Coastal Area
-
ఏపీ తీరం...1,027.58 కి.మీ.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎన్ని కిలో మీటర్లు అని అడిగితే... 973.7 కిలో మీటర్లు అని వెంటనే చెప్పేస్తారు. కానీ.. అది గతం.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఏపీ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు అని తేల్చింది. గత అధ్యయనం ప్రకారం దేశ పశ్చిమ, తూర్పు తీర రేఖ పొడవు 7,516.6 కిలో మీటర్లు కాగా.. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో అది 11,098.81 కిలో మీటర్లుగా తేలింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశంలో తీర ప్రాంతంపై సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసి పలు కీలక విషయాలు వెల్లడించింది. 2,31,831 కిలో మీటర్ల మేర కోత » దేశంలో ఇప్పటికే 2,318,31 కిలో మీటర్ల పొడవునా తీరం కోతకు గురైందని కేంద్ర జలసంఘం తేల్చింది. మరో 1,855.02 కిలో మీటర్ల పొడవునా తీర ప్రాంతం కోతకు గురవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతోంది. తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. » మన రాష్ట్రంలో ఇప్పటికే 272.34 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురైంది. మరో 434.26 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురవుతోంది. 320.98 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురికాకుండా సురక్షితంగా ఉంది. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తీర ప్రాంతం అధికంగా కోతకు గురైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ప్రాంతంలో తీర రేఖ అధికంగా కోతకు గురైంది. » వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీటి మట్టం పెరగడం, అలల ఉద్ధృతి తీవ్రమవడం, తుపానులు, అధిక ఉద్ధృతితో నదులు ప్రవాహించడం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురువుతోంది. సహజసిద్ధంగా ఏర్పడిన మడ అడవులను నరికివేయడం, పగడపు దిబ్బలను తవ్వేయడం, సముద్రం నాచును తొలగించడం వల్ల తీర ప్రాంతం భారీ ఎత్తున కోతకు గురికావడానికి దారితీస్తోంది. » తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతుండటం వల్ల ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. దీంతో తీర ప్రాంతం ఉప్పు నీటి కయ్యలుగా మారుతోంది. తీరం కోతకు గురవడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. » తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టకపోతే ఉత్పాతాలు తప్పవని, మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీడబ్ల్యూసీ హెచ్చరించింది. సీ–వాల్(తీరానికి వెంబడి గోడ) నిర్మించడం, రాళ్లతో రివిట్మెంట్ చేయడం ఇతర రక్షణ చర్యల ద్వారా, తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షించవచ్చని సూచించింది. ఏపీలోని ఉప్పాడ ప్రాంతంలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవీ.. » దేశంలో తీర ప్రాంతం పశి్చమాన గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి ప్రారంభమై... తూర్పున పశ్చిమ బెంగాల్‌లోని సుందర్ బన్స్ వద్ద ముగుస్తుంది. తీర ప్రాంతం తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్‌లతోపాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు డయ్యూ–డామన్, లక్ష్యద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులలో విస్తరించింది.» 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 15 శాతం తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. ముంబయి, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నంతోపాటు 70 నగరాలు, పట్టణాలు తీర ప్రాంతంలో వెలిశాయి. » తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలిచింది. గత అధ్యయనం ప్రకారం గుజరాత్ తీర రేఖ పొడవు 1,214.7 కిలో మీటర్లు కాగా... తాజా అధ్యయనం ప్రకారం 2,340.62 కిలో మీటర్లకు పెరిగింది. » ఇప్పటి వరకు తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండేది. తాజా అధ్యయనం ప్రకారం తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు తీర రేఖ పొడవు 1,068.69 కిలో మీటర్లు. » ప్రస్తుతం తీర రేఖ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. గతంలో ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 973.7 కిలో మీటర్లు. ప్రస్తుతం అది 1,027.58 కిలో మీటర్లకు పెరిగింది. » రాష్ట్రంలో తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి (189.84 కి.మీ.) మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శ్రీకాకుళం (173.12 కి.మీ.), మూడో స్థానంలో నెల్లూరు (172.10 కి.మీ.) ఉన్నాయి. -
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్‌లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్‌మెంట్‌కు మారినప్పుడు బీచ్‌లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
అవును.. అది నిజంగా మృత్యుగుహే!
ఇది చూడటానికి మిగిలిన కొండగుహల మాదిరిగానే కనిపిస్తుంది గాని, నిజానికిది మృత్యుగుహ. ఈ గుహలోకి అడుగుపెడితే మృత్యువు తప్పదు. కోస్టారికాలోని పోవాస్ అగ్నిపర్వత శిఖరం వద్ద ఉన్న ఈ కొండగుహ మృత్యుగుహగా పేరుమోసింది.రెండు మీటర్ల లోతు, మూడు మీటర్ల పొడవు ఉన్న ఈ గుహ చిన్నా చితకా జంతువులు, పక్షులు తలదాచుకోవడానికి అనువైన ప్రదేశంలా కనిపించినా, ఇందులోకి జంతువులు, పక్షులు ఏవీ వెళ్లవు. పొరపాటున వెళితే, క్షణాల్లోనే అవి ఊపిరాడక మరణిస్తాయి. కంటికి కనిపించని, కనీసం ముక్కుపుటాలకు వాసనైనా తెలియని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు ఈ గుహ నిండా వ్యాపించి ఉండటం వల్లనే ఈ గుహలో ఎలాంటి జీవులైనా ప్రాణాలతో ఉండలేవు.వెలిగించిన కాగడాను ఈ గుహలోపల పెడితే అది క్షణాల్లోనే ఆరిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ బొత్తిగా లేకపోవడం, లోపల అంతా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు వ్యాపించి ఉండటం వల్ల ఇది మృత్యుగుహగా తయారైంది.ఈ గుహ లోపల ప్రతి గంటకు కనీసం ముప్పయి కిలోల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఈ ప్రాంతంలో రిక్రియో వెర్డే కాంప్లెక్స్ నిర్మాణం జరుపుతున్నప్పుడు ఇంజినీర్లు ఈ గుహకు గల ప్రాణాంతక లక్షణాన్ని తొలిసారిగా గుర్తించారు. వారు దీనికి ‘కేవా డి లా మ్యూర్టె’ (మృత్యుగుహ)గా పేరుపెట్టారు.ఇవి చదవండి: ఈ సరికొత్త టెక్నాలజీ గురించి విన్నారా! వీటి పనేంటో తెలుసా!! -
తీవ్ర విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి
ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొజాంబిక్ ఉత్తర తీర ప్రాంత సుముద్రంలో మత్స్యకార పడవ మునిగిపోవటంతో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి పడవలోకి ప్రయాణికులు ఎక్కటంతో ఈ ప్రమాదం జరిగినట్లు నాంపులా ప్రావిన్స్ అధికారులు చెప్పారు. Andy Vermaut shares: Dozens killed as boat sinks off north coast of Mozambique: More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday. https://t.co/O4MSafGYK0 Thanks. pic.twitter.com/vVehEtxG9C — Andy Vermaut (@AndyVermaut) April 7, 2024 ఈ ప్రమాదంలో అధికంగా చిన్నారులే మృతి చెందినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు ఐదు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుముద్రంలో పరిస్థితుల కారణంగా మృత దేహాలు వెతికే ఆపరేషన్ కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నరని స్థానిక అధికారులు తెలిపారు. More than 90 people died when an overcrowded makeshift ferry sank off the north coast of Mozambique, local authorities said on Sunday. Read more at: https://t.co/8lVayQMPHE — Daily Tribune (@tribunephl) April 7, 2024 -
