Addiction
-
పొద్దస్తమానం సోషల్ మీడియాలోనే!
డాక్టరు గారూ! నా కూతురు వయస్సు 16 సంవత్సరాలు. తను ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతోంది. అక్కడ ఎక్కువగా అబ్బాయిలతో చాట్ చేయడం, తన ఫోటోలు పెట్టడం చేస్తోంది. మేము ఆంక్షలు పెట్టినప్పుడు విపరీతమైన కోపాన్ని, భావోద్వేగాలను ప్రదర్శించడం, మందలిస్తేనేమో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం సాధారణం అయ్యాయి. ఈ మధ్య చదువు మీద శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయింది. మీ సలహా కోసం ఎదురు చూస్తుంటాం. –స్రవంతి, మహబూబ్నగర్మీరు పడుతున్న వేదన అర్థమవుతోంది. ఈ మధ్య ఇలాంటి సమస్యలను తరచూ గమనిస్తున్నాం. మీ అమ్మాయికి ఉన్న కండిషన్‌ని ‘బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. ఇందులోని ప్రధానమైన లక్షణాలు అస్థిరమైన సంబంధాలు, విపరీతమైన భావోద్వేగాలు ఆత్మహత్య బెదిరింపులు, ఆత్మహత్యా ప్రయత్నాలు. వీటికి తోడు మీరు చెప్పినట్టు స్నేహితులను మార్చడం, సంబంధాల స్వభావం కూడా ఈ సమస్యకి సంబంధించినవే! మీ అమ్మాయిని ఒక మంచి సైకియాట్రిస్టుకి చూపించి ఈ సమస్య కోసం వైద్య చికిత్స (మందులు) మానసిక చికిత్స (థెరపీ) ఇప్పించాలి. ‘డయలెక్టికల్ బిహేవియర్ థెరపీ’ ఆత్మ నియంత్రణను, మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది. సోషల్ మీడియా వినియోగంపై నిర్దిష్ట నిబంధనలు పెట్టడం మంచి ఆలోచన. నిర్ణీతగంటల్లో మాత్రమే ఉపయోగించడం, ఖచ్చిత సమయానికి పరిమితం చేయడం వంటివి, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవలకు స్వచ్ఛందంగా సహాయం చేయడం తన పరిస్థితిని మెరుగు పరుస్తాయి.ఆమెతో మాట్లాడేటపుడు తన భావనలను గౌరవిస్తూనే, తనకు సరైన గైడెన్స్ ఇవ్వండి. తన పరిస్థితి మెరుగుపడడానికి సమయం, సహనం అవసరం. అన్నింటికీ మించి మీ కుటుంబ సభ్యుల ప్రేమ ఎంతో అవసరం. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఆశాజనకంగా ఉండండి. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?!) -
అమ్మే దిగివస్తే మత్తు దిగదా..
పంజాబ్‌లో హెరాయిన్‌ని ‘చిట్టా’ అంటారు. దీని అడిక్షన్లో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ను వ్యతిరేకించడానికి నేడు తల్లులే రంగంలోకి దిగారు. పంజాబ్‌లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ మొదలైంది. నిజానికి ఇది ప్రతి రాష్ట్రంలో జరగాలి. డ్రగ్స్ నీడ లేని ఇల్లే సమాజానికి వెలుగు.పంజాబ్‌లో ‘డ్రగ్స్’ మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రకృతిలోని మహమ్మారికి మందు ఉంది వాక్సిన్లు ఉన్నాయి... కాని ఈ మహమ్మారికి మందు లేదు. దీనిని నివారించాలంటే మానవశక్తి కావాలి. మహా శక్తి కావాలి. ఆ శక్తి తల్లే తప్ప మరెవరూ కాలేరని పంజాబ్‌లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమం మొదలైంది. ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ అనే సంస్థ సెప్టెంబర్ 15న హోషియార్‌పూర్‌లో ఈ ఉద్యమం మొదలెట్టింది. ఈ కార్యక్రమానికి తల్లులు భారీగా తరలి వచ్చారు. పిల్లలు వ్యసనాల బారిన పడితే కడుపుకోతకు గురయ్యేది మొదట తల్లులే. పిల్లల్ని కాపాడుకోవాల్సింది మొదట వారే.13 నుంచి 18 ఏళ్ల మధ్యలోపిల్లల వయసు 13 నుంచి 18 ఏళ్ల మధ్య వరకు తల్లులు వారిని జాగ్రత్తగా గమనించుకుంటే డ్రగ్స్ నుంచి కాపాడుకోవచ్చని ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ స్థాపకుడు, రచయిత కుష్వంత్ సింగ్ అన్నాడు. పంజాబ్‌లోని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఆయన ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమానికి అంకురార్పణ చేశాడు. ‘పంజాబ్‌లో 13 నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు డ్రగ్స్‌కు పరిచయం అవుతున్నారు. 14 నుంచి 24 ఏళ్ల మధ్య వీళ్లు అడిక్ట్స్‌గా మారుతున్నారు. వీరిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో పడేస్తే మారే వారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. అంటే డ్రగ్స్ బానిసత్వం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి’ అన్నాడాయన. ‘పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గత సంవత్సరం చండీగఢ్ నుంచి భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్ వరకూ పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఎందరో తల్లులు వచ్చి మా పిల్లలు బాగుపడే మార్గం లేదా అని అడిగేవారు. తల్లులే మొదటి రక్షకులుగా మారితే పిల్లలను డ్రగ్స్‌వైపు వెళ్లకుండా ఆపొచ్చని నాకు అనిపించింది. దాని ఫలితమే ఈ ఉద్యమం’ అని తెలిపాడతడు.మంచాలకు సంకెళ్లుపంజాబ్లో హెరాయిన్ వ్యసనపరులు లెక్కకు మించి ఉన్నారు. దీనిని అక్కడ ‘చిట్టా’ అంటారు. దాని కోసం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు. వారిని డ్రగ్స్ కోసం వెళ్లకుండా ఉంచేందుకు తల్లిదండ్రులు మంచాలకు సంకెళ్లు వేసి కట్టేసి ఉంచడం సర్వసాధారణం. పంజాబ్‌లో కొన్ని ఊళ్లు డ్రగ్స్ వల్ల చని΄ోయిన వ్యక్తుల భార్యలతో నిండి ‘వితంతువుల పల్లెలు’గా పేరు పడటం సమస్య తీవ్రతను తెలుపుతుంది.తల్లులకు ట్రైనింగ్ ఇస్తేమదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్ ఉద్యమంలో తల్లులను ఒకచోట చేర్చి డ్రగ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన గౌరవ్ గిల్ అనే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నవారి శారీరక కదలికలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ సందర్భంగా తల్లులకు తెలియచేసి పిల్లల్లో ఈ మార్పు చూడగానే అలెర్ట్ అవ్వాలని కోరాడు. ‘తొలి రోజుల్లోనే గమనిస్తే చాలా మేలు జరుగుతుంది. చాలాసార్లు పరిస్థితి చేయి దాటి ΄ోయాకే పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యారని తల్లిదండ్రులు గమనిస్తున్నారు’ అని అక్కడకు వచ్చిన ΄ోలీసు అధికారులు తెలిపారు. అందుకే ఈ ఉద్యమంలో డ్రగ్స్ కార్యకలాపాలు గమనించిన వెంటనే ΄ోలీసుల హెల్ప్‌లైన్‌కు ఎలా తెలపాలి, ΄ోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో తెలియచేస్తారు. ‘గ్రామీణ స్త్రీలకు ఈ శిక్షణ ఉంటే గ్రామాల్లో యువకులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోగలరు’ అంటున్నారు ఈ ఉద్యమ బాధ్యులు.ఎన్నో రకాలుమత్తు పదార్థాలంటే హెరాయిన్, గంజాయి మాత్రమే కాదు. వైటెనర్స్తో మొదలు దగ్గుమందు వరకు ఎన్నో ఉన్నాయి. డ్రగ్స్ చలామణి కోసం పంజాబ్‌లో దగ్గుమందు ముసుగులో ఫ్యాక్టరీలు తయారయ్యి ్రపాణాంతకస్థాయిలో దగ్గుమందులోని రసాయనాలను ఇంజెక్షన్లుగా ఎక్కించునే విధంగా తయారు చేస్తున్నారు. అంతేకాదు గ్రాము బరువుకు ఎక్కువ పొడి వచ్చే విధంగా తయారు చేయడంతో ఒక్క గ్రాముతో కూడా రోజు గడపొచ్చనుకుని అలవాటు పడుతున్నారు.ఏం చేయాలి?తల్లిదండ్రులు పిల్లలతో తరచూ సమయం గడపాలి. వారితో విహారాలు చేయాలి. ఆ సమయంలో వారి మనోభావాలు విని స్నేహాలు తెలుసుకోవాలి. చదువుల్లో మార్కులు తెలుసుకోవాలి. ప్రవర్తనను గమనించాలి. ఇవన్నీ ఏమాత్రం తేడా వున్న అనుమానించి ఆదుకోవాలి. ఈ స్పీడు యుగంలో ఎవరూ ఈ పని చేయడం లేదు. తల్లులకు తప్పదు. వారే రక్షకులు. అమ్మ వల్లే మారాను‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమంలో భాగంగా డ్రగ్స్ నుంచి బయటపడి సామాన్య జీవితం గడుపుతున్న వారి కథనాలు కూడా స్వయంగా వినిపించారు. ‘నేను డ్రగ్స్ నుంచి కేవలం మా అమ్మ వల్ల బయట పడ్డాను. ఒక దశలో హెరాయిన్ డోస్ కోసం 2 లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడలేదు. మా అమ్మ నా కోసం అనేక త్యాగాలు చేసి మామూలు మనిషిని చేసింది’ అని ఒకతను తెలిపాడు. -
మత్తు వదిలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాలు రవాణా చేసే ముఠాలను కట్టడి చేయడంతోపాటు మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిని అందులోంచి బయటపడేసే వ్యూహంతో ముందుకు వెళితేనే మత్తు మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యమవుతుందని నిపుణులు చెపుతున్నారు. మద్యం, కల్తీకల్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ సెంటర్లకు రోగుల సంఖ్య ఇటీవల పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల గురించి అవగాహన పెరుగుతుండటంతో డీ–అడిక్షన్ సెంటర్లలో చేరే రోగుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీ–అడిక్షన్ సెంటర్ల పనితీరును టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవలే పరిశీలించి ఓ నివేదికను తయారు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 డీ–అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తుండగా.. ఐదు సెంటర్లు పూర్తిగా మూతపడినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా డీ–అడిక్షన్‌కు ప్రాధాన్యం పెరగడంతోనషాముక్త భారత్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీసం 10 చొప్పున బెడ్లు అందుబాటులోకి తెచ్చారు. మద్యం బానిసలే ఎక్కువ.. డీ–అడిక్షన్ సెంటర్లలో చేరుతున్న రోగులలో ఎక్కువ మంది మద్యానికి బానిసలైన వారే ఉంటున్నారు. తర్వాత పెద్ద సంఖ్యలో గంజాయి బానిసలు ఉంటున్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 12 వరకు డీ–అడిక్షన్ సెంటర్లలో చేరిన రోగుల సంఖ్య ఆధారంగా చూస్తే.. హనుమకొండలోని డీ–అడిక్షన్ కేంద్రంలో 1,067 మంది మద్యానికి బానిసలైన వారుండగా, గంజాయి రోగులు 344 మంది ఉన్నారు. ఆదిలాబాద్ సెంటర్లో 781 మంది మద్యానికి బానిసలైన వారు చేరగా.. 53 మంది గంజాయి బాధితులు ఉన్నారు.ఎల్బీనగర్లోని సెంటర్లో 933 మంది మద్యానికి బానిసలైన రోగులు, 39 మంది గంజాయికి బానిసలైన రోగులున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో 850 మంది మద్యం బానిసలు, 30 మంది గంజాయికి బానిసలైన రోగులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని సెంటర్లో 722 మంది మద్యానికి బానిసలైన వారు.. 24 మంది గంజాయికి అలవాటుపడిన వారున్నారు. ఖమ్మం జిల్లా మధిర‡ సెంటర్లో 427 మంది రోగులు మద్యానికి బానిసలైన వారుండగా, 23 మంది గంజాయి నుంచి డీ–అడిక్షన్ కోసం చేరారు. డీ–అడిక్షన్ సెంటర్లు అంటే..? మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి వారిని తిరిగి ఆరోగ్యవంతులుగా మార్చే కేంద్రాలను డీ–అడిక్షన్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్ఏపీడీడీఆర్) పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. -
దేశాన్ని కమ్మేస్తున్న మత్తు మబ్బులు.. సినిమా ప్రభావమా?.. వ్యవస్థలో లోపమా ?
