Hima Das
-
హిమా దాస్‌పై తాత్కాలిక నిషేధం
భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. గత ఏడాది కాలంలో డోపింగ్ పరీక్షల కోసం ఆమె తన ఆచూకీ వివరాలు ‘నాడా’కు ఇవ్వకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. నిబంధనల ప్రకారం హిమా దాస్ రెండేళ్ల నిషేధం ఎదుర్కోవచ్చు. అస్సాంకు చెందిన 23 ఏళ్ల హిమ 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల విభాగంలో రజతం, మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించింది. -
CWG 2022: హిమ దాస్ స్వర్ణం గెలవలే.. నెట్టింట వైరలవుతున్న ఫేక్ ట్వీట్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ స్వర్ణ పతకం (400 మీటర్ల పరుగు పందెం) నెగ్గిందన్న వార్త కొద్దిసేపటి క్రితం నెట్టింట హల్చల్ చేసింది. హిమ స్వర్ణం గెలిచిందన్న ఆనందంలో చాలామంది భారతీయులు ఆమెకు రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వార్త ఫేక్ అని తేలడంతో వారంతా నాలుక్కరచుకుని తమ పోస్ట్‌లను డిలీట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలా చేసిన వారిలో మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు. సరైన ఫాలో అప్ లేక ఇలాంటి ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేసినందుకు గాను వారంతా పశ్చాత్తాప పడుతున్నారు. అసలు కామన్వెల్త్ క్రీడల్లో ఇవాళ (జులై 30) హిమ దాస్ ఈవెంటే లేకపోవడం ఓ విషయమైతే.. హిమ స్వర్ణం నెగ్గినట్లు చెబుతున్న 400 మీటర్ల రేసులో ఆమె పాల్గొనకపోవడం మరో విశేషం. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల్లో ఇవాళ భారత్ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించి భారత్‌కు తొలి పతకం అందించాడు. Hima das has not started her campaign yet. Why so hurry Mr Patra and Mr Sehwag. An old video is prompting many to tweet this fake news. Now they have deleted the tweet. She is participating in 200m and 4*100m relay. @sambitswaraj @virendersehwag #HimaDas #CommonwealthGames2022 pic.twitter.com/4dxegSWMca— Pankaj Priyadershi (@BBCPankajP) July 30, 2022 చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం -
Hima Das: స్టార్ అథ్లెట్ హిమా దాస్‌కు కరోనా...
Hima Das Tests Covid-19 Positive: భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్ బుధవారం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తొడ కండరాల గాయం కారణంగా టోక్యో ఒలిపింక్స్‌కు ఆర్హత సాధించలేకపోయిన హిమా.. ప్రస్తుతం పాటియాలాలోని నేషనల్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణైంది 'నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఆరోగ్యం బాగానే ఉంది. మునుపటి కంటే బలంగా తిరిగి రావడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి." అని హిమదాస్ ట్వీట్ చేసింది. హిమాదాస్ 2018లో అండర్-20 ప్రపంచ చాంపియన్ షిప్లో 400 మీటర్ల ఈవెంట్లో విజయం సాధించింది. దాంతో ఈ ఈవెంట్లో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఈక్రమంలోనే హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో గౌరవించింది. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. -
డీఎస్పీగా హిమా దాస్ నియామకం ఫోటోలు
-
డీఎస్పీగా హిమా దాస్ నియామకం
డిస్పూర్: భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం ఉన్నతోద్యోగంతో గౌరవించింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పదవిలో నియమించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో 21 ఏళ్ల హిమా దాస్‌కు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నియామక పత్రాలు అందజేశారు. 2018లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో హిమా 400 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Welcome Aboard! Heartiest Congratulations to @HimaDas8 and all 597 newly selected Sub Inspectors of Assam Police. Together, we'll write a new saga of people friendly policing in the State, to serve the citizens of Assam.@CMOfficeAssam @DGPAssamPolice#SIsRecruitment pic.twitter.com/KBeFUGHLuW — Assam Police (@assampolice) February 26, 2021 -
డీఎస్పీగా హిమదాస్
భారత యువ అథ్లెట్ హిమ దాస్‌ను ప్రోత్సహిస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన ఈ అమ్మాయి ప్రస్తుతం 400 మీటర్ల పరుగు జూనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్ కూడా. -
స్ప్రింటర్ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు
గౌహతి: స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. లీస్, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి విలేకరులకు తెలిపారు. అసోం పోలీస్ విభాగంలో డీఎస్పీ ర్యాంకు అధికారిగా హిమదాస్‌ను.. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్ స్పింటర్ 2018లో అద్భుతంగా రాణించింది. ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4*400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 చాంపియన్ షిప్స్‌లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్ ఏదైనా ఫార్మాట్లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది. -
అథ్లెట్ల భోజనంలో వెంట్రుకలు, గోళ్లు...
న్యూఢిల్లీ : పాటియాలాలోని నేతాజీ సుభాష్ జాతీయ క్రీడాసంస్థ (ఎన్ఎస్–ఎన్ఐఎస్) డొల్లతనం బయటపడింది. ఇటీవలే అక్కడి సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో పాటు ఇద్దరు బాక్సర్లు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ వార్తలు రాగా... తాజాగా అథ్లెట్లకు అందించే ఆహారం మరీ నాసిరకంగా ఉన్నట్లు తెలిసింది. భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో పాటు ఇతర అథ్లెట్లు ఆహారం నాణ్యతపై, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. తనకు అందించిన ఆహారంలో వెంట్రుకలు, గోళ్లు ఉండటంతో హిమదాస్ ఈ అంశాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వాటి ఫోటోలను కెమెరాతో చిత్రీకరించిన హిమ ఆ దృశ్యాలను ఎన్ఐఎస్ పాలక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిందంట. (నా మనసు చెబుతోంది అది కుట్రేనని...) ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కిరణ్ రిజుజు వెంటనే భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను మందలించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ‘ఎన్ఐఎస్ భోజనశాలలో అపరిశుభ్రత, ఆహారం నాసిరకంగా ఉండటంపై అథ్లెట్లు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకున్నాం. అథ్లెట్లు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం. ఆటగాళ్ల అవసరాలకు అనుగుణంగా వారికి అందించాల్సిన ఆహారం నాణ్యత, పరిమాణంపై సూచనలు జారీ చేశాం. ఇప్పుడు వారికి అందుతున్న ఆహారం పట్ల అథ్లెట్లు కూడా సంతోషంగా ఉన్నారు’ అని ‘సాయ్’ పేర్కొంది. (ఫ్రెంచ్ ఓపెన్‌కూ యాష్లే బార్టీ దూరం) -
రజతం స్వర్ణంగా మారింది...
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల జాబితాలో మరొకటి అదనంగా చేరింది. నాడు లభించిన రజతమే ఇప్పుడు స్వర్ణంగా మారింది. 4గీ400 మిక్స్డ్ రిలే ఈవెంట్లో భారత బృందం రెండో స్థానంలో (3 నిమిషాల 15.71 సెకన్లు) నిలిచింది. బహ్రెయిన్ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్ టీమ్ (3 నిమిషాల 19.52 సెకన్లు) కాంస్యం సాధించింది. అయితే బహ్రెయిన్ జట్టులో సభ్యుడైన కెమీ అడికోయా డోపింగ్‌లో పట్టుబడ్డాడు. అతనిపై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నాలుగేళ్ల నిషేధం విధించింది. ఫలితంగా బహ్రెయిన్‌ను డిస్క్వాలిఫై చేస్తూ భారత్‌కు బంగారు పతకాన్ని ప్రకటించారు. ఈ స్వర్ణం గెలుచుకున్న బృందంలో మొహమ్మద్ అనస్, అరోకియా రాజీవ్, హిమ దాస్, పూవమ్మ సభ్యులుగా ఉన్నారు. మరో కాంస్యం కూడా... మరో భారత అథ్లెట్ అను రాఘవన్ ఖాతాలో కూడా ఇదే తరహాలో కాంస్య పతకం చేరింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను 4వ స్థానంలో నిలిచింది. ఈ రేస్ గెలిచిన అడెకోయాపై కూడా నిషేధం పడటంతో అనుకు కాంస్య పతకం లభించింది. -
‘ఖేల్‌రత్న’కు హిమదాస్
న్యూఢిల్లీ: భారత యువ స్ప్రింటర్ హిమదాస్ ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అవార్డు బరిలో నిలిచింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్ పేరును కేంద్ర క్రీడాశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమ ఘనత వహించింది. 2018లో అద్భుతంగా రాణించిన హిమ.... ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4్ఠ400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఆ తర్వాత 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 4్ఠ400మీ. మహిళల రిలేలో పసిడిని గెలుపొందింది. ప్రస్తుతం ఆమె ఈ అవార్డు కోసం నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోయర్), వినేశ్ ఫొగాట్ (రెజ్లర్), మనికా బత్రా (టీటీ), రాణి రాంపాల్ (హాకీ), రోహిత్ శర్మ (క్రికెట్)లతో పోటీపడనుంది. -
అప్పుడు నేను... ఇప్పుడు అడిడాస్
న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ హిమ దాస్ ‘అడిడాస్’ పేరుపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భారత సీనియర్ క్రికెటర్ రైనాతో ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసింది. ఈ సంభాషణలో ఆ సంగతి చెబుతూ ‘పందెం కోసం నా పరుగు ఉట్టి పాదాలతోనే మొదలైంది. ఎలాంటి బూట్లు, పాదరక్షల్లేవ్. అయితే నేను పాల్గొనే తొలి జాతీయ పోటీల కోసం నా తండ్రి తన స్తోమతకు తగిన సాదాసీదా స్పైక్ బూట్లను తెచ్చాడు. అయితే వాటిపై నేను చేతితో అడిడాస్ అనే బ్రాండ్ పేరు రాసి పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు అదే అడిడాస్ నాకు స్పాన్సర్ చేసిన కిట్‌పై నా పేరు రాసివ్వడం గొప్ప అనుభూతినిచ్చింది. షూస్‌పై హిమ దాస్ అని ఉండటం చూసిన నాకు అప్పటి అనుభవం గుర్తొచ్చింది’ అని చెప్పింది. 20 ఏళ్ల హిమ 2018లో ఫిన్లాండ్లో జరిగిన ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేసులో పసిడి పతకం గెలిచింది. దీంతో ప్రముఖ షూ కంపెనీ అడిడాస్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన షూస్‌లపై హిమ పేరు రాసింది. -