చేపల పడవలో దేశాలే దాటారు
ముంబై: పరాయి దేశంలో పడరాని పాట్లు పడి, యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నదే తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయల్దేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలుమోపేలోపే పోలీసులు అరెస్ట్‌చేశారు. ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో సముద్రజలాల మీద గస్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. జనవరి 28న ప్రయాణం షురూ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జె.సహాయట్ట అనీశ్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిట్సో డిటోలు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. వీరి వృత్తి చేపలుపట్టడం. కువైట్‌లోనూ అదే పనిచేసేవారు. కేరళలోని త్రివేండ్రమ్ నుంచి వీరు కువైట్‌కు వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్‌కు రానీయకుండా వారి పాస్‌పోర్టులను దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీన ప్రయాణం మొదలెట్టి సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు. రంగంలోకి నేవీ, పోలీసులు మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని యెల్లో గేట్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. ససూన్ డాక్ ప్రాంతంలో వీరి రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానమొచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికీ మరాఠా, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేవీ అధికారులతోపాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటిన చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడుపదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారంటూ పాస్‌పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీదాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. విదేశీ గడ్డపై వీళ్లు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెల్సుకోండని పోలీసులకు సూచించారు. పడవలో జీపీఎస్ స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్వా్కడ్ క్షుణ్ణంగా తనిఖీచేసింది. ఒక జీపీఎస్‌ను గుర్తించారు. సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్‌ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్‌ను కెప్టెన్ మదన్‌గా పోలీసులు గుర్తించారు. ‘‘అబ్దుల్లా షర్హీద్ అనే మాస్టర్ దగ్గర పనిచేసేవాళ్లం. జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదు. అదేంటని అడిగితే చితకబాదేవాడు. ఇదే విషయమై కువైట్‌లోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. ఇండియన్ ఎంబసీలోనూ మా గోడు వెళ్లబోసుకున్నాం. ఫలితం శూన్యం. అందుకే ఇలా పారిపోయి వచ్చాం’’అని ఈ ముగ్గురు పోలీసులకు చెప్పారు. వీళ్ల కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు. -
2016లో గల్లంతు.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ
ఢిల్లీ/చెన్నై: ఎనిమిదేళ్ల కిందటి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఏఎన్-32 మిస్సింగ్ మిస్టరీ వీడింది. బంగాళా ఖాతం అడుగున విమాన శిథిలాల్ని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇందులో ప్రయాణించిన 29 మంది సజీవంగా లేరనేది దాదాపుగా నిర్ధారణ అయ్యింది. 2016లో బంగాళాఖాతం మీదుగా 29 మందితో వెళ్తున్న విమానం జాడ లేకుండా పోయింది. అయితే అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఓ అంచనాకి వచ్చిన అధికారులు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించిన ఆటానమస్ యుటిలిటీ వెహికల్(AUV) ద్వారా అన్వేషణ ప్రారంభించారు. చివరకు.. ఇన్నేళ్ల తర్వాత చెన్నై తీరానికి దాదాపు 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమానం శిథిలాలు కనిపెట్టారు. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించిన జరిపిన అన్వేషణలో పలు అంశాల పరిశీలన తర్వాత.. సముద్రం అడుగున కనిపించిన శిథిలాలు ఏఎన్-32వేనని అధికారులు నిర్ధారించుకున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జూలై 22, 2016 ఉదయం ఏం జరిగిందంటే.. ఉదయం 8.30ని ప్రాంతంలో IAF ఆంటోనోవ్ An-32, చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. మూడు గంటల తర్వాత అది గమ్యస్థానం అయిన అండమాన్ ,నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరాల్సి ఉంది. ఎఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. వారానికోసారి పోర్ట్‌బ్లెయిర్‌కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉంది. ఆతేదీ సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు. అయితే పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్‌లో అది ల్యాండ్ కాలేదు. బయల్దేరిన 15 నిమిషాలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధృవీకరించుకుని రంగంలోకి దిగారు. అదృశ్యమైన విమానం కోసం భారతదేశం తీవ్రంగా వెతికింది. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేకపోవడంతో.. సెప్టెంబర్‌లో బాధిత కుటుంబ సభ్యులకు ‘‘విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేద’’ని లేఖలు రాసింది. అలా.. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని అధికారులు అప్పుడు భావించారు. విమానం కోసం ఐదు యుద్ధనౌకలు సముద్ర జలాల్లోకి గాలింపు చర్యల నిమిత్తం బరిలోకి బయల్దేరాయి. వీటితో పాటు 13 ఫుల్ స్పీడ్ పడవలను కూడా పంపారు. అయితే జాడను గుర్తించేందుకు ఉపయోగపడే పరికరాలను ఎయిర్‌క్రాఫ్ట్ మోసుకెళ్లలేదనే విషయం దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సెర్చ్ ఆపరేషన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. అలా.. ఎయిర్‌క్రాఫ్ట్ కోసం భారత్ జరిపిన అతిపెద్ద గాలింపు చర్యగా మిగిలిపోయింది ఈ ఆపరేషన్. -
Karnataka Assembly elections 2023: బీజేపీ కోటలో కాంగ్రెస్ పాగా వేసేనా?