-
Social Media: ఈ వ్యసనం ప్రాణాంతకం
15 సెకన్ల రీల్స్ కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతోంది నేటి యువత. రీల్స్‌ను ప్రవేశపెట్టిన ఇన్ స్టాగ్రామ్‌కు నేడు మన దేశంలో 24 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. వీరిలో యువతీ యువకులే ఎక్కువ. ఆన్ లైన్ ఫేమ్ కోసం చిత్ర విచిత్రమైన రీల్స్ చేయడానికి ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు. గొడవలు, మర్డర్లు జరుగుతున్నాయి. మంచి ఫోన్ల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ఈ వ్యసనాన్ని ఇలాగే వదిలేయాలా?పూణెలో పోలీసులు వెంటనే స్పందించారు. మిహిర్ గాంధీ (27), మీనాక్షి సలూంఖే (23)లను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐ.పి.సి 336 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీని ప్రకారం ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రీల్ చేశారు కనుక.ఏం జరిగింది?పూణెకు చెందిన మిహిర్ గాంధీ, మీనాక్షి వారం క్రితం ఒక రీల్ విడుదల చేశారు. అందులో ఎత్తయిన భవంతి మీద మిహిర్ ఉంటే అతని చేయి ఆధారంగా మీనాక్షి గాల్లో వేలాడింది. అతను వదిలేసినా ఆమె చేయి జారినా మీనాక్షి కచ్చితంగా చనిపోయి ఉండేది. ఈ రీల్ బయటకు రాగానే అందరూ మండి పడ్డారు. ఈ రీల్స్ పిచ్చికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి...ఇటీవల లక్నోలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రీల్ చేయబోయిన శివాంశ్ అనే కుర్రాడు కాలు జారి పడి మరణించాడు. దాంతో లక్నోలో పెద్ద ఎత్తున రీల్స్ అడిక్షన్ మీద చర్చ జరిగింది. ఇలా రీల్స్ చేస్తున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం మానేయాలని తల్లిదండ్రులు, సమాజం అందరూ కోరారు. ఇలాగే రాజస్థాన్‌లోని పాలిలో ఒక యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక రీల్ చేయాలనుకున్నాడు. తల్లిదండ్రులు వారించేసరికి కోపమొచ్చి వారిని చంపేశాడు. టీనేజ్ యువతీ యువకులు ఇలా మతిలేని పనులు చేస్తున్నారనుకున్నా వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా రీల్స్‌కు బలవుతున్నారు. చత్తిస్‌గఢ్‌లోని భిలాయ్‌కి చెందిన ఒక మహిళ రీల్స్ చేయడానికి అడిక్ట్ అయ్యి భర్త వారించాడని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలో ఒక భార్య రీల్ కోసం కన్నడ గీతానికి గంతులేసిందని మనసు నొచ్చుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లో రీల్స్ వద్దన్నందుకు భర్తనే చంపేసింది మరో మహిళ. రీల్స్ కోసం యువతీ యువకులు రకరకాల డ్రస్సులు వేసుకోవడం, ప్రాంక్‌లు చేయడం, ట్రాఫిక్‌లో ప్రమాదకరమైన ఫీట్లు చేయడం చివాట్లు తినడం ఆనవాయితీగా ఉంది. సమర్థమైన మంచి కంటెంట్‌తో కొందరు గుర్తింపు పొంది లాభపడుతున్నా మరెందరో ఈ రీల్స్ అనే వధ్యశిలపై తలలు తెగిపడుతున్నారు.గుర్తింపు కోసం పోరాటం...గతంలో డార్విన్ మనుగడ కోసం పోరాటం అన్నాడు. ఇవాళ ప్రభుత్వ పథకాల వల్ల మనుగడకు ఢోకా లేదు. ఇక మిగిలింది గుర్తింపు. టీనేజ్‌లో ఉన్న యువతీ యువకులకు గుర్తింప బడాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. గతంలో బాగా చదివి, ర్యాంక్ తెచ్చుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఒక్క రీల్‌తో గుర్తింపు వస్తోంది. ఫాలోయెర్ల వల్ల ఇదంతా ‘తమ కుటుంబం’ అనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడూ కల్పిత ప్రపంచంలో ముక్కూ మొహం ఎరగని వారి కామెంట్ల ద్వారా వారు సంతృప్తి ΄÷ందుతుంటారు. మరిన్ని కామెంట్ల కోసం మరిన్ని రీల్స్ చేయాలి. మరిన్ని రీల్స్ కోసం మరిన్ని రిస్క్‌లు తీసుకోవాలి అనే భావన బలపడుతుంది.253 కోట్ల మంది...ప్రపంచ వ్యాప్తంగా రోజూ 253 కోట్ల మంది రీల్స్ చూస్తున్నారని ఒక అంచనా. 2020లో టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రవేశ పెట్టింది. 15 నుంచి 30 సెకండ్ల వీడియోలు పోస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతో ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో కంటెంట్ క్రియేటర్ల పేరుతో గుర్తింపు కోసం అందరూ రంగంలో దిగారు. మన దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారంటే (కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారంటే) అంతమందికి మంచి కంటెంట్ దొరికే అవకాశం లేదు. అందుకే పిచ్చి స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.సిసలు ప్రపంచంలో...యువతీ యువకులు సిసలైన ప్రపంచంలో ఉండేలా చేస్తే వారిని ఈ రీల్స్ నుంచి బయటకు తేవచ్చు. ‘సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారు పెరుగుతున్నారు’ అని సైకియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులతో దూరం, నిరుద్యోగం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, క్షణిక గుర్తింపుతో వస్తున్న మానసికానందం, విలువల శూన్యత ఇవన్నీ యువతను రీల్స్ వైపు నెడుతున్నాయి. స్నేహితులతో ఆటలు, మాటలు కూడా లేనంతగా (అవతలివారు కూడా ఫోన్లతో బిజీగా ఉండటం వల్ల) ఒంటరితనానికి విరుగుడును సోషల్ మీడియాలో వెతుక్కుంటూ మరింత ఒంటరి ఔతున్నారు. తల్లిదండ్రులు.ఏం చేయాలి?→ కుటుంబం కూచుని సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడుకోవాలి.→ మనం చేసే రీల్స్ వల్ల కుటుంబానికి మంచిదా చెడ్డదా చర్చించుకోవాలి.→ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో నిజాయితీగా చెప్పే మిత్రుల సలహా అడగాలి.→ పిల్లలు చేసే ప్రతి పనికీ అంగీకారం ఉండదని తల్లిదండ్రులు వారిని ఒప్పించేలా చె΄్పాలి.→ సైకియాట్రీ సాయం పొందాలి.→ విలువలతో కూడిన గుర్తింపు, గౌరవం మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి. -
వెలుగు నీడల దారుల్లో....
సోషల్ మీడియాతో యువతరాన్ని విడదీసి చూడలేని కాలం ఇది. ‘డిజిటల్ నెటిజన్స్’గా పేరున్న యువతరానికి సోషల్ మీడియాకు సంబంధించి ఎలాంటి ఆసక్తులు ఉన్నాయి? కంటెంట్ క్రియేషన్‌ను ఇష్టపడుతున్నారా? ‘వ్యూయర్’గా ఉండడానికి ఇష్టపడుతున్నారా? బలం తెచ్చుకుంటున్నారా? బలహీనపడుతున్నారా?సోషల్ మీడియా అనేది యువత దైనందిన జీవితంలో విడదీయరాని భాగం అయింది. ‘మా పిల్లలు సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు’ అంటున్న తల్లిదండ్రుల సంఖ్య తక్కువేమీ లేదు.‘సోషల్ మీడియాలో ఎంత టైమ్ గడుపుతున్నారు?’ అనేది ఒక కోణం అయితే అసలు అక్కడ ఏం చేస్తున్నారు? అనేది మరో కోణం. ఈ అంశంపై కొన్ని డిజిటల్ మార్కెటింగ్ పాట్‌ఫామ్స్ సర్వే నిర్వహించాయి.తమ సొంత కంటెంట్‌ను పోస్ట్ చేయడం కంటే యువతలో ఎక్కువమంది ఇతరుల పోస్టులను చదవడం, కామెంట్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. 21 శాతం మాత్రమే కంటెంట్ క్రియేటర్లుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. 79 శాతం మంది ‘వ్యూయర్స్’గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కంటెంట్‌ను పోస్టు చేస్తున్న వారిలో రోజూ పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.పర్సనల్ గ్రోత్, కెరీర్ ఎంపిక... మొదలైన వాటి విషయంలో సోషల్ మీడియాలోని కంటెంట్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు. రకరకాల డొమైన్స్‌లో కొత్తగా వస్తున్న ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి మిగిలిన దేశాలతో పోల్చితే మన దేశంలో యువ ‘స్పోర్ట్స్ సూపర్ ఫ్యాన్స్’ ఎక్కువ. ఈ సూపర్ ఫ్యాన్స్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచంలోని ఎన్నో ఆటల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.‘సోషల్ మీడియాను యూత్ ఎలా ఉపయోగించుకుంటుంది?’ అనేదాన్ని పక్కన పెడితే... సోషల్ మీడియా ఎడిక్షన్ విషయంలో ‘ఎవరో చెప్పేవరకు ఎందుకు... మన గురించి మనం తెలుసుకుందాం’ అనే ధోరణి యువతలో పెరుగుతుండడం శుభసూచకం.‘సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత అప్డేట్ అవుతాం’ అనే భ్రమకు దూరంగా జరుగుతున్నారు.‘ప్రతి అంశానికి మంచి, చెడులు ఉంటాయి. మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదానిపైనే మంచి, చెడు ఆధారపడి ఉంటాయి’ అంటుంది ఎంబీఏ స్టూడెంట్ తాన్వీ అగర్వాల్.ముంబైకి చెందిన తాన్వీ ఒకప్పుడు సోషల్ మీడియానే ప్రపంచంగా ఉండేది. తాను సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్న విషయం గ్రహించాక ‘ఒకరోజులో ఇంత సమయం మాత్రమే’ అని టైమ్ సెట్ చేసుకుంది.‘సోషల్ మీడియాకు ఎడిక్ట్ కావడం వల్ల నా చదువు దెబ్బతింది. చదివే సమయంలో సోషల్ మీడియాలో చదివిన పోస్టులు, చూసిన వీడియోలు గుర్తుకు వస్తుంటాయి. ఆలోచనలు అటువైపు మళ్లుతుంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది’ అంటుంది తాన్వీ అగర్వాల్.సోషల్ మీడియాను ఎంతసేపు, ఎలా వాడుకోవాలి అనేది ఒక కోణం అయితే ‘నైతికత’ అనేది మరో కోణం.లక్నోకు చెందిన వైశాలి ఒకప్పుడు మీమ్స్‌ను తెగ ఎంజాయ్ చేసేది. అయితే ‘బ్యాడ్ టేస్ట్ ఇన్ మీమ్స్’ అనే పోస్ట్ చదివిన తరువాత ఆమెలో మార్పు వచ్చింది.ఇప్పుడు ఆమె రిలేటబుల్ కంటెంట్, గుడ్ మీమ్స్‌ను మాత్రమే ఇష్టపడుతుంది.‘మీమ్స్ ద్వారా క్రూరత్వాన్ని ప్రదర్శించవద్దు. మీమ్స్ అనేవి హాయిగా నవ్వుకునేలా ఉండాలి’ అంటుంది వైశాలి.బ్రాండ్ల ఎంపికకు సంబంధించి సోషల్ మీడియాపై ఎక్కువ ఆధారపడుతుంది యువతరం. కాస్తో కూస్తో వచ్చిన మార్పు ఏమిటంటే ఇప్పుడు బ్రాండ్ల నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నారు. ఫలానా బ్రాండ్ పర్యావరణం హితం అంటే ఆ బ్రాండ్ వైపు మొగ్గుచూపుతున్నారు.స్థూలంగా చేప్పాలంటే... ‘సోషల్ మీడియాతో బలం తెచ్చుకుంటున్నామా? బలహీనపడుతున్నామా?’ అనేది పూర్తిగా మన అవగాహన, ఆలోచన ధోరణి మీదే ఆధారపడుతుంది. ఉదాహరణకు... ఫోర్బ్స్ హెల్త్ అండ్ వన్‌పోల్ సర్వే ప్రకారం సోషల్ మీడియాలో 53 శాతం మంది తమ నవ్వును ఇతరులతో ΄ోల్చి చూసుకుంటున్నారు.‘అయ్యో! అలా అందంగా నవ్వలేక పోతున్నానే’ అని అవతలి వ్యక్తితో పోల్చుకొని బాధ పడుతున్న వారే ఎక్కువ.పలువరుస అందంగా కనిపించడానికి సోషల్ మీడియాలోని తమ ఫొటోలను ఎడిట్ చేస్తున్నవారు, పలువరుస బాగోలేదని ఫొటోను హైడ్ చేస్తున్నవారూ ఉన్నారు. ‘నవ్వు విషయంలో నా ఆత్మవిశ్వాసాన్ని సోషల్ మీడియా దెబ్బతిస్తోంది’ అంటున్నారు 45 శాతం మంది.సోషల్ మీడియా అనే ప్రపంచంలో ...చిన్న నవ్వు విషయంలోనూ ఆత్మవిశ్వాసం లోపించిన వారు ఉన్నారు. ప్రయోజనకర కంటెంట్‌తో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో తమను తాము నిరూపించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు ఉన్నారు. ఏ దారిలో వెళుతున్నామనేది పూర్తిగా మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మార్పు గురించి చెప్పుకోవాల్సి వస్తే... ‘నేను ఏ దారిలో వెళుతున్నాను. ఇది సరిౖయెనదేనా?’ అనే స్వీయ విశ్లేషణ ధోరణి యువతరంలో పెరుగుతోంది. -
మద్యానికి బానిసైతే...ఇంత భయంకరమా? వైరల్ వీడియో!