‘మనకు సేవ చేసే వారిపై దాడులా’
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాల ప్రముఖులతో సమాలోచనలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా వివిధ క్రీడలకు సంబంధించిన పలువురితో శుక్రవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇందులో సచిన్, సౌరవ్ గంగూలీ, కోహ్లి వంటి క్రికెటర్లతో పాటు స్ప్రింటర్ హిమదాస్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులు కూడా ఉన్నారు. (40 మంది క్రీడా ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్) ప్రధానితో వీడియో సమావేశం అనంతరం హిమదాస్ మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. ‘క్రీడాకారులకు ప్రస్తుత పరిస్థితిని వివరించి మాతో మాట్లాడినందుకు తొలుత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు. కష్టకాలంలో సేవలందిస్తున్న సిబ్బందిపై దాడులు జరుగడం చూస్తుంటే చాలా బాధేస్తుంది. మనకు సేవ చేసే వారిపై దాడులా.. డాక్టర్లు, పోలీసులపై రాళ్లు రువ్వడం ఎంత మాత్రం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. ఇక మీరాబాయి చాను కూడా మాట్లాడుతూ.. ‘ లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. (ముందు నువ్వుండాలి.. ఆ తర్వాతే ఐపీఎల్: రైనా) ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మాట్లాడుతూ.. `లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిన అవసరముంది. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి` అని చెప్పారు. ఏప్రిల్ 5 వ తేదీన రాత్రి 9 గంటలకు ఇంట్లో క్యాండిల్, దీపాలు వెలిగించి కానీ ఫ్లాష్ లైట్‌తో కానీ తొమ్మిది నిమిషాల పాటు కరోనాపై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలపాలని చెప్పినట్లు మీరాబాయి చాను తెలిపారు. ఇక ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేయమని కూడా మోదీ చెప్పారన్నారు. ఇదే విషయాన్ని తాను ప్రజలకు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతీ ఒక్కరూ కరోనాపై పోరాటంలో మమేకం కావాలన్నారు. -
గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హిమదాస్
ప్రముఖ క్రీడా పానీయాలు, ఆహార ఉత్పత్తుల సంస్థ గ్యాటొరేడ్‌కు భారత వర్ధమాన అథ్లెట్ హిమదాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం ‘పెప్సీ కో ఇండియా’ గురువారం హిమదాస్‌తో ఒప్పందం చేసుకుంది. గ్యాటొరేడ్తో భాగస్వామ్యం పట్ల హిమదాస్ హర్షం వ్యక్తం చేసింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా ఉన్నారు. -
హిమ దాస్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: భారత యువ మహిళా అథ్లెట్ హిమ దాస్ మరోసారి మెరిసింది. చెక్ రిపబ్లిక్లో జరిగిన అథ్లెటికీ మిటింక్ రీటెర్ మీట్లో 300 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. గత నెలన్నర వ్యవధిలో యూరోపియన్ సర్క్యూట్లో హిమ దాస్కిది ఆరో స్వర్ణం కావడం విశేషం. అయితే వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియ న్షిప్కు మాత్రం హిమ ఇంకా అర్హత సాధించలేదు. -
'అస్సామి దాల్ వండడంలో తాను స్పెషలిస్ట్'
కేవలం మూడు వారాల వ్యవధిలో భారత స్ర్పింటర్ హిమదాస్ ఐదు గోల్డ్ మెడల్స్‌ను కొల్లగొట్టి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తాను స్వయంగా తయారు చేసిన 'అస్సామి దాల్' వంటకం వీడియో ట్విటర్ ద్వారా బయటికి రావడం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. యూరప్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో భాగంగా ఓ హోటల్ రూమ్‌లోనే ఈ వంటకాన్ని తయారు చేసినట్లు హిమదాస్ తెలిపారు. ఆరోజు ఆదివారం కావడం, ప్రాక్టీస్ కూడా లేకపోవడంతో 'అస్సామి దాల్'ను వండడం ద్వారా తన ఖాళీ సమయాన్ని ఆస్వాదించినట్లు దాస్ పేర్కొన్నారు. తనతో పాటు మరో భారతీయ అథ్లెట్ సరితాబెన్ గైక్వాడ్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. దేశం కాని దేశంలో తానే స్వయంగా వంట చేయడం నాకు మధురానుభుతి కలిగించిందని వెల్లడించారు. నాతో పాటు ఉన్నవారు అస్సామి దాల్ వంటకాన్ని తిని ఎంతో రుచిగా ఉందని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించినట్లు పేర్కొంది. ఇప్పటికే వరుసగా ఐదు గోల్డ్ మెడల్స్‌ను కొల్లగొట్టిన హిమదాస్ శనివారం పరాగ్వేలో జరగనున్న నోవ్మాస్టో అథ్లెటిక్స్‌లో పోటీ పడనుంది. 52.09 సెకన్లలో 400మీటర్ల రేసును పూర్తి చేసిన హిమదాస్ తాజాగా ఆ రికార్డును సవరిస్తుందేమో చూడాలి. -
సద్గురు ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలుచుకొని యావత్ భారతావని దృష్టిని ఆకర్షించిన అథ్లెట్ హిమ దాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సద్గురు ట్వీట్ చేశారు. ‘హిమదాస్‌కు శుభాకాంక్షలు, అదేవిధంగా బ్లెస్సింగ్స్’అంటూ పేర్కొన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ట్వీట్లో ‘Golden Shower For India’అని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అసభ్యపద జాలం అంటూ సద్గురుకు వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై సద్గురు ఫాలోవర్స్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. హిమదాస్ బంగారు వర్షం కురిపిస్తోందనే ఉద్దేశంతో అలా అన్నారని కానీ దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. అయితే దీనిపై రెండు వర్గాల వారు ట్విటర్ వేదికగా వాగ్వాదం చేసుకుంటున్నారు. మామూలుగా సద్గురు వాడిన పదంలో ఎలాంటి అభ్యతరకరం లేదని.. కానీ పాశ్చాత్య దేశాల్లో దాని అర్థాన్ని మార్చారని సద్గురు అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే గతంలో అమెరికన్ రచయిత జేమ్స్ కోమే ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఈ పదజాలం వాడి విమర్శలపాలైన విషయాన్ని సద్గురు వ్యతిరేకులు గుర్తుచేస్తున్నారు. -
టోక్యో ఎంత దూరం?
పంతొమ్మిదేళ్ల యువ తరంగం... భారత మహిళా అథ్లెట్ హిమ దాస్ వరుసగా ట్రాక్‌పై అద్భుతాలు సాధిస్తోంది. 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలుచుకొని... అంతంతమాత్రంగా ఉన్న అథ్లెటిక్స్‌లో దేశం మొత్తం గర్వపడేలా చేసింది. ఫలితంగా క్రీడాభిమానులతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు హిమ ఘనతను కీర్తిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికపరంగా వెనుకబడిన వర్గానికి చెందిన నేపథ్యంతో పాటు ఇటీవల అసోం వరద బాధితుల కోసం పెద్ద మనసుతో ఆమె చేసిన సాయం కూడా ఆ అమ్మాయి స్థాయిని పెంచింది. దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించి హిమ దాస్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మన దేశానికి తొలి పతకం అందించగలదని, ఇటీవలి పంచ స్వర్ణాలు ఆమె సత్తా చాటాయని అంతా భావిస్తున్నారు. కాకపోతే ఇటీవలి ప్రదర్శన ఆమె కెరీర్లో అత్యుత్తమమేమీ కాదు. టోక్యోకు అర్హత సాధించటానికి సరిపోదు కూడా..!! ఒకవేళ ఆమె తన మునుపటి అత్యుత్తమ ప్రదర్శనను చేరుకుంటే, లేక అధిగమిస్తే మాత్రం... పతకాన్ని ఆశించవచ్చు. ఆ విశ్లేషణ ఇదిగో...! ఇటీవల గెలిచిన స్వర్ణాలు... 200 మీటర్లు ► పోజ్నాన్ గ్రాండ్‌ప్రి (పోలండ్) : 23.65 సెకన్లు ► కుట్నో మీట్ (పోలండ్) : 23.97 సెకన్లు ► క్లాడ్నో మీట్ (చెక్ రిపబ్లిక్) : 23.43 సెకన్లు ► తాబోర్ మీట్ (చెక్ రిపబ్లిక్) : 23.25 సెకన్లు 400 మీటర్లు ► నోవ్ మెస్టో (చెక్ రిపబ్లిక్) : 52.09 సెకన్లు ఏ స్థాయి ఈవెంట్లంటే... అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) గుర్తింపు పొందిన ఈవెంట్లలో ‘ఎ’ నుంచి ‘ఎఫ్’ వరకు ఆరు రకాలు స్థాయిలున్నాయి. వీటిలో హిమ పతకాలు గెలిచిన ఐదులో రెండు ‘ఎఫ్’ కేటగిరీవి కాగా... మరో మూడు ‘ఇ’ కేటగిరీవి. ఎవరెవరు పాల్గొన్నారు... భారత అథ్లెట్ల బృందానికి పోలండ్‌లోని స్పాలాలో రెండు నెలల ప్రత్యేక శిక్షణ శిబిరం జరుగుతోంది. ప్రాక్టీస్‌తో పాటు రేస్‌లో అనుభవం కోసం స్పాలాకు చుట్టుపక్కల జరిగే ఈవెంట్లలో మనవాళ్లు పాల్గొంటున్నారు. హిమ గెలిచిన 400 మీటర్ల పరుగులో టాప్–5 అందరూ భారత అథ్లెట్లే ఉన్నారు. మిగతా దేశాలవారు కొందరు పాల్గొన్నా వారెవరికీ హిమకంటే మెరుగైన ర్యాంక్ లేదు. హిమ ప్రదర్శన ఎలా ఉంది? అథ్లెటిక్స్‌లో పతకాల్ని పక్కనబెడితే... టైమింగే ముఖ్యం. దీని ప్రకారం చూస్తే హిమ ప్రదర్శన ఇంకా మెరుగుపడాల్సి ఉందనే చెప్పాలి. ఎందుకంటే 200 మీటర్ల పరుగులో నమోదు చేసిన నాలుగు టైమింగ్‌లు కూడా ఆమె కెరీర్ అత్యుత్తమ టైమింగ్‌తో (23.10 సెకన్లు) పోలిస్తే చాలా వెనకబడినట్లే. 400 మీటర్ల పరుగులోనైతే కెరీర్ బెస్ట్ 50.79 సెకన్లతో పోలిస్తే 1.30 సెకన్ల తేడా అంటే చాలా చాలా ఎక్కువ! తాజా ప్రదర్శన ఉపయోగపడదా... అథ్లెటిక్స్‌కు సంబంధించి ఒలింపిక్స్ లేదా ప్రపంచ చాంపియన్‌షిప్! ఈ రెండే అత్యుత్తమ ఈవెంట్లు. ఇక్కడ చూపిన ప్రతిభనే క్రీడా ప్రపంచం గుర్తిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి దోహాలో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. దీనికి ఐఏఏఎఫ్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలు 23.02 సెకన్లు (200 మీటర్లు), 51.80 సెకన్లుగా (400 మీటర్లు) ఉన్నాయి. క్వాలిఫికేషన్‌కు సెప్టెంబర్ 6 చివరి తేదీ. 200 మీటర్ల పరుగులో వచ్చే నెలలో మరో రెండు మీట్లు ఉండటంతో హిమకు ఇంకా అవకాశం ఉంది. 400 మీటర్ల పరుగులో మాత్రం ఆమెకు మరో ఈవెంట్ లేదు. దాంతో ఆమె క్వాలిఫై కానట్లే! తాజాగా పతకాలు గెలిచిన మీట్లలోనే ప్రత్యర్థులతో సంబంధం లేకుండా హిమ తన అత్యుత్తమ ఆటతీరు కనబరిచి ఉంటే క్వాలిఫై అయ్యేదేమో!!. కాకపోతే అది సాధ్యం కాలేదు. ఒలింపిక్స్‌పై ఆశలు... టోక్యో ఒలింపిక్స్‌కు చాలా సమయం ఉంది. ట్రాక్‌పై టైమింగ్ ప్రకారమే కాకుండా మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించవచ్చు. అయితే ర్యాంకింగ్‌కు సంబంధించి ఉండే గణాంకాలు, లెక్కల కారణంగా చివరి వరకు చాలా గందరగోళం ఉంటుంది. కాబట్టి అథ్లెట్లు ఎక్కువగా టైమింగ్‌పైనే దృష్టి పెడతారు. 22.80 సెకన్లు (200 మీటర్లు), 51.35 సెకన్లు (400 మీటర్లు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతగా నిర్ణయించారు. ఇందులో 200 మీటర్లలో హిమ చాలా మెరుగవ్వాలి. 400 మీ. విషయంలో మాత్రం గతంలో ఇంతకంటే బెస్ట్ టైమింగ్ నమోదు చేసింది కాబట్టి అది స్ఫూర్తినివ్వవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెన్ను నొప్పితో ఆసియా చాంపియన్‌షిప్ నుంచి మధ్యలోనే తప్పుకున్న హిమ దాస్ ఇటీవలే కోలుకుంది. అదే క్రమంలో తాజా యూరోప్ ఈవెంట్లలో పాల్గొన్నది. మెరుగైన టైమింగ్ కోసం తన పని తాను చేసుకుపోతోంది. ఇదే దారిలో వెళితే మున్ముందు తన టైమింగ్‌ను మెరుగుపర్చుకుని, మరిన్ని పతకాలు సాధించగల సత్తా ఆమెలో ఉంది. సహజ ప్రతిభ కలిగిన హిమ అద్భుత ఆటతో క్వాలిఫై కావటం, పతకాల ఆశల్ని సజీవంగా ఉంచగలగటం... అసాధ్యమైతే కాదు. -
