-
AP: సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్ల కన్ను
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్లు కన్ను పడింది. అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యా దీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాలు వస్తున్నాయా అంటూ ఫోన్ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏదైనా పథకం రాక పోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ కేటుగాళ్లు లింక్ పంపిస్తున్నారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్ చేసి అమాయకుల్ని నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి లాంటి ఫోన్ కాల్స్ నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు తెలిపారు. -
టీడీపీ-జనసేన శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. ఇక పొత్తులో ఉన్న టీడీపీ జనసేన శ్రేణులు రేపటి కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం జడ్జిమెంట్ రానుంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించనుంది. స్కిల్ స్కామ్‌లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 16న(రేపు) తీర్పు వెలువరించనుంది. ఈ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన తర్వాతే.. ఫైబర్‌నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానుంది. దీంతో.. ఈలోపే 17-ఏ పిటిషన్‌పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనుంది. అంత త్వరగా క్వాష్ కోరడమా? ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట కుట్రపూరితంగా భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది నేర పరిశోధన విభాగం(CID). ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. విజయవాడలోని అవినీతి నిరోధక న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) కోర్టులో ప్రవేశపెట్టాగా.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు పలుమార్లు పొడిగించుకుంటూ వెళ్లింది. చివరకు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి కంటి సర్జరీ, చికిత్స లాంటి కారణాల విజ్ఞప్తి దృష్ట్యా.. మానవతా దృక్ఫథంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపై.. హైకోర్టులోనే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. అయితే.. ఈ మధ్యలో స్కిల్ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ, జస్టిస్ శ్రీనివాసరెడ్డి పిటిషన్ కొట్టేయడంతో బాబుకు ఉన్నతన్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయించారు. తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అక్కడ సుదీర్ఘమైన వాదనలే జరిగాయి. ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీలు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారు వాళ్లంతా. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్‌లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని సీఐడీ తరఫున వాదించారు . క్వాష్ పిటిషన్.. ఎప్పుడేం జరిగిందంటే.. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. ఆపై ఐదుసార్లు రిమాండ్ పొడిగింపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహా బ్లాక్‌లో ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ సెప్టెంబర్ 13వ తేదీ విచారణకు స్వీకరించిన హైకోర్టు సెప్టెంబర్ 19వ తేదీన వాదనలు వినిపించిన బాబు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ సెప్టెంబర్ 22వ తేదీన.. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు క్వాష్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్.. మర్నాడు మెన్షన్ చేయాలన్న సీజేఐ 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన బాబు క్వాష్ పిటిషన్ ట్విస్ట్ ఇస్తూ.. ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ భట్ మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు అత్యవసరంగా తీసుకెళ్లిన బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా అక్టోబర్ 3వ తేదీకి చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా అక్టోబర్ 3వ తేదీన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్ అక్టోబర్ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు అక్టోబర్ 13వ స్కిల్ పిటిషన్‌కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్ స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్ అక్టోబర్ 17వ తేదీన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం బెంచ్ నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ పిటిషన్‌పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామని దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా అక్టోబర్ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద బయటకు మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం బెంచ్ అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు శీతాకాల సెలవుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన స్కిల్ కేసు తీర్పు ఎట్టకేలకు ఈనెల 16న వెలువడనున్న తీర్పు జరిగింది ఇదే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి ఉన్నారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత
నగరంపాలెం: తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల చందాలు వసూలు చేసిందని, దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశానని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తెలిపారు. గుంటూరు లక్ష్మీపురంలోని నివాసంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 13న గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారన్నారు. వైజాగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని, లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. తన ప్రాణానికి ఏదైనా జరిగితే అందుకు నారా లోకేశ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి కొత్తకాదని, అందులో భాగంగానే రాయపాటి శైలజతో మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్ ఎక్కడా గెలవడని జ్యోస్యం చెప్పారు. యువగళానికి ఒక్క రోజు కూడా తాను వెళ్ళలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలిచి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని పేర్కొన్నారు. -
AP: విశాఖలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ స్కామ్ వైజాగ్‌లో కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో వైజాక్‌కు చెందిన అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్‌ను ఈడీ తాజాగా అదుపులోకి తీసుకుంది. నితిన్, అమిత్‌లు టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో వైజాగ్‌లో కంపెనీ ఏర్పాటు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను ఈ కంపెనీ ఖాతాలను వినియోగించి వీరిద్దరు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్లోలో వచ్చిన నిధులతో ఆస్తులు కొనుగోలు చేశారు. భార్యల పేరు మీద ఈ ఆస్తులన్నీ ఉంచారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్కు ఈ కేసులో ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కేసు అక్కడ పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఇదీచదవండి.. పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా -
పండుగపూట విషాదం.. అక్కాచెల్లెళ్లు ముగ్గు వేస్తుండగా..