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలుసు, మితిమీరితే ప్రాణాలకే ప్రమాదమనీ తెలిసు. అయినా మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకుపెరుగుతూనే ఉంది. అసలు మద్యం లేదా అల్కహాల్ సేవించడం ఎంత ప్రమాదమో తెలుసా?ఒక్కసారి మద్యానికి బానిపైపోతే మనిషి చివరికి ఎలాంటి దుస్థితికి దిగజారి పోతాడో తెలిపే వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వారాలు, నెలలు, సంవత్సరాల పాటు ఆల్కహాల్‌కు బానిసై, అకస్మాత్తుగా అకస్మాత్తుగా మద్యపానాన్ని ఆపివేసినా లేదా బాగా తగ్గించేసినా మానసిక, శారీరక సమస్యలు రెండూ వస్తాయి. ఈ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా మారవచ్చు. తక్షణ వైద్య సహాయం తీసుకోకపోతే ప్రాణాపాయం కావచ్చు. మద్యం తాగిన తరువాత నరాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతో అది క్రమేపీ మనతోపాటు పాటు నరాలు కూడా అలవాటు పడతాయన్న మాట. చివరికి అదొక ఎడిక్షన్‌లా మారిపోతోంది. అంటే అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. ఈ స్థాయి మరింత ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం) లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి ఇది ప్రాణాపాయం కావచ్చు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి జరుగుతోంది అదే. మద్యానికి అలవాడు పడిన నరాలు స్థిమితంగా ఉండలేకపోయాయి. దీంతో కాస్త మద్యం పుచ్చుకోగానే కుదుటపడ్డాయి. అంతిమంగా ఇది మరణానికి దారితీస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాలు: అధిక రక్త పోటు, నిద్రలేమి, శరీర భాగాలు బాగా వణికిపోవడం (హైపర్ రెఫ్లెక్సియా) ఆందోళన, కడుపు నొప్పి, తలనొప్పి, గుండె దడ లాంటివి. ఓకే అండీ, మనం మందు తాగమే అనుకోండి, ముందు నరాలు ఎక్సైట్ అవుతాయన్నమాట, తర్వాత తర్వాత అలవాటు పడతాయన్నమాట, చివరికి అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట ఇలాగే. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. బాగా ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం), ఇంకా ప్రాణాపాయం కావచ్చు. pic.twitter.com/wmqiDsTr6U — Srikanth Miryala (@miryalasrikanth) April 12, 2024 మద్యానికి బానిసైతే ♦ ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ♦ అతిము ఖ్యమైన అవయం కాలేయం దెబ్బతింటుంది. ఇది ముదిరితే కాలేయ కేన్సర్‌కు దారి తీస్తుంది. ♦ఏకాగ్రతను కోల్పోవడం, పాదాలు, చేతుల్లో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు భావోద్వేగాలను నియంత్రించ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ♦ ఎంజైమ్‌లు అండ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. నోట్: మద్యం ఆరోగ్యానికి అనర్థం. ఇందులో రెండో మాటకు తావేలేదు. ఆరోగ్య జీవనం కోసం ఆ వ్యసనాన్ని మెల్లిగా వదిలించుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. అవసరమైన నిపుణుల సలహాలు తీసుకొని మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం. -
డీ అడిక్షన్ సెంటర్ నుంచి 13 మంది యువతులు పరార్..
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాకు చెందిన పర్వానూలో డీ అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల వినియోగం నుంచి విముక్తి కల్పించే సంస్థ) నుంచి 13 మంది యువతులు పారిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. అనంతరం బాలికలను అడవిలో గుర్తించి, రక్షించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పర్వానూలోని ఖాదిన్ గ్రామంలో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ ఉంది. ఇక్కడ మొత్తం 17 మంది బాలికలు చికిత్స పొందుతున్నారు. శనివారం 13 మంది బాలికలు సెంటర్లోని కిటికీ అద్దాలు పగులగొట్టుకుని, బయటపడి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. అయితే డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది పోలీసుల సహకారంతో ఈ యువతులను వెదికిపట్టుకుని తిరిగి సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన డీ అడిక్షన్ సెంటర్ల పనితీరుపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సెంటర్లో పంజాబ్ హర్యానాలకు చెందిన యువతులు చికిత్స పొందుతున్నారు. పంజాబ్‌లో డీ-అడిక్షన్ సెంటర్లపై నిషేధం విధించిన తర్వాత మత్తుమందు బాధితులు చికిత్స కోసం హర్యానా, హిమాచల్‌లకు వస్తున్నారు. అయితే హిమాచల్‌లో డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభించినప్పటి నుండి ఈ సెంటర్లలో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. కాగా డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ల నుంచి పారిపోయిన యువతులు.. పోలీసుల విచారణలో తమకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని అందుకే పారిపోయామని ఫిర్యాలు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక ఎస్పీ సోలన్ తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా! -
మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..
మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్, నటి జెస్సికా లాండన్ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్ చేసింది. మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్‌కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్‌లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి కణితిలా వచ్చింది. దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్ కాకమునుపే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్‌కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. అసలు మద్య పానం వ్యసనం అంటే.. ఆల్కహాల్‌పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం. అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం. ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం తగని సమయాల్లో కూడా తాగడం మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు. (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
ఎదుగుదల వాయిదా!
బాపట్లకు చెందిన చిట్టిబాబు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. వయసు 40 దాటడంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలనుకున్నాడు. ‘రేపటి నుంచి మార్నింగ్ వాక్ చేయాలి’.. అని నిర్ణయం తీసుకుని ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాడు. తెల్లారింది.. అలారం మోగడం మొదలైంది. నిద్రమత్తులోనే చిట్టిబాబు అలారాన్ని ఆపి.. ఈ రోజు గురువారం.. అటూఇటు కాకుండా ఈ రోజే మొదలెట్టాలా? సోమవారం నుంచైతే ఓ క్రమపద్ధతిలో ఉంటుంది కదా అనుకుని.. వచ్చే సోమవారానికి వాయిదా వేసుకుని మళ్లీ ముసుగుతన్నాడు. సోమవారం ఉదయాన్నే అలారం మోగడంతో భారంగా నిద్రలేచాడు. వాకింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అతడి మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది..ఎటూ మూడు రోజుల్లో ఈ నెల ముగిసిపోతుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాకింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందబ్బా.. అని ఆలోచించాడు. తన ఆలోచన కరక్టే అనిపించింది. ఒకటో తేదీ అయితే లెక్కించుకోడానికి కూడా సులువుగా, అనువుగా ఉంటుందనుకుంటూ.. వాకింగ్‌కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒకటో తేదీ కూడా రానే వచి్చంది.. ఆ రోజు బుధవారం. మరీ వారం మధ్యలో ఎందుకు? సోమవారం నుంచి నడుద్దాంలే.. అని వాయిదా వేశాడు. మళ్లీ సోమవారం రాగానే.. ఆపై సోమవారానికి వాయిదా. ఇలా రెండేళ్లుగా వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది గానీ.. మార్నింగ్ వాక్కు మాత్రం అడుగు ముందుకు పడలేదు. వాకింగ్ మొదలెడదామనుకున్న రోజు రాగానే ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ సాకుతో వాయిదా వేసుకుని, ఆ క్షణానికి హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకోవడం పరిపాటిగా మారింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒక్క చిట్టిబాబు విషయంలోనే కాదు.. దాదాపు అందరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాయిదా ఘటనలు ఉండే ఉంటాయి. ఒక్కసారి ఈ వాయిదా సంస్కృతికి అలవాటు పడితే.. మన ఎదుగుదలను, అభివృద్ధిని వాయిదా వేసుకున్నట్టే లెక్క. విలువైన కాలాన్ని హరించి వేస్తుంది. వాయిదా వేయడం.. ఆ సమయానికి ఎంతో రిలీఫ్‌నిస్తుంది. చేయాల్సిన పనిని ‘తర్వాత చేద్దాంలే..’ అనుకోవడం ఆ క్షణానికి ప్రశాంతతనిస్తుంది. కానీ ఆ వాయిదా తాలూకు పర్యావసానం నష్టాన్ని కలిగించినప్పుడు తల పట్టుకుని కుమిలిపోతుంటారు. ఇలా డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూ లేకపోలేదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అనేవి జీవితాన్ని వెనక్కి లాగే విషయాలని, వీటి నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిదంటున్నారు. మనం ఇలా ఆలోచిస్తే.. మెదడు అలా ఆదేశిస్తుంది.. సాధారణంగా మనకు ఒత్తిడి కలిగించేవాటిని వాయిదా వేయమని మెదడు చెబుతుంది. పరీక్షల కోసం చదవడం, ఉదయాన్నే లేచి నడవడం వంటివి మానసికంగా భారంగా ఉండే పనులు. ఎక్కువగా ఇలాంటి వాటినే వాయిదా వేయాలని మెదడు చెబుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది డిప్రెషన్, మానసిక ఆందోళనల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్లో మునక నుంచి బయటి కొద్దాం.. ఏ పనినైనా అనుకున్న సమయానికి పూర్తిచేయాలంటే ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్ అనేది మనకు తెలియకుండానే సమయాన్ని హరిస్తుంది. మనలో అంతులేని బద్దకానికి కారణమవుతుంది. ఫోన్ చేతిలో ఉందంటే చాలు.. ఇక ఏపనైనా ‘ఆ చేయొచ్చులే..’ అనిపించే నీరసం, ‘ఇప్పుడే చేయాలా..’ అనేంత బద్దకం, ‘చేయలేక చస్తున్నా..’ అనుకునేంత నిస్తేజం మనల్ని ఆవహించేస్తాయి. అందుకే ఫోన్‌కు దూరంగా ఉంటే ఈ వాయిదా అలవాటు నుంచి బయటపడే అవకాశం ఉంది. అందరిలో ఉండే లక్షణమే గానీ.. పనులు వాయిదా వేయడం అనేది టైం మేనేజ్మెంట్ సమస్య అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఇది ఎమోషనల్ రెగ్యులేషన్ సమస్య. ఏదైనా ఒక పని మనలో ఒత్తిడిని కలిగిస్తే.. మెదడులోని దానికి సంబంధించిన భాగం ఆ పనిని వాయిదా వేయాలని ప్రేరేపిస్తుంది. దీంతో మనం ఆ పనిని వాయిదా వేస్తాం. అందుకే వాయిదా వేయడాన్ని ఓ డిఫెన్స్ మెకానిజంగా పరిగణించవచ్చు. ఇది అందరిలో ఉండే లక్షణమే గానీ, ఇది క్రానిక్‌గా మారినప్పుడు మాత్రం సైకాలజిస్టులను సంప్రదించాల్సి ఉంటుంది. కాగి్నటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్ ఫుల్నెస్ ట్రైనింగ్, బిహేవియర్ షేపింగ్, ఎపిసోడిక్ ఫ్యూచర్ థింకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి వాయిదా వేసే లక్షణాన్ని సైకాలజిస్టులు తగ్గిస్తారు. – బి.కృష్ణ, సైకాలజిస్ట్ మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ పనులు వాయిదా వేయడం అనేది మెదడులోని లింబిక్ సిస్టం, ప్రీ ఫ్రొంటల్ కార్తెక్స్ మధ్య ఘర్షణతో సంభవిస్తుందని న్యూరో సైన్స్ చెప్తుంది. ఈ లక్షణం విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌లో 81 శాతం మంది పనులు వాయిదా వేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. పనులు వాయిదా వేయడానికి కొన్ని మానసిక కారణాలున్నాయి. మోటివేషన్ లేకపోవడం, ఓటమి భయం, ఒత్తిడి, స్వీయ విమర్శలు తదితరాలు ఓ వ్యక్తి పనులు వాయిదా వేయడానికి కారణమవుతాయి. వాయిదా లక్షణం మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాయిదా వేసే లక్షణం దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగించే స్థాయికి చేరుకుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది. – బి.అనితజ్యోతి, సైకాలజిస్ట్ ‘వాయిదా’పై నిపుణులు ఏమంటున్నారంటే.. ఒక పనిని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఆ పని చేయడానికి ఆసక్తి లేకపోవడంతో పాటు ఉత్సాహ లేమిని కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఆ పని మనకు ఒత్తిడి కలిగించేది, లేదా మానసికంగా భారంగా అనిపించేదై ఉంటుంది. ఒక పనిని ఒక్కసారి వాయిదా వేశామంటే.. మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకే మన మెదడు మొగ్గు చూపుతుంది. బద్దకం, సోమరితనం కూడా ఈ వాయిదా పరంపరకు ప్రధాన కారకంగా నిలుస్తున్నాయి. అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా పనులు వాయిదా వేస్తూ అదో రకమైన మానసిక ఆనందాన్ని పొందుతుంటాం. చాలా కోల్పోతున్నాం వాయిదా వేసిన పనిని పూర్తిచేయలేక దాని తాలూకు నష్టాన్ని మూటగట్టుకుంటాం. వాయిదాల వల్ల తరచూ ఇలానే జరగడంతో ఆందోళన, భయానికి లోనవుతాం. మనమీద మనకు నమ్మకం సన్నగిలి.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. ఇది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. మనకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇలా అధిగమిద్దాం.. ఒక పనిని చేయడంలో హాయిని అనుభవించాలి గానీ.. ఒత్తిడిని దరిచేరనీయ కూడదు. ఈ వాయిదా వేయడం అనే దాన్ని మన ఎదుగుదలను నియంత్రించే రుగ్మతగా భావిస్తూ.. దాని బారిన పడకుండా ఉండాలంటూ మనసుకు ఆదేశాలిచ్చుకుంటూ.. మనసును పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదన్నా పని మొదలెట్టామంటే.. దానికి అంకితమైపోవాలి. అది పూర్తయిందాకా వెనకడుగు వేయకూడదు. వాయిదా సంస్కృతి అనేది మన ఉన్నతిని, ఎదుగుదలను నిలువరించే ఓ సోమరిపోతు. ఈ జీవన పరుగు పందెంలో తోటివారితో పాటు మన అడుగుల్ని ముందుకు పడనీయకుండా అనుక్షణం వెనక్కి లాగుతూ.. మనల్ని ఓ మాయా ప్రపంచంలోని నిష్క్రియా స్థితికి తీసుకెళ్లే ఓ మత్తుమందు. దీని విషయంలో మనం అప్రమత్తంగా, అనుక్షణం జాగరూకతతో ఉండాలి. పనిని విభజించుకోవాలి. ఓ టైం టేబుల్ వేసుకుని ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని పూర్తిచేసి తీరాలి. ఒక సామెత చెప్పినట్టు.. రేపు మనం చేయాలనుకుంటున్న పనిని ఈ రోజే.. ఈ రోజు ఏం చేయాల్సి ఉందో దానిని ఇప్పుడే చేసెయ్యాలి. పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం, ధ్యానం చేయాలి. -
కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?
