Editorial
-
ఎన్నికల బృహత్ పర్వం!
ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఎన్నికల సమయం వచ్చింది. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలకూ, అదే విధంగా మరో 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకూ శనివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించడంతో ఒక బృహత్ యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో మరో నెల రోజుల పైచిలుకులో తొలి దశతో సుదీర్ఘ ఎన్నికల పర్వం ఊపందు కోనుంది. ఇదే ఏడాది అమెరికా సహా పలు భారీ ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా, 96.9 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లతో మన దేశం సంఖ్యాపరంగా అన్నిటి కన్నా ముందు వరుసలో ఉంది. అలాగే, మిగిలిన దేశాలతో పోలిస్తే సుదీర్ఘంగా ఈ ప్రక్రియ సాగనుంది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు సైతం ఇలాగే సుదీర్ఘంగా సాగాయి. 489 స్థానాలకు గాను మొత్తం 68 దశల్లో అప్పట్లో ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత మళ్ళీ అంత సుదీర్ఘంగా సాగుతున్నవి ఈ సార్వత్రిక ఎన్నికలే. ఈ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజుల వ్యవధిలో ఈ హంగామా కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో రానున్న రెండున్నర నెలలు వేసవి వేడితో పాటు దేశమంతటా ఎన్నికల ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయి. ఇవి యువతరం ఎన్నికలు కావడం విశేషం. ఓటర్లలో 29 శాతం మంది 18 నుంచి 29 ఏళ్ళ మధ్యవయసు యువతరమే. 2660 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొనే ఈ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి కూడా! అధికారికంగా అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితులు విధించారన్న మాటే కానీ, పార్టీల ప్రచారం సహా ఈ ఎన్నికల తతంగం మొత్తం ఖర్చు దాదాపు రూ. 1.2 లక్ష కోట్లు దాటుతుందని లెక్క. ఏకంగా 15,256 అడుగుల ఎత్తైన ప్రాంతంలోనూ పోలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న బృహత్తర ప్రక్రియ ఇది. వెబ్సైట్లు, సోషల్ మీడియా, ఫోన్–ఇన్ ప్రచార సాధనాలతో వర్చ్యువల్ ప్రచారం ప్రబలిన ఆధునిక కాలమిది. ఓటింగ్‌కు 48 గంటల కన్నా ముందే ప్రచారం ఆపాలి, అంశాల ప్రాతిపదికన – కులమతాలకూ, విద్వేషానికీ దూరంగా ప్రచారం సాగాలి లాంటి నిబంధనల్ని ఆచరణలో పెట్టించడం ఈసీకి కష్టమే. అలాగే 1999లో 29 రోజులతో మొదలై గత 2019లో 39, ఈసారి 44 రోజులకూ వ్యాపిస్తూ పోతున్న ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండే పాలకపక్షాలకు వాటంగా మారుతుందని ఆరోపణలొస్తున్నాయి. షెడ్యూల్ ప్రకటన ఫలితంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో ఈసీ క్రియాశీలక పాత్ర మొదలైంది. తాజాగా సోమవారం గుజరాత్, యూపీ సహా అరడజనుల రాష్ట్రాల్లో హోమ్‌శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ కౌరడా జుళిపించింది. పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన డీజీపీపై వేటు వేసింది.ఎన్నికలు నిష్పక్ష పాతంగా సాగాలంటే, ఆయా ప్రాంతాల్లో పాలకపక్ష అనుకూలురని పేరుబడ్డ అధికారులకు చెక్ చెప్పడం సమంజసమే, స్వాగతించాల్సిందే. అయితే, అనేక సందర్భాల్లో కేంద్రంలోని పాలక వర్గాల చేతిలోని సంస్థగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణలు వింటూనే ఉన్నాం. అవన్నీ నిరాధారమని మాటలతో కన్నా చేతల ద్వారా తేల్చడమే ఈసీ ముందున్న మార్గం. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒకప్పటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌ను ఆదర్శంగా నిలుపుకోవాలి. పాలకుల కన్నా ప్రజలకు జవాబుదారీగా ఈసీ నిలబడాలి. డబ్బు, అధికారం లేనివారు సైతం ఎన్నికల బరిలో స్వేచ్ఛగా పోటీ చేసే ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి. దురదృష్టవశాత్తూ పరిస్థితులన్నీ ఆ ఆదర్శాలకు తగ్గట్టు ఉన్నాయన్న భరోసా ఇప్పటికీ పూర్తిగా కలగడం లేదు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలోనే దేశంలో ఒకటికి రెండు కీలక పరిణామాలు సంభవించాయి. రహస్యమయమైపోయిన ఎన్నికల బాండ్లలో దాతలు, గ్రహీతల (పార్టీల) వివరాలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)ని ఆదేశించాల్సి వచ్చింది. మరోపక్క మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంశంపై వేలకొద్దీ పేజీల నివేదిక సమర్పిస్తూ, లోక్‌సభకూ, రాష్ట్రాల శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలని సిఫార్సు చేసింది. ఇంకొకపక్క కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి భాగం లేకుండా ప్రభుత్వం ఆ మధ్య చేసిన మార్పులు సైతం మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ ఒక రకంగా భారత ప్రజాస్వామ్య ప్రస్థానం నునుపైన జారుడు శిఖరం మీద సాగుతున్న అంశాన్ని పట్టిచూపాయి. రానున్న కాలంలో ఈ ప్రయాణం ఇంకెంత సంక్లిష్టం కానున్నదో చెప్పకనే చెప్పాయి. బాండ్ల సాక్షిగా పారిశ్రామిక వర్గాలకూ, రాజకీయాలకూ మధ్య రహస్యబంధం అంతకంతకూ బలపడుతున్న వేళ, దేశమంతా ఒకేసారి ఎన్నికలతో సమస్తం కేంద్ర పాలకుల కనుసన్నల్లోకి మార్చాలని చూస్తున్న వేళ... రానున్న ఎన్నికల్లో ప్రజలెన్నుకొనే ప్రభుత్వాలు కీలకం కానున్నాయి. ‘‘చరిత్ర కూడలిలో నిల్చొని, ఏ మార్గంలో వెళ్ళాలో ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి జాతికీ ఒకానొక దశలో వస్తుంది’’ అని భారతదేశానికి రెండో ప్రధాన మంత్రి అయిన లాల్‌బహదూర్ శాస్త్రి ఒక సందర్భంలో అన్నారు. ఆ మార్గాన్ని బట్టే భవితవ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య భారతావని తన ప్రయాణంలో ఇప్పుడు సరిగ్గా అదే స్థితిలో ఉంది. ఈ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఎంచు కొనే మార్గం పౌరుల మొదలు న్యాయవ్యవస్థ, ప్రభుత్వ అధికార వ్యవస్థ, మీడియా దాకా సమస్తాన్నీ ప్రభావితం చేయనుంది. అందుకే, సరైన మార్గాన్ని ఎంచుకోవడం అత్యవసరం. సరైన ఎంపిక సాగాలంటే, అలక్ష్యం చేయకుండా విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడమే సాధనం. -
నెహ్రూ జాకెట్ సాహిత్యం
నెహ్రూ గారిని నిలదీయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగాని నిజానికి ఆయనను నిలదీయాల్సింది నెహ్రూ జాకెట్‌ను ఎందుకు పాప్యులర్ చేశావయ్యా అని. రచయితలు, కవులు, విమర్శకులు మున్ముందు రోజులలో లాల్చీ పైజమా ధరించడమేగాక నెహ్రూ జాకెట్‌ను కూడా తగిలించారంటే గనక చచ్చినట్టు వారు సాహిత్యకారులుగా మన దేశంలో చలామణి అవుతారని ఆయన ఊహించి ఉండడు. ఎరిగిన సాహిత్యకారులు అడపా దడపా ఆ అదనపు వస్త్రాన్ని ధరించినా తాము సాహిత్యకారులమే అని తప్పక నిరూపించుకోవాలనుకునే వారికి మాత్రం నెహ్రూ జాకెట్ కవచ కుండలం. పూర్వం రోజులలో కొందరు సాహితీ తాపసులు పెన్నును బుగ్గకు పెట్టుకుని, నుదుటిని నింగి వంక ఎత్తి పెట్టి ఫొటో దిగి, పుస్తకం వెనుక వేసుకోవడం వల్ల వారు రచయితలని, కవులని నమ్మాల్సి వచ్చేది. మరికొందరు టెలిఫోన్ రిసీవర్‌ను చెవి దగ్గర పెటుకొన్న ఫొటోను పుస్తకం వెనుక వేయడం వల్ల అమ్మో వీరు రచయితలేస్మీ అనుకోకుండా ఉండలేకపోయేవారం. ‘మానవతా... ఎక్కడమ్మా నీ చిరునామా?’ అని గూగుల్ మేప్స్ లేని కాలంలో ఎవరు పై అడ్రస్ అడుగుతూ కవిత్వం రాసినా వారు కవులు కాకుండాపోలేదు. ఇక ఏ కాలంలో అయినా ఎల్.ఎస్.వి.శేషాచలం, మునవర్తి సుబ్రహ్మణ్యం, విక్టర్ మనోహర్, ప్రొఫెసర్ చారులత వంటి ప్రముఖ విమర్శకులు ఉంటారు కనుక వారు ముందు మాట రాసి వదిలారంటే– ఎందుకొచ్చిన గొడవ అని నోరు మెదపక అట్టి రచయితలను రచయితలే అనుకోవడమూ కద్దు. ఏదేని ఒక శాఖ కలిగిన రాష్ట్రమంత్రితో, ఏదేని ప్రాదేశిక ఇన్ కమ్టాక్సు కమిషనర్‌తో, లేదంటే స్థానిక వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్‌తో... ఈ ముగ్గురితో కాని కనీసం వీరిలో ఇద్దరితో కాని ఫొటోలు దిగి, ఫేస్బుక్లో పెట్టి, ఇక మమ్మల్ని సాహిత్యకారులం కాదు అనంటే తంతాం అనేవారు ఉన్నారంటే నోరు నొక్కుకోవాల్సిన పని లేదు. జీవితంలో అక్షరమ్ముక్క రాయకపోయినా రాసే వాళ్లందరి ఫోన్ నంబర్లు కలిగి ఉండటమే కాదు వారికి కాల్ చేసి ‘ఏవోయ్ ఎలా ఉన్నావ్’ అనిగానీ, ‘నమస్కారమండీ... టిఫినయ్యిందా’ అనిగానీ అడగ్గలిగే చనువు ఉన్నందుకు కనీసం డజను మంది తెలుగునాట ప్రముఖ సాహిత్యకారులుగా చలామణి అవుతున్నారంటే గుండె పొంగే సంగతి. ‘శుంఠల్లారా... ఇదా మీ ప్రతాపమూ... నన్ను గనక కళ్లకు గంతలు గట్టి ఢిల్లీలో ఏమూల వదిలినా నేరుగా సాహిత్య అకాడెమీ ఆఫీసుకు చేరుకోగలను’ అనేవారి ప్రదక్షిణ పటిమ వారికి ఇస్తున్న అతిశయం అంతా ఇంతా కాదు. ‘అడుగడుగున నుడి ఉంది’, ‘అక్షర రశ్మీ జయతు’, ‘మనమంతా కలం కులం’... వాట్సప్ గ్రూప్‌లను స్థాపించి, ఒక దానిలో నూట పదహారుకు తక్కువ కాకుండా సభ్యులను చేసి, అడ్మిన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక హోదా వల్ల సాహిత్య దశా దిశను నిర్దేశించాలని కన్నీళ్లతో తపన పడేవారెందరో మన హృదయాలను చెమ్మగిల్ల చేస్తున్నారు. ఈ యొక్క వాట్సప్ గ్రూప్‌లలో ప్రతి ఒక్క కవిత, వ్యాఖ్యకు మరువక లైక్ కొట్టేవారిని దృష్టిలోకి తీసుకుని మాసాంతంలో వారికో అవార్డు బహూకరించడం మరో విశిష్ట ప్రోత్సాహక ప్రోత్సహితం. జూమ్‌లో స్లాట్ బుక్ చేసి, కార్డు డిజైన్ చేయగల వనరులు కలిగినవారు వారానికి పది మందిని సాహితీ సమాలోచనంలో ముమ్మరం చేయడం చూస్తే ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది. గుర్తు తెలియని విదేశాలకు వెళ్లి స్థానిక గాంధీనగర్ అసోసియేషన్ స్థాయి సాహితీ సమ్మేళనంలో పాల్గొని రుజువు పత్రంతోనూ, తెల్లవాళ్లతోనూ ఫొటోలు దిగి బెదురు, బెరుకు పుట్టించే వారిది స్వీయ విమానచార్జీలు భరించగలిగే స్థాయి. సాహిత్యం అంటే అందరికీ ఇష్టం. పాఠకులుగా ఉత్తమ సాహిత్యాన్ని ఇష్టపడేవారూ సృజన కారులుగా ఉత్తమ సాహిత్యసృష్టికి పెనుగులాడేవారూ ఎప్పుడూ ఉంటారు. ఈ ఇద్దరూ ప్రతి ప్రాంతంలో, భాషలో, దేశంలో తమ తమ సాహిత్యాన్ని గౌరవ భంగం కలగకుండా కాపాడుకుంటూ వస్తారు. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో ఈ సాహిత్యంలో భాగం కావాలని నిజాయితీగా అభిలషించేవారూ ఉంటారు.వీరి ప్రయత్న శుద్ధి, సృజన సామర్థ్యం, విడదీయలేని స్వభావం ఇవ్వవలసిన గుర్తింపు ఇస్తూనే ఉంటాయి. వీరు కాక ఔత్సాహిక పాఠకులు, ఔత్సాహిక సాహితీ సేవకులూ ఉంటారు. వీరు తమను తాము సాహితీకారులుగా భావించుకుని కార్యాచరణలో దిగడమూ, సాహిత్యానికి ప్రతినిధులుగా మారడం నేటి సోషల్ మీడియా కాలంలో విస్తృతమైంది. సాహిత్యం ఇచ్చే గుర్తింపు ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగించడమేగాక ఏదో ఒక ఊతం దొరికింది కదా అనుకునేలా చేయడం ఇందుకు కారణం. ఇవన్నీ ఉండాల్సినవే. ఉండతగ్గవే. కాకుంటే శ్రుతి మించి అసలు కొంత, కొసరు మరింతగా మారడం నేటి దుఃస్థితి. వాస్తవానికి రెండు రాష్ట్రాలలోని చిన్న ఊళ్లలో ఉంటూ మంచి కవిత్వాన్ని, కథను రాస్తున్న యువతరం ఎందరో ఉన్నారు. అలాగే ఏళ్లకేళ్లు తమ మానాన తాము రాసుకుంటూ పాఠకుల గౌరవం పొందినవారూ ఉన్నారు. వీరంతా పి.ఆర్. చేయకపోవచ్చు. తమను తాము ముందుకు నెట్టుకోకపోవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల మీద వీరు కనపడాల్సిన పనిలేదు అనుకోరాదు. అదే సమయంలో పరిచయ సామర్థ్యమే సాహితీ సామర్థ్యంగా చెల్లుబాటయ్యే వారు అట్టి వేదికల మీద పదే పదే సాహితీ ముఖాలుగా కనిపించడాన్నీ ఉపేక్షించాల్సిన పని లేదు. ‘సత్యముతో పని ఏల, మిడియోకర్లతో కలిసి నడిచి ప్రయోజనాలు పొందితే పోలా’ అనుకునే నిజ సాహితీకారులదీ ఈ దోషం. కళ్లు మూత. ఏమైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అభినయ సాహిత్యకారులూ కొంచెం నెమ్మదించండి! -
విలన్ డెన్‌లో విదూషకుడు!
శంఖం మోగింది. యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిని మాత్రమే పెండింగ్‌లో పెట్టింది. ఈ దూకుడు వల్ల పోల్ పొజిషన్లో దానికి అడ్వాంటేజ్ దక్కినట్టే. విప్లవాత్మక ఆలోచనలతో మరో ఘనతను కూడా అది సొంతం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రెండొందల స్థానాల్లో వంద స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించి రాజకీయ ప్రపంచాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక న్యాయం తమ నినాదం మాత్రమే కాదు, విధానం కూడానని ఆయన చేతల ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. బీసీ వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 లోక్‌సభ స్థానాలను వైసీపీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్‌సభ సీట్లు ఉన్నప్పుడు కూడా బీసీలకు ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసని తరుచూ జగన్ మోహన్ రెడ్డి చెప్పే మాట. ఆ మాటను చేతల్లో చూపించారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తన కోటాలో ఉన్న 144 సీట్లలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో 24 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. ఆ పార్టీ కోటాలో ఇంకో 16 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒక్క బీసీకే చోటు దక్కింది. మిగిలిన పధ్నాలుగులో ఇదే నిష్పత్తి కొనసాగుతుందో, పెరుగుతుందో వేచిచూడాలి. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కూటమి తరఫున ఇంకో నలభై సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉన్నది. ఇందులో 23 స్థానాలను బీసీలకు కేటాయించగలిగితేనే వైసీపీ బీసీ స్కోర్‌ను అది చేరుకోగలుగుతుంది. బ్రహ్మాండం బద్దలైతే తప్ప అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ 7 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. కూటమి తరఫున ఇప్పటికి ముగ్గురే ఎంపికయ్యారు. మిగిలిన 40లో నాలుగు స్థానాలు దక్కే అవకాశాలు మృగ్యం. ఏకంగా 11 లోక్‌సభ స్థానాలకు బీసీ అభ్యర్థులనే వైసీపీ ఎంపిక చేసింది. ఈ రికార్డును అందుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. కూటమి కట్టిన తర్వాత ప్రచారాన్ని పరుగెత్తించగల ఒక శుభ శకునం కోసం బాబు ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో తెలుగుదేశం శిబిరం డీలా పడిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోనైనా చిలకలూరిపేట సభ సక్సెస్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చుతున్నాయి. మొత్తం 175 నియోజక వర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ‘సిద్ధం’ పేరిట వైసీపీ నిర్వహించిన నాలుగు ప్రాంతీయ సభలు చరిత్ర సృష్టించడం టీడీపీ కూటమికి పెనుసవాల్‌గా మారింది. ఒక్కో సభకు యాభై కంటే తక్కువ నియోజకవర్గాల నుంచే అభిమానుల సమీకరణ జరిగింది. మొదటి రెండు సభలు ఐదు లక్షల మార్కును దాటితే, చివరి రెండు సభలు పది లక్షల మార్కును దాటాయి. జాతీయ స్థాయిలోనే ఇదొక రికార్డు. రాష్ట్రవ్యాప్త సమీకరణ చేస్తే తప్ప గతంలో ఎన్నడూ కూడా ఐదు లక్షల పైచిలుకు జనసమీకరణ జరగలేదు. ఇప్పుడు ప్రధాని సభ టీడీపీ కూటమికి జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే రాష్ట్రవ్యాప్త సమీకరణకు టార్గెట్లు పెట్టారు. రెండు మూడు లక్షలమంది హాజరైనా సరే యెల్లో మీడియా సహకారంతో సభ విజయవంతమైనట్టు ప్రకటించుకోవచ్చని ప్రయాసపడుతున్నారు. నరేంద్రమోదీ రూపంలో ఓ శుభశకునం కోసం ఎదురుచూస్తున్న కూటమికి అమిత్ షా రూపంలో అపశకునం ఎదురైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ఒకరోజు ముందు! శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ కాన్క్లేవ్లో అమిత్ షా పాల్గొన్నారు. ‘ప్రధానిని టెర్రరిస్టని విమర్శించిన చంద్రబాబుతో మీరెలా పొత్తుపెట్టుకున్నార’న్న ప్రశ్నకు అమిత్ షా బదులిచ్చారు. ‘అలా అని ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు బుద్ధొచ్చింది. మళ్లీ మా దగ్గరకు వచ్చాడు’ అనగానే అక్కడున్న అతిథులందరూ పడిపడి నవ్వడం కనిపించింది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పరువుపై పంచనామా జరిగింది. ఇదే కాన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా హుందాగా మాట్లాడారు. ఒక వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి నిబద్ధత, క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఎత్తిచూపింది. ‘పార్లమెంట్లో కొన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది కదా... మరి ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేద’ని అమిత్ షాను యాంకర్ ప్రశ్నించారు. ‘‘మేం పెట్టిన ప్రతి బిల్లుకూ ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటేనే ఇచ్చింది తప్ప బీజేపీ కోసం కాద’’ని అమిత్ షా చెప్పారు. అమిత్ షా మాటల సారాంశాన్ని విడమర్చి చెప్పుకుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల వ్యక్తిత్వం మధ్యన ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకు సిద్ధాంతాలతో, రాద్ధాంతాలతో సంబంధం లేదు. అవకాశవాది! అవసరం ఉంటే వస్తాడు. లేకపోతే వెళ్లిపోతాడని అమిత్ షా భావన. జగన్మోహన్ రెడ్డికి సైద్ధాంతిక నిబద్ధత ఉన్నది. ఆ పార్టీ విధానాలకు అనుగుణమైతే మద్దతు ఇస్తారు. లేకపోతే లేదు. సిద్ధాంతపరంగా ఆయన పార్టీకీ, మాకూ పొత్తు పొసగదని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్టు! మనం సినిమాల్లో చూస్తూ వుంటాం, విలన్ డెన్‌లో ఉండే విదూషక క్యారెక్టర్‌కు ఆ డెన్లోనే ఏపాటి గౌరవం ఉంటుందో! చంద్రబాబు పరిస్థితి కూడా అంతే! ఎన్డీఏ కూటమిలో చేరినా, కూటమి సభ్యుల దృష్టిలో ఆయనో విదూషకుడు, అసందర్భ ప్రేలాపి, అవకాశవాది. అవకాశవాదంతో అటూ ఇటూ తిరిగినా, బీజేపీ ప్రవచించే పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాతో చంద్రబాబుకు కెమిస్ట్రీ బాగానే కుదురుతుంది. ఈ నమూనా వ్యవస్థలో అధికారంలో ఉన్నవాడు పెత్తందారీ శక్తుల భజంత్రీగా మారితే భారీగా వెనకేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటును పద్నాలుగేళ్లపాటు బాబు బాగానే ఒడిసిపట్టుకున్నాడు. కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధిగా, వారి పెరుగుదలే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలగా పరిగణించే బీజేపీ శిబిరమే చంద్రబాబుకు సహజ ఆవాసం. అందుకే మూడుసార్లు విడాకులు తీసుకున్నా మళ్లీ నాలుగోసారి అదే పార్టీని మనువాడేందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా వాజ్‌పేయి కార్గిల్ ఊపుమీద ఉన్నప్పుడు, మోదీ గుజరాత్ మోడల్ ఊపుమీద ఉన్నప్పుడు వారి గాలితో గెలిచిన అనుభవం బాబుది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలహీనంగా కన్పిస్తున్నందువల్ల మళ్లీ మోదీ గాలివాటు బాబుకు అవసరమైంది. అన్నిటినీ మించి తరుముకొస్తున్న అవినీతి కేసుల నుంచి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాపాడాలి. ఆ రాబోయే ప్రభుత్వం మోదీ సర్కారేనని బాబు నమ్ముతున్నారు. దేశంలో చాలామందికి బాబుకున్న అభిప్రాయమే ఉండవచ్చు. ప్రతిపక్ష శిబిరం బాగా బలహీనంగా కనిపించడం అందుకు ఒక కారణం కావచ్చు. స్వతంత్ర మీడియా సంపూర్ణంగా అంతర్ధానం కావడం మరో కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల, దేశానికి అన్నంపెట్టే రైతు తన పంటకు చట్టబద్ధమైన మద్దతు ధర కావాలని ఎలుగెత్తడం మనకు న్యాయమైన కోర్కెగా కనిపించడం లేదు. రోజురోజుకూ వేలాదిమంది యువకులు నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నా మన కళ్లకు వికసిత భారత విశ్వరూపమే కనిపిస్తున్నది. తరతరాలుగా ఈ నేలపైనే పుట్టి ఈ నేలపైనే శ్వాసిస్తున్న కోట్లాదిమంది ‘మైనారిటీ’ ముద్రకు భయపడి వణికిపోతుంటే విజయోద్వేగంతో మన హృదయాలు ఉప్పొంగుతున్నవి. కనుక చాలామంది మళ్లీ మోదీయే గెలుస్తాడని అనుకుంటే అనుకోవచ్చు. వారికా స్వేచ్ఛ ఉన్నది. మన బాబు కూడా ఆ గుంపులోని గోవిందుడే! ఉత్తరాది మోదీ గాలి అంతో ఇంతో దండకారణ్యాన్ని దాటుకుని రాకపోతుందా, తనను కరుణించకపోతుందా అనే ఆశ ఆయనలో మిణుకుమిణుకుమంటూ ఉండవచ్చు. కానీ తూరుపు కనుమలది తలలు వంచే నైజం కాదు. ఉత్తరాదిలో లేనిదీ... ఏపీలో ఉన్నదీ ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం. పేదల సాధికారతే తారకమంత్రంగా సాగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత విప్లవోద్యమం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తు.చ. తప్పకుండా అమలుచేస్తూ, ఆ రాజ్యాంగ కర్తను నగరం నడిబొడ్డున విశ్వరూపంతో నిలబెట్టిన రాష్ట్రమిది. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేంద్రానికి పెద్ద ఎత్తున సీట్లు కావాలి. అందుకు కూటములు కావాలి. రాజ్యాంగ రక్షణ కవచంతో సాధికారత సంతరించుకుంటున్న ప్రజలు ఈ ప్రయత్నాలను ఓడిస్తారు. ఆ కూటములనూ ఓడిస్తారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తును గానం చేసిన విశ్వకవి రవీంద్రుని కవిత అందరికీ తెలిసిందే. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత భావాలతో సమాజం ముక్కలుగా విడిపోదో... ఓ తండ్రీ! అటువంటి స్వర్గసీమకు నా దేశాన్ని తీసుకుని వెళ్లు’’. కవీంద్రుని కలను నిజం చేసే శక్తి మన రాజ్యాంగానికి ఉన్నది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చి అసమానతలకు, భయం బతుకులకు బాటలు వేసే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యాంగ మార్పుల చర్చ మళ్లీ ముందుకొచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే సవరణలు చెల్లబోవని గతంలోనే సుప్రీంకోర్టు చాటి చెప్పింది. ప్రస్తుత చట్టం (సీఏఏ) పౌరసత్వానికి మత ప్రాతిపదికను రుద్దుతున్నదని విమర్శకులు గట్టిగా భావిస్తున్నారు. ఇది రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధం కనుక చెల్లదని వారి వాదన. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు రాబోతున్నది. ఒకవేళ న్యాయస్థానం కొట్టివేస్తే భారీ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని ముందుకు తేబోతున్నదని విమర్శకులు అనుమానిస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఇంత గంభీరమైన అంశంపై నాలుగోసారి బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఎంత సింపుల్‌గా సమాధానం చెబుతున్నారో చూడండి. ‘‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్‌షిప్ అనేది పారదర్శకంగా ఉంటుంది. అక్కడి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల’’ని తేల్చేశారు. కానీ, మత ప్రాతిపదిక అవసరమా అనే కీలక విషయం జోలికి వెళ్లలేదు. పోనీ, ఈ ప్రాతిపదిక చట్టంలో చెప్పినట్టు మూడు దేశాలకూ, నిర్ణీత కాలానికే పరిమితం కావాలి. అంతకుమించి అనుమతించేది లేదని చెప్పినా అదొక లెక్క. కానీ మన నాయకుడు బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అంతే మరి! విలన్ డెన్‌లో చేరిన విదూషకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రష్యాలో ఎన్నికల తంతు!