సాక్షి బెంగళూరు: ఎంతో వైవిధ్యం, సాంస్కృతిక, సామాజిక, వారసత్వ సంపద కలిగిన ప్రాంతం కరావళి కర్ణాటక. సుదీర్ఘ తీరప్రాంతం, అటవీ భూభాగం కలిగిన ఈ ప్రాంతాన్ని బీజేపీ తన అడ్డాగా మార్చుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. కరావళి కర్ణాటక పరిధిలోకి వచ్చే దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో గత ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని పార్టీగా అవతరించింది. గతంలో ఉత్తర కన్నడ జిల్లా కరావళి కర్ణాటక పరిధిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత దాన్ని కిత్తూరు కర్ణాటకలో కలిపేశారు. అలాగే కొడుగు జిల్లా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో కలిసిపోయింది. ప్రస్తుతం ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలను కరావళి కర్ణాటకగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో నియోజకవర్గాల అభివృద్ధి కంటే వ్యక్తిగత కీర్తి, కుల ఆధారిత రాజకీయాలు కీలకంగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 13 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల గెలుపొందింది. బీజేపీకి కంచుకోటలో పాగా వేయా లని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. జేడీఎస్ ఈ ప్రాంతంలో ఖాతా కూడా తెరవలేకపోయింది. హిజాబ్ ప్రభావం చూపిస్తుందా? కుల, మత ప్రాతిపదికన అంశాలు ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నాయి. హిజాబ్, హలాల్ వివాదాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కరావళి కర్ణాటకలో అత్యధికంగా ఆరుగురు సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. కోస్తా కర్ణాటకలో పార్టీ బలాన్ని చూసుకుని టికెట్ల పంపిణీలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో సరస్వత్ బ్రాహ్మిణ్‌లు, మత్స్యకార సామాజికవర్గం మొగవీరలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఉడుపి జిల్లా కార్కళ నియోజకవర్గం నుంచి శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవడం గమనార్హం. దీంతో కార్కళలో హిందూ సామాజికవర్గ ఓట్లు బీజేపీకి, ముతాలిక్ మధ్య చీలిక తెచ్చే అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధం, హలాల్ మాంసం నిషేధించి జట్కా మాంసంపై బీజేపీ ప్రచారం చేస్తుండడంతో ముస్లింలలో ఆగ్రహం పెరిగిపోతోంది. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న పీఎఫ్ఐ సంస్థను నిషేధించడంతో ఆ ప్రతినిధులు బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మరోవైపు పోటాపోటీ హత్యలు, హింసాత్మక ప్రేరేపణలు, దాడుల నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి. -
వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి సౌందర్యానికి, ఆహ్లాదకర వాతావరణానికి, సౌమ్యులైన మనుషులకు అది నిలయం.. ఒకపక్క అతి సుందర సాగరతీరం.. మరోపక్క రాశులు పోసినట్లుండే పచ్చని పర్వతాలు.. వాటి దిగువన పుష్కలంగా నిక్షిప్తమై ఉండే భూగర్భ జలాలు.. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే నేరాలు, ఘోరాలకు దూరంగా ఉండే నగరం.. అదృష్టానికి చిరునామాగా పిలుచుకునే సిటీ ఆఫ్ డెస్టినీ.. ఇన్ని ప్రత్యేకతలున్న అరుదైన నగరం మన విశాఖపట్నం. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వారినైనా అక్కున చేర్చుకునే నైజం విశాఖ సొంతం. నడి వేసవిలోనూ వేడి జాడ నామమాత్రంగా ఉండే ప్రాంతం. ఇక సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తుతో భవిష్యత్తులో ముంపు ముప్పేలేని ఏకైక తీర నగరం కూడా ఇదే. దక్షిణాది రాష్ట్రాల్లో ఇన్ని విశిష్టతలు విశాఖకే సొంతం. ఇలా ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానికి అవసరమైన అన్ని అర్హతలు, హంగులతో వాహ్.. అనిపించే ప్రకృతి ప్రసాదించిన మహానగరం విశాఖపట్నం. సముద్రానికి 45మీటర్ల ఎత్తులో.. ఇది ప్రకృతి వైపరీత్యాలకు అంతగా ప్రభావితం కాని నగరం కూడా. హుద్‌హుద్‌లాంటి సూపర్ సైక్లోన్‌తో కకావికలమైనా నెలల వ్యవధిలోనే తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకున్న విశిష్ట నగరి. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రధాన నగరాలన్నింటికంటే విశాఖ ఎంతో సురక్షితమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ నగరం సముద్రమట్టానికి సగటున 45 మీటర్ల ఎత్తులో ఉంది. చెన్నై 6.7 మీటర్లు, ముంబై 14 మీటర్లు, మంగుళూరు 22 మీటర్ల ఎత్తులోనూ ఉన్నాయి. అంటే విశాఖ నగరంకంటే సముద్రం 45 మీటర్ల దిగువన ఉందన్న మాట. అందువల్ల ఇప్పట్లోనే కాదు.. భవిష్యత్తులోనూ విశాఖకు ఎలాంటి ముంపు ముప్పు ఉండే అవకాశమే లేదు. అదే చెన్నై, ముంబై నగరాలు తరచూ ముంపు బారిన పడుతున్నాయి. నిజానికి.. విశాఖ నగరం భౌగోళికంగా ఎత్తు పల్లాలుగా ఉంటుంది. దీంతో 15–20 సెం.మీ.ల మేర భారీ వర్షం కురిసినా నీరు నిలిచిపోకుండా దిగువనున్న సముద్రంలోకి వెళ్లిపోతుంది. రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో డాల్ఫిన్ నోస్ ఆహ్లాదకర వాతావరణం.. ఇక వైజాగ్‌లో అన్ని సీజన్లలోనూ ఆహ్లాదకర వాతావరణమే నెలకొంటుంది. ఓ పక్క చల్లగాలులను పంపించే సముద్రం, మరోపక్క పచ్చని పర్వత శ్రేణులు ఇందుకు దోహదం చేస్తున్నాయి. తూర్పు కనుమలు, సింహాచలం కొండ, యారాడ కొండ, కంబాల కొండ, కైలాసగిరి, డాల్ఫిన్‌నోస్ వంటివి పర్యావరణ సమతుల్యతను పదిలంగా ఉంచుతున్నాయి. అంతేకాదు.. ఈ కొండలు భూగర్భ జలాలను సంరక్షిస్తున్నాయి. దీంతో తక్కువ లోతులోనే నీటి లభ్యత ఉంటూ ఏడాది పొడవునా నీటి ఎద్దడికి ఆస్కారం లేకుండా చూస్తున్నాయి. అలాగే, వేసవిలో విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45–48 డిగ్రీల వరకు నమోదవుతాయి. కానీ విశాఖలో సగటున 36 డిగ్రీలకు మించదు. నడి వేసవిలో మధ్యాహ్నం వేళ ఒకింత ఉష్ణతాపం అనిపించినా సా.4 గంటలకే వాతావరణం చల్లబడిపోవడం ఈ నగరానికున్న ప్రత్యేకత. అందుకే ఇక్కడకు దేశ, విదేశాల నుంచి జనం పోటెత్తుతుంటారు. అయితే, సగటున 68 శాతం హ్యుమిడిటీ నమోదుతో వేసవిలో ఉక్కపోత ఒకింత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు.. శీతాకాలంలోనూ సాధారణ చలే తప్ప ఎముకలు కొరికే చలి విశాఖలో ఉండదు. ఉప్పెనల ముప్పేలేదు.. తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ విశాఖ నగరానికి ఉప్పెనల ముప్పులేదు. ఎటువైపు నుంచీ వరద గాని, ఉప్పెన గాని ముంచెత్తే అవకాశంలేదు. ఇది కూడా విశాఖ నగరానికి ప్రకృతి పరంగా మేలుచేసే అంశంగా నిపుణులు చెబుతుంటారు. ఇక విశాఖలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజనులో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఏడాదిలో సగటున 53 రోజులు వర్షిస్తాయి. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా అన్ని సీజన్లలోనూ అనుకూల వాతావరణం కలిగిన ఏకైక నగరంగా విశాఖపట్నం ఖ్యాతి గడించింది. రానున్న వందేళ్లలో కొచ్చి 2.3 అడుగులు, పారదీప్ 1.93 ముంబై 1.90, చెన్నై 1.87 అడుగులు, మంగుళూరు 1.87 అడుగుల చొప్పున సముద్రమట్టాలు పెరుగుతాయని.. అయితే, ఈ నగరాలన్నిటికంటే తక్కువగా విశాఖలో 1.77 అడుగులు మాత్రమే సముద్రమట్టం పెరిగే అవకాశముందని నిపుణుల అంచనా. ఇది కూడా విశాఖకు ఎంతో మేలుచేసే అంశం. అన్ని కాలాలకు అనువైన సిటీ విశాఖపట్నం అన్ని కాలాలకు అనువైన సిటీ. శీతాకాలంలో చలి, వర్షాకాలంలో వానలు, వేసవిలో ఎండలు ఎక్కువ ప్రభావం చూపవు. అందుకే విశాఖలో మోడరేట్ క్లైమేట్ ఉంటుంది. సమీపంలో ఉన్న పర్వతాలు విశాఖకు అదనపు ఆభరణాలు. వీటివల్ల భూగర్భ జలాలు సంరక్షించబడుతున్నాయి. సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఈ నగరం ఉండడంతో ముంపు ముప్పుగాని, ఉప్పెనల భయంగాని లేదు. ముంబై, చెన్నై, కొచ్చి, మంగుళూరులాంటి తీరప్రాంత నగరాల మాదిరిగా సముద్రమట్టాల పెరుగుదల బెడద కూడా విశాఖకు లేదు. – ఓఎస్ఆర్యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయన విభాగపు పూర్వ అధిపతి, ఏయూ, విశాఖ -
మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా!
