bangaru thalli scheme
-
మా ఇంటి మహాలక్ష్మికి మంగళం
గుంటూరు, గురజాలరూరల్: బంగారు తల్లి పథకానికి కష్టాలు తప్పడం లేదు. ఆడపిల్ల పుట్టిన ప్రతి తల్లికి ఈ ప«థకం వర్తించేలా 2013 మే 1న అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెడితే... 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పథకాన్ని మా ఇంటికి రా మహాలక్ష్మిగా పేరు మార్చారు. పేరేదయితేనేం లబ్ధిదారులకు మేలు చేకూర్చితే చాలని ప్రజలు అనుకున్నారు. అయితే ఈ నాలుగేళ్లుగా ఆ పథకం ఊసే లేకుండా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడిచింది. పథకం ఉద్దేశం మహిళలపై లింగవివక్షకు వ్యతిరేకంగా బాల్య వివాహాలు, కట్నం, హింస వంటి సాంఘిక దురాచారాలు, బాలిక కుటుంబానికి భారం అనే ఒక భావన వ్యాపించింది. ఆడపిల్లలు పదవ తరగతి చదివిన తర్వాత పై చదువులు కొనసాగించేందుకు వారి తల్లిదండ్రులు సంసిద్ధులుగా లేరు. దీంతో అప్పటి ప్రభుత్వం వారి విద్య, వివాహంలో తోడుగా ఉండేందుకు బంగారుతల్లి పథకాన్ని ప్రారంభించింది. పథకంతో ఉపయోగాలు బంగారుతల్లి పథకం కింద ఆడపిల్ల జననం నాటి నుంచి డిగ్రీ చదువు వరకు ప్రభుత్వం ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని అందిస్తుంది. పథకం పూర్తయ్యే దశకు రూ.2,16,000 అందించాల్పి ఉంది. ççఈ పథకం రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డులందరికీ వర్తిస్తుంది. పేరు మార్పుతో సరి ప్రభుత్వం మాత్రం పథకానికి మా ఇంటి మహాలక్ష్మిగా పేరు మార్చింది. చంద్రబాబు మహాలక్ష్మికే మంగళం పాడేశారు. జిల్లాలో 19,140 మంది లబ్ధిదారులను రిజిస్టర్ చేయగా 19,140 మంది పథకానికి ఎంపికయ్యారు. వీరిలో 8,234 మందికి మొదటి విడతగా రూ.2,05,85,000 నగదు లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమైంది. గురజాల మండలంలో 418మంది రిజిస్టర్ చేసుకోగా వీరిలో176 మందికి రూ.4,40,000 వారి ఖాతాల్లో జమైంది. పథకం ప్రారంభంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యతగా, ఒక ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రెండో ప్రాధాన్యతగా కల్పించారు. చివరి బడ్జెట్లో కూడా మొండిచేయే! బంగారుతల్లి పథకానికి పేరుమార్చిన టీడీపీ సర్కార్ చివరి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించక పోగా, ఆ పథకాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో, ఆయా శాఖలకు కూడా అంతుచిక్కడంలేదు. మా ఇంటి మహాలక్ష్మిగా నామకరణ చేసిన తర్వాత 2015 జనవరి 1వతేదీ నుంచి బంగారుతల్లి వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. దీంతో ఆ పథకానికి అర్హులైన వారికి సమాచారం అందే అవకాశం లేకుండా పోయింది. గతంలో పనిచేసిన ఐకేపీ వారి వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో అర్హులకు తగిన సమాచారం ఇచ్చేవారు లేరు.పుట్టిన బంగారుతల్లులు పెద్ద అయి పెరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం వారిని చిన్నచూపు చూస్తోందని తల్లులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి పంపిణీతో సరి ఒక్కసారి మాత్రమే తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ఒక విడత రూ.2500 జమ చేశారు. అయితే రెండో విడతగా వేయాల్సిన మొత్తాలను ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. సంబంధిత అధికారులు స్పందించి పథకం వివరాలు తెలియజేయాలని, ఆడబిడ్డల కోసం పెట్టిన పథకం నిర్వీర్యం కాకుండా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పథకం వివరాలు చెప్పేవారే కరువయ్యారు గతంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఉన్న ఈ పథకం ఐసీడీఎస్ వారికి అప్పచెప్పినట్లు ఐకేపీ అధికారులు చెబుతున్నారు. ఐసీడీఎస్ వారిని సంప్రదిస్తే పత్రికల్లో మాత్రమే చూశామని, తమకు మాత్రం ఎటువంటి పథకాలు అప్పచెప్పలేదని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు అసలు ఈ పథకం ఉందా..లేదా అనే మీమాంసలో ఉన్నారు. బంగారు తల్లి పథకం ఉందా.. లేదా..! 2014లో పాప పుట్టింది, బంగారు తల్లి పథకానికి అర్జీ చేసుకున్నాం. పథకానికి అర్హత సాధిం చాము. ఆ తర్వాత ఆ పథకం గురించి చెప్పేవారే కరువయ్యారు. అటు వెలుగువారిని, ఇటు మహిళా శిశు సంక్షేమ కార్యాలయాన్ని సంప్రదించినా తెలియదంటున్నారు. అసలు పథకం ఉందో...లేదో కూడా అర్థం కావడంలేదు. – సరికొండ లత, అంబాపురం మాకు ఎలాంటి సమాచారం లేదు బంగారుతల్లి పథకాన్ని నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక పత్రాలు రాలేదు, మా దగ్గర సమాచారం కూడా లేదు.– మేరీభారతి, మహిళా శిశుసంక్షేమ శాఖ ఏపీడీ ఆర్థ్ధిక ఇబ్బందులతో చదువు కష్టంగా మారుతోంది అమ్మానాన్నలకు మేము ఇద్దరం ఆడపిల్లలం. బంగారు తల్లి పథకంతో పై చదువులు చదివించవచ్చని అమ్మానాన్నా ఆశ పడ్డారు. ఇంతవరకు బ్యాంక్‌ఖాతాలో నిధులు జమకాలేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వలన చదువులు కొనసాగించే పరిస్థితి లేదు. పథకాన్ని పునరుద్ధరించి మాలాంటి నిరుపేద ఆడపిల్లలు చదువుకునేందుకు సహాయపడాలి. – జి.అనూషలక్ష్మి, 10వ తరగతి విద్యార్థిని -
మా ఇంటికిరాని మహాలక్ష్మి
బాలిక భవితకు బాటలు వేయాలన్న తలంపుతో 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘బాలికా సంరక్షణ పథకం’ ప్రారంభించారు. అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఆ పథకం పేరు మార్చివేశారు. ప్రస్తుతం ‘మా ఇంటి మహా లక్ష్మి’ పేరుతో అమలవుతున్న ఈ పథకాన్ని అటక ఎక్కించే దిశగా టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, మచిలీపట్నం: బాలిక భవితకు బాటలు వేయాలన్న తలంపుతో ప్రవేశపెట్టిన బంగారుతల్లి (మా ఇంటి మహాలక్ష్మి) పథకాన్ని బాలారిష్టాలు వీడటం లేదు. ప్రభుత్వాలు మారాయి.. పథకం పేరు మారింది.. బాలిక భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పథకాన్ని అటక ఎక్కించే దిశగా అడుగులు పడ్డాయి. వెరసి మూడున్నరేళ్లుగా పథకంలో లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకునే వెబ్సైట్ పనిచేయకపోవడమే ఇందుకు నిదర్శనం. పథకం ఉద్దేశం ఏమిటంటే.. బాలికా శిశు మరణాలు, బాల్యవివాహాలను అరికట్టి బాలికల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాలికా సంరక్షణ పథకం ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల పుట్టిన తరువాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న పేదలకు రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లల తరువాత ఆపరేషన్ చేయించుకుంటే రూ.30 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. వైఎస్సార్ మరణాంతరం పలు ఘటనలు, మార్పులు చోటు చేసుకున్నాయి. మహానేత పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అప్పటి ముఖ్యంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2013 మే ఒకటో తేదీన బంగారుతల్లి బాలికా అభ్యుదయ సాధికారత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిం ది. ఒకే తల్లికి జన్మించిన మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేక్చూలని నిర్ణయించింది. అర్హులు.. అందే సాయం పుట్టిన పాప జనన ధ్రువీకరణ పత్రం, తల్లి ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఐసీడీఎస్, ఐకేపీ ద్వారా అర్హులను ఎంపిక చేసి పాప పుట్టిన మరు క్షణమే తొలి విడతగా రూ.2,500, రెండేళ్ల రెమ్యూనరేషన్ వైద్య సేవల కోసం ఏడాదికి రూ.వెయ్యి మంజూరు చేస్తారు. పాపకు 3, 4, 5 ఏళ్ల వయసుకు రాగానే పౌష్టికాహారం కోసం ఏటా రూ.1500, విద్యాభ్యాసం నిమిత్తం ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు ఇస్తారు. విద్యాభ్యాసం నిమిత్తం 6,7, 8, తరగతుల్లో రూ. 2,500. 