Bee
-
‘మిషన్ లైఫ్’తో భవిష్యత్తు!
సాక్షి, అమరావతి: వాతావరణంలో జరుగుతున్న అనూహ్య మార్పులు మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణం పూర్తిగా దెబ్బతిని భావితరాలు భూమిపై మనుగడ సాగించడమే కష్టమయ్యే అవకాశముంది. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. నీరు, ఇంధనం తదితరాలన్నీ పొదుపుగా వినియోగించాలి. ప్లాస్టిక్‌ను విడనాడాలి.. కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ‘మిషన్ లైఫ్’కు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి పలు నగరాలు ఎంపికవ్వగా.. అందులో రాజమహేంద్రవరం కూడా చేరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషితో.. భావితరాలకు ఇంధన వనరులను అందించడం కోసం.. పర్యావరణంలోని కర్బన ఉద్గారాలను తగ్గించి ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. బీఈఈ నేతృత్వంలో జరిగే ‘మిషన్ లైఫ్’ కార్యక్రమాలకు చేయూతనందించింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇంధన సంరక్షణ, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విడనాడడం, మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితం, చెత్త, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేసేందుకు బీఈఈ శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కర్నూలు నగరాలను బీఈఈ ఎంపిక చేసుకుంది. ఆ క్రమంలో రాజమహేంద్రవరంపైనా బీఈఈ దృష్టి సారించింది. విస్తృత ప్రచారం.. మిషన్ లైఫ్‌లో భాగంగా విస్తృత ప్రచారం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటు చేయడం, సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై ప్రత్యేక డ్రైవ్‌లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్‌షాప్‌లు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్‌లను బీఈఈ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, వలంటీర్ల ద్వారా.. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజిన్లను ఆపివేసేలా ప్రత్యేక ప్రచారం, కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక డ్రైవ్‌లను చేపడుతోంది.స్కూళ్లల్లో ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించేలా కృషి చేస్తోంది. దీని కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(సీసీసీ)ను రూపొందించింది. ఇందులో నిపుణులు, విద్యుత్ పంపిణీ సంస్థలు, మునిసిపల్, పట్టణాభివృద్ధి, రవాణా తదితర విభాగాలను భాగస్వాములను చేసింది. ఈ సెల్ వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంటుంది.వంద కోట్ల మందికి భాగస్వామ్యమే లక్ష్యం మిషన్ లైఫ్‌కు ఏపీలోని ఆరు నగరాలను ఎంపిక చేసుకున్నాం. ప్రజలు, వివిధ సంఘాలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నాం. తద్వారా రాష్ట్రంలో పర్యావరణ క్షీణతను అధిగమించడంతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం గ్రీన్ జాబ్స్ సృష్టించవచ్చని అంచనా వేస్తున్నాం. 2027–28 నాటికి వంద కోట్ల మంది భారతీయుల్ని మిషన్‌లైఫ్‌లో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – మిలింద్ దేవ్రా, బీఈఈ కార్యదర్శి మనం మారితేనే..» ట్రాఫిక్ లైట్లు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాల ఇంజన్లను ఆపితే ఏటా దాదాపు 22.5 బిలియన్ కిలోవాట్స్ ఇంధనం ఆదా చేయొచ్చు. » షాపింగ్‌లకు క్లాత్ బ్యాగులను వినియోగిస్తే 375 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా నివారించవచ్చు. » వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేయడం వల్ల 15 బిలియన్ టన్నుల ఆహారం వృథా కాదు. » నీటి కుళాయిలను సకాలంలో ఆపివేయడం వల్ల 9 ట్రిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయొచ్చు. » పని చేయని ఎలా్రక్టానిక్ గాడ్జెట్లను రీసైకిల్ చేయడం ద్వారా 0.75 మిలియన్ టన్నుల ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయొచ్చు. » ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం, ఎల్రక్టానిక్ పరికరాలను ఇంధన పొదుపు మోడ్‌లో వాడడం, తక్కువ నీటిని వినియోగించే పంటలు వేయడం, గ్రామీణ నీటి వనరుల రీచార్జ్‌ను ప్రోత్సహించడం, ఎల్ఈడీ లైట్లను వినియోగించడం, ప్రజా రవాణా తదితర మంచి విధానాలను ఉపయోగిస్తే.. మిషన్ లైఫ్ లక్ష్యాలను చేరుకోవచ్చు. » బీఈఈ ఇంధన సామర్థ్య పథకాలు, కార్యక్రమాల ద్వారా.. 2022–23లో 307 బిలియన్ యూనిట్ల విద్యుత్, 24.68 మిలియన్ టన్నుల చమురు సమానమైన థర్మల్ శక్తితో సహా సుమారు 306.40 మిలియన్ టన్నుల ఉద్గారాల్ని తగ్గించింది. -
ఆ ‘వెలుగు’లు విస్తరిద్దాం.!
సాక్షి, అమరావతి: భవిష్యత్ తరాల కోసం ఇంధన పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఇకపైనా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం బీఈఈతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి విద్యుత్ ఆదా చర్యలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే బీఈఈ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి, ఏపీఎస్ఈసీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.ఎ.వి.పి. కుమార రెడ్డి, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఈ రెండు విభాగాల అధికారులు ప్రత్యేకంగా సమావేశమై విధి విధానాలపై తాజాగా చర్చించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదీ..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీఈఈతో కలిసి రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థలలో 1000 ఎనర్జీ క్లబ్‌లను ఏపీఎస్ఈసీఎం ఏర్పాటు చేసింది. పట్టణ ఉష్ణ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ‘ఏపీ కూల్ సర్ఫేస్ పాలసీ 2023–28’ అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహంతో రూపొందించింది. 59 భారీ పరిశ్రమల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) సహకారంతో ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా ‘పాట్’ పథకంలో దాదాపు 1.16 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనం ఆదా అయ్యేలా చేసింది. 1158 సినిమా థియేటర్ల స్క్రీన్లపై నాలుగు చిన్న వీడియోలతో పాటు నాలుగు ఎఫ్ఎం ఛానళ్లలో 3 జింగిల్స్‌ను ప్రసారం చేసింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని ఆంధ్రా భవన్, తిరుమల తిరుపతి దేవస్థానం, పలు జనరల్ హాస్పిటల్స్, విజయవాడలోని డెంటల్ హాస్పిటల్, 130 గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యుత్ ఆదా కోసం ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, మోటార్లు అమర్చింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)ని నోటిఫై చేసింది. విశాఖపట్నంలో సూపర్ ఎనర్జీ కన్జర్వేటివ్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) భవన నిర్మాణాన్ని చేపట్టింది. -
ఇంధన ఆదాకు రోల్‌మోడల్ ‘ఈసీబీసీ బిల్డింగ్’
సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్‌లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్‌గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్‌లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది. అదనపు నిధుల కోసం... గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్‌రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్మెంట్, డిస్కమ్‌లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా.. బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పొదుపులో అగ్రగామి ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్‌మోడల్‌గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్ -
విద్యుత్ ఆదా కోసం ‘బిల్డింగ్ కోడ్’!
