champion
-
సింధు నిరీక్షణ ముగిసె...
లక్నో: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధు చాంపియన్‌గా నిలిచింది. తద్వారా 2 సంవత్సరాల 4 నెలల 18 రోజుల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ప్రపంచ 119వ ర్యాంకర్ వు లువో యు (చైనా)తో 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో గెలుపొందింది. ఈ విజయంతో సింధుకు 15,750 డాలర్ల (రూ.13 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సయ్యద్ మోడీ ఓపెన్‌లో సింధు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. ఆమె 2017, 2022లోనూ విజేతగా నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్లో ఈ ఏడాది సింధుకిదే తొలి టైటిల్‌కాగా... ఓవరాల్‌గా 18వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. 29 ఏళ్ల సింధు చివరిసారి 2022 జూలైలో సింగపూర్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ ఏడాది మలేసియా మాస్టర్స్ టోర్నిలో సింధు ఫైనల్ చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ‘ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నా ప్రధాన లక్ష్యం గాయాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండటమే. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ చాలా దూరంలో ఉన్నా ఫిట్‌గా ఉంటే వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతా. ఈ ఏడాదిని టైటిల్‌తో ముగించినందుకు ఆనందంగా ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. జనవరి నుంచి కొత్త సీజన్‌ను ప్రారంభిస్తా’ అని సింధు వ్యాఖ్యానించింది. లక్ష్య సేన్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కే టైటిల్ లభించింది. 31 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో లక్ష్య సేన్ 21–6, 21–7తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై గెలిచాడు. లక్ష్య సేన్‌కు 15,570 డాలర్ల (రూ. 13 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. లక్ష్య సేన్‌కు కూడా ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఈ సంవత్సరం లక్ష్య సేన్ మొత్తం 14 టోర్నిలు ఆడగా... ఈ టోర్నిలోనే ఫైనల్‌కు చేరుకొని టైటిల్ సాధించడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ కృష్ణ–సాయిప్రతీక్ (భారత్).. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జోడీలు రన్నరప్‌గా నిలిచాయి. గాయత్రి–ట్రెసా జోడీ అదుర్స్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గాయత్రి–ట్రెసా కెరీర్లో ఇదే తొలి సూపర్–300 టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 21–11తో బావో లి జింగ్–లి కియాన్ (చైనా) జంటను ఓడించింది. ఈ ఏడాది ఓవరాల్‌గా గాయత్రి–ట్రెసా జోడీ 20 టోర్నిలు ఆడి ఎట్టకేలకు తొలి టైటిల్‌ను దక్కించుకుంది. గాయత్రి–ట్రెసా జంటకు 16,590 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సంవత్సరం నిలకడగా రాణించిన గాయత్రి–ట్రెసా ద్వయం ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. -
‘ఫార్ములా’–4 చేదించాడు..
సాక్షి, సిటిబ్యూరో: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ సత్తా చాటింది. టాలివుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీం రేసర్ అఖిల్ అలీ భాయ్ ఫార్ములా 4 విభాగంలో చాంపియన్‌గా నిలిచారు. దీనితో అక్కినేని నాగచైతన్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్ కరీ మోటార్ స్పీడ్వే వేదికగా ఆదివారం జరిగిన ఈ రేసింగ్‌లో చాంపియన్‌గా నిలువగా, లీగ్ 2024లో గోవా ఏసెస్ జేఏ విజేతగా నిలిచింది. చివరి రోజు ఐఆర్ఎల్ రేసులో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవా అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా చై ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలను పంచుకున్నారు. అభిమానులకు ధన్యవాదాలు.. హైదరాబాద్ రేసింగ్ లవర్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. నాగచైతన్యతో కలిసి ట్రోఫీ అందుకోవడం మంచి మెమొరీగా మిగిలిపోతుంది. భవిష్యత్తులోనూ రేసింగ్ లీగ్‌కి ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేస్తాను. ఈ విజయం నా కెరియర్ను మలుపు తిప్పుతుంది. – అఖిల్ అలీ భాయ్ఈ సీజన్ చాలా కఠినం.. ఈ సీజన్ రేసింగ్ చాలా కఠినంగా కొనసాగింది. ప్రతి డ్రైవర్‌కి ట్రోఫీ చేజింగ్ లా మారింది. నేను రేసర్‌గా మారడానికి నా కుటుంబం అందించిన సహకారం మాటల్లో వరి్ణంచలేని. పని పట్ల అంకితభావం, ఆత్మస్థైర్యం ఉంటే జెండర్‌తో పనిలేదు. – లారా క్యామ్స్ టారస్, మోటార్స్ స్పోర్ట్స్ వుమెన్ డ్రైవర్ రేసింగ్‌తో మంచి అనుబంధం.. నాకు చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ఇష్టం. చెన్నైలో ఉన్నప్పటి నుంచే రేసింగ్ తో