Allergy
-
పరదా చాటున అలర్జీ మాటేస్తది!
తలుపులకూ, కిటికీలకు పరదాలు (డోర్ అండ్ విండో కర్టెయిన్స్) అందాన్నీ, ప్రైవసీని ఇస్తాయి. కొన్ని స్టార్ హోటల్స్‌లో మంచి రాజసపు లుక్ కోసం వెరైటీగా కర్టెన్లు అమరుస్తారు. ఇటీవల ఇండ్లలోనూ ఈ తరహాలోనే రంగురంగుల ఆకర్షణీయమైన కర్టెన్స్ అమర్చుకోవడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇంటి పై సజ్జబల్లల మీద / అటక మీద పాత సామాన్ల వంటివి సర్దిపెట్టినప్పుడు అవి బయటకు కనపడకుండా పరదాలు అడ్డుగా అమర్చి ఉంచడమూ మామూలే. అయితే వాటిని నెలల తరబడి అలాగే ఉంచడం వల్ల వాటి వెనక అలర్జీకి కారణమయ్యే డస్ట్‌మైట్స్ చేరి అలర్జీ కలిగించవచ్చు. అది ఎన్ని రకాలుగా కలుగుతోందో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.సాధారణంగా కర్టెన్లతో వచ్చే అలర్జీలు రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం వల్ల... అత్యంత చురుకుగా పనిచేసే ఆ వ్యాధి నిరోధక వ్యవస్థ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల అలర్జీలు వస్తాయి. అది ఈ కింది విధాలుగా జరుగుతుంది. ఫ్యాబ్రిక్ కర్టెన్లలో చేరే అలర్జెన్లూ, డస్ట్‌మైట్స్ : కరై్టన్లు ఇళ్లలోకి దుమ్మూ, ధూళి రాకుండా నిరోధిస్తాయి. ఈ క్రమంలో దుమ్ము ధూళిలో ఉండే డస్ట్‌మైట్స్... తలగడల్లో, పక్కబట్టల్లో చేరినట్టే పరదాల్లోకీ చేరతాయి. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్ ఉంటాయి. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) వరకు ఉండవచ్చు. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఈ విసర్జకాల్లోని ఒక రకమైన ప్రోటీన్ మనుషులు శ్వాసించేటప్పుడు ముక్కులోకి వెళ్లి... అది వారిలో అలర్జీ కలిగిస్తుంది. కొన్నిసార్లు అలర్జీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. కేవలం డస్ట్‌మైట్స్ మైట్స్ మాత్రమే కాకుండా అనేక రకాల అలర్జెన్స్ సైతం కర్టెన్లలో దాగి ఉంటాయి. అవి కలిగించే అలర్జీ కారణంగా దగ్గడం, తుమ్ములు రావడం, అదేపనిగా ముక్కుకారడం, భయం కలిగించేలా కళ్లెర్రబడటం వంటి రియాక్షన్స్ కనిపిస్తాయి. కొందరిలో ఈ డస్ట్‌మైట్స్, అలర్జెన్లు తీవ్రమైన ఆస్తమాను కలిగించి, ఊపిరాడకుండా చేస్తూ తీవ్రంగా బాధిస్తాయి. మౌల్డ్స్ లాంటి ఫంగస్ చేరడం : కర్టెన్లలో మౌల్డ్స్ వంటి ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి. ఇవి ఒకరకంగా బూజు లాంటివి. గాలిలో తేమ ఉండేచోట్ల, వెలుతురు తక్కువగా ప్రసరించే చోట్లలో ఈ మౌల్డ్స్, ఇతర ఫంగస్‌లు పెరుగుతాయి. అన్ని చోట్లలాగే కర్టెన్లలో చేరినప్పుడు అవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. సూక్ష్మజీవుల ఆవాసంగా : అనేక రకాల సూక్ష్మజీవులు (జెర్మ్స్) సైతం పెద్దసంఖ్యలో కర్టెన్లలో చేరి అవి కూడా ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ∙దుమ్ము కణాలు : అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలు కూడా అలర్జీలకు తెచ్చి పెడతాయి. ప్లాస్టిక్ కర్టెన్ల విషయంలో : మొదట్లో ఇళ్లలో, నివాస ప్రదేశాల్లో కేవలం క్లాత్ కర్టెన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇటీవల ఉపయోగాలూ, ఫ్యాషన్ దృష్ట్యా ప్లాస్టిక్‌తో తయారైనవీ వాడుతున్నారు. ఇక బాత్రూమ్ల విషయానికి వస్తే... అక్కడ అవి నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం పూర్తిగా వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని ప్లాస్టిక్కర్టెన్లు ఫ్యాబ్రిక్‌లతో చేసిన పరదాల్లో అటు ఇటు ఒంగకుండా (ఫ్లెక్సిబుల్‌గా లేకుండా) ఉంటాయి. అందుకే అవి బట్టలాగే ఎటు పడితే అటు కాస్తంత వంగేందుకు వీలుగా వాటిల్లో ‘థాలేట్’ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఇదే పదార్థాన్ని వాల్పేపర్లు, ఫ్లెక్సీల్లో కూడా వాడతారు.ప్లాస్టిక్కరై్టన్లతో ఎంతో హాని... ఈ ప్లాస్టిక్వంటి కర్టెన్లలోని హానికర / విష పదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) కేవలం అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థపైన కూడా ప్రతికూలంగా పనిచేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థనూ దెబ్బతీస్తాయి. ఇక గర్భవతులపై కూడా ప్రతికూలంగా పనిచేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ అటెన్షన డిజార్డర్) వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్వంటి పదార్థాలతో తయారైన కర్టెన్ల కారణంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలో ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) వచ్చే అవకాశాలు ఎక్కువని ‘మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలింది.అలర్జీలు వస్తే... కర్టెన్లు లేదా ఇతరత్రా కూడా అలర్జీలు వచ్చినప్పుడు తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీహిస్టమైన్స్ వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మోతాదుల్లో స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స అందిస్తారు. ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసుకోవడం వల్ల ఇంటి పరిశుభ్రతతో పాటు ఒంటి ఆరోగ్యాన్నీ కాపాడుకున్నట్లు అవుతుంది.అలర్జీల నివారణకు...∙డోర్, విండో కర్టెన్ల కోసం వీలైనంతవరకు వస్త్రంతోతయారైన పరదాలు (ఫ్యాబ్రిక్ కర్టెన్స్) వాడటమే మంచిది షవర్ కర్టెన్లు కోసం ఫ్యాబ్రిక్ మెటీరియల్ వాడటం మంచిది ∙అయితే... బాత్రూమ్ల్లో వాడటం వల్ల అవి తడిసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ పీవీసీ మెటీరియల్ కంటే హానికరం కాని అలర్జీ ఫ్రెండ్లీ బ్లైండ్స్ వంటివి వాడటం మంచిది ∙కర్టెన్లు ఫ్యాబ్రిక్ లేదా ప్లాస్టిక్మెటీరియల్తో చేసినవైనా బాగా మాసిపోయే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి, పూర్తిగా పొడిబారే వరకు ఆరబెట్టడం... అదే విధంగా ప్లాస్టిక్మెటీరియల్తో తయారైన వాటిని డిస్ఇన్ఫెక్టెంట్స్తో తరచూ శుభ్రపరచడం చాలా అవసరం. ఇలా ΄్లాస్టిక్తో తయారైనవి వాడాల్సి వచ్చినప్పుడు హైపో అలర్జెనిక్ వాషబుల్వి వాడాలి. దాంతో వాటిని కూడా సబ్బుతో కడిగినట్టే కడిగే అవకాశం ఉంటుంది. -
అలర్జీని ఎలా వదిలించుకోవాలి..?
ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు: ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తల దురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు: దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి: మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి చదవండి: 90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో! -
ఇదేమీ అలెర్జీ రా బాబు..! స్నానం చేసిందా ఇక అంతే..!
