Adilabad Agriculture
-
BRS Party: మల్కాజ్గిరి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మరో రెండు లోక్‌సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది బీఆర్ఎస్. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేడు భేటీ అయ్యారు.. నందినగర్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై చర్చించారు. ఈఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలచారి, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. అయితే కేసీఆర్ సమావేశానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ భేటీలోనే రెండు పార్లమెంట్ స్థానాల అభ్యర్ధి ఎంపిక విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును కాదని కాషాయ పార్టీ నగేష్‌కు టికెట్ కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు లోక్ సభ టికెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రకటించిన పార్లమెంటు స్థానాలు 1) ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు 2) మహబూబాబాద్ -(ఎస్టీ) మాలోత్ కవిత 3) కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్ 4)పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్ 5) మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి 6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ 7) వరంగల్ (ఎస్సీ)-డాక్టర్ కడియం కావ్య 8 ) జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్ 9) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి -
పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?
పత్తి అయినా, మరో పంటైనా.. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా? వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. పత్తి, కూరగాయలు, సోయా, వేరుశనగ.. పంట ఏదైనా సరే.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు(రెయిజ్డ్ బెడ్స్) చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఎత్తుమడులపై పత్తిని సాగు చేయటంపై ప్రయోగాలు చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. దుక్కి చేసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలి దుక్కి దున్ని, ట్రాక్టర్‌కు అమర్చిన బెడ్ మేకర్ ద్వారా బోదెలు తోలాలి. తగుమాత్రంగా వర్షం పడిన తర్వాత ఆ బెడ్‌పై ఒకే వరుసలో విత్తుకోవాలి. చదునుగా ఉండే పొలంలో సాగు చేసిన పత్తి పంట కంటే బోదెలు తోలి సాగు చేసిన పత్తి పంట మంచి దిగుబడినిచ్చింది. వర్షం పడిన తర్వాత ఒక వరుసలో పత్తి విత్తనం వేసుకోవాలి వర్షాలకు అధిక నీరు పొలంలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లిపోవటం వల్ల పత్తి పంట ఉరకెత్త లేదు. గాలి, వెలుతురు మొక్కల మొదళ్లకు బాగా తగలటం వల్ల, ఎత్తు మడిలో మట్టి గుల్లగా ఉండటంతో వేరు వ్యవస్థ బాగా విస్తరించటం వల్ల పంట ఆరోగ్యంగా ఎదిగింది. ఎత్తు మడులపై ఆరోగ్యంగా పెరుగుతున్న పత్తి పైరు ఫ్లాట్ బెడ్‌పై విత్తనాలు నాటిన దానితో పోల్చితే అధిక పత్తి దిగుబడులు రావటానికి ఎత్తు మడుల పద్ధతి బాగు ఉపయోగపడిందని డా. ప్రవీణ్ కుమార్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఒక వేళ వర్షాలు తక్కువ పడితే, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినా కూడా ఎత్తుమడిపై ఉన్న పంట వేరు వ్యవస్థలో తేమ త్వరగా ఆరిపోదు. అందువల్ల బెట్టను తట్టుకునే శక్తి కూడా బోదెలపై నాటిన పంటకు చేకూరుతుంది. ఎత్తు మడులు / బోదెలపై పత్తి పంటను విత్తుకోవటం గురించి తాజా వీడియోను ‘కేవీకే ఆదిలాబాద్’ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. రైతులు ఆ వీడియోను చూసి అవగాహన పెంచుకోవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: జీవన ఎరువుల ప్రయోగశాల) -
అమృత్ పత్తి.. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి! ఎలా సాగు చేయాలంటే?
పత్తి దిగుబడుల పరంగా ఎకరానికి 20 క్వింటాళ్లు సాధించిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారికి చెందిన యువ రైతు ఫడ్ విజయ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెట్టింపు దిగుబడి సాధించిన విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకొని పరిసర గ్రామాల రైతులు ఆసక్తిగా పొలాన్ని చూసి వెళ్తున్నారు. సాధారణ సాగులో కొంత మందికి 6 నుంచి 8 క్వింటాళ్లు, మరికొంత మందికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే, ఈ రైతు ఏకంగా రెట్టింపు కంటే అధిక దిగుబడి సాధించడమే రైతులను ఆకర్షిస్తోంది. ఫడ్ విజయ్‌కు మహరాష్ట్రలోని యవత్మాల్ జిల్లా అంబోడ గ్రామంలో చుట్టాలు ఉన్నారు. ఒకసారి ఆ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ అమృత్ ప్యాటర్న్‌లో సాగు చేయడాన్ని గమనించాడు. దిగుబడి అధికంగా వస్తుందని ఆ రైతులు చెప్పడంతో ఆ వైపు మొగ్గు చూపాడు. అమృత్ పద్ధతి అంటే..? యవత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా అంభోద గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త అమృత్‌రావు దేశ్‌ముఖ్ తన క్షేత్రంలో అనేక ఏళ్లపాటు ప్రయోగాలు చేసి ఈ సాగు పద్ధతిని రూపొందించారు. అందువల్లనే అమృత్ ప్యాటర్న్ అని పేరు వచ్చింది. ఏకంగా 50 క్వింటాళ్ల వరకు ఎకరంలో పత్తి దిగుబడి సాధించిన ఘనత ఆయనిది. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా పత్తి సాగులో రైతులు మొక్కల మధ్య కొంచెం అటూ ఇటుగా ఒక అడుగు, వరుసల మధ్య 3 నుంచి 4 అడుగులు లేదా 4 నుంచి 5 అడుగుల దూరం పాటిస్తారు. అమృత్ ప్యాటర్న్‌లో మొక్కల మధ్య దూరం కచ్చితంగా ఒక అడుగు ఉండే చూస్తారు. ఒక వరుస మధ్య 4 అడుగులు, ఆ పక్కన వరుస మధ్య దూరం 6 అడుగుల దూరం పాటిస్తారు. అంటే.. మొదటి రెండు వరుసల మధ్య దూరం నాలుగు అడుగులు.. రెండు, మూడు వరుసల మధ్య ఆరు అడుగుల దూరం అనుసరిస్తారు. ఇదే తీరులో చేనంతా పాటిస్తారు. ఇదే విధానాన్ని విజయ్ అవలంభించారు. నెల తర్వాతే ఎరువులు.. పత్తి సాగులో మొదటి నెల రోజుల పాటు ఎలాంటి ఎరువులు, పురుగుమందులు వాడలేదు. ఇలా చేయటం వల్ల మొక్కకు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. విత్తిన నెల తర్వాత ఎకరాకు ఒక బ్యాగు 10:26:26 వేశారు. ఆ తర్వాత నెలలోనూ అదే మోతాదులో అదే ఎరువుతో పాటు అతి తక్కువ ధరకు లభ్యమయ్యే పురుగుల మందు వాడినట్టు వివరించారు. మూడో నెల తర్వాత 5 కేజీల సల్ఫర్, ఆ తర్వాత 25 కేజీల మెగ్నీషియం నెలకు అందిస్తే సరిపోతుందని విజయ్ తెలిపారు. తద్వారా ప్రతి మొక్కకు వచ్చే కొమ్మలైనా ప్రధాన కొమ్మ, పిల్ల కొమ్మలు చాలా తక్కువ దూరంలో వస్తాయని తెలిపారు. పూత, కాత ఎక్కువగా రావడంతో పాటు రాలిపోకుండా ఉంటాయని విజయ్ వివరించారు. సాళ్ల మధ్య ఎక్కువ దూరం పెట్టడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి అధిక దిగుబడి వస్తోంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని అనుభవపూర్వకంగా విజయ్ చెబుతున్నారు. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చయ్యింది. 20 క్వింటాళ్ల పత్తి తీసిన తర్వాత మళ్లీ నీటి తడి ఇచ్చారు. ఫలితంగా మున్ముందు కూడా మరికొంత పత్తి దిగుబడి రావచ్చని విజయ్ ఆశిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అమృత్ పద్ధతిని అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడే అవసరం పడదు. కలుపు తీయడంతో పాటు ఎరువులు, మందుల ఖర్చుల్లో చాలా ఆదా అవుతుంది. అధిక సాంద్రతతో పూత, కాత రావడం జరుగుతుంది. – సాయిప్రణీత్(96768 83233), వ్యవసాయ విస్తరణాధికారి, కొల్హారి గ్రామం సాగు పద్ధతి మార్చుకొని అధిక దిగుబడి సాధించా... రెండేళ్ల కింద పత్తి సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మహరాష్ట్రలో కొంతమంది రైతులు అవలంభిస్తున్న అమృత్ ప్యాటర్న్‌లో గతేడాది పత్తి సాగు చేశాను. కొన్ని కాయలు కూడా కుళ్లిపోయాయి. అప్పుడు 9 నుంచి 11 క్వింటాళ్ల మధ్య దిగుబడి వచ్చింది. అమృత్ విధానాన్ని పూర్తిస్థాయిలో పాటించకపోవడంతో దిగుబడి అంతకు పరిమితమైంది. రెండో ఏడాది.. గడిచిన వానా కాలంలో ఈ విధానంలో అమృత్ ప్యాటర్న్‌లో అన్ని పద్ధతులను పూర్తిస్థాయిలో అవలంభించాను. ఎకరానికి 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. – ఫడ్ విజయ్ (77024 42958), ఇన్నోవేటివ్ పత్తి రైతు, కొల్హారి గ్రామం, గుడిహత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా – గొడిసెల కృష్ణకాంత్ గౌడ్, స్టాఫ్ రిపోర్టర్, సాక్షి, ఆదిలాబాద్. చదవండి: Goat Farming: మేకలు, నాటు కోళ్ల పెంపకం.. ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం! మరి ఖర్చు? Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల.. -
ఎత్తు మడుల మేలు, ఎన్నో విధాలు!
ఎత్తు మడుల (రెయిజ్డ్ బెడ్స్)పై పంటల సాగు ఎన్నో విధాలా మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు ఎక్కువగా కురిసినా, తక్కువగా కురిసినా.. అది నల్లరేగడి నేలైనా, ఎర్ర చల్కా నేలలైనా.. అది మెరక పొలమైనా, లోతట్టు ప్రాంతమైనా.. పత్తి /కంది /మిర్చి /పసుపు పంటలైనా లేదా వంగ తదితర కూరగాయ పంటలైనా సరే ఎత్తు మడులపై విత్తుకుంటే మేలు అంటున్నారు. అతివృష్టి, అనావృష్టి కాలాల్లో వత్తిళ్లను తట్టుకోవడమే కాకుండా పంటలు బాగా పెరుగుతాయని, గాలి వెలుతురు బాగా సోకడం వల్ల చీడ పీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని, అంతిమం గా అధిక దిగుబడులనిస్తాయని ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. మూడేళ్ల క్రితం నుంచి ఎత్తుమడులపై పత్తి (4సాళ్లు)+కంది(2సాళ్లు) కలిపి సాగు చేసే పద్ధతిలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. అతివృష్టి అయినా, అనావృష్టి అయినా పంటలు దెబ్బతినకుండా ఎకరానికి 13–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తున్నదని చెబుతున్నారు. ట్రాక్టర్‌కు రెయిజ్డ్ బెడ్ మేకర్ పరికరాన్ని అమర్చి వరుసల మధ్య 5 అడుగుల ఎడంతో, అడుగు వెడల్పు (150X30 సెం.మీ.) తో ఎత్తు మడులు తయారు చేస్తున్న దృశ్యం ఆరుగాలం కష్టపడే అన్నదాత ప్రతి యేడు ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు అధికంగా పడి పంట నీట మునగడం, ఒక్కోసారి సరైన సమయం లో వర్షాలు కురువక పంటలు ఎండిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అధిక వర్షాలు పడితే నల్లరేగడి పొలం ఉరకెత్తుతుంది. దిగుబడి లోపిస్తుంది. ఎత్తు మడుల విధానంలో లాభాల బాటలోకి పయనించవచ్చని డాక్టర్ ప్రవీణ్ సూచిస్తున్నారు. చిన్న ట్రాక్టర్‌తో అంతర సేద్యం ద్వారా కలుపు నిర్మూలిస్తున్న దృశ్యం 15X30 సెం.మీ. దూరం మేలు ఎత్తు మడులపై పత్తి, కంది మాత్రమే కాదు.. మిర్చి, పసుపుతోపాటు వంగ తదితర కూరగాయలను సాగు చేయవచ్చు అంటున్నారు డా.ప్రవీణ్. గతఏడాది 5 ఎకరాల్లో ఈ విధానంలో పత్తి పంట సాగు చేశారు. అధిక వర్షం కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండకుండా బెడ్లుగా తయారు చేసి, వాటిపైన పత్తి విత్తనాలు నాటారు. పత్తి మొక్కల సాళ్ల మధ్య 180X30 సెం.మీ., 150X20 సెం.మీ., 120X30 సెం.మీ.ల దూరంలో ప్రయోగాత్మకంగా పత్తి పంటను సాగు చేశారు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో 5 అడుగుల వెడల్పు ఎత్తు మడులపై 4 వరుసలు పత్తి, 2 వరుసలు కంది విత్తినప్పటి దృశ్యం (ఫైల్) మొక్కకు 80 కాయల వరకు కాచాయి. తక్కువ దూరం పెట్టిన చోట తోట కలిసిపోయి పిచికారీలకు ఇబ్బంది ఏర్పడింది. అందుకని, 150X30 సెం.మీ. (సాళ్ల మధ్యన 5 అడుగులు, మొక్కల మధ్యన ఒక అడుగు దూరం) చొప్పున 4 సాళ్లు పత్తి, 2 సాళ్లు కంది విత్తామని డా. ప్రవీణ్ వివరించారు. సాళ్ల మధ్య తగినంత ఖాళీ ఉండడంతో మినీ ట్రాక్టర్ ద్వారా కలుపు తీయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎద్దులతో పైపాటు చేసుకునే రైతులు సాళ్ల మధ్య 4 అడుగులు (120 సెం.మీ.) దూరం పెట్టుకున్నా పర్వాలేదన్నారు. అధిక వర్షాలు కురిస్తే.. సాళ్లలో నీరు నిల్వ ఉండి ఇంకుతుంది. వర్షాలు తక్కువగా ఉంటే.. కురిసిన కొద్ది మాత్రం వర్షం ఎక్కడికక్కడే ఇంకి ఎత్తు మడులపై ఉన్న పంటలు త్వరగా నీటి ఎద్దడికి గురికాకుకుండా ఉపయోగపడుతుంది. సాధారణ సాగు పద్ధతిలో అధిక వర్షం కురిసినప్పుడు పంటలు ఉరకెత్తి దెబ్బతింటాయి. తక్కువ వర్షం కురిస్తే పంట త్వరగా బెట్టకు వస్తుంది. ఎత్తు మడులపై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా నష్టాన్ని నివారించవచ్చు. అంతేకాదు పంటలు ఏవైనా సరే ఈ పద్ధతిలో అధిక దిగుబడి కూడా పొందవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. – యేర సుధాకర్, సాక్షి, ఆదిలాబాద్ టౌన్ చదవండి: డ్రాగన్ ప్రూట్ కన్నా అధిక పోషక విలువలు.. -
ఎత్తు మడులతో ఎంతో మేలు!