అనుబంధం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఓనర్‌గా మారినప్పటికీ మన టీం చాంపియన్ షిప్ గెలవడం గర్వంగా ఉంది. మిగతా క్రీడల్లానే భారత్‌లో రేసింగ్ వృద్ధిలోకి రావడంలో మా వంతు కృషి చేస్తున్నాం. ఈ రేసింగ్ ఫెస్టివల్లో వుమెన్ డ్రైవర్స్ పాల్గొనడం, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. నాకు కార్ రేసింగ్ చేయడం మంచి హాబీ.. చిన్నప్పుడు నుంచి ఫార్ములా జీపీ రేసింగ్ అభిమానిస్తూ పెరిగాను. కానీ ఇండియన్ రేసింగ్‌లో పాల్గొనక పోవచ్చు. నా సినిమాల్లో రేసర్‌గా మంచి క్యారెక్టర్ వస్తే కచి్చతంగా చేస్తాను. – అక్కినేని నాగచైతన్య, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఓనర్ -
మాగ్నస్ కార్ల్సన్ ‘డబుల్’
ప్రపంచ నంబర్‌వన్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. రెండు రోజుల వ్యవధిలో 18 రౌండ్ల పాటు (9 చొప్పున) జరిగిన ఈ కేటగిరీ పోటీల్లో అతను మరో రౌండ్ మిగిలుండగానే టైటిల్ సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ర్యాపిడ్ టైటిల్ గెలుచుకున్న 33 ఏళ్ల నార్వే సూపర్‌స్టార్ బ్లిట్జ్‌లోనూ తిరుగులేదని నిరూపించుకున్నాడు. శనివారం ఎనిమిదో రౌండ్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ చేతిలో కంగుతిన్న కార్ల్సన్ ఆదివారం జరిగిన ‘రిటర్న్’ ఎనిమిదో రౌండ్లో అర్జున్నే ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకోవడం విశేషం. అప్పటికే 12 పాయింట్లు ఉండటంతో టైటిల్ రేసులో అతనొక్కడే నిలిచాడు. చివరకు ఆఖరి రౌండ్ (9వ)లోనూ కార్ల్సన్... భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతిని ఓడించడంతో మొత్తం 13 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఫిలిపినో–అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో 11.5 పాయింట్లతో రన్నరప్‌తో సంతృప్తి పడగా, తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశి(10.5)కి మూడో స్థానం దక్కింది. భారత ఆటగాళ్లు ఆర్. ప్రజ్ఞానంద (9.5), విదిత్ (9) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. -
US Open 2024: సూపర్ సినెర్
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చలాయిస్తూ వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచాడు. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకొచి్చన డోపింగ్ వివాదం తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సినెర్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు, టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సినెర్‌కు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ ఫ్రిట్జ్కు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్రేక్ పాయింట్‌తో మొదలు... 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక మరో అమెరికన్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయాడు. 2009లో ఆండీ రాడిక్ వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక మరో అమెరికా ప్లేయర్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయాడు. 15 ఏళ్ల తర్వాత టేలర్ ఫ్రిట్జ్ రూపంలో అమెరికా ప్లేయర్ ఒకరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతుండటంతో అందరి కళ్లు ఫ్రిట్జ్పైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే సినెర్ మాత్రం అమెరికా అభిమానుల ఆశలను వమ్ము చేశాడు.తొలి సెట్లోని తొలి గేమ్‌లోనే ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫ్రిట్జ్ స్కోరును 2–2తో సమం చేశాడు. కానీ సినెర్ వెంటనే విజృంభించి మరో రెండుసార్లు ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ సినెర్ దూకుడుకు ఫ్రిట్జ్ జవాబు ఇవ్వలేకపోయాడు. మూడో సెట్లో కాస్త పోటీ ఎదురైనా 12వ గేమ్‌లో ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ విజయాన్ని అందుకున్నాడు.6: ఈ ఏడాది సినెర్ గెలిచిన టైటిల్స్. ఆ్రస్టేలియన్ ఓపెన్, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో సినెర్ విజేతగా నిలిచాడు. 55: ఈ సంవత్సరం సినెర్ మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు. 3: తన కెరీర్లో ఒకే ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్ సినెర్. గతంలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్), జిమ్మీ కానర్స్ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4: ఒకే ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్ సినెర్. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మూడుసార్లు చొప్పున... 1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) ఒకసారి ఈ ఘనత సాధించారు. -
'ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే'.. మను భాకర్ పోస్ట్ వైరల్!