స్నానం చేస్తే.. నరకయాతన అనుభవించే వాళ్లు ఉన్నారంటే నమ్ముతారా!. అసలు ఇలాంటి సమస్య కూడా ఉంటుందా? అని అనిపిస్తుంది.కానీ ఇలాంటి చిత్ర విచిత్రమైన అనారోగ్య సమస్యలు ఫేస్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. వాటికి సరైన చికిత్స విధానం, తగ్గించే మందులు లేకపోవడంతో వాళ్లు చెప్పుకోవడానికి కూడా వీల్లేనంత యాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి భాదనే చవిచూస్తోంది యూకేకి చెందిన ఓ మహిళ. వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్‌లోని సౌత్ కరోలినాకు చెందిన 22 ఏళ్ల మహిళ తీవ్రమైన నీటి అలెర్జీతో బాధపడుతోంది. అందువల్ల ఆమె స్నానం చేయలేని స్థితిని ఎదుర్కొంటుంది. అలాగని స్నానం చేయకుండా ఉండటం అనేది కుదరని పని. తప్పక స్నానం చేసినా.. వెనుటవెంటనే టవల్‌తో తుడిచేసుకోవాల్సిందే. ఒక చుక్క నీరు కూడా శరీరంపై ఉండటానికి వీల్లేదు. ఇది ఎంత దారుణమైన బాధంటే..ఆయా వ్యక్తులు పొరపాటున కూడా నీటిని తాకలేరు, కనీసం వారి స్వేద జలం కూడా వారికి ఇబ్బందే. ఆమె శరీరం పొరపాటున తడికి గురయ్యిన లేదా నీళ్లను తాకినప్పుడు వెంటనే దద్దుర్లు, దురద రావడం జరుగుతుంది. ఎంతలా అంటే అదేపనిగా దురద వస్తూ ఉండటంతో గోకకుండా ఉండలేనంత విధంగా ఒకటే దురదగా ఉంటుందని వేదనగా చెబుతోందామె. తనకు ఈ పరిస్థితి సుమారు 12 ఏళ్ల వయసు నుంచి మొదలయ్యిందని, ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి మరింత దిగజారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక భరించేలేక డాక్టర్ వద్దకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే వైద్యులు కూడా ఈ అలెర్జీకి చికిత్స లేనందున వీలైయినంతగా స్నానం చేయకపోవడం లేదా స్నానం చేయడానికి దూరంగా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని సూచించినట్లు తెలిపింది. అయితే ఇలా స్నానం చేయకుండా తడిగుడ్డతో లేదా వైప్స్‌తో తుడుచుకోవడం ఎంత నరకమో తెలుసా? అంటూ కన్నీటి పర్యంతమవుతోంది ఆ మహిళ. తాను ఇలా స్నానం చేయకుండ ఉండలేను స్నానం చేస్తే తట్టుకోలేను అంటూ బాధగా తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది. అయితే తనలాంటి వాళ్లు ఎవరైన ఉన్నారా? అని సోషల్ మీడియా ద్వారా సర్చ్ చేసి మరీ తెలుసుకున్నానని, తామంత ఒక కమ్యూనిటిగా ఉండి, తమ సమస్యలను ఒకరికొకరం షేర్ చేసుకుంటామని చెప్పింది. నిజానికి ఇదొక అరుదైన సమస్య. వైద్య చరిత్రలో నీటికి సంబంధించిన అలెర్జీలు 37 రకాలు ఉన్నాయని, ఇప్పటివరకు వాటికి సరైన చికిత్స విధానం లేదని వైద్యులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: చేప చర్మం కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్, అల్సర్లకు కూడా!) -
ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ!
కొందరూ చెప్పేందుకు, వినేందుకు బాధకరంగా ఉండే చిన్న చిన్న వాటితో వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తుంటారు. ఆ వ్యాధి ఇది అని కూడా నిర్థారించలేక వైద్యులు సైతం తలపట్టుకుంటారు. అత్యంత విచిత్రమైన రుగ్మతలతో కొందరూ చిన్నారులు బాధపడుతుంటారు. వారికి, వారిని కన్నవారికి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎందువల్ల ఆ సమస్య ఉత్ఫన్నమవుతోంది నిర్థారించిన అందుకు సరైన చికిత్స విధానం లేక మరో సమస్య. పగవాడికి కూడా ఈ సమస్య వద్దు అనేలా ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు. ఇక్కడ అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది ఓ చిన్నారి. వివరాల్లోకెళ్తే..క్వీన్స్‌లాండ్‌లోని కర్యాన్ జిమ్మ్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు సుమ్మా విలియమ్స్ పడుతున్న ఆవేదన గురించి కన్నీటిపర్యంతమయ్యింది. తాను మొదట్లో తన చిన్నారికి వచ్చిన సమస్యను వడదెబ్బగా తప్పుగా అర్థం చేసుకున్నానట్లు తెలిపింది. ఏడ్చినా, చెమట పట్టినా..ఒక్కసారిగా ఆమె చర్మం ఎర్రగా మారి ప్రతి చోట పగళ్లు ఏర్పడటం జరుగుతోంది. దీంతో తాను తన కూతురు బయట ఎండకు ఎక్స్పోజ్ కావడంతో అలా అయ్యి ఉంటుందని భావించి తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అది కాస్త తీవ్రమైన దురదతో కూడిన మంటతో బ్రిస్బేన్‌లోని ఆస్పత్రిలో చేరే వరకు ఆ సమస్య ఏంటన్నది తనకు తెలియలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది ఆ చిన్నారి తల్లి. అక్కడ వైద్యులు ఆమె కన్నీళ్లు, చెమటే ఆమెకు అలెర్జీగా పరిణిమించి ఇలా మంటతో కూడిన దురద వచ్చి ఎర్రగా అవుతున్నట్లు వెల్లడించారు. శరీరంపై పగుళ్లుకు కారణం అదేనని చెప్పడంతో తాము షాక్‌కి గురయ్యినట్లు పేర్కొంది. ఆ అలెర్జీని తామరకు సంబంధించిన చర్మ వ్యాధిగా వైద్యులు నిర్థారించినట్లు తెలిపింది. అంతేగాదు తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లిన ప్రతి చోట ఆమెను చూసి వడదెబ్బకు గురయ్యిందా? అని అందరూ అడుగుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆ తల్లి. తన కూతురుకి డ్యాన్స్ అంటే ఇష్టమని, అందులో ఆమె మంచి నర్తకిగా అవార్డు కూగా గెలుచుకుందని చెప్పుకొచ్చింది. అయితే డ్యాన్స్ చేస్తే కచ్చితంగా చెమట పడుతుంది. దీంతో ఆమె ఆ చర్మ సమస్యను ఫేస్ చెయ్యక తప్పడం లేదు. కన్నీళ్ల అంటే ఎప్పుడో పరిస్థితిని బట్టి వచ్చేవి, కానీ చెమట అనేది మనం శ్రమించినా, లేదా టెన్షన్ పడ్డ ఆటోమెటిక్‌గా వచ్చేవి. దీంతో ఆ చిన్నారికి ఈ సమస్య వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఈ సమస్యను వైద్యులు వివిధ ఇంజెక్షన్లతో నివారించే ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురు పదేపదే తన స్నేహితుల్లా తన చర్మం ఎందుకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుదంటూ ఆ చిన్నారి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధికంగా తామరకు సంబంధించిన చర్మ వ్యాధితో ఆస్ట్రేలియాలోని చిన్నారులే ఎక్కువుగా బాధపడుతున్నట్లు సమాచారం. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
మాకొద్దు బాబోయ్.. మాంసం చూస్తే వణికిపోతున్న అమెరికన్లు.. ఆ పురుగు వల్లనే ఇదంతా!
మాంసం చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఇంకొంత మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదని అంటారు. అయితే కొందరు అమెరికన్లకు మాత్రం మాంసం చూస్తేనే ఒళ్లంతా అలర్జీ వచ్చేసి వాంతులతో వస్తున్నాయట. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు చివరికి ఇది ఆల్ఫా – గాల్ సిండ్రోం అని కనుగొన్నారు. అసలు ఆ వ్యాధి ఏంటి, ఇలా ఎందుకు జరుగుతోందంటే.. ఆల్ఫా గాల్ అనేది ఒక ఫుడ్ అలెర్జీ. ఈ సిండ్రోం ఉన్న వారికి మాంసం, లేదా జంతువుల ఉత్పత్తులను ఆహారంగా ఇస్తే అలర్జీకి గురవుతారు. ఇది లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం వల్ల వ్యాపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2010 తర్వాతి నుంచి అమెరికాలో ఆల్ఫా గాలా సిండ్రోం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో ప్రభుత్వ విడుదల చేసిన నివేదికలో 100,000 మందికి ఉండగా.. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్యను మరింత పెరిగి దాదాపు 450,000 మంది ఈ సిండ్రోం బారిన పడినట్లు పేర్కొన్నారు. 2011 లో పరిశోధకులు మొదటగా లోన్ స్టార్ టిక్ అనే కీటకం కుట్టడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని ఓ ప్రముఖ క్లినిక్ ప్రకారం, ఇటువంటి కేసులు సాధారణంగా దక్షిణ, తూర్పు, మధ్య యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపింది. లాంగ్ ఐలాండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ఎరిన్ మెక్గింటీ దీని గురించి మాట్లాడుతూ, గత దశాబ్దంలో ఆమె సిండ్రోమ్‌తో సుమారు 900 మందిని చూసిందని చెప్పుకొచ్చారు. ఇది వేగంగా వ్యప్తి చెందుతుందని ఆమె చెప్పారు. జింకల ద్వారా ఈ కీటకం నగరాల సరిహద్దుల్లోకి అక్కడి నుంచి వివిధ మార్గాల్లో జనావాసాల్లోకి వస్తోంది. దీంతో ఈ అలర్జీ బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చదవండి నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు.. -
ఇది మెడలో వేసుకుంటే అలెర్జీలకు చెక్!..ధర ఎంతంటే..