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నారు. ఓ యేడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. అధిక వర్షం కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో బురదగా మారి పత్తి పంటలో ఎదుగుదల లోపించి దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఎత్తు మడుల పద్ధతి (రైజ్డ్ బెడ్ సిస్టమ్) ద్వారా కేవీకే క్షేత్రంలో వర్షాధారంగా బీటీ పత్తి సాగు చేస్తున్నారు. వర్షాధారపు సాగులో ఆదిలాబాద్ ప్రాంతంలో సాధారణంగా ఎకరానికి 8–10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అయితే, ఎత్తుమడుల పద్ధతిలో ఎకరానికి 13–15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంటున్నారు. 15–20 సెం.మీ. ఎత్తున మడులు సమతల భూమి మీద గొర్రుతో తోలి సాళ్లుగా పత్తి విత్తుకోవడం సాధారణ పద్ధతి. ఎత్తు మడుల పద్ధతిలో ట్రాక్టర్‌కు రెయిజ్డ్ బెడ్ మేకర్ అనే పరికరాన్ని జోడించడం ద్వారా మడులు తోలుకొని పత్తి విత్తుకోవాలి. ఈ మడి 15–20 సెం.మీ. ఎత్తున ఉంటుంది. మడి వెడల్పు (ఆ భూమి స్వభావాన్ని బట్టి, అక్కడి వర్షపాతాన్ని బట్టి) ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మడి పైనే పత్తి విత్తనాలు నాటుతారు. పత్తి మొక్కలున్న ఎత్తు మడికి అటు ఇటు కాలువలు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు పంట చేలల్లో వర్షపు నీరు ఈ కాల్వల్లో మాత్రమే నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. వర్షాలు ఈ ఏడాది మాదిరిగా బాగా ఎక్కువగా కురిస్తే.. పత్తి మొక్కలు ఎత్తు మడిలో ఉంటాయి కాబట్టి ఉరకెత్తే ఇబ్బంది ఉండదు. మొక్కల వద్ద నీరు నిల్వ లేకపోవడంతో అవి ఏపుగా పెరుగుతాయి. గాలి సరిగా ఆడుతుంది. ఎండ బాగా తగులుతుంది. తెగుళ్లు కూడా అంతగా ఆశించవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వర్షాలు అంతగా లేనప్పుడు కూడా ఎత్తు మడి ఉపయోగపడుతుంది. వర్షానికి కాలువల్లో ఇంకిన నీటి తేమ ఉపయోగపడుతుంది. భారీ వర్షాల్లో కూడా పత్తి చేలు ఉరకెత్తకుండా ఉండే ఉపాయం ఏమైనా ఉందా? ఉందంటున్నారు ఆదిలాబాద్ కేవీకే శాస్త్రవేత్తలు. ఎత్తు మడుల (రెయిజ్డ్ బెడ్స్)పై పత్తిని విత్తుకుంటే అతివృష్టిని మాత్రమే కాదు, ఒకవేళ అనావృష్టి ఎదురైనా పంట సమర్థవంతంగా తట్టుకోగలుగుతుందని అంటున్నారు. పసుపు మాదిరిగా పత్తి, కంది, మిర్చి, వంగ తదితర కూరగాయలను సైతం ఎత్తు మడలపై సాగు చేస్తే.. వర్షాలు అటూ ఇటూ అయినా సరే 10–20% మేరకు దిగుబడి పెరుగుతుందంటున్నారు. రెండేళ్లుగా ప్రయోగాలు కేవీకే సమన్వయకర్త డా. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రైజ్డ్ బెడ్ సాగు పద్ధతికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. గతేడాది కేవీకేలో ఈ పద్ధతిలో ఎకరంలో పత్తి సాగు చేస్తే 12.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 5 ఎకరాల్లో వేశారు. మొక్కల సాళ్ల మధ్య 180“30 సెం.మీ., 150“20 సెం.మీ., 120“30 సెం.మీ.ల దూరంలో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తి పంట ఐదున్నర అడుగుల ఎత్తు వరకు ఏపుగా పెరిగింది. ఒక్కో మొక్కకు ప్రస్తుతం 50 కాయలున్నాయి. మరో 30 నుంచి 40 కాయలు కాచే విధంగా పూత ఉంది. పురుగులు, తెగుళ్లు లేవు. సాళ్ల మధ్య తగినంత ఖాళీ ఉండటంతో కలుపు నిర్మూలనకు మినీట్రాక్టర్తో పైపాటు చేస్తున్నారు. కాయలు కాసిన తర్వాత పొలంలో నీరు నిల్వ ఉంటే కాయలు మురిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ తగినంత వర్షం కురవకపోయినా, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు ఎడం వచ్చినా పంట బెట్టకు వచ్చి దిగుబడి తగ్గుతుంది. ఎత్తు మడుల పద్ధతి ద్వారా పంటలను సాగు చేయటం ఒక్కటే ఈ సమస్యలకు పరిష్కారం అని కేవీకే సమన్వయకర్త డా. ప్రవీణ్‌కుమార్ రైతులకు సూచిస్తున్నారు. – సుధాకర్ యేరా, సాక్షి, ఆదిలాబాద్ టౌన్ వర్షాలు అటూ ఇటూ అయినా అధిక దిగుబడి! వర్షాధార భూముల్లో ఎత్తు మడులపై పంటలను సాగు చేయటం ద్వారా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. వర్షాలు ఎక్కువైతే మడుల పక్కన కాలువల్లోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. పంట ఉరకెత్తదు. వర్షాలు తక్కువగా కురిసినా.. ఎక్కడి నీరు అక్కడే ఇంకుతుంది కాబట్టి భూమిలో తేమ ఉండి పంట దిగుబడి దెబ్బతినదు. అంటే.. వర్షాలు అటూ ఇటూ అయినా ఎత్తుమడుల వల్ల దిగుబడి దెబ్బతినదు. 10–20% అదనంగా దిగుబడి పొందవచ్చు. పసుపు మాదరిగా పత్తిని కూగా ఎత్తు మడుల్లో సాగు చేయవచ్చు. కంది, మిరప, వంగ వంటి కూరగాయలు కూడా ఇలా సాగు చేయవచ్చు. ట్రాక్టర్‌తో ఎత్తుమడులు తోలుకోవాలి. ఎర్ర నేలల్లో అయినా, నల్ల నేలల్లో అయినా సాగు చేయొచ్చు. తేలికపాటి, ఎర్ర నేలల్లో సాళ్ల మధ్య, మొక్కల మధ్య దూరం తక్కువగా పెట్టుకోవాలి. బలమైన నల్ల నేలల్లో అయితే కొంచెం ఎడంగా పెట్టుకోవాలి. ఎర్ర నేలల్లో మొక్కల సాంద్రత ఎక్కువగా, నల్లనేలల్లో తక్కువగా ఉంటుంది. మొదటి సారి గత ఏడాది నల్ల నేలలో 120“30 సెం.మీ. (సాళ్ల మధ్య 120 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ.) దూరంలో సాగు చేశాం. బాగా వత్తుగా అయ్యి పురుగుమందుల పిరికారీ ఇబ్బంది అయ్యింది. ఈ ఏడాది 150“30, 180“30 కొలతల్లో పత్తి విత్తాం. 180“30లో ఎకరానికి 7,400 మొక్కలు వచ్చాయి. మొక్కలు ఆరు అడుగులు ఎత్తు పెరిగాయి. సాళ్లు కూడా మూసుకుపోయాయి. ఈ ఏడాది ఎడతెరపి లేని వర్షాల్లో కూడా నీరు నిలవలేదు. పంట ఉరకెత్తలేదు. చీడపీడల్లేవు. చెట్టుకు 40–50 కాయలున్నాయి. ప్రస్తుతం ఉన్న పూతతో మరో 30 వరకు కాయలు వరకు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి ఖాయంగా వస్తుంది. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి, కలుపు గొర్రుతో తీస్తారా, ట్రాక్టర్‌తో తీస్తారా అన్నదాన్ని బట్టి రైతులు సాళ్ల మధ్య దూరాన్ని ఎంపిక చేసుకోవాలి. – డా. యాదగిరి ప్రవీణ్‌కుమార్ (99896 23829), సమన్వయకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ 24, 25 తేదీల్లో ఆన్లైన్ దేశీ విత్తనోత్సవం జాతీయ స్థాయిలో దేశీ విత్తనోత్సవాన్ని వినూత్నంగా తొట్టతొలిగా ఆన్లైన్లో ఈ నెల 24(శని)–25(ఆది) తేదీల్లో ఉ. 10 గం. నుంచి సా. 2.30 గం. వరకు జరగనుంది. భారత్ బీజ్ స్వరాజ్ మంచ్, ఆషా–కిసాన్ స్వరాజ్, సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్, సహజ సమృద్ధ సంస్థలు ఈ సంప్రదాయ విత్తన పరిరక్షణ కార్యక్రమాన్ని సంయుక్తంగా చేపట్టాయి. విలక్షణమైన సంప్రదాయ వంగడాలకు ఆలవాలం దేశం మనది. ప్రపంచంలో ఇంతటి సుసంపన్నమైన వ్యవసాయ జీవవైవిధ్యం కలిగిన అతి కొద్ది దేశాలలో భారత్ కూడా ఉంది. అమూల్యమైన ఈ వంగడాలను ఏటేటా సాగు చేస్తూ పరిరక్షించుకోవటం ఆహార భద్రత రీత్యా చాలా ముఖ్యమైన సంగతి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయ విత్తన పరిరక్షకులు వారి వద్ద ఉన్న వంగడాలను ఈ ఆన్లైన్ విత్తనోత్సవంలో ప్రదర్శిస్తారు. ఈ ఆన్లైన్ విత్తనోత్సవం చూడాలనుకునే వారు రెండు రోజులకు వేర్వేరుగా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి. మొదటి రోజు 24వ తేదీ నాటి విత్తనోత్సవంలో పాల్గొనదలచిన వారు ఈ క్రింది వెబ్ పేజీలో రిజిస్టర్ చేసుకోవాలి. https://tinyurl.com/SeedMelaDay1 రెండో రోజు 25వ తేదీ నాటి విత్తనోత్సవంలో పాల్గొనదలచిన వారు ఈ క్రింది వెబ్ పేజీలో రిజిస్టర్ చేసుకోవాలి. https://tinyurl.com/SeedMelaDay2 మట్టికి దగ్గరైతే మది తేలిక! కోవిడ్–19 కష్టకాలంలో స్వయంగా మట్టిలో విత్తనాలు వేసి సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయటం ప్రారంభించిన వారి మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడిందని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఇంటిపట్టున కూరగాయలు సాగు చేసుకునే వారికి శారీరక వ్యాయామం, ఆరోగ్యదాయకమైన కూరగాయలకు తోడు మానసిక స్వస్థత కూడా అభిస్తోందని ప్రిన్సెటన్ విశ్వవిద్యాలయం కరోనా కాలంలో చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ‘ప్రకృతిలో, మొక్కల మధ్య గడుపుతూ పెంచిన కూరగాయలను ఇరుగు పొరుగు వారితో పంచుకుంటూ ఉన్నప్పుడు వారి మదిలో స్థిమితత్వ భావన, గొప్ప సంతృప్తి, ఆనందం కలుగుతాయ’ని రొడేల్ ఇన్స్టిట్యూట్ కమ్యూనికేషన్స్ సంచాలకులు డయానా మార్టిన్ అన్నారు. కరోనా కాలంలో చాలా మంది ఉచిత కిచెన్ గార్డెన్ కిట్ తమ దగ్గర తీసుకొని కూరగాయల సాగు మొదలుపెట్టారన్నారు. -
కరోనా: ఆశా కార్యకర్తలపై దాడికి యత్నం
సాక్షి, కైలాస్‌నగర్(ఆదిలాబాద్) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి కుంటుంబాలను సర్వే చేసేందుకు వెళ్లిన ఆశా కార్యకర్తలపై దాడికి యత్నించడం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఆశా కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించడంపై జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు విధులు బహిష్కరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సర్వేకు ప్రజలు సహకరించడం లేదని, దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకే ప్రమాదం ఉందని, గదుల్లో బంధిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. స్పందించిన అధికారులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. (మృతులంతా మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లే..!) చిల్కూరి లక్ష్మినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే ఆశా కార్యకర్త భారతి శివాజీచౌక్‌లో సర్వేకు వెళ్లగా.. ఓ అనుమానితుడు సర్వే ఫైల్‌ను చించే ప్రయత్నం చేసి దాడికి యత్నించాడు. సదరు వ్యక్తిపై వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక శివాజీచౌక్‌కు చెందిన ఓ అనుమానిత వ్యక్తిని సర్వే చేసేందుకు ఆశా కార్యకర్త భారతి వెళ్లగా.. అతడి సోదరుడు దురుసుగా ప్రవర్తించాడు. భారతి ఫిర్యాదు మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్వయంగా కేసును పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్టు చేయాలని ఆదేశించారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు) ఖుర్షీద్‌నగర్ ఆరోగ్య కేంద్రం ఆశా కార్యకర్త అర్చన ఖుర్షీద్‌నగర్‌లో సర్వేకు వెళ్లగా కొందరు స్థానికులు దురుసుగా ప్రవర్తించారు. ఇలా వరుస సంఘటనలో తమకు రక్షణ లేకుండా పోతోందని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తొడసం చెందు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆశా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ విష్ణు వారియర్ సర్వేకు వెళ్లే ఆశా కార్యకర్తలకు పోలీసు సెక్యూరిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సర్వేలకు వచ్చిన ౖసిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినా, వారి విధులకు ఆటంకం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (కరోనా: మరో షాకింగ్ న్యూస్!) -