ఆపద్ధర్మ ఏలుబడితో కలుపుకొని ప్రధానిగా, దేశాధ్యక్షుడిగా పాతికేళ్లనుంచి అవిచ్ఛిన్నంగా రష్యా అధికార పీఠాన్ని అంటిపెట్టుకునివున్న వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సార్వత్రిక ఎన్నికల తంతుకు తెరలేపారు. మూడురోజులపాటు జరిగే ఈ ఎన్నికలు శుక్రవారం మొదలయ్యాయి. 14 కోట్ల 30 లక్షలమంది జనాభాగల రష్యాతోపాటు 2014లో అది దురాక్రమించిన క్రిమియా... 2022 నుంచీ దాని ఆక్రమణలోవున్న ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ మీడియా మినహా మరి దేనికీ చోటీయని రష్యాలో చిన్నపాటి అసమ్మతి వినిపించే ప్రయత్నం చేసినా పెద్ద నేరమవుతుంది. అందుకే ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలన్నీ పుతిన్‌కు 80 శాతం ప్రజల ఆమోదం వున్నదని చాటాయి. కనుక 71 యేళ్ల పుతిన్ మరోసారి విజయం సాధించి అయిదోసారి అధ్యక్షుడవుతారనీ, 2030 వరకూ ఆయనే పాలిస్తారనీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయని చెప్పటానికి నామమాత్రంగా ప్రత్యర్థులు కనబడతారు. కానీ వారెవరికీ ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఒకప్పుడు దశాబ్దాలపాటు దేశాన్నేలిన కమ్యూనిస్టు పార్టీ ఏనాడో నామ మాత్రావశిష్టమైంది. ఆ పార్టీ తరఫున 75 యేళ్ల నికొలాయ్ ఖరిటోనోవ్ పోటీచేస్తున్నారు. 2004లో పుతిన్‌పై మొదటిసారి ఓడిన ఆయన్నే ఈసారి కూడా ఆ పార్టీ నిలబెట్టింది. ఎటూ గెలవని ఎన్నికల కోసం మరొకరిని ముందుకు తోయటం అనవసరమని ఆ పార్టీ భావించివుండొచ్చు. లిబరల్ డెమొ క్రాటిక్ పార్టీ అభ్యర్థి లియోనెడ్ స్లట్స్కీ... పుతిన్ మాదిరే జాతీయవాది. ఆయన గెలుపే తన గెలు పని స్లట్స్కీ ఇప్పటికే ప్రకటించారు. ఉదారవాదిగా ముద్రపడి ఉక్రెయిన్‌లో ‘శాంతి’ నెలకొనాలని తరచు చెప్పే న్యూ పీపుల్ పార్టీ అధినేత వ్లాడిస్లావ్ దవాన్కోవ్ది కూడా అదే తీరు. ఇక ఉక్రెయిన్‌తో తలపడటాన్ని తప్పుబట్టిన చరిత్రగల ఇద్దరు అభ్యర్థులను అధికారులు ‘అనర్హులుగా’ తేల్చారు. చాలా దేశాలకు ఇది ఎన్నికల నామ సంవత్సరం. ఇప్పటికే బంగ్లాదేశ్, తైవాన్ ఎన్నికలుపూర్తయ్యాయి. మన దేశంతోపాటు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఇండొనేసియా తదితర 60 దేశాల్లో ఈ ఏడాదంతా వేర్వేరు నెలల్లో ఎన్నికలుంటాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 200 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ప్రపంచ జనాభాలో నాలుగోవంతన్నమాట! అయితే విజేతలై గద్దెనెక్కేవారు ప్రజాస్వామ్యబద్ధంగానే పాలిస్తారా అన్నది వేరే సంగతి. ఎందుకంటే ప్రజా స్వామ్యం ముసుగేసుకున్న నియంతలూ, సమాజంలో పరస్పర వైషమ్యాలు రెచ్చగొట్టే నేతలూ, గాలి కబుర్లతో గద్దెనెక్కాలనుకునేవారూ ఈ దేశాలన్నిటా వున్నారు. కానీ పుతిన్ మాదిరి బరితెగించిన నేత ఎక్కడా కనబడరు. క్రితంసారి ఎన్నికలకన్నా ఎక్కువ పోలింగ్ అయిందనీ, పుతిన్‌కు అధిక శాతం మద్దతు లభించిందనీ ‘నిరూపించటానికి’ అధికారగణం ఎక్కడలేని పాట్లూ పడుతూవుంటుంది. 2018 ఎన్నికల సమయంలో పోలైన ఓట్లలో పుతిన్‌కు 5 కోట్ల 60 లక్షల ఓట్లులభించాయి. కనుక ఈసారి అది ఆరు కోట్లు దాటాలన్నది వారి పట్టుదల. తమ అధీనంలోని ఉక్రెయిన్ భూభాగంలో 45 లక్షలమంది ఓటర్లున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ నిత్యం బాంబుల వర్షం కురిసేచోట నిజానిజాలు నిర్ధారించేదెవరు? వారందరికీ ఆన్లైన్ వోటింగ్‌కు అవకాశం ఇచ్చామని అధికారులు ప్రకటించారు. కనుక రిగ్గింగ్ ఈసారి పాత రికార్డులు బద్దలుకొడుతుందని నిర్ధారణగా చెప్పవచ్చు. వారం పదిరోజుల్లో ఉక్రెయిన్ లెక్క తేల్చి, యుద్ధ విజేతగా చాటుకుని అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలని పుతిన్ తపించారు. కానీ 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన నాటి నుంచీ రష్యాకు అడుగడుగునా అవరోధాలే. అమెరికా ఉక్రెయిన్‌కు భారీయెత్తున సైనిక, ఆర్థిక సాయం అందించటమే కాదు...‘ఉక్రెయిన్ తర్వాత మీవంతే’ అని నాటో కూటమి దేశాలను బెదరగొట్టి ఆ దేశం పక్షాన నిలబడేలా చేసింది. కనుక యుద్ధం రెండేళ్లుదాటి మూడోసంవత్సరంలోకి ప్రవేశించినా పుతిన్‌కు అక్కడ దారీ తెన్నూ కనబడటం లేదు. పైపెచ్చు ఆయుద్ధంలో రష్యా సైనికులు భారీ యెత్తున మరణిస్తుండటం, అత్యాధునిక ఆయుధాలు అక్కరకు రాకుండా పోవటం, ఉక్రెయిన్ డ్రోన్ దాడులను నిలువరించటంలో వైఫల్యం వంటివి ఆయనకు నిరాశ కలిగిస్తున్నాయి. కానీ ఆ యుద్ధం వల్ల పుతిన్‌కు జనాల్లో ఆమోదనీయత పెరిగిందని ప్రభుత్వ మీడియా ఊదరగొడుతోంది. అయితే పుతిన్ ఏలుబడి నల్లేరు మీద నడక కాదు. 2006–08 మొదలుకొని రెండేళ్లనాడు మొదలైన ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధం వరకూ ఏదో పేరిట చెలరేగే నిరసనలు తలనొప్పిగానే వున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా, హక్కుల ఉల్లంఘన, దురాక్రమణ యుద్ధాలను నిరసిస్తూ ఈ ఉద్యమాలు సాగాయి. అయితే పుతిన్ వాటన్నిటినీ అణిచేసి, జైళ్లు నింపారు. ప్రస్తుతం రాజకీయ ఖైదీల సంఖ్య 1,16,000 పైమాటే. దేశ పౌరుల్లో పుతిన్ పాలనపై తీవ్ర అసంతృప్తి వుంది. ప్రభుత్వ వ్యయంలో 40 శాతం యుద్ధానికే కేటాయించాల్సివస్తోంది. అయినా ఫలితం నాస్తి. నిరుడు జీడీపీ 3.6 శాతంగా నమోదై జీ–7 దేశాలను అధిగమించింది. రక్షణరంగ పరిశ్రమలు మాత్రమే పచ్చగా వర్ధిల్లుతున్నాయి. అమెరికా ఆంక్షల పర్యవసానంగా దేశంలో అనేక వ్యాపార ‡సంస్థలు కుప్పకూలి మూతబడ్డాయి. వాస్తవాదాయాలు పడిపోయి, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి పౌరులు సతమతమవుతున్నారు. దానికితోడు అంతర్జాతీయంగా ఏకాకులమయ్యామన్న అసంతృప్తి అదనం. కానీ అధ్యక్ష ఎన్నికల్లో వీటి ప్రభావం కనబడనీయకపోవటం పుతిన్ ప్రత్యేకత. ఈ రీతి, రివాజు ఎన్నాళ్లు కొనసాగుతుందో, నిజమైన ప్రజాస్వామ్యం రష్యాలో ఎప్పుడు చిగురిస్తుందో చూడాలి. -
ఈసీలో కొత్త నీరు!
ఎన్నికల నోటిఫికేషన్ల విడుదల సమయాల్లో మాత్రమే వినబడే ఎన్నికల సంఘం చాన్నాళ్లుగా తరచు వార్తల్లోకెక్కుతోంది. అక్కడ కమిషనర్ల ప్రవేశమూ, నిష్క్రమణా కూడా సంచలనాలుగా, వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నెల 9న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశాక ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. తాజాగా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ గురువారం ప్రకటించింది. తనకు 212 పేర్లతో బుధవారం రాత్రే జాబితా పంపారని, తెల్లారేలోగా అంతమందిని జల్లెడపట్టి వారిలో ఇద్దరిని ఎంపిక చేయటం సాధ్య మేనా అని కమిటీలోని విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు. ఆ సంగతలావుంచి రేపో మాపో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న దశలో ఈ ఎంపిక వుండదని, ఏకసభ్య సంఘం చేతులమీదుగా అంతా ముగుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ రాజు తల్చుకుంటే కానిదంటూ ఏముంటుంది? నిజానికి ఎన్నికల సంఘం 90వ దశకం వరకూ ఏకసభ్య సంఘంగానే వుండేది. 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో జైల్‌సింగ్‌కు రెండోసారి అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను సవరించాలన్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రయత్నానికి అప్పటి ఎన్నికల కమిషనర్ ఆర్వీఎస్ పేరిశాస్త్రి అడ్డుపుల్ల వేయటంతో ఆగ్రహించి ఆ సంఘాన్ని త్రిసభ్య సంఘం చేయాలని కేంద్రం భావించింది. అయితే అనంతర కాలంలో వీపీ సింగ్ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలా చేసింది. 1990లో నాటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ దూకుడును తట్టుకోలేకపోయిన నాటి పీవీ నరసింహారావు సర్కారు దాన్ని త్రిసభ్యసంఘంగా మార్చింది. నిర్వాచన్ సదన్‌లో ఏదో జరుగుతోందని తెలిసినా ఎందుకో అర్థంకాని పరిస్థితి గతంలో లేదు. ఏదైనా సమస్యవుంటే ప్రభుత్వం వివరణనివ్వటం రొటీన్‌గా సాగిపోయేది. లేదంటే మీడియానే కూపీ లాగే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వివరణనిచ్చే సంస్కృతీ లేదు... వెలికితీసే మీడియా కూడా లేదు. ఈమధ్యే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసి నిష్క్రమించారు. వచ్చినప్పటిలాగే వెళ్లేటపుడు కూడా ఎన్నో ప్రశ్నలు మిగిల్చారు. వాస్తవానికి ఆయనకు ఇంకా మూడేళ్ల వ్యవధివుంది. పైగా వచ్చే ఫిబ్రవరిలో రాజీవ్‌కుమార్ రిటైరయ్యాక ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం కూడావుంది. ఈ చాన్సును కమిషనర్లుగా వున్నవారు ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోరు. పోనీ గోయెల్‌కు అలా వెళ్లితీరాల్సిన పరిస్థితి ఏర్పడినా సాధారణంగా కేంద్రం సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గత నెలలో మరో కమిషనర్ అనూప్ పాండే రిటైరయ్యారు. గోయెల్ కూడా నిష్క్రమిస్తే ఒక్కరే మిగులుతారు. ఒక్కరితో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు బదులు ఆ ప్రక్రియ ముగిసేవరకూ వుండాలని ఆయన్ను కోరితే వేరుగా వుండేది. ఈ హఠాత్తు నిష్క్ర మణలోని ఆంతర్యమేమిటో మూడోకంటికి తెలియదు. ఆయనంతట ఆయన వెళ్లారా, ప్రభుత్వమే అడిగిందా అన్నది అర్థంకాదు. ఆయన నియామకం కూడా వివాదాస్పదమే. 2022 నవంబర్ వరకూ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా వున్న గోయెల్ ఆ నెల 18న స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. రాత్రికి రాత్రి కేంద్ర న్యాయశాఖలో కమిషనర్ ఫైలు చకచకా కదిలి, నలుగురు సభ్యుల జాబితాలో గోయెల్ పేరు చేరిపోయింది. ఆ మర్నాడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు ఆ ఫైలు వెళ్లటం, గోయెల్‌ను ఎంపిక చేయటం, ఆయన కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం ముగిసిపోయాయి. ఈ హైస్పీడ్ ‘24గంటల వ్యవహారం’పై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఎందుకింత తొందర?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది కూడా. కానీ చివరకు ఆ పిల్‌ను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకం అంశంలో కొత్త చట్టం వచ్చేవరకూ ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వుండాలని నిరుడు మార్చిలో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. రాజ్యాంగంలోని 324(2) అధికరణను ఉల్లంఘించి ప్రధాని ఏకపక్షంగా నియమకాలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఆ తీర్పునిచ్చింది. అనంతరం ఆగస్టులో కేంద్రం తెచ్చిన చట్టంలో ఆ తీర్పు స్ఫూర్తి గాలికెగిరి పోయింది. ప్రధాని, కేంద్రమంత్రి, లోక్‌సభలో విపక్షనేత ఎంపిక కమిటీలో వుంటారని ఆ చట్టం చెబుతోంది. పర్యవసానంగా ఎప్పటిలా పాలకపక్షం అభీష్టమే నెరవేరుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షం లేకుండానే బిల్లు ఆమోదం పొంది, చట్టం కావటాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ ప్రస్తుతం విచారణలో వుంది. ఆ చట్టంకిందనే తాజాగా ఇద్దరు కమిషనర్లను నియమించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. దాన్ని పర్యవేక్షించే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వుండాలని జనం కోరుకుంటారు. అందుకే కమిషనర్ల నియామకం, పదోన్నతులు సాధ్యమైనంత పారదర్శకంగా వుండేందుకు ప్రయత్నించాలి. హఠాత్తు నిష్క్రమణలు, ఆగమనాలు ఎన్నికల సంఘం తటస్థతను ప్రశ్నార్థకం చేస్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే దశలో అశోక్ లావాసా 2020లో హఠాత్తుగా రాజీనామా చేయటం, ఇటీవల వున్నట్టుండి గోయెల్ నిష్క్రమించటం, పాలకపక్షందే పైచేయిగావున్న ఎంపిక కమిటీ కొత్త నియామకాలు చేయటం వంటివి సంశ యాలకు తావిస్తాయని పాలకులు తెలుసుకోవటం ఉత్తమం. -
బెంగళూరు దాహార్తి!
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి. కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్‌మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్‌లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి. ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది. 1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క. కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్‌లోని రాంసర్లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది. మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్‌టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి. ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది. నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్‌టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది. -
మళ్లీ సీఏఏ రంగప్రవేశం!
రేపో మాపో లోక్‌సభ ఎన్నికల నగారా మోగబోతున్న తరుణంలో... ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆరునూరైనా ఈనెల 15కల్లా బహిరంగపరచాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన కొన్ని గంటల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనలపై సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనారిటీలుగా వేధింపులకు లోనవుతూ మన దేశానికి వలసవచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మతస్తులకు త్వరితగతిన భారత పౌర సత్వం ఇవ్వటం సీఏఏ ప్రధాన ఉద్దేశమని పార్లమెంటులో బిల్లు పెట్టిన సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మరోసారి ఆమాటే చెప్పింది. ఈ మతస్తులు వరసగా అయిదేళ్లపాటు ఈ దేశంలో నివసిస్తే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఈ సవరణలు తీసుకొచ్చారు. చట్టంలో ముస్లింలను మినహాయించినట్టు బాహాటంగానే కనబడుతోంది. కానీ శ్రీలంకలో మైనారిటీలైన హిందూ తమిళులనూ, మయన్మార్‌లోని మైనారిటీలు రోహింగ్యాలనూ, ఇంకా... హజరా, అహ్మదీయ వంటి ముస్లిం మైనారిటీ తెగలనూ సీఏఏ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ తెగలు కూడా భారత పౌరసత్వం కోసం ఎప్పటిలా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం వారు పదకొండేళ్లపాటు ఈ దేశంలో నివసించాలి. ఆచరణలో పౌరసత్వం రావటానికి దశాబ్దాలు పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ముస్లిం దేశాల్లోని హిందువుల స్థితిగతులపై వున్న ఆరాటం లంక తమిళుల విషయంలో ఎందుకు లేకుండా పోయింది? అక్కడ వారు ఎదుర్కొంటున్న వివక్ష, హింస తక్కువేమీ కాదు. చట్టం ముందు అందరూ సమానులేనని మన రాజ్యాంగం చెబుతోంది. రాజ్యం ఎవరికీ సమానత్వాన్ని నిరాకరించకూడదనీ, పౌరులందరికీ చట్టాలు సమంగా రక్షణ కల్పించాలనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చాటుతోంది. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నవారి విషయంలో ఆ స్ఫూర్తే కొనసాగాలి. కానీ సీఏఏ అందుకు విరుద్ధంగా కొన్ని మతాలవారిని ఉదారంగా చూడటం, మరికొందరిని దూరం పెట్టడం ఎంతవరకూ సమంజసం? ఈ చట్టాన్ని సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 2020లో పిటిషన్ దాఖలు చేసింది. కాలక్రమంలో మరో 200 పిటిషన్లు దానికి జత కలిశాయి. ఇందులో అస్సాంకు చెందిన అసోం గణపరిషత్, డీఎంకే, అస్సాం పీసీసీ మొదలుకొని అసదుద్దీన్ ఒవైసీ, మహువా మొయిత్రా, జైరాం రమేష్ వంటి నాయ కులు కూడా వున్నారు. బిల్లు చట్టంగా మారాక దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, విశ్వ విద్యాలయాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలోని జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూని వర్సిటీ వంటిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనల్లో వందమంది వరకూ మరణించగా, అనేకులు గాయపడ్డారు. వందలాదిమందిపై ఇప్పటికీ కేసులు కొనసాగు తున్నాయి. సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యాక ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఉద్యమాల వెనకున్న ఉద్దేశం వేరు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వంటివి పరాయి దేశాల మైనారిటీలకు మనమెందుకు పౌరసత్వం ఇవ్వాలని ప్రశ్నిస్తు న్నాయి. ఈ భారం తమపైనే పడుతుందని ఆందోళన పడుతున్నాయి. మరోపక్క సీఏఏ నోటిఫికేషన్ రాకపై గత కొన్ని నెలలుగా మీడియాలో కథనాలు వస్తూనే వున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఎదుర్కొనటానికి ఇది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనీ, లేకుంటే దెబ్బతింటామనీ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. బెంగాల్‌లోని నాదియా, 24 పరగణాలు, తూర్పు బర్ద్వాన్, ఉత్తర బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలకు 1971లో బంగ్లా విముక్తి యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతువా తెగ ప్రజలు హిందువులు. పౌరసత్వ చట్టానికి 2003లో చేసిన సవరణ కింద వారంతా శరణార్థులుగా కొనసాగుతున్నారు. ఓటుహక్కు వగైరాలున్నాయి. మొదట్లో సీపీఎంకూ, తర్వాత తృణమూల్కూ, ఇప్పుడు బీజేపీకీ వోటు బ్యాంకుగా వీరు ఉపయోగపడుతున్నారు. అస్సాంలోనూ బీజేపీకి అటువంటి ప్రయోజనాలే వున్నాయి. రామమందిరం, పౌరసత్వ సవరణ చట్టంవంటివి మాత్రమే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని నిజంగా బీజేపీ భావిస్తే అది ఆ పార్టీ బలహీనతను సూచిస్తుందే తప్ప బలాన్ని కాదు. పొరుగు దేశాల బాధిత మైనారిటీల విషయంలో అనుసరించాల్సిన విధానాలను మాత్రమే సీఏఏ నిర్ధారించిందని, మైనారిటీల పౌరసత్వానికి దానివల్ల వచ్చే నష్టంలేదని, వారు భయపడాల్సిన పని లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. సీఏఏ దానికదే సమస్యాత్మకం కాక పోవచ్చు. కానీ జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను దాంతో అనుసంధానిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని నిపుణులంటున్న మాట. అస్సాంలో ఎన్ఆర్సీ అమలయ్యాక ఏమైందో చూస్తే ఇది అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలమంది పౌరసత్వానికి అనర్హు లయ్యారు. ఇందులో ముస్లింలతోపాటు హిందువులు కూడా వున్నారు. ఎన్ఆర్సీని ఏదోమేరకు అంగీకరించిన అస్సాంలో సీఏఏపై వ్యతిరేకత వుండటాన్ని, లంక తమిళులకు చట్టంలో చోటీయక పోవటంపై వున్న అసంతృప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్టులేదు. చట్టం తీసుకురావటానికి ముందు అన్ని వర్గాలతోనూ చర్చించలేదు. ఉద్యమాల సమయంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా అవేమీ జరగలేదు. కనీసం నోటిఫికేషన్ విడుదలకు ముందైనా సందేహాలు పోగొట్టాల్సిన అవసరం గుర్తించకపోతే ఎలా? అసలు ఎన్నికలు ముంగిట పెట్టుకుని సమస్యాత్మకమైన ఈ తేనెతుట్టెను ఎందుకు కదిపినట్టు? -
సరైన కార్యాచరణ ఎక్కడ?!