సలామ్ బాస్: రిషభ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత మహిళా అథ్లెట్ హిమ దాస్ మూడు వారాల వ్యవధిలో ఐదో స్వర్ణాన్ని గెలిచి శభాష్ అనిపించారు. చెక్ రిపబ్లిక్లో శనివారం జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో హిమ దాస్ 400 మీటర్ల రేసులో తొలి స్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకున్నారు. 200 మీటర్ల రేసులో నాలుగు స్వర్ణాలు సాధించిన హిమదాస్.. 400 మీటర్ల రేసులోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. భారత కీర్తిని మరింత పెంచిన హిమ దాస్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత యువ క్రికెటర్ రిషభ్ పంత్ తన ట్విటర్ అకౌంట్లో స్పందిస్తూ.. ‘ నీవే ఒక స్ఫూర్తి. ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా.. సలామ్ బాస్’ అంటూ కొనియాడాడు. ‘ గత 19 రోజుల కాలంలో యూరోపియన్ సర్క్యూట్లో నీ ప్రదర్శన చూసి గర్విస్తున్నాం. గెలవాలనే నీలో కసి యువతకు ఒక స్ఫూర్తి. ఐదు పతకాలు గెలిచినందుకు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నా’ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: నచ్చారండి.. హిమదాస్) -
నచ్చారండి.. హిమదాస్
నచ్చారండి హిమదాస్.. తెగ నచ్చేశారు. దేశమంతా క్రికెట్ ప్రపంచకప్ పిచ్చిలో మునిగి మీ గెలుపును గుర్తించకున్నా.. మీరు మాత్రం వరుస పతకాలతో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. మూడు వారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించారు. మీ విజయానికి రావాల్సినంత పేరు రాకున్నా.. దాన్ని మీ చిరునవ్వుతోనే సరిపెట్టుకున్నారు. మొబైల్లో టెంపుల్ రన్ గేమ్ ఆడుతూ బిజీగా ఉన్న మేము.. మీ పరుగును పట్టించుకోకున్నా.. మీరు ముందుకు సాగారు. ప్రకృతి కన్నెర్ర చేసి మీ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతుంటే.. కోట్లు సంపాదించే ఆటగాళ్లు ట్వీట్లతో సరిపెడితే.. మీరు మాత్రం మీకు తోచిన సాయం చేసి పెద్ద మనుసు చాటుకున్నారు.. సరిగ్గా ఏడాది క్రితం.. ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో చిరుతలా పరుగెత్తి స్వర్ణ పతకం నెగ్గారు. ఈ గెలుపుతో ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఈ రేసులో నెగ్గిన వెంటనే మీరు జాతీయ పతాకం కోసం అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనవ్వడం మాకు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మీ ప్రతిభను దేశ ప్రధానే కొనియాడుతుంటే.. మీకు నజరానాలు.. కానుకల వర్షం కురుస్తందని భావించాం. ప్చ్.. అందరూ ప్రశంసలతోనే సరిపెట్టినా.. మీరు ఏ మాత్రం అసంతృప్తికి లోనవ్వలేదు. మీ పరుగును ఆపలేదు. ఆ ప్రశంసలను తలకెక్కించుకోలేదు. అంతేకాకుండా ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు సాధించారు. తమ ప్రతిభను గుర్తించడం లేదని, నజరానాలు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్న ఆటగాళ్లున్న ఈ రోజుల్లో.. ఇన్ని విజయాలందుకున్న మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండడం.. చిరునవ్వుతో ముందుకు సాగడం అందర్నీ ఆకట్టుకుంది. ఫిన్లాండ్లోని టాంపెరెలో మొదలైన మీ జైత్రయాత్ర.. నిన్నటి చెక్ రిపబ్లిక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ వరకు అప్రతిహతంగా కొనసాగింది. ఇది ఇలానే టోక్యో ఒలింపిక్స్-2020 వరకు కొనసాగాలని.. భారత్‌కు స్వర్ణపతకం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. -
ఏషియన్‌గేమ్స్ రజతం.. బంగారమైంది!
జకార్త : ఏషియన్ గేమ్స్-2018లో మిక్స్డ్ 4x400m రిలే విభాగంలో తొలిసారి భారత ట్రాక్ జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ రజతం కాస్త ఇప్పుడు స్వర్ణమైంది. ముహమ్మద్ అనస్ యాహియా, పూవమ్మ మచెట్టేరి, హిమదాస్, రాజీవ్ అరోకియాలతో కూడిన భారత బృందం 3:15.71 సమయంలో లక్ష్యాన్ని చేరుకొని రెండో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ ట్రాక్‌జట్టుకు రజతం వరించింది. తొలి స్థానంలో నిలిచిన బెహ్రెయిన్(3:11.89) జట్టుకు స్వర్ణం దక్కగా.. కజకిస్తన్(3:19.52)కు కాంస్యం లభించింది. అయితే బెహ్రెయిన్ జట్టుకు చెందిన అథ్లెట్ కెమి అడెకోయ డోపింగ్‌టెస్ట్‌లో విఫలమవడంతో అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) నాలుగేళ్లు నిషేధం విధించింది. అంతేకాకుండా 2018 ఆగస్టు 24 నుంచి 2018 నవంబర్ 2018 మధ్య కెమి అడెకోయ సాధించిన విజయాలకు అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో బెహ్రెయిన్ జట్టు గెలిచిన స్వర్ణం భారత్ వశమైంది. ఇక బెహ్రెయిన్ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే తమ అథ్లెట్లకు పరుగు ఆటంకం కలిగించారని భారత అధికారులు అప్పట్లో ఫిర్యాదు చేశారు. చివరకు ఆ స్వర్ణం భారత్ వశం కావడం గమనార్హం. కెమి అడెకోయ 400m రిలే విభాగంలో స్వర్ణం సాధించగా.. భారత అథ్లెట్ అను రాఘవన్ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఏఐయూ తాజా నిర్ణయంతో అనుకు కాంస్యం లభించింది. చదవండి: టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా? -
హిమ దాస్‌కు రెండో స్వర్ణం
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ వారం వ్యవధిలో అంతర్జాతీయ టోర్నమెంట్లో రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది. పోలాండ్‌లో జరిగిన కుట్నో అథ్లెటిక్స్ మీట్లో హిమ దాస్ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. హిమ 23.97 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన విస్మయ 24.06 సెకన్లలో రేసును ముగించి రజత పతకం దక్కించుకుంది. గత మంగళవారం పొజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి మీట్లోనూ హిమ 200 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించింది. -
హిమదాస్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ : భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. పోలండ్‌లో జరుగుతున్న పోజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో హిమ 200 మీటర్ల పరుగులో స్వర్ణం గెలుచుకుంది. ఆమె 23.65 సెకన్లలో రేసు పూర్తి చేసింది. భారత్‌కే చెందిన వీకే విస్మయ (23.75 సె.) కాంస్యం నెగ్గింది. పురుషుల షాట్‌పుట్‌లోనూ భారత్‌కు కాంస్యం లభించింది. తజీందర్ పాల్ సింగ్ తూర్ (19.62 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల 200 మీటర్ల రేస్‌లో ముహమ్మద్ అనస్ (20.75 సె.), 400 మీటర్ల పరుగులో కేఎస్ జీవన్ (47.25 సె.)లకు కాంస్య పతకాలు దక్కాయి. -
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ‘అర్జున్‌రెడ్డి’
2019 సంవత్సరానికి వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన 30 ఏళ్ల లోపు వారి జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ‘ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ' పేరుతో ఆరవ జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నాడని తెలిపింది. ముఖ్యంగా 2017లో అర్జున్‌రెడ్డి ద్వారా సంచలనం సృష్టించారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. వయస్సు 25 అయినా 52 ఏళ్లు అయినా సక్సెస్‌లను అభినందించడంతోపాటు, తక్కువ వయస్సులోనే విజయాలను అందుకున్నవారి ప్రతిభ, ధైర్యాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. విజయాలు, కెరీర్లో దూసుకెళ్లే తత్వం, తమ వ్యాపారాన్ని నిర్వహించే సత్తా, దీర్ఘకాలం ప్రతిభను కొనసాగించే సామర్థ్యం ఆధారంగా ఈ జాబితాను రూపొందించామనీ, దీనికి సంబంధించిన కథనాన్ని ఫిబ్రవరి 15, ఫోర్బ్స్ ఇండియా మ్యాగజీన్లో చూడొచ్చని తెలిపింది. 16 కేటగిరీల్లో 300 పేర్లను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను రూపొంచింది. మీడియా, క్రీడలు, మార్కెటింగ్, పరిశ్రమ, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లోని వారిని ఎంపిక చేసింది. మహిళా క్రికెట్ సంచలనం స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్ ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వీరితోపాటు యూట్యూబ్ పర్సనాలిటీ ప్రజక్త కోలీ, సింగర్ మేఘన మిశ్రా, ఆయుష్ అగర్వాల్ లాంటివారి పేర్లున్నాయి. ఇంకా పైనాన్స్ సంస్థను నడుపుతున్న ఐఐటీయన్లు వసంత్ కాంత్, అనురాగ్ శ్రీవాస్తవ, రోహన్‌గుప్త, ఇంకా నింజా కార్ట్ ద్వారా రైతులకు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్న కార్తీశ్వరన్, శరత్ లోగనాథన్, అశుతోష్ విక్రం తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
హిమదాస్‌కు ఐఓసీలో ఉద్యోగం
