CCMB
-
HYD: హోటళ్లలో తనిఖీలు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: హబ్సిగూడ, నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం(నవంబర్ 10) ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు.కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.ఎక్స్పైర్ అయిన పాడైన ఫుడ్ ఇంగ్రీడియెంట్స్‌తో వంట చేస్తున్నట్లు గుర్తించారు.దీంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్ కిచెన్లలోనూ తనిఖీలు చేశారు.కుళ్ళిపోయిన టమాటో, పొటాటోలను వంటకాల్లో ఉపయోగిస్తున్నారని తేలింది.వీటికి తోడు కాలం చెల్లిన పన్నీర్, మష్రూమ్‌లతో వంటల చేస్తున్నట్లు గుర్తించారు.ఇదీ చదవండి: HYD: హోటల్లో భారీ పేలుడు.. పక్కనున్న బస్తీలో ఎగిరిపడ్డ రాళ్లు -
కేరళ నాయర్లూ...రాజస్తాన్ గుజ్జర్లూ చుట్టాలే!
దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని నాయర్లు... వాయవ్య దిశలో ఉన్న రాజస్తాన్, దాని పొరు గునే ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలేనట! ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. నాయర్లతోపాటు కేరళకే చెందిన థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయవ్య ప్రాంతానికి చెందిన వారని జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించింది. – సాక్షి, హైదరాబాద్ వలసలపై భిన్న వాదనలు... భారతదేశ నైరుతి ప్రాంతం.. అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవవైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులు చెబుతుంటారు. యూదు లు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వారంతా గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఈ వాదనతో మరికొందరు విభేదించేవారు. వారంతా ఇండో–సిథియన్ వర్గం వారని, దేశ వాయవ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొనేవారు. డీఎన్ఏ సేకరణతో... ఈ నేపథ్యంలో నాయర్లు సహా ఇతరుల వలస ఎలా సాగింది? వారు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వంటి భూస్వామ్య, యుద్ధవీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించింది. అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులను (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) విశ్లేషించింది. వాటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో తంగరాజ్ బృందం పోల్చిచూసింది. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్ (ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయవ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వారి మధ్య ఎక్కువ జన్యుసంబంధాలు.. నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయవ్య ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వారిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది. తల్లివైపు నుంచి అందిన జన్యు సమా చారాన్ని విశ్లేషిస్తే పశ్చిమ యూరేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోంది. దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వారు భాగమై ఉంటారని చెప్పవచ్చు. – డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, శాస్త్రవేత్త గోదావరి తీరం మీదుగా... భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయవ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు నాయర్లు, ఇతర వర్గాల ప్రజలు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తేలింది. – సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి -
కేరళ నాయర్లూ... రాజస్థాన్ గుజ్జర్లూ చుట్టాలే!
కేరళలో ఉన్న నాయర్లకు.. రాజస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని గుజ్జర్లకు మధ్య సంబంధం ఏమిటి? మీకు తెలుసా? ఈ రోజు ఇరువురికీ మధ్య అస్సలు సంబంధం లేకపోవచ్చునేమో కానీ.. ఒకప్పుడు మాత్రం ఇద్దరు దగ్గరి చుట్టాల్లాంటి వారు అంటోంది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ). ఒక్క నాయర్లు మాత్రమే కాదు.. కేరళలోనే ఉండే థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయువ్య ప్రాంతానికి చెందిన వారని వీరు జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించారు. కొంచెం వివరంగా చూస్తే.. భారత దేశ నైరుతి ప్రాంతం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవ వైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చెబుతారు. యూదులు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వీరందరూ గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఇతరులు మాత్రం వీరందరూ ఇండో సిథియన్ వర్గం వారని, దేశ వాయువ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జన్యుపరంగా వీరి వలస ఎలా సాగింది? వీరు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎండీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ వంటి భూస్వామ్య, యుద్ధ వీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించి అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులు (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు అన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) గుర్తించారు. వీటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో పోల్చి చూశారు. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్ (ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయువ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ‘‘నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయ్యు ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు. అంతేకాకుండా... తల్లివైపు నుంచి అందిన జన్యు సమారాన్ని విశ్లేషిస్తే పశ్చి యురేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోందని దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వీరు భాగమై ఉంటారని చెప్పవచ్చునని ఆయన వివరించారు. ‘జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనపై సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి మాట్లాడుతూ భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయువ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తెలుస్తుందని అన్నారు. -
సీసీఎంబీ మొబైల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
-
మనుషుల్లో ఇన్ని వ్యాధులెందుకు.. వానర రహస్యం రట్టయ్యిందా?
మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్‌లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా.. సాక్షి, హైదరాబాద్: మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్‌సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపు రేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయా రయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యు మార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యుమార్పులకు సంబంధించిన సమా చారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వాన రులు, మనుషుల జన్యుక్రమాలను సరి పోల్చే పరిశోధన చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యు వుల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్రభావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యు మార్పులన్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలు పెట్టి మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. కొన్నింటిని గుర్తించాం.. మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్‌సెన్స్ మ్యుటేషన్స్)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్ ఫార్ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్ ఏఐ–3డీ అనే డీప్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్‌జీపీటీ అనుకోవచ్చు. చాట్‌జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు.. ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్ హూలాక్ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్ టెయిల్డ్ మకాక్ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు. జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట!. ఇది కూడా చదవండి: కిలో రూ.100 దాటిన టమాట ధరలు.. -
కొత్త వేరియంట్ ప్రభావం భారత్‌పై తక్కువే
సాక్షి, హైదరాబాద్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి స్పష్టం చేశారు. భారతీయులకు ఇప్పటికే మూక రోగనిరోధకత వచ్చి ఉండటం ఇందుకు కారణం అని అయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు కొనసాగించడం అవసరమన్నారు. గతంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో కొందరికి బీఎఫ్–7 సోకే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా వైరస్‌ను ఎదుర్కొన్నాక దేశంలో వాక్సినేషన్ జరిగిందని, ఆ తరువాత ఒమిక్రాన్ వచ్చినప్పుడు బూస్టర్ డోసులు వేసుకున్న కారణంగా భారతీయులు మెరుగైన రోగ నిరోధక శక్తితో ఉన్నారని అయన వివరించారు. అందుకే చైనా లాంటి పరిస్థితులకు ఇక్కడ అవకాశం ఉండదన్నారు. -
కోవిడ్ ఇక అంటువ్యాధి స్థాయిలోనే..