ఇటీవల పారిస్‌లో ముగిసిన ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మను భాకర్. తొలిసారి రెండు కాంస్య పతకాలు గెలిచి అందరి మనసులను గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఒక అథ్లెట్ పాత్రలో నటించడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే వివరాలేంటో చూద్దాం.బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చందు ఛాంపియన్'. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చందు ఛాంపియన్ వీక్షించిన మనుభాకర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే మను భాకర్ చేసిన పోస్ట్‌కు హీరో కార్తీక్ ఆర్యన్ రిప్లై ఇచ్చారు. మీలాంటి నిజమైన ఛాంపియన్ మా సినిమాపై ప్రశంసలు కురిపించడం అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒలింపిక్స్‌లో రాణించారని కొనియాడారు. ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ కార్తీక్ ఆర్యన్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
‘ఫ్రెంచ్ కింగ్’ అల్కరాజ్
మట్టి కోర్టులపై కొత్త యువరాజు వచ్చాడు. ఇప్పటికే పచ్చిక కోర్టులపై, హార్డ్ కోర్టులపై గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ యువతార కార్లోస్ అల్కరాజ్ మట్టి కోర్టులపై కూడా తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలిసారే అల్కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రెండోసారీ నిరాశే ఎదురైంది. 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్లలో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయిన జ్వెరెవ్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఐదు సెట్ల సమరంలో పరాజయం చవిచూశాడు.పారిస్: అంచనాలకు అనుగుణంగా ఆద్యంతం పట్టుదల కోల్పోకుండా ఆడిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం ముగిసిన టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 21 ఏళ్ల అల్కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ 6–3, 2–6, 5–7, 6–1, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్కు 24 లక్షల యూరోలు (రూ. 21 కోట్ల 71 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగిన సమరం హోరాహోరీగా సాగింది. తొలి సెట్లో అల్కరాజ్ పైచేయి సాధించగా... రెండో సెట్లో జ్వెరెవ్ పుంజుకున్నాడు. మూడో సెట్లో ఒకదశలో జ్వెరెవ్ 2–5తో వెనుకబడ్డాడు. అయితే జ్వెరెవ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను 7–5తో సొంతం చేసుకొని టైటిల్ దిశగా అడుగు వేశాడు. కానీ నాలుగో సెట్లో అల్కరాజ్ మళ్లీ చెలరేగాడు.జ్వెరెవ్‌కు కేవలం ఒక గేమ్ కోల్పోయి సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లోనూ అల్కరాజ్ తన జోరు కొనసాగించాడు. రెండుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసి తన సర్విస్లను నిలబెట్టుకొని ఈ స్పెయిన్ స్టార్ విజయకేతనం ఎగురవేశాడు. » ఓపెన్ శకంలో (1968 తర్వాత) మూడు ఉపరితలాలపై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయసు్కడిగా అల్కరాజ్ (21 ఏళ్లు) గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు రాఫెల్ నాదల్ (23 ఏళ్లు) పేరిట ఉంది.హార్డ్ కోర్టులపై 2022 యూఎస్ ఓపెన్ నెగ్గిన అల్కరాజ్, 2023లో పచ్చిక కోర్టులపై వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. » టెన్నిస్‌లోని మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిల్స్ సాధించిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ ఘనత వహించాడు. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాట్స్ విలాండర్ (స్వీడన్), జిమ్మీ కానర్స్ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా) గతంలో ఈ ఘనత సాధించారు. » కెరీర్లో ఫైనల్ చేరిన మొదటి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. గతంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్), స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), జాన్ బోర్గ్ (స్వీడన్), ఫెడరర్, జిమ్మీ కానర్స్, వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ ఘనత సాధించారు. » నాదల్, సాంటానా, గిమెనో, సెర్గీ బ్రుగుయెరా, కార్లోస్ మోయా, అల్బెర్ట్ కోస్టా, కార్లోస్ ఫెరీరో తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో స్పెయిన్ ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. -
సక్సెస్‌కి ఏజ్‌తో సంబంధం లేదంటే ఇదేనేమో..! ఏకంగా ఫిడే చెస్..
