AGM
-
Reliance AGM 2024: రిలయన్స్ బొనాంజా
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించారు. సమీప భవిష్యత్‌లో టాప్–30 గ్లోబల్ దిగ్గజాల్లో ఒకటి గా కంపెనీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు టెక్నా లజీ విస్తృత వినియోగం, ఆధునిక తయారీ విధానాలు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా మారు తోందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అన్ని వ్యాపా రాల్లోనూ ఏఐ సంబంధ డిజిటల్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ అత్యంత వృద్ధి పథంలో సాగనున్నట్లు చెప్పారు. వెరసి రానున్న కాలంలో కంపెనీ విలువ భారీగా మెరుగుపడనున్నట్లు వివరించారు. ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఆర్ఐఎల్ గతేడాది ఆర్అండ్డీపై రూ. 3,643 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లలో రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా(బోనస్) అందించనుంది. ఈ అంశాన్ని సెప్టెంబర్ 5న సమావేశంకానున్న డైరెక్టర్ల బోర్డు పరిశీలించనుంది. కంపెనీ ఇంతక్రితం 2017 సెప్టెంబర్, 2009 నవంబర్లోనూ 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లను జారీ చేసింది. రిటైల్ జోరు..: గతేడాది రిలయన్స్ రిటైల్ తొలిసారి రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. రానున్న 3–4ఏళ్లలో బిజినెస్‌ను రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్ఐఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. మూడు ప్రయివేట్ లేబుళ్లు రూ. 2,000 కోట్ల వార్షిక అమ్మకాలను అందుకున్నాయి. లగ్జరీ జ్యువెలరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా 18,836 స్టోర్లను నిర్వహిస్తోంది. దీంతో స్టోర్లరీత్యా టాప్–5 గ్లోబల్ రిటైలర్‌గా నిలుస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సరీ్వసుల మిల్క్‌బాస్కెట్‌ను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కళానికేతన్, జివామే, క్లోవియా, అర్బన్ ల్యాడర్లలో పెట్టుబడులు ఫ్యాషన్ విభాగంలో పట్టుసాధించేందుకు దోహదం చేస్తున్నాయి. జియో.. బంపర్ ఆఫర్: 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీరానున్న దీపావళి కానుకగా రిలయన్స్ జియో యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని అందించనుంది. తద్వారా ఫొటోలు, వీడియోలు ఇతర డిజిటల్ ఫైళ్లను భద్రంగా దాచుకునేందుకు వీలుంటుంది. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్, జియో, డిజిటల్ సర్వీసుల ఆదాయం, నిర్వహణ లాభం (ఇబిటా) రెట్టింపు కానున్నట్లు ముకేశ్ అచనా వేశారు. డేటా ఆధారిత ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రీమియం డివైస్ల అందుబాటులోఉన్న క్లౌడ్ సేవలను లగ్జరీగా కాకుండా చౌకగా అందించనున్నట్లు వెల్లడించారు. టీవీ వినియోగదారులకు హలోజియో పేరుతో వాయిస్ అసిస్టెంట్ సేవలను ప్రారంభించింది. రిలయన్స్ డిస్నీ.. వినోదంలో కొత్త శకం డిస్నీతో ఒప్పందం దేశీ వినోద రంగంలో సరికొత్త శకానికి దారి చూపనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియో, రిటైల్ తరహాలో మీడియా బిజినెస్ సైతం వృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. డిజిటల్ స్ట్రీమింగ్‌తో కంటెంట్ సృష్టిని జత చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది (2024–25) చివరికల్లా ఆర్ఐఎల్ తొలి సోలార్ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ముకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంటు లో ఒకే చోట పీవీ మాడ్యూల్స్, సెల్స్, వేఫర్స్, పాలీసిలికాన్, గ్లాస్ తయారీని చేపట్టనున్నారు. తద్వారా ఈ యూనిట్ సౌరశక్తిని విద్యుత్‌గా మార్చనుంది. -
Reliance AGM 2023: జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేస్తోంది..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ వృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా వినాయక చవితి కల్లా జియో ఎయిర్‌ఫైబర్‌ను అందుబాటులోకి తేనుంది. అలాగే, జియో ఫైనాన్షియల్స్ విభాగం ద్వారా బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వచ్చే అయిదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు ప్రకటించారు. అదే క్రమంలో వారసత్వ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఆయన ముగ్గురు సంతానం (ఆకాశ్, ఈషా, అనంత్) కంపెనీ బోర్డులో నియమితులైనట్లు పేర్కొన్నారు. అలాగే, 2024 ఏప్రిల్ 19తో తన పదవీకాలం ముగియనున్నప్పటికీ.. మరో అయిదేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఏజీఎంలో మరిన్ని విశేషాలు.. ఎయిర్‌ఫైబర్‌తో వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్.. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సరీ్వసులు ప్రారంభమవుతాయి. ఇది వైర్లు అవసరం లేని 5జీ బ్రాడ్‌బ్యాండ్ సరీ్వసులాంటిది. నెట్ కనెక్టివిటీకి ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు .. 5జీ నెట్‌వర్క్‌ను, అధునాతన వైర్లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఇది వరుసలో చిట్టచివర్న ఉన్న వారికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేగలదని ముకేశ్ అంబానీ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్‌తో రోజూ 15,000 ప్రాంగణాలను కనెక్ట్ చేయగలుగుతుంటే, జియోఎయిర్‌ఫైబర్ దీనికి పది రెట్లు అధికంగా కనెక్ట్ చేయగలదు. తద్వారా 20 కోట్ల గృహాలు, ప్రాంగణాలకు జియో మరింత చేరువ కాగలదు. ఈ సందర్భంగా జియో ట్రూ5జీ డెవలపర్ ప్లాట్‌ఫాంను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఏర్పాటు చేసే తొలి జియో ట్రూ5జీ ల్యాబ్‌లో టెక్నాలజీ భాగస్వాములు, ఎంటర్ప్రైజ్ కస్టమర్లు .. వివిధ పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించవచ్చు. వాటిని పరీక్షించవచ్చు. అటు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అందరికీ, అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ కృషి చేస్తోందని ముకేశ్ అంబానీ చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని తెలిపారు. జియోసినిమా వినోదానికి దేశీయంలోనే అతి పెద్ద డిజిటల్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్లు.. గిగా ఫ్యాక్టరీలు.. 2035 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జామ్‌నగర్‌లో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) డెమో యూనిట్లను నెలకొల్పాక, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో వాణిజ్యావసరాల కోసం తొలి సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు అంబానీ చెప్పారు. వీటిని త్వరితగతిన 25కి, అటుపైన వచ్చే అయిదేళ్లలో 100కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ కోసం జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో రూ. 75,000 కోట్లతో నాలుగు గిగాఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బీమాలోకి జేఎఫ్ఎస్... జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ (జేఎఫ్ఎస్) బీమా రంగంలోకి విస్తరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది సరళమైన ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను అందిస్తుందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి విస్తరించేందుకు బ్లాక్‌రాక్‌తో కలిసి జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. టెలికం విభాగం జియోకి ఉన్న 45 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తమ ఉత్పత్తులను విక్రయించే యోచనలో ఉంది. టాప్ 4లో రిటైల్.. పలు అంతర్జాతీయ దిగ్గజాలు రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఒకవేళ దీన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసి ఉంటే ప్రస్తుత వేల్యుయేషన్ ప్రకారం టాప్ 4 లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ కూడా ఒకటిగా ఉండేదని ఆయన తెలిపారు. ‘‘2020 సెప్టెంబర్‌లో నిధులు సమీకరించినప్పుడు రిటైల్ వేల్యుయేషన్ రూ. 