ఎప్పుడెప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడతారా ? ఇంటికెళుదామా ? అని చూస్తుంటారు " "క్లాసు రూమ్ లో పాఠాలు వినడం లేదు . పక్క వారిని గిల్లడం, గిచ్చడం లాంటి పనులు చేస్తున్నారు " " చిరాకు, కోపం, అసహనం ఎక్కువయ్యింది . ఏకాగ్రత లోపించింది " " టీచర్ల పై తిరుగుబాటు, తల్లితండ్రుల్ని ఎదిరించడం ఎక్కువయ్యింది. రాగ్గింగ్ , బుల్లియింగ్ , ఘర్షణలు ఎక్కువయ్యాయి " " చెడు వ్యసనాల బారిన పడుతున్నారు " ఒక్కో సారి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాము. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకొంటాము . అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం . నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు . వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. కరోనా ముందు కాలం తో పోలిస్తే , ఇప్పుడు... అంటే కరోనా తరువాత కాలం లో , పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూసారా ? అయితే ఏంటది ? ఇది నేను ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగిన ప్రశ్న . పైన ఇచ్చినవి వారి సమాధానాలు. ఒక్కరంటే ఒక్కరు పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు . సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు . కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసు లు . మొబైల్ వ్యసనం అని సమాధానం చెప్పారు . "ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్టా ? " "టెక్నాలజీ మార్పు తెస్తుంది . ఇది సహజం " "టెక్ సావీ పిల్లలు " "మార్పు సహజం . మారుతున్న సమాజంతో పాటే మనం మారాలి " అని ఇంకా పలవరిస్తున్న అజ్ఞానులు కోకొల్లలు. ఏది మార్పు ? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వం అది. ఫ్లో లో వెళ్ళాలి అనుకొనే వారు .. ఇదే ట్రెండ్ అనుకొనే వారు .. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకొనే వారు .. ఇంకా కోట్లలో . ఈ లోగా యునెస్కో కుండబద్దలు కొట్టేసింది . మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని అధికారికంగా తేల్చేసింది. కమిషన్ల ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డుపడట్టయ్యింది. కరోనా కాలం లో ఆన్లైన్ క్లాసులను నేను సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. తీవ్ర రోగముండి ఐసీయూ లో ఉంటే తప్పదు . కానీ టిఫిన్ బాక్స్ కు బదులు సెలైన్ పెట్టుకొని రోజూ ఇంటినుంచి బయటకు వెళుతామా? వారం రోజులు వానపడితే (వాన పడింది గట్టిగా రెండు రోజులే ) ఆన్లైన్ క్లాసులు షురూ చేసిన స్కూల్స్ . "పక్కన ఉన్న అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు?" అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ . "వెంటనే వారు కట్టిన ఫీజు వాపసు ఇచ్చేయండి .. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్ లో అబ్బాయి ని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేయండి " నా ఆర్డర్ . చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు "మాకు సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టం అర్థం అయ్యింది. కానీ ఏమి చెయ్యాలి ?"... అని ఇంకా చాలా మంది ఇంట్లో బాంబు పెట్టుకొంటే పేలుతుంది . ఏమి చేస్తాము ? ఇంట్లో బాంబు పెట్టుకోము . ఇదీ అంతే. "పెద్దాళ్ళకు తప్పని సరి. ఆఫీస్ వర్క్ కోసం సెల్ ఫోన్. ఇది అట వస్తువు కాదు. మీ మెదళ్ళు సెల్ ఫోన్ వల్ల వంద రెట్లు అధికంగా ప్రభావితం అవుతాయి , కాబట్టి వద్దు" అని పిల్లలకు నచ్చ చెప్పి వారు సెల్ ఫోన్ వాడకుండా చూడాలి . మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించాలి . సమస్య జటిలం. పరిష్కారం అంత సులభం కాదు. సంవత్సరాల తరబడి అధిక తిండి తిని ఒంట్లో కిలోల కొద్దీ అధిక కొవ్వును పేరపెట్టుకొన్న వారు ఏమి చెయ్యాలి ? తిన్నప్పుడు పొందిన సుఖాన్ని గుర్తు చేసుకొంటూ దానికి ప్రాయచ్చితం అన్నట్టు సరైన తిండి తినాలి . వ్యాయామం చెయ్యాలి. అబ్బే ఇంత కష్టం మేము పడలేము. ఏదైనా సింపుల్ మార్గం ఉంటే చెప్పండి అని లక్షల్లో అనుకొంటున్నారు. అలాంటి బకరాల కోసం డబ్బాల్లో మూలికా మందులు వచ్చాయి. అవి జస్ట్ ఒక స్పూన్ తింటే సరిపోతుంది అని ప్రచారం. ఈజీ మార్గం కదా అని లక్షల మంది. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకొన్న వారు వేలమంది. అయినా ఆగదు. ఆగితే వారి బిజినెస్ సాగదు బలహీనతల్ని కాష్ చేసుకోవడంలో ఫార్మసురులకు మించిన వారెవరూ ఉండరు. నువ్వు అధిక తిండి తింటే వాడికి డయాబెటిస్ బిజినెస్. కనీస ఆహార నియమాలు లేకుండా టెన్షన్ పెంచుకొని నువ్వు ఇమ్మ్యూనిటిని కుళ్ళపొడుచుకొంటే ... తుమ్ముకు.. దగ్గుకు... కాన్సర్‌కు.. జ్వరానికి.. ఒంటి నొప్పులకు ... చివరాఖరికి దురద కూడా వాక్సిన్లు .తిరుగు లేని బిజినెస్. అవి వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొంటే బోనస్ బిజినెస్ . ఇంతకీ కరోనా వాక్సిన్లు ఏమయ్యాబ్బా ? ముక్కు నోరు . చెవి.. ఇలా నవ రంద్రాల్లో వేసే వాక్సిన్లు .. వాటి మార్కెటింగ్ కోసం అదిగో చైనాలో కేసులు .. లాంగ్ కరోనా .. తొక్క... అంటూ విషపు రాతలు .. మరో పక్క కరోనా వాక్సిన్ వేసుకంటే కండ పుష్టి .. అంటూ మార్కెటింగ్ చేసే బ్రోకర్లు ... అరెరే .. ఎక్కడ పోయారబ్బా ? పిల్లి వచ్చే ఎలుక భద్రం అంటూ ఒక్క సారిగా మొత్తం మాయం అయిపోయారే. అన్నట్టు వారి ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలిగా . ఆ లెక్కన ఇప్పుడు.. అయిదోదో ఆరోదో పొడుస్తుండాలిగా ? ఏంటి ఆగిపోయింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్ కు పిల్లలు బానిసలు అయిపోతుంటే... వాడిది రెహబ్ సెంటర్ బిజినెస్ . వాడిదేనా ? తిలాపాపం తలా పిడికెడు.. పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి. సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. ఓయో హోటళ్ల బిజినెస్ డల్ అయిపోతుంది. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు. అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము . ఒక్కోక్కరూ కనీసం అయిదు మందికి .. ఈ వారం రోజుల వానల్లో అందరూ కలిసి కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు . "సెల్ ఫోన్ వద్దు. ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు . ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు. మార్పు వస్తుందా ? వస్తుంది. అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ఈ విధంగా మా పిల్లల్లో ఆ భావన మరింత దృడంగా .. పక్కింటి పిల్లలో .. ముఖ్యంగా వారి తల్లితండ్రుల్లో అవగాహన. వారు ఇప్పుడైనా నిద్ర లేస్తే బయటపడతారు . లేకుంటే రేపు దారుణాలకు మూగ సాక్ష్యంగా మిగిలి పోతారు. ఒక స్కూల్ ఇలా చేస్తోంది . మీరు ఇలా ఎందుకు చెయ్యరు అని ప్రతి ఒక్కరు తమ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే ? ఎన్నికలు రాబోతున్నాయి. మీ డ్రామాలు, గోవా ఫైటింగ్‌లు ఆపండి. బాల లోకాన్ని పీడిస్తున్న ఈ వ్యసనం పై మీ స్టాండ్ ఏంటి ? యునెస్కో చెప్పాక కూడా నిద్ర నటిస్తారా ?" అని ప్రతి రాజకీయనాయకుడ్ని, పార్టీని ప్రశ్నిస్తే .. మార్పు రాదా ? ప్రశ్నించడం ఆంటే వీధుల్లోకి పోనక్కర లేదు. జస్ట్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొంటే చాలు. ఇంకా... స్వచ్చంద సేవ సంఘాలు .. ప్రజా సంఘాలు .. సినిమా హీరోలు .. అబ్బో సమాజం శక్తి కొంచమయ్యిందా ? ముందుకు రావాలి. రావాలి... బాబూ... రావాలి . రాక పొతే చరిత్ర హీనులయి పోతారు . ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని .. నిజం మరిచితే నిదురోతే? కరోనా రెండో వేవ్ .. అటు పై వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే... దారుణాలు ఖాయం . ఇది శాపనార్థం కాదు . హెచ్చరిక దండోరా ! మార్పు మనింటి నుంచే మొదలు కావాలి . వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
తాగితే మా ఆయన చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు.. ఏం చేయాలి?
వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’ ► అపార్ట్మెంట్లో దాదాపు అన్ని ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్‌లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్రూమ్కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు. ► ఫ్యామిలీ ఫంక్షన్‌కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు. ► మల్టిపుల్ అడిక్షన్స్‌కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్. బాధ్యత తెలిస్తే సెట్ అవుతావులే’ అంటుంది. ► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది. ► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది’ అంటాడు తండ్రి. ► కజిన్స్ రిలేటివ్ ఫంక్షన్లో ఒకబ్బాయి ఓవర్‌గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్‌గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి. వెరీ డేంజర్!! చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్ వెరీ వెరీ డేంజర్ డిసీజ్. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు. ధైర్యమే ఆయుధం వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు. కుటుంబం ప్రవర్తన మారాల్సిందే! కొడుకు/కూతురు/హజ్బెండ్/ఫాదర్ కి అడిక్షన్ పట్ల సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే. మందలించాల్సిందే! ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్ రోల్ భార్య/తల్లిదే. ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్/ డ్రగ్స్ వాడుతున్నాడంటే అతని మైండ్ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల బ్రెయిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. అవగాహన, బిహేవియరల్ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు ఎలా వెళతామో సైకలాజికల్ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్ని కలవడానికి ఇబ్బంది పడకూడదు. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ -
13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్లో షాక్ ఇచ్చింది!
వీడియో గేమ్స్ అడిక్షన్ ఇంటింటి వ్యసనాయణం! అది చైనా, హేనన్ ప్రావిన్స్‌లోని ఒక కుటుంబానికి ఎలాంటి షాక్‌ను ఇచ్చిందో చదవండి. ఆ కుటుంబంలోని పదమూడేళ్ల అమ్మాయికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. నిద్రాహారాలు మరచిపోయి మరీ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది.. ఇల్లు, బడి అనే తేడా లేకుండా! ఆ అమ్మాయికున్న ఈ అలవాటును ఇంట్లో పెద్దలు నిర్లక్ష్యం చేసినా బడిలో టీచర్ మాత్రం లక్ష్యపెట్టింది. ఆ పిల్ల తల్లిదండ్రుల దృష్టికీ తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి మీద ఓ కన్నేసి ఉంచింది ఆమ్మ. ఎన్నో రోజులు గడవకముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అమ్మ కంట్లో పడింది. ఏంటా అని చూస్తే.. తన కూతురు ఖర్చు పెట్టిన డబ్బు తాలూకు బ్యాంక్ స్టేట్మెంట్స్ వీడియో అది. ఒకటి కాదు రెండు కాదు 51,72,646 రూపాయలు. అది ఆ పిల్ల అమ్మానాన్న కొన్నేళ్లుగా కూడబెట్టిన మొత్తం! ఒక్క పూటలో అలవోకగా ఖర్చుపెట్టేసింది. అంతా ఆన్లైన్ పేమెంటే. కూతురికి ఎప్పుడైనా అర్జంట్‌గా ఏదైనా అవసరం వస్తుందేమో ఎంతకైనా మంచిది అని అమ్మాయికి తన డెబిట్ కార్డ్ పిన్ నంబర్ చెప్పింది. ఇంకేముంది ఆ కూతురు కొత్త వీడియో గేమ్స్ కొనడానికి, ఆడుతున్న గేమ్స్‌కి కావల్సిన పాయింట్స్‌ని సంపాదించడానికీ తల్లిదండ్రుల సేవింగ్స్‌ని ఖర్చుపెట్టింది ఆ పిన్ నంబర్ ఉపయోగించి. తన ఈ సీక్రెట్ ఫ్రెండ్స్‌కి తెలిసిపోయి.. బ్లాక్మెయిల్ చేసేసరికి వాళ్లకూ కావల్సిన వీడియో గేమ్స్‌ని కొనిపెట్టి మొత్తం డబ్బును హుష్ కాకి చేసేసింది. ఈ వ్యవహారం తల్లి కంట పడకుండా చక్కగా ఫోన్లోంచి ఆ ట్రాన్జాక్షన్ హిస్టరీని డిలీట్ చేసింది. పదమూడేళ్ల అమ్మాయి రికార్డ్ స్థాయిలో వీడియో గేమ్స్ కొనేసరికి అది సోషల్ మీడియాలో వైరలై.. ట్రాన్జాక్షన్ స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చి.. అమ్మకు షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ల తమ కష్టాన్ని కూతురు సింపుల్‌గా స్వైప్ చేయడంతో నెత్తీనోరు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ వ్యసనాయణం మనకూ షాక్ ఇవ్వకుండా జాగ్రత్తపడదాం! (చదవండి: బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!) -
డేంజర్: పొద్దస్తమానం.. ఫోన్లోనే!