9,10 తరగతుల్లో రూ.3 వేలు, ఇంటర్లో ఏడాదికి రూ.3500, డిగ్రీ లో ఏడాదికి రూ.4 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇంటర్‌తో చదువు ఆపేస్తే రూ.50 వేలు చొప్పున జమ చేయాలని నిర్ణయించారు. దరఖాస్తులపై స్పష్టత ఏదీ? తొలుత ఐకేపీ ఆధ్వర్యంలో పథకం అమలవుతుందని అధికారులు స్పష్టీకరించారు. అనంతరం ఐసీడీఎస్ ద్వారా సాయం అందుతుందని, ఈ మేరకు విధివిధానాలను సైతం రూపకల్పన చేశామని పాలకులు, అధికారులు సెలవిచ్చారు. తీరా చూస్తే మూడున్నరేళ్లుగా ఆన్లైన్లో వెబ్సైట్ పనిచేయడం లేదు. ఈ విషయమై ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని, ఐసీడీఎస్ అధికారులు సైతం అది తమ పథకం కాదని సామాధానమిస్తుండటంతో లబ్ధిదారులు తమ గోడు ఎవరి వద్ద వెల్లబోసుకోవాలా? అని ఆందోళన చెందుతున్నారు. మూడున్నరేళ్లుగా ముప్పుతిప్పలు పథకం ప్రారంభ సమయంలో జిల్లాలో 22 వేల మంది బాలికలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పారితోషికంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున జిల్లా వ్యాప్తంగా రూ.5.50 కోట్లు మంజూరు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పథకం అమలు విషయమై పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వం ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వారికే సాయం అందే సూచనలు కనిపించడం లేదు. మూడున్నరేళ్లుగా వేలాది మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన వారు వెబ్సైట్ ఎప్పుడు పనిచేస్తుందా? తమ పిల్లల పేర్లు నమోదు చేసుకుందామా? అని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు : 22,000 ఒక్కొక్కరికి మొదటి విడత మంజూరు చేసిన మొత్తం :రూ.2500 జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన నిధులు : రూ.5.50 కోట్లు -
మా ఇంటికి రాని మహాలక్ష్మి
భ్రూణహత్యలను నివారించేందుకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు, వారు ఉన్నత చదువులు చదువుకొనేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రస్తుతం ఆడబిడ్డలకు అక్కరకు రావటం లేదు. పథకాన్ని టీడీపీ ప్రభుత్వం సక్రమంగా అమలుచేయలేకపోతుంది. ఈ పథకానికి ‘మా ఇంటి మహాలక్ష్మిగా’ పేరు మార్చినప్పటికీ పథకం నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఫలితంగా వేలమంది ఆడపిలల్లకు రక్షణ లేకుండా పోతుంది. * బంగారు తల్లి పథకానికి మా ఇంటి మహాలక్ష్మిగా పేరుమార్చిన టీడీపీ ప్రభుత్వం * ఆన్లైన్లో లోగోకే పరిమితం ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్టమెంట్ ద్వారా పథకం అమలు చేయాలని వచ్చిన ఉత్తర్వులను పట్టించుకోని వైనం * కమిషనర్ల స్థాయిలోనే ఉత్తర్వులు నిలిచిపోయాయని చెబుతున్న ఐసీడీఎస్ సిబ్బంది పొందూరు: మా ఇంటి మహాలక్ష్మి పథకంపై నీలి నీడలు అలముకొన్నాయి. మే 5, 2013 తర్వాత పుట్టిన బాలికలకు మా ఇంటి మహాలక్ష్మిగా మారిన బంగారు తల్లి పథకం వర్తిస్తుంది. సమర్థంగా అమలు జరగాల్సిన ఈ పథకం ప్రభుత్వం చేతిలో బందీగా ఉంది. నిర్వహణ సరిగా లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. దీనిపై స్పందించాల్సిన మంత్రులు, అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించడం దురదృష్టకరం. మా ఇంటి మహాలక్ష్మి పథకంలో చిన్నారుల నమోదు బాధ్యత ఎవరిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పుట్టిన బాలికల వివరాలను వెలుగు కార్యాలయంలో నమోదు చేసేవారు. ప్రస్తుతం వారు కొనసాగించటం లేదు. ఆ పథకం వెలుగు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారని వెలుగు అధికారులు జీవోలు చూపిస్తున్నారు. 2015 ఫిబ్రవరి 18న బంగారు తల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా మార్చినట్టు సింగిల్ ఫైల్ నంబర్ 15 తెలుపుతుంది. 2015 ఏప్రిల్ 30న విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 50 ప్రకారం వెలుగు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలెప్మెంట్ డిపార్టమెంట్‌కు బదిలీ చేసినట్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇవన్నీ పక్కాగా ఆన్లైన్లో పొందుపరచినప్పటికీ ఉమెన్ అండ్ చైల్డ్ డవలప్మెంట్ అధికారులు మాత్రం ఉత్తర్వులు కమిషనర్లు వరకే పరిమితమయ్యాయని, పథకంలో ఆడపిల్లల నమోదుపై ఎటువంటి ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మహాలక్ష్మిలకు భరోసా ఏది? పుట్టిన ఆడబిడ్డలకు భరోసా లేకుండా పోయింది. మా ఇంటి మహాలక్ష్మి పథకం ఉన్నప్పటికీ అరకొరగానే బాలికల నమోదు జరిగింది. నమోదు చేసిన వారిలో కొందరి ఆధార్ కార్డు అప్లోడ్ జరగలేదని, ఏపీఎం, డీపీఎంలు అప్లోడ్ చేయాల్సి ఉందని వారిని అర్హత లేకుండా చేశారు. బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టిన నుంచి ఇప్పటివరకూ శ్రీకాకుళం జిల్లాలో 15,658 బాలికలను నమోదు చేశారు. వారిలో 14,865 మందిని అర్హులుగా గుర్తించారు. 793 మందిని వివిధ కారణాలతో అర్హత లేదని పెండింగ్‌లో పెట్టారు. గత రెండేళ్లలో పుట్టిన బాలికలను ఈ పథకంలో నమోదు చేసేందుకు వేలాది మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. వెలుగు, ఐసీడీఎస్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆడ శిశువు పుట్టిన నుంచి డిగ్రీ చదువుకొనేంత వరకు ఈ పథకం కింద వారికి రూ. 2.15 లక్షలను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఆడబిడ్డను పథకంలో నమోదు చేసేందుకు తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరగా ఈ పథకం పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఆడపిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘బంగారు తల్లి’కి మంగళం!
-
‘బంగారు తల్లి’కి మంగళం!
- చట్టాన్ని రద్దు చేసేందుకు సర్కారు సన్నాహాలు - ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల విషయంలో వీడని సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లల బతుక్కి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’ పథకం కనుమరుగు కానుంది. దీనికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో భ్రూణ హత్యలను నివారించడంతో పాటు ఆడపిల్లలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు 2013 మే 1న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే ఏడాది జూన్ 19న బంగారు తల్లి పథకానికి ప్రత్యేకంగా సాధికారత చట్టం కూడా తెచ్చింది. ఈ చట్టం ద్వారా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తయ్యేదాకా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గడచిన ఏడాదిన్నర నుంచే లక్షల సంఖ్యలో దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేసేందుకు సర్కారు చర్యలు చేపట్టకపోగా, ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా బంగారుతల్లి పథకాన్ని రద్దు చేయాలని తాజాగా నిర్ణయించింది. చట్టం ఉపసంహరణకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకూ సన్నాహాలు చేస్తోంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గత రెండు బడ్జెట్లలోనూ నిధులు కే టాయించకపోవడంతో ఇప్పటికే ఎంపికైన సుమారు లక్ష మంది బంగారు తల్లులు ఆర్థిక సాయం కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. 2013-14లో దరఖాస్తు చేసుకున్న 72,869 మందికి మొదటి విడతగా రూ.18.22 కోట్లు మాత్రమే అందింది. రెండో విడతను ఇంతవరకు ఇవ్వలేదు. 2014-15లో వచ్చిన దరఖాస్తుల్లో పరిశీలన అనంతరం 67,848 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఆపై పాత లబ్ధిదారులకు గానీ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి గానీ ఎటువంటి లబ్ధి చేకూరలేదు. -
బంగారు తల్లి భవితవ్యం ఏంటి?