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి కథ ముగిసినట్టేనా? వేల సంఖ్యలో రోజువారీ కేసులు, ఆక్సిజన్ కొరతలు, ఆసుపత్రి చేరికలు ఇక గతకాలపు మాటేనా? కావచ్చు.. కాకపోనూవచ్చని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందికూరి. మారుతున్న వాతావరణ పరిస్థితులు.. నగరీకరణ, జంతు ఆవాసాల విస్తృతి తగ్గిపోతుండటం వంటి వాటి వల్ల భవిష్యత్తులోనూ జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో కోవిడ్ నియంత్రణలో కీలకపాత్ర పోషించిన వినయ్.. ‘సాక్షి’తో కోవిడ్ తదనంతర పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు! ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కథ ఇక ముగిసినట్టేనా? జవాబు: వైరస్ వ్యాధుల విషయంలో ముగింపు ఉండదు. దశాబ్దాలుగా వచ్చిపోతున్న ఫ్లూ మాదిరిగానే కోవిడ్ కూడా అప్పుడప్పుడూ మనల్ని పలకరిస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి వైరస్లు కాలక్రమంలో నెమ్మదిస్తాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఎండమిక్ అని, తరచూ కొన్నిచోట్ల వస్తుంటే ఎపిడమిక్ అని పిలుస్తారు. కోవిడ్ ఇకపై ఎపిడమిక్ స్థాయిలో కొనసాగుతుందని అంచనా. కోవిడ్ వైరస్ జన్యుక్రమం గురించి తెలుసుకొని మనం ఏం నేర్చుకోగలిగాము? ►జన్యుక్రమాల ద్వారా నిత్యం ఒక మహమ్మారి వైరస్‌ను పరిశీలించడం కోవిడ్‌తోనే మొదలైంది. వేల జన్యుక్రమాలను నమోదు చేయడం వల్ల వైరస్‌లో వచ్చే అతిసూక్ష్మ మార్పులనూ గుర్తించేందుకు వీలు ఏర్పడింది. ప్రొటీన్ కొమ్ములోని ఏ భాగంలో మార్పులొస్తే ఏ రకమైన లక్షణాలు రాగలవో అంచనా వేయవచ్చు. పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడమూ సాధ్యమైంది. భవిష్యత్తును అంచనా వేయడమూ వీలవుతోంది. భారతీయ పరిశోధనల్లో వచ్చిన మార్పులేంటి? ►కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చించడంతో మునుపెన్నడూ భారతీయ శాస్త్రవేత్తలు చేయని పనులను చేపట్టారు. జన్యుక్రమాల నమోదు, అత్యవసరంగా టీకా తయారీ వంటివన్నీ ఈ కోవకు చెందుతాయి. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇప్పటికీ పదో వంతు మంది శాస్త్రవేత్తలు కూడా లేరు. పాశ్చాత్య దేశాల్లో నిర్దిష్ట సమస్య పరిష్కారం లక్ష్యంగా వందల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. భారత్‌లో అలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థల మధ్య సహకారం మరింత పెరిగింది. సీసీఎంబీ మాతృసంస్థ సీఎస్ఐఆర్కు ఉన్న 35కుపైగా ల్యాబ్స్ మధ్య పరిశోధనల్లో పరస్పర సహకారం ఉందా? ►సీఎస్ఐఆర్ ల్యాబ్స్ అన్నీ ఒక అంశంపై సహకరించుకోవడం అన్నది ఆచరణసాధ్యమైన విషయం కాదు. కానీ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి మొదలుకొని వైరస్‌ను చంపేందుకు ఉన్న మార్గాల వరకూ అనేక అంశాల్లో సీఎస్ఐఆర్లోని పలు సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. మంచి ఫలితాలు సాధించాయి కూడా. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ పలు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా? ►ఇటీవలి కాలంలో మనుషులకు, జంతు ఆవాసాలకు మధ్య దూరం బాగా తగ్గిపోవడంతో జంతువుల్లోని వ్యాధులు మనుషులకు సోకుతున్నాయి. అలాగే వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమవుతోంది. వాటిని ఎదుర్కోవడం ఎలా? అన్న ప్రశ్నకు ‘వన్ హెల్త్’ కార్యక్రమం సమాధానం చెబుతోంది. మానవ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా... వాతావరణ పరిస్థితులు, జంతువుల ఆరోగ్యంపై నిత్యం నిఘా పెట్టడం క్లుప్తంగా వన్ హెల్త్ లక్ష్యం. దేశంలో క్షయను పూర్తిగా నివారించాలన్న లక్ష్యాన్ని అందుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ►క్షయవ్యాధిని మటుమాయం చేసేందుకు టీకా కచ్చితంగా కావాలి. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. దేశంలో క్షయ వ్యాధి నివారణకు ప్రస్తుతం 6–9 నెలల కార్యక్రమం నడుస్తోంది. వ్యాధి నయమవ్వాలంటే మందులను క్రమం తప్పకుండా వాడటం, పోషకాహారం తీసుకోవడం వంటివి కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల ఇవి అమలు కావడం లేదు. అందుకే వ్యాధి నివారణ కష్టతరమవుతోంది. -
సైన్స్‌ను జనం దరి చేర్చినవాడు
వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందించడం కోసం, దేశంలో గొప్ప గొప్ప శాస్త్రీయ సంస్థల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేసినవారు డాక్టర్ పుష్పా భార్గవ! ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. జన విజ్ఞాన వేదికకు ఆలంబనగా నిలిచిన గొప్ప సైన్సు కార్యకర్త. సైన్స్ ప్రచార కార్యక్రమాల్లో ఆ సంస్థను మున్ముందుకు నడిపిస్తూ– చేప మందు శాస్త్రీయతను ప్రశ్నించారు. న్యాయస్థానం వరకు వెళ్ళి, అది మందు కాదని నిరూపించారు. విశ్వ విద్యాలయాల్లో ప్రభుత్వం జ్యోతిషాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించారు. అలాగే, వాస్తు ప్రామాణికతను ప్రశ్నించారు. సమగ్రమైన చర్చ లేకుండా జీవ సాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. డాక్టర్ పుష్పా మిత్ర భార్గవ (22 ఫిబ్రవరి 1928–1 ఆగస్టు 2017) రాజస్థాన్‌లోని అజ్మీర్ (అజయ్ మేరు)లో జన్మించారు. 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీ (సేంద్రియ రసాయన శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వెనువెంటనే 21 సంవత్సరాల చిరుప్రాయంలో లక్నో యూనివర్సిటీ నుండి పీహెచ్డీ స్వీకరించారు. కొంతకాలం లక్నో యూని వర్సిటీలోనే లెక్చరర్‌గా పనిచేసి, తర్వాత కాలంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేరి స్థిరపడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనల్లో పాల్గొన్నారు. యూకే నుంచి వచ్చి హైదరాబాద్‌లోని ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఆర్ఆర్ఎల్)లో సైంటిస్ట్‌గా చేరారు. తర్వాత కాలంలో ఆ ప్రయోగశాల భారత రసాయన సాంకేతిక సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – ఐఐసీటీ)గా రూపాంతరం చెందింది. (చదవండి: నిజం... నిజం... డార్వినిజం) డాక్టర్ పీఎం భార్గవకు దేశ ప్రధానులందరితో దగ్గరి పరిచయాలుండేవి. అందువల్ల ఆయన హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ’ (సీసీఎంబీ)ని స్థాపించగలిగారు. 1977–1990 మధ్య కాలంలో దానికి వ్యవ స్థాపక సంచాలకుడిగా ఉండి, ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు. మాలిక్యులర్ సెగ్మెంట్స్ తయారీ కోసం ఒక అణుశక్తి ప్రయోగశాలను నెలకొల్పారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బయోటెక్నాలజీ విభాగం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని హైదరాబాద్‌లో ఆవిష్కరించి, నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం అయ్యారు. ఒక సైంటిస్ట్‌గా, ఒక డైరెక్టర్‌గా వివిధ స్థాయులలో పనిచేస్తూ, దేశ విదేశాలలోని పరిశోధనా శాలల సమన్వ యంతో ఒకానొక సమయంలో దేశ వైజ్ఞానిక పరి శోధనా రంగానికి వెన్నెముకగా నిలిచిన భార్గవ కృషి చాలా విలువైంది. (Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది) డాక్టర్ భార్గవకు లభించిన దేశ విదేశాల అవార్డులు, గుర్తింపులూ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇచ్చే లీజియన్ డి ఆనర్ (1998) పొందిన ఘనత వీరిదే. ఈ మధ్య కాలంలో దేశంలో వ్యాపించిన మత ఛాందసత్వ అసహనం పట్ల – దభోల్కర్, పన్సారే, కల్బుర్గీల హత్యల పట్ల కలత చెందిన భార్గవ, తన పద్మభూషణ్ పురస్కారాన్ని 2015లో భారత ప్రభుత్వానికి వాపస్ చేశారు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి, హైదరాబాద్‌ను తన స్వస్థలంగా మార్చుకుని, ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో దీన్ని ఒక ముఖ్య కేంద్రంగా మార్చినవారు. సత్యాన్ని ప్రేమించి, దాని కోసం అన్ని విధాలా పోరాడే స్ఫూర్తిని మనమంతా ఆయన జీవితం నుండి పొందుతూనే ఉండాలి! - డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (ఫిబ్రవరి 22న పుష్పా భార్గవ జయంతి) -
ఒమిక్రాన్ బలం మన బలహీనతే!