మాటలు లేవు.. మాట్లాడుకోవడాలు లేవు.. బంధుమిత్రులు ఇంటికొస్తే పలకరింపులూ లేవు.. తలోక దిక్కున సెల్‌ఫోన్‌తో ఎవరి పనిలో వారు బిజీ.. ఆ ఫోన్లతో సోషల్ మీడియా సముద్రంలో ఈదుతుంటాం.. ఏ ఇంటికెళ్లినా ఈ కాలంలో కనిపించే దృశ్యం దాదాపు ఇదే! ఏదో కాలక్షేపానికి కొద్దిసేపు సోషల్ మీడియాను వాడితే తప్పులేదు కానీ.. గంటలు కరిగిపోయే స్థాయిలో దానికి కట్టుబానిసలైతే మాత్రం డేంజర్.. డేంజర్.. డేంజర్!!! టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తి అంటారు... ఇదీ చాలా పాతకాలపు సామెతే కానీ, సోషల్ మీడియా ఈ తరానికి ముఖ్యంగా యువతరానికి చేస్తున్న చేటును దృష్టిలో పెట్టుకుంటే దానిని తరచూ గుర్తుచేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇందుకు తగ్గట్టుగానే ట్విట్టర్, టిక్‌టాక్, వాట్సాప్, ఇన్‌స్టా్రగామ్, స్నాప్‌చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల లాభనష్టాల గురించి వివరించే అధ్యయనాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లివింగ్ సర్కిల్స్ అనే సంస్థ దేశంలోని 287 జిల్లాల్లో 9–13 ఏళ్ల వయసున్న పిల్లలు గల తల్లిదండ్రులతో, అలాగే 13–17 సంవత్సరాల వయసున్న బాలబాలికలతో ఒక అధ్యయనం నిర్వహించింది. సామాజిక మాధ్యమాల వాడకాన్ని అనుమతించడంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉండటం దాని వాడకం తీరుతెన్నులపై టీనేజర్లను అడిగి తెలుసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 65 వేల మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. జరుగుతోంది తప్పే.. అధ్యయనంలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 40 శాతం మంది పిల్లలు వీడియో గేమ్‌లకు, సామాజిక మాధ్యమాలకు బానిసలైనట్లు ఈ సర్వేలో వెల్లడైన భయంకరమైన సత్యం, కాగా, ఇది సరి కాదని వారు కూడా అంగీకరించడం కొసమెరుపు. హైసూ్కల్లో చేరే వయసు కూడా లేని పిల్లలకు స్మార్ట్ఫోన్లు నిత్యం అందుబాటులో ఉన్నాయని 55 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. టీనేజర్ల తల్లిదండ్రుల దగ్గరకు వచ్చే సరికి ఈ సంఖ్య 71 శాతం ఉంది. అయితే, కోవిడ్ కారణంగా విద్యాసంస్థలు సక్రమంగా పని చేయకపోవడం వల్లనే తాము పిల్లలకు స్మార్ట్ఫోన్లు కొనివ్వాల్సి వచి్చందని మెజారిటీ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే పిల్లలు సామాజిక మాధ్యమాలకు పరిచయమయ్యారని, అది కాస్తా వ్యసనంగా మారుతోందన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరిచేందుకు కనీస వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే కావడం. దీనిని కనీసం 15 సంవత్సరాలకు పెంచితే సమస్య కొంతవరకైనా తగ్గుతుందని 68 శాతం మంది తల్లిదండ్రులు తమ ఆవేదన చెప్పుకున్నారు. తమని తాము తక్కువ చేసుకుంటారు.. పిల్లలంటేనే వారికి ఎల్లల్లేని ఆత్మవిశ్వాసం. ప్రపంచంలో దేనినైనా అవలీలగా సాధించగలమన్న నమ్మకం కలిగి ఉంటారు. అయితే, సామాజిక మాధ్యమాల మితిమీరిన వాడకం కారణంగా వీరిలో ఈ లక్షణం క్రమేపీ సన్నగిల్లుతోందని, వారు తమని తాము తక్కువ చేసుకుని చూసుకుంటున్నారని లోకల్ సర్కిల్స్ అధ్యయనం తేలి్చంది. ఆ సర్వే మాత్రమే కాదు ఇప్పటికే జరిగిన పలు శాస్త్రీయ పరిశోధనలు కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. ప్రతి చిన్న విషయానికీ సోషల్ మీడియాపై ఆధారపడటం వల్ల పిల్లలతోపాటు పెద్దవారిలోనూ కొన్ని శారీరక, మానసిక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాకులత, ప్రతిదానికీ చికాకుపపడటం వంటివి వీటిల్లో కొన్ని. పైగా పిల్లలు ఏ అంశంపైనా సరైన దృష్టిని కేంద్రీకరించలేని పరిస్థితి ఉంటోంది. లోకల్ సర్కిల్స్ అధ్యయనం ప్రకారం 13–17 మధ్య వయసు్కలు రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాపై ఖర్చు చేస్తున్నారు. నగరాల్లోనైతే 9–13 మధ్య వయస్కులైన పిల్లలు కూడా ఇదే రకంగా ఉన్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. మానసిక సమస్య కాదు టీనేజీ లేదా అంతకంటే తక్కువ వయసులో సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిపోవడం మానసిక సమస్య కాదన్నది నిపుణుల అభిప్రాయం. కాకపోతే మార్చుకోదగ్గ బిహేవియరల్ డిజార్డర్ అని చెప్పకతప్పదని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ ఎంఎస్ రెడ్డి చెప్పారు. టీనేజీ వారైనా, పెద్దలైనా రోజుకు కనీసం 150 సార్లు తమ ఫోన్లు చెక్ చేసుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. మరీ ఎక్కువగా ఆధారపడ్డ వారైతే నిత్యం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం గ్యారంటీ అంటున్నారు నిపుణులు. సామాజిక మాధ్యమాల వల్ల సమస్యలున్నాయని కోవిడ్‌కంటే ముందు కూడా చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. అతి వాడకం వల్ల ఇవి మరిన్ని వ్యవసనాలకు పాల్పడే అవకాశాలూ ఎక్కువని ఈ అధ్యయనాలు తెలిపాయి. పెద్దలకు మాత్రమే పరిమితం కావాల్సిన కంటెంట్ సులువుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటమూ టీనేజీ వారికి అంత మంచిది కాదన్నారు మానసిక నిపుణులు డాక్టర్ వీరేంద్ర. ఇటీవల కాలంలో తమ వద్దకు వచి్చన కేసుల్లో అధికం ఇలాంటివేనని మానసిక నిపుణులు అంటున్నారు. పైగా, సోషల్ మీడియాలో ఎవరు ఎవరన్నది ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగా ఆడ పిల్లలు ప్రమాదాల బారిన పడేందుకూ అవకాశాలు పెరిగాయంటూ ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ జాయ్ ఎన్ టిర్కీ సైబర్ క్రైమ్ విభాగానికి సమరి్పంచినలో నివేదికలో వెల్లడించారు. జామా సైకియాట్రీ అధ్యయనం ప్రకారం.. రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి మాధ్యమాల్లో గడపడం టీనేజర్లకు ఏ మాత్రం సరికాదు. అర గంట కంటే ఎక్కువ సమయం గడిపే వారికి అసలు వాడని వారితో పోలి్చనప్పుడు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. టీవీ, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, మ్యూజిక్ వంటి అన్ని రకాల వినోదాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమంది టీనేజర్లు రోజుకు తొమ్మిది గంటల వరకూ గడుపుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలా గుర్తించండి.. ► సోషల్ మీడియాలో గడిపే సమయం క్రమంగా ఎక్కువవుతుంటే... లైకులు ఎన్ని వచ్చాయి? ఎలాంటి కామెంట్లు వచ్చాయో.. అని మామూలు సమయంలోనూ ఆలోచిస్తూంటే.. ► ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు తగ్గిపోయినా.. ఇతర అలవాట్ల నుంచి దూరంగా తొలగుతున్నా.. స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ అందుబాటులో లేకపోతే తెగ ఆందోళన చెందుతున్నా.. చదువులు దెబ్బతింటున్నా.. బంధుమిత్రులు, తల్లిదండ్రులు తిడుతున్నా.. నచ్చచెబుతున్నా సోషల్ మీడియాను వదలకుండా ఉంటే.. పైన చెప్పుకున్న విషయాలన్నీ మీకు లేదా మీకు తెలిసిన టీనేజీ వారికి వర్తిస్తున్నాయా? అయితే సామాజిక మాధ్యమం ఉచ్చులో చిక్కినట్లే!!! :::కంచర్ల యాదగిరిరెడ్డి -
నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం
మద్యం సేవించే అధికారికంటే రిక్షా తొక్కేవాడిని, కూలీలను పెళ్లిచేసుకోవడం సముచితమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు తమ కుమార్తెలు, సోదరీమణులకు మద్యపానం చేసేవారితో అస్సలు వివాహం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యపానం డి అడిక్షన్‌పై జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడూ..సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు. "తన కొడుకు ఆకాష్ తన స్నేహితులతో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. ఆ అలవాటు మానుకుంటాడని పెళ్లి కూడా చేశాను కానీ అతను పెళ్లైన తర్వాత కూడా తాగడం ప్రారంభించాడు. క్రమంగా అది అతని మరణానికి దారితీసింది. దీంతో అతడి భార్య వితంతువుగా మారింది. పైగా వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు." అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అందువల్ల దయచేసి మీరు మీ కుమార్తెలను, సోదరీమణులను ఇలాంటి వ్యసనపరులకు కట్టబెట్టకుండా రక్షించండి. ఈ తాగుడు వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలకు కేవలం పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమని అన్నారు. ఈ డీ అడిక్షన్ కార్యక్రమంలో ప్రజలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లాను వ్యసన రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకువెళ్లాలని, పైగా ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలకు దీని గురించి చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు
బీజింగ్: చైనాలో ఆన్లైన్ వీడియో గేమ్‌లకు బానిసగా మారిన ఓ ఐదో తరగతి బాలుడిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు తల్లిదండ్రులు అతని ‘దారి’నే ఎంచుకున్నారు! రోజూ గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడుతున్న తమ కుమారుడు తిరిగి చదువుల బాట పట్టేందుకు వీలుగా ఓ ప్రొఫెషనల్ ఆన్లైన్ గేమర్‌ను ఆశ్రయించారు!! ఇందుకోసం అతనికి గంటకు సుమారు రూ. 600 చొప్పున ‘సుపారీ’సైతం చెల్లించారు!! ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా తమ కుమారుడిని ఆన్లైన్ గేమర్‌తో చిత్తుగా ఓడించడం ద్వారా ఈ తరహా ఆటలు ఆడటంలో నిష్ణాతుడినన్న అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే వారి వ్యూహం ఫలించింది. బాలుడితో ఐదు గంటలపాటు ఐదు గేమ్‌లు ఆడిన ఆన్లైన్ గేమర్... అతన్ని చిత్తుగా ఓడించాడు. గేమ్‌లన్నీ పూర్తి ఏకపక్షంగా సాగడంతో కంగుతిన్న బాలుడు.. ఆ ఆటలపై ఇష్టాన్ని కోల్పోయాడు. దీంతో తమ కొడుకును ఓదార్చిన తల్లిదండ్రులు... ఇక నుంచి అతను తిరిగి చదువుపై దృష్టిపెట్టేలా ఒప్పించారు. ఈ విషయాలను ఆన్లైన్ గేమర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరో బాలుడిని సైతం ఇలాగే ఆన్లైన్ ఆటల వ్యసనం నుంచి బయటపడేసినట్లు చెప్పాడు. చదవండి: పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్.. -
పిల్లలు మొబైల్‌కు అడిక్ట్ కాకుండా ఉండాలంటే, ఇలా చేయండి..!
