Comprehensive family survey
-
పొరపాట్లకు తావివ్వకండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న సామా జిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహ రించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ దశలో డేటా ఎంట్రీ చాలా ముఖ్యమైనదని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉన్న ఆయన అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు మిగిలిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. సర్వే జరిగిన క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల డోర్‌లాక్ ఉండటం, ఇంటివద్ద అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వచ్చాయని, వారి వివరాలను ఫోన్ ద్వారా.. లేదంటే నేరుగా కలిసి సేకరించాలని కోరారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా జాగ్రత్తగా క్రమబద్ధీకరించాలని సూచించారు. -
Telangana: సర్వే ‘సమగ్ర’మేనా?
రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తగిన ఫలితం ఇస్తుందా? దాని ఆధారంగా సర్కారు ముందుకు వెళుతుందా? ఆ వివరాలతో సంక్షేమ పథకాల అమలు కుదురుతుందా? అసలు ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందా?.. ఇలా ఎన్నో సందేహాలు ముసురుకుంటున్నాయి. సర్వేలో చాలా ప్రశ్నలకు అరకొర సమాచారమే వస్తుండటం.. ముఖ్యమైన ప్రశ్నలకు ప్రజలు ఎదురుప్రశ్నలు వేయడం.. పైగా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం.. ఎన్యుమరేటర్లు చేసేదేమీ లేక ఆ వివరాల కాలమ్‌లను ఖాళీగా వదిలేస్తుండటంతో సర్వేకు ‘సమగ్రత’ చేకూరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాల సేకరణే ప్రధానంగా చేపట్టిన ఈ సర్వేపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఎన్యుమరేటర్లతో కలసి వెళ్లి... సర్వేలో ప్రజల స్పందన ఎలా ఉందన్నది స్వయంగా పరిశీలించింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామంలోని ఏడవ వార్డులో ఎన్యుమరేటర్ శనివారం సర్వే నిర్వహించాడు. భద్రయ్య కుటుంబాన్ని సర్వే చేస్తుండగా.. బ్యాంకు ఖాతా, టీవీ, కూలర్ ఉన్నాయా అన్న ప్రశ్నలకు అతడు తడబడ్డాడు. జీరో బిల్లుకు ఏమైనా సమస్య వస్తుందా అనే సందేహంతో తడబడినట్లు తెలిపారు. అతనికి కొడుకు, కోడలు, మనుమరాళ్లు ఉండగా వారి వివరాలను తెలపడానికీ ససేమిరా అన్నాడు. తమ ఇల్లు ఇరుకుగా ఉందని, కొడుకుకు రేషన్ కార్డు ఉన్నందున సర్వేను వేరుగా రాస్తే వారికి ప్రభుత్వం నుంచి ఇల్లు, ఇతర పథకాలు వస్తాయని చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో ఓ వృద్ధురాలిని వివరాలు అడుగుతూ ఇల్లు ఉందా అని ప్రశ్నించగా, తనకు రేకుల ఇల్లు ఉందని మీరు రాసుకున్నంత మాత్రాన తనకు ఇల్లు వస్తదన్న నమ్మకం లేదని.. ఇంతకుముందు కూడా ఇలాగే రాసుకొని వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు ప్రజల నుంచి స్పందన రావడం లేదు. 75 ప్రశ్నలతో సర్వే ఫారాన్ని తయారు చేస్తే.. అందులో 40 వరకు ప్రశ్నలకు ప్రజల నుంచి వివరాలు అందడం లేదు. సాధారణంగా ఏదైనా సర్వే నిర్వహించేటపుడు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. అప్పుడే ఆ సర్వే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు, అందులోనూ కీలకమైన వాటికి ప్రజల నుంచి స్పందన లేకపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సమగ్ర సర్వే 90 శాతానికిపైగా పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. సర్వే ఫారాల కంప్యూటరీకరణ కూడా సాగుతోంది. 40 ప్రశ్నలకు అరకొర జవాబులు.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉన్నాయి. అందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు. మొత్తం ప్రశ్నావళి రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతుల అంశాలు ఉన్నాయి. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్ కార్డు, నివాస గృహానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో చాలా ప్రశ్నలకు ప్రజలు సమాచారం ఇవ్వడం లేదని ఎన్యుమరేటర్లు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త మెరుగ్గా ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో స్పందన అంతంతగానే ఉందంటున్నారు. 56 ప్రధాన ప్రశ్నల్లో సుమారు 40 ప్రశ్నలకు సరైన విధంగా జవాబులు రావడం లేదని పేర్కొంటున్నారు. ⇒ సర్వే ఫారం మొదటి విభాగంలో 1 నుంచి 10వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు జనం ఎలాంటి ఇబ్బందిపడటం లేదు. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, లింగం, మతం, సామాజికవర్గం, కులం, వయసు తదితర ప్రశ్నలున్నాయి. 11, 12వ ప్రశ్నలు ఆధార్, ఫోన్ నంబర్లకు సంబంధించినవి. ఇవి ఐచ్ఛికమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివరాలను చెప్పేందుకు గ్రామీణ ప్రాంతాల వారు ముందుకొస్తున్నా.. పట్టణ ప్రాంతాల్లో చెప్పేందుకు ఇష్టపడటం లేదు. ⇒ ఇక కాలమ్ 13 నుంచి 19 వరకు ప్రశ్నలు భౌతిక, వివాహ స్థితి, పాఠశాల, విద్యార్హతలు, మాధ్యమం, డ్రాపౌట్ తదితర వివరాలకు సమాధానాలు వస్తున్నాయి. ⇒ కాలమ్ 20 నుంచి 56 వరకు ఉన్న ప్రశ్నలకు సమాచారం చెప్పడంలో జనం వెనక్కి తగ్గుతున్నారు. అందులో చాలావరకు వ్యక్తిగత వివరాలు ఉన్నాయని.. అవి వెల్లడించలేమని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ⇒ 20వ కాలమ్ నుంచి ఉన్న ప్రశ్నల్లో ఎక్కువగా వ్యక్తిగత అంశాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, వేతనం, కులవృత్తి, వ్యాధులు, వార్షికాదాయం, పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు, వ్యవసాయ భూములు, ధరణి పాస్‌బుక్ వివరాలు, భూమి రకం, నీటిపారుదల వనరులు, కౌలు, రిజర్వేషన్ల ద్వారా పొందిన విద్యావకాశాలు, ఉద్యోగ ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి, ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం, నామినేటెడ్ పోస్టులు, వలసలు, అందుకు కారణాలు, బ్యాంకు లేదా ఇతర సంస్థల నుంచి రుణాలు, వాటి చెల్లింపులు, పశుసంపద, స్థిర, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు, నివాసగృహం, ఇంటికి సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు రావడం లేదని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. ‘అసలు’వివరాలే రావట్లే! సమగ్ర కుటుంబ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాల సేకరణే కీలకం. కానీ ఉద్యోగం, వృత్తి, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకపోతుండటంతో ఎన్యుమరేటర్లు సైతం చేతులెత్తేస్తున్నారు. వివరాలు చెప్పాలని మళ్లీ మళ్లీ అడిగితే... ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఇచ్చిన వివరాలు నమోదు చేసుకుంటూ ఇతర కాలమ్స్‌ను వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల గట్టిగా ఎదురు ప్రశ్నిస్తుండటంతో చాలామంది ఎన్యుమరేటర్లు తర్వాత అడగడమే మానేశారు. అయితే నిర్దేశించిన ప్రశ్నల్లో సగానికి పైగా సమాధానాలు రాకపోతే సర్వే లక్ష్యం నెరవేరే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల ఎన్యుమరేటర్లు పెన్సిల్‌తో సర్వే ఫారం పూరిస్తున్నారు. తర్వాత వాటిని పెన్నుతో రాస్తామని చెప్తున్నారు. తప్పులు దొర్లకుండా ఈ విధానం అనుసరిస్తున్నట్టు ఎన్యుమరేటర్లు చెప్తున్నా... పెన్నుతో రాసే సమయంలో ఇతర వివరాలు నమోదు చేస్తారేమోనని జనంలో ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి. ఎన్నో అపోహలు.. మరెన్నో అనుమానాలు! సమగ్ర సర్వేపై ఎన్నో అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని నివృత్తి చేయడంలో అధికార యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతోనే... సర్వేలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారాన్ని చాలా మంది వెల్లడించడం లేదు. ఒకవేళ ఆస్తుల లెక్కలు చెబితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కోత పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ఈ కారణంగానే ఆధార్ వివరాలను కూడా ఈ కారణంగానే బహిర్గతం చేయడం లేదని అంటున్నారు. వాహనాలు, ఇళ్లు, స్థిర, చరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎక్కువ మంది చెప్పడం లేదు. ప్రధానంగా పింఛన్లు, ఉచిత కరెంటు, రేషన్‌కార్డు, ఉచిత నల్లా కనెక్షన్, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్íÙప్ తదితర పథకాలు ఆగిపోతాయేమోనన్న కారణంతో వాస్తవాలను దాచేస్తున్న పరిస్థితి. స్టిక్కర్లు వేయని ఇళ్ల మాటేంటి? పట్టణ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు ఇప్పటికీ స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, నాలుగైదు అంతస్తుల భవనాల్లోని చాలా ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదని అంటున్నారు. పూర్తిస్థాయి సర్వేలో ఇలాంటి ఇళ్లను గుర్తించి, వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోయిందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వే సమయంలో అలాంటి ఇళ్లను కూడా గుర్తించాలని అధికారులు సూచిస్తున్నా.. ఎన్యుమరేటర్లు వచ్చే సమయం తెలియక ఇబ్బందిగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. సర్వేతో ఒరిగేదేమిటి.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారు. వెంకటేశ్వరకాలనీ 4బీ రోడ్లో నివాసం ఉంటున్న మంద సతీష్ రెడ్డి ఇంటికి రాగా.. సర్వేతో తమకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుందని.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సర్వే చేసింది.. అప్పుడు అన్ని చెప్పాం.. మళ్లీ కొత్తగా చెప్పేది ఏముంటుందని ప్రశ్నించారు. దీంతో ఎన్యుమరేటర్ నచ్చజెప్పి వివరాలను నమోదు చేశారు. కుల వృత్తికి సంబంధించి ప్రశ్న అడగ్గా.. రెడ్డిలకు ఏ కుల వృత్తి ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. అలాగే, ఆదాయ వివరాలు ఎందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. తాము అప్పులు చేసి కొన్న ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాహనం వంటి వివరాలు అడగడం తగదన్నారు. రుణమాఫీ, రైతుబంధు, రేషన్‌కార్డు, పింఛన్లు ఇవ్వకుండా సర్వే చేయడం అనవసరమని చెప్పారు. -
67.72 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇప్పటివరకు 58.3 శాతం పూర్తయింది. ఈ నెల 6వ తేదీన సర్వే ప్రారంభం కాగా... తొలి మూడు రోజులు ఇళ్ల గుర్తింపు, స్టికర్లు అంటించే కార్యక్రమం నిర్వహించారు. 9వ తేదీ నుంచి కుటుంబాల వివరాలు సేకరించి నమోదుచేసే ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,16,14,349 ఇళ్లను గుర్తించగా, ఆదివారం సాయంత్రానికి 67,72,246 ఇళ్లలో సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సర్వేలో 87,807 మంది ఎన్యుమరేటర్లు, 8,788 మంది పర్యవేక్షకులు పాల్గొంటున్నారు. సర్వేలో కీలకాంశాలు.. ⇒ సర్వేలో భాగంగా గుర్తించిన మొత్తం ఇళ్లు: 1,16,14,349. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 64,41,183, పట్టణ ప్రాంతంలో 51,73,166 ఇళ్లు ఉన్నాయి. ⇒ రాష్ట్రాన్ని 92,901 బ్లాకులుగా విభజించారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 52,493, పట్టణ ప్రాంతంలో 40,408 బ్లాకులున్నాయి. ⇒ సర్వేలో 87,807 మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో 47,561 మంది, పట్టణ ప్రాంతంలో 40,246 మంది ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. ⇒ సర్వే తీరును సమన్వయం చేసేందుకు 8,788 మంది పర్యవేక్షకులను ప్రభుత్వం నియమించింది. ఇందులో 4,947 మంది గ్రామాల్లో, 3,841 మంది పట్టణ ప్రాంతంలో ఉన్నారు. ⇒ ఆదివారం నాటికి ములుగు జిల్లాలో అత్యధికంగా 87.1 శాతం సర్వే పూర్తయింది. ఆ తర్వాత స్థానంలో నల్లగొండ జిల్లా 81.4 శాతం, జనగామ 77.6 శాతం, మంచిర్యాల 74.8 శాతం, పెద్దపల్లి జిల్లాలో 74.3 శాతం సర్వే పూర్తయింది. అత్యధిక జనసాంద్రత ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఇప్పటివరకు 38.3 శాతం మాత్రమే పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