నటన ఒక స్థాయికి మించితే బెడిసికొడుతుంది. తెరపై అతిగా నటిస్తే ఓవరాక్షన్ అంటారు. ఆ పనే నిజజీవితంలో చేస్తే వంచన అంటారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ 157 రోజులుగా అంతూ దరీ లేకుండా సాగుతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా పరిగణించే రంజాన్ మాసం మొదలైనా మారణకాండ, విధ్వంసం ఆగటంలేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకూ, బాంబులకూ పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికి 31,000 మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో 13,000 మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ‘సంపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మంది పౌరులను అపహరించినప్పటినుంచీ గాజాపై దాడులు సాగుతూనేవున్నాయి. కిడ్నాప్ చేసినవారిలో 150 మందిని హమాస్ విడుదలచేసింది. ఇంకా 100 మంది వారి చెరలోనేవున్నారు. ఈ మానవ హననాన్ని నిలువరించటానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం చేస్తూ తన నటనావైదుష్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాపై దాడులు నిలపాలనీ, కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీ కరించాలనీ నెతన్యాహూను కోరారు. మంచిదే. కానీ ఆయన లక్ష్యపెట్టిందెక్కడ? తన మాటకు విలువీయని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు? అమెరికాయే కాదు... దాని మిత్రదేశాలు కూడా ఈ ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసు కున్నాయి. ఇదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతామండలిలో అమెరికా తన వీటో అధికారంతో గండికొడుతోంది. నెతన్యాహూపై బైడెన్ తరచు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణరేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎవరిని వంచించటానికి ఈ హెచ్చరికలు? గాజా ప్రజల క్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళనవుంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరులు సరిహద్దుదాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు. కానీ ఆయన ఆ పని చేయటం లేదు. ఈజిప్టుకు ఏటా అమెరికా 103 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయినా ఈ ప్రతిపాదన చేయరు. ఇందుకు బదులు ఆహార పొట్లాలు అందించటం మొదలెట్టారు. ఆ ఉద్దేశం వెనకున్న ఆంతర్యాన్ని కూడా అనేకులు తప్పుబడుతున్నారు. దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలుపెడతామని బైడెన్ ప్రకటించారు. ఇది ఆహార సరఫరా సులభం చేయటం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ తిష్టవేయటమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రా యెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడే మాటలు 31,000 మంది మరణించాక కూడా చెల్లుబాటవుతాయా? అయిదు నెలలు గడిచాక కూడా ఇంకా హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథాన్ని అమెరికా చూసీ చూడనట్టు వదిలేయటం సరైందేనా? హమాస్ తన దుందుడుకు చర్యలతో గాజా ప్రజలకు తీరని నష్టం చేసింది. దానిపై దాడి పేరుతో అదే పని ఇజ్రాయెల్ కూడా కొనసాగిస్తోంది. కానీ ఒకరి దాడిని ఉగ్రవాదంగా చిత్రీకరిస్తూ మరొకరిని అనునయిస్తూ, వేడుకుంటూ అదే సమయంలో వారికి కావల సిన ఆయుధ సామగ్రి అందిస్తూ కాలం గడపటం సరైందేనా? గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించటం సాధ్యంకాని ఉదంతాలు చోటుచేసు కుంటున్నాయి. గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలములు తింటున్నారు. కడుపు నింపు కోవటానికి పశుదాణా సైతం వినియోగిస్తున్నారు. నెలలు నిండకమునుపే గర్భిణులకు ప్రసవాలవు తున్నాయి. ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావటం లేదు. అధిక రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సివస్తుంది. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్‌కు ఇంతవరకూ అమెరికా ఒక్కటే 7,500 కోట్ల డాలర్ల సాయం అందించింది. నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి. ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. అటు ఉక్రెయిన్‌కు కూడా ఒరిగేదేమీ వుండటం లేదు. లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే. సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు, క్షిపణులు వగైరాలు కొంటున్నది. అటు ఉక్రెయిన్, ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మరపిస్తుండగా... రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి. పోనీ అమెరికా అయినా ప్రశాంతంగా వుంటున్నదా? కొన్ని దశాబ్దాలక్రితం పౌరహక్కుల కోసం చేతులు కలిపిన నల్లజాతీయులు, యూదులు ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నారు. యూదులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్నంతటినీ ఆపాలంటే గాజాతోపాటు ఉక్రెయిన్లోనూ ప్రశాంతత నెలకొనాలి. అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనేవుంది. ఇప్పుడు కావాల్సింది నటన కాదు... సరైన కార్యాచరణ. -
మల్లెల వేళ... వెన్నెల మాసం
‘వసంతం’ అన్న మాటే ఎంత మృదువుగా చెవిని తాకుతుంది! ఆ మాటలో ఒక్క పరుషాక్షరంకానీ, ద్విత్వాక్షరం కానీ, సంయుక్తాక్షరం కానీ లేవు. ఎందుకుంటాయి? వసంతమంటే, ప్రకృతి మోహపరవశయై రంగురంగుల పూలతో సిగను అలంకరించుకుని నూతన సృష్టికి సంసిద్ధమయ్యే కాలం కదా! స్త్రీపురుషుల ఎదలో తీపి ఊహలు రేపి లలితలలితం చేసే మధుమాసం కదా! వేదాలలో సామంగా, ఛందస్సులలో గాయత్రిగా, మాసాలలో మార్గశీర్షంగా తనను చెప్పుకున్న కృష్ణ పరమాత్మ; ఆరు ఋతువులలోనూ సర్వశ్రేష్ఠం కనుకనే కుసుమాకరమైన వసంతమూ తానేనన్నాడు. సమృద్ధికి సంకేతమైన ఆమని, ఋతుపతి, కామవల్లభము, పికబాంధవము, పూలకారు అనిపించుకునే వసంతఋతువుకు రారాజు మన్మథుడైతే; అతని చెలికాడూ, సేనానీ వసంతుడట! అరవిందం, అశోకం, మామిళ్ళు, కొత్త మల్లెలు, నీలోత్పలాలనే అయిదూ మన్మథుని బాణాలట! అవి ప్రేయసీప్రియుల ఎడదను తాకి వలపు పులకలతో ఠారెత్తిస్తాయట! ఆదికవి నుంచి ఆధునికుని వరకూ వసంత రుతుగానం చేయని కవికోకిల ఎవరుంటారు? సీతావియోగ దుఃఖంతో అడవుల వెంబడి పడిపోతున్న రాముణ్ణి వసంతశోభ ఆకర్షించడమే కాదు, మరింతగా దుఃఖవివశుణ్ణి చేసినట్టు వాల్మీకి వర్ణిస్తాడు. పంపాతీరానికి చేరేసరికి ఆ సరస్సు పద్మాలు, ఉత్పలాలు, చేపలతో కనువిందు చేసింది. అందులోని నీళ్ళు వైడూర్యంలా స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయి. చుట్టుపక్కల అడవి అంతటా ఎత్తైన చెట్లు, పర్వతాలు పచ్చదనంతో ముచ్చట గొలుపుతున్నాయి. పూర్తిగా పుష్పించి ఉన్న చెట్లను లతలు గాఢాలింగనం చేసుకుని ఉన్నాయి. రక రకాల చెట్ల మధ్యలో నీలి, పసుపురంగు గడ్డిభూములు రంగురంగుల పూలదుప్పటి కప్పుకున్నట్టున్నాయి. ఆహ్లాదకరమైన పిల్లగాలితో ఎల్లెడలా పూలు, పండ్ల పరిమళాన్ని గుప్పిస్తూ వసంతం ఎంతో కొత్తగానూ, స్వాతిశయంతోనూ భాసించింది. మేఘాల్లోంచి పడే వర్షంలా అదేపనిగా పూల వాన కురుస్తోంది. ఆదికవిది ఎంత సుసూక్ష్మ పరిశీలనంటే, కొన్ని పూలు అప్పటికే రాలిపోగా, కొన్ని రాలి పోతూపోతూ ఉన్నాయట. ప్రతిచోటా గాలి పూలతో పరాచికాలు ఆడుతూనే ఉందట. కాళి దాసు ఋతుసంహార కావ్యాన్ని గ్రీష్మంతో ప్రారంభించి వసంతంతో ముగిస్తాడు. అప్పుడు చెట్లు పూల తోనూ, నీళ్ళు పద్మాలతోనూ, స్త్రీలు ప్రియసమాగమ కాంక్షతోనూ, గాలి పూలగంధంతోనూ, సాయంత్రాలు సుఖం గొలిపేలానూ, పగళ్ళు పరమరమ్యంగానూ ఉండి సమస్తమూ సుమనో హరంగా ఉందంటాడు. మగకోకిల బాగా చిగిర్చిన మామిడి చిగుళ్ళు మెక్కి మదించి తనకు ప్రియమైన ఆడకోకిలను ముద్దాడుతున్నట్టూ; తుమ్మెద కమలాల్లోని పూదేనె గ్రోలుతూ ఝంకారం చేస్తూ ఆడుతుమ్మెదను ఆకర్షించే నర్మవ్యాపారాలు చేస్తున్నట్టూ వర్ణిస్తాడు. ప్రతిపద్య చమత్కృతికి పెట్టిన పేరైన చేమకూర వెంకటకవి తన ‘విజయవిలాస’ కావ్యంలో వసంతుడికీ, చంద్రుడికీ మధ్య స్పర్థను కల్పించి తన ఊహావైభవాన్ని అంచులు దాటిస్తాడు. వసంతుడు వస్తూనే మోడువారిన చెట్లను చిగురింపజేసి రసవంతమైన ఫలపుష్పాలతో నలువైపులా సుగంధాలను వ్యాపింపజేసినా, అవి వట్టి చెట్లే కదానని చెప్పి చంద్రుడు మెచ్చలేదట. ప్రసన్న, సుకుమారమైన తన వెన్నెలజల్లుతో ఏకంగా రాళ్ళనే కరిగింపజేశాడట. చేమకూరకు మరింత చవిని జోడించే మరో పద్యం మన్మథుడి జైత్రయాత్రను చెబుతుంది. రాజు ఎక్కడికైనా వెడుతున్నప్పుడు సూర్యచంద్రుల బొమ్మలున్న పొడవాటి కర్రలను పట్టుకుని పరిచారకులు ముందునడవడం పరి పాటి కాగా; మన్మథుడు జగజ్జేత కనుక తూర్పు, పడమటి కొండలపై ప్రకాశించే సూర్యచంద్రులనే నేరుగా రాజలాంఛనం చేసుకుని దిగ్విజయానికి బయలుదేరాడట. వసంతాగమనాన్ని ఎలా పోల్చుకోవాలో విశ్వనాథవారు తన ‘ఋతుసంహార’ కృతిలో అందంగా ఏకరవుపెడతారు. కౌగి లింత వేళ ఉద్రిక్త అయిన ప్రియురాలి ఎద చెమర్చినా, చన్నీటిస్నాన సౌఖ్యం వల్ల ముక్కుపుటాలలో చెమరింపు పుట్టినా, పేరంటానికి వెళ్ళే పిన్నబాలిక వాలుజడలో మల్లెమొగ్గ కనబడినా, వంగిన వేపకొమ్మకు కావి చిగురుపట్టి పక్క ఈనెకు పూతపట్టినా, హఠాత్తుగా ఓ రోజున పొద్దెక్కినవేళ దూరపు కోన నుంచి కోకిలస్వరం వినిపించినా వసంతం అడుగుపెట్టిందన్న మధురోహ కలుగు తుందంటారు. ఆపైన, కొత్తగా జతకట్టిన కోకిలమ్మ పెంటికై నూత్నయవ్వనోద్వేగంతో వేగిపోతూ వసంతవనాంత వీథిలో ముక్కున చిదమని మామిడి చిగురు లేదంటారు. శేషేంద్ర ఏం తక్కువ! ‘ఎక్కడ చూసినా స్వచ్ఛకాంతులీనుతూ సంతోషంలో ముంచే జాజులు, మల్లెలు, తీగసంపెంగలు, కొదమ గులాబులతో విశ్వదిశాంతరాళాన్ని సుమసముద్రం చేస్తున్నది– ఇదేనా మధుమాసమంటే’ అని తన ‘ఋతుఘోష’లో ఆశ్చర్య, పారవశ్యాలను అక్షరీకస్తారు. ‘ఈ ఆకాశమూ, ఈ మహా సము ద్రాలూ, ఈ భూమండలమూ, ఈ తరుప్రపంచమూ ఈ విశ్వమంత అంతర్గత శోభతో ఉర్రూత లూగిస్తున్నాయి; ఊహావిహంగం ఉత్కంఠతో ఎగిరిపోవాలనుకుంటోం’దంటారు. విశ్వమందిరంలో కన్నులపండువగా కొలువైన పురుషునికీ; పూవులతో, ఎర్రని చిగుళ్లతో సింగారించుకుని సొంపుగులికే ప్రకృతికీ మధ్య రాసక్రీడగా వసంతారంభ కాలాన్ని రూపుకడతారు. ఇంకోవైపు, జీవజాల మనే ఒడ్లను ఒరుసుకుంటూ ప్రవహించే ఈ వాసంతరస స్రవంతి వేళ, ప్రియురాలితో కలసి సరస్తీరాలకు, పూపొదల చాటుకు, తోటలకు వెళ్ళే అవకాశం లేకుండా మధ్యాహ్నకాలాల్లో చేలల్లో మగ్గి పోయే శ్రామికజనాలపై జాలితో కరిగినీరవుతారు. వసంతం మామూలుగా కాదు, ఉత్సవంలా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జీవుల మనుగడను ఆహ్లాదపు ఊయెల ఎక్కించి ఊపి విడిచిపెడుతుంది. వసంతానుభవపు మత్తుకు, గమ్మత్తుకు చిత్తు కాని జీవి ప్రపంచంలోనే ఉండడు. మన్మథుడా మజాకానా! ఆయన జగత్తుకే రారాజు కదా!! -
స్నేహం కాదు, దాసోహం!
ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు స్నేహ హస్తాన్ని అందుకోవలసిన అవసరం బీజేపీకి ఉన్నదా? కామన్సెన్స్ ఉన్న వాళ్లె వరైనా లేదనే చెబుతారు. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నదని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఎన్డీఏకు సవాల్ విసరడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్టించుకున్న ‘ఇండియా’ బొంత ప్రతిపక్షాలకు స్ఫూర్తినివ్వలేక పోయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సమరశీలతను కోల్పోవడం బీజేపీకి అయాచిత వరంగా మారింది. ఈ పరిస్థితు లలో తనకు ఏమాత్రం బలం లేని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి రెండు సీట్లు గెలిచి తీరవలసిన అవసరం బీజేపీకి లేదు. ఈ ఎన్నికల్లో గెలవాల్సిన తక్షణ లక్ష్యంతోపాటు బీజేపీకి ఒక దీర్ఘకాలిక వ్యూహం కూడా ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించడం కోసం అది వ్యూహాన్ని రూపొందించుకున్నది. ఇది బహిరంగ రహస్యం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు బీజేపీ తొలి టార్గెట్ తెలంగాణ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గురి తప్పినా 14 శాతం ఓట్లను సమీకరించుకోగలిగింది. గెలిచే అవకాశాలున్నాయన్న వాతావరణాన్ని ఎన్నికల ముందు సృష్టించగలిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం రెట్టింపు అయి వుండేదన్న అంచనా ఆ పార్టీకి ఉన్నది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తామన్న అంచనాతో ఆ పార్టీ శ్రేణులున్నాయి. రాజకీయ పరిశీలకుల అభి ప్రాయాలు కూడా ఈ అంచనాకు అనుగుణంగానే ఉన్నాయి. తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలోనే తేలిపోతుందని ఇటీవల లక్ష్మణ్ వంటి సీనియర్ బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని బీజేపీ సహకారంతో గద్దెనెక్కిన మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఏక్నాథ్ షిండే ఎపిసోడ్‌ను ఈ నాయకుల మాటలు గుర్తు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రయోగాన్ని తెలంగాణలోనూ రిపీట్ చేయగలిగితే బీజేపీ తన లక్ష్యాన్ని దాదాపుగా చేరు కున్నట్టే! తెలంగాణ షిండేకు పార్టీ తీర్థప్రసాదాలను ఇవ్వడం ఆ తర్వాత ఒక లాంఛనం మాత్రమే! లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు బీజేపీ ఖాతాలో పడితే షిండే ప్రయోగం ప్రారంభం కావచ్చన్న అభిప్రాయం బలపడు తున్నది. ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే బీజేపీకి తన సహకారం అవసరమనే ఒక ప్రతిపాదన చంద్రబాబు ద్వారా ఆ పార్టీ పెద్దలకు చేరింది. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల కథ ముందుకు కదిలింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడి, బీజేపీ బలం పుంజుకుంటే ముందుగా ముప్పు ముంచు కొచ్చేది కాంగ్రెస్‌కే! తెలంగాణ భవన్లో స్విచాఫ్ చేస్తే గాంధీ భవన్లో చీకటి కమ్ముతుందన్నమాట!! తెలంగాణలో ఏక్నాథ్ ఎఫెక్ట్‌కూ, ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు లకూ ఏమిటి లంకె? చంద్రబాబుకు బీజేపీ చేయగలిగిన ప్రత్యుపకారమేమిటి? బీజేపీ జతగూడితే చంద్రబాబు ఏపీలో గెలుస్తాడా? ఇటువంటి ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడానికి తొంభై శాతం అవకాశాలున్నాయనుకుంటే ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి నూరు శాతం అవకా శాలున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 40 శాతం ఓటర్ల మద్దతు కనిపిస్తుంటే, ఏపీలో వైసీపీకి 50 శాతానికి పైగా ఓటర్ల మద్దతు కనిపిస్తున్నది. డజన్‌కు పైగా జాతీయస్థాయి సర్వేలు దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. బీజేపీకి ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నది. కానీ చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ప్రాణావసరం. ఆయనకది జీవన్మరణ సమస్య. ఎన్డీఏ కూటమి తరఫున 400 సీట్లు, 50 శాతం ఓట్లు సంపా దించి రికార్డు సృష్టించాలని బీజేపీ పెద్దలు కలలు కంటున్నారు. గడచిన ఎన్నికల్లో ఎన్డీఏకి 45 శాతం ఓట్లు లభించాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఏర్పడిన సానుభూతి ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలిచింది. 49 శాతం ఓట్లకే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి ఆ రికార్డుపై కన్నేసింది. అందు కోసం కలసిరాగల ప్రతి రాజకీయ పక్షాన్నీ తన దొడ్లో కట్టేసుకుంటున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు విజ్ఞప్తిని మన్నించడానికి అది ఒక కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు మరో ప్రత్యా మ్నాయం కూడా బీజేపీకి లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని జగన్మోహన్రెడ్డి అవలంబిస్తున్నప్పటికీ, సైద్ధాంతికంగా బీజేపీ భావజాలానికి, రాజకీయ కూటమికి దూరంగానే ఉంటున్నారు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని ఎంజీ రామచంద్రన్ నుంచి నవీన్ పట్నాయక్ వరకు పలువురు ముఖ్య మంత్రులు అవలంబించి వారి రాష్ట్రాల ప్రయోజ నాలను కాపాడుకొచ్చారు. ఏపీ సీఎం జగన్‌దీ అదే వైఖరి. టీడీపీ వినతిని బీజేపీ నాయకత్వం అంగీకరించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం ఫలించాలంటే వైసీపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీ క్షీణించాలి. ఆ ఖాళీని మాత్రమే బీజేపీ ఆక్రమించగలదు. సాపేక్షంగా వైసీపీ యువ పార్టీ. పన్నెండేళ్ల వయసు. ఎదిగే దశ. యాభైశాతం ఓటుతో బలంగా ఉన్నది. పైగా అధికారంలో ఉన్నది. టీడీపీ అధినేతతో పోల్చితే వైసీపీ అధినేత వయసు పాతికేళ్లు తక్కువ. పాలనా సంస్కరణలు అమలు చేస్తూ, సామాజిక విప్లవాలను ఆవిష్కరిస్తూ, సరికొత్త శక్తులను పార్టీ నిర్మాణంలోకి సమీకరించుకున్నది. ఇప్పుడు మండే నెత్తురుతో ఆ పార్టీ ఇంజన్ నడుస్తున్నది. ఇందుకు భిన్నంగా టీడీపీ పరిస్థితి కనిపిస్తున్నది. చంద్రబాబుకు వృద్ధాప్యం మీదపడింది. ఉపన్యాసాల్లో ఒక మాటకు బదులు మరో మాట చెబుతున్నారు. పార్టీలోకి కొత్త తరం రావడం లేదు. వచ్చినా ఒక సామాజిక వర్గం నుంచే వస్తున్నారు. పార్టీ నాయకత్వం బాగా బలహీనపడింది. అధినేత సొంత కొడుకుతో పాటు, బావమరిది కూడా అప్రయోజకులుగా ముద్ర పడ్డారు. ఆ కారణంగానే బాబు జైల్లో పడ్డప్పుడు అసలు వారసు లకంటే పవన్ కల్యాణ్ ఎక్కువ వీరంగం వేశారు. పార్టీ క్షీణ దశతో పాటు చంద్రబాబుపై వస్తున్న అవినీతి ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు పార్టీని గుప్పెట్లోకి తీసుకొని నెమ్మదిగా దాని స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నాలు బీజేపీ చేయవచ్చు. గతంలో పలుమార్లు అవకాశ వాద పొత్తులతో బీజేపీని దగ్గరకు తీసుకొని, దాన్ని ఎదగనీయ కుండా బాబు నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు దానికి బీజేపీ ప్రతీ కారం తీర్చుకోవచ్చు. ఈసారి చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలి కాబోతున్నది. ఏదో అద్భుతం జరగకపోతుందా? ఈ ఒక్కసారికి సూర్యుడు పడమటి కొండపై ఉదయించకపోతాడా? అనే ఆశ చంద్రబాబు, రామోజీ అండ్ గ్యాంగ్‌లో మిణుకుమిణుకుమంటున్నది. వారు తప్ప వివేకవంతులెవరూ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని భావించడం లేదు. సర్వేలు మాత్రమే కాదు. క్షేత్ర వాస్తవికత కూడా అందుకు భిన్నంగా లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని పెత్తందారీ పోకడల కీళ్లు విరిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఫలితంగా బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రాజకీయ స్రవంతిలోకి ప్రవేశిస్తున్నారు.