మద్దతు ధర లేక నిలిచిన పత్తి కొనుగోళ్లు
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ పత్తి కొనుగోలు కేంద్రంలో బుధవారం ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 5550 కు గాను, వ్యాపారులు రూ. 4950 మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు మండిపడ్డారు. మద్దతు ధర చెల్లించాల్సిందేనని రైతులు పట్టుబట్టడంతో కలెక్టర్ దివ్యదేవ్ రాజన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావు కలుగజేసుకున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విసిగిపోయిన రైతులు పంజాబ్ చౌక్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. -
పాతాళంలోకి గంగమ్మ
సాక్షి, ఆదిలాబాద్: ఆకాశ గంగమ్మ భువికి దిగి రానంటోంది. పాతాళ గంగమ్మ పైకి రానంటోంది. మరోవైపు మితిమీరిన ఎండలతో జనం గొంతెండిపోతోంది. గుక్కెడు నీటికోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భజలాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా భారీ వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. బజార్హత్నూర్లో 36.23 మీటర్లు, నేరడిగొండలో 48 మీటర్ల లోతుకు జలం వెళ్లిదంటే పరిస్థితి ఎంత జఠిలంగా ఉందో అర్థమవుతోంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా.. కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోసిపోతున్న జలాశయాలు జలాశయాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో సాత్నాల, మత్తడివాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన్నవాగు, కుమురంభీం, పీపీరావు ప్రాజెక్టు, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. చెరువులు ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. బావులు, చేతిపంపుల్లో నీళ్లు రావడం లేదు. జూన్ 1 నుంచి వర్షాలు కురవాల్సి ఉన్నా ఈసారి నైరుతి రుతుపవనాలు కనికరించకపోవడంతో ఇంకా వర్షాల జాడలేకపోయింది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటే వైపరీత్యాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా.. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది పరిస్థితులే ఈసారి కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. జిల్లాలో కనిష్టంగా 5.52 మీటర్లలో, గరిష్టంగా 48 మీటర్లలో భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బజార్హత్నూర్, నేరడిగొండలో పరిస్థితి దారుణంగా ఉంది. బజార్హత్నూర్లో 36.23 మీటర్లు, నేరడిగొండలో 48.00 మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటాయి. ఏటా ఈ రెండు మండలాల్లోనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. జిల్లాలో సగటున కనిష్టంగా 4.23 మీటర్లు, గరిష్టంగా 24.98 మీటర్ల లోతులో నీళ్లు పడిపోయాయి. తానూర్ మండలం బోసిలో 24.98 మీటర్లు, సారంగాపూర్ మండలం బీరవెల్లిలో 19.20 మీటర్లు, నర్సాపూర్‌లో 18.60 మీటర్లు, లోకేశ్వరం మండలం మన్మడ్‌లో 24.50 మీటర్లు, కుంటాలలో 17.70 మీటర్లలో జలాలు పడిపోయాయి. కుమురంభీం జిల్లా.. కుమురంభీం జిల్లాలోనూ భూగర్భజలాలు పడిపోతున్నాయి. ఆసిఫాబాద్‌లో 21.85 మీటర్లు, కాగజ్‌నగర్ శివారు జంబుగాంలో 15.50 మీటర్లు, దహెగాంలో 15.75 మీటర్లు, పెంచికల్పేట్ సమీపంలోని ఎల్కపల్లిలో 15.50 మీటర్ల లోతులో జలాలు పడిపోయాయి. ఇతర మండలాల్లోనూ భూగర్భ జలాలది ఇదే పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా.. మంచిర్యాల జిల్లాలోనూ భూగర్భజలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సగటున జిల్లాలో 7.98 మీటర్లకు జలాలు పడిపోయాయి. జైపూర్ మండలం కుందారంలో 19.54 మీటర్లకు, మందమర్రి సమీపంలోని పొన్నారంలో 16.35 మీటర్లు, తాండూర్‌లో 15.48 మీటర్లకు పడిపోయాయి. వర్షాలు పడితేనే రీచార్జ్ సమయానికి వర్షాలు కురువని పక్షంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బోర్లు ఎండిపోతున్నాయి. మళ్లీ మంచి వర్షాలు పడినప్పుడే రీచార్జ్ అవుతాయి. ప్రజలు నీళ్లను పొదుపుగా వాడాలి. – టి.హన్స్‌రాజ్, అసిస్టెంట్ డైరెక్టర్, భూగర్భజల శాఖ, ఆదిలాబాద్ -
వానమ్మ.. రావమ్మా..
సాక్షి, ఆదిలాబాద్: వానమ్మ.. రావమ్మా.. అంటూ తొలకరి వర్షాల కోసం ఆదిలాబాద్ రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో మృగశిర కార్తె ప్రవేశంతోనే రైతులు పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడడమే తప్పా.. పెద్ద వర్షాల జాడలేదు. అయినా నీటివసతి ఉన్న రైతులు వితనాలు వేసేశారు. దీంతో మిగతా రైతులు ఆగమాగం అవుతున్నారు. ఒకరిని చూసి మరొకరు భూమిలో విత్తనం వేస్తున్నారు. ఇప్పటికే 20 నుంచి 30 శాతం మంది పత్తి విత్తనాలు పెట్టారు. ఇక వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండుమూడు రోజుల్లో వర్షాలు కురువని పక్షంలో పెట్టుబడిలోనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అప్పటికి.. ఇప్పటికీ గతేడాది తొలకరి వర్షాలు రైతులను మురిపించాయి. పోయినేడు ఇదే సమయానికి 70 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. సాధారణంగా జిల్లాలో రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2 లక్షల హెక్టార్ల వరకు సాగయ్యే పరిస్థితి ఉండగా, అందులో పత్తి పంటనే 1.47 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఏడాది వర్షాల రాక ఆలస్యం కావడంతో రైతులు పత్తి విత్తనాలు నాటడంలో డోలయాన పరిస్థితి కనిపిస్తోంది. నీటి సౌకర్యం ఉన్న కొంత మంది బడా రైతులు పత్తి విత్తనాలు నాటడంతో వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వారిని చూసి పలు వురు చిన్న, సన్నకారు రైతులు కూడా విత్తనాలు వేశారు. ఈ రెండుమూడు రోజులు వర్షాలు పడితే నే ఆ విత్తనం మొలకెత్తే అవకాశం ఉంది. లేదంటే భూమిలోనే విత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది. అంతా రెడీ.. వర్షాకాలం మొదలుకావడంతో పంటలు వేయడానికి రైతులు సర్వం సిద్ధం చేసుకున్నారు. దుక్కులు దున్ని చదును చేశారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ధైర్యం చేసి తెచ్చిన విత్తనాలను నాటితే వర్షాలు రాక చెయ్యికి అందదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి వస్తోంది. కష్టాల్లో కర్షకుడు ఏటా ప్రకృతి వైపరిత్యాలతో కర్షకుడు ఏదో రీతిన నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది తొలకరి జోరుగా మురిపించగా, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగి రైతు ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇసుక మేటలతో చేల్లు ధ్వంసమయ్యాయి. రైతులు నష్టపోయా రు. ఇలా రైతన్నను భారీ వర్షాలు అప్పట్లో దెబ్బతీశాయి. సాహసం చేయడం పత్తి రైతుకు అలవాటైంది. మృగశిర కార్తె ప్రవేశంతో పత్తి విత్తనం నాటిన పక్షంలో సరైన సమయంలో పత్తికి పూత, కాత వస్తుందనే నమ్మకంతో రైతులు ఈ సమయంలో విత్తు నాటేందుకు సాహసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర వర్షాభావం గతేడాదితో పోల్చితే ఈసారి తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, మావల, జైనథ్ మండలాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. సాధారణ వర్షం కంటే –60 శాతం నుంచి –99 శాతం వరకు తక్కువ వర్షపాతం ఉంటే దానిని తీవ్ర వర్షాభావంగా పరిగణిస్తారు. ప్రస్తుతం పై మూడు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. –20 శాతం నుంచి –59 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని వర్షాభావ పరిస్థితిగా పరిగణిస్తారు. జిల్లాలోని బేల, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్‌లలో ఈ పరిస్థితి ఉంది. సాధారణ వర్షపాతం కంటే –19 శాతం నుంచి +19 శాతం వరకు వర్షం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇక సాధారణ వర్షపాతం కంటే +20 శాతం, అంతకంటే ఎక్కువ కురిస్తే దానిని అతివర్షపాతంగా పరిగణిస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఒక తాంసి, భీంపూర్ మండలాల్లోనే అధిక వర్షపాతం కురిసింది. -
ఖరీఫ్ ఆలస్యం
కెరమెరి(ఆసిఫాబాద్): మృగశిరం మాసం ప్రారంభమైనా వానలు మృగ్యమవడంతో అన్నదాత దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే పొలం పనులన్నీ పూర్తి చేసి నింగికేసి చూస్తున్న రైతులు ఎందరో జిల్లాలో ఉన్నారు. నైరుతి రుతుపవనాల రాక మరింతగా ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం దాటితే తప్పా తొలకరి పలకరించే అవకాశం లేదని చెబుతుండడంతో ఈసారి ఖరీఫ్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమైన రుతుపవనాలు... గతేడు జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురువడంతో రైతులు సంతోషంతో విత్తనాలు నాటుకున్నారు. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 40శాతం విత్తనాలు వేశారు. ఈ సారి మాత్రం ఇప్పటి వరకు వర్షాలు కురవక పోవడంతో రైతులు వేసవి దుక్కులు సైతం చేయలేక ఆకాశం వైపు చూస్తున్నారు. దుక్కులు దున్నేందుకు భూముల్లో సేంద్రియ ఎరువులు, నల్లమట్టి వేసి ఎదరుచూస్తున్నారు. ఇప్పటి వరకు 20శాతం దుక్కులు కూడా కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల అక్కడక్కడ కురిసిన వర్షాలకు తడిసిన భూముల్లో పిచ్చి మొక్కల తొలగించేందుకే సరిపోయిందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పుడు వానస్తోనే వేసవి దుక్కులు చేసినా తర్వాత మరో సారి వానలు కురిస్తేనే విత్తనాలు వేసేందుకు అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వర్షాలు వచ్చినా విత్తనా లు నాటుకునేందుకు దాదాపు మూడు వారా లు పట్టె అవకాశముంది. దీంతో సీజన్ నెలరోజులు వెనక్కి వెళ్లినట్టేనని రైతులు అంటున్నారు. కాలం ఆశాజనకంగా.. కాలం ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ శాఖ మూడు వారాల కిందట ప్రకటించిన నేపథ్యంలో అధికారులు సాధారణ సాగు విస్తీర్ణానికి మించి పంటలు సాగవనున్నాయని 30 శాతం అదనంగా ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం. అయినా నేటికి వర్షాలు కురవక పోవడం రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. జిల్లాలో కొంత కాలువల ద్వారా సాగువుతుండగా.. అధిక శాతం నీటి సౌకర్యం లేక పోవడంతో అకాశం వైపు వేచి చూస్తున్నారు. కొందరు విద్యుత్ ఆధారిత బోరు బావులను నమ్ముకుంటున్నారు. మండిపోతున్న ఎండలు! సాధారణంగా జూన్ మొదటి వారం వచ్చిందటే రుతుపవనాల ఆగమనంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు వస్తాయి. ప్రస్తుతం రుతుపవనాల జాడ లేక పోవడం, వడగాల్పులు వీస్తుండడం. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో పగటి ఉష్ణ్రోగ్రతలు 40 నుంచి 45డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. మరో వారం రోజులు తపరిస్తితులు ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది లోటు వర్షపాతం.. నిరుడు జిల్లాలో సాధారణ వర్షాపాతం కంటే 30.5 మిల్లీ.మీటర్ల లోటు నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోయాయి. జిల్లా పరిధిలో ఆశించయిన స్థాయిలో వానలు కురవలేదు. పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లింది. ఈసారి గత చేదు అనుభవాలు దరిచేరకుండా వానలు కురవాలని అన్నదాతలు ఆశిస్తున్నారు. కాలువల ద్వారా సాగు నీరందించి రైతున్నల కన్నీళ్లు తుడవాలనే సంకల్పంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గతేడాది వరకు పలు చోట్ల చెక్ డ్యాంలు, చెరువు కట్టలు నిర్మించింది. కానీ ప్రస్తుతం అవి ఎండిపోయి ఉండడంతో వాటిని చూసి అన్నదాత దిగాలు చెందుతున్నాడు. పరిస్థితిలో మార్పు రాకుంటే రానున్న కాలం గడ్డు కాలమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