కులరహిత వ్యవస్థకు తొలి అడుగు
కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు. కులగణన చాలామందికి గొంతు దిగని పచ్చివెలక్కాయలా మారిందనిపిస్తుంది. తెలంగాణలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నాపత్రంపై కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. కనీస సదుపాయాల లభ్యత పరంగా వివిధ సముదాయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం. అసెంబ్లీ, పార్లమెంటులు కాదు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని కొన్ని సముదాయాలున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి, ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి రాజకీయ అనే పదం గురించిన అభ్యంతరాలు అర్థం లేనివి.కుటుంబ సర్వేలో ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇదేదో వ్యక్తిగత హక్కులకు భంగమైనట్లు వాదిస్తున్నారు. సంపాదన వివరాలు తెలియజేసి ఆదాయపన్ను చెల్లించడం పౌరుల బాధ్యత కాదా? వివిధ సముదాయాల ఆర్థిక స్థితి గతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి పక్కా ఇంట్లో ఉంటున్నారా? పూరిగుడిసెలో ఉంటున్నారా అనే ప్రశ్నలు అడగవలసినవే. ఆస్తులే మున్నాయి? అసలున్నాయా? ఇల్లు ఉందా లేదా? ఎక్కడ తలదాచు కుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ అవసరమైనవే. ఈ ప్రశ్నలకు జవాబుల్లోనే ఏ సముదాయం ప్రజలకు ఆదాయవనరులు అందుబాటులో లేవు, ఎవరికి విద్యావసతి అందుబాటులో లేదు వంటి వివరాలు తెలుస్తాయి. రాజ్యంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించాలి. అవసరమైన గణాంకాలు లేకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం?ఉండవలసిన ప్రశ్నలుఇది ప్రాచీన దేశం. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి. విభిన్న సముదాయాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది. అర్ధసంచార జాతులు, సంచార జాతులు, డినోటిఫైడ్ ట్రైబ్స్ అనేకం ఉన్నాయి. వారికి సంబంధించిన గణాంకాలు లేకపోతే, ప్రభుత్వం ప్రణాళికా రచన ఎలా చేయగలదు? అందువల్లనే రాహుల్ గాంధీ తన న్యాయ్ యాత్రలో ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పారు. డాటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించి రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యం? వెనుకబడిన వర్గాలన్నీ పేదవర్గాలు కాకపోవచ్చు. వారందరికీ రిజర్వేషన్లు అవసరం లేకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డాటా కావాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది? రాజ్యంగంలోని అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం కాని, సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యలు చేప ట్టడం కాని ఏది చేయాలన్నా డాటా అవసరం. రాజ్యాంగంలోని అధి కరణ 17 ప్రకారం అంటరానితనం నేరం. సమాజంలో ఏదో ఒక రూపంలో అంటరానితనం ఉంది కాబట్టి ఈ సర్వేలో దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉండవలసింది. విద్యాహక్కు అందరికీ ఉంది. కానీ ఎంతమందికి విద్య అందు బాటులో లేదు? అధికరణ 23 హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నిషేధిస్తుంది. వెట్టిచాకిరిని నిషేధిస్తుంది. సర్వే జరగకపోతే ఎంత మంది వెట్టిచాకిరిలో ఉన్నారు? అనే వివరాలు ఎలా తెలుస్తాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న కూడా ప్రస్తుత సర్వేలో లేదు. మహానగరాల రెడ్ లైట్ ఏరియాల్లో, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంతమంది మగ్గిపోతున్నారు? వెట్టిచాకిరి, హ్యూమన్ ట్రాఫికింగ్, బాలకార్మికులు వంటి సమస్యలు పరిష్కరించాలంటే డాటా కావాలి. సంపద కొందరి చేతుల్లోనే పోగుపడరాదు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలంటే, సంపదకు సంబంధించిన డాటా ఉండాలి. ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు? ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు? ఏ కులం పరిస్థితి ఎలా ఉంది? ఎవరి బ్యాంకు ఎక్కౌంట్లు ఎలా ఉన్నాయి?వంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే ఎవరు సంపన్నులు, ఎవరు బాగా బతుకుతున్నారు? ఎవరు ఇతరుల వాటాను కబళిస్తున్నారు? వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకే దోపిడీ శక్తులు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్న వారంతా అగ్రవర్ణాలకు చెందినవారే అన్నది గమనించాలి. దురదృష్టవశాత్తు కొందరు అభివృద్ధి చెందిన వెనుకబడిన కులాలవారు, అభివృద్ధి సాధించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కూడాను. ఎందుకు అవసరం?ఇందిరా సాహ్ని కేసుతో సహా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయమై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. 1966లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు కోర్టులు ఈ ప్రతిపాదనను డాటా లేనందువల్ల కొట్టేశాయి. సర్వేలు ఏవీ జరగ లేదు. మురళీధర్ కమిషన్ విషయంలోనూ ఇదే జరిగింది. మురళీధర్ కమిషన్ ఈ సర్వే నిర్వహించలేదు. డాటా లేదన్న కారణంతో కోర్టులు కమిషన్ సిఫారసులను కొట్టేశాయి. భారతదేశంలో ఇప్పుడు లభి స్తున్న రిజర్వేషన్లకు కారణం బ్రిటిషు వారి కాలంలో, 1931లో చేసిన కులగణన. దీని ఆధారంగానే మండల్ కమిషన్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ రిపోర్టులో బీసీ జనాభా 52 శాతంగా నిర్ధారించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కులగణన చేయించలేదు. కులగణన అనేది రాజ్యాంగబద్ధమైన అవసరం.అధికరణ 38 ప్రకారం ప్రభుత్వం సోషల్ ఆర్డర్‌ను కాపాడటం ద్వారా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలి. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సాధించాలి. ఇందులో రాజకీయ న్యాయాన్ని కూడా మరిచిపోరాదు. పురుషులు, మహిళలకు సమానంగా తగిన జీవనోపాధి హక్కు, భౌతిక వనరుల యాజమాన్యం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారి తీయకుండా చూడటం, సమాన పనికి సమాన వేతనం గురించి ప్రభుత్వాలకు నిర్దేశాలున్నాయి. గణాంకాలతోనే సామాజిక న్యాయంస్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అదే అధికరణ 243 డి 6. ఈ అధికరణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది. 1992లో ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు పంచాయితీల్లో, చైర్పర్సన్ల ఎన్నికల్లో తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు ఉంది. అయితే వెనుకబడిన వర్గాలు రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన రిజ ర్వేషన్లు పొందగలరు. అందువల్లనే అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పంచా యత్ రాజ్ చట్టం 1994 తీసుకువచ్చారు. ఆ విధంగా స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు 1994 నుంచి గత ఎన్నికలకు ముందు వరకు లభిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు క్యాప్ 50 శాతం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థానాల లభ్యతను బట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కుల సముదాయాల డాటా అందుబాటులో లేకపోవడం వల్లనే. అందు వల్లనే కులగణన అవసరం.సమగ్ర కుటుంబసర్వేలో కానీ, కులగణనలో కానీ ఉన్న ప్రశ్నలు పాతవే. 2011లో జరిగిన సర్వేలో ఉన్న ప్రశ్నలే ఇప్పుడూ అడుగు తున్నారు. అప్పుడు ఎవ్వరు అభ్యంతరాలు చెప్పలేదు. నిజానికి, గణాంకాల చట్టం ఉంది. అధికరణ 342 ఏ (3) ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. శ్రీశ్రీశ్రీ రవిశంకర్ దేశంలో కులగణన జరిగితే తిరుగుబాట్లు జరుగుతాయని మాట్లాడారు. కులగణన జరగకపోతేనే అణగారిన వర్గాలు తిరగబడి అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. కులరహిత వ్యవస్థ ఏర్పడాలంటే కులగణన తప్పనిసరి అవసరం. బడుగు బలహీనవర్గాలు సామాజికంగా కాస్త పైస్థాయికి చేరుకున్న ప్పుడే కులాంతర వివాహాలు జరుగుతాయి. ఆ విధంగా కులనిర్మూ లన జరుగుతుంది. అందువల్ల అందరూ కులగణనకు సహకరించా లని కోరుతున్నాను. కులగణన సమగ్ర ప్రగతి వికాసాలకు తోడ్పడే మొదటి అడుగు.జస్టిస్ వి.ఈశ్వరయ్య వ్యాసకర్త జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్ -
సమగ్ర కుటుంబ సర్వే.. ఎందుకీ ఆలస్యం?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వేలో వివరాలు వెల్లడించేందుకు చాలామంది నిరాకస్తున్నారు. వివరాలు గోప్యంగానే ఉంటాయని ప్రభుత్వం భరోసాస్తున్నప్పటికీ ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించడం లేదు. దీనికి తోడు.. ఫామ్‌లో మార్పుల వల్ల ఒకరోజు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో నిన్నటి వరకు స్టిక్కరింగ్ కార్యక్రమం కొనసాగింది. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల ఇళ్లలో ఎన్యుమరేటర్లు సర్వే చేశారు. సర్వే కోసం ఒక్కో ఇంటివద్ద 20 నుంచి 35 నిమిషాల సమయం తీసుకున్నారు. చాలాచోట్ల.. ఇంటి యజమానులు ఎన్నికల హామీలపై నిలదీస్తుండడంతో ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సర్వే సాఫీగా సాగుతుందనే ధీమాతో ఉంది.చదవండి: కులగణనపై కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి: పొన్నం -