ఒకటి కాదు,రెండు కాదు వరసగా మూడుసార్లు జగన్ సభలకు లక్షోప లక్షలుగా జనం హాజరయ్యారు. నేడు నాలుగో సభ పోటెత్తు తున్నది. రాజకీయ సభలకు ఈ స్థాయిలో జనం హోరెత్తడం వర్త మాన భారతంలో ఇంకెక్కడా మనకు కనిపించదు. వచ్చే ఎన్ని కల్లో జగన్ ప్రభంజనానికి ఇంతకంటే రుజువేమి కావాలి? మరోసారి అధికారం దూరం కాబోతున్నదన్న ఏడుపే కాదు, చేసిన పాపాలు శాపాలై కేసుల రూపంలో వెంటాడ బోతున్నాయన్న భయం బాబు, రామోజీలను నిద్రపోనీయడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన బాబు ఇప్పుడు బెయిల్‌పై బయటకొచ్చారు. ‘ముసలివాణ్ణి, ఆరోగ్యం బాగాలేదు, దయచూడండ’ని కోర్టువారిని బతిమాలు కొని బయటకొచ్చి తిరుగుతున్నారు. అమరావతి ప్రాంతాల ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన 1500 ఎకరాల అసైన్డ్ భూమిని కొల్లగొట్టిన కేసు తలపై వేలాడుతున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డును స్వప్రయోజనాల కోసం అష్టవంకర్లు తిప్పిన కేసు. నిబంధనలను అటకెక్కించి ఫైబర్‌నెట్‌ను బినామీకి అంటగట్టిన కేసు. చేలాగాళ్ల డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులిచ్చిన కేసు. ఇసుక కుంభకోణంలో పదివేల కోట్లు దోచేసిన కేసు... ఇలా వరుసగా అనేకం చంద్రబాబును వెన్నాడుతున్నాయి. ప్రతి కేసులోనూ చంద్రబాబు మీద పలు సెక్షన్లు నమోద య్యాయి. వాటిలో సీఆర్పీసీ 409 సెక్షన్ కింద నేరం రుజువైతే ప్రతి కేసులోనూ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అవినీతి నిరోధక చట్టం 13 (2) రెడ్ విత్ 13 (1) సీ, డీ సెక్షన్ల కింద నేరం రుజువైతే ఒక్కో కేసులో పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. 17ఏ సెక్షన్ సాయంతో తప్పించుకోవాలనే చంద్ర బాబు ఎత్తు పారలేదు. ఆ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. చంద్రబాబు మీద నమోదు చేసిన అభియోగాలకు స్పష్టమైన ఆధారాలు న్నాయని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అభిప్రాయపడి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆధారాలున్నందువలన కేసు కొట్టి వేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పేర్కొ న్నది. బాబుకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు. హరిహర బ్రహ్మాదులొచ్చినా ఆపలేరు. కానీ బీజేపీ వాళ్లు ఆపగలరని చంద్రబాబు దింపుడుకళ్లం ఆశ. అందుకే వారి ముందు సాగిలపడ్డారు. ఇప్పుడు నడుస్తున్న కేసులే దడ పుట్టిస్తుంటే ముగిసిపోయిందనుకున్న ఐఎమ్జీ కేసు ముందు కొచ్చింది. సీబీఐ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తారా? మమ్మల్ని ఆదే శించమంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించడం బాబు క్యాంపులో గుబులు రేకెత్తిస్తున్నది. ఒకవేళ దర్యాప్తుకు ఆదేశిస్తే అచ్చం అలాంటిదే సింగపూర్ ప్రైవేట్ కంపె నీలతో సీఆర్డీఏ కుదుర్చుకున్న స్టార్టప్ ఏరియా కుంభకోణం తెరమీదికొస్తుంది. దాని మీద విచారణ తప్పదు. గత మూడు రోజులుగా యెల్లో మీడియాలో కామెడీ షో నడుస్తున్నది. చివరి రోజు స్వయంగా చంద్రబాబే టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆ షోను కొనసాగించారు. ‘బాబ్బాబూ! మాక్కొంచెం ఎక్కువ సీట్లు దానం చెయ్యవా ప్లీజ్...!’ అని అమిత్ షా, నడ్డాలు బతిమాలుకున్నారట. ‘ఛస్తే కుదరదు, ఇచ్చింది తీసు కోండి, ఎక్కువ సీట్లిస్తే మీరు గెలవర’ని బాబు గట్టిగా చెప్పా రట! అంతేగాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామా లను వారికి వివరించారట. ఆర్థికశాస్త్రాన్ని వారికి బోధించారట. చివరికి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తును కుదుర్చుకుంటున్నట్టుగా వివరించి షా, నడ్డాల కళ్లు తెరిపించారట! బాబు విషయ పరిజ్ఞానానికి వారు అబ్బురపడిపోయారట. చివరికి బీజేపీ, జనసేనలకు కలిసి 8+30 సీట్లను బాబు అనుగ్రహించ డంతో వారు సంతృప్తి చెందారట! అమావాస్య తర్వాత సీట్ల పంపకాలను అధికారికంగా ప్రకటిస్తారట! ఆ తర్వాత మన యెల్లో మీడియా బాబు విజయో త్సవాలు పేరుతో వారోత్సవాలు నిర్వహిస్తుంది. జయజయ మహావీర మహాధీర ధౌరేయ....... వంటి గద్యాలను రోజుకొకటి చొప్పున వినవలసి రావచ్చు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసే సీట్ల సంఖ్యపై బీజేపీ వారికి పెద్దగా ఆసక్తి లేదు. ఒక్క సీటు కూడా తాము గెలవబోవడం లేదనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. వారి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒకటి రెండు సీట్లు కాదు. మొత్తం పార్టీయే వాతాపి జీర్ణం. రాజకీయ చరమాంకంలో కూడా చంద్రబాబు అండ్ కో ప్రదర్శిస్తున్న అతిశయాన్ని చూస్తే మాత్రం దిగ్భ్రాంతి కలుగుతున్నది. తాను కేసుల నుంచి బయటపడేందుకు కాళ్ల మీద పడి పొత్తు కుదుర్చుకున్నారని లోక మంతా తెలుసు. కానీ దానికి ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అనే ముసుగు వేయడం, దాన్ని యెల్లో మీడియా విస్తృతంగా ప్రచా రంలో పెట్టడం మాత్రం ఏవగింపు కలిగిస్తున్నది. చంద్ర బాబుకు, రామోజీకి పడిసెం పడితే తెలుగు ప్రజలంతా తుమ్మా లన్నట్టుంది ఈ వ్యవహారం! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భయపెడుతున్న వలస కథలు
దుర్భర కష్టాల నుంచి విముక్తి పొందాలన్న ఆకాంక్షతో అవకాశాలను అన్వేషిస్తూ ఎంత దూరమైనా పోవటానికి సిద్ధపడటం మనిషి నైజం. దీన్ని ఆసరాచేసుకుని మానవ వ్యాపారం చేస్తున్న మాయగాళ్ల ఆటకట్టించటం ప్రభుత్వాలకు అసాధ్యమా? గత కొన్ని నెలలుగా మీడియాలో వస్తున్న కథనాలు ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎక్కడో ఉద్యోగమని, ఏదో చదువని నమ్మి అప్పులు చేసి, ఏజెంట్లకు లక్షలకు లక్షలు పోసి విమానాలు ఎక్కుతున్న యువకులు చివరకు అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాల్లో తేలుతున్నారు. ఏ క్షిపణి దాడులకో, బాంబు పేలుళ్లకో బలవుతున్నారు. లేదా దుర్భ రమైన చాకిరీలో ఇరుక్కుని బయటపడే మార్గం దొరక్క అల్లాడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీనుంచి రష్యా వెళ్లిన యువకుడు కిరాయి సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటూ కన్ను మూశాడు. కేరళకు చెందిన మరో వ్యక్తి ఇజ్రాయెల్‌లో పనిచేస్తూ హమాస్ రాకెట్ దాడిలో చని పోయాడు. మరో ఏడెనిమిదిమంది యువకులు తమను కాపాడాలంటూ రష్యానుంచి వీడియో కాల్లో ప్రాధేయపడ్డారు. కిరాయి సైన్యాల్లో పనిచేసినవారు తిరిగొచ్చాక తగిన ఉపాధి చూపకపోతే సమస్యాత్మకంగా మారే ప్రమాదం కూడా వుంటుంది. నిరుడు డిసెంబర్లో ఫ్రాన్స్‌లో మన దేశంనుంచి నికరాగువా, సోమాలియా వంటి దేశాలకు వెళ్లే 300 మందిని అనుమానం వచ్చి నిలువరిస్తే ఏజెంట్ల మాయ బయటపడింది. వీరిలో చిన్న పిల్లలు సైతం వున్నారు. చట్టవిరుద్ధ మార్గాల్లోనైనా అమెరికా పోయి డాలర్ల పంట పండించుకోవాలని ప్రయత్నించేవారూ పెరిగారు. 2022 అక్టోబర్– 2023 సెప్టెంబర్ మధ్య 96,917 మంది భారతీయులు అమెరికాలో ప్రవేశించటానికి విఫలయత్నం చేసి పట్టుబడ్డారు. ఇది అంతకుముందు సంవత్సరంకన్నా అయిదు రెట్లు అధికం. అమెరికా పోవా లంటే వీసా రావటం అంత తేలిక కాదు గనుక ఇతరేతర మార్గాలు వెదుక్కుంటున్నారు. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు టూరిస్టు వీసాలు లభించటం పెద్ద కష్టం కాదు. అక్కణ్ణించి వేర్వేరు చోట్లకు వెళ్తున్నారు. ఇలాంటివారు వెనకబడిన రాష్ట్రాలనుంచి కాదు, సంపన్న రాష్ట్రాలనుంచే అధికంగా వుండటం ఆందోళన కలిగించే అంశం. ఎక్కువగా గుజరాత్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారు. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సీబీఐ సాగిస్తున్న దాడుల్లో ఢిల్లీ చుట్టుపక్కలా, దేశంలోని వివిధ నగరాల్లో దర్జాగాబ్రాంచీలు పెట్టుకుని మనుషుల్ని రవాణా చేస్తున్న ముఠాల ఆచూకీ బట్టబయలైంది. సామాజిక మాధ్యమాల ద్వారా, స్థానిక ఏజెంట్ల ద్వారా యువకులకు వలవేసి ఈ ముఠాలు తీసుకు పోతున్నాయి. రష్యా వెళ్లేవారికి మంచి ఉద్యోగాలంటూ నమ్మించి తీరా ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రానికి బలవంతంగా తరలిస్తూ వారి ప్రాణాలను పణం పెడుతున్నారు. అనేకులు యుద్ధంలో తీవ్రంగా గాయపడి సాయం చేసే దిక్కులేక ఆసుపత్రుల్లో విలవిల్లాడుతున్నారు. ఇలా యువకులను తీసుకెళ్లిన ఉదంతాలు 35 వరకూ బయటపడ్డాయని సీబీఐ అంటున్నది. మరెందరు వీరివల్ల మోసపోయారో తేలాలి. హమాస్ నుంచి, హిజ్బుల్లా నుంచి నిరంతరం రాకెట్ దాడులు సాగుతున్న ఇజ్రాయెల్‌లో నిర్మాణరంగంలో తాత్కాలిక అవకాశాలున్నాయంటూ రిక్రూట్మెంట్ మొదలెడితే హిందీ భాషా రాష్ట్రాలనుంచి అత్యధికులు క్యూ కట్టారు. ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిన ఈ రిక్రూట్మెంట్ కోసం వచ్చినవారిని మీడియా కదిలిస్తే ఆకలితో చచ్చేకన్నా పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవటం నయమన్న జవాబొచ్చింది. తమ ప్రాణాలు పోయినా కుటుంబాలకు ఎంతో కొంత అందుతుందన్న ధీమా వారిది. ఎంత విషాదకర స్థితి! మరో ఆరేళ్లలో మన దేశం ఏడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రభుత్వఅంచనాలు చెబుతున్నాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న చైనాను అధిగమించటం మరెంతో దూరంలో లేదని ఆర్థికరంగ నిపుణులు ఊరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వున్న 6.1 శాతం వృద్ధి రేటు ఈ ఏడాది చివరికల్లా 6.8 శాతానికి ఎగబాకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. నిరుద్యోగిత తగ్గిందని, కొనుగోలు శక్తి బాగా పెరిగిందని, తయారీ రంగం పుంజుకుందని గణాంకాలు అంటున్నాయి. అయినా ఇంతమంది ఎందుకు వలసబాట పడుతు న్నారు? ఇబ్బందులుంటాయని తెలిసినా తప్పుడు మార్గాల్లో అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆర్థికవ్యవస్థ వెలుగులీనటం నిజమే అయినా అందులో సామాన్యులకు వాటా లేకపోతే సాధించిన అభివృద్ధికి అర్థమేముంటుంది? యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నామంటే లోపం ఎక్కడుందో ఆత్మపరిశీలన చేసు కోవాల్సిన అవసరం లేదా? యుద్ధ క్షేత్రాలవైపు పోయి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని మన విదేశాంగ శాఖ ఈమధ్య ఒక ప్రకటన చేసింది. మంచిదే. కానీ అదొక్కటే సరిపోతుందా?తమ విధానాలను విమర్శిస్తారనుకున్నవారిని దేశంలో అడుగుపెట్టకుండా విమానాశ్రయాల నుంచే వెనక్కిపంపుతున్నారు. పరాయిగడ్డపై దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారన్న శంకతో కొంద రిని బయటికి వెళ్లకుండా నిరోధిస్తున్నారు. కానీ మనుషుల్ని మోసపుచ్చి వారిని అక్రమంగా తరలి స్తున్న మాయదారి ముఠాలకు కళ్లెం వేయటం ఎందుకు సాధ్యపడదు? ఇది ఎన్నికల నామ సంవ త్సరం గనుక కనీసం ఇప్పుడైనా ఉపాధి కల్పనకూ, తయారీరంగ పరిశ్రమలు పుంజుకోవటానికీ, వ్యవసాయ అనుబంధరంగాల్లో పనులు పుష్కలంగా లభించటానికీ చర్యలు తీసుకోవాలి. గణాంకాలు కళ్లు చెదిరేలావుండొచ్చు. కానీ అవి కడుపు నింపవు. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్‌ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్‌లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్‌పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
నల్ల కోటు... రాజకీయం!
కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యానికి మూలస్తంభాలు. ఇందులో న్యాయ వ్యవస్థ మిగిలిన రెండింటికంటే విశిష్టమైనది. ఎందుకంటే మొత్తం మూడు వ్యవస్థల పరిధులనూ, పరిమితులనూ నిర్ణయించగల, నిర్దేశించగల స్థానం ఆ ఒక్క వ్యవస్థకు మాత్రమే వుంది. ఇతర రెండు వ్యవస్థలతో పోలిస్తే ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై ప్రజలకు కొద్దో గొప్పో విశ్వనీయత వుంది. దానికి విఘాతం కలిగించే పరిణామాలు అడపా దడపా చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. 175 ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఆ పదవికి రాజీనామా ఇచ్చిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వైనం అటువంటిదే. తన రాజకీయ రంగ ప్రవేశంపై జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తనను రోజూ దుమ్మెత్తిపోయటం, అసభ్య పదజాలంతో దూషించటం ఆయన తట్టుకోలేకపోయారట. కనుక నల్లకోటు, న్యాయదండం విడిచిపెట్టి ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమే ఆయనకు పరిష్కారంగా తోచింది! అలా అసభ్య పదజాలంతో దూషించే నేతలకు చదువు సక్రమంగా లేదన్న జస్టిస్ గంగోపాధ్యాయ విమర్శలో నిజం వుండొచ్చు. కానీ ఆయన చదువుసంధ్యలూ, విజ్ఞతా ఏమయ్యాయి? తాను వెలువరించే తీర్పులకు పూలు తప్ప రాళ్లు పడవని ఎలా అనుకున్నారు? తృణమూల్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో జస్టిస్ గంగోపాధ్యాయ కఠినంగా వ్యవహరించారన్న పేరు వుంది. మొత్తం 14 ఉదంతాల్లో ఆయన సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అందులో ఉపాధ్యాయ నియామకాల కోసం పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) కేసు ప్రధానమైనది. ఆయన ఉత్తర్వుల కారణంగా 2022లో ఉన్నత విద్యాశాఖమంత్రిగా వున్న పార్థా ఛటర్జీతోపాటు దళారులు, డబ్బులిచ్చి ఉద్యో గాల్లోకొచ్చిన కొందరు టీచర్లు అరెస్టయ్యారు. నిజానికి ఆ కేసులో జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. అవినీతిపై నిప్పులు కక్కే యోధుడిగా, సీఎం పదవికి అన్నివిధాలా అర్హతగల వ్యక్తిగా లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి అప్పట్లో కీర్తించారు. వామపక్షాలు సైతం ఆయన తీర్పులను ప్రశంసించాయి. కానీ అవి జస్టిస్ గంగో పాధ్యాయ చెవికి సోకినట్టు లేదు. ‘న్యాయమూర్తులుగా తమ తీర్పులు నచ్చకపోతే విమర్శించవచ్చు, అప్పీల్‌కు పోవచ్చు. కానీ దూషిస్తారా?’ అని ఆయన ప్రశ్నించటం సబబే. కానీ ఆయన చేయాల్సిందేమిటి? దూషణలకు జవాబుగా ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమా? ఇందువల్ల ఆయనకుగానీ, మొత్తంగా వ్యవస్థకుగానీ విశ్వసనీయత పెరుగుతుందా? నిరుడు జస్టిస్ గంగో పాధ్యాయ తృణమూల్‌ను విమర్శిస్తూ స్థానిక చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దాన్ని తీవ్రంగా తప్పుబట్టి మందలించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. న్యాయమూర్తి పదవిలో వుంటూ రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేయటం జస్టిస్ గంగోపాధ్యాయతోనే మొదలు కాలేదు. 1967లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావుతోపాటు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ బహరూల్ ఇస్లాం, జస్టిస్ ఫాతిమా, జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ వరకూ ఎందరో వున్నారు. జస్టిస్ బహరూల్ ఇస్లాం 1983లో అప్పటి బిహార్ పీసీసీ(ఐ) అధ్యక్షుడు జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన ఫోర్జరీ, నేరపూరిత ప్రవర్తన ఆరోపణలనుంచి ఆయన్ను విముక్తి చేసిన నెల రోజులకే అస్సాంలో ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. రిటైర్మెంట్ అనంతరం లా కమిషన్, మానవహక్కుల సంఘం, కంపెనీ లా బోర్డు, వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వంటి సంస్థలకు నేతృత్వం వహించే అవకాశం ఎటూ వుంటుంది. అది కూడా సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించటం, అంతకు వారంరోజుల ముందు ఆ పార్టీ నేతలను సంప్రదించినట్టు చెప్పటం జస్టిస్ గంగోపాధ్యాయ విజ్ఞతపై సందేహాలు రేకెత్తిస్తుంది. ఈ వారంరోజుల్లో కేసులేమీ చూడలేదన్నంత మాత్రాన ఈ సందేహాలు సమసిపోవు. మిమ్మల్ని ముందుగా బీజేపీ నేతలే సంప్రదించారా అన్న ప్రశ్నకు ఆయన లౌక్యంగా ‘మేమిద్దరం ఒకరినొకరం సంప్రదించుకున్నాం’ అని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నీతివంతమైన పాలన గురించి ఎవరికీ భ్రమల్లేవు. నాలుగైదేళ్ల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే తమ పార్టీలో అవినీతి నేతలు మితిమీరుతున్నారనీ, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్థితి వున్నది గనుకే జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించిన తీర్పులను అనేకులు ప్రశంసించారు. తన రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంతో ఆ తీర్పులపై సందేహాలు తలెత్తటానికి ఆయనే కార కులయ్యారు. బీజేపీ నేతలు స్వర్గీయ అరుణ్ జైట్లీ, ప్రస్తుత కేంద్రమంత్రి నితీన్ గడ్కరి వంటివారు పదవీ విరమణ తర్వాత జడ్జీలు ఏ పదవీ తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. అసలు సీవీసీ పదవికున్నట్టే జడ్జీలకు సైతం రిటైరయ్యాక పదవులు చేపట్టరాదన్న ఆంక్షలుండాలని చాలామంది చెబుతారు. అలా కాకపోయినా కనీసం రెండేళ్లపాటు ఏ పదవీ తీసుకోకుండా వుండటం శ్రేయస్కరం. రాజకీయాలకు అతీతంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల స్థితిలో వుందనే సంకేతం మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతుందని అందరూ గుర్తించాలి. -
కొరకరాని కొయ్య ట్రంప్!
ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్నీ, ఆ తర్వాత అధ్యక్ష స్థానాన్నీ డోనాల్డ్ ట్రంప్ గెల్చుకోవటం ఖాయమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కొలరాడోలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగే ఎన్నికలో బ్యాలెట్ పత్రంపై ట్రంప్ పేరు తొలగించాలన్న ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తోసిపుచ్చటం ఆయనకు కొత్త శక్తినిస్తుందనటంలో సందేహం లేదు. ‘సూపర్ ట్యూజ్‌డే’ కింద మంగళవారం ఒకేసారి పదిహేను రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఎన్నికలు జరగనుండగా ఒకరోజు ముందు ఈ తీర్పు వెలువడింది. ట్రంప్ ఇప్పటికే అయోవా, న్యూహాంప్‌షైర్, నెవడా ప్రైమరీలను గెల్చుకోవటంతోపాటు తన ప్రత్యర్థి హేలీకి బలం వుంటుందని భావించిన ఆమె స్వస్థలం సౌత్ కరోలినాలో సైతం సత్తా నిరూపించుకున్నారు. ‘సూపర్ ట్యూజ్‌డే’ పోలింగ్‌లో సైతం ఆయనదే పైచేయి అని ప్రాథమిక సమాచారం చెబుతోంది. అయితే రకరకాల కేసుల్లో చిక్కుకుని వాటినుంచి బయటపడటానికి అనుసరించాల్సిన వ్యూహంపై న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరపాల్సిరావటం, న్యాయస్థానాలకు హాజరుకావటం ట్రంప్ ప్రచారాన్ని దెబ్బతీస్తోందనే చెప్పాలి. న్యాయస్థానాలకు సెలవు దినాలైన శని, ఆదివారాల్లో మాత్రమే ఆయన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో సైతం సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. ప్రసంగాలకు బదులు కరచాలనాలతో సరిపెడుతున్నారు. అయితే ఇదంతా ట్రంప్ స్వయంకృతం. దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు లభించిన విజయాన్ని డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందని ఆరోపిస్తూ కాపిటల్ హిల్‌పైకి మద్దతుదార్లను ఉసిగొల్పి విధ్వంసానికి కారకులయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఆ భవన సముదాయాన్ని మూకలు చేజిక్కించుకున్నాయి. ఆయన ప్రత్యర్థి, డెమాక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించటానికి 2021 జనవరిలో అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఆ దాడి దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అందరినీ నివ్వెరపరిచింది. నిజానికి ఈ కేసులోనే కొలరాడో సుప్రీంకోర్టు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడే అర్హతను ట్రంప్ కోల్పో యారని తీర్పునిచ్చింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చిన ఎవరైనా అందుకు భిన్నంగా తిరుగుబాట్లను రెచ్చగొడితే భవిష్యత్తులో పదవులు చేపట్టటానికి అనర్హులవుతారని చెప్పే రాజ్యాంగం 14వ సవరణలోని సెక్షన్ 3కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మెయిన్, ఇల్లి నాయీ సుప్రీంకోర్టులు సైతం ఇలాగే నిర్ణయం తీసుకునే అవకాశం వున్నదని అందరూ అనుకున్నారు. కానీ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో అవి నిలిచిపోయాయి. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులపై ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంటే... అవి పరస్పర విరుద్ధంగా వుంటే ఒకరకమైన అరాచకానికి దారితీస్తుందని ధర్మాసనంలోని తొమ్మిదిమంది న్యాయ మూర్తులూ భావించారు. వీరిలో ఆరుగురు మితవాద న్యాయమూర్తులైతే మరో ముగ్గురు ఉదార వాదులు. దేశమంతటికీ వర్తించేలా పార్లమెంటు మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది వారి ఉద్దేశం. అయితే పార్లమెంటు ఉభయసభలైన సెనేట్, ప్రతినిధుల సభల్లో అధికార విపక్షాలిద్దరికీ చెరోచోటా ఆధిక్యత వున్నప్పుడు సమస్య మరింత జటిలంగా మారుతుంది. ట్రంప్ అధ్యక్ష పదవి గెల్చుకున్నాక దాన్ని ధ్రువీకరించటానికి నిర్వహించే పార్లమెంటు సమావేశం కాస్తా ఆయన ఎన్నికను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయన్నది ఊహాతీతం. కాపిటల్ హిల్‌పై దాడికి సంబంధించి ట్రంప్‌పై నాలుగు వేర్వేరు కేసులు విచారణలో వున్నాయి. వాటిల్లోని దాదాపు 93 ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ఆ నేరాలు తాను చేయలేదనటం మాత్రమే కాదు... ఇవన్నీ పదవిలో వుండగా వచ్చిన ఆరోపణలు కనుక అధ్యక్షుడిగా తనకు రక్షణ వుంటుందంటున్నారు. అధ్యక్ష పదవిలో వున్న నాయకుడిపై క్రిమినల్ నేరారోపణలు రావటం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. కాపిటల్ హిల్‌పై దాడికి ఆయన పిలుపు ఇచ్చివుండొచ్చుగానీ, ఆయన స్వయంగా ఈ దాడిలో పాల్గొనలేదన్నది ట్రంప్ న్యాయవాదుల వాదన. ఈ విషయంలో దేశ సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. వాస్తవానికి వచ్చే నెల 22న సుప్రీంకోర్టు దీనిపై విచారణను ప్రారంభించాలి. కానీ ప్రతి దశలోనూ ఏదో ఒక అభ్యంతరంతో అడ్డుకుంటున్న ట్రంప్ న్యాయవాదులు దాన్ని సజావుగా సాగనిస్తారా అన్నది చూడాల్సివుంది. అయితే ట్రంప్ కష్టాలు ఈ కేసుతో తీరిపోతాయనడానికి లేదు. ఆయన చుట్టూ మరిన్ని కేసులున్నాయి. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ తనపై ఆరోపణలు చేయకుండా వుండటానికి ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారన్న అభియోగం అందులో ఒకటి. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఆయన 50 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువడింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని సమీకరించటానికి ఆయన పాట్లు పడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలు సేకరించటం సరేసరి. ఇదిగాక ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కాలమిస్టు జీన్ కరోల్ ఆరోపించారు. అందులో 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించగా, ఆమె పరువు ప్రతిష్ఠలు దెబ్బతీశారన్న ఆరోపణకు సంబంధించి 8 కోట్ల 30 లక్షల డాలర్లు ఇవ్వాలని మరో కోర్టు నిర్ణయించింది. వీటిపై అప్పీళ్లకు వెళ్లదల్చుకున్నారు. జనంలో వరస విజయాలు సాధిస్తున్న ట్రంప్‌ను న్యాయస్థానాల ద్వారా నిరోధించే డెమాక్రాటిక్ పార్టీ వ్యూహం వారికి ఏమేరకు లాభిస్తుందో వేచిచూడాలి. -
ఎన్నదగిన తీర్పు
చట్టసభల సభ్యులు చెట్లకూ, పుట్లకూ ప్రాతినిధ్యం వహించరు. ఓటు హక్కున్న పౌరులు వారిని ఎన్నుకుంటారు. తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపుతారు. అలా ఎన్నికైనవారి ప్రవర్తన అందరికీ ఆదర్శనీయంగా వుండాలనీ, వుంటుందనీ జనం ఆశిస్తారు. అందుకు భిన్నంగా వున్నపక్షంలో ఆ సభ్యులపై మాత్రమే కాదు... ఆ చట్టసభలపైనే ప్రజలు నమ్మకం కోల్పోతారు. కనుకనే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది. చట్టసభల్లో ఓటేయటానికీ లేదా ప్రసంగించటానికీ లంచం తీసుకునే ప్రజాప్రతినిధులు చట్టపరమైన చర్యలనుంచి తప్పించుకోలేరంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు మన ప్రజాస్వామ్యానికి పట్టిన అనేకానేక చీడల్లో ఒకదాన్ని తొలగించటానికి దోహదపడుతుందని భావించాలి. 1993 సంవత్సరంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లోక్‌సభలో వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించటానికి అయిదుగురు జేఎంఎం సభ్యులు, జనతాదళ్ (ఏ) సభ్యుడొకరు లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నాటి ప్రధాని పీవీ, ఈ ఆరుగురు సభ్యులూ ఆ తీర్మానాన్ని ఓడించటానికి ఉమ్మడిగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డా రన్నది ఆ ఆరోపణ సారాంశం. లంచావతారాలైన ప్రభుత్వోద్యోగులు ముడుపులు తీసుకుంటే అవినీతి నిరోధక విభాగాలు అరెస్టు చేస్తాయి. వారి నేరం రుజువైన పక్షంలో శిక్ష కూడా పడుతుంది. ఇదే పని మరింత భారీ స్థాయిలో చేసే ప్రజాప్రతినిధి చట్టపరిధిలోకి ఎందుకు రారన్నది సామాన్యులకొచ్చే సందేహం. నిజానికి 1998లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించినప్పుడు రాజ్యాంగ నిపుణులు నివ్వెరపోయారు. ఈ తీర్పు పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందనీ, ప్రజాస్వామ్యం పతనమవుతుందనీ హెచ్చరించారు. నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును అర్థం చేసుకున్న తీరూ, చట్టసభల సభ్యు లకు రక్షణకల్పించే రాజ్యాంగ అధికరణ 105కు చెప్పిన భాష్యమూ లోపభూయిష్టం. పార్లమెంటు నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలూ, ఇతరత్రా ఆదేశాలకు లోబడి పార్లమెంటు సభ్యులకు వాక్ స్వాతంత్య్రం వుంటుందన్నది 105(1) అధికరణ చెప్పిన మాట. సభలో సభ్యులు చేసే ప్రసంగాలు, ఏదైనా అంశంపై వారు వేసే ఓటు, సమర్పించే నివేదికలు న్యాయస్థానాల్లో సవాలు చేయటానికి అతీతమైనవని 105(2) అధికరణ చెబుతోంది. కానీ వారు చేసే ప్రసంగాలూ, వేసే ఓటూ వెనక ముడుపుల ప్రమేయం వున్నప్పుడు కూడా రక్షణ పొందగలరా అన్నదే ప్రధాన ప్రశ్న. అయితే చిత్రంగా నాటి ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అయిదుగురు జేఎంఎం ఎంపీలకూ 105(2) అధికరణ కింద రక్షణ వుంటుందని భావించారు. అయితే అదే తరహాలో లంచం తీసుకుని కూడా ఓటింగ్‌కు గైర్హాజరైన జనతాదళ్(ఏ) సభ్యుడు అజిత్ సింగ్‌కు మాత్రం ఆ రక్షణ వర్తించదని తీర్పునిచ్చారు. నాటి ముడుపుల కేసులో ఆరోపణ లెదుర్కొన్న అయిదుగురు జేఎంఎం సభ్యుల్లో ఒకరైన శిబూ సోరెన్ కుమార్తె సీతా సోరెన్ ఎమ్మెల్యేగా వుంటూ 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర సభ్యుడికి ఓటేస్తానని మాటిచ్చి ముడుపులు తీసుకున్నారు. అయితే ఎన్నిక బహిరంగ విధానంలో జరగటంతో గత్యంతరం లేక తన పార్టీ ఎంపిక చేసిన సభ్యుడికి అనుకూలంగా ఓటేశారు. దానిపై నమోదైన కేసులో తనకు పీవీ కేసు తీర్పే వర్తిస్తుందనీ, కేసు కొట్టేయాలనీ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ లంచం తీసుకుని కూడా అప్పట్లో ఓటింగ్‌కు గైర్హాజరైన అజిత్ సింగ్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే సీతా సోరెన్‌కు కూడా వర్తిస్తుందని హైకోర్టు భావించి ఆ పిటిషన్‌ను తోసిపుచ్చటంతో 2014లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైనా కొత్త అంశం తెరపైకొచ్చినప్పుడు గత తీర్పులు నిశితమైన పరీక్షకు నిలబడక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సీతా సోరెన్ అప్పీల్ సర్వోన్నత న్యాయస్థానానికి ఆ మాదిరి అవకాశాన్ని చ్చింది. పౌరస్వేచ్ఛ పౌరులకు చట్టం ఇచ్చిన బహుమతి మాత్రమేననీ, ఆత్యయిక పరిస్థితి వున్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు రాజ్యానికుంటుందనీ ఏడీఎం జబల్పూర్ కేసుగా ప్రసిద్ధిచెందిన హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువ రించింది. ధర్మాసనంలోని జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఒక్కరే దాంతో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ తీర్పును అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా వేలాదిమంది పౌరులను జైళ్లపాలు చేసింది. ఆ తీర్పును 1978లో సుప్రీంకోర్టు సవరించుకుంది. అలాగే 2017లో పుట్టస్వామి కేసులో గోప్యత హక్కుపై వెలువరించిన తీర్పు సందర్భంగా ఏడీఎం జబల్పూర్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ తీర్పు ఏ పర్యవసానాలకు దారితీస్తుందో, ఎలాంటి దుçస్సంప్రదాయాలకు సాకుగా మారుతుందో గమనించుకోవటం న్యాయస్థానాలకు తప్పనిసరి. ప్రజాప్రతినిధులు పార్లమెంటులో వ్యవహరించే తీరుపై లంచాల ప్రభావంవున్నా వారు చర్యకు అతీతులన్న గత భావనను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చటం హర్షించదగింది. ముడుపులు ఎక్కడైనా ముడుపులే. ప్రజాప్రతినిధులు అటువంటి ప్రలోభాలకు లొంగితే వారి అనైతికత మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. చట్టసభలపై ప్రజానీకానికుండే విశ్వాసం కుప్పకూలుతుంది. అవినీతి కేసుల్లో దోషులందరికీ ఒకే చట్టం, న్యాయం వర్తిస్తుందన్న తాజా తీర్పు ఎన్నదగింది. -
పుస్తక హననం
నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ . ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు. అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్ ఓవెండెన్ . ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ. ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం... అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది. నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్ ఆర్కైవ్స్ ఆఫ్ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్ కలిగివున్న గ్రేట్ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్ విమర్శకుడు జాక్వెస్ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్‌లోని నలందా విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తులకాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిషం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట! క్రీ.శ.1193లో భక్తియార్ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు. ‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్. బీజింగ్‌లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్ ’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్ సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్ సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు. అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్‌వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్ డార్న్‌టన్ . అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు. పనామ్ పెన్ ్హ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్ రూజ్’ తుడిచిపెట్టింది. దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్ పాట్ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది. ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం! అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా? -
ఇక పూటకో ప్యాకేజీ స్టార్!
ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ శిబిరం రూపొందించిన ఒక పాట బాగా పాపులరయింది. ‘జెండలు జతకట్టడమే మీ ఎజెండా... జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా’ అనే పల్లవితో పాట మొదలవుతుంది. ‘నల్లగొండ గద్దర్’గా పేరు గాంచిన నర్సిరెడ్డి గొంతుక ఈ పాటకు ప్రాణం పోసింది. వైసీపీ అభిమానులకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్లి వేడుక జరిగినా ఈ పాటకు స్టెప్స్ వేయడం ఓ కార్యక్రమంగా మారింది. నాలుగు పార్టీలను కూడగట్టి అతుకుల బొంత అలయెన్స్‌లను కుట్టుకోవడం తప్ప ప్రజా సంబంధమైన ఎజెండా ప్రతిపక్షాలకు లేనేలేదని ఈ పాట ఎద్దేవా చేస్తుంది. అదే సందర్భంలో ప్రజలకు అండదండగా నిలబడుతూ వారి ఆద రణను జగన్ చూరగొంటున్నారనేది ఈ పల్లవి భావన.ఈ అభిప్రాయాన్ని ప్రతిపక్ష శిబిరం కూడా నిర్ధారిస్తున్నది. తాడేపల్లిగూడెం సమీపాన మొన్న తెలుగుదేశం–జనసేన పార్టీలు ఉమ్మడిగా జరిపిన సభకు కూడా ‘జెండా’ అనే నామ కరణాన్నే కూటమి వారు ఎంపిక చేసుకున్నారు. ‘తెలుగు–జన విజయకేతన’ జెండా అనే పేరుతో వేదికను అలంకరించారు. ‘తెలుగు జన’ అనే రెండు పదాలు రెండు పార్టీ పేర్లకు గుర్తనేది కవి హృదయం. కేతనం అన్నా కూడా జెండా అనే అర్థం. మరి కేతన జెండా అంటే? నొక్కి చెప్పడం కావచ్చు. లేదా ఒకరిది కేతనం, ఒకరిది జెండా అని కావచ్చు. అర్థం ఏమైనప్పటికీ‘జెండాలు జతకట్టడమే మా ఎజెండా’ అని వారు కూడా నర్సిరెడ్డి పాటకు కోరస్ పాడినట్టు కనిపించింది. రెండు పార్టీల అగ్రనాయకులిద్దరూ ఒకరి జెండా కర్రను మరొకరు చేత పుచ్చుకొని అటూ ఇటూ ఊపుతూ కార్యక్రమాన్ని లయబద్ధం చేశారు. మూడో జెండాను కూడా ఊపడానికి చాలాకాలం ఎదురు చూశారు కానీ ఎందుకో బీజేపీ వాళ్లు కనికరించలేదు. సభలో ప్రజలు కూర్చోవడానికి కేటాయించిన పదిహేను ఎకరాల్లోకి ఆరు లక్షలమందిని సమీకరిద్దామని సంకల్పం చెప్పుకున్నారు. పదిహేను ఎకరాల్లో ఆరు లక్షల మంది ఎలా కూర్చుంటారని ప్రశ్నించవద్దు. అగస్త్య మహాముని సప్త సముద్రాలను పుక్కిట పట్టలేదా? అలాంటి విద్యనే ప్రదర్శించి వుండేవాళ్లం, కానీ ఆర్టీసీ సహకరించనందు వల్ల అంతమంది రాలేదని సర్ది చెప్పుకున్నారు. టార్గెట్‌లో పదోవంతు మందిని సమీకరించగలిగినందుకు యెల్లో మీడియా ఆ పార్టీలను అభినందనల్లో ముంచెత్తింది. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి పదోవంతు సీట్లు గెలిచినా కూడా యెల్లో మీడియా అభినందిస్తుందేమో చూడాలి. జనసమీకరణ దృష్ట్యా చూస్తే ‘సిద్ధం’ సభలు గోదావరి ప్రవాహాలైతే ‘తెలుగు జన’ సభ పిల్లవాగులా తోచింది. ఎన్ని పిల్లవాగులైతే ఒక గోదావరి కావాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్జన సామాన్యంలో వైసీపీ ప్రభావాన్ని గోదావరితో పోల్చితేఈ రెండు పార్టీలను పిల్లవాగుతో పోల్చాలి. ఇది నేటి యథార్థ దృశ్యం.ఈ దృశ్యాన్ని సరిగ్గా అంచనా వేయడానికి కష్టపడి సర్వేలు కూడా చేయనవసరం లేదు. రాష్ట్రంలో అక్కడక్కడా పర్యటిస్తూ జనంతో ముచ్చటిస్తే చాలు నాడి తెలిసిపోతున్నది. పేద వర్గాల ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం వెనుక సమీకృతమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అయిదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వారి జీవితాలు స్పష్టమైన మార్పుకు లోనయ్యాయని ఈ ప్రాంత మేధావులు చెబుతున్నారు. ఈ మార్పు పట్ల మధ్య తరగతి మేధావి వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇటువంటి మార్పుకోసమే గదా... పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమానావకాశాలు లభ్యం కావాలన్న ఆశ యంతోనే కదా... చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగిందీ, ఎన్నో విప్లవాలు చెలరేగిందీ! అటువంటి విప్లవం నిశ్శబ్దంగా ఇప్పుడు పేదవాడల్లోకి ప్రవేశిస్తున్నది. ఈ అద్భుతాన్ని కులమతాలకు అతీతంగా అభ్యుదయ కాముకులందరూ నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. ఇందుకు కారణమైన జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక డజన్‌కు పైగా స్వతంత్ర సర్వేలు బయటకు వచ్చాయి. వాళ్లంతా వైసీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి శాంపిల్ సైజ్ పరిమితుల వల్ల జనంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న మద్దతును పూర్తిగా అంచనా వేయలేకపోతున్నామనే అభిప్రాయం సర్వే సంస్థల్లో పని చేసే వారిలోనే ఉన్నది. వైసీపీకి పురుష ఓటర్లలో ఉన్న ఆధిక్యత కంటే మహిళా ఓటర్లలో ఎక్కువ ఆధిక్యత కనిపిస్తున్నది. ఇది అన్ని సర్వేల్లో వ్యక్తమైంది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. కానీ సర్వే సంస్థల శాంపిల్స్‌లో చాలావరకు పురుష ఓటర్లే ఎక్కువగా ఉంటున్నారు. శాంపిల్స్ జనాభా ప్రాతిపదిక మీద, వర్గాల నిష్పత్తి ప్రకారం కచ్చితంగా లెక్కగట్టి తీసుకోగలిగితే వైసీపీకి ఉన్న ఆధిక్యతను సరిగ్గా అర్థం చేసు కోగలుగుతాము. ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ సంస్థ తరఫున సర్వే పర్యవేక్షణకు వచ్చిన ఒక కీలక వ్యక్తి అంచనా ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, వైసీపీ ఓటు షేర్ 50 శాతానికి పైగానే ఉన్నది. వందకు పైగా నియోజక వర్గాల్లో 55 శాతంకంటే ఎక్కువ ఓటర్ల మద్దతు వైసీపీకి లభించే అవకాశం ఉన్నదని కూడా ఆయన చెప్పారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లూ వైసీపీకే దక్కుతాయనీ, అసెంబ్లీ సీట్లు కూడా గతం కంటే ఒక్కటి కూడా తగ్గబోదనీ ఆయన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన కార్య క్రమాలను ప్రజలు సంపూర్ణంగా ఆమోదిస్తున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితేనే పేదవర్గాల నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని జనం నమ్ముతున్నారు కనుకనే క్షేత్ర స్థాయిలో వైసీపీ పటిష్ఠంగా ఉన్నది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జనంలో ఇటువంటి విశ్వాసాన్ని కలిగించలేకపోయారు. కిందటిసారి గెలిచినప్పుడు హామీలను అమలు చేయలేక మేనిఫెస్టోను మార్కెట్ నుంచి కనుమరుగు చేయడం కూడా ప్రజల మనోఫలకం నుంచి చెరిగిపోలేదు.రెండు ప్రభుత్వాలనూ జనం బేరీజు వేసుకుంటున్నారు. సహ జంగానే మార్కులు జగన్ ప్రభుత్వానికే పడుతున్నాయి. తమ జీవితాల్లో వెలుగులు పూయించి, బిడ్డల భవిష్యత్తు మీద కొండంత విశ్వాసాన్ని నింపుతున్న జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగాఎందుకు ఓటేయాలని జనసామాన్యం ప్రశ్నిస్తున్నారు. ఇదిగో ఈ సింపుల్ లాజిక్ వచ్చే ఎన్నికల్లో మరో సునామీని సృష్టించ బోతున్నది.జనం గుండెల్లో గుడి కట్టుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లేదు. ఆయనకో జీవితకాలం ఆలస్యమైపోయింది. అందుకే జెండాలు జతకట్టుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం మీద అపోహలు సృష్టించడానికి, దుమ్మెత్తిపోయడానికి రక రకాల కుట్రలకు తెరతీస్తున్నారు. యెల్లో మీడియా ప్రాపగాండా సరిపోవడం లేదని సరికొత్త ప్యాకేజీ స్టార్లను ప్రయోగిస్తున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు కనిపించిన ప్రతి గడ్డిపోచ మీద కూడా ఆశ పెట్టుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి సరిగ్గా అదే! జగన్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి వివిధ టాస్క్‌లను తెలుగుదేశం డిజైన్ చేసింది. ఒక్కో టాస్క్‌కు ఒక్కో ప్యాకేజి స్టార్. వాళ్లందరికీ వెలకట్టాలి. ఎన్నికల్లో వెదజల్లాలి. అందుకు డబ్బు కావాలి. సొంత ముల్లెను విప్పడానికి ఇంట్లో వాళ్లు చస్తే ఒప్పుకోరు.అందుకని పెత్తందారీ మనస్తత్వం కలిగిన డబ్బున్న వారి మీద వలలు విసిరారు. బాబు గెలిస్తే ఇష్టారాజ్యంగా దండు కోవచ్చన్న కక్కుర్తితో చాలామంది రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ, అధిక వడ్డీల పేరుతో 650 కోట్లు సేకరించి ఎన్నికల గమ్యస్థానాలకు చేర్చారని వినిపించింది. గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తాడని భావిస్తున్న ఒకాయన 800 కోట్లను ఇప్పటికే సిద్ధం చేశాడట. వాటిని గమ్యస్థానాలకు చేర్చడమెట్లా అని మల్లగుల్లాలు పడు తున్నట్టు సమాచారం. ఇటువంటి పెత్తందార్లు గెలిస్తే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే! పవన్ కల్యాణ్‌కు వైసీపీ వాళ్లు ‘ప్యాకేజి స్టార్’ అనే టైటిల్‌ను తగిలించారు. ఈ మాట అన్నందుకు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఒక సభలోనైతే ఈ ఆరోపణపై పాదరక్షలను సంధించారు. కానీ ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు కని పిస్తున్నది. మొన్నటి తెలుగు – జనసభలోనైతే తనను తాను అవమానించుకొని, తన పార్టీనీ తానే అవమానించి చంద్ర బాబుకు జైకొట్టారు. ఈ విపరీత ప్రవర్తనకు జనసైనికులే విస్తుపోతున్నారు. తాను స్వతంత్రంగా నిలబడి తన పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా తెలుగుదేశంతో బేరమాడి ఉంటే పవన్ కల్యాణ్ తనపై పడ్డ మచ్చను తొలగించుకోగలిగి ఉండే వాడు. కానీ అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నాడు. ఇంకో సారి ఆరోపణలపై విరుచుకుపడే నైతిక బలాన్ని ఆయన కోల్పోయాడు. తెలంగాణ తన మెట్టినిల్లనీ, కర్మభూమనీ నమ్మబలికిన షర్మిల హఠాత్తుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం వెనుక చక్రం తిప్పింది ఎవరు? డీకే శివకుమార్ ద్వారా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో రాయబారం నడిపిందెవరు? షర్మిల పర్యటనల కోసం విమాన సౌకర్యాల కల్పన వెనుకనున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు? వైఎస్ జగన్ వ్యతిరేక శక్తులతో ఆమెకు సమన్వయాన్ని ఏర్పాటుచేసిన వారెవరు? ఆమె ఉపన్యాసాల్లో చెప్పవలసిన అంశాలను, జగన్‌పై చేయాల్సిన ఆరోపణలను అందిస్తున్నదెవరు? ఆమె సభలకు కమ్యూనిస్టు నాయకులను కూడా జతచేసి పంపిస్తున్న వారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లాడికి కూడా తెలుసు! చంద్రబాబు విజయావకాశాలు రోజురోజుకూ కొడిగట్టి పోతున్న స్థితిలో ఇప్పుడు నర్రెడ్డి సునీత ముసుగును తొలగించారు. జగన్మోహన్రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తూ చంద్ర బాబు మహానుభావుడని ఆమె సర్టిఫికేట్ ఇచ్చేశారు. గతంలో తన తండ్రి హత్యకు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలే కారణ మని చెప్పిన సునీత ఇలా ‘చంద్ర’ముఖిలా ఎందుకు మారి పోయారు. తన తండ్రికి రెండో వివాహం ద్వారా కలిగిన కుమా రునికి ఆస్తిలో హక్కు దక్కకుండా చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? వివేకా రక్తపు మడుగులో ఉన్న ఫోటోలను పీఏ కృష్ణారెడ్డి పంపించింది సునీత దంపతులకే గదా! అయినా గుండెపోటు థియరీని ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి ఎందుకు ప్రచారంలో పెట్టినట్టు? హత్య సమ యంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆమె భర్తకూ, ఆయన సోదరుడికీ సన్నిహితులన్న విషయం అందరికీ తెలుసు. అప్పుడు చూపుడు వేలు ఎటువైపు చూపెడుతుంది? హంతకులు వివేకాతో లేఖ రాయించిన విషయాన్నిగోప్యంగా ఉంచాలని సునీత ఎందుకు ఆదేశించినట్టు? హత్య తరువాత హంతకులు వివేకా రెండో భార్యకు రాసిన ఆస్తి పత్రాలను తస్కరించే అవకాశం ఎవరికి ఉన్నది? అసలు దోషులను రక్షించి పరులపై నింద వేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? వారి అవసరంతో రాజకీయ ప్రయోజనం ముడిపడి ఉన్న పెద్దమనిషి ఎవరు? ఇప్పుడు సునీతను ‘చంద్ర’ ముఖిగా మార్చి చిలక పలుకులు చెప్పిస్తున్న నాయకుడెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటీవల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఆరోపణలు చేసి ప్రభు త్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరించిన హనుమ విహారి వెనుక కూడా ప్యాకేజీ ట్రాప్ ఉన్నదనే విషయం వెలుగులోకి వస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకెంతమంది ప్యాకేజీ స్టార్స్ రంగంలోకి వస్తారో చూడాలి. ప్యాకేజీ దండగే తప్ప ఇటువంటి ప్రయోగాలకు విలువ ఉంటుందా? పండగ లప్పుడు వచ్చిపోయే పిట్టల దొరల ప్రగల్భాలకు జనం నవ్వు కుంటారు తప్ప సీరియస్‌గా తీసుకుంటారా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇంత దారుణమా?!