సాక్షి, అమరావతి: ‘డెంగ్యూ, మలేరియా, ఇన్‌ఫ్లూయాంజాతో నేటికీ మరణాలు సంభవిస్తున్నాయి. రోగ నిరోధకత బలహీనంగా ఉన్న వారిపై వీటి ప్రభావం ఉంటోంది. ఇదే తరహాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ల రూపంలో బలహీన రోగ నిరోధకత ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. కరోనా మూడో దశ వ్యాప్తి, ఒమిక్రాన్ ప్రభావంపై పలు అంశాలను ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. సీసీఎంబీలో ఏపీ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంది? డెల్టాతో పోలిస్తే ప్రస్తుతం వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ బలహీనంగా ఉంది. డెల్టా వైరస్ శరీరంలోకి వేగంగా ప్రవేశించడంతో పాటు స్పైక్ ప్రోటీన్‌తో కణాలపై దాడి చేస్తుంది. రిప్లికేషన్ (ఉత్పాదక సామర్థ్యం) బాగా ఉంటుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేగంగా వ్యాíపిస్తున్నా డెల్టా అంత తీవ్రతతో దాడి చేయడం లేదు. రిప్లికేషన్ తగ్గింది. వైరస్ ఎండమిక్ దశకు చేరుకున్నట్లేనా? డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో వైరస్ క్షీణించింది. దీన్ని ఆధారంగా చేసుకుని వైరస్ ఎండమిక్ దశకు చేరిందని భావించలేం. భవిష్యత్‌లో బలమైన లక్షణాలతో వైరస్ రూపాంతరం చెందవచ్చేమో చెప్పలేం. ఇన్‌ఫ్లూయాంజా దేశంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉందో తెలిసిందే. కేసుల నమోదు ఎప్పటిలోగా తారస్థాయికి చేరవచ్చు? మన దేశంలో ప్రస్తుతం పాండమిక్ దశలో ఉన్నాం. ఈ దశలో సాధారణంగా ప్రతి మూడు రోజులకు కేసుల నమోదు రెట్టింపు అవుతూ వస్తుంది. ఈ నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారంలో కేసుల నమోదు తారస్థాయికి చేరుతుంది. పాజిటివిటీ రేటు పెరిగే కొద్దీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఇదే జరుగుతోంది. బలహీన రోగనిరోధకత ఉన్న వారిపై ఒమిక్రాన్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదయ్యాయా? ఇప్పటివరకూ మేం పరీక్షించిన నమూనాల్లో ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదవలేదు. కేవలం ఒమిక్రాన్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. టీకాల నుంచి రక్షణ ఉంటోందా? గతంలో వైరస్ సోకడం, టీకాలు తీసుకోవడం వల్ల వచ్చిన రోగనిరోధకతను దాటుకుని ఒమిక్రాన్ వేరియంట్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. గతంలో వైరస్‌తో పరిచయం ఉండటం, టీకాలు తీసుకుని ఉండటం వల్ల టీ సెల్స్ కొంత రక్షణగా ఉంటున్నాయి. బలహీన రోగ నిరోధకత ఉండే వృద్ధులు, రోగులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతరులకు ప్రభుత్వం ప్రికాషన్ డోసు అందిస్తోంది. అర్హులైన వారంతా ప్రికాషన్ డోసు తీసుకోవాలి. ప్రికాషన్ డోసు కింద ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి? విదేశాల్లో మొదటి రెండు డోసులు కింద తీసుకున్న టీకా కాకుండా వేరే రకం టీకాను ప్రికాషన్ డోసు కింద ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. మన దేశంలో మాత్రం మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకుంటే ప్రికాషన్ డోసుగా అదే టీకాను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మొదటి రెండు డోసుల కింద ఏ టీకా తీసుకుంటే అదే టీకాను ప్రికాషన్ డోసు కింద పొందాలి. -
రూ. 16 కోట్లుంటేనే పసిదానికి ప్రాణం!
మల్లాపూర్: తమకు పండంటి పాప పుట్టిందని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు! ఇందుకు కారణం... ఆ చిన్నారిలో కదలికలు క్రమంగా తగ్గిపోవడమే!! ప్రస్తుతం నాలుగు నెలల వయసున్న ఆ బిడ్డ తల, కాళ్లు, చేతులు ఆడించలేని స్థితికి చేరుకోవడమే!! స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1గా పిలిచే అరుదైన జన్యువ్యాధి బారిన ఆ పసిపాప పడటమే!! ఈ వ్యాధి చికిత్సకు రూ. లక్షలు కాదు.. ఏకంగా రూ. కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో రెక్కాడితేకానీ డొక్కాడని ఆ నిరుపేద దంపతులు విలవిల్లాడుతున్నారు. దీనికితోడు కేవలం మరో 3 నెలల్లోనే ఆ సొమ్మును సమకూర్చుకోకుంటే పాప ప్రాణం దక్కదని తెలిసి దాతల సాయం కోసం చూస్తున్నారు. పిడుగులాంటి వార్త... నాచారం బాబానగర్‌కు చెందిన ఫయాజ్, రేష్మకు 2019లో వివాహం జరిగింది. ఫయాజ్ ఓ మొబైల్ షాప్‌లో పనిచేస్తుండగా ఆయన భార్య గృహిణి. వారికి 2021 ఆగస్టు 31న కుమార్తె ఫైజా జన్మించింది. తమ బిడ్డ కాళ్లు, చేతులు అడించట్లేదని గుర్తించిన తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చూపించారు. నెలపాటు చిక్సిత అందించినా చిన్నారి కోలుకోకపోవడంతో ఆమె జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానించి ఆమె రక్త నమూనాలను నిమ్స్‌కు పంపించారు. నిమ్స్ వైద్యులు శాంపిళ్లను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపగా ఆ చిన్నారి ఎస్ఎంఏ టైప్–1 జన్యు వ్యాధితో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వ్యాధిని నయం చేయడానికి విదేశాల నుంచి రూ. 10 కోట్ల ఖరీదైన ఇంజక్షన్తోపాటు దిగుమతి పన్నులు కలిపి రూ.6 కోట్లు కలిపి మొత్తం రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు. మంత్రి హరీశ్‌కు తల్లిదండ్రుల మొర... ఫయాజ్, రేష్మలు మంగళవారం వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి నివేదికలను చూపారు. దీంతో స్పందించిన ఆయన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇంజక్షన్ కోసం ప్రయత్నిద్దామని హామీ ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాతలు ఆర్థిక సాయం పంపాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు అకౌంట్ పేరు: ఫైజా అకౌంట్ నంబర్: 90928679014210 ఐఎఫ్ఎస్సీ కోడ్: IDFB0020101 యూపీఐ ట్రాన్స్‌శాక్షన్ కోసం: assist.faiza@icici -
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
సాక్షి, విజయనగరం: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. తొలుత అతనికి ముంబైలోని ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి గత నెల (నవంబరు) 27న విశాఖ చేరుకున్నాడు. అక్కడ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. కాగా, తాజాగా ఆ వ్యక్తికి మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ఒమిక్రాన్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వ్యక్తి నమునాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పరీక్షల కోసం పంపించారు. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 15 మంది నమునాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, పది నమూనాలలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఐదుగురి వివరాలు రావాలన్న ఆరోగ్యశాఖ ప్రజలు అనవసర వదంతులు నమ్మవద్దని తెలిపింది. ప్రజలు కోవిడ్ నిబంధలను పాటించాలని కోరింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ -
CCMB: గిరిజనులకు కోవిడ్ ముప్పు అధికం
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాధారణ ప్రజలతో పోలిస్తే గిరిజనులు కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేల్చారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు గిరిజన తెగల ప్రజలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. సీసీఎంబీ శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఈ పరిశోధనలు చేపట్టారు. సీసీఎంబీ... అండమాన్ నికోబార్ దీవుల్లోని స్థానిక తెగల ప్రజల జన్యుక్రమాలను పరిశీలించి.. వారు కోవిడ్ బారిన పడేందుకు ఉన్న అవకాశాలపై ఒక అంచనా కట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబేతో కలసి చేపట్టిన ఈ పరిశోధన కోసం మొత్తం 1,600 మంది గిరిజన తెగల ప్రజల జన్యు క్రమాలను విశ్లేíÙంచారు. మొత్తం 227 తెగలకు చెందిన (అండమాన్‌లోని ఒంగే, జరావా తెగలు కలుపుకొని) జన్యుక్రమాల్లో కోవిడ్‌కు గురయ్యేందుకు అవకాశమున్న పొడవాటి డీఎన్ఏ పోగులు ఉన్నట్లు తెలిసింది. మానవ పరిణామానికి సజీవ సాక్ష్యాలు... అండమాన్ తెగల జన్యుక్రమాల ద్వారా వారి మూలలను వెలికి తీసిన తంగరాజ్ అంచనా ప్రకారం.. ఒంగే, జరావా తెగల వారితోపాటు దేశంలోని కొన్ని ఇతర తెగల ప్రజలూ కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. జరావా తెగల ప్రజల్లో ఏస్2 జన్యువులోని మార్పులు ఎక్కువ మందిలో ఉన్నాయని, ఈ జన్యుమార్పులు ఉన్న వారు కోవిడ్ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువని ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. -