అనుమానాలొద్దు.. సలహాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ఇంటింటి సర్వే చేస్తూనే బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఆ వర్గానికి సంబంధించిన కుల గణన చేయటానికి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంలో తమ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాలితులను పాలకులను చేయడానికే తమ తపన అని వ్యాఖ్యానించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చేపట్టిన చర్యల తరహాలోనే రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడే గొప్ప నిర్ణయమైనందున దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన సందేహాలపై సీఎం వివరణ ఇచ్చారు. అండగా ఉండాలంటే లెక్కలు తెలియాలని సుప్రీం చెప్పింది ‘ఈ తీర్మానంపై సలహాలు సూచనలు ఇవ్వటం కంటే అనుమానాలు లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించటంతో పాటు ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారు. యూపీఏ–1 హయాంలో మైనారిటీల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వేశారు. దాని సిఫారసుల ఫలితంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడు బీసీల సమగ్ర అభ్యున్నతి కోసం, వారికి ప్రభుత్వం అండగా నిలవాలన్న రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు మా ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు వెల్లడించలేదు. పదేళ్లయినా అది ఓ రహస్య నివేదికగానే ఉండిపోయింది. ఒకే ఒక కుటుంబం ఆ వివరాలను అవసరమైనప్పుడు చూసుకుని, ఎన్నికల సమయంలో దాన్ని వాడుకుంది. మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఈ తీర్మానం అత్యంత కీలకమైంది. బలహీనవర్గాలకు అండగా నిలబడాలంటే ఆ వర్గం లెక్కలేంటో తెలియాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉందనే అనుమానాలు ఏవైనా ప్రతిపక్షానికి ఉంటే వాటిని వెల్లడిస్తూ మంచి సూచనలు చేయాలి..’అని సీఎం కోరారు. అర శాతం ఉన్నోళ్లకు బాధగానే ఉంటుంది.. ‘అర శాతం ఉన్నోళ్లకు కచి్చతంగా బాధ ఉంటుంది. రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకున్నోళ్లకు.. ఇప్పుడు లెక్కలన్నీ బయటకు వచ్చి 50 శాతం ఉన్నోళ్లకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న బాధ ఉండొచ్చు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి అభిప్రాయం చెప్పాలి. లేదా వారు బాధ్యత అప్పగించిన వారైనా చెప్పాలి. నకలుæ చిట్టీలు అందించినట్టు కడియం శ్రీహరి పక్కన చేరి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు సందేహం లేదు. కానీ, పక్కన కూర్చున్నవారి సావాస దోషం ఆయనను తప్పుదోవ పట్టిస్తోంది. మేనిఫెస్టో, ఎన్నికల హామీలపై చర్చ కావాలంటే ప్రత్యేకంగా పెట్టుకుందాం. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష పార్టీ ఏం హామీ ఇచ్చింది, వాటిని ఎంతమేర అమలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన హామీలు, ఈ 70 రోజుల్లో అమలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దాం..’అని రేవంత్ అన్నారు. కేవలం బీసీల కులగణనతో వారికే నష్టం: గంగుల కమలాకర్ బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, అయితే దీనిపై కొన్ని సందేహాలున్నాయని అన్నారు. తీర్మానం కాకుండా బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం బీసీ కుల గణన చేస్తే చివరికి బీసీలే నష్టపోతారని పేర్కొన్నారు. సర్వే ఎప్పట్లోగా చేసి వివరాలు వెల్లడిస్తారో కూడా చెప్పాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారని, వచ్చే జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో దాన్ని అమలు చేయాలని కోరారు. బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్‌ప్లాన్ తెస్తామని చెప్పినా బడ్జెట్లో వాటి ఊసు లేదన్నారు. తీర్మానంలో స్పష్టత లేదు: కడియం శ్రీహరి తీర్మానంలో స్పష్టత లోపించిందని, సమగ్ర కుటుంబ సర్వే అని, బీసీ కుల గణన అని ఉందని, ఇందులో ఏది చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని తీర్మానంలో పూర్తి స్పష్టత ఉందని, అన్ని వర్గాలు, అన్ని కులాల ఆర్థిక, సామాజిక ఇతర అంశాల పూర్తి వివరాలను సర్వే ద్వారా సేకరించనున్నట్టు చెప్పారు. బీసీ కులగణన కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. విపక్షం ఒకవేళ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టైతే ఆ విషయం బహిరంగంగా చెప్పాలని అన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా కులగణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (కులగణన) పేరుతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిపేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులతోపాటు ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన ప్రణాళికలను రూపొందించేందుకు ఉద్దేశించిన ఈ తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సభ ముందుంచారు. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, గంగుల కమలాకర్, కడియం శ్రీహరి, కాలేరు వెంకటేశ్, కాంగ్రెస్ సభ్యులు వాకాటి శ్రీహరి, శంకరయ్య, ఆది శ్రీనివాస్, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చర్చలో పాల్గొన్నారు. చట్టం అవసరం లేదు: పొన్నం ప్రభాకర్ జనాభా దామాషా పద్ధతిలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన ఎలా చేయాలనే దానిపై అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానా లు రూపొందిస్తామని చెప్పారు. కులగణన తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ఆయన బదులిచ్చారు. కులగణనకు ఎలాంటి చట్టం అవసరం లేదని, 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చట్టం లేకుండానే చేపట్టిందని తెలిపారు. అయితే తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టడంతో పదేళ్లుగా వెనక్కు పోయిందని అన్నారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పటికీ బయట పెట్టలేదని విమర్శించారు. తాజాగా చేపట్టనున్న సర్వే అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2014 నుంచి 2023 వరకు అప్పటి ప్రభుత్వం బీసీల కోసం రూ.23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. ఎంబీసీలకు వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. న్యాయపరమైన సలహాల మేరకే ముందుకు: భట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణనకు అంకురార్పణ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. ‘ఎవరెంత ఉంటారో వారికి అంత చెందాలి’అని రాహుల్‌గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగానే ఈ నెల 4న కేబినెట్లో చర్చించి కులగణన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. బీసీలకు సబ్‌ప్లాన్ కూడా తీసుకొస్తామని, సర్వే అనంతరం బీసీల శాతాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పిస్తేనే మంచిది: కేటీఆర్ రాష్ట్రంలో కులగణనను బీఆర్ఎస్ సంపూర్ణంగా స్వాగతిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చట్టబద్ధత కల్పిస్తేనే ఫలవంతమవుతుందని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ మొదటి నుంచి పనిచేస్తోందన్నారు. 2004లోనే కేసీఆర్.. ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్ రావుతో కలసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలసి ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. 2014 తర్వాత శాసనసభలో రెండుసార్లు ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి: అక్బరుద్దీన్ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు వీలుగా కులగణన చేపట్టేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలతోపాటు మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధనలను తొలగించాలన్నారు. కూనంనేని మాట్లాడుతూ.. కులగణనకు సంబంధించిన విధివిధానాలు ఏమిటో తెలపాలని విజ్ఞప్తి చేశారు. బిల్లు రూపంలో తీసుకొస్తే చట్టబద్ధత ఉంటుందని సూచించారు. -
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరపాలి
లక్డీకాపూల్ (హైదరాబాద్): రాష్ట్రప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలకు గణన విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనగణనకు ఏర్పాటు చేసిన ఐక్య సదస్సు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ డేటా తన దగ్గర ఉంచుకుని కులం ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎస్సీ, బీసీ కులాలకు చెందిన అధికారులను ఎంతమందిని పెట్టుకున్నారో పరిశీలిస్తే.. ప్రభుత్వ వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. చివరికి కాళేశ్వరంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేరని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రవీణ్ కుమార్ అంటే అందరి వాడని, కొందరి వాడు కాదన్నారు. గ్రామాల్లో ప్రతి ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ జన గణన కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అనిల్, శారద, కృçష్ణుడు, రియాజ్, నాగరాజు పాల్గొన్నారు. -
సర్వేనే దిక్సూచి!
సాక్షి, హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే టీఆర్ఎస్కు ఎన్నికల ఆయుధమైంది. సర్వే వివరాల ఆధారంగానే ఆయా వర్గాలకు పలు రకాల హామీలిస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చ ఊపందుకుంది. ఇదే సమయంలో తమ విజయావకాశాలపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది. స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారం కైవసం చేసుకుంటామని కారు పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఒక కారణమైతే.. తన చేతిలో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే మరో కారణమని తెలుస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్దినెలలకే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రం లోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యతపై స్పష్టత కోసం ఈ సర్వే చేపట్టారు. దీనిపై చాలా ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ సర్వే తరువాత కారు పార్టీ ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తూ టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికతో మొదలు 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండుచోట్లా విజయం సాధించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో మెదక్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సరిగ్గా మెదక్ ఉపఎన్నికకు ముందు కేసీఆర్ సమగ్ర కుటుంబసర్వే చేపట్టారు. దీని ఆధారంగా భవిష్యత్తులో వివిధ సంక్షేమ పథకాలు చేపడతానని అప్పట్లో ప్రకటించారు. మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. 2015లో కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 150 డివిజన్లలో 99 స్థానాలు కైవస ం చేసుకుంది. తరువాత నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకస్మిక మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు భూపాల్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇలా అన్ని పురపాలక, నగరపాలికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగిస్తూ వస్తోంది. సర్వేనే ఆయుధమా? వాస్తవానికి నారాయణఖేడ్, పాలేరులో కాంగ్రెస్‌కు బలం ఎక్కువ. పైగా సానుభూతి కలసి వస్తుందనుకున్న కాంగ్రెస్‌కు రెండు సందర్భాల్లోనూ పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సమగ్ర కుటుంబ సర్వేపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ఏ ఏ వర్గాల వారు నివసిస్తున్నారు... వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు, ఆ ప్రాంత భౌగోళిక స్థితులు, అవసరాలేమిటి... వంటి వాటిని గ్రహించి టీఆర్ఎస్ తన వ్యూహాలను రచిస్తోంది. ఆ మేరకు ప్రచార ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎక్కడ ఎవరు ప్రచారం చేయాలి? ఏ ఏ విషయాలు మాట్లాడాలన్న దానిలోనూ సర్వేనే ఆధారం. టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లేందుకు కారణం కూడా ఇదేనని విశ్వసనీయ సమాచారం. సంక్షేమ పథకాలతోపాటు సమగ్ర కుటుంబసర్వే ఈ ఎన్నికల్లో తమను గట్టెక్కిస్తుందని కేసీఆర్ ధీమాతో ఉన్నట్లు తెలిసింది. -
భూముల లెక్క తేలుద్దాం!
