత్రి. అప్పటి యూపీఏ ప్రభుత్వం 2జీ స్ప్రెక్ట్రమ్ కేటాయింపుల్లో రూ. 1.76 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకులు ఆరోపించారు. ఆ కేసులో సీబీఐ సరైన సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడి 2017లో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తీర్పుపై 2018 మార్చిలో సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను ఆరేళ్ల తర్వాత శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఐఆర్ఎస్ కొలువుకు రాజీనామా చేసి ఉద్యమంలోకొచ్చిన కేజ్రీవాల్‌ను ఆదినుంచీ వివాదాలు చుట్టుముడుతూనే వున్నాయి. అవినీతి వ్యతిరేకోద్యమం చల్లారి దాన్లోని ప్రముఖులంతా తెరమరు గవుతున్న రోజుల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్థాపించటం ఆయన సహచరులకు మింగుడు పడలేదు. ఉద్యమాన్ని స్వలాభానికి వాడుకుంటున్నాడంటూ అనేకులు విరుచుకుపడ్డారు. తొలుత ఆయనతో చేతులు కలిపిన కేంద్ర మాజీ న్యాయ మంత్రి శాంతి భూషణ్, ఆయన కుమారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు కొద్దికాలంలోనే కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేస్తూ వైదొలిగారు. అధికారంలోకొచ్చాక ఆయనపై దాదాపు డజనుసార్లు దుండగులు దాడిచేశారు. ఇంకుతో, కోడిగుడ్లతో, కర్రలతో, రాడ్లతో ఈ దాడులు జరిగాయి. ఒకసారైతే దుండగుడు పాదాభి వందనం చేస్తున్నట్టు నటించి ముఖంపై కారం జల్లాడు. అవినీతి వ్యతిరేకోద్యమంలో కీలక పాత్ర పోషించిన అనేకమంది మాదిరే కేజ్రీవాల్ కూడా సంఘ్ పరివార్ సంస్థలతో సన్నిహితంగా మెలిగిన వారే. అందుకే ఆప్ స్థాపన వారికి నచ్చలేదంటారు. 2013లో స్వల్ప ఆధిక్యతతో తొలిసారి అధికారం చేపట్టినప్పుడు నాటి యూపీఏ సర్కారుతో పేచీ తప్పలేదు. ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకొ చ్చినా ఏదో ఒక అంశంపై ఘర్షణ కొనసాగుతూనేవుంది. లెఫ్టినెంట్ గవర్నర్లుగా వచ్చినవారు ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపుల్లలేయటం, కొన్నిసార్లు న్యాయస్థానాల జోక్యంతో ఆయన విజయం సాధించటం రివాజైంది. నిజానికి కేజ్రీవాల్ కార్యక్షేత్రం చిన్నది. ఆయన ప్రభావం ఢిల్లీకి పరిమితం. పంజాబ్‌లో సైతం ఆప్ ప్రభుత్వాన్ని స్థాపించగలిగినా అది నిలకడగా వుండగలదా అన్నది ప్రశ్నార్థకం. మతం, కశ్మీర్ తదితర అంశాల్లో కేజ్రీవాల్ వైఖరి బీజేపీకి భిన్నమేమీ కాదు. అందువల్ల ఆయనపై అస్త్రాలు సంధించి బలహీనపరచటం బీజేపీకి సాధ్యంకావటం లేదు. చిత్రమేమంటే అటు కాంగ్రెస్ సైతం ఆయన బలపడితే తమకే ముప్పని భావించి కేజ్రీవాల్‌ను తగినంత దూరంలోవుంచింది. దేశవ్యాప్తంగా వేరే పార్టీలు పెద్ద బలంగా లేవు. ఏతావాతా తమ నేతల అరెస్టుపై ఆప్‌ది ఒంటరి పోరాటమే కావొచ్చు. ఇంతకూ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారన్నది వాస్తవమేనా? అది ఎన్ని దశాబ్దాలకు తేలుతుందో ఎవరూ చెప్పలేరు. ఆయన సర్కారు ఢిల్లీ మద్యం విధానంలో మార్పులు చేయటం ద్వారా కొన్ని వర్గాలకు లాభం చేకూర్చి వందకోట్ల రూపాయల మేర ముడుపులు తీసుకుందన్నది ఈడీ ఆరోపణ. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఏడాదిన్నరగా జైల్లో వున్నారు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఇటీవలే అరెస్టు చేశారు. కొందరు అప్రూవర్లుగా మారారు. కేసులోని నిజానిజాలేమిటన్న సంగతలావుంచి సీబీఐ, ఈడీ వ్యవహార శైలిపై యూపీఏ సర్కారుకాలం నుంచీ అనుమానాలున్నాయి. ఆ సంస్థల నిర్వాకాన్ని అడపా దడపా న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్న ఉదంతాలు లేకపోలేదు. అయినా వాటి తీరుతెన్నులు మారిన దాఖలా లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ అరెస్టుల వెనక రాజకీయప్రమేయం, ప్రయోజనం లేవని ఎవరూ అనుకోలేరు. నిజానికి సుప్రీంకోర్టు పుణ్యమా అని బయట పడిన ఎలక్టోరల్ బాండ్ల ఆనుపానులు, కార్యకారణ ప్రమేయాలు గమనిస్తే ఈ మద్యం కుంభకోణం పిపీలిక ప్రాయం అనిపిస్తుంది. అవినీతి కేసుల విషయంలో ఈమధ్య పార్టీల పరస్పర ఆరోపణలు వింతగా వుంటున్నాయి. కవితను అరెస్టు చేయకపోవటంవల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడామని బీజేపీ నేతలు ఖేదపడగా... బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కు కావటంవల్లే ఆమె అరెస్టు జరగలేదని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆప్ తమ కూటమిలో వుంది గనుక కేజ్రీవాల్ అరెస్టును తప్పుబడుతున్నది. ఈ అష్టావక్ర రాజకీయాలవల్ల బీజేపీ ఎడాపెడా లాభపడుతోంది. ఏదేమైనా అగ్రనాయకత్వం అరెస్టుతో సైన్యాధిపతిలేని సేనలా తయరైన ఆప్ ఈ సార్వత్రిక ఎన్ని కలనూ, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలనూ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. -
గరళ కంఠ భారతం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంటూ రొమ్ము విరుచుకుంటున్న మనకు ఇప్పుడు పెద్ద అపకీర్తి కిరీటమూ దక్కింది. ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఒకటని తాజాగా తేలింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మొత్తం 134 దేశాలు, ప్రాంతాల్లోని 7,812 నగరాలలో 30 వేలకు పైగా వాయు నాణ్యతా పర్యవేక్షక కేంద్రాల నుంచి డేటా సేకరించి ఈ నివేదికను అందించింది. వారి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యదేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ ఒక్క ఏడాది కాలంలో కాలుష్యంలో మూడో ర్యాంకుకు చేరడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత రాజధాని అనే దుష్కీర్తి వరుసగా రెండో ఏడాది కూడా మన ఢిల్లీకే దక్కింది. అవి చాలదన్నట్టు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా బెగూసరాయ్ నిలవడం దిమ్మ తిరిగేలా చేస్తోంది. ప్రపంచంలో గత ఏడాది ఎదురైన ఆరోగ్య విపత్తు వాయు కాలుష్యమని నిపుణుల మాట. మన దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన కాలుష్యకారకం కాగా, ఉత్తరాదిన ఖరీఫ్ సీజన్లో పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యాలు సైతం ఢిల్లీ దుఃస్థితికి కారణమై వెక్కిరిస్తున్నాయి. అయితే, మెట్రోలు, గౌహతి – పాట్నా లాంటి ద్వితీయ శ్రేణి నగరాలే కాదు... బిహార్‌లోని బెగూసరాయ్, హర్యానాలోని రోహ్తక్, యూపీలోని మీరట్ లాంటి చిన్న పట్నాలు సైతం వాయు గరళంతో నిండిపోతున్నాయని నివేదిక తేల్చింది. ఐక్యూ ఎయిర్ జాబితాలోని 83 భారతీయ నగరాల్లో చాలావాటిలో కాలుష్య కారకాలు ఏమిటనే సమాచారం లేదు. అలాగే, బెగూసరాయ్ లాంటి చోట ఏడాది తిరగక ముందే కాలుష్యం 6 రెట్లు ఎలా పెరిగిందనేది కనిపెట్టాల్సి ఉంది. కారణాల్ని అంచనా వేస్తూనే, ముంచుకొచ్చిన ఈ ముప్పును విధానపరమైన పరిష్కారాలతో సమర్థంగా ఎదుర్కోవడం పాలకుల ముందున్న సవాలు. గాలిలో ధూళికణాల (పీఎం) సాంద్రత ఏ మేరకున్నదనే దాన్ని బట్టి వాయుకాలుష్య ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు ఫరవాలేదు. అలాకాక, ధూళికణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసం (పీఎం 2.5) ఉన్నప్పుడు ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయసులోనే మర ణాలు సంభవిస్తాయి. కాబట్టి అది ప్రమాదఘంటికకు కొలమానం. 2023లో భారత్‌లో వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా రికార్డయింది. అలా భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక, క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, క్యూబిక్ మీటర్‌కు 73.3 మైక్రోగ్రాములతో పాకిస్తాన్ రెండోస్థానంలో ఉన్నాయి. నిజానికి, మిగతా రెండు దేశాలతో పోలిస్తే, భారత్ పీఎం2.5 సాంద్రత 2021 నాటి నుంచి తగ్గింది. అప్పట్లో భారత్‌లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రోగ్రాములు ఉండేది. ఇప్పుడది 54.4కు తగ్గిందన్న మాటే కానీ ఇవాళ్టికీ ప్రపంచ టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 మన దేశంలోవే కావడం కలతపరిచే అంశం. దేశ జనాభాలో కొద్ది మంది మినహా దాదాపు 136 కోట్లమంది నిత్యం డబ్ల్యూహెచ్ఓ మార్గ దర్శకాలను మించి పీఎం2.5 ధూళికణ సాంద్రతకు లోనవుతున్నవారే! మరీ ముఖ్యంగా, మన దేశంలోని పట్టణప్రాంతాల్లో అధిక శాతం మంది ఇలా నిత్యం కాలుష్యం కోరల బారిన పడుతూ, శ్వాస కోశ సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుండడం తరచూ కంటి ముందు కనిపిస్తున్న కథే. మిగిలి నవి అటుంచితే, భారత్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 70 శాతం థర్మల్ విద్యుత్తే అన్నది గమనార్హం. ఇప్పటికీ మనం పునరుత్పాదక శక్తి వనరుల మార్గం పట్టలేదు. పైపెచ్చు, దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమయ్యేకొద్దీ ఇది పెను సవాలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటి పైకప్పులపై సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటు లాంటి భారీ ప్రణాళికలు ప్రకటించింది. అయితే, ఇవన్నీ ఆచరణ లోకొచ్చి, ప్రభావం చూపడానికి మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు గణనీ యంగా ప్రభావం చూపాలంటే, మన విద్యుత్ విధానాలను సమూలంగా మార్చడం ముఖ్యం. అసలు ‘స్వచ్ఛమైన గాలి’ కూడా ప్రాథమిక జీవనహక్కే. కోర్టులు ఆ సంగతి పదేపదే చెప్పాయి. బరిలోకి దిగక తప్పని పరిస్థితిని ప్రభుత్వాలకు కల్పించాయి. అయితే, పౌర రవాణాలో సీఎన్జీ, మెట్రో వ్యవస్థ, ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ లాంటివి తీసుకొచ్చినా ఢిల్లీ లాంటి చోట్ల కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమస్య అవగాహన, పరిష్కారానికై శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే, కాలుష్య నియంత్రణకు అవసరమైన రీతిలో జనజీవితంలో అలవాట్లు మారేలా ప్రోత్సాహకాలు, అతిక్రమిస్తే జరిమానాల పద్ధతి