పరిగి:బంగారు తల్లి పథకానికి బాలారిష్టాలు దాటకముందే అడ్డంకులు మొదలయ్యాయి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనే విషయంలో ఇప్పటికి సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో బంగారు తల్లుల్ని కన్న తల్లిదండ్రులు ఆందోళనకు గరరవుతున్నారు. ఈ పథకం ప్రారంభించి ఏడాది కావస్తుండగా.. తొమ్మిది నెలలుగా లబ్ధిదారులకు డబ్బులు చెల్లించడం నిలిపి వేశారు. బాలికల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని భరోసా కల్పిస్తూ 2013 మేలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అమ్మాయి పుట్టింది మొదలు.. డిగ్రీ వరకు ఆమె చదువు తదితర ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఈ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టారు. పుట్టినప్పటినుంచి ఏడాదివారీ ఖర్చుల నిమితం బాలిక డిగ్రీ పూర్తి చేసే సమయానికి మొత్తం రూ. 2.16 లక్షలు అందజేయడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఇంతలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కొత్త ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అంతేకాకుండా ఈ పథకానికి నిధుల కేటాయింపు కూడా లేకపోవడంతో ఆడపిల్లలు జన్మించిన వెంటనే పేర్లు నమోదు చేయించుకుంటున్నా.. పథకం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఆడపిల్లలని కన్నవారు ఇప్పటికీ బంగారుతల్లి పథకానికి పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. ‘బంగారు తల్లి పథకం’ కింద తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి ఈ పథకంపై స్పష్టత కరువైనా అధికారులు మాత్రం బంగారు తల్లి పథకం కింద పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇంకా అవగాహన కరువు బంగారు తల్లి పథకం కొనసాగుతుందా లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. దీనికితోడు ప్రజలకు కూడా ఈ పథకంపై అవగాహన కరువైంది. పథకం ప్రారంభమైన నాటినుంచి జిల్లాలో ఇప్పటి వరకు 26,362 మంది బాలికలు జన్మించారు. అయితే వారిలో 2,432 మంది మూడో కాన్పులో పుట్టడం, కుటుంబ సభ్యులు పింక్ కార్డు కలిగి ఉండటంతో వారిని ఈ పథకానికి అనర్హులుగా తేలారు. కాగా మిగిలిన 22 వేల మంది బాలికలు బంగారు తల్లి పథకానికి అర్హులైనప్పటికీ అందులో రెండొంతుల మంది కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 9685 మంది మాత్రమే బంగారు తల్లి పథకం కోసం ఐకేపీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3763 మందికి బ్యాంకుల నుంచి మొదటి ఇనిస్టాల్మెంట్ కింద డబ్బులు అందాయి. -
‘బంగారు తల్లి’కి పురిటి నొప్పులు
కొవ్వూరు రూరల్ : బంగారుతల్లి పథకం పేద కుటుంబాలకు అం దని ద్రాక్షలా మారింది. పేద కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే ఆ తల్లిదండ్రులకు బంగారుతల్లి పుట్టిందనే భావన తీసుకురావాలనే లక్ష్యంతో 2013 మే 1నుంచి ఈ పథకాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆడపిల్ల పుట్టిన ప్రతి తల్లికి ఈ పథకం వర్తిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అయితే, పథకం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఈ పథకంలో పేర్లు నమోదు చేయించుకునేందుకు బిడ్డ జనన ధ్రువీకరణ, ఆధార్ నమోదు, బ్యాంక్ అకౌంట్ల కోసం బాలింతలు కాళ్లరిగేలా తిరిగారు. పథకం ప్రారంభమై ఏడాది దాటినా ఎలాంటి ప్రగతి లేకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డల భవిష్యత్ కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం పురిట్లోనే పడకేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 8,500 మంది తల్లుల ఎదురుచూపు బంగారు తల్లి పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 15,192 మంది తల్లులు ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం అన్ని పత్రాలను అందించి పేర్లు నమోదు చేయించుకున్నారు. కాగా, వీరిలో సుమారు 6,700 మందికి చెందిన బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే నగదు జమ అయ్యింది. ఇంకా సుమారు 8,500 మందికి పైగా లబ్ధి చేకూరాల్సి ఉంది. కొవ్వూరు మండలంలో ఈ పథకం కోసం 347మంది తల్లులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకూ 154మందికి మాత్రమే ఆర్థిక సాయం అందింది. ప్రోత్సాహకం ఇలా బంగారు తల్లి పథకం నిబంధనల ప్రకారం గర్భిణి ప్రభుత్వాస్పత్రిలో పురుడు పోరుుంచుకోవాలి. ఆమెకు ఆడబిడ్డ పుడితే.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఈ విషయం ధ్రువీకరించగానే ఆ బిడ్డ తల్లి బ్యాంక్ అకౌంట్లో రూ. 2,500 జమ అవుతుంది. అనంతరం బిడ్డ వయస్సు పెరిగేకొద్దీ ఏటా ఇచ్చే ఈ మొత్తం పెరుగుతుంది. రెండేళ్లలోపు బిడ్డకు రూ.2 వేలు, 3 నుంచి 5 ఏళ్ల మధ్య రూ.4,500, 1వ తరగతి నుంచి 5వ తరగతి మధ్య రూ.10వేలు, 6 నుంచి 8వరగతి మధ్య రూ.7,500, 9, 10తరగతులకు రూ.6వేలు, ఇంటర్మీడియెట్‌లో చేరాక రూ.7వేలు, డిగ్రీలో చేరాక రూ.16వేలు, డీగ్రీ పాసైన యువతికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. బిడ్డకు 21ఏళ్లు నిండి ఇంటర్ ఉత్తీర్ణురాలైతే రూ. 50 వేలు, డిగ్రీ పాసైతే రూ.లక్ష ఒకేసారి ప్రోత్సాహకం అందుతుంది. జిల్లాలో ఇప్పటివరకూ ఇప్పటివరకూ 6,700 మంది లబ్ధిదారుల అకౌంట్లలో బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే రూ.2,500 చొప్పున మాత్రమే జమ అయ్యూయి. 1-2 ఏళ్ల మధ్య ఇవ్వాల్సిన రూ.2 వేలు నేటికీ అందలేదు. మరోవైపు సుమారు 8,500 మంది లబ్ధిదారుల అకౌంట్లలో ఒక్క పైసా కూడా జమ కాలేదు. సాయం అందలేదు నాకు ఆడబిడ్డ పుట్టి సుమారు 10నెలలు అవుతోంది. బంగారుతల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటివరకూ ఆర్థిక సాయం అందలేదు. -కంచర్ల సుమతి, మద్దూరులంక దరఖాస్తు ఇచ్చి 8 నెలలైంది అమ్మాయి పుడితే బంగారు తల్లి పథకంలో ఆర్థిక సాయం అందుతుందని చెబితే దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికి 8 నెలలు కావస్తోంది. ఎటువంటి సొమ్ములు అందలేదు. -పచ్చిపాల స్వాతి, నందమూరు సాయం ఎప్పుడు అందుతుందో నాకు పాప పుట్టి 8 నెలలు కావస్తోంది. ఇప్పటికీ బంగారు తల్లి పథకం కింద బ్యాంక్ అకౌంట్లో సొమ్ము జమకాలేదు. ఆ డబ్బు అందితే మా వంటి పేదవారికి ఎంతో ఉపయోగపడుతుంది. -కొమ్మిరెడ్డి దుర్గ, నందమూరు -
‘బంగారు తల్లి’కి ఏమైంది?
యాలాల: ‘బంగారు తల్లి’ పథకానికి 2013 నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో 6,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 2,637 దరఖాస్తులు గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. మొదటి పర్యాయంలో భాగంగా ఇచ్చే నగదు ప్రోత్సాహకానికి వీటిని కూడా కలుపుకుంటే మొత్తం రూ.65,92,500 చెల్లించాల్సి ఉంది. ఘట్కేసర్, షాబాద్, గండీడ్, కుల్కచర్ల, మహేశ్వరం మండలాల్లో మొదటి దశ చెల్లింపుల్లో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదీ పథకం.. ఈ పథకంలో భాగంగా ఆడ శిశువు జనన నమోదు సమయంలో రూ.2,500 అందజేస్తారు. ఆమెకు 21 సంవత్సరాలు నిండేవరకు (డిగ్రీ పూర్తిచేసే వరకు) రూ.లక్ష 55వేలను ప్రభుత్వం వివిధ దశల్లో అందజేస్తుంది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బాలికల కోసం ఈ పథకాన్ని 2013, మే 1న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టి చట్టబద్ధం చేశారు. ఆడ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తోడ్పడే విధంగా రూపొందించిన ఈ పథకం సరిగ్గా అమలైతే అంతోఇంతో లబ్ధి చేకూరుతుంది. కానీ అధికారుల నిర్లిప్తత కారణంగా పథకం మూలనపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. నమోదులో జరుగుతున్న తీవ్ర జాప్యం, ప్రోత్సాహకానికి నిధుల మంజూరులో నిర్లక్ష్యం కారణంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ఆరు నెలలుగా ప్రోత్సాహకం అందకపోవ డంపై లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బ్యాంకు ఖాతా, గ్రామ సంఘం, ఏఎన్ఎం, ఐకేపీ కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్నా.. డబ్బులు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. -