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ రంగంలో విద్యుత్ ఆదా చర్యల ద్వారా పర్యావరణానికి మేలు చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే తీసుకువచ్చిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలను ఇస్తుండగా.. తాజాగా దానిని సవరిస్తూ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్‌బీసీ) పేరుతో కొత్త డ్రాఫ్ట్‌ను బీఈఈ రూపొందించింది. ఈ ముసాయిదాపై ఈ నెల 12లోగా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించాలని ప్రజలను, రాష్ట్రాలను బీఈఈ కోరింది. ఇది అమల్లోకి వస్తే కొత్తగా నిర్మించే వాణిజ్య–నివాస భవనాల్లో నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ పొదుపు చర్యలను పాటించాల్సి ఉంటుంది. ఏమిటీ ముసాయిదా.. ప్రపంచంలో విద్యుత్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాల్లో 39 శాతం భవన నిర్మాణ రంగం నుంచే వస్తోంది. అలాగే మొత్తం విద్యుత్ వినియోగంలో 36 శాతం భవనాల్లోనే జరుగుతోంది. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా 2030 నాటికి నిర్మాణ రంగ ఇంధన డిమాండ్‌ను 50 శాతం తగ్గించగల సామర్థ్యం ఈసీఎస్బీసీకి ఉందని బీఈఈ గుర్తించింది. ఇంజనీర్లు, డెవలపర్లు, నిర్మాణ సంస్థల సంయుక్త సహకారంలో దీనిని విజయవంతం చేయాలని బీఈఈ భావిస్తోంది. వనరుల సంరక్షణతో పాటు వ్యర్థాలు, కాలుష్యం, పర్యావరణ క్షీణతను తగ్గించడం, పగటిపూట సహజ వెలుతురు ప్రసరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముసాయిదాను తయారు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ని విభాగాలను భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. గృహ, పరిశ్రమ, వ్యవసాయం సహా అనేక రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది. భవనాల్లో దాదాపు 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది. స్కూళ్లు, ఆస్పత్రులు, టీటీడీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులతో పాటు వాణిజ్య భవనాలు, నివాస భవనాల్లో ఇంధన సంరక్షణను ప్రోత్సహించడం కోసం ఈసీబీసీని కూడా అమలు చేస్తోంది. ప్రభు త్వం ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా అందించింది. వ్యవసాయంలో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించి రైతులు, పంప్ టెక్నీషియన్లతో వివిధ అవగాహన సెషన్లను నిర్వహించింది. ఇటువంటి చర్యలతో గతేడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు–2023ను ఆంధ్రప్రదేశ్ అందుకుంది. ‘ఈసీబీసీ’లో ఏపీ ఆదర్శం వెయ్యికి పైగా భవనాల్లో ఈసీబీసీ అమలుతో పాటు 3 వేల మంది కంటే ఎక్కువ వాటాదారులకు శిక్షణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. వేగంగా అభివృద్ధి చెందుతూ.. విస్తరిస్తున్న విశాఖ వంటి నగరాల్లో ఈసీబీసీ అమలు వల్ల విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. నీటి వనరులు కూడా కలుషితం కావు. ఉత్పాదక రంగం వృద్ధి చెందుతుంది. భవన నిర్మాణ రంగంలో ఆవిష్కరణలు, పోటీతత్వం, గ్రీన్ ఉద్యోగాలు, నైపుణ్యాలు, సాంకేతికతలకు అవకాశాలు పెంచడంలో ఈ కోడ్ సహాయపడుతుంది. ఈ క్రమంలోనే విశాఖలో సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణాన్ని చేపట్టిన ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. – అభయ్ భాక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ -
నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్!
కొరియన్ అమ్మాయిలు ఎంత తెల్లగా ఉంటారో తెలిసిందే. వారి ముఖం చక్కగా కాంతివంతంగా ఎలా ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదు. గ్లాస్ మాదిరిగా ముఖం మెరిసిపోతుంది. చిన్న మచ్చ కూడా ఉండదు. అలాంటి అందం సొంతం చేసుకోవాలంటే కొరియన్ బ్యూటి ప్రోక్ట్స్లో వాడే వాటి గురించి తెలసుకోవాల్సిందే. కొరియన్ పురుషులు, స్త్రీలు గ్లామర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ల చర్మ సంరక్షణ ఉత్పత్తులో వాడే వాటిని చూస్తే షాకవ్వతాం. ఎందుకంటే వాళ్లు చాలా విభన్నమైన వాటితో ఫేస్క్రీంలు తయారు చేస్తారు. బహుశా అందుకే కాబోలు వారు అంత అందంగా ఉంటారు. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏం ఉపయోగిస్తారో చూస్తే షాకవ్వుతారు. నతల విసర్జకాలు లేదా నత్తల జిగురు నత్తల విసర్జకాల్లో అల్లాంటోయిన్, కొల్లాజెన్, ఎలాస్టిన్, గ్లైకోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సీలు, యాంటీబయాటిక్ పెప్టైడ్స్ తదితరాలు ఉంటాయి. నత్త విసర్జకాలు లేదా నత్త జిగురు వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేటడ్గా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ మొటిమల వల్ల అయ్యే గాయాలను నయం చేయడమే గాక మృతకణాలను తొలగిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇందులో జింక్ కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా మృదువుగా చేస్తుంది. నత్త విసర్జకాలతో తయారు చేసిన కొరియన్ ప్రొడక్ట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉందట. వీటిని వాడితే కచ్చితంగా కొరియన్ అమ్మాయిల్లా తెల్లగా ఉంటారని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. తేనెటీగల జిగురు తేనెటీగల నుంచి లభించే ఈ రెసిన్ని ఆంగ్లంలో ప్రొపోలిస్ అంటారు. పుప్పొడి అనేది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధం. ఇది ముడుతలను తగ్గించే లక్షణాలతో పాటు మొటిమల బారిన పడే చర్మం, బ్రేక్అవుట్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, పుప్పొడి చర్మానికి కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. పుప్పొడి చర్మంపై సున్నితమైన మెరుపును వదులుతుంది. ఇది క్రమం తప్పకుండా అప్లై చేస్తే చర్మంలోని మృతకణాలను తొలగించి యవ్వన రూపాన్ని ఇస్తుందని కొరియన్లు గట్టిగా విశ్వసిస్తారట. రంధ్రాలను తగ్గించేందుకు "ముత్యం".. కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో ముత్యాలు చాలా కాలంగా ముఖ్యమైన పదార్ధంగా ఉన్నాయి.ముత్యాలు మొటిమలను తొలగించడంలో ఉపయోగపడతాయని చెబుతారు. అలాగే ముఖంపై విస్తరించిన రంధ్రాలను తగ్గిస్తాయని, చర్మం వృద్ధాప్యం బారిన పడకుండా నివారిస్తుందని విశ్వసిస్తారు. తేనెటీగ విషం తేనెటీగ విషం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. తేనెటీగలు బెదిరినప్పుడు వాటిని స్రవిస్తాయి. అనేక చర్మ సంరక్షణ సంస్థలు సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వంటి ఉత్పత్తులకు తేనెటీగ విషాన్ని వాడతాయి.ఈ పదార్థాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో వాపును తగ్గించే లక్షణాలు ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను అందిస్తుంది, ముడతలను తగ్గిస్తుంది.అదే విధంగా వెదురు, యుసా (ఒక రకమైన పండు), సెంటెల్లా ఆసియాటికా, బిర్చ్ సాప్ వంటి అనేక పదార్థాలు కొరియన్ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. (చదవండి: పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా? ) -
తేనెటీగల పెంపకంలో సాంకేతిక సహకారం... కిలో తేనె కోటి రూపాయలు...