చెస్ స్టార్ జియానా గార్గ్ అతి పిన్న వయస్కురాలైన చెస్ ఛాంపియన్. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ఫిడే(ప్రపంచ చెస్ సమాఖ్య) రేటింగ్ పొంది అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు అత్యంత చిన్న వయసులో ఈ రేటింగ్ పొందిన చిన్నారిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులో అత్యున్నత అంతర్జాతీయ ప్రపంచ చెస్ సమాఖ్య రేటింగ్‌ని పొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అమె చెస్ జర్నీ ఎలా సాగిందంటే..జియానా గార్గ్ సాధించిన ఫిడే చెస్ రెటింగ్ నిజంగా అసాధారణమైనది. అత్యధిక ఫీడే చెస్ రేటింగ్ సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు ఆమె. ఈ విజయాన్ని చూస్తే జియానాకు చదరంగం పట్ల ఉన్న ఇష్టం, అంకితభావం క్లియర్‌గా తెలుస్తోంది. ఆమె చెస్ నేర్చుకోవడం ప్రారంభించింది కేవలం నాలుగున్నరేళ్ల నుంచే..చాలా వేగంగా ఈ క్రీడలో అపార జ్ఞానాన్ని సంపాదించింది. ఈ విజయంలో జియాని గురువు నవీన్ బన్సాల్ పాత్ర ఎక్కువే ఉంది. చండీగఢ్ చెస్ అసోసీయేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన నవీన్ బన్సాల్ మొదట్లో ఇంత చిన్న వయసులో ఉన్న ఆ చిన్నారికి చెస్ నేర్పించడానికి చాలా సంకోచించాడు. ఎందుకంటే..?ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు చెస్ ఎట్టిపరిస్థితుల్లో నేర్పించరు. అందువల్ల ఆయన ముందుకు రాలేకపోయినా..జియానాలో ఉన్న ప్రతిభ ఆయన్ను ఆకర్షించింది. ఆమెకు చెస్ మెళుకువలు నేర్పించేలా చేసింది. అదీగాక జియానా అమ్మ కూడా తన కూతురు క్రమశిక్షణతో ఉంటుందని ఒప్పించేలా ఒక వీడియో కూడా తనకు పంపినట్లు తెలిపారు. ఐతే ఆమె కొన్ని నెలల శిక్షణలోనే చెస్అ డ్వాన్స్‌డ్ బ్యాచ్‌లో పదోన్నతి పొందింది. "తను నా ఉపన్యాసాలను వినేలా అత్యంత అధునాతన బ్యాచ్‌లో ఉంచి మరీ కోచింగ్ ఇప్పించాం. ఐతే ఆమె అనుహ్యంగా మంచి రేటింగ్ ఉన్న ఇతర పిల్లలతో సమానంగా పోటీ పడటం ప్రారంభించిదని గుర్తించి, ఆమెకు చక్కటి తర్ఫీదు ఇచ్చామని చెప్పారు". బన్సాలీ. ఆమె ఇంతలా చెస్‌పై అంకితభావంతో నేర్చుకునేలా దృష్టిసారించడంలో జియానా తల్లి పాత్ర అద్భుతమైనదని అన్నారు. తల్లిదండ్రులు సహకారం లేకుండా ఏ కోచ్ కూడా ఇంత చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దలేరని అన్నారు.జియానా చెస్ విజయాలు..జియానా గార్గ్ మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2024, నేషనల్ అండర్-11 గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్-2023, మొదటి మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2023, మొదటి లేట్ శ్రీ ధీరాజ్ సింగ్ మెమోర్ ఓపెన్ రఘువానిడే, రేటింగ్ టోర్నమెంట్ 2023 వంటి అనేక టోర్నమెంట్లలో పాల్గొంది. ఆమె తను గురువుల మార్గదర్శకత్వంలో చేసిన అచంచలమైన కృషి, అంకితభావాలకి నిదర్శనమే ఈ విజయాల పరంపర. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చదరంగా ఔత్సాహికులకు స్పూర్తిగా నిలిచింది. పైగా ఈ పురాతన చెస్ క్రీడలో రాణించడానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది.(చదవండి: 'రజనీకాంత్ స్టైల్ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!) -
US Open 2023: 24: తగ్గేదేలే...
న్యూయార్క్: 36 ఏళ్ల వయసు వచ్చినా తన ఆటను మరింత పదునెక్కిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన జొకోవిచ్ సీజన్లో చివరిదైన యూఎస్ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. 3 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. కెరీర్లో 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్‌కు తుది పోరులో మెద్వెదెవ్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. 30 లేదా 40 షాట్లతో కూడిన ర్యాలీలను చాలాసార్లు జొకోవిచ్ పాయింట్‌తో ఫినిష్ చేయగా... కొన్నిసార్లు మెద్వెదెవ్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని రెండో గేమ్‌లోనే మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
చాంపియన్ భారత్
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్‌బలూషి గోల్‌తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్జులా చాంగ్టే గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా... కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 9: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్ సాధించింది. 24: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్‌తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్‌తో సునీల్ ఛెత్రి అధిగమించాడు. ‘షూటౌట్’ సాగిందిలా... భారత్ స్కోరు కువైట్ సునీల్ ఛెత్రి 4 10 అబ్దుల్లా 8 సందేశ్ జింగాన్ 4 21 అలోతైబి 4 లాలియన్జులా 4 32 ఆల్దెఫీరి 4 ఉదాంత సింగ్ 8 33 మహ్రాన్ 4 సుభాశ్ బోస్ 4 44 అల్ఖాల్ది 4 మహేశ్ సింగ్ 4 54 హజిహా 8 -
ఓరి బాబోయ్ ఇది మాములు ర్యాగింగ్ కాదు...నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు..