బజ్జున్న బంగారు తల్లి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని సమర్థంగా నడిపించగలగాలి. చట్టం చేస్తే దాన్ని ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆపరాదు. కానీ బంగారు తల్లి పథకాన్ని మాత్రం ఎటువంటి లక్ష్యాలూ లేకుండానే ప్రవేశపెట్టారు. ఏడాది తిరక్కముందే ఆపేశారు. బంగారు తల్లి పథకం గురించి పెద్దఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వ యంత్రాంగం తరువాత పట్టించుకోవడం మానేసింది. మార్చి నెలనుంచి నిధులు జమచేయకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబానికి ఆర్థిక సహా యంగా పలుమార్లు నిధులు వచ్చేలా చట్టం చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల కావడం లేదు. ఇంతకీ ఈ పథకానికి కొత్త ప్రభుత్వ యంత్రాంగం నిధులు విడుదల చేస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది మే 1న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారు తల్లి పథకాన్ని ప్రారంభిం చారు. మే1వ తేదీ తరువాత జన్మించిన ఆడపిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుందనడంతో పిల్లల తల్లిదండ్రులు బ్యాంకుల్లో అకౌంట్లు ప్రారంభించి, పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. పథకం ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంకు అకౌంట్లలో కొద్ది మొత్తంలో డబ్బులు వేశారు. దీంతో మిగతా వారిలో కూడా నమ్మ కం పెరిగింది. కానీ అన్ని పథకాల్లాగే ఇది కూడా నిధుల లేమితో నిలిచిపోరుుంది. ఈ సంవత్సరం జూన్ 6 నాటి కి జిల్లాలో వెబ్సైట్ ప్రకారం 9,600 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో కేవలం 4,875 మందికే పథకాన్ని వర్తింపజేశారు. నిధుల్లేక మిగతా వారికి వర్తింపచేయలే దు. అయితే పథకాన్ని పర్యవేక్షిస్తున్న డీఆర్డీఏ అధికారుల వివరణ ప్రకారం...7,828 మంది దరఖాస్తుచేసుకోగా 4,875 మందికి నిధులు విడుదల చేశామని, ఇంకా 2953 మందికి పథకాన్ని వర్తింపజేయాల్సి ఉందని చెబుతున్నారు. వ్యయప్రయాసలతో రిజిస్ట్రేషన్ ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నా ఫలితం లభించడం లేదు. దీనికి దరఖాస్తు చేసుకోడానికి ఆరురకాల ధ్రువీ కరణ పత్రాలు ఉండాలి. అలాగే పాస్పోర్ట్సైజ్ ఫొటో లు, తల్లి పేరుమీద బ్యాంకు ఖాతా తెరిచినట్లు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్, తదితర వాటి కోసం దరఖాస్తుదారులు ఖర్చు చేసి, అధికారుల చుట్టూ తిరిగినా...నిధులు మాత్రం రావడం లేదు. ఎప్పుడెప్పుడు ఎంతెంత మంజూరు అంటే... ఆడపిల్ల పుట్టగానే రూ.2,500 తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. రెండేళ్ల వరకూ టీకాల కోసం రూ.2000 (ఏడాదికి వేయి చొప్పున) పాపకు ఐదేళ్లు వచ్చే వరకూ సంవత్సరానికి రూ.1500 చొప్పున రూ.4,500 పదేళ్లవరకూ సంవత్సరానికి రూ.2,500 చొప్పున రూ.పదివేలు 13 ఏళ్ల వరకూ రూ.7,500 (ఏడాదికి రూ.2,500 చొప్పున) 15 ఏళ్ల వరకూ రూ.3 వేల చొప్పున రూ.6,000 17ఏళ్ల వ రకూ రూ.3,500 చొప్పున రూ.7,000 21 ఏళ్ల వరకూ రూ.4వేల చొప్పున రూ.16000 జమ చేస్తూ 21 ఏళ్ల తరువాత అప్పటికి ఇంటర్ పాసయితే రూ.50 వేలు, గ్రాడ్యుయేషన్ పాసయితే రూ.లక్ష. మొత్తంగా రూ.1,55,500 ప్రోత్సాహకాలు అందిస్తామ ని ప్రకటించారు. కానీ దీనికోసం ఇప్పటివరకూ నిధులు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాలో పీడీ ప్రత్యేక చొరవ తీసుకుని ఓ కాల్‌సెంటర్‌ను కూడా (800834 2244)ఏర్పాటు చేశారు. దీంతో మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, కానీ నిధుల వద్దకు వచ్చేసరికి ఈ పథకం నిద్రపోతోంది. -
పాపం బంగారు తల్లి..!
సాక్షి, అనంతపురం : ‘బంగారు తల్లి’ పథకం అమలుకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకం అమలులోకి వచ్చి ఏడాది దాటినా శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా లక్ష్యంలో 50 శాతం కూడా సాధించలేదు. గత ఏడాది మే 1న ప్రభుత్వం దీన్ని చట్టంగా చేసింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం ఆ రోజు నుంచి గతేడాది నవంబర్ వరకు జిల్లాలోని పీహెచ్సీపీల పరిధిలో 44,097 జననాలు ఉన్నాయి. ఇందులో 20,908 మంది ఆడపిల్లలు పుట్టారు. ఇందులో 90శాతం వరకు తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల కుటుంబాల్లో పుట్టిన వారే. అంటే దాదాపు 18,090 మందికి పైగా ఆడపిల్లలు బంగారుతల్లులే. అయితే వీరిలో రికార్డులకు ఎక్కింది ఎవరన్నది పరిశీలిస్తే..వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. దరఖాస్తు ఓ ప్రహసనం ఈ పథకానికి అర్హులు కావాలంటే స్థానిక సంస్థ జనన ధ్రువపత్రం లేదా సంబంధిత ఆస్పత్రి వైద్యాధికారి ఇచ్చిన ధ్రువపత్రం ఉండాలి. ఇదంతా శిశువు పుట్టిన వారంలోగా జరగాలి. ఏఎన్ఎంలు ఇందుకు బాధ్యత తీసుకోవాలి. కేవలం ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై దృష్టి సారిస్తున్నంతగా ఈ పథకం వైపు యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. మరో వైపు జనన ధ్రువపత్రం కేవలం మీ-సేవా కేంద్రాల ద్వారానే తీసుకోవాల్సి రావడం గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఇదీ చాలదన్నట్లు ప్రధాన నిబంధన ఇంకొకటి ఉంది. ఎక్కడ డెలివరీ అయితే అక్కడ జనన ధ్రువపత్రం ఉండాలి. ఎక్కడ ధ్రువపత్రం ఉంటే అక్కడే అర్జీలు దాఖలు చేయాలి. వాస్తవానికి గర్భిణులు కాన్పు సమయానికి పుట్టింటికి వెళ్లే సంప్రదాయం ఉన్నందున ఆ గ్రామంలోనే 90శాతం డెలివరీలు జరుగుతున్నట్లు అంచనా. అంటే అక్కడే జనన ధ్రువపత్రం, దరఖాస్తు తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేసుకోవాలి. మెట్టినింటికి (అత్తగారింటికి) వెళ్లాక.. అక్కడ వీరికి ఎలాంటి అవకాశం ఉండడం లేదు. బంగారు తల్లి పథకానికి ఇది పెద్ద అవరోధంగా మారిందని, జననాల సమాచారం కూడా ఆశ, ఏఎన్ఎం సిబ్బంది చెప్పడం లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక సంస్థలు, డీఆర్‌డీఏల మధ్య ఉన్న సమన్వయలోపం సమాచార మార్పిడిలో జాప్యం కారణంగా లబ్ధిదారుల కుటుంబాలకు నష్టం జరుగుతోంది. ‘బంగారు తల్లి’ నమోదు ఇలా... జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో (గ్రామీణప్రాంతాల్లో) గత ఏడాది మే 1 నుంచి ఈ యేడాది మే వరకు దాదాపు 85 వేల జననాలు జరిగినట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో దాదాపు 38,500 మంది ఆడపిల్లలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖరికార్డుల మేరకు గత ఏడాది మే 1 నుంచి గత ఏడాది నవంబర్ చివరి వరకు జిల్లాలో 44,094 మంది జన్మించారు. వీరిలో బాలికలు 20,908 మంది ఉన్నారు. అయితే గత ఏడాది మే నుంచి ఈ ఏడాది మే వరకు డిఆర్డీఏ లెక్కల ప్రకారం 14,919 దరఖాస్తులు వచ్చాయి. అంటే గతేడాది నవంబర్ వరకు నమోదైన జననాలోనే జిల్లా అధికారుల ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించలేదన్నమాట. కాగా దరఖాస్తు చేసుకున్న వాటిలో 12,537 అర్హత పొందాయి. ఇందులో 6,920 మందికి తొలి బిడ్డ అంటే ఒకొక్కరికి రూ.2,500 చొప్పున వెంటనే కేటాయించారు. వాస్తవానికి ఏడాది కాలంలో జిల్లాలో జరిగిన జననాల్లో ఇది కేవలం 25 శాతం కూడా దాటలేదని తెలుస్తోంది. ఇక 211 మంది దరఖాస్తుదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు జతచేయకపోగా, ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేని 20 మంది దరఖాస్తులను అధికారులు వెనక్కు పంపించారు. ఇక 285 దరఖాస్తులు ఏపీఎం, 91 దరఖాస్తులు డీపీఎం పరిశీలనలో ఉండగా, 1784 మంది లబ్ధిదారులకు చెల్లింపులు చేయడానికి నివేదిక సిద్ధంగా ఉంది. ఇక మొదటి చెల్లింపులకు సంబంధించి 3,400 దరఖాస్తులను అధికారులు బ్యాంకులకు పంపించారు. నిజానికి ఈ చట్టం వర్తిస్తే ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి డిగ్రీ చదివే వరకు, వివాహం అయ్యే వరకు ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో ఆయా దశలను బట్టి డబ్బును జమ చేస్తుంది. 21 ఏళ్ల నాటికి మొత్తంగా రూ.2 లక్షలు మేర లబ్ధి కల్గించే ఈ పథకం పర్యవేక్షణ, అవగాహన లేమి కారణంగా నీరుగారుతోంది. -
‘బంగారు తల్లి’కి బెంగ