4.28 లక్షల కోట్లుగా ఉంది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే ఇది రెట్టింపయింది. రూ. 8.278 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో ఇటీవలే ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 1 శాతం వాటాను కొనుగోలు చేసింది. నాణ్యత, నవకల్పన, కస్టమరు ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోగలుగుతుండటం వంటి సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని అంబానీ తెలిపారు. అటు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన సాఫ్ట్‌డ్రింక్ క్యాంపా కోలాను ఆసియా, ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూ డా తీసుకెళ్లనున్నట్లు ఈషా అంబానీ తెలిపారు. వారసత్వ ప్రణాళికలు.. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వివిధ వ్యాపార విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారు ఈ హోదాను ‘కష్టపడి సంపాదించుకున్నారని’ అంబానీ తెలిపారు. ‘‘ఈషా, ఆకాశ్, అనంత్‌లో నేను, మా తండ్రిగారు ధీరుభాయ్ అంబానీ నాకు కనిపిస్తారు. ధీరుభాయ్లోని ఆ మెరుపు వారిలో నాకు కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ఇన్ఫోకామ్‌ను ఆకాశ్, రిటైల్ వ్యాపారాన్ని ఆయన కవల సోదరి ఈషా (31), కొత్త ఇంధన వ్యాపార విభాగాన్ని అనంత్ (27) పర్యవేక్షిస్తున్నారు. 2002లో ధీరుభాయ్ మరణానంతరం సోదరుడు అనిల్ అంబానీతో వ్యాపార పంపకాలపరంగా వివాదం తలెత్తిన నేపథ్యంలో ముకేశ్ తాజా వారసత్వ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ముకేశ్ సతీమణి నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా శాశ్వత ఆహా్వనితురాలు హోదాలో ఆమె బోర్డు సమావేశాలన్నింటికి యథాప్రకారంగా హాజరవుతారు. అత్యధిక డిమాండ్ ఉన్నవి, అనేక దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించగలిగేవి అయిన వ్యాపారాలను మేము ఎంచుకున్నాం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను నిర్మించగలిగాం. మా మూడు వృద్ధి చోదకాలు .. (ఓ2సీ, రిటైల్, జియో డిజిటల్ సర్వీసులు) మరింత విలువ జోడించగలవు. కొత్తగా మా నాలుగో వృద్ధి ఇంజిన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వీటికి తోడుగా చేరింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ -
రిలయన్స్ ఏజీఎం: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నీతా అంబానీ కొత్త ప్లాన్స్
Reliance AGM Nita Amban NMACC 46వ రిలయన్స్ వాటాదారుల వార్షిక సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దేశ సంసృతినుంచి క్రీడల దాకా తమ ఫౌండేషన్ కృషిని వివరించారు. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటీ గురించి ప్రకటించారు. భారతీయ సంస్కృతి,కళ పట్ల తమ నిబద్ధతకు తాము లాంచ్ చేసిన ఎన్ఎంఏసీసీ అని తెలిపారు. రానున్న పదేళ్లలో 50వేల మంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం.బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిపి మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. 10 లక్షల మహిళల సాధికారత కోసం తాము బాగా కృషి చేయనున్నట్టు నీతా అంబానీ వెల్లడించారు. విద్య, క్రీడలు ఇప్పటివరకు 22 మిలియన్ల మంది యువకులకు చేరువయ్యాయని నీతా అంబానీ చెప్పారు ఈ సందర్భంగా బిల్ గేట్స్ దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. రానున్న పదేళ్లలో 50వేలమంది విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం పనిచేయనున్నాం. ఈ సెంటర్‌ను లాంచ్ చేసినప్పటినుంచి 20లక్షలమంది ఈ సెంటర్‌ను సందర్శించి నట్టు తెలిపారు. అలాగే ఐపీఎల్ టీం గురించి మాట్లాడారు.హార్ధిక ప్యాండ్యా, బుమ్రా,తిలక వర్మ గురించి చెప్పారు. విదేశాల్లో ముఖ్యంగా విమెన్ ఐపీఎల్ టీం ప్రారంభించినట్టు తెలిపారు. అంతర్జాతీయ ఒలంపిక్ మెంబర్‌గా ఇండియాకు ఎలంపిక్ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రిలయన్స్ ఫౌండేషన్‌తో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ఆవిష్కరణలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే ఆ ఆవిష్కరణలను అత్యంత అవసరమైన వారికి అందించడంపై దృష్టి పెట్టడం కూడా బావుంది: బిల్ గేట్స్ అధిక-నాణ్యత, సరసమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేయడంలో భారతదేశం బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. రిలయన్స్‌తో ఫౌండేషన్ సహకారంతో మాదక ద్రవ్యాలు , పాయింట్-ఆఫ్-కేర్ డయాగ్నస్టిక్‌లను అభివృద్ధికి, కొత్త ఆవిష్కరణలు అమలుకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ చెప్పారు. అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తాము సంఘాలతో కలిసి పని చేయడం కూడా కొనసాగిస్తామని బిల్ గేట్స్ ప్రకటించారు. -
జియో వినియోగదారులకు ముఖేష్ అంబానీ శుభవార్త!
జియో వినియోగదారులకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్, జియో 5జీ గురించి కీలక ప్రకటన చేశారు. జియో ఎయిర్‌ఫైబర్ ఎలా పనిచేస్తుందంటే? జియో ఎయిర్‌ఫైబర్ డివైజ్ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్‌స్పాట్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్ డివైజ్‌ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్) స్పీడ్ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. ఫైబర్ ఆప్టికల్స్ వర్సెస్ జియో ఎయిర్‌ఫైబర్ సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్ డివైజ్. దగ్గర్లోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. గత ఏడాది ఎయిర్‌ఫైబర్ గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్ చేయొచ్చు. సంబంధిత వెబ్సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా బ్లాక్ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్ స్పీడ్ పొందవచ్చని తెలిపింది. జియో ఎయిర్‌ఫైబర్ ధర గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్‌వర్క్‌తో పాటు జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ గురించి ప్రస్తావించింది. తాజాగా ఆ డివైజ్‌ను ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. పలు నివేదికలు.. జియో ఎయిర్‌ఫైబర్ ధర ఎంత ఉంటుందో ఓ అంచనా వేశాయి. వాటి ఆధారంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్) రూ. 2,800కి, మెష్ ఎక్స్టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్టెండర్ 6 మెష్ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. జియో ఎయిర్ ఫైబర్ ధర ఎంతనేది అధికారంగా వెల్లడించాల్సి ఉంటుంది. -
రిలయన్స్ ఏజీఎం: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా
రిలయన్స్ ఇండస్ట్రీ 46వ ఏజీఎం సోమవారం జరిగింది. ఈ సందర్బంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీరిలయన్స్ గ్రూప్,వాటాదారులను ఉద్దేశించి అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే రిలయన్స్ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక ప్రకటన చేశారు. అలేగే సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాటాదారులు, ఉద్యోగులక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా బోర్డులో కీలకమార్పులను ప్రకటించారు. అంబానీ తన భార్య నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకుంటారని ప్రకటించారు. అలాగే ఇషా,అనంత్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ జియో స్మార్ట్ హోమ్ సేవలను ప్రకటించింది. ఆటోమేట్, రిమోట్ యాక్సెస్‌ని అనుమతించే ఆధునిక పరికరాల కలయిక.. యాప్‌లు, రిమోట్లు, స్విచ్‌లు, వాయిస్ కమాండ్లు లేదా కృత్రిమ మేధస్సు ద్వారా ఈ సేవలను నియంత్రించనుంది. రిలయన్స్ గత 10 సంవత్సరాలలో 150 బిలియన్ల డాలర్లకుపైగా పైగా పెట్టుబడి పెట్టిందని గుర్తుచేశారు. తమ అన్ని వ్యాపారాలలో 2.6 లక్షల ఉద్యోగాలను సృష్టించిందనీ, ఇందులో 3.9 లక్షల మంది తమ ఉద్యోగులు ఉన్నారని అంబానీ ప్రకటించారు. తమ గ్రోత్‌కు సహకరించిన వాటాదారులకు, ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ⇒ ఇది ఆత్మవిశ్వాసం నిండిన నవ భారతం ⇒ రిలయన్స్ అభివృద్ధి చెందుతున్న కొత్త భారతదేశానికి నాందిగా నిలిచింది ⇒ మేం అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నాం, అంతేకాదు వాటిని సాధించాం ⇒ జియో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ⇒ తొమ్మిదినెలలో 96 శాతం 5జీ సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది డిసెంబరునాటికి దేశ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం. ⇒ వోల్టాయిక్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్స్ కోసం నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. జామ్‌నగర్‌లో పూర్తిగా సమీకృత న్యూ ఎనర్జీ తయారీ పర్యావరణ వ్యవస్థను నెలకొల్పేందుకు కంపెనీ రూ. 75,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని అంబానీ చెప్పారు. ⇒ jio AirFiber సెప్టెంబర్ 19 న గణేష్ చతుర్థి సందర్భంగా ప్రారంభించనున్నట్టు అంబానీ ప్రకటించారు. ⇒ జియో మార్ట్ , వాట్సాప్‌ల ప్రారంభం అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2022లో ప్రారంభించినప్పటి నుండి వాట్సాప్‌లో జియో మార్ట్ వినియోగదారుల సంఖ్య 9 రెట్లు పెరిగింది: ఇషా అంబానీ ⇒జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా రంగొంలో సులభమైన , స్మార్ట్ బీమా ఉత్పత్తులను అంతరాయం లేని డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా అందించడానికి బీమా విభాగంలోకి ప్రవేశిస్తుందని రిలయన్స్ చైర్మన్ ప్రకటించారు. ⇒జియో వృద్ధికి అత్యంత ఉత్తేజకరమైన సరిహద్దుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ప్రస్తావించిన ఆయన ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను వివరించారు.క్లౌడ్ అండ్ ఎడ్జ్ లొకేషన్లలో 2,000 మెగావాట్ల వరకు AI-రెడీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సృష్టించేందుకు కంపెనీ నిబద్ధతను అంబానీ వెల్లడించారు. -
Reliance AGM 2023: రిలయన్స్ ప్రకటనపై ఉత్కంఠ
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 28న జరగనుంది. 2016లో జియో టెలికాం నెట్ వర్క్ లాంఛింగ్ అనంతరం రిలయన్స్ నిర్వహించే ఏజీఎం సమావేశాలపై ఆసక్తి మొదలైంది. సామాన్యులకు కనెక్ట్ అయ్యేలా ప్రతీ ఏజీఎంలోనూ ఏదో ఒక ప్రకటన ఉంటూ వస్తోంది. దీంతో ఈసారి ఏజీఎంలో ఎలాంటి ప్రకటన ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. టెలికాం, రిటైల్, ఎనర్జీ వంటి కీలక రంగాలపై ఈసారి ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. రిలయన్స్ జియో 2016లో దేశీయ టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు వేదికైంది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా అవతరించింది. గత ఏడాది 5జీ సేవల్ని ప్రారంభించింది. ఇప్పుడు జియో వెల్కమ్ ఆఫర్ కింద 5జీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఈ ఏజీఎంలో 5జీ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 4జీ తరహాలో ఇవి ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌తో తమ పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్‌లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్‌ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్‌ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ
అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూపు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారంతో, తమను అపఖ్యాతి చేయాలన్న దురుద్దేశంతో చేసిన ఆరోపణలని పునరుద్ఘాటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించింది. తాజాగా గ్రూప్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతం అదానీ మంగళవారం మాట్లాడారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కావాలనే తమ పబ్లిక్ ఆఫర్‌కు ముందు విడుదల చేశారనీ, ఇది ఉద్దేశపూర్వకంగా కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. అయినా ఎఫ్‌పీవో సక్సెస్ అయినప్పటికీ, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అదానీ చెప్పారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) ఈ సందర్బంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన వాటాదారులకు స్థిరమైన వృద్ధి , విలువ సృష్టికి హామీ ఇచ్చారు. అలాగే ప్రపంచ స్థాయి ఆస్తులను నిర్మించేందుకు గ్రూప్ కట్టుబడి ఉందని బిలియనీర్ చెప్పారు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) కాగా అదానీ గ్రూప్‌లో అకౌంటింగ్ మోసం, స్టాక్ ప్రైస్ మానిప్యులేషన్ జరిగిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది అదానీ గ్రూప్ స్టాక్‌ల భారీ పతనానికి దారితీసింది. ఫలితంగా గ్రూపు మార్కెట్ విలువను భారీగా కోల్పోయింది. అలాగే హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత రెగ్యులేటరీ మెకానిజమ్‌ల వైఫల్యాన్ని సూచించే ఆధారాలు తమకు లభించ లేదని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్యానెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? ) #WATCH | "...The report was a combination of targeted misinformation and discredited allegations. The majority of them dating from 2004 to 2015. They were all settled by authorities at that time. This report was a deliberate and malicious attempt aimed at damaging our… pic.twitter.com/yEH5r3Duff — ANI (@ANI) July 18, 2023 -
స్పైస్ జెట్ ఏజీఎం 26న ఆర్థిక ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ ఈ నెల 26న సాధారణ వార్షిక సమావేశాన్ని(ఏజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. 2021–22 ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలతోపాటు.. డైరెక్టర్‌గా అజయ్ సింగ్‌ను తిరిగి ఎంపిక చేయడంపై వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు తెలియజేసింది. అజయ్ సింగ్ ప్రస్తుతం స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. సింగ్ 2004 నవంబర్ 4న డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తదుపరి 2010 ఆగస్ట్ 27న రాజీనామా చేశారు. తిరిగి 2015 మే 21న ఎండీగా ఎంపికైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
మహిళల ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అంటే..?
మహిళల ఐపీఎల్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు వచ్చింది. మహిళల ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఇవాళ (అక్టోబర్ 18) అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ 91వ సాధారణ వార్షిక సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో మహిళల క్రికెట్‌కు క్రమేపీ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ క్రీడల దగ్గర నుండి తాజాగా ముగిసిన ఆసియా కప్ వరకు మహిళల క్రికెట్ మ్యాచ్‌లకు ఊహించని టీఆర్పీ వచ్చింది. మ్యాచ్‌లు చూసేందుకు జనాలు స్టేడియంలకు ఎగబడ్డారు. దీంతో ఈ ఊపును క్యాష్ చేసుకోవాలని భావించిన బీసీసీఐ వుమెన్స్ ఐపీఎల్‌కు పచ్చజెండా ఊపింది. చాలాకాలంగా ప్రచారంలో ఉన్న విధంగా మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలి ఎడిషన్‌ను ఐదు జట్లతో స్టార్ట్ చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీగ్ ప్రారంభ తేదీ తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా, భారత్‌లో మహిళల క్రికెట్‌కు సంబంధించి టీ20 ఛాలెంజ్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. 2018లో ప్రారంభమైన ఈ టోర్నీలో మూడు జట్లు (వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్) పాల్గొంటున్నాయి. -
2026 కల్లా రూ. 21,000 కోట్లకు..