ఉన్నత విద్యాసంస్థల్లో చేరే విద్యార్థినులు గతంతో పోలిస్తే 44 శాతం పెరిగారని మొన్న జనవరిలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఘనంగా ప్రకటించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పిల్లలు ఎక్కువుండటం శుభసూచకమని చెప్పింది. కానీ ఆడపిల్లల భద్రత విషయంలో ఉన్నత విద్యాసంస్థలు శ్రద్ధ పెడుతున్నాయా? వాటిని పర్యవేక్షించాల్సిన వ్యవస్థలు ఆ సంస్థలను అప్రమత్తం చేస్తు న్నాయా? గుజరాత్‌లోని గాంధీన గర్‌లో కొలువుదీరిన గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జీఎన్‌ఎల్‌యూ) వాలకం చూస్తే ఏదీ సక్రమంగా లేదన్న సందేహం కలుగుతుంది. నిరుడు సెప్టెంబర్‌లో మీడియాలో వచ్చిన కథనాలను గుజరాత్ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి. మయీల నేతృత్వంలోని ధర్మాసనాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సాగుతున్నలైంగిక నేరాలను కప్పిపుచ్చటానికి బాధ్యతాయుత స్థానాల్లో వున్న వారు ప్రయత్నించటం భీతి గొలుపుతున్నదని న్యాయమూర్తులు అన్నారంటే అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమ వుతుంది. ఈ తరహా అకృత్యాలు, వికృతాలు రాజకీయ నాయకుల అండదండలు లేకుండా సాగవు. ఒక ‘పలుకుబడిగల రాజకీయ నాయకుడు’ ఇలాంటి నేరగాళ్లకు వత్తాసుగా ఉన్నాడని ఒక విద్యార్థిని చెప్పటం గమనార్హం. డైరెక్టర్, రిజిస్ట్రార్, మరికొందరు అధ్యాపకులపై సైతం ఆరోపణలు రావటం గమనిస్తే విశ్వవిద్యాలయం తోడేళ్ల పాలయిందా అన్న సందేహం తలెత్తుతుంది. ప్రపంచీకరణకు తలుపులు బార్లా తెరిచాక దేశంలో ఉన్నత విద్యాసంస్థలు కళ్లు తేలేయటం మొదలైంది. సామాజిక శాస్త్రాల అధ్యయనం మహాపాపమని పాలకులే ప్రచారం చేయటం, విద్యార్జన అంతిమ ధ్యేయం కొలువులు సాధించటం మాత్రమేనన్న అభిప్రాయం కలిగించటం ఉన్నత విద్యాసంస్థలను క్రమేపీ దిగజార్చాయి. తాము ఈ సమాజం నుంచి వచ్చామని, తమ మేధస్సును దీని ఉన్నతికి వినియోగించాలన్న స్పృహ విద్యార్థుల్లో కరువైంది. చాలా ఉన్నత విద్యా సంస్థలు ఇప్పుడు కుల, మత, ప్రాంతీయ జాడ్యాల్లో కూరుకుపోయాయి. ఆడపిల్లల హాస్టళ్లలో సైతం ర్యాగింగ్లు సాగుతుండటం, కొందరు సస్పెండవుతున్నట్టు వార్తలు రావటం యాదృచ్ఛికం కాదు. వర్తమానంలో సినిమా హీరోలూ, క్రికెటర్లూ, ప్రపంచ సంగీత దిగ్గజాలూ ఆరాధ్య దైవాలవు తున్నారు. మాదకద్రవ్యాల సంగతి సరేసరి. ఇన్ని కశ్మలాల మధ్య కూనారిల్లుతున్న విద్యాసంస్థలు రాణిస్తాయని, విద్యార్థులకు వివేకాన్నీ, విజ్ఞానాన్నీ అందిస్తాయని నమ్మటం అమాయత్వమే అవుతుంది. జీఎన్ఎల్యూలోని దారుణాలపై కనీసం అయిదేళ్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మారుపేర్లతో కొందరు విద్యార్థినులు తమకెదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టిన ఉదంతాలున్నాయి. అటువంటి ఉదంతం ఆధారంగా మీడియాలో వచ్చిన కథనమే గుజరాత్ హైకోర్టును రంగంలోకి దించింది. కానీ విశ్వ విద్యాలయం ఏం చేసింది? చర్యల మాట అటుంచి... సాక్షాత్తూ హైకోర్టు ధర్మాసనమే అడిగిందన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా రిజిస్ట్రార్ బుకాయింపులకు దిగాడు. ఈ మహానుభావుడే అంతక్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన ఇద్దరు విద్యార్థినులను మందలించాడు. ఆఖరికి బాలికల హాస్టల్ వార్డెన్‌గా ఉన్న మహిళా ప్రొఫెసర్ సైతం వారిని భయపెట్టి ఆ పోస్టులను తొలగింపజేశారు. సంస్థ కీర్తిప్రతిష్ఠలు దెబ్బతింటాయన్న సాకుతోనే ఇదంతా సాగించారు. పేరుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) వుంది. ఒక మహిళా ప్రొఫెసర్ నేతృత్వంలోనే సాగుతోంది. కానీ ఆ కమిటీకి ఫిర్యాదు చేయటం దండగ అనుకున్నారో, దానిగురించి తెలియనే తెలియదో ఏ బాలికా వారికి ఫిర్యాదు చేయలేదు. కనీసం ఆ కమిటీ తనంత తానే విచారణ జరపాలి కదా... ఆ పని కూడా జరగ లేదు. తొలుత దారుణాలు తన దృష్టికొచ్చాక హైకోర్టు నియమించిన కమిటీలో ఐసీసీ చైర్‌పర్సన్‌కు కూడా చోటిచ్చారు. కానీ ఆమె గారి నిర్వాకం తెలిశాక ఆ కమిటీని రద్దుచేసి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. కనుకనే ఈ అకృత్యాలు వెలుగు లోకొచ్చాయి. విద్యార్థుల్లో జిజ్ఞాస రేకెత్తించటం, తార్కిక శక్తిని పెంచటం, స్ఫూర్తి రగల్చటం, వారిని సామా జిక మార్పులకు చోదకశక్తులుగా మార్చటం ఉన్నత విద్య లక్ష్యం. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వంటిచోట తమ పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు ఎందుకు ఆసక్తి చూపుతారు? అక్కడైతే అత్యున్నత ప్రమాణాలున్న న్యాయవిద్య అందుతుందని, ఆ విశ్వవిద్యాలయంలో నిర్వహించే సెమి నార్లు, ఇతర సదస్సులు తమ పిల్లలను ఉన్నతశ్రేణికి చేరుస్తాయని వారు ఆశిస్తారు. కానీ జరిగిందేమిటి? రేపన్నరోజున న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి సమాజంలోని దురంతాలను అంతం చేయాల్సినవారే బాధితులుగా మారారు. ఎవరికి చెప్పుకోవాలో, ఎట్లా ఎదుర్కొనాలో తెలియని నిస్సహాయ స్థితిలో పడ్డారు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్భయ చట్టం వచ్చింది. విద్యాసంస్థల్లోనూ, పనిస్థలాల్లోనూ బాలికలకు, మహిళకు భద్రత కల్పించటం వ్యక్తుల, సంస్థల బాధ్యతగా ఆ చట్టం గుర్తించింది. విఫల మైన పక్షంలో కఠినంగా దండించే నిబంధనలున్నాయి. కానీ జరిగిందేమిటి? ఈ దురంతాలపై లోతుగా విచారణ జరగాలి. నేరగాళ్లకూ, వారికి తోడ్పడిన పెద్దలకూ కఠినశిక్షలు పడేలా చర్యలుండాలి. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ ఆ చర్యలు ఒక హెచ్చరిక కావాలి. -
గోసాయిచిట్కా ప్రకటనలేనా?
ఏ ఉత్పత్తికైనా ప్రచారం కావాలి. ప్రచారానికి ప్రకటనలివ్వాలి. ప్రకటనల్లో చెప్పేదంతా సంపూర్ణ సత్యమని ఎవరూ అనుకోరు కానీ, ప్రజల్ని మభ్యపెట్టేలా అసత్యాల్ని వ్యాప్తిలో పెడితేనే చిక్కు. మరీ ముఖ్యంగా, జీవితాలను ప్రభావితం చేసే ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై అసత్య వాణిజ్య ప్రకటనలు ప్రమాదకరం. పాపులర్ యోగాగురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన ‘పతంజలి ఆయుర్వేద్’ సంస్థ ప్రకటనలు సరిగ్గా ఇలాగే ‘తప్పుదోవ పట్టించేలా, అసత్యపూర్వకం’గా ఉన్నాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రకరకాల జబ్బులు నయమవుతాయంటున్న సదరు ఉత్పత్తుల ప్రకటనలపై తాత్కాలిక నిషేధం విధించింది. పైగా, ‘దేశం మొత్తాన్నీ ఇలా ఓ సంస్థ మోసం చేస్తూ ఉంటే’, కేంద్రం చోద్యం చూడడాన్ని సుప్రీమ్ కోర్ట్ తప్పుబట్టింది. అలాంటి ప్రచారం చేయరాదని ఉత్తర్వులిచ్చినా సరే ఉల్లంఘించినందుకు గాను సంస్థ ఎండీకి కోర్టు ధిక్కార నోటీసులివ్వడం విశేషం. స్థానిక ఉత్పత్తులతో విపణిలో బహుళ జాతి సంస్థలను మించాలని చూస్తున్న రామ్‌దేవ్ మాత్రం ఇదంతా ఆయుర్వేదంపై, తన మూలికా వ్యాపారంపై సాగుతున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. టూత్‌పేస్ట్‌ల నుంచి ఆహార ఉత్పత్తులు, మందుల దాకా అన్నీ అందిస్తున్న పతంజలి సంస్థ ఆధునిక వైద్య విధానాలకూ, కోవిడ్ టీకాకరణకూ వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2022లో కోర్టుకెక్కింది. ఇద్దరు జడ్జీల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. కోవిడ్ వేళ అల్లోపతి వైద్యుల్ని తక్కువ చేసేందుకు రావ్‌ుదేవ్ ప్రయత్నించారు. ఆ వ్యవహార శైలిని 2022 ఆగస్ట్‌లో సుప్రీమ్ కోర్ట్ ప్రశ్నించింది. అసత్య ప్రకటనలు, తప్పుదోవ పట్టించేవాటిని తక్షణమే ఆపేయాలంటూ గత నవంబర్‌లో సుప్రీమ్ ఆదేశించింది. అప్పట్లోనే పతంజలి తరఫు వకీలు సైతం తమ ఉత్పత్తుల ప్రకటనకు సంబంధించి ఇకపై చట్టాన్ని ఉల్లంఘించబోమని కోర్టుకు విన్నవించారు. ఔషధ సామర్థ్యంపై మీడియాలో ప్రకటనలివ్వబోమని కూడా హామీ ఇచ్చారు కానీ కట్టుబడ లేదు. 2006లో ఆరంభమైన పతంజలి శరవేగంతో పైకి వచ్చింది. ప్రపంచమంతా కోవిడ్‌తో అతలా కుతలం అవుతున్నప్పుడు 2020 జూన్‌లో కోవిడ్‌కు మందు కనుక్కున్నామంటూ రామ్‌దేవ్ ప్రకటించారు. ‘కరోనిల్, శ్వాసారి’ మందుల్ని ఆవిష్కరించారు. అయితే, సంస్థ ఇచ్చిన పత్రాలన్నిటినీ క్షుణ్ణంగా సమీక్షించేంత వరకు సదరు ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్ని ఆపేయాలంటూ ‘ఆయుష్’ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. అయినా పతంజలి తన పంథా మానలేదు. సరికదా... కరోనా వేవ్‌లు కొనసాగుతుండగానే 2021 ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నియమానుసారం కోవిడ్ చికిత్సలో అండగా కరోనిల్ మందును వాడవచ్చని ‘ఆయుష్’ నుంచి ధ్రువీకరణ పత్రం వచ్చినట్టు అబద్ధమాడింది. కానీ, ఏ సాంప్రదాయిక ఔషధ సామర్థ్యాన్నీ తాము పరీక్షించనే లేదనీ, అసలు ధ్రువీకరించనే లేదనీ ఐరాస ఆరోగ్య సంస్థ ప్రకటించేసరికి బండారం బయటపడింది. ఇదొక్కటే కాదు... పతంజలి చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదమే. 2015లో దేశంలో మ్యాగీ నూడుల్స్‌పై రచ్చ రేగినప్పుడు భారత ఆహార భద్రత, నియంత్రణ సంస్థ ఆమోదమైనా లేకుండానే, పతంజలి ఆటా నూడుల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఆహార భద్రతా నియమాలను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆనక నోటీసిచ్చింది. అలాగే, ‘దివ్యపుత్రజీవక్ బీజ్’ వాడితే చాలు అబ్బాయే పుడతా డంటూ 2015లో మరో మందును మార్కెట్లోకి తేవడమూ వివాదమైంది. ఇక, 2016లో పతంజలి ఆమ్లా రసం వినియోగానికి పనికిరాదంటూ రక్షణ దళాల క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ దాన్ని అమ్మ కాన్ని నిలిపేసింది. నిరుడు ‘దివ్య దంత మంజన్’ను శాకాహార ఉత్పత్తిగా పేర్కొంటూ దానిలో ఒక జాతి చేపను వాడడమూ రగడయింది. పతంజలి వ్యవహారశైలిపై ప్రత్యర్థుల అభ్యంతరాలు చెప్పడం నిజమే కానీ, ప్రపంచ సంస్థలన్నీ కట్టగట్టుకొని దానిపై కుట్ర చేస్తున్నాయనే మాట అసంబద్ధం. యోగాతో ఎయిడ్స్, క్యాన్సర్లను తగ్గించవచ్చంటూ 2006లోనే ప్రకటించిన రామ్‌దేవ్ వ్యాపార ప్రయాణం రెండు దశాబ్దాలవుతున్నా నేటికీ అనుమానాస్పదమే. రామ్‌దేవ్ మాటల్నే కాదు, పతంజలి ప్రకటనల్నీ ఆరోగ్యశాఖ కొట్టిపారేస్తున్నా సరే... అవే అసత్యాలు విస్తృత ప్రకటన లుగా వ్యాప్తిలో ఉండడం దురదృష్టం. ఏ ఔషధమైనా సరే ఔషధ రెగ్యులేటర్ల కఠిన పరీక్షల్లో పాసై, నిర్ణీత చికిత్సకు ఉపయోగమని ఆమోదం పొందడం అల్లోపతిలో గీటురాయి. అలాగని సంప్రదాయ ఔషధ విధానాలన్నిటినీ కొట్టిపారేయమని కాదు కానీ, పరీక్షకు నిల్చి ఫలితాలతో గెలిస్తేనే ప్రపంచంలో ప్రామాణికత. పతంజలి తన ఉత్పత్తుల టముకు ఎంత మోగిస్తున్నా, అధీకృత శాస్త్రీయసంస్థలేవీ వాటికి ఆమోదముద్ర వేయలేదు. సాధారణ ఆరోగ్యం కోసమని స్పష్టంగా చెప్పే సంప్ర దాయ మందుల్ని నమ్మకం మీద వాడవచ్చు కానీ, కరోనా లాంటి నిర్ణీత వ్యాధుల నివారణకు పరమౌషధం అన్నప్పుడు శాస్త్రీయ నిర్ధారణ పరీక్షలు, ఫలితాలు కీలకం. అందులో వెనుకబడ్డ పతంజలి తీరా శాస్త్రీయ వైద్యవిధానాలపై అపనమ్మకం రేపుతోంది. సర్వ రోగ నివారిణి తమదే అన్నట్టు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే అనవసర ఆరోగ్య సంక్షోభమే. నకిలీ వైద్యులు, గోసాయిచిట్కాలతో ఇల్లు ఒళ్ళు గుల్లవుతాయి. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అభ్యంతర కర యాడ్స్) యాక్ట్–1954 లాంటివి ఎప్పటి నుంచో ఉన్నా, పకడ్బందీగా అమలు చేయడంలో నిర్లిప్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సుప్రీమ్ చేసిన వ్యాఖ్యలు కీలకమై నవి. అరచేతిలో ఆరోగ్య స్వర్గం చూపే ప్రకటనల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంస్థలపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇక నైనా, బుద్ధి తెచ్చుకొని పతంజలి తీరు మార్చుకోవాలి. తలబొప్పి కట్టిన పాలకులు బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధి చూపాలి. – సభావట్ కళ్యాణ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు -
చిన్న బుద్ధుల పెద్ద ఎన్నిక
అసెంబ్లీలో పార్టీలకు స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నచోట రాజ్యసభ ఎన్నికలనేవి అంతా సజావుగా సాగిపోయే మామూలు తంతు. కానీ, పార్టీ ఏదైనా సరే పాలకపక్షంతో అంటకాగడానికీ, జెండా కన్నా సొంత అజెండాకు పెద్ద పీట వేయడానికీ ప్రజాప్రతినిధులు దిగజారితే, పెద్దల సభకు ఎన్నికలు సైతం చిన్న బుద్ధులకు వేదిక అనిపించక మానవు. ఫిబ్రవరి 27న యూపీ (10 సీట్లు), కర్ణాటక (4 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (1)లలో ఎగువసభ ఎన్నికలు అలానే సాగాయి. హిమాచల్‌లో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు, యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఏడుగురు క్రాస్ ఓటింగ్‌కు దిగడంతో ఆ పార్టీలు చెరొక స్థానాన్ని బీజేపీకి కోల్పోయాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు ఓటేసిన కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ నాలుగింట తనకు దక్కాల్సిన 3 స్థానాల్ని నిలబెట్టుకుంది. మంగళవారం 15 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగితే, బీజేపీ తన బలంతో గెలవగలిగిన వాటి కన్నా రెండు సీట్లు ఎక్కువగా 10 సొంతం చేసుకుంటే, కాంగ్రెస్, ఎస్పీలు తమ సంఖ్యాబలం కన్నా చెరొకటి తక్కువగా వరుసగా 3, 2 సీట్లే దక్కించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల్ని రకరకా లుగా ప్రలోభపెట్టి, క్రాస్ ఓటింగ్‌కు దిగజార్చే దుష్టసంస్కృతి పూర్తి స్థాయిలో స్థిరపడినట్టు మరో సారి రుజువైంది. రాజ్యసభ ఎన్నికలకు విప్ల జారీ కుదరదు కానీ, తమ పార్టీ నియమించిన ఏజెంట్‌కు లెజిస్లేటర్లు తమ బ్యాలెట్ పేపర్లు చూపాలి. అయినా సరే, ఎమ్మెల్యేలు తామున్న పార్టీ వైఖరికి భిన్నంగా ఓటేయడం వర్తమాన రాజకీయాలలో విలువల పతనానికి విషాద నిదర్శనం. చిత్రమేమంటే, హిమాచల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మనుగడనే బీజేపీ ప్రశ్నార్థకం చేసింది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల్లో గత ఏడాదే గెలిచి, హస్తం పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచి తమ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలే తమకున్నారని అధికార కాంగ్రెస్ పెద్దలు ఏమరుపాటుగా ఉంటే, అదను కోసం చూస్తున్న ప్రతిపక్ష బీజేపీ తమ ‘ఆపరేషన్ కమల్’కు పదును పెట్టింది. ఫలితంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసి, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. ఫలితంగా, మెజారిటీతో ఇట్టే గెలవాల్సిన కాంగ్రెస్ అభ్యర్థి – ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి కాస్తా ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థితో సమానంగా మాత్రమే ఓట్లొచ్చిన పరిస్థితి. లాటరీలోనూ అదృష్టం బీజేపీ పక్షాన నిలిచేసరికి, ఆ రాజ్యసభా స్థానం కాంగ్రెస్ చేజారింది. హిమాచల్‌లో కొద్దినెలలుగా కుతకుతలాడుతున్న అసంతృప్తిని అలక్ష్యం చేసి, బీజేపీ ‘ఆకర్షణ మంత్రాన్ని’ తక్కువగా అంచనా వేసి, కాంగ్రెస్ చేజేతులా ఈ ఓటమి కొనితెచ్చుకుంది. చివరకు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాల్సినవేళ సభలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే దుఃస్థితి తలెత్తింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యంగానైనా బరిలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. సీనియర్ నేతలు డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హూడా తదితరుల్ని హిమాచల్ పంపింది. సుఖూ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. ఈ విషయంపై వారు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం తాజా బుజ్జగింపులతో అంతా సద్దుమణుగుతుందా అన్నది చూడాలి. ‘నేను పోరాట యోధుణ్ణి, రాజీనామా ప్రసక్తే లేదు’ అని సీఎం సుఖూ బింకంగా చెబుతున్నా, సభలో మెజారిటీ ఆయనకుందా, సొంత ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉన్నందున ఆయన అధికారంలో కొనసాగగలరా అన్నది అనుమానమే. మొత్తం 68 మంది సభ్యుల హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలగం 40 మంది. ఆరుగురి క్రాస్ ఓటింగ్‌తో దాని బలం 34కు పడిపోయింది. ఇక, బీజేపికి 25 మంది ఉంటే, ఇండిపెండెంట్లు ముగ్గురున్నారు. బీజేపీ పాలిత హర్యానాలో పంచ కులాలో మకాం వేసిన కాంగ్రెస్ రెబెల్స్‌తో కలుపుకొంటే కాషాయ బలమూ 34కు చేరింది. సభలో మెజారిటీ మార్కు 35. ఇంకా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను సంప్రతిస్తున్నారని బీజేపీ అంటున్నందున ఏమైనా జరగవచ్చు. ఈ నేపథ్యంలో నాటకీయత పెంచుతూ బుధవారం 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌తో ఇప్పటికి గండం గట్టె క్కాలన్నది తాపత్రయం. అదే జరిగినా, సుఖూను వ్యతిరేకిస్తూ, సీఎం పీఠానికై విక్రమాదిత్య సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండడం గమనార్హం. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమా రుడైన విక్రమాదిత్య మంత్రి పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించడం కథలో కీలక మలుపు. ఎన్నికల్లో మెజారిటీ ఏ పార్టీకి దక్కినా, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా, ఆఖరుకు అక్కడ బీజేపీయే అధికార చక్రం తిప్పడం కొన్నేళ్ళుగా పెరుగుతున్న ధోరణి. సామ దాన భేద దండోపా యాలు ప్రయోగించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యర్థి పార్టీ నేతల్ని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీది ఇప్పుడు తిరుగులేని రికార్డు. 2019లో కర్ణాటకలో జేడీ–ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వం, 2020లో మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్, 2022లో మహారాష్ట్రలోని శివ సేన ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్... ఇలా గత నాలుగేళ్ళలో కాషాయపార్టీ పాలబడినవి ఎన్నో. తాజాగా హిమాచల్‌లోని సుఖూ సారథ్య కాంగ్రెస్ సర్కార్ ఆ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సుఖూ పట్ల పార్టీలో వ్యతిరేకతను సర్దుబాటు చేసుకోవాల్సింది కాంగ్రెస్. కానీ, ఒక పార్టీ అంతర్గత విభేదాల కుంపటిలో మరొక పార్టీ చలి కాచుకొని, అధికారం చేజిక్కించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. సంతలో ప్రజాప్రతినిధులను కొని, ప్రజాతీర్పు తమ వైపు ఉందని ఏ పార్టీ భావించినా అది అవివేకం. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సమయం చూసి సమాధానం చెబుతారు. -
ఆచితూచి అడుగేద్దాం!