♦ రాష్ట్రంలో అన్ని భూముల పూర్తి వివరాల నమోదుకు సర్కారు నిర్ణయం ♦ సమగ్ర కుటుంబ సర్వే తరహాలో భారీ సర్వేకు కసరత్తు ♦ వేలాది మంది ఉద్యోగులు, సిబ్బందితో మూడు రోజుల పాటు నిర్వహణ ♦ ఆగస్టు చివరి వారంలో సర్వే చేపట్టాలని సీఎం యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని భూము ల వివరాలను పక్కాగా రికార్డు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ తరహా భూములు, వాటి విస్తీర్ణం, యజమానులు తదితర అన్ని అంశాలనూ నమోదు చేయనుంది. ఇందుకోసం సమగ్ర కుటుంబ సర్వే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మరో భారీ సర్వేకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే 3 రోజుల పాటు రాష్ట్రమంతటా సమగ్ర భూముల సర్వే చేయిం చాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయిం చారు. పల్లెల నుంచి పట్నం వరకు ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది, ఎవరెవరి పేరట ఉంది, విస్తీర్ణం ఎంత, సాగు భూములెన్ని, హక్కుదా రులెవరు.. ఇలా ప్రతి అంగుళం భూమి వివరాలన్నీ సేకరించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇక వివాదాలకు చెక్.. ఈ సర్వే సందర్భంగా భూముల వివాదాలను పరిష్కరించి.. వాస్తవ యజమానులెవరో గుర్తించి, ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే సీఎం ఇప్పటికే ఈ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం కావడంతో ఆగస్టు 15 వరకు హరితహారం కార్యక్రమంపై దృష్టి సారించాలని... ఆ నెల చివరి వారంలో భూముల సమ గ్ర సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. సర్వే నిర్వహణకు ఉద్యోగులు సరిపోకపోతే.. 15 వేల మంది వరకు నిరుద్యోగ యువకులను వినియోగించుకోవాలని ఆదేశించారు. పెట్టుబడి పథకానికి ముందస్తు వ్యూహం! వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో కూడిన పథకం కావటంతో.. అవకతవకలకు తావు లేకుండా, పక్కాగా అమలు చేసేందుకు సర్కారు ముందస్తు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో సాగు భూముల సర్వే చేయించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ సర్వేలో దాదాపు 1.26 కోట్ల ఎకరాల సాగు భూములున్నట్లు తేలింది. అయితే తమ భూముల వివరాలు ఇంకా నమోదు కాలేదని, మరో అవకాశం ఇవ్వాలంటూ రైతుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. అంతేగాకుండా వివాదాలు, కోర్టు కేసుల్లో ఉండడం వంటి కారణాలతో మరో 12 శాతం భూముల వివరాల నమోదు పెండింగ్‌లో పడింది. ఈ నేపథ్యంలోనే సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం మొగ్గు చూపింది. యూనిక్ కోడ్‌తో టైటిల్ డీడ్ భూమి లెక్కలు తేలిన తర్వాత కొత్తగా టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకాలు ఇస్తారు. ప్రతి రైతుకు, పాస్ పుస్తకానికి ప్రత్యేక (యూనిక్) కోడ్ ఇస్తారు. భూరికార్డులన్నీ సరిచేసిన తర్వాత రూపొందించిన జాబితానే ప్రభుత్వం అనుసరిస్తుంది. అందులోని వివరాల ఆధారంగా.. ఏ రైతు వద్ద ఎంత భూమి ఉందనే దాని ప్రకారం పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తుంది. ఇక రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలు, వారసత్వ బదిలీ, పేరు మార్పిడి విధానాలన్నీ అక్టోబర్ నెలాఖరులోగా సరళంగా, పారదర్శకంగా అమలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. మ్యుటేషన్, పాస్ పుస్తకాల జారీ వంటివి నిర్ధారిత సమయంలోగా చేయకుంటే సంబంధిత అధికారికి జరిమానా విధించేలా కొత్త విధానాన్ని రూపొందించనున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణ.. ప్రచురణ నిజాం కాలంలో అమల్లోకి వచ్చిన రెవెన్యూ విలేజ్ విధానంలో నిర్ణయించిన గ్రామ శివార్లు, అప్పటి సర్వే నంబర్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం రెవె న్యూ శాఖ వద్ద, వ్యవసాయాధికారుల వద్ద భూమి రికార్డులున్నాయి. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోవటంతో భూవివాదాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే ద్వారా వివాదాలను పరిష్కరించనున్నారు. మొత్తం వ్యవసాయ భూముల రికార్డులన్నీ సర్వే వివరాలతో సరి పోల్చి, అవసరమైన సవరణలు చేస్తారు. అనంతరం ఆయా గ్రామాల వారీగా భూముల వివరాలు, వాటి యజమానులు, సర్వే నంబర్లు, సర్వే సందర్భంగా సవరించిన రికార్డుల వివరాలన్నీ ఓటర్ల జాబితాల తరహాలో అందరికీ అందుబాటులో ఉండేలా గ్రామాల్లో ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి, విచారణ జరుపుతారు. అవసరమైన సవరణలు, మార్పులు చేర్పులతో భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ తుది భూముల రికార్డుల్లోనూ ఏవైనా అభ్యంతరాలుంటే.. పరిశీలించి, సరిదిద్దుతారు. -
తగ్గిన ముస్లింలు.. పెరిగిన హిందువులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో హిందువుల సంఖ్య రెండుశాతం పెరగగా, ముస్లింల సంఖ్య ఒక శాతానికి పైగా తగ్గింది. కేంద్ర జనగణన విభాగం చేపట్టిన 2011 జనాభా లెక్కలతో నిరుడు తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే మతాల వారీగా జనాభాలో హెచ్చుతగ్గులిలా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని పది జిల్లాల్లో మొత్తం జనాభా 3.51 కోట్లు. గతేడాది ఆగస్టు 19న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో మొత్తం 3.63 కోట్ల మంది జనాభా ఉన్నట్లు లెక్కతేలింది. అదే సర్వేలో మతాల వారీగా కుటుంబాల వివరాలను సైతం ప్రభుత్వం సేకరించింది. కుటుంబాలకు, జనాభాకు స్వల్ప వ్యత్యాసమే ఉంటుందని.. ఇంచుమించుగా ఇదే ఫలితాలు ప్రతిబింబిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 87.17 శాతం హిందువుల కుటుంబాలున్నాయి. 2011 లెక్కల ప్రకారం హిందువులు 85.09 శాతం మంది ఉండడం గమనార్హం. దీంతో నాలుగేళ్లలో హిందువులు 2.08 శాతం పెరిగినట్లు అర్థమవుతోంది. ముస్లింలు 2011లో 12.65 శాతం ఉండగా, సమగ్ర సర్వే ప్రకారం 11.01 శాతం ఉన్నారు. అంటే 1.64 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది. క్రిస్టియన్ల సంఖ్యలో మార్పేమీ లేకపోవడం గమనార్హం. 2011 లెక్కల ప్రకారం 1.27 శాతం క్రిస్టియను ఉన్నారు. సిక్కులు 0.15 శాతం, జైనులు 0.06 శాతం, బుద్ధులు 0.05 శాతం ఉన్నట్లు తేలింది. 2011తో పోలిస్తే ఈ మూడు మతాల జనాభా స్వల్పంగా పెరిగింది. -
జీవనభృతికి మళ్లీ మెలిక
మారిన నిబంధనలు.. పీఎఫ్ తప్పనిసరి.. యాభై ఏళ్ల లోపు వారికే.. కోరుట్ల: బీడీ కార్మికుల జీవన భృతికి సర్కారు మరో మెలిక పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికురాలిగా నమోదు కాని కారణంగా భృతిని పొందలేకపోయిన వారి కోసం మరోసారి సర్వేకు సిద్ధమవుతున్న తరుణంలోనే నిబంధనలు మార్చింది. గతంలో బీడీ కార్మిక భృతికి ఎంపిక నిబంధనలను మారుస్తూ కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బీడీ కార్మికులకు తప్పని సరిగా పీఎఫ్ ఉండడంతో పాటు, యాభై ఏళ్లలోపు వయస్సు ఉండాలని నిర్దేశించింది. తాజా దరఖాస్తులు 1.20 లక్షలు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మొదటి విడత బీడీ కార్మిక భృతి కోసం అర్హులను ఎంపిక చేశారు. అయితే, పీఎఫ్ ఉండి.. అన్ని అర్హతలున్నా, సమగ్ర సర్వేలో నమోదు కాని కారణంగా తమకు బీడీ కార్మిక భృతి అందలేదని ఆందోళన వ్యక్తమైంది. దీంతో బీడీ కార్మికులు భృతి కోసం మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో బీడీ కార్మిక భృతి కోసం కరీంనగర్ జిల్లాలో 44 వేలు, ఆదిలాబాద్‌లో 8 వేలు, మెదక్‌లో 13 వేలు, నిజామాబాద్‌లో 48 వేలు, వరంగల్‌లో 6 వేల మంది దరఖాస్తులు వచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇలా దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించిన సర్వే.. ఎంపిక కోసం ఈనెల 7న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో ఎంఎస్ 38 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పీఎఫ్‌తో పాటు యాభై ఏళ్లలోపు వారైతేనే గతంలో బీడీ కార్మికుల పీఎఫ్‌తో సంబంధం లేకుండా.. బీడీ కార్మికురాలిగా నమోదై.. సర్వేలో బీడీలు చుడుతున్నట్లు తేలిన వారికి భృతి మంజూరు చేశారు. ఈసారి మాత్రం బీడీ కార్మిక భృతి కోసం పీఎఫ్ తప్పనిసరి చేశారు. 28 ఫిబ్రవరి 2014లోపు బీడీ కార్మికురాలు పీఎఫ్ నమోదు చేసుకుని ఉండాలి. దీంతో పాటు యాభై ఏళ్ల లోపు వయసున్న వారికే బీడీ కార్మిక భృతి మంజూరు చేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మొదటి విడతలో పీఎఫ్ లేని వారికి బీడీ కార్మిక భృతి ఇవ్వడంతో చాలా మంది పీఎఫ్ లేని బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా బీడీ కార్మిక భృతి మంజూరు చేశారు. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో తమకు రెండో విడత సర్వేలోనూ బీడీ కార్మిక భృతి అందని ద్రాక్షే అవుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
జనాభా ప్రాతిపదికన బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులలోని ఆయా కులాల్లో జనాభాను బట్టి బీసీ సహకార ఫెడరేషన్లకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరుపనుంది. గతేడాది ఆగస్టు 19న సమగ్ర కుటుంబసర్వేలో ఆయా బీసీ కులాలకు సంబంధించి లెక్కలకు అనుగుణంగా ఆయా ఫెడరేషన్లకు 2015-16 బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన సమాచారం ప్రకారం రాష్ర్టంలో విశ్వబ్రాహ్మణ, అనుబంధకులాలు కలుపుకుని 9.5 లక్షల మంది, రజకుల సంఖ్య 8.5 లక్షలుగా తేలింది. ఇక ఇతర వెనుకబడిన కులాల వివరాల విషయానికి వస్తే వడ్డెరలు 3.75 లక్షలు, కుమ్మరి, శాలివాహన 3.70 లక్షలు, నాయి బ్రాహ్మణులు 3 లక్షలు, వాల్మీకి/బోయలు దాదాపు 3 లక్షలు, సగర (ఉప్పర) 1.20 లక్షలు, మేదర 91 వేలు, కృష్ణ బలిజ/పూసల 38 వేలు, భట్రాజ్లు 17 వేలు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ పది కులాలకు సంబంధించిన సహకార ఫెడరేషన్లకు వచ్చే బడ్జెట్లో కేటాయింపులపై గతంలోనే కొంత కసరత్తు జరిగింది. ఆయా ఫెడరేషన్లకు బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపు సిద్ధం చేశారు. అయితే ఆ తర్వాత సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన వివరాలకు అనుగుణంగా ఆయా కులాల లెక్కలు తీసి బడ్జెట్ ప్రతిపాదలను తాజాగా రూపొందించారు. మొత్తంగా చూస్తే ఈ కులాలకు సంబంధించిన పది సహకార ఫెడరేషన్లకు దాదాపు రూ.160-170 కోట్ల వర కు ప్రతిపాదించి ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. ఆయా శాఖలవారీగా బడ్జెట్ కసరత్తు ముగిశాక, ఈ ప్రతిపాదనలకు కూడా తుదిరూపం ఇచ్చి వార్షిక బడ్జెట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. -