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) రానున్న నాలుగేళ్లలో టర్నోవర్‌ను భారీగా పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. 2026కల్లా రూ. 21,000 కోట్ల ఆదాయం సాధించగలమని విశ్వసిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. మార్కెట్లో కంపెనీకిగల పొజిషన్‌ను మరింత పటిష్ట పరచుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధించగలమని కంపెనీ 15వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. టెక్నాలజీ వినియోగం, ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలతో లాభదాయక, ఫ్యూచర్ రెడీ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించనున్నట్లు వివరించారు. 2021 మార్చిలోనే రూ. 21,000 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2026కల్లా అంచనాలను అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లను అందుకునే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్పారు. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కంపెనీ 55 శాతం వృద్ధితో రూ. 8,136 కోట్ల ఆదాయం సాధించింది. -
RIL AGM: దీపావళికల్లా రిలయన్స్ 5జీ
ముంబై: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత దూకుడుగా విస్తరించనుంది. ఇందుకోసం రూ. 2.75 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో 5జీపై రూ. 2 లక్షల కోట్లు, కీలకమైన చమురు.. పెట్రోకెమికల్స్ వ్యాపారంపై వచ్చే అయిదేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ టెలికం సర్వీసులను అక్టోబర్‌లో (దీపావళి నాటికి) అందుబాటులోకి తేనుంది. అలాగే పోటీ దిగ్గజం అదానీ గ్రూప్‌ను ఢీకొట్టేందుకు ఎఫ్ఎంసీజీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వారసత్వ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ముగ్గురు సంతానం సారథ్యం వహించబోయే విభాగాలను కూడా వివరించారు. చౌకగా, నాణ్యమైన 5జీ సేవలు.. రిలయన్స్‌లోని టెలికం విభాగం రిలయన్స్ జియో 5జీ నెట్‌వర్క్‌పై రూ. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో, ఆ తర్వాత 2023 డిసెంబర్ ఆఖరు కల్లా దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. ‘సిసలైన పాన్–ఇండియా 5జీ నెట్వర్క్ నిర్మించేందుకు మేము రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. వచ్చే రెండు నెలల్లో.. అంటే దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా కీలకమైన మెట్రో నగరాల్లో జియో 5జీ సేవలను ప్రారంభిస్తాం’ అని ముకేశ్ అంబానీ వివరించారు. అత్యంత వేగవంతమైన 5జీ రాకతో కోట్ల కొద్దీ స్మార్ట్ సెన్సర్స్‌ను ఆవిష్కరిస్తామని, ఇవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా భారత్ కోసం 5జీ సొల్యూషన్స్ రూపొందించేందుకు చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌తో జట్టు కట్టినట్లు అంబానీ చెప్పారు. అలాగే, అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ను అభివృద్ధి చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్స్‌లోకి కూడా విస్తరిస్తున్నట్లు అంబానీ తెలిపారు. ఇటీవల ముగిసిన వేలంలో జియో రూ. 88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మరోవైపు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వంటి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కోసం కొత్తగా మరో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తి కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్ ప్రకటించగా ఇది ఐదోది కానుంది. ఎఫ్ఎంసీజీలో అదానీతో ఢీ.. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది వినియోగ ఉత్పత్తుల (ఎఫ్ఎంసీజీ) విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ముకేశ్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను, చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ, నిత్యావసరాలు వంటి విభాగాల్లో పటిష్టమైన బ్రాండ్స్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఈషా చెప్పారు. అలాగే కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల ద్వారా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు తెలిపారు. ‘వచ్చే అయిదేళ్లలో ఒక కోటి మంది పైగా వ్యాపారస్తులతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే దిశగా ముందుకు వెడుతున్నాం. దేశవ్యాప్తంగా 7,500 పట్టణాలు, 5 లక్షల గ్రామాలకు విస్తరించబోతున్నాం’ అని ఈషా పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జియోమార్ట్‌లో కొనుగోళ్లకు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు పెట్టడం, చెల్లింపులు జరిపే విధానాన్ని ఆమె ఆవిష్కరించారు. అటు, జియోమార్ట్‌తో జట్టుకట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ .. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. రిలయన్స్‌లో రిటైల్ వ్యాపారాలకు ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది. దీని విలువ దాదాపు రూ. 2 లక్షల కోట్లు.. 2022 జూన్ 30 నాటికి రిలయన్స్ రిటైల్‌కు 15,866 స్టోర్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీలో ఎంట్రీతో ఆ విభాగంలో దిగ్గజంగా ఉన్న అదానీ గ్రూప్‌తో రిలయన్స్ నేరుగా తలపడనుంది. అదానీకి చెందిన అదానీ విల్మర్ వంట నూనెలు మొదలుకుని వివిధ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులతో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో అదానీ ప్రధాన వ్యాపారమైన ఎఫ్‌ఎంసీజీలోకి అంబానీ ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది. వారసులొచ్చేశారు.. ఆకాశ్‌కు టెలికం, ఈషాకు రిటైల్, అనంత్‌కు ఎనర్జీ.. ఏజీఎం వేదికగా ముకేశ్ అంబానీ (65) తమ వ్యాపార సామ్రాజ్యానికి వారసులను కూడా ప్రకటించారు. అంబానీకి ముగ్గురు సంతానం (ఇద్దరు కవలలు–ఆకాశ్, ఈషా) కాగా, రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రధానంగా ఆయిల్ రిఫైనింగ్..పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికం సహా డిజిటల్ సర్వీసులు అని మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అంబానీ కేటాయించారు. ‘జియో (టెలికం విభాగం)లో ఆకాశ్ (30), రిటైల్‌లో ఈషా ఇప్పటికే సారథ్య బాధ్యతలు చేపట్టారు. కన్జూమర్ వ్యాపార విభాగాలను ప్రారంభించిన తొలినాళ్ల నుంచి వారు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక అనంత్ (26) కూడా మా కొత్త ఇంధన వ్యాపార విభాగం కార్యకలాపాల్లో ఎంతో ఆసక్తిగా పాలుపంచుకున్నారు‘ అంటూ ఎవరికి ఏయే వ్యాపార విభాగాల బాధ్యతలు ఇస్తున్నదీ ఆయన వెల్లడించారు. అయితే, వారసులను ప్రకటించినంత మాత్రాన తాను రిటైర్ అవుతున్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. ‘స్వర్ణ దశాబ్ది ముగిసే 2027 నాటికి రిలయన్స్ విలువ రెట్టింపయ్యేలా, గ్రూప్ సమగ్రంగా..