-
ఇంధన సామర్థ్యంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సెక్రటరీ ఆర్.కే. రాయ్ కొనియాడారు. ఇంధన భద్రత, పర్యావరణ లక్ష్యాలను సాధించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించడానికి సహాయపడే ఇంధన సామర్థ్య కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఇంధన సామర్థ్య పరికరాలను అమర్చే ప్రాజెక్టును ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) రికార్డు స్థాయిలో నెల రోజుల్లోనే పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టును రాయ్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ భవన్లో ఏటా 1.96 లక్షల యూనిట్ల విద్యుత్తును, రూ.39 లక్షల మేర ప్రజా ధనాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. 139 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించొచ్చన్నారు. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి 13 నెలల్లోనే ఇంధనం ఆదా రూపంలో తిరిగి పొందవచ్చన్నారు. తొలి దశలో హాలోజన్ ల్యాంప్‌ల స్థానంలో 190 వాట్ల కెపాసిటీ గల 12 ఎల్ఈడీ ఫ్లడ్ లైట్లు, సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 28 వాట్స్ కెపాసిటీ గల 170 బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు, 1.8 టీఆర్ 3 స్టార్ రేటెడ్ హాట్ అండ్ కోల్డ్ ఇన్వర్టర్ టైప్ స్ప్లిట్ ఏసీలు, కారిడార్ల వద్ద లైట్లను నియంత్రించడానికి 40 మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల ఏటా రూ.6.25 లక్షల విలువైన49,469 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందన్నారు. నెల రోజుల్లోనే పనులు పూర్తి చేసిన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని రాయ్ అభినందించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు న్యూ ఢిల్లీలో బీఈఈ ఎంపిక చేసిన తొలి రాష్ట్ర భవన్ ఏపీ భవన్. ఇక్కడి ఇంధన పొదుపు చర్యల ఫలితాల ఆధారంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాల భవనాల్లోనూ ఇదే ప్రాజెక్టును అమలు చేయాలని బీఈఈ భావిస్తోంది. ఏపీ భవన్‌ను ఎంపిక చేసి ఏపీఎస్ఈసీఎం ద్వారా ఇంధన సామర్థ్య చర్యలను విజయవంతంగా అమలు చేసిన బీఈఈకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంధన సామర్థ్యంలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సామర్థ్యంలో వినూత్న ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. భారీ స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారింది. ఏపీని చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు కేంద్రం చెప్పే స్థాయికి చేరుకుంది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ఏపీ అనుసరిస్తున్న ‘రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)’కి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీని ఆదర్శంగా తీసుకుని 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. బీఈఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడేళ్లుగా ఏటా రూ.3,914 కోట్ల విలువైన 5,608 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తోంది. ఇందులో ఒక్క పాట్ పథకం ద్వారానే 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్తును పొదుపు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ప్రత్యేకమైన ఐవోటీ ఆధారిత విద్యుత్తు పర్యవేక్షణ డివైస్‌ను రాష్ట్రంలోని 65 ఎంఎస్ఎంఈల్లో ప్రవేశపెట్టింది. ఇది యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ’ఏపీఎస్ఈసీఎం’కు ప్రశంసలు రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీయే ఈ ఎస్ఎల్ఎస్సీ. ఈ కమిటీ నేతృత్వంలో ఇంధన సామర్థ్య చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏపీఎస్ఈసీఎం సేవలను బీఈఈ డీజీ అభయ్ భాక్రే ప్రశంసించారు. ఏపీ మోడల్ ఎస్ఎల్ఎస్సీ విధానాన్ని ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, హరియాణ, తమిళనాడు, తెలంగాణ సహా 18 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని వెల్లడించారు. ఇంధన సామర్థ్యం, సంరక్షణ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, భాగస్వాముల్లో చైతన్యం తెస్తున్న ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బీఈఈ డైరెక్టర్ జనరల్‌తోపాటు క్లైమేట్ అండ్ ఎనర్జీ లీడ్ బ్రిటిష్ హై కమిషన్ లిబ్బి గ్రీన్, ఈఈఎస్ఎల్ ఎండీ విశాల్ కపూర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంకిత భావంతో పనిచేయడం వల్లే ఏపీఎస్ఈసీఎం దేశంలోనే ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు–2022, ఇతర అవార్డులను గెలుచుకుందని భాక్రే చెప్పారు. ఏపీఎస్ఈసీఎం ద్వారా బీఈఈ తొలిసారిగా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ బజార్ నిర్వహించి, ఇతర రాష్ట్రాలకు మార్గాన్ని చూపిందన్నారు. ఫలితంగా దేశం మొత్తం మీద రూ.2,500 కోట్ల విలువైన 73 ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను గుర్తించామని చెప్పారు. ఇందులో ఒక్క ఏపీలోనే రూ.400 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ..దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీఈఈ డైరెక్టర్, కార్యదర్శికి, ఏపీఎస్ఈసీఎం చైర్మన్ కె.ఎస్.జవహర్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు -
జాతీయ లక్ష్యానికి చేయూతనివ్వాలి..
