coal mines
-
సింగరేణిలో శరవేగంగా తగ్గిపోతున్న బొగ్గు నిక్షేపాలు.. ఈ ఏడాది నుంచే గనుల మూత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొంగు బంగారం కరిగిపోతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో నిక్షేపాలు శరవేగంగా తరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణీయుల కొలువుల ఆశలు ఆవిరైపోతున్నాయి. సింగరేణి బొగ్గు బాయి అంటేనే ఉద్యోగాల పంట. ఇప్పుడు సింగరేణిలో కొత్త ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. వచ్చే కొన్నేళ్లలో సింగరేణి బొగ్గు గనులు సగానికిపైగా మూతబడిపోనుండగా, బొగ్గు ఉత్పత్తి సగం కానుంది. అదే జరిగితే తెలంగాణలోని ప్లాంట్లతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ అధిక ధరలు వెచ్చించి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు విద్యుత్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు, బోనస్‌ల చెల్లింపులు కూడా కష్టంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచే గనుల మూత ప్రారంభం కానుండగా, ప్రత్యామ్నాయంగా కొత్త గనులను ప్రారంభించి సంస్థ భవిష్యత్తును సుస్థిర చేసుకోవడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థ విస్తరణకు మూలధనం కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నేరుగా గనులను కేటాయించేందుకు ససేమిరా అంటుండగా, వేలంలో పాల్గొని కొత్త గనులు దక్కించుకునే విషయంలో సింగరేణి సంస్థ పెద్ద ఆసక్తి చూపడం లేదు. గనులను నేరుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం వేలానికి దూరంగా ఉంది. కేంద్రం ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి గనులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించగా, శ్రావణపల్లి ఓసీ గనికి సైతం వేలం నిర్వహించడం గమనార్హం.వచ్చే ఏడేళ్లలో 19 గనుల మూత సింగరేణి ఏరియాలో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు శాస్త్రీయ అధ్యయనాల్లో తేలగా, 2,997 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనుల్లో మాత్రమే తవ్వకాలు జరిపేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ లీజులను కలిగి ఉంది. కాగా ఇప్పటికే 1,565 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా, ఇక 1,432 మిలియన్ టన్నుల నిక్షేపాలే మిగిలిఉన్నాయి. సింగరేణి సంస్థ ప్రస్తుతం 22 భూగర్భ, 20 భూఉపరితల గనులు కలిపి మొత్తం 42 గనులను కలిగి ఉండగా..»ొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండటంతో వచ్చే రెండేళ్లలో 8 గనులను మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అలాగే 2031–32 నాటికి ఏకంగా 19 గనులను మూసివేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో సింగరేణి సంస్థ 42 గనులు, 40,994 మంది కారి్మకులతో ఏటా సగటున 72.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అయితే 2042–43 నాటికి కేవలం 19 గనులే ఉండనుండగా, కారి్మకుల సంఖ్య సైతం 35,665కి తగ్గిపోనుంది. ఇక బొగ్గు ఉత్పత్తి కూడా 39.03 మిలియన్ టన్నులకు పడిపోనుంది. విస్తరణకు మూలధనం చిక్కులు సంస్థను కాపాడుకునే క్రమంలో కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్, పంప్డ్ స్టోరేజీ, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టి ఇతర రంగాల్లో సంస్థ విస్తరణకు బాటలు వేయాలని ప్రయత్నాలు జరుగుతుండగా, మూలధన పెట్టుబడులు లేక ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జైపూర్‌లోని 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు కేటాయింపులుండగా, ఆ గనిని సింగరేణి సంస్థ గతంలోనే చేజిక్కించుకుంది. అక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ రాష్ట్రానికి తరలించడానికి రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఈ నేపథ్యంలో నైనీ బ్లాకుకు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జైపూర్‌లోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అలాగే కాలం చెల్లిన రామగుండం థర్మల్–బీ స్టేషన్ స్థానంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి వ్యయంలో 80 శాతాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో పొందడానికి వీలుండగా, మిగిలిన 20 శాతం వాటాను సింగరేణి స్వయంగా భరించాల్సి ఉంటుంది. మెగావాట్‌కు రూ.10 కోట్లు చొప్పున ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూ.32 వేల కోట్ల వ్యయం కానుండగా, అందులో 20 శాతం అంటే రూ.6,400 కోట్లను సింగరేణి భరించాల్సి ఉంటుంది. ఇలావుండగా రామగుండం రీజియన్‌లోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో రూ.3 వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇల్లందు జీకే గనిలో మరో 100 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రం నిర్మించాలని యోచిస్తోంది. రూ.1,640 కోట్లతో లోయర్ మానేరు డ్యామ్‌పై 300 మెగావాట్లు, మల్లన్నసాగర్‌పై 500 మెగావాట్లు కలిపి మొత్తం 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరో 100 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. శ్రావణ్‌పల్లి, మాదారం, గోలేటీ ఓపెన్ మైన్స్‌ను ప్రారంభించాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టులన్నింటినీ చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలంటే సింగరేణి రూ.వేల కోట్లను వెచ్చించాల్సి ఉండగా మూలధనం కొరత సమస్యగా మారనుంది. సర్కారు బకాయిలు రూ.31 వేల కోట్లు గనుల మూత, విస్తరణకు మూలధనం కొరతతో పాటు ప్రభుత్వం నుంచి వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉండటంతో సింగరేణి పరిస్థితి అయోమయంగా మారింది. విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం చెల్లింపులు జరపకపోవడం సంస్థ విస్తరణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి సంస్థ నుంచి పెద్ద మొత్తంలో బొగ్గు, విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం..అందుకు సంబంధించిన చెల్లింపులు మాత్రం జరపడం లేదు. గడిచిన ఏప్రిల్ నాటికి సంస్థకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.32,325.29 కోట్లు ఉండగా, అందులో ఒక్క తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలే రూ.31,000.5 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ విక్రయాలకు సంబంధించిన రూ.22,405.76 కోట్లు తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(టీఎస్పీసీసీ) చెల్లించాల్సి ఉండగా, బొగ్గు విక్రయాలకు సంబంధించి రూ.8,594.74 కోట్లను తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి రావాల్సి ఉంది. సింగరేణికి మరో రూ.1,324.79 కోట్లను ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర బకాయిపడ్డాయి. ఏటేటా రావాల్సిన బకాయిలు పేరుకుపోయి రూ.32,325 కోట్లకు చేరినా సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని యాజమాన్యం పేర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం 2023–24 చివరి నాటికి రూ.57,448 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) నుంచి సింగరేణి సంస్థ బకాయిలను రాబట్టుకోవడం కష్టమేనని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఉత్తర–దక్షిణ కారిడార్‌తో పొంచి ఉన్న ముప్పు ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య కోల్ కారిడార్ పేరుతో కొత్త రైల్వే లైన్ వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కారిడార్ వస్తే సింగరేణి బొగ్గుకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగరేణి టన్ను బొగ్గును రూ.3,500కు విక్రయిస్తుండగా, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశంలోని రాష్ట్రాలు రూ.1,100కే విక్రయిస్తున్నాయి. పైగా సింగరేణి బొగ్గుతో పోలి్చతే అక్కడి బొగ్గులో నాణ్యత ఎక్కువ. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆయా రాష్ట్రాల నుంచి బొగ్గును సులభంగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.చదవండి: ధరణి పోర్టల్‌లో ఇక నుంచి ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్ముందస్తు ప్రణాళిక లేకుంటే ఇబ్బందే.. ముందస్తు ప్రణాళిక లేకపోతే సింగరేణి పరిస్థితి భవిష్యత్తులో కష్టమే. గతంలో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం తప్ప, విస్తరణను పట్టించుకోలేదు. దీనికితోడు కేవలం వేలంలోనే గనులు దక్కించుకోవాలన్న కేంద్ర నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. తాడిచర్ల బ్లాక్‌కు అనుమతులు తీసుకోవడం, అలాగే మరో మూడు గనులు ఇల్లందు, కోయగూడెం, సత్తుపల్లిని కూడా ప్రభుత్వం తీసుకుంటే మరో 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఢోకా ఉండదు. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