నకిలీ విత్తనాలపై నిఘా
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలు విక్రయించే వారి బెడద ఎక్కువవుతోంది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి. దీంతో నకిలీలతో అన్నదాత బేజారవుతున్నాడు. పలు కంపెనీలకు చెందిన డీలర్లు ఈ విత్తనాలను గ్రామాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారే తప్పా గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టక ప్రతీ ఏటా రైతులను నట్టేట ముంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నకిలీలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. మండలాలు, డివిజన్, జిల్లాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపడుతోంది. అనుమతులు లేని విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో సాగు వివరాలు... ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. పత్తి 1లక్షా42వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా, సోయాబీన్ 28వేల హెక్టార్లలో, కందులు 25వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ఎక్కువ శాతం ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట సాగు చేస్తుండడంతో కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరుతో మార్కెట్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. వాటిలో నుంచి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాల డిమాండ్‌ను బట్టి ధర తక్కువ చేసి అమ్ముతున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అమాయక గిరిజన రైతులకు విక్రయించడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. 2017 సంవత్సరంలో జైనథ్, ఆదిలాబాద్, తాంసి మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా వేలాది మంది రైతుల పంట పొలాల్లో పంటలు ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోవడంతో నష్టాలను చవిచూశారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇటీవల నేరడిగొండ మండల కేంద్రంలో నకిలీ విత్తనాలను ప్యాకెట్లలో ప్యాక్ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసులు సైతం నమోదు చేశారు. మండలానికో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. అయితే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మండలానికో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తహసీల్దార్, ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. ఆయా మండల కేంద్రాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలు, గోదాంల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో పాటు ట్రాన్స్‌పోర్ట్‌ల వద్ద సైతం కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లాకు సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ బృందం వచ్చింది. రైల్వే స్టేషన్, జిన్నింగ్ మిల్లులు, గోదాములు, విత్తనాల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీ బృందాలు వచ్చే విషయం నకిలీలకు ముందే తెలియడంతో ఆ రోజు షాపులు మూసి ఉంచుతున్నారు. దీంతో వారు ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంటుంది. రశీదు తప్పనిసరి.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నష్టం వాటిల్లినప్పుడు రశీదు ఉంటేనే ప్రభుత్వం తరపున సాయం అందే వీలుంటుంది. సంబంధిత కంపెనీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. జిల్లాలో నకిలీ విత్తనాలతో అక్కడక్కడ నష్టపోతున్న అన్నదాతల నుంచి ఫిర్యాదులు అందుతున్నా విచారణ దశకు వచ్చే సరికి కేసు నీరుగారుతోంది. ఇం దుకు ప్రధాన కారణంగా కొనుగోలు దారుల వద్ద ఎలాంటి రశీదు లేకపోవడమే. గ్రామాలకు వచ్చి విత్తనాలను విక్రయించే వారు రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకుండా రైతులకు అంటగడుతున్నా రు. అవగాహన లేమి కారణంగా అన్నదాతలకు నష్టం వాటిల్లుతోంది. విత్తనాల ప్యాకెట్లపై ఎక్కడ తయారు చేశారు, ఎక్కడ ప్యాకింగ్ చేశారు, ఎవరు మార్కెట్ చేస్తున్నారనే సమాచారంతో పాటు అందులో మొలక శాతం, జెన్యూ స్వచ్ఛత తదితర విషయాలను ముద్రించాలి. అయితే విత్తన కంపెనీలు కొన్ని ఈ నిబంధనలు పాటించకుండా పుట్టగొడుగుల్లా మార్కెట్లోకి వస్తున్నాయి. స్థానికంగానే తయారీ.. ఇటీవల నేరడిగొండలో స్థానిక విత్తనాలకు రంగులు పూసి ప్యాకింగ్ చేస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇలాంటివి జిల్లాలో అక్కడక్కడ జరుగుతున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెడితే తప్పా అక్రమాలను అరికట్టడం సాధ్యం కాదు. దీంతోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యేవాటిపై తనిఖీలు ముమ్మరం చేస్తే కొంత వరకైనా రైతులను నకిలీల బెడద నుంచి కాపాడవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేని బీటీ–3, గ్లైసిల్, రౌండ్ఆ‹ఫ్ బీటీ ఇతర రాష్ట్రాల నుంచి ట్రావెల్స్ ద్వారా జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. పత్తి విత్తన సంచి ధర రూ.740 ఉండగా, దాదాపు వీరు రూ.600లకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు విత్తనాలు లభించడంతో రైతులు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖాధికారులు పట్టించుకోక పోవడంతో ఈ తతంగం జోరుగా సాగుతోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మంగీలాల్‌ను ఫోన్ ద్వారా పలుసార్లు సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
రూ.10 కోట్లు ఢమాల్!
జీరో దందా జోరుగా కొనసాగడం..వ్యాపారులు జిమ్మిక్కులు ప్రదర్శించి సెస్ చెల్లించకపోవడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం ఈ సారి దారుణంగా పడిపోయింది. ఉమ్మడి జిల్లాకు 2018–19 సంవత్సరానికి రూ.45.05 కోట్ల లక్ష్యం ఉండగా, కేవలం రూ.33.51 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. రూ.10 కోట్లకు పైగా ఏఎంసీలు ఆదాయాన్ని కోల్పోయాయి. బెల్లంపల్లి, చెన్నూర్, జన్నారం, జైనథ్ మినహాయిస్తే మిగతా 14 మార్కెట్ యార్డుల్లో లక్ష్యాన్ని చేరుకోవడం మాట అటు ఉంచితే అందుకోలేనంత దూరంలో ఉండటం గమనార్హం. సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పంటల పరంగా ఆదాయం అధికంగా ఉండగా, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లోని మార్కెట్లలో కొంత తక్కువగా ఉన్నా కోట్ల రూపాయల్లోనే ఆదాయం లభిస్తోం ది. ప్రధానంగా పత్తి, సోయాబీన్, శనగ, కందులు, మొక్కజొన్న పంటల కొనుగోలు పరంగా మార్కెట్‌కు ఫీజు రూపంలో ఆదాయం ల భిస్తుంది. మార్కెట్లో పంటల కొనుగోలు జరిగినప్పుడు ఏఎంసీ యార్డులోనే తూకం జరిగిన తర్వాత వ్యాపారులు కొనుగోలు చేయాలి. తద్వారా వ్యాపారులు కొనుగోలు చేసిన పంట విలువలో ఒక శాతం సెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడే వ్యాపారులు తమ జిమ్మిక్కులను ప్రదర్శించి సెస్‌ను దిగమింగుతున్నారు. మార్కెట్ యార్డులో తూకం జరగకుండానే నేరుగా వ్యాపారుల వద్దనే కొనుగోలు జరుగుతుండడంతో ఏఎంసీలకు వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. ఇలా ట్రేడర్లు జీరో దందాను యథేచ్ఛగా నడుపుతున్నా దీనిని అరికట్టడంలో ప్రభుత్వ యం త్రాంగాలు విఫలమవుతున్నాయి. ఏటా ఈ వ్యవహారాలు ‘మామూలు’ అన్నట్లుగానే సాగిపోతున్నాయి. దళారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను మభ్యపెట్టి వ్యాపారులతో ఉన్న సంబంధాల ఆధారంగా మార్కెట్ యార్డులో తూకం కాకుండా నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఏటా సాగులో పెట్టుబడుల కోసం దళారులు, కమీషన్ ఏజెంట్ల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. పంట చేతికి వచ్చాక అమ్ముకునే దశలో దళారులు, కమీషన్ ఏజెంట్ల చేతిలో చిక్కుకొని వారు చెప్పినట్లుగానే వ్యాపారులకు రైతులు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ యార్డులు ఈ సంవత్సరం పూర్తిస్థాయిలో సెస్‌ను రాబట్టడంలో విఫలమయ్యాయి. రూ.10 కోట్లు వెనుక.. ఉమ్మడి జిల్లాకు 2018–19 సంవత్సరానికి రూ.45.05 లక్ష్యం ఉండగా, కేవలం రూ.33.51 కోట్లు మాత్రమే సాధించింది. రూ.10 కోట్లకు పైగా వెనుకబడింది. ప్రధానంగా ఆదిలాబాద్, భైంసా మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు అధికంగా సాగి ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ రెండు మార్కెట్లోనే లక్ష్యాన్ని అందుకోలేనంత దూరంలో నిలిచిపోయాయి. ఆయా మార్కెట్లలో జీరో వ్యాపారం జోరుగా సాగడంతోనే మార్కెట్ ఆదాయానికి గండి పడిందన్న విమర్శలు లేకపోలేదు. జైనథ్, బెల్లంపల్లి, చెన్నూర్, జన్నారం వంటి చిన్న మార్కెట్లు లక్ష్యాన్ని మించి సాధించినప్పుడు ఆదిలాబాద్, భైంసాలలో నిత్యం పంట కొనుగోలు బండ్లతో కళకళలాడే మార్కెట్లు ఆదాయంలో వెనకబడటం విస్తుపోయేలా చేస్తుంది. పత్తి ఆదాయమే ప్రధానం.. కందులు, శనగ, సోయాబీన్, జొన్నలకు ప్రభుత్వం ఎంఎస్పీ ఆపరేషన్ కింద మార్కెట్ ఫీజును మినహాయించింది. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. దీంతో రైతులకు లబ్ధి చేకూరింది. తద్వారా ఆదాయం కొంత తగ్గే పరిస్థితి ఉన్నా రూ.10 కోట్లకుపైగా వెనకబడడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా పత్తి పంట ద్వారా మార్కెట్లకు అధిక ఆదాయం లభిస్తోంది. గడిచిన సంవత్సరం రైతుల నుంచి పత్తిని ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ కంటే ట్రేడర్స్ అధికంగా కొనుగోలు చేశారు. సీసీఐ నామమాత్రంగా కొనుగోలు చేసింది. ఈ లెక్కన మార్కెట్ యార్డులకు పెద్ద మొత్తంలో మార్కెట్ ఫీజు లభించాలి. కానీ ఆదాయం తగ్గింది. ఇది జీరో మార్కెట్‌ను ప్రస్పుటం చేస్తుంది. 2017–18లో లక్ష్యాన్ని మించి ఆదాయం లభించినప్పుడు 2018–19లో లక్ష్యానికి అందుకోలేనంత దూరంలో నిలిచిపోవడం మార్కెట్లలో జరుగుతున్న అక్రమాలను తేటతెల్లం చేస్తున్నాయి. మార్కెట్ ఫీజు మినహాయింపుతోనే.. ప్రభుత్వం కనీస మద్దతు ధర ఆపరేషన్‌లో మార్కెట్ ఫీజును మినహాయించింది. కం దులు, శనగ, సోయాబీ న్, జొన్న పంటలకు ఈ మినహాయింపు వర్తించింది. మార్క్‌ఫెడ్, నా ఫెడ్‌లు కొనుగోలు చేశాయి. మార్కెట్ ఫీజు మినహాయించడంతోనే ఆదాయం తగ్గింది. – గజానంద్, డీఎంఓ, ఆదిలాబాద్ -
కాలువలు మరిచారా?