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: సుమారు ఏడాది క్రితం.. మే ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారు తల్లి పథకానికి అంకురార్పణ చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు దశలవారీగా ఆర్థికంగా చేయూత అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపికైన వారికి ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.2.16 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నది లక్ష్యం. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉన్న తరుణంలో హడావుడిగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ ఎన్నికల పథకమేనన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చేందుకే దీన్ని ప్రారంభించారన్న విమర్శలు కూడా వినిపించాయి. అందుకు తగినట్లే ఇప్పుడు ఈ పథకానికి గ్రహణం పట్టుకుంది. జిల్లాలోని 31 మండలాల నుంచి 9014 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,613 మందిని అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సుమారు రూ.1.40 కోట్లు కూడా జమ చేశారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా 3,401 దరఖాస్తులను అధికారులు పెండింగులో పెట్టారు. దీంతో దరఖాస్తుదారులు నిరాశ చెందారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయినా దరఖాస్తుదారులు కొత్త అనుమానాలతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ ప్రభుత్వం రద్దయ్యింది. కొత్తగా అధికారంలోకి రానున్న టీడీపీ ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఏ వైఖరి అవలంభిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుందన్నది తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకే టీడీపీ ప్రభుత్వం కిందా మీదా పడాల్సిన పరిస్థితులు ఉన్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించిన ఈ పథకం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పథకం అమలు, పెండింగు దరఖాస్తుల విషయంలో అధికారులు సైతం నోరు మెదపడం లేదు. దీనిపై వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా డీఆర్డీఏ అధికారులు ఏవరూ అందుబాటులో లేరు. -
‘బంగారుతల్లి’కి అవమానం
ధర్పల్లి, న్యూస్‌లైన్ : ‘బంగారుతల్లి’ పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళ్లిన దంపతులకు అవమానం ఎదురైంది. ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్‌కు చెందిన సుంచ జమున, నరేశ్ దంపతులకు స్నేహిత అనే ఆడబిడ్డ జన్మించింది. ఆరు నెలల క్రితమే వీరికి బం గారుతల్లి పథకం మంజూరుకాగా, బ్యాంక్ ఖాతా తెరవడానికి అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో ఖాతాను తెరిచేందుకు సుంచ జమున దంపతులు ఆరు నెలలుగా తిరుగుతున్నారు. ఖాతాకు అవసరమైన పత్రాలు జత చేసి బ్యాంకు అధికారులకు అందజేసినా ఖాతా ఇచ్చేందుకు తిప్పలు పెడుతున్నారు. బుధవారం మరోసారి బ్యాంక్ ఖాతా కోసం దంపతులు బ్యాంకుకు వచ్చారు. ఖాతాకు సంబంధించిన పత్రాలు జతచేసి బ్యాంక్ అకౌంటెంట్ రాజేశ్వర్ కౌంటర్ వద్దకు వెళ్లారు. అకౌంటెంట్ ఖాతా తెరిచే పత్రాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ నివాస ధ్రువ పత్రమేనా అంటూ ఖాతాకు సంబంధించిన పత్రాలను వారి ఎదుటే బ్యాంక్‌లోనే ఆయన చింపివేశారు. దీంతో దంపతులు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. ఇదేందని బ్యాంక్‌లోనే నిరసన వ్యక్తం చేశారు. బంగారుతల్లినే అవమానిస్తారా అని చిన్నారి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు మేనేజర్ వచ్చి దంపతులను సముదాయించి మరో ఖాతా పత్రాన్ని ఇచ్చి ఖాతా కోసం దరఖాస్తు చేయించారు. -
‘బంగారుతల్లి’కి బంధనాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఆడపిల్లల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు.. అండగా నిలిచేందుకు ప్రభుత్వం 2013 మే ఒకటో తేదీన ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయితే జిల్లాలో పథకం అమలుకు అనుసంధానంగా ఉన్న శాఖల మధ్య సమన్వయలోపంతో బంగారుతల్లి లక్ష్యం దిశగా సాగడంలేదు. దీంతో మే నుంచి పుట్టిన బంగారుతల్లుల(ఆడపిల్లల) వివరాలు పూర్తిస్థాయిలో ఇటు డీఆర్డీఏ, అటు డీఎంహెచ్‌వో అధికారుల వద్ద లేవు. జిల్లాలో ఏపీఎం, డీపీఎం పరిధిలో పథకం అమలవుతోంది. పథకం ప్రారంభం నుంచి ఈ ఏడాది జనవరి వరకు జిల్లాలో 16 వేలకుపైగా ఆడపిల్లలు జన్మించారు. ఫిబ్రవరి 12 వరకు 10,170 మంది మాత్రమే పథకం కింద పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో ఆదిలాబాద్ పరిధిలో 6,082 మంది, ఉట్నూర్ పరిధిలో 4,088 మంది ఉన్నారు. ఇందులో 851 మంది లబ్ధిదారులు ఇంట్లోనే పాపకు జన్మనిచ్చినవారే. దరఖాస్తు చేసుకున్న 614 మంది వివరాలను అధికారులు ఆయా బ్యాంకులకు పంపించారు. వివిధ కారణాలతో వీటిలో నుంచి 167 దరఖాస్తులు తిరస్కరించారు. మిగతా వాటిలో కొన్ని పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలో ఆడపిల్లలు పుట్టిన వెంటనే పూరిస్థాయిలో వివరాలు సేకరించడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నా వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదు. {పసవాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియక పుట్టిన ఆడపిల్లల వివరాలు సేకరించడం అధికారులకు కష్టంగా మారింది. ఏఎన్ఎం, ఐకేపీ సభ్యురాలు, అధికారి వీరిలో ఎవరైనా ఉంటేనే ఆ వివరాలు పథకం కింద నమోదవుతున్నాయి. {పభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల వివరాలు రోజురోజుకు అందుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో, హోం డెలివరీ కేసుల వివరాలు వారం రోజుల్లో తెలియాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో అందడంలేదు. పట్టణ ప్రాంతాల్లో ఆడబిడ్డకు జన్మనిస్తే నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు జనన ధ్రువీకరణ పత్రం పొందడం కష్టంగా మారింది. ఆస్పత్రుల నుంచి వివరాలు అందకపోవడం, బిడ్డ వివరాలు నమోదు కాకపోవడంతో పురపాలక సంఘం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. పథకానికి అర్హత పొందాలంటే.. స్థానిక సంస్థల నుంచి జనన ధ్రువీకరణపత్రం, ఆస్పత్రి వైద్యాధికారి ఇచ్చిన ధ్రువీకరణపత్రం ఉండాలి. ఇదంతా వారంలోగా జరగాలి. ఇందుకోసం స్థా నిక ఏఎన్ఎంలే బాధ్యత తీసుకోవాలి. వీరు ప్రసూతి, శస్త్రచికిత్సలపై దృష్టిసారిస్తున్నా పథకం వర్తింపుపై నిర్లక్ష్యంగా ఉన్నారు. జనన ధ్రువీకరణ పత్రం కేవలం మీ-సేవ కేంద్రాల ద్వారా తీసుకోవాల్సి ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఆ పత్రం పొందడం కష్టంగా మారింది. అన్ని పత్రాలు ఉన్నవారు నేరుగా మండల ఐకేపీ అధికారులను సంప్రదిస్తే.. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి, ఏఎన్ఎంలు ధ్రువీకరించాలని తిప్పి పంపిస్తున్నారు. అంగన్వాడీలు ఆడపిల్లల వివరాలు సక్రమంగా నమోదు చేయాలి. వివరాలను నెల వారీగా కార్యదర్శికి అందించి, సకాలంలో రిజిస్టర్లో నమోదు చేసేలా చూడాలి. కానీ ఈ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. కార్యదర్శులు పనిఒత్తిడితో పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. -
‘బంగారు తల్లీ’ ?
బాలిక వివరాలు నమోదు చేసి పాఠశాలకు వెళ్లే వరకు పర్యవేక్షించాలి. పాఠశాలల్లో హెచ్ఎంలు, కళాశాలల్లో చేరిన తర్వాత ప్రిన్సిపాళ్లు వారి వివరాలు నమోదు చేయాలి. బంగారు తల్లి పథకాన్ని ఆధార్‌కు అనుసంధానం చేశారు. ఆధార్ ద్వారానే కుటుంబాలను గుర్తిస్తారు. బాలికల పేరిట ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నేరుగా వారి ఖాతాలకే నగదు చెల్లిస్తారు. వీటికి బయోమెట్రిక్ విధానం కూడా పరిగణనలోకి తీసుకుని పంపిణీ మొదలుపెడతారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఆధార్ నంబర్లు చాలా మందికి లేవు. అదేవిధంగా కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధన విధించారు. ఇలా ప్రభుత్వ నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం ఈ పథకం అమలుకు శాపంగా మారాయి. జిల్లాలో బంగారు తల్లి పథకం క్షేత్రస్థాయి అమలు తీరును ‘న్యూస్‌లైన్’ బృందం బుధవారం పరిశీలించింది. ఇప్పటి వరకు పథకంలో 7,867 మంది తల్లులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 5,493 మందికి మొదటి విడత నగదు అందించారు. 5 వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు బంగారు తల్లి బాండ్లు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 1597 మంది తల్లులకు ఆధార్ లేదు. దీంతో వారికి మొదటి విడత నగదు మంజూరు కాలేదు. బంగారు తల్లి పథకంలో గత సంవత్సరం మే 1 అనంతరం జన్మించిన ఆడపిల్లలకు రూ. 2,500లను ఖాతాలో జమ చేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజు రూ.1000 చెల్లిస్తారు. బాలికలకు రెండో సంవత్సరం వచ్చే సరికి మరో రూ. 1000లను చెల్లిస్తారు. మూడో సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమ చేస్తారు. ఇలా 4,5 సంవత్సరాలకు ఒక్కో ఏటా రూ. 1500లు చొప్పున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఏడాదికి రూ.2 వేల చొప్పున చెల్లిస్తారు. బాలిక 6,7,8, తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ. 2,500 జమచేస్తారు. 9,10 తరగతుల చదివే సమయంలో ఏడాదికి రూ. 3 వేలు చొప్పున చెల్లిస్తారు. బాలిక పదహారో ఏట ఇంటర్ రెండు సంవత్సరాలకు ఏడాదికి రూ. 3500ల చొప్పున జమ చేస్తారు. డిగ్రీలో చేరిన అనంతరం వరుసగా మూడు సంవత్సరాలు రూ. 4 వేలు జమ చేస్తారు. డిగ్రీ పూర్తై తర్వాత మహిళ పేరిట రూ. 1 లక్ష జమ చేస్తారు. -
ఆమెకేది రక్షణ?