30 ఏళ్లలోపు పెళ్లికాని యువతులు 8వేల మంది
పోరాటాల పురిటిగడ్డగా కీర్తికెక్కిన నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత కలిగి ఉందని చెబుతున్నాయి సమగ్రకుటుంబ సర్వే గణాంకాలు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల కోవకు వచ్చే కరీంనగర్, వరంగల్‌తో పాటు పేదజిల్లాగా, వలసలకు అడ్డాగా గుర్తింపు పొందిన మహబూబ్నగర్తోనూ పోటీపడగలదని తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు19న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లావాసులు ఏం చెప్పారో... ఆ లెక్కలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవాలంటే మధ్యపేజీల్లోకి వెళ్లాల్సిందే.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సమగ్ర కుటుంబ సర్వేతో జిల్లా ముఖచిత్రం ఆవిష్కృతమైంది. అన్నింటా మన జిల్లా ప్రత్యేకత చాటుకుంది. ఇంటి స్థలం లేని వారి నుంచి ఆరెకరాల భూమి ఉన్న వారి వరకు.. సొంత ఇంటి నుంచి ఆద్దె ఇళ్లలో ఉంటున్న వారి వరకు... అనాథలు, ఒంటరి మహిళలు, వికలాంగులు, రోగాలతో బాధపడుతున్న వారు.... ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, బ్యాంకు ఖాతాలు, స్వయం సహాయక సంఘాల్లో ప్రాతినిధ్యం.... ఇలా అన్ని రంగాల్లోనూ జిల్లా వాసులు పోటీపడుతూనే ఉన్నారు. అన్నింటిలోనూ మొదటి మూడు, నాలుగు స్థానాల్లోనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 19న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేనిర్వహించిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన ఈ లెక్కలను శాస్త్రీయంగా పరిగణించలేం. కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే సర్వేలో ప్రజలు పూర్తి వివరాలను కచ్చితంగా చెప్పారన్నదానికి ఆధారం లేదు. సర్వేలో ప్రజలు తమ ఇష్టపూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం రూపొందించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. ‘భూమి’పుత్రులకు నెలవు సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడయిన అంశాలను పరిశీలిస్తే జిల్లాలో ‘భూమి’ ఉన్నవారు సగానికిపైగానే ఉన్నారు. మొత్తం 11,01,439 మంది ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లాలో సొంతస్థలం ఉన్నవారి సంఖ్య 4,58,911 మంది. తెలంగాణలో మహబూబ్‌నగర్ తర్వాత మన జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇక, అసలు స్థలం కూడా లేని వారు కూడా ఎక్కువేనండోయ్. వారి సంఖ్య 6,42,528. ఇక పొలం విషయానికి వస్తే ఎకరం కంటే తక్కువ ఉన్న వారు జిల్లాలో 10శాతం మంది ఉన్నారు. మొత్తం 1,25,260 మందికి ఎకరం కంటే తక్కువ భూమి ఉందని సర్వే లెక్కలు చెబుతుండగా, తెలంగాణలో ఇది మూడోస్థానం. మనకన్నా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎకరం కన్నా తక్కువ ఉన్న వారు ఎక్కువ ఉన్నారు. ఇక, ఎకరం నుంచి రెండకరాలున్నవారు 96,007 మంది, రెండు నుంచి మూడెకరాలున్నవారు 81,266 మంది, మూడు నుంచి నాలుగెకరాలు ఉన్నవారు 53,349 మంది, నాలుగు నుంచి ఐదెకరాలున్నవారు 45,516 మంది, ఐదు కన్నా ఎక్కువ ఎకరాలున్న వారు 98,989 మంది ఉన్నారు. అంటే ఎకరం కంటే ఎక్కువ ఉన్న వారికన్నా, ఐదు కన్నా ఎక్కువ ఎకరాలున్న వారున్న కుటుంబాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే, పేద జిల్లాగా పేరుపడ్డ మహబూబ్‌నగర్‌లో ఐదుకన్నా ఎక్కువ ఎకరాలున్న వారు మన జిల్లా కన్నా ఎక్కువ ఉండడం గమనార్హం. 30 ఏళ్లలోపు పెళ్లికాని మహిళలు 8వే ల మంది ఇక వర్గాల వారీగా పరిశీలిస్తే... జిల్లా అనాథలు, వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో అనాథలు 507 మంది ఉండగా, వికలాంగులు 68,218 మంది ఉన్నారు. అనాథల్లో రంగారెడ్డి తర్వాత, వికలాంగుల్లో కరీంనగర్ తర్వాత జిల్లానే మూడోస్థానంలో ఉంది. కనీసం ఇల్లు లేని సంచారజాతులు 1,25,001 మంది ఉంటే, ఇల్లున్న సంచార జాతుల వారు 1,024 మంది మాత్రమే. జిల్లాలో 30 ఏళ్లలోపు పెళ్లికాని మహిళల సంఖ్య 8,021 కాగా, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, భర్తలు వదిలిపెట్టిన మహిళలు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. జిల్లాలో సఫాయి కార్మికులు కూడా 1,332 మంది ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చెబుతున్నాయి. రోగాలూ ఎక్కువే సర్వే లెక్కల ప్రకారం.. జిల్లాలో అనారోగ్యం బారిన పడుతున్న వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇందులో తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు 1,19,999 మంది ఉన్నారు. వరంగల్, కరీంనగర్ తర్వాత జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇక, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కరీంనగర్ జిల్లా తర్వాత జిల్లాలోనే ఎక్కువగా 4,762 మంది ఉన్నారు. హృద్రోగాలున్నవారు 17,211 మంది కాగా, క్షయ వ్యాధి 4,590 మందికి, కుష్టు వ్యాధి 921 మందికి ఉంది. పక్షవాతంతో బాధపడుతున్నవారు 8,212 మంది, ఆస్తమా వ్యాధిగ్రస్తులు 11,862 మంది ఉన్నారు. ఇక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలోనే అత్యధికంగా 1,711 మంది ఉన్నార ని సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదాయపు పన్ను కడుతున్న వారు తక్కువే.. తెలంగాణవ్యాప్తంగా పరిశీలిస్తే జిల్లాలో ఆదాయపు పన్ను కడుతున్న వారి సంఖ్య తక్కువేనని సమగ్ర సర్వే లెక్కలంటున్నాయి. జిల్లాలో మొత్తం 30,268 మంది ఆదాయపు పన్ను కడుతున్నారని సర్వేలో చెప్పగా, నిజామాబాద్ జిల్లాలోనే మన కన్నా తక్కువ మంది ఆదాయపు పన్ను ఖాతాలు కలిగి ఉన్నారు. ఇక, బ్యాంకు ఖాతాల విషయంలో మనం ముందంజలో ఉన్నామని, జిల్లాలో 8,68,237 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయని సర్వేలో తేలింది. పోస్టాఫీసు ఖాతాల విషయంలో అయితే మనం తెలంగాణలోనే టాప్‌లో ఉన్నాం. మొత్తం 3,94,648 మందికి పోస్టాఫీసు ఖాతాలుండగా, స్వయం సహాయక సంఘాల సభ్యత్వం ఉన్నవారు కూడా జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు. కరీంనగర్ తర్వాత మన జిల్లాలోనే ఎక్కువగా 5,26,915 మందికి ఎస్‌హెచ్‌జీల్లో సభ్యత్వం ఉంది. ఇక చరాస్తుల విషయానికి వస్తే జిల్లాలో 2,22,358 ద్విచక్రవాహనాలు, 17,133 నాలుగు చక్రాల వాహనాలున్నాయి. ట్రాక్టర్లు, వ్యవసాయ సామాగ్రి వాహనాల సంఖ్య తెలంగాణలోనే జిల్లాలో అధికంగా ఉంది. మొత్తం 18,156 ట్రాక్టర్లు, వ్యవసాయ సామగ్రి వాహనాలున్నాయని సర్వే లెక్కలు చెబుతున్నాయి. చిన్నకుటుంబాలే ఎక్కువ.. సభ్యుల వారీగా కుటుంబాలను పరిశీలిస్తే జిల్లాలో చిన్నకుటుంబాల వారే ఎక్కువగా ఉన్నారు. అంటే చిన్నకుటుంబం - చింతలేని కుటుంబం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు జిల్లావాసులు. మొత్తం 11,01,439 కుటుంబాలిచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో ఒక్క మహిళ ఉన్న కుటుంబాలు 1,18,224. ఇది తెలంగాణలోనే ఎక్కువ. అచ్చం మహిళలే ఉన్న కుటుంబాలు 1,94,454. ఇది కూడా రంగారెడ్డి జిల్లా తర్వాత మన జిల్లాలోనే ఎక్కువ. అంటే జిల్లాలో మహిళలు పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబాలు బాగానే ఉన్నాయన్నమాట. ఇక, ఒకే పురుషుడున్న కుటుంబాలు కూడా జిల్లాలో 1,21,085 ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక, ఇద్దరు మాత్రమే ఉన్న కుటుంబాలు 2,37,167 కాగా, ముగ్గురున్న కుటుంబాలు 2,18,835, నలుగురున్న కుటుంబాలు 3,48,428 ఉన్నాయి. అంటే ఇద్దరు నుంచి నలుగురున్న కుటుంబాలు మొత్తం కుటుంబాల్లో 70శాతానికి పైగా ఉన్నాయన్నమాట. ఇక, పెద్ద కుటుంబాల విషయానికి వస్తే ఐదుగురుండే కుటుంబాలు 1,29,512 కాగా, ఆరుగురుండేవి 32,683, ఆరుగురు కన్నా ఎక్కువ ఉన్నవి 13,729 మాత్రమే. పెద్ద కుటుంబాలు కరీంనగర్, ఖమ్మం తర్వాత మన జిల్లాలోనే తక్కువ. అంటే లెక్కల ప్రకారం.. చివరి నుంచి మూడోస్థానంలో ఉన్నాం. విద్యుత్ లేని ఇళ్లలో మూడో స్థానం జిల్లాలోని ఇళ్లను పరిశీలిస్తే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సొంత ఇల్లున్న కుటుంబాలు 2,95,171 మంది. అంటే మొత్తం కుటుంబాల్లో ఇది 15శాతంపైమాటే. ఇక, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు జిల్లాలో 1,90,529 కుటుంబాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల తర్వాత అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారి సంఖ్య జిల్లాలోనే ఎక్కువ కావడం గమనార్హం. ఇక, ప్లాస్టిక్ కప్పులున్న ఇళ్లు 49,362, పూరిగుడిసెలు 49,310 (వరంగల్ తర్వాత మన దగ్గరే ఎక్కువ.), రాతికప్పులున్నవి 81,053 ఉన్నాయి. మొత్తం ఇళ్లలో 40శాతం ఇళ్లు కాంక్రీట్ శ్లాబ్ ఇళ్లేనని లెక్కలు చెబుతున్నాయి. కాంక్రీట్ కప్పులున్న ఇళ్లు జిల్లాలో 4,36,097 కాగా, మొత్తం ఇళ్లలో మరుగుదొడ్లు లేనివి 5.62లక్షలు. ఇక, విద్యుత్ సౌకర్యం కూడా లేని ఇళ్లు జిల్లాలో 1,84,439 ఉన్నాయని, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ల తర్వాత మన జిల్లాలోనే ఎక్కువని గణాంకాలు చెపుతున్నాయి. ఇక, ఒకే గదిలో నివసిస్తున్నవారు జిల్లాలో 5,10,044 మంది కాగా, రెండు గదుల్లో ఉండేవారు 4,01,302 మంది. అంటే మొత్తం కుటుంబాల్లో దాదాపు 90శాతం మంది రెండుగదుల్లోపే ఉంటున్నారు. ఇక, మూడు గదుల ఇళ్లు 1,05,260 కాగా, నాలుగు గదులున్న ఇళ్లు 61వేలేనని సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఉద్యోగ వర్గం.. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 31,192 మందికాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు 9,510 అని తేలింది. ఇక, వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు 25,103 మంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తున్న వారు 6,963 మంది ఉన్నారు. ఇక, నెలసరి వేతనం పొందే ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య 47,200 మంది. మతాలు, కులాల లెక్కలివి... సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో హిందూ మతస్తులు 10,33,702, ముస్లింలు 56,821, క్రిస్టియన్లు 9,178, సిక్కులు 737, జైనులు 40, బౌద్ధులు 21, ఇతరులు 940 మంది ఉన్నారని సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు. ఇక, సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే జిల్లాలో బీసీల సంఖ్యే ఎక్కువ. మొత్తం జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలున్నారు. -
ఎన్నాళ్లు బాంచెన్!