ఇంద్రవెల్లి(ఖానాపూర్): రైతుల మెట్ట భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో మండలంలోని ముత్నూర్ శంకగర్గూడ గ్రామపంచాయతీల పరిధిలో 2005లో త్రివేణి సంఘం చెరువు నిర్మించారు. కాని ఎడమ, కుడి కాలువలు నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో రైతులకు సాగునీరు అందక వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. 15 ఏళ్లుగా రైతులు ఆశతో సాగునీటి కోసం ఎదురుచూస్తేనే ఉన్నారు. రూ.3.70కోట్లతో చెరువు నిర్మాణం మండలంలోని ముత్నూర్, శంకర్‌గూడ, కేస్లాపూర్, మెండపల్లి, మెండపల్లిగూడ, దుర్వగూడ, గౌరపూర్, చిత్తబట్ట,« ధర్మసాగర్, మల్లాపూర్ తదితర గ్రామాల పరిధిలోని సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2005లో నీటిపారుదలశాఖ రూ.3.70కోట్లతో ముత్నూర్, శంకర్‌గూడ గ్రామాల మధ్య సుమారు 150ఎకరాల విస్తీర్ణంలో త్రివేణి సంఘం చెరువు నిర్మాణం చేపట్టారు. 14 సంవత్సరాలు పూర్తి కావస్తున్న చెరువు కుడి, ఎడమ కాలువలు మాత్రం నిర్మించలేదు. దీంతో చెరువు కేవలం చేపలు పెంచడానికి మాత్రమే పరిమితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువలను నిర్మించాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. కాలువల నిర్మాణానికి రూ.2కోట్లు మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలో నిర్మించినా త్రివేణి సంఘం చెరువు కుడి, ఎడమ కాలువు నిర్మించడానికి మూడు సంవత్సరాల క్రితం నీటిపారుదల శాఖ సర్వే చేసింది. ఎడమ, కుడి కాలువలు నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరై మూడేళ్లవుతున్నా స్థానిక నీటిపారుదల, రెవెన్యూశాఖల అధికారుల నిర్లక్ష్యంతో కాలువల నిర్మాణ పనులు కదలడం లేదు. చెరువు కింద భూములు పోతున్న రైతులు తమకు పరిహారం గిట్టుబాటుకాదని భూములు ఇవ్వడం లేదు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించకపోవడంతో కాలువల నిర్మాణం ముందుకు సాగడం లేదు. చెరువుకు కాలువలు నిర్మిస్తే తమ భూములకు సాగునీరు వస్తోందని ఆశతో ఉన్న ఆ ప్రాంత రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి కాలువలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. సర్వే చేసినా ఫలితం లేదు.. ముత్నూర్ త్రివేణి సంఘం చెరువు నిర్మించారు. కానీ కాలువల నిర్మాణం మర్చిపోయారు. మూడు సంవత్సరాలుగా అధికారులు సర్వే చేస్తున్నా కాలువలు మాత్రం నిర్మించడం లేదు. దీంతో మా వ్యవసాయ భూములకు సాగునీరు అందడం లేదు. చెరువుల్లో ఈ ప్రాంత రైతుల వ్యవసాయ భూములకు సరిపడా సాగునీరు ఉన్నా ఫలితం లేదు. దీంతో కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. – తొడసం సంపత్‌రావు, రైతు ముత్నూర్ అసంపూర్తిగా ఎడమ కాలువు -
భూసార పరీక్ష.. శ్రీరామరక్ష
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): గతంలో భూసార పరీక్షలు అంటేనే గ్రామానికి ఒకరు,ఇద్దరు రైతులు మాత్రమే చేయించేవారు. వ్యవసాయంపై అమితాసక్తి ఉండి చదువుకున్న రైతులు మాత్రమే చేన్లలో మట్టి పరీక్షలు చేయించునేవారు. అయితే చేన్లో మట్టి నమూనాలు సేకరించడం పట్ల అవగాహన లేకపోవడం, మట్టి పరీక్షలతో కలిగే లాభాలు తెలియకపోవడం, నమూనాలు పరీక్షించేందుకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపాల్సి రావడం వంటి కారణాలతో ఆసక్తి ఉన్నా అతికొద్ది మంది రైతులు కూడా మట్టి పరీక్షలు అంటే వెనకాడేవారు. అక్కడక్కడ రైతులు ఎవరైనా తమ చేన్లోని మట్టి నమూనాలకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కి పంపించిన కూడా ఫలితాలకోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీంతో భూసార పరీక్షల ఫలితాలు రైతులకు సకాలంలో అందకపోయేవి. రైతులు కూడా తమ పక్క రైతులు వాడే ఎరువులనే ఇష్టారీతిగా పంటలకు వేసేవారు. దీంతో దిగుబడి పెరగడం మాట అటు ఉంచితే.. రైతులు పెట్టుబడి తడిసి మోపెడయ్యేది. దీంతోపాటు దీర్ఘకాలంగా ఒకే రకమైన రసాయనిక ఎరువులు విపరీతంగా వాడడంతో భూసారం తగ్గి, నేల నిర్జీవంగా తయారైంది. దీంతో ఏళ్లుగా రైతులు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది. రైతుల్లో మట్టి పరీక్షల పట్ల అవగాహన పెరగడం, వ్యవసాయశాఖ అధికారులు క్లస్టర్ల వారీగా మట్టి పరీక్షల కోసం మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 101 ల్యాబ్‌లు గతంలో మట్టి పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా కేంద్రంలోని ప్రధాన ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే రైతులకు ఈ ల్యాబ్ గురించి పెద్దగా అవగాహన లేకపొవడం, దూర ప్రయాణాలు చేయాల్సి రావడం, ఫలితాలు రావడంలో నెలల తరబడి వేచి చూడాల్సి రావడం జరిగేది. దీంతో రైతులు మట్టి పరీక్షల గురించి అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో మినీల్యాబ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ పరిధిలోని నాలుగైదు గ్రామాలకు కలిపి క్లస్టర్ గ్రామంలో మినీల్యాబ్ ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 101 క్లస్టర్లలో ఈ మినీ ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఏఈవోల ఆధ్వర్యంలో నిర్వహణ.. క్లస్టర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ మినీల్యాబ్ల నిర్వహణ బాధ్యతలు ఏఈవోలకే అప్పగించడం జరిగింది. దీనికోసం ఏఈవోలకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. దీంతో రైతులు తమ చేన్లోంచి తెచ్చిన మట్టిని ఇక్కడ పరీక్షించి ఒక్క రోజులోనే ఏఈవోలు ఫలితలు కూడా ఇచ్చేలా వెసులుబాటు కలిగింది. ఈ ల్యాబ్‌లో మట్టిలోని పీహెచ్(గాఢత), ఈసీ(లవణీయత), ఓసీ(సేంద్రియ కర్బనం), ఎన్పీకే(నత్రజని, భాస్వరం, పోటాషియం)లతోపాటు నేలలో ఉన్న సూక్షపోషకాల శాతాన్ని లెక్కించడం జరుగుతుంది. అనంతరం రైతులకు సాయిల్ హెల్త్‌కార్డ్ అనే ప్రత్యేకమైన రిపోర్టులు కూడా అందిస్తారు. దీని ఆధారంగా రైతులు వేసిన పంటలకు ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి? ఎప్పుడెప్పుడు వాడాలి? ఆ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? అనే వివరాలు రైతులకు సూచిస్తారు. దీంతో తగిన మోతాదులో ఎరువులు వాడి రైతులు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా, లాభాలు ఆర్జించవచ్చని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ ఏడాది రైతుబంధు, పీఎం కిసాన్ వంటి ఇతరాత్ర పనుల వలన వ్యవసాయశాఖ అధికారులు భూసార పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 1450 మట్టి నమునాలు మాత్రమే పరిశీలించారు. అయితే ఈ ఏప్రిల్ నుంచి అన్ని గ్రామాల్లో మట్టి నమూనాల సేకరణ ఉధృతం చేస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి గ్రామాల్లో రైతులకు మట్టి పరీక్షల సేవలు అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో మండలంలో క్లస్టర్‌కు ఒకటి చొప్పున మినీల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో రైతులు తీసుకొచ్చిన మట్టి నమూనాలు వెంటనే పరీక్షించి, ఒక్క రోజులోనే ఫలితాలు అందిస్తాం. ఈ ల్యాబ్‌ల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ఏఈవోలకు అప్పగించాం. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ భూమిలోని పోషకాలశాతం ఆధారంగా అవసరమైన మేరకు మాత్రమే బయట నుంచి ఎరువులు వేసుకోవాలి. దీనిద్వారా పెట్టుబడి తగ్గడమే కాకుండా, దిగుబడి కూడా పెరుగుతుంది. – పుల్లయ్య, వ్యవసాయశాఖ, ఏడీఏ -
సాగుభూమిలో సారమెంత?
ఏ నేలలో ఏ పంట వేయాలి..ఎంత మోతాదులో ఎరువులు వాడాలి.. తదితర విషయాలు తెలుసుకునేందుకు రైతులు విధిగా మట్టి పరీక్షలు చేయించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ ఇందుకోసం మట్టి నమూనాలు సేకరించి తీసుకెళ్లినా పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. స్థానికంగానే పరీక్షలు చేసేందుకు ప్రతీ క్లస్టర్‌కు మినీ భూసార పరీక్ష కిట్లను గతేడాది ప్రభుత్వం అందజేసింది. అయితే ఇవి అటకెక్కాయి. దీంతో రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలు కవర్లలోనే మూలుగుతున్నాయి. దీంతో భూసార పరీక్ష ఫలితాలు అందక రైతులు వారికి తోచిన పంటలు సాగు చేస్తూ నష్టపోతున్నారు. తలమడుగు(బోథ్): జిల్లాలోని 18 మండలాలకు 91 యూనిట్లు మంజూరయ్యాయి. క్లస్టర్‌కు ఒక్కటి చొప్పున మండలానికి నాలుగు నుంచి ఆరు వరకు మినీ భూసార పరీక్ష కిట్లను గతేడాదే ఏఈవోలకు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్న వాటిని ఇప్పటివరకు ఉపయోగించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం హడావుడిగా భూసార పరీక్ష కిట్లను అందించినా ఈ కేంద్రాలకు అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యం, ప్రత్యేక గదులు, లేబర్, ఫర్నిచర్ తదితర వసతులు కల్పించాల్సి ఉంది. కానీ కిట్లు మాత్రమే ఇచ్చి సౌకర్యాలు కల్పించకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో గ్రామాల్లో కిట్లు నిరుపయోగంగా మారాయి. జిల్లాలో కేవలం12 చోట్ల మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగతా గ్రామాల్లో ఇప్పటి వరకు వీటిని కనీసం తెరిచి చూడలేదు. కొన్ని మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయంలో మూలనపడేశారు. దీంతో కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. పరీక్షలు వట్టివే.. గ్రామాల్లో పంట పొలాల నుంచి సేకరించిన మట్టిని ల్యాబ్‌లో పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ మేరకు సారం ఉంది. సారం లేని భూముల్లో ఏ మేరకు ఏయే ఎరువులు ఎంతమేరకు వాడాలి. ఏ పంటలకు అనుకులంగా ఉంటుంది..అనే విషయాలను రైతులకు తెలియజేయాలి. ఈ విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యతను మండల వ్యవసాయ విస్తరణాధికారులకు (ఏఈఓ) ప్రభుత్వం అప్పగించింది. 5వేల ఎకరాల సాగు భూమికి ఒక విస్తరణాధికారిని నియమించింది. జిల్లాలో మొత్తం 2లక్షల 10 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నది 101 మంది. ఏఈవోలకు గతంలోనే భూసార పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. వీరు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు రైతులకు అందించాలి. కార్డులో భూమి సంబం«ధించిన వివరాలు నమోదు చేయాలి. వివరాల ఆధారంగా ఎరువులు ఎంత మొత్తంలో వాడాలో తెలుస్తుంది. కానీ గ్రామాల్లో ఎక్కడా పరీక్షలే చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రైతు పొలంలో భూసార పరీక్షలు గతంలో మెట్ట ప్రాంతమైతే 25 ఎకరాలు తడి భూమిలో అయితే 6.25 ఎకరాలకు ఒక నమునాను సేకరించి భూసార పరీక్షలు నిర్వహించేవారు. కాగా ఇక నుంచి ప్రతీ రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో క్లస్టర్ పరిధిలోని ఒక ఏఈవోకు భూసార పరీక్ష కిట్‌ను అందించారు. పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకూ భూసార కార్డులు అందజేయాల్సి ఉంది. వసతులు కరువు.. వ్యవసాయ విస్తరణ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించడానికి లవణాల లభ్యత(ఎలక్ట్రానిక్ కార్బన్) ఉదజని సూచికలను గుర్తించాలి. అంటే నైట్రోజన్, భాస్వరం, పొటాష్ల శాతం పొలంలో ఏ మేరకు ఉన్నాయో పరీక్షల ద్వారా తేల్చాలి. పరీక్షలు చేయడానికి కార్యాలయంలో విద్యుత్, నీటి, వసతి కల్పించాలి. ప్రభుత్వం వసతులు కల్పించడంతో పాటు కనీసం టేబుల్, కుర్చీలు, గ్రామంలో ఒక గది ఏర్పాటు చేయాలి. కానీ అవేమి లేకుండానే మట్టి పరీక్షలు చేసి రైతులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని వ్యవసాయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 18 మండలాల్లో మట్టి నమూనా పరీక్షల యూనిట్లు ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారాయి. కొంతమంది ఏఈవోలకు ఈసీ పరీక్షలు చేస్తే పీహెచ్ పరీక్షలు రాకపోవడం, పీహెచ్ పరీక్షలు వచ్చిన వారికి ఈసీ పరీక్షలు చేయరాకపోవడంతో మట్టి నమునా పరీక్షలు పూర్తిస్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. సౌకర్యాలు కరువు.. భీంపూర్ మండలం కొత్తగా ఏర్పడింది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకే అద్దె భవనాలు దొరకడం లేదు. ఇక తాంసి కార్యాలయంలో విద్యుత్, నీటి సౌకర్యం లేదు. తలమడుగు మండలంలో 6 కిట్లు అందజేశారు. వీటిలో ఎక్కడా సౌకర్యాలు లేకపోవడంతో కిట్లను వ్యవసాయ కార్యాలయంలో నిరుపయోగంగా ఉంచారు. భూసార పరీక్షలు నిర్వహించాలంటే ఒక ప్రత్యేక ల్యాబ్ ఉండాలి. ల్యాబ్‌లో నీటివసతి, సిబ్బంది ఉండాలి. కానీ అవేమి లేకుండా పరీక్షలు నిర్వహించడం ఇబ్బంది అవుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపయోగంలోకి తెస్తాం జిల్లాలో గతేడాది 91 మినీ భూసార పరీక్ష కిట్లు వచ్చాయి. వాటిని మండలాలకు పంపిణీ చేశాం. సంబంధిత ఏఈవోలు తీసుకొని గ్రామాల్లో యూనిట్లు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, భవనాలు లేక నిరుపయోగంగా మారాయి. వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తాం. భూసార పరీక్షలు చేసే సమయం వచ్చింది కనుక తప్పకుండా అన్ని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. – ఆశాకుమారి, జేడీఏ -
పశుబజార్ అమలెప్పుడో?