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్షా్మతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
ప్రెగ్నెన్సీ సమయంలో యాంటీ అలర్జీ మెడిసిన్ వాడితే ప్రమాదమా..?
-
మనుషుల అశ్రద్ధతోనే పర్యావరణానికి ముప్పు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మనుషుల అశ్రద్ధతోనే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ఈనెల 18 నుంచి ప్రారంభమైన ప్రపంచ అలర్జీ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం డీజీపీ కార్యాలయంలో ప్రముఖ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నేతృత్వంలో ‘పావురాల రెక్కలు – పావురాల విసర్జన– ఎలర్జీ నిర్ధారణ– పరీక్షలు’ క్యాంపెయిన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పావురాలతో ప్రబలే అలర్జీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలర్జీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అశ్వినీ అలర్జీ సెంటర్లో పావురాల వల్ల కలిగే ప్రాణాంతకరమైన వ్యాధి ‘హైపర్ సెన్సిటివిటీ నీమోనైటిస్’ ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు వెయ్యి మందికి ఉచితంగా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
మీ పిల్లలు తరచు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?
ఇది అటు చలికాలం కాదు, అలాగని పూర్తి వేసవి కాలమూ కాదు... అటూ ఇటూ కానీ సంధికాలం. ఈ కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలే తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి దగ్గు, జలుబు. అలెర్జీ, దగ్గు, న్యూమోనియా, బ్రాంకైటిస్, అధిక జ్వరం, టాన్స్లైటిస్, చెవి ఇన్ఫెక్షన్ సమస్యలు పిల్లలకు తరచు సోకుతుంటాయి. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు పిల్లలకు దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు, అధిక తీపి, ఎక్కువ చల్లగా ఉండే ఆహారాలను తినిపించకూడదని వైద్యులు సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇవి దగ్గును ఎక్కువ చేస్తాయి. అలాగే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వీటితోపాటు క్యాండీలు, ఐస్ క్రీం, చాక్లెట్లు, డోనట్స్, పేస్ట్రిలు, ద్రాక్ష, రిఫ్రిజిరేటర్ లో ఉండే చల్లని ఆహారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి దగ్గును బాగా పెంచుతాయి. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లలను పంపించకూడదు. ఎందుకంటే ఇవి దగ్గును ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బొమ్మలు ఇవ్వాల్సి వస్తే.. వాటిని వాష్ చేసిన తర్వాతే ఇవ్వండి. అలాగే పావురాలు, ఇతర పెంపుడు జంతువులకు కొద్దిగా దూరంగా ఉంచండి. ఇవి అలెర్జీని కలిగిస్తాయి. -
అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా..
Winter Season: Tips To Handle Asthma Allergy Doctors Suggestions: ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరని అనుకుంటారు కొందరు. కానీ ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ. సౌకర్యం కోసం శ్వాస వ్యవస్థను అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్ వే అనీ... కింది భాగాన్ని లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే అని చెబుతుంటారు గానీ... ఈ రెండూ ఒకటే. డూప్లె(క్స్) భవనంలోని పై భాగం అప్పర్ ఎయిర్ వే అయితే... కింది భాగం లోయర్ ఎయిర్ వే... ఈ రెండూ కలిసిన ఒకే ఇల్లు లాంటివివి. అలర్జీ వల్ల పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’. అదే కింది భాగం అయితే అది ఆస్తమా. గమనించి చూస్తే 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, ఆస్తమా ఈ రెండూ ఉంటాయి. ఈ సీజన్లో వీటి బెడద మరింత ఎక్కువ. అందుకే చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం. అలర్జీలు అలర్జీ అంటే ఏదైనా మనకు సరిపడని పదార్థం మనలోకి ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ!. అదెంత ఎక్కువగానంటే... మన ఆరోగ్యాన్నే దెబ్బతీసేంత తీవ్రంగా! అప్పుడు మన దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. అలా అలర్జీని కలిగించే పదార్థాల్ని ‘అలర్జెన్’ అంటారు. అలర్జీలు వేటివేటితో... నిర్వహణ ఎలా? సాధారణంగా పిల్లల్లో / పెద్దల్లో చాలా మందికి చాలా రకాల అంశాలు సరిపడవు. ఆహారాలు : చాక్లెట్స్, గోధుమలతో వండిన ఆహారాలు, కొందరికి గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు, పాలతో చేసిన పదార్థాల వంటి వాటితో రావచ్చు. పాలు తాగే పసిపాపల్లో సైతం బాటిల్ ఫుడ్, పోతపాలు, టిన్డ్ ఫుడ్ వంటివాటితో అలర్జీలు రావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : పిల్లలకు సరిపడని వాటిని... వారినుంచి దూరంగా ఉంచడమే దీనికి తొలి చికిత్స అని గుర్తుపెట్టుకోవాలి. పరిసరాలు/ వాతావరణం : పొగ, దుమ్ము ధూళి, పుప్పొడి, దోమల మందు వంటివి. నిర్వహణ (మేనేజ్మెంట్) : పైన పేర్కొన్నవి కమ్ముకుని ఉండే చోట్ల నుంచి దూరంగా ఉండాలి. మందులు / ఇతరాలు : కొందరు పిల్లలకు పెన్సిలిన్, యాస్పిరిన్ వంటివి సరిపడకపోవచ్చు. మరికొందరికి కాస్మటిక్స్ పడకపోవచ్చు. సోయా అలర్జీ, మోల్డ్ అలర్జీ, సన్ అలర్జీ, కొందరికి రబ్బర్ వస్తులతో కలిగే లేటెక్స్ అలర్జీ... ఇలా ఎన్నెన్నో కారణాలతో... రకాల అలర్జీలు వచ్చే అవకాశముంది. నిర్వహణ (మేనేజ్మెంట్) : మనకు అలర్జీ కలిగించే అంశం ఏదైనా దాన్ని నుంచి దూరంగా ఉండటమే దాని నివారణకూ, నిర్వహణకు మేలైన మార్గమని గుర్తుంచుకోవాలి. ఆస్తమా ఆస్తమాను ప్రేరేపించే అంశాలు... దాని నిర్వహణ అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాలా రావచ్చు. అలాగే తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : మనకు సరిపడని ఆహారానికి/వాతావరణానికి/పరిసరాలకు దూరంగా ఉండటం వ్యాయామం : తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కొందరిలో ఆస్తమా రావచ్చు. మనం గాలిని పీల్చగానే ముక్కులోకి ప్రవేశించిన బయటి చలి గాలిని కాస్తంత వెచ్చబరచడం, తేమ ఉండేలా చేయడం వంటి పనులను ముక్కు చేస్తుంది. వ్యాయామ సమయంలో సాధారణ సమయంలో కంటే పెద్దమొత్తంలో గాలిని పీల్చుకుంటుంటాం. దాంతో బయటి గాలి తాలూకు టెంపరేచర్, తేమల తేడాలను తట్టుకోలేని శ్వాసనాళాలు ముడుచుకుపోతాయి. వ్యాయామం కారణంగా ఎక్కువ మోతాదులో గాలి అవసరమవుతుంది. కానీ ముడుచుకుపోయిన శ్వాసనాళాల నుంచి అవసరమైన మేరకు గాలి అందదు. దాంతో ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ వస్తుంది. నిర్వహణ (మేనేజ్మెంట్) : సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా మొదలవుతుంది. బయటి గాలిలో, ముక్కు నుంచి దేహంలోకి లోపలికి ప్రవేశించాక ఉన్నగాలిలో తేడాలు ఎక్కువైతే ఇది వస్తుంది కాబట్టి దేహం కూడా దీన్ని తట్టుకునేలా నేరుగా వ్యాయామం మొదలుపెట్టకుండా... కనీసం 5 – 10 నిమిషాల పాటు వార్మ్ అప్ వ్యాయామాలు చేయాలి. వార్మ్ అప్ వ్యాయామాలు ఎంతసేపు చేస్తే... ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా వచ్చే అవకాశాలు అంతగా తగ్గుతాయి. ఒకవేళ అప్పటికీ వస్తూనే ఉంటే వ్యాయామం తాత్కాలికంగా ఆపేసి, డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే మొదలుపెట్టాలి. జీఈఆర్డీ సమస్యతో అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో ఆహారం తీసుకున్న తర్వాత వారి కడుపులో జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం కడుపులోంచి గొంతులోకి వెనక్కు వెళ్లినప్పుడు (రిఫ్లక్స్) గొంతు, పొట్టపైభాగంలో మంట, నొప్పి వస్తాయి.