పాత పింఛన్ లేక, కొత్తగా పింఛన్ అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం ఆధార్, ఎస్కేఎస్, ఆన్లైన్ తదితర కారణాలతో అనేకమందిలో గందరగోళం నెలకొంది. పింఛన్ రాదేమోననే బెంగతో డిచ్పల్లి మండలం సుద్దుపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (68) మృతి చెందింది. 30 రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాలలో ఇలా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రోజుకోచోట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు రోడ్డెక్కుతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలో లోకేష్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ అవస్థలు ఎన్నాళ్లో తెలియడం లేదు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిబంధనలు మారడం, నూతనంగా ఆసరా పథకం తెరపైకి రావడంతో పింఛన్దారులలో అయోమయం ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా రూ.1000 పిం ఛన్ అమలు కోసం చేపట్టిన సర్వే, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రక్రియలు గందరగోళంగా మారాయి. దరఖాస్తు చే సుకున్నవారిలో అర్హులు చాలా మంది పింఛన్లు రాక అవస్థ పడుతున్నారు. గ తంలో పింఛన్ పొంది, కొత్త జాబితాలో పేర్లు లేనివారు విలపిస్తున్నారు. తామె లా బతికేదంటూ రోడ్డెక్కుతున్నారు. జి ల్లాలో గత నెల ఎనిమిదిన పింఛన్ల పం పిణీ ప్రారంభమైనా 61 మందికే అందజేశారు. ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆసరా పథకం లబ్ధిదారులకు న్యాయం చేకూర్చలేకపోయింది. అధికారులు దర ఖాస్తుదారుల పరిశీలనలో అయోమయానికి గురవుతున్నారు. అర్హులను గుర్తించడంలో తప్పులు దొర్లుతున్నాయి. సాంకేతిక కారణాల తో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అర్హులను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. మోర్తాడ్, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాలలో పరిశీలన నత్తనడకన సాగుతుంది. అక్టోబర్ 30లోగా దరఖా స్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని భావించారు. ఆచరణలో ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ తేదీని నవంబరు ఆరు వరకు పొడిగించారు. ఎనిమిద వ తేదీ నుంచి పింఛన్లు అందించాలని నిర్ణయించారు. అది కూడా సాధ్యం కాలేదు. ఇపుడు ఆ గడువును ఈనెల 15 వరకు పొడిగించారు. మండల, పట్టణ, నగర స్థాయిలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా గందరగోళం మాత్రం తొలగడం లేదు. నగర పరిధిలోనూ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పింఛన్ల పరిశీలన నేటికీ వరకు కొనసాగుతోంది. ఇక్కడ పింఛన్ల కోసం 35 వేల దరఖాస్తులు, ఆహార భద్రత కార్డుల కోసం 86 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన నేటి వరకు ముగియలేదు. కేవలం 60 శాతం పరిశీలన మాత్రమే జరిగింది. దీంతో పింఛన్ల పంపిణీ జరుగలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 3,67,101 మంది పింఛన్‌దారులు ధరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అ నంతరం అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్లో కంప్యూటరీకరించా ల్సి ఉంది. వీటి కోసం కంప్యూటర్ కౌంటర్లు ఏర్పాటు చేసినా దరఖాస్తులు ఇంకా పూర్తిగా రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచి పోయిం ది. వృద్ధాప్య పింఛన్లలో వయసు నిర్ధార ణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో చాలా మంది అర్జీలు వయసు తక్కువ అంటూ తిరస్కారానికి గురయ్యాయి. వితంతు పింఛన్ల విషయంలో భర్త మరణ ధ్రువీక రణ పత్రం కావాలంటూ, ఆసుపత్రికి రావాలంటూ కొంతమందికి కత్తెర పెట్టారు. ఇక వికలాంగులకు సదరం ఐడి నంబర్ ఉంటేనే పింఛన్ ఇస్తామంటూ గొళ్లెం తగిలేశారు. సదరం శిబిరానికి హజరైన ఇంకా 30 శాతం మందికి ధ్రువీకరణ పత్రాలు అందాల్సి ఉంది. ఆగని ఆందోళనలు గత కొన్ని రోజులుగా జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం పింఛన్ల కోసం గాంధారిలో వృద్ధులు ధర్నా, రాస్తారోకో చే పట్టారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందలో వృద్ధులు, వికలాం గు లు, వితంతువులు ఆందోళన నిర్వహించారు. సోమవారం దోమకొండ మండలం బీబీపేటకు చెందిన వికలాంగుడు లోకేశ్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. ఇంతకు ముందు ధర్పల్లి మం డ లంలో రెండుసార్లు ఎల్లారెడ్డిపల్లి, అంసాన్పల్లి గ్రామాలకు చెందిన పం డుటాకులు రాస్తారోకో నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామ పంచాయతీని గత నెలలో ముట్టడించారు. ఆర్మూర్‌లో అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించారు. కల్లెడ, ఢీకంపల్లి గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు మాక్లూర్ మండల కార్యాలయానికి తాళం వేసి నిజామాబాద్-నందిపేట రోడ్డుపై బైఠాయించారు. ఇదే మండలం అడవిమామి డిపల్లి లో నిరసన వ్యక్తం చేశారు. కోటగిరి మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఎల్లారెడ్డికి చెందిన పింఛన్‌దారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రలో రాస్తారోకో చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో నిరసనలు కొనసాగాయి. -
‘సమగ్ర’ నమోదు వివాదం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం కలిగించాయి. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆమె నవీపేట మండలం పోతంగల్లో, హైదరాబాద్‌లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఆగ్రహం చెందిన తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ వర్గాలు టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం, బుధవారం జరిగిన చర్చలో అదే అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో అసెంబ్లీలోనూ ఉద్రిక్తతకు దారి తీసింది. అట్టుడికించిన ‘సమగ్ర సర్వే’ వివాదం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా రాష్ర్టవ్యాప్తంగా ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అనేక కష్టనష్టాలకోర్చి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల వివాదాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే క్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత నవీపేట మండలం పోతంగల్తోపాటు హైదరాబాద్‌లోను నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తాను పోతంగల్లోనే పేరు నమోదు చేసుకున్నానని కవిత స్పష్టం చేశారు. జిల్లా అధికారులు కూడా అదే నిజమని ఆధారాలతో సహా వెల్లడించారు. అప్పట్లో నాలుగైదు రోజులు ఈ వివాదం కొనసాగి, ఆ తర్వాత సద్దుమణిగింది. తాజాగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్బంగా టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి కవిత పోతంగల్, హైదరాబాద్‌లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారని ప్రస్తావించడం, దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, కొండా సురేఖ తదితరులు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని పట్టుపట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో లేని ఓ మహిళా నేతపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నిరసన వ్యక్తమయింది. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం సమగ్ర సర్వేలో ఎంపీ కవితనే రెండు చోట్ల పేరు నమోదు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి తీరును టీడీపీ సభ్యులు సమర్థించగా, మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కవితపై వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేదని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పత్రికలలో వచ్చిన వాటిని పట్టుకొని విమర్శించడం తగదని టీడీపీ సభ్యులకు హితవు పలికారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఎంపీని అవమానిస్తారా?
* ఎంపీ కవితపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డిపై అధికారపక్షం ధ్వజం * టీడీపీ సభ్యుడుక్షమాపణలు చెప్పాలని డిమాండ్ * ముందుగా కేటీఆర్‌పై సభాహక్కుల నోటీసుకు చర్య తీసుకోవాలన్న టీడీపీ * రెండు పార్టీల ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: పాలక, విపక్షాల వాదోపవాదాలు, నిరసనల మధ్య శాసనసభ దద్దరిల్లింది. నిజామాబాద్ ఎంపీ కవితపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ సభ్యుల నిరసనకు, ఉద్రిక్తతకు దారితీసింది. సమగ్ర కుటుంబ సర్వేలో ఎంపీ కవిత రెండు చోట్ల తన పేరును నమోదు చేసుకున్నట్లు మంగళవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. దీనిపై బుధవారం అసెంబ్లీలో దుమారం రేగింది. రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారని, నిజామాబాద్ ఎంపీకి, అసెంబ్లీ సభ్యులందరికీ ఆయన క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీనిపై ఏమాత్రం తొణకని టీడీపీ సభ్యులు.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే ముందు మంత్రి తారకరామారావుపై ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పట్టుపట్టారు. దీంతో ఇరుపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికింది. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే మరే అంశాన్నైనా ప్రస్తావించాలని అధికారపక్షం పట్టుబట్టడంతో రెండు గంటల పాటు సభ స్తంభించిపోయింది. రేవంత్‌రెడ్డి చేసిన అభియోగాలకు సంబంధించి వివిధ పార్టీల నేతల అభిప్రాయాలను స్పీకర్ కోరారు. అవి తప్పుడు అభియోగాలైతే.. భేషజానికి పోకుండా వాటిని ఉపసంహరించుకోవాలని వారంతా సూచించారు. అంతకుముందు సాధారణ బడ్జెట్‌పై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత రేవంత్‌రెడ్డి ప్రసంగించాల్సి ఉంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై సభా ఉల్లంఘన నోటీసును ప్రస్తావించే సమయంలోనే.. టీఆర్ఎస్ సభ్యురాలు గొంగడి సునీత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ఎంపీ కవిత అంశాన్ని లేవనెత్తారు. తాత జాగీరా?: మంత్రి ఈటెల ఎంపీలు, ఎమ్మెల్యేలపై మాట్లాడే ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందని, అయితే నోటీస్ ఇవ్వకుండానే రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. దీంతో వివాదం ఒక్కసారిగా రాజుకుంది. వాగ్వాదాల మధ్య సభను పదినిమిషాల పాటు స్పీకర్ వాయిదావేశారు. కేటీఆర్‌పై సభా హక్కుల నోటీస్‌కు పట్టు సభ తిరిగి ప్రారంభం కాగానే మంత్రి కేటీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అంశాన్ని రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రస్తావించారు. సభ్యుల వ్యాఖ్యల మధ్యే సభను స్పీకర్ మరోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ మొదలుకాగానే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..క్రైస్తవ మైనారిటీ సభ్యులను అసెంబ్లీకి నామినేట్ చేసినట్లు ఈ ఎమ్మెల్యేలను ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిందని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మంగళవారం సభలో వ్యాఖ్యానించటం ప్రజలను, తమను, స్పీకర్‌ను అవమానపరటమేనన్నారు. సభాహక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకుని కేటీఆర్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఎంపీలపై ఆరోపణలు చేసే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో ఉన్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు. అయితే తాము ఇదివరకే స్పీకర్ అనుమతి తీసుకున్నందున మంత్రి కేటీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన అంశాన్ని మొదట తీసుకోవాలని రేవంత్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ మధుసూదనాచారి గురువారానికి వాయిదా వేశారు. -
‘సర్వే’తో సాధించిందేమిటి?