బేల(ఆదిలాబాద్): ఈ–మార్కెట్లో పండించిన పంటలు ఆన్లైన్ ద్వారా క్రయవిక్రయాలు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఏడాదిన్నర క్రితం ప్రతిష్ఠాత్మకంగా పశుబజార్ కార్యక్రమం తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు అమలు అవుతుందో ప్రశార్థకంగా మారింది. పశువులు, గొర్రెలు, మేకలు, పందులు తదితర వాటి విక్రయాలు, కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా పశుబజార్ ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ఏడాదిన్నరక్రితం ప్రారంభించారు. పశువులు అమ్మేందుకు, కొనేందుకు వేదికగా ఈ పశుబజార్ ఉపయోగపడుతుంది. ఈ పశుబజార్ వెబ్సైట్లో విక్రేతలు వారి పశువుల వివరాలు నమోదు చేసుకుంటే..అవసరమైన రైతులు తెలుసుకొని ఆయా ప్రాం తాలకు వెళ్లి స్వయంగా పరిశీలించి కొనుక్కోవాలనేది లక్ష్యం. తద్వారా శ్రమ, సమయం వృథా కావు. అయితే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో రైతులు, పశు పోషణదారుల వరకు చేరలేదు. అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు లేకపోలేదు. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ఆశించిన ప్రచారం, రైతులతోపాటు పశు పోషణదారులతో ప్రత్యేక సమావేశాలు, సభలు ఇంతవరకు నిర్వహించలేదు. కేవలం పశువైద్యశాలలో వాల్ పోస్టర్ అతికించి వదిలేశారు. పశుబజార్ వెబ్‌సైట్‌పై అవగాహన, సాంకేతికంగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలు ఎంత మాత్రమూ వివరించలేదని తెలిసింది. దీంతో పశువులు, మేకలు, గొర్రెలు, పందులు తదితర అమ్మకాలు పాత పద్ధతిలోనే కొనసాగతున్నాయి. దీంతో అందుబాటులోని సంతకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. పశు బజార్‌తో కొనుగోలు, అమ్మకాలు ఎంతో సులభం.. ఈ పశుబజార్తో పశువుల కొనుగోలు, అమ్మకాలు ఎంతో సులభతరం కానుంది. పశువులు, ఇతరాత్ర వాటిని అమ్మదలచిన రైతులు వివరాలను పశు బజార్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాలు 30రోజుల వరకు వెబ్సైట్లో ఉంటాయి. పశువులను కొనదలిచిన వారు ఈ వెబ్సైట్ ద్వారా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. ఇరువర్గాలు సంప్రదింపులు జరుపుకునే అవకాశం కూడా చేర్చారు. స్థానిక వాతావరణానికి తట్టుకునే పశువులు ఎంపిక చేసుకోవచ్చు. ఆశించిన పాడి పశువులు, దుక్కిటెద్దులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక గొర్రెలు, మేకలు, పందులు తదితరవి విక్రయించే వారికి కొనుగోలు చేసే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మాంసంకోసం వ్యాపారులు, వినియోగదారులకు కూడా ఈ పశుబజార్ మరింత ప్రయోజనకరంగా మారనుంది. ధరలు, నాణ్యత, అవసరమైన మేరకు సరుకు లభిస్తుంది. ఈ పశుబజార్ ఆన్లైన్ అనుసంధానంతోపాటు భౌతికంగా చూసి కొనుగోలు చేస్తే, మరింత మేలు జరగనుంది. దళారులకు చెక్.. సంతల్లో పశువులు, మేకలు, గొర్రెలు, పందులు తదితర కొనుగోలు, అమ్మకాల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య దళారులుగా వ్యవహరించే వారు ఇరువర్గాల నుంచి కమీషన్లను వసూలు చేస్తుంటారు. ఇంతేకాకుండా పలు సందర్భాల్లో విక్రయించే వారి నుంచి ధర కుదుర్చుకుని కొనుగోలుదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అధిక రేట్లకు అమ్ముతున్న పరిస్థితి సంతల్లో జరుగుతోంది. పశు బజార్లపై అవగాహన కల్పిస్తే రైతులు, పశు పోషణదారులు నేరుగా కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. తద్వారా ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. పశు బజార్ గురించి ఎవరు చెప్పలేదు సంతలు, అంగళ్లు తెలుసు. కానీ గవర్నమెంటు కొత్తగా పెట్టిన పశుబజార్ గురించి ఎవరూ చెప్పలేదు. తెలియదు. దుక్కిటెద్దులు, పాడి పశువులు అవసరం ఉంటే అందుబాటులోని సంతలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నాం. పశుబజార్పై అవగాహన లేదు. వివరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. – గౌరి పురుషోత్తం,రైతు బేల పశువులు అమ్మే, కొనేఆన్లైన్ మంచిదే పంటలను ఆన్లైన్ ఆమ్ముతున్నట్లు పశువులు అమ్మే, కొనే పశుబజార్ ఆన్లైన్ మంచిదే. దీనిపై గ్రామాల్లో ఆఫీసర్లు అవగాహన కల్పించాలి. మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా నిర్ణీత ధరలతోపాటు భౌతికంగా పశువు నచ్చితే అమ్మే, కొనే రైతులు నేరుగా క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. నష్టపోకుండా ఉంటాం.– గేడాం మనోహర్, పశు పోషణదారుడు సిర్సన్న అవగాహన కల్పిస్తాం రైతులు, పశు పోషణదారుల్లో ఈ పశుబజార్పై అవగాహన కల్పిస్తాం. ఏడాదిన్నర క్రితం ఇది ప్రారంభమైంది. పెద్దగా వినియోగంలో లేదు. అంతగా ప్రచారం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ పశు బజార్‌తో ప్రత్యేకంగా పశువుల సంతకు వెళ్లే అవసరం లేదు. ధర, నాణ్యత పశుబజార్ ఆన్లైన్లో ఉండడంతో కూర్చున్న చోటనే మనకు నచ్చిన సరుకు మన దగ్గరకు తెప్పించుకోవచ్చు. సమయం, శ్రమ వృథాకావు. ఈ పశు బజార్‌పై సాంకేతికపరమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పశు బజార్‌ను వినియోగించుకుని, మంచి ప్రయోజనాలు పొందవచ్చు. – సురేశ్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి -
లెక్క తేలింది..
ఆదిలాబాద్‌టౌన్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సర్వే పూర్తయ్యింది.. దీంతో ఈ పథకానికి అర్హుల లెక్క తేలింది. జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన 45,042 కుటుంబాలు ఉండగా, ఇందులో 41,439 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సర్వే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. కాగా మొదటి విడతగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున ఈ నెల 24న డబ్బులు జమ కానున్నాయి. జిల్లాలో మొత్తం 1,33,447 మంది రైతులు ఉండగా, కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి నిబంధన ఉండడంతో సగానికంటే ఎక్కువ మంది రైతులు పథకానికి దూరమయ్యారు. ఈ నెల 14న ప్రారంభమైన సర్వే 20వ తేదీ వరకు నిర్వహించారు. ఏఈఓలు సేకరించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. ఇప్పటివరకు 32,763 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు. మిగతా వారి వివరాలు సైతం మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు రైతుల ఖాతాల్లో డబ్బులు.. సమ్మాన్ పథకంలో భాగంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈనెల 24 నుంచి డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6వేలు ఇవ్వనున్న విషయం తెలిసిందే. మూడు విడతలుగా అకౌంట్లలో వేయనున్నారు. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున అందించనున్నారు. అయితే జిల్లాలోని 18 మండలాల్లో 5 ఎకరాలు కలిగి ఉన్న రైతులు 45,042 రైతు కుటుంబాలు ఉండగా, ఇందులో 194 మంది రైతులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, లాయర్లు, డాక్టర్లు, ఐటీ చెల్లించేవారు, తదితరులు ఉండడంతో అనర్హులుగా గుర్తించారు. ఈ పథకానికి సంబంధించి 41,439 మంది రైతులను అధికారులు అర్హులుగా గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు 32,763 మంది రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. 3,374 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించాల్సి ఉందని, 676 మంది రైతుల పూర్తి వివరాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. రైతుల వివరాలు అప్లోడ్ చేస్తున్నాం జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలు 45,042 ఉండగా, ఇప్పటివరకు 41,414 మంది రైతులను అర్హులుగా గుర్తించాం. 194 మంది రైతులను ఈ పథకానికి అనర్హులుగా గుర్తించాం. 676 మంది రైతుల వివరాలు పూర్తిగా లేవు. 3,374 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 33,763 రైతుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాం. ఇంకా 95 గ్రామాల రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్ -
మూడుపువ్వులు ఆరుకాయలు
మంచిర్యాలఅగ్రికల్చర్: పత్తి కొనుగోలు వ్యాపారంలో దళారులు రంగప్రవేశం చేసి అక్రమ పద్ధతిలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నేరుగా గ్రా మాల్లో రైతుల వద్దకు వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నారు. తుకాల్లో మోసాలకు పాల్పడుతూ ఇష్టం వచ్చిన రేటుకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. జిల్లాలో అధికారులు సాధారణ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. అక్రమ కొనుగోళ్లపై పర్యావేక్షణ కొరవడడంతో దళారులకు మూడుపువ్వులు ఆరుకాయలుగా మారింది. తూకాల్లో భారీ మోసం అంతర్జాతీయ మార్కెట్లో పత్తి డిమాండ్ పెరుగుతోంది. ఇదే అదనుగా భావించిన కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు రైతుల వద ్దకు చేరుతున్నారు.క్వింటా పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.5450 ధర ఉండగా.. దళారులు అద నంగా రూ.100 నుంచి రూ. 200 చెల్లిస్తూ తూకా ల్లో మాయజలం ప్రదర్శించి రైతులను నష్టపరు స్తున్నారు. క్వింటా పత్తికి 6 నుంచి 10 కిలోల వర కు తూకాల్లో మోసానికి పల్పడుతున్నారు. దీంతో రైతులు క్వింటాళుకు రూ. 500 నుంచి రూ. 600 వరకు నష్టపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి మార్కెట్ కమిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సేస్ రూపకంగా మార్కెట్‌కు రావాల్సిన ఫీజు రాకుండా పోతుంది. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని రాత్రికి రాత్రే బొలేరో, టాటా మ్యాక్స్, డీసీఎం వాహనాల ద్వారా తరలిస్తున్నా రు. పత్తి పంటలు సాగు చేసిన సమయంలో పెట్టు బడులు కోసం ఇచ్చిన అప్పులను తిరిగి తీసుకునేందుకు కొందరు ఈ వ్యాపారం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జిల్లాలో సీసీఐ మందమర్రి, హాజిపూర్, మంచిర్యాల, నస్పూర్ మండలాలకు మంచిర్యాల మార్కెట్‌కమిటీ ద్వారా ముల్కల్లలోని జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, భీమిని, తాండూర్, కన్నెపెల్లి మండలాలకు బెల్లంపల్లి మార్కెట్ పరిధిలోని రేపల్లివాడలోని జిన్నింగ్ మిల్లులో, లక్సెట్టిపేట, దండెపల్లి, జన్నారం మండలాల రైతుల సౌకర్యార్థంకోసం లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీముఖి ఇండస్ట్రీస్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, భీమారం, జైపూర్ మండలాల రైతుల కోసం చెన్నూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మూడు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయినా ఈ ఏడాది సీసీఐ ఇప్పటి వరకు ఒక్క క్వింటా పత్తి సైతం కొనుగోలు చేయలేదు. మద్దతు ధర కంటే ఎక్కువగానే ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తుండడంతో రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ పత్తి అక్రమ కొనుగోళ్లపై దృష్టి సారించి మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా రైతులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. పత్తి కొనుగోలు సీజన్లో మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. కానీ అధికారులంతా ఎన్నికల విధుల్లో ఉండడంతో దళారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జిల్లాలో కొనుగోలు చేస్తున్న పత్తిని భైంసా, ఆదిలాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈప్రాంతంలోని జిన్నింగ్ మిల్లుల్లో ప్రైవేటు వ్యాపారులు ఎక్కువగా ధర చెల్లిస్తుండడంతో కొనుగోలు చేసిన పత్తిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. -
ఎత్తిపోతల పథకాలకు గ్రహణం
దిలావర్పూర్(నిర్మల్): బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు 13ఏళ్ల క్రితం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు అధికారుల పర్యవేక్షణ కరువై ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. కొన్నేళ్లుగా రైతులకు సాగు నీరందించని దుస్థితి నెలకొంది. ఇందుకు తార్కాణమే గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు. దిలావర్పూర్ మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలైన దిలావర్పూర్, బన్సపల్లి, న్యూలలోంలోని బీడుభూములను సాగులోకి తెచ్చేందుకు 2003 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం బన్సపల్లి పరిసరాల్లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి స్టేజ్–1 పనులు చేపట్టారు. దీని నిర్మాణంతో బన్సపల్లితో పాటు దిలావర్పూర్, న్యూలోలం గ్రామాలకు సాగు నీరందించేందుకు పంప్‌హౌస్‌లతోపాటు పైపులైన్ నిర్మాణాలు చేపట్టారు. న్యూలోలం గ్రామానికి 1250 ఎకరాల సాగు విస్తీర్ణానికి నీరందించేందుకు రూ.307.85 లక్షల వ్యయంతో పథకాన్ని నిర్మించారు. అలాగే బన్సపల్లి ఎత్తిపోతల పథకం స్టేజ్–1నిర్మాణానికి 800 ఎకరాల్లో సాగు నీరందించడానికి రూ.147.05 లక్షలు వెచ్చించారు. మొదట రెండేళ్లు నీరందించడంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో పంప్‌హౌస్‌లోని మోటార్లు తరచూ మొరాయించడం, అధికారుల తోడ్పాటు కరువవడంతో ఆయకట్టు రైతులు విసుగుచెంది సాగుకు దూరమయ్యారు. గతంలో న్యూలోలం ఆయకట్టుకు నీరు సరిపోగా పక్క గ్రామమైన సిర్గాపూర్ గ్రామచెరువుకు సైతం నీటిని అందించారు. తదనంతరం పథకం పునరుద్ధరించాలని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నా నేతల నుంచి గానీ, అధికారుల నుంచి స్పందన కరువవడంతో చేసేదిలేక రైతులు ఆశలు వదులుకున్నారు. దిలావర్‌పూర్‌ది ఇదీ పరిస్థితి.. మండలకేంద్రంలో మొదటి స్టేజీ ఎత్తిపోతల పథకం కింద 1500 ఎకరాలకు, రెండో స్టేజీకింద 650 ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.423.05లక్షలు, మూడో స్టేజీ కింద 225 ఎకరాలకు సాగునీరందించేందు రూ.63.46 లక్షలు వెచ్చించి నిర్మించిన పథకాలు నేడు అలంకారప్రాయంగా మారాయి. పథకాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సరైన పైపులైన్ ఉండాలి. దిలావర్పూర్ మొదటిస్టేజీ నిర్మాణం నుంచి రెండోస్టేజీ వరకు పైపులైన్ పనులు సక్రమంగా జరిగాయి. అయితే రెండు, మూడో స్టేజీలకు సంబంధించి ప్రారంభం నుంచి తరచూ పైపులైన్ లీకేజీల కారణంగా ఏడాది కూడా రైతులకు నీరందని పరిస్థితి. పైపులైన్ మార్చి నిర్మించాలని పలుమార్లు రైతులు మొరపెట్టుకున్నా పథకంపై పాలకులు స్పందించడం లేదని తెలుస్తోంది. తుప్పు పడుతున్న మోటార్లు ఎళ్ల తరబడి ఎత్తిపోతల పథకాలు మూలనపడడంతో అందుకు సంబంధించిన కొన్ని పరికరాలు చోరీకి గురవుతుండగా మోటార్లన్నీ తుప్పుపట్టిపోతున్నాయి. ఈ పథకాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు, సామగ్రి సైతం అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎత్తిపోతల పథకాల మరమ్మతు కోసం తోడ్పాటునందించి సాగునీరందించాలని రైతులు కోరుతున్నారు. ఎందుకు పనికి రాకుండాపోయింది దిలావర్పూర్లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ఆదినుంచి తమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. పథకం నిర్మాణ సమయంలో రైతు ల అవసరాలు గమనించక కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పైపులైన్ నిర్మాణాలు చేపట్టడంతో రైతులకు ఎంతమాత్రం సాగునీరు అందలేదు. తరచూ పైపులైన్లు పగలడంతో పథకం మూలన పడింది. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలి. – ఆర్.నర్సయ్య, రైతు, దిలావర్పూర్ ప్రభుత్వం తోడ్పాటునందించాలి కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టిసారించి వాటిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలి. గ్రామాల్లో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈమేరకు చర్యలు చేపడితే పథకాలు సమర్థవంతంగా పనిచేసి రైతులకు సాగు నీరు అందే అవకాశం ఉంటుంది. – రవి, రైతు, బన్సపల్లి -
యార్డుకు కళొచ్చింది.
