Civil Aviation
-
రెండు సంస్థలదే ఆధిపత్యం!
దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్లో నాయుడు పాల్గొని మాట్లాడారు.‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ముప్పై కోట్లకు విమాన ప్రయాణికులు! ఎప్పటి వరకంటే..
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి (2030) దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 30 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు సుమారు 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (జీఐఎఫ్ఏఎస్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న సివిల్ ఏవియేషన్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఎయిర్‌లైన్స్ కూడా తమ విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా 157 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్‌డ్రోమ్‌లు ఉన్నాయని చెప్పారు. వినియోగంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 2025 ఆఖరు నాటికి 200కి పెరగవచ్చని పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో మరో 200 విమానాశ్రయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ అనుకూల విమాన ఇంధన సరఫరా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంపై భారత్, ఫ్రాన్స్ కలిసి పని చేయొచ్చని ఆయన తెలిపారు. ఎయిర్‌బస్ భారత మార్కెట్ నుంచి విడిభాగాల కొనుగోళ్లను మరింతగా పెంచుకోనున్నట్లు ఎయిర్‌బస్ సీఈవో గిలామీ ఫారీ తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో భారత్ నుంచి సరీ్వసులు, విడిభాగాల కొనుగోళ్లను రెట్టింపు స్థాయిలో 1 బిలియన్ యూరోలకు పెంచుకున్నట్లు వివరించారు. తమకు ఇక్కడ 100కు పైగా సరఫరాదారులు ఉన్నట్లు జీఐఎఫ్ఏఎస్లో పాల్గొన్న సందర్భంగా ఫారీ చెప్పారు. జీఐఎఫ్ఏఎస్లో భాగమైన కంపెనీలు భారత్ నుంచి ఏటా 2 బిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఎయిర్‌బస్‌కు 8,600 విమానాల ఆర్డర్ బుక్ ఉండగా, ఈ ఏడాది 770 ప్లేన్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దేశీయంగా ఇండిగో, ఎయిరిండియా కలిసి 1,000కి పైగా విమానాల కోసం ఆర్డరు ఇచ్చాయి. -
యుద్ధంలో విమానాల టార్గెట్‌పై ఐఏటీఏ వ్యాఖ్యలు
పౌర విమాన కార్యకలాపాలు భద్రంగా సాగేలా అన్ని దేశాలు బాధ్యత వహించాలని అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం ఐఏటీఏ తెలిపింది. రాజకీయ సంఘర్షణల్లో సంస్థ ఎవరి వైపూ మొగ్గదని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ స్పష్టం చేశారు. వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో పౌర విమానాల నేవిగేషన్ వ్యవస్థను ఏ దేశం లక్ష్యంగా చేసుకోకూడదని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల వాల్ష్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా వాల్ష్ మాట్లాడుతూ..‘విమానాశ్రయాలు, విమాన నేవిగేషన్ మౌలిక వసతులను ఏ దేశం కూడా లక్ష్యంగా పెట్టుకోరాదు. పౌర విమాన కార్యకలాపాలు భద్రంగా కొనసాగేలా చూడాలి. రాజకీయ సంఘర్షణల్లో పౌర విమానయానం ఎవరి పక్షమూ వహించదు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకుంటోంది. అందులో పాల్గొంటున్న ఎవరివైపూ సంస్థ మొగ్గు చూపదు. పౌర విమానయానం భద్రంగా సాగేలా అన్ని దేశాలు సహకరించాలి. యుద్ధాలకు సిద్ధపడే దేశాలు పౌర విమానాల నేవిగేషన్ వసతులను లక్ష్యంగా చేసుకోకూడదు. ప్రతి పరిశ్రమకు అంతర్జాతీయ ప్రమాణాల్లో పనిచేయడం ముఖ్యం. మేం పౌరులకు సేవలందిస్తున్నాం. కాబట్టి దేశాలకు అతీతంగా ఈ యుద్ధ సంఘర్షణలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. అంతర్జాతీయ చట్టంలోని నిబంధనలు అందరూ పాటించాలి’ అని చెప్పారు.ఇదీ చదవండి: పెరిగిన ఇంటి భోజనం ఖర్చు..ఎంతంటే..భారత విమానయాన సంస్థలతో పాటు, అంతర్జాతీయంగా మొత్తం 330 కంపెనీలకు ఐఏటీఏ ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ విమాన రద్దీలో 80 శాతానికి పైగా వాటా కలిగిన సంస్థలు ఈ సంఘంలో భాగంగా ఉన్నాయి. -
పదేళ్లలో గణనీయ వృద్ధి
దేశీయ వైమానిక రంగంలో గత పదేళ్లలో ఆశించినమేర వృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో మోదీ పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ)తో సహా 29 దేశాలు, ఎనిమిది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఒకప్పుడు విమాన ప్రయాణం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మధ్యతరగతి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విమాన ప్రయాణాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి మారిపోయింది. టైర్ 2, 3 నగరాల్లోనూ విమానయానానికి అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దానివల్ల ఆయా నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ రంగంలో పదేళ్ల కిందటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని తెలిపారు.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, విమానయాన రంగంలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడం, పౌర విమానయానంలో స్థిరమైన వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’ పేరుతో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని ప్రధాని నరేంద్రమోదీ ఆమోదించారు. తాజాగా జరిగిన సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘విమానయాన రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులతో చర్చించి ఢిల్లీ డిక్లరేషన్‌ను రూపొందించాం. ఐసీఏఓ గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్, గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ ప్లాన్, ఏవియేషన్ భద్రత..తదితర అంశాలను అందులో పొందుపరిచాం’ అని మంత్రి తెలిపారు. -
విమానయానంలో విప్లవం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: గత తొమ్మిదిన్నరేళ్లలో విమానయాన గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పౌర విమానయాన, ఉక్కుశాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రూ.347 కోట్లతో నిర్మిస్తున్న డొమెస్టిక్ టెర్మినల్ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల భారతదేశ చరిత్రలో 2014 నాటికి దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉన్నాయని, ఈ తొమ్మిదిన్నరేళ్లలో 75 ఎయిర్‌పోర్టులు నిర్మించామని చెప్పారు. దీంతో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 149కి చేరిందన్నారు. వీటి సంఖ్యను 220కి పెంచుతామని తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ పాయింట్ 21,094 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, రద్దీవేళల్లో 2,100 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతోపాటు భవిష్యత్‌లో ఏటా 30 లక్షలమంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం ఉంటుందని వివరించారు. 28 చెక్ ఇన్ కౌంటర్లు, నాలుగు అరైవల్ కరైజల్స్, 600 కార్లకు పార్కింగ్, ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో టెర్మినల్ రూపు దిద్దుకోనుందని చెప్పారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్‌కు మాత్రమే విమానాల కనెక్టివిటీ ఉండేదని, ప్రస్తుతం మూడు ప్రధాన నగరాలకు ఉందని తెలిపారు. తిరుపతి నుంచి గతంలో ఒక నగరానికి మాత్రమే కనెక్టివిటీ ఉండగా.. ఇప్పుడది 10 ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. విజయవాడకు రెండు నగరాలతో కనెక్టివిటీ ఉంటే ప్రస్తుతం ఎనిమిదికి పెరిగిందని, షార్జా కూడా వెళ్లగలుగుతున్నారని తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు తొమ్మిది ప్రాంతాలతో ఉన్న కనెక్టివిటీ ఇప్పుడు 14 నగరాలకు పెరిగిందన్నారు. సింగపూర్‌కు సైతం విమానాలు వెళ్లేలా వసతులు కల్పించామని చెప్పారు. అలాగే కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల ద్వారా వివిధ ప్రాంతాలకు విమానాలు వెళ్లేలా తీర్చిదిద్దామన్నారు. భోగాపురం, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులను గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఇటీవల భోగాపురంలో 2,200 ఎకరాల్లో రూ.4 వేల కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. రెండేళ్లలో దీని నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. కర్నూలులో రూ.500 కోట్లతో ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కలెక్టర్ కె.మాధవీలత, జేసీ ఎన్.తేజ్‌భరత్, రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కమిషనర్ కె.దినేష్‌కుమార్, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్‌కుమార్, మధురపూడి విమానాశ్రయ అధికారి ఎస్.జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సింథియా ప్రసంగం అందరికీ నమస్కారం.. అంటూ సింథియా ప్రారంభించిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సాంస్కృతిక రాజధానిగా ఖ్యాతిగాంచిన రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి ఒడ్డున ఉందని, వెయ్యేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఈ నగర సాంస్కృతిక వారసత్వం దేశానికే తలమానికమని కొనియాడారు. ప్రజాకవి నన్నయ నడయాడిన నేలగా అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడి వారేనని ఆయన పేర్కొన్నారు. -
వింగ్స్ ఇండియా 2024కు శ్రీకారం
వింగ్స్ ఇండియా 2024 కర్టెన్ రైజింగ్ వేడుక సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నుంచి జ్ఞాపికను స్వీకరిస్తున్న ఫిక్కీ సివిల్ ఏవియేషన్ కమిటీ చైర్మన్, ప్రెసిడెంట్ ఎయిర్‌బస్ ఎండీ (భారత్ అలాగే దక్షిణాసియా) రెమి మెయిలార్డ్. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ హైదరాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో వింగ్స్ ఇండియా 2024 ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమంగా నిలవనుంది. ‘‘వరల్డ్ కనెక్ట్ ఇండియా’’ ప్రధాన థీమ్‌తో ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది. సమస్యలను విమానయాన సంస్థలు సొంతంగా పరిష్కరించుకోవాలి కార్యక్రమం సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా మాట్లాడుతూ, గోఫస్ట్ దివాలా అంశం పరిశ్రమకు విచారకరమైన అంశమేనని అన్నారు. అయితే అయితే విమానయాన సంస్థలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా సంస్థ తమ విమాన సేవలను తిరిగి ప్రారంభించాలనే ప్రభుత్వ కోరుకుంటోందన్నారు. అయితే తొలుత గోఫస్ట్ తన కార్యాచరణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు తప్పనిసరిగా తమ వినతిపత్రాన్ని సమర్పించాలని సూచించారు. -
రూ.400 కోట్లతో పౌర విమానయాన పరిశోధన కేంద్రం
తెలంగాణలో మరో పరిశోధనా సంస్థ రూపుదిద్దుకుంటోంది. పౌర విమానయాన రంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిశోధనా సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.400 కోట్లకుపైగా అంచనా వ్యయంతో బేగంపేట విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఏఆర్వో)కు శ్రీకారం చుట్టింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో మున్ముందు విమానయాన రంగంలో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా పరిశోధనలు జరగనున్నాయి. ‘గృహ–5’ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పరిశోధనా కేంద్రంలో ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేశారు. భారతదేశంలో మొదటిసారిగా నిర్మిస్తున్న ఈ కేంద్రంలో విమానాశ్రయాలు, ఎయిర్ నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్, డొమైన్ సిమ్యులేటర్, నెట్వర్క్ ఎమ్యులేటర్, విజువలైజేషన్ – అనాలసిస్ ల్యాబ్స్, సరై్వలెన్స్(నిఘా) ల్యాబ్స్, నావిగేషన్ సిస్టమ్స్ ఎమ్యులేషన్ – సిమ్యులేషన్ ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ – థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్, డేటా మేనేజ్మెంట్ సెంటర్, ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ – టూల్స్ సెంటర్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్‌సహా పలు పరిశోధనలు జరగనున్నాయి. -
ఏవియేషన్ పరిశ్రమ.. వీ షేప్ రికవరీ!
న్యూఢిల్లీ: దేశీ పౌరవిమానయాన పరిశ్రమ వీ ఆకారంలో బలమైన రికవరీ చూస్తోందని (ఎలా పడిపోయిందో, అదే మాదిరి కోలుకోవడం) ఈ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దేశీ ప్రయాణికుల సంఖ్యలోనూ బలమైన వృద్ధి కనిపిస్తోందంటూ, రానున్న సంవత్సరాల్లోనూ ఇది కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండేళ్లపాటు ఏవియేషన్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను చూడడం తెలిసిందే. గతేడాది చివరి నుంచి పుంజుకున్న పరిశ్రమ ఈ ఏడాది బలమైన వృద్ధిని చూస్తుండడం గమనార్హం. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పైనే నమోదవుతోంది. ప్రయాణికుల సంఖ్య ఎంతో ఉత్సాహకరంగా ఉందంటూ, ఈ ఏడాది నవంబర్ నాటికి 111 మిలియన్లకు చేరుకుందని సింధియా వెల్లడించారు. వాయు మార్గంలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారంటూ, అందుకే ఈ స్థాయి గణాంకాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఏవియేషన్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవారం 2,883 దేశీ సర్వీసుల్లో 4,15,426 మంది ప్రయాణించారు. ‘‘కరోనా ముందు 2019లో సగటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.15 లక్షలుగా ఉండగా, గడిచిన రెండు వారాల్లో దీనికి మించి ప్రయాణిస్తుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది. డిసెంబర్ 24న 4.35 లక్షల మంది ప్రయాణించారు’’అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కేసులు ఆందోళనకరం.. ప్రపంచవ్యాప్తంగా చైనా, దక్షిణకొరియా, జపాన్, యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళకర విషయమేనని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘‘మేము ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అందుకే ఆరోగ్యశాఖ సూచనలకు అనుగుణంగా భారత్‌కు వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి స్క్రీనింగ్ (పరీక్షలు) నిర్వహిస్తున్నాం. అదృష్టం కొద్దీ ప్రస్తుతం ఎక్కువ కేసులు రావడం లేదు. ఈ విషయంలో కొంత వేచి చూసే ధోరణి అవసరం’’అని చెప్పారు. అంత రద్దీని అంచనా వేయలేదు.. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర రద్దీ కారణంగా ప్రయాణికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవడం తెలిసిందే. పండుగల సమయంలో అంత రద్దీని తాము అంచనా వేయలేదని సింధియా చెప్పారు. ‘‘నిజానికి ఇది విమానాశ్రయాల బాధ్యత. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాల్లేని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉంది. రద్దీ వేళల్లో విమానాశ్రయాల సామర్థ్యానికి అనుగుణంగా ట్రాఫిక్‌ను కట్టడి చేయడం, సామర్థ్యాన్ని విస్తరించడం దీనికి పరిష్కారం’’అని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఢిల్లీ విమానాశ్రయంతోపాటు, పలు ఇతర విమానాశ్రయాల్లో రద్దీపై పౌర విమానయాన శాఖకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పౌర విమానయాన శాఖ పలు దిద్దుబాటు చర్యలకు దిగడం గమనార్హం. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ను నియంత్రించామని, మరిన్ని గేట్లు తెరిచామని మంత్రి చెప్పారు. ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ ఇదే తరహా చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2019తో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపారు. -
Covid-19: వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ తప్పదు. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు. కొత్తగా 201 కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. -
విమానం గాల్లోకి ఎగిరాక పైలట్ల ఫైట్.. పాపం ప్రయాణికులు..!
పారిస్: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. విమానాలను నడిపే పైలట్లు ఎంతో నేర్పుతో, నైపుణ్యవంతులై ఉంటారు. సమన్వయంతో విమానాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. అలాంటిది.. వారే విమానంలోని కాక్‌పుట్‌లో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్చల్ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్ నుంచి జెనీవాకు వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానంలోని ఇద్దరు పైలట్లు గొడవకు దిగిన కారణంగా వారిని సస్పెండ్ చేశారు అధికారులు. పైలట్లు గత జూన్ నెలలో విమానం కాక్‌పిట్‌లో గొడవ పడినట్లు ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే, కొద్ది క్షణాల్లోనే గొడవ సద్దుమణిగిందని, ఆ తర్వాత విమాన ప్రయాణం సాఫీగా కొనసాగినట్లు చెప్పారు. తమ ప్రవర్తనపై మేనేజ్మెంట్ నిర్ణయం కోసం పైలట్లు ఇన్నాళ్లు వేచి ఉన్నారని చెప్పారు. ఫ్రాన్స్ పౌర విమానయాన సంస్థ భద్రతా దర్యాప్తు సంస్థ నివేదిక బయటకు రావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూన్‌లో జరిగిన సంఘటన నివేదిక ప్రకారం.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయానికే కాక్‌పిట్‌లో పైలట్, కోపైలట్‌ల మధ్య వివాదం మొదలైంది. దీంతో ఒకరు ఎదుటి వ్యక్తి కాలర్ పట్టుకున్నారు. దాంతో అతడిపై దాడి చేశారు మరొకరు. కాక్‌పిట్ నుంచి అరుపులు క్యాబిన్లోకి వినిపించినట్లు పలువురు తెలిపారు. దీంతో వారు వెళ్లి గొడవను ఆపారని, ఓ పైలట్ ఫ్లైట్ డెక్కు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్ -
హైదరాబాద్: రెండో రోజు వింగ్స్ ఇండియా ఎయిర్ షో
-
లాటరీలో లక్కీ చాన్స్! 150 కిలోల బరువు ఉండటంతో టికెట్ ఫ్రెండ్‌కు ఇచ్చి..
కేప్ కానవెరల్: ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ గతేడాది చేపట్టిన తొలి పౌర అంతరిక్షయానం ‘ఇన్స్పిరేషన్ 4’కు లాటరీలో టికెట్ గెలుచుకున్న వ్యక్తి దాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడని తెలుసా? బరువు ఎక్కువున్నందు వల్ల స్పేస్‌లో ప్రయాణించే అవకాశాన్ని అతను కోల్పోయాడంటే నమ్ముతారా? అక్షరాలా నిజం. టికెట్ గెలుచుకున్న అసలు వ్యక్తి పేరు కైల్ హిప్చెన్. తన కాలేజీ స్నేహితుడు క్రిస్ సెంబ్రోస్కీకు ఆ టికెట్‌ను ఇచ్చాడు. అలా స్నేహితుడికి టికెట్ ఇచ్చిన విషయాన్ని హిప్చెన్ ఎప్పుడో తన స్నేహితులు, బంధువులకు చెప్పినా ఇటీవలే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఫ్లోరిడాకు చెందిన ఎండీవర్ ఎయిర్ అనే విమానయాన సంస్థలో హిప్చెన్ కెప్టెన్‌గా పని చేస్తున్నాడు. 1990ల్లో ఏరోనాటికల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్రిస్ సెంబ్రోస్కీ, హిప్చెన్ కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. తర్వాత కాలంలో హిప్చెన్ కెప్టెన్‌గా ఫ్లోరిడాలో, క్రిస్ డేటా ఇంజనీర్‌గా వాషింగ్టన్లో ఉంటున్నారు. రూ. 48 వేలు పెట్టి లాటరీలో పాల్గొని.. స్పేస్ ఎక్స్ అంతరిక్షయానానికి సంబంధించిన ఓ సీటును ‘షిఫ్ట్4 పేమెంట్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జారెడ్ ఇసాక్‌మన్ కొనుగోలు చేశాడు. ఓ పిల్లల రీసెర్చ్ ఆస్పత్రి కోసం డబ్బులు పోగు చేయడానికి దాన్ని లాటరీ ద్వారా అమ్మతున్నట్టు ప్రకటించాడు. అది తెలుసుకున్న హిప్చెన్ రూ. 45 వేలు, క్రిస్ రూ. 3 వేలు కలిపి రూ. 48 వేలతో లాటరీలో పాల్గొన్నారు. 72 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరిలో లాటరీ తీస్తే హిప్చెన్ పేరొచ్చింది. గెలిచిన వ్యక్తి 2 మీటర్ల లోపు పొడవు, 113 కిలోల వరకు బరువుండాలని స్పేస్ ఎక్స్ షరతు విధించింది. కానీ హిప్చెన్ 150 కిలోలున్నాడు. లాంచింగ్‌కు 6 నెలలుంది. బరువు తగ్గుదామనుకున్నాడు. కానీ ఒకేసారి అంత బరువు తగ్గడం మంచిదికాదని తెలుసుకున్నాడు. దీంతో తన స్నేహితుడు క్రిస్ సెంబ్రొస్కీని హిప్చెన్ ఎంచుకున్నాడు. -
త్వరలో టాటాల చేతికి ఎయిరిండియా
Rajiv Bansal About Air India Disinvestment: ఎయిరిండియాలో వాటా విక్రయ ప్రక్రియను డిసెంబర్‌కల్లా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సల్ పేర్కొన్నారు. నష్టాలతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన కంపెనీ ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను త్వరితగతిన పూర్తి చేసే సన్నాహాల్లో ప్రభుత్వమున్నట్లు తెలియజేశారు. ఎయిరిండియా కొనుగోలు రేసులో టాటా గ్రూప్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం గత నెల 25న ఎయిరిండియా విక్రయానికి టాటా సన్స్‌తో రూ. 18,000 కోట్ల విలువైన వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా టాటా గ్రూప్ రూ. 2,700 కోట్లు నగదు రూపేణా చెల్లించడంతోపాటు.. మరో రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. అంతేకాకుండా ఎయిరిండియాతోపాటు చౌక ధరల సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను, ఏఐఎస్ఏటీఎస్లో ఎయిరిండియాకుగల 50 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనుంది. కంపెనీ నెలకు రూ. 600 కోట్లకుపైగా నష్టాలు నమోదు చేస్తోంది. -
విమానాల్లో మీల్స్‌కు అనుమతి
న్యూఢిల్లీ:విమానయాన సంస్థలు అన్ని దేశీ విమానాల్లో ప్రయాణికులకు మీల్స్ సర్వీసు అందించడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించింది. అలాగే, చదువుకునేందుకు మ్యాగజైన్లు మొదలైనవి కూడా అందించవచ్చని తెలిపింది. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో రెండు గంటల కన్నా తక్కువ ప్రయాణ సమయం ఉండే ఫ్లయిట్స్‌లో ప్రయాణికులకు భోజనాలు అందించడంపై ఏప్రిల్ 15 నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
చిన్న సిటీలకు చిట్టి విమానం, రివ్వున ఎగిరేందుకు రెడీ
ద్వితీయ శ్రేణి నగరాలు జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తొలి చిన్న విమానం గాలిలో ఎగిరేందుకు రంగం సిద్ధమైంది. హల్ ఆధ్వర్యంలో విమానయాన రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర రాజధానులే కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే నిర్ణయంతో ఉంది. అందులో భాగంగా తక్కువ రన్ వేలో టేకాఫ్, ల్యాండ్ అయ్యేలా సివిల్ డూ 228 (డార్నియర్ 228) విమానాలను హిందుస్తాన్ ఎయిరోనాటిక్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థ రూపొందిస్తోంది. కాన్పూరులో ఈ విమానాలను తయారీ జరుగుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో పూర్తిగా కొండ ప్రాంతాలతో నిండి ఉండే అరుణాచల్ ప్రదేశ్‌లో తొలిసారిగా ఈ విమానాలను సివిల్ ఏవియేషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు హల్, సివిల్ ఏవియేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఆర్మీ ఆధ్వర్యంలో ఈ విమానాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిర్ అంబులెన్సులుగా అత్యవసర సేవలు అందిస్తున్నాయి. పలు రకాలుగా హల్ తయారు చేస్తోన్న సివిల్ డూ 228 విమనాల్లో 19 మంది ప్రయాణించవచ్చు. మెయింటనెన్స్ ఖర్చు తక్కువ. ప్రయాణికుల రవాణాతో పాటు వీఐపీ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ అంబులెన్స్, ఫ్లైట్ ఇన్స్పెక్షన్, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, రిక్రియేషన్ యాక్టివిటీస్‌కి ఉపయోకరంగా ఉంటుంది. త్వరలో వరంగల్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, రామగుండం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీఎంఆర్ ఒప్పందాల నుంచి మినహాయింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది, ఈ విషయాల్లో క్లారిటీ వస్తే జిల్లా కేంద్రాల నుంచి రివ్వున ఎగిరేందుకు డూ 228 విమానాలు రెడీ అవుతున్నాయి. చదవండి : ఎలక్ట్రిక్ కార్లపై సుంకం తగ్గించండి: ఆడి కంపెనీ -
ఎయిరిండియాపై కెయిర్న్ దావా ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయంపై కెయిర్న్ ఎనర్జీ, దేవాస్ మల్టీమీడియా సంస్థలు దాఖలు చేసిన కేసుల ప్రభావమేమీ ఉండదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. సొంత మేనేజ్మెంటు, బోర్డుతో ఎయిరిండియా ప్రత్యేకంగా కార్పొరేట్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోందని లోక్‌సభలో ఆయన తెలిపారు. పన్ను వివాదంలో కేంద్రం నుంచి పరిహారం రాబట్టుకునే క్రమంలో బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. విదేశాల్లోని భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు వివిధ దేశాల్లో కేసులు వేసింది. ఇందులో భాగంగా ఎయిరిండియా ఆస్తుల జప్తుపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏవియేషన్’ సవాళ్ల పరిష్కారానికి సలహా బృందాలు కాగా, విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పరిష్కారానికి గాను పౌర విమానయాన శాఖ మూడు సలహా బృందాలను ఏర్పాటు చేసింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, కార్గో (సరుకు రవాణా) విమానయాన సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలు, ఫ్లయింగ్ శిక్షణా కేంద్రాలు, మరమ్మతులు, నిర్వహణ సంస్థలకు ఇందులో చోటు కల్పించింది. కరోనా మొదటి విడతలో రెండు నెలల పాటు విమానయాన సర్వీసులు మూతపడ్డాయి. రెండో విడతలోనూ సర్వీసులు, ప్రయాణికుల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుని నిర్వహించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఈ పరిశ్రమలోని సంస్థలపై గట్టిగానే పడింది. దీంతో భారీ నష్టాలతో వాటి ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. దీంతో పౌర విమానయాన శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ‘‘పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చైర్మన్‌గా మూడు సలహా బృందాలను ఏర్పాటు చేయడమైనది. ఈ బృందాలు క్రమం తప్పకుండా సమావేశమై పలు అంశాలపై చర్చించడంతోపాటు.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తాయి’’ అంటూ పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. -
విమానయానం, ఆక్సిజన్ ప్లాంట్లకూ రుణ హామీ..
ముంబై: అత్యవసర రుణ హామీ పథకం(ఈసీఎల్ జీఎస్) కింద ఇంకా రూ.45,000 కోట్ల మంజూరీకి బ్యాంకింగ్‌కు అవకాశం ఉందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సునిల్ మెహతా ప్రకటించారు. ఈ పథకానికి కేంద్రం రూ.3,00,000 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటికే రూ.2.54 లక్షల కోట్లను బ్యాంకింగ్ మంజూరీ చేసిందని ఆయన తెలిపారు. ఈ పథకం వర్తించే విభాగాల జాబితాను పెంచినట్లు ఆర్థికశాఖ చేసిన ప్రకటన అనంతరం మెహతా తాజా ప్రకటన చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్‌లకు ఈ రాయితీ వడ్డీ (7.5 శాతం) రుణాలను అందజేయవచ్చని ఆర్థికశాఖ తాజాగా ప్రకటించింది. అలాగే పౌర విమానయానం విభాగానికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్న ట్లు తెలిపింది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం! ఆర్బీఐ ఈనెలారంభంలో ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా రూ.25 కోట్ల వరకూ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను బ్యాంకులు ప్రారంభించినట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. బ్యాంక్ బోర్డులు సంబంధిత నిర్ణయాన్ని ఆమోదించి, ఈ పథకం వర్తించే వారికి తెలియజేస్తున్నట్లు సమాచారం. చదవండి: రూ.50 వేలు దాటేసిన బంగారం ధర -
ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఒక కపుల్ విమానంలో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విమానంలో ఉన్నామన్న సంగతి మరిచి వారిద్దరు ముద్దుల్లో మునిగిపోయారు. అయితే ఇది చూసిన తోటి పాసింజర్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మే 20న చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్‌లో ఒక కపుల్ నాలుగో వరుసలో కూర్చున్నారు. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు. ఆమె వెళ్లి మీ చర్యలతో చుట్టుపక్కల వాళ్లకు అభ్యంతరం ఉందని.. ఇలాంటివి చేయకూడదని వివరించింది. అయినా వారు పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోయారు. దీంతో ఎయిర్ హోస్టస్ వారికి బ్లాంకెట్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే బిలాల్ ఫరూక్ ఆల్వీ అనే అడ్వకేట్ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ దంపతులు చేసే పనిపై ఎలాంటి చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మందలించారు. అయితే అప్పటికే ఈ వార్త సోషల్ మీడియాకు పాకడంతో వైరల్‌గా మారింది. విమానంలో కపుల్ చేసిన పనిపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’ Live scenes from Airblue. pic.twitter.com/FkVbzpLXfT — 𝕾 🇵🇸 (@seennzoned) May 25, 2021 Air-host to other Passengers after giving blanket to kissing couple on #AirBlue pic.twitter.com/OqtwTxoiJw — Junaid Khawar (@jjkhawar) May 25, 2021 Air Hostess gives blanket to kissing couple in #Airblue flight. Single me: pic.twitter.com/gUvNWAiBVY — Malik Muzamil (@mozammalnawaz) May 26, 2021 #Airblue Guy on seat no. 5 : pic.twitter.com/K6F01ah5Wc — ابرار ابنِ عزیز (@ballisays) May 25, 2021 -
రెక్కలకు సెక్యూరిటీ చీఫ్
గాలిలో ప్రయాణం! పక్షితో కూడా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట నేత్రాలు ఉంటాయి. హైజాకర్లు.. బాంబర్లు.. ఇంకా.. ఊహించని ఉపద్రవాలు. వాటి నుంచి భద్రతకే బి.సి.ఎ.ఎస్. ఆ బి.సి.ఎ.ఎస్.కు కొత్త బాస్.. ఉషా పథి, ఐఏఎస్. తొలి మహిళా డైరెక్టర్ జనరల్. ఒడిశా క్యాడర్ ఐ.ఎ.ఎస్ అధికారి ఉషా పథి. 1996 బ్యాచ్. కర్ణాటక అమ్మాయి. బి.టెక్. సివిల్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ డివిజన్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఢిల్లీలో ఉద్యోగం. తొంభై ఆరు అంటే ఇప్పటికి ఇరవై నాలుగేళ్లు. పదవీ విరమణ వయసు అరవై ఏళ్లు కనుక ఇంకా తొమ్మిదేళ్లు ప్రభుత్వానికి ఆమె ఒక ధీమా. 1969లో జన్మించారు ఉష. సర్వీసు లెక్కలు, వయసు లెక్కలు కాదు. గత రెండున్నర దశాబ్దాలలో దేశమంతటా వివిధ హోదాల్లో ఆమె చేపట్టిన బాధ్యతల జాబితా ఓ గవర్నమెంట్ ఫైల్ అంత ఉంటుంది. అయితే అందులో ఒక్క అవార్డు పత్రం కూడా ఉండదు. ఆమె పనితీరే ఆమెకు గుర్తింపు. ఫొటోలలో ఆమె అబ్దుల్ కలామ్తో, ప్రణబ్ ముఖర్జీతో కనిపించవచ్చు. విధుల నిర్వహణ లో భాగంగా మాత్రమే తన ప్రమేయం లేకుండా వాళ్లతో కలిసి ఉన్నప్పటి ఫొటోలే అవన్నీ. సర్వీసులో ఉండగానే ఎం.బి.ఎ. ఫారిన్ డిగ్రీ చేశారు. న్యూఢిల్లీ, బెంగళూరు, ముస్సోరి, కోయంబత్తూరు, పంచాగ్ని (మహారాష్ట్ర)లలో పాలనాపరమైన శిక్షణ పొందారు. అంటే క్షణం కూడా ఎక్కడా ఆగలేదని! ఐఎఎస్ ఆఫీసర్ల మిడ్ కెరీర్ ప్రోగ్రామ్‌లో కూడా శిక్షణ తీసుకున్నారు. ఉషకి కొత్తగా ఎక్కడికి పోస్టింగ్ వచ్చినా.. ఆమె కన్నా ముందుగా ఆమె కెరీర్ వెళ్లి ఆ సీట్లో కూర్చుంటుంది! లైఫ్ సైజ్‌ను కూడా దాటిపోయిన కెరీర్ ఆమెది! ఉషా పథి శనివారం కొత్త విధుల్లోకి వచ్చారు. ఢిల్లీలోని ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బి.సి.ఎ.ఎస్.) డైరెక్టర్ జనరల్ ఆమె ఇప్పుడు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ! నలభై రెండేళ్ల నుంచీ ఉంది బి.సి.ఎ.ఎస్. ‘డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్’లో ఒక విభాగంగా 1978లో బి.సి.ఎ.ఎస్. ఏర్పాటైంది. అంతకు రెండేళ్ల క్రితం ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయిన అనుభవంతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బి.సి.ఎ.ఎస్. స్వతంత్ర విభాగం అయింది. ఆ విభాగానికే ఉష ఇప్పుడు డైరెక్టర్ జనరల్. ఇక నుంచి భారతదేశ విమానాల, విమాన ప్రయాణికుల భద్రత బాధ్యత ఉషదే! ఆమే కేర్ తీసుకోవాలి. గగనతలానికి కనురెప్ప ఉషా పథీ. ఈ పోస్టులోకి రాకముందు శుక్రవారం వరకు ఆమె పౌర విమానయాన మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ. కొత్త కుర్చీలోకి వచ్చి కూర్చోగానే.. ‘ఎట్ లాస్ట్ ఎ శ్రీమతి.. ఈ పొజిషన్లోకి’ అని ఉష ట్వీట్ చేశారు. తొలి మహిళే కాదు, బి.సి.ఎ.ఎస్. డైరెక్టర్ జనరల్ అయిన మూడో ఐ.ఎ.ఎస్. ఆఫీసర్‌గా కూడా ఆమెకు ఇదొక గుర్తింపు. సాధారణంగా ఈ విభాగానికి చీఫ్లుగా ఐ.పి.ఎస్. ఆఫీసర్లు ఉంటారు. ఇరవై నాలుగేళ్ల కెరీర్లో నలభై ఎనిమిదేళ్ల సర్వీసు అనిపిస్తుంది ఉష గురించి వింటే. తొంభై ఆరులో సివిల్స్ పాస్ అయితే.. తొంభై ఎనిమిది వరకు ట్రైనింగ్. తర్వాత నుంచి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఛాలెంజింగ్. సబ్ కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, కలెక్టర్, కలెక్టర్ అండ్ డీఎం. అలా 2004 వరకు వివిధ జిల్లాలు, ప్రాంతాలు! 2005 నుంచి డైరెక్టర్. సాంఘిక సంక్షేమం, పంచాయితీరాజ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్, టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ శాఖలు. ఇవన్నీ 2015 వరకు. ఆ తర్వాతి నుంచీ సివిల్ ఏవియేషన్. ఒక ఐ.ఎ.ఎస్. ఆఫీసర్‌కు ఇదంతా మామూలే అనిపించవచ్చు. అయితే ఉష చేపట్టిన బాధ్యతలేవీ మామూలు శాఖలు కాదని ఈ లిస్ట్ చూస్తే అర్థమౌతుంది. సంక్షేమం, విద్య.. ఉద్యోగం.. ఎంత కీలకమైనవి. వాటిని ఉష సమర్థంగా నడిపించారు. ఉద్యోగంలోనే ఒక భాగం అయిన మరొక ప్రపంచం ఆమెకు.. భర్త అరవింద్, కొడుకు తేజ్. ఉషా పథీ భర్త అరవింద్ పథీ కూడా ఐ.ఎస్.ఎస్. ఆఫీసరే. ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. ముస్సోరీ ఐ.ఎ.ఎస్. శిక్షణలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. సివిల్స్ రాయకముందు ఉష లవ్ ఇంట్రెస్ట్ మాత్రం మెడిసిన్. తన తల్లిలా తనూ డాక్టర్ అవాలని అనుకున్నారు కానీ మెడిసిన్‌లో సీటు రాలేదు. ఇంజినీరింగ్ చదివి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ని ఎంచుకున్నారు. మంచిదైంది. అందించవలసిన సేవలు, చక్కబెట్టాల్సిన అనారోగ్య పరిస్థితులు వైద్యరంగంలో మాత్రమే ఉండవు కదా. -
త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు ఆర్థిక ప్యాకేజీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం భరోసానిచ్చారు. అయితే, ఇందుకు ఎన్ని రోజులు పడుతుందన్న వివరాలను ఆమె వెల్లడించలేదు. పౌర విమానయానం, పర్యాటకం, ఎంఎస్ఎంఈ, పశుసంవర్థక శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి సీతారామన్ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయా శాఖల నుంచి వచ్చిన డిమాండ్లపై విస్తృతంగా చర్చించినట్టు మంత్రి తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శనివారం అంతర్గతంగా మరో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్–19 ఎకనమిక్ రెస్పాన్స్ టీమ్ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఉపశమన చర్యల గురించి మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు.. సెబీ ప్రకటించిన నియంత్రణ చర్యలు మార్కెట్లలో కొంత స్థిరత్వాన్ని తీసుకొస్తాయన్నారు. ప్రస్తుత స్థితిలో ప్రతీ ఒక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకుని వాటిపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు చెప్పారు. పర్యాటకానికి గడ్డు పరిస్థితి ‘‘పర్యాటక రంగంపై ప్రభావం ఉన్న విషయం మన అందరికీ తెలుసు. ఈ రంగానికి వచ్చే నష్టాల గురించి పూర్తి అధ్యయనం అనంతరం ఏదైనా ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని నిర్ణయిస్తాం’’ అని పర్యాటక మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. ఆర్థిక సాయం అవసరం : క్రిసిల్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్, హోటల్స్, మాల్స్, మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లు, రిటైలర్లకు స్వల్ప, మధ్యకాలిక ఆర్థిక సాయం వెంటనే అందించాలని క్రిసిల్ తన నివేదికలో కోరింది. చైనాలో కొత్తగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మే చివరినాటికి సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వివరించింది. ఇది జరక్కపోతే స్టీల్, జెమ్స్, జువెల్లరీ, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, టెక్స్టైల్ రంగాలూ కరోనా బారిన పడతాయని హెచ్చరించింది. నగదు రాక తగ్గింది..: ఫిక్కీ దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 50 శాతంపైగా కంపెనీల కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని ఫిక్కీ తెలిపింది. ఫిక్కీ నిర్వహించిన సర్వేలో 80 శాతం కంపెనీలు నగదు రాక తగ్గినట్టు తెలిపాయి. కరోనాతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, డిమాండ్. సరఫరా దెబ్బతిందని ఫిక్కీ వివరించింది. ఉద్యోగుల వేతనాలు, వడ్డీ, రుణ చెల్లింపులపై ప్రభావం ఉంటుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్బీఐ పాలసీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఫిక్కీ కోరింది. నగదు సాయం చేయండి : సీఐఐ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీ పన ప్రకటించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది. వ్యాపారాలకు భారీ అంతరాయం రానుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. కరోనా మూలంగా రియల్టీ, విమానయా నం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. ‘ఆధార్ ఆధారంగా గ్రామీణ, పట్టణ నిరుపేదలకు ఒక్కొక్కరికీ రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమచేయాలి. బలహీన వర్గాలు, వృద్ధులకు రూ.10,000 అందించండి. వ్యక్తుల్లో ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుంది’ అని తన లేఖలో తెలిపారు. వేతనాలను తగ్గించుకోవాలి.. వ్యయ భారం తగ్గేందుకు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ స్థాయిలో వేతనాలను కుదించుకోవాలి అని చంద్రజిత్ సూచించారు. ‘ప్రభుత్వం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 10 శాతమున్న పన్నును ఎత్తవేయాలి. టోటల్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను 25 శాతానికి చేర్చాలి. ఇన్వాయిస్ల ఆధారంగా కాకుండా బిల్లుల వసూళ్లపై మాత్రమే జీఎస్టీ అమలు చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. -
నింగిలో సయ్యాట
సనత్‌నగర్: నింగిలో అద్భుతానికి హైదరాబాద్ నగరం మరోసారి వేదికైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), కేంద్ర పౌర విమానయాన సంస్థ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రెండేళ్లకోసారి ‘వింగ్స్ ఇండియా’పేరిట నిర్వహించే ఏవియేషన్ షోకు బేగంపేట ఎయిర్పోర్ట్ ముస్తాబైంది. ఈ నెల 12 నుంచి 15 వరకు ఈ షో జరగనుంది. ఇందులో ప్రధానంగా సరంగ్ టీమ్, మార్క్ జెఫ్రీ బృందాల విన్యాసాలు హైలైట్‌గా నిలవనున్నాయి. హెలికాప్టర్, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉండనుంది. గతంలో పోలిస్తే ఈసారి ఎయిర్ షోకు అధిక ప్రాధాన్యత కల్పించారు. గతంతో ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలే విన్యాసాలు జరిగేవి. మార్క్ జెఫ్రీ బృందం మాత్రమే విన్యాసాలు చేసేది. ఈసారి అదనంగా సరంగ్ టీం కూడా అదరగొట్టనుంది. ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు సరంగ్ టీమ్, మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు మార్క్ జెఫ్రీ టీం, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల వరకు సరంగ్ టీం, సాయంత్రం 4 నుంచి మార్క్ జెఫ్రీ బృందం విన్యాసాలు చేయనున్నాయి. ఈ రెండు బృందాలు గత రెండు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాయి. సకల విమాన ఉత్పత్తుల ప్రదర్శన.. కమర్షియల్, రీజనల్, బిజినెస్, కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పాటు హెలికాప్టర్స్, మోటార్ గ్లైడర్స్, బెలూన్స్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మిషనరీ, ముడి ఉత్పత్తుల కంపెనీలు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్ ఉత్పత్తులు, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలు, స్పేస్ ఇండస్ట్రీలు, డ్రోన్ ఉత్పత్తులు, ఎయిర్‌లైన్ సర్వీసెస్, కార్గో ఉత్పత్తులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలు సైతం కొలువుదీరనున్నాయి. 13న సీఎం కేసీఆర్ సందర్శన మొదటిరోజు రిజిస్ట్రేషన్స్, చిన్నచిన్న సమావేశాలు, ఎగ్జిబిషన్ ప్రారంభంతో పాటు సరంగ్, మార్క్ జెఫ్రీ టీంలు నింగిలో సందడి చేయనున్నాయి. 13న ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఈ షోకు హాజరవుతారు. ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఖరోరలా, ఫిక్కీ చైర్మన్ ఆనంద్‌స్టాన్లీ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అర్వింద్‌సింగ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. సామాన్య ప్రజలకు నో ఎంట్రీ.. ప్రతిసారి చివరి రోజున ఏవియేషన్ షో వీక్షించేందుకు సామాన్యులకు అవకాశం కల్పించేవారు. అయితే ఈసారి కరోనా ప్రభావంతో సామాన్య ప్రజలను అనుమతించరన్న వార్తలు వస్తున్నాయి. వ్యాపార సంబంధ వ్యక్తులకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. -
ఏరోస్పేస్‌కు కొత్త రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించేందుకు ఈ ఏడాది మార్చిలో జరిగే ‘వింగ్స్ ఇండియా–2020’ని వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. భారతీయ పౌర విమానయాన పరిశ్రమకు తలమాణికంగా భావించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే ‘వింగ్స్ ఇండియా 2020’లో భాగంగా అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సులుంటాయి. ‘ఫ్లైయింగ్ ఫర్ ఆల్’నినాదంతో జరిగే ‘వింగ్స్ ఇండియా’ద్వారా రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి అవసరమైన వాతావరణం వృద్ధి చెందగా.. ఎయిరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ప్రపంచస్థాయి కంపెనీలు బోయింగ్, జీఈ, రాఫెల్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు సుమారు వేయి చిన్న, మధ్య తరహా ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలు, నాలుగు ఏరోస్పేస్ పార్కులున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, టెక్నాలజీ సెజ్‌లు రాష్ట్రంలో ఉండటంతో భవిష్యత్‌లో ఏరోస్సేస్, డిఫెన్స్ రంగాల వృద్ధికి మరింత అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏరోస్పేస్ శిక్షణపైనా దృష్టి ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు శిక్షణ రంగంపైనా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ఇప్పటికే బోయింగ్, ఫ్రాట్ అండ్ విట్నీ, కోలిన్స్ ఏరోస్పేస్ వంటి స్టార్టప్ సంస్థలతో నూతన ఆవిష్కరణల కోసం ‘టీ హబ్’పనిచేస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే ‘టీ వర్క్స్’ద్వారా కూడా ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులకు తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ (టాస్క్) తరఫున శిక్షణ ఇస్తుండగా, ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా ఈ రంగాలకు చెందిన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ పాలసీని రూపొందించిన రాష్ట్రం.. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేక పాలసీ తయారు చేయాలనే యోచనలో ఉంది. పారిశ్రామికవాడల్లో హెలిపోర్టులు.. దేశవ్యాప్తంగా వచ్చే నాలుగేళ్లలో వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొంది. మామునూరు (వరంగల్), ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి (నిజామాబాద్), బసంత్‌నగర్ (పెద్దపల్లి), అడ్డాకుల (మహబూబ్‌నగర్)లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిం ది. ఈ 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేస్తోంది. హైదరాబాద్ బయట వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఐటీ క్లస్టర్లతో పాటు, ఫార్మాసిటీ వంటి భారీ పారిశ్రామికవాడల్లో హెలిపోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ హెలీపోర్టుల ద్వారా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందడంతో పాటు, పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఊతం లభిస్తుందనే అంచనా వేస్తోంది. వీటి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు నిధులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. -
బంధం విస్తృతం
న్యూఢిల్లీ: సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేయడానికి భారత్, బ్రెజిల్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో సమక్షంలో శనివారం రెండు దేశాల అధికారులు ఈ మేరకు 15 ఒప్పందాలపై సంతకాలు చేశారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌరవిమానయానం, ఇంధన, ఆరోగ్యం, పరిశోధన రంగాల్లో మరింతగా సహకరించుకునేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించాయి. ‘మీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది’ అని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోతో చర్చల అనంతరం మోదీ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో బ్రెజిల్‌ను కీలకమైన భాగస్వామిగా ఆయన వర్ణించారు. ఇప్పటికే బలంగా ఉన్న రెండు దేశాల సంబంధాలు తాజాగా కుదిరిన ఒప్పందాలతో మరింత దృఢమవుతాయని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొననున్న జయిర్ బొల్సనారో తన కూతురు లారా, కోడలు లెటిసియా ఫిర్మోతోపాటు 8 మంది మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు, వాణిజ్య ప్రతినిధుల బృందంతో శుక్రవారం వచ్చారు. భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా రసాయనాలు, సింథటిక్ దారం, వాహన భాగాలు, పెట్రోలియం ఉత్పత్తులు అలాగే, బ్రెజిల్ నుంచి ముడి చమురు, బంగారం, ఖనిజాలు దిగుమతి చేసుకుంటోంది. -
ఇండిగో పైలట్లను సస్పెండ్ చేసిన డీజీసీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) హెచ్చరికను పట్టించుకోకుండా విమానాన్ని నడిపినందుకు ఇద్దరు ఇండిగో పైలట్లను డీజీసీఏ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇండిగో విమానం టేల్ ప్రాప్(విమానం ల్యాండ్ అయిన సమయంలో దానికి సపోర్టింగ్‌గా వెనుక భాగంలో ఉంచే స్టాండ్)తో అలానే టేకాఫ్ అయింది. విమానంలో గాల్లోకి లేచే సమయంలో టేల్ ప్రాప్ కిందకు వేలాడకూడదు. అయితే దీనిని గమనించిన ఏటీసీ అధికారులు విమానంలోని ఇద్దరు పైలట్లకు ఈ సమాచారం చేరవేశారు. అయితే వారు విమానాన్ని తిరిగి హైదరబాద్‌కు మళ్లించకుండా విజయవాడకు వెళ్లారు. జూలై 24న చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీజీసీఏ ఆ విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లను సస్పెండ్ చేసింది. ఈ విధంగా టేల్ ప్రాప్ తో ప్రమాణం ప్రమాదకరమని డీజీసీఏ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సదరు పైలట్లకు షో కాజ్ నోటీసులు జారీ చేయగా.. వారు తమ తప్పును అంగీకరించారు. -
కొలంబియాలో విమాన ప్రమాదం
బొగటా: కొలంబియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందులోని మొత్తం పన్నెండు మంది చనిపోయారు. ప్రమాదంలో తరైరా, డోరిస్ గ్రామాల మేయర్, ఆమె కుటుంబ సభ్యులు, విమాన యజమాని, పైలట్, కో– పైలట్ సహా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 1930లో అమెరికాలో తయారైన డగ్లస్ డీసీ–3 విమానం శాన్ జోస్ డెల్ గ్వావియేర్, విల్లావిసెన్సియో పట్టణాల మధ్య కూలిపోయిందని అధికారులు చెప్పారు. విమాన ఇంజిన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని అధికారులు వివరించారు. అధ్యక్షుడు ఇవాన్ డుక్యూ మృతులకు ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ప్రమాదానికి గురైన విమానాన్ని నిర్వహిస్తున్న లాజార్ ఏరియో కంపెనీ ఘటనపై స్పందించడానికి నిరాకరించింది.