నల్ల బంగారులోకం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొందనుంది. నల్ల బంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండించనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జాబితాలో ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లు 44, 45 స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు సెక్టార్లు కూడా చింతలపూడి మండలంలోనే ఉండటం విశేషం. దీంతో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే వేలంలో చోటు దక్కినా...!చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి చింతలపూడి వరకు 2వేల మిలియన్ టన్నుల నుంచి 3వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ) లేఖ రాసింది. దానిపై కేంద్రం స్పందించలేదు. కానీ, గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం, తడికలపూడితోపాటుగా చింతలపూడి బ్లాక్‌లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి. ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేక పోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది. తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా, చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లకు చోటు దక్కింది. దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.60 ఏళ్ల నుంచి అన్వేషణ.. » ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)తోపాటు వివిధ సంస్థలు 60 ఏళ్ల నుంచి సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి. » అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలో మీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. » లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో నాటి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు గనులపై అధ్యయనం చేసింది. చాట్రాయి మండలం సోమవరం నుంచి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్–1 రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించింది. » సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్ల ద్వారా సుమారు 65,000 మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40,000 మీటర్ల పనులు పూర్తి చేసింది. » ఇక్కడ గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి 8 వేల మెగావాట్లు చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టుల ఆధారంగా అధికారులు అంచనా వేశారు. -
సింగరేణికే కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలు ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/ 17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్–3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటా యింపు కీలకమైనందున సింగరేణికే వాటిని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సుమారు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాలపై చర్చించారు. ప్రధానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వినతులు ఇవీ.. ⇒ హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్–44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మధ్యలో అడ్డుగా ఉన్న రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ కారిడార్లతోపాటు హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలో 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాలలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ఐసీ)కు లీజుకిచ్చిన 2,462 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. ⇒ 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరుకు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాంతాల విషయంలో 2014 తర్వాత ముందడుగు పడలేదు. అందుకే హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలి. ⇒ భారత్‌మాల పరియోజన మొదటి దశలో హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణ టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి దాన్ని కూడా భారత్ మాల పరియోజనలో చేర్చి నిర్మించాలి. ⇒ రాష్ట్రంలో పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి. (జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్లగొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్ ఆమన్‌గల్–షాద్ నగర్–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్–జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవెల్లి–యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం) – రాష్ట్రానికి ఒక ఐఐఎం మంజూరు నిర్ణయం కింద తెలంగాణకు ఇంకా ఐఐఎం మంజూరు చేయలేదు. ఇప్పటికైనా హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి. – తెలంగాణలోని కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. – ఏపీ పునరి్వభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి. – హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నందున ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి. – 2024–25 నుంచి ప్రారంభమవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. – తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) కింద 2019–20 నుంచి 2023–24 వరకు తెలంగాణకు రావల్సిన రూ. 1,800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. – రాష్ట్ర పునరి్వభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలి. -