సాక్షి, ఏలూరు జిల్లా: మండపల్లి మండలం కానుకొల్లులో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి సడన్‌గా ఇటుక లోడుతో వెళుతున్న లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(16), పల్లవి దుర్గ(18) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అడ్డంగా దొరికిన ‘రింగ్’ మాస్టర్
సాక్షి, అమరావతి: కట్టని రాజధాని.. నిర్మించని ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు చెలరేగిపోయారు. రాజధాని అమరావతి ముసుగులో యథేచ్ఛగా భూ దందా సాగించారు. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తనకే సాధ్యమని నిరూపించారు. గత ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం కొసమెరుపు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా వెలికి తీసి కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీది అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్‌లో పొందు పరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు భూములు ► ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ► 2014 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ► క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. పవన్ కల్యాణ్‌కూ 2.40 ఎకరాల ప్యాకేజీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే ► సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ► దీంతో ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఐఆర్ఆర్ కేసులో నిందితులు ఏ–1: చంద్రబాబు ఏ–2: నారాయణ ఏ–3: లింగమనేని రమేశ్ ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్) ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ ఏ–14: లోకేశ్ బాబు, నారాయణ ఆస్తుల అటాచ్మెంట్ క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
Vishaka: స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం( జనవరి 13) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్లాంటుకు చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ప్లాంటులో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇదీచదవండి.. లొంగిపోయి పూచికత్తులు సమర్పించిన చంద్రబాబు -
Chandrababu: లొంగిపోయి పూచీకత్తుల సమర్పణ
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనపై దాఖలైన మూడు కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని నేర పరిశోధన సంస్థ(సీఐడీ) కార్యాలయం, తాడేపల్లి సిట్, గుంటూరు సీఐడీ ఆఫీసుల్లో ఆయా కేసుల్లో శనివారం లొంగిపోయిన ఆయన.. పూచీకత్తులు, బాండ్ షూరిటీలు సమర్పించారు. ముందుగా విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ ఆఫీస్‌కు వెళ్లిన చంద్రబాబు.. ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ అభిమానులకు ఆయన అభివాదం చేశారు. అక్కడి నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు.. ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఆపై పూచీకత్తులు సమర్పించారు. చివరగా గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత.. మద్యం పాలసీ కేసులో ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో అధికారులకు ష్యూరిటీ సమర్పించారు. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు ‘పూచీకత్తు’ సంతకాలు చేశారు. ఇసుకాసురుడి అవతారంలో చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
3 కేసుల్లో నేడు సీఐడీ ఎదుట బాబు హాజరు
సాక్షి, అమరావతి: మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్దకు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్నారు. బాబు హాయాంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు చేయగా.. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది. ఉ. 11 గంటల తర్వాత మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయానికి, ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3.30 గంటలకు, ఐఆర్ఆర్ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు. -
బాబుకి ముందస్తు: ఆ మూడు కేసుల్లో జరిగింది ఇదే!
గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నాం తీర్పు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ(సీఐడీ) చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇసుకను అలా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
విజయవాడరూరల్: అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం నున్న పోలీసు స్టేషన్ పరిధి శాంతినగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పాయకాపురం శాంతినగర్‌కు చెందిన అంబటి ప్రతాప్‌కుమార్ ఫ్లవర్ డెకరేషన్ వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య అంబటి సాయికన్య(32) చీటీల వ్యాపారం చేస్తుంటుంది. వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు పెరిగిపోవడంతో, అవి తీర్చే మార్గం లేక మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి బెడ్రూమ్లో పడిపోయారు. వారి పిల్లలు చూసి పక్కింటివారికి చెప్పగా వారు వచ్చి దంపతులిద్దరినీ చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారిని పరిశీలించి సాయికన్య చనిపోయిందని నిర్ధారించారు. మృత్యువుతో పోరాడుతున్న ప్రతాప్కుమార్కు చికిత్స అందిస్తున్నారు. ప్రతాప్‌కుమార్ అన్న ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తలనరికి తెస్తే రూ.కోటి ఇస్తామన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 న్యూస్ యాంకర్ సాంబశివరావులను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 5.30 గంటలపాటు వారిద్దరిని కలిపి, విడివిడిగానూ విచారించారు. టీవీ 5 చానల్ నిర్వహించిన డిబేట్ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూర్వకంగానే కొలికపూడి శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలు చేశారని రామ్‌గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయన పేర్కొన్న కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు, టీవీ 5 చానల్ ఎండీ, చీఫ్ ఎడిటర్ బి.ఆర్.నాయుడు, న్యూస్ యాంకర్ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ 5 మేనేజింగ్ ఎడిటర్లపై పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 3న కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ అధికారులు మొదటి దఫా విచారించారు. కాగా ఆరోజు న్యూస్ యాంకర్ సాంబశివరావు విచారణకు హాజరుకాలేదు. దాంతో వారిద్దరిని సోమవారం సీఐడీ అధికారులు విచారించారు. ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా.. సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూడదన్న అవగాహన లేదా..? అంటూ వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సీఐడీ అధికారుల ప్రశ్నలకు కొలికపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అందుకు వారిద్దరూ సమ్మతించారు. -
రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నంద్యాల/హైదరాబాద్: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లతో చేతులు కలిపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ సోదరి సహకారంతో కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి సురేందర్‌ని రాయదుర్గం పిలిపించిన సోదరి.. కిడ్నాపర్లకు అప్పగించింది. సురేందర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకున్న కిడ్నాపర్లు.. నల్లమల వైపు తీసుకెళ్లారు. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్‌కి పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్‌ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. సాప్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి నల్లమల అడవులకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో కారును కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఫారెస్ట్ సిబ్బంది ఆపి తనిఖీ చేయగా, కారు,బాధితుని వదిలేసి కిడ్నాపర్లు పారిపోయారు. ఒక కిడ్నాపర్‌ను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులకు పారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో సురేందర్‌ను క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాప్ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ స్పాట్‌కు సురేంద్‌ను తరలించిన పోలీసులు.. సోదరి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. సురేందర్ నుంచి ఆరు గంటల పాటు వివరాలు సేకరించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. భారీగా డబ్బులు వసూలు చేయడానికే కిడ్నాప్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది.. -
యానాం: బోటులో మంటలు.. ఒకరు సజీవదహనం
సాక్షి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. యానాంలోని దరియాలతిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న వ్యక్తి సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం.. యానాంలో బోటు ప్రమాదం జరిగింది. దరియాలతిప్ప వద్ద బోటులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న గంగాద్రి అనే వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక, ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది నుంచి దరియాలతిప్పకు వచ్చినట్టు గుర్తించారు. -
AP: ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు.. లారీని ఢీకొట్టిన కారు
సాక్షి, నెల్లూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, పర్వతరెడ్డి పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలోని రేగడిచెలిక దగ్గర ఆగి ఉన్న కంటైనర్ లారీని ఆయన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పర్వతరెడ్డికి తీవ్రంగా గాయపడగా.. కారులో ఉన్న ఆయన పీఏ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. ఇక, వారు విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం, పర్వతరెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు చికిత్స అనంతరం.. మెడికల్ సూపరింటెండెంట్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి కారు అద్దాలు గుచ్చుకోవడంతో తల భాగంలో గాయాలు ఉన్నాయి. అన్ని పరీక్షలు నిర్వహించాం. బ్రెయిన్, చెస్ట్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెన్నునొప్పి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి ప్రమాదం లేదు. రెండు వారాలు విశ్రాంతి అవసరం అని తెలిపారు. -
ఎంపీ నందిగం సురేశ్ కారును ఢీకొట్టే ప్రయత్నం
తాడేపల్లి రూరల్: దళిత ఎంపీ నందిగం సురేష్ కారును మరో కారుతో ఢీకొట్టేందుకు మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. బాపట్ల ఎంపీ సురేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అమరావతి కరకట్ట వెంబడి ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బిబి1 మధ్య జరిగిన ఈ సంఘటనలో ఎంపీ కారును ఢీకొట్టబోయిన కారులో ఉన్నవారు బొటనవేలు, చిటికెనవేలు చూపిస్తూ, చూపుడు వేలుతో వార్నింగ్ ఇచ్చి ప్రకాశం బ్యారేజ్ వైపు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్ పీఎస్వో బషీర్ తెలిపిన వివరాల మేరకు.. సురేష్ కాన్వాయ్ కరకట్ట మీదుగా వెళుతున్న సమయంలో ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఉద్దేశపూర్వకంగా ఏపీ16 జెఎఫ్ 0828 గల కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఆపి ఉన్న కారు ఒక్కసారిగా రోడ్డు మీదుగా వచ్చి ఎస్కార్ట్ వాహనాన్ని, సురేష్ కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. డ్రైవర్ అప్రమత్తమై కారును కంట్రోల్ చేశారు. లేకపోతే కారు కరకట్ట మీద నుంచి 30 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయేది. ఏపీ16 జెఎఫ్ 0828 కారులో డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి కారు అద్దాలు దించి చూపుడువేలుతో వార్నింగ్ ఇస్తూ, టీడీపీ సింబల్ అయిన విక్టరీ సింబల్ చూపిస్తూ నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇస్తున్నట్లు సైగలు చేశాడు. వెళ్లిపోబోతున్న కారును ఆపడంతో అందులో ఉన్న వ్యక్తి కిందకు దిగి వేళ్లు చూపిస్తూ ఎంపీ అయితే ఏమిటి.. త్వరలోనే మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. కారుకు అడ్డుగా నిలిచిన బషీర్‌ను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్ వచ్చి కారులో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న వ్యక్తిని నువ్వెవరని ప్రశ్నించగా.. నీకు చెప్పేది ఏమిట్రా అంటూ కారు ఎక్కుతూ మరోసారి చేతివేళ్లు ఊపుతూ నీ సంగతి తేలుస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కారులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ ఘటనపై తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కారు నంబరు ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని బషీర్ తెలిపారు. -
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. రెండుకార్లలో కలిపి మరో 8మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను దివ్యప్రియ(25), రమాదేవి (50), గనిష్క (19 నెలలు)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు సైతం సహాయక చర్యలో పాల్గొన్నారు. చదవండి: TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు… pic.twitter.com/C48xYsOfY2— Telugu Scribe (@TeluguScribe) January 2, 2024 -
నూతన సంవత్సరంలో పెనువిషాదం
బేస్తవారిపేట/ఆగిరిపల్లి: నూతన సంవత్సరం వేళ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలంలోని పాపాయిపల్లెకు చెందిన నల్లబోతుల పవన్‌కళ్యాణ్ (19), పిక్కిలి రాహుల్ (19), గుజ్జుల శ్రీనివాసులు (20) స్నేహితులు. వీరు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై గిద్దలూరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో గిద్దలూరు నుంచి కంభం వైపు బొలేరో వాహనం (లగేజీ ట్రక్) వెళ్తోంది. బేస్తవారిపేట మండలంలోని చెట్టిచర్ల బస్టాండ్ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై బొలేరో, మోటార్ సైకిల్ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్‌పై పెట్రోల్ పడటంతో అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. బైక్‌పై ఉన్న రాహుల్, శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మోటార్ సైకిల్, బొలేరో వాహనం రెండూ మంటల్లో దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి.నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంభం అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలను కంభం ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పాపాయిపల్లె తీసుకెళ్లారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏలూరు జిల్లాలో బైక్ నేలబావిలో పడి ఇద్దరు యువకులు మృతి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో బైక్ నేలబావిలో పడి ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన తలశిల కృష్ణ చైతన్య (24), నున్న గ్రామానికి చెందిన శెట్టి సాయికుమార్ (24), నున్న రాకేష్ (25), మరో ఇద్దరు స్నేహితులతో కలసి ఆదివారం కనసానపల్లిలోని రాకేష్ మామిడి తోటలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఉదయం కృష్ణచైతన్య, సాయికుమార్, రాకేష్ ఒకే బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా, గేదె అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నేలబావిలోకి దూసుకుపోయింది. వీరి వెనుకే మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు స్నేహితులు గమనించి వెంటనే కనసానపల్లి సర్పంచ్ అమ్మిశెట్టి సంజీవరావు సాయంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీటిలో మునిగిపోవడంతో కృష్ణ చైతన్య, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రాకేష్‌ను బయటకు తీసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై ఎస్ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి/సత్తెనపల్లి : టీడీపీ, జనసేన మూకలు గుంటూరులో విధ్వంసానికి తెరలేపాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని కొత్త కార్యాలయంపై ఆ మూకలు రాళ్ల దాడిచేశాయి. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్రమౌళినగర్ మెయిన్‌రోడ్డులో మంత్రి రజిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ, జనసేన కార్యకర్తల ముసుగులో కొందరు గూండాలు పెద్ద సంఖ్యలో బైక్‌లపై ర్యాలీగా వచ్చారు. ముందుగా పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 12 గంటల తర్వాత కేక్ కటింగ్ నిర్వహించారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా.. తెలుగుదేశం, జనసేన జిందాబాద్.. అంటూ నినాదాలు చేస్తూ మంత్రి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయం మొత్తం టీడీపీ రౌడీమూకలు విసిరిన రాళ్లతో నిండిపోయింది. అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఆఫీసు సెక్యూరిటీ మాసారపు చిరంజీవి అడ్డుకోబోతే అతనిపైనా దాడిచేశారు. కార్యాలయం ప్రారంభానికి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ మూకలు చించివేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు మేడా ప్రకాష్, సాధు రఘు, మద్దులూరి రామబ్రహ్మం, పుల్లా రేవంత్, కోనేటి సాయిమణికంఠ, పాములపాటి రాంబాబుతోపాటు మరో 24 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు వంద మంది పాల్గొన్నట్లు పట్టాభిపురం పోలీసులు నిర్ధారించారు. మిగిలిన వారిపైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పథకం ప్రకారమే దాడి.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే.. మంత్రి రజినిని ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రమౌళినగర్లో పార్టీ కార్యాలయాన్ని ఆమె ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థులు దాడికి దిగినట్లు తెలిసింది. మరోవైపు.. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కూడా రజినిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని సహించలేని తెలుగుదేశం నేతలు ఈ దాడిని ప్రేరేపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీసీ మహిళపై టీడీపీ రౌడీయిజం : మంత్రి రజిని ఈ ఘటనపై మంత్రి రజిని స్పందిస్తూ.. తన పార్టీ కార్యాలయంపై దాడి టీడీపీ గూండాల అధికార దాహానికి పరాకాష్ట అని మండిప డ్డారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళ పోటీచేయడాన్ని చూసి తట్టుకోలేక టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారన్నారు. వారికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ధ్వంస రచనకు తెరతీశారని ఆమె ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్నారు. వాహనాల ద్వారా బస్తాల్లో రాళ్లు తీసుకొచ్చి పార్టీ కార్యాలయంపై విసిరారని.. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. మంత్రి కార్యాలయంపైనే టీడీపీ రౌడీమూకలు దాడులకు పాల్పడ్డాయంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణే ఉండదన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం పెడితే.. రాష్ట్రం సర్వనాశనమవుతుందని మంత్రి చెప్పారు. భౌతిక దాడులతో నైతికంగా తమను దెబ్బతీయాలని చూస్తున్నారని.. తమ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ఎవరి తరం కాదని రజిని హెచ్చరించారు. టీడీపీ దౌర్జన్యాలు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో గుంటూరు ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. దాడి దుర్మార్గం : ఎమ్మెల్యే మద్దాళి గిరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీ మహిళ పోటీచేయడాన్ని టీడీపీ గూండాలు సహించలేకపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి తెలిపారు. బీసీలను అందలం ఎక్కిస్తామంటూ ఓ పక్క మాయమాటలు చెబుతూ మరోవైపు బీసీలపై ఇలా దాడులకు తెగబడటం టీడీపీకే చెల్లిందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేసిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. బలహీనవర్గాలపై టీడీపీ, జనసేన దాడులు : మంత్రి జోగి ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ కూడా స్పందిస్తూ.. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల వారు సంఘ విద్రోహశక్తులుగా, గూండాలుగా మారి బలహీనవర్గాలపై దాడులకు తెగబడుతున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లు తమ శ్రేణులను రెచ్చగొడుతూ.. ఇతర పార్టీలపై దాడులు చేయిస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థిర నివాసం కూడా లేని వీరు సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న వీరికి రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెబుతారన్నారు. టీడీపీ, జనసేన కలిశాకే అరాచకాలు : మంత్రి అంబటి ఇక టీడీపీ, జనసేన పార్టీల కలయిక ప్రజాప్రయోజనాల కోసం కాదని, అరాచకం సృష్టించేందుకేనని.. గుంటూరులో బీసీ మహిళ మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఇందులో భాగమేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రజినీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం టీడీపీ దాష్టీకమని, దీనిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిన తర్వాతే అరాచకాలు పెరిగాయన్నారు. చంద్రబాబునాయుడు నిరాశా నిస్పృహల్లో ఉన్నాడని, పవన్‌కల్యాణ్ ఒక అరాచక శక్తి అని ఆయన నిప్పులు చెరిగారు. ‘ఎర్ర’బుక్కులో పేర్లు రాసుకుని అధికారంలోకి వస్తే అధికారుల తాటతీస్తానని లోకేశ్ హెచ్చరిస్తున్నాడని, టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పంను కనీసం మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్‌గా కూడా చేసుకోలేని చంద్రబాబుకి ఇప్పుడు ఎన్నికల ముందు అక్కడి ప్రజలు గుర్తుకొచ్చారని అంబటి విమర్శించారు. అంతకుముందు.. ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఏడాదంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. -
మంత్రి రజిని ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
అర్ధరాత్రి ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి
సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీసు అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం, జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై ఎల్లో బ్యాచ్ రాళ్లు విసిరారు. అనంతరం, మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే, మంత్రి రజిని ఈరోజు గుంటూరు వెస్ట్‌లో ఏర్పాటు చేసిన తన ఆఫీసును ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో దాడి జరిగింది. -
భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా!
చిల్లకూరు(తిరుపతి జిల్లా): కష్టసుఖాల్లో ఇన్నాళ్లూ తనతో పాటు నడిచిన తన అర్ధాంగి మృతిని భర్త తట్టుకోలేకపోయాడు. భార్య మరణించిన కొద్ది సేపటికే తాను ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు దళితవాడలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కడివేడు గ్రామానికి చెందిన పల్లిపాటి నాగూరయ్య(68), రమణమ్మ(60)లు భార్యా భర్తలు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు. వీరందరికి వివాహాలు జరిపించి మనవళ్లు, మనమరాళ్లతో సంతోషంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా, రమణమ్మకు ఇటీవల ఆరోగ్యం దెబ్బతిని మంచానికే పరిమితమైంది. వృద్ధాప్యంలోనూ నాగూరయ్య కూలి పనులకు వెళ్లి.. వచ్చిన డబ్బుకు తోడు ప్రభుత్వం అందించే పింఛన్‌తో ఆమెకు వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె శనివారం వేకువజామున ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గమనించిన రమణయ్య.. కుటుంబ సభ్యులను మేల్కొలిపి, తాను ఓ చోట అలా కూర్చుండి పోయాడు. నిద్ర లేచిన దగ్గర్నుంచి ఏమీ మాట్లాడకుండా ఉన్నాడని.. కుమారులు తండ్రి దగ్గరకు వెళ్లి కదిలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచి ఉన్నాడు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. -
కోడెల శివరామ్ వేధింపులతోనే మా బిడ్డ ఆత్మహత్య
పట్నంబజారు: కోడెల శివరామ్ వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మృతుడి తల్లి విలపిస్తున్నారు. మేడికొండూరు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన కొల్లోజు ఫణీంద్రసాయి(22) నాలుగేళ్ల కిందట గుంటూరు నాజ్‌సెంటర్ డీమార్ట్‌లో గేట్ ఇన్చార్జిగా పనిలో చేరి సూపర్వైజర్గా ఎదిగాడు. కోడెల శివరామ్‌కు సంబంధించి వ్యక్తిగత పనులు కూడా చూస్తుండేవాడు. నగదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని కనస్ట్రక్షన్లకు చెందినవి కూడా చూస్తుంటాడు. కొంతకాలం కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెల్ స్విచ్ఛాఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో డీమార్ట్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డాకవచ్చిన ఫణీంద్రసాయి.. రూ.2 లక్షలను తిరిగి ఇచ్చారని సాటి ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం పలు కారణాల రీత్యా ఫణీంద్ర అక్కడ ఉద్యోగం మానేశాడు. కొద్ది రోజుల తర్వాత యాజమాన్యం పిలిపించి తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంది. ఈ నెల ప్రారంభంలో తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కోడెల శివరామ్ అనుచరుడైన నాయక్ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి ఫణీంద్రను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించాడు. ఉద్యోగానికి రావాలని లేకుంటే సార్ ఊరుకోరని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివరామ్, నాయక్‌లు అకారణంగా వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కొల్లోజు నాగమణి ఆరోపిస్తున్నారు. నిత్యం నాయక్ వచ్చి, కోడెల శివరామ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడే వాడంటూ ఆమె విలపించారు. తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరామ్, అతని అనుచరుడు నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
చిత్తూరు జిల్లా: దళితులపై టీడీపీ వర్గాల దాడి
గంగవరం(చిత్తూరు జిల్లా): దళితులపై టీడీపీకి చెందిన అగ్రవర్ణాలవారు దాడులకు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం మీడియా ఎదుట బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువారిపేట దళితవాడలో దాదాపు 30 ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటున్నారు. వీళ్లందరికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ అంటే అమితమైన అభిమానం.దీన్ని జీర్ణించుకోలేని ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన అగ్ర కులస్థులు నిత్యం కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటివి పరిపాటిగా సాగిస్తున్నారు. బుధవారం రాత్రి వారు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటుండగా.. టీడీపీకి చెందిన అల్లరిమూకలు దుర్గ, గోవర్ధన్, రాకేష్ మరి కొంతమంది అనుచరులతో వెళ్లి అక్కడ గొడవలు సృష్టించారు. ఇంతలో రవి అనే వ్యక్తి అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అందరూ కలిసి అతనిపై పైశాచికంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళల పైనా దాడులకు పాల్పడి కులం పేరుతో దూషించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు దళితులపై దాడి విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్ఐ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇదీ చదవండి: మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం -
అనకాపల్లి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను రామకృష్ణ, దేవి, వైష్ణవి, జాహ్నవిగా గుర్తించారు. అప్పులు బాధలు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.