గువాహటి: స్ప్రింట్ సంచలనం హిమదాస్‌కు ప్రభుత్వ చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఉద్యోగం ఇచ్చింది. అంతర్జాతీయ పోటీల్లో హిమ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో రిలేలో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకుంది. ఆమె సాధించిన ఘన విజయాలకు ప్రోత్సాహంగా తమ సంస్థ మానవ వనరుల (హెచ్ఆర్) విభాగంలో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లు ఐఓసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తియ భట్టాచార్య తెలిపారు. హిమదాస్‌కు ఉన్నతస్థాయి వేతన భత్యాలతో పాటు ఆమె పాల్గొనే ఈవెంట్ల కోసం ప్రయాణ, బస ఏర్పాట్లకయ్యే ఖర్చును తమ సంస్థే భరిస్తుందని ఆయన చెప్పారు. హిమ ఘనతను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటీవల అర్జున అవార్డు కూడా బహూకరించింది. -
హిమ దాస్‌కు అడిడాస్ స్పాన్సర్షిప్
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్‌కు ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్షిప్ చేస్తుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ అస్సాం స్ప్రింటర్తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 18 ఏళ్ల హిమకు అడిడాస్ కిట్ స్పాన్సర్ చేస్తుంది. ఫిన్ లాండ్లో జరిగిన ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది. అందుకే అడిడాస్ కంపెనీ ఆమె కోసమే ప్రత్యేకంగా ప్రీమియం షూస్‌ను తయారు చేసి ఇచ్చింది. ఒక బూటుపై ప్రముఖంగా ‘హిమ దాస్’ అని... ఇంకోదానిపై ‘క్రియేట్ హిస్టరీ’ అని ముద్రించింది. ఈ సందర్భంగా ‘అడిడాస్ కుటుంబంలో చేరడం గర్వంగా ఉంది. అంతర్జాతీయ అథ్లెట్ల గ్రూపులో ఇప్పుడు నేను భాగమైనందుకు ఆనందపడుతున్నా. క్రీడా ప్రపంచంలో ఎంతో మందికి ఈ సంస్థ అండగానిలుస్తోంది. అడిడాస్ స్పాన్సర్‌షిప్‌తో నేను రెట్టించిన ఉత్సాహంతో రాణిస్తా. నా ప్రదర్శనను మెరుగుపర్చుకుంటా’ అని హిమ చెప్పింది. -
జీవితంలో కష్టాలు.. మైదానంలో బంగారాలు
నిన్నటితో ‘దంగల్’ ముగిసింది. దంగల్ అంటే.. తెలిసిందే, కుస్తీ! పతకం కోసం కుస్తీ.. పరువు కోసం కుస్తీ.ఊరికే కుస్తీ పడితే పతకం వస్తుందా? పరువు పతాకమై ఎగురుతుందా?! ప్రత్యర్థిని పడగొట్టాలి.. విజేతగా.. నిలబడాలి! ఈసారి ఏషియన్ గేమ్స్‌లో.. అమ్మాయిలదే దంగల్ అంతా! అది కాదు విషయం.. జీవితంతో కుస్తీ పడి వచ్చినవాళ్లే అంతా! లేమి లోంచి మెరిసిన ఈ మేలిమి బంగారాలు ఇప్పుడు మన దేశానికి.. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్లను మించిన త్రివర్ణ ‘పతకాలు’!! 2018, జకార్తా ఏషియన్ గేమ్స్.. మన అమ్మాయిల దమ్ము చూపించింది. దుమ్ము రేపింది! ఈ ఆటల్లో మెడల్స్ సాధించిన చాలామంది అమ్మాయిలు కలిమిలోంచి వచ్చినవాళ్లు కాదు. మధ్యతరగతి, ఇంకా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. ఆర్థిక బాధ్యతలను పంచుకుంటూ ఇంటి పరువునే కాదు, దేశ కీర్తినీ మోస్తున్న క్రీడాబలులు. జీవితంలోని హార్డిల్స్నూ అదే స్పిరిట్‌తో దాటుతున్న ఆ చిరుతలు తమ గెలుపుతో ప్రభుత్వ కర్తవ్యాన్నీ గుర్తుచేస్తున్నారు. మైదానంలో మాణిక్యాలు వినేశ్ ఫోగత్, చిత్రా ఉన్నికృష్ణన్, స్వప్నా బర్మన్, ద్యుతి చంద్, మలప్రభ జాధవ్, దివ్యా కక్రన్, హిమాదాస్, సరితాబెన్ లక్ష్మణ్ గైక్వాడ్, హర్షితా తోమర్, పింకీ బల్హారా.. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం! వినేశ్ ఫోగత్.. ఈ గేమ్స్‌లో మనదేశ మహిళా రెజ్లర్ల బలం చూపించింది.. 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో గోల్డ్ మెడల్ సంపాదించి! ఆమె మహావీర్ సింగ్ ఫోగత్‌కు స్వయానా తమ్ముడి బిడ్డ. మహావీర్ కూతుళ్లు గీత, బబితాలతో సమానమైన కుస్తీ మెళకువలున్నా గ్లాస్గో, స్కాట్లాండ్ కామన్వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించినా పెద్దనాన్న పంచన నీడగానే ఉండిపోయింది. ఈసారే ఫోగత్ అనే ఇంటిపేరుతోనే కాక వినేశ్ అనే బంగారం కాంతితో మీడియాలో బ్యానర్ అయింది. వినేశ్ ఫోగత్‌కు అయిదేళ్లున్నప్పుడే తండ్రి రాజ్‌పాల్ ఫోగత్ చనిపోయాడు. ఫోగత్‌కు ఒక చెల్లి, తమ్ముడు. తల్లే ఆ ముగ్గురిని పెంచి పెద్ద చేసింది. తర్వాత వినేశ్‌ను మహావీర్ ఫోగత్ దత్తత తీసుకున్నాడు. తన బిడ్డలతోపాటుగా వినేశ్కూ కుస్తీ నేర్పాడు. పెళ్లి చేసి పంపకుండా ఆడపిల్లలకు కుస్తీపట్టడం నేర్పిస్తున్నాడు అంటే అత్తింట్లో జుట్టుపట్టుకొని పోట్లాడమనా అంటూ ఊరి (భివాణి, హర్యానా) పెద్దలు, కులస్థులు హేళన చేశారు, వెలివేశారు. అయినా ఫోగత్ పట్టుబట్టి ఆడపిల్లలను కుస్తీ వీరులుగా తయారు చేశాడు. అలా బతుకు యుద్ధాన్నీ నేర్చుకుంది వినేశ్. వాటిన్నిటినీ రింగ్‌లో ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రయోగిస్తోంది వినేశ్! చిత్రా ఉన్నికృష్ణన్ స్టోరీ సింపులేం కాదు.. కేరళలోని పాలక్కాడ్ జిల్లా, మందూరు ఆమె స్వస్థలం. చిత్రకు ఊహ తెలిసేటప్పటికే ఆకలి కడుపుతోనే ఆడుకోవడం అలవాటైంది. ఆమె తల్లిదండ్రులు కూలీలు. ఇద్దరూ కష్టడితేనే ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబానికి రెండు పూటలా తిండి దొరికేది. అర్ధాకలితో నిద్ర పోయిన రోజులే ఎక్కువ. పొట్టలో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకొని రాత్రంతా కంటికి మీద కునుకుకు దూరం చేసినా పొద్దున్నే అయిదున్నరకల్లా తను చదువుకునే సర్కారు బడిలోని గ్రౌండ్‌కు పరుగెత్తేది. ఆ పట్టుదలే మొన్నటి ఏషియన్ గేమ్స్‌లో బ్రౌంజ్ మెడల్ వచ్చేలా చేసింది. ఆకలిని జయించింది. ఆత్మవిశ్వాసంతో విధిరాతను మార్చుకుంది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో జయమే ధ్యేయంగా ప్రాక్టీస్‌ను ట్రాక్‌లో పెడుతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్న బర్మన్.. హెపథ్లాన్‌లో బంగారు పథకం సాధించింది. ఈ అమ్మాయి కూడా పేదరికం ఫ్రెండ్షిప్తోనే పెరిగింది. తండ్రి పంచన్ బర్మన్ ఆటోడ్రైవర్. తల్లి బసనా టీ జల్పాయ్గురిలోని టీ ఎస్టేట్‌లో కూలీ. స్వప్నకు గోల్డ్‌మెడల్ వచ్చిందని తెలియగానే ఒక విషయాన్ని తలుచుకొని ఆ అమ్మ కంటతడి పెట్టింది. ‘‘అథ్లెట్స్‌కి బలమైన తిండి పెట్టాలి. పౌష్టికాహారం కాదు కదా నా బిడ్డకు కడుపునిండా కూడా తిండిపెట్టలేదు నేను’’ అంటూ! అయినా ఆ అమ్మాయి అమ్మ మీద అలగలేదు. నాకీ పరిస్థితి ఏంటీ అని కాళ్లు నేలకేసి కొట్టలేదు. ఆకలితో పరుగుపందెం పెట్టుకుంది. దానికి ఎప్పటికీ దొరకనంత దూరానికి వచ్చేసింది. ఒడిషా అమ్మాయి ద్యుతి చంద్‌కు హండ్రెడ్ మీటర్స్ రేస్‌లో సిల్వర్ మెడల్ వచ్చింది. మెడల్స్కన్నా టఫ్గేమ్ అయిన ఆత్మబలాన్ని దెబ్బతీసే సమస్యతో పోరాడి గెలిచింది ఆమె ఆ సక్సెస్ ముందు ఈ పథకాలు చిన్నవే. కాని ఆడడానికే ఆ పోరు నెగ్గింది కాబట్టి ఈ విజయం ద్యుతికి అమూల్యమైనదే. చేనేత కార్మికుల ఇంట ఏడుగురు సంతానంలో మూడో అమ్మాయిగా పుట్టింది ద్యుతి. ఆమె బాల్యమూ గొప్పగా ఏమీ గడవలేదు. అక్క సరస్వతి.. నేషనల్ లెవెల్ అథ్లెట్. ఆమె స్ఫూర్తితోనే ద్యుతి కూడా అథ్లెట్ అయింది. పదిహేడేళ్లకే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. విజయపరంపరతో దూసుకెళ్తున్న ద్యుతి లండన్ ఒలింపిక్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉండింది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్యుతి మీద వైద్య పరీక్షలు మొదలుపెట్టింది కారణం ఆమెకు చెప్పకుండానే. చివరకు ‘జెండర్ టెస్ట్’లో ఫెయిల్ అయినందుకు ఒలిపింక్స్‌లో పాల్గొనే చాన్స్ లేదని, నేషనల్ ఛాంపియన్షిప్ కూడా వదులుకోవాలని చెప్పారు ఆమెతో. ఆ మాట ఆమెను అచేతనం చేసింది. జెండర్టెస్ట్లో ఫెయిలవడానికి దారితీసిన ఆమె శారీరక పరిస్థితిని హైపర్ఆండ్రోనిజమ్ అంటారు. సాధారణ మహిళల్లో ఉండే కంటే ఎక్కువ పాళ్లలో ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ హర్మోన్లు ఆమె శరీరంలో ఉన్నాయి. ఈ స్థితిలో ఆమె స్త్రీలకు సంబంధించిన అథ్లెట్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఆమెకు రెండే దారులు. ఒకటి.. ఆటలకు శాశ్వతంగా దూరం కావడం, రెండు.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్లి ఆండ్రోజెన్ హర్మోన్ లెవెల్స్‌ను తగ్గించుకోవడం. అయితే ద్యుతి మూడో ఆప్షన్‌ను ఎన్నుకుంది. అలాంటి టెస్ట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని. తనకు ఎదురైంది ఇంకే అమ్మాయికి ఎదురు కావద్దని. గెలిచింది. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఆమెది గెలుపు దారే! మలప్రభా జాధవ్.. రైతు బిడ్డ. కర్ణాటకలోని తుర్మూరు ఆమె జన్మస్థలం. జూడో కేటగిరీ కురాష్లో కాంస్య పథకం సాధించింది. ‘‘కురాష్ అనే ఒక ఆట ఉంటుందని కూడా నాకు తెలియదు. అమ్మాయిలకు ఈ ఆట వస్తే చాలా మంచిది. మీ అమ్మాయి చాలా చురుగ్గా ఉంది. నేర్పించండి అని కోచ్ చెబితే సర్లే స్కూల్లోనే కదా నేర్పిస్తున్నారు అని చేర్పించా’’ అన్నాడు మలప్రభ తండ్రి యెల్లప్ప జాధవ్. ఇప్పుడు కూతురు మెడల్ కొట్టిందని తెలియగానే ఆయన ఆనందానికి అంతులేదు. అన్నట్టు మలప్రభ తుర్మూరు పక్కనుంచే పారే ఒక నది. ఆ పేరే కూతురికి పెట్టుకున్నాడు యెల్లప్ప. తగ్గట్టుగానే ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది మలప్రభ. దివ్యాకక్రన్.. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల రెజ్లింగ్ పోటీల్లో బ్రౌంజ్ మెడల్ తెచ్చుకుంది. ఢిల్లీలో పుట్టిపెరిగిన దివ్యా దిగివ మధ్యతరగతి కుటుంబం. నాయి సామాజికవర్గం. తల్లి లంగోటాలు కుడితే.. తండ్రి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర వసతులతో అడ్జస్ట్ అవుతూ స్పోర్ట్స్‌లో సత్తా చూపుతోంది దివ్యా. స్పోర్ట్స్కోటాలోనే నోయిడా కాలేజ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచలర్స్ డిగ్రీ చేస్తోంది. హిమాదాస్.. జకార్తా ఏషియన్ గేమ్స్ కన్నా ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన అథ్లెట్. అస్సాంలోని నాగోన్ జిల్లా, కంధులిమరి అనే ఊళ్లో పుట్టింది. తండ్రి రొంజిత్ దాస్, జొనాలి దాస్ తల్లిదండ్రులు. రైతులు. అయిదుగురు పిల్లల్లో ఆఖరు సంతానం హిమాదాస్. ఈశాన్య రాష్ట్రాలంటే మిగతా దేశానికి ఉన్న చిన్నచూపు, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొంది హిమా. ముందు ఫుట్‌బాల్ అంటే ఆసక్తి చూపింది. బాగా ఆడేది కూడా. కాని మన దగ్గర ఫుట్‌బాల్ పట్ల అనాదరణ, అసలు మహిళా టీమ్ అన్న జాడే లేకపోవడంతో అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది. విజయాల ట్రాక్ మీద ఉరుకుతూ మొన్నటి ఏషియన్ గేమ్స్‌లో మహిళల 400 మీటర్స్ డెస్టినేషన్‌లో సిల్వర్ సాధించింది. సరితాబెన్ లక్ష్మణ్‌భాయి గాయక్వాడ్.. గుజరాత్‌కు చెందిన ట్రైబల్ గర్ల్. దుగా జిల్లాలోని ఖరాది అంబ స్వగ్రామం. పేదింటి పిల్ల. ఏషియన్‌గేమ్స్‌లో పాల్గొనేందుకు అరకొర డబ్బుల్తోనే జకార్తా వచ్చింది. డబ్బు సరిపోవట్లేదని గుజరాత్లో తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తే వాళ్లు డబ్బు పంపారు. ఈ గేమ్స్‌లో 4 ఇంటూ 400 రిలేలో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. పింకీ బల్హారా... ఢిల్లీ అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం. జూడో అంటే ఇష్టం. ఈ ఏషియన్ గేమ్స్‌లో కురాష్లో రజత పథకం సాధించింది. ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచీ హార్డిల్సే. ఉమ్మడి కుటుంబంలో కజిన్ చనిపోయాడు. ఆ తర్వాత హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. ఆ విషాదాన్ని పిడికిలిలో బిగించి రింగ్‌లోకి వచ్చింది. కొడుకు పోయాడన్న దిగులుతో పింకీ తాత (తండ్రి తండ్రి) చనిపోయాడు. ఈ విషయాన్ని పింకీకి చెప్పకుండా దాచారు ఇంట్లోవాళ్లు. ఆమె పోటీలో నెగ్గాక విషయం చెప్పారు. పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువన పెట్టి పథకం తెచ్చింది. కూతురికి తోడుగా జకార్తా వెళ్లాలనుకున్నాడు పింకీ వాళ్ల నాన్న. ఆమె గెలుపు చూడకుండానే వెళ్లిపోయాడు. కండబలంతో మైదానాన్ని ఓడిస్తూ .. గుండెబలంతో జీవితాన్ని విన్ అవుతున్నారు వీళ్లంతా! బతుకు పోడియం ఎక్కి సమాజం సృష్టించిన తారతమ్యాలు తలదించుకునేలా చేస్తున్నారు. ఈ సామర్థ్యాన్ని ఇంకా పరీక్షించొద్దు. ఈ ప్రతిభకు ఇంకా పోటీలు పెట్టొద్దు. ఎన్ని అడ్డంకులున్నా దీక్షకు అడ్డురావని చూపారు. ఆటలు అనగానే ఒక సానియా, ఒక సైనా.. ఒకే ఒక సింధు కాదు.. ఏషియన్ గేమ్స్‌లో ఇండియా జెండా ఎగరేసిన చాలామంది క్రీడాకారిణులున్నారు. స్పాన్సర్షిప్స్కు ఒక టెన్నిస్.. ఇక స్వా్కషే కాదు.. అథ్లెటిక్స్ కూడా ఉంటాయి. ఆటలను గ్లామర్ హంగులతో కాదు... స్పోర్టివ్ స్పిరిట్‌తో చూద్దాం! వీళ్ల జీవితాలను ట్రాక్ మీదకు తెద్దాం! – సరస్వతి రమ -
రిలేలో జోరు
జకార్తా: ఆసియా క్రీడల్లో అద్భుత రికార్డును కొనసాగిస్తూ 4్ఠ400మీ. రిలే పరుగులో భారత మహిళలు వరుసగా ఐదోసారి స్వర్ణం నెగ్గారు. గురువారం జరిగిన రేసులో హిమా దాస్, ఎంఆర్ పూవమ్మ, సరితాబెన్ గైక్వాడ్, విస్మయ కరోత్లతో కూడిన భారత బృందం 3ని. 28.72 సెకన్లలో రేసును పూర్తిచేసి విజేతగా అవతరించింది. హిమా బుల్లెట్లా దూసు కెళ్లడంతో ప్రారంభం నుంచి భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. బహ్రెయిన్ (3ని. 30.61 సెకన్లు), వియా త్నాం (3ని. 33.23 సెకన్లు) వరుసగా రజతం, కాం స్యాలు సాధించాయి. 2002 ఏషియాడ్ నుంచి 4్ఠ400మీ. స్వర్ణం భారత్ ఖాతాలోనే ఉంటోంది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో భారత బృందం రజతం గెలుచుకుంది. కున్హు ముహమ్మద్, ధరుణ్ అయ్యసామి, మొహమ్మద్ అనస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన బృందం 3 నిమిషాల 01.85 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. 3 నిమిషాల 0.56 సెకన్ల ఆసియా క్రీడల రికార్డుతో ఖతర్ జట్టు స్వర్ణం దక్కించుకుంది. 3 ని. 1.94 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన జపాన్ బృందం కాంస్యం అందుకుంది. గత ఏషియాడ్‌లో భారత పురుషుల రిలే జట్టు నాలుగో స్థానంతో త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. స్క్వాష్ సెమీస్ ప్రత్యర్థి మలేసియా మహిళల స్క్వాష్ జట్టు హాంకాంగ్ చేతిలో 1–2 తేడాతో పరాజయం పాలైంది. గురువారం జోయ్ చాన్ 3–1తో దీపికా పల్లికల్పై, యానీ 3–0తో జోష్నా చినప్పపై గెలుపొందారు. అయితే... సునయనా కురువిల్లా 3–2 తేడాతో జె లాక్ హొపై గెలుపొందింది. గ్రూప్ ‘బి’లో మూడు మ్యాచ్‌లు గెలిచి, ఒకదాంట్లో ఓడిన మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. సెమీస్‌లో మలేసియాతో తలపడనుంది. టీటీ ప్రిక్వార్టర్స్‌లో మనికా, శరత్, సత్యన్ టేబుల్ టెన్నిస్‌లో భారత ఆటగాళ్లు ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మహిళల విభాగంలో మనికా బాత్రా 11–3, 11–7, 11–3, 11–6తో నంథానా కొమ్వాంగ్ (థాయ్‌లాండ్)ను, పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ 11–4, 11–8, 11–7, 11–5తో ముహమ్మద్ ఆసిమ్ ఖురేషి (పాకిస్తాన్)ని ఓడించారు. సత్యన్ జ్ఞాన శేఖరన్ 4–2 తేడాతో శాంటొసొపై (ఇండోనేసియా) నెగ్గాడు. 1500 మీ. పరుగులో చిత్రకు కాంస్యం మహిళల 1500 మీటర్ల పరుగులో ఆసియా చాంపియన్ అయిన చిత్ర ఉన్నికృష్ణన్ ఏషియాడ్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. 4 నిమిషాల 12.56 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతోనే సంతృప్తి పడింది. బహ్రెయిన్ అథ్లెట్లు కల్కిదన్ బెఫ్కదు (4 ని. 07.88 సెకన్లు), టిగిస్ట్ బిలే (4 ని. 09.12 సెకన్లు) స్వర్ణం, రజతం నెగ్గారు. -
ద్యుతీచంద్‌కు భారీ నజరానా
ఒడిశా: ఏషియన్ గేమ్స్ 2018లో రజత పతకం సాధించిన అథ్లెట్ ద్యుతీచంద్‌కు ఒడిశా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు రూ. 1.50 కోట్లు నజరానాను ద్యుతీచంద్‌కు ఇవ్వనున్నట్లు ఒడిశా సీఎంఓ(ముఖ్యమంత్రి కార్యాలయం) ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియా క్రీడల్లో పతకం సాధించడానికి ద్యుతీచంద్ అంకిత భావంతో కృషి చేసిందని, అదే సమయంలో పతక వేటలో ఆమె ఎంతగానో శ్రమించిందని సీఎంఓ పేర్కొంది. దానిలో భాగంగానే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ద్యుతీచంద్‌కు కోటిన్నర నజరానా ప్రకటించినట్లు సీఎంఓ స్పష్టం చేసింది. 1998 ఏషియన్ గేమ్స్‌లో తమ రాష్ట్ర అథ్లెట్ రచితా పాండా మిస్త్రీ కాంస్య పతకం సాధించిన సుదీర్ఘ కాలం తర్వాత ద్యుతీచంద్ రజత పతకాన్ని తేవడం ఎంతో గర్వంగా ఉందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్(ఓఓఏ) రూ.50 వేల నజరానాను ద్యుతీకి ప్రకటించింది. ఆదివారం జరిగిన 100 మీటర్ల ఫైనల్ పోరులో ద్యుతిచంద్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ద్యుతీ... రజత ఖ్యాతి -
ద్యుతీ... రజత ఖ్యాతి
అంచనాలు నిలబెట్టుకుంటూ పతకంతో మెరిసిన టీనేజర్ ఒకరు... ఆటకే పనికిరావంటూ ఒకనాడు ఎదురైన చేదు జ్ఞాపకాలను ట్రాక్ కింద సమాధి చేస్తూ విజయంతో మరొకరు... సొంతూళ్లో ప్రకృతి వైపరీత్యానికి అల్లాడుతున్న సన్నిహితులకు గెలుపుతో ఊరటనందించే ప్రయత్నం చేసిన వారొకరు... ఆసియా క్రీడల్లో ముగ్గురు భిన్న నేపథ్యాల అథ్లెట్లు అందించిన రజత పతకాలతో ఆదివారం భారత్ మురిస్తే... ‘గీత’ దాటినందుకు మరో అథ్లెట్ చేతికి వచ్చిన కాంస్యం దూరమై విజయం కాస్తా విషాదంగా మారిపోవడం మరో కీలక పరిణామం. ఈక్వెస్ట్రియన్‌లో వచ్చిన రెండు వెండి పతకాలు, ‘బ్రిడ్జ్’ అందించిన రెండు కాంస్యాలు కలిపి ఈవెంట్ ఎనిమిదో రోజు మొత్తం ఏడు పతకాలు మన ఖాతాలో చేరాయి. జకార్తా: అథ్లెటిక్స్‌లో ప్రతిష్టాత్మక ఈవెంట్ 100 మీటర్ల పరుగు (మహిళల)లో భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్ రజత పతకంతో సత్తా చాటింది. 11.32 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఒడియాంగ్ ఎడిడియాంగ్ (బహ్రెయిన్) 11.30 సెకన్లలో పరుగు పూర్తి చేసి స్వర్ణం గెలుచుకోగా... వీ యోంగ్లీ (చైనా–11.33 సెకన్లు) కాంస్యం సాధించింది. ఎనిమిది మంది హోరాహోరీగా తలపడ్డ ఈ రేస్‌లో ఫలితాన్ని ‘ఫొటో ఫినిష్’ ద్వారా తేల్చారు. తాను పాల్గొంటున్న తొలి ఆసియా క్రీడల్లోనే ద్యుతీ రజతం సాధించడం విశేషం. మహిళల 100 మీటర్ల ఈవెంట్లో భారత అథ్లెట్ ఒకరు ఆఖరిసారిగా 1998 ఆసియా క్రీడల్లో పతకం సాధించారు. నాడు రచిత మిస్త్రీకి కాంస్యం దక్కింది. 1951లో రోషన్ మిస్త్రీ... 1982, 1986 ఆసియా క్రీడల్లో పీటీ ఉష రజత పతకాలు సాధించాక ... మళ్లీ ఇప్పుడు భారత అథ్లెట్‌కు 100 మీటర్ల విభాగంలో రజతం దక్కింది. హిమ దాస్ మళ్లీ రికార్డు... వరుసగా రెండో రోజు జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 18 ఏళ్ల హిమ దాస్ 400 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. హిమ 50.79 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. సల్వా నాసర్ (బహ్రెయిన్–50.09 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, మిఖినా ఎలీనా (కజకిస్తాన్–52.63 సె.)కి కాంస్యం దక్కింది. శనివారమే ఆమె క్వాలిఫయింగ్ రౌండ్లో 51.00 సెకన్ల టైమింగ్ నమోదు చేసి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు తానే దానిని బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ నిర్మలా (52.96 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. 2006 దోహా క్రీడల్లో మన్జీత్ కౌర్ రజతం గెలిచిన తర్వాత 400 మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. పురుషుల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ మొహమ్మద్ అనస్ యహియా రజతం సాధించాడు. 45.69 సెకన్ల టైమింగ్ నెలకొల్పి అనస్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోరులో హసన్ (ఖతర్–44.89 సెకన్లు) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, అలీ (బహ్రెయిన్–45.70 సె.)కు కాంస్యం లభించింది. ‘నేను మరింత వేగంగా పరుగెత్తాల్సింది. అయితే ప్రస్తుతానికి రజతంతో సంతృప్తిగా ఉన్నా. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ బరిలోకి దిగాను. అనుకున్నది దక్కింది. నా కేరళలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు నా విజయం అంకితం’ అని అనస్ వ్యాఖ్యానించాడు. కొత్తగా రెక్కలు తొడిగి... సాక్షి క్రీడా విభాగం సరిగ్గా నాలుగేళ్ల క్రితం ద్యుతీ చంద్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధమవుతోంది. అప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆమె ఎలాగైనా పతకం గెలవాలని పట్టుదలగా శ్రమిస్తోంది. అయితే అనూహ్యంగా అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ప్రకటనతో ఆమె ట్రాక్‌పై కుప్పకూలిపోయింది. ద్యుతీచంద్‌లో అధిక మోతాదులో పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నాయి కాబట్టి ఆమెకు మహిళల విభాగంలో పాల్గొనే అర్హత లేదంటూ కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పించారు. ఎలాంటి డ్రగ్స్ ఆరోపణలు లేకున్నా... ఈ తరహాలో వేటు పడటం 18 ఏళ్ల అమ్మాయిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అన్ని వైపుల నుంచి విమర్శలతో పాటు ఒక రకమైన వ్యంగ్య వ్యాఖ్యలతో ఆమె మనసు వికలమైంది. ట్రాక్‌పై ప్రాక్టీస్‌కంటే కూడా ముందు తాను ఆడపిల్లనేనని రుజువు చేసుకోవాల్సిన అగత్యం ద్యుతీకి ఎదురైంది. అయితే ఆమె వెనక్కి తగ్గకుండా పోరాడాలని నిర్ణయించుకుంది. తాను ఎంచుకున్న ఆటలో లక్ష్యం చేరాలంటే అన్ని అడ్డంకులు అధిగమించేందుకు సిద్ధమైంది. చివరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ద్యుతీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్’ను రుజువు చేయడంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విఫలమైందని, సరైన ఆధారాలు కూడా లేవంటూ ద్యుతీ మళ్లీ బరిలోకి దిగేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో ద్యుతీ మళ్లీ కొత్తగా ట్రాక్‌పైకి అడుగు పెట్టి తన పరుగుకు పదును పెట్టింది. హైదరాబాద్‌లోనే... పేరుకు ఒడిషాకు చెందిన అమ్మాయే అయినా ద్యుతీ ప్రాక్టీస్ మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ట్రాక్‌లో ఆమె సాధన చేసింది. ద్యుతీని తీర్చి దిద్దడంలో తెలంగాణకు చెందిన భారత కోచ్ నాగపురి రమేశ్‌దే ప్రధాన పాత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా, కొన్ని సార్లు ప్రతికూల ఫలితాలు వచ్చినా పట్టువదలకుండా ఆయన ద్యుతీకి లక్ష్యాలు విధించి ప్రాక్టీస్ చేయించారు. ఒక మెగా ఈవెంట్లో ఆమె వల్ల పతకం సాధించడం సాధ్యమవుతుందా అనే సందేహాలు అనేక సార్లు వచ్చినా... రమేశ్ మాత్రం ఆశలు కోల్పోలేదు. చివరకు ఇప్పుడు ఆసియా క్రీడల్లో రజతంతో వీరిద్దరి శ్రమకు గుర్తింపు లభించింది. జిమ్, ఫిట్నెస్ ట్రైనింగ్, డైట్‌కు సంబంధించిన అన్ని అదనపు సౌకర్యాలు తన అకాడమీలోనే కల్పించి ద్యుతీని ప్రోత్సహిస్తూ భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా అండగా నిలవడం విశేషం. ‘ద్యుతీచంద్ రజతం నెగ్గడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరుకుంది’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. లక్ష్మణన్ విషాదం... మరో భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్‌ను దురదృష్టం వెంటాడింది. 10 వేల మీటర్ల పరుగును 29 నిమిషాల 44.91 సెకన్లలో పూర్తి చేసిన లక్ష్మణన్‌కు ముందుగా కాంస్య పతకం ఖరారైంది. అయితే అంతలోనే అతడిని డిస్‌క్వాలిఫైగా తేల్చడంతో ఆనందం ఆవిరైంది. పరుగులో ప్రత్యర్థిని దాటే ప్రయత్నంలో అతను ట్రాక్ వదిలి ఎడమ వైపు బయటకు వెళ్లినట్లు తేలింది. జ్యూరీ నిర్ణయాన్ని భారత జట్టు సవాల్ చేసింది. అతను గీత దాటినా సహచర ఆటగాడిని ఇబ్బంది పెట్టలేదని, దాని వల్ల అదనపు ప్రయోజనం ఏమీ పొందలేదని కూడా వాదించింది. అయితే ఈ అప్పీల్‌ను జ్యూరీ తిరస్కరించడంతో లక్ష్మణన్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్ 7.95 మీటర్ల దూరం గెంతి ఆరో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ధరున్ అయ్యసామి, సంతోష్ కుమార్... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జౌనా ముర్ము, అను రాఘవన్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అథ్లెటిక్స్‌కు సంబంధించి ఆసియా క్రీడలు ఎంతో కఠినమైనవి. ఇక్కడ ఎన్నో ఏళ్ల తర్వాత పతకం దక్కడం సంతోషంగా ఉంది. ఆమె ఆరంభంపై ఎంతో శ్రమించాం. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేకంగా స్పీడ్ రబ్బర్లను తెప్పించి సాధన చేయించాం. గోపీచంద్‌తో పాటు ఎన్నో రకాలుగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. –నాగపురి రమేశ్, ద్యుతీ కోచ్ 2014లో నా గురించి జనం నానా రకాల మాటలు అన్నారు. ఇప్పుడు దేశం తరఫున పతకం సాధించడం గొప్ప ఘనతగా భావిస్తున్నా. రేసులో మొదటి 40 మీటర్లు చాలా వేగంగా పరుగెత్తాలని కోచ్ ముందే చెప్పారు. నేను కళ్లు మూసుకొనే పరుగెత్తాను. కళ్లు తెరిచే సరికి రేసు పూర్తయింది. గెలిచానో కూడా తెలీదు. డిస్ప్లే బోర్డుపై పేరు కనిపించిన తర్వాతే జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకున్నాను. నా కెరీర్లో ఇదే పెద్ద పతకం. –ద్యుతీచంద్ ద్యుతీచంద్ హిమ దాస్, అనస్ -
ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటిన హిమదాస్
-
ఏషియన్ గేమ్స్: మెరిసిన హిమదాస్
జకార్త : ఏషియన్ గేమ్స్‌లో హిమదాస్ సత్తా చాటింది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ అస్సాం అమ్మాయి రజతం కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్ 400 మీటర్ల విభాగంలో 50.79 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత అథ్లెట్ నిర్మల నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఆమె 52.96 సెకన్లలో పరుగును పూర్తి చేసి తృటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది. ఇక అగ్రస్థానంలో నిలిచిన బెహ్రెయిన్ క్రీడాకారిణి నాసెర్ సల్వా 50.09 సెకన్లలో పరుగును పూర్తిచేసి స్వర్ణం కైవసం చేసుకుంది. కజకిస్తాన్ క్రీడాకారిణి మికినా ఎలినా 52.63 సెకన్లలో పరుగును పూర్తి చేసి కాంస్యం దక్కించుకుంది. చదవండి: హిమదాస్ టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా? హిమదాస్ ఇటీవల అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం నెగ్గి దేశప్రజల మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దీంతో జకార్తాలోనూ ఆమె ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇక 100 మీటర్ల విభాగంలో భారత రన్నర్ ద్యూతీ చంద్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పురుషుల విభాగంలో.. పురుషుల 400 మీటర్ల విభాగంలో సైతం భారత్‌కు రజతం వరించింది. భారత అథ్లెట్ యహియా మొహహ్మద్ 45.69 సెకన్లలో పరుగును పూర్తి చేసి రజతం దక్కించుకున్నాడు. ఖతర్ అథ్లెట్ హసన్ అబ్దెల్లా(44.89) స్వర్ణం దక్కించుకోగా.. బెహ్రెయిన్ క్రీడాకారుడు కమీస్ అలీ (45.7) కాంస్యం సొంత చేసుకున్నాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత రన్నర్ ఆరోకియారాజీవ్ (45.84) నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో భారత పతకాల సంఖ్య 7 స్వర్ణాలు,9 రజతాలు, 19 కాంస్యలతో కలుపుకొని 35కు చేరుకుంది. ప్రస్తుతం పతకాల జాబితాలో భారత్ 9వ స్థానంలో కొనసాగుతోంది. -
ఏషియాఢంకా
భారీ సంఖ్యలో క్రీడాకారులు... దిగ్గజాలనదగ్గ దేశాలు... పెద్దఎత్తున బృందాలు... అందుకు తగ్గట్లు రికార్డులు... బరిలో హేమాహేమీలు... రసవత్తర సమరాలు... పతకాల వేటలో... పతాకస్థాయి పోరాటాలు... ... నేటి నుంచే ఏషియాడ్ సంరంభం ... పదహారు రోజుల పాటు సంగ్రామం సాక్షి క్రీడా విభాగం ఆసియా అతిపెద్ద క్రీడా సమరానికి నేడే శంఖారావం. ఇండోనేసియా వేదికగా... జకార్తా–పాలెంబాంగ్ నగరాల్లో శనివారం నుంచే 18వ ఏషియాడ్ ఆరంభం. 11 వేల మంది అథ్లెట్లు... 45 దేశాల ప్రాతినిధ్యంతో సెప్టెంబర్ 2 వరకు క్రీడలు. పతకాల వేటలో మేటైన చైనా... దీటైన జపాన్... దమ్మున్న దక్షిణ కొరియా... వీటిని తట్టుకుంటూ భారత్! మరి... ఈసారైనా మన భాగ్యరేఖ మెరుగవుతుందా? కామన్వెల్త్ జోరును ఇక్కడా కొనసాగిస్తుందా? పట్టికలో ప్రస్థానం పైకెళ్తుందా? బలాలేమిటి...? బలహీనతలేమిటి? అంశాల వారీగా ఓసారి సమీక్షిస్తే...! నవ యువత... అనుభవజ్ఞులు ఏషియాడ్ భారత బృందంలో పదహారేళ్ల పాఠశాల బాలిక నుంచి ఒలింపిక్ పతకాలు గెలిచిన ఉద్ధండులున్నారు. నాలుగు నెలల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు ఇదే బృందం అద్భుత ప్రదర్శనతో అనూహ్యంగా మూడో స్థానం సాధించి సగర్వంగా దేశానికి తిరిగొచ్చింది. అయితే, ఆ పోటీల్లో చైనా, జపాన్, దక్షిణ కొరియాకు ప్రాతినిధ్యం లేదు. ఏషియాడ్‌లో మాత్రం ఈ దేశాల నుంచి ప్రతి అంశంలో పోటీ తప్పదు. వీటితోపాటు బృందం ఎంపిక, పరిమితిపై వివాదాలతో ముందే కొంత చర్చ రేగింది. ఈ నేపథ్యంలో ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతమే స్ఫూర్తి... కొన్నేళ్లుగా మెరుగుపడుతున్న భారత క్రీడా వ్యవస్థకు నిదర్శనంగా 2014 ఏషియాడ్‌లో మన క్రీడాకారులు విశేషంగా రాణించారు. 11 స్వర్ణాలు సహా మొత్తం 57 పతకాలు నెగ్గి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేశారు. సుశీల్ కుమార్, నీరజ్ చోప్రా, మనూ భాకర్‌లకు తోడు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఫామ్‌ను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మరో చరిత్ర సృష్టించినట్లవుతుంది. సింధు, శ్రీకాంత్‌లపై దృష్టి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు అద్భుత ఫామ్‌లో ఉంది. ఆఖరి పోరాటాల్లో ఓడుతున్నా... ఏ దశలోనైనా పుంజుకోగల సత్తా సింధు సొంతం. చైనా, థాయ్‌లాండ్, జపాన్ షట్లర్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా... వాటిని అధిగమించడం ఈ తెలుగమ్మాయికి కష్టమేం కాదు. పూర్వ ఫామ్‌ను అందుకుంటే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నుంచి కూడా పతకం ఆశించవచ్చు. హెచ్ఎస్ ప్రణయ్పైనా ఆశలున్నాయి. హిమాదాస్ మెరిసేనా... అసోంకు చెందిన హిమాదాస్‌పై ఈ ఏషియాడ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో హిమాస్వర్ణం నెగ్గడమే దీనికి కారణం. జకార్తాలోనూ ఈమెను ఫేవరెట్‌గా భావిస్తున్నారు. పతకం సాధిస్తుందని ఆశిస్తున్నారు. వీరేం చేస్తారో... రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్లు ఏమేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. తమ గురించి కొత్తగా చాటేందుకు ఏమీ లేకున్నా... కొంతకాలంగా వీరు ఫామ్‌లో లేరు. సుశీల్ ఇటీవల టిబిలిసి గ్రాండ్‌ప్రిలో బౌట్ ఓడిపోయాడు. నాలుగేళ్లలో అతడికిదే తొలి పరాజయం కావడం గమనార్హం. టర్కీలో జరిగిన యాసర్ డొగు టోర్నీలో సాక్షి పతకం అందుకోలేకపోయింది. వీరి ప్రతిష్ఠకు ఈ ఏషియాడ్ ఓ సవాలే. స్వర్ణం తప్ప మరేది గెలిచినా వారి స్థాయికి తక్కువే అన్నట్లవుతుంది. ఒలింపిక్స్ టికెట్ కొట్టేస్తారా..? పురుషుల హాకీ జట్టు పూర్వ వైభవం దిశగా అడుగులేస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. గత ఏషియాడ్‌లో స్వర్ణంతో మెరిసింది. ఈసారి దానిని నిలబెట్టుకుంటే 2020 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందుతుంది. పరిస్థితి చూస్తే మళ్లీ స్వర్ణం నెగ్గేలా కనిపిస్తున్నా... పాకిస్తాన్, దక్షిణ కొరియాలను ఎలా ఎదుర్కొంటుందనేదీ కీలకమే. రాణి రాంపాల్ ఆధ్వర్యంలోని మహిళల హాకీ జట్టు సంచలనాలు సృష్టించ గలదు. గత క్రీడల్లో గెలిచిన కాంస్యాన్ని మించి రాణించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. ‘కిక్’ ఇస్తారా? బాక్సింగ్‌లో భారత్‌కు ఎక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకు కారణం... వికాస్ కృషన్, శివ థాపాలతో పాటు వర్థమాన తార గౌరవ్ సోలంకి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం విజేత సర్జుబాలా దేవి భారత్ ఖాతాలో పతకం చేర్చగలదు. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా స్వర్ణం ఒడిసిపట్టింది. ఇప్పుడు కనీసం ఒక పతకమైనా తెస్తుందని భావిస్తున్నారు. కొంతకాలంగా సంచలన ప్రదర్శనలతో అదరగొట్టి వార్తల్లో నిలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గాయం కారణంగా ఇబ్బంది పడింది. దాన్నుంచి కోలుకున్న ఆమె బరిలో దిగనుండటం ఆశలు రేపుతోంది. ► బ్రిడ్జ్ క్రీడలో బరిలో దిగనున్న 81 ఏళ్ల లీహంగ్ ఫాంగ్... ఆసియా క్రీడల చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడు. 11 ఏళ్ల ఇయాన్ నుర్మెన్ అమ్రి (స్కేట్‌బోర్డర్) అతి చిన్నవయస్కుడు. వీరిద్దరూ మలేసియాకు చెందినవారే కావడం విశేషం. ప్రారంభ వేడుకలు సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం మనోళ్లు 17 మంది... ► ఆర్చరీ– జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్). ► బ్యాడ్మింటన్– కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, చుక్కా సాయి ఉత్తేజిత రావు, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి, సాయిప్రణీత్, పుల్లెల గాయత్రి (తెలంగాణ) ► బాక్సింగ్– హుసాముద్దీన్ (తెలంగాణ) ► జిమ్నాస్టిక్స్– అరుణా రెడ్డి (తెలంగాణ) ► మహిళల హాకీ– రజని (ఆంధ్రప్రదేశ్) ► పురుషుల కబడ్డీ– మల్లేశ్ (తెలంగాణ) ► సెపక్తక్రా– తరంగిణి (తెలంగాణ) ► షూటింగ్–రష్మీ రాథోడ్ (తెలంగాణ) ► టెన్నిస్–యడ్లపల్లి ప్రాంజల (తెలంగాణ) -
హిమదాస్ కోచ్‌పై లైంగిక ఆరోపణలు
న్యూఢిల్లీ : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించి హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే హిమదాస్ వంటి అద్బుతమైన అథ్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ నిపన్దాస్పై లైంగిక ఆరోపణలు రావడం సంచలనం రేపింది. తనను లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న ఓ మహిళా క్రీడాకారిణి గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత మే నేలలో నిపన్ దాస్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఎంతో మంది అథ్లెట్లకు నిపన్‌దాస్ శిక్షణనిస్తున్నాడు. హిమదాస్ సైతం ఆయన శిక్షణలోనే రాటుదేలింది. ఆ ఆరోపణలు అవాస్తవం.. ఈ ఆరోపణలను నిపన్‌దాస్ ఖండిచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి., కల్పితమైనవి. ఆమె నా దగ్గర 100మీ, 200 మీటర్ల విభాగాల్లో శిక్షణ తీసుకునేది. రాష్ట్ర జట్టులో చోటు కల్పించాలని ప్రాధేయపడేది. కానీ ఆమె కన్నా వేగంగా పరుగెత్తే వారు ఉండటంతో నేను సహకరించలేదు. జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రాష్ట్ర జట్టులో చోటు దక్కలేదు. దీంతోనే ఆమె అసత్య ఆరోపణలు చేస్తుంది. ప్రస్తుతం పోలీస్ విచారణ కొనసాగుతున్నది. నాతో పాటు సహాయక కోచ్‌లు, కొంత మంది అథ్లెట్లను విచారించారు. దర్యాప్తులో ఎలాంటి మచ్చలేకుండా బయటపడుతానన్న నమ్మకం ఉంది’ అని నిపన్ చెప్పుకొచ్చాడు. చదవండి : టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా? కన్నీళ్లురాని ఇండియన్ ఉండరు.. వైరల్ -
క్రీడా సంచలనం హిమదాస్‌పై బయోపిక్!
భారతీయ క్రీడారంగంలో ఒక సంచలనం హిమదాస్. 18 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ అథ్లెటిక్ ఈవెంట్లో సత్తా చాటి.. భారత్ తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించిన స్ప్రింటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పుడామె జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కించాలని అక్షయ్‌కుమార్ ఆసక్తి కనబరుస్తున్నారు. నిర్మాతగా ఆమె జీవితచరిత్రను తెరకెక్కించడానికి ఇష్టపడతానని బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్కీ తాజాగా తెలిపాడు. 2018 ఆసియా గేమ్స్ కోసం సిద్ధమవుతున్న భారతీయ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈడెల్వీస్ గ్రూప్ శనివారం ఓ కార్యక్రమం నిర్వహించింది. హాకీ నేపథ్యంతో తెరకెక్కిన తన ‘గోల్డ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ కార్యక్రమంలో అక్షయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరు నిర్మాతగా ఏ భారతీయ క్రీడాకారుడిపై సినిమా తీసేందుకు ఇష్టపడతారని అక్షయ్‌ని అడుగ్గా.. ‘హిమదాస్‌పై బయోపిక్ తీసేందుకు నేను ఇష్టపడతాను. ఆమె ట్రాక్ రన్నర్. భారత్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి.. పరుగు పోటీల్లో స్వర్ణపతకం సాధించడమనేది చాలా అరుదైన ఘనత. ఇది నిజంగా అసాధారణమైన విషయం’ అని ఆయన అన్నారు. ‘పరుగు పోటీల విషయంలో భారత్ ప్రదర్శన ఒకింత పేలవంగా ఉందని చెప్పాలి. మనం ఈ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరముంది. మన దగ్గర కూడా గొప్ప ప్రతిభావంతులు ఉన్నారని ప్రపంచానికి చాటాలి. బస్సులు, రైళ్లను క్యాచ్ చేయడానికి రోజూ మనం చాలా వేగంగా పరుగులు దీస్తాం. అందుకే హిమదాస్‌పై నేను బయోపిక్ తీయడానికి ఇష్టపడతాను’ అని అక్షయ్ అన్నారు. -
అలవోక అభ్యాసం
కందులిమరి గ్రామం చేల గట్ల మీద మొదలైన హిమాదాస్ పరుగు ఫిన్లాండ్లోని టాంపేర్ స్టేడియం ట్రాక్ ఎక్కింది. ఈ రెండింటి మధ్య సాగిన హిమ ప్రయాణం అంత పెద్దదీ కాదు, మరీ చిన్నదీ కాదు. గోల్డ్ మెడల్ కోసం ఆమె ఆయాస పడి శ్రమించింది లేదు, ఒక ఏడాది కష్టపడిందంతే! పిల్లలు హక్కులు ప్రదర్శిస్తుంటారు. ప్రశ్నలు సంధిస్తుంటారు. అలాంటి హక్కులున్న చిన్న పిల్ల హిమాదాస్. ఐదుగురు పిల్లల్లో చిన్నమ్మాయి. అందరి కంచాల్లోకి అన్నం రావాలంటే, ఇంట్లో అందరి ఒంటి మీద శుభ్రమైన దుస్తులు ఉండాలంటే ఇంట్లో అందరూ కష్టపడాల్సిన కుటుంబ నేపథ్యం వారిది. అయినా సరే ఆడుతూపాడుతూ బాల్యాన్ని బాల్యంగా ఆస్వాదించే విరచిత హక్కులు దఖలు పరచబడిన అమ్మాయి హిమ. చిన్నప్పుడు హిమ అబ్బాయిలతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూంటే అమ్మానాన్నలు మురిసిపోయారు. ‘అదేంటి మగపిల్లాడిలా’ అనలేదు. ఇప్పుడీ అమ్మాయి సాధించిన విజయానికి దేశం మొత్తం బుగ్గలు పుణికి మొటికలు విరుస్తుంటే పొంగిపోతున్నారు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వంటి దేశ ప్రముఖులైతే ప్రపంచ స్థాయిలో మన జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు హిమను చూసి గర్వపడుతున్నారు. ఇంత పెద్ద దేశం, నూటా ముప్పై కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం... ఇన్ని కోట్లమందిలో ఇంతవరకు ఒక్కరూ సాధించని విజయాన్ని పద్దెనిమిదేళ్ల అమ్మాయి సాధించింది. ఆమె తెచ్చిన బంగారు పతకమే.. ఈ దేశానికి ప్రపంచ స్థాయి అథ్లెటిక్ రంగంలో తొలి గోల్డ్ మెడల్. ఐఏఏఎఫ్ అండర్ 20 కేటగిరీలో అథ్లెటిక్స్‌లో పాల్గొని 51.46 సెకన్లలో నాలుగు వందల మీటర్ల లక్ష్యాన్ని చేరుకుని తొలి స్థానంలో నిలిచింది హిమాదాస్. క్రీడాకారులు విరాట్ కోహ్లీ, వీరేందర్ సింగ్ సెహ్వాగ్, బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌తోపాటు అనేకమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ‘దేశానికి ప్రపంచస్థాయి బంగారు పతకం తెచ్చిన బంగారం’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. సౌకర్యాలు లేకుండానే సాధన! అస్సాం రాష్ట్రం, నాగోన్ జిల్లా, థింగ్ పట్టణానికి సమీపంలో కందులిమరి గ్రామం చేల గట్ల మీద మొదలైన హిమ పరుగు ఫిన్లాండ్లోని టాంపేర్ స్టేడియం ట్రాక్ ఎక్కింది. ఈ రెండింటి మధ్య సాగిన హిమ ప్రయాణం అంత పెద్దదీ కాదు, మరీ చిన్నదీ కాదు. గోల్డ్ మెడల్ కోసం ఆమె ఆయాస పడి శ్రమించింది లేదు, ఒక ఏడాది కష్టపడిందంతే. అలాగని వడ్డించిన విస్తరిలా ఆమెకు అన్నీ సిద్ధంగా ఉన్నాయా అంటే.. ఏ ఒక్క సౌకర్యమూ లేదు. కనీసం కాళ్లకు స్పోర్ట్స్ షూ కొనడానికి కూడా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. హిమలో అథ్లెట్ ఉందని గుర్తించింది ఆ స్కూల్ పీఈటీ నిపాన్ దాస్. అథ్లెటిక్స్ వైపు ఆమె దృష్టిని మరల్చింది కూడా అతడే. జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడంతోపాటు రాష్ట్ర క్రీడల కార్పొరేషన్ సహాయంతో మెరుగైన శిక్షణ ఇప్పించడంలోనూ సహకరించాడతడు. పల్లెటూరిలోనే ఉంటే స్పెషల్ కోచింగ్ కుదరదు. అందుకే గౌహతికి తాత్కాలికంగా మకాం మార్చమని హిమ తల్లిదండ్రులు రంజిత్, జోనాలి దాస్‌లకు సూచించాడు. గౌహతిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకుని శిక్షణ ఇప్పించారు. తన పోటీ తనతోనే!! హిమాదాస్ పరుగెత్తిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ... ‘పక్క ప్రత్యర్థులను చూడను కూడా చూడదు. లక్ష్యం వైపు సాగడమే తన పని అన్నట్లు పరుగెడుతుంది. తన టైమింగ్ తానే అధిగమించాలనే లక్ష్యంతో పరుగెత్తుతుంది’ అన్నారు నిపాన్. అందరి ప్రశంసలు ఒక ఎత్తయితే క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మెచ్చుకోలు ఒక్కటీ ఒకెత్తు. ఆయన ట్విట్టర్లో ‘హిమ చరిత్ర సృష్టించింది, ఈ చాంపియన్ షిప్ సాధించిన తొలి ఇండియన్. దేశానికే గర్వకారణం ఈ నారీ శక్తి’ అంటూ హిమాదాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ మంత్రి ఎన్నికల్లో గెలుపు ఓటములనే కాకుండా, క్రీడల్లో గెలుపు ఓటములు కూడా తెలిసిన వాడు కదా మరి. -
టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా?