‘ప్రైవేటు’తో సింగరేణి కుదేలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు, ఖనిజాల చట్టం (ఎంఎండీఏ)లోని సెక్షన్ 17ఏ(2) కింద సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బొగ్గు గనులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రైవేటు కంపెనీలకు గనులను కేటాయించడం సింగరేణిని కుదేలు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని 2015లో కేంద్రం సవరించడంతో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై అంతకుముందున్న లీజు హక్కులు, అధికారాలను సంస్థ కోల్పోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనతో మాట్లాడారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి... సింగరేణి ప్రాంతంలోని గనులను సంస్థకే కేటాయించేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి, తాను, ఇతర పారీ్టల నేతలతో కలిసి అఖిలపక్షంగా ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. గత సర్కారు వేలంలో పాల్గొననివ్వలేదుచట్టంలోని సెక్షన్ 17ఏ(2) కింద తమకు అతిముఖ్యమైన సత్తుపల్లి–3, శ్రావణపల్లి, పీకే ఓసీ డీప్‌సైడ్, కోయగూడెం బ్లాక్–3 బొగ్గు బ్లాకులను కేటాయించాలని గతంలో సింగరేణి కోరగా వాటిని కూడా కేంద్రం వేలం వేయాలని నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. వేలంలో పాల్గొనైనా ఈ గనులను దక్కించుకోవాల్సిన అవసరముండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందని విమర్శించారు.దీంతో సత్తుపల్లి–3 బ్లాక్ అవంతిక మైనింగ్ పరమైందని.. కోయగూడెం బ్లాక్–3 ఆరో మైనింగ్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులను వేలంలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. సత్తుపల్లి–3, కోయగూడెం–3 బ్లాకుల్లో ఇంకా ప్రైవేటు కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేదని, చట్టప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని భట్టి కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా కింద 0.5 శాతాన్ని అదనంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణిని కాపాడేందుకు అవసరమైతే చట్టంలో సవరణలు చేపట్టాలని కోరారు. మిగిలిన గనులను సింగరేణికే ఇవ్వాలి.. సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి–ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 388 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలిసితీసే అవకాశం ఇవ్వగా సింగరేణి 1,585 మిలియన్ టన్నుల బొగ్గునే వెలికితీసిందన్నారు. ఇంకా 1,422 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను చట్టప్రకారం రిజర్వేషన్ కోటాలో సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి అందజేశారు. సింగరేణి మూతబడే ప్రమాదంసింగరేణికి ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులు ఉన్నారని భట్టి చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్‌కాస్ట్ గను లు, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో 5 భూ గర్భ గనులు, 6 ఓపెన్‌కాస్ట్ గనులు మూతపడతాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. 2037–38 నాటికి మరో 5 గనులు మూతబడతాయన్నారు. మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి సంస్థ పడిపోయి చివరకు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నా రు. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, నాయకులుగా ఈ పరిణామాలను ఊహించలేమన్నారు. -
అవంతిక, అరబిందో గురించి నోరుమెదపరేం?
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకోకుండా కనీసం వారి మాటలను వినడానికి కూడా ఇష్టపడని బీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అయినా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ శుక్రవారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చా రు.‘కేటీఆర్ గారు... మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణు లు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసి రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే.అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? మా ఉప ముఖ్యమంత్రి సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. అవంతిక, అరబిందో కంపెనీలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి సింగరేణికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కులను కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడతాం. అటు సింగరేణిని, ఇటు ఓఆర్ఆర్ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం’ అని సీఎం రేవంత్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో విమర్శించారు. -
సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో కిషన్‌రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.ఓపెన్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్ కొరత లేదు..’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు ‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు. గుదిబండగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్‌లాల్ మీనా, సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. -
సింగరేణిని బీఆర్ఎస్ బొంద పెట్టింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసి బొంద పెట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం గనులు, ఖనిజాల చట్టం–1957 ను సవరించి దేశంలో బొగ్గుగనులకు వేలం నిర్వహించేలా చట్టం చేస్తే 2015లో ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించి ఉంటే బిల్లును వ్యతిరేకించి ఉండేవారన్నారు.అయితే, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించేలా ఉండగా.. దొంగే దొంగ అన్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. భట్టి గురువారం ఖమ్మం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సింగరేణిలో 42 వేల మంది ఉద్యోగులు, 26 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, రాష్ట్రంలోని 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే, త్వరలో 22 బొగ్గు గనులు మూసివేతకు గురికానుండగా, 2031 వరకు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే కొత్తగా గనులు సాధించాల్సి ఉందని తెలిపారు.అనుచరులకు దక్కేలా...2021లో గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటే... వారం రోజుల్లోనే సంస్థ గనులు తీసుకోవద్దని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని భట్టి చెప్పారు. ఆయన అనుచర పారిశ్రామిక వేత్తలకు గనులు దక్కేలా కుట్ర చేశారని, అందులోభాగంగానే లిక్కర్ స్కామ్‌లో ఉన్న అరబిందో గ్రూపునకు చెందిన అరో మైనింగ్ కంపెనీకి కోయగూడెం బ్లాక్, ప్రతిమ గ్రూప్ కంపెనీకి చెందిన అవంతిక కాంట్రాక్టర్‌కు సత్తుపల్లి బ్లాక్ దక్కిందని చెప్పారు. తెలంగాణలో వదిలేసి ఒడిశాలో జరిగిన గనుల వేలంలో మాత్రం సింగరేణి పాల్గొనడం వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.తాము అధికారంలోకి రాగానే కేంద్ర మంత్రిని కలిసి వేలం వేయకుండా బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వాలని కోరామని, అదీగాక ఇప్పుడు ఆ శాఖ కిషన్‌రెడ్డికి దక్కినందున రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలని కోరారు. వేలం లేకుండానే రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని, దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ శుక్రవారం హైదరాబాద్‌లో జరగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తోందని తెలిపారు. సింగరేణిపై కేటీఆర్, హరీశ్‌రావు చర్చకు వస్తే అన్ని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానమంత్రి మోదీని కలుస్తామని పేర్కొన్నారు.సింగరేణికే కేటాయించాలి: తుమ్మలవేలం లేకుండా సింగరేణి సంస్థకే గనులు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, బొగ్గు వెలికితీతలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. 2016లో ఒడిశాలోని నైనీలో ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించినందున ఇక్కడ కూడా అలాగే చేయాలన్నారు. తద్వారా తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణిని కాపాడేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, రాందాస్‌నాయక్, కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. -