రియో డీ జెనీరో: బ్రెజిల్ తీరంలో మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం బయటపడడం కలకలం రేపింది. ఇది మరో గ్రహానికి చెందిన జీవి చెయ్యి కావొచ్చని స్థానికులు అనుమానించారు. భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 20న సో పౌలో స్టేట్‌లో లభించిన పొడవైన ఎముకలు మనిషి చేతి వేళ్లను పోలి ఉన్నాయి. అచ్చంగా చెయ్యి ఆకారంలోనే ఉండడం గమనార్హం. నిజానికి ఇది గ్రహాంతరవాసి హస్తం కాదని, భారీ తిమింగలం లేదా డాల్ఫిన్‌కు చెందిన ఎముకలని మెరైన్ బయాలజిస్ట్ ఎరిక్ కోమిన్ వెల్లడించారు. ఇది 18 నెలల క్రితం మరణించి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఎముకలు సముద్ర జీవి శరీరం చర్మం కింద ఉండే ఫ్లిప్సర్స్ అని తెలిపారు. ఈ ఫ్లిప్పర్స్‌కు ఐదు వేళ్ల లాంటి ఎముకలు ఉంటాయన్నారు. -
ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా విశాఖపట్నం జిల్లా పూడిమడక మారింది. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవు అనే మాట తప్పని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) పరిశోధనలు నిరూపించాయి. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల కోరల్స్(పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. వీటిని మరోచోటికి తరలించి అభివృద్ధి చేసేందుకు కూడా అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా రాష్ట్రంలో జెడ్ఎస్ఐ.. విశాఖ జిల్లా పూడిమడక నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు సర్వే నిర్వహించగా.. ఈ ప్రాంతమంతా విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా ఉందని స్పష్టమయ్యింది. భారతీయ పగడాల వర్గీకరణపై నిరంతర పరిశోధన చేస్తున్న జెడ్ఎస్ఐ మొట్టమొదటిసారిగా ఆంధ్రా తీరంలో 2020 నుంచి ప్రతి ఏటా జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు మూడేళ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక అంశాలు వెల్లడయ్యాయి. విభిన్న రకాల పగడపు దిబ్బలు.. పూడిమడక, భీమిలి, రుషికొండ, యారాడ, కైలాసగిరి, సాగర్‌నగర్, ఆర్కేబీచ్, మంగమూరిపేట, తెన్నేటిపార్కు, చింతపల్లి బీచ్‌లలో ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రదేశాల్ని సర్వే పాయింట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 30 మీటర్ల లోతులో సాగరగర్భంలో అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబాడైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తల బృందం చేపట్టిన సర్వేలో పూడిమడక కేంద్రంగా విభిన్న పగడపు దిబ్బలున్నట్లు గుర్తించారు. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనాఎస్పీ, లిథోపిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్లు కనుగొన్నారు. సాగర గర్భంలో కనుగొన్న పగడపుదిబ్బలు మరోచోట పెంచుకునేందుకు వీలుగా.. ఒక చోట పెరిగే పగడపు దిబ్బల్ని కొంత భాగం తీసి.. మరోచోట పెంచే రకాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి అరుదైన కోరల్స్ పూడిమడకలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. ఈ తరహా కోరల్స్.. మేరీటైమ్ మెడిసిన్ తయారీకీ ఉపయోగపడతాయని గుర్తించారు. ప్రతి ఏటా 9 రోజుల పాటు ఆయా బీచ్‌లలో సబ్–టైడల్, ఇంటర్–టైడల్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి.. విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు. 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ఫ్లాట్ వార్మ్‌లతో పాటు.. అన్నెలిడ్ జీవజాతుల నమూనాల్ని సేకరించారు. మత్స్యసంపదకు ఉపయుక్తం.. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బల్ని పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే.. సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. విభిన్న జీవరాశుల సమాహారం... పూడిమడక తీరం విభిన్న జీవరాశులతో కళకళలాడుతోందని జెడ్ఎస్ఐ సర్వేలో వెల్లడైంది. విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మ జాతి సముద్ర జీవ రాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. పీత జాతికి చెందిన అరుదైన తెనస్, స్పాంజ్, స్టార్ఫిష్, ఇండో పసిఫిక్ సముద్రంలో ఉండే స్టోమోప్నిస్టెస్ సముద్రపు ఆర్చిన్లు, సీ బటర్‌ఫ్లైస్‌గా పిలిచే హెనియోకస్ చేపలు, ఒంటెరొయ్యలు.. ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. మరోసారి సర్వే.. పూడిమడక తీరం.. విభిన్న సముద్ర జీవజాతుల సమాహారంగా ఉంది. ఇక్కడ ఉన్న పగడపు దిబ్బలు చాలా అరుదైన రకాలు. ఈ తరహా సముద్ర గర్భ వాతావరణం ఇక్కడ ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. మొత్తం డాక్యుమెంటేషన్ నిర్వహించాం. ఇక్కడి కోరల్స్.. సముద్ర పర్యాటకానికి, వైద్యరంగంలో ఔషదాల తయారీకి, మెరైన్ రిలేటెడ్ రీసెర్చ్‌కు ఎంతగానో ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని భావిస్తున్నాం. – డాక్టర్ జేఎస్ యోగేష్ కుమార్, జెడ్ఎస్ఐ సీనియర్ సైంటిస్ట్ చింతపల్లి వరకు అరుదైన జీవజాలం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనలకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందించాం. పూడిమడక నుంచి చింతపల్లి వరకు ప్రతి ప్రాంతం విభిన్న రకాల జీవజాతులతో అద్భుతంగా కనిపించాయి. 30 మీటర్ల లోతు వరకు పగడపు దిబ్బల్లో ఉన్న జంతుజాలం ఫొటోల్ని జెడ్ఎస్ఐకి అందించాం. రీఫ్‌లు, కోరల్స్ ద్వారా.. మత్స్యసంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అయితే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాలి. – బలరాం, లివిన్ అడ్వెంచర్స్ స్కూబా ఇన్స్ట్రక్టర్ -
అభివృద్ధికి రహదారి.. చెన్నై, కోల్‌కతా మధ్య మరింత వేగంగా ప్రయాణం
సాక్షి, కృష్ణాజిల్లా: కోస్తా తీరం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచేందుకు చేపట్టిన 216 నంబరు జాతీయ రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తీరప్రాంతం పారిశ్రామిక, వర్తక, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది. టీడీపీ పాలకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా పనుల్లో జాప్యం నెలకొంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే మచిలీపట్నం పోర్టు ద్వారా చెన్నై, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు రవాణా మార్గం సులభతరం అవుతుంది. బందరు పోర్టు అనుబంధ పరిశ్రమలకు రోడ్డు రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది. బాపట్ల, రేపల్లెతో పాటు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఏటా రూ.1150 కోట్ల ఎగుమతులు సాధిస్తున్న ఆక్వా రంగం మరింతగా పుంజుకుంటుంది. తగ్గనున్న 150 కి.మీ. దూరం తమ ప్రాంతం అభివృద్ధి కోసం జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలంటూ 2002లో కృష్ణా జిల్లా లోని పలు మండలాలకు చెందిన మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నెలల తరబడి దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ ఉద్యమ ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం 216 జాతీయ రహదారిని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చెన్నై – కోల్‌కతా మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కోల్‌కతా, చెన్నై మధ్య రాకపోకలు సాగించే వాహనాలు ఏలూరు, విజయవాడ, గుంటూరు వెళ్లకుండానే నేరుగా ఒంగోలు చేరుకుంటాయి. ఫలితంగా ఇంధనం, సమయం ఆదా అవుతాయి. కోస్తా తీర ప్రగతికి రాచమార్గం 216 జాతీయ రహదారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలం పల్లెపాలెం నుంచి పులిగడ్డ వరకు 120 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ రహదారిని నాలుగు వరసలుగా విస్తరిస్తున్నారు. 16 నంబరు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా ఒంగోలు నుంచి 216వ నంబరు జాతీయ రహదారి ప్రారంభమవుతుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ కత్తిపూడి వద్ద తిరిగి 16 నంబరు జాతీయ రహదారిలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 260.5 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 30, కృష్ణాలో 138, గుంటూరులో 48, ప్రకాశంలో 123.48 హెక్టార్ల భూములు సేకరించారు. ఇందు కోసం నిర్వాసితులకు రూ.320 కోట్లు చెల్లించారు. పొడవైన వంతెనలు.. పెద్ద ఎత్తున కల్వర్టులు ప్రాజెక్టులో భాగంగా రైల్వే క్రాసింగ్ ఉన్న చోట్ల ఆరు ప్రాంతాల్లో రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లు నిర్మిస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, రావులపాలెం, పెడన, భట్టిప్రోలు, చినగంజాం వద్ద ఆర్వోబీలు నిర్మిస్తున్నారు. కాకినాడ వద్ద 19 కిలోమీటర్ల పొడవున బైపాస్ నిర్మించారు. గతంలో ఉన్న వంతెనల స్థానంలో 164 కొత్త వంతెనలను నిర్మిస్తున్నారు. ఈపూరుపాలెం – ఒంగోలు మధ్య 25, కత్తిపూడి – కాకినాడ మధ్య 23 వంతెనలు నిర్మిస్తున్నారు. 