సురక్షితంగా ఉండేలా ఈ ప్రణాళికలు దోహదపడగలవు’ అని అంబానీ చెప్పారు. మూడు వ్యాపార విభాగాలు ప్రస్తుతం దాదాపు ఒకే పరిమాణం స్థాయిలో ఉన్నాయి. జూన్‌లోనే ఆకాశ్.. జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈషా, అనంత్‌లు గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ముందుజాగ్రత్త .. వారసత్వ ప్రకటన ద్వారా, గతంలో తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ వ్యాపార విభజనపై సోదరుడు అనిల్ అంబానీతో తనకు తలెత్తిన విభేదాల్లాంటివి, తన సంతానం విషయంలో జరగకుండా ముకేశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అయిందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ధీరూభాయ్ అంబానీ 1973లో రిలయన్స్‌ను ప్రారంభించారు. టెక్స్టైల్స్ నుంచి చమురు, టెలికం వరకూ వ్యాపారాన్ని వివిధ విభాగాల్లోకి విస్తరించారు. అయితే, వీలునామాల్లాంటివేవీ రాయకుండా 2002లో ఆయన ఆకస్మికంగా మరణించడంతో రిలయన్స్ సామ్రాజ్యం బీటలు బారింది. ముకేశ్, ఆయన తమ్ముడు అనిల్ అంబానీల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి వారి మాతృమూర్తి కోకిలాబెన్ జోక్యం చేసుకుని 2005లో రిలయన్స్‌ను విడగొట్టి సోదరులిద్దరికీ పంచారు. ముకేశ్‌కు రిఫైనింగ్, ఆయిల్, టెక్స్టైల్స్ వ్యాపారం లభించగా.. అనిల్‌కు టెలికం, అసెట్ మేనేజ్మెంట్ మొదలైనవి దక్కాయి. 2019 మార్చి ఆఖరు నాటికి రిలయన్స్‌లో అంబానీల వాటా 50.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర సంపద విలువ 94 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీగా కొనసాగుతుండగా, భార్య నీతా అంబానీ (59) కంపెనీ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. -
'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ
సాక్షి,ముంబై: భారతదేశంలో 'అల్ట్రా-అఫర్డబుల్' 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఇందుకోసం జియో గూగుల్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ పలు కీలక విషయాలను వెల్లడించారు. (Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి) మేడ్ ఇన్ ఇండియా 5జీ సేవలకుగాను ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలను భాగస్వాములుగా ఉండటమ విశేషమని ముఖేష్ అంబానీ అన్నారు. జియో ప్రస్తుతం మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సిస్కో వంటి గ్లోబల్ నెట్వర్క్ టెక్నాలజీ ప్రొవైడర్లతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. అలాగే ఇండియా 5జీ సొల్యూషన్స్ డెవలప్మెంట్కి క్వాల్కంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, రిటైల్ దిగ్గజం ఈ సంవత్సరం ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. అలాగే తన తల్లి నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ అనేక సేవలందించిందని తెలిపారు. -
ఎన్డీటీవీ ఏజీఎం వాయిదా
న్యూఢిల్లీ: అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ తమ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. వాస్తవానికి ఇది సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. అనుబంధ సంస్థ వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ పరోక్షంగా 29.18 శాతం వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్దిష్ట నిబంధనల అమలు కోసం 34వ ఏజీఎంను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
జియో మరో సంచలనం?12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్
ముంబై: రిలయన్స్ జియో మరో సంచలనానికి సన్నద్ధమవుతోంది. భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌పై హింట్ ఇచ్చినప్పటికీ, అంతకుమించి వివరాలను వెల్లడించారు. అయితే సరసమైన ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ వినియోగదారులకు అందించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది రిలయన్స్ జియో , గూగుల్ సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు ఆగస్ట్ 29న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ 5 జీస్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని అంచనా.. జియో ఫోన్ 5జీ ధర: అంచనా 5జీ జియో ఫోన్ ధర సుమారు 12 వేల రూపాయల లోపునే ఉండనుందట. అలాగే జియో ఫోన్ నెక్స్ట్ మాదిరిగానే, వినియోగదారులు రూ. 2500 డౌన్ పేమెంట్ చేసి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని మార్కెట్ వర్గాల్లో ఊహాగానాలు విరివిగా ఉన్నాయి.గతంలో లాగానే ఈఫోన్ కొనుగోలు చేసినవారికి అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఇతర బంపర్ ఆఫర్లను అందించనుందట జియో.పూర్తి వివరాలు అధికారంగా ప్రకటించేంతవరకు సస్పెన్స్ తప్పదు.! జియో 5జీ ఫోన్ ఫీచర్లు 6.5 అంగుళాల HD డిస్ప్లే ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 సాక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ 13ఎంపీ ప్రైమరీ సెన్సార్+2 ఎంపీ డ్యూయల్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా -
డిష్ టీవీకి షాక్! వాటాదారులతో అంత ఈజీ కాదు!
గతేడాది(2021) డిసెంబర్ 30న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో ప్రతిపాదనలన్నీ వీగిపోయినట్లు డీటీహెచ్ సేవల కంపెనీ డిష్ టీవీ వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు, డైరెక్టర్‌గా తిరిగి ఏఎం కురియన్ ఎంపిక తదితర మూడు ప్రతిపాదనలనూ వాటాదారులు తిరస్కరించినట్లు తాజాగా స్టాక్ ఎక్సేంజీలకు తెలియజేసింది. అతిపెద్దవాటాదారు అయిన యస్ బ్యాంక్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఇప్పటివరకూ వివరాలను బయటపెట్టలేదని కంపెనీ ప్రస్తావించింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో ఈ అంశాలను వెల్లడించినట్లు డిష్ టీవీ పేర్కొంది. ఇటీవల జరిగిన 33వ ఏజీఎంలో ప్రతిపాదించిన 2021–22 ఏడాదికి కాస్ట్ ఆడిటర్స్ రెమ్యునరేషన్, స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలు, కురియన్ పునఃనియామకం అంశాలకు వ్యతిరేకంగా అధిక శాతం వోటింగ్ నమోదైనట్లు వివరించింది. -
ఏజీఎం ఓటింగ్ ఫలితాలు ప్రకటించండి
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్ 30న వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) నిర్వహించిన ఓటింగ్ ఫలితాలను తక్షణమే స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయాలంటూ డిష్ టీవీ ఇండియాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. వివిధ ప్రతిపాదనలపై జరిపిన ఓటింగ్ ఫలితాలను వెల్లడించకుండా డిష్ టీవీ తొక్కిపెట్టి ఉంచుతోందంటూ యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇతర షేర్హోల్డర్లు ఫిర్యాదు చేయడంతో సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో డైరెక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డిష్ టీవీ మాతృ సంస్థ అయిన ఎస్సెల్ గ్రూప్‌లో కొన్ని కంపెనీలు.. షేర్లను తనఖా పెట్టి యస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాయి. అవి డిఫాల్ట్ కావడంతో వాటి షేర్లను యస్ బ్యాంకు జప్తు చేసుకుంది. తనఖా పెట్టిన షేర్ల యాజమాన్య హక్కులపై ప్రమోటరు గ్రూప్ కంపెనీ డబ్ల్యూసీఏ, యస్ బ్యాంక్‌ల మధ్య వివాదం నెలకొంది. కంపెనీ ఏజీఎంలో వోటింగ్ హక్కులను నిరాకరించడంతో యస్ బ్యాంక్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అయి తే, ఓటింగ్ ఫలితాలు మాత్రం డిష్ టీవీ వెల్లడించకపోవడం మరో వివాదానికి దారి తీసింది. -
మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం!