సాక్షి, అమరావతి : ఇంధన పొదుపు, సామర్థ్యంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏపీ.. జాతీయ లక్ష్యానికి మరింత చేయూతనివ్వాల్సిందిగా బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే కోరారు. మార్చి 1న న్యూఢిల్లీలోని ఇండియన్ హాబిటాట్ సెంటర్లో జరగనున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) 21వ వ్యవస్థాపక దినోత్సవాలకు రాష్ట్రాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ(ఎస్డీఏ)గా ఉన్న ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం)కు సమాచారం అందించడం కోసం బాక్రే ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ఏపీలో 6.68 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన(ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయాలనే లక్ష్యాన్ని చేరుకునే కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బాక్రే కోరారు. -
ఏపీ భవన్లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేస్తోంది. 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) న్యూఢిల్లీలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ భవన్లో పవర్ కాంట్రాక్ట్ డిమాండ్ తగ్గింపు, ఎల్ఈడీ స్టేజ్ లైటింగ్, స్టార్ రేటెడ్ ఎయిర్ కండిషనర్లు, వంటగదిలో ఇండక్షన్ వంట ఉపకరణాల వినియోగం, మోషన్ సెన్సార్‌ను ఇన్స్టాల్ చేయడం, బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ)తో సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లను భర్తీచేయడం, హీట్ పంపుల ఏర్పాటు వంటి మార్పులు చేయనున్నారు. బీఈఈ ద్వారా ఎంప్యానల్ చేయబడిన థర్డ్ పార్టీ ఎనర్జీ ఆడిటింగ్ సంస్థ నిర్వహించిన ఈ ఎనర్జీ ఆడిట్ ప్రకారం, ఇది సంవత్సరానికి సుమారు 1.96 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా సుమారు 139 టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపుతోపాటు రూ.39 లక్షల విలువైన ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఈ లెక్కన ఇంధన సామర్థ్య చర్యల కోసం ప్రతిపాదించిన రూ.35 లక్షల పెట్టుబడి కేవలం ఏడాదిలోనే వచ్చేస్తుంది. వచ్చేనెల (మార్చి) చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) కృషిచేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేసి, కర్బన ఉద్గారాలను తగ్గించే జాతీయ లక్ష్యానికి దోహదపడే తొలి రాష్ట్ర భవన్‌గా ఏపీ భవన్ అవతరించనుంది. బీఈఈ ఆర్థిక సాయం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఇంధన సామర్థ్య చర్యలపై బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే తరఫున బీఈఈ కార్యదర్శి ఆర్.కె.రాయ్ ఆదివారం ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌తో సమావేశమయ్యారు. ఏపీ భవన్‌పై భారం లేకుండా బీఈఈ నుంచి ఏపీఎస్ఈసీఎంకు ఆర్థిక సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్.కె.రాయ్ ఈ సమావేశంలో చెప్పారు. బీఈఈ ఆర్థిక సహాయంతో ఏపీ భవన్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించినట్లు ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో బీఈఈ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ శర్మ, ఏపీ భవన్ అడిషనల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి పాల్గొన్నారు. -
ఇంధన పొదుపు దిశగా టీటీడీ అడుగులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇంధన సామర్థ్య చర్యల్లో భాగంగా పాత నీటి మోటార్ల స్థానంలో స్టార్ రేటెడ్ మోటార్లను అమర్చేందుకు యోచిస్తోంది. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం, విద్యుత్ ఆదాతో పాటు బిల్లులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. విద్యుత్ కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా ఈ బిల్లులను ఏడాదికి రూ.5 కోట్ల వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సంప్రదాయ హై కెపాసిటీ మోటార్ల స్థానంలో ఫైవ్ స్టార్ రేటెడ్ పంపు సెట్లను అమర్చనుంది. నీటి పంపింగ్ స్టేషన్లలో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), ఎనర్జీ డిపార్ట్మెంట్, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ సీఇడీసీఓ), టీటీడీ అధికారులు ఆదివారం వర్చువల్‌గా చర్చించారు. టీటీడీలో ప్రస్తుతం ఉన్న 118 పంపుసెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపుసెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. 4.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా టీటీడీలో ఉన్న పంపింగ్ స్టేషన్లలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించినట్టు ఏపీ సీడ్కో, ఏపీ ఎస్ఈసీఎం సీనియర్ అధికారులు వెల్లడించారు. 118 పంపు సెట్లను ఇంధన సామర్థ్య పంపుసెట్లతో భర్తీ చేయడానికి సుమారు రూ.3.18 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. వీటివల్ల ఏటా రూ.3.17 కోట్ల విలువైన 4.50 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఎల్ఈడీ లైటింగ్ ఉపకరణాలు, బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ) ఫ్యాన్ల విభాగాల్లో టీటీడీలో ఎనర్జీ ఎఫిషియెన్సీ డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్టులు అమలు చేశారు. మొదటి దశలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో 1000 ట్యూబ్ లైట్ల స్థానంలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 400 ఫ్యాన్లను బీఎల్డీసీ ఫ్యాన్లతో భర్తీ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదికి 1.64 లక్షల యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. రెండో దశలో టీటీడీ భవనాలలో ప్రస్తుతం ఉన్న 5 వేల సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో బీఎల్డీసీ ఫ్యాన్లతో భర్తీ చేయడానికి ఏపీ సీడ్‌కోతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి ఏటా రూ.62 లక్షల ఆదాతో దాదాపు 0.88 మిలియన్ యూనిట్లను ఆదా చేయగలవని భావిస్తున్నారు. సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ డి.నాగేశ్వరరావు, ఏపీఎస్ఈసీఎం సీఈఓ ఎ.చంద్రశేఖరరెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ జగదేశ్వరరెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈసీ సెల్ రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రూ.400 కోట్ల ‘ఇంధన’ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదర్శంగా ఏపీ సిమెంట్, స్టీల్, పవర్ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది. 49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. అదితితో సమన్వయం పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు. -
ఇంధన పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
సాక్షి, విశాఖపట్నం: దేశంలో పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) అశోక్‌కుమార్ చెప్పారు. కేంద్ర విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోని బీఈఈ సహకారంతో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) విశాఖలో బుధవారం పెట్టుబడుల బజార్ పేరిట సదస్సు నిర్వహించింది. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సదస్సుని అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి కనబరిచిన పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గొప్ప విషయమన్నారు. ఇంధన సామర్థ్య రంగంలో జాతీయస్థాయిలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ మొదటి అడుగు వేసిందని, వరుసగా ఇన్వెస్ట్మెంట్ బజార్స్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని ప్రశంసించారు. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి పెట్టుబడుల సదస్సులకు విశేష స్పందన లభించటం బీఈఈకి ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఏపీ ఆదర్శంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇన్వెస్ట్మెంట్ బజార్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంధన సామర్థ్య పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఈíసీఎం ఆధ్వర్యంలో ఆర్థికసంస్థల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికత అమలు చేసే పరిశ్రమలకు 5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం చేసిన ప్రతిపాదన కేంద్ర ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.15 వేలకోట్ల విలువైన ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విధానపరమైన ప్రమాణాలు రూపొందించడంలో ఏపీఎస్ఈíసీఎం ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన చెప్పారు. నిరంతర సరఫరాకు విద్యుత్ వ్యవస్థ బలోపేతం రాష్ట్ర ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తరఫున ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని చెప్పారు. ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పూర్తిస్థాయి సహాయ, సహకారాలందిస్తుందన్నారు. ఇంధన సామర్థ్యం అభివృద్ధితో ఇంధన భద్రత లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వం వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదకారిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీఈపీడీíసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, సూర్యప్రతాప్, పీఎఫ్సీ జనరల్ మేనేజర్ మదన్మోహన్, బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
23న విశాఖలో ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్మెంట్ బజార్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సమన్వయంతో 23న విశాఖలో నిర్వహించనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రకటించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఏపీఎస్ఈసీఎం అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, దానిని వినియోగించుకోవడం కోసం పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఆసక్తి గల పరిశ్రమలను, బ్యాంకులను, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బజార్ వేదికగా పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తిస్తామని, సదస్సులో ఎంపికైన పరిశ్రమలకు ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందే ఏర్పాటు చేస్తామని అభయ్ బాక్రే చెప్పారు. గతేడాది మార్చిలో ఇదే విశాఖలో దేశంలో తొలిసారిగా ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సును నిర్వహించిన ఘనత ఏపీకి దక్కుతుందని, విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఏపీ పనితీరును గుర్తించి మరోసారి విశాఖలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిశ్రమల నుంచి ఏపీఎస్ఈసీఎంకు ప్రతిపాదనలు వస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి, ఆర్థిక సంస్థలకు పంపుతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రశంసించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులతో బాక్రే ఆదివారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తొలుత ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు అభయ్ బాక్రేకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 18.8 గిగావాట్లు ఉండగా, అందులో 40 శాతం (7.5 గిగా వాట్లు) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తే అని తెలిపారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు కూడా పునరుత్పాదక ఇంధనాన్ని ఎగుమతి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అభయ్ బాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య రంగాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఏపీ, కేరళ తరహాలో అన్ని రాష్ట్రాలు ఇంధన సామర్థ్య విభాగాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన సామర్థ్యం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం అధికారులకు బాక్రే సూచించారు. ఈ సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘పాట్’లో మరిన్ని పరిశ్రమలు
సాక్షి, అమరావతి: ఇంధన వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం పరిధిలోకి కొత్తగా మరికొన్ని పరిశ్రమలు, సెక్టార్లను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పథకం పరిధిలో ఉన్న సెక్టార్ల నుంచి కొత్తగా 143 పరిశ్రమలను గుర్తించారు. అదనంగా 4›పారిశ్రామిక సెక్టార్లను పాట్ పథకంలోకి తేవడం ద్వారా మరో 85 పరిశ్రమలకు పథకం వర్తిస్తుంది. బీఈఈకి ప్రతిపాదనలు పరిశ్రమల్లో విద్యుత్, ఇతర ఇంధన వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల తక్కువ ఇంధనంతో ఎక్కువ ఉత్పత్తి సాధించేందుకు వీలవుతుంది. తద్వారా పారిశ్రామిక రంగంలో 2031 నాటికి దేశవ్యాప్తంగా 47.5 ఎంటీవోఈ (మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్) ఇంధనం ఆదా చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలో 36 భారీ పరిశ్రమల్లో పాట్ పథకం అమలు చేయటం ద్వారా రూ.5709 కోట్ల విలువైన 0. 818 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయగలిగారు. క్లోర్–ఆల్కలీ, స్టీల్, సిమెంట్, వాణిజ్య భవనాలు (ఎయిర్ పోర్ట్, హోటళ్లు), టెక్స్టైల్స్ తదితర సెక్టార్లలో కొత్తగా 143 పరిశ్రమలను పాట్ పథకంలోకి తీసుకొస్తోంది. కొత్తగా ఫార్మా, ఇంజనీరింగ్ , ఆటోమొబైల్, సిరామిక్స్, ఆహారం, మత్స్య పరిశ్రమల సెక్టార్లకు చెందిన 85 పరిశ్రమలను పాట్ పథకంలోకి తెచ్చేందుకు బీఈఈకి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పాట్ ప్రగతి నివేదిక విడుదల ఆంధ్రప్రదేశ్‌లో పాట్ పథకం ప్రగతి నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదివారం విడుదల చేశారు. అన్ని శాఖల్లో ఇంధన పరిరక్షణ విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, శాఖల విభాగాధిపతులకు సూచించారు. ఏపీఎస్ఈసీఎం, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. -
సత్ఫలితాలిస్తున్న ‘పాట్’
సాక్షి, అమరావతి: భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) పదేళ్లుగా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాట్ వల్ల రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్‌తో కూడిన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనం ఆదా అయింది. అంతేకాదు.. 2.464 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను కూడా తగ్గించింది. ‘బీఈఈ’ ప్రోత్సాహం పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ కరెంటును సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) పాట్ పథకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను అందిస్తోంది. రాష్ట్రంలో ఏపీఎస్ఈసీఎం ద్వారా 65 ఎంఎస్ఎంఈల్లో వీటిని అమర్చింది. ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందిస్తాయి. తద్వారా ఇంధన ఆదాకు దోహదపడతాయి. పాట్ పథకం లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కూడా బీఈఈ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 4,01,496 సర్టిఫికెట్లను అందించింది. వీటిని పవర్ ఎక్సే్ఛంజ్‌లో విక్రయించడం ద్వారా ఆ పరిశ్రమలు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించని పరిశ్రమలు ఆ సర్టిఫికెట్లను డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి. అలా 2,79,667 సర్టిఫికెట్లను పలు పరిశ్రమలు కొన్నాయి. అన్ని పరిశ్రమలు ‘పాట్’ పరిధిలోకి రావాలి భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో పాట్ పథకం వల్ల భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగింది. ఈ పథకం పరిధిలోకి రావాలని అన్ని పరిశ్రమలను కోరుతున్నాం. –కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇంధన రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ప్రాజెక్ట్ ఎకనామిస్ట్ మాల్వీ మెహ్రోత్రా ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బీఈఈ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్(పాట్) పథకంపై రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో అవగాహనా సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భారీ పరిశ్రమల్లో ‘పాట్’ అమలు చేయడం ద్వారా సాధించిన ఫలితాలను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దశాబ్దకాలంలో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనం(బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్) ఆదా అయిందని తెలిపారు. 2.464 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని.. భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగిందని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. పాట్ పథకాన్ని భారీ పరిశ్రమలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం కింద పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను బీఈఈ మంజూరు చేస్తుందని, వీటి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చన్నారు. పరిశ్రమల కోసం విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరించి మరింత బలోపేతం చేయాలని సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారని విజయానంద్ పేర్కొన్నారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 65 ఎంఎస్ఎంఈ యూనిట్లలో ఐఓటీ పవర్ మానిటరింగ్ పరికరాలను అమర్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సంస్థ జాయింట్ డైరెక్టర్ పుష్పేంద్ర నాయక్, ఈఈఎస్ఎల్ అసోసియేట్ మేనేజర్ కిషోర్ సింగ్ పాటిల్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నగరాల్లో ‘కరెంట్’ ఆటోలు.!