సింగరేణి ‘సెగ’పట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తుండటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. సింగరేణి ఏరియాలోని బొగ్గు బ్లాకులపై.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. సింగరేణి సంస్థను కాపాడుతామని పైకి చెప్తున్న కేంద్రం.. సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తుండటం ఏమిటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పైగా ఈ వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థను కోరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దూరంగా ఉంది. మీదే తప్పంటే మీదేనంటూ.. గతంలో బీఆర్ఎస్ సర్కారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను వేలంలో ఎవరు దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాదీనం చేసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ 2015లో కేంద్రం తెచ్చిన చట్టానికి పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పెద్దలు గతంలో జరిగిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, వారి అనుయాయులకు సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణి ఏరియాలోని గనులను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా మూడు ప్రధాన పక్షాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ‘సింగరేణి’ అంశం చర్చనీయాంశంగా మారింది. వేలానికి సింగరేణి దూరమే? – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామన్న అధికారులు సింగరేణి (కొత్తగూడెం): శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం ప్రక్రియలో పాల్గొనాలని తొలుత సింగరేణి యాజమాన్యం భావించినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత రాజకీయ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకుని, తవ్వకాలు చేపట్టే విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి. శ్రావణపల్లి బ్లాక్‌లో జీ–10 గ్రేడ్ బొగ్గు 11.9 కోట్ల టన్నుల మేర ఉన్నట్టు అంచనా వేశారు. టన్నుకు ఇంత అనే లెక్కన కొంత సొమ్ము ముందే చెల్లించి వేలంలో పాల్గొనాలి. వేలంలో దక్కించుకున్నా.. నిర్దేశిత ప్రాంతం ప్రైవేట్ భూమా, అటవీ భూమినా అన్నది తేల్చుకోవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లించాలి, ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించి ఇతర అనుమతులు తీసుకోవాలి. ఇదంతా సాఫీగా సాగకుంటే వేలంలో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలపై రాయల్టీల పేరిట ఏటా రూ.వందల కోట్లు చెల్లిస్తోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్ దక్కించుకుంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కంపెనీకి వచ్చే లాభం తగ్గుతుంది. ఇప్పటికే వీకే–7 గని అనుమతుల ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతుండటంతో.. శ్రావణపల్లి వేలం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. -
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సింగరేణిలో అతిపెద్ద కుట్ర
-
సింగరేణికి తాడిచెర్ల–2 బొగ్గు గని
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థకి తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడానికి అన్ని అనుకూలతలున్నాయని భట్టి వివరించారు. త్వరలో సింగరేణికి బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామని ప్రహ్లద్ జోషీ హామీ ఇచ్చారని భట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్‌లోనూ ఉత్పత్తిని ప్రారంభించే నిమిత్తం అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రాష్ట్రంలోని సబ్స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సహకరించాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌ను కోరామన్నారు. ఈ అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి వెంట ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సింగరేణి ఇన్చార్జీ సీఎండీ బలరామ్ ఉన్నారు. కాగా, తాడిచెర్ల బ్లాక్–2 గనిని సింగరేణికి కేటాయిస్తే సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి ఏటా 5మిలియన్ టన్నులకు పెరగనుంది. తాడిచర్ల బ్లాక్ 2 గని ద్వారా 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంజనీర్లు కాదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఎవరికి వారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లనే అవి కూలిపోయాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్తు ఆలోచనా జ్ఞానం కోల్పోయారని భట్టి మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అధికారులు చెప్పినట్లు చేయడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం చర్చలు జరుపుతోందని, సమయం, సందర్భాన్ని బట్టి జాబితా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరో ముందుగా ప్రకటించారని తాము తొందరపడబోమని వ్యాఖ్యానించారు. -
కల్లర్ మ్యాజిక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్‌గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్‌గా, ట్యాన్ అయిన స్కిన్‌తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్‌పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్‌లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్‌లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్‌లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్‌లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ అంతా బ్లాక్‌గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్‌లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్‌లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్‌హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్‌లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్‌లో కనిపిస్తారు. -
బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి
న్యూఢిల్లీ: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. 2070 నాటికి 50 శాతం విద్యుత్‌ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఎనిమిదో విడత వాణిజ్య స్థాయిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని మంత్రి బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘‘ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 240 గిగావాట్లకు చేరుకుంది. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందన్న అంచనా ఉంది. ఇంధన వనరుల్లో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గొచ్చు. కానీ, మొత్తం మీద బొగ్గు విద్యుదుత్పత్తి ప్రస్తుత స్థాయి నుంచి పెరుగుతుంది’’అని వివరించారు. బొగ్గు మైనింగ్‌లో సుస్థిరతాభివృద్ధి సూత్రాలను అమలు చేయడంతోపాటు సంయుక్త కృషి ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను చేరుకోగలమన్నారు. 3 లక్షల మందికి ఉపాధి ప్రస్తుతం వేలం వేస్తున్న బొగ్గు గనులకు సంబంధించి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. ‘‘వాణిజ్య బొగ్గు మైనింగ్ ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభిస్తున్న నేడు ప్రత్యేకమైన రోజు. మొత్తం 39 బొగ్గు గనులను వేలానికి ఉంచాం. ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే నేడు గిరిజనుల గౌరవ దినోత్సవం’’అని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బొగ్గు రంగానికి, గిరిజనులకు లోతైన అనుబంధం ఉందన్నారు. వేలంలో ఉంచిన బొగ్గు గనుల్లో ఉత్పత్తి మొదలైతే గిరిజనులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఏడు విడతల వేలంలో మొత్తం 91 బొగ్గు గనులను వేలం వేసినట్టు గుర్తు చేశారు. -
బొగ్గు బ్లాకులను ఎవరూ వాపసు చేయలేదు..