సాక్షి, హైదరాబాద్ : హిమ దాస్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారు మోగుతున్న పేరు. గత రెండు రోజులుగా ఈ అసోం అమ్మాయిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి.. సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసించడానికి పోటీ పడ్డారు. అయితే ఆమె ప్రతిభను కేవలం ప్రశంసలతోనే సరిపెట్టడమే విస్మయానికి గురిచేస్తోంది. గతంలో పతకాలు సాధించిన ఆటగాళ్లకు దక్కిన నజరానా, బహుమతులు కానీ ఈ గ్రామీణ క్రీడాకారిణికి దక్కకపోవడం గమనార్హం. క్రీడలకు అంతంత మాత్రానే ప్రోత్సాహకం లభించే మన దేశంలో విజయాలు సాధిస్తే మాత్రం బహుమతులు, నజరానాలతో పోటీపడటం గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే హిమ విషయంలో మాత్రం 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆమె ఖర్చులు భరిస్తామని, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద నెలకు రూ. 50 వేలు చొప్పున అందజేస్తామని చెప్పి క్రీడా మంత్రిత్వ శాఖ చేతులు దులుపుకోవడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారిణులకు దేశం ఎంతో ఘనంగా స్వాగతం పలికింది. ఏవేవో కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు వరదలో ముంచెత్తాయి.. ఆకాశానికి ఎత్తాయి.. కార్లు ఇచ్చాయి.. కానుకలిచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి. కానీ చాలా మంది స్పాన్సర్లు, పుష్కలంగా డబ్బులున్న టెన్నిస్, బ్యాడ్మింటన్ స్టార్లకే కాకుండా.. మట్టిలో మాణిక్యమైన హిమ దాస్ వంటి గ్రామీణ క్రీడాకారులకు కూడా సాయం అందిస్తే బాగుంటుందని ప్రతీ సగటు క్రీడా ప్రేమికుడు అభిప్రాయపడుతున్నాడు. అసలెవరూ ఈ హిమ దాస్ ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం నెగ్గారు. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ దాస్ రికార్డు సృష్టించింది. అసోంలోని నగావ్ జిల్లా ధింగ్ గ్రామం 18 ఏళ్ల హిమ దాస్ స్వస్థలం. నలుగురు పిల్లల్లో చిన్నది. దేశంలోని ఎందరో మేటి అథ్లెట్ల మాదిరిగానే ఆమెది గ్రామీణ, పేదరిక నేపథ్యం.. వారిలాగే ఆటలంటే ఆమెకు ఎక్కడలేని ఇష్టం.. బురద, మట్టితో కూడిన తన పొలమే ఆమెకు తొలి ‘ట్రాక్’ అయింది.. అక్కడ నిరంతర సాధన ఆమెను శారీరకంగా బలవంతంగా తయారు చేస్తే.. కుటుంబ కష్టాలు, కన్నీళ్లు మానసిక దృఢత్వాన్ని పెంచాయి.. అయితే తొలి అడుగు ఫుట్‌బాల్‌వైపు పడినా పరుగులో ఆమె వేగం చూసిన స్థానిక కోచ్ ఇచ్చిన సలహాతో రన్నింగ్‌కు మారింది.. అలా రెండేళ్లలోనే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది.. దిగ్గజ మిల్కాసింగ్, పీటీ ఉష తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత పతాకంను రెపరెపలాడించిందీ. చదవండి: కన్నీళ్లురాని ఇండియన్ ఉండరు : మోదీ -
టోక్యో ఒలింపిక్స్ వరకు ‘టాప్స్’లో హిమ దాస్
భారత అథ్లెటిక్స్ నయా సంచలనం హిమ దాస్‌కు పూర్తి సహకారం అందిస్తామని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద నెలకు రూ. 50 వేలు చొప్పున హిమకు లభించనున్నాయి. మరోవైపు హిమ దాస్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రతిభావంతులు ఏపీలో సమృద్ధిగా ఉన్నారని, ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పిస్తే వారు తమ అత్యుత్తమమైన ప్రతిభను కనబర్చి భారతదేశానికి మరింత ఘనకీర్తిని తీసుకువస్తారన్నారు. -
హిమ దాస్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన హిమదాస్‌కు వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తే.. వారు అద్భుతంగా రాణించి.. దేశానికి కీర్తిప్రతిష్టలు సాధించి పెడతారని ఆయన శనివారం టిటర్‌లో పేర్కొన్నారు. ఫిన్లాండ్లోని టాంపెరెలో జరుగుతున్న ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో హిమ దాస్ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం. Congratulations @HimaDas8 on becoming the first ever Indian girl to win gold in world U20 athletics. AP has such potential in abundance. Provided world-class sports facilities, these athletes can perform their best and bring many more accolades to India. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2018 -
కన్నీళ్లురాని ఇండియన్ ఉండరు.. వైరల్
న్యూఢిల్లీ : ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రికార్డ్ టైమింగ్‌తో భారత క్రీడాకారిణి హిమ దాస్ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. హిమ దాస్ అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘హిమ దాస్ విజయం మరిచిపోలేని క్షణాలు. రేసులో నెగ్గిన వెంటనే జాతీయ పతాకం కోసం ఆమె అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపై విజేతగా నిలిచిన హిమ దాస్ మన జాతీయ గీతాన్ని పాడటం మనసును కరిగించింది. ఈ వీడియో చూసిన భారతీయులెవ్వరూ సంతోషంతో కంటతడి పెట్టకుండా ఉండలేరంటూ’ మోదీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా, ఫిన్లాండ్లోని టాంపెరెలో జరుగుతున్న ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం నెగ్గారు. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం. ఆ రేసులో ఆండ్రియా మెక్లోస్ (రొమేనియా– 52.07సెకన్లు), టేలర్ మ్యాన్షన్ (అమెరికా – 52.28 సెకన్లు) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచారు. తన తాజా ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు హిమ దాస్. Unforgettable moments from @HimaDas8’s victory. Seeing her passionately search for the Tricolour immediately after winning and getting emotional while singing the National Anthem touched me deeply. I was extremely moved. Which Indian won’t have tears of joy seeing this! pic.twitter.com/8mG9xmEuuM — Narendra Modi (@narendramodi) 14 July 2018 -
అంతా కలలా అనిపిస్తోంది: హిమ
న్యూఢిల్లీ: ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్ హిమ దాస్ తాను కలలో విహరిస్తున్నట్లు ఉందని అంటోంది. ఫిన్లాండ్లో గురువారం జరిగిన ఈ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగులో అస్సాంకు చెందిన హిమ దాస్ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ మెగా ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. ‘దేశం కోసం ఏదో సాధించాలనే సానుకూల దృక్పథంతోనే ముందడుగు వేశాను. ప్రస్తుతం ఈ విజయం నాకు కలలో ఉన్న భావన కలిగిస్తోంది’ అని తెలిపింది. స్వర్ణం నెగ్గిన హిమ దాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన హిమకు శుభాకాంక్షలు. నీ ఘనతను చూసి దేశం గర్విస్తోంది. నీ విజయం రాబోయే కాలంలో యువకులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘హిమ దాస్‌కు అభినందనలు. ఇది యావత్ భారత జాతి గర్వించే సమయం. ఒలింపిక్ పోడియంపై నిలవాలని ఆశిస్తున్నాం’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. -
ఈ విజయం అసామాన్యమైనది : సెహ్వాగ్
ప్రపంచ అండర్- 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి హిమ దాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిమ దాస్‌ను ప్రశంసిస్తూ.. ‘వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన హిమకు శుభాకాంక్షలు. అస్సాం, భారత్‌కు నువ్వు గర్వకారణం. ఇక ఒలంపిక్ మెడల్ సాధించే దిశగా కృషి చేయాలి’ అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా.. ‘మమ్మల్ని గర్వంతో తలెత్తుకునేలా చేశావంటూ’ హిమను ప్రశసించారు. ఇక ట్విటర్ ఫన్నీమ్యాన్ వీరేంద్ర సెహ్వాగ్... ‘చాలా గర్వంగా ఉంది. నీ విజయం అసామాన్యమైనది. స్వర్ణ పతకం సాధించి మాకు సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన భారత ప్రజలందరికీ హిమ దాస్ ధన్యవాదాలు తెలిపారు. కాగా అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. తద్వారా ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ చరిత్ర సృష్టించారు. Congratulations to our sensational sprint star Hima Das for winning the 400m gold in the World Under-20 Championship. This is India’s first ever track gold in a World Championship. A very proud moment for Assam and India, Hima; now the Olympic podium beckons! #PresidentKovind — President of India (@rashtrapatibhvn) July 12, 2018 Wow! So proud of you Hima Das. Incredible, historic achievement on becoming the first Indian track athlete to win a medal at any global event winning Gold at women's 400m World U-20 Championships clocking a time of 51.47 seconds. Thank you for the happiness. pic.twitter.com/Cs5wY8sDuM — Virender Sehwag (@virendersehwag) July 12, 2018 T 2865 - CONGRATULATIONS .. #HimaDas , the first Indian Women to win a GOLD in World Athletic track event EVER ! INDIA is proud of you .. you have given us reason to hold up our heads HIGH ! JAI HIND !! 🇮🇳🇮🇳 pic.twitter.com/Q0YVCx6FSf — Amitabh Bachchan (@SrBachchan) July 12, 2018 -
హిమ దాస్ స్వర్ణ చరిత్ర
టాంపెరె: ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి హిమ దాస్ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్లోని టాంపెరెలో జరుగుతున్న ఈ ఈవెంట్ 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం. 2016 చాంపియన్‌షిప్‌లో ఫీల్డ్ విభాగంలో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) స్వర్ణం నెగ్గాడు. 400 మీటర్ల పరుగులో ఆండ్రియా మెక్లోస్ (రొమేనియా– 52.07 సె.), టేలర్ మ్యాన్షన్ (అమెరికా – 52.28 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్లో చెలరేగి భారత అథ్లెటిక్స్ ప్రపంచం గర్వపడే ప్రదర్శన కనబర్చింది. -
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ ఫైనల్లో హిమ దాస్
భారత క్రీడాకారిణి హిమ దాస్ ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగులో ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్ హీట్స్‌లో 18 ఏళ్ల హిమ 52.10 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ముందంజ వేసింది. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ జిస్నా మాథ్యూ మాత్రం విఫలమైంది. సెమీ ఫైనల్ హీట్‌లో ఆమె 53.86 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానానికే పరిమితమైంది.