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఆడదంటే చులకనభావం సమాజంలో ఇంకా రాజ్యమేలుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే.. పుట్టకముందే కొన్నిచోట్ల చిదిమేస్తున్నారు. మరికొన్నిచోట్ల పుడమిపైకి రావడానికి బంగారుతల్లికి అవస్థలెన్నో. ఉన్నత చదువులతో అన్నిరంగాల్లో మగవారికి ధీటుగా రాణిస్తున్నా మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. చదువు, ఉపాధిలోనే కాదు కుటుంబ పోషణలో.. సమస్యల్లో ఇంటిపెద్ద పాత్ర పోషిస్తున్నా ఆదరించలేని నైజం చాలా మందిది. మహిళ అంతరిక్షంలోకి అడుగుపెట్టినా శభాష్ అని తట్టి ప్రోత్సహించలేని సంస్కారం చాలామందిలో కనిపిస్తోంది. ఆడవారిని అదుపులో పెట్టుకోవాలి.. అణచిపెట్టాలనే ధోరణి మృగాళ్లలో కోరలు చాస్తోంది. చట్టాలెన్నీ తెచ్చినా ఆడవారిపై అఘారుుత్యాలు, హింస, వేధింపుల పరంపర కొనసాగుతోనే ఉంది. పేదరికం.. నిరక్షరాస్యత.. సమస్యలను పరిష్కరించుకునే ఆత్మస్థైర్యం లేకపోవడం.. ఒంటరిననే భావన.. మహిళను అశక్తురాలిని చేస్తోంది. కాపురాల్లో మద్యం చిచ్చు మద్యం వ్యసనం ఎన్నో కాపురాల్లో చిచ్చుపెడుతోంది. కుటుంబాలను కూల్చుతోంది. ఆర్థిక సమస్యలు తెచ్చిపెడుతోంది. కుటుంబ పోషణ భారం చేసి, దంపతుల మధ్య గొడవలు సృష్టిస్తోంది. ఆయూ సమస్యలు పరిష్కరించుకోలేక చాలామంది దంపతులు ఠాణా మెట్లెక్కుతున్నారు. న్యాయస్థానాల తలుపు తడుతున్నారు. మరికొందరు సర్దుకుపోలేక హత్యలు, ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా ఆడది తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని పేర్కొన్న జాతిపిత గాంధీజీ మాటలు ఇప్పట్లో నిజమయ్యేలా లేవు. ఆడవారిపై అఘారుుత్యాలు పుణ్యమా అని వారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో దుష్పరిణామాలు తప్పవు. -
‘బంగారు తల్లి’కి కష్టాలు
లబ్ధిదారుల ఖాతాల్లో పడని నగదు ఏపీజీబీ అకౌంట్లు ఇచ్చిన వారికి ఆన్లైన్ సమస్యలు పెండింగ్‌లో వందలాది దరఖాస్తులు బేస్తవారిపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్న తల్లులు నగదు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన వారికి 2013 మే నుంచి పథకాన్ని ప్రారంభించారు. వైద్యశాలలో బిడ్డ జన్మించినట్లు ధ్రువీకరణ పత్రం అందజేయగానే బ్యాంకు ఖాతాలో రూ. 2,500 జమ చేయాలి. అప్పటి నుంచి కష్టాలు మొదటి ఏడాదికి వెయ్యి, 3,4,5 సంవత్సరాలకు ఏటా రూ. 1500, 6-10 సంవత్సరాలకు ఏడాదికి రూ. 2 వేలు, 11 నుంచి 13 ఏళ్ల వరకు ఏడాదికి రూ. 2,500, 14-15 కు రూ. 3 వేలు, ఇంటర్మీడియెట్‌కు రూ. 3,500, డిగ్రీలో ఏడాదికి రూ. 4 వేలు, ఇంటర్ పూర్తయిన తర్వాత రూ. 50 వేలు, డిగ్రీ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని 56 మండలాల్లో 7,412 మంది పథకంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 4,475 మందికి మాత్రమే మొదటి ఇన్స్టాల్మెంట్ నగదు బ్యాంకు ఖాతాలో జమైంది. జిల్లాలోని అన్ని మండలాల ఏపీఎంల వ ద్ద 455, డీపీఎం వద్ద 165 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లబ్ధిదారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, తల్లీబిడ్డల ఫొటోలు, బ్యాంకు అకౌంట్ పుస్తకాలను మండల ఐకేపీ ఏపీఎంలకు అందజేశారు. - ఏపీజీబీ అకౌంట్ నంబర్ ఇచ్చిన జిల్లాలోని 140 మందికి ఆన్లైన్ సమస్యతో నేటికీ మొదటి విడత నగదు పడలేదు. సెప్టెంబర్‌లో ఏపీజీబీ ఖాతాలో నగదు జమ చేసినట్లు కంప్యూటర్లో పే స్లిప్‌లు తీసిచ్చారు. కానీ బ్యాంకులకు వెళ్లి చూసుకుంటే జమకాలేదు. అప్పటి నుంచి నిత్యం ఐకేపీ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. - స్టేట్‌బ్యాంకు, ఆంధ్రాబ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన లబ్ధిదారులకు వెంటనే మొదటి ఇన్స్టాల్మెంట్ మంజూరైంది. 7 నెలల క్రితం నమోదు చేసుకున్న తల్లులు ఇంత వరకు నగదు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 6,526 మంది లబ్ధిదారులు సర్టిఫికెట్లన్నీ అందజేసినా చిన్నపాటి సమస్యలతో 2,051 మందికి సకాలంలో పథకం నగదు అకౌంట్లలో జమకాలేదు. అష్టకష్టాలు పడి అధికారుల చుట్టూ తిరిగి ఐకేపీ అధికారులు కోరిన సర్టిఫికెట్లు అందజేసినా పథకం వర్తించకుండా పోయిందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. పే స్లిప్ వచ్చినా..నగదు పడలేదు కటికల రూతమ్మ, చింతలపాలెం 2013 జూన్ నెలలో బంగారు తల్లి పథకానికి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏపీజీబీ అకౌంట్ నంబర్ ఇచ్చాను. 2013 నవంబర్ నెలలో రూ. 2500 అకౌంట్లో పడినట్లు పేస్లిప్ ఇచ్చారు. బ్యాంక్‌కు వెళ్లి చూసుకుంటే నగదు జమకాలేదు. రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఆన్లైన్ సమస్య పరిష్కరిస్తున్నాం.. కృపారావు, డీపీఎం బంగారు తల్లి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఆన్లైన్ సమస్య ఉండటంతో ఆ బ్యాంకులో అకౌంట్లున్న తల్లులకు నగదు పడలేదు. ఈ మధ్య కాలంలో బ్యాంక్ ఆన్లైన్ కావడంతో సమస్య పరిష్కరిస్తున్నాం. కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఏపీఎంలు ఆన్లైన్లో పలుమార్లు తల్లుల ఏపీజీబీ ఖాతాలను నమోదు చేయడంతో ఆన్లైన్ అవుతున్నాయి. వారం రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. -
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. స్వయం ఉపాధి యునిట్లపై ఇప్పటివరకిచ్చిన రాయితీని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో జిల్లాలోని 17,994 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ నిరుద్యోగులు దాదాపు రూ.80కోట్ల మేర లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 65వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టర్ ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే... భూమిలేని నిరుపేదలకు సాగుభూమి కల్పించే భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 666మంది పేదలకు 1,106 ఎకరాల భూమిని పంపిణీ చేసి పట్టా సర్టిఫికెట్లు అందజేశామన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు జిల్లాలో 2లక్షల మంది పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మూడు విడతల కింద 2,63,820 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పావలా వడ్డీపై రూ.537కోట్ల పంట రుణాలు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. పేద రైతులకు 74వేల వ్యవసాయ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చామన్నారు. 400కేవీ సామర్థ్యం గల 3సబ్స్టేషన్లు, 132కేవీ సామర్థ్యంగల 2సబ్స్టేషన్లు, 220కేవీ సామర్థ్యం గల ఒక సబ్‌స్టేషన్, 33 కేవీ సామర్థ్యం గల 9సబ్స్టేషన్లు కొత్తగా నిర్మించామన్నారు. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమలుచేస్తున్న బంగారు తల్లి పథకంతో జిల్లాలో 42వే ల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. స్త్రీనిధి పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 24వేల మంది మహిళలకు రూ.41కోట్ల రుణాలు అందించామన్నారు. అభయహస్తం పథకంతో జిల్లాలో 10వేల మంది సభ్యులకు ప్రతి నెల రూ.500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, ఎస్పీ రాజకుమారి, డీసీపీ కాంతిలాల్ రాణా తదితరులు పాల్గొన్నారు. -
‘బంగారు తల్లి’కి ఎన్ని కష్టాలో!