731 కల్వర్టులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలో పెడన వద్ద ఇప్పటికే బైపాస్ ఉండగా, బంటుమిల్లి సమీపంలో మరో బైపాస్ నిర్మిస్తున్నారు. చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం వద్ద బైపాస్‌లు నిర్మిస్తున్నారు. ఏడు టోల్ ప్లాజాలు ఈ రహదారిపై ఏడు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, అన్నంపల్లి, పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం, కృష్ణా జిల్లా బాసినపాడు, మోపిదేవి, గుంటూరు జిల్లా రెడ్డిపాలెం, ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటవు తాయని తెలుస్తోంది. ఈ జాతీయ రహదారిపై సాధారణ వేగం 80, గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఈ రహదారిని ఒకే దిశలో మలుపులు లేకుండా డిజైన్ చేశారు. వంతెనల వద్ద అప్రోచ్‌రోడ్ల నిర్మాణం పనులు సాగుతున్నాయి. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఈ రహదారిని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మోపిదేవి మండలం పెదప్రోలు వద్ద నిర్మాణంలో ఉన్న 216 జాతీయ రహదారి పెడన వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ -
పర్యావరణ నేస్తాలు ఆలివ్ రిడ్లేలు
విజయనగరం పూల్‌బాగ్: ఆలివ్‌రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది. తీరప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండడంతో వీటి మనుగడ కష్టంగా మారింది. అలాంటి సమయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టి తీరం వెంబడి పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 28 కిలోమీటర్ల మేర సముద్రతీరంలో 2014వ సంవత్సరంలో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం 10 ఆలివ్‌రిడ్లే పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెంపకం ఎలా చేపడతారంటే? ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని ఆడ తాబేలు తీరానికి చేరుకుని గుడ్లు పెడుతుంది. వాటిని నక్కలు, అడవి పందులు ధ్వంసం చేయకుండా అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలమో ముందుగా గుర్తిస్తారు. ఆప్రాంతంలో మిని హ్యాచరీలు ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు. గుంతల్లో ఉంచిన గుడ్లనుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉత్పత్తికేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియకు ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టిన గుడ్లును సురక్షిత ప్రాంతాల్లో ఉంచి 25మంది కాపలాదారులను నియమించారు. చంపినా, తిన్నా నేరమే తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. పర్యావరణ పరిరక్షణకు ఏం చేస్తాయంటే? తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీరప్రాంతాల్లో నివశించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు.సముద్రంలో ఆక్సిజన్ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్ బెడ్ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తి చేస్తాయి. ఈ మేరకు మత్స్య సంపద పెరుగుతుంది. ఇదీ ప్రత్యేకత ఆలివ్‌రిడ్లే సుమారు 45 కిలోల బరువు, మూడడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్ల పొడవు, అరంగుళం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రంలోకి వెళ్తాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలివ్‌రిడ్లేలను సంరక్షించే బాధ్యతను తీసుకున్నాం. తాబేళ్ల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో 1,69,509 గుడ్లను సేకరించి పునరుత్పత్తి కేంద్రాల ద్వారా 1,38,738 పిల్లలను ఉత్పత్తిచేసి సముద్రంలో విడిచిపెట్టాం. కాంపా బయోడైవర్సిటీ స్కీం ద్వారా వచ్చిన నిధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఎస్ వెంకటేష్, జిల్లా అటవీఅధికారి, విజయనగరం -
వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది!
యశవంతపుర(బెంగళూరు): ఉడుపి మల్పె వద్ద అరేబియా సముద్రంలో అపురూపమైన చేప వలలో పడింది. సా ఫిష్ (రంపపు చేప)గా దీనిని పిలుస్తారు. 250 కేజీలున్న చేపను ఆదివారం జాలర్లు బోటులో తెచ్చి లారీలో మంగళూరుకు తరలించారు. చేప నోరు 10 అడుగుల పొడవైన రంపంలా ఉంది. దీనిని చూడడానికి స్థానికులు, పర్యటకులు బారులుతీరారు.ఈ జాతి చేపలు అంతరించే దశకు చేరుకున్నాయి. -
రుషికొండ తీరంలో వేల్‌షార్క్ సందడి
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అతి పెద్ద చేపగా పిలిచే వేల్‌షార్క్ మరోసారి విశాఖలో సందడి చేసింది. ఇటీవల తంతడి వద్ద మత్స్యకారుల వలకు చిక్కగా.. దానికి వైద్యం చేసిన జిల్లా అటవీ శాఖ అధికారులు సురక్షితంగా తిరిగి సముద్రంలోకి పంపించారు. తాజాగా రుషికొండ తీరంలో ఈ అరుదైన వేల్‌షార్క్ కనిపించింది. లివిన్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు తీరం నుంచి 2 కి.మీ. దూరంలో విహరించి.. బోటులో తిరిగి వస్తుండగా.. ఈ చుక్కల వేల్‌షార్క్ సందడి చేసింది. సుమారు 7 మీటర్ల పొడవుందని సంస్థ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. ప్రపంచంలో అంతరించిపోతున్న ఈ తరహా వేల్‌షార్క్‌లు రుషికొండ తీరంలో కనిపించడం మొట్టమొదటిసారి అని ఆయన వెల్లడించారు. -
కోస్తాంధ్రకు మరో తుపాను!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో: కోస్తాంధ్రకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఈ నెల 10వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర వైపు పయనిస్తూ 12వ తేదీన మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఆపై మరింత బలపడి ఈ నెల 13, 14 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది తుపానుగా మారితే పూరీ నుంచి మచిలీపట్నం మధ్య ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఈ నెల 15న తీరం దాటే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.‘అక్టోబర్ నెల తుపానుల సీజన్. 10వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడుతూ దక్షిణ ఒడిశా–ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుంది. తుపానుగా మరే అవకాశాలను పరిశీలిస్తున్నాం. దీనిపై 10 తర్వాత స్పష్టత వస్తుంది’ అని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా చెప్పారు. ‘10న ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇది తుపానుగా మారినా, వాయుగుండానికే పరిమితమైనా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయి’ అని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ పేర్కొన్నారు. చదవండి: (బొగ్గు సంక్షోభంలో భారత్) ఉధృతంగా ప్రవహిస్తున్న పచ్చార్ల వంక నేడు వర్షసూచన మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. రాగల రెండు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని భాగాల నుంచి తిరోగమించనున్నాయని ఐఎండీ వెల్లడించింది. వీటి ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి. చిత్తూరులో కుండపోత చిత్తూరు అగ్రికల్చర్/పెద్ద దోర్నాల: చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పెనుమూరు మండలంలో 176.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మరో ఏడు మండలాల్లో 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో శుక్రవారం 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చదవండి: (తగ్గిన వంట నూనెల మంట) -
ఏపీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
సాక్షి, ఢిల్లీ: మెరైన్ ఎయిడ్స్ అండ్ నావిగేషన్ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు. విభజన చట్టం మేరకు ఈ పోర్టు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఉన్న ఆరు లైట్ హౌస్ లను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఏపీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. -
సముద్రతీరంలో ముగ్గురు గల్లంతు
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని వేటపాలెం మండలం కటారిపాలెం సముద్రతీరంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఉషా(19), భరత్‌రెడ్డి(20)గా పోలీసులు గుర్తించారు. గల్లంతైన మహేష్ అనే యువకుడి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. -
ఆ రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు!