కొందరిలో తిన్నది గొంతులోకి వస్తున్నట్లుగా అనిపిస్తు్తంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అంటారు. పులితేన్పుల రూపంలో యాసిడ్ గొంతులోకి రాగానే గొంతు మండడం, కడుపు ఉబ్బరం చాలామందికి అనుభవంలోకి వచ్చేదే. జీఈఆర్డీ సమస్య ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత కడుపు బరువుగా ఉండటం, ఆయాసంగా అనిపించడం, నిద్రలో సమస్య ఎక్కువై, మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. నిర్వహణ (మేనేజ్మెంట్) : సాధారణంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో తినేవారిలో ఇలాంటి ఆస్తమా ఎక్కువ. అందుకే తక్కువ మోతాదుల్లో తింటూ కడుపును తేలిగ్గా ఉంచుకునే వారిలో ఈ సమస్య తగ్గుతుంది. రాత్రివేళ వీలైనంత ముందుగా భోజనం పూర్తి చేయాలి. తిన్న వెంటనే (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత) పడుకోకుండా / నిద్రకు ఉపక్రమించకుండా కాసేపు అటు ఇటు నడిచాకే పక్క మీదికి చేరాలి. ఇతర కారణాలతో... పొగాకు పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగుల (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి వాటి వాసన సరిపడకపోవడం వంటి అంశాలతోనూ ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్‌ప్లేస్ ఆస్తమా’ అంటారు. కొందరిలో కొన్ని మందులు సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : తమకు సరిపడని వాటి నుంచి దూరంగా ఉండటమే ఈ సమస్యల నివారణకు మార్గం. అలాగే వర్క్‌ప్లేస్ ఆస్తమా ఉన్నవారు... వీలైతే తమ వృత్తిని మార్చుకోవడమే మేలు. ఇక మందులతో ఆస్తమా వచ్చేవారు... ఏవి తమకు సరిపడటం లేదో గుర్తించి, ఆ విషయాన్ని డాక్టర్‌కు తెలిపి, మందులను మార్పించుకోవాలి. -డాక్టర్ రఘుకాంత్..సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ చదవండి: Bottle Gourd Juice: సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే అద్భుత ఫలితాలు! జ్యూస్ అస్సలు వదలరు! -
గర్భిణులూ.. తీపి పదార్థాలు తగ్గించండి, లేకపోతే కష్టం!
చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా ఉండి బాగా తీపి పదార్థాలను గర్భవతిగా ఉన్నప్పుడు తినకపోవడమే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ప్రెగ్నెన్సీలో అలా అపరిమితంగా తీపి పదార్థాలు తినేవాళ్లకు పుట్టిన చిన్నారులకు అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని బ్రిటిష్ పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 9000 మంది గర్భిణులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. గర్భవతిగా ఉన్న సమయాల్లో అపరిమితంగా తీపి తినేవారి పిల్లల్లో దుమ్ముకూ, ఇంట్లోని పెంపుడు జంతువుల వెంట్రుకలకూ తీవ్రమైన అలర్జీ వచ్చే అవకాశాలుంటాయని వెల్లడించారు. కాబోయే తల్లులు ఎంత తక్కువగా స్వీట్లు తింటే పిల్లల్లో ఈ అలర్జీలు అంత తగ్గుతాయని సూచిస్తున్నారు. అయితే ఈ అలర్జీలు.. తీపిని ఇచ్చేందుకు ఉద్దేశించిన కృత్రిమ స్వీటనర్లతోనే అనీ, పండ్లూ, కూరగాయల్లో లభ్యమయ్యే నేచురల్ షుగర్స్‌తో ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. ఈ విషయాలన్నీ ‘యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్’ అనే వైద్యనిపుణుల సంచికలో ప్రచురితమయ్యాయి. చదవండి: భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడుతున్నారా? రెండుసార్లు అబార్షన్.. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో నెగెటివ్...పరిష్కారం ఏంటి! -
తెలుగు రాష్ట్రాల్లో అలర్జీ పరీక్ష కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: అన్ని రకాల అలర్జీలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జెరాత్ పాథ్ ల్యాబ్స్, అలర్జీ టెస్టింగ్ సెంటర్ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 80 నుంచి 130 అలర్జీలకు సంబంధించిన పరీక్షలను 50 శాతానికి పైగా రాయితీతో చేయనున్నట్లు పేర్కొంది. జూలై 2, 3, 4, 5వ తేదీల్లో ఈ కేంద్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. అలర్జీ పరీక్షలతో పాటు థైరాయిడ్, కిడ్నీ, లివర్, కీళ్లు, లిపిడ్, ఎలక్ట్రోలైట్స్ వంటి 40 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది. -
ఫైజర్ టీకాతో అలర్జీ
అలాస్కా/వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్–19ను నిరోధించే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో అలర్జీ లక్షణాలు కనిపించాయి. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో కూడా ఫైజర్ వ్యాక్సిన్‌తో అలర్జీకి సంబంధించిన రెండు కేసులు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని అలాస్కాలోనూ టీకా డోసు తీసుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు అనారోగ్యానికి గురి కావడంపై ఆందోళన నెలకొంది. అమెరికాలో అలర్జీ లక్షణాలు కనిపించిన ఆరోగ్య కార్యకర్తలకు గతం లో ఎప్పుడూ అలర్జీ రాలేదు. ఫైజర్ టీకా డోసు తీసుకున్న వెంటనే వారిలో కొన్ని నిమిషాల పాటు శ్వాస తీసుకోవడంలో ఇ బ్బందులు, కళ్ల కింద వాపు, తలనొప్పి, గొం తు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికన్లలో ఫైజర్ వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చని భరోసా ఇచ్చింది. నేడు పైన్స్కు.. వచ్చేవారంలో బైడెన్‌కు వ్యాక్సిన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నేడు వ్యాక్సిన్ తీసుకోనున్నారు. వచ్చే వారంలో బైడెన్ కూడా టీకా తీసుకుంటారని ఆరోగ్య శాఖ అధికారు లు వెల్లడించారు. అందరి ఎదుట వ్యాక్సిన్ తీసుకుంటానని బైడెన్ చెప్పిన సంగతి తెలిసిందే. -
అలర్జీ ఉంటే వ్యాక్సిన్ వద్దు
లండన్: కరోనాను తరిమికొట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. ఫైజర్– బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న నేషనల్ హెల్త్ సర్వీసుకి చెందిన ఇద్దరు వర్కర్లు తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఒక్క రోజులోనే వారికి ఒళ్లంతా దద్దుర్లు, రక్తప్రసరణలో తేడాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో యూకే డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది. ఏదైనా మందులకుగానీ, ఆహార పదార్థాలకు గానీ అలర్జీ వచ్చే వాళ్లు ఎవరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి రావద్దని హెచ్చరించింది. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వచ్చిన వారి మెడికల్ హిస్టరీని పరిశీలించాలని ఆదేశించింది. ఎవరికైనా అలర్జీలు ఉన్నాయని తేలితే వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్లు రావడం సర్వసాధారణమే. ఎందుౖనా మంచిదని వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చే వారి మెడికల్ హిస్టరీ చూడాలని చెప్పాము. ప్రస్తుతం ఆ హెల్త్ వర్కర్లు ఇద్దరూ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం బాగుంది’’ అని అధికారులు చెప్పారు. -
ఇదో చిత్రమైన అలర్జీ