పరిగి, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం అమలులో నీరుగారుతోంది. ఆడపిల్లను భారమనుకోకండి... మహాలక్ష్మిలా భావిం చండి... చదువు చెప్పించండి... ప్రోత్సహిస్తాం... ఆర్థిక సాయం అందజేస్తామన్న ప్రభుత్వం... పథకం గురించి పేదలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతోంది. తెల్ల రేషన్కార్డులున్న కుటుంబాల బాలికల సంక్షేమానికి ఉద్దేశించిన పథకం.. ప్రారంభించి తొమ్మిది నెలలవుతున్నా బాలారిష్టాలు దాటడం లేదు. బంగారు తల్లుల తల్లిదండ్రులకు భరోసానివ్వటం లేదు. మొదట్లో ఆర్భాటాలు చేసిన ప్రభుత్వం బంగారు తల్లి పథకం గురించి గ్రామీణ పేదలకు అవగాహన కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. పథకం ప్రారంభమైన గతేడాది మే నుంచి ఇప్పటివరకూ జన్మించిన బాలికలకు, పథకం కోసం ఐకేపీలో నమోదవుతున్న సంఖ్యకు ఏ మాత్రం పొంతన కుదరటం లేదు. గణాంకాలను బట్టి చూస్తే జిల్లాలో 50 శాతానికిపైగా ప్రజలకు బంగారు తల్లి పథకం గురించే తెలియదనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు పథకం గురించి కొందరికి తెలిసినా అధికారులు సహకరించకపోవడంతో తిప్పలు పడుతున్నారు. బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లిపేరిట బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి పంచాయతీ అధికారులు, ఖాతాలు తెరవడానికి బ్యాంకర్లు రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో పలువురు బంగారుతల్లి పథకం వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రజల్లో అవగాహనా లోపం... జిల్లాలో ‘బంగారుతల్లి’ గురించి సగానికిపైగా ప్రజలకు అవగాహన లేదనే విషయాన్ని పథకం ప్రారంభమైన నాటినుంచి నమోదైన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో పథకం ప్రారంభమైన గతేడాది మే నుంచి ఇప్పటివరకు 13,362మంది బాలికలు జన్మించి నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 1,232మంది బాలి కలు మూడో కాన్పులో జన్మించడం, గులాబీ రేషన్‌కార్డుల కుటుంబాలు కావడంతో పథకానికి అర్హత పొందలేదు. మిగిలిన 12,130 మంది బాలి కలు బంగారు తల్లి పథకానికి అర్హులైనప్పటికీ ఇప్పటివరకు 4,844మంది బాలికల కోసమే ఐకేపీ కార్యాలయాల్లో తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,149మందికి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి మొదటి విడత డబ్బులు అందగా, మిగతా 1695 దరఖాస్తులు ఆయా స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాలో ఇంకా 7,286 మంది బాలికలకు బంగారు తల్లి పథకం అందాల్సి ఉంది. పరిగి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పథకం రిజిస్ట్రేషన్లలో కొన్ని మండలాలు చాలా వెనుకబడ్డాయి. మే నుంచి ఇప్పటివరకు బంట్వారంలో 34 మంది బాలికలకు, బషీరాబాద్‌లో 36మందికి మాత్రమే పథకం నుంచి మొదటి దఫా ఆర్థిక సాయం అందింది. పరిగి, మర్పల్లి, చేవెళ్ల మండలాల్లో అత్యధికంగా 150కి పైగా బాలికలకు తొలివిడత ఆర్థిక ప్రయోజనం అందింది. పథకంతో ప్రయోజనాలివీ... తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో మొదటి, రెండో కాన్పులో జన్మించిన ఆడపిల్లలకు పథకం వర్తిస్తుంది. ఒకేసారి కవలలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే. బాలిక జన్మించింది మొదలు డిగ్రీ పూర్తి చేసుకునే వరకు అంటే 21ఏళ్లు నిండే వరకు మొత్తం తొమ్మిది దఫాలుగా రూ.2.15లక్షలను ప్రభుత్వం అందజేస్తుంది. కచ్చితంగా డిగ్రీ పూర్తి చేస్తేనే ఈ మొత్తం అందజేయాలనే నిబంధన ఉంది. మధ్యలో చదువు ఆపేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా తగ్గుతాయి. -
బంగారు తల్లి పధకం వల్ల ప్రాణాలు కోల్పోయిన పసికందులు
-
‘బంగారు తల్లి’తో మోసం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: బంగారు తల్లి పథకంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మోసగిస్తోందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. ఈ పథకానికి సంబంధించి 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం నాలుగు వేల మందికి మంజూరు చేశారన్నారు. స్థానిక ఎల్బీజీ భవన్లో గురువారం నిర్వహించిన ఐద్వా ఒంగోలు డివిజన్ విస్తృత సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామంటూ పదేపదే ప్రకటించుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆచరణలో వారిని పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టినా అర్హులైన వారికి దాన్ని అందకుండా చేస్తున్నారన్నారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి కాలం సుబ్బారావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం వాటిని నియంత్రించకుండా ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. కనీస వేతనం పదివేల రూపాయలకు పైగా ఉండాలని ప్రభుత్వమే చట్టం చేసినా దానిని ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా వాటిని నియంత్రించకుండా ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. ఐద్వా డివిజన్ కార్యదర్శి యూ ఆదిలక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఐద్వా నాయకురాలు ఎన్ మాలతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకురాళ్లు ఎస్కే నాగూర్‌బీ, పద్మ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
కలెక్టరేట్,న్యూసలైన్ : అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై క ఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ప్రగ తి భవన్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, శిశువులకు అందించాల్సిన పౌష్టికాహారం ఇతర సదుపాయాలు సక్రమంగా అందడంలేనట్లు సమీక్ష ద్వారా తెలుస్తోందన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించి, ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడానికి , మాతా శిశుమరణాలు తగ్గించడానికి కృషిచేయాలని సూచించారు. బాధ్యతలు విస్మరించి లక్ష్యాలకు తగ్గట్టుగా పని చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జేసీ హర్షవర్ధన్, ఐసీడీఎస్ పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు. ‘బంగారు తల్లుల’ను గుర్తించ ండి బంగారుతల్లి పథకానికి అర్హత పొందే ప్రతిపాపను పుట్టిన క్షణంలోనే ఏఎన్ఎంలు ఏంపీఎలకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఆడపిల్లల నమోదులో ఐసీడీఎస్-ఆరోగ్యశాఖాధికారుల మధ్య తేడాలున్నాయన్నారు. ప్రసవమైన ప్రతికేసును నమోదుచేయాలని, పాప పుట్టిన క్షణంలోనే ఏఎన్ఎంలకు మెసేజ్ పంపాలన్నారు. ఈ నివేదికలు నెలకోసారి కాకుండా ఏరోజుకు ఆరోజు పంపించాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు సంబంధిత ప్రాథమిక కేంద్రాల పరిధిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. బంగారుతల్లి పథకం ప్రారంభమైన మే ఒకటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 9వేల మంది పిల్లలు జన్మించారని తెలిపారు. ఆరోగ్య శాఖద్వారా 8,876 మంది పి ల్లలు నమోదైనట్లు చెప్పారు. ఇందులో 8,097 మంది బంగారుతల్లి పథకానికి అర్హత కలిగి ఉన్నారన్నారు. వీటిలో 6,457 మందిని రిజిస్టర్ చేశామన్నారు. మిగతావారి పేర్లను రిజిస్టర్ చేయాల్సి ఉందన్నారు. పీడీలు రాములు, వెంకటేశం, డీఎంహెచ్ ఓ గోవింద్వాగ్మారే, ఏఎన్ఎంలు, ఏపీఓలు,ఏపీఎంలు పాల్గొన్నారు. -
తడబడుతున్న బంగారు తల్లి