శాస్త్రవిజ్ఞాన విజయాలతో మానవాళి ఎప్పటికప్పుడు ముందడుగేయడం చరిత్రలో సంతోష సందర్భమే. గతవారం అలాంటి మరో సందర్భం ఎదురైంది. పుడమికి అతి సమీపంలో ఉండే గ్రహమైన చంద్రునిపై మరోసారి మానవ మేధ సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగింది. ఇప్పటి దాకా వివిధ దేశాల ప్రభుత్వాలు అధికారిక అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు సాధించడం చూశాం. ఈసారి ఓ ప్రైవేట్ సంస్థ చందమామపై జయకేతనం ఎగరేసింది. అమెరికాకు చెందిన ‘ఇన్ట్యూటివ్ మెషిన్స్’ (ఐఎం) సంస్థ ఫిబ్రవరి 22న ఓ రోబోటిక్ వ్యోమనౌకను చందమామపై సాఫ్ట్ ల్యాండ్ చేసింది. ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం అయిదే దేశాలు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అలా చూస్తే, ఒక ప్రైవేట్ సంస్థ ఆ అపురూప విన్యాసం చేయడం చెప్పుకోదగ్గ మైలురాయి. అయితే, చరిత్రలో రెండో పర్యాయం ఇప్పుడు మళ్ళీ జాబిల్లిపై వ్యోమయానం ఊపందుకున్న వేళ రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా నిర్దిష్టమైన అంతరిక్ష విధానం, ప్రత్యేక అంతరిక్ష చట్టం అవసరం ఉందని అర్థమవుతోంది. అమెరికా అంతరిక్ష నౌక ఒకటి చంద్రమండల ఉపరితలంపై దిగడం గత 50 ఏళ్ళ పైచిలుకులో ఇదే ప్రథమం! అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ 1972లో అపోలో ప్రోగ్రామ్‌కు తెర దించిన తర్వాత మళ్ళీ ఆ దేశం చంద్ర మండల పునఃప్రవేశం మళ్ళీ ఇప్పుడే! చంద్రునిపై వ్యోమనౌక దిగడమనే సవాలులో మానవజాతి ఎన్నో ఏళ్ళుగా విజయాలు, వైఫల్యాలు – రెండూ చవిచూసింది. చంద్రునిపై దిగడంలో విఫలమైన ప్రతిసారీ వ్యోమనౌకల శకలాలు చంద్రోపరితలంపై చెల్లాచెదరై పడివుండడమూ చూశాం. అంతెందుకు... గత నెలలో మరో అమెరికన్ సంస్థ ‘ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ’ సైతం ఓ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపాలని చూసింది. ఇంధనం లీకేజీతో ఆ యత్నాన్ని అర్ధంతరంగా ముగించింది. సదరు ల్యాండర్ భూవాతావరణంలోకి పునఃప్రవేశించి, పసిఫిక్ మహాసముద్రంపై దగ్ధమైంది. విఫలమైన ఆ ‘ఆస్ట్రోబోటిక్’, విజయవంతమైన ‘ఐఎం’ సంస్థ... రెండూ ‘నాసా’ అండతో వాణిజ్యపంథాలో చంద్రునిపైకి వ్యోమనౌకల్ని పంపే కృషిలో భాగమే. గగనాంతర సీమల గవేషణలో ప్రైవేట్ రంగ ప్రమేయం పెరుగుతున్న తీరుకు ఇది ఉదాహరణ. చరిత్ర గమనిస్తే – 1966లోనే సోవియట్ యూనియన్ ‘లూనా9’ తొలిసారిగా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. నాలుగు నెలల తర్వాత ‘సర్వేయర్1’తో అమెరికా విజయం సాధించింది. అది క్రమంగా చంద్రునిపైకి మానవయాత్రకు దారి తీసింది. 1969లో నాసా ‘అపోలో11’తో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్ద్రిన్లు చంద్రునిపై అడుగిడిన తొలి వ్యక్తులుగా చరిత్ర సృష్టించినప్పటి నుంచి ఇప్ప టికి అరడజనుకు పైగా యాత్రల్లో డజను మంది చంద్రునిపై కాలుమోపారు. 2026 చివరి కల్లా మరోసారి చంద్రునిపైకి మానవ యానానికి అమెరికా సిద్ధమవుతోంది. మూడో దేశంగా చైనా, గత ఏడాది ‘చంద్రయాన్3’ ద్వారా రెండో ప్రయత్నంలో విజయం సాధించి నాలుగో దేశంగా భారత్ చంద్రునిపై ల్యాండింగ్ చేశాయి. ఈ జనవరిలో జపాన్ తప్పుదిశలో ల్యాండింగ్ జరిపినప్పటికీ, అసలంటూ చేసిన అయిదో దేశంగా ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు ఐఎం విజయంతో చంద్రమండల యాత్రల్లో ప్రైవేట్ రంగ శక్తియుక్తులు హెచ్చనున్నాయి. మరిన్ని యాత్రలకు సన్నాహాలు సాగుతు న్నందున లోతైన అన్వేషణ, శాస్త్రీయ పరిశోధనలకు కలువలరేడు కేంద్రబిందువు కానున్నాడు. నిజానికి, చంద్రునిపై దిగేందుకు ప్రైవేట్ సంస్థలు గతంలోనూ అనేక యత్నాలు చేశాయి. 2019లో ఇజ్రాయెల్ బెరేషీట్ చంద్రునిపై కుప్పకూలింది. 2023లో ఓ జపనీస్ సంస్థ తాలూకు ల్యాండర్ పడిపోయింది. తాజా ప్రైవేట్ ప్రయోగ విజయంలోనూ లోటుపాట్లు లేకపోలేదు. గ్రీకు పురాణా ల్లోని తెలివైన వీరుడు ‘ఒడిస్సియస్’ పేరు పెట్టుకున్న ఐఎం వారి వ్యోమనౌక ఆఖరుఘట్టంలో జాబిల్లి దక్షిణ ధ్రువానికి దగ్గరలో నేరుగా కాక అనుకున్నదాని కన్నా వేగంగా, పక్కవాటుగా దిగింది. దాంతో, ముందనుకున్నట్టు వారం కాకుండా, 2–3 రోజుల ముందే తట్టాబుట్టా సర్దుకుంటోంది. అయితే, అసలంటూ ఐఎం విజయవంతం కావడంతో నాసా ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్’ (సీఎల్పీఎస్) కార్యక్రమం కింద మరిన్ని ప్రైవేట్ ప్రయత్నాలు సాగుతాయి. 2020 నాటికి పూర్తయ్యేలా మరో 14 ప్రైవేట్ సంస్థలతో నాసా పెట్టుకున్న 260 కోట్ల డాలర్ల కాంట్రాక్టులే అందుకు తార్కాణం. ఇటీవలే భారత్ సైతం జాతీయ అంతరిక్ష రంగంలో నూరు శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టు బడులకు ద్వారాలు తెరిచింది. అంటే రానున్న రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై భారం తగ్గి, ప్రైవేట్ రంగంలో భారతీయ అంకుర సంస్థల మధ్య పోటాపోటీ పెరగనుంది. ప్రపంచమంతటా ఇలాంటి ప్రైవేట్ ప్రయత్నాలతో కష్టాలూ తప్పవు. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ మినహా ఇప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనలేవీ లేవు. ఆ ఒడంబడిక సైతం అనుసరించాల్సిన విధుల జాబితాయే తప్ప, పాటించి తీరాల్సిన ఆదేశాలు కావు. తాజా ఒడిస్సియస్ దెబ్బతో వివిధ సంస్థలు చంద్రునిపైకి ఏవైనా పంపి, దాన్ని ఎలాగైనా నింపే వీలుంది. అందుకే, ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష, చంద్రమండల చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఇప్పటికే ఉప గ్రహాలతో క్రిక్కిరిసిన దిగువ భూకక్ష్య లానే చంద్రమండలమూ నిండవచ్చని శాస్త్రవేత్తల జోస్యం. చంద్రునిపై నిర్ణీత ప్రాంతాలు శాస్త్రీయ పరిశోధనా శాలలకు కీలకం గనక అవాంఛనీయ పోటీ తప్పదు. విలువైన హీలియమ్3 కోసం చంద్రునిపై గనుల తవ్వకాలు జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. కాబట్టి, ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భమిది. నైతికతకు కట్టుబడి పరిశోధనలు సాగిస్తూనే, వెన్నెలరేడు వాతావరణాన్ని విధ్వంసం చేయనిరీతిలో చట్టాలు చేసుకోవాల్సిన సమయమిది. -
సిగ్గు... సిగ్గు...
వ్యవసాయభూముల కాపాడేందుకు ఉద్యమాలు చేసి, అప్పటి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన పార్టీ చివరకు అందులోనే విఫలమైతే? సదరు పార్టీ వ్యక్తులే సారవంతమైన భూముల్ని కబ్జా చేసి, స్థానికులను జీతం బత్తెం లేని బానిస కూలీలుగా మార్చి, స్త్రీలపై యథేచ్ఛగా లైంగిక అత్యాచారాలు సాగిస్తుంటే? పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ళ దీర్ఘకాల వామపక్ష సర్కార్‌పై అలుపెరుగని పోరాటాలు చేసి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ఇప్పుడు సందేశ్‌ఖలీ వ్యవహారంలో వస్తున్న విమర్శలు ఇవే. కోల్‌కతాకు 70 కి.మీ.ల దూరంలో, ఉత్తర 24 పరగణాల జిల్లాలో సారవంతమైన భూములతో కూడిన ఈ కుగ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికి 53 రోజులైనా, అక్కడి అకృత్యాలకు మూలమని ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ నేత షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేయకపోవడంపై కలకత్తా హైకోర్ట్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి రావడం పరాకాష్ఠ. సందేశ్‌ఖలీలో చాలాకాలంగా అకృత్యాలు సాగుతున్నా, అది ఇప్పుడు చర్చకు వచ్చింది. రేషన్ కుంభకోణంలో నిందితుడైన స్థానిక రాజకీయ బాహుబలి షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 5న వెళ్ళింది. వారిపై దాదాపు 2 వేల మంది దాకా షాజహాన్ అనుచరులు తీవ్రమైన దాడికి తెగబడ్డారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా, పెద్దయెత్తున స్థానిక మహిళలు బయటకొచ్చి, ధైర్యం కూడగట్టుకొన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడ షాజహాన్, ఆయన అనుచరులు సాగిస్తున్న భూకబ్జాలనూ, లైంగిక అత్యాచారాలనూ బయటపెట్టారు. ఈ ఆరోపణలతో గ్రామంలో నిరసనలు తలెత్తాయి. గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, షాజహాన్ ప్రధాన అనుచరులైన ఉత్తమ్ సర్దార్, శివప్రసాద్ హజ్రాల ఆస్తులపై దాడికి దిగేలా చేసింది. షాజహాన్నూ, అతని అనుచరులనూ అరెస్టు చేయాలని కోరుతూ ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో వీధులకెక్కారు. అధికార తృణమూల్ అసలు నిందితుడి విషయంలో మీనమేషాలు లెక్కిస్తుంటే, ఈ వ్యవహారాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలా అని బీజేపీ చూస్తోంది. అధికార పార్టీ సైతం ఆచితూచి వ్యవహరిస్తున్న నిందితుడు షేక్ షాజహాన్‌ది పెద్ద కథ. ‘సుందర్బన్స్ అసలు పులి’ అంటూ స్థానిక గ్రామీణులు పిలుచుకొనే అతను 2013 నుంచి తృణ మూల్‌కూ, అంతకు ముందు సీపీఐ (ఎం)కూ ఓటింగ్ మిషన్. అతను∙ఎవరికి మద్దతిస్తే వారిదే గెలుపు. 2023 జూలై పంచాయతీ ఎన్నికల్లో సందేశ్‌ఖాలీలోని రెండు బ్లాకుల్లో 333 సీట్లుంటే, 310 సీట్లు పోటీ లేకుండా తృణమూల్ ఖాతాలో పడ్డాయి. మిగతా 23 సీట్లలోనూ చివరకు తృణమూల్ జెండాయే ఎగిరింది. అలాంటి బలవంతుణ్ణి వదులుకోవడం ఎంత మమతకైనా కష్టమే. అందులోనూ మైనార్టీ అయిన షాజహాన్‌ను పరారీలో ఉన్నాడంటూ వదిలేసి, అతని∙హిందూ సహచరు లిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో బీజేపీ – ఆరెస్సెస్‌లకు అస్త్రం అందివచ్చినట్టయింది. మమత మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని నిందిస్తూ ఎస్సీ, ఎస్టీలను తమ వైపు తిప్పుకోవాలని కమలదళం యత్నిస్తోంది. నాలుగేళ్ళ క్రితమే పోలీసులకు ఫిర్యాదులందినా, 42 కేసులు దాఖలైనా షాజహాన్‌ను కదిలించినవారు లేదు. అతణ్ణి అరెస్ట్ చేస్తే మైనార్టీలు దూరమవుతారనేది మమత భయం. ఏమైనా, మోదీ పర్యటనకు వచ్చే లోపల మమత ఆ పని చేయక తప్పకపోవచ్చు. గతంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా మమత ఎలాంటి ధర్నాలు చేసిందీ తెలుసు. 2007లో నందిగ్రామ్‌లో ప్రత్యేక ఆర్థిక జోన్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించి అక్కడకు చేరడానికి ఆమె స్కూటర్ వెనుక కూర్చొని ప్రయాణించడం, సింగూర్‌లో టాటా నానో కర్మాగారం ఎదుట ధర్నాలు చేయడం అందరికీ గుర్తే. తీరా మమత పాలనలో ప్రతిపక్షాలు ఆ తరహా పోరాటాలు సాగించలేకపోతున్నాయి. బీజేపీలో సైతం నేతల మధ్య సమన్వయం కొరవడింది. దాంతో, ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మరికొద్ది రోజులే ఉన్నందున అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు మార్చి తొలివారంలో ఒకటికి మూడుసార్లు బెంగాల్లో పర్య టించనున్నారు. రాజకీయాలు, హింసాకాండ జంటపదాలైన బెంగాల్ దేశంలోని అతి సున్నితమైన ప్రాంతాల్లో ఒకటని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చివరకు కాశ్మీర్ కన్నా ఎక్కువగా 920 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్లో దింపనున్నట్టు ప్రకటించింది. సభ్యసమాజం సిగ్గుపడేలా సాగుతున్న లైంగిక అత్యాచారాలపై పార్టీలకు అతీతంగా నేతలందరూ గళం విప్పాల్సింది. తృణమూల్ మొదట అసలు అలాంటిదేమీ లేనే లేదని కొట్టిపారేసింది. ఆనక ఇదంతా తమను అప్రతిష్ఠ పాల్జేసేందుకు కాషాయదళ స్కెచ్ అనీ, ఇప్పుడేమో నిందితుల్ని శిక్షిస్తామనీ పిల్లిమొగ్గలు వేసింది. ప్రతిపక్షాలేమో స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఈ వివాదాన్ని ఎలా వాడుకోగలమనే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఇంత సాగుతున్నా, సందేశ్‌ఖలీ ఘటనల్ని సీఎం మమత గట్టిగా ఖండించిన పాపాన పోలేదు. కనీసం పోలీసులు అసలు నిందితుణ్ణి అరెస్ట్ చేసిందీ లేదు. ఇది శోచనీయం. ఓ మహిళ పాలిస్తున్న రాష్ట్రంలో, శాంతిభద్రతల పరిరక్షించాల్సిన హోమ్ శాఖ ఆమె చేతిలో ఉండగా ఇదీ స్త్రీల పరిస్థితి కావడం మరింత సిగ్గుచేటు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రభుత్వం తక్షణం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బలవంతుడిదే రాజ్యంగా మారిన పరిస్థితుల్ని మార్చి, కబ్జాకు గురైన భూముల్ని అసలు యజమానులకు అప్పగించాలి. అప్పుడే న్యాయం గెలుస్తుంది. ప్రభుత్వంపై, ప్రజాస్వామ్యంపై జనంలో నమ్మకం నిలుస్తుంది. -
సంజీవని కావాలి!
మనం మనుషులం, మర్త్యులం. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన మనుషులు తిరిగి బతికిన ఉదంతాలు అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. చితి మీద నుంచి లేదా శవపేటిక నుంచి అలా బతికి లేచిన వాళ్లు కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ/ తస్మాద పరిహార్యేర్థే న/ త్వం శోచితు మర్హసి’ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదని, మరణించిన వారు తిరిగి పుట్టక తప్పదని, ఇదంతా ఒక చక్రమని చాలా మతాలు నమ్ముతాయి. ఈ నమ్మకంలోని నిజానిజాలు ఆ భగవంతుడికే ఎరుక! ఇది ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. నమ్మకాలకు రుజువులతో పనిలేదు. నమ్మకాలను కలిగి ఉండటం ప్రజల హక్కు గనుక జనన మరణ చక్రంపై నమ్మకాన్ని అలా విడిచిపెడదాం. మన పురాణాల్లో మరణించిన వారిని బతికించిన ఉదంతాలు ఉన్నాయి. అసురగురుడు శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్య ఉండేదట! ఆ విద్యతోనే దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన దానవులందరినీ ఆయన మళ్లీ బతికించేసేవాడట! అప్పట్లో దేవతల వద్ద ఈ విద్య ఉండేది కాదు. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం తాగిన తర్వాతనే దేవతలు అమర్త్యులుగా మారారు. క్షీరసాగర మథనానికి ముందు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా దేవగురువు బృహస్పతి మృతసంజీవని విద్యను శుక్రుని వద్ద నేర్చుకోవడానికి స్వయంగా తన కొడుకు కచుడిని పంపించాడు. శుక్రాచార్యుడి ఆశ్రమంలో కచుడి ప్రవేశం ముక్కోణపు ప్రేమ గాథకు దారితీసింది. అదంతా వేరే కథ! త్రేతాయుగం నాటి రామాయణంలో కూడా మృతులను బతికించిన సందర్భం కనిపిస్తుంది. అప్పట్లో ఈ విద్య వానర వైద్యుడు సుషేణుడికి తెలుసు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సలహాపై హనుమంతుడు సంజీవని మూలిక దొరికే సుమేరు పర్వతానికి వెళ్లి, మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్ని పెకలించుకొచ్చాడు. సుషేణుడు సంజీవని మూలికతో లక్ష్మణుడు తెప్పరిల్లేలా చేశాడు. అప్పటి వరకు యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బతికించాడు. ఇదంతా రామాయణ కథనం. ద్వాపర యుగం నాటికి మరణించినవాళ్లను తిరిగి బతికించే విద్య అంతరించిందేమో! కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్లెవరూ తిరిగి బతికిన దాఖలాలు కనిపించవు. ఆధునిక కాలంలో మనమేం చేస్తున్నామంటే, భూమ్మీద సృష్టి మొదలైనది లగాయతు ఇప్పటి వరకు ఏమేమి అంతరించిపోయాయో లెక్కలు వేసుకుంటున్నాం. భూమ్మీద జీవసృష్టి మొదలయ్యాక దాదాపు ఐదువందల కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. వాటిలో తొంభైతొమ్మిది శాతం అంతరించిపోయాయి. ఇప్పటికి మిగిలిన జీవజాతులు దాదాపు ఎనభై ఏడు లక్షలు మాత్రమే! వీటిలోనూ కొన్ని జీవజాతులు మన కళ్లముందే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద అంతరించిపోతున్నవి జీవరాశులు మాత్రమే కాదు. భూమ్మీద పుట్టిన మనుషులు సృష్టించుకున్న ఎన్నో నాగరికతలు, భాషలు అంతరించిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో వస్తువులు, ఎన్నో కళలు కనుమరుగైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల భాషలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు ఐదువందల వరకు భాషలు పూర్తిగా అంతరించాయి. మనుగడలో ఉన్న భాషల్లోనూ కొన్ని సాహితీప్రక్రియలు కనుమరుగైపోయాయి. కొన్ని భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన ‘వరల్డ్ అట్లాస్ ఆఫ్ లాంగ్వే జెస్’ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో సుమారు రెండున్నరవేల భాషలు రానున్న కాలంలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో ముడిపడి ఉన్న ప్రజల చరిత్ర అంతరించిపోతుంది. ఆ భాషలో నమోదై ఉన్న విలువైన సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం; ఆ భాష ప్రజల సంస్కృతి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే అంతరించిపోయిన భాషలను ఎటూ కాపాడుకోలేకపోయాం. కనీసం ప్రమాదం అంచుల్లో ఉన్న భాషలనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరణించిన భాషలకు ప్రాణం పోసే మృతసంజీవని విద్య ఏదీ ఇప్పటివరకు లేదు. అయితే, అంతరించిపోయిన కొన్ని అరుదైన జీవరాశులకు తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ అనే ఎగరలేని పక్షిని జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి పుట్టించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాణ్యత అరుదైపోతున్న ప్రక్రియల విషయానికి వస్తే – తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న ప్రక్రియ విమర్శ. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగంతో మొదలైన విమర్శ – రాచమల్లు రామచంద్రారెడ్డి నాటికి గొప్ప దశకు చేరుకుంది. కానీ, తర్వాత తర్వాత చప్పబడింది. రచయితలు రాటుదేలడానికి విమర్శకులు చాలా అవసరం. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం రచయితలకు, కవులకు కొదవలేదు గాని, విమర్శకుల లోటు బలంగా ఉంది. కొద్దిమంది విమర్శకులు ఈ ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాగని విమర్శ ప్రక్రియ క్షీణతకు కేవలం విమర్శకులను తప్పుపట్టలేం. విమర్శను తట్టుకునే శక్తి రచయితల్లో కొరవడటం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విమర్శ కనుమరుగైపోతే, సాహితీ సృజన అంతరించి పోవడానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పుడు విమర్శకు పునర్జీవం కల్పించే సంజీవని కావాలి! -
యెల్లో సేనలు డీలా!