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాటయితే, స్మార్ట్ ఫోన్ సర్వహస్త భూషణం అనేది ఈనాటి మాట. అది భూషణమైతే పర్వాలేదు.. అదొక వ్యసనంగా మారింది. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకూ పట్టి పీడిస్తున్న సమస్య మొబైల్ అడిక్షన్. అసలు దేన్ని వ్యసనమంటారు? ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ గేమ్స్ కోసం వాడుతుంటే.. ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ఇంకా రకరకాల కారణాల కోసం పెద్దలు వాడుతున్నారు. మొబైల్ వాడటం తప్పుకాదు. ఆ వాడకం ఎక్కువై మన రోజువారీ పనుల్ని ఇబ్బంది పెడుతుంటే, దాన్ని మానుకోవాలనుకున్నా మానుకోలేకపోతే దాన్నే వ్యసనం అంటారు. మన దేశంలో 33 శాతం మందికి ఈ వ్యసనం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అసలెందుకు అడిక్ట్ అవుతారు? మనం ఏ పని చేసినా, ఎంత సంపాదించినా.. అంతిమ లక్ష్యం ఆనందమే. నచ్చినపని చేసినప్పుడు మెదడులో డొపమైన్ అనే కెమికల్ విడుదలవుతుంది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించినప్పుడు కూడా ఇదే కెమికల్ విడుదలవుతుంది. సిగరెట్ తాగేవాళ్లు నికోటిన్‌కు, మద్యం తాగేవాళ్లు ఆల్కహాల్‌కు అడిక్ట్ అయినట్లే స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు డొపమైన్‌కు అడిక్ట్ అవుతారు. అంటే డొపమైన్ విడుదల వల్ల వచ్చే ఆనందానికి అడిక్ట్ అవుతారు. గతంలో పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తేనో, ఆటల్లో గెలిస్తేనో సంతోషం కలిగేది. ఇప్పుడంత అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫొటోలకు లైకులు, కామెంట్స్ వచ్చినా ఆనందపడుతున్నాం.. డొపమైన్ విడుదలవుతోంది. చాలామంది స్మార్ట్ ఫోన్‌ను ఒక సాధనంగా కాకుండా తమ వ్యక్తిత్వంలో భాగం (ఎక్స్టెండెడ్ సెల్ఫ్) గా భావిస్తున్నారు. అందుకే కాసేపు మొబైల్ దూరమైతే, తమలో ఒక భాగం దూరమైనట్లుగా ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్ ఫోన్‌ను వదిలి ఉండలేకపోతుంటారు. ఈ తరం పిల్లలకు స్మార్ట్ ఫోన్ కేవలం ఫోన్ మాత్రమే కాదు. తమ జీవితంలో జరిగే ప్రతీ ఆనందకరమైన సంఘటనను దాచుకునే.. చూసుకునే సాధనం. నాన్న చేతిని పట్టుకుంటే ఎంత భరోసాగా ఉంటుందో, అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో మొబైల్ వాడేటప్పుడు కూడా అలాగే ఫీలవుతుంటారు. మీ పిల్లలు మొబైల్‌కు అడిక్ట్ కాకూడదనుకుంటే మీరు చేయాల్సినవి.. పిల్లలు మొబైల్ తక్కువగా వాడాలంటే ముందు పేరెంట్స్ మొబైల్ వాడకం తగ్గించాలి. పిల్లలు అనేక విషయాల్లో పేరెంట్స్‌నే రోల్ మోడల్‌గా తీసుకుంటారు. 12 ఏళ్లలోపు పిల్లలు గంటలు గంటలు స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తే వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్ పై ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే మొబైల్‌ను దూరంగా పెట్టండి. మానవ సంబంధాలకు మెదడులోని ఫ్రంటల్ లోబ్ రెస్పాన్సిబుల్. ఆ భాగం బాల్యంలో బాగా పెరుగుతుంది. బాల్యంలో స్మార్ట్ ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడపడం వల్ల పెరుగుదల మందగిస్తుంది. ఫలితంగా సోషల్ స్కిల్స్ తగ్గుతాయి. అటెన్షన్ తగ్గుతుంది. ఇతరుల ఆటిట్యూడ్‌ని, బిహేవియర్, కమ్యూనికేషన్‌ని అర్థం చేసుకోవడమూ తగ్గుతుంది. పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూశారనే దానికన్నా, చూసినదాంట్లో హ్యూమన్ పార్టిసిపేషన్, షేరింగ్ ఉన్నాయా లేవా అనేది ముఖ్యం. అంటే పిల్లలు ఒంటరిగా ఫోన్‌తో ఎంగేజ్ అయితే నష్టం. పేరెంట్స్‌తో కలసి చూస్తే, చూసేటప్పుడు మాట్లాడుకుంటే మంచిది. పిల్లల అల్లరిని తప్పించుకునేందుకు వాళ్ల చేతికి ఫోన్ ఇవ్వడం వాళ్లను ఒంటరితనానికి అలవాటు చేసి మనుషులకు దూరం చేయడమే. Toddlers need laps, not apps. మొబైల్లో పిల్లలకు పనికి వచ్చే టెడ్–ఎడ్, కోరా లాంటి ఎడ్యుకేషనల్ యాప్స్‌ను పరిచయం చేయండి. పిల్లలు ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారనేది కాదు, ఎలా ఉపయోగిస్తున్నారనేది వాళ్ల స్క్రీన్ అడిక్షన్‌ను, సోషల్, ఎమోషనల్ సమస్యలను నిర్దేశిస్తుందని అధ్యయనంలో తేలింది. కాబట్టి వాళ్లకు మొబైల్ ఎలా ఉపయోగించాలో నేర్పించండి. ఉదాహరణకు మొబైల్లో క్రికెట్ బాగా ఆడినంత మాత్రాన గ్రౌండ్లో బాగా ఆడలేరని, మొబైల్లో బైక్ రేస్‌లో గెలిచినంత మాత్రాన రోడ్ పై బైక్ నడపలేరని వివరించండి. మొబైల్ గేమ్స్‌లోని స్కిల్స్ బయటకు ట్రాన్స్ఫర్ కావనే విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. టీనేజర్లకు స్క్రీన్ టైమ్‌ను నియంత్రించడం కచ్చితంగా వర్కవుట్ కాదు. అది పేరెంట్స్‌పై వ్యతిరేకతను పెంచుతుంది. అందువల్ల వాళ్లతో కూర్చుని మాట్లాడి రీజనబుల్ టైమ్ చూసేందుకు ఒప్పించండి. ఫోన్ పక్కన పెట్టేయమని కోప్పడకుండా యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండే హాబీలు, పనుల్లోకి డైవర్ట్ చెయ్యండి. అలాంటి పనులు చేసినప్పుడు తరచుగా అభినందించండి. ప్రతి ప్రశంస వారి మెదడులో డొపమైన్‌ను రిలీజ్ చేస్తుంది. ఇవేవీ ఫలితమివ్వకపోతే సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. డిజిటల్ డీఅడిక్షన్ ద్వారా మీ పిల్లలు మొబైల్‌కు దూరమయ్యేలా చికిత్స అందిస్తారు. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారా?
ఒక కార్టూన్లో... యువకుడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ కాస్త ‘సెల్’ (జైలు)గా మారుతుంది. అందులో బందీ అయిన కుర్రాడు బయటికి బిత్తర చూపులు చూస్తుంటాడు. యువతరం డిజిటల్ వ్యసనానికి అద్దం పట్టే కార్టూన్ ఇది. హైదరాబాద్‌కు చెందిన పల్లవికి అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వస్తుంటుంది. లేచి తన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు ‘పదిలంగానే ఉన్నాయా లేదా!’ అని ఒకసారి చూసుకొని పడుకుంటుంది. చెన్నైకి చెందిన శ్రీహర్షిణి ఇంజనీరింగ్ స్టూడెంట్. తాను చదువుకుంటున్నా, ఏదైనా పనిలో ఉన్నా సెల్‌ఫోన్ రింగైనట్లు శబ్దభ్రమ కలిగి, ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటుంది. ఇవి మాత్రమే కాదు... ‘స్క్రీన్ టైమ్’లో తినాలనిపించకపోవడం, నిద్రపోవాలనిపించకపోవడం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం, స్క్రీన్ యాక్సెస్‌కు అవకాశం లేని సమయాల్లో ఒత్తిడికి గురికావడం, చిరాకు అనిపించడం, కోపం రావడం, ఏదైనా సరే ఆన్లైన్లోనే చేయాలనుకోవడం (అవసరం లేకపోయినా సరే), ఫోన్లలో ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం గడపడం (ఉద్యోగ విధుల్లో భాగంగా కాదు), చదువు దెబ్బతినడం... మొదలైనవి ‘డిజిటల్ అడిక్షన్’ కు సూచనలుగా చెబుతున్నారు. ‘ఇది సమస్య’ అని తెలుసుకోలేనంతగా ఆ సమస్యలో పీకల లోతులో మునిగిపోయిన యువతరం ఇప్పుడిప్పుడే ఆ వ్యసనం ఊబి నుంచి బయటపడడానికి, స్వీయచికిత్సకు సిద్ధం అవుతోంది. ‘డిజిటల్ అడిక్షన్’కు దూరం కావడానికి యువతరంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న టెక్నిక్స్‌లో కొన్ని.... 20–20–20: ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఫోన్ నుంచి బ్రేక్ తీసుకోవడం. 20 సెకండ్ల పాటు ఫోన్‌ను 20 ఫీట్ల దూరంలో పెట్టడం. అన్నీ బంద్: పడుకోవడానికి ముందు అన్ని స్క్రీన్లు ఆఫ్ చేయడం. డిజిటల్ ఫాస్ట్: నెలలో కొన్నిరోజులు గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండడం. యూజ్ టెక్–స్టే ఆఫ్ టెక్: అధిక సమయం స్మార్ట్ఫోన్లను ఉపయోగించకుండా యాప్ బ్లాకర్, టైమ్ ట్రాకర్లను ఉపయోగించడం. ఉదా: సెల్ఫ్–కంట్రోల్, ఫోకస్ బూస్టర్, థింక్... మొదలైన యాప్స్ అలారం: అలారం సెట్ చేసుకొని ప్రతి అరగంటకు ఒకసారి మాత్రమే సెల్‌ఫోన్ చెక్ చేసుకోవడం. మిగులు కాలం: డిజిటల్ ప్రపంచంలో గడపడానికి నిర్దిష్టమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని, మిగులు కాలాన్ని పుస్తకాలు చదవడానికి, స్నేహితులను ప్రత్యక్షంగా కలవడానికి ఉపయోగించడం, ఇంటి పనుల్లో పాల్గొనడం... మొదలైనవి. టర్న్ ఆఫ్: ఫోన్లో రకరకాల నోటిఫికేషన్లకు సంబంధించి ‘టింగ్’ అనే శబ్దాలు వస్తుంటాయి. ఎంత కాదనుకున్నా వాటిని చూడాలనిపిస్తుంది. దీనివల్ల టైమ్ వేస్ట్ అవుతుంటుంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి నోటిఫికేషన్ టర్న్ ఆఫ్ చేయడం. నో ఫోన్స్ ఎట్ నైట్ పాలసీ: అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ స్మార్ట్‌ఫోన్ వైపు చూడరాదు అనేది ఈ పాలసీ ఉద్దేశం. టెక్ దిగ్గజాలు కూడా కాలం వృథాను అరికట్టడానికి కొత్త ఫీచర్లు తీసుకువస్తున్నాయి. తాజాగా టిక్‌టాక్ రెండు స్క్రీన్టైమ్ ఫీచర్లను తీసుకువచ్చింది. ‘మొదట్లో డిజిటల్ ఫాస్ట్ అనే మాట నాకు వింతగా అనిపించేది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని వాదించేదాన్ని. నేను కూడా ప్రాక్టిస్ చేసి చూశాను. చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఏదైనా మితంగానే ఉపయోగిస్తే మంచిది అనే వాస్తవాన్ని తెలుసుకున్నాను’ అంటుంది పల్లవి. ముంబైలో డిగ్రీ రెండో సంవత్సరం స్టూడెంట్ అయిన మేఘ ఒకప్పుడు ఫేస్బుక్లో నుంచి అరుదుగా మాత్రమే బయటికి వచ్చేది. ఈ వ్యసనం తన చదువుపై తీవ్ర ప్రభావం చూపడంతో డిజిటల్ ఫాస్ట్ వైపు మొగ్గు చూపింది. ‘ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వాటికవే చెడ్డవేమీ కాదు. అయితే వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం, ఎంతసేపు ఉపయోగిస్తున్నాం అనేది అసలు సమస్య’ అంటారు మానసిక నిపుణులు. మొన్నటి వరకు ‘ఫోమో’ ప్రపంచంలో (ఫోమో... ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఏదైనా మిస్ అవుతున్నానేమో అనే భావనతో పదే పదే ఫోన్ చెక్ చేసుకోవడం) ఉన్న యువతరం ఇప్పుడు ‘జోమో’ ప్రపంచంలోకి (జోమో... జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–మిస్ కావడంలో కూడా ఆనందం వెదుక్కోవడం) రావడానికి గట్టి కృషే చేస్తోంది. మంచిదే కదా! (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) -
కాలక్షేపం కోసం ఆడిన ఆన్లైన్ గేమ్‌లు...సైబర్ జూదం ఊబిల్లో ..
బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాతో మరో నష్టం మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులతో అతిగా మొబైల్స్‌ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది. పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ తెలుసుకుని గేమ్స్‌కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు. డబ్బు తగలేసిన టెక్కీ ఒక టెక్కీ పోకర్ అనే ఆన్లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది. వీధిన పడ్డ క్యాషియర్ బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు) -
స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు
స్మార్ట్ ఫోన్ల వాడకం పతాకస్థాయికి చేరింది. మొబైల్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అవసరానికి వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిసలవుతున్న వారు కెరీర్‌ను పాడు చేసుకుంటున్నారు. అపరిమిత వాడకం.. జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నెముక, కంటి తదితర సమస్యల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్మార్ట్ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లా చిరునామాతో సిమ్ కార్డులు తీసుకున్న 8,01,456 మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నట్లు తేలింది. ఏటా 10 నుంచి 15 శాతం వరకు మొబైల్ఫోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి కాకుండా సాధారణ (కీప్యాడ్) ఫోన్లు మరో 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. నెలకు రూ.16 కోట్లు పైనే స్మార్ట్‌ఫోన్ వినియోగదారు నెలకు సగటున రూ.200 వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారులు వివిధ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు నెలకు కనిష్టంగా రూ.16 కోట్లు, ఏడాదికి రూ.192 కోట్లకు పైగా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. మిగతా సాధారణ ఫోన్లు కూడా కలిపితే ఏడాదికి రూ.250 కోట్లకు పైగా చార్జీల రూపంలో ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నట్టు సమాచారం. సగటున 2 గంటల సమయం వృథా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారికి సగటున రోజుకు రెండు గంటల సమయం వృథా అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ఏదో ఒక యాప్ నుంచి ప్రయోజనం లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా యువకులు, పనిచేసే వారు ఇలా చేయడం వల్ల ఉత్పాదక రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలామంది విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. సెల్‌ఫోన్ కొనివ్వలేదని.. గత ఏడాది డిసెంబర్లో ఉరవకొండ పట్టణంలో రవినాయక్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతకీ కారణమేంటంటే తల్లిదండ్రులు తనకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని. తన కొడుకు సెల్‌ఫోన్‌కు బానిస అయ్యాడని తల్లి కుళ్లాయమ్మ కన్నీరుమున్నీరవుతోంది. అలవాటు చేసినందుకు.. అనంతపురం నగరానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసులు, తనూష దంపతులకు మూడేళ్ల తేజాస్ అనే కుమారుడు ఉన్నాడు. అన్నం తినడం లేదని కుమారుడికి సెల్‌ఫోన్ అలవాటు చేశారు. చివరకు ఆ సెల్‌ఫోన్‌కు బానిసైన చిన్నారి.. ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కు గురయ్యాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్న వారిలో టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ (మెడ నొప్పి) లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సేపు మెడ వంచి మొబైల్ ఫోన్ మెసేజ్‌లు చదువుతున్నారు. గంటల తరబడి మెడ వంచి చూడటం వల్ల వెన్నెముక సమస్యలు కూడా వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మితిమీరి మొబైల్‌ఫోన్‌కు అలవాటు పడిన చిన్నారులకు రెటీనా (కంటి) సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు తేల్చాయి. అనర్థాలకు మూలం సెల్‌ఫోన్ అనేక అనర్థాలకు సెల్‌ఫోన్ వినియోగమే మూలం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెల్‌ఫోన్, వాట్సాప్, ఇంటర్నెట్ వినియోగాన్ని కూడా ఒక బానిసత్వంగా పరిగణించింది. వీటి వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ప్రధానంగా నిద్ర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. నిద్ర లేకపోవడంతో కోపతాపాలకు గురికావడం, ధ్యాస లోపించడం తోపాటు కంటి చూపు పూర్తిగా మందగిస్తోంది. చిన్న వయస్సులో నిషేధిత వెబ్సైట్లలోకి ప్రవేశించి పోర్న్ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. సర్వ అనర్థాలకు కారణం సెల్‌ఫోన్ అని ప్రధానంగా చెప్పవచ్చు. –యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం అధికమవుతున్న అనారోగ్య సమస్యలు (చదవండి: ప్రశాంత్ నీల్.. మన బంగారమే) -
నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు!