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీల్లో బంగారుతల్లి పథకం కింద ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. లబ్ధిదారులు నిత్యం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ‘బంగారుతల్లి’ పథకం ప్రారంభంలోనే తడబడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానస పుత్రికగా ప్రచారం పొందిన ఈ పథకం ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వచ్చినా, ఇప్పటి వరకు జిల్లాలోని 11 మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో ఒక్క తల్లికి కూడా పారితోషికం అందించలేకపోయారు. ఈ ఏడాది మే ఒకటి తరువాత పుట్టిన ప్రతి ఆడపిల్లను ఈ పథకంలో చేర్చుతామని అధికారులు చెబుతున్నా.. లబ్ధి మాత్రం చేకూర్చడంలేదు. అర్భాటపు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం.. అమలులో మాత్రం చతికిలపడుతోంది. జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్, ధర్మవరం, రాయదుర్గం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం మునిసిపాలిటీలతో పాటు పుట్టపర్తి, మడకశిర, పామిడి నగర పంచాయతీలలో ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి 647 మంది దరఖాస్తు చేశారు. వారిలో 482 మంది అర్హులని అధికారులు తేల్చారు. మిగతా వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అర్హమైన వాటిలో బ్యాంకు ఖాతా నెంబర్ సరిగా ఉందా? లేదా? అన్ని పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అని చూసి 191 తేల్చగా తొలివిడత ప్రోత్సాహకం రూ.2,500 వంతున ఈ పాటికే జమ చేయాలి. అయితే ఈ ప్రక్రియ నేటీకి జరగకపోవడంతో ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఏం.. జరుగుతోందంటే.. 2012 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 100 మంది బాలురకు 74 మంది బాలికలు ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. దీంతో ఆడపిల్లల సంఖ్య పడిపోకూడదని, వీరి శాతం పెరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బాలికాభ్యుదయ సాధికారిక చట్టాన్ని 2013 జులై 2వ తేదీ నుంచి అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే బంగారు తల్లి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఐకే పీ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా పర్యవేక్షిస్తున్నాయి. 2013 మే ఒకటో తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లకు దీనిని వర్తింపజేస్తారు. ఇద్దరు ఆడపిల్లల వరకే ఇది వర్తిస్తుంది. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే. ఈ పథకం కింద శిశువు పుట్టిన నాటి నుంచి డిగ్రీ పూర్తి చేసే వరకు రూ.2 లక్షలు పైచిలుకు డబ్బు అందుతుంది. నిర్ధేశిత లక్ష్యం పూర్తి చేస్తూ పోతేనే లబ్ధి పొందుతారని నిబంధన విధించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగు.. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కాస్త బాగానే కనిపిస్తోంది. 63 మండలాల్లో మొత్తం 6,826 మంది దరఖాస్తు చేసుకోగా 4,831 మంది అర్హులని తేల్చారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. వీటిలో అన్ని పత్రాలు సరిగా ఉన్నాయా లేదా? బ్యాంకు ఖాతా నెంబర్ సరిగా ఉందా లేదా అని చూసి 3,178 మంది తల్లుల ఖాతాలకు తొలివిడత ప్రోత్సాహకం రూ.2,500 జమ చేశారు. మంజూరు పత్రాలు అందజేశాం జిల్లాలోని మునిసిపాలిటీలలోని ‘బంగారుతల్లి’ పథకం కింద అర్హులైన 191 మంది రచ్చబండలో మంజూరు పత్రాలు అందజేశాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాలేదు. హైదరాబాద్ స్థాయిలో ప్రాసెసింగ్‌లో ఉంది. వారం పది రోజుల్లో వారి ఖాతాల్లో ప్రోత్సాహకం జమ అవుతుంది. -నీలకంఠారెడ్డి, మెప్మా ఇన్చార్జ్ పీడీ, అనంతపురం -
అర్హులందరికీ ‘బంగారు తల్లి’
మంచాల, న్యూస్‌లైన్ : ఆడపిల్లల పట్ల వివక్ష, భ్రూణ హత్యలు, విక్రయాలు నిరోధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టిందని, అర్హులందరికీ ఈ పథకాన్ని అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ దివ్యదేవరాజన్ పేర్కొన్నారు. గురువారం బంగారు తల్లి పథకం ఆన్లైన్ విధానంపై మంచాల మండల కేంద్రంలో ఇందిర క్రాంతి పథం, వైద్య, అంగన్వాడీ శాఖల సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి దివ్యదేవరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తల్లి పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టిందని, పైలట్ ప్రాజెక్టుగా మొదటగా రాష్ట్రంలో మంచాల మండలాన్ని ఎంచుకుందని చెప్పారు. ఈ కార్యక్రమం కింద గ్రామ సమాఖ్య ప్రతినిధుల(వీఓ)కు, ఏఎన్ఎంలకు ట్యాబ్లెట్ పీసీలు ఇవ్వనున్నట్టు తెలి పారు. ఆయా గ్రామాల్లో బంగారు తల్లి పథకానికి అర్హులైన వారితో పాటు గర్భిణులు, శిశువుల వివరాలను ఈ పీసీ ట్యాబ్లెట్లలో నమోదు చేసి, ఆన్లైన్లో పొందుపర్చి ఉన్నతాధికారులకు చేరవేయాల్సి ఉంటుందన్నారు. గర్భిణులకు ఇమ్యూనైజేషన్, వైద్య సేవల విషయాలను కూడా వీటిలో పొందుపర్చాలన్నా రు. ఇలా ప్రసవం జరిగేంతవరకు వివరాలను సేకరించి, పుట్టిన పసిపాపల వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భం గా 40మంది వీఓలకు, 9మంది ఏఎన్ఎంలకు ట్యాబ్లెట్ పీసీలను దివ్యదేవరాజన్ అందజేశారు. పైన తెలిపిన వివరాలను అన్లైన్లో పొందుపర్చి ఉన్నతాధికారులకు అందించాలన్నారు. శుక్రవారం కూడా శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ట్యాబ్లెట్ పీసీలో వివరాల నమోదు, ఆన్లైన్ విధానం గురించి సెర్ప్ ఐటీ డెరైక్టర్ జాకబ్ అవగాహన కల్పించారు. బంగారు తల్లి పథకం సం చాలకులు రామశాస్త్రి, సాంకేతిక సంచాలకులు సురేష్‌కుమార్, ఏరియా కో ఆర్డినేటర్ నర్సింహ, డీఆర్డీఏ ఏపీడీ ఉమాదేవి, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ వెంకటే శ్వర్లు, డీపీఎంలు సురేఖ, గిరిజ, కళ్యాణి, మంచాల పీహెచ్సీ వై ద్యురాలు విజయలత, ఏపీఎం సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
‘బంగారుతల్లి’పై నిర్లక్ష్యం వద్దు
తాడ్వాయి, న్యూస్‌లైన్ : బంగారుతల్లి పథకంపై నిర్లక్ష్యం వహిస్తే సం బంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. శనివారం ఆయన తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రం పనితీరును పరిశీలించారు. గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందజేయాలని సూచించారు. గర్భిణులు ప్రసవ సమయంలో 108 అంబులెన్స్‌ను ఉపయోగించుకునేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి రికార్డులన్నింటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పప్పుదినుసులు, బియ్యం, నూనె, తదితర వస్తువులు అందుతున్నాయా లేదా గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వికలాంగులకు పింఛన్ రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సదరన్ శిబిరానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.ఇటీవల కురిసిన భారీవర్షాలకు సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని నష్టపరిహారం అందించాలని కలెక్టర్‌ను రైతులు కోరారు. మండలంలోని నందివాడ, గ్రామపరిధిలో గల తండాలకు రోడ్డు వేయించాలని తండావాసులు కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి లింగంపేట: గ్రామాల్లో పేద మహిళల ప్రసవాలను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రద్యుమ్న వైద్య సిబ్బంది ని ఆదేశించారు. శనివారం లింగంపేట ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహిం చారు. మందులు సక్రమంగా ఇస్తున్నారాలేదా అని అడిగి తెల్సుకున్నారు. సమీక్షలో జిల్లా శిశుసంక్షేమాధికారి రాములు,జిల్లావైద్య ఆరోగ్య అధికారి గోవింద్ వాగ్మారే,ఏడీఎంహెచ్ఓ సురేష్ బాబు పాల్గొన్నారు. -
ఇంటికి చేరిన ‘బంగారు తల్లి’
కౌడిపల్లి, న్యూస్‌లైన్: ఎట్టకేలకు ‘బంగారు తల్లి’ ఇంటికి చేరింది. అవగాహన లేక శిశువును విక్రయించారని తెలుసుకుని రంగంలోకి దిగిన అధికారులు సుమారు పది రోజులు తరువాతఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మండలంలోని సలాబత్పూర్ దయ్యాల తండాకు చెందిన హలావత్ జైసింగ్, శాంతిలకు గతనెల 29న ఆడ శిశువు జన్మించింది. పుట్టిన నాలుగు రోజులకే ఆ చిన్నారిని విక్రయించారు. అశోక్‌తోపాటు మరికొందరు మధ్యవర్తిత్వం నెరపగా సదరు శిశువును బీహెచ్ఈఎల్కు చెందిన కె.శ్రీనివాస్, జ్యోతి దంపతులు కొనుగోలు చేశారు. శిశు విక్రయం జరిగినట్టు ప్రచారం జరగడంతో ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఐసీడీఎస్‌లో భాగమైన ఐసీపీఎస్ (ఇంటీగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్) జిల్లా కోఆర్డినేటర్ రత్నం సూచన మేరకు శనివారం సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫర్ కమిటీ) సభ్యుడు సున్నంసతీష్, ఐసీపీఎస్ సభ్యుడు విఠల్, సర్పంచ్ చిన్నసాయిరెడ్డి, వీఆర్ఓ మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్ బుడ్యానాయక్, మాజీ ఉపసర్పంచ్ శాబొద్దీన్, చైల్డ్‌లైన్ కార్యకర్త షాహిన్, సుభాష్ తదితరులు వెంకట్రావ్పేట గేటు వద్ద ఇరు కుటుంబాలతో సమావేశమయ్యారు. శిశువును విక్రయించడం, కొనుగోలు చేయడం నేరమని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందుకు మద్దతు తెలిపిన వారు కూడా బాధ్యులేనని వారు పేర్కొన్నారు. దీంతో శిశువును కొనుగోలు చేసిన కె.శ్రీనివాస్ నుంచి చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులైన జైసింగ్, శాంతిలకు అప్పగించారు. శిశుపోషణ భారమవుతుందని తిరిగి అమ్మడానికి ప్రయత్నిస్తే కేసు పెడతామని వారు హెచ్చరించారు. ఎట్టకేలకు దసరా ముందు బంగారు తల్లి ఇంటికి చేరడంతో కథ సుఖాంతమైంది.