తేవాలి. సర్వజన శ్రేయస్సు కోసం పార్టీలన్నీ కాలుష్యంపై పోరును రాజకీయ అంశంగా తీసుకొని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చోటివ్వాలి. నిజానికి, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తామంటూ 2019లో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వాగ్దానపత్రంలో పేర్కొన్నాయి. ఇది కేవలం కేంద్రం పనే కాదని గుర్తించి, రాష్ట్రాల నుంచి మునిసిపాలిటీల దాకా అన్నీ తమ వంతుగా కాలుష్యంపై పోరులో చేతులు కలపాలి. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యమే కాక, దరిమిలా సంక్లిష్టమైన పర్యావరణ ప్రక్రియలతో పుడమి వాతావరణమే దెబ్బతింటుందని శాస్త్రవేత్తల మాట. అందుకని ఈ విషానికి విరుగుడు కనిపెట్టడం అన్ని విధాలా అత్యవసరం. ఈ క్రమంలో తాజా ఐక్యూ ఎయిర్ నివేదిక మనకు మరో మేలుకొలుపు. -
ఇది ఏకగ్రీవ సి‘ఫార్సు’
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఊహించినట్టుగానే జమిలి ఎన్నికలకు జైకొట్టింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో, ఆ తర్వాత వంద రోజుల్లో మునిసిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తూ, సదరు కమిటీ గత వారం నివేదిక సమర్పించింది. సిఫార్సులు ఊహించినవే అయినప్పటికీ, నిర్ణీత కాలవ్యవధి ఏమీ లేకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందుగా కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (ఓఎన్ఓఈ) ప్రతిపాదనను తెర మీదకు తేవడం అనుమానాలు రేపింది. రాజ్యాంగ సవరణ, ఒకే ఎన్నికల జాబితా – ఎన్నికల గుర్తింపు కార్డు, త్రిశంకు సభ – అవిశ్వాస తీర్మాన పరిస్థితులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు – పోలింగ్ సిబ్బంది – పోలీసు బలగాల ఏర్పాట్ల లాంటి పలు అంశాలపై కమిటీ కీలక సిఫార్సులు ఇప్పుడు చర్చ రేపుతున్నాయి. మన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనూ, సమాఖ్య చట్రాన్నే మార్చేసే సత్తా ఈ ప్రతిపాదనకు ఉండడమే అందుకు కారణం. కోవింద్ సారథ్యంలో 2023 సెప్టెంబర్‌లో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి కమిటీలో భాగం కావడానికి నిరాకరించారు. మొత్తం 8 మంది సభ్యుల కమిటీ 65 సమావేశాలు జరిపి, అనుకున్నట్టుగానే ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. జాతీయ, రాష్ట్ర పార్టీల అభిప్రాయాల్ని తెలుసుకున్నామనీ, న్యాయకోవిదుల మొదలు ఆర్థికవేత్తల దాకా పలువురి సూచనలు కోరామనీ కమిటీ తెలిపింది. అయితే, నివేదికను గమనిస్తే అవసరమైన లోతైన అధ్యయనం, విశ్లేషణ సాగినట్టు తోచదు. అన్ని వర్గాలనూ ఈ అధ్యయన ప్రక్రియలో భాగం చేసినట్టు అనిపించదు. తూతూ మంత్రపు తతంగం చివరకు 21 సంపుటాల్లో, 18,626 పేజీల్లో, మొత్తం 11 అధ్యాయాలు, అనేక అనుబంధాల బృహన్నివేదిక రూపం మాత్రం సంతరించుకుంది. రాష్ట్రపతికి మార్చి 14న కమిటీ తన నివేదికను అందించడంతో ప్రధాన ఘట్టం ముగిసింది. త్వర లోనే లా కమిషన్ సైతం తన నివేదికను ఇవ్వనుంది. ఇక, వచ్చే 2029 ఎన్నికల్లోగా దాన్ని ఎలా ఆచ రణలోకి తేవాలన్నది కేంద్రం చేతిలో ఉంది. కమిటీ ఏకగ్రీవ సిఫార్సు గనక అది ముగిసిన కథ అన కుండా, వ్యతిరేకిస్తున్న వారి సముచితమైన భయాందోళనల్ని విని, సమాధానపరచడం