మాటల్లేవు... మాట్లాడుకోవడాలు లేవు! ఒక అచ్చట లేదు.. ముచ్చటా లేదు! నట్టింట్లో సందడి, హడావుడి లేనే లేవు... ఉన్నదల్లా భరించలేనంత నిశ్శబ్దం! నలుగురు నాలుగు దిక్కుల్లో మొబైల్‌ఫోన్ తెరలకు అతుక్కుపోయిన పరిస్థితి. స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు చాలామందిలో వ్యసనమైపోయింది. దీంతోనే నిద్ర... దీంతోనే మేలుకొలుపు. రీల్స్ మత్తులో కొందరు... పబ్జీ ఆడుతూ ఇంకొందరు.. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్... పేర్లు ఏవైనా.. అన్నింటి అతి వాడకం పుణ్యమా అని సమాజం విచిత్ర మహమ్మారిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి పీడ ఎలాగోలా వదిలిందని సంబరపడుతున్న ఈ సమయంలో దశాబ్దకాలంగా పట్టిపీడిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ మహమ్మారి సంగతులపై ప్రత్యేక కథనం. -కంచర్ల యాదగిరిరెడ్డి సగటున ఏడు గంటలు ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ దేశంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 2021లో సగటు భారతీయులు రోజుకు సుమారు ఏడు గంటలపాటు ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ‘నేను మొదట్లో గంట మాత్రమే యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలను చూసేదానిని. ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడేందుకు మానసిక నిపుణుడి సహాయం తీసుకోవాల్సి వచ్చింది’ అని ముంబైకి చెందిన గృహిణి ప్రమీలారాణి వాపోయారు. ‘ముఖ్యంగా టీనేజ్ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. వారిని ఆ వ్యస నం నుంచి దూరం చేయకపోతే భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. నా దగ్గరకు రోజు ఇలాంటి కేసులు అరడజను దాకా వస్తున్నాయి. వారిలో పిల్లలతో పాటు సాధారణ గృహిణులు కూడా ఉన్నారు’అని ఢిల్లీకి చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ రాజేంద్రన్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నిమిషానికి ఒకసారి.. నోటిఫికేషన్లు, మెయిళ్లు, చాట్ మెసేజీలేమైనా వచ్చాయా? అని చెక్ చేసుకోవడం స్మార్ట్‌ఫోన్ వ్యసన లక్షణాల్లో మొదటిది. ఫోన్ దగ్గర లేకపోతే ఆందోళనలో పడిపోవడం.. నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ లాక్ ఓపెన్ చేయడం.. ఇలా అనేక రూపాల్లో మన వ్యవసనం బట్టబయలు అవుతూంటుంది’అని చెప్పారు. భౌతిక, మానసిక సమస్యలు స్మార్ట్‌ఫోన్ అతి వినియోగం కారణంగా అటు భౌతిక, ఇటు మానసిక సమస్యలు రెండూ తలెత్తుతున్నాయి. మహిళల్లో తలనొప్పి ఎక్కువ అవుతుండగా.. కళ్ల మంటలు, చూపులో అస్పష్టత, మెడ సమస్యలు, జబ్బు పడితే తేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి దు్రష్పభావాలు కనిపిస్తాయి. విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం కాస్తా ఏకాగ్రత లోపానికి దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ‘బాలల హక్కుల సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న విద్యార్థుల్లో 37.15 శాతం మంది ఏకా గ్రత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే కనీసం 23.80 శాతం మంది పిల్లలు నిద్రపోయేటప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్‌ను తమ దగ్గరగా ఉంచుకుంటున్నారు’ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా గత నెలలో లోక్‌సభకు వివరించారు. ‘ప్రాథమిక ఫలితాల ప్రకారం సెల్‌ఫోన్ రేడియేషన్ కాస్తా మగవారిలో వంధ్యత్వానికి దారితీస్తుంది. అలాగే వీర్యకణాల కదలికలు నెమ్మదించేందుకు, సంఖ్య తగ్గేందుకూ మొబైల్‌ఫోన్ రేడియేషన్ కారణమవుతుంది’ అని ప్రముఖ రేడియోలజిస్ట్ డాక్టర్ కే.గోవర్దన్ రెడ్డి హెచ్చరించారు. ప్రశ్నించుకోండి... సరిచేసుకోండి! స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని గుర్తించేందుకు కొన్ని సర్వేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోని ప్రశ్నలకు నిజాయితీగా జవాబులు చెప్పుకోగలిగితే మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యారా? లేదా? అన్నది తెలిసిపోతుంది. తదనుగుణంగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలరు కూడా. అతికొద్ది మందికి కొన్ని మందులు వాడాల్సిన అవసరం రావొచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తొలగించేందుకు నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏదీ లేదన్నది మాత్రం అందరూ గుర్తించాలి. -
సరదాగా మొదలై... వ్యసనంగా మారి!
‘చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఇటీవల మత్తుమందుకు అలవాటు పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు పాకెట్ మనీ కట్ చేశారు. డ్రగ్స్ కొనడానికి డబ్బుల్లేకపోవడం, తల్లిదండ్రులను అడిగినా ఇవ్వకపోవడంతో ఏకంగా తండ్రినే హత్య చేసేందుకు సిద్ధపడ్డాడు’ ‘గచ్చిబౌలికి చెందిన ఓ యువతి డ్రగ్స్ కొనుగోలు కోసం దొంగతనానికి పాల్పడింది. ముందు ఇంట్లో తల్లిదండ్రుల పర్సులను మాయం చేసేది. అవి సరిపోకపోవడంతో బంధువుల ఇళ్లల్లో బంగారు ఆభరణాలను కొట్టేసి చివరకు పోలీసులకు చిక్కింది’ ‘మలక్‌పేటకు చెందిన ఓ యువకుడు డ్రగ్స్‌కు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి తల్లిదండ్రులు కొనిచ్చిన టూ వీలర్‌ను అమ్మడమే కాదు.. వీధుల్లో పార్క్ చేసిన వాహనాలనూ కొట్టేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు’ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మాదక ద్రవ్యాల కోసం యువత చిన్నచిన్న చోరీల నుంచి హత్యలు చేయడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవలికాలంలో నగరంలో పెరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్ రాడిసన్‌బ్లూ హోటల్లో దొరికిన 150 మందిలో 80 శాతం మంది 35ఏళ్లలోపు వారే. మధ్య తరగతి యువతీ, యువకులు ఎక్కువగా గంజాయి తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఉండి, పబ్బులకు వెళ్లేవాళ్లు కొకైన్, హెరాయిన్, ఓపీయం, ఎల్ఎస్డీ వంటి ద్రావణాలను తీసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆనందం కోసమో మొదలవుతున్న ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్‌నే కబళిస్తోంది. వారి జీవితాలను పాడుచేసుకోవడమే కాదు... మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికీ కారణమవుతున్నారు. చాలా ఘటనల్లో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడడానికి స్నేహితులు, తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిల్లలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. లక్షణాలివే.. మాదక ద్రవ్యాలు తీసుకున్న వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులుంటాయి. చిన్న విషయాలకు చిరాకు, కోపం తెచ్చుకుంటారు. వేళకు తినరు. ఒక్కోసారి అతిగా తింటారు. వ్యక్తిగత శుభ్రత ఉండదు. చదువు, పనితీరులో వెనకబడుతుంటారు. ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. పరధ్యానంలో ఉంటారు. విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రుల కళ్లల్లోకి సూటిగా చూడలేక పోతారు. ఇలాంటి లక్షణాలుంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని అనుమానించొచ్చు. పర్యవేక్షణ అవసరం.. పిల్లలు ఎక్కడికి, ఎవరితో వెళ్తున్నారు? తిరిగి ఇంటికెప్పుడొస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారు? వంటి అంశాలు తెలుసుకోవాలి. లేదంటే పిల్లలు చేయిదాటిపోవడమే కాదు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఊహాలోక అనుభూతికోసం.. గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిజువానా, మార్పిన్, చేరస్ వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. డ్రగ్స్ తీసుకున్న వారు ఊహా లోకంలో విహరిస్తుంటారు. దీన్నే యూపోరియా అంటాం. ఒకసారి ఈ భావన పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి అనుభూతినే పొందాలని భావిస్తుంటాడు. ఉన్నత వర్గాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి దొరక్కపోతే అసాంఘీక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడితే.. కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడుకోవచ్చు. –డా.కళ్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్యనిపుణుడు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం వ్యసనంగా మారిన డ్రగ్స్ యువత ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, లోపల మంట, గొంతులో పుండ్లు, బొంగురు పోవడం, చర్మంపై దద్దుర్లు, కీలకమైన సిరలు దెబ్బ తినడం, మొదడు పోటు, నిద్రలేమి/అతినిద్ర వంటి సమస్యలు తలెత్తడం, రాపిడికి గురై పళ్లు పాడైపో వడం, గుండెపోటు, వాల్వ్‌లకు ఇన్ఫెక్షన్లు, రక్తకఫం, పిల్లికూతలు, ఆయాసం, ఉబ్బసం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. –డాక్టర్ వై.జయరామిరెడ్డి, వైజేఆర్ డీఅడిక్షన్ సెంటర్ డ్రగ్స్‌తో బ్రెయిన్ స్ట్రోక్ లక్డీకాపూల్ (హైదరాబాద్): ఆల్కహాల్‌తోపాటు డ్రగ్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని నిమ్స్ న్యూరో సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ ఎర్రంనేని వంశీకృష్ణ తెలిపారు. డ్రగ్స్‌తో రక్తనాళాలు వ్యాకోచించి, మెదడులో రక్తస్రావం అవుతుందని.. ఇది ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు పెరిగి.. తమ పనులను సక్రమంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ బాధితులు గుండెపోటుతో చనిపోతున్నారన్నారు. ఆల్కహాల్‌తో డ్రగ్స్ కలిపి తీసుకునేవారి సంఖ్య పెరిగిందని.. వారిలో చాలా మంది విద్యావంతులు కావడం, 29 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారే అధికంగా ఉండటం ఆందోళనకరమని చెప్పారు. కొకైన్, గంజాయిలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్న యువకుడు ఇటీవల మెదడులో రక్తస్రావంతో చనిపోయాడని.. ఓ ఐటీ ఉద్యోగిని గంజాయికి అలవాటుపడి రెండుసార్లు బ్రెయిన్ స్టోక్‌కు గురైందని వివరించారు. డ్రగ్స్ వల్ల చేజేతులా జీవితాలను కోల్పోయే ప్రమాదముందని.. యువత ఆల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. -
ఆదాయం కోసం ప్రభుత్వం అడ్డదారులు: అన్నా హజారే
సాక్షి, ముంబై: సూపర్ మార్కెట్లలో, కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు పోరాటాలకు సిద్ధమవుతుండగా, ప్రముఖ సమాజ సేవకుడు అన్నా హజారే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో స్పష్టం చేయాలని సోమవారం అన్నాహజారే బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ నిర్ణయం రైతుల హితవు కోసం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క వైన్ అంటే మద్యం కాదని కూడా అంటోంది. కానీ ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ విక్రయం ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి కీడు చేస్తుందో త్వరలో బయటపడు తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మన రాజ్యాం గం ప్రకారం ప్రజలను వ్యసనాల నుంచి, మాదక ద్రవ్యాలనుంచి విముక్తి చేయడం, మద్యపానానికి దూరంగా ఉంచడం ప్రభుత్వాల విధి. మద్యానికి వ్యతిరేకంగా ప్రచారాల ద్వారా, జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వమే అదనపు ఆదాయం కోసం వ్యసనాలకు బాట వేసే నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం తనను కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల హితవు కోసమైతే పేదలు, సాధారణ రైతులు పండించిన పంటలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. కానీ రైతులకు మేలు చేసే అలాంటి చర్యలను విస్మరిస్తూ, యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల లీటర్ల వైన్‌ను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. మంత్రులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు 2021 నవంబర్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకున్న స్కాచ్ విస్కీపై విక్రయ పన్ను 300 శాతం నుంచి 150 శాతానికి కుదించింది. మద్యం ధరలు తగ్గడంతో విక్రయాలు జోరందుకున్నాయి. ఫలితంగా 2.5 లక్షల బాటిళ్ల విక్రయం పెరిగిపోయింది. ప్రభుత్వానికి లభించే రూ.100 కోట్ల ఆదాయం ఏకంగా రూ.250 కోట్లకు చేరుకుంది. ప్రజలు మద్యానికి బానిసలై సర్వం కోల్పోయినా పర్వాలేదు, ఆదాయం పెరిగితే చాలని ప్రభుత్వం అనుకుంటోందా అని హజారే ప్రశ్నించారు. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, కొందరు మంత్రులు ఈ నిర్ణయాన్ని సమరి్ధస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అదనపు ఆదాయం కోసం మద్యం విక్రయానికి మార్గం సుగమం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడమంటే రాష్ట్ర ప్రజలకు ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకేముంటుందని నిలదీశారు. ఔరంగాబాద్‌లో విక్రయించండి చూద్దాం: ఇమ్తియాజ్ జలీల్ కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతివ్వాలని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఔరంగాబాద్ ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ లాంటి మహాయోధుడు ఏలిన రాష్ట్రం ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన ఇలాంటి పుణ్యభూమిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇంకా ఎవరైనా సరే ఔరంగాబాద్‌కు వచ్చి కిరాణ షాపుల్లో వైన్ విక్రయాన్ని ప్రారంభించి చూపాలని సవాలు విసిరారు. ఆ తరువాత షాపులను ధ్వంసం చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. ఇది కేవలం హెచ్చరిక కాదని, ప్రభుత్వానికి బహిరంగంగా సవాలు విసురుతున్నామని ఇమ్తియాజ్ అన్నారు. వైన్ విక్రయాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర సంస్కృతిని చెడగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. వైన్ విక్రయాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తే చరస్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల పంటలను కూడా పండించేందుకు అనుమతివ్వాలని ఇమ్తియాజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీది ద్వంద్వ వైఖరి: భుజ్‌బల్ సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీని రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకోవడానికి అనుమతించిందని, అక్కడ తప్పు కానిది, మహారాష్ట్రలోనే తప్పు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష బీజేపీది ద్వంద్వ వైఖరి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య కచ్చితంగా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అవుతుందని పేర్కొన్నారు. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ మంత్రి నవాబ్ మాలిక్ కూడా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో, ప్రభుత్వం పెద్దమొత్తంలో మద్యం విక్రయాలకు, బార్లను సైతం తెరవడానికి అనుమతి ఇచ్చారు. మహారాష్ట్రలోనే బీజేపీకి ఇది తప్పుడు నిర్ణయంగా కనిపిస్తోందా అని మాలిక్ ప్రశ్నించారు. ‘వైన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పానీయంగా పరిగణిస్తారు. ప్రభుత్వ నిర్ణయం రైతులకు కచ్చితంగా ఆర్థికంగా సహాయపడుతుంది. కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తారు. మా ప్రభుత్వ నిర్ణయ మాత్రం రైతులకు మేలు చేసేందుకే’ అని ఆయన సమర్థించుకున్నారు. అయితే ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్లు వైన్‌ను విక్రయించకూడదని, నిషేధం అమలులో ఉన్న జిల్లాల్లోనూ వైన్ అమ్మకాలను అనుమతించబోమని భుజ్‌బల్ స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రభుత్వం మద్య నిషేధాన్ని ఉపసంహరించుకుందని, మహారాష్ట్రను ‘మద్య’రాష్ట్ర చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. -
మాయదారి అలవాటు.. పిచ్చోళ్లు అవుతున్న పిలగాండ్లు
ఆదిలాబాద్: సాంకేతిక పరిజ్ఞానం మనిషిలోని సృజనాత్మకతను రోజురోజుకూ నీరు గారుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి సాంకేతికత ఆసరా తీసుకుని దానికి బానిస అవుతున్నాడు. మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న చిన్నారులు బయటి ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. యువత, టీనేజర్లు స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. శారీరక శ్రమ లేక బద్ధకం పెరిగి అనారోగ్యం బారిన పడిన ఆస్పత్రుల పాలవుతున్నారు. వినిపించని బామ్మల కథలు.. గతంలో చిన్నారులు పాఠశాల ముగియగానే ఇంటి వద్ద అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల పంచన చేరేవారు. వారు చెప్పే పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్రం వంటి నీతి కథలను శ్రద్ధగా వినేవారు. దీంతో పిల్లల్లో వినికిడి సామర్థ్యం పెరగడంతోపాటు ఏకాగ్రత, శ్రద్ధ వంటి అంశాలు మెరుగుపడేవి. నీతి కథల ద్వారా నైతిక విలువలు నేర్చుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్నకుటుంబాలు పెరగడంతో పిల్లలకు కథలు చెప్పేవారు కరువయ్యారు. నేటి పిల్లలు పాఠశాల నుంచి రాగానే టీవీ, మొబైల్ ఫోన్లను వదలడం లేదు. మరోవైపు టీనేజ్ పిల్లలు, యువత మొబైల్ ఫోన్ల వాడకంతో అశ్లీలత వైపు అడుగులు వేస్తున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి విపరీత పోకడలు టీనేజ్ పిల్లలను నేరాలను చేయడానికి సైతం ఉసిగొల్పుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పుస్తక పఠనంపై తగ్గిన ఆసక్తి.. డిజిటల్ లర్నింగ్, ఆన్లైన్ తరగతులు రాకతో రోజురోజుకూ పుస్తకం ప్రాధాన్యత తగ్గుతోంది. ఫలితంగా విద్యార్థులు పఠనంపై ఆసక్తి చూపడం లేదు. అరచేతిలోనే ప్రాపంచిక విషయాలు తెలుస్తుండటంతో లైబ్రరీలవైపు పిల్లల అడుగులు పడడం లేదు. ఫోన్లలో ఈ–బుక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువసేపు వాటిని చూడటంతో చిన్నారుల కళ్లు త్వరగా అలిసిపోతున్నాయి. ఫలితంగా ఈ–బుక్ పఠనంలోనూ వారి ఆసక్తి సన్నగిల్లుతోంది. సరైన వినియోగంతోనే.. ఆధునిక యుగంలో మానవ జీవన వృద్ధి, అవసరాలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా కీలకం. విద్య, వైద్యం, నిర్మాణం, పారిశ్రామికం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా సర్వం సాంకేతికమయమే. విద్యాబోధన రంగాల్లో కూడా గణనీయ మార్పులు వచ్చాయి. సానుకూల ఫలితాలను ఇస్తున్న సాంకేతికత దుష్ప్రభావాలను సైతం చూపుతోంది. ఇదే విషయమై పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థుల శారీరక, మానసిక, నైతిక అభివృద్ధికి తోడ్పడాలని నిపుణులు సూచిస్తున్నారు. గంటల తరబడి స్మార్ట్ ఫోన్లను పిల్లలకు ఇవ్వకుండా కట్టడి చేస్తూ, పుస్తక పఠనం, క్రీడలపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు. అప్పుడే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. తగ్గిన శారీరక శ్రమ ‘దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుంది’ అని ఒక మేధావి అంటాడు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకుంటే శారీరక సామర్థ్యం మానసిక స్థైర్యం పెరుగుదలకు ఉపయోగపడుతుంది అనే విషయం అర్థమవుతోంది. సాంకేతిక ఆధునిక యుగంలో పిల్లలు ఆటపాటలు, క్రీడలకు దూరం అవుతున్నారు. ఫలితంగా శారీరకంగా బలహీనులుగా మారి, మానసికంగా జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఏ చిన్న ఓటమి వచ్చినా కుంగుబాటుతో ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. వాస్తవిక ప్రపంచానికి దూరం మొబైల్ ఫోన్లను అధికంగా వినియోగించడంతో పిల్లలు వాస్తవిక ప్రపంచానికి దూరమవుతున్నారు. ఫైటింగ్ గేమ్స్, రేసింగ్ గేమ్స్ ఆడటంతో వారిలో సహనం క్రమక్రమంగా తగ్గిపోయి, ప్రతి విషయానికి ఉద్రిక్తతకు లోనవుతారు. టెక్ గ్యాడ్జెట్స్ అధికంగా వినియోగిస్తుండటంతో కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్ తగ్గిపోతాయి. పిల్లలకు శారీరక శ్రమ కలిగించే ఆటలు, క్రీడలపై ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – ఓంప్రకాశ్, మానసిక వైద్యనిపుణుడు పిల్లలకు సమయం కేటాయించాలి మొబైల్ ఫోన్లను అధికంగా వాడుతుండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫోన్ల వాడకంతో తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోతోంది. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లలకు మొబైల్ ఫోన్లను అందించే విషయంలో కట్టడి చేస్తూ.. వారికి కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు అనుబంధాలు, నైతిక విలువలను గుర్తించి జీవితంలో ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. – సాధన, డెప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ -
పిల్లలకు బోర్ కొట్టిస్తున్న సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: ‘సెల్ ఫోన్‌తో ఆడుకోవడం లేదా డల్‌గా పడుకోవడం’.. ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో పిల్లలు చేసేది ఇదే అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. కరోనా పుణ్యమాని ఉత్సాహంగా ఊరెళ్లే పరిస్థితి లేదు. ఆనందంగా అయిన వాళ్లను రమ్మనే అవకాశం లేదు. కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకుందామన్నా ఆందోళన.. వెరసి సంక్రాంతి సెలవులు విద్యార్థులకు బోర్ కొట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వరకు సెల్ పట్టుకుని, అదే పనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే మౌనంగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు. సరే అని కట్టడి చేస్తే ఏదో కోల్పోయినట్టుగా ఉండిపోతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా సంశయించాల్సి వస్తోంది. కరోనా పరిస్థితుల్లో వచ్చిన సంక్రాంతి సెలవుల్లో స్కూల్ పిల్లల దిన చర్యను ‘సాక్షి’క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పలకరించింది. ఇంట్లో బందీగా పిల్లలు ‘ఇది వరకు సంక్రాంతి సెలవులొస్తే చాలు పిల్లాడిని పట్టుకోవడం కష్టంగా ఉండేది. పొద్దున లేస్తే గాలి పటాల గోలే. ఇప్పుడు ఇల్లు కదలడం లేదు. బయట కూడా అంతా సందడిగా ఉండేది. ఇప్పుడా వాతావరణం లేదు..’ అని వరంగల్ పట్టణానికి చెందిన లలిత చెప్పారు. కరోనా భయంతో పిల్లల్ని ఇల్లు కదలనివ్వడం లేదు. ఇంటికి వేరే పిల్లల్నీ రానివ్వడం లేదు. పక్క పక్క ఇళ్ళవాళ్ళయితే కాస్త సర్దుకుపోతున్నారు. అదీకూడా వాళ్ళింటికి కొత్తవాళ్ళు ఎవరూ రాకపోతేనే. నిజానికి సంక్రాంతి పండగొస్తే పోస్టాఫీసు కాలనీ మొత్తం హడావిడిగా ఉంటుందని, ఎక్కడెక్కడి నుంచో గాలి పటాలు ఎగరెయ్యడానికి, ఆటల పోటీల్లో పాల్గొనడానికి వస్తుంటారని హన్మకొండ పోస్టాఫీసు కాలనీకి చెందని రవి తెలిపారు. ఇప్పుడు అవేవీ కన్పించడం లేదని అన్నారు. పక్క వీధిలోని ఫ్రెండ్ ఇంటికి తన కొడుకు వస్తానంటే, అతని తల్లిదండ్రులు ‘రోజులు బాగోలేవు కదా’అని సున్నితంగా వద్దని చెప్పారని వెల్లడించారు. రెండేళ్ళ క్రితం చూసిన ముగ్గుల పోటీలు, కబడ్డీ ఆటలు, కుస్తీ పోటీలు ఏవీ పిల్లలు ఎంజాయ్ చేసే పరిస్థితి కన్పించడం లేదని అన్నారు. అమ్మమ్మ ఇంటికెళ్ళినా అదే సీన్... ‘నేనొచ్చానని అమ్మమ్మ ఎన్నో పిండి వంటలు చేసింది. కొత్త దుస్తులూ కొన్నది. కానీ ఇల్లు మాత్రం దాటనివ్వడం లేదు..’అని కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్‌లో అమ్మమ్మ ఇంటికొచ్చిన 9వ తరగతి విద్యార్థి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి ఆ ఊళ్ళో వారం రోజులుగా పరిస్థితి బాగాలేదు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల మనవళ్లు, మనవరాళ్లు ఊరికి వస్తామన్నా వద్దన్న ఘటనలున్నాయి. ఖమ్మం పట్టణంలో ఉంటున్న చంద్రం దంపతులు.. తమ ఇంటికి హైదరాబాద్ నుంచి మనవడు, మనమరాలు సంక్రాంతికి వస్తామన్నా.. వద్దన్నారు. ‘రోజులు బాగోలేవు. ఇక్కడ వాళ్ళకు ఏవైనా వచ్చినా వాళ్ళనే అంటారు. వాళ్ళకు ఏమైనా అయినా మాటొస్తుంది’అని చంద్రం వ్యాఖ్యానించారు. కొత్త గేమ్స్ కోసం వేట లాక్డౌన్లో విద్యార్థులు ఆడే గేమ్స్‌పై సూపర్ స్కూల్స్ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ విషయంలోనూ పిల్లల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆ సంస్థ సీఈవో భానూ ప్రసాద్ తెలిపారు. పబ్జీ, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్, సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ వంటి ఆటలు వాళ్ళకు పెద్దగా కిక్కెకించడం లేదు. దీంతో కొత్త కొత్త గేమ్స్ ఏమొచ్చాయా అనే దిశగా నెట్లో వెతుకుతున్నారు. కరోనా కారణంగా బయటకెళ్ళే అవకాశం లేకపోవడంతో 24 గంటలూ సెల్‌ఫోన్ గేమ్స్‌పై ఆధారపడుతున్నారని సర్వేల్లో తేలింది. సంక్రాంతి సెలవుల్లోనూ ఇదే కన్పిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్ మోజులో నెట్ లింక్స్ తెలియకుండా క్లిక్ చేస్తే తలిదండ్రుల బ్యాంకు సమాచారం తెలుసుకుని, సైబర్ నేరగాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం కరోనా కాలంలో పిల్లలకు ఆన్లైన్ విద్య కోసం తల్లిదండ్రులే ఫోన్లు కొనిచ్చారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో అది అంతర్భాగమైంది. సెలవులొస్తే చాలు ఫిజికల్ గేమ్స్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కరోనా ఉధృతి దీనికి మరింత అవకాశం ఇచ్చింది. ఎంతసేపూ మొబైల్ పట్టుకుని కాలం గడిపేస్తున్నారు. ఇది విద్యార్థి మానసిక స్థితిలో మార్పు తెస్తుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి – పణితి రామనాథం (ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, బూర్గుంపాడు, కొత్తగూడెం జిల్లా) సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి సెల్ ఆటలే విద్యార్థులకు శరణ్యం అయినట్టయ్యింది. అయితే ఇవి హద్దుమీరడానికి నియంత్రణ లేకపోవడమే కారణం. పిల్లల్ని తల్లిదండ్రులు అలా వదిలేయకూడదు. వాళ్ళ బాగుకోరి కొంతసేపైనా సెలవుల్లో పుస్తకాల పఠనం వైపు దృష్టి మళ్లించే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులూ వాళ్ళతో ఆడుకుంటూ, సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా చేయడం మంచిది. – శ్రీధర్ (భారత్ పబ్లిక్ స్కూల్, కోదాడ)