సమగ్ర కుటుంబ సర్వేపై విపక్షాల ధ్వజం ప్రశ్నోత్తరాల్లోనే అధికార విపక్షాల వాగ్వివాదం హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే అంశంపై మంగళవారం శాసనసభ అట్టుడికింది. దీనిపై ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించడంతో వాడివేడిగా చర్చ జరిగింది. సమగ్ర సర్వేతో సాధించిందేమిటని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రాన్ని నిర్బంధించారు..: టీడీపీ తొలుత ఈ అంశంపై టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... సమగ్ర సర్వే పేరిట రాష్ట్రాన్ని 12 గంటల పాటు నిర్బంధించారని వ్యాఖ్యానించారు. ‘‘సంక్షేమ పథకాలన్నింటికీ సర్వేనే ఆధారమని చెప్పడంతో వలస వెళ్లిన లక్షలాది మంది పేదలు సొంతూళ్లకు రావాల్సి వచ్చింది. రవాణా వ్యవస్థను నిలిపేసిన ప్రభుత్వం వైన్‌షాపులను ఎందుకు తెరిచి ఉంచింది. రూ. 20 కోట్ల ఖర్చుతో 12 గంటల్లో సర్వే చేస్తే.. వంద శాతం ఫలితాలు వస్తాయా..?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్వేలో రెండు సార్లు నమోదు చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారని, మరి నవీపేట మండలం పోతంగల్లో, హైదరాబాద్‌లోనూ నిజామాబాద్ ఎంపీ వివరాలు నమోదైతే చర్యలు తీసుకోలేదేమని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీకి అర్జీలు తీసుకుంటున్న ప్రభుత్వం.. వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఆడపడుచులను అవమానపరిచేలా ఆదేశాలు జారీ చేసిందని... మహిళలను అవమానించినందుకు ప్రభుత్వాన్ని రోడ్డుపై నిలబెట్టి రాళ్లతో కొట్టాలని అన్నారు. మీసేవ ద్వారా అవకాశమివ్వాలి: మజ్లిస్ హైదరాబాద్‌లో 25 శాతం మంది సర్వే పరిధిలోకి రాలేదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. వారిని మళ్లీ ఎప్పుడు సర్వే చేస్తారని ప్రశ్నించారు. ‘‘ప్రజలు తమ సమాచార నమోదు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు లేదా వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించాలి. సర్వే ఆధారంగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారికి సంక్షేమ పథకాలు నిరాకరిస్తే ఒప్పుకోబోం. సర్వే వివరాలను ప్రభుత్వం సభ ముందు పెట్టాలి..’’ అని అక్బరుద్దీన్ కోరారు. విద్యుత్‌పై తీర్మానం కాపీని ఉర్దూలో అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఉర్దూలో ప్రతులను అందజేస్తామన్నారు. కాగా.. సర్వేలో దొర్లిన తప్పులను ఎలా సరి చేస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రశ్నించారు. ఇదే ప్రామాణికం కాదు: ఈటెల విపక్ష సభ్యులు ప్రశ్నలకు మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిస్తూ.. సర్వేకు ప్రభుత్వం రూ. 20 కోట్లు ఖర్చు చేసిందని, 1.27 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించామని చెప్పారు. సర్వేలో మిగిలిపోయిన కుటుంబాల వివరాలను తిరిగి నమోదు చేస్తామన్నారు. ‘‘తెలంగాణలో ఆర్థిక,సామాజిక,విద్య,వైద్య ఉపాధి, స్థితిగతులు తెలుసుకునేందుకే సర్వే చేశాం. ఒక్క రోజులో చేపట్టిన ఈ సర్వేతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఇది ఎలా సాధ్యమైందని ప్రధాని మోదీ కూడా కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. చాలా మందికి సొంత గ్రామాలతో పాటు నగరాల్లో ఓటరు కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. వీటన్నింటిని సరిచేయాలనే సర్వే చేశాం. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకుంటాం. కానీ అది ప్రామాణికం కాదు..’’ అని ఈటెల పేర్కొన్నారు. కాగా.. సర్వే ప్రకారం ఏయే వర్గాల జనాభా ఎంతో చెప్పాలని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ పట్టుబట్టడంతో ఈటెల వివరాలు వెల్లడించారు. సర్వే ప్రకారం తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5%, ఎస్టీ జనాభా 9.91%, బీసీలు 51.09%, ఓసీలు 21.5% ఉన్నట్లు చెప్పారు. అన్నివర్గాల్లో కలపి మైనారిటీలు 14.46 శాతంగా ఉన్నారని తెలిపారు. -
జనాభాలో మహిళలే అధికం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో 27,90,069 మంది జనాభా ఉన్నట్లుగా లెక్క తేలింది. ప్రభుత్వం ఆగస్టు 19న నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో 25,27,849 మంది వివరాలు ‘కుటుంబ సర్వే వెబ్సైట్లో నిక్షిప్తం అయ్యాయి. మిగతా 2,62,220 మంది వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం కావాల్సి ఉంది. 25,27,849 మంది జనాభాలో పురుషులు 12,51,672 మంది ఉండగా, స్త్రీలు 12,66,498 మంది ఉన్నారు. దీని ప్రకారం చూసుకుంటే జనాభాలో పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా 21,62,982 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మిగతా వారికి లేవు. జిల్లా వ్యాప్తంగా 8,28,042 ఇళ్లు సర్వేలో వెల్లడి కాగా, 7,58,678 ఇళ్లు కంప్యూటర్లో నిక్షిప్తం అయ్యాయి. జిల్లా జనాభా ఇలా.. కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలోని ఐదు డివిజన్లు ఉండగా, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలోని జనాభాలో మహిళలే అధికంగా ఉన్నారు. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో 5,46,427 మంది జనాభా ఉండగా, ఇందులో 2,78,053 మంది పురుషులు, 2,68,374 మంది స్త్రీలు ఉన్నట్లు తేలింది. డివిజన్లో మొత్తం 1,60,196 ఇళ్లకు గాను 5,46,427 మంది జనాభా ఉన్నట్లు లెక్కతేలింది. ►ఉట్నూర్ డివిజన్ పరిధిలో 3,14,974 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1,57,672 మంది పురుషులు, 1,57,302 మంది స్త్రీలు ఉన్నారు. డివిజన్లో 72,551 ఇళ్లు ఉన్నాయి. ►ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం 4,11,626 మంది జనాభా ఉండగా, ఇందులో 2,06,733 పురుషులు, 2,04,893 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం 1,21,534 ఇళ్లు ఉన్నట్లు లెక్కతేలింది. ►నిర్మల్ డివిజన్ పరిధిలో 5,34,285 మంది జనాభాకు 2,61,550 పురుషులు, 2,72,735 మంది స్త్రీలు ఉన్నారు. కాగా, డివిజన్లో 1,66,777 ఇల్లు ఉన్నాయి. ►మంచిర్యాల డివిజన్ పరిధిలో 7,20,537 మంది జనాభా ఉండగా, 3,57,343 మంది పురుషులు, 3,63,194 మంది స్త్రీలు ఉన్నారు. డివిజన్లో మొత్తం 2,37,623 ఇల్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. 3,64,867 మంది ఆధార్ కార్డులు లేవు ►జిల్లాలో సుమారు లక్ష మందికిపైగా ఆధార్ కార్డులు లేవు. కంప్యూటర్లో నమోదైన సర్వే వివరాల ప్రకారంగా 99,743 మందికి ఆధార్ కార్డులు లేవు. ►ఆదిలాబాద్ డివిజన్లో మొత్తం 5,46,427 మంది జనాభాలో 4,36,680 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. 1,09,747 మంది కార్డులు లేవు. ►ఉట్నూర్ డివిజన్లో మొత్తం 3,14,974 మంది జనాభా ఉండగా, 2,69,827 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇంకా 45,147 మంది కార్డులు లేనట్లుగా లెక్కతేలింది. ►ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం 4,11,626 మంది జనాభా ఉండగా, 3,55,929 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇంకా 55,697 మంది కార్డులు లేవు. ►నిర్మల్ డివిజన్ పరిధిలో 5,34,285 మంది జనాభా ఉండగా, 4,55,769 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మిగతా 78,516 మందికి ఆధార్ కార్డులు లేవు. ►మంచిర్యాల డివిజన్లో 7,20,537 మంది జనాభా ఉండగా, 6,44,777 మందికి ఆధార్ కార్డులు ఉన్నట్లు, ఇంకా 75,760 మంది ఆధార్ కార్డులు లేనట్లుగా లెక్క తేలింది. -
సర్వేలో నిరాధార్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తయింది. కుటుంబాల సమగ్ర సమాచారాన్ని కంప్యూటరీకరించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. శనివారం నాటికి ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చిన యంత్రాంగం.. సర్వే రోజున మిగిలిపోయిన (ప్రి విజిట్‌లో ఇంటి నంబర్లు ఇవ్వని) కుటుంబాల వివరాలను కూడా నమోదు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో సర్వే ఫారాల కొరత కారణంగా జిరాక్స్ కాపీల్లో నమోదు చేసిన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీచేయడంతో అధికారయంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సర్వే కంప్యూటరీకరణలో ఆధార్ విషయమై ఆసక్తికర విషయం వెలుగు చూసింది. దాదాపు 7.89 లక్షల మంది తమ ఆధార్ వివరాలను ఇవ్వలేదు. గత నెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంట్లో కేవలం గ్రేటర్ పరిధి మినహా మిగతా ప్రాంతంలో సర్వే నిర్వహణ బాధ్యతలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ సర్వేలో జిల్లావ్యాప్తంగా 8.41 లక్షల కుటుంబాలు వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. ఈ డేటాను గత వారం రోజులుగా కంప్యూటరీకరిస్తున్న ఆపరేటర్లు.. శనివారం ఈ ప్రక్రియకు ముగింపు పలికారు. తొలినాళ్లలో రోజుకు 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నిక్షిప్తం చేసిన సిబ్బంది.. దీన్ని లక్షకు చేర్చారు. దీంతో కంప్యూటరీకరణ మూడు రోజుల ముందుగానే ముగిసింది. ఇదిలావుండగా, అనివార్య పరిస్థితుల్లో సర్వే రోజున అందుబాటులో లేని (డోర్‌లాక్) కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాయి. లెక్కతప్పిన ఆధార్ ఆధార్ కార్డుల జారీలో రాష్ర్టంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 110 శాతం ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే, సమగ్ర సర్వేలో ఆధార్ వివరాలు మాత్రం లెక్క తప్పాయి. కుటుంబ సభ్యుల సంఖ్యకు ఆధార్ కార్డుల జారీకి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలో 27,77,742 మంది వివరాలను కంప్యూటరీకరించగా, దీంట్లో 7,89,868 మంది తమ ఆధార్ వివరాలను సర్వేలో పొందుపరచలేదు. ఆధార్ సమాచారం సర్వేలో నమోదు కాకపోవడానికి జిల్లా యంత్రాంగం.. పలు రకాలుగా విశ్లేషిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52.96 లక్షలు. అయితే, ఆధార్ కార్డులు మాత్రం దీనికి పది లక్షల మేర అదనంగా జారీ అయ్యాయి. దీంట్లో నాలుగు లక్షల కార్డులను యూఐడీఐ తిరస్కరించింది. కాగా, తాజాగా నిర్వహించిన సమగ్ర సర్వేలో ఆధార్ యూఐడీ నంబర్‌ను విధిగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒకవేళ ఆధార్ కార్డు అందకపోతే మాత్రం ఈఐడీ నంబర్‌ను పొందుపరచవద్దని స్పష్టం చేసింది. ఇది కూడా సర్వేలో ఆధార్ సంఖ్య తక్కువ నమోదు కావడానికి ఒక కారణంగా యంత్రాంగం చెబుతోంది. గ్రామీణ మండలాల్లో కార్డులను పోగొట్టుకున్నా, ఎక్కడ భద్రపరుచుకున్నా, సమయానికి దొరకకపోయినా విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కాకపోవచ్చని అంటోంది. అదే సమయంలో ఆధార్ కార్డు(యూఐడీ) జారీలో జరిగిన జాప్యం కూడా సర్వేపై ప్రభావం చూపే అవకాశంలేకపోలేదని పేర్కొంటోంది. ఈ కారణాల వల్లే కుటుంబసభ్యుల సంఖ్యకు ఆధార్ కార్డుల వివరాల నమోదుకు భారీ తేడా కనిపిస్తోందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
8లోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ: సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను ఈ నెల 8లోగా కంప్యూటర్లో ఎంట్రీ చేయాలని జాయింట్ కలెక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సంబంధిత అధికారుల సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ, జిల్లాలోని 46 మండలాలకు గాను జహీరాబాద్, కల్హేర్, కోహీర్, నారాయణఖేడ్, న్యాల్కల్ మండలాల్లో డాటా ఎంట్రీ మందకొడిగా సాగుతుండటం పట్ల జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ తేదీలోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే డాటా ఎంట్రీ ఆపరేటర్లను పెంచుకోవడంతో పాటు అధిక సమయాన్ని కేటాయించి పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషాతో పాటు వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు పాల్గొన్నారు. డాటా ఎంట్రీని పరిశీలించిన జేసీ సంగారెడ్డి రూరల్: కంది శివారులోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శరత్ శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో 8 లక్షల 65 వేల నివాసాల్లో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని, అందుకు డాటా ఎంట్రీలో అప్రమత్తత అవసరమని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. జేసీతోపాటు తహశీల్దార్ రాధాబాయి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. -
సిబ్బంది లేరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లా యంత్రాంగానికి మరో తలనొప్పి వచ్చిపడింది. సర్వే ప్రక్రియలో సిబ్బంది కొరతతో సతమతమైన యంత్రాంగం.. చివరకు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులను వినియోగించుకుని పరిస్థితిని గట్టెక్కించింది. తాజాగా ఈ సర్వే వివరాల కంప్యూటరీకరణకు కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్లు కరువయ్యారు. వివరాల నమోదు ప్రక్రియ మొదలుపెట్టి ఐదురోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాలకు సంబంధించి మాత్రమే నమోదు పూర్తయింది. మరోవైపు సర్కారు విధించిన గడువు ముంచుకొస్తుండగా.. నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం తో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆరు శాతమే! జిల్లాలోని గ్రామీణ ప్రాంతాన్ని మాత్రమే యంత్రాంగం సర్వే చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని జిల్లా పరిధినంతా జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేశారు. అయితే గ్రామీణ ప్రాంతంలో దాదాపు ఎనిమిది లక్షల కుటుంబాలను సర్వే చేయగా.. వాటిని ప్రస్తుతం కంప్యూటర్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను శివార్లలోని ఇంజినీరింగ్ కళాశాలలను నమోదు కేంద్రాలుగా ఎంపిక చేశారు. అక్కడ కంప్యూటర్లు అందుబాటులో ఉండడంతో ప్రక్రియ సులభతరమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల నమోదుకు రెండువేల కంప్యూటర్లు వినియోగించేలా ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు అధికారులు విజయవంతంగా ప్రక్రియను పూర్తిచేశారు. కానీ అసలు చిక్కంతా డాటా ఎంట్రీ ఆపరేటర్ల అంశంలో వచ్చిపడింది. రెండువేల మంది ఆపరేటర్లను వినియోగించుకుని రెండువేల కంప్యూటర్ల ద్వారా నమోదు చేయాలని అధికారుల భావించినా.. కేవలం తొమ్మిది వందల మంది ఆపరేటర్లు మాత్రమే లభించారు. అందుబాటులో ఉన్న ఆపరేటర్లతో నమోదు ప్రక్రియ చేపట్టగా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం ఆరుశాతం మాత్రమే పూర్తిచేయడంతో అధికారగణం ఆందోళన చెందుతోంది. గడువులోగా కష్టమే.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియంతా సెప్టెంబర్ రెండోతేదీ నాటికి పూర్తిచేయాలని సర్కారు స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో ఈనెల 22 నుంచి నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించింది. అయితే జిల్లాలో మాత్రం కంప్యూటర్ల నిర్వహణలో సమస్య తలెత్తడంతో కొంత జాప్యం జరిగింది. ఫలితంగా మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో నమోదు ప్రక్రియ ప్రారంభించగా.. ఇప్పటివరకు 50వేల ఫారాలను కంప్యూటరీకరించారు. సగటున రోజుకు 25వేల దరఖాస్తులు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సర్కారు విధించిన గడువు నాటికి కేవలం 25శాతం మాత్రమే పూర్తవుతుందని తె లుస్తోంది. మరోవైపు డాటాఎంట్రీ ఆపరేటర్ల సంఖ్య పెంచేందుకు యంత్రాంగం ప్రత్యేక తాయిలాలు ప్రకటిస్తోంది. ప్రస్తుతం డాటా ఎంట్రీ చేస్తున్న ప్రభుత్వం సంబంధిత ఉద్యోగులకు ఒక్కో దరఖాస్తుకు రూ.5 చెల్లిస్తుండగా.. ప్రైవేటు సిబ్బందికి రూ.10వరకు చెల్లిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆపరేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ పదో తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలి
కామారెడ్డిటౌన్ : ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని కంపూట్యర్ ఆపరేటర్లు నిశితంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్ సూచించారు. స్థానిక ఆర్కే డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కామారెడ్డి డివిజన్ సమగ్ర సర్వే ఆన్లైన్ నమోదును సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఎటువంటి తప్పులు జరుగకుండా కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని, లేని పక్షంలో అర్హ్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోతారని అన్నారు. సర్వే విజయవంతం కావాలంటే ఈ ఘట్టమే ప్రధానమన్నారు. అధికారులు దగ్గరుండి నమోదు చేయించాలని ఆయన ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని స్థానిక అధికారుల ద్వారా సేకరించాలన్నారు. ఆపరేటర్లు తమ సొంత నిర్ణయం తీసుకోకుండా సూపర్వైజర్లు, వీఆర్వోల సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 32 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో కొత్తగా 40వేల కుటుంబాలు నమోదు చేసుకున్నారని, ఇంకా సు మారు 10 వేల కుటుంబాలు నమోదు కావాల్సి ఉం దని తెలిపారు. నమోదు కాని కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు చేపడుతామన్నారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలున్నాయని వాటిని వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆపరేటర్ల వివరాల రిజిష్టర్లను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కంప్యూటర్ ఆపరేటర్లతో కాసేపు ముచ్చటించారు. జాగ్రత్తగా సర్వే వివరాలను నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జయదేవ్ ఆచార్య , తహశీల్దార్ గఫర్‌మియా, వీఆర్వోలు తదితరులున్నారు. -
ఫోన్ చేస్తారు..సమాచారం సేకరిస్తారు
సాక్షి, మంచిర్యాల :తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైన నేపథ్యంలో తదుపరి దశల్లోనూ సర్కారు అదే స్పష్టతతో ముందుకెళ్తోంది. ఒక్కరోజే సర్వే చేయడం ద్వారా అక్రమాలకు తావు లేని విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా సర్వే ఫారాల క ంప్యూటరీకరణకు ముందు సైతం వివరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ మార్కుతో ఉన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు ఓ అధికారి వివరించారు. నోడల్ అధికారులుగా సర్వే బాధ్యతలు నిర్వర్తించిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, అగ్రికల్చర్ అధికారులు, ఎంఈవోలపై ఈ గురుతర బాధ్యత పెట ్టనున్నట్లు సమాచారం. ఈ నోడల్ అధికారులు సర్వే నమూనాలో నింపకుండా వదిలివేసిన వివరాలను లబ్ధిదారులు ఇచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా సేకరించనున్నారు. స్టార్.. స్టార్.. గ్యాస్ కనెక్షన్, విద్యుత్ మీటరు కనెక్షన్ నంబరు వంటి ‘స్టార్’ గుర్తు గల విషయాలను ప్రాధాన్య అంశాలుగా తీసుకోనున్నారు. స్టార్ గుర్తున్న వివరాలు పూర్తి చేయని పక్షంలో సర్వే ఫామ్‌లో పేర్కొన్న సెల్‌ఫోన్‌కు కాల్ చేసి వాటిని తెలుసుకొని పెన్సిల్ ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ విధంగా సర్వే జరిగిన అన్ని కుటుంబాల వివరాల విషయమై నోడల్ అధికారి పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్‌లోని అన్ని వివరాలు సమగ్రంగా ఉంటేనే ఆ కుటుంబ వివరాలను అప్డేట్ చేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. ఈ వివరాలను కంప్యూటరీకరణ చేసిన తర్వాత సైతం థర్డ్‌పార్టీ తనిఖీ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిల్లాస్థాయి అధికారి ఒకరు వివరించారు. ఈ క్రమంలోనే సర్వే ఫామ్‌లోని వివరాలను క్షేత్రస్థాయి తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఫామ్‌ల కంప్యూటరీకరణ ప్రక్రియను సైతం పరిశీలించే అవకాశాలున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. -
తెలంగాణ సర్వే దెబ్బకు ‘పవర్లూమ్’ అతలాకుతలం
సాక్షి, ముంబై: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే భివండీ పవర్లూమ్ పరిశ్రమలను అతలాకుతలం చేసింది. వేలమంది తెలంగాణ కార్మికులు భివండీలోని పవర్లూమ్ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. సర్వే కారణంగా కార్మికులంతా తెలంగాణలోని సొంతగ్రామాలకు వెళ్లిపోయారు. ఇంకా కార్మికులు పరిశ్రమలకు చేరుకోకపోవడంతో పవర్లూమ్ పరిశ్రమలు వెలవెలబోయాయి. సర్వేకు పట్టణంలోని సుమారు 50 వేల మంది ప్రజలు తరలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిపై ఆధారపడి ఉన్న పరిశ్రమలు, తదితర వ్యాపారాలపై భారీ ప్రభావం పడుతోంది. కేసీఆర్ తెలంగాణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించినట్లయితే భివండీలో స్థిరపడ్డ గుజరాతి, ముస్లిం, మార్వాడీ, మరాఠీ వ్యాపారాలు దెబ్బతింటాయని పలువురు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భివంఢీ నుంచి తెలంగాణ బాట భారతదేశ మాంచస్టర్గా పేరు గాంచిన భివండీ పట్టణంలో భారీ సంఖ్యలో పవర్లూమ్ పరిశ్రమలు మూతపడ్డాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్ వివిధ జిల్లాల ప్రజలు ఉపాధి కోసం భివండీ వచ్చి స్థిరపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇక్కడ స్థిరపడ్డ ప్రజలతో పాటు ఒంటరిగా వచ్చిన కార్మికులు కూడా ఈ నెల 15 నుంచి తెలంగాణ బాట పట్టారు. ఈ నెల 29న వినాయక చవితి పండుగ ఉండడంతో కొందరు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో అక్కడే ఆగిపోయారు. ఇప్పటికే పట్టణంలోని సుమారు 20 వేలకు పైగా పవర్లూమ్ యంత్రాలు నిలిచిపోయాయి. నిత్యం లక్ష రూపాయల నష్టపోతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు.