► బడ్జెట్‌లో రూ. 3,800 కోట్ల కేటాయింపు
► కొత్త సచివాలయానికి రూ.50 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులను ఆకట్టు కోడానికి మెరుగైన రహదారి వ్యవస్థ ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం.. నిధుల కేటాయింపులో మాత్రం ఔదార్యం చూపలేదు. గత బడ్జెట్‌లో తక్కువ నిధులే కేటాయించింది. ఈసారి ఇంచుమించు అంతే నిధులతో సరిపెట్టింది. రవాణా, రోడ్లు భవనాల నిర్మాణానికి సంబంధించి తాజా బడ్జెట్‌లో రూ.5,033 కోట్లు కేటాయిస్తున్నట్లు పద్దుల్లో చూపింది. అందులో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు మాత్రం రూ.2700 కోట్లు మాత్రమే. జిల్లా రహదారులకు రూ.725 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్ల రోడ్ల కు రూ.350 కోట్లు, కోర్ నెట్‌వర్క్ రోడ్లకు రూ.320 కోట్లు, వంతెనలకు రూ.295 కోట్లు కేటాయించారు. గజ్వేల్, ఇతర అనుసంధాన రహదారుల ప్రాంత అభివృద్ధి అథారిటీకి రూ.50 కోట్లు, రేడియల్ రోడ్స్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. భవనాల విభాగానికి రూ.1,100 కోట్లు కేటాయించారు.
కొత్త సచివాలయంలో ఆచితూచి..
కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. తాజా బడ్జెట్‌లో కొత్త సచివాలయం కోసం రూ.50 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లోనూ ఇంతే కేటాయించారు. ఇక కొత్త జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించారు.
ఎమ్మెల్యేల ఇళ్లకు రూ.30 కోట్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం భవనం కోసం రూ.కోటి, తెలంగాణ జర్నలిస్టుల భవనాల కోసం రూ.10 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణం కోసం రూ.25 లక్షలు, తెలంగాణ కళాభారతి భవనానికి రూ.10 కోట్లు, సీనియర్ అధికారుల కొత్త నివాస గృహాల క్వార్టర్లకు రూ.122 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యేల ఇళ్ల కోసం రూ.30 కోట్లు, రాజ్‌భవన్‌లో కొత్త భవనాల కోసం రూ.40 కోట్లు కేటాయించారు.
రోడ్లు భవనాలకు మోస్తరే...
Published Tue, Mar 14 2017 2:33 AM | Last Updated on Sat, Sep 15 2018 8:38 PM
Advertisement
Advertisement