ముంబై: కోవిడ్–19 తుదుపరి వేవ్ వచ్చినా తట్టుకొని నిలబడగలిగిన పటిష్ట స్థాయిలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉందని చైర్మన్ దినేష్ కుమార్ ఖారా స్పష్టం చేశారు. మూలధన పెరుగుదల విషయంలో బ్యాంక్ తగిన స్థాయిలో ఉందని అన్నారు. వైవిధ్య పోర్ట్‌ఫోలియోతో వృద్ధి అవకాశాలు ఉన్న రంగాలకు రుణ అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు. ఎటువంటి సవాళ్లనైనా బ్యాంక్ ఎదుర్కొనగలదన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన బ్యాంక్ 66వ వార్షిక సర్వసభ సమావేశాన్ని (ఏజీఎం) ఉద్దేశించి చైర్మన్ శుక్రవారం ప్రసంగిస్తూ, ‘‘2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్–19 విసిరిన సవాళ్లను బ్యాంక్ తట్టుకుని నిలబడింది. ఇదే ధోరణి 2021–22 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది. తదుపరి ఎటువంటి వేవ్నైనా బ్యాంక్ ఎదుర్కొనగలుగుతుంది’’ అన్నారు. ప్రసంగంలో ముఖ్యాంశాలను చూస్తే.. 2020–21లో మంచి ఫలితాలు 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.20,410 కోట్ల అత్యధిక స్టాండెలోన్ నికర లాభం సాధించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం రూ.14,488 కోట్లు. స్థూల మొండిబకాయిల (ఎన్పీఏ) రేషియో కూడా ఇదే కాలంలో 6.15 శాతం నుంచి 4.98 శాతానికి తగ్గింది. ప్రొవిజనల్ కవరేజ్ రేషియో (పీసీఆర్) 87.75 శాతానికి మెరుగుపడింది. బ్యాంక్ రూపొందించిన వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా కొనసాగాయి. 2021 మార్చితో ముగిసిన కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోని పలు అంశాల్లో ఇది సుస్పష్టమైంది. భవిష్యత్‌కు భరోసా.. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఊహించని రీతిలో సెకండ్ వేవ్ సంక్షోభం ప్రారంభమైంది. 2020నాటి కఠిన లాక్డౌన్ పరిస్థితులు లేకపోయినప్పటికీ మొదటి త్రైమాసికం ఎకానమీపై సెకండ్‌వేవ్ తీవ్ర ప్రభావాన్నే చూపింది. అయితే బ్యాంక్ భవిష్యత్ వ్యాపార ప్రణాళికల అమల్లో ఢోకా ఉండబోదని భావిస్తున్నాం. బ్యాంక్ తన డిజిటల్ ఎజెండాను మరింత వేగంగా కొనసాగిస్తుంది. యోనో పరిధి మరింత విస్తృతం అవుతుంది. మున్ముందు మొండిబకాయిల భారం కూడా గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నాం. ఈ దిశలో విజయానికి దివాలా చట్టాలు, కోర్టులు, నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) దోహదపడతాయని విశ్వసిస్తున్నాం. నష్టాల్లో 406 బ్రాంచీలు.. బ్యాంక్‌కు ప్రస్తుతం 406 నష్టాల్లో నడుస్తున్న బ్రాంచీలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి బ్యాంక్ తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నిర్దిష్ట కాలపరిమితితో సమీప భవిష్యత్తులో తగిన చర్యలు ఉంటాయి. -
రిలయన్స్‌కు... కొత్త ‘ఇంధనం’
ముంబై: చమురు నుంచి రిటైల్, టెలికం దాకా వివిధ రంగాల్లో విస్తరించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వ్యాపార వృద్ధికి ఊతమిచ్చే కొత్త ఇంధనాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గురువారం జరిగిన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) భారీ ప్రణాళికలు ఆవిష్కరించింది. వీటి ప్రకారం పర్యావరణ అనుకూల ఇంధనాలపై వచ్చే మూడేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ సెల్స్ తయారీ ప్లాంట్లు, విద్యుత్ నిల్వ చేసే బ్యాటరీల ఫ్యాక్టరీ, ఫ్యుయెల్ సెల్ తయారీ ప్లాంటు, హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎలక్ట్రోలైజర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఏజీఎంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 2030 నాటికి 100 గిగావాట్ల (జీడబ్ల్యూ) సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను, కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయాల్లో దాదాపు 60 శాతం .. హైడ్రోకార్బన్ ఆధారిత ఇంధనాల కార్యకలాపాల ద్వారానే వస్తోంది. ‘2035 నాటికి పూర్తిగా కర్బన ఉద్గారాల రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్ గతేడాది లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా వ్యూహాలు, మార్గదర్శక ప్రణాళికలను నేడు మీ ముందు ఉంచుతున్నాను. ఈ ప్రణాళికల అమలుపై వచ్చే మూడేళ్లలో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం. నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నాం‘ అని ముకేశ్ అంబానీ వెల్లడించారు. నాలుగు గిగా ఫ్యాక్టరీలకు అవసరమైన పరికరాల తయారీకి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ. 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అమలు ఇలా ..: రిలయన్స్ 2030 నాటికి కనీసం 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు అంబానీ చెప్పారు. ఇందులో సింహభాగం రూఫ్‌టాప్ సోలార్, గ్రామాల్లో సౌర విద్యుత్ మౌలిక సదుపాయాల ఏర్పాటు రూపంలో ఉండనుంది. ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను నిల్వ చేసేందుకు అత్యాధునిక బ్యాటరీల తయారీ కోసం ప్రత్యేకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విద్యుత్‌తో పాటు వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించగలిగే హరిత హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీలో అంతర్గతంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ నిర్వహణ.. నిర్మాణం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ ఫైనాన్స్ పేరిట రెండు విభాగాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 5జీ ముందుగా మేమే తెస్తాం.. దేశీయంగా పూర్తి స్థాయిలో 5జీ సర్వీసులను తమ కంపెనీయే ముందుగా అందుబాటులోకి తెస్తుం దని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ఇతర భాగస్వాములతో కలిసి దేశీయంగా రూపొందించిన 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలిపారు. ఇవి 1 జీబీపీఎస్ పైగా స్పీడ్‌తో పనిచేసినట్లు చెప్పా రు. దేశవ్యాప్తంగా తమ డేటా సెంటర్లలో, నవీ ముంబైలోని ట్రయల్ సైట్లలో 5జీ నెట్‌వర్క్‌ను ఇన్స్టాల్ చేసినట్లు అంబానీ పేర్కొన్నారు. ఏజీఎం నేపథ్యంలో గురువారం షేరు బీఎస్ఈలో 2.35% తగ్గి రూ. 2,153 వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్‌లో జియో–గూగుల్ ఫోన్.. టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి రూపొందించిన చౌక 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ముకేశ్ అంబానీ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 10 నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జియోఫోన్ నెక్ట్స్ పేరిట దీన్ని ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ కాగలదని ఆయన పేర్కొన్నారు. ‘భారత్‌ను 2జీ విముక్త దేశంగా మార్చాలంటే అత్యంత చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్ అవసరం. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం జియో, గూగుల్ కలిసి జియోఫోన్ నెక్ట్స్ రూపొందించాయి‘ అని అంబానీ తెలిపారు. దీనికోసమే ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినట్లు ఏజీఎంలో వర్చువల్‌గా పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. 5జీకి సంబంధించి కూడా గూగుల్ క్లౌడ్, జియో జట్టు కట్టాయని ఆయన వివరించారు. ఫోన్ ధర కీలకం.. దాదాపు 30 కోట్ల మంది యూజర్లకు చేరువయ్యేందుకు చౌక స్మార్ట్‌ఫోన్ రిలయన్స్‌కి ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, అంతిమంగా ధర, పనితీరు కీలకంగా ఉంటుందని పేర్కొన్నాయి. కరోనా వైరస్‌కు పూర్వం భారత మార్కెట్లో రూ. 5,000 పైగా రేటున్న స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్ వాటా అయిదు శాతమేనని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. రూ. 5,000 లోపు సెగ్మెంట్‌పై ఏ సంస్థా పెద్దగా ఆధిపత్యం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్‌తో 10 లక్షల ఉద్యోగాలు.. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్ మూడు రెట్లు వృద్ధి చెందగలదని ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న రిలయన్స్ రిటైల్‌ను.. ప్రపంచ టాప్ 10లో ఒకటిగా చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. వచ్చే మూడేళ్లలో రిలయన్స్ రిటైల్‌తో 10 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, మరెంతో మందికి జీవనోపాధి కల్పించగలదని అంబానీ తెలిపారు. పరిశోధన, డిజైన్, ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకోవడంపై రిలయన్స్ రిటైల్ గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో ఈ–కామర్స్ విభాగం జియోమార్ట్‌లో ఒక కోటి పైగా వ్యాపారులను భాగస్వాములుగా చేసుకోవాలనే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రేటింగ్ అప్‌గ్రేడ్: ఫిచ్ భారీ ప్రణాళికలతో ముందుకెడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను ‘బీబీబీ’కు అప్‌గ్రేడ్ చేసినట్లు ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వివిధ వ్యాపార విభాగాల నుంచి వచ్చే నగదు ప్రవాహం, రుణభారాన్ని తగ్గించుకునేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిచ్ తెలిపింది. ఇది భారత సార్వభౌమత్వ రేటింగ్ కన్నా ఒక అంచె ఎక్కువ కావడం గమనార్హం. బోర్డులోకి ఆరామ్కో చైర్మన్.. సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్కోతో ప్రతిపాదిత 15 బిలియన్ డాలర్ల డీల్ ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంబానీ తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా చమురు, రసాయనాల (ఓ2సీ) వ్యాపార విభాగంలో ఆరామ్కో 20 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి 2020 మార్చి నాటికి ఇది పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరిగింది. తాజాగా సౌదీ ఆరామ్కో చైర్మన్, సావరీన్ వెల్త్‌ఫండ్ పీఐఎఫ్ చీఫ్ యాసిర్ ఆథ్మాన్ అల్–రుమయ్యాన్ (51) .. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరనున్నట్లు అంబానీ తెలిపారు. బోర్డు సభ్యుడైన యోగేంద్ర పి త్రివేది (92) రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారని, ఆయన స్థానాన్ని యాసిర్ భర్తీ చేస్తారని అంబానీ పేర్కొన్నారు. -
ఐపీఎల్ జట్లు... టి20 ప్రపంచకప్... ఒలింపిక్స్!