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడ్పాటుగా ప్యాసింజర్ ఆటోల విద్యుద్దీకరణకు కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అంగీకరించింది. ఈ క్రమంలో తొలివిడతగా తిరుపతిలో 200, విశాఖపట్నంలో 100 త్రీవీలర్లు ఎలక్ట్రికల్ వాహనాలుగా మారనున్నాయి. మరోవైపు జాతీయ రహదారుల వెంబడి ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, నగరాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు చార్జ్ పాయింట్ చొప్పున నెడ్కాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ ఆధ్వర్యంలో ‘గో ఎలక్ట్రిక్ ప్రచారం’లో భాగంగా త్రీ–వీలర్ ప్యాసింజర్ ఆటోల విద్యుదీకరణ (రెట్రోఫిట్టింగ్)కు స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఫండ్ నుంచి రూ.2 కోట్లు వెచ్చించనున్నారు. ఏపీతో సహా 14 రాష్ట్రాల్లో.. దేశంలో 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించాల్సిన అవసరం ఉందని గుర్తించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఏపీతో సహా 14 రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. రాయితీలు అందించేందుకు రూ.8,596 కోట్ల నిధులను కేటాయించింది. టూ వీలర్లకు కిలోవాట్‌కు రూ.15 వేలు, 3,4 చక్రాల వాహనాలకు కిలోవాట్‌కు రూ.10 వేలు, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులకు కిలోవాట్‌కు రూ.20వేల చొప్పున రాయితీ ప్రకటించింది. తద్వారా 2024 నాటికి దేశ వ్యాప్తంగా 7వేల ఎలక్ట్రిక్ బస్సులు, 5 లక్షల త్రీ వీలర్లు, 55 వేల ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్లు, 10 లక్షల టూ వీలర్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగంగా స్వీకరించడం, తయారు చేయడం (ఫేమ్–2) పథకం కింద దేశవ్యాప్తంగా 2019 నుంచి 4.08 లక్షల వాహనాలు, రాష్ట్రంలో 15,865 ఈ–వాహనాలను విక్రయించారు. రోజుకు 3,76,801 లీటర్ల ఇంధనం ఆదా అయ్యింది. దీంతో రోజుకు 8,57,441 కేజీల కార్బన్డయాక్సైడ్ తగ్గింది. ఏపీ ముందడుగు.. వచ్చే పదేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఏపీ ముందడుగు వేస్తోంది. ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ముందుకొచ్చింది. దీనికి ఫేమ్–2 పథకం ద్వారా రాయితీలిచ్చేందుకు బీఈఈ నుంచి అనుమతినిచ్చాం. ఈవీలను ప్రోత్సహించడానికి వైజాగ్, హైదరాబాద్, చెన్నై, లక్నో, బెంగళూరు, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో అతి త్వరలో సమావేశాలు నిర్వహించనున్నాం. –అభయ్ బక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ అందరికీ అందుబాటులో ఈవీ స్టేషన్లు.. రాష్ట్రంలో దాదాపు 109 ఛార్జింగ్ స్టేషన్లున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లోని ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున అందుబాటులోకి తీసుకురావడానికి నెడ్కాప్ ప్రణాళికలు తయారు చేసింది. ప్రైవేట్ భూ యజమానులతో కలిసి 4 వేల లొకేషన్లను ఇందుకోసం గుర్తించింది. 10 మంది డెవలపర్లను కూడా ఎంపానెల్ చేసింది. – ఎస్.రమణారెడ్డి, వీసీఎండీ, నెడ్కాప్ -
ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు ఆస్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సామర్థ్య రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తెలిపారు. అలాగే పెట్టుబడులకు ఏపీలో సానుకూల వాతావరణం కూడా ఉందన్నారు. జాతీయ స్థాయిలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెల్లడించారు. ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ అధికారులతో బాక్రే ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన రంగంలో పెట్టుబడుల వల్ల పారిశ్రామిక, రవాణా, భవన నిర్మాణం, తదితర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనివల్ల ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన మెరుగవుతుందన్నారు. ఇంధన రంగంపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతుందని.. దీంతో పర్యావరణం కూడా మెరుగవుతుందని బాక్రే వివరించారు. ఇంధన సామర్థ్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఆయన అభినందించారు. రోడ్ మ్యాప్‌ను రూపొందించాలి.. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు ద్వారా అన్ని రంగాల్లో 15,787 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేసేందుకు అవకాశం ఉందని అజయ్ బాక్రే తెలిపారు. 2030 నాటికల్లా 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్విలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఏపీ ఇంధన సంరక్షణ మిషన్‌కు సూచించారు. జాతీయ స్థాయిలో 2030 నాటికి 150 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పారిశ్రామిక రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో రాష్ట్రం కనబరుస్తున్న ఉత్తమ పనితీరుని చూసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని సహాయక ఏజెన్సీగా నియమించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తేనెలూరుతున్న ఉపాధి
రాజానగరం: ఉద్యోగాల కోసం పరుగు తీయకుండా కొందరు ఉన్నచోట స్వయం ఉపాధిని ఎంచుకుని లబ్ధి పొందుతున్నారు. ‘తేనెపట్టు’ను స్వయం ఉపాధిగా ఎంచుకుని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి పరిసరాల్లో ఇటువంటి ఔత్సాహికులు కనిపిస్తున్నారు. పండ్ల తోటల్లో వీటిని ఏర్పాటు చేయడం వలన పరపరాగ సంపర్కం జరిగి, దిగుబడులు పెరగడానికి దోహపడుతున్నాయని రైతులు కూడా సహకరిస్తున్నారు. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ (ఎన్బీహెచ్ఎం) పథకం ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజు బీఎస్సీ (కంప్యూటర్స్) చదివాడు. స్వతహాగా ఫొటోగ్రాఫర్. అప్పుడప్పుడూ రంపచోడవరం, అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అరకొరగా జరిగే తేనెటీగల పెంపకంపై కాస్తోకూస్తో తెలుసుకున్నాడు. యూట్యూబ్ చానళ్లలో చూసి స్వయం ఉపాధికి అదే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. గుంటూరులో కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడు. వివిధ రకాల పండ్ల తోటలకు నిలయంగా పేరొందిన రాజానగరం మండలం తేనెటీగల పెంపకానికి అనుకూలమని భావించాడు. శ్రీకృష్ణపట్నంలో ఏడాది క్రితం ఐదు పెట్టెలతో తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. ఎంఏ చదివిన స్నేహితుడు నల్లమిల్లి వెంకటేష్(వాసు)ను కూడా కలుపుకొన్నాడు. ఏడాది తిరక్కుండానే వంద పెట్టెల్లో తేనెటీగలను పెంచుతూ తేనె తీసే ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ‘విశిష్ట’ బ్రాండ్ పేరుతో వ్యాపారం శ్రీకృష్ణపట్నంలో మామిడి, జీడిమామిడి, నిమ్మ, నారింజ, పనస, సపోటా, జామ, నేరేడు, సీతాఫలం, తదితర పండ్ల చెట్లు విస్తారంగా ఉంటాయి. తేనె ఉత్పత్తికి అవసరమైన పుప్పొడికి ఇక్కడ కొదవుండదు. తేనెటీగలు ఆయా పూవులపై వాలి, పుప్పొడి నుంచి తేనె సంగ్రహించి, తోటల్లో అమర్చిన పెట్టెల్లో నిక్షిప్తం చేస్తుంటాయి. ఈ ప్రక్రియ ఏడాది పొడవునా జరిగేందుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. దీంతో ఇక్కడి నుంచే తేనె సేకరించి విక్రయించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సహకారంతో తేనెను ప్రత్యేక యంత్రం (హనీ ఎక్స్ట్రాక్టర్) ద్వారా శుద్ధి చేసి, సీసాల్లో ప్యాక్ చేస్తున్నారు. దానికి ‘విశిష్ట’ పేరు పెట్టి ఉన్నచోటనే అమ్మకాలు సాగిస్తున్నారు. 40 రోజులు పడుతుంది పెట్టెల ద్వారా తేనె సేకరణకు 40 రోజులు పడుతుంది. స్వచ్ఛత, చిక్కదనం కలిగి ఉండటంతో దీని కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకృష్ణపట్నంతో పాటు గుంటూరు జిల్లా జాగర్లమూడిలో కూడా మరో తేనెటీగల పెంపకం యూనిట్‌ను వీరు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో జనం రోగ నిరోధక శక్తి పెంపుపై దృష్టి పెట్టారు. దీంతో తేనె వాడకంకూడా పెరిగింది. ఇద్దరే కాదు.. ఇంకా ఉన్నారు తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న వారు రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అనపర్తికి చెందిన శ్రీరామరాజు ఎంబీఏ చదివి, నాలుగేళ్ల క్రితమే తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పీరా రామచంద్రపురం ప్రధాన కేంద్రంగా చేసుకుని గుంటూరు, రాజవొమ్మంగిల్లో కూడా ఈ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ‘గోల్డెన్ బీస్’ పేరుతో సొంతంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఐటీడీఏ, ఉద్యాన శాఖ, డీఆర్డీఏలద్వారా ప్రత్యేక ప్రాజెక్టులు చేస్తూ, ఔత్సాహికులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. రాజానగరం మండలం రఘుదేవపురంలో నక్కిన కృష్ణ అనే రైతు సుమారు 20 సంవత్సరాల నుంచి తేనెటీగల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదివిన ఆయన కుమారుడు శ్రీను ఈ యూనిట్‌ను కొనసాగిస్తున్నారు. దివాన్‌చెరువులో మార్ని గంగరాజు, కానవరంలో నాగేశ్వరరావు, చక్రద్వారబంధంలో కన్నబాబు కూడా దీనిని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు. రాయితీతో ప్రోత్సహిస్తున్నాం నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్(ఎన్బీహెచ్ఎం)లో తేనెటీగల పెంపకం యూనిట్లపై ప్రభుత్వం 50 నుంచి 75 శాతం రాయితీ అందజేస్తుంది. ఒక యూనిట్(8 పెట్టెలు)కు ఒక తేనెటీగల పెట్టె, అవసరమైన తేనెటీగలు, రక్షణ దుస్తులు కూడా సమకూర్చి, రంపచోడవరంలో అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. అనంతరం యూనిట్లు పెట్టి, మంచి ప్రగతి చూపించిన వారి వివరాలను ‘మధుక్రాంతి’ యాప్‌లో అప్లోడ్ చేసి, మరింత ప్రోత్సాహం అందించేలా కృషి చేస్తున్నాం. – టి.రిని, ఉద్యాన శాఖాధికారి, రాజానగరం -
ఇలా వాడితే.. చాలా ఆదా!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో ఏసీలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వినియోగించడం ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. బీఈఈ చెప్పిన అంశాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ టన్నుల రిఫ్రిజిరేషన్ (టీఆర్) వ్యవస్థాపించిన మొత్తం ఎయిర్ కండీషనర్ సామర్థ్యం ఉంది. ఇది 10 సంవత్సరాలలోపు దాదాపు 250 మిలియన్ టీఆర్‌కు చేరుకునే ప్రమాదం ఉంది. 2030 నాటికి ఎయిర్ కండిషనింగ్‌తో దేశంలో విద్యుత్ లోడ్ సుమారు 200 గిగావాట్స్‌కు పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఏసీలకు ఏటా డిమాండ్ దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతంగా నమోదవుతోంది. ఈ క్రమంలోనే వినియోగదారులు తమ ఏసీల్లో డిఫాల్ట్ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేస్తే దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని బీఈఈ నివేదికలో పేర్కొంది. పెంచితేనే మంచిది.. ఒక మనిషి 1.5 టన్నుల ఏసీని ఉపయోగిస్తే, అది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్‌ను వినియోగించి, దాదాపు 0.98 కిలోల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. గది ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల వల్ల విద్యుత్తులో 6శాతం ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 36–37 డిగ్రీల సెల్సియస్. కానీ 18–21 డిగ్రీల సెల్సియస్‌కు ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, ఎముకల సమస్య, తలనొప్పి, కళ్లు, చర్మం పొడిబారడం, అల్పోష్ణస్థితి, అధిక రక్తపోటు (బీపీ) వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు సర్దుబాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఏం) విజ్ఞప్తి చేస్తోంది. ఏపీఎస్ఈసీఎం సూచనలు ► వేడిగాలి ఇంట్లోకి రాకుండా ఉండేలా కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి. ► ఎయిర్ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచాలి. ప్రతి 30 నుంచి 90 రోజులకు వాటిని శుభ్రపరచడం లేదా కొత్తవాటిని మార్చడం ద్వారా ఏసీ యూనిట్లో గాలి సజావుగా కదులుతుంది. ► వేడిని ఉత్పత్తి చేసే పరికరాలు, ఉపకరణాలను థర్మోస్టాట్‌కు దూరంగా ఉంచాలి. ► సాధ్యమైనంత వరకూ సీలింగ్ ఫ్యాన్లను ఉపయోగించాలి. ► గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, మొబైల్ చార్జర్లు, ఏసీల స్విచ్‌లను ఆఫ్ చేయాలి. -
టీటీడీలో ‘క్లీన్ కుకింగ్’ లడ్డూ!