జైనథ్: మండలకేంద్రంలో మార్కెట్‌యార్డు ప్రా రంభమై మూడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పత్తి కొనుగోలు చేయలేదు. గడిచిన నాలుగైదేళ్ల వరకూ కనీసం సోయా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సోయాతోపాటు శనగలు, కందులు కూడా మార్కెట్లో కొనుగోలు చేస్తుండడంతో మార్కెట్‌కు ఓ కళ వచ్చింది. గతంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ అంతగా విజయవంతం కాలేదు. మండలకేంద్రంలో జిన్నింగ్‌లు లేకపోవడం, ట్రేడర్లు ఆసక్తి చూపకపోవడంతో కొనుగోలు జరగలేదు. ప్రస్తుతం చిన్న, సన్నకారు రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేపడుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పీఏసీఎస్ ద్వారా కొనుగోళ్లు.. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం(పీఏసీఎస్), మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కేవలం సన్నకారు, చిన్నకారు రైతులను ఉద్దేశించి మాత్రమే ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. చిన్న రైతులు తమ పత్తిని రోడ్ల వెంబడి ఉండే వ్యాపారుల వద్ద అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులకు మార్కెట్ ధర లభించడమే కాకుండా రవాణా ఖర్చులు తగ్గడంతో ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇక్కడ పత్తి అమ్మేందుకు వచ్చిన రైతుల హమాలీ, దళారీ, రవాణా ఖర్చుల పేరిట ఎలాంటి అదనపు వసూళ్లు ఏవీ లేకపోవడంతో కలిసొస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇవీ నిబంధనలు.. రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్ జిరాక్స్ పత్రాలు తీసుకు రావాలి. ఒక రోజు ఒక రైతు నుంచి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. రోజువారీగా 100 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయబడుతుంది. చిన్న, సన్నకారు రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేయబడును. కౌలు రైతులు సంబంధిత ఏఈవో నుంచి పంట ధ్రువీకరణపత్రం తీసుకు రావాలి. తేమ 8శాతానికి మించకుండా ఉండాలి. -
పత్తి ‘పాయే’
ఇచ్చోడ(బోథ్): తెల్ల బంగారం రైతుకు ఈసారి కూడా నిరాశ తప్పడం లేదు. కీలక దశలో భారీ వర్షాలు పడడంతో పత్తి చెట్టు ఎదగలేదు. దీంతో ఆశించిన స్థాయిలో కాత, పూత రాలేదు. ఈ నేపథ్యంలో గతేడాది కష్టాలే ఇప్పుడు కూడా పునరావృతమయ్యాయి. చేనంత చూస్తే ఎక్కడా పత్తి బుగ్గ కనిపిస్తుండకపోవడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ఒకేసారి పత్తి ఏరడంతోనే చేను మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. చెట్టుకు ఒక్క కాయ కూడా కానరాకపోవడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఈసారి పత్తి క్వింటాల్ ధర రూ.5450 ఉంది. అయినా దిగుబడి లేనిది ఏం లాభం అంటూ బోరున విలపిస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 3.5లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 5 లక్షలు కాగా ఇందులో పత్తిదే అధిక భాగం. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉండడంతో గత ఐదు, ఆరు సంవత్సరాల నుంచి జిల్లా రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఆహార ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోంది. ఈసారైనా ఆశించిన స్థాయిలో లాభం రాకపోతుందా అని పత్తి సాగు చేసిన రైతన్నకు ప్రతిసారి నష్టాలే ఎదురవుతున్నాయి. అయినా పత్తి పంటనే.. జిల్లాలో సాగులో ఉన్న భూముల్లో 80 శాతానికి నీటి సౌకర్యం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో పత్తి పంట సాగు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో సోయాబీన్, ఇతర ఆహార ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. పప్పు దినుసుల సాగు చేపట్టాలని ప్రభుత్వం 2016– 17 సీజన్లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో ఆ ఏడాది పత్తి సాగు కాస్త తగ్గింది. 2.70లక్షల ఎకరాలకే పరిమితమైంది. కంది, పెసర సాగు కూడా కొంత పెరిగింది. అయితే పప్పు దినుసుల ధరలు కూడా అమాంతం తగ్గాయి. 2015– 16లో క్వింటాల్ కందులకు రూ.9వేలు పలికింది. కాని ఆ తర్వాత ఏడాది ధర ఏకంగా రూ.5వేలకు పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంచెం అటు, ఇటుగా పత్తి ధరలు ఉంటుండడంతో రైతులు పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కాగా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నా రైతులు లాభాల బాట పట్టడం లేదు. గతేడాది ఓ మోస్తారులో పత్తి దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేదు. ఈసారి గిట్టుబాటు ధర ఉన్నా దిగుబడి లేదు. ఈ పరిస్థితులకు తోడు ప్రతి ఏటా కీలక దశలో వర్షాలు పడి పంట ఎదగకపోవడం, గులాబీ రంగు పురుగు సోకడం వంటి వాటితో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. సగానికి పడిపోయిన దిగుబడులు.. ఈఏడాది జిల్లా వ్యాప్తంగా పత్తి దిగుబడి అమాంతం పడిపోయింది. ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురవడంతో పూత, కాత లేకుండా పోయింది. అనంతరం వర్షాలు కానరాకుండా పోయాయి. ఈ ప్రభావంతో చెట్టు ఎదుగుదల లోపించింది. రెండు, మూడు సార్లు రసాయనాలు పిచికారీ చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. పంట పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు తల పట్టుకుంటున్నారు. పరిస్థితి తారుమారు.. పత్తి ధర విషయంలో ప్రతిఏడాది పరిస్థితి తారుమారు అవుతోంది. దిగుబడులు ఉన్న సమయంలో మద్ధతు ధర ఉండడం లేదు. మద్ధతు ధర ఉన్న సమయంలో దిగుబడి ఉండడం లేదు. గతేడాది ఓ మోస్తారులో దిగుబడులు ఉన్నాయి. అయినా క్వింటాల్ ధర రూ.4320లు మాత్రమే పలికింది. ఈసారి దిగుబడి పూర్తిగా తగ్గింది. కాని మద్ధతు ధర మాత్రం రూ.5450 పలుకుతోంది. ఈ పరిస్థితులు అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఈసారి ధర ఉండడంతో ఇలాగే ఉంటుందని భావించి వచ్చే ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. కాని మద్ధతు ధర పెరుగుతుందో, తగ్గుతుందో తెలియదు. మొత్తంగా ఈఏడాది పత్తి రైతుకు నష్టాలు తప్పడం లేదు. దిగుబడి అమాంతం తగ్గిపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని వాపోతున్నారు. -
పైసలు రాలే సారూ?
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకం కింద పెట్టుబడి సాయం రైతులకు ఇంకా చేరలేదు. 2018–19 రబీ సీజన్ ముగింపునకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నా.. ఇంత వరకు సొమ్ము చేతికి అందలేదు. ఈ నెలాఖరు వరకు రబీ పంట వేస్తేనే సరైన సమయానికి పంట చేతికి వస్తుంది. ఇందుకు రైతులు భూములను చదును చేసి సిద్ధంగా ఉంచగా, కొందరు పంటలు కూడా వేశారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తోంది. రబీ సీజన్ ముగుస్తున్నా ఆ డబ్బులు ఇంతవరకు బ్యాంకు ఖాతాలకు చేరకపోవడంతో రైతులు ఆయోమయానికి గురవుతున్నారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల పనుల్లో ఉండడం, ఒక్క వ్యవసాయ శాఖనే పెట్టుబడి సాయంపై దృష్టి సారించడంతో రైతుబంధు సొమ్ము రైతులకు సరైన సమయానికి పనికొచ్చేట్లు కన్పించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,11,164 మంది రైతులు ఉండగా, అధికారులు ఇప్పటివరకు 1,00,456 మంది రైతుల నుంచి ఖాతాల వివరాలు సేకరించారు. ఇంకా 10,708 ఖాతాలను రైతుల వద్ద నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించాల్సి ఉంది. సేకరించిన వాటిని పైస్థాయి అధికారులకు అప్లోడ్ చేయాల్సి ఉంది. 33 వేల మంది రైతులకు నగదు జమ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 1,11,164 మంది రైతులు ఉన్నారు. ఇప్పటిదాక 33 వేల మంది రైతులకు పెట్టుబడి అందగా, ఇంకా 78,164 మంది రైతులకు పెట్టుబడి సొమ్ము రావాల్సి ఉంది. జిల్లాలో గత నెల రోజులుగా వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) 1,00,456 మంది రైతుల ఖాతాలు సేకరించారు. ఆ వివరాలను మండల వ్యవసాయ అధికారుల(ఎంఏవో)కు అందజేశారు. ఎంఈవోలు 88,012 ఖాతాలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించారు. అందులో నుంచి 33 వేల మంది రైతులకు మాత్రమే ‘రైతుబంధు’ కింద పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. వివరాలు పంపినా ఇంకా 55,012 మంది రైతుల ఖాతాలకు నగదు చేరలేదు. ఇదిలా ఉండగా, జిల్లా రైతులకు మొత్తం రూ.178 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.55 కోట్లు మాత్రమే వచ్చింది. మిగతా రూ.123 కోట్ల నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కొనసాగుతున్న ఖాతాల సేకరణ.. జిల్లా వ్యాప్తంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ గత నెల రోజుల నుంచి కొనసాగుతోంది. జిల్లాలో 1,11,164 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 1,00,456 మంది రైతుల ఖాతాలను సేకరించారు. మిగతా 10,708 మంది రైతుల ఖాతాలు తీసుకోవాల్సి ఉంది. కాగా, ఏఈవోలు గ్రామాల వారీగా వెళ్లి రైతుల ఖాతాల వివరాలు సేకరించి, ఆ ఖాతా పని చేస్తుందా.. లేదా అనేది సరి చూడాల్సి వస్తోంది. ఒకవేళ రైతు ఇచ్చిన బ్యాంకు ఖాతా పనిచేయకపోతే నగదు అందులో జమ కాదు. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతోపాటు అధికారులను రైతులు నిలదీసే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు అధికారులు ముందే జాగ్రత్త పడుతూ ఖాతాలను పరిశీలన చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ‘అందరికీ పెట్టుబడి’.. జిల్లాలోని రైతులందరికీ ఈ నెలాఖరులోగా రైతుబంధు సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున యాభై ఎకరాల వరకు పరిమితి లేకుండా ఇస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి యేడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది. మొదటి విడత ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయం ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ కాగా, రెండో విడత రబీ సీజన్ పెట్టుబడి పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నందున రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు మొదటి విడత చెక్కులు పొందిన రైతులే రెండో విడత నగదు పొందడానికి అర్హులుగా గుర్తించారు. ఆన్లైన్ ద్వారా నగదు జమ చేసేందుకు మొదటి విడత చెక్కులు పొందిన రైతుల వద్ద నుంచి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పెట్టుబడి నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు సగం మంది రైతులకు కూడా సాయం అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘మద్దతు’పైనే ఆశలు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: పత్తి రైతులు ఏటా ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గిట్టుబాటు ధర పక్కనబెడితే మద్దతు ధర లభించని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏయేడు చూసినా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గతేడాది వర్షాలు కురువక నష్టపోయిన రైతులు, ఈయేడాది అధిక వర్షాలతో పంటలు నష్టపోయారు. గతేడాది పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.4,320 ఉండగా, ఈయేడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించిన విషయం విదితమే. గతేడాది కంటే ఈ యేడాది మద్దతు ధరను క్వింటాలుకు రూ.1130 పెంచింది. ఈ నిర్ణయంతో అన్నదాతల్లో సంతోషం ఉన్నా ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులు మద్దతు ధర చెల్లిస్తారో లేదోనని రైతులు దిగాలు చెందుతున్నారు. వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతుకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు వెనుకంజ వేస్తున్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం నుంచి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ ఇప్పటికే పలుసార్లు వ్యాపారులు, సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. పత్తిని అన్లోడింగ్ చేసిన తర్వాతే తేమ శాతాన్ని పరీక్షించాలని అధికారులకు సూచించారు. రూ.6వేలు చెల్లిస్తేనే మేలు.