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని తీరప్రాంతాలలో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక, కేరళలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ మహారాష్ట్ర, ఉత్తర కేరళ తీరప్రాంతల మధ్య అల్పపీడనం ఏర్పడిందని, దీని వలన గాలి దిశ, వేగంలో మార్పువస్తుందని సూచించింది. దీని ప్రభావం దేశం అంతటా ఎంతో కొంత ఉంటుందని తెలిపింది. తూర్పు కర్ణాటక తీరం- అరేబియా సముద్రం మీద తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అస్సాం, మేఘలయాలలో గురువారం, శుక్రవారం ఆరెంజ్ రంగు కేటగిరీ హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 11 నుంచి నెలాఖరు వరకు దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు -
తీరంలో ‘భూ’చోళ్లు
సముద్ర తీర భూములు కబ్జా అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్వా పరిశ్రమలు అప్పనంగా కలుపుకుంటున్నాయి. రికార్డుల్లో సర్కార్ భూమిగా ఉంటుంది. స్వరూపం చూస్తే అక్కడ పెద్ద పెద్ద కంపెనీల భవనాలు కనిపిస్తుంటాయి. ఐదెకరాల ప్రైవేట్ భూమిని కొని దాని చుట్టు పక్కల పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులను మామూళ్లతో లోబర్చుకుని అందిన కాడికి భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట తీరం భూ కబ్జాలకు నిలయంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ఇందుకూరుపేట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. మైపాడు తీరంలో బీచ్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడి తీరం అనువుగా ఉండడంతో ఆక్వా హేచరీలు సైతం సీడ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. పదిహేనేళ్ల క్రితం నుంచి ఇక్కడ హేచరీలు ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి. మైపాడు, కొరుటూరు ప్రాంతాల్లోనే హేచరీలు అధికంగా ఉన్నాయి. ఒక్క మైపాడు పరిసర ప్రాంతంలోనే సుమారు 30 వరకు హేచరీలు ఉన్నాయి. హేచరీలు అధికంగా రావడం, మైపాడు బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతానికి డిమాండ్ ఏర్పడింది. ♦హేచరీల ఏర్పాటు ముందు వరకు ఎకరా రూ.5 లక్షలు పలికిన భూమి ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరింది. ♦జిల్లాలోని వివిధ రంగాల వ్యాపారులు, రాజకీయ పార్టీల నేతలు, కొందరు డాక్టర్లు అందరూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో బహిరంగ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ♦ఈ క్రమంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూముల స్వాహా పర్వానికి మొదట్లోనే ఒకటి..రెండు హేచరీల నిర్వాహకులు తెర తీశారు. ♦అలా ప్రారంభమైన భూ ఆక్రమణ పర్వం నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. 12 సర్వే నంబర్లలో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు తమ ప్రైవేట్ భూముల్లో కలుపుకుని హేచరీలు నిర్మించారు. ♦తాజాగా ప్రభుత్వం జిల్లాలో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అనువైన స్థలాలను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలించారు. దీంతో మైపాడు, కొరుటూరులో 150 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రైవేట్ భూమి మాటున.. ఇందుకూరుపేట మండలం మైపాడు, కొరుటూరు గ్రామాలు సముద్ర తీర ప్రాంతం కావడంతో ప్రభుత్వ భూమికి కొదవ లేదు. ఈ భూముల మధ్య మధ్యలో ప్రైవేట్ భూమి కూడా ఉంది. ఇదే హేచరీల నిర్వాహకులకు వరంగా మారుతోంది. ♦కొంత ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి దానికి రెట్టింపులో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు. ♦ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్లకు ఆనుకుని అనేక ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. ♦హేచరీల యాజమాన్యం ప్రైవేట్ భూములను అధికారికంగా కొనుగోలు చేసి వాటిలో ప్రభుత్వ భూములు కలుపుకుని ప్రహరీ నిర్మించడం సముద్రం వరకు పైపులైన్లు ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ♦ఒక్క కొరుటూరులోనే 10 సర్వే నంబర్లలో 70 ఎకరాలకు పైగా భూమి హేచరీల్లో కలిసి ఉంది. ♦కొందరు హేచరీ నిర్వాహకులు గతంలో అధికారులను లోబర్చుకుని రికార్డులను కూడా తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ♦గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన హేచరీలు కాల్వ పోరంబోకు, ప్రభుత్వ డొంక, శ్మశాన డొంక, చెరువు పోరంబోకు ఇలా ఏ ఒక్క దాన్ని వదలకుండా అందిన మేరకు కలుపుకున్నాయి. ♦దీనిపై గతంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి విచారణతో సరి పెట్టారు. ♦కొరుటూరులో 544, 545, 546, 543, 547, 526, 527, 557, 559, 560 తదితర సర్వే నంబర్లలో 10 హేచరీ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. ♦పది సర్వే నంబర్లలో ప్రధానమైన పది కంపెనీలు కలుపుకున్న 70 ఎకరాల భూమి విలువ సుమారు రూ.35 కోట్లు పైమాటే. ♦ఇక మండలం మొత్తంలోనూ ఇదే పరిస్థితి. మండలంలో సుమారు 400 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు నిర్ధారించారు. వీటి విలువ మొత్తం సుమారుగా రూ.200 కోట్లపై మాటేనని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ♦ఆక్వా పరిశ్రమల భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. -
42 % మేట.. 27% కోత
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని సముద్ర తీరం అనూహ్యమైన మార్పులకు లోనవుతోంది. దేశంలో గుజరాత్ తర్వాత అతి పెద్దదైన మన రాష్ట్రంలోని తీరం.. 42 శాతం ఇసుక మేటల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు తొమ్మిది జిల్లాల్లో 1,027.58 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీరంలో 434.26 (42 శాతం) కిలోమీటర్ల మేర ఇసుక మేటలు వేసింది. 272.34 కిలోమీటర్ల తీరం (27%) కోతకు గురవుతుండగా, 320.98 కి.మీ. (31%) తీరం స్థిరంగా ఉంది. చెన్నై కేంద్రంగా పనిచేసే నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ విభాగం 1990 నుంచి 2016 వరకు సముద్ర తీరంలోని మార్పులను శాటిలైట్ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్, క్షేత్ర స్థాయి సమాచారం ద్వారా అధ్యయనం చేసి, ఇటీవల విడుదల చేసిన నివేదికలో పలు విషయాలను వెల్లడించింది. కృష్ణా, తూర్పుగోదావరిలో ప్రమాదకర మార్పులు కృష్ణా జిల్లాలో 40.30 కి.మీ. తీరం ప్రమాదకర స్థాయిలో కోతకు గురవుతుండగా, 29.18 కి.మీ. మేర ఇసుక మేటలు వేశాయి. తూర్పుగోదావరి జిల్లాలో 45 కి.మీ. తీవ్రంగా కోతకు గురవుతుండగా, 33.10 కి.మీ. ఇసుక మేటలున్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే కోతలు, మేటలు ఎక్కువగా ఉంటున్నాయి. విశాఖలో 102.74 కి.మీ., శ్రీకాకుళంలో 81.60 కి.మీ. తీరం స్థిరంగా ఉంది. కైలాసగిరి, యారాడ కొండలు విశాఖ తీరాన్ని స్థిరంగా ఉండేలా చేస్తున్నాయి. విజయనగరం తీరం కూడా స్థిరంగా ఉంటోంది. నెల్లూరు జిల్లా తీరంలో కొన్ని చోట్ల మేటలు కనిపిస్తుండగా, ఎక్కువ ప్రాంతం స్థిరంగా ఉంది. ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని తీరంలో ఇసుక మేటలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. గడిచిన 26 ఏళ్లలో పశ్చిమబెంగాల్ తీరం 40 శాతం కోతకు గురై 99 చదరపు కి.మీ. తీరాన్ని కోల్పోయింది. 40 శాతం ఇసుక మేటలు వేయడంతో ఒడిశాలో ఆ మేర తీరం పెరిగింది. దేశం మొత్తం మీద 231.50 చ.కి.మీ. ఇసుక మేటలు వేసి తీరం పెరగ్గా, 234.25 చ.కి.మీ. కోత వల్ల తీరం కోల్పోయింది. ఒకచోట పెరిగితే మరో చోట తగ్గుతుంది సముద్ర తీరం ఒకచోట కోతకు గురైతే మరో చోట పెరుగుతుంది. రాష్ట్రంలో ఉప్పాడ తీరాన్ని బట్టి మార్పులను అంచనా వేస్తారు. ఇటీవలి కాలంలో కోత ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. తీరానికి ఎక్కడైనా అడ్డుకట్ట (నిర్మాణాలు, జెట్టీలు వంటివి) పడితే మరో చోట మార్పు కనిపిస్తుంది. ఒక్క ప్రాంతాన్నే చూస్తే అక్కడి వరకే కనిపిస్తుంది. అలా కాకుండా మొత్తం తీరాన్ని పరిశీలిస్తే ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది తెలుస్తుంది. ఈ అధ్యయనం చాలా నిశితంగా, సంవత్సరాలపాటు చేస్తేగానీ ఏం జరుగుతుందో అర్థం కాదు. – వీఎస్ఎన్ మూర్తి, రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ (ఓషనోగ్రఫీ) తీరం కోతకు కారణాలివే.. - బంగాళాఖాతంలో ఏర్పడే తుపానుల వల్ల రాష్ట్రంలోని తీరం ఎక్కువగా మార్పులకు లోనై కోతకు గురవుతోంది. - సాధారణ పరిస్థితుల్లో గాలి వేగం, సముద్ర మట్టాల్లోని తేడాలు, తరచూ మారే వాతావరణ పరిస్థితులు, పర్యావరణం కారణంగానూ తీరం తీరు మార్చుకుంటోంది. -పోర్టులు, హార్బర్లు, ఫిషింగ్ జెట్టీలు, తీరంలో ఆధునిక సౌకర్యాల కోసం జరిగే మార్పుల వల్ల కూడా ప్రభావితమవుతోంది. నష్ట నివారణ ఇలా.. - మానవ విధ్వంసాల్ని వీలైనంతగా తగ్గించాలి. - కోస్టల్ రెగ్యులేటరీ నిబంధనలను (కట్టడాల సైజు, ఏ ప్రాంతంలో కట్టాలి.. ఎక్కడ కట్టకూడదు.. తదితరాలు) తప్పక పాటించాలి. - నదులు సముద్రంలో కలిసే చోట అడ్డంకులు లేకుండా చూడాలి. - సముద్రంలో కాలుష్య కారకాల విడుదలను తగ్గించాలి. - తీరంలో ఆటుపోట్లకు విఘాతం కలుగకుండా చూడాలి. -
ముంపు ముప్పు ముంచుకొస్తోంది!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: సముద్ర తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ముంచుకొస్తోంది. ఇంకో 30 ఏళ్లలో ఒక్క భారత్‌లోనే సుమారు మూడున్నర కోట్లమంది ముంపు ముప్పును ఎదుర్కోనుండటం ఇందుకు కారణం. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని చాలాకాలంగా తెలిసినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం ఇప్పటివరకూ తక్కువ అంచనా వేశాం. అమెరికాలోని క్లైమెట్ సెంట్రల్ జరిపిన తాజా అధ్యయనం పాత అంచనాలను మార్చేస్తోంది. గతంలో కంటే కనీసం ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ స్థాయిలో నష్టం జరగనున్నట్లు చెబుతోంది. చైనాలో 9 కోట్లు, బంగ్లాదేశ్‌లో 4.3 కోట్ల మందికి ముంపు ముప్పు ఉందని హెచ్చరిస్తోంది. అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► భూతాపోన్నతి ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు ఎంత మేరకు పెరుగుతాయి? అదే సమయంలో తీరప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య ఎంత మేరకు ఎక్కువవుతుంది? అన్న రెండు అంశాల ఆధారంగా భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ► ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది తీరప్రాంత ప్రజలు ముంపు బారిన పడే చాన్సుంది. భారత్ విషయానికొస్తే.. సుమారు కోటిన్నర మంది ప్రజలు ఏటా వరద, ముంపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ► ముంబై, నవీ ముంబై, కోల్‌కతాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువ. గత అంచనాల ప్రకారం ఈ సంఖ్య కేవలం 50 లక్షలు. ► 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం 11–16 సెంటీమీటర్లు పెరిగింది. కార్భన్ ఉద్గారాలను తీవ్రంగా తగ్గించినప్పటికీ ఈ శతాబ్దంలో సముద్ర మట్టం మరో 0.5 మీటర్లు పెరగనుంది. ► 2050నాటికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది వార్షిక వరదల్లో మునిగిపోయే ప్రాంతాల్లో ఉండగా.. శతాబ్దం చివరినాటికి ఈ సంఖ్య 63 కోట్లను దాటనుంది. ఎత్తైన అల స్థాయిలో 25 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గరిష్ట అలల ఎత్తుకంటే పదిమీటర్ల ఎక్కువ ఎత్తులో నివసిస్తోన్న తీరప్రాంత ప్రజలే వంద కోట్ల మంది ఉండగా.. మీటరు కంటే తక్కువ ఎత్తులో ఉండేవారే 25 కోట్ల మంది ఉన్నారు. వరదల ప్రభావానికి గురయ్యేవారిలో 70 శాతం మంది భారత్, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ దేశస్తులేనని వెల్లడించింది. -
యూఏఈలో చమురు నౌకలపై దాడి
ఫుజైరా(యూఏఈ): యూఏఈలో భాగమైన ఫుజైరా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో జరిగిన విద్రోహక దాడుల్లో తమ రెండు చమురు నౌకలు ధ్వంసం అయ్యాయని సౌదీ అరేబియా సోమవారం తెలిపింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రతిష్టంభన ఫలితంగా ఇప్పటికే కాస్త ఆందోళనగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో తాజా దాడులు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ దాడిపై యూఏఈ ఆదివారమే ఓ ప్రకటన చేస్తూ తమ ఫుజైరా తీరం దగ్గర్లో వివిధ దేశాలకు చెందిన 4 వాణిజ్య చమురు నౌకలపై విద్రోహక దాడులు జరిగినట్లు తెలిపింది. తమ 2 ట్యాంకర్లు ధ్వంసం అయ్యాయనీ, ప్రాణనష్టం సంభవించలేదని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్ చెప్పారు. సౌదీ నౌకలపై దాడిని ఇరాన్ ఖండించింది. ఈ ప్రాంతంలో సముద్ర తీర భద్రతకు భంగం కలిగించేలా విదేశాలు దుందుడుకు చర్యలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ చమురును ఎవరూ కొనకుండా అమెరికా ఆంక్షలు విధించగా, ఈ ఆంక్షలు ఈ నెల 1 నుంచి అన్ని దేశాలకూ వర్తిస్తూ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడం తెలిసిందే. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక బీ–52 బాంబర్లను మోహరించడం ద్వారా తన సైనిక శక్తిని పెంచుకుంది. ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా చూడాలంటూ అమెరికాను సోమవారం యూరప్ హెచ్చరించింది. -
కోస్తా తీరం.. ఫలహారం!