న్యూఢిల్లీ: అనుమతుల్లో జాప్యం కారణంగా వాణిజ్య, క్యాప్టివ్ బొగ్గు గనులను కొన్ని సంస్థలు వాపసు చేస్తున్నాయన్న వార్తలను కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా ఖండించారు. బొగ్గు బ్లాకులను పొందిన సంస్థలేవీ తిరిగి ఇచ్చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయా బ్లాకుల్లో పనులు ప్రణాళికకు అనుగుణంగానే సాగుతున్నాయని, తదనుగుణంగా ఉత్పత్తి కూడా ఉంటుందని పేర్కొన్నారు. పలు పనులు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా బొగ్గు గని అందుబాటులోకి రావడానికి సుమారు 51 నెలలు పడుతుందని మీనా చెప్పారు. వేలంలో గనులు దక్కించుకున్న సంస్థలకు సత్వరం క్లియరెన్సులను ఇచ్చేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పర్యావరణ శాఖతో బొగ్గు శాఖ కలిసి పని చేస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో.. కమర్షియల్, క్యాప్టివ్ (సంస్థలు తమ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు తీసుకునే గనులు) గనుల వాటా 14 శాతంగా ఉంటోందని చెప్పారు. 152 వాణిజ్య, క్యాప్టివ్ గనులు ఉండగా.. ప్రస్తుతం 51 గనుల్లో ఉత్పత్తి జరుగుతోందన్నారు. తదుపరి విడత కింద నవంబర్ 15కి కాస్త అటూ ఇటూగా మరో 40 కొత్త బ్లాకులను వేలం వేయనున్నట్లు మీనా పేర్కొన్నారు. అటు కోల్ ఇండియా రెండు అనుబంధ సంస్థల (బీసీసీఎల్, సీఎంపీడీఐ) లిస్టింగ్‌పై ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని మీనా చెప్పారు. కోల్ ఇండియా పనితీరు బాగుందని, గత ఏడాది వ్యవధిలో కంపెనీ మార్కెట్ క్యాప్ 26 శాతం పెరిగిందని వివరించారు. బీసీసీఎల్, సీఎంపీడీఐలను ఒకదాని తర్వాత ఒకటిగా లిస్టింగ్ చేయనున్నట్లు ఆగస్టులో షేర్‌హోల్డర్ల వార్షిక సమావేశంలో కంపెనీ ప్రకటించింది. -
బొగ్గు దిగుమతుల బిల్లు రూ.3.85 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ గత ఏడాది బొగ్గు దిగుమతులపై రూ.3.85 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో దేశం మొత్తం బొగ్గు వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం నుండి 21 శాతానికి తగ్గింది. అయితే భారతదేశం ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల (ఎంటీ) కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశం నుంచి భారీ విదేశీ మారకపు ద్రవ్య ప్రవాహానికి దారితీస్తోంది. అడవుల సంరక్షణకు పెద్దపీట: బొగ్గు మంత్రిత్వశాఖ ఇదిలా ఉండగా, అడవులను సంరక్షించే అంశానికి పెద్ద పీట వేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచనలను పట్టించుకోకుండా బొగ్గు గనులను వేటినీ వేలం వేయలేదని కూడా స్పష్టం చేసింది. ఉదాహరణకు, లెమ్రు ఎలిఫెంట్ కారిడార్ పరిధిలోకి వచ్చే బొగ్గు గనులను డి–నోటిఫై చేయాలన్న ఛత్తీస్‌గఢ్ విజ్ఞప్తిని అంగీకరించినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు లెమ్రు ఎలిఫెంట్ కారిడార్‌కు ఆవల ఉన్న ప్రాంతాలను కూడా మినహాయింపు కోసం పరిశీలించినట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 10 శాతం నిల్వలు ఉన్న 40కి పైగా కొత్త బొగ్గు బ్లాకులను బొగ్గు తవ్వకాల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. దట్టమైన హాస్డియో–అరాండ్ బొగ్గు క్షేత్రం పరిధిలోని తొమ్మిది బొగ్గు గనులను కూడా బొగ్గు బ్లాకుల తదుపరి రౌండ్ వేలం నుంచి దూరంగా ఉంచిన్నట్లు తెలిపింది. అదేవిధంగా, తదుపరి వేలం ప్రక్రియ నుండి మూడు లిగ్నైట్ గనులను మినహాయించాలన్న తమిళనాడు అభ్యర్థన కూడా అంగీకరించినట్లు పేర్కొంది. ‘‘బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు... అటవీ ప్రాంతాలను వేలంలో పెట్టాలని పరిశ్రమ డిమాండ్లు ఉన్నప్పటికీ వాటిని రక్షించడం మా బాధ్యత అని మంత్రిత్వశాఖ స్పష్టంగా సూచిస్తోంది’’అని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దీపావళి బోనస్ రూ.85 వేలు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గని కార్మికులకు ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్‌ను కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళి బోనస్ రూ.76,500 చెల్లించగా, ఈ సంవత్సరం రూ.1.20 లక్షలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. చివరకు గతేడాది కంటే రూ.8,500 పెంచి రూ.85 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ పీఎల్ఆర్ బోనస్‌ను సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి వారం, పది రోజుల ముందు చెల్లిస్తుండగా, ఇతర ప్రాంతాలవారికి దసరా ముందు చెల్లిస్తున్నారు. -
చైనా బొగ్గు గనిలో అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని పాంఝౌ నగరం గుయిజౌ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గని యజమాని గుయిజౌ పంజియాంగ్ షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో కనీసం 16 మంది కార్మికులు మరణించారన్నారు. పాంఝౌ నగర భద్రతాధికారుల ప్రాధమిక దర్యాప్తులో గుయిజో బొగ్గుగనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ఎంత ప్రయత్నించినా అదుపు కాలేదని చాలాసేపు ప్రయత్నించగా చివరకు ఎలాగో మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. కన్వేయర్ బెల్టుకు మంటలు అంటుకోవడం వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని అక్కడున్నవారిలో కొందరు సురక్షితంగా బయటపడినా 16 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని మరణించారని తెలిపారు. పంజియాంగ్ కంపెనీకి మొత్తం 7 బొగ్గు గనులని నిర్వహిస్తోందని మొత్తంగా 17.3 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందని అన్నారు. అగ్నిప్రమాదం తర్వాత షాంఘైలోని కమొడిటీస్ కన్సల్టెన్సీ మిస్టీల్ ఒకరోజు పాటు పాంఝౌ నగరంలోని అన్ని బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గుయిజౌకు చెందిన బొగ్గుగని భద్రతా విభాగం సంఘటన గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపింది. మిస్టీల్ తెలిపిన వివరాలు ప్రకారం ప్రమాదం జరిగిన బొగ్గు గనిలో ఒక ఏడాదికి 52.5 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని ఇది చైనా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఐదు శాతం అని తెలిపింది. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