అహ్మదాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుదీర్ఘ విరామం తర్వాత పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం గురువారం జరిగే వార్షిక (89వ) సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బోర్డు సభ్యులందరూ పాల్గొనబోతున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత తొలిసారి బోర్డు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో వేర్వేరు అంశాలు చర్చకు రానున్నాయి. బోర్డులో ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న పలు అంశాలపై కూడా ఏజీఎంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఐపీఎల్లో అదనపు జట్లు 2022 ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు తోడు అదనంగా మరో 2 జట్లకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదనపై చర్చించనున్నారు. వచ్చే ఐపీఎల్‌తోనే ఇలా చేయాలని భావించినా... పలు కారణాలతో 10 జట్ల ఆలోచన సాధ్యం కాదనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది. ఈ సమావేశంలో రెండు కొత్త జట్లు చేర్చే అంశానికి మాత్రమే ఆమోదం తెలిపి 2022 ఐపీఎల్ నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చు. పన్ను రాయితీలపై ఎలా? 2021లో భారత్‌లో టి20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ విషయంలో పూర్తిగా పన్ను రాయితీ కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరుతోంది. అందుకు ఐసీసీ విధించిన గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. రాయితీ ఇవ్వలేకపోతే టోర్నీని యూఏఈకి తరలిస్తామని కూడా ఇప్పటికే ఐసీసీ చెప్పేసింది. గతంలో పలు మెగా ఈవెంట్లకు పన్నుల విషయంలో ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా... కొత్త పన్ను చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. మరోవైపు ప్రపంచ కప్ నిర్వహణ కోసం బోర్డు ఎనిమిది వేదికలను ప్రస్తుతానికి ఎంపిక చేసింది. అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, మొహాలి, ధర్మశాల ఈ జాబితాలో ఉన్నాయి. అయితే పలు రాష్ట్ర సంఘాలు తమ వద్దా అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయని, తమకూ వరల్డ్‌కప్ మ్యాచ్ నిర్వహణ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌కు నో 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు బోర్డు మద్దతునిచ్చే విషయంపై చర్చ జరగవచ్చు. అయితే ఎక్కువ మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటే జాతీయ క్రీడా సమాఖ్యగా ప్రభుత్వం గుర్తింపు కిందకు వచ్చి బీసీసీఐ తమ పట్టు కో ల్పోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్... ఏజీఎంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల మధ్య బుధవారం మొతేరా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బీసీసీఐ కార్యదర్శి జై షా సెక్రటరీ ఎలెవన్ 28 పరుగుల తేడాతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై గెలుపొందడం విశేషం. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా జై షా జట్టు 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్ ఓపెనర్‌గా వచ్చి 22 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అనంతరం గంగూలీ జట్టు 100 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గంగూలీ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్యదర్శి జై షా రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) సహా పలు ప్రధాన సబ్ కమిటీలను ఏజీఎంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఎంపికకు... ముగ్గురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు కూడా ఆమోద ముద్ర వేస్తారు. ఇందులో బ్రిజేశ్ పటేల్, ఖైరుల్ మజుందార్ మరో ఏడాది కొనసాగనుండగా... భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) తరఫున హైదరాబాద్‌కు చెందిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కింది. సురీందర్ ఖన్నా స్థానంలో ఓజా పేరును ఐసీఏ ప్రతిపాదించింది. భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టి20లు ఆడిన ఓజా... ఏడేళ్ల క్రితం చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఐపీఎల్లో మరో రెండు జట్లు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ దశావతారం ఎత్తనుంది. పది జట్లతో లీగ్‌ను విస్తరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 24న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్) ఏర్పాటు చేసింది. మొత్తం 23 అంశాలపై చర్చించేందుకు బోర్డు సమావేశమవుతున్నప్పటికీ ఏజీఎమ్ ప్రధాన ఎజెండా మాత్రం లీగ్‌లో తలపడే జట్లను పెంచడమేనని బోర్డు వర్గాలు తెలిపాయి. నిజానికి పది జట్లతో ఐపీఎల్ నిర్వహణ బోర్డుకు కొత్తేం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే పది జట్లు (పుణే సహారా వారియర్స్, కొచ్చి టస్క ర్స్) ఐపీఎల్లో తలపడ్డాయి. అయితే ఈ పది జట్ల ముచ్చట 2013లోనే ముగిసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత విస్తరణ తెర మీదికొచ్చింది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్. గుజరాత్‌కు చెందిన ఈ కార్పొరేట్ సంస్థ అహ్మదాబాద్ వేదికగా ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కనబరుస్తోంది. ఇదివరకే రెండేళ్లు రైజింగ్ పుణే సూపర్‌స్టార్స్ ఫ్రాంచైజీ ఉన్న సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీజీ సంస్థ కూడా తిరిగి వచ్చేందుకు తహతహలాడుతోంది. దీనికి లక్నో వేదిక కావచ్చు. -
బీసీసీఐ ఏజీఎం వాయిదా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా పడింది. అతి ముఖ్యమైన ఈ మీటింగ్‌ను ఆన్లైన్లో నిర్వహించే వీలు లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా తమ నిర్ణయాన్ని అనుబంధ, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు తెలిపారు. నిబంధనల ప్రకారం ఏటా సెప్టెంబర్ 30లోపు ఏజీఎం నిర్వహించాలి. ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో ఆలోపు నిర్వహించడం కుదరట్లేదు. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న మీదటే ఏజీఎంను వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెలాఖరులోపు తప్పనిసరిగా ఏజీఎం నిర్వహించాల్సిన అవసరమైతే లేదని, తదుపరి ఎప్పుడు ఏజీఎం ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జై షా వివరించారు. ఐపీఎల్ తదితర కీలకాంశాలపై చర్చించేందుకు బోర్డు గతంలో వర్చువల్ మీటింగ్ (ఎక్కడివారక్కడే ఉండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం) నిర్వహించింది. చివరిసారిగా బోర్డు ఏజీఎం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. అప్పుడే మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
ఇక రిలయన్స్ రిటైల్‌పై ముకేశ్ దృష్టి!