అవసరం. నిజానికి, ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరగడం కనివిని ఎరుగనిదేమీ కాదు. చట్టం ఏమీ లేకపోయినా స్వతంత్ర భారతావనిలో ఎన్నికలు మొదలయ్యాక తొలి రోజుల్లో ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే, అయిదేళ్ళ కాలవ్యవధి పూర్తికాక ముందే రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే ధోరణి మొదలయ్యాక, 1967 తర్వాత నుంచి ఈ ఏకకాల విధానానికి తెర పడింది. తరువాత కూడా మధ్య మధ్యలో ఈ జమిలి ఎన్నికల ఆలోచన తొంగిచూసినా, వడివడిగా అడుగులు పడింది మాత్రం ఇప్పుడే. మోదీ సారథ్యంలోని బీజేపీ ఆది నుంచి జమిలి ఎన్నికల నిర్వహణ జపం చేస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికలను 15 పార్టీలు వ్యతిరేకించాయని కమిటీ పేర్కొంది కానీ, వ్యతిరేకిస్తున్నవారిని ఒప్పించడానికీ, సద్విమర్శలను తీసుకొని సరిదిద్దుకోవడానికీ చేసిందేమిటో తెలియదు. అలాగే, ఒకే దశలో ఎన్నికలు చేయలేక 7 విడతల్లో, 40 రోజులపైగా ఎన్నికలు జరుపుతున్న పాలకులు ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలరన్నదీ సందేహమే! ఒకరకంగా, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వల్ల అటు ప్రభుత్వానికీ, ఇటు పార్టీలకూ ఎన్నికల ఖర్చు తగ్గుతుందనే మాట నిజమే. అలాగే, కాస్తంత వ్యవధి తేడాతో మునిసిపల్, పంచాయతీ సహా అన్ని ఎన్నికలూ ఒకేసారి జరగడం వల్ల పాలనకు తరచూ అంతరాయాలు ఏర్పడవు. అయితే, ఈ విధానం మన సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనేదీ అంతే వాస్తవం. ఇక, ఈ పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీలకు నిర్ణీత కాలవ్యవధి కన్నా ముందే మంగళం పాడి, ఆనక ప్రతి ప్రభుత్వానికీ నిర్ణీత వ్యవధిని నిర్ణయించడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే విరుద్ధం. ఒకవేళ గనక ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అర్ధంతరంగా కూలిపోతే, ఆ తర్వాత ఎన్నికైన ప్రభుత్వం ఆ వర్తమాన లోక్‌సభా కాలం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగాలనడం మరో తిరకాసు. అన్నిటి కన్నా పెద్ద భయం మరొకటుంది. ఏకకాలంలో కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల వల్ల ప్రాంతీయ, స్థానిక అంశాలను మింగేసి, జాతీయ అంశాలే పైకొచ్చే ప్రమాదం ఉంది. ఎన్నికల వ్యూహంలో, వ్యయంలో జాతీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి పార్టీలు దీటుగా నిలబడడమూ కష్టమే. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా చిన్న పార్టీలు కనిపించకుండా పోతాయని సమాజ్‌వాదీ పార్టీ లాంటివి బాహాటంగానే చెబుతున్నాయి. నిజానికి, ఏకకాలపు ఎన్నికల వల్ల ఓటర్లలో 77 శాతం మంది కేంద్రంలో, రాష్ట్రంలో – రెండు చోట్లా ఒకే పార్టీకి ఓటేస్తారని 2015 నాటి ఓ సర్వే తేల్చింది. రెండు ఎన్నికల మధ్య ఆరు నెలల విరామం ఉంటే, 61 శాతమే అలా ఓటేస్తారట. అంటే ఒక రకంగా ఈ జమిలి ఎన్నిక కేంద్రంలో చక్రం తిప్పుతున్న పార్టీలకే వాటంగా మారవచ్చు. అసలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే ఈ ఆలోచన వెనుక అసలు మతలబు... దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకు రావాలన్న బీజేపీ ఆలోచన అని