బొగ్గు గనుల వేలం అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను గట్టిగా ఎదుర్కొంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు, అక్కడి గనులు సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు భట్టి విక్రమార్క, దివాకరరావు, శ్రీధర్‌బాబు, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ఇలా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం మొదలైందన్నారు. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం సవరణతో ముందుకొచ్చినా.. బహిరంగ వేలం అంశానికే ప్రాధాన్యమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గనులను స్థానిక ప్రభుత్వానికి అప్పగించే వెసులుబాటు చట్ట సవరణలో ఉన్నా దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాగా, సింగరేణి కూడా బహిరంగ వేలంలో పాల్గొని దక్కించుకోవచ్చని పేర్కొందన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నాన్ని జరగనీయమని మంత్రి తెలిపారు. ఇంకో 20 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అప్పటి వరకు సింగరేణికి నష్టం జరగనీయమని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో మూడో స్థానం.. తలసరి ఆదాయం జాబితాలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మన కంటే ముందు సిక్కిం, గోవాలాంటి చిన్న రాష్ట్రాలే ఉన్నందున తెలంగాణ అగ్రభాగంలో ఉన్నట్టుగానే భావించొచ్చన్నారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సబ్సిడీ విస్తీర్ణ పరిమితి పెంచే యోచన.. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సబ్సిడీ పరిమితిని పన్నెండున్నర ఎకరాల నుంచి మరింత ఎక్కువ పరిధికి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా దాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నట్టు శాసనసభ దృష్టికి తెచ్చారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ.. సభలో పలువురు సభ్యులు అడిగిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం తిరస్కరించారు. -
‘విచారణ పేరుతో జాప్యం సరికాదు’
శ్రీరాంపూర్(మంచిర్యాల): విచారణ పేరుతో సింగరేణి యజమాన్యం జాప్యం చేయడం సరికాదని కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌లోని ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల పరిధిలోని ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీఎంవోఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఎలాంటి సంబంధం లేని 32 మంది అధికారులకు చార్జిషీట్లు ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా నాలుగేళ్లుగా ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో ఎలాంటి తప్పుచేయని అధికారులు తప్పుడు చార్జిషీట్ల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వెంటనే దీనిపై యజమాన్యం స్పందించి చార్జ్షీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏరియా జీఎం సంజీవరెడ్డికి దృష్టికి సమస్యలు తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏరియా జీఎంలు చింతల శ్రీనివాస్(ఆర్జీ 1), మనోహర్(ఆర్జీ 2), అపెక్స్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, నాయకులు చిలక శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ చంద్రమౌళి రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. -
అలవెన్స్ చర్చలు సఫలం
గోదావరిఖని(రామగుండం): దేశవ్యాప్త బొగ్గు గని కార్మి కుల 11వ వేతన ఒప్పందం 10వ సమావేశం శుక్రవారం కోల్‌కతాలో జరిగింది. యాజమాన్యం జరిపిన చర్చలో అన్ని అలవెన్స్‌లపై 25శాతం పెంచేందుకు అంగీకారం కుదిరినట్లు జాతీయ కార్మి క సంఘాల నాయకులు తెలిపారు. అండర్ గ్రౌండ్ అలవెన్స్ 9 నుంచి 11.25 శాతం, స్పెషల్ అలవెన్స్ 4 నుంచి 5 శాతం, హెచ్ఆర్ఏ 2 నుంచి 2.5, ఎల్టీసీ రూ.8వేల నుంచి రూ.10వేలు, ఎల్ఎల్టీసీ రూ.12 వేల నుంచి రూ.15వేలు పెంచడానికి అంగీకారం కుదిరింది. సెలవులు, సిక్ లీవ్‌లు 120 నుంచి 150 అక్యుములేషన్ చేసుకోవడానికి, అంబేద్కర్ జయంతిని పెయిడ్ హాలిడేగా అంగీకరించారు. లైవ్ రోస్టర్‌లో ఉన్న అమ్మాయిలకు 18ఏళ్లు వచ్చే వరకు డిపెండెంట్ జాబ్ అవకాశం కల్పించనున్నారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ మస్టర్‌కు రూ.50 చెల్లించనున్నారు. నర్సింగ్ అలవెన్స్ నెలకు రూ.500 ఇవ్వనున్నారు. కార్మి కుడు..కార్మి కుని భార్య చనిపోయి పిల్లలు అనాథలైతే వారికి సగం జీతం, 18ఏళ్లు దాటితే ఉద్యోగం కల్పిస్తారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం 19శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్, 3శాతం ఇంక్రిమెంట్‌తోపాటు ఒప్పుకున్న డిమాండ్లను శనివారం డ్రాఫ్ట్ రూపంలో పొందుపరుస్తారు. సమావేశాన్ని శనివారం కూడా కొనసాగించనున్నారు. సమావేశంలో కోలిండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సింగరేణి డైరెక్టర్(పా) బలరాం, పర్సనల్ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు మెంబర్లు ఏఐటీయూసీ నుంచి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నుంచి జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు. -
సింగరేణి ప్రైవేటీకరణపై ఉత్తర తెలంగాణలో జంగ్ సైరన్