పెత్తందారు ప్రమాదకరమైనవాడు. వాడు దశకంఠుడిలా కనిపి స్తాడు. మహాబలాఢ్యునిగా గోచరిస్తాడు. నల్లధనం కొండ మీద పడగవిప్పి కూర్చున్న నల్లతాచు వాడు. కనుక భయంకరంగానే కనిపిస్తాడు. వేయి పడగల కర్కోటకుడు పెత్తందారు. ఒక్కో వ్యవస్థలోకి ఒక్కో పడగను దూర్చి ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విషసర్పం వాడు. ఆ సర్పరాజు పేరు ఏదైనా కావచ్చు. తక్షకుడు, కర్కోటకుడు, కాలకేయుడు, పింజారకుడు, చంద్రబాబు నాయుడు, రామోజీరావు... ఇలా! పేరేదైనా సరే పెత్తందార్ల దోపిడీకి కాపుకాయడమే ఆ రాజు పని. భయంకరంగా కనిపి స్తున్నాడని వాడికి భయపడితే పేదల బతుకులు ఎప్పటికీ మారవు. మన ఏడున్నర దశాబ్దాల ప్రజాస్వామ్యం ఇదే విషయాన్ని నిరూపించింది. ఈ విషసర్పపు కోరలు పీకేస్తేనే పేదలకు శాప విమోచనం దొరుకుతుంది. ఆ పని చేయడానికి నేను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తున్నారు. తనతో కలిసి నడవడానికి సిద్ధమా అని ప్రశ్నిస్తూ జనసామాన్యాన్ని ఆయన సమాయత్తం చేస్తున్నారు. పేద పిల్లలకు బంట్రోతు చదువులు... సంపన్నులకు దొరబాబు చదువులా? ఎన్నాళ్లీ దుర్నీతి? ఇది ప్రజాస్వా మ్యమా... పెత్తందారీస్వామ్యమా?... ఇన్నాళ్లూ పెత్తందారీ స్వామ్యమే విద్యారంగాన్ని పరిపాలించింది. ఈ దుష్పాలన ఇంకానా... ఇకపై చెల్లదని ఐదేళ్ల కింద జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చాటింపు వేశారు. ఒక్క చదువే కాదు, సమస్త జీవన రంగాల్లోని అమానవీయత, అసమానతలపై ఆయన యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పేదవర్గాలకు సమకూర్చేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. నవయుగానికి అవసరమైన ‘మాగ్నాకార్టా’ను తనదైన పద్ధతిలో అమలు చేయడం ప్రారంభించారు. అది సత్ఫలితాలనిస్తున్నది. రెండేళ్లు కోవిడ్ కోతకు గురైన ఈ అయిదేళ్ల పదవీ కాలంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపెట్టింది. ఒకపక్క ఆర్థికాభివృద్ధి సూచికలు ఊర్ధ్వ చలనాన్ని సూచిస్తుంటే, అదే సమయంలో మానవాభివృద్ధి సూచికలు కూడా అంతకంటే వేగంగా పరుగులు తీశాయి. ఇది గతంలో ఎన్నడూ చూడని అనుభవం. మానవాభివృద్ధిరంగంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇంకో పది పదిహేనేళ్లలో సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చబోతున్నదని పలువురు ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని గతంలో కొందరు ఆర్థికవేత్తలు తప్పుపట్టేవారు. ‘గుడ్ ఫిలాసఫీ బట్ బ్యాడ్ ఎకనామిక్స్’ అంటూ వెటకారం చేసేవారు. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన మానవాభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్కదానిపైనా ఆర్థికవేత్తలు ఇటువంటి వ్యాఖ్యానం చేయకపోవడం విశేషం. పైపెచ్చు ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ‘గుడ్ ఫిలాసఫీ అండ్ గుడ్ ఎకనామిక్స్’గా పరిగణన పొందాయి. అందువల్లనే అవి సత్ఫలితాలనిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికల్లో, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో, ఉపాధి కల్పనలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పేద వర్గాల్లో ఒక గొప్ప రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్నది. సాధికారతలోని ఆత్మగౌరవ భావన వారి అనుభవంలోకి నెమ్మదిగా ప్రవేశి స్తున్నది. సాధికారత పథంలో మహిళలు ముందడుగు వేశారు. ఈ కారణాల వలన రాష్ట్రంలో వైఎస్ జగన్ రాజకీయ శిబిరం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. అతి భయంకరుడూ, గండర గండడనుకున్న పెత్తందారులను తరిమికొట్టొచ్చన్న భావన బల పడుతున్నది. ఈ పెత్తందారీ శిబిరానికి తెలుగు నాట కాపలా దార్లయిన సర్పరాజులు చంద్రబాబు, రామోజీ వగైరాలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు పార్టీ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెబుతున్నది కదా! మరి వాళ్లెట్లా పెత్తందారీ వర్గాల ప్రతినిధులవుతారు? ఈ సంశయం కొంతమందికి కలగవచ్చు. చంద్రబాబు పార్టీది పూటకూళ్ల సంక్షేమ సిద్ధాంతం. అన్న క్యాంటీన్లు, అక్క క్యాంటీన్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి సంక్షేమ పథకం వెనుక ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ పథకాన్ని అమలు చేయడం వల్ల లబ్ధిదారుకు కలిగేది తాత్కాలిక ఉపశ మనమైతే దాన్ని కంటితుడుపు సంక్షేమమంటారు. తాత్కాలిక ఉపశమనంతోపాటు లబ్ధిదారుని అభ్యున్నతికీ, సాధికారతకూ ఉపయోగపడే విధంగా పథకాన్ని డిజైన్ చేస్తే అది మానవాభి వృద్ధి పథకం కింద లెక్క. ఉదాహరణకు పేద జంటలకు పెళ్లి కానుక అందజేసే పథకాన్ని చంద్రబాబు కూడా అమలు చేశారు. పద్దెనిమిది వేల అర్హులైన జంటలకు ఎగవేసినందువల్ల తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వారికి చెల్లించిందనేది వేరే విషయం. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇదే పథకాన్ని ‘కల్యాణమస్తు’ పేరుతో జగన్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ అది కాదు అసలు విషయం. పథకానికి అర్హత ప్రమాణాలను కొత్తగా నిర్దేశించింది. వధువుకు 18 యేళ్లు, వరుడికి 21 యేళ్లు వయఃపరిమితి చట్టపరమైన నిబంధన. దాన్ని కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయించింది. దాంతో పాటు పదవ తరగతి ఉత్తీర్ణతను కూడా అర్హతగా చేర్చింది. అందువల్ల తప్పనిసరి టెన్త్ పాసవుతారు. ఆడపిల్లలకు పెళ్లి కోసం ఇంకో మూడేళ్ల గడువుంటుంది. ఇంటర్ వరకూ ‘అమ్మ ఒడి’ కూడా లభిస్తున్నందువల్ల ఆ పిల్లలు కచ్చితంగా ఇంటర్ కూడా పూర్తి చేస్తారు. డిగ్రీలో చేరుతారు. ఈ విధంగా ఒక్కో సంక్షేమ పథకాన్ని వారి కాళ్ల మీద నిలబడటానికి తోడ్పతే విధంగా డిజైన్ చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే! జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమం వెనుక ఇటువంటి ఎంపవర్మెంట్ ఫిలాసఫీ ఉంటుంది. ఈ ఫిలాసఫీ సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ ప్రాధమ్యాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం ఉపాధి వంటి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాల ప్రజలు కూడా పెద్ద వారితో సమానంగా నిలబడేందుకు అవకాశాలు కల్పించింది. ఇండియాలోని అత్యున్నతస్థాయి కార్పొరేట్ విద్యను రాష్ట్రంలోని పేద విద్యార్థి కూడా అభ్యసించగలిగే ఏర్పాట్లు చేసింది. నాణ్య మైన వైద్యం పేదల ఇళ్ల వాకిళ్లకు చేరువైంది. చిన్న సన్నకారు రైతులు కూడా లాభసాటి సేద్యం చేయడానికి అనేక కార్య క్రమాలను అమలుచేస్తూ ఆర్బీకే సెంటర్ల పేరుతో గ్రామ గ్రామానా ఊతకర్రలను నిలబెట్టింది. పేదవర్గాల తలరాతలు మార్చే ఇటువంటి ప్రాధమ్యాలు చంద్రబాబు సర్కారులో కని పించలేదు. విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు దేనికి ప్రాధాన్యతనిచ్చారో అందరికీ తెలిసిందే. అమరావతి సింగిల్ పాయింట్ ఎజెండా. అదో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్. కాంట్రాక్టర్లకూ, పెట్టుబడులు పెట్టిన పెత్తందార్లకూ మాత్రమే ఉపయోగపడే ఎజెండా. ఒక తాత్కాలిక సెక్రటేరియట్‌ను కట్టి అందులో 30 శాతం కమిషన్‌ను తీసుకున్నట్టు ఇప్పుడు ఆధారాలు లభించాయి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎమ్‌గా మార్చు కున్నారని ఈ దేశ ప్రధాని స్వయంగా చెప్పిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. కమిషన్ల కక్కుర్తికి ప్రతిష్ఠా త్మకమైన పోలవరాన్ని ఆయన బలిపెట్టారు. నాసిరకం పనుల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పనుల్లో అవాంఛ నీయమైన ఆలస్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ రకంగా చంద్రబాబు తీరని ద్రోహం చేసిన వారయ్యారు. ఇదొక్కటే కాదు ఆయన ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల భారీగా లబ్ధిపొందిన వారు ఆయన, ఆయన ఆంతరంగికులు, కాంట్రా క్టర్లు, సంపన్నులు. చిల్లర లబ్ధి పొందిన వాళ్లు జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల లబ్ధి పొందినవారు రాష్ట్రంలోని 85 శాతం కుటుంబాల ప్రజలు. ఈ ప్రాధమ్యాల కారణంగానే జగన్ ప్రభుత్వానికి ‘పేదల ప్రభుత్వం’ అనే పేరు వచ్చింది. ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే తెలుగుదేశం, యెల్లో మీడియా కూటమికి పెత్తందార్లు అనే పేరు వచ్చింది. ఇంగ్లీషు మీడియం, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు మన పేదవర్గాల భవిష్యత్తును సుంద రంగా మార్చివేస్తాయి. జగన్ ప్రభుత్వ వైద్య విధానాలు బీదా బిక్కీ తేడా లేకుండా ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తాయి. వ్యవసాయ విధానాలు సాగుబాటను సంపన్నం చేస్తాయి. ఈ విధా నాలను వ్యతిరేకిస్తున్నారు కనుకనే వారిని పెత్తందారుల తొత్తులుగా పరిగణించవలసి వస్తున్నది. ఈ ఫిలాసఫీని పక్కన పెట్టి జగన్మోహన్రెడ్డి పేదవాడా? ఆయనది పేదల ప్రభుత్వం ఎట్లా అవుతుందని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వితండవాదాన్ని లేవదీస్తున్నారు. ఒక నాయకుడు ధనికుడా, పేద వాడా అన్నది కాదు సమస్య. ఆ నాయకుని విధా నాలు ఎవరి పురోభివృద్ధికి తోడ్పడుతున్నాయనేదే ముఖ్యం. ఆ లెక్కన జగన్ ప్రభుత్వం నిస్సందేహంగా పేదల ప్రభుత్వమే! చంద్రబాబు పార్టీ పెత్తందార్ల వేదికే! రాష్ట్రంలోని పేదవర్గాల్లో ఈ రకమైన అవగాహన బలపడు తున్నది. ఫలితంగా పెత్తందారీ రాజకీయ శిబిరం తీవ్ర సంక్షో భంలోకి కూరుకొని పోయింది. జనసేన పార్టీని తన ప్రయో జనాలకోసం చంద్రబాబే పెట్టించాడనే అభిప్రాయానికి తాజా అభ్యర్థుల ప్రకటన మరింత బలం చేకూర్చింది. కనీసం మూడో వంతు సీట్లయినా వస్తాయని ఆశిస్తున్న జనసేన కార్యకర్తలు 24 సీట్ల లెక్కతో తీవ్ర నిరాశలో కూరుకొని పోయారు. ఈ రెండు పార్టీల బలంతోనే జగన్ పార్టీని ఎదుర్కో లేమనీ, బీజేపీని కూడా తమ తరఫున రంగంలోకి దించాలనేది చంద్రబాబు తలపోత. బీజేపీ వాళ్లు తనవంటి ఊసరవెల్లిని నమ్ముతారో లేదోనని నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ ద్వారా లాబీయింగ్ నడిపిస్తున్నారు. అదేకాకుండా తన సొంత మనుషులను కూడా ఆ పార్టీలోకి జొప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ఈ కూటమిలో చేరుతుందో లేదో స్పష్టత లేదు. పరిస్థితులను గమనిస్తుంటే చంద్రబాబు వంటి మోసకారి నేతను నమ్మలేమని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అదే నిజమైతే చంద్రబాబు – పవన్ పార్టీలే కూటమిగా పోటీ చేయాలి. 24 సీట్లతో జూనియర్ భాగస్వామి పాత్ర పవన్‌ది. ఈ మాత్రం సీట్లకే ఎన్ని గంభీరోపన్యాసాలు చేశారు పవన్? వాళ్లు ‘సిద్ధం’ అంటే మేము ‘యుద్ధ’మని మొన్ననే ఆయన గర్జించి నట్టు కూడా గుర్తు. ఒకసారెప్పుడో జనసేన కార్యకర్తల సభలో అభిమానులు ‘సీఎం... సీఎం’ అనే నినాదాలు చేశారు. అందుకు పవన్ చెప్పిన సమాధానం ఏమిటి? ‘మొన్నటి ఎన్నికల్లో కనీసం 40 సీట్లలో గెలిపించి ఉన్నట్లయితే సీఎం పదవి అడిగేవాడిని. ఇప్పుడెలా అడుగుతామ’ని అశక్తతను ప్రకటించాడు. ఇప్పుడు కూడా అంతే! 40 సీట్లలో పోటీ కూడా చేయడం లేదు. పోటీ చేస్తున్న 24 సీట్లలో పావలా పర్సెంట్ గెలిచినా 6 సీట్లే. కనుక ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సీఎం పదవి అడగలేరు. ఎందుకంటే అయిదేళ్ల తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని ఆయనే చెప్పారు కనుక! రెండు పార్టీలూ కలిసి 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో 18 మందే బీసీ వర్గాలకు చెందినవారు. ఇంకా ప్రకటించాల్సింది 76 సీట్లు. అందులో 14 రిజర్వుడు సీట్లు న్నాయి. పోతే 62 సీట్లు. వాటిలో బీసీలకు, మైనారిటీలకు ఏమాత్రం కేటాయిస్తారో చూడాలి. ఆ వర్గాల గురించి మాట్లాడే అర్హత టీడీపీ కోల్పోయినట్టే! బీసీ ఓట్లు పూర్తిగా దూరమైనట్టే! అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేయడానికి కూడా చంద్రబాబు భయపడినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. పవన్ కల్యాణ యితే తన అభ్యర్థిత్వాన్ని కూడా తొలి జాబితాలో ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారు. కేటాయించిన 24 సీట్లలో ఐదుగురి పేర్లే ఆయన ప్రకటించగలిగారు. పాపం, ఆయన ముఖకవళి కల్లో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. పార్టీ శ్రేణులు జావగారి పోకుండా ఉండేందుకే కుప్పం నుంచి తన పేరును బాబు ప్రకటించారు గానీ, చివరి నిమిషంలో అక్కడ మార్పు ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. కానీ తొలి జాబితాతోనే శ్రేణులు డీలా పడ్డాయి. అధికార వైసీపీ ఇప్పటికే సగం యుద్ధాన్ని గెలిచింది. మన పెత్తందారు ఇంకెంతమాత్రమూ బలాఢ్యుడు కాదు. అతడొక గాలి తీసిన బెలూన్ మాత్రమే. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఉక్రెయిన్ పోరు దారెటు?!
‘ఇక్కడ బతుకు దుర్భరంగా వుంది. స్వీయానుభవంలోకి రాకుండా దీన్నర్థం చేసుకోవటం పూర్తిగా అసాధ్యం’ అని తన సన్నిహితుడికి రాసిన లేఖలో రష్యాలోని అతి శీతలమైన ఆర్కిటిక్ ప్రాంత కారాగారంలో ఇటీవల కన్నుమూసిన అసమ్మతివాది అలెక్సీ నవాల్నీ అన్నారట. రెండేళ్లు పూర్తయి మూడో యేట ప్రవేశించిన ఉక్రెయిన్ యుద్ధం కూడా అటువంటి పరిస్థితుల్నే సృష్టించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన ఈ దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా అటు రష్యా సైనికులూ... ఇటు ఉక్రెయిన్ సైనికులూ, పౌరులూ కూడా చెప్పనలవికాని యాతనలు పడు తున్నారు. ఈ యుద్ధం నిరుడు రెండో ఏడాదిలో ప్రవేశించే సమయానికి ఉక్రెయిన్ పౌరుల్లో కాస్తయినా విశ్వాసం వుండేది. వచ్చే వేసవిలో రష్యా సైనికులను తరిమేయగలమని నమ్మేవారు. ఇప్పుడు అదంతా ఆవిరైంది. 2025 నాటికి మెరుగైన ఫలితాలొస్తాయని తాజాగా పాశ్చాత్య మీడియా నమ్మబలుకుతోంది. అమెరికా అండదండలతో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు దండిగా ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణులు అందించటంతోపాటు రష్యాపై ఆంక్షలు కూడా విధించాయి. 1945 తర్వాత యూరోప్ దేశాలన్నీ చిక్కుకున్న ఈ భారీ యుద్ధం ఎటుపోతుందో, చివరికేమవుతుందో ఎవరి అవగాహనకూ అందటం లేదు. ఈమధ్యే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాటో కూటమి దేశాలను హెచ్చరించారు. తమ తమ జీడీపీల్లో రక్షణకు 2 శాతంకన్నా తక్కువ వ్యయం చేసే యూరోప్ దేశాలకు తాను గద్దెనెక్కిన తర్వాత సహకరించబోనని ప్రకటించారు. పైగా యూరోప్‌ను ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండ’ని రష్యాకు చెబుతానన్నారు. ఆయన మళ్లీ అ«ధ్యక్షుడు కావటం ఖాయమని దాదాపు సర్వేలన్నీ చెబుతున్నాయి. ఈనాటికీ 18 శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలో వుంది. అక్కడా, ఇతరచోట్లా ఉక్రెయిన్ పౌరులు భయంతో బతుకులీడుస్తున్నారు. అంతేకాదు... రష్యా క్షిపణి దాడులు జరిగిన ప్రతిసారీ సమీప బంధువులనూ, స్నేహితులనూ కూడా అనుమాన దృక్కులతో చూసే ధోరణి మొదలైంది. కొందరు రష్యాకు అమ్ముడుపోయి క్షిపణి దాడులకు కారణమవుతున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. ఇరాన్, ఉత్తర కొరియాలు రష్యాకు అవసరమైన డ్రోన్లు, క్షిపణులు అందిస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనే సైనికులకు అవసరమైన సామగ్రిని తుర్కియే సరఫరా చేస్తోంది. చైనానుంచి పేలుడు పదార్థాల్లో వినియోగించే రసాయనాలు వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి మొదలుకొని ఇంతవరకూ రష్యా ఆదాయాన్ని 433 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 35,500 కోట్లు) గండికొట్టగలిగామని పాశ్చాత్య దేశాలు సంబరపడుతున్నా రష్యా దూకుడు తగ్గలేదు. యుద్ధరంగంలో రష్యా వినియోగిస్తున్న ఆయుధాల్లోని 95 శాతం విడిభాగాలు అమెరికా, పాశ్చాత్య దేశాల్లో తయారైనవేనన్నది కియూవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యయన సారాంశం. సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ చెప్తున్న ప్రకారం ఇంతవరకూ 3,15,000 మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో మరణించటమో, గాయపడటమో జరిగింది. మూడింట రెండువంతుల శతఘ్నులుధ్వంసమయ్యాయి. రక్షణ కేటాయింపులు పెంచే విధానానికి స్వస్తిచెప్పి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని యుద్ధకాల ఆర్థిక వ్యవస్థగా (వార్ ఎకానమీ) రష్యా మార్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థతగల నాయకుడనీ, యుద్ధ హీరో అని పాశ్చాత్య మీడియా కీర్తించటంవల్ల ఒరిగేదేమిటో అర్థంకాదు. గతంతో పోలిస్తే ఆయన రేటింగ్స్ పడిపోయాయన్నది వాస్తవం. ముఖ్యంగా కమాండర్ ఇన్ చీఫ్ జలూజినీని తొలగించటం, కియూవ్ నగర మేయర్‌తో విభేదాలు జెలెన్స్కీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌కు మరో ఆరువేల కోట్ల డాలర్ల ఆర్థిక సాయానికి అమెరికా సెనేట్ గతవారం అంగీకారం తెలిపినా రిపబ్లికన్లకు ఆధిక్యతవున్న ప్రతినిధుల సభలో ఏమవుతుందో తెలియదు. కొత్త ఆయుధాల సరఫరాకు ఇప్పటికే రిపబ్లికన్లు బ్రేక్ వేశారు. ఉక్రెయిన్‌కు అందించదలచుకున్న సాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను వెదకాలన్న సూచనలు రావటం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సమస్యాత్మకమే. ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించి, యుద్ధ నేరాలకు మూల్యం చెల్లించేలా రష్యాపై అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిళ్లు పెంచటమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఈ బాధ్యతను అమెరికా, పాశ్చాత్య దేశాలు విస్మరిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలందిస్తూ పోతే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల ఆయుధ పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయితప్ప ఒరిగేదేమీ వుండదు. ఉక్రెయిన్ గెలుపు గురించీ, రష్యాపై తీసుకునే చర్యల గురించీ ఆర్భాటంగా మాట్లాడుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు యుద్ధం మొదలై రెండేళ్లవుతున్నా తమ దేశాల్లోని రష్యా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటంలో వెనకడుగేస్తున్నాయి. వివిధ ఫైనాన్షియల్ కంపెనీల్లో వున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన రష్యా ఆస్తుల్ని యుద్ధం మొదలైన రోజుల్లోనే స్తంభింపజేశారు. కానీ వాటì స్వాధీన ప్రక్రియను ప్రారంభిస్తే డాలర్ల రూపంలో నిధులు డిపాజిట్ చేసే విధానానికి చాలా దేశాలు స్వస్తి చెబుతాయన్న భయం అమెరికాకు ఉంది. ఇలా తమ ఆర్థిక వ్యవస్థల గురించీ, భవిష్యత్తు గురించీ ఆచి తూచి అడుగు లేస్తున్న సంపన్న దేశాలు ఈ యుద్ధాన్ని ఆపటంపై మాత్రం దృష్టి సారించటం లేదు. ఉక్రెయిన్ పోరునూ, గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దారుణ మారణకాండనూ ఇకనైనా నిలువరించకపోతే అన్ని దేశాలూ పెను సంక్షోభంలో కూరుకుపోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూడటం అందరి కర్తవ్యం కావాలి.