మరికొందరి వాదన. అందుకు రాజ్యాంగ సవరణలు సహా అనేకం అవసరం. దానికి తగ్గట్టే దీర్ఘకాలిక వ్యూహంతో బీజేపీ 400 పైచిలుకు సీట్లతో సంపూర్ణ మెజారిటీని కోరుతోందని విశ్లేషణ. అవతలి వారివి ‘అనవసర భయాందోళనలు’ అని కొట్టిపారేస్తే సరిపోదు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే ముందు మరింత విస్తృత స్థాయి సంప్రతింపులు జరపడం అవసరం. అంతేకానీ, డబ్బు ఆదా పేరిట ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, సమాఖ్య స్వభావాన్నీ నీరు గార్చడం సమర్థనీయం కానే కాదు. -
ఎన్నిక అపహాస్యమే అయినా...
అనుకున్నదే అయింది. ఫలితం ముందే నిర్ణయమై, అపహాస్యంగా మారిన రష్యా ఎన్నికల్లో అందరూ ఊహించినట్టే వ్లాదిమిర్ పుతిన్ అయిదో పర్యాయం అధ్యక్షుడయ్యారు. కంటితుడుపుగా సాగిన రిగ్గింగ్ ఎన్నికలన్న విమర్శకుల ఆరోపణలకు తగ్గట్టే ఆయన మునుపెన్నడూ, ఎవరికీ రానన్ని ఓట్లతో అఖండ విజయం సాధించారు. పుతిన్ గెలుపు ముందే నిశ్చయమైనా, సోమవారం అధికారిక వెల్లడింపుతో ఒక తంతు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో భిన్నాభిప్రాయాలకూ, రాజకీయ పోటీకీ కాసింత అవకాశమైనా ఇచ్చిన 71 ఏళ్ళ ఈ మాజీ గూఢచారి ఇప్పుడు అందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరని తేలిపోయింది. వెరసి, పుతిన్ హయాంలో రష్యాలో పాలన నిరంకుశత్వం నుంచి ఏకఛత్రాధిపత్యం, ఏకవ్యక్తి పాలన దిశగా వెళుతున్నట్టు ప్రపంచానికి ఖరారైంది. సోవియట్ పతనానంతర కాలంలో ఎన్నడూ లేనట్టు రష్యా ఎన్నికల్లో పుతిన్ అత్యధికంగా 88 శాతం దాకా ఓట్లు సాధించడం స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రధానిగా అయితేనేం, అధ్యక్షుడిగా అయితేనేం పాతికేళ్ళుగా పీఠంపై ఉన్న పుతిన్ ఇప్పుడిక రష్యాపై పూర్తిగా పట్టు బిగించారన్న మాట. అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా ఇప్పటికే ఆయన రాజ్యాంగాన్ని మార్చేశారు. తాజా విజయంతో మరో ఆరేళ్ళు ఆ పదవి ఆయనదే. ఇలాగే, వచ్చే 2030లో సైతం పుతిన్ విజయం సాధిస్తే, కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. అదే జరిగితే, 31 ఏళ్ళ పాటు అధికారం చలాయించిన స్టాలిన్ రికార్డును పుతిన్ తిరగరాసినట్టవుతుంది. పైపెచ్చు, పుతిన్ ఈసారి విజయం సాధిస్తూనే... అమెరికా సారథ్యంలోని ‘నాటో’ కూటమి గనక ఉక్రెయిన్‌లో బలగాలను మోహరిస్తే సహించబోమన్నారు. అదే గనక జరిగితే ‘పూర్తిస్థాయిలో మూడో ప్రపంచ యుద్ధమే’ అని హెచ్చరించడం గమనార్హం. నిజానికి, మార్చి 15 – 17 మధ్య జరిగిన తాజా ఎన్నికలు పెద్ద ప్రహసనం. అభ్యర్థులుగా అధి కారిక ఆమోదం పొందిన ప్రత్యర్థులు పేరుకు రంగంలో ఉన్నారు. కానీ, బరిలో నిలిచేందుకూ, పోటీలో గెలిచేందుకూ వారు ఇసుమంతైనా ప్రయత్నించలేదు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు పాపులర్ వ్యక్తులు సైతం మొదట బరిలో ఉన్నారు. తీరా పుతిన్ విజ యంపై ఎంతో కొంత ప్రభావం చూపగల వారి అభ్యర్థిత్వాన్ని సాంకేతిక కారణాలతో తోసిపుచ్చారు. ఇక గత 2018 ఎన్నికల వేళ పుతిన్‌కు కంటిలో నలుసైన జనాకర్షక ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ గత నెల ఓ ఆర్కిటిక్ జైలులో అంతుచిక్కని రీతిలో మరణించారు. మాస్కో యుద్ధం సందర్భంగా రష్యా కలిపేసుకున్న