మీకు తెలుసా? కొందరిలో కొన్ని పదార్థాలతో వచ్చే అలర్జీలు మనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఇందుకు ఓ ఉదాహరణ అరటి, కీవీ పండ్ల వల్ల వచ్చే అలర్జీ. మనకు చిత్రంగా అనిపించినా ఇది వాస్తవం. సాధారణంగా కొందరిలో రబ్బర్ ఉత్పాదనలనుంచి అలర్జీ వస్తుంటుంది. ఉదాహరణకు చేతికి వేసుకునే రబ్బర్ గ్లౌవ్స్, షూస్, మాస్కులు, స్లిప్పర్ల వంటి ఎన్నెన్నో వస్తువులతో ఈ తరహా అలర్జీ కనిపిస్తుంది. దీని కారణంగా చర్మం ఎర్రబారడం, మేనిపై చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్ రావడం మొదలుకొని, అవి చాలా తీవ్రంగానూ చర్మంపై పగుళ్ల రూపంలో కనిపించేలా ఈ అలర్జిక్ రియాక్షన్ తీవ్రత ఉంటుంది. మరికొందరిలో రబ్బర్‌తో వచ్చే అలర్జీ రియాక్షన్ కనిపించగానే చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం జరుగుతుంది. ఈ రియాక్షన్‌ను అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్ రబ్బర్ హ్యాండ్’ లేదా ‘బ్లాక్ రబ్బర్ ఫీట్’ అని అంటుంటారు. ఇలా రబ్బర్‌తో అలర్జీ ఉన్న కొంతమందిలో కాస్తంత అరుదుగానైనా అరటి, కీవీ పండ్ల వల్ల కూడా అలర్జీ కనిపించవచ్చు. అరటి, కివీ పండ్ల చెట్లు కూడా ఇంచుమించుగా రబ్బర్ మొక్క కుటుంబానికి చాలా దగ్గరి జాతివి కావడమే ఇందుకు కారణం. ఇలా అటు రబ్బర్కూ... ఇటు ఈ అరటి, కీవీ పండ్లకూ అలర్జీ కలిగి ఉండటాన్ని ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అని వ్యవహరిస్తారు. కేవలం ఆ కుటుంబానికి చెందిన పండ్లకు మాత్రమే కాకుండా... మరికొందరికి అవకాడో, చెస్ట్నట్, పీచ్, టొమాటో, ఆలూ, బెల్‌పెప్పర్, మామిడి, స్ట్రాబెర్రీ వంటి పండ్లూ కూరగాయలతో కూడా అలర్జీ వస్తుంటుంది. వీటిల్లో లాటెక్స్ పాళ్లు లేనప్పటికీ కనిపించే ఈ రుగ్మతను కూడా ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అనే వ్యవహరిస్తారు. ఆయా పదార్థాలు వారికి సరిపడకపోవడమే ఇందుకు కారణం. -
వాతావరణంలో మార్పులతో... వెంటనే తుమ్ములు, జలుబు
మా పాప వయసు 12 ఏళ్లు. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే చాలు... అదేపనిగా తుమ్ములు, జలుబు, ముక్కుదిబ్బడతో బాధపడుతూ ఉంటుంది. స్కూల్‌కు కూడా పోవడం లేదు. మా పాప సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? అలర్జీ గురించి మనం సాధారణంగా రోజూ వింటూ ఉంటాం. అలర్జీ అనేది రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన ఒక రుగ్మత. వర్షాకాలం తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే అది పలు రకాల వ్యాధులతో బాధపెట్టవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షాకాలంలో అలర్జీ సమస్య చాలామందిని వేధిస్తూనే ఉంటుంది. తుమ్ములూ, దగ్గులు మాత్రమే కాదు... ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ జలుబు, దగ్గు రావడం సహజంగా వైరల్ జ్వరాలకు దారితీస్తుంది. వర్షాకాలంలో ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ వంటి వ్యాధులను ఎక్కువగా చూస్తుంటాం. అలాగే మన ఆధునిక జీవితం, పారిశ్రామిక ప్రాంతాలు, పెద్ద పెద్ద నగరాలూ, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం కూడా ఈ అలర్జీకి ఒక పెద్ద కారణం. అలర్జీతో ఇబ్బందులు పడేవారి బాధ వర్ణనాతీతం. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ అలర్జీతో బాధపడుతుంటారు. అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. అలర్జీతో బాధపడేవారిలో వారు ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు లేదా దాన్ని తీసుకున్నప్పుడు మన రక్తంలో ఉండే ఒక రకమైన యాంటీబాడీస్‌తో ఈ అలర్జెన్స్ కలవడం వల్ల హిస్టమిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దీని కారణంగానే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి తాలూకు తత్వం, వాతావరణం, వంశపారంపర్య చరిత్రతో పాటు గాలి, నీరు, ఆహారంలో మార్పులు, కాలుష్యాల వల్ల రక్తంలో జరిగే మార్పులతో ఈ లక్షణాలు బయటపడతాయి. అం్ట కొన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఈ అలర్జీకి కారణమవుతాయన్నమాట. కారణాలు : ►దుమ్ము, ►పుప్పొడి రేణువులు ►పెంపుడు జంతువుల వెంట్రుకలు ►ఘాటైన వాసనలు ►చల్లటిగాలి ►శీతలపానియాలు ఐస్‌క్రీమ్‌లు ►మస్కిటో రిపల్లెంట్స్ వాతావరణంలో మార్పులు లక్షణాలు : ►తుమ్ములు ►ఆయాసం ►శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు / ఉబ్బసం ►వాంతులు ►ముక్కుకారడం ►ఒంటిపై దద్దుర్లు ►కళ్లు దురదలు పెట్టడం. వ్యాధి నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, ఇజినోఫిల్ కౌంట్, ఐజీ–ఈ యాంటీబాడీస్, ఎక్స్‌రే, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్, సీటీ స్కాన్, అలర్జిక్ ప్రొఫైల్... మొదలైనవి. చికిత్స : హోమియోలో అలర్జీ నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వాటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లటి మచ్చలు... తగ్గేదెలా? నా వయసు 42 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏ ప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ►ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పుట్టినరోజు నాడే ప్రాణం తీసిన వెన్న
లండన్: ఒవెన్ కారీ అనే యువకుడు తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కోసం లండన్ థేమ్స్ నది ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకల నిమిత్తం నది పక్కనే ఉన్న బైరన్ చైన్ అనే రెస్టారెంట్‌కు వెళ్లాడు. కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భోజనం ఆర్డర్ చేశాడు. అయితే ఒవెన్‌కు డెయిరీ ఎలర్జీ(పాల సంబంధిత ఉత్పత్తులు పడకపోవడం) ఉంది. చికెన్ బ్రెస్ట్ ఆర్డర్ చేసిన ఒవెన్ ఎందుకైనా మంచిదని తనకున్న డెయిరీ ఎలర్జీ గురించి హోటల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆహారం రావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ భోజనం చేశాడు. ఆహారం స్వీకరించిన కాసేటికే ఒవెన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ముందు అతని పెదవులు ఒంకర్లు పోవడం.. కడుపులో మంట.. ఆ తర్వాత ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ఒవెన్ మరణించాడు. ఈ సంఘటన 2017లో జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఒవెన్ మృతికి గల కారణం మాత్రం తెలియలేదు. ఈ నేపథ్యంలో సౌత్వార్స్ కరోనర్స్ కోర్టు తాజాగా ఒవెన్ మృతికి గల కారణాల్ని వెల్లడించింది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ వల్లే ఒవెన్ మరణించినట్లు కోర్టు ప్రకటించింది. పుట్టిన రోజునాడు ఒవెన్, బైరన్ చైన్ రెస్టారెంట్లో ఆహారం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు డెయిరీ ఎలర్జీ ఉందని ఒవెన్ హోటల్ సిబ్బందికి తెలిపాడు. కానీ వారు ఆ విషయాన్ని మర్చిపోయి.. ఒవెన్ ఆర్డర్ చేసిన చికెన్ బ్రెస్ట్ పీస్‌ను వెన్నతో కలిపి ఉడికించారు. సదరు పదార్థంలో వెన్న ఉందనే విషయాన్ని తెలిపారు కానీ.. దాన్ని చాలా సూక్ష్మంగా ముద్రించడంతో ఆ విషయం ఒవెన్ దృష్టికి రాలేదు. దాంతో అతడు ఆ ఆహారాన్ని స్వీకరించడం.. మరణించడం క్షణాల్లో జరిగిపోయాయి. ఒవెన్ మరణం అతడి కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చినప్పటికి.. ఓ కొత్త చట్టం రావడానికి మాత్రం దోహదపడింది. ఒవెన్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఇక మీదట రెస్టారెంట్లలో ప్రతి ఆహారం మీద ఎలర్జీ లేబుల్స్‌ను ఉంచాలని ఆదేశించింది. ప్రతి వంటకం మీద.. దానిలో వాడిన పదార్థాల వివవరాలతో పాటు కలిగే ఎలర్జీల గురించి ఖచ్చితంగా పేర్కొనాలని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు తీసుకునే ఈ చిన్న చిన్న చర్యల వల్ల నిండు ప్రాణాన్ని కాపాడగల్గుతామని కోర్టు స్పష్టం చేసింది. -
హెయిర్–డై వాడుతున్నారా?