సాక్షి, అమరావతి: ‘క్లీన్ కుకింగ్’ విధానంలో తిరుమల లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం)కు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తాజాగా ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2030 నాటికి 6.68 టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీవోఈ) ఇంధన ఆదాకు అవకాశం ఉందని, దేశ వ్యాప్తంగా బొగ్గు, విద్యుత్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీకి బీఈఈ సహకారం ► తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పవిత్ర లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి క్లీన్ కుకింగ్ విధానం ఉపయోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించవచ్చు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని బీఈఈ అందిస్తుంది. ► టీటీడీ సహకారంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను ఏపీఎస్ఈసీఎం పంపించాలి. ఈ విధానంలో ప్రసాదం తయారీకి కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే గ్యాస్‌కు బదులు ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగిస్తారు. ► కొద్ది రోజుల క్రితం మేము తిరుమలలో పర్యటించాం. ఆ సందర్భంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కుకింగ్, ఆస్పత్రులు, భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్‌రెడ్డికి సూచించాం. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల స్థానంలో విద్యుత్ ఆదా చేసే ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లను అమర్చాలని చెప్పాము. ఇందుకోసం ఇప్పటికే ఏపీఎస్ఈసీఎం టెండర్లు ఆహ్వానించింది. విద్యుత్ బిల్లులు ఆదా ► టీటీడీలో ఏపీఎస్ఈసీఎం ద్వారా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్‌ను బీఈఈ నిర్వహించింది. ఇక్కడ ఏటా 68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, 30% పునరుత్పాదక ఇంధనం, 70% సంప్రదాయ విద్యుత్ ఉంది. ► విద్యుత్ బిల్లుల కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు వెచ్చిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యల ద్వారా ఇందులో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 213 నీటి పంపుసెట్లలో 118 ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చడం వల్ల ఏటా 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. ► టీటీడీలో ఇదివరకు రోజుకు 34 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుండగా, ఇప్పుడు అది 44 లక్షల గ్యాలన్లకు చేరింది. ఈ దృష్ట్యా జల వనరుల సమర్థ నిర్వహణకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. పెట్టుబడుల సద్వినియోగం ► దేశంలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల మేర ఇంధన సామర్థ్య పెట్టుబడులకు అవకాశముంది. ఏపీ ఇప్పటికే ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగంలో దేశంలో ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. అందువల్ల ఇంధన సామర్థ్య పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ క్రీయాశీలకంగా వ్యవహరించాలి. ► దీని వల్ల పరిశ్రమలు, రవాణా, విద్యుత్, భవన నిర్మాణం వంటి కీలక రంగాలలో ఇంధన వినియోగ సామర్థ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనను మెరుగు పరచవచ్చు. ► కేంద్ర ప్రభుత్వం నేషనల్ కార్బన్ మార్కెట్ల(ఎన్సీఎం) అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై బీఈఈ ఒక నమూనా కార్యాచరణ తయారు చేసింది. దీనిపై ఏపీ తరుఫున అభిప్రాయాలు, సూచనలు తెలపాల్సిందిగా ఏపీఎస్‌ఈసీఎంకి సూచించాం. -
ఇంధన పొదుపునకు ‘ఫిక్కీ’ సాయం
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తున్న ఇంధన పొదుపు చర్యలను గుర్తించిన కేంద్రం.. వాటికి మరింత ఊతమిచ్చేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా నియమించింది. పెర్ఫార్మ్ అచీవ్ అండ్ ట్రేడ్ (పాట్) పథకం కింద పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దీనిని గుర్తించిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నిర్దేశించుకున్న ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించేందుకు, పాట్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఫిక్కీ సహకారం అందించనుంది. రాష్ట్రంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా బీఈఈ చెబుతోంది. లక్ష్యాన్ని చేరుకునేలా.. దేశవ్యాప్తంగా 2070 నాటికి కర్బన ఉద్గారాలను లేకుండా చేయాలనే లక్ష్యంలో భాగంగా 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించాలని, అందులో మన రాష్ట్రం 2030 నాటికి 6.68 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనాన్ని ఆదా చేయాలని బీఈఈ నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న రంగాలతోపాటు కొత్త రంగాల్లోని వినియోగదారులను గుర్తించడంలో ఫిక్కీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ ఈసీఎం) తోడుగా నిలుస్తుంది. ఫిక్కీ ఇతర రాష్ట్రాలు, దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, కొత్త సాంకేతికతలను అధ్యయనం చేసి ఏపీకి అన్వయిస్తుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారంతో పాట్ పథకం సైకిల్–1లో దాదాపు రూ.1,600 కోట్ల విలువైన 2,386 మిలియన్ యూనిట్ల ఇంధనానికి సమానమైన దాదాపు 0.20 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ మేర ఇంధనాన్ని పొదుపు చేయగలిగింది. సైకిల్–2లో దాదాపు రూ.2,356.41 కోట్ల విలువైన 3,430 మిలియన్ యూనిట్లకు సమానమైన 0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ను ఆదా చేసింది. పాట్ పథకం ప్రస్తుతం 13 రంగాల్లో 1,073 డీసీల (భారీ ఇంధనం ఉపయోగించే పరిశ్రమల)ను కవర్ చేస్తుంది. ఇవి పారిశ్రామిక ఇంధన వినియోగంలో సగం మాత్రమే. కనీసం 80 శాతాన్ని కవర్ చేయడానికి ఈ పథకంలో రవాణా, విమాన యానం, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, షిప్పింగ్ వంటి అదనపు రంగాలను బీఈఈ చేర్చింది. వేగంగా ‘పాట్’ అమలు దేశంలోని మొత్తం ఇంధనంలో 40 శాతం పారిశ్రామిక రంగం మాత్రమే వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఈ రంగంలో ఇంధన వినియోగం భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ వంటి రాష్ట్రాల్లో వేగంగా పాట్ పథకాన్ని అమలు చేయడంలో సహకారం అందించేందుకు ఫిక్కీని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా నియమించింది. – అభయ్ భాక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ ఫిక్కీ సహకారం శుభపరిణామం పారిశ్రామిక రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమల్లో ఇంధన పొదుపు కార్యక్రమాల అమలులో ఏపీకి మద్దతిస్తూ.. ఫిక్కీని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా బీఈఈ నియమించడం శుభపరిణామం. – బి. శ్రీధర్, కార్యదర్శి, ఇంధన శాఖ -
ఇంధన సామర్థ్యం, పొదుపులో ఏపీ కృషి అభినందనీయం
సాక్షి, అమరావతి : ఇంధన సామర్థ్యం, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే అభినందించారు. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా మారిందని ప్రశంసించారు. యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సు ముగింపులో భారతీయ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. ఆ వివరాలను ఆదివారం ఏపీ ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి మీడియాకు చెప్పారు. ఏపీలో 65 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల్లో ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్) పవర్ మానిటరింగ్ డివైజ్‌ను ఇన్స్టాల్ చేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఏపీ చర్యలు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేవిగా ఉన్నాయని అభయ్ భాక్రే కొనియాడారు. కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గితేనే సమగ్రాభివృద్ధి దేశంలో కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడం ద్వారా సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సమతుల్యంపై దృష్టి సారించిందని, 2030 నాటికి 33–35 శాతం ఉద్గార తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని అభయ్ భాక్రే చెప్పారు. స్వచ్ఛమైన ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా అవసరమన్నారు. బీఈఈ చేస్తున్న ప్రయత్నాల వల్ల 2030 నాటికి.. 557 మిలియన్ టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఇంధన–పొదుపు పెట్టుబడి సామర్థ్యం దాదాపు రూ.10.02 లక్షల కోట్ల నుంచి రూ.13.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని, ఈ అవకాశాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుతం ఉన్న మొత్తం ఇంధన వినియోగం 347 మిలియన్ యూనిట్లు కాగా, 2031 నాటికి 443.4 మిలియన్ యూనిట్లకు చేరుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ఇంధన సామర్థ్య ఏజెన్సీల స్థాపనను తప్పనిసరి చేస్తూ ఇంధన సంరక్షణ చట్టం–2001ని సవరించనుందని, దీనిని అన్ని రాష్ట్రాలూ పాటించాలని అభయ్ భాక్రే సూచించినట్టు చంద్రశేఖరరెడ్డి వివరించారు.