నాలుగు ఉక్రెయిన్ ప్రావిన్సుల్లోనూ ఓటింగ్ జరిగింది. అయితే, సాయుధ బలగాల కనుసన్నల్లో బలవంతపు ఓటింగ్ వల్ల ఫలితం ఏమిటన్నది అర్థమై పోయింది. ఒకపక్క ఎన్నికలు జరుగుతుండగానే రష్యా భూభాగంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగాయి. కీవ్, దాని పాశ్చాత్య భాగస్వామ్య పక్షాల నుంచి మాస్కోకు ముప్పు తప్పదని తేల్చాయి. పుతిన్ అయిదోసారి గెలిచినా, ప్రజాక్షేత్రంలో అసమ్మతి పుష్కలం. ఫక్తు ఫార్సుగా మారిన ఎన్నికల్ని నిరసిస్తూ, కొందరు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో రంగు పోశారు. అలాగే, నావల్నీ నివాళికి వేలాది రష్యన్లు హాజరవడం గమనార్హం. అయితే, దేశాన్ని పూర్తిస్థాయి ఏకవ్యక్తి పాలనగా మార్చేసేందుకు పుతిన్‌కు దక్కిన వరం – ఉక్రెయిన్‌తో యుద్ధం. ‘ప్రత్యేక సైనిక చర్య’గా స్వల్పకాలిక దాడితో ఉక్రెయిన్‌పై పైచేయి సాధించాలని ఆయన మొదట భావించారు. తీరా అది దీర్ఘకాలిక పోరై, నష్టా లకు దారి తీసింది. అయినా, అణచివేత కొనసాగిస్తూ, పాశ్చాత్య ప్రపంచంతో సుదీర్ఘ యుద్ధంలో అంతిమ విజయం మనదేనంటూ రష్యన్లతో పుతిన్ నమ్మబలికారు. సలహాదారుల మాట పెడచెవిన పెట్టి, యుద్ధాన్ని ప్రచారంలో ప్రధానాంశం చేశారు. యుద్ధంపై నిరసన నేరమంటూ, నిరసించే పౌరులంతా ‘విదేశీ ఏజెంట్లే’ అంటూ చట్టమే చేశారు. ఎవరేమనుకున్నా మళ్ళీ అధ్యక్షుడయ్యారు. దేశమంతా తన వెంటే ఉందని చాటేందుకు పుతిన్ ఈ ఎన్నికను అవకాశంగా వాడుకున్నారు. అణచివేత మాట అటుంచితే, రష్యాలో ఇప్పటికీ పాపులర్ నేతనని నిరూపించుకున్నారు. ఉక్రెయిన్‌తో పోరులోనూ మొదట కొద్దినెలలు గట్టి ఎదురుదెబ్బలు తగిలినా, అనూహ్యంగా ఇప్పటికీ పట్టు నిలుపుకొన్నారు. కఠినమైన ఆర్థిక ఆక్షలు ఎదురైనా, దేశ ఆర్థిక వ్యవస్థను అంచనాలను మించేలా నిలబెట్టగలిగారు. పాశ్చాత్య బ్రాండ్లు దేశం విడిచివెళ్ళినా, అదే విధమైన స్థానిక ఉత్పత్తులతో సామన్యులపై ప్రభావం పడకుండా చూసుకున్నారు. ముడి చమురు కొనుగోళ్ళకు యూరప్ అడ్డం తిరిగినా, భారత్, చైనా, టర్కీలతో ఆదాయం పుష్కలంగా కొనసాగేలా చూసుకున్నారు. రష్యాకు రాజకీయ, ఆర్థిక సుస్థిరత సమకూర్చినప్పటికీ, దేశాన్ని నిరంకుశ పాలనలోకి దింపడమే పెద్ద చిక్కు. అయితే, ఇష్టమున్నా, కష్టమైనా కనీసం మరో ఆరేళ్ళ పాటు రష్యా సారథి పుతినే. అమెరికా, దాని మిత్రపక్షాలు సహా అందరూ ఆ వాస్తవాన్ని గుర్తించాలి. ఎలాగోలా పుతిన్‌కు నచ్చజెబితే తప్ప ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పుడప్పుడే తెర పడే పరిస్థితి లేదని గమనించాలి. పుతిన్‌తో వైరం పెరిగినకొద్దీ అది తూర్పు ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికే తలనొప్పి అని గ్రహించాలి. పాశ్చాత్యప్రపంచం సైతం తన వైఖరిలోని తప్పులను ఆత్మపరిశీలన చేసుకోవాలి. రష్యాకు మిత్రదేశాలైన భారత్, చైనా లాంటివి ఈ శత్రుత్వ ధోరణి సద్దుమణిగేలా ప్రయత్నించాలి. 2022లో ఉక్రెయిన్‌పై పుతిన్ జరపదలచిన అణ్వస్త్రదాడిని ఆపింది భారత ప్రధాని, ఇతర నేతలేనంటూ వస్తున్న తాజా కథనాలు విస్మరించలేనివి. అమెరికా, రష్యాలు రెంటితోనూ బలమైన బంధమున్న భారత్ శాంతియుత పరిష్కారానికై కృషి చేయాలి. ఎందుకంటే, ఉక్రెయిన్ యుద్ధం మరింత కాలం కొనసాగడం మానవాళికి ఏమాత్రం మేలు కాదు!