-
‘మీ కోసం మళ్లీ ఆడతా’
అహ్మదాబాద్: మూడేళ్ల క్రితం ఐపీఎల్లో ఇదే ప్రశ్న...రెండేళ్ల క్రితం టైటిల్ గెలిచాక ఇదే ప్రశ్న...గత ఏడాది టీమ్ ఘోరంగా విఫలమైనప్పుడు మళ్లీ అదే ప్రశ్న...ఇప్పుడు ఐదో సారి చాంపియన్‌గా నిలిచాక పాత సందేహమే కొత్తగా..! మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాడా, ఈ సారి అద్భుత ప్రదర్శనతో జట్టును విజేతగా నిలిపిన తర్వాత తప్పుకుంటున్నాడా అని అభిమానుల్లో ఉత్సుకత. చెన్నై సూపర్ కింగ్స్ 2023 చాంపియన్‌గా నిలిచిన తీరును చూస్తే ధోనికి ఇంతకంటే ఘనమైన వీడ్కోలు ఉండదనిపిస్తోంది. కానీ అతని మాట చూస్తే మళ్లీ వచ్చి ఆడతాడనిపిస్తోంది. ఫైనల్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్పై ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికర సమాధానమిచ్చాడు. ‘ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే రిటైర్మెంట్ను ప్రకటించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఒక్క మాటలో థ్యాంక్యూ అని చెప్పి నేను తప్పుకోవచ్చు. కానీ వచ్చే 9 నెలల పాటు కష్టపడి మరో ఐపీఎల్ ఆడటం మాత్రం అంత సులువు కాదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు నాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తే మరో సీజన్ ఆడటం వారికి కానుక అందించినట్లవుతుంది. వాళ్ల అభిమానం, భావోద్వేగాలు చూస్తే వారి కోసం ఇదంతా చేయాలనిపిస్తోంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. తాను కెరీర్ చివరి రోజుల్లో ఉన్నాననే విషయం వారికీ తెలుసని, అందుకే ఎక్కడకు వెళ్లినా తనకు ప్రేక్షకులనుంచి భారీ మద్దతు లభించిందని ధోని గుర్తు చేసుకున్నాడు. ‘ఇదే మైదానంలో సీజన్లో తొలి మ్యాచ్ ఆడాను. అంతా నా పేరును మైదానంలో మారుమోగించారు. చెన్నైలో మాత్రమే కాకుండా ఇలా అన్ని చోట్లా స్పందన చూస్తే నేను ఆడగలిగినంత ఆడాలనిపించింది’ అని మహి పేర్కొన్నాడు. కెపె్టన్‌గా తన ఐదు ఐపీఎల్ ట్రోఫీ విజయాల్లో ప్రతీది భిన్నమైందని, ఒకదాంతో మరోదానికి పోలిక లేదని, పరిస్థితులను బట్టి అన్ని మారతాయని ధోని అభిప్రాయ పడ్డాడు. ‘ప్రతీ ట్రోఫీ గెలుపు, ప్రతీ ద్వైపాక్షిక సిరీస్ విజయానికి వేర్వేరు సవాళ్లు ఉంటాయి. ఏదీ ఒకే తరహాలో మూసగా ఉండదు. అందుకే ఆందోళన చెందకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటా. ఇలాంటి టోరీ్నల్లో కీలక క్షణాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఎలా ఒత్తిడిని ఎదుర్కొంటామనేదే కీలకం. ఈ విషయంలో అందరూ భిన్నంగా ఉంటారు. రహానేలాంటి అనుభవజు్ఞలకు సమస్య రాదు కానీ కుర్రాళ్లను సరైన విధంగా నడిపించాల్సి ఉంటుంది’ అంటూ తన శైలిని వెల్లడించాడు. -
Adelaide International 1: జొకోవిచ్... టైటిల్ నంబర్ 92
అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్లో 5–6తో వెనుకబడి తన సర్వీస్‌లోని 12వ గేమ్‌లో 30–40తో మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్నాడు. ఓవర్‌హెడ్ షాట్‌తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్‌లో కోర్డా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 94,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్‌తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
టీ ట్వంటీ ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
-
77 ఏళ్ల వయసులో 1.5 కి.మీ. స్విమ్మింగ్
కంటోన్మెంట్: ఎమ్మెల్లార్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 77ఏళ్ల వయసులో అరుదైన రికార్డు సాధించారు. ట్రయథ్లాన్ చాంపియన్‌గా పేరొందిన ఆయన ఇటీవల మహరాష్ట్ర లోనావాలాలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 1.5 కిలో మీటర్ల దూరం ఈది సరికొత్త ఘనత సాధించారు. యువతకు స్ఫూర్తి కలిగించాలన్న లక్ష్యంతోనే తాను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ వెటరన్ స్పోర్ట్స్ జరిగినా హాజరవుతానని అన్నారు. ఇప్పటికీ నిరంతరం వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉంటానని అన్నారు. యువత ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శరీరంపై పట్టు సాధిస్తే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం కలుగుతుందన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసమూ కలుగుతుందన్నారు. (చదవండి: టు లెట్.. టేక్ కేర్) -
సీఎం జగన్‌ను కలిసిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ కార్తీక్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ అరబండి కార్తీక్ రెడ్డి గురువారం కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం అన్నారు. కరాటేను శాప్ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్ ఇటీవల జరిగిన కామన్వెల్త్ కరాటే చాంపియన్ షిప్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, అండర్ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణపతక విజేతగా కార్తీక్ నిలిచాడు. అంతకుముందు ఏప్రిల్‌లో లాస్వేగాస్లో జరిగిన యూఎస్ఏ ఓపెన్ ఛాంపియన్ షిప్‌లోనూ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అక్టోబర్‌లో టర్కీలో వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో అఫిషియల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో పాల్గొని పతకం సాధిస్తానని కార్తీక్ తెలిపారు. తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కార్తీక్ కోరగా, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, కార్తీక్ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌కేడీఏఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ మిల్టన్ లూథర్ శాస్త్రి, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు. -