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తాజాగా రిలయన్స్ రిటైల్ బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సూపర్ మార్కెట్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ తదితర విభాగాలలో రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 12,000 సోర్లను నిర్వహిస్తోంది. సుమారు 7,000 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇటీవల జియోమార్ట్ ద్వారా ఆన్లైన్ గ్రోసరీ స్టోర్‌ను సైతం ప్రారంభించింది. 2020 మార్చికల్లా రిలయన్స్ రిటైల్ రూ.1.63 ట్రిలియన్ల ఆదాయాన్ని సాధించినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. కొద్ది రోజులుగా రిలయన్స్ రిటైల్ బిజినెస్‌పైనా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు తాజా ఏజీఎంలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై రిలయన్స్ రిటైల్‌లో వాటా విక్రయం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ముకేశ్ అంబానీ తెరతీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్రోకెమికల్స్ సైతం పెట్రోకెమికల్స్ విభాగంలో సైతం వాటా విక్రయం, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందడుగు వేసే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరామ్కోతో డీల్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదని బుధవారం జరిగిన 43వ ఏజీఎంలో ముకేశ్ తెలియజేశారు. దీంతో తిరిగి విదేశీ ఇంధన దిగ్గజాలతో చర్చలు ప్రారంభించే వీలున్నట్లు ఊహిస్తున్నాయి. అయితే సౌదీ అరామ్కోతో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు ముకేశ్ పేర్కొనడం గమనార్హం! రానున్న రోజుల్లో రిలయన్స్ రిటైల్ బోర్డులోకి వ్యూహాత్మక ఇన్వెస్టర్లు అడుగు పెట్టనున్నట్లు ముకేశ్ పేర్కొన్న నేపథ్యంలో తాజా అంచనాలకు బలమొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 20 బిలియన్ డాలర్లు డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మూడు నెలల్లోనే దాదాపు 33 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు రూ.1.52 లక్షల కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ సమకూర్చుకుంది. గ్లోబల్ దిగ్గజాలు ఫేస్బుక్, ఇంటెల్, గూగుల్ తదితరాలు ఇన్వెస్ట్ చేయడం విశేషంకాగా.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఎంటర్ప్రైజ్ విలువ 58 బిలియన్ డాలర్లకు చేరింది. జియోలో 7.7 శాతం వాటా కొనుగోలుకి గూగుల్ 4.5 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఈ బాటలో ఆయిల్, కెమికల్స్ విభాగంలో సౌదీ అరామ్కోకు వాటా విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లను సమకూర్చుకోవాలని ఆర్ఐఎల్ ఆశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో రిలయన్స్ రిటైల్ బిజినెస్‌తోపాటు.. ఆయిల్, కెమికల్ విభాగంలో విదేశీ పెట్టుబడులపై ముకేశ్ అంబానీ దృష్టిసారించవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఆర్ఐఎల్ ఏజీఎం- ముకేశ్ గ్రూప్ షేర్ల హవా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్చువల్ ప్రాతిపదికన నేడు వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహిస్తోంది. ఇటీవల డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోకు తరలివచ్చిన విదేశీ పెట్టుబడులు, ఆర్ఐఎల్ చేపట్టిన రైట్స్ ఇష్యూ నేపథ్యంలో ఏజీఎంకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏజీఎంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్న గడువుకంటే ముందుగానే ఆర్ఐఎల్ రుణరహిత దిగ్గజంగా ఆవిర్భవించిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముకేశ్ అంబానీ వెల్లడించనున్న ప్రణాళికలపై అంచనాలతో ఇన్వెస్టర్లు ఆర్ఐఎల్ గ్రూప్ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఆర్ఐఎల్ షేరు 2.2 శాతం ఎగసి రూ. 1960 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇటీవలే కంపెనీ మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. ఈ ప్రభావంతో గ్రూప్‌లోని ఇతర కంపెనీల కౌంటర్లు సైతం జోరందుకున్నాయి. హాథవే కేబుల్ అండ్ డేటాకామ్ 13 శాతం దూసుకెళ్లి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50 సమీపంలో ఏడాది గరిష్టాన్ని తాకింది. ఇతర కౌంటర్లలో డెన్ నెట్వర్క్స్, 5.25 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 97 సమీపంవరకూ ఎగసింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 0.5 శాతం బలపడి రూ. 461 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 468ను దాటింది. ఇటీవల ర్యాలీ రెండు రోజులుగా దూకుడు చూపుతున్న హాథవే కేబుల్ షేరు గత నెల రోజుల్లో 73 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం 46 శాతం లాభపడింది. ఈ బాటలో టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్, నెట్వర్క్ 18 మీడియా, డెన్ నెట్వర్క్స్ 12-40 శాతం మధ్య ఎగశాయి. -
రిలయన్స్ ఆన్లైన్ ఏజీఎమ్ రేపు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎమ్) రేపు (బుధవారం) జరగనున్నది. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఈ ఏజీఎమ్‌ను నిర్వహిస్తున్నారు. కంపెనీకి ఇదే తొలి ఆన్లైన్ ఏజీఎమ్, దాదాపు 500కు పైగా ప్రదేశాల నుంచి లక్షకు పైగా వాటాదారులు ఈ ఆన్లైన్ ఏజీఎమ్‌లో పాల్గొంటారని అంచనా. ఈ ఆన్లైన్ ఏజీఎమ్‌పై అవగాహన కల్పించడానికి ఇప్పటికే ఒక చాట్‌బోట్‌ను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. ఈ వర్చువల్ ఏజీఎమ్‌లో వాటాదారులు చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రసంగాన్ని వినడమే కాకుండా, ప్రశ్నలు కూడా అడగవచ్చని, ఓటింగ్‌లోకూడా పాల్గొనవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏజీఎమ్‌లో ఏం ఉండొచ్చు...? రెండేళ్లలో రిలయన్స్‌ను రుణ రహిత కంపెనీగా మార్చడం లక్ష్యమని, గత ఏడాది ఏజీఎమ్‌లో ముకేశ్ అంబానీ ప్రకటించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటా విక్రయం ద్వారా 13 విదేశీ సంస్థల నుంచి రూ.1.18 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. ఈ పెట్టుబడులతో పాటు రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూతో ఈ లక్ష్యాన్ని గత నెలలోనే రిలయన్స్ కంపెనీ సాధించింది. బ్రోకరేజ్ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయంటే... ► రిలయన్స్‌కు చెందిన ఆయిల్–టు–కెమికల్ (ఓఈసీ)విభాగంలో 20 శాతం వాటాను 1,500 కోట్ల డాలర్లకు సౌదీ ఆరామ్కో సంస్థకు విక్రయానికి సంబంధించి గత ఏడాది ప్రకటించిన డీల్‌పై మరింత స్పష్టత రావచ్చు. ► రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్స్ సంస్థల స్టాక్ మార్కెట్ లిస్టింగ్ వివరాలు వెల్లడి కావచ్చు. జియో ప్లాట్పారŠమ్స్‌ను అంతర్జాతీయ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ చేసే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. ► ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల్లో వాటా కొనుగోలుకు సంబంధించిన వివరాలు వెలువడవచ్చు. ► జియో ఫైబర్ సేవలు, రిలయన్స్ జియో 5జీ సేవలు ఎప్పుడు మొదలయ్యేదీ తదితర వివరాలు వెల్లడి కావచ్చు. ► బోనస్, ఇంకా ఇతరత్రా వివరాలపై ప్రకటనలు ఉండొచ్చు.