సాక్షి, అమరావతి బ్యూరో: ‘దేశంలో ఏ రాష్ట్రానికీ లేనంత సువిశాల సముద్ర తీర ప్రాంతం మన బలం... దాన్ని ఆలంబనగా చేసుకుని అపార అవకాశాలు సృష్టిస్తాం.. విశాఖ నగరాన్ని ఏపీలో ఐటీ సంస్థలు కొలువుదీరే కేంద్రంగా మారుస్తాం..’ అని తరచూ చెప్పే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడా సాగర తీరాన్ని ఫలహారంలా పంచిపెట్టేందుకు ప్రణాళిక రచించారు. విశాఖపట్నం–విజయనగరం, కృష్ణా–గుంటూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని దాదాపు 200 కి.మీ. తీరప్రాంతాన్ని తమవారికి కట్టబెట్టేందుకు ముఖ్యనేత రంగంలోకి దిగారు. అందుకు అడ్డుగా ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్లను (సీఆర్‌జెడ్) మార్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహంతో తీరప్రాంతం విధ్వంసానికి గురై ప్రకృతి విపత్తులకు దారి తీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో మరో ఘోరం.. కోస్తా తీరంలో విస్తారంగా ఉన్న భూములపై దృష్టి సారించిన ప్రభుత్వ ముఖ్యనేత పర్యాటకాభివృద్ధి, ఐటీ రంగానికి ప్రోత్సాహం పేరుతో అస్మదీయ సంస్థలకు స్టార్‌హోటళ్లు, రిస్టార్టులు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖలోని కైలాసగిరి– విజయనగరం జిల్లా పూసపాటిరేగ, కృష్ణా జిల్లా బందరుతోపాటు కావలి నుంచి తడ వరకు అంటే 200 కి.మీ. మేర తీరప్రాంతం అప్పగించేందుకు పథకం వేశారు. వాస్తవానికి ఆ ప్రాంతమంతా సీఆర్‌జెడ్–3 కేటగిరీ కిందకు రావటంతో నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. జోన్లు మార్చేస్తే సరి... తీరాన్ని అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ముఖ్యనేత విశాఖపట్నం–విజయనగరం, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించిన తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్–2గా మార్చాలని ఆదేశించారు. దీనివల్ల పరిమితస్థాయిలో నిర్మాణాలకు అవకాశం కలుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని 200 కి.మీ. పొడవునా భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేసి పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టవచ్చనేది ముఖ్యనేత వ్యూహం. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చూసీచూడనట్టు ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వుడాకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. వుడా, ముడా, నుడా... సరే విశాఖలోని కైలాసగిరి నుంచి విజయనగరం జిల్లా పూసపాటిరేగ వరకు ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–3 నుంచి సీఆర్‌జెడ్–2గా మార్చాలని మాస్టర్‌ప్లాన్‌లో వుడా ప్రతిపాదించింది. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడా), నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా)లు కూడా తమ పరిధిలోని సీఆర్‌జెడ్–2 ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–3గా మార్పులు చేయడానికి సన్నాహాలు చేపట్టాయి. పురపాలక శాఖ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. నిబంధనలకు విరుద్ధమే.. 200 కి.మీ. పొడవున తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్–2గా మార్చడం నిబంధనలకు విరుద్ధం. కేవలం తీరాన్ని ఆనుకుని నగరాలు, పట్టణాలు ఉన్న ప్రాంతంలో మాత్రమే సీఆర్‌జెడ్–2 కేటగిరీ కిందకు చేర్చాలి. భూగర్భ డ్రైనేజీ, నీటిశుద్ధి ప్లాంటు తదితరాల కోసం ఆ వెసులుబాటు కల్పించారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న చోట అవేవీ లేవు. పైగా విశాఖకు చేరువలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలున్నాయి. తీరప్రాంతంలో తుపాన్ల తీవ్రతను తగ్గించే మడ అడవులు కూడా ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా విలువైన తీరప్రాంతాన్ని అప్పనంగా పంచేస్తే తీవ్ర ప్రకృతి వైపరీత్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ‘సీఆర్‌జెడ్’ చట్టం సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) చట్టాన్ని రూపొందించింది. దీనిప్రకారం తీరప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించారు. తీరంలో ఇసుక ప్రాంతాన్ని సీఆర్‌జెడ్–1గా ప్రకటించారు. ఈ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కేవలం జెట్టీలు, పోర్టులు, ఇతర మత్స్యకార సామాజిక కార్యక్రమాలే చేపట్టాలి. సముద్ర కెరటాలు అత్యంత ముందుకు వచ్చే ప్రాంతం (హైటైడ్ లైన్Œæ) నుంచి 500 అడుగుల వరకు సీఆర్‌జెడ్ ప్రాంతంగా ప్రకటించారు. సముద్రతీరంలో ఉండే నగరాలు, పట్టణాల కోసం మాత్రం కొంత వెసులుబాటు ఇచ్చారు. అందుకోసం 500 అడుగుల సీఆర్‌జెడ్ ప్రాంతాన్ని మళ్లీ రెండుగా విభజించారు. దీని ప్రకారం నగరాలు, పట్టణాలు ఉన్న చోట హైటైడ్ లైన్ నుంచి 200 అడుగుల వరకు సీఆర్‌జెడ్–2గా ప్రకటించారు. ఆ పరిధిలో నగరాల మురుగునీటి కాలువలు, నీటి శుద్ధి ప్లాంట్లు కోసం పరిమిత స్థాయిలో నిర్మాణాలను అనుమతించారు. హైటైడ్ లైన్‌కు 200 అడుగుల నుంచి 500 అడుగుల వరకు సీఆర్‌జెడ్–3గా ప్రకటించారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. -
‘కోస్టల్ బెర్త్’లో రూ. 2,302 కోట్ల ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సాగరమాల కింద ‘కోస్టల్ బెర్త్ పథకం’లో రూ. 2,302 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నామని కేంద్రం ప్రకటించింది. మొత్తం 47 ప్రాజెక్టులకు గాను మహారాష్ట్రకు 12, ఏపీ, గోవాలకు పదేసి చొప్పున, కర్ణాటక 6, కేరళ, తమిళనాడుకు మూడేసి, గుజరాత్ 2, పశ్చిమ బెంగాల్‌కు ఒక ప్రాజెక్టు కేటాయించామని కేంద్ర నౌకాయాన శాఖ తెలిపింది. ఈ పథకంలో ప్రముఖ ఓడరేవులు, రాష్ట్రాల మారీటైం బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకూ రూ. 620 కోట్లు మంజూరు చేశామని, మిగతా 24 ప్రాజెక్టులకు అనుమతుల కేటాయింపులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది. -
రాష్ట్రాభివృద్ధికి సముద్ర వనరులు ముఖ్యం
జాతీయ సదస్సులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ నెల్లూరు (టౌన్): రాష్ట్రాభివృద్ధికి సముద్ర వనరులు ముఖ్యమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయప్రకాష్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకేంద్రంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో సంప్రదాయ సముద్రనీటి వనరుల విజ్ఞానంపై శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి విజయప్రకాష్ మాట్లాడుతూ సముద్ర జీవజాల పునః సమీకరణ అవసరమన్నారు. ఏపీకి ప్రకృతి సంపద, జల వనరులు మంచి ఆదాయ మార్గాలన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 221 మత్స్య కేంద్రాలతో పాటు 6,23,000 గ్రామాలు ఉన్నాయన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అంతకంతకూ పెరుగుతున్న సముద్ర నీటిమట్టం మూలంగా మత్స్యకార జీవితాలపై పెనుప్రభావం పడుతుందని తెలిపారు. సముద్ర నీటిమట్టం ఒక మీటరు పెరిగినా ఏపీలో 282 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. మొత్తం 1.29 మిలియన్ల జనాభా తమ ఆవాసాలను కోల్పోతారని చెప్పారు. వీసీ వీరయ్య మాట్లాడుతూ వీఎస్‌యూ మెరైన్ బయాలజీ విభాగం గొప్ప పరిశోధనలకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. అంటార్కిటికా లాంటి మంచు ఖండంలో దొరికే అత్యంత పౌష్టికాహారమైన క్రిల్స్‌లాంటి వాటిపై పరిశోధనలు చేసేందుకు సన్నద్ధం కావాలని తెలిపారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ పరిశోధనలో ప్రాంతీయ అవసరాలకు ప్రధాన భూమిక ఇవ్వాలని కోరారు. కృష్ణపట్నం పోర్టు జిల్లాకు మంచి ఆభరణమైనా, దాని మూలంగా ఎంతో అమూల్యమైన మడ అడవులు అంతరించడంపై మెరైన్ బయాలజీ విభాగం దృష్టి సారించాలన్నారు. సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి విజయ మాట్లాడుతూ 2014 వరకు 187వేల టన్నులు మత్స్య ఉత్పత్తి చేయగా ప్రస్తుతం దానిని 319వేల టన్నులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రష్యాకు చెందిన సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్సిటీతో అవగాహన చేసుకుని రాష్ట్రంలో మూడు కొత్త మత్స్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ సంకలనం చేసిన ఫిష్ అండ్ ఫిషరీస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.