Ultimate Kho Kho 2022: ఖో–ఖో లీగ్ విజేత ఒడిశా జగర్‌నాట్స్
పుణే: చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ పైచేయి సాధించి అల్టిమేట్ ఖో–ఖో లీగ్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఒడిశా జగర్‌నాట్స్ 46–45తో ఒక్క పాయింట్ తేడాతో తెలుగు యోధాస్ జట్టును ఓడించింది. మ్యాచ్ ముగియడానికి 14 సెకన్లు ఉన్నాయనగా తెలుగు యోధాస్ 45–43తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ దశలో ఒడిశా ప్లేయర్ సూరజ్ అద్భుతమైన డైవ్ చేసి తెలుగు యోధాస్ ప్లేయర్ అవధూత్ పాటిల్‌ను అవుట్ చేసి మూడు పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో ఒడిశాకు చిరస్మరణీయ విజయం సొంతమైంది. విజేతగా నిలిచిన ఒడిశా జట్టుకు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్ తెలుగు యోధాస్‌కు రూ. 50 లక్షలు... మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్‌కు రూ. 30 లక్షలు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు రామ్‌జీ కశ్యప్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 5 లక్షలు).. ‘బెస్ట్ అటాకర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు అభినందన్ పాటిల్ (గుజరాత్; రూ. 2 లక్షలు)... ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దీపక్ మాధవ్ (తెలుగు యోధాస్; రూ. 2 లక్షలు)... ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు మదన్ (చెన్నై క్విక్‌గన్స్; రూ. 2 లక్షలు) గెల్చుకున్నారు. -
అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించాడు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ ఆరు గేముల్లో విజయం సాధించి, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో అర్జున్ తెల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో స్పెయిన్ గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ ఆంటోన్ గిజారోపై గెలుపొందాడు. భారత్‌కే చెందిన రోహిత్‌కృష్ణ, దీప్‌సేన్ గుప్తా, రౌనక్ సాధ్వాని, అలెగ్జాండర్ ఇందిక్ (సెర్బియా), వాంగ్ హావో (చైనా)లపై కూడా అర్జున్ నెగ్గాడు. ఎవగెనీ తొమాషెవ్కీ (రష్యా), జోర్డెన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్), రాబ్సన్ రే (అమెరికా)లతో జరిగిన గేమ్‌లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 15 వేల డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మాస్టర్స్ టోర్నీలో మొత్తం 148 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఇందులో 43 మంది గ్రాండ్‌మాస్టర్లు, 35 మంది అంతర్జాతీయ మాస్టర్లు, ఏడుగురు మహిళా గ్రాండ్‌మాస్టర్లు, ముగ్గురు మహిళా అంతర్జాతీయ మాస్టర్లు ఉండటం విశేషం. -
పతకాలకు విజయం దూరంలో...
టోక్యో: ఈ ఏడాది థామస్ కప్‌లో భారత్ తొలిసారి చాంపియన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో ఏడాది ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ కేరళ ప్లేయర్ మరో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–16, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్, గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌తో ఆడతాడు. గత ఏడాది ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఈసారి మాత్రం ఒకరికి సెమీఫైనల్ బెర్త్‌తోపాటు పతకం కూడా లభించనుంది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఎం.ఆర్. అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాయి. ఈ రెండు జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–12, 21–10తో జెప్పా బే–లాసె మోల్హెడె (డెన్మార్క్) జోడీపై... అర్జున్–ధ్రువ్ జోడీ 18–21, 21–15, 21–16తో టెరీ హీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలుపొందాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా)లతో అర్జున్–ధ్రువ్... రెండో సీడ్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో ఒక్కసారి కూడా పతకం రాలేదు. సైనాకు నిరాశ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 13–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. -
Netherlands International Open Chess Tournament: చాంపియన్ హర్ష
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి తన కెరీర్లో మరో టైటిల్‌ను సాధించాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన హెచ్‌జెడ్ యూనివర్సిటీ అప్లయిడ్ సైన్సెస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 22 ఏళ్ల హర్ష చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హర్ష మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి రెండు వేల యూరోలు (రూ. లక్షా 63 వేలు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హర్ష ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయాడు. తొలి రౌండ్లో క్లీన్ జోరిక్ (నెదర్లాండ్స్)పై 35 ఎత్తుల్లో... రెండో రౌండ్లో ఎడువార్డ్ కోనెన్ (నెదర్లాండ్స్)పై 28 ఎత్తుల్లో... ఎస్పెర్ వాన్ బార్ (నెదర్లాండ్స్)పై 24 ఎత్తుల్లో గెలిచిన హర్ష నాలుగో రౌండ్లో శ్రేయస్ రాయల్ (ఇంగ్లండ్) చేతిలో 25 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్లో తేరుకున్న హర్ష కేవలం 14 ఎత్తుల్లో రెనీ డచెన్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. ఆరో రౌండ్లో హర్ష 61 ఎత్తుల్లో రొలాండ్ ఒలెన్బర్గర్ (జర్మనీ)పై, ఏడో రౌండ్లో 63 ఎత్తుల్లో విలియమ్ షక్వర్డియాన్ (నెదర్లాండ్స్)పై, ఎనిమిదో రౌండ్లో 53 ఎత్తుల్లో థామస్ బీర్డ్సెన్ (నెదర్లాండ్స్)పై, చివరిదైన తొమ్మిదో రౌండ్లో 33 ఎత్తుల్లో లలిత్ బాబు (భారత్)పై గెలుపొందాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు, అంతర్జాతీయ మాస్టర్ ధూళిపాళ్ల బాలచంద్ర 6.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా లలిత్ బాబు తొమ్మిదో ర్యాంక్‌లో, బాలచంద్ర 11వ ర్యాంక్‌లో నిలిచారు. ఏడు పాయింట్లతో రుస్లాన్ పొనొమరియోవ్ (ఉక్రెయిన్), లియామ్ వ్రోలిక్ (నెదర్లాండ్స్), థామస్ బీర్డ్సెన్, వ్లాదిమిర్ బాక్లాన్ (ఉక్రెయిన్), టిమ్ గ్రుటెర్ (నెదర్లాండ్స్), వ్యాచెస్లావ్, ఖోయ్ ఫామ్ (నెదర్లాండ్స్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా పొనొమరియోవ్ రన్నరప్‌గా నిలువగా, లియామ్‌కు మూడో ర్యాంక్ దక్కింది. -
ఏడోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా
మహిళల క్రికెట్లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగి ఆద్యంతం దూకుడును కొనసాగించిన ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిదో విజయంతో ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించింది. క్రైస్ట్‌చర్చ్: ఆస్ట్రేలియా జోరు ముందు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ నిలబడలేకపోయింది. ఆదివారం జరిగిన మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా 71 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించి ఏడోసారి విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హీతెర్ నైట్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్ హేన్స్ ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ముఖ్యంగా అలీసా హీలీ (138 బంతుల్లో 26 ఫోర్లతో 170) తన కెరీర్లోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. రాచెల్ హేన్స్ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద... అలీసా 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌లను ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో రాచెల్ హేన్స్ (93 బంతుల్లో 68; 7 ఫోర్లు) అవుటవ్వడంతో 160 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాచెల్ అవుటయ్యాక వచ్చిన బెత్ మూనీ (47 బంతుల్లో 62; 8 ఫోర్లు) కూడా కదంతొక్కడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగెత్తింది. అలీసా, బెత్ మూనీ రెండో వికెట్‌కు 156 పరుగులు జత చేయడంతో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటింది. అలీసా ‘డబుల్ సెంచరీ’ ఖాయమనుకుంటున్న దశలో ష్రుబ్షోల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. నటాలీ సివెర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత ఆటతో అజేయ సెంచరీ సాధించినా ఆమెకు సహచర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. టామీ బీమోంట్ (27; 5 ఫోర్లు), హీతెర్ నైట్ (26; 4 ఫోర్లు), సోఫీ డంక్లే (22; 1 ఫోర్) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దాంతో ఇంగ్లండ్ లక్ష్యానికి దూరంగా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ (3/64), జెస్ జొనాసెన్ (3/57) రాణించారు. టోర్నీ మొత్తంలో 509 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచిన అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’... ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డులు లభించాయి. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్ ఇంగ్లండ్‌కు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► ఒకే ప్రపంచకప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో (సెమీఫైనల్, ఫైనల్) సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ అలీసా. గతంలో పురుషుల క్రికెట్లో పాంటింగ్ (ఆస్ట్రేలియా; 2003 ఫైనల్, 2011 క్వార్టర్ ఫైనల్), జయవర్ధనే (శ్రీలంక; 2007 సెమీఫైనల్, 2011 ఫైనల్) వేర్వేరు ప్రపంచకప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశారు. ► పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీ ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా అలీసా హీలీ రికార్డు సృష్టించింది. శ్రీలంకతో 2007 పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (149) స్కోరును అలీసా అధిగమించింది. ► ఇప్పటివరకు 12 సార్లు మహిళల ప్రపంచకప్ టోర్నీలు జరగ్గా... ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. ► ఆస్ట్రేలియా సాధించిన ప్రపంచకప్ టైటిల్స్. గతంలో ఆసీస్ 1978, 1982, 1988, 1997, 2005, 2013లలో కూడా విజేతగా నిలిచింది. -