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.5450 కనీస మద్దతు ధర నిర్ణయించింది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండడంతో క్వింటాలుకు రూ.6వేలు చెల్లిస్తే గానీ గిట్టుబాటు కాదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది కంటే ఈ యేడాది మద్దతు ధర పెంచినప్పటికీ ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో ఖర్చులు కూడా భారీగా పెరిగాయని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం వరంగల్ మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.5,800తో కొనుగోలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆదిలాబాద్ మార్కెట్లో క్వింటాలుకు రూ.5,600 నుంచి రూ.5800 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడంతో ధర పెంచుతారో లేదనేది అనుమానంగానే ఉంది. మద్దతు ధర కంటే తక్కువగా ఉంటేనే ప్రభుత్వరంగ సంస్థ అయిన సీసీఐ రంగంలోకి దిగుతుంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 34,629 క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు 23లక్షల 59వేల 627 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గతేడాది మొత్తం జిల్లా వ్యాప్తంగా 23లక్షల 94వేల 226 క్వింటాళ్ల పత్తి రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. తేమ కొర్రీతో ఆందోళన.. రైతులకు యేటా తేమ కొర్రీ తంటాలు తప్పడం లేదు. తేమ పేరిట ఇష్టారీతిన కోతలు విధించడంతో మద్దతు ధరకు కూడా నోచుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సీసీఐ 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని, ఆపై తేమ శాతం పెరిగే కొనుగోలు చేయబోమని స్పష్టం చేస్తున్నారు. 8 శాతం తేమ ఉంటే మద్దతు ధర రూ.5,450, అంతకంటే కంటే ఒక్క శాతం పెరిగితే అదనంగా రూ.54.50 చొప్పున కోత విధించనున్నారు. ఇదే నిర్ణయాన్ని ఈసారి ప్రైవేట్ వ్యాపారులు కూడా పాటించే విధంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైంది. దీంతో మంచు కురియనుండడంతో పత్తిలో తేమ ఎలాగైనా ఉంటుంది. ఇదే అదునుగా తీసుకుంటున్న వ్యాపారులు రైతులు పంటపై నీళ్లు చల్లి మార్కెట్‌కు తీసుకొస్తున్నారని కోతలు విధించడంతో అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. కలెక్టర్ తేమ శాతం పేరిట కోతలు ఎక్కువగా విధించవద్దని ప్రైవేట్ వ్యాపారులతో జరిగిన సమావేశంలో సూచించారు. 8 నుంచి 12 శాతం తేమ ఉంటే కొంత కోత విధించాలని, 12 నుంచి 16 శాతం తేమ ఉంటే మరో కొంత కోత విధించాలే తప్పా, ఇష్టారీతిన కోతలు విధిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. తేమ కొలిచే యంత్రాల్లో వ్యత్యాసం ఎలా వస్తుందని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. తేమ యంత్రాన్ని సగం భాగంలో పెడితే తేమ ఒక విధంగా, పూర్తిగా ఉంచితే మరో విధంగా, సీసీఐ తేమ యంత్రంలో మరో విధంగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి.. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం 9గంటలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్ దివ్యదేవరాజన్ కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో పది ఎలక్ట్రానిక్ తూకం కాంటాలను ఏర్పాటు చేశారు. 40 మెట్రిక్ టన్నుల కాంటా ఒకటి, 20 మెట్రిక్ టన్నుల కాంటాలు మూడు, 5 మెట్రిక్ టన్నుల కాంటాలు మూడు, ఎడ్లబండ్లకు సంబంధించి మూడు కంటాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ పరిధిలో 298 కాటన్ కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 225 మంది కొనుగోళ్లు చేయనున్నారు. 186 మంది ట్రేడర్స్, 27 జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేశారు. జిన్నింగ్ మిల్లుల్లోనే ధర నిర్ణయం.. ప్రతియేడు మార్కెట్‌కు వచ్చిన పత్తి వాహనంలో ఉన్నప్పుడే తేమ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించేవారు. దీంతో రైతులు నష్టాలను చవిచూసేవారు. ఈ విషయాన్ని గ్రహించిన జిల్లా కలెక్టర్ రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు చేపట్టారు. పత్తి వాహనం అన్లోడ్ చేసిన తర్వాత తేమ శాతాన్ని లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో రైతులకు తేమ కొర్రీల విషయంలో కొంత ఇబ్బందులు తొలిగేలా కనిపిస్తోంది. -
రబీ ప్రణాళిక సిద్ధం
ఆదిలాబాద్‌టౌన్: వ్యవసాయ శాఖ అధికారులు రబీ ప్రణాళిక కోసం యాక్షన్‌ప్లాన్ తయారీలో నిమగ్నం అయ్యారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ యేడాది జూన్‌లోనే వర్షాలు పుష్కలంగా కురిసాయి. పంటలకు ఆశాజనకంగా ఉండగా, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతియేటా అన్నదాతలు ప్రకృతి వైఫరీత్యాలు, దళారుల చేతిలోనూ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. దిగుబడులు బాగా వస్తే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల చేతిలో మోసాలకు గురికావడం మనం చూస్తూనే ఉన్నాం. గిట్టుబాటు ధరలు లభించే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంటలు నష్టపోవాల్సిన దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగిపైనే ఆశలు.. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 24వేల హెక్టార్లలో పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు యాసంగిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాలు ఉన్నాయి. తాంసి మండలంలో మత్తడి ప్రాజెక్టు, జైనథ్ మండలంలో సాత్నాల ప్రాజెక్టు మినహా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. రబీలో బోరుబావులపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు. గతంలో అరకొర నీటివనరులు, విద్యుత్ సమస్య ఉండేది. ప్రస్తుతం వర్షాలతో చెరువులు, కుంటలు, బావులు నిండి ఉన్నాయి. నీటి సదుపాయం ఉన్న రైతులు ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు రబీ సీజన్లో శనగ, వేరుశనగ, మొక్కజొన్న, తదితర పంటలపైనే పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్నారు. 23వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం అంచనా.. జిల్లాలో ఈ యేడాది రబీలో 23వేల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 18వేల హెక్టార్లలో శనగ, వెయ్యి హెక్టార్లలో వేరుశనగ, 2వేల హెక్టార్లలో జొన్న, 500 హెక్టార్లలో మొక్కజొన్న, 1500 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శనగ విత్తనాల ధర క్వింటాలుకు రూ.6,500 ఉండగా, 50 శాతం సబ్సిడీపై రూ.3250కి రైతులకు అందించనున్నారు. మిగతావి కూడా సబ్సిడీపై అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా రబీ కోసం ఎరువులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంటున్నారు. యూరియా 9వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 4500 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 2300 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6500 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 250 మెట్రిక్ టన్నులు, మొత్తం 23,150 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 24వేల హెక్టార్లలో ఖరీఫ్ పంట నష్టం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 24వేల హెక్టార్లలో పంటలకు నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంట చేతికొచ్చే సమయంలో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు పంటలు నష్టపోయి దిగుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొందని దిగాలు చెందుతున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 780 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా 1142 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని అధికారులు చెబుతున్నారు. ప్రతియేటా ఏదో విధంగా రైతులు నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. అందుబాటులో ఎరువులు, విత్తనాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రబీ కోసం ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాం. అక్టోబర్ మొదటి వారం నుంచి సబ్సిడీ విత్తనాల కూపన్లను క్లస్టర్ల వారీగా పంపిణీ చేయనున్నాం. గతంలో విత్తనాలు 33శాతం సబ్సిడీ అందించగా, ఈసారి 50శాతం సబ్సిడీతో పంపిణీ చేయనున్నాం. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఆశకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
పక్కాగా సర్వే
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో పంట నష్టం అంచనాకు బృందాలు సర్వేలో నిమగ్నమయ్యాయి. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని శుక్రవారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంట నష్టానికి సంబంధించి కలెక్టర్ దివ్యదేవరాజన్ కొద్దిరోజుల ముందే బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచే ఈ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా వ్యాప్తంగా 101 క్లస్టర్లకు గాను 101 బృందాలను ఏర్పాటు చేసి సర్వే కోసం పంపించారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓ, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్ఓ ఉన్నారు. సర్వే కోసం వారికి ప్రత్యేక యాప్‌ను ఇచ్చారు. ఆ యాప్‌పై వారికి అవగాహన కల్పించేందుకు సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టం సర్వేను నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పూర్తి పారదర్శకంగా నష్టం జరిగిన రైతులనే పరిగణనలోకి తీసుకునే పరిస్థితి. తద్వారా సర్వేలో బోగస్ పేర్ల నమోదు జరిగే ఆస్కారం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక గ్రామంలోని పంట నష్టపోయిన రైతుకు సంబంధించి చేను ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేసే క్రమంలో దాని అక్షాంశాలు, రేఖాంశాలు అందులో నమోదవుతాయి. అంతేకాకుండా సర్వే చేసిన తేదీ, సమయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనేది అందులో పేర్కొంటారు. ఇక పంట నష్టానికి సంబంధించి మాత్రం ఆ యాప్‌లో నమోదు చేయరు. రికార్డులో నష్టం వివరాలను నమోదు చేసుకుంటారు. ఇలా సర్వే ఒక పారదర్శకంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టంలో రాజకీయ జోక్యం, గ్రామంలో భూస్వాముల నుంచి ఒత్తిడి చోటుచేసుకొని బోగస్ పేర్లు, ఎకరాలు నమోదు చేయడం వంటివి, తద్వారా పరిహారాన్ని పరిహాసం చేసి స్వాహా చేసేవారు. దీనికి అవకాశం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేస్తుండడంతో అసలైన రైతులకు పంట నష్టపరిహారం దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎక్కువ రోజులు.. సాధారణ సర్వే కంటే జియో ట్యాగింగ్ ద్వారా చేపడుతున్న ఈ సర్వేకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా మామూలు సర్వేలో బృందాలు ఒక చేనులో పరిశీలన చేసిన తర్వాత పక్క చేనులో కూడా ఇదే పరిస్థితి ఉందని నమోదు చేసుకొని నష్టాన్ని అంచనా వేసేవారు. కానీ దీంట్లో ఆ పరిస్థితి లేదు. నష్టం జరిగిన ప్రతి రైతుకు సంబంధించి జియో ట్యాగింగ్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఒక క్లస్టర్ పరిధిలో 5వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. సాధారణ సర్వేలో రోజు 400 నుంచి 500 ఎకరాలు సర్వే చేసే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ జియో ట్యాగింగ్ సర్వేలో సుమారు 200 నుంచి 250 ఎకరాల వరకు సర్వే చేయడం జరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా సాధారణ సర్వే కంటే రెట్టింపు రోజులు ఈ జియో ట్యాగింగ్ సర్వేకు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఈ సర్వే 10 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. పకడ్బందీగా సర్వే జరుగుతుండడంతో పంట నష్టపోయిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాలుగైదు రోజుల్లో పంట నష్టానికి సంబంధించి సమగ్ర నివేదిక పంపించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమై ఉండడం, కొంత ఆలస్యమైనా మరో వారం, పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏనుగు కేశవ్‌రెడ్డి జైనథ్ మండలం కాప్రి గ్రామంలో 5.11 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. ఇటీవల భారీ వర్షాలకు చేనులో వరద నీరు నిలిచి పంట పూర్తిగా నష్టపోయాడు. సర్వే బృందం పంట నష్టం నమోదులో ఒక కొత్త పద్ధతిని అవలంబించింది. పంట నష్టపోయిన చేనులో రైతును నిల్చోబెట్టి ఆ చేనుకు సంబంధించి ప్రత్యేక యాప్‌లో ఫొటో తీసుకోవడమే కాకుండా ఆ రైతు పేరు, సర్వేనంబర్, ఎన్ని ఎకరాలు ఉందనే విషయాలను నమోదు చేసుకున్నారు. ఇక ఆ ఫొటో తీసిన సమయం, తేదీ అందులో స్పష్టంగా కనిపిస్తోంది. జియో ట్యాగింగ్ ద్వారా ఆ ప్రాంతంలోని అక్షాంశాలు, రేఖాంశాలు నమోదవుతాయి. పంట నష్టం సర్వేలో బోగస్ పేర్లు, ఎకరాలు, తదితర నమోదు చేసే అవకాశం లేదు. తద్వారా పంట నష్టపోయిన నిజమైన రైతులకే పరిహారం అందజేసేందుకు అవకాశం ఉంటుందనేది అధికారుల భావన. పకడ్బందీగా సర్వే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించడం జరుగుతోంది. పంట నష్టం సర్వేలో పూర్తి పారదర్శకత ఉంటుంది. జియో ట్యాగింగ్ ద్వారా రైతు చేనుకు సంబంధించి ఫొటోతోపాటు రైతు వివరాలు, చేను అక్షాంశాలు, రేఖాంశాలు నమోదు చేయడం జరుగుతుంది. తేదీ, సమయం అన్ని స్పష్టంగా ఉంటాయి. – మంగీలాల్, జేడీఏ, ఆదిలాబాద్