సీసీఎంబీ స్థాయిలో ల్యాబొరేటరీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటివరకూ క్లిష్టమైన నమూనాలను పూణె వైరాలజీ ల్యాబొరేటరీ లేదా సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ–హైదరాబాద్)కు పంపించేవారు. ఇకపై ఈ స్థాయి ల్యాబొరేటరీని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అధికారులు స్థల సేకరణకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి గన్నవరం విమానాశ్రయం వద్ద 3 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఈ ల్యాబొరేటరీ నిర్మాణానికి రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ అవుతుందని అంచనా. దీన్ని రెండేళ్లలో అందుబాటులోకి తెస్తారు. పూర్తిస్థాయి నిర్మాణం తర్వాత ఇందులో 300 మందికి పైగా సిబ్బంది పనిచేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు అతి తక్కువ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉపయోగాలివే.. ► ఈ ల్యాబొరేటరీలో అన్ని రకాల వైరస్‌లే కాదు, బ్యాక్టీరియా నమూనాలు, కీటకాలు, ఎల్లో ఫీవర్.. తదితర ఎలాంటి నమూనాలనైనా పరిశీలించవచ్చు. ► ప్రస్తుతం మన వద్ద మన రాష్ట్రంలో జినోమిక్ సీక్వెన్సీ ల్యాబ్ (వైరస్ ఉనికిని కనుక్కునే ల్యాబ్) లేదు. ఇకపై ఇలాంటి టెస్టులు ఇక్కడే చేసుకోవచ్చు. ► గతంలో ఏలూరు పట్టణంలో వింత వ్యాధితో బాధితులు ఆస్పత్రికి వచ్చినప్పుడు నమూనాలు వివిధ రాష్ట్రాలకు పంపించాల్సి వచ్చింది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎలాంటి టెస్టులైనా ఇక్కడే చేసుకోవచ్చు. ► దీనికి సంబంధించిన నిర్మాణ వ్యయం, మానవ వనరులు కేంద్రం చూసుకుంటుంది. స్థలం మాత్రం ఏపీ సర్కారు ఇస్తుంది. త్వరలోనే అవగాహన ఒప్పందం అతిపెద్ద ల్యాబొరేటరీ నిర్మాణానికి గన్నవరంలో 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం చూపించింది. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే అవగాహన ఒప్పందం చేసుకుంటాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపించే పరిస్థితి ఉండదు. రకరకాల జబ్బుల ఉనికిని వీలైనంత త్వరగా తెలుసుకునే వీలుంటుంది. – డా.ఎం.అనురాధ, సీనియర్ రీజనల్ డైరెక్టర్, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ -
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మార్గం
సాక్షి, హైదరాబాద్: శరీంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త లక్ష్యాన్ని గుర్తించారు. కణత్వచంపై సెరటోనిన్ రిసెప్టార్–1ఏ.. కొలెస్ట్రాల్‌ను గుర్తించగలదని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అమితబ ఛటోపాధ్యాయ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. సెరటోనిన్ రిసెప్టార్లు కణత్వచంలో ఉండే కొలెస్ట్రాల్‌కు సున్నితంగా ఉంటాయని ఆయన గతంలోనే గుర్తించారు. కణాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు రిసెప్టార్ ప్రోటీన్లు కీలకం కాగా.. చాలా మందులు ఈ రిసెప్టార్ ప్రొటీన్లనే లక్ష్యంగా చేసుకుని తయారుచేస్తుంటారు. సెరటోనిన్ రిసెప్టార్ ప్రొటీన్‌లోని సీఆర్‌ఏసీ నిర్మాణాలపై తాము దృష్టి పెట్టామని, నిర్దిష్ట అమైనో యాసిడ్స్‌ను మార్చి చూడగా, ఒక అమైనోయాసిడ్ కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. స్పెయిన్‌లోని పాంపియూ ఫాబ్ర యూనివర్సిటీ హాస్పిటల్ సాయంతో ప్రొటీన్, కొలెస్ట్రాల్ మధ్య జరిగే చర్యలను పరిశీలించామని, తద్వారా తాము గుర్తించిన అమైనో యాసిడ్.. ఎలా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుందో తెలిసిందని చెప్పారు. వయసుతో పాటు కొలెస్ట్రాల్ మోతాదుల్లో తేడాలు వస్తాయని, ఈ రిసెప్టార్ ఆధారంగా కొత్తగా మందులు తయారుచేస్తే మరింత మెరుగ్గా కొలెస్ట్రాల్‌ను నియంత్రించొచ్చని తాము భావిస్తున్నట్లు వివరించారు. స్ట్రక్చరల్ బయాలజీలో సీసీఎంబీకి ఉన్న నైపుణ్యం ఈ కొత్త ఆవిష్కరణకు వీలు కలిగించిందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ నందికూరి వినయ్ తెలిపారు. -
Covid-19: థర్డ్‌వేవ్ తీవ్రత: ఆ మూడే కీలకం!
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో దశ ముగింపునకు వచ్చినట్లే! మూడు నాలుగు నెలల తరువాత ఇంకో వేవ్ వచ్చే అవకాశం ఉందనేది నిపుణుల మాట! మూడో దశ తీవ్రత, ప్రభావం మొత్తం మూడంటే మూడు అంశాలపై ఆధారపడి ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా విస్పష్టంగా తెలిపారు. అందరికీ టీకా ఇవ్వడం, కోవిడ్ నిబంధనలు పాటించడం, నిర్ధారణ పరీక్షలు కొనసాగించడం కీలకమని చెప్పారు. కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో తరువాతి దశల పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు ‘సాక్షి’ డాక్టర్ రాకేశ్ మిశ్రాను సంప్రదించింది. ఆయన ఇంకా ఏమన్నారంటే... టీకాతో తీవ్రత తగ్గించొచ్చు.. 1 కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు మనకున్న ఏకైక ఆయుధం టీకానే. వీలైనంత తొందరగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా మూడు లేదా ఆ తరువాతి దశల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. 2 కోవిడ్ నిబంధనలు అంటే భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి మాస్కు తొడుక్కోవడం వంటివి కచ్చితంగా పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. 3 రెండో దశ కేసులు తగ్గిపోతున్నాయి కదా అని ప్రభుత్వాలు పరీక్షలు చేయడం తగ్గిస్తే అసలుకే మోసం వస్తుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు జరిపి.. నిర్ధారణయ్యే తక్కువ కేసులను ఐసొలేషన్‌లో ఉంచి వెంటనే చికిత్స కల్పించడం ఇకపై చాలా ముఖ్యం. జన్యుమార్పులకు లోనయ్యే అవకాశం! అరవై ఏళ్లపైబడ్డ వారు, మధుమేహం, గుండెజబ్బుల వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో అధికులు ఇప్పటికే టీకాలు తీసుకున్న నేపథ్యంలో వైరస్ ఇతరులకు సోకే అవకాశాలు పెరుగుతాయి. టీకాలు, రకరకాల చికిత్సల ద్వారా అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల నుంచి తప్పించుకునేందుకు వైరస్ జన్యుమార్పులకు గురవుతుంది. ఈ మార్పుల్లో ఏ ఒక్కటి మనిషికి ప్రమాదకరంగా ఉన్నా ముప్పు తప్పదు. దేశంలో ప్రస్తుతానికి 617.2 రకం రూపాంతరిత వైరస్ ఒక్కదానితోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరస్‌లో కొత్త రూపాంతరితాలేవీ కనిపించలేదు. పాత తప్పులు మళ్లీ వద్దు రెండో దశ కరోనా సమయంలో జరిగిన పొరబాట్లు, తప్పులను పునరావృతం చేస్తే దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మూడో దశను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావడం చాలా అవసరం. మూడు నాలుగు నెలల సమయం ఉందన్న అంచనాలను ఆధారంగా చేసుకుని ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో మాదిరిగా ఆక్సిజన్, బెడ్ల కొరత వంటి సమస్యలకు ఈసారి మరికొన్ని జత చేరే అవకాశం ఉండొచ్చు. మూడో దశ ప్రభావం పిల్లలపై ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున.. అటువంటి వారికి అనుగుణంగా ఆసుపత్రుల్లోని కోవిడ్ వార్డుల్లో తగిన మార్పులు,చేర్పులు చేయాలి. రోజంతా మాస్కులు ధరించడం, ఒకేచోట కదలకుండా ఉండటం పిల్లలు చేయలేరు కాబట్టి.. వారికి అనుకూలమైన విధంగా వార్డులను సిద్ధం చేయాలి. అంతేకాకుండా.. కోవిడ్ బారిన పడ్డ పిల్లలకు ఏ రకమైన మందులు ఇవ్వాలన్న అంశంపై ఇప్పుడే అధ్యయనం మొదలుపెట్టాలి. పెద్దవారికి ఇచ్చే మందులు పిల్లలకూ పనికొస్తాయనుకోవడం సరికాదు. చదవండి: డ్రోన్లతో వ్యాక్సిన్ల రవాణా: 100 కి.మీ వేగం.. 70 కి.మీ దూరం.. -