పీవీఎల్ చాంప్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–0 (15–13, 15–10, 15–12)తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టును ఓడించింది. కోల్‌కతా ఆటగాడు వినీత్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవా ర్డును దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కీలకదశలో కోల్‌కతా ఆటగాళ్లు పాయింట్లు గెలిచి వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు. వినీత్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ గా... ఎస్వీ గురుప్రశాంత్ (హైదరాబాద్ బ్లాక్‌హాక్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా... అంగముత్తు (అహ్మదాబాద్ డిఫెండర్స్) ‘బెస్ట్ స్పైకర్ ఆఫ్ ద సీజన్’గా... జాన్ జోసెఫ్ (హైదరాబాద్ బ్లాక్ హాక్స్) ‘బెస్ట్ బ్లాకర్ ఆఫ్ ద సీజన్’గా... షాన్ జాన్ (అహ్మదాబాద్ డిఫెండర్స్) ‘ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా అవార్డులు గెల్చుకున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేత యాష్లే బార్టీ
-
‘కింగ్’ అర్జున్
కోల్‌కతా: పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడ్డ టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ అద్భుతం చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాంపియన్‌గా అవతరించాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రోజు జరిగిన మూడు గేమ్‌లను అర్జున్ ‘డ్రా’గా ముగించాడు. ఆధిబన్ (భారత్)తో జరిగిన ఏడో గేమ్‌ను అర్జున్ 45 ఎత్తుల్లో... విదిత్ (భారత్)తో జరిగిన ఎనిమిదో గేమ్‌ను 12 ఎత్తుల్లో... లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో గేమ్‌ను 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
4 సార్లు చాంపియన్.. సెకండ్ల వ్యవధిలో మిస్సయ్యాడు
ఒలంపిక్స్‌లో పాల్గొనాలని ప్రతి ఒక్క అథ్లెట్ కల. అందుకోసం వాళ్లు ఏళ్ల తరబడి సాధన చేస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం, ప్రతిష్టాత్మక టోర్నికి 19 సెకన్ల ఆలస్యం వల్ల అర్హత కోల్పోతే ఆ బాధ వర్ణించలేం. అది కూడా మొదటి సారి ఒలంపిక్స్‌లో అడుగుపెడుతున్న అథ్లెట్ కాదు ఏకంగా 4 సార్లు చాంపియన్‌గా నిలిచిన వ్యక్తి ఇలా చేజార్చుకున్నాడంటే నమ్మలేం కదా ? కానీ ఇది నిజం. తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన మో ఫారా. శుక్రవారం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన 10వేల మీటర్ల ఒలంపిక్స్ అర్హత పోటీల్లో.. అతను కొద్దిలో గమ్యాన్ని చేరలేకపోయాడు. 27 నిమిషాల 28 సెకన్లలో టార్గెట్‌ను చేరుకోవాల్సి ఉండగా, మో ఫారా 27నిమిషాల 47 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. దీంతో అతను మరో సారి ఒలంపిక్స్‌లో ఐదో సారి చాంపియన్‌గా నిలవాలన్న మో పారా నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది. Not to be for @Mo_Farah tonight but this man is and always will be a champion 🥇🥇🥇🥇 pic.twitter.com/CK3BnTSB9t — Team GB (@TeamGB) June 25, 2021 చదవండి: టోక్యో ఒలింపిక్స్: పీవీ సింధుకి అరుదైన గౌరవం.. -
Alexander Zverev: జ్వెరెవ్ అదరహో...
మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో బలమైన ప్రత్యర్థులను ఓడిస్తూ సాగిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రయాణం ఘనంగా ముగిసింది. క్వార్టర్స్‌లో నాదల్‌ను, సెమీస్‌లో థీమ్‌ను ఓడించిన జ్వెరెవ్... ఫైనల్లోనూ అదే ప్రదర్శనను కనబరచి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన టైటిల్ పోరులో జ్వెరెవ్ 6–7 (6/8), 6–4, 6–3తో మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. మాడ్రిడ్ ఓపెన్‌ను జ్వెరెవ్ గెలవడం రెండో సారి. 2018లో అతను తొలిసారి ఈ టైటిల్‌ను నెగ్గగా...అతని కెరీర్లో ఇది నాలుగో మాస్టర్స్–1000 టైటిల్. మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన ప్రపంచ పదో ర్యాంకర్ బెరెటిని కీలక సమయాల్లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు ప్లేయర్లు కూడా హోరాహోరీగా తలపడటంతో టై బ్రేక్‌కు దారి తీసింది. ఇందులో నెగ్గిన బెరెటిని తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో బెరెటిని సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... ఆ తర్వాత తన గేమ్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో సెట్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన జ్వెరెవ్ ఆ సెట్‌ను గెలవడంతో లాంఛనం పూర్తి చేశాడు. మ్యాచ్‌లో బెరెటిని 50 అనవసర తప్పిదాలు చేయడంతో పాటు... మూడో సెట్లో జ్వెరెవ్ సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా వాటిని జారవిడిచి మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ్వెరెవ్ 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (సుమారు రూ. 2 కోట్ల 81 లక్షలు)ని అందుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో మార్సెల్ గ్రనోలర్స్ (స్పెయిన్)– హరసియో జెబలోస్ (అర్జెంటీనా) జంట 1–6, 6–3, 10–8తో నికోలా మెక్టిక్–మాటె పవిచ్ (క్రొయేషియా) జోడిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.