నా వయసు 34 ఏళ్లు. నా జుట్టు ఇప్పుడిప్పుడే తెల్లబడుతోంది. అయితే ఇప్పటివరకు నేను జుట్టుకు రంగు వేయలేదు. ఇకపై హెయిర్–డై వాడదామని అనుకుంటున్నాను. దాని విషయంలో నా ఎంపిక ఎలా ఉండాలి? హెయిర్–డైతో ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దయచేసి నాకు హెయిర్–డై వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విపులంగా చెప్పండి. చాలామంది హెయిర్–డై లను చాలారకాల ప్రయోజనాల కోసం వాడుతుంటారు. హెయిర్–డై విషయంలో మీ ఎంపిక అన్నది అసలు మీరు హెయిర్ డైని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అంటే... కొందరు జుట్టు తెల్లబడ్డందున దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటారు. అయితే మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్‌గా గ్రూమ్ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. ఉదాహరణకు కొందరు జుట్టు చివర్లు ఎర్రగా మార్చుకునేందుకు, మరికొందరు కొన్ని పాయలు ఎట్రాక్టివ్‌గా కనిపించేందుకు రకరకాల షేడ్స్‌లో హెయిర్–డైని వాడుతుంటారు. మీరు ఏ ప్రయోజనం కోసం హెయిర్–డై వాడుతున్నప్పటికీ మీ బడ్జెట్లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడం మంచిది. హెయిర్ డైతో వచ్చే సాధారణ ప్రమాదాలివే... ►హెయిర్ డైలో ఉండే రసాయనాలలో కొన్ని కెమికల్స్ మీకు, మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దాని వల్ల కొందరిలో అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం మీద వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగితే వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్/డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి ►కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే రసాయనాలు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం వంటి ఇబ్బందులు కలగజేస్తాయి. ఇవి కొందరిలో శ్వాస తీసుకోవడంలోనూ తీవ్రమైన అవరోధాలకు దారితీస్తాయి. ఒక్కోసారి ఆస్తమాకూ దారితీయవచ్చు. చాలాసార్లు సురక్షితంగా వాడిన రసాయానాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా మీకు ప్రమాదకరంగా, అలర్జిక్‌గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి ►అయితే మొదటిసారి హెయిర్–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఒకవేళ నిర్దిష్టంగా ఆ బ్రాండ్ హెయిర్–డైతో మీకు ఏవైనా అలర్జిక్ లక్షణాలు కనిపిస్తుంటే దానికి దూరంగా ఉండటం మేలు. హెయిర్–డై వేసుకునే పద్ధతి ఇలా... ►ఒక గిన్నెలో మీరు వేసుకోబోయే హెయిర్–డైని కలుపుకుని సిద్ధం చేసుకోండి. దాన్ని మీకు అనువైన బ్రష్‌తో హెయిర్ డైలో ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్‌డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఆ రసాయనాలు ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెయిర్–డై వేసుకునే సమయంలో కంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ►హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. ఒక రసాయన చర్య జరిపి జుట్టును నల్లబారుస్తాయి. ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్‌గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది ►కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ, కాలీ మెహందీలోనూ పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. బ్లాక్ హెన్నా కూడా అంత సురక్షితం కాదు. వీటిలో ఉండే రసాయనాల వల్లనే రియాక్షన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఒకింత సురక్షితమైన మెడికేటెడ్ హెయిర్ డైస్ దొరుకుతున్నాయి. మీ డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వాటిని మీరు సురక్షితంగా వాడుకోవచ్చు ►కొంతమంది హెయిర్ డై ప్యాక్‌మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... ►మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? అయితే మొదటిసారి మీరే ఇంటి దగ్గర వేసుకోకండి. ఒకటి రెండుసార్లు మంచి పార్లర్లో ప్రొఫెషనల్స్ సహాయంతో రంగు వేసుకోండి. వారెలా వేస్తున్నారో గమనించి, ఆ తర్వాత మీరు ఆ టెక్నిక్స్‌ను అనుసరించండి ►తొలిసారి రంగు వేసుకునే వారు నేరుగా దాన్ని తలకు పట్టించుకోవడానికి బదులు ముందుగా చెవి వెనక ఉండే ఒక పాయకు రంగు వేసి, కాసేపు ఉంచి, దాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత 48 గంటల పాటు పరిశీలించి చూసుకోవాలి. ఆ సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలూ (సైడ్ ఎఫెక్ట్స్) కనిపించపోతే... ఇక ఆ రంగును నిరభ్యంతరంగా వాడవచ్చు. ఒకవేళ ఏదైనా సైడ్ఎఫెక్ట్ కనిపిస్తే ఆ బ్రాండ్‌ను వదిలేసి, మరో బ్రాండ్ ఎంచుకోండి ►మీకు సురక్షితమని తేలిన బ్రాండ్‌నే ఎప్పుడూ కొనసాగించండి. కొత్త బ్రాండ్ వాడదలచుకున్నప్పుడు మళ్లీ చెవి వెనక ఉన్న వెంట్రుకలలో ఒక పాయకు రంగు వేసి మళ్లీ మరో 48 గంటలు వేచిచూసి, సురక్షితమని తేలాకే బ్రాండ్ మార్చండి ►మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాల చర్మంపైన ముందుగా పెట్రోలియం జెల్లీని పూయండి ►రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్‌ను చుట్టండి ►రంగును ఒకే తరహాలో (యూనీఫామ్గా) అంటేలా బ్రష్‌ను ఉపయోగించండి. అంతే తప్ప ఒక్కచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది ►రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి ►వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి ►మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి ►రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి ►రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి ►హెయిర్‌డై కేవలం తలకు మాత్రమే వాడండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు ►మీరు కొన్ని బ్రాండ్‌లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి ►ఒకవేళ మహిళలు గర్భం ధరించి ఉంటే... తాము గర్భవతిగా ఉన్న సమయంలో హెయిర్‌డై ఉపయోగించకపోవడమే మంచిది ►హెయిర్‌డై వల్ల యౌవనంగా కనిపిస్తాం. అలా కనిపించడం మనందరం కోరుకునేదే. అయితే ఆ చర్య వల్ల మనకు హాని జరగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. రంగు వేసుకునే సమయంలో మీ గోళ్లు జాగ్రత్త... జుట్టుకు రంగు వేసుకునే సమయంలో మీరు సరైన జాగ్రత్త తీసుకోకపోతే... హెయిర్ డై గోళ్లకు అంటుకునే ప్రమాదం ఉంది. అది ఏ మాత్రం గోరుకు అంటుకున్నా పర్మనెంట్‌గా ఉండిపోతుంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గోరు పెరుగుతున్న కొద్దీ, పెరిగిన గోరును మనం కట్ చేసుకున్న కొద్దీ మూడు నెలల్లో గోరు రంగు పూర్తిగా తొలగిపోతుంది. మన గోరూ, జుట్టూ ఈ రెండూ కూడా కెరొటిన్ అనే పదార్థంతో తయారవుతాయి. కాబట్టి జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ ఉంటుంది. కింది నుంచి పెరుగుతున్న కొద్దీ ఆ ఫ్రెష్ గోరుగానీ, జుట్టుగానీ తెల్లగా వస్తుంది. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
సల్వార్ కట్టే చోట నల్లటి మచ్చ...
డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 15 ఏళ్లు. నేను లెహంగా కానీ, సెల్వార్ గానీ కట్టుకున్నప్పుడు నా నడుము వద్ద నల్లగా మచ్చలాగా పడుతోంది. ఇలా నల్లమచ్చ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి. – సుష్మా, హైదరాబాద్ మీరు చెబుతున్న సమస్య అమ్మాయిల్లో చాలా సాధారణంగా కనిపించేదే. నడుము దగ్గర కాస్త బిగుతుగా కట్టుకున్నప్పుడు ఇలా ఏర్పడటం సహజం. నడుము దగ్గరి నాడా బిగుతుగా ఉండటంతో అక్కడ ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడ్డచోట రక్తప్రవాహం తగ్గుతుంది. దాంతో అక్కడ డార్క్ రంగును ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే... ∙నాడాను మరీ బిగుతుగా కట్టుకోకుండా, కాస్త వదులుగా కట్టుకోండి ∙నాడా కట్టే ప్రాంతంలో కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీమ్ రాసుకోండి ∙బిగుతుగా కట్టుకునే నాడాలకు బదులు, శరీరాన్ని అంటిపెట్టుకునేలా సాఫ్ట్ ఎలాస్టిక్‌తో ఉండే దుస్తులు వాడండి ∙అప్పటికీ పిగ్మెంటేషన్ తగ్గకపోతే మీకు సమీపంలోని డర్మటాలజిస్ట్‌ను కలిసి గ్లైకోలిక్, ఫీనాల్ పీలింగ్ చికిత్సను ఒక కోర్స్లాగా తీసుకోవాల్సి ఉంటుంది. హెల్మెట్ బయటి జుట్టు చివర్లు చిట్లుతున్నాయి...! నా వయసు 26 ఏళ్లు. నేను వర్క్‌ప్లేస్‌కు బైక్‌పై వెళ్తుంటాను. నా మీడియమ్ లెంత్ హెయిర్‌లోని హెల్మెట్‌కు బయట ఉండే జుట్టు దుమ్ముకూ, ఎండకూ ఎక్స్పోజ్ అవుతోంది. దాంతో ఆ భాగం జుట్టులోని చివర్లు చిట్లుతున్నాయి. దాంతో జుట్టు అసహ్యంగా కనిపిస్తోంది. తగిన పరిష్కారం చెప్పండి. – కె. శివానీ, విశాఖపట్నం మీరు చెప్పినట్లుగా వెంట్రుకల చివర్లు చిట్లడానికి మూడు అంశాలు సంయుక్తంగా ప్రభావం చూపుతాయి. అవి... దుమ్ము, కాలుష్యం, ఎండ. ఈ అంశాల దుష్ప్రభావం జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. మీ సమస్య తగ్గడానికి కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. ∙టూవీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జుట్టు మొత్తం కాలుష్యం, ఎండ, దుమ్ము బారిన పడకుండా, వెంట్రుకలను కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోండి. ∙రోజు విడిచి రోజు తల స్నానం చేయండి. తలస్నానం చేయడానికి మైల్డ్ షాంపూ మాత్రమే ఉపయోగించండి ∙తలస్నానం తర్వాత మీ జుట్టు పూర్తిగా ఆరకముందే ఈ కింద పేర్కొన పదార్థాలు ఉండే ‘హెయిర్ సీరమ్’ రాయండి. అవి... ∙డైమిథికోన్ ∙ట్రైజిలోగ్జేన్ ∙విటమిన్ ఈ ఎసిటేట్ ∙అహోబా ఆయిల్ ∙ఆలివ్ ఆయిల్ ∙ఆల్మండ్ ఆయిల్. పైన పేర్కొన్న సీరమ్ మీ వెంట్రుకలకు దుమ్ము, అల్ట్రావయొలెట్ కిరణాలు, కాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది. కాలి వేళ్ల మధ్య ఎర్రబారుతోంది... నా వయసు 54 ఏళ్లు. గృహిణిని. మా ఇంట్లో మా ప్లేట్లు నేనే శుభ్రం చేస్తేగానీ లేదా మా బట్టలు నేనే ఉతుక్కుంటేగానీ నాకు సంతృప్తి ఉండదు. అందుకే ఆ పనులన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను. దాంతో తడిలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. దాంతో నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నాకు తగిన పరిష్కారం చెప్పండి. – అనసూర్య, కోదాడ మీరు చెబుతున్న సమస్య చాలా సాధారణం. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రధానంగా సబ్బు నీళ్లలో కాళ్లు తడుస్తుండేవారిలో ఇది మరీ ఎక్కువ. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి. అలర్జిక్ ర్యాష్ వచ్చిన చోట డార్క్ మార్క్స్... నాకు కుడి చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తుంటే విపరీతంగా గీరాను. దాంతో అక్కడ డార్క్ మార్క్స్ ఏర్పడ్డాయి. నా చర్మం మీద అవి అసహ్యంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. పారిజాత, ఒంగోలు మీరు ‘పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్’తో బాధపడుతున్నారని తెలుస్తోంది. అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు వాడుతూ మీరు ఈ కింది సూచనలనూ పాటించండి ∙సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేయండి. ∙ఆ ప్రాంతంలో ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రాయండి. ∙కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీములు రాయండి. ∙ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజాపండ్లు ప్రతిరోజూ తీసుకోండి. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ, చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
అలర్జీతో ఆయాసం... వ్యాయామం చేయడం ఎలా?
పల్మునాలజీ కౌన్సెలింగ్ పీరియడ్స్ సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదెందుకు? నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు పీరియడ్స్ సమయంలో సరిగా శ్వాస అందడం లేదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? – ఎమ్. కవిత, విశాఖపట్నం రుతుక్రమం వచ్చే సమయం మహిళల్లో ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మహిళల భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. దాంతో కొన్నిసార్లు అటు శరీరక, ఇటు మానసిక సమస్యలు కనిపించవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమాగా చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 33. నాకు డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ము అంటే సరిపడదు. దాంతో ఇటీవల నేను వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయాలనుకున్నా ఇది నాకు ప్రతిబంధకంగా ఉంటోంది. దయచేసి నేను వ్యాయామం చేయడానికి అవసరమైన సలహా ఇవ్వగలరు. – ఎమ్డీ గియాసుద్దిన్, కర్నూలు వ్యాయామం ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడుతుంది, అదే సమయంలో ఆ గాలికి తేమ సమకూరుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) వచ్చినప్పుడు అప్పటికి ఆపేసినా... వ్యాయామాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే వ్యాయామానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. అసలు సిగరెట్ మానడానికి ఈ–సిగరెట్ మంచిదేనా? నా వయసు 46. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. ఎలక్ట్రానిక్ సిగరెట్ (ఈ–సిగరెట్)ను ప్రయత్నించమని స్నేహితులు చెబుతున్నారు. ఈ–సిగరెట్ వాడడం సురక్షితమేనా? – ఆర్. గౌతమ్, హైదరాబాద్ ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ–సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాటరిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ–సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ–సిగరెట్లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. ఈ–సిగరెట్లో సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ–సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ–సిగరెట్లో కాటరిడ్జ్లో డీ–ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ–సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ–సిగరెట్ పొగ అయినా సరే... బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ–సిగరెట్ సురక్షితమేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ–సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్‌తో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ–సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ–సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ–సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడమే మార్గం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల సంఖ్య చాలా ఎక్కువ. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
రుచిగా లేదనుకుంటే నష్టపోతాం
పాపం... దొండకాయను కాకి ముక్కుతో జత చేసేప్పుడు మనమిచ్చే ప్రాధాన్యం.. దాన్ని కూరగా పరిగణించినప్పుడు అంతగా ఇవ్వం. కానీ కాకి విషయంలో దాని అందం ఎంతో... తిండి విషయంలో దాంతో వచ్చే ఆరోగ్యమూ అంతే అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అంతగా రుచించదంటూ దొండను ముట్టకపోతే మనమే అజ్ఞానకాకులం అవుతామంటున్నారు కాకలు దీరిన ఆహారనిపుణులు. దొండకాయతో మనకు సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. దొండకాయ ఒంట్లో విడుదలయ్యే చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే ఇది డయాబెటిస్ రోగులకు మంచిది. క్రమం తప్పకుండా దొండకాయ తినేవారిలో చక్కెర పాళ్లు నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. కొవ్వుగా మారే ప్రీ–అడిపోసైట్స్ అనే కణాలను దొండకాయ సమర్థంగా నివారిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దొండలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత (అనీమియా) తగ్గుతుంది. ఐరన్ లేమి వల్ల వచ్చే నిస్సత్తువ కూడా మాయమవుతుంది.దొండ వల్ల కేంద్ర నాడీమండలం బలం పుంజుకుంటుంది. మెదడుకూ మంచిది. ఇది మూర్ఛ (ఎపిలెప్సీ), అలై్జమర్స్ వంటి వాటిని చాలావరకు నివారిస్తుంది. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే మణికట్టు నొప్పి కలిగించే జబ్బుకు దొండకాయ స్వాభావికమైన చికిత్సగా చాలామంది వైద్యులు పరిగణిస్తుంటారు. దొండలో ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి దొండకాయలోని ఈ పీచుపదార్థం బాగా తోడ్పడుతుంది. దొండకాయ మూత్రపిండాల్లో రాళ్లను సమర్థంగా నివారిస్తుంది. దొండకాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి. అందుకే దొండకాయ తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దొండకాయలో సాపోనిన్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల అది ఎన్నో రకాల అలర్జీలను నివారిస్తుంది. దొండలో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల అది చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దొండలోని పోషకాల వల్ల మన కండరాలు, టెండన్లు, లిగమెంట్లు బలంగా తయారవుతాయి. కండరాలు బలపడటానికి, కదలికలు చురుగ్గా ఉండటానికి దొండ బాగా తోడ్పడుతుంది. దొండలోని యాస్కార్బిక్ యాసిడ్ పాళ్ల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది. మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి, మంట, ఎర్రబారడం) ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది. దొండలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీ ఉన్నవారికి దొండ చాలా మంచిది. హైబీపీని నియంత్రణలో ఉంచడం ద్వారా అది గుండెజబ్బులనూ అరికడుతుంది. చాలా కూరగాయలలాగే దొండకాయలోనూ నీటి పాళ్లు ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది. -
ఉంగరం ఉన్న చోట్ల నల్లబడుతోంది.. ఏం చేయాలి?
డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను ఉంగరం పెట్టుకునే చోట వేలు నల్లబడుతోంది. మంటగా ఉండటంతో పాటు వేలిపై దురద వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – నవీన, సామర్లకోట మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటూ ఉండవచ్చు. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్ ఆనుకొని ఉండేచోట అలర్జీ వస్తోంది. ఇతర లోహాల మిశ్రమాల (అల్లాయ్స్)తో చేసే ఆభరణాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోండి. ∙మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. ∙మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. ∙ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, మీరు అలా కూడా మార్చి చూడవచ్చు. ∙చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. అప్పటికీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. జుట్టు విపరీతంగా రాలుతోంది... పరిష్కారం చెప్పండి నా వయసు 22 ఏళ్లు. నాకు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ కూడా క్రమంగా వెనక్కుపోతూ మాడు కనిపిస్తోంది. నేను అనిమిక్‌గా ఉంటాను. హిమోగ్లోబిన్ కూడా తక్కువే. కేవలం 10 శాతం మాత్రమే. దయచేసి నా జుట్టు రాలిపోకుండా ఉండటానికి తగిన సలహా ఇవ్వండి. – సుష్మా, ఖమ్మం జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో పోషకాహార లోపం చాలా ప్రధానమైనది. పైగా మీ విషయంలో మీలో హిమోగ్లోబిన్ కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. మీ రక్తహీతన కారణంగానే జుట్టు రాలిపోతూ ఉండవచ్చు. మీ వయసులో అంటే ఇరవైలలో ఉండే యువతలో ఇది చాలా సాధారణమైన విషయం. బహుశా మీ ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. ఇవన్నీ కలిసి మీలో జుట్టు రాలడం ఎక్కువయ్యేందుకు దోహదపడుతూ ఉండవచ్చు. మీరు ఈ కింది సూచనలు పాటించండి. 1) మీలో రక్తహీనతను తగ్గించుకోండి. మీ హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 14 శాతానికి పెరగాలి. ఇందుకోసం ఫెర్రస్ సల్ఫేట్ 50 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున, విటమిన్–సి 500 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల పాటు వాడండి. 2) ఇక మీ జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం డాక్టర్ సలహా మేరకు బయోటిన్ 10 ఎంజీ, సాపాల్మెథో లేదా ఇతర అమైనో యాసిడ్లను రోజుకు ఒకసారి చొప్పున భోజనం తర్వాత మూడు నెలల పాటు తీసుకోండి. 3) మీ జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మీరు రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి. 4) పై సూచనలన్నీ పాటించాక కూడా మీ జుట్టు రాలడం తగ్గకపోతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స, మీసోథెరపీ వంటి ప్రక్రియల ద్వారా మీ జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. నుదుటి చర్మం మందంగా మారుతోంది... ఎందుకు? నా వయసు 50 ఏళ్లు. నా ఒంటి రంగు గోధుమ వర్ణంలో ఉంటుంది. అయితే గత ఏడాది కాలం నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ప్రధానంగా చర్మం మడతలు పడ్డ చోట ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – కె. కృష్ణమూర్తి, నిజామాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నారు. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ–ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. రక్తంలోని సీరమ్ ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల దీన్ని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అలా ఇది రక్త పరీక్షలో బయటపడుతుంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా జరుగుతుంది. ∙బరువు తగ్గించుకోవడం ∙జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ∙మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... – ఆర్బుటిన్ – లికోరైస్ – కోజిక్ యాసిడ్ ∙పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి ∙యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్సూ్యల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ –500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ఇతర ప్రక్రియలు: ∙ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 – 6 సెషన్ల పాటు చేయించుకోవాలి ’ లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఉల్లి, టమాటాలతో అలర్జీ తుమ్ములు దూరం!
మీకు దుమ్ము వల్ల అలర్జీయా? దుప్పట్లు దుపలగానే తుమ్ములు మొదలవుతాయా? మీరు ఓ చిన్న చిట్కా పాటించండి. ఇకపై గోధుమలు, అరటిపండ్లు, ఉల్లి, బార్లీ, చికోరీ, టమాటా, చిలగడదుంప వంటివి కాస్త ఎక్కువగా తినండి. అలర్జీలు దూరమవుతాయంటున్నారు జపాన్‌లోని పరిశోధకులు. కొన్ని ఎలుకలపై పరిశోధనల్లో ఈ విషయం తేలింది. వారు తొలుత ఎలుకలకు డస్ట్‌మైట్స్‌తో అలర్జీ కలిగించారు. ఇక వాటికి ‘ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్’ ఎక్కువగా ఉండే ఆహారం ఇస్తూ వచ్చారు. తీరా పరిశీలిస్తే... మామూలు ఆహారంపై ఉన్న ఎలుకలతో పోలిస్తే ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్ ఉండే ఆహారం తిన్నవి చాలా ఆరోగ్యంగా ఉండి, అలర్జీలను సమర్థంగా ఎదుర్కొన్నాయి. అందుకే అలర్జీలను అరికట్టడానికి ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్ ఉండే గోధుమ, అరటి, ఉల్లి, వెల్లుల్లి వంటివి మంచివంటున్నారు పరిశోధకులు. మీరూ కాస్త ట్రై చేస్తారా? -
ఎక్కువగా వాడితే వేపేస్తుంది
పరిపరిశోధన చిన్నప్పటినుంచి మనం చదువుకున్న దాని ప్రకారం వేపతో మనకెంతో మేలు కలుగుతుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వేప మేలే కాదు, కీడు కూడా చేస్తుంది. ముఖ్యంగా వేపనూనెను చంటిపిల్లలకు ఉపయోగిస్తే వారిలో రియేస్ సిండ్రోమ్ తలెత్తి అది వారి ప్రాణాలకే ముప్పు కలిగిస్తుందట. అలాగే అలెర్జీ తీవ్రస్థాయిలో ఉంటే చాలామంది వేపాకును నూరి అదేపనిగా పట్టిస్తారు. దానివల్ల మరింత తీవ్రరూపం దాల్చి సమస్య జటిలం అవుతుందంటున్నారు పరిశోధకులు. చాలామంది ఉదయం లేవగానే వేపాకును నూరి ముద్దగా చేసుకుని మింగేస్తే రోగాలు తగ్గిపోతాయనుకుంటారు. కాని ఇది నిర్ణీత మోతాదులో సేవిస్తేనే మంచి ఫలితం వస్తుంది. లేదంటే కడుపు గడబిడతో అల్లకల్లోలం అవుతుంది. బ్లడ్సుగర్తో బాధపడేవారికి, అలాగే శరీరావయవాలను మార్పిడి చేయించుకునేవారికి వేపనూనెను ఇస్తుంటారు వైద్యులు. అలా చేయడం చాలా అపాయకరమని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కాబట్టి వేపాకే కదా అని ఇష్టం వచ్చినట్లు వాడితే ప్రాణాలను వేపేస్తుంది మరి! -
అలర్జిక్ రైనైటిస్... వాతావరణంతో పెద్ద రణం!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. చాలాకాలంగా దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది, వెంటనే తుమ్ములు వస్తున్నాయి. కాస్త చల్లగా ఉన్నప్పుడు ఆ వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ముక్కు బిగుసుకుపోతోంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? – సంజీవ్, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు అలర్జిక్ రైనైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి అంశాలు ఈ సమస్యను మరింత దుర్భరం చేస్తాయి. అలర్జిక్ రైనైటిస్ ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మనకు సరిపడని పదార్థాలు ఒంట్లోకి ప్రవేశంచగానే ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్నే అలర్జిక్ రైనైటిస్ అంటారు. కారణాలు : ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది. ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స : హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్