Coronavirus: నిర్ధారణ పరీక్షకు ‘డ్రైస్వాబ్’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాధి నిర్ధారణను వేగవంతం చేసే డ్రైస్వాబ్ కిట్ల వాణిజ్య ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. సెంటర్‌ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యు లర్ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన ఈ డ్రైస్వాబ్ కిట్ల ద్వారా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు వేగంగా, చౌకగా జరుగుతాయి. భారత వైద్య పరిశోధన సమాఖ్య కూడా ఈ డ్రైస్వాబ్ కిట్ల వినియోగానికి అనుమతిచ్చిన నేపథ్యంలో వాటిని వాణిజ్యస్థాయిలో తయారు చేసేందుకు మెరిల్ డయాగ్నస్టిక్స్ ముందుకొచ్చింది. దేశం మొత్తమ్మీద డ్రైస్వాబ్ ఆధారిత పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సీసీఎంబీ–మెరిల్ డయాగ్నస్టిక్స్ ఒప్పందం దోహదపడుతుంది. సాధారణ ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో ఆర్ఎన్ఏను వేరు చేసేందుకు చాలా సమయం పడు తుండగా.. డ్రైస్వాబ్ కిట్ల ద్వారా తక్కువ సమయంలోనే ఈ పని చేయొచ్చు. దేశంలో కోవిడ్ పరీక్షలు పెద్ద సంఖ్యలో చేపట్టేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని మెరిల్ డయాగ్నస్టిక్స్ ఉపాధ్యక్షుడు సంజీవ్ భట్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా దాదాపు రెండు కోట్ల డ్రైస్వాబ్ కిట్లను తయారు చేయగలమని, ఒక్కో పరీక్షకు అయ్యే ఖర్చు రూ.45–60 మధ్య ఉంటుందన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ పరీక్షలకు రెండు మూడు రెట్లు ఎక్కువ పరీక్షలు చేసేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని సీసీఎంబీ నూతన డైరెక్టర్ డాక్టర్ నందికూరి వినయ్ కుమార్ తెలపగా.. పరీక్షలకయ్యే సమయం, ఖర్చు దాదాపు సగం వరకూ తగ్గుతాయని సంస్థ గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఏమిటీ డ్రైస్వాబ్స్ టెక్నాలజీ? కోవిడ్ వ్యాధి నిర్ధారణకు ముక్కు లేదా నోటి లోపల ఉండే ద్రవాలను పొడవాటి పుల్లల్లాంటి వాటితో సేకరిస్తారు. వీటినే స్వాబ్స్ అంటారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు జరిగే కేంద్రాలకు ఈ నమూనాలను తీసుకెళ్లాలంటే వాటిని వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. స్వాబ్స్‌లోని జీవ పదార్థా న్ని జాగ్రత్త పరిచేందుకు కొన్ని రీఏజెంట్లను కూడా వాడతారు. ఇవేవీ లేకుండా పొడిగా ఉండే స్వాబ్స్‌నే నేరుగా పరీక్షలు జరిగే కేంద్రా లకు తరలించేందుకు వీలుగా సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీనే డ్రైస్వాబ్స్ టెక్నాలజీ! సాధారణ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ఫలితాలకు ఒకట్రెండు రోజుల సమయం పడితే.. డ్రైస్వాబ్స్ టెక్నాలజీతో మూడు గంటల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చు. చదవండి: విదేశీ టీకాలకు నో ట్రయల్స్! -
డీఆర్డీవో గుడ్‌న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం
1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్ సోకి దెబ్బతిన్న కణాలు. 2–డీజీ ఇవ్వక ముందు వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది. 2. మందు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే వైరస్ లోడ్ చాలా వరకు తగ్గింది. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో శుభవార్త చెప్పింది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ’ ఔషధాన్ని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’ మంచి ఫలితాలు ఇచ్చిందని, ఈ మేరకు అత్యవసర వినియోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)’అనుమతులు వచ్చాయని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి శనివారం వెల్లడించారు. డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) ఈ ‘2–డీజీ’మందును అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కలిసి ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. ‘2–డీజీ’ఇచ్చిన కోవిడ్ రోగుల్లో చాలా మందికి నాలుగైదు రోజుల్లోనే కోవిడ్ నెగెటివ్ వచ్చిందని వివరించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన కోవిడ్ కేసులు, ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో ‘2–డీజీ’అందుబాటులోకి వస్తుండటంతో సంతోషం వ్యక్తమవుతోంది. ఏడాది కిందే ప్రయోగాలు మొదలు.. కరోనా వైరస్ పంజా విసరడం మొదలైన కొత్తలోనే.. అంటే గత ఏడాది ఏప్రిల్‌లోనే ఈ వైరస్‌కు మందు కనిపెట్టడంపై ఇన్మాస్ సంస్థ దృష్టి పెట్టింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)తో కలిసి పరిశోధనలు చేసి.. ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’మందును రూపొందించింది. ఇది కరోనా వైరస్ పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటోందని గుర్తించి.. క్లినికల్ ట్రయల్స్ కోసం ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌డీఓ)’కు దరఖాస్తు చేసింది. ఈ మేరకు అనుమతి రావడంతో గత ఏడాది మే నెలలోనే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీతో కలిసి.. కోవిడ్ రోగులపై ప్రయోగాత్మక పరిశీలన చేపట్టింది. ఈ మందు సామర్థ్యం, భద్రత ఏమేరకు ఉన్నాయనేది నిర్ధారించేందుకు ప్రయోగాలు నిర్వహించింది. కరోనా వైరస్ ఉన్న శాంపిల్స్.. ఇన్ఫెక్ట్ అయిన కణాలకు 2–డీజీ మందు వాడిన తర్వాత మందు సురక్షితమే.. గత ఏడాది మే – అక్టోబరు మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’మందు సురక్షితమైనదేనని, రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతోందని గుర్తించారు. తర్వాత రెండో దశలో ఫేజ్–2ఏ కింద ఆరు ఆస్పత్రుల్లో, ఫేజ్–2బీ కింద 11 ఆస్పత్రుల్లో పరిశీలన చేపట్టారు. మొత్తం 110 మంది రోగులకు 2–డీజీ మందును ఇచ్చి ఫలితాలను బేరీజు వేశారు. సాధారణ చికిత్సా పద్ధతులతో పోలిస్తే 2–డీజీ మందు ఇచ్చిన రోగులు.. కోవిడ్ లక్షణాల నుంచి వేగంగా బయటపడుతున్నట్టు నిర్ధారించారు. మరోలా చెప్పాలంటే 2–డీజీ తీసుకున్నవారు మూడు రోజులు ముందుగానే కోలుకుంటున్నారని తేల్చారు. మూడో దశలోనూ సత్ఫలితాలు తొలి, రెండు దశల ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు గత ఏడాది నవంబరులోనే డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. గతేడాది డిసెంబరు – ఈ ఏడాది మార్చి మధ్య 220 మంది రోగులకు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 27 కోవిడ్ ఆస్పత్రుల్లో పేషెంట్లపై ప్రయోగాలు చేశారు. 2–డీజీ మందు ఇవ్వడం మొదలుపెట్టిన మూడో రోజు నుంచే దాదాపు 42 శాతం మంది రోగుల్లో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. అరవై ఐదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. మూడు దశల ఫలితాల ఆధారంగా.. మధ్యమ, తీవ్ర స్థాయి కోవిడ్ రోగుల చికిత్సలో 2–డీజీని ఉపయోగించేందుకు డీసీజీఐ ఈ నెల ఒకటో తేదీనే అనుమతులు జారీ చేసింది. తాజాగా ఈ మందుకు సంబంధించిన వివరాలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పొడి.. నీళ్లలో కలుపుకొని తాగడమే 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔష ధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. ఈ మందులోని అణువులు.. సాధారణ గ్లూకోజ్ అణువులను పోలి ఉండటం వల్ల విస్తృతంగా ఉత్పత్తి చేయడానికి వీలుందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే వారం, పదిరోజుల్లోనే ఈ మందు తొలి విడత మార్కెట్లోకి వచ్చేస్తుందని.. మూడు వారాల్లో మరింత మోతాదులో అందుబాటులోకి వస్తుందని వివరించారు. -
ఎన్440కే వేరియంట్‌పై సీసీఎంబీ ట్వీట్
హైదరాబాద్: కరోనా వైరస్ ఎన్440కే వేరియంట్‌పై సీసీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త రకం వేరియంట్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న తరుణంలో సీసీఎంబీ ట్వీట్ ద్వారా స్పందించింది. ఈ వైరస్ కొత్తగా వచ్చింది కాదని, గతేడాది ఎన్440కే వైరస్‌ను గుర్తించామని తెలిపింది. ఎన్440కే వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయినట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు సీసీఎంబీ స్పష్టం చేసింది. #COVID19India #COVID19 #coronavirus In light of the many reports on coronavirus variant N440K lately, we would like to bring to your attention a few things: 1. The mutant is not new. We have been seeing it in South India since last year.@CSIR_IND @AndhraPradeshCM (1/3) More👇🏾 — CCMB (@ccmb_csir) May 5, 2021 -
యూకే వేరియంట్‌తోనే సమస్య!