సాక్షి, పెద్దపల్లి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కోల్ట్‌బెల్ట్ ప్రాంతంలో మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గుగనుల వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌బెల్టు ప్రాంతాల్లో ‘మహా ధర్నాలతో’ జంగ్ సైరన్ మోగించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బొగ్గు గనులకు నిలయమైన గోదావరిఖనిలో సింగరేణి కార్మికులు, కార్మికసంఘాల నేతలు, మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, పార్టీ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్ పుట్టమధు భూపాలపల్లి జిల్లాలో నిర్వహించే మహాధర్నాలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేలా మహాధర్నా విజయవంతం చేసేందుకు శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. కోల్‌బెల్టు నేతలకు సీఎం ఫోన్..! సింగరేణి సమస్య కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే బొగ్గు గనుల వేలంకు కేంద్రం యత్నిస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం పోరుబాటను ఎంచుకుంది. దీనిలో భాగంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నాకు సంబంధించి కేటీఆర్ సింగరేణి పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మాట్లాడగా, పార్టీ నిరసన కార్యక్రమాలపై సీఎంవో కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ ఫోన్లో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించే మహాధర్నాకు కార్మికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ యుద్ధభేరి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 8న ‘మహాధర్నా’నిర్వహించాలని అధికార బీఆర్ఎస్ నిర్ణయించింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాల్లో ఈ మహధర్నాలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ ఈ నెల 8న హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమంటూ గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై నిరసన తెలుపుతూ ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకే మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహాధర్నాకు సంబంధించి సింగరేణి పరిధిలోని జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో గురువారం కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండంలో ప్రకటించిన ప్రధాని మోదీ మాట తప్పారు. వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని అటు కార్మికులు, ఇటు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరినా పట్టించుకోవట్లేదు. తాజాగా సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోమారు నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియ నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కుట్రలపై జంగ్ సైరన్ ‘తెలంగాణను దెబ్బకొట్టాలనే దురుద్దేశంతో కేంద్రం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని సీఎం కేసీఆర్ గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కూడా గనులు కేటాయించకుండా కేంద్రం దివాలా తీయించింది. అదే విషప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తే అడ్డుకొని తీరుతాం. గుజరాత్ ఖానిజాభివృద్ధి సంస్థకు నామినేషన్ పద్ధతిలో లిగ్నైట్ గనులను కేటాయించిన రీతిలోనే సింగరేణికి గనులు కేటాయించాలి. సింగరేణి సంక్షోభంలోకి వెళ్తే దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుంది. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం 6 జిల్లాల సమస్య కాదు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే జరుగుతోంది. సింగరేణి ప్రైవేటీకరణతో తెలంగాణలో అంధకారంతోపాటు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు. వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల బోనస్‌లు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జంగ్ సైరన్ పూరించాం’అని కేటీఆర్ తెలిపారు. 10న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు భేటీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైనా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. స్టీల్ ప్లాంటును కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందంటూ ఈ నెల 2న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఈ నెల 10న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
అమ్మకానికి బొగ్గు గనులు.. మరి సింగరేణి పరిస్థితి ఏంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సింగరేణి పరిధిలోని గనులను మరోసారి అమ్మకానికి పెట్టింది. బుధవారం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారికంగా ఏడో రౌండ్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దేశంలోని తెలంగాణతో సహా మరో 8 రాష్ట్రాల్లో ఉన్న 106 బొగ్గు బ్లాకులను వేలం వేయనుంది. ఇందులో సింగరేణికి చెందిన కొత్తగూడెం ఏరియాలోని పెనగడప, మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాక్ ఉన్నాయి. గతంలో ఈ బ్లాక్‌ను వేలంలో చేర్చగా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటివరకు అన్ని రౌండ్లలోనూ సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తోంది. తాజా రౌండ్లో పాల్గొంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. -
వందల ఏళ్లుగా భూగర్భంలో ‘సేఫ్టీ ల్యాంప్’.. అసలు దీని కథేంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భంలో పనిచేసే గని కార్మికులకు ప్రాణదీపంగా వందల ఏళ్ల నుంచి సేప్టీల్యాంప్ రక్షణ వెలుగులను పంచుతోంది. బొగ్గు గనుల్లో కాలక్రమేణా అనేక ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఈ బత్తిదీపం ప్రాధాన్యత నేటికీ తగ్గడం లేదు. ఈ దీపం ఆవిష్కరణకు ముందు పలువురు భూగర్భంలోనే విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ దీపం రాకతో గనుల్లో రక్షణ ప్రమాణాలు మెరుగయ్యాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. బొగ్గు గాలితో నిత్యం ఆక్సిడేషన్ జరిపి స్వయంగా నిప్పు రాజేస్తుంది. అలా బొగ్గు మండినప్పుడు మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషవాయువులు వెలువడుతాయి. ఆ సమయంలో కార్మి కులు పనిచేస్తే శ్వాస సమస్య ఏర్పడి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ప్రమాద పరిస్థితులను ముందే గుర్తించేందుకు పూర్వం కెనరీ పక్షులను పంజరాల్లో భూగర్భంలోకి తీసుకెళ్లేవారు. పక్షిరెక్కలు కొట్టుకోవడం, కదలికల ఆధారంగా వాయువులను గుర్తించేవారు. ప్రతిసారీ పక్షులను బంధించి గనిలోకి తీసుకెళ్లడం, రావడంతో అవి అస్వస్థతకు గురై అనారోగ్యంతో చనిపోయేవి. బ్రిటన్ కు చెందిన హంప్రి డేవీ 1815లో బొగ్గు గనుల్లో రక్షణ కోసం సేఫ్టీ ల్యాంప్‌ను కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనుల్లో విషవాయువులను గుర్తించడంలో సమర్థంగా పనిచేయడంతో ఈ ల్యాంప్ ప్రామాణికంగా మారింది. ఎలా పని చేస్తుందంటే.. ‘వైర్ గాజేస్’సూత్రంతో పనిచేసే ఈ సేప్టీ ల్యాంప్ 2.5 కిలోల బరువు, 10 సెం.మీ. పొడవు ఉంటుంది. మంట వెలిగేందుకు కిరోసిన్/పెట్రోల్‌ను వాడతారు. ఇది బానేట్, ఇనుప జాలీలు, వాషర్, గ్లాసు, చెక్నట్, నూనె బుడ్డితో నిర్మితమై ఉంటుంది. ఈ ల్యాంప్‌ను గనిలోకి ఓవర్‌మెన్, మైనింగ్ సర్దార్లు తీసుకెళ్లి బొగ్గు తీసే ముందు అక్కడి వాయువుల శాతాన్ని పరీక్షిస్తారు. మీ«థేన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల శాతాన్ని తెలుసుకుంటారు. పనిచేసేందుకు అనువుగా ఉంటే ఉత్పత్తి మొదలుపెడతారు. మొదట గనుల్లోకి సాధారణ స్థాయిలో మంట వెలుగుతూ ఉంటుంది. వెలుగుతున్న దీపాన్ని వాయువులు తాకగానే మంటలో మార్పు మొదలవుతుంది. ఉదాహరణకు మీథేన్ ఒక శాతం ఉంటే 0.10 అంగుళాల ఎత్తుతో మంట పక్కవైపులకు వెలుగుతూ కనిపిస్తుంది. 1.5 శాతం ఉంటే 0.15 ఇంచు ఎత్తులో మంట టోపీ ఆకారంలో కనిపిస్తుంది. ఇలా ఎరుపు, నీలిరంగు మంటల కదలికలు, కనిపించే ఆకారాలను బట్టి అక్కడ మీథేన్ గ్యాస్ ఏ మోతాదులో ఉందో గుర్తిస్తారు. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే మంట ఆరిపోతుంది. ఇలా ఆ వాతావరణంలో పైన, కింద, వివిధ ఎత్తుల్లో దీపంతో పరిశీలిస్తారు. ప్రస్తుతం గనుల్లో 1.25 శాతం మీథేన్ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మి కులను అలర్ట్ చేసి బయటకు పంపుతున్నారు. సింగరేణివ్యాప్తంగా జీఎల్–50, జీఎల్–60 రకం ల్యాంప్‌లను వాడుతున్నారు. జీఎల్–60లో ఒకవేళ మంట ఆరిపోతే తనంతట తానే వెలుగించుకొనే సాంకేతికత ఉంది. వాయువులను గుర్తించేందుకు డిజిటల్ పరికరాలైన మీౖథెనోమీటర్, ఆక్సీమీటర్, మల్టీడిటెక్టర్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కోసారి ఈ పరికరాలు భూగర్భంలో సాంకేతిక సమస్యలతో పని చేయకపోవచ్చు. కానీ సేఫ్టీ ల్యాంప్ మాత్రం 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. దీంతో నేటికీ ఈ దీపం వాడకాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అధికారులు, కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ల్యాంప్ నిర్వహణ, మరమ్మతులకు ఓ ఇన్చార్జి ఉంటారు. రక్షణలో ఇప్పటికీ ఇదే కీలకం.. బొగ్గుగనుల్లో రక్షణ విషయంలో సేఫ్టీల్యాంప్ కీలకంగా పనిచేస్తోంది. ప్రాణనష్టం జరగకుండా విషవాయువులను గుర్తించేందుకు బాగా ఉపయోగపడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పలు డిజిటల్ పరికాలు వచ్చినా, సేఫ్టీల్యాంప్ వాడకం మాత్రం కొనసాగుతోంది. –సీహెచ్.సమ్మయ్య, హెడ్ ఓవర్‌మెన్, వీటీసీ, శిక్షకుడు ఇలా మంటలో మార్పుని బట్టి గ్యాస్ మోతాదును గుర్తిస్తారు. సింగరేణిలో ఒక్కో భూగర్భ గనిలో సగటున 12 నుంచి 14 వరకు దీపాలు అవసరమవుతాయి. -
బొగ్గు గనుల్లో డ్రోన్ వినియోగం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో ఉన్న కోల్ ఇండియా అనుబంధ కంపెనీ మహానది కోల్‌ఫీల్డ్స్ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణ పర్యవేక్షణ, నిల్వల స్థాయి తెలుసుకోవడానికి, గనుల చిత్రీకరణకు డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్టు కోల్ ఇండియా తెలిపింది. ఇందుకోసం విహంగం పేరుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధీకృత వ్యక్తులు ఈ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఒడిషాలోని తాల్చేర్ బొగ్గు గనుల్లో భువనేశ్వరి, లింగరాజ్ ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మహానది కోల్‌ఫీల్డ్స్ వాటా 20 శాతంపైమాటే. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
ఆర్టీసీ ‘సింగరేణి దర్శన్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ, సింగరేణి కార్పొరేషన్లు సంయుక్తంగా చేపట్టిన ‘సింగరేణి దర్శన్’ప్రారంభమైంది. గనుల్లో బొగ్గును తీయడం నుంచి బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించటమే దీని ఉద్దేశం. ప్రతి శనివారం సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సును మంగళవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సింగరేణి దర్శన్ యాత్ర కు వెళ్లాలనుకునేవారు వారం ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకోవాలని బాజిరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ఆలయంతోపాటు కాళేశ్వరం బ్యారేజీని తిలకించేందుకు మరో ప్యాకేజీ టూర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి దర్శన్ యాత్రకు వెళ్లాలనుకునేవారు రూ.1600 చార్జి చెల్లించాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, యాదగిరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.