‘దేశంలో ప్రస్తుతం యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొంత కాలంగా డబుల్ మ్యూటెంట్ వేగంగా వ్యాప్తి చెందినా, ప్రస్తుతం యూకే రూపాంతరితమే సమస్యగా మారింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం..’అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు. ప్ర: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు నాలుగు లక్షలకు చేరువ అవుతోంది. తొలిదశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్న మనం రెండోసారి మాత్రం విఫలమయ్యాం. ఇందుకు కారణాలేమిటి? జ: కోవిడ్–19 వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అతిపెద్ద కారణం. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని, ఈ జాగ్రత్తలన్నీ కొనసాగించాలని చాలాకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిపడింది. పాఠశాలలు, కళాశాలలు త్వరగా తెరవడం, ఎన్నికల ర్యాలీలకు అనుమతించడం, బార్లు, పబ్బులు, సినిమాహాళ్లు పనిచేసేందుకు అనుమతులివ్వడం కూడా కారణమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రూపాంతరిత వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడింది. అదృష్టం ఏమిటంటే.. యూకే, భారత్ డబుల్ మ్యూటెంట్ వైరస్‌లకు ఇతర జీవుల ద్వారా వ్యాపించే శక్తి అలవడలేదు. అదే జరిగి ఉంటే సమస్య మరింత జటిలమయ్యేది. ప్ర: దేశంలో ఏ రూపాంతరిత వైరస్ ఎక్కువ వ్యాప్తిలో ఉంది? జ: ప్రధానంగా మూడు (యూకే, డబుల్ (కాలిఫోర్నియా), బెంగాల్) రూపాంతరిత వైరస్లు ఉన్నాయి. వీటి నుంచి మరోసారి జన్యుమార్పులకు గురైన ఇంకో వైరస్ కూడా వ్యాప్తిలో ఉంది. దీన్నే ట్రిపుల్ మ్యూటేటెడ్ అని పిలుస్తున్నారు. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో పదిశాతం ఈ వైరస్వే. కొమ్ములో ఉండే ఒకే ఒక్క తేడా డబుల్, ట్రిపుల్ మ్యూటేటెడ్లను వేరు చేస్తుంది. బెంగాల్లో 20 శాతం కేసులకు కారణమవుతున్న రూపాంతరిత వైరస్ బలహీనపడుతోందని, త్వరలో కనిపించకుండా పోతుందని అంచనా వేస్తున్నాం. డబుల్ మ్యూటెంట్ వైరస్‌ను గత ఏడాది డిసెంబర్లోనే గుర్తించినా..మన నిర్లక్ష్యం కారణంగా గత కొంతకాలంగా అది వేగంగా వ్యాప్తి చెందింది. డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్లలో జన్యుపరమైన మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రమాదమేమీ లేకపోవడం ఊరటనిచ్చే అంశం. దేశంలో ప్రస్తుతం యూకే రూపాంతరితమే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అదే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వెరైటీలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలుస్తోంది. సీసీఎంబీలో రూపాంతరితాల జన్యుక్రమ నమోదు జరుగుతోంది. ఇప్పటివరకూ పరిశీలించిన నమూనాల్లో యూకే రూపాంతరితం 12 – 15 శాతం ఉండగా.. డబుల్ మ్యూటెంట్ 20 శాతం నమూనాల్లో కనిపించింది. మిగిలిన 70 శాతంలో వేర్వేరు రకాల ఉనికిని గుర్తించాము. ప్ర: రెండో దఫా కేసులు శిఖరస్థాయికి చేరేదెన్నడు? మూడో దఫా ఉండే అవకాశం ఉందా? జ: దేశ విదేశాల్లో చేసిన అధ్యయనాలన్నీ భారత్‌లో మే రెండు, మూడో వారాల్లో కేసులు శిఖరస్థాయికి చేరతాయని, ఆ తర్వాత వేగంగా తగ్గిపోతాయని చెబుతున్నాయి. మళ్లీ జూన్ తర్వాత కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. తీవ్రత తక్కువగా ఉంటుందంటున్న ఈ దశను మూడో దఫా అని కూడా అనలేము. నిజానికి ఈ మూడోదఫా గురించి ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం రోజువారీ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? అన్న అంశంపై ఆధారపడి ఈ అంచనాలు రూపొందాయి. శిఖర స్థాయికి చేరే క్రమంలో రోజువారీ కేసుల సంఖ్య ఐదు నుంచి పది లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కని కేసులు దీనికి అదనంగా భావించాలి. కేసులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అందని పరిస్థితుల్లో అంచనాలు వేయడం అంత సులభమేమీ కాదు. కానీ మే నెల మూడో వారానికల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదై ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఆ సంఖ్య పతనమవుతుందని అనుకుంటున్నాం. అప్పటివరకూ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మాస్కులేసుకోవడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి మరింత కఠినంగా కొనసాగించాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం, అందుబాటులో ఉన్న వైరస్ నమూనాల జన్యుక్రమాన్ని వేగంగా నమోదు చేయడం చాలా అవసరం. తద్వారా కొత్త రూపాంతరితాలను ఎప్పటికప్పుడు గుర్తించే వీలేర్పడుతుంది. జన్యుక్రమ నమోదు ద్వారా కొత్త టీకాలు, మందులను అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం ఈ పనులన్నీ తగిన వేగంతో చేస్తుందని అనుకున్నా.. ప్రజలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే దేశం నుంచి కరోనా వైరస్‌ను తరిమి కొట్టగలం. – సాక్షి, హైదరాబాద్. -
మాస్కే మంత్రం.. టీకానే దివ్య ఔషధం..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం మేలైన మార్గమైతే.. ఆ తర్వాత కూడా మాస్కు వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నా రు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యుల్లో వ్యాధిపై మరింత అవగాహన పెంచే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సీసీఎంబీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, జాతీయ పోషకాహార సంస్థలు సంయుక్తంగా బుధవారం ఆన్లైన్ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కరోనాపై పలు సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశాయి. టీకా లభ్యతపై.. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉన్నా.. మే 10–15 మధ్య సమయానికి రష్యా తయారుచేసిన స్పుత్నిక్–వీ అందుబాటులోకి వస్తుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. క్యాడిల్లా ఫార్మా తయారు చేస్తున్న సెప్సివ్యాక్ కూడా ప్రభుత్వ అనుమతులు పొందే అవకాశముందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి కోసం అభివృద్ధి చేసిన సెప్సివ్యాక్.. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పారు. కాగా, కోవాగ్జిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాల కొరత లేదని, రసాయనాలను దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. కోవి షీల్డ్ ముడిపదార్థాల కొరత కూడా త్వరలోనే తీరుతుందని పేర్కొన్నారు. ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకితే లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటోందని చెప్పారు. వ్యాక్సినేషన్ నత్తనడకపై.. వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడక సాగడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిలోని లోటుపాట్లు కొంతవరకు కారణమైనా.. తొలి దశ వ్యాక్సినేషన్లో వైద్యులు, సిబ్బందిలో వేచి చూద్దామన్న ధోరణి వల్లే టీకా కార్యక్రమం వేగం తగ్గిందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ కరోనా కేసుల్లో 85 శాతం మంది తక్కువ స్థాయి లక్షణాలతో బయటపడుతున్నారని తెలిపారు. తొలి దశతో పోలిస్తే రెండో దశలో సైటోకైన్ స్టార్మ్, న్యుమోనియా వంటివి తక్కువగా ఉన్నాయని తెలిపారు. తొలి డోసు టీకా తీసుకున్న 7 రోజులకే శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నా రోగ నిరోధక వ్యవస్థ స్పందించేందుకు 2,3 వారాల సమయం పడుతుందని వివరించారు. మ్యూటెంట్ల గురించి.. కరోనా వైరస్‌తో పాటు ఏ వైరస్ అయినా కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది కాబట్టి.. బ్రెజిల్, యూకే, దక్షిణాఫ్రికా, డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో ఎన్.మధుసూదనరావు స్పష్టం చేశారు. తొలి దశతో పోలిస్తే రెండో దశలో ప్లాస్మా ట్రీట్మెంట్ ప్రభావం కొంత తగ్గినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కొందరికి తప్పుగా నెగెటివ్ రావడంపై మాట్లాడుతూ.. శాంపిల్‌ను ఎంత సమర్థంగా తీయగలరు? ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే యంత్రాలు తదితర అంశాలూ ప్రభావం చూపుతా యని తెలిపారు. ధూమపానం చేసేవారు, శాఖాహారులు, ఫలానా గ్రూపు రక్తం ఉన్న వారిలో కరోనా తీవ్రత తక్కువగా ఉందనేందుకు ఆధారాల్లేవని చెప్పారు. మహిళల్లో నిరోధకత ఎక్కువ? పురుషులతో పోలిస్తే మహిళల రోగ నిరోధక వ్యవస్థ కొంచెం మెరుగ్గా ఉంటుందని, ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే వేగం కూడా ఎక్కువని, కోవిడ్–19 విషయంలోనూ ఇదే జరుగుతోందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఆర్.హేమలత తెలిపారు. నెలసరి సమయంలో వ్యాక్సిన్ తీసుకోరాదన్నది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవడం అపాయమేమీ కాదని, కోవిడ్–19 విషయంలో ప్రభావంపై ఇంకా తెలియదని చెప్పారు. కరోనా బారిన పడ్డవారు తగిన పౌష్టికాహారం తీసుకోవడం అత్యవసరమని తెలిపారు. రోజువారీ ఆహారంలో కనీసం సగం పండ్లు, కాయగూరలు ఉండేలా చూసుకోవాలని వివరించారు. విటమిన్–డి తక్కువగా ఉన్న వారిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, మరణాల రేటూ ఎక్కువని, ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇంట్లోనూ మాస్కు అవసరమా? రెండో దఫా కేసులు ప్రబలుతున్న తీరును చూస్తే ఇళ్లలోనూ మాస్కులు ధరించాలన్న కేంద్ర ప్రభుత్వ అధికారుల సూచన సరైందేనని భావిస్తున్నట్లు ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శిష్ట్లా రామకృష్ణ తెలిపారు. గాలి, వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే.. తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని కోరారు. కరోనా వైరస్ నోరు, ముక్కు, కళ్లద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఆరడుగుల దూరం పాటించాలని, ప్రజలు వీటిని సరిగ్గా పాటించి ఉంటే సెకండ్‌వేవ్ కేసులు ఈ స్థాయిలో పెరిగేవి కావేమోనని అభిప్రాయపడ్డారు. ఆ రెండే కరోనా నుంచి మనల్ని కాపాడుతాయి.. -
కరోనా ఇండియన్ స్ట్రెయిన్ చాలా ఫాస్ట్!
న్యూఢిల్లీ: కరోనా ఇండియన్ స్ట్రెయిన్ (బి. 1. 617 వేరియంట్) యూకే వేరియంట్‌లాగానే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని, అయితే ఇది అత్యంత ప్రాణాంతకం (లీథల్) అనేందుకు ఆధారాలు స్వల్పమని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. సార్స్– సీఓవీ2(కరోనా వైరస్) బి. 1. 617 వేరియంట్‌ను డబుల్ మ్యూటెంట్ లేదా ఇండియన్ స్ట్రెయిన్ అని పిలుస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో సెకండ్ వేవ్ సందర్భంగా ఈ వేరియంట్ అధికంగా కనిపించింది. మహారాష్ట్రలో దాదాపు 50కిపైగా కేసుల్లో ఈ వేరియంట్ కనిపించిందని, యూకే వేరియంట్ 28 శాతం మేర కనిపించిందని ఎన్సీడీసీ డైరెక్టర్ సుజిత్ సింగ్ గతవారం చెప్పారు. కొన్ని వారాలుగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. పలు ఆస్పత్రుల్లో పడకలు దొరక్క బాధితులు పలు ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఈ రెండు వేరింట్లు అత్యంత ప్రమాదకారులని చెప్పలేమని, కానీ యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే రకమైతే, భారత వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకమై ఉండొచ్చని ఐజీఐబీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ విషయం నిరూపణకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిఉందన్నారు. గతేడాదితో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో మరణాలు పెరగడానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణమైఉంటుందన్నారు. ఎక్కువమంది వ్యాధికి గురైతే మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. భారత్ వేరియంట్లో మూడు రకాల సరికొత్త ప్రొటీన్ ఉత్పరివర్తనాలున్నాయని ఆయన వివరించారు. ఇండియన్ స్ట్రెయిన్ ప్రాణాంతమైనదని చెప్పేందుకు సంపూర్ణ ఆధారాల్లేవని ఎన్సీబీఎస్ డైరెక్టర్ సౌమిత్ర దాస్ తెలిపారు. భారత్‌లో కనిపిస్తున్న వేరియంట్లు వాక్సిన్‌కు లొంగేవేనని, ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వీటిపై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని గతవారం జరిగిన వెబ్‌నార్‌లో ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీ. 1. 617 వేరియంట్‌పై కోవిషీల్డ్ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని సీసీఎంబీ సైతం వెల్లడించింది. -
హే! హెర్డ్ ఇమ్యూనిటీ ఉత్త ముచ్చట
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 60 శాతం మందికి కోవిడ్ సోకితే ఇక హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టే. ఇక వైరస్ వ్యాప్తి తగ్గి క్రమంగా అంతర్థానం అవుతుంది’.. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారంలో ఉన్న మాట ఇది.‘ఇప్పటికే హైదరాబాద్‌లో 54 శాతం మంది కోవిడ్ బారినపడ్డారు’.. కోవిడ్ తొలిదశ ముగిసిన సమయంలో సీసీఎంబీ చేసిన ప్రకటన ఇది. ఈ లెక్కన ఇప్పటికే హైదరాబాద్‌లో 60 శాతాన్ని మించి జనం ఇన్ఫెక్ట్ అయినట్టే. అంటే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి, కరోనా వ్యాప్తి తగ్గిపోవాలి. కానీ వేలకొద్దీ కేసులు నమోదవుతున్నాయి. మరేమిటి విషయం అంటే.. ప్రచారంలో ఉన్నట్టుగా 60% మందికి సోకితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్నది ఉత్తమాటేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకుంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని అంటున్నారు. వందేళ్ల కిం ద ప్రపంచాన్ని గడగడలాడించిన స్పానిష్ ఫ్లూ నాటి పరిస్థితిని, ఇటీవల స్వీడన్ హెర్డ్ ఇమ్యూనిటీని ప్రయత్నించి దెబ్బతినడాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు జరిగిందేమిటి? పారిశ్రామిక విప్లవం వచ్చి ఆధునిక సమాజం మొదలైన తర్వాత వచ్చిన మహమ్మారి స్పానిష్ ఫ్లూ. మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తూనే దాని దాడి మొదలైంది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని స్వదేశాలకు వెళ్లిన సైనికులు ఈ వైరస్‌ను మోసుకెళ్లారు. తొలుత అమెరికాలో ఈ వైరస్ వెలుగు చూసినా.. ఆ దేశ సైని కులు యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక్కసారిగా ప్రబ లింది. దాని అసలు ప్రభావం స్పెయిన్ నుంచి మొదలైంది. దాంతో ఆ వైరస్‌కు స్పానిష్ ఇన్çఫ్లూ యెంజా పేరు పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారినపడి దాదాపు మూడున్నర కోట్ల మంది చనిపోతే.. అందులో ఒక్క మన దేశంలోనే కోటిన్నర మంది చనిపోయినట్టు అంచనా. అంటే వైరస్ సోకినవారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. అప్పటి జనాభా ప్రకారం చాలా మందికి వచ్చినట్టే. ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితిని నిపుణులు ప్రస్తావనకు తెస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్మి దెబ్బతిన్న స్వీడన్.. కోవిడ్ వ్యాప్తితో ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోగా ఒక్క స్వీడన్ మాత్రం దానికి వ్యతిరేకంగా అడుగేసింది. ఆ దేశ ఎపిడమాలజిస్ట్ అండర్స్ టాగ్నెల్ ప్రభుత్వానికి హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకోవాలని సూచించిన ఫలి తం అది. స్వీడన్లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం టాగ్నెల్ను కరోనా కంట్రోల్ యూనిట్ చీఫ్‌గా నియమించింది. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, హెర్డ్ ఇమ్యూనిటీ విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. దాంతో దుకాణాలు, బార్లు, మాల్స్, ప్రీస్కూల్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అన్నీ తెరిచే ఉంచారు. అక్కడే తేడా కొట్టింది. నిజానికి స్వీడన్ చిన్న ధనిక దేశం.. జనాభా కోటిన్నర మాత్రమే. పార్టీలు, వేడుకలు నిత్యకృత్యం. అయితే ఆ దేశ సగటు ఆయుర్ధాయం 86 ఏళ్లు. దాంతో వృద్ధుల సంఖ్య ఎక్కువ. 65 ఏళ్లపై వయసున్నవారు ఆ దేశ జనాభాలో దాదాపు 24 శాతం ఉన్నారు. ఇలాంటి క్రమంలో హెర్డ్ ఇమ్యూనిటీ విధానం గట్టి దెబ్బకొట్టింది. కేసులు విపరీతంగా పెరిగిపోయి, ఆస్పత్రులు నిండిపోయాయి. అక్కడ తొలి నాలుగు నెలల్లో 3,460 మంది కరోనాతో చనిపోతే.. అందులో 70 ఏళ్లు, ఆపై వయసున్న వారు 2,975 మంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో హెర్డ్ ఇమ్యూనిటీ యోచనకు మంగళం పలికి.. లాక్డౌన్ పెట్టారు. జాగ్రత్తలు తెలియక.. ప్రస్తుతం కోవిడ్‌కు అడ్డుకట్ట వేయాలంటే మాస్కు లు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి నిబంధనలు అమలవుతున్నాయి. కానీ స్పానిష్ ఫ్లూ నాటి పరిస్థితి దీనికి కాస్త భిన్నం. మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తెలియవు. వైరస్ సోకి ఎవరైనా జ్వరం బారిన పడితే.. వారిని పరామర్శించేందుకు చుట్టుపక్కల జనాలు వచ్చేవారు. ఎవరైనా వైరస్‌తో చనిపోతే అంతిమ సంస్కారాలకు పెద్ద సంఖ్యలో గుమిగూడేవారు. దీంతో చూస్తూండగానే స్పానిష్ ఫ్లూ దేశం మొత్తం వ్యాపించింది. సరైన వైద్య వసతుల్లేక జనం విలవిల్లాడారు. కొన్ని ఊళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా వైరస్ దేశంలోని ప్రతి గడపనూ తట్టిందని.. ఓ అంచనా ప్రకారం దాదాపు 85 శాతం మంది ప్రజలకు ఫ్లూ సోకిందని నిపుణులు చెప్తున్నారు. మిగతావారిలో రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉండటంతో దానిబారిన పడలేదు. అంటే 60 శాతం మందికి వైరస్ సోకితే హెర్డ్ (మూకుమ్మడి) ఇమ్యూనిటీ వచ్చి వైరస్ మాయమవుతుందన్న మాట సరికాదని అంటున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీకి ఆధారం లేదు.. ‘‘కోవిడ్‌ను కట్టడి చేసే క్రమంలో వందేళ్లనాటి స్పానిష్ ఫ్లూను అధ్యయనం చేయడం చాలా అవసరం. దానికి దీనికి చాలా పోలికలున్నాయి. ఆ వ్యాధితో ప్రపంచంలో బాగా దెబ్బతిన్న దేశం మనదే. ఇక్కడ దాదాపు కోటిన్నర మందిని స్పానిష్ ఫ్లూ పొట్టనపెట్టుకుంది. ప్రతి ఇంట్లో వైరస్ జాడ కనిపించింది. అప్పట్లో వైరస్ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన లేక, ఆధునిక వైద్యం లేక భారీగా మరణాలు సంభవించాయి. 60% మందికి సోకితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్న మాటకు నాటి ఉదంతంలో ఎక్కడా ఆధారాలు లేవు. అందువల్ల ఆ దిశగా యోచించకుండా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయడం, జనం నిబంధనలు పాటించేలా చేయడంపై దృష్టి పెట్టాలి. మ్యుటేషన్స్ వల్ల వ్యాక్సిన్ల పనితనం ఎంతనే విషయంలోనూ పరిశోధనలు సాగాలి.’’ - డాక్టర్ రాజారెడ్డి, ప్రముఖ న్యూరో సర్జన్ -
త్వరలో 18 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సిన్
-
భారత్‌లో కొత్త రకం కరోనా!
న్యూఢిల్లీ: రెండుసార్లు జన్యు మార్పిడి జరిగిన కరోనా వైరస్‌ను మన దేశంలో గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దానితోపాటు పలు ఆందోళనకర వైరస్ రకాలు కూడా వ్యాపిస్తున్నట్టు తెలిపింది. జన్యుక్రమంలో ఓసారి మార్పులు జరిగిన వైరస్‌లో మరోసారి కూడా జన్యుమార్పిడి జరిగి సరికొత్త రకమైన వైరస్‌గా మారడం భారత్‌లోనే కనిపించిందని, ఇతర రకాలు కొన్ని గతంలోనే విదేశాల్లో బయటపడ్డాయని వివ రించింది. ఇటీవల మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతుండటానికి ఈ కొత్త వైరస్ రకాలే కారణమా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది. వైరస్ జన్యు క్రమంతోపాటు వ్యాధికి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని వివరించింది. ఇన్సాకాగ్ నేతృత్వంలో.. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో ‘ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్షియం ఆన్ జినోమిక్స్ (ఇన్సాకాగ్)’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)తోపాటు దేశంలోని పది జాతీయ పరిశోధనశాలల్లో ఈ పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి వైరస్ జన్యుక్రమాలను నమోదు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారి సంబంధీకుల నుంచి శాంపిల్స్ సేకరించి, ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు. జన్యుక్రమాలను గుర్తించడం ద్వారా వైరస్‌కు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చని.. వ్యాధి చికిత్స, టీకాల తయారీలో ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలంగాణలో కొత్త రకాల వ్యాప్తి.. కేరళలోని 14 జిల్లాల నుంచి వచ్చిన 2,032 నమూనాలను విశ్లేషించగా.. రోగ నిరోధక వ్యవస్థ దృష్టి నుంచి తప్పించుకోగల ఎన్440కే రకం వైరస్ 123 నమూనాల్లో కనిపించిందని ఇన్సాకాగ్ వివరించింది. గతంలో ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ నమూనాల్లో 33 శాతం వరకూ ఉండేదని తెలిపింది. తెలంగాణ నుంచి సేకరించిన 104 నమూనాల్లోని.. 53 నమూనాల్లో కొత్త రకాన్ని గుర్తించామని తెలిపింది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి పదహారు దేశాల్లో ఈ ఎన్440కే రకం వైరస్ వ్యాపించిందని పేర్కొంది. 771 రకాల గుర్తింపు ఇప్పటివరకు 771 రకాల కరోనా వైరస్‌లను గుర్తించామని, అవన్నీ ఆందోళన కలిగించేవేనని ఇన్సాకాగ్ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం 10,787 నమూనాల్లో యూకే రకం వైరస్‌ను 736 నమూనాల్లో, దక్షిణాఫ్రికా రకం వైరస్‌ను 34 నమూనాల్లో, బ్రెజిల్ రకం వైరస్‌ను ఒక నమూనాలో గుర్తించామని తెలిపింది. మహారాష్ట్ర నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించినప్పుడు గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం.. ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యుమార్పులున్న వైరస్లు ఎక్కువయ్యాయని పేర్కొంది. ఈ రెండు జన్యుమార్పులు రోగ నిరోధక వ్యవస్థ దృష్టి నుంచి తప్పించుకునేందుకు వైరస్‌కు అవకాశం కల్పిస్తాయని వివరించింది. ఈ జన్యుమార్పులు 15- 20 శాతం నమూనాల్లో ఉన్నట్టు గుర్తించామని.. ఇప్పటిదాకా గుర్తించిన వైరస్‌లతో వీటికి పోలిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. కొత్త రకం వైరస్‌ను కట్టడి చేసేందుకు.. విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ వారికి దగ్గరగా వ్యవహరించిన వారిని గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, తగిన చికిత్స కల్పించడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
అక్కడ కేసులు పెరుగుతున్నా పెద్ద ముప్పేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్నంత వేగంగా తెలంగాణలో కరోనా వైరస్ విస్తరించే అవకాశం తక్కువ అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కె.మిశ్రా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 55.5శాతం మందిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్లు తమ పరిశోధనలో వెల్లడైందని.. దీనికితోడు ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ఇక్కడ వైరస్ ఉధృతి తక్కువగా ఉందని పేర్కొ న్నారు. కరోనా వ్యాక్సిన్లు సురక్షితమేనని భరోసా ఇచ్చారు. రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 14 రోజులకు యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతా యని.. అయితే 20 నుంచి 30% మందిలో తొలి డోసుతోనే వృద్ధి చెందినట్లు గుర్తించామని తెలి పారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆరో వార్షిక సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది కార్డియాలజిస్టులు దీనికి హాజరయ్యారు. ఈ సదస్సులో రాకేశ్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా టీకాల కార్యక్రమానికి వైద్య సిబ్బంది నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదని, అన్ని వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అవసరమన్నారు. జాగ్రత్తలు తప్పనిసరి కోవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని రాకేశ్ మిశ్రా చెప్పారు. ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉండటంతోనే ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించిందని.. శుభకార్యాలు, తీర్థయాత్రలు, విహారయాత్రల కోసం కాదని పేర్కొన్నారు. వైరస్ పీడ ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. ఈ విషయం తెలియక చాలా మంది సినిమాలు, షికార్లు, పార్టీలు, ఫంక్షన్ల పేరుతో గుమిగూడుతున్నారని చెప్పారు. అలాంటి వారి ద్వారా ఇంట్లో ఉన్న వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతర వ్యాధిగ్రస్తులు వైరస్ బారిన పడుతున్నారని వివరించారు. టీకాతో గుండెపోటు ముప్పు ఉండదు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ తెలంగాణ సదస్సు నిర్వాహకులు డాక్టర్ కేఎంకేరెడ్డి, డాక్టర్ ఆర్కే జైన్ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తర్వాత కేసులు పెరిగాయనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. సాధారణ రోజుల్లో ఎంత మంది గుండెపోటుకు గురయ్యారో.. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత అంతే మంది అనారోగ్యం బారిన పడ్డారని వివరించారు. తనతోపాటు చాలా మంది వైద్యులు ఇప్పటికే రెండో డోసు టీకా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని, అంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు.