Cricket World Cup 2019
-
ప్రపంచకప్‌లో కింగ్ కోహ్లి పేరిట ఎవరికీ సాధ్యంకాని ప్రపంచ రికార్డు
ప్రపంచకప్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఓ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2019 వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. అప్పటివరకు ప్రపంచకప్ టోర్నీల్లో ఏ కెప్టెన్ ఈ ఘనతను సాధించలేదు. నాటి వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 18 పరుగులు మాత్రమే చేసి ఔటైన కోహ్లి ఆతర్వాత జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి ఇరగదీశాడు. ఆస్ట్రేలియాపై 82, పాకిస్తాన్‌పై 77, వెస్టిండీస్‌పై 72, ఆఫ్ఘనిస్తాన్పై 77, ఇంగ్లండ్‌పై 66 పరుగులు చేసిన కోహ్లి ఈ వరల్డ్‌కప్‌లో సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. వరల్డ్‌కప్ టోర్నీల్లో కెప్టెన్ హోదాలో వరుస హాఫ్ సెంచరీ రికార్డు గతంలో ఆస్ట్రేలియా ఆరోన్ ఫించ్, సౌతాఫ్రికా గేమ్ స్మిత్ పేరిట ఉండింది. వీరిద్దరు వరల్డ్‌కప్ టోర్నీల్లో కెప్టెన్లుగా వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేశారు. ఇదిలా ఉంటే, 2023 ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌తో ఈ వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్ అవుతుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. ఈనెల 14న టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
గత వరల్డ్‌కప్‌లో ఉన్న ఏడుగురు ఈసారి జట్టులో లేరు.. వారెవరంటే..?
వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం భారత సెలెక్టర్లు ఇవాళ (సెప్టెంబర్ 5) టీమిండియాను ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. యువకులు, అనుభవజ్ఞులతో ఈ జట్టు సమతూకంగా ఉంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చహల్‌లకు అందరూ ఊహించినట్టుగానే మొండిచెయ్యి ఎదురైంది. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. గత వరల్డ్‌కప్‌లో ఆడిన సగం మంది సభ్యులు (ఏడుగురు) ప్రస్తుతం ప్రకటించిన జట్టులో లేరు. అలాగే టీమిండియాకు కెప్టెన్ కూడా మారాడు. 2019 ప్రపంచకప్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లి సారథ్యం వహించగా.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే 2023 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. గత వరల్డ్‌కప్ ఆడిన ఎంఎస్ ధోని పూర్తిగా ఆట నుంచి తప్పుకోగా.. శిఖర్ ధవన్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్‌లు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వీరి స్థానల్లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. ఈ ఏడుగురికి ఇది తొలి వరల్డ్‌కప్ కావడం విశేషం. వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్. -
టీషర్ట్‌ను వేలం వేద్దామనుకుంటున్నా
-
కరోనా: ప్రముఖ బ్యాట్స్‌మన్ టీషర్ట్ వేలం!
లండన్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ కరోనా బాధితుల సహాయార్థం ముందుకొచ్చారు. 2019 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తాను ధరించిన టీషర్ట్‌ను వేలం వేసి.. ఆ మొత్తాన్నికరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న లండన్‌లోని రెండు ఆస్పత్రులకు అందిస్తానని చెప్పారు. ఈమేరకు ట్విటర్లో ఆయన ఓ వీడియో పోస్టు చేశారు. ‘ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో నేను ధరించిన టీషర్ట్‌ను వేలం వేద్దామనుకుంటున్నా. వచ్చిన సొమ్మును లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్, హారెఫైడ్ ఆస్పత్రులకు అందిస్తాను. కోవిడ్-19 బాధితులకు సేవలందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులు తగినంత వైద్య పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంటి వద్దే ఉండండి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయండి.’అని బట్లర్ ట్విటర్లో పేర్కొన్నాడు. (చదవండి: కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం) ఇక మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా ఆస్పత్రుల వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. లార్డ్స్ మైదానంలో వారి వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. కాగా, యూకేలో ఇప్పటివరకు 25వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1500 మంది మృతి చెందారు. ఇదిలాఉండగా.. 2019 జులై 14న లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో.. సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఇంగ్లండ్‌కు ఇదే తొలి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ కావడం విశేషం. (చదవండి: పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్) -
అంతా పీడకలలా అనిపిస్తోంది
లండన్: ప్రపంచ కప్ విజేతగా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. ఫైనల్ మరుసటి రోజు దీనిపై కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారంగా స్పందించాడు. ‘నిరాశ మమ్మల్ని ఉప్పెనలా ముంచెత్తింది. ఉదయం లేచి చూస్తే పీడకల కన్నట్లుగా అనిపించింది. మా ఆటగాళ్లంతా నిజంగా చాలా బాధపడుతున్నారు. మ్యాచ్‌లో ఈ తరహాలో ఓడటం ఏదోలా ఉంది’ అని విలియమ్సన్ తన బాధను వ్యక్తీకరించాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కివీస్ కెప్టెన్... బౌండరీల లెక్క నిబంధనపై ఆచితూచి స్పందించాడు. ‘బౌండరీలను బట్టి విజేతను నిర్ణయించడం సరైందా అంటే నేను ఎప్పటికీ సమాధానం ఇవ్వలేను. నిజానికి ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని గానీ నేను జవాబు ఇవ్వాల్సి వస్తుందని గానీ అసలెప్పుడూ ఊహించలేదు. ఇంకా ఓటమి బాధలోనే ఉన్నాం. ఇరు జట్లు ఇంత కష్టపడిన తర్వాత బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది సిగ్గుచేటు’ అని అతను వ్యాఖ్యానించాడు. అయితే ఇంత జరిగినా అతను ఈ నిబంధనను విమర్శించడానికి ఇష్టపడకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ‘నిబంధనలు మొదటి నుంచి ఉన్నాయనేది వాస్తవం. కానీ ఇలాంటి నిబంధనతో మ్యాచ్ ఫలితం తేల్చాల్సి వస్తుందని బహుశా ఎవరూ ఊహించకపోవచ్చు. స్టోక్స్ బ్యాట్‌కు తగిలి ఓవర్‌త్రో వెళ్లడం కూడా అలాంటిదే. ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అందరూ దానిని బాగా ఆస్వాదించారు’ అని విలియమ్సన్ చెప్పడం విశేషం. ఫైనల్ ఫలితం తర్వాత భావోద్వేగాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ విలియమ్సన్... ‘ఇలాంటి స్థితిలో నవ్వడమో లేదా ఏడవడమో అనే ఒకే ఒక అనుభూతి ఉంటుంది. అయితే కొంత నిరాశ ఉన్నా నాకు కోపం మాత్రం లేదు’ అని విలియమ్సన్ స్పష్టం చేశాడు. -
వీధి రౌడీలా కాదు హీరోలా...
లండన్: బెన్ స్టోక్స్ అంటే అందరికీ రెండే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి మ్యాచ్‌ను చేజార్చిన వైనం... ఆ తర్వాత నైట్ క్లబ్ వద్ద ఒక వ్యక్తిని చితక్కొట్టిన ఘటన... కానీ ఇప్పుడు అతను ఒకేసారి ఈ రెండింటినీ మరచిపోయే ఘనతను సాధించాడు. ‘వీధిలో రౌడీలా గొడవకు దిగిన వ్యక్తిగా నేను గుర్తుండిపోదల్చుకోలేదు. మైదానంలో ఏదైనా సాధించిన వాడిగా ఉండాలనుకుంటున్నా. ప్రపంచ కప్ గెలిస్తే నా బయోడేటాలో అదే ముందుంటుంది’ అని మెగా టోర్నీకి ముందు చెప్పిన స్టోక్స్ చివరకు దానిని నిజం చేసి చూపించాడు. ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించి ఒకరకంగా అతను పాపపరిహారం చేసుకున్నాడు. టోర్నీలో ఐదు అర్ధ సెంచరీలు చేసిన స్టోక్స్... ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ అపూర్వం. క్లిష్టపరిస్థితుల్లో అజేయంగా 84 పరుగులు చేసిన స్టోక్స్ చరిత్రలో నిలిచిపోయాడు. ‘నాకు మాటలు రావడం లేదు. ఇక్కడికి చేరేందుకు గత నాలుగేళ్లుగా పడ్డ శ్రమ, ఇప్పుడు ప్రపంచ చాంపియన్లుగా నిలవడం అద్భుతంగా అనిపిస్తోంది’ అని ఫైనల్ అనంతరం స్టోక్స్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టి 12 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు వలస వెళ్లిన స్టోక్స్... ఇప్పుడు ఫైనల్లో కివీస్‌పైనే చెలరేగడం విశేషం. ‘న్యూజిలాండ్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడైనా ప్రత్యేకమే. అది గొప్ప జట్టు మాత్రమే కాదు. అందులో చాలా మంది మంచివాళ్లున్నారు. నా ఓవర్‌త్రో సిక్సర్ తర్వాత విలియమ్సన్కు నేను క్షమాపణ చెప్పా’ అని మ్యాచ్ అనంతరం స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కష్టకాలంలో జట్టు సహచరులు తనకు, తన కుటుంబానికి అండగా నిలవడం వల్లే మళ్లీ కోలుకొని ఇక్కడి వరకు రాగలిగాలని 28 ఏళ్ల స్టోక్స్ భావోద్వేగంతో చెప్పాడు. ఇప్పుడెవరికీ అతని నాలుగు సిక్సర్లు గానీ బ్రిస్టల్‌లో గొడవ కానీ గుర్తుకు రావు. ఇంగ్లండ్ చరిత్రలో గొప్ప ఆల్‌రౌండర్‌గా నిలిచిపోయిన ఇయాన్ బోథమ్ సహా మరెందరికో సాధ్యం కాని రీతిలో విశ్వ విజయంలో భాగమైన స్టోక్స్ ఇప్పుడు వారందరికీ సూపర్ హీరో మాత్రమే. -
అదృష్టం మా వైపు ఉంది!
లండన్: ప్రపంచ కప్‌ను గెలుచుకున్నామన్న ఆనందం నుంచి తాము ఇంకా బయటకు రాలేకపోతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పాడు. నాలుగేళ్ల శ్రమకు దక్కిన ఫలితమిదని మ్యాచ్ తర్వాత అతను వ్యాఖ్యానించాడు. ‘మేం గెలుపు గీత దాటడం ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. నాతో పాటు జట్టు సభ్యులందరూ ఒక ప్రణాళిక ప్రకారం అంకితభావంతో కష్టపడ్డాం. ఈ గెలుపు ప్రయాణం అద్భుతంగా సాగింది. టోర్నీ ఆరంభం నుంచి కూడా మాపై అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేయడం సంతోషంగా ఉంది’ అని మోర్గాన్ అన్నాడు. బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించిన నిబంధనపై మోర్గాన్ జాగ్రత్తగా స్పందించాడు. ‘ఇప్పుడు అమలు చేసిన పద్ధతి కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి. అప్పుడు ఈ రెండింటినీ పోల్చి ఏది మెరుగైందో నిర్ణయించవచ్చు. టోర్నీ నిబంధనలు చాలా కాలం క్రితమే రూపొందించారు. వాటిపై మన నియంత్రణ ఉండదు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్పష్టీకరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌పై మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. ‘స్టోక్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను మానవాతీతుడిలా ఆడి జట్టు గెలుపు భారాన్ని సమర్థంగా మోశాడు. బట్లర్ ఔటైన తర్వాత చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో అతను ఇన్నింగ్స్ నడిపించడం అసాధారణం’ అని మోర్గాన్ చెప్పాడు. ‘అల్లా కూడా మాతోనే’... మోర్గాన్ స్వదేశం ఐర్లాండ్ కాగా... అన్ని కలిసి రావడంపై అక్కడ ‘ఐరిష్ లక్’ పేరుతో బాగా ప్రాచుర్యంలో సామెత ఉంది. ‘ఐరిష్ లక్’ వెంట నడిచిందా అంటూ అడిగిన ప్రశ్నపై మోర్గాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నా సహచరుడు ఆదిల్ రషీద్‌తో మాట్లాడినప్పుడు అల్లా ఈ రోజు మనతో ఉన్నాడని చెప్పాడు. కాబట్టి నేను కూడా అల్లా మా జట్టుకు అండగా నిలిచాడని నమ్ముతున్నా. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో వేర్వేరు సంప్రదాయాలు, నేపథ్యాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. కానీ ఆటకు వచ్చేసరికి అంతా కలిసికట్టుగా ఆడి విజయం సాధించాం’ అని అతను విశ్లేషించాడు. భారత్‌లో జరిగే 2023 ప్రపంచకప్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, ప్రస్తుతం విశ్వ విజేతగా ఆనందాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు మోర్గాన్ చెప్పాడు. 6 కాదు 5 పరుగులు ఇవ్వాల్సింది! ఓవర్‌త్రోపై మాజీ అంపైర్ టఫెల్ అభిప్రాయం లండన్: ఓవర్ త్రో ద్వారా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్ ఫైనల్ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్ వేసిన ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ వైపు కొట్టిన స్టోక్స్ సింగిల్‌ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా స్టోక్స్ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చినా... అతని బ్యాట్‌కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పు పట్టారు. ‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ పిచ్‌పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్‌నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్ వివరించారు. అయితే తాను అంపైర్‌ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్‌పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్ అభిప్రాయపడ్డారు. ‘బౌండరీ’పై విమర్శల బాదుడు! ప్రపంచ కప్ ఫైనల్ ఫలితాన్ని బౌండరీల లెక్కతో తేల్చడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిని అత్యంత చెత్త నిబంధనగా పేర్కొంటూ మాజీ క్రికెటర్లు ఐసీసీపై విరుచుకుపడ్డారు. దీనికంటే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిందని కొందరు అభిప్రాయ పడగా, ఇలాంటి నిబంధనలు మార్చేయాలని మరికొందరు సూచించారు. ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ పరంగా చూస్తే 26–17 తేడాతో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ నెగ్గింది. ‘క్రికెట్లో కొన్ని నిబంధనలపై తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ –రోహిత్ శర్మ ‘అద్భుతంగా సాగిన మ్యాచ్‌లో ఫలితాన్ని బౌండరీల తేడాతో నిర్ణయించడం ఏమిటో అర్థం కాలేదు. అతి చెత్త నిబంధన ఇది. ‘టై’గా ప్రకటిస్తే బాగుండేది’ –గౌతం గంభీర్ ‘బౌండరీ నిబంధనకు నేను కూడా మద్దతివ్వను. కానీ రూల్స్ అంటే రూల్సే. ఎట్టకేలకు కప్ గెలిచిన ఇంగ్లండ్‌కు అభినందనలు’ –యువరాజ్ సింగ్ ‘అసలు ఎంత బాగా పని చేస్తున్నారో...అసలు ఐసీసీ అనేదే పెద్ద జోక్’ –స్కాట్ స్టయిరిస్ ‘ఐసీసీ నిబంధన వల్ల ఇంగ్లండ్ కప్ గెలవడం అసలే మాత్రం ఊహించలేనిది. ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తే బాగుండేది’ –బిషన్ సింగ్ బేడి ‘డక్‌వర్త్ లూయిస్ నిబంధన పరుగులు, వికెట్లపై ఆధారపడి ఉంది. కానీ ఫైనల్ ఫలితం మాత్రం బౌండరీల లెక్క ప్రకారం తీసుకుంటారా’ –డీన్ జోన్స్ ‘నా దృష్టిలో ఇలా విజేతను నిర్ణయించడం దుర్మార్గమైన పద్ధతి. ఇది మారాల్సిందే’ –బ్రెట్ లీ ‘చాలా బాధగా ఉంది. మేం మోసపోయినట్లనిపిస్తోంది. పిచ్చి నిబంధన. ఇది కూడా టాస్ వేసి విజేతను నిర్ణయించడంలాంటిదే’ –డియాన్ నాష్ ‘క్రూరత్వం’ –స్టీఫెన్ ఫ్లెమింగ్ -
సారీ న్యూజిలాండ్...
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచకప్ ఫైనల్లో పాత రూల్స్ అమల్లో ఉంటే ఇంగ్లండ్–న్యూజిలాండ్‌లు సంయుక్త విజేతలుగా నిలిచేవి. కానీ ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయిందంటే సగటు క్రికెట్ అభిమాని కూడా దానిని తమ పరాజయంగా భావిస్తున్నాడు. స్టోక్స్ బ్యాట్‌ను తాకి పోయిన 6 పరుగుల ఓవర్‌త్రో దురదృష్టమో, గప్టిల్ గ్రహచారం బాగా లేని రోజు కావడమో కానీ విలియమ్సన్ సేన విలపించాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఆట తర్వాత కూడా బౌండరీ లెక్కల త్రాసుతో ఇంగ్లండ్ పైచేయి కావడం బలవంతంగా కివీ రెక్కలు విరిచేసినట్లయింది. వరుసగా రెండోసారి కూడా న్యూజిలాండ్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి వెంటాడింది. అయితే ఆ జట్టు గొప్పతనాన్ని ఈ మ్యాచ్ ఫలితం తగ్గించలేదు. ప్రత్యర్థులపై మాటల దాడి చేయకుండా, దూషణలకు పాల్పడకుండా కూడా ప్రపంచ కప్‌లో గొప్ప విజయాలు సాధించవచ్చని ఆ జట్టు నిరూపించింది. కివీస్ క్రికెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మైదానంలో వారి ప్రవర్తన. తమదైన ఆటను ఆడుకుంటూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంలో వారికి వారే సాటి. ఫెయిర్ ప్లే అవార్డు అంటూ ఎప్పుడిచ్చినా ఈ మర్యాద రామన్నల బృందానికే దక్కడం పరమ రొటీన్. ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టంను మొదలు పెట్టింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అందరికంటే అతి తక్కువగా ఒకే ఒకసారి శిక్షకు గురైన జట్టు న్యూజిలాండ్. వారి ఆట ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇది చాలు. ఏ టోర్నీలో బరిలోకి దిగినా వారిని ‘అండర్డాగ్’గానే చూడడం అందరికీ అలవాటైపోయింది. డాగ్ ఏదైనా అసలైన రోజు కరవడం ముఖ్యం అని స్వయంగా విలియమ్సన్ చెప్పినట్లు రెండు అసలు మ్యాచ్‌లలో కివీస్ సత్తా చాటింది. సెమీస్‌లోనే భారత్ ముందు అసలు కివీస్‌ను ఎవరూ పెద్దగా లెక్క చేయలేదు. కానీ అద్భుత వ్యూహంతో ఆ జట్టు అనూహ్య విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరుకే పరిమితమైనా... పట్టుదలతో ఆడి టీమిండియాను నిలవరించగలిగింది. ఫైనల్లో కూడా నాలుగు ఇంగ్లండ్ వికెట్లు తీసిన తర్వాత విజయానికి బాటలు వేసుకున్న ఆ జట్టు అదే ఒత్తిడిని కొనసాగించలేకపోయింది. కెప్టెన్‌గా తొలి ప్రపంచ కప్‌లో బ్యాట్స్‌మన్‌గానూ తనదైన ముద్ర వేసిన విలియమ్సన్కు దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్ల నుంచి ఎక్కువ మద్దతు లభించలేదు. అదే చివరి పోరులో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేందుకు కారణమైంది. విలియమ్సన్ 82.57 సగటుతో ఏకంగా 578 పరుగులు చేయగా... రెండో స్థానంలో నిలిచిన టేలర్ మూడు అర్ధ సెంచరీలతో 350 పరుగులకే పరిమితమయ్యాడు. గత వరల్డ్‌కప్‌లో డబుల్ సెంచరీ సహా హీరోగా నిలిచిన గప్టిల్ ఘోర వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 186 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కివీస్ ఇక్కడి వరకు రాగలిగిందంటే పేస్ బౌలింగ్ త్రయమే కారణం. ఫెర్గూసన్ (21), బౌల్ట్ (17), హెన్రీ (14) కలిపి 52 వికెట్లు పడగొట్టారు. ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా ఓవర్‌కు ఐదుకు మించి పరుగులు ఇవ్వలేదంటే ఎంత నియంత్రణతో బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. 232 పరుగులు చేసిన నీషమ్ కూడా 15 వికెట్లతో అండగా నిలిచాడు. అయితే చివరకు బ్యాటింగ్ వైఫల్యమే కివీస్‌కు గొప్ప అవకాశాన్ని దూరం చేసింది. అఫ్గానిస్తాన్ మినహా టోర్నీలో 300 దాటని ఏకైక జట్టు న్యూజిలాండే. ఫలితంగా కివీస్ బృందం టైటిల్ కాకుండా మరోసారి హృదయాలు గెలుచుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
లార్డ్స్ నుంచి లార్డ్స్ వరకు...
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్ అద్భుతమైన వన్డే క్రికెట్ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్ జట్టు టాప్–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు. ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్‌కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెల్‌లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్‌రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్ ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్ వన్డేల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్ సేన తమ దేశంలో సంబరాలు పంచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని. పేరుకే క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా, వన్డే వరల్డ్ కప్ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్‌లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్‌కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్ టీమ్‌ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది. పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్‌కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్ కంటే కూడా ఇంగ్లండ్‌కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా, శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్‌ను గుర్తుకు తెచ్చింది. నిజంగా ఇంగ్లండ్ సెమీస్ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్‌పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్‌నూ ఓడించి దర్జాగా సెమీస్ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్‌లో తమ చేతిలో చిత్తయిన కివీస్‌పై ఫైనల్ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్‌నే ఓడించిన న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌కు తెలుసు. రసవత్తర ఫైనల్ దానిని నిజం చేసింది. చివరకు అశేష అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. ఇంగ్లండ్ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్‌స్టో (532 పరుగులు), జేసన్ రాయ్ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్ (556 పరుగులు), స్టోక్స్ (465 పరుగులు), బట్లర్ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్ (371 పరుగులు) బ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్‌లో ఆర్చర్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్ (18 వికెట్లు), వోక్స్ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి. 1975, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. క్రికెట్‌ను కనుగొన్న దేశం వరల్డ్ కప్ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది. 2019, జూలై 14: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది. -
ప్రపంచ కల నెరవేరింది
ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై దరిదాపులకూ రాలేని దీన స్థితి... నాలుగోసారి మాత్రం ఆ కల నెరవేరింది... ఓ దశలో కల్లగా మారేలా ఉన్నా కాలం కలిసొచ్చింది... ఒత్తిడిని పక్కకు నెడుతూ, ఉత్కంఠను తట్టుకుని... విశ్వ విజేత కిరీటం వారిని వరించింది. ఔను...! ఇంగ్లండ్ సాధించింది... ఎట్టకేలకు వన్డే చాంపియన్ అయింది... వీడని నీడలాంటి వారి ఆశయం నెరవేరింది... ఎన్నాళ్లో వేచిన విజయం పలకరించింది... చాలావరకు సాదాసీదాగా సాగిన ఫైనల్... ఆఖర్లో అదిరిపోయే హై డ్రామా సృష్టించింది... మైదానంలో అభిమానులను మునివేళ్లపై నిలిపింది... టీవీల ముందు ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది... ప్రపంచ కప్ తుది సమరం ‘టై’ అవడమే అరుదంటే... వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్ ఆడిస్తే... అందులోనూ ఇరు జట్ల స్కోర్లు సమమైతే... ఇంతకంటే మజా మజా ఏదైనా ఏముంటుంది? ఏదేమైనా క్రికెట్ పుట్టిల్లు పండుగ చేసుకుంది... వారి ‘ప్రపంచ కల’ సొంతగడ్డపైనే నెరవేరింది... నాలుగేళ్ల వారి శ్రమకు ఫలితం దక్కింది... రాబోయే నాలుగేళ్లు వారే రారాజని తీర్పొచ్చింది... లండన్ : ఇంగ్లండ్ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్ కప్ ఫైనల్లో వన్ ఓవర్ ఎలిమినేటర్ పద్ధతిలో ఇంగ్లండ్ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విలియమ్సన్ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు) స్కోరుకు సమానంగా అదనపు పరుగులు రావడం గమనార్హం. వోక్స్ (3/37), ప్లంకెట్ (3/42)లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. చివర్లో హై డ్రామా నడుమ ఇంగ్లండ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు (15) సమం కాగా... ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో నమోదైన బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను జగజ్జేతగా ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లు నీషమ్ (3/43), ఫెర్గూసన్ (3/50) వరుసగా వికెట్లు పడగొట్టడం, గ్రాండ్‌హోమ్ (1/25) పొదుపుగా బంతులే యడంతో ఛేదనలో ఇంగ్లండ్ కష్టాలు ఎదుర్కొంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత పోరాటం, బట్లర్ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో తేరుకుంది. నికోల్స్ నిలిచాడు... లాథమ్ ఆడాడు కివీస్ ఓపెనింగ్ జంట నికోల్స్, గప్టిల్ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు, సిక్స్) ఫైనల్లో కాసేపు నిలిచింది. ఆర్చర్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపిన గప్టిల్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విలియమ్సన్ జాగ్రత్తగా ఆడాడు. ఎదుర్కొన్న 12వ బంతికి గానీ పరుగు తీయలేకపోయాడు. పవర్ ప్లే అనంతరం ఇద్దరూ వేగం పెంచడంతో కదలిక వచ్చింది. స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్ చేసి కివీస్‌కు ప్లంకెట్ షాకిచ్చాడు. అతడి గుడ్ లెంగ్త్ బంతి విలియమ్సన్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది. అంపైర్ ధర్మసేన ఔటివ్వకున్నా మోర్గాన్ రివ్యూ కోరి ప్రత్యర్థి కెప్టెన్‌ను సాగనంపాడు. అంపైర్ ఎరాస్మస్ తప్పుడు నిర్ణయానికి రాస్ టేలర్ (15) బలయ్యాడు. ఆల్‌రౌండర్ నీషమ్ (25 బంతుల్లో 19; 3 ఫోర్లు) మిడాన్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. గ్రాండ్‌హోమ్ (16) అండగా లాథమ్ బండి లాగించాడు. వోక్స్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. హెన్రీ (4), సాన్‌ట్నర్ (5 నాటౌట్) చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇంగ్లండ్ కష్టంగానైనా అందుకుంది... ఇంగ్లండ్ ఛేదన సులువుగా సాగలేదు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతే ఓపెనర్ జేసన్ రాయ్ (20 బంతుల్లో 17; 3 ఫోర్లు) ప్యాడ్లను తాకింది. అంపైర్ ఎరాస్మస్ ఔటివ్వకపోవడంతో కివీస్ సమీక్ష కోరింది. బంతి లెగ్ స్టంప్ మీదుగా వెళ్తున్నట్లు తేలడంతో ఎరాస్మస్ నిర్ణయానికి కట్టుబడ్డాడు. హెన్రీ... రాయ్‌ను ఊగిసలాటలో పడేసి వికెట్ దక్కించుకున్నాడు. రూట్ (30 బంతుల్లో 7) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. గ్రాండ్హోమ్పై ప్రతాపం చూపబోయి వికెట్ ఇచ్చేశాడు. బెయిర్ స్టో (55 బంతుల్లో 36; 7 ఫోర్లు) వికెట్లను ఫెర్గూసన్ గిరాటేశాడు. ఆ వెంటనే మోర్గాన్ (9) పేలవ షాట్‌కు ఔటయ్యాడు. అప్పటికి 23.1 ఓవర్లలో జట్టు స్కోరు 86/4. స్టోక్స్–బట్లర్ ఐదో వికెట్‌కు 130 బంతుల్లో 110 పరుగులు జోడించి మలుపు తిప్పారు. 53 బంతుల్లో బట్లర్, స్టోక్స్ 81 బంతుల్లో అర్ధసెంచరీలు అందుకున్నారు. సమీకరణం 32 బంతుల్లో 46 పరుగులుగా మారి విజయావకాశాలు మెరుగైన స్థితిలో ఫెర్గూసన్ ఓవర్లో బట్లర్ షాట్‌కు యత్నించి ఔటవడం ఉత్కంఠ పెంచింది. స్టోక్స్ పోరాడుతున్నా... వోక్స్ (2)ను పెవిలియన్ చేర్చి కివీస్ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 49వ ఓవర్లో ప్లంకెట్ (10), ఆర్చర్ (0)లను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ చేసి నీషమ్ ఒత్తిడిని ఆతిథ్య జట్టు మీదకు నెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... బౌల్ట్ తొలి రెండు బంతులకు స్టోక్స్ పరుగులు చేయలేకపోయాడు. మూడో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్‌లోకి పంపి రెండో పరుగుకు యత్నిస్తుండగా గప్టిల్ త్రో స్టోక్స్‌కు తగిలి 6 పరుగులు వచ్చాయి. లక్ష్యం రెండు బంతుల్లో 3 పరుగులుగా మారింది. రషీద్ (0), వుడ్ (0) రనౌట్లయినా పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది. చివరి ఐదు ఓవర్లు హైడ్రామా... ఫైనల్లో చివరి ఐదు ఓవర్ల హైడ్రామా ఇరు జట్ల పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికి ఇంగ్లండ్ 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. బట్లర్ రెండు బంతుల ముందే ఔటయ్యాడు. వోక్స్ (46.1), ప్లంకెట్ (48.3), ఆర్చర్ (48.6) ఔటవ డంతో కప్ న్యూజిలాండ్‌దే అనిపించింది. కానీ, అటు పరుగులూ రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో స్టోక్స్ సిక్స్, ఓవర్ త్రో రూపంలో 2 ప్లస్ 4 పరుగులు రావడంతో తలకిందులైంది. బౌల్ట్ క్యాచ్... సిక్స్... మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన టర్నింగ్ పాయింట్ నీషమ్ ఓవర్లో స్టోక్స్ కొట్టిన సిక్స్ షాట్. 9 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితిలో జరిగిందీ ఘటన. స్టోక్స్ మిడ్ వికెట్‌లోకి భారీ షాట్ ఆడగా... బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ చేసిన తప్పిదం దెబ్బకొట్టింది. లైన్‌కు కొన్ని అంగుళాల ముందే బంతిని అందుకున్న బౌల్ట్... అలాఅలా వెనక్కువెళ్తూ బౌండరీ రోప్‌ను తొక్కేశాడు. ఎదురుగా ఫీల్డర్ గప్టిల్ ఉన్నా అతడికి విసిరే ప్రయత్నం చేయలేకపోయాడు. పోనీ, బంతిని లోపలకు విసిరేసినా ఆరు పరుగులు బదులుగా రెండో, మూడో వచ్చేవి. అవేవీ కాకపోగా ఏకంగా సిక్స్ నమోదైంది. బోనస్‌గా స్టోక్స్‌కు లైఫ్ వచ్చింది. ప్రధాన పేసర్ అయిన బౌల్ట్ బౌలింగ్‌లోనూ (10 ఓవర్లలో 67 పరుగులు; సూపర్ ఓవర్లో 15 పరుగులు) ఆకట్టుకోలేకపోవడం కివీస్‌కు వేదన మిగిల్చింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ (ఎల్బీడబ్ల్యూ) వుడ్ 15; లాథమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్‌హోమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 16; సాన్‌ట్నర్ (నాటౌట్) 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241 వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240. బౌలింగ్: వోక్స్ 9–0–37–3; ఆర్చర్ 10–0–42–1; ప్లంకెట్ 10–0–42–3; వుడ్ 10–1–49–1; రషీద్ 8–0–39–0; స్టోక్స్ 3–0–20–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లాథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9, స్టోక్స్ (నాటౌట్) 84; బట్లర్ (సి) సబ్ (సౌతీ) (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ (రనౌట్) 0; మార్క్ వుడ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241. బౌలింగ్: బౌల్ట్ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్ 10–2–25–1, ఫెర్గూసన్ 10–0–50–3, నీషమ్ 7–0–43–3, సాన్‌ట్నర్ 3–0–11–0. సూపర్ ఓవర్ సాగిందిలా... నోట్: సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ 26 బౌండరీలు కొట్టగా... న్యూజిలాండ్ 17 బౌండరీలు సాధించింది. స్టోక్స్... మాస్టర్ స్ట్రోక్... ప్రపంచ కప్ నెగ్గడం జట్టుగా ఇంగ్లండ్‌కు ఎంత సంబరమో, అంతకుమించి బెన్ స్టోక్స్‌కు వ్యక్తిగతంగా ఆనందదాయకం. ఎందుకంటే అతడి చేతుల మీదుగానే ఇంగ్లండ్‌కు ఒక కప్ (2017 టి20 ప్రపంచ కప్) చేజారింది. భారత్ వేదికగా జరిగిన నాటి కప్ ఫైనల్లో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో కార్లొస్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది వెస్టిండీస్‌కు కప్‌ను సాధించి పెట్టాడు. అప్పుడు స్టోక్స్ పిచ్ పైనే కుప్పకూలి రోదించాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆ చేదు అనుభవాన్ని అతడు తన చేతులతోనే చెరిపేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఒడ్డునపడేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు వచ్చి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాడు. టోర్నీలో స్టోక్స్ ఆస్ట్రేలియాపై (89), శ్రీలంకపై (82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్‌లు ఓటముల కారణంగా వెలుగులోకి రాలేకపోయాయి. ఫైనల్లో మాత్రం అతడి శ్రమకు అత్యద్భుత రీతిలో ఫలితం దక్కింది. గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గప్టిల్‌ను ఓదార్చుతున్న నీషమ్ -
విశ్వ కిరీటం... పుట్టింటికా? కివీ గూటికా?
ప్రారంభంలో చప్పగా సాగుతోందన్నారు వారాలు గడుస్తున్నా ఊపు లేదన్నారు మ్యాచ్‌లు తరుగుతున్నా మజా ఏదన్నారు మధ్యలోకి వచ్చేసరికి కాక మొదలైంది రంజైన మ్యాచ్‌లతో ఆట రక్తి కట్టింది ఇప్పుడిక ప్రపంచ కప్ ఆఖరి అంకం 46వ రోజున 48వ మ్యాచ్‌తో ముగింపు వన్డే కిరీటం ఎవరిదో తేలిపోయే సందర్భం రానున్న నాలుగేళ్లకు రారాజు పట్టాభిషేకం దూకుడైన ఇంగ్లండ్... నిబ్బరంగా న్యూజిలాండ్ జగజ్జేత హోదా పుట్టింటికి దక్కుతుందా? రెక్కలు కట్టుకుని కివీస్ గూటిలో వాలుతుందా? క్రికెట్ మక్కా లార్డ్స్‌లో... అందమైన బాల్కనీ నుంచి... సగర్వంగా కప్‌ను చూపే కెప్టెన్ ఎవరో? మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర తర్వాత తెరపైకి ‘సరికొత్త విజేత’ అభిమానులూ... ఆస్వాదించండి! లండన్: వన్డే క్రికెట్లో 23 ఏళ్ల తర్వాత సరికొత్త చాంపియన్ ఆవిర్భావానికి 12వ ప్రపంచ కప్ వేదిక కాబోతోంది. తొలిసారి జగజ్జేతగా నిలిచేందుకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ తుది సమరంలో తలపడనున్నాయి. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా అది వారి దేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోనుంది. ఇరు జట్ల బలాబలాల ప్రకారం చూస్తే ఈ ఫైనల్‌ను బ్యాటింగ్, పేస్ బౌలింగ్ మధ్య పోటీగా పేర్కొనవచ్చు. దూకుడైన ఆటతో పైచేయి సాధించడం ఇంగ్లండ్ వ్యూహం కాగా... నెమ్మదిగా పట్టు బిగించే స్వభావం న్యూజిలాండ్‌ది. మరి అంతిమ పోరులో ఎవరి ప్రణాళికలు విజయవంతం అవుతాయో చూడాలి? మార్పుల్లేకుండానే! అత్యంత కీలక మ్యాచ్ కాబట్టి రెండు జట్లు తాము సెమీఫైనల్లో ఆడిన తుది పదకొండు మందితోనే ఫైనల్లో దిగే వీలుంది. పైకి కనిపించకున్నా అటు ఇటు ఒకరిద్దరు ఆటగాళ్లే కీలకం. జేసన్ రాయ్, రూట్‌ను త్వరగా ఔట్ చేస్తే ఆతిథ్య జట్టు పరోక్షంగానైనా ఆత్మరక్షణలో పడటం ఖాయం. ఈ నేపథ్యంలో విధ్వంసక జాస్ బట్లర్ నుంచి భారీ ఇన్నింగ్స్ నమోదవాల్సి ఉంటుంది. అనంతరం కెప్టెన్ మోర్గాన్, ఆల్‌రౌండర్ స్టోక్స్ బాధ్యతలు తీసుకుంటారు. ఇక విలియమ్సన్, రాస్ టేలర్ తేలిపోతే న్యూజిలాండ్ పని ఖతం. అసలే ఆ జట్టు ఓపెనర్లు గప్టిల్, నికోల్స్ పేలవ ఫామ్‌తో సతమతం అవుతోంది. లాథమ్, గ్రాండ్‌హోమ్, నీషమ్ అదనపు పరుగులు జోడించగలరు తప్ప పరిస్థితిని అమాంతం మార్చలేరు. మొత్తమ్మీద చూస్తే బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంతో ఉన్నందున ఇంగ్లండ్‌కు ఫేవరెట్ మార్కులు ఎక్కువగా పడతాయి. బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్నా టోర్నీలో కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకుని గెలిచినందున కివీస్‌ను తేలిగ్గా తీసుకోలేం. చరిత్ర బాటలో ఈ ఇద్దరు ఐర్లాండ్ జాతీయుడైన మోర్గాన్ ఇంగ్లండ్ తరఫున ఆడటమే అనూహ్యం అనుకుంటే, కెప్టెన్‌గానూ ఎదిగి, ఇప్పుడు ప్రపంచ కప్ సాధించే వరకు తీసుకొచ్చాడు. గాటింగ్, గూచ్ వంటి మహామహులకు సాధ్యం కాని ఈ చిరకాల స్వప్నాన్ని గనుక నెరవేరిస్తే మోర్గాన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటు విలియమ్సన్‌కూ అంతే స్థాయిలో ఖ్యాతి దక్కుతుంది. మార్టిన్ క్రో, బ్రెండన్ మెకల్లమ్ వంటి తమ దేశ దిగ్గజాలకు త్రుటిలో చేజారిన కప్‌ను సాధిస్తే... ఇప్పటికే ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మన్‌గా పేరున్న అతడు వ్యక్తిగతంగా మరో మెట్టెక్కుతాడు. నాలుగోసారి... రెండోసారి.... ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ ఆడటం ఇది నాలుగోసారి. 1979, 87, 92లలో ఆ జట్టు తుది సమరానికి అర్హత సాధించింది. న్యూజిలాండ్ 2015 కప్ రన్నరప్. చిత్రమేమంటే ఇంగ్లండ్ ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఫైనల్. కివీస్ తరఫున గత ఫైనల్ మ్యాచ్ ఆడిన గప్టిల్, విలియమ్సన్, టేలర్, బౌల్ట్, హెన్రీ ఈసారీ బరిలో దిగనున్నారు. అటో గోడ.. ఇటో గోడ ఇరు జట్లలో అంత తొందరగా బద్దలు కొట్టలేనంతటి రెండు బ్యాటింగ్ గోడలున్నాయి. అవే విలియమ్సన్ , రూట్ (549 పరుగులు). పోటాపోటీగా రాణించిన ఈ ఇద్దరూ సమవయస్కులే. ఒకే తరహా బ్యాటింగ్ శైలి వారే. తమ జట్ల విజయాల్లో కీలకంగా మారినవారే. ఎలాంటి సందర్భంలోనైనా ఇన్నింగ్స్‌లు నిర్మించగలవారే. ఫైనల్లో ఎవరు తమ పాత్ర సమర్థంగా పోషిస్తారో చూద్దాం. వీరి సమరం ఆసక్తికరం రాయ్, బెయిర్‌స్టో x బౌల్ట్, హెన్రీ జేసన్ రాయ్ (426 పరుగులు), బెయిర్‌స్టో (496 పరుగులు)... టోర్నీలో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జంట. గాయంతో రాయ్ దూరమైతే ఓ దశలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నది జట్టు. అప్పుడు బెయిర్‌స్టో ఒంటరివాడైనట్లు కనిపించాడు. భారత్‌తో మ్యాచ్‌లో రాయ్ పునరాగమనంతో ఈ జోడీ మళ్లీ తడాఖా చూపుతోంది. ఫైనల్లో వీరికి న్యూజిలాండ్ పేసర్లు బౌల్ట్ (17 వికెట్లు), హెన్రీ (13 వికెట్లు) అడ్డుకట్ట వేస్తే ఇంగ్లండ్‌కు ముకుతాడు పడినట్లే. కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేసే ఈ జోడీకి మరో పేసర్ లాకీ ఫెర్గూసన్ (18 వికెట్లు) తోడైతే ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవు. విలియమ్సన్, టేలర్ X ఆర్చర్, వోక్స్ న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరిందంటే అది కెప్టెన్ విలియమ్సన్ (548 పరుగులు) విశేష రాణింపు, రాస్ టేలర్ (335 పరుగులు) నిలకడతోనే. భారత్‌తో జరిగిన సెమీస్‌లో వీరి అర్ధ సెంచరీలే ఈ విషయాన్ని చాటుతాయి. ఈ ఇద్దరికీ ఇంగ్లండ్ పేసర్లు ఆర్చర్ (19 వికెట్లు), వోక్స్ (13 వికెట్లు) నుంచి సవాల్ ఎదురవడం ఖాయం. మూడో పేసర్ మార్క్ వుడ్ (17 వికెట్లు) కూడా తక్కువేం కాదు. కేన్–టేలర్ జోడీ... వీరిని కాచుకొని క్రీజులో నిలదొక్కుకుంటే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. స్పిన్నర్లూ ఉన్నారోయ్... బ్యాటింగ్‌కు అనుకూలమైనా, పేసర్లు పండుగ చేసుకుంటున్నా ఈ కప్‌లో స్పిన్నర్లూ అంతోఇంతో ప్రభావం చూపారు. అలాంటివారిలో ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్, 11 వికెట్లు), సాన్‌ట్నర్ (న్యూజిలాండ్, 6 వికెట్లు) ముఖ్యులు. స్పిన్‌ను సమర్థంగా ఆడే భారత్‌ను సెమీస్‌లో సాన్‌ట్నర్ కట్టి పడేశాడు. రషీద్... ఆస్ట్రేలియాపై నిర్ణయాత్మక ప్రదర్శన కనబర్చాడు. ఇక ఫైనల్స్‌లో అవసరమైన సందర్భంలో వీరు ఎలాంటి పాత్ర పోషిస్తారో? తుది జట్లు (అంచనా) ఇంగ్లండ్: జేసన్ రాయ్, బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్ (కెప్టెన్), స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్. న్యూజిలాండ్: గప్టిల్, నికోల్స్, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, నీషమ్, లాథమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్. పిచ్, వాతావరణం శనివారం వరకు పిచ్‌పై సన్నటి పొరలా పచ్చిక ఉంది. వేడి ప్రభావంతో ఆదివారం మ్యాచ్ సమయానికి అది ఎండిపోవచ్చు. తద్వారా సహజ స్వభావంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. పిచ్‌ను పరిశీలించిన మోర్గాన్ మ్యాచ్ మొదలయ్యే వేళకు ఓ అంచనాకు రావొచ్చని అన్నాడు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఫైనల్‌కూ రిజర్వ్ డే ఉంది. ఆదివారం వర్షం వల్ల అంతరాయం కలిగి ఫలితం రాకపోతే సోమవారం కొనసాగిస్తారు. ఒకవేళ ఫైనల్ ‘టై’ అయితే ‘సూపర్ ఓవర్’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మ్యాచ్ రద్దయితే మాత్రం రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ముఖాముఖిలో పోటాపోటీ... ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 90 మ్యాచ్‌లు జరిగాయి. న్యూజిలాండ్ 43 మ్యాచ్‌లు, ఇంగ్లండ్ 41 గెలిచాయి. రెండు ‘టై’ కాగా, నాలుగింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో 9 సార్లు ఎదురుపడగా ఐదుసార్లు కివీస్, నాలుగుసార్లు ఇంగ్లండ్ నెగ్గాయి. -
‘ఫైనల్’ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్
లండన్: విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరుగనున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు కుమార ధర్మసేన (శ్రీలంక), మారిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) థర్డ్ అంపైర్ కాగా, అలీమ్ దార్ (పాకిస్తాన్) నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే బృందం గురువారం నాటి ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌కూ పనిచేసింది. అయితే, ధర్మసేన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. యూకేలో ఫైనల్ ఉచిత ప్రసారం సొంతగడ్డపై టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఆదివారం జరుగబోయే ప్రపంచ కప్ ఫైనల్‌ను ఉచిత ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్ణయించారు. యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుత కప్‌కు సంబంధించి యూకేలో ప్రసార హక్కులను చానెల్ 4 దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్‌తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్ ఫైనల్ చేరిన నేపథ్యంలో చానెల్ 4 మెత్తబడి మెట్టుదిగింది. -
‘4’లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే ఓడాం
ముంబై: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ సమావేశమవుతుంది. మెగా టోర్నీ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇంగ్లండ్ నుంచి కోహ్లి, శాస్త్రి తిరిగి రాగానే సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గే వారితో చర్చిస్తారు. దీంతో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కూడా ప్రత్యేకంగా భేటీ ఉంటుంది. ముఖ్యంగా అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్ ముందు జరిగిన ఆఖరి సిరీస్ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అదే విధంగా దినేశ్ కార్తీక్ వైఫల్యం, సెమీస్‌లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలు కూడా భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 2020 టి20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్ధం చేసే విషయంలో సెలక్షన్ కమిటీ సూచనలను సీఓఏ కోరనుంది. రేపు భారత జట్టు రాక... ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించిన భారత క్రికెట్ జట్టు ఆదివారం స్వదేశం చేరుకోనుంది. విడిగా కాకుండా జట్టు ఆటగాళ్లందరూ కలిసి ఒకేసారి ముంబైకి ప్రయాణిస్తారు. ‘టోర్నీ ముగిశాక కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్‌లోనే ఉండి విరామం కోరుకుంటారని వినిపించింది. అయితే అది వాస్తవం కాదు. జట్టు సభ్యులంతా ఆదివారం లండన్‌లో ఒక్కచోటికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ముంబై విమానమెక్కుతారు. సెమీస్ ఓటమి తర్వాత క్రికెటర్లంతా చాలా బాధలో ఉన్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ధోని రిటైర్మెంట్పైనే ఉంది. దీనిపై అతను మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ముంబై నుంచి స్వస్థలం రాంచీ చేరుకున్న తర్వాతే ధోని ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. ‘4’లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే ఓడాం హెడ్ కోచ్ రవిశాస్త్రి విశ్లేషణ ఎప్పటి నుంచో వెంటాడిన ‘నాలుగో’ సమస్యను సమస్యగానే ఉంచడం వల్ల ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు అంగీకరించారు. మిడిలార్డర్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేకే సెమీఫైనల్లో కంగుతిన్నామని రవిశాస్త్రి అన్నారు. టీమిండియా పరాజయాన్ని విశ్లేషించిన ఆయన ఈ లోటుపై తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని సూచించారు. ‘మిడిలార్డర్‌కు కీలకమైన నాలుగో స్థానాన్ని మొదట్లో రాహుల్‌తో లాగించాం. టోర్నీ మధ్యలో ఓపెనర్ ధావన్ గాయంతో నిష్క్రమించడంతో అతన్ని ఓపెనర్‌గా దింపాల్సి వచ్చింది. విజయ్ శంకర్‌ను ఆ నాలుగో స్థానంలో ఆడించినా... అతనూ గాయపడటంతో ఇక చేయాల్సిందేమీ లేకపోయింది’ అని రవిశాస్త్రి వివరించారు. మయాంక్ అగర్వాల్‌ను పిలిపించినా అప్పటికే సమయం మించిపోయిందన్నారు. ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపలేదన్న గావస్కర్ విమర్శలపై మాట్లాడుతూ ఎంతో అనుభవజ్ఞుడు, గొప్ప ఫినిషర్ అయిన ధోనిని ముందే పంపితే... అతను ఔటయితే ఇక గెలిచే పరిస్థితే ఉండదన్న విశ్లేషణతోనే మాజీ కెప్టెన్‌ను ఏడోస్థానంలో దింపామని... ఇది పూర్తిగా జట్టు నిర్ణయమని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. ‘ఆఖరిదాకా వికెట్ కాపాడుకున్న ధోని కూడా గెలిపించగలననే ధీమాతోనే ఉన్నాడు. అతను రనౌట్ కానంత వరకు అతని కళ్లలో ఈ ఆత్మవిశ్వాసమే కనబడింది. దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో ఓటమి తప్పలేదు’ అని కోచ్ తెలిపారు. -
కప్పు కొట్లాటలో...
44 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఐదు జట్లే (వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక) ఇప్పటివరకు చాంపియన్లుగా నిలిచాయి. పెద్ద టోర్నీల్లో తేలిపోయే దురదృష్ట దక్షిణాఫ్రికాను మినహాయిస్తే మిగతా వాటిలో కచ్చితంగా జగజ్జేతగా నిలిచే సత్తా ఉన్నవి ఇంగ్లండ్, న్యూజిలాండ్. అయితే, వీటి పోరాటం ఇన్నాళ్లూ సెమీఫైనల్లోనో, ఫైనల్లోనో ముగిసింది. ఇక ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. కొత్త చాంపియన్ ఆవిర్భావానికి వేదిక సిద్ధమవుతోంది. సరికొత్త చరిత్ర నమోదుకు కాలం వేచి చూస్తోంది. మరి ఈ జట్ల గత ఫైనల్ ప్రస్థానం ఎలా ఉందంటే? సాక్షి క్రీడా విభాగం ఇంగ్లండ్ మూడుసార్లు 1979, 1987, 1992లో న్యూజిలాండ్ 2015లో ప్రపంచ కప్ చివరి మెట్టు వరకు వచ్చాయి. ఇంగ్లిష్ జట్టు... వరుసగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలై విశ్వ విజేతగా నిలిచే అవకాశం చేజార్చుకుంది. కివీస్‌ను గత కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడనుండటం ఇదే మొదటిసారి కావడం ఓ విశేషమైతే... 12వ ప్రపంచ కప్ ద్వారా 23 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్‌ను ప్రేక్షకులు చూడబోతుండటం మరో విశేషం. చివరి సారిగా 1996లో (శ్రీలంక) ఓ కొత్త జట్టు జగజ్జేత అయింది. ఇంగ్లండ్ ఆ మూడుసార్లు ఇలా... క్రికెట్ పుట్టిల్లయిన ఇంగ్లండ్ ఇంతవరకు వన్డేల్లో విశ్వవిజేత కాలేకపోవడం ఆశ్చర్యమే. మంచి ఫామ్, గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా ఆ జట్టు మిగతా దేశాలతో పోటీలో వెనుకబడిపోయింది. వీటిలో సంప్రదాయ టెస్టు తరహా ఆటను విడనాడకపోవడం మొదటిది. కాలానికి తగ్గట్లు మారకపోవడం రెండోది. ఇప్పుడు వాటిని ఛేదించి అమీతుమీకి సిద్ధమైంది. గతంలోని మూడు విఫలయత్నాలను గమనిస్తే... వివ్ విధ్వంసంలో కొట్టుకుపోయింది... వరుసగా రెండోసారి ఆతిథ్యమిచ్చిన 1979 కప్‌లో ఇంగ్లండ్ గ్రూప్ మ్యాచ్‌లన్నిటిలో అజేయంగా నిలిచింది. కెప్టెన్ మైక్ బ్రియర్లీ, బాయ్‌కాట్ వంటి ఓపెనర్లతో, కుర్రాళ్లు గూచ్, బోథమ్, డేవిడ్ గోవర్లతో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించింది. సెమీస్‌లో గట్టి పోటీని తట్టుకుని 9 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. తుది సమరంలో మాత్రం భీకర వెస్టిండీస్‌కు తలొంచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఓ తప్పిదం కాగా... విధ్వంసక వివ్ రిచర్డ్స్ (157 బంతుల్లో 138 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆతిథ్య జట్టును చితక్కొట్టాడు. కొలిస్ కింగ్ (66 బంతుల్లో 86; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి అండగా నిలవడంతో కరీబియన్లు నిర్ణీత 60 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేశారు. ఛేదనలో బ్రియర్లీ (64), బాయ్‌కాట్ (57) అర్ధ సెంచరీలతో మంచి పునాది వేసినా జోయల్ గార్నర్ (5/38) ధాటికి గూచ్ (32) మినహా మిగతావారు విఫలమయ్యారు. వీరు కాక రాండల్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేయడంతో ఇంగ్లండ్ 51 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. 92 పరుగుల తేడాతో ఓడి కప్‌ను చేజార్చుకుంది. గాటింగ్ షాట్‌తో గూబ గుయ్... భారత్ ఆతిథ్యమిచ్చిన 1987 కప్‌లో గ్రూప్ దశలో రెండుసార్లు (ఫార్మాట్ ప్రకారం) పాకిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... శ్రీలంక, వెస్టిండీస్‌లపై అజేయ విజయాలతో సెమీస్ చేరింది. సెమీస్‌లో నాటి డిఫెండింగ్ చాంపియన్ భారత్‌పై 35 పరుగులతో నెగ్గింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను 50 ఓవర్లలో 253/5 కు కట్టడి చేసింది. గూచ్ (35), అథె (58)కు తోడు కెప్టెన్ గాటింగ్ (41), అలెన్ లాంబ్ (45) రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది. అయితే, 135/2తో ఉన్న దశలో గాటింగ్ అత్యుత్సాహ రివర్స్ స్వీప్ సీన్‌ను రివర్స్ చేసింది. స్కోరు 177 వద్ద అథెను ఔట్ చేసిన ఆసీస్ బౌలర్లు పట్టుబిగించి ఇంగ్లండ్‌ను 50 ఓవర్లలో 246/8కే పరిమితం చేశారు. కప్‌నకు అతి దగ్గరగా వచ్చిన ఇంగ్లండ్ ఏడు పరుగుల తేడాతో కోల్పోయింది. పాక్ ప్రతాపాన్ని తట్టుకోలేక... ఆ వెంటనే జరిగిన 1992 కప్‌లో రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఇంగ్లండ్ అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. వర్షం రూపంలో అదృష్టం కలిసివచ్చి సెమీస్‌లో దక్షిణాఫ్రికాను 19 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు వెళ్లింది. అటువైపు ప్రత్యర్థి పాకిస్తాన్ కావడంతో ఇంగ్లండ్‌దే కప్ అని అంతా అనుకున్నారు. కానీ, పాక్ పట్టువిడవకుండా ఆడి ఇంగ్లండ్ కలను చెదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (72), జావెద్ మియాందాద్ (58) అర్ధసెంచరీలు, ఇంజమామ్ (42) అక్రమ్ (32) మెరుపులతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఛేదనలో అక్రమ్ (3/49), ముస్తాక్ అహ్మద్ (3/41), అకిబ్ జావెద్ (2/27) ప్రతాపానికి నీల్ ఫెయిర్ బ్రదర్ (62) తప్ప మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో 49.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటై కప్‌నకు 22 పరుగుల దూరంలో ఆగిపోయింది. కివీస్‌కు ఆసీస్ కిక్... ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్‌ది స్థిరమైన ప్రదర్శన. టోర్నీ ఎక్కడ జరిగినా కనీసం సెమీస్ చేరే స్థాయి ఉన్న జట్టుగా బరిలో దిగుతుంది. మొత్తం 12 కప్‌లలో 8 సార్లు సెమీస్‌కు రావడమే దీనికి నిదర్శనం. వాస్తవానికి మార్టిన్ క్రో బ్యాటింగ్ మెరుపులతో సహ ఆతిథ్యమిచ్చిన 1992 కప్‌లోనే కివీస్ హాట్ ఫేవరెట్‌గా కనిపించింది. కానీ, సెమీస్‌లో పాకిస్తాన్ విజృంభణకు తలొంచింది. మళ్లీ 2015లో సహ ఆతిథ్యంలో కెప్టెన్ మెకల్లమ్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో మెగా టోర్నీలో విజేతగా నిలిచేలా కనిపించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా... భీకర ఫామ్‌లో ఉన్న మెకల్లమ్ (0) డకౌట్ కావడంతో మానసికంగా బలహీన పడిపోయింది. ఇలియట్ (83), రాస్ టేలర్ (40) మాత్రమే రాణించడంతో 45 ఓవర్లలో 183కే ఆలౌటైంది. స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. -
ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్
-
ఇంగ్లండ్ ఇరవై ఏడేళ్లకు...
9969 రోజులు... ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆఖరిసారిగా ప్రపంచ కప్ ఫైనల్ ఆడి ఇన్నిరోజులైంది! అప్పటి నుంచి ఆ దేశపు అభిమానులు ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. 1992 వరల్డ్ కప్ తర్వాత ఆరు టోర్నీలలో ఒక్కసారి కూడా సెమీస్ చేరలేకపోయిన ఇంగ్లండ్ ఇప్పుడు సొంతగడ్డపై ఎట్టకేలకు తుదిపోరుకు అర్హత సాధించింది. గతంలో మూడు ఫైనల్ పోరాటాల్లోనూ ఓడిన ఆ జట్టు నాలుగో సారి ఫైనల్లోకి అడుగుపెట్టి 44 ఏళ్ల తమ టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించి పాతాళానికి పడిపోయిన ఇంగ్లండ్ కొత్తగా ఎగసి ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియానే చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టడం మరో విశేషం. బర్మింగ్‌హామ్: సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఖేల్ ఖతమైంది. ఈ ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్ ఖాయమైంది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై జయకేతనం ఎగురవేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మిత్ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ వోక్స్ ప్రత్యర్థిని దెబ్బతీశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రా య్ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్ (39 బంతుల్లో 45 నాటౌట్), రూట్ (46 బంతుల్లో 49 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. ఫించ్ 0... 14కే ముగ్గురు ఔట్ టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా, వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన కెప్టెన్ ఫించ్ (0) డకౌటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే ఆర్చర్ అతన్ని ఔట్ చేశాడు. మరుసటి ఓవర్లోనే వార్నర్ (9)ను పెవిలియన్ చేర్చిన వోక్స్, హ్యాండ్స్కోంబ్ (4)ను బౌల్డ్ చేశాడు. 6.1 ఓవర్లలో ఆసీస్ స్కోరు 14/3. పట్టుమని పది ఓవర్ల ‘పవర్‌ప్లే’ పూర్తికాకముందే టాపార్డర్ వికెట్లను కోల్పోయిన కంగారూ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి దాకా స్మిత్ ఒక్కడే... రెండో ఓవర్ రెండో బంతికే స్మిత్ ఆట మొదలైంది. అక్కడి నుంచి 47.1 ఓవర్ దాకా స్మిత్ జట్టును ఒడ్డున పడేసేందుకు చేసిన పోరాటం అద్వితీయం. హ్యాండ్స్కోంబ్ నిష్క్రమించాక వచ్చిన అలెక్స్ క్యారీ (70 బంతుల్లో 46; 4 ఫోర్లు)తో కలిసి ముందుగా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత జాగ్రత్త పడుతూ... ఓపిగ్గా ఆడుతూ పరుగుల బాటపట్టాడు. ఇద్దరి జోడీ కుదురుకోవడంతో నెమ్మదిగానైనా జట్టు కోలుకుంది. 72 బంతుల్లో స్మిత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 103 పరుగులు జతయ్యాక జట్టు స్కోరు 117 పరుగుల వద్ద క్యారీని, స్టొయినిస్ (0)ను రషీదే ఔట్ చేశాడు. మళ్లీ కుదుపునకు గురైన స్మిత్ తన అసాధారణ పోరాటంతో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ముందుగా మ్యాక్స్‌వెల్ (23 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టు స్కోరును 150 పరుగులు దాటించిన స్మిత్... టెయిలెండర్లతో కలిసి 200 పరుగుల దాకా తీసుకెళ్లాడు. కమిన్స్ (6) విఫలమైనా స్టార్క్ (36 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడటంతో జట్టు ఆ మాత్రమైనా చేయగలిగింది. రాయ్ జోరు ఇంగ్లండ్ విజయలక్ష్యం 224. ఇదేమంత స్కోరే కాదు. కానీ కివీస్ చేతిలో జోరుమీదున్న భారత్ చిత్తవడం, ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వికెట్ల విలాపంతో ఇంగ్లండ్ జాగ్రత్తపడింది. రాయ్, బెయిర్ స్టో (43 బంతుల్లో 34; 5 ఫోర్లు) మొదట్లో ఆచితూచి ఆడారు. పిచ్‌ను ఆకళింపు చేసుకున్నాక రాయ్ రఫ్ఫాడించడం మొదలుపెట్టాడు. స్టార్క్ వేసిన నాలుగో ఓవర్లో 2 బౌండరీలు కొట్టాడు. అతని మరుసటి ఓవర్లో భారీ సిక్సర్‌తో ఊపుతెచ్చాడు. పవర్‌ప్లే తర్వాత రాయ్ తన బ్యాటింగ్ పవర్ పెంచాడు. 11వ ఓవర్లో స్పిన్నర్ లయన్‌ను రంగంలో దించగా... రాయ్ సిక్సర్‌తో అతనికి స్వాగతం పలికాడు. మరో బౌండరీ కూడా కొట్టడంతో అతని ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. స్టార్క్ వేసిన 15 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రాయ్ 50 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వికెట్ కోసం స్మిత్ బౌలింగ్‌తో ఆసీస్ ప్రయోగం చేసింది. అతను 16వ ఓవర్ వేయగా... రాయ్ ‘హ్యాట్రిక్’ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో 21 పరుగులు రాగా జట్టు స్కోరు 100 పరుగులు దాటేసింది. ఓపెనింగ్ జోడీ దుర్భేద్యంగా మారడంతో స్టార్క్ బౌలింగ్‌ను అదేపనిగా కొనసాగించాడు. ఈ ప్రయత్నంలో ఆసీస్ కెప్టెన్ ఫించ్ సఫలమయ్యాడు. 18వ ఓవర్లో బెయిర్‌స్టోను స్టార్క్ ఔట్ చేయడంతో 124 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే కమిన్స్ బౌలింగ్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయంతో రాయ్ ఔటయ్యాడు. అతని నిష్క్రమణతో కెప్టెన్ మోర్గాన్... రూట్‌కు జతయ్యాడు. జట్టు విజయానికి కేవలం 77 పరుగులే కావాలి. ఎలాంటి ఒత్తిడి లేని ఈ దశలో వీళ్లిద్దరు మరో వికెట్ పడకుండా... చక్కగా తమ పని పూర్తిచేశారు. ఇది ఔటా! అ‘ధర్మసేన’ నిర్ణయంపై జేసన్ రాయ్ భగ్గుమన్నాడు. 20వ ఓవర్ నాలుగో బంతిని కమిన్స్ లెగ్‌సైడ్‌లో వేశాడు. పుల్‌షాట్‌కు ప్రయత్నించినా... బంతి బ్యాట్‌కు చిక్కకుండానే కీపర్ చేతుల్లో పడింది. కానీ కంగారూ ఆటగాళ్లంతా పెద్దగా అప్పీల్ చేసేసరికి ధర్మసేన (శ్రీలంక) తీరిగ్గా ఔటిచ్చాడు. బ్యాట్‌కు తగలనంత దూరం వెళ్లినా... ఔటేంటని రాయ్ తీవ్రంగా వాదించాడు. పిచ్‌పై నుంచి కదల్లేదు. మరో అంపైర్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) సర్దిచెప్పడంతో ఆగ్రహంగా పెవిలియన్‌కు వెళ్లిన రాయ్ తన గ్లవ్స్‌ను విసిరికొట్టడం కనిపించింది. రాయ్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు 2 డీ మెరిట్ పాయింట్లు శిక్షగా విధించింది. అయితే ఎలాంటి నిషేధానికి గురికాకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద ఊరట. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్ 9; ఫించ్ ఎల్బీడబ్ల్యూ (బి) ఆర్చర్ 0; స్మిత్ రనౌట్ 85; హ్యాండ్స్కోంబ్ (బి) వోక్స్ 4; క్యారీ (సి) సబ్–విన్స్ (బి) రషీద్ 46; స్టొయినిస్ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్ 0; మ్యాక్స్‌వెల్ (సి) మోర్గాన్ (బి) ఆర్చర్ 22; కమిన్స్ (సి) రూట్ (బి) రషీద్ 6; స్టార్క్ (సి) బట్లర్ (బి) వోక్స్ 29; బెహ్రెన్‌డార్ఫ్ (బి) వుడ్ 1; లయన్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–4, 2–10, 3–14, 4–117, 5–118, 6–157, 7–166, 8–217, 9–217, 10–223. బౌలింగ్: వోక్స్ 8–0–20–3, ఆర్చర్ 10–0–32–2, స్టోక్స్ 4–0–22–0, వుడ్ 9–0–45–1, ప్లంకెట్ 8–0–44–0, రషీద్ 10–0–54–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) క్యారీ (బి) కమిన్స్ 85; బెయిర్ స్టో ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 34; జో రూట్ నాటౌట్ 49; మోర్గాన్ నాటౌట్ 45; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–124, 2–147. బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 8.1–2–38–0, స్టార్క్ 9–0–70–1, కమిన్స్ 7–0–34–1, లయన్ 5–0–49–0, స్మిత్ 1–0–21–0, స్టొయినిస్ 2–0–13–0. ఆర్చర్ బౌన్సర్ ధాటికి విలవిల్లాడిన క్యారీ... బ్యాండేజ్‌తో బ్యాటింగ్ కొనసాగించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. -
ఆశలు సమాధి చేస్తూ...
కలలు కల్లలవడం అంటే ఇదేనేమో! ఆశలు అడియాసలు కావడమంటే ఇలాగేనేమో! దూసుకుపోతున్న రేసు గుర్రాన్ని దురదృష్టం వెంటాడితే ఈ తీరునే ఉంటుందేమో! అంచనాలను చేరుతున్నా... శిఖరం అంచుల్లోంచి జారిపడిపోయిన దృష్టాంతాలకు ఇదే నిదర్శనమేమో! తేలికైన ప్రత్యర్థిగా భావిస్తే అసలుకే మోసం తెచ్చింది. మనకు తిరుగులేదనుకుంటే తలొంచాల్సి వచ్చింది. స్వింగుతో కంగుతినిపించి స్పిన్‌తో చుక్కలు చూపింది. వెరసి... ప్రపంచ కప్ ఊహలను చెల్లాచెదురుచేస్తూ టీమిండియాకు న్యూజిలాండ్ అతిపెద్ద ఝలక్ ఇచ్చింది. ఇంతటి బాధాకర ఓటమిలోనూ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా త్రీడీ ఆట (77 పరుగులు, ఒక వికెట్, ఒక రనౌట్, రెండు క్యాచ్‌లు) ఓదార్పునిచ్చింది. వెటరన్ ధోని పోరాటంతో పరువు దక్కింది. మనకు మిగిలిందిక... ప్రపంచ కప్‌ను పెద్దగా ఆసక్తి లేని సాధారణ ప్రేక్షకుడిగా వీక్షించడమే! మాంచెస్టర్: కోట్లాది అభిమానులను హతాశులను చేస్తూ... టీమిండియా ప్రపంచ కప్ పోరాటం సెమీఫైనల్‌తోనే ముగిసింది. లీగ్ దశ నుంచి అద్భుతంగా సాగుతున్న కోహ్లి సేన ప్రస్థానానికి నాకౌట్లో న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ కొనసాగిన తొలి సెమీస్‌లో కివీస్ 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. అంతకుముందు ప్రత్యర్థి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. భువనేశ్వర్ (3/43)కు మూడు వికెట్లు దక్కాయి. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి బృందం 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. అద్భుత పోరాటం సాగించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్. అతడికి అండగా నిలిచిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని (72 బంతుల్లో 50; ఫోర్, సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. కుర్రాళ్లు రిషభ్ పంత్ (56 బంతుల్లో 32; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (62 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లను త్వరగా పెవిలియన్ చేర్చి ఆదిలోనే కివీస్‌కు పట్టు చిక్కేలా చూసిన పేసర్ మ్యాట్ హెన్రీ (3/37)ని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వరించింది. బౌల్ట్ (2/42), సాన్‌ట్నర్ (2/34)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆతిథ్య ఇంగ్లండ్–ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం విఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తలపడుతుంది. రోహిత్, రాహుల్, కార్తీక్, పంత్, హార్దిక్ అప్పుడే ఆశలు ఆవిరి... టోర్నీలో కళ్లు చెదిరే ఆటతో ఐదు సెంచరీలు చేసిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (1), గత మ్యాచ్‌లో శతకం బాదిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (1)తో పాటు మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి (1)లను... ఇన్నింగ్స్ ఇలా మొదలైందో లేదో అలా ఔట్ చేసి భారత్‌ను తేరుకోలేనంత దెబ్బకొట్టింది కివీస్. దీంతో ఇటీవల ఎన్నడూ లేనివిధంగా భారత్ 5/3 గణాంకాలతో నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి పేసర్లను పంత్, దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 6) కాసేపు కాచుకున్నారు. దూకుడైన పంత్ వికెట్ పారేసుకునే ప్రమాదం ఉండటంతో కార్తీక్ ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్నాడు. కానీ, హెన్రీ బౌలింగ్‌లో బంతిని కొంత ఆలస్యంగా ఆడిన కార్తీక్... నీషమ్ అందుకున్న మెరుపు క్యాచ్‌కు వెనుదిరిగాడు. ధోని, జడేజా సరిగ్గా పవర్ ప్లే చివరి బంతికి కార్తీక్ పెవిలియన్ చేరగా స్కోరు 24/4. ఈ కప్‌లో అతి తక్కువ పవర్ ప్లే స్కోరు ఇదే కావడం గమనార్హం. హిట్టింగ్‌కు మారు పేరైన పంత్, పాండ్యా సహనం చూపుతూ ఐదో వికెట్‌కు 77 బంతుల్లో 47 పరుగులు జోడించి కాస్త ఒడ్డున పడేశారు. విజృంభించి బౌండరీలు కొట్టని స్థితిలో వీలు చూసుకుని సింగిల్స్ తీశారు. అయితే, స్పిన్నర్ సాన్‌ట్నర్‌పై భారీ షాట్లతో ప్రతాపం చూపబోయి ఇద్దరూ ఔటయ్యారు. ఈ దశలో ధోని, జడేజా సమయోచితంగా ఆడుతూ ముందుకు నడిపించారు. కానీ, 11 బంతుల వ్యవధిలో వీరిద్దరితో పాటు భువనేశ్వర్ (0), చహల్ (5)లను పెవిలియన్ చేర్చిన కివీస్ మ్యాచ్‌ను వశం చేసుకుంది. టాపార్డర్ 1..1..1.. బ్యాటింగ్‌లో టాపార్డర్ భారత్‌కు పెట్టని బలం. దీనికితగ్గట్లే టోర్నీలో రోహిత్ (648), రాహుల్ (361), కోహ్లి (443) పరుగులు చేశారు. కానీ, సెమీస్‌లో ఈ ముగ్గురూ కలిపి చేసింది మూడే పరుగులు. వారు సింగిల్ డిజిట్‌కే వెనుదిరగడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ పరుగులే కీలకంగా మారి! మంగళవారం నాటి స్కోరు 46.1 ఓవర్లలో 211/5 నుంచి బుధవారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మిగతా 23 బంతుల్లో 28 పరుగులు జోడించి 239/8 వద్ద ఇన్నింగ్స్ ముగించింది. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (90 బంతుల్లో 74; 3 ఫోర్లు, సిక్స్)ను బుమ్రా వేసిన 48వ ఓవర్ చివరి బంతికి చురుకైన త్రో ద్వారా రనౌట్ చేసిన జడేజా; ఆ వెంటనే భువనేశ్వర్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ (10)ను చక్కటి క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి హెన్రీ (1) సైతం వెనుదిరిగాడు. బౌల్ట్ (3), సాన్‌ట్నర్ (9) చివరి ఓవర్ ఎదుర్కొని ఏడు పరుగులు జత చేశారు. ఈ మొత్తం 28 పరుగుల్లో కొన్నింటిని నిరోధించగలిగినా... మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో? స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1; నికోల్స్ (బి) రవీంద్ర జడేజా 28; విలియమ్సన్ (సి) రవీంద్ర జడేజా (బి) చహల్ 67; రాస్ టేలర్ (రనౌట్) 74; నీషమ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా 12; గ్రాండ్‌హోమ్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 16; లాథమ్ (సి) రవీంద్ర జడేజా (బి) భువనేశ్వర్ 10; సాన్‌ట్నర్ (నాటౌట్) 9; హెన్రీ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 1; బౌల్ట్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50ఓవర్లలో 8 వికెట్లకు) 239. వికెట్ల పతనం: 1–1, 2–69, 3–134, 4–162, 5–200, 6–225, 7–225, 8–232. బౌలింగ్: భువనేశ్వర్ 10–1–43–3; బుమ్రా 10–1–39–1; హార్దిక్ పాండ్యా 10–0–55–1, రవీంద్ర జడేజా 10–0–34–1, చహల్ 10–0–63–1. భారత్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) లాథమ్ (బి) హెన్రీ 1; రోహిత్ శర్మ (సి) లాథమ్ (బి) హెన్రీ 1; విరాట్ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 1; రిషభ్ పంత్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) సాన్‌ట్నర్ 32; దినేశ్ కార్తీక్ (సి) నీషమ్ (బి) హెన్రీ 6; హార్దిక్ పాండ్యా (సి) విలియమ్సన్ (బి) సాన్‌ట్నర్ 32; ధోని (రనౌట్) 50; రవీంద్ర జడేజా (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 77; భువనేశ్వర్ (బి) ఫెర్గూసన్ 0; చహల్ (సి) లాథమ్ (బి) నీషమ్ 5; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 221 వికెట్ల పతనం: 1–4, 2–5, 3–5, 4–24, 5–71, 6–92, 7–208, 8–216, 9–217, 10–221. బౌలింగ్: బౌల్ట్ 10–2–42–2, హెన్రీ 10–1–37–3, ఫెర్గూసన్ 10–0–43–1, గ్రాండ్‌హోమ్ 2–0– 13–0, నీషమ్ 7.3–0–49–1, సాన్‌ట్నర్ 10–2–34–2. సాహో జడేజా... భళా ధోని 30.3 ఓవర్లకు స్కోరు 92/6. సాధించాల్సిన రన్‌రేట్ 8కి దగ్గరగా ఉంది. ఇలా చాలా ముందే ఓటమి ఖరారైన టీమిండియా చివరకు లక్ష్యానికి అంత దగ్గరగా వచ్చిందంటే అది జడేజా, ధోని ఘనతే. పాండ్యా ఔటయ్యేసరికి మన జట్టు గెలిచే అవకాశాలు 10 శాతమే. ఇలాంటి దశలో పొరపాటునైనా వికెట్ ఇవ్వకూడదన్నట్లు ధోని జాగ్రత్త పడ్డాడు. జడేజా మాత్రం వస్తూనే ధైర్యం చేసి నీషమ్ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్ కొట్టి తాడోపేడో తేల్చుకోవాలన్నట్లు కనిపించాడు. ఇద్దరూ తమదైన సమన్వయంతో పరుగులు తీస్తూ స్కోరు బోర్డులో కదలిక తెచ్చారు. టర్నింగ్ పాయింట్ : ధోని రనౌట్ హెన్రీ, ఫెర్గూసన్ ఓవర్లలో ఫోర్లు కొట్టిన జడ్డూ... సాన్‌ట్నర్ స్పిన్ వలయాన్ని ఛేదిస్తూ లాంగాన్, మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌లతో ప్రతాపం చూపాడు. 39 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. అప్పటికి ధోని ఇంకా 28 పరుగుల వద్దే ఉండటం గమనార్హం. బౌలర్ ఎవరైనా లెక్క చేయనంతటి జోష్‌లో అతడు ఫెర్గూసన్ ఓవర్లో సిక్స్, బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్ దంచాడు. జడేజా–ధోని 97 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. ఇందులో జడేజావే 69 పరుగులు ఉండటం విశేషం. ఇదే క్రమంలో జట్టు స్కోరును 200 సైతం దాటించారు. గెలుపునకు 14 బంతుల్లో 32 పరుగులు అవసరమైన స్థితిలో బౌల్ట్ వేగం తగ్గించి వేసిన బంతికి జడేజా బోల్తా పడ్డాడు. అతడు కొట్టిన బంతి గాల్లో చాలా ఎత్తులో లేవగా లాంగాఫ్‌లో పొంచి ఉన్న విలియమ్సన్ ఒడిసి పట్టాడు. కొంత క్లిష్టమే అయినా అవకాశాలు ఉన్న ఈ పరిస్థితిలో ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్ తొలి బంతినే బ్యాక్వర్డ్ పాయింట్లోకి సిక్స్‌కు పంపి ధోని ఆశలు రేపాడు. మరుసటి బంతికి పరుగులు తీయని మహి... మూడో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో స్క్వేర్ లెగ్ నుంచి గప్టిల్ విసిరిన డైరెక్ట్ రాకెట్ త్రోకు రనౌటయ్యాడు. ఈ ఓవర్ చివరి బంతికి భువీ బౌల్డ్ అవడంతో ఏ మూలనో ఉన్న ఆశలు ఆవిరయ్యాయి. వరుణుడా...? దెబ్బకొట్టావ్! ‘న్యూజిలాండ్‌తో కలిసి వరుణుడు సెమీఫైనల్లో టీమిండియాను ఓడించాడు’... ఫలితాన్ని విశ్లేషిస్తే ఇది సరైనదేమోననే అనిపిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా మంగళవారం మ్యాచ్ పూర్తిగా సాగి ఉంటే కివీస్ విధించే 230 లేదా 240 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించేలా కనిపించిన భారత్‌కు... వాన కారణంగా వాయిదా పడటం ప్రతికూలమైంది. బుధవారం చల్లటి వాతావరణంలో ప్రత్యర్థి పేసర్లు చెలరేగిపోయారు. బౌల్ట్ వంటి ఎడమ చేతివాటం పేసర్‌కు బంతి స్వింగ్ అయ్యే వీలుచిక్కడం; హెన్రీ కచ్చితమైన డెలివరీలకు రోహిత్, రాహుల్ తడబడటం దెబ్బకొట్టింది. ఈ జట్టు చేతిలో ఓడటమేంటబ్బా? కివీస్‌పై కచ్చితంగా గెలుస్తామనే అంచనాల మధ్య భారత్ ఓటమి అభిమానులను తీవ్రంగా బాధించేదే. కప్‌లో రెండు జట్లు భిన్న నేపథ్యాల నుంచి సెమీస్ చేరడమే దీనికి కారణం. ఇంగ్లండ్‌పై ఓటమి తప్ప అప్రతిహత విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు సిద్ధమవగా; న్యూజిలాండ్ లీగ్ చివర్లో తేలిపోయింది. అంతా కోహ్లి సేనకు ఇంగ్లండ్ ఎదురవుతుందని అనుకుంటే కివీస్ అనూహ్యంగా తారసపడి అంతే ఆశ్చర్యకరమైన షాకిచ్చింది. విలియమ్సన్, టేలర్ తప్ప ఎవరూ ఫామ్‌లో లేని ఆ జట్టుపై ‘ఎలాగైనా మనమే గెలుస్తాం’ అని ఊహల్లో ఉన్న భారత వీరాభిమానులను ఈ పరాజయం కొన్ని రోజులు వెంటాడటం ఖాయం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హెన్రీ (3/37) కూర్పు ఒప్పు... తప్పు మంగళవారం సెమీస్‌కు మైదానంలో దిగిన భారత తుది జట్టులో పేసర్ షమీ లేకపోవడంతో అంతా అవాక్కయ్యారు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన అతడిని శ్రీలంకతో మ్యాచ్‌కు పక్కన పెట్టడమే అనూహ్యం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఆడించకపోవడం ఏం వ్యూహమో అర్థం కాలేదు. అటువైపు కివీస్ స్పిన్నర్ సాన్ట్నర్నే నమ్ముకుని, ముగ్గురు ఫ్రంట్‌లైన్ పేసర్లను తీసుకుంది. భారత్ మాత్రం కుల్దీప్ బదులు చహల్‌ను తుది పదకొండులో చేర్చింది. అతడు విఫలమవ్వగా సహచర స్పిన్నర్ జడేజా చకచకా బంతులేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తుంటే చహల్ పరుగులిస్తూ పోయాడు. పాత కాలపు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్ల ఆలోచనకు భారత్ స్వస్తి పలికి మూడో పేసర్‌గా షమీని ఆడిస్తే కివీస్‌కు పుంజుకొనే అవకాశమే రాకపోయేది. కివీస్ అప్పుడు... ఇప్పుడు... వరుణుడి చలవతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరింది న్యూజిలాండ్. సహ ఆతిథ్యమిచ్చిన 2015 కప్‌లోనూ ఆ జట్టు వర్షం ప్రభావిత మ్యాచ్ ద్వారానే తుది సమరానికి అర్హత పొందింది. నాడు మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా డివిలియర్స్ (45 బంతుల్లో 65 నాటౌట్) భీకర హిట్టింగ్తో 43 ఓవర్లలో 281/5తో భారీ స్కోరు దిశగా వెళ్తుండగా వర్షం అడ్డుకుంది. తర్వాత లక్ష్యాన్ని 43 ఓవర్లలో 299 పరుగులుగా నిర్దేశించారు. గ్రాంట్ ఇలియట్ (84 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో మరో బంతి మాత్రమే ఉండగా కివీస్ లక్ష్యాన్ని చేరుకుంది. రిటైర్మెంట్పై ధోని నాకేమీ చెప్పలేదు టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడి ఒక్క 45 నిమిషాల చెత్త ఆటతో జట్టు బోల్తా పడటం చాలా నిరాశ పరిచింది. టోర్నీలో జోరుమీదున్న మేం ఇలాంటి అనూహ్య ఫలితంతో నిష్క్రమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడేజా అసాధారణ ఆటతీరు కనబరిచాడు. తన క్రికెట్ నైపుణ్యాన్ని చాటాడు. ధోనితో విలువైన భాగస్వామ్యం జోడించాడు. ధోని ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకే నింపాదిగా ఆడాడు. మరోవైపు జడేజా యథేచ్చగా ఆడేందుకు స్ట్రయికింగ్‌తో సాయపడ్డాడు. ఒకవేళ ఆఖర్లో ధోని రనౌట్ కాకపోతే ఫలితం మరోలా ఉండేది. అయితే అతను తన రిటైర్మెంట్పై మాకేమీ చెప్పలేదు. – భారత కెప్టెన్ కోహ్లి నేడు రెండో సెమీఫైనల్ ఇంగ్లండ్ X ఆస్ట్రేలియా వేదిక : బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ –1లో ప్రత్యక్షప్రసారం -
సశేషం!
ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డు పడ్డాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య పోరులో ఒక ఇన్నింగ్సూ పూర్తిగా ముగియకుండానే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. అయితే వరల్డ్ కప్ నాకౌట్ నిబంధనల ప్రకారం ‘రిజర్వ్ డే’ అయిన నేడు మ్యాచ్ కొనసాగుతుంది. 46.1 ఓవర్ల వద్ద కివీస్ ఇన్నింగ్స్ నిలిచిపోగా... ఇప్పుడు అక్కడి నుంచే బుధవారం ఆట జరుగుతుంది. భారత బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగిన కివీస్ మిగిలిన 3.5 ఓవర్లలో మరికొన్ని పరుగులు జోడించే అవకాశం ఉంది. రెండో రోజు వాన దెబ్బ లేకుండా సెమీస్ సజావుగా సాగితే భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాకు లక్ష్యాన్ని ఛేదించడంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ నేడు కూడా మ్యాచ్ మధ్యలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని సవరిస్తారు. భారత ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్లు కూడా సాధ్యంకాకపోతే మ్యాచ్ రద్దయినట్లు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం లీగ్ దశలో టాప్ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. మాంచెస్టర్: ప్రపంచ కప్ తొలి సెమీస్ మ్యాచ్ రెండో రోజుకు చేరింది. సుదీర్ఘ సమయం పాటు కురిసిన వర్షం కారణంగా మంగళవారం ఆట అర్ధాంతరంగా నిలిచిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రాస్ టేలర్ (85 బంతుల్లో 67 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (95 బంతుల్లో 67; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఐదుగురు భారత బౌలర్లు తలా ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం టేలర్‌తో పాటు లాథమ్ (3 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఎదురుచూపులు... కివీస్ ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్ వేసిన 47వ ఓవర్ తొలి బంతికి టేలర్ రెండు పరుగులు తీశాడు. ఈ దశలో వర్షం వచ్చింది. కొన్ని చినుకుల వరకు అంపైర్లు ఆగినా... చహల్ మైదానంలో జారడం, వాన పెరిగితే పిచ్ పాడయ్యే ప్రమాదం ఉండటంతో వెంటనే ఆటను నిలిపివేశారు. భారత కాలమానం ప్రకారం సా. 6.30 గంటలకు ఆట ఆగిపోయింది. ఆ తర్వాతి నుంచి వర్షం పెరగడం, మధ్యలో కొంత తెరిపినిచ్చినా పూర్తిగా తగ్గకపోవడంతో గంటలు గడిచిపోయాయి. దాదాపు రెండున్నర గంటల తర్వాత వాన ఆగడంతో అంపైర్లు పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ వెంటనే మళ్లీ వర్షం వచ్చింది. కివీస్ ఇన్నింగ్స్‌ను అంతటితో ఆపివేసి భారత్ కనీసం 20 ఓవర్లు ఆడే అవకాశం ఇవ్వాలన్నా రాత్రి గం.11.05కు ఆట ఆరంభం కావాల్సింది. కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదు. చివరకు రాత్రి గం.10.52కు మంగళవారం ఆటను యథాతథ స్థితిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. బౌలర్లు భళా... న్యూజిలాండ్‌ను ప్రపంచ కప్ ఆసాంతం వేధించిన ఓపెనింగ్ సమస్య సెమీస్‌లోనూ కొనసాగింది. భువీ, బుమ్రా వేసిన తొలి రెండు ఓవర్లు మెయిడిన్లుగా ముగియగా, తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆడిన గప్టిల్ (1)ను చక్కటి బంతితో బుమ్రా పెవిలియన్ పంపించాడు. స్లిప్‌లో కోహ్లి అద్భుత రీతిలో ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఎనిమిదో ఓవర్ చివరి బంతికి గానీ తొలి ఫోర్ కొట్టలేకపోయిన కివీస్... తొలి 10 ఓవర్లలో 27 పరుగులే చేయగలిగింది. ఈ దశలో నికోల్స్ (51 బంతుల్లో 28; 2 ఫోర్లు), విలియమ్సన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరు 68 పరుగులు జత చేశారు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కివీస్ స్కోరు బాగా నెమ్మదిగా సాగింది. ఈ జోడి కుదురుకుంటున్న దశలో జడేజా టర్నింగ్ బంతితో నికోల్స్ స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత కెప్టెన్‌తో పాటు మరో సీనియర్ టేలర్‌పై పడింది. అయితే ఈ జంట కూడా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక మరీ నెమ్మదిగా ఆడింది. ఒక దశలో 80 బంతుల పాటు న్యూజిలాండ్ ఫోర్ కూడా కొట్టలేకపోయింది! ఎట్టకేలకు చహల్ ఓవర్లో రెండు ఫోర్లు సాధించిన కివీస్ తడబాటును అధిగమించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో విలియమ్సన్ 79 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 65 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి విలియమ్సన్, టేలర్ ఏకంగా 102 బంతులు తీసుకున్నారు. చివరకు చహల్ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు విలియమ్సన్ ఔటయ్యాడు. వెంటనే నీషమ్ (12), గ్రాండ్‌హోమ్ (16) పెవిలియన్ చేరారు. మరో వైపు చహల్ బౌలింగ్‌లో సిక్సర్‌తో టేలర్ 73 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. చివర్లో భారత బౌలర్లు కట్టు తప్పడంతోపాటు నాసిరకమైన ఫీల్డింగ్‌తో 5 ఓవర్లలో కివీస్ 47 పరుగులు చేయగలిగింది. వారి ఇన్నింగ్స్‌లో 153 డాట్ బాల్స్ ఉండటం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి నిదర్శనం. మ్యాచ్ రద్దయితే... మనమే ఫైనల్‌కు వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాంచెస్టర్‌లో బుధవారం కూడా పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఒక వేళ మ్యాచ్ సమయంలో మళ్లీ వర్షం పడితే కివీస్ ఇన్నింగ్స్‌ను అక్కడితోనే ముగించి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైనా డక్‌వర్త్ లూయిస్ వర్తిస్తుంది. అదీ జరగకుండా పూర్తిగా రద్దయితే మాత్రం లీగ్ దశలో టాప్ ర్యాంలో నిలిచిన భారత్ ఫైనల్‌కు చేరుతుంది. నిజానికి మంగళవారం మళ్లీ వర్షం రావడమే భారత్‌కు మంచిదైంది. మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే టీమిండియా విజయానికి 148 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది. టి20 స్టార్లు టీమ్‌లో ఉన్నా...వర్షం ఆగిన తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేది. అదే జరిగితే భారత్‌కు ఛేదన కష్టంగా మారిపోయేదేమో! తొలి బంతికే రివ్యూ పోయింది! భువనేశ్వర్ వేసిన మ్యాచ్ తొలి బంతి గప్టిల్ ప్యాడ్లను తాకడంతో భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. అయితే అంపైర్ కెటిల్‌బరో తిరస్కరించడంతో కోహ్లి రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి లెగ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్నట్లు తేలింది. దాంతో గప్టిల్ బతికిపోగా... మొదటి బంతికే రివ్యూ కోల్పోయిన భారత్ తీవ్రంగా నిరాశ చెందింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1; నికోల్స్ (బి) రవీంద్ర జడేజా 28; విలియమ్సన్ (సి) జడేజా (బి) చహల్ 67; టేలర్ (బ్యాటింగ్) 67; నీషమ్ (సి) కార్తీక్ (బి) పాండ్యా 12; గ్రాండ్‌హోమ్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 16; లాథమ్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (46.1 ఓవర్లలో 5 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–1, 2–69, 3–134, 4–162, 5–200. బౌలింగ్: భువనేశ్వర్ 8.1–1–30–1; బుమ్రా 8–1–25–1; పాండ్యా 10–0–55–1, రవీంద్ర జడేజా 10–0–34–1, చహల్ 10–0–63–1. 87 ఏళ్ల భారత అభిమాని చారులత ఉత్సాహం -
కాయ్ రాజా కాయ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచకప్‌లోకి భారత జట్టు సెమీ ఫైనల్స్‌కు ప్రవేశించడంతో క్రికెట్ అభిమానుల్లోనే కాదు.. బెట్టింగ్‌రాయుళ్లల్లోనూ జోష్ పెంచింది. ఈ క్రేజ్‌కు క్యాష్ చేసుకోవడానికి బుకీలు కొత్త ‘అవతారాల్లో’ రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి చెక్ చెప్పడానికి నిఘా ముమ్మరం చేశారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వారి వివరాలు, కదలికలనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరానికి చెందిన అనేక మంది బుకీలు ఇటీవల తమ పంథా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు వీరంతా నగరంలోనే ఉండి నేరుగా పందేలు కాసేవాళ్లతో (పంటర్లు) సంబంధాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇలా చేయడంతో పోలీసులు దాడి చేసినప్పుడు పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దీంతో కొందరు కీలక బుకీలు ఇటీవల కాలంలో తమ పంథా మార్చారు. ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో వాళ్లు మకాం వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్స్‌తో పాటు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా బెట్టింగ్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. వీరివద్ద పందేలు కాసే పంటర్లు సుపరిచితులే. దీంతో ఫోన్ల ద్వారా పందేలను అంగీకరిస్తున్నారు. ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేయడం, గెలిచిన వారికి అప్పగించడానికి ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు మాత్రమే నగరంలో ఉంటూ ప్రధాన బుకీలకు సహకరిస్తుంటారు. పోలీసులకు వీళ్లు చిక్కుతున్నా అనేక సందర్భాల్లో సూత్రధారులు పట్టుబడట్లేదు. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ముందస్తు పందాల కంటే ఇటీవల కాలంలో లైవ్ బెట్టింగ్‌లు పెరిగాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్‌లో ఫలానా జట్టు గెలుస్తుందని, ఇన్ని పరుగులు చేస్తుందని, ఓడిపోయే జట్టు ఇన్ని పరుగులకే కట్టడి అవుతుందని.. ఈ పంథాలో జరిగేవి ముందస్తు పందేల కిందికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత రేషియో ఆధారంగా బంతి బంతికీ జరిగే పందేలను లైవ్ బెట్టింగ్‌లుగా పరిగణిస్తుంటారు. యాప్స్ ఆధారంగా బెట్టింగ్ దందా నిర్వహించే బుకీలు ఈ తరహాకే ఎక్కువ ప్రాధాన్యమస్తారని చెబుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. నగరంలో బెట్టింగ్ నిర్వహణకు, ఏజెంట్ల కదలికలను ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని మోహరించారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. -
సెమీస్ 'ఫీవర్'
సిటీలో క్రికెట్ ఫీవర్ పీక్‌స్థాయికి చేరింది. నేడు ఇండియా–న్యూజిలాండ్ జట్ల సెమీఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఫెక్సీలు..బ్యానర్లు..ప్రత్యేక స్క్రీన్లతో అభిమానులు హడావుడి చేస్తున్నారు. న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఇండియా ఫైనల్‌కు చేరుతుందని,ఫైనల్లోనూ గెలుపొంది వరల్డ్ కప్ సాధించడం ఖాయమని క్రికెట్ లవర్స్‌తోపాటు పలువురు ప్రముఖులు ధీమాగా ఉన్నారు. సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్/హిమాయత్‌నగర్ :నగరానికి వరల్డ్‌కప్ ఫీవర్ పట్టుకుంది.. క్రికెట్ అభిమానులు మంచి జోష్‌లో ఉన్నారు. నేడు మాంచెస్టర్‌లో జరిగే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల క్రికెట్ క్రేజ్‌కు మరింత జోష్‌నిస్తూ నగరంలోని బడా రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు, కాఫీ షాపులు ప్రత్యేక ఆఫర్లతో ఓ వైపు విందు.. మరోవైపు క్రికెట్ వినోదాన్ని పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. జయహో భారత్ అనే ప్రత్యేక స్క్రీన్లతో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను అభిమానులు చూసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నోరూరించే రుచులతో విభిన్నమైన వంటకాలను ప్రత్యేక ఆఫర్లతో నగరవాసులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చేవారికి ప్రత్యేక వంటకాల మెనూను అందుబాటులో ఉంచామని వివిధ రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ‘రోజువారీ వంటకాలకు కొంచెం డిఫరెంట్‌గా అదనంగా రెండు రకాల బిర్యానీ రుచులు అందించేందుకుసిద్ధమవుతున్నాం’ అని గచ్చిబౌలిలోని ఉలవచారు రెస్టారెంట్ ఎండీ వినయ్ తెలిపారు. ‘స్పెషల్ డీజేతో పాటు పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశాం. డ్రింక్స్ మీద కూడా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాం. మ్యాచ్ ముగిసినా మరో గంట పాటు పార్టీకొనసాగుతుంది’ అని చెప్పారు అవుట్ స్వింగర్ పబ్‌కు చెందిన అమేయ్. ఇదే తరహాలో పలు హోటల్స్ సైతం ప్రత్యేక ఆఫర్లతో సిటీ యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. పాతబస్తీలో భారీ ఫ్లెక్సీలు.. కమాన్ ఇండియా.. విన్ ఫైనల్.. టేక్ వరల్డ్ కప్ అంటూ పాతబస్తీలో ఫ్లెక్సీలు వెలిశాయి. మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ ఇలియాస్ బుకారీ ఆధ్వర్యంలో నయాపూల్ బ్రిడ్జిపై ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్‌దే విజయమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి క్రికెట్‌పై తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. సెమీఫైనల్లో భారత్ నెగ్గి ఫైనల్ చేరుకుంటే ఈ నెల 14న పాతబస్తీ నుంచి గుర్రం బగ్గీతో ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిది గుర్రాలతో ప్రత్యేక బగ్గీని తయారు చేయించి భారత క్రికెట్ ఆటగాళ్ల బొమ్మలను ఏర్పాటు చేసి బాజాభజంత్రీలతో పాతబస్తీలోని మదీనా నుంచి మొజంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెమీస్.. కప్పు.. రెండూ గెలవబోతున్నాం ‘లా ఆఫ్ యావరేజెస్’ ప్రకారం చూస్తే ఈసారి భారత్ జట్టు సెమీ ఫైనల్స్‌తో పాటు ఫైనల్స్‌లోనూ గెలిచి ప్రపంచ కప్పు సొంతం చేసుకోబోతోంది. ఇప్పటికి జరిగిన మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో వరుసగా గెలిస్తే ఆ ధీమాతో ఉదాసీనత కారణంగా ఓడిపోయే ప్రమాదం ఉండేది. లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం తొమ్మిదింటిలో ఏదో ఒక మ్యాచ్‌లో ఓడిపోవాల్సిందే. ఇప్పటికే భారత్ జట్టు ఇంగ్లండ్‌పై ఓడిపోయింది. దీంతో ఆ థియరీ ప్రకారం ఇక కప్పు గెలుచుకునే అవకాశాలు పెరిగాయి. ఇప్పటి వరకు క్రికెట్ కెరీర్లో టీ– 20 సహా అనేక మ్యాచ్‌లు ఆడిన నా అనుభవం సైతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. వాటిలో వరుసగా మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్ లేదా ఫైనల్స్‌లో కప్పును కోల్పోయేవాళ్లం. అలా కాకుండా ఏదో ఒక మ్యాచ్‌లో ఓడి సెమీస్ వరకు వెళ్తే కప్పును సొంతం చేసుకునేవాళ్లం. ఇలా లా ఆఫ్ యావరేజెస్ థియరీ అనేకసార్లు నిజమైంది. ఇప్పుడు భారత జట్టు విషయంలోనూ నిజమవుతుందనే భావిస్తున్నా.– సీవీ ఆనంద్, సీఐఎస్ఎఫ్ ఐజీ/క్రికెటర్ అభిమానులను ఉత్సాహపర్చాలని.. మా కుటుంబానికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. భారత ఆటగాళ్లంటే అభిమానం. భారత్ విజయం సాధించినప్పుడల్లా కుటుంబ సభ్యులందరం పండగ చేసుకుంటాం. మా నాన్నగారు దివంగత మహ్మద్ యాకుబ్ బుకారీ సైతం క్రికెట్ అభిమానే. ఆయన కాలం నుంచే మేము వినూత్న ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తున్నాం. – మహ్మద్ ఇలియాస్ బుకారీ,మహ్మద్ క్యాప్ మార్ట్ ఎండీ వరల్డ్ కప్ మనదే.. భారత జట్టు ఆటతీరు ఎంతో బాగుంది. మునుపెన్నడూ లేని విధంగా చక్కటి ప్రతిభను కనబరుస్తున్నారు. అంచనాలనుతలకిందులు చేస్తూ క్రీడాభిమానుల మన్ననలు అందుకుంటున్నారు మనవాళ్లు. సెమీఫైనల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి ఫైనల్‌కు చేరుకుంటారనే నమ్మకం బలంగా ఉంది. ఫైనల్లోనూ ప్రత్యర్థిని ఓడించి వరల్డ్ కప్‌ను కచ్చితంగా సాధిస్తుందని విశ్వసిస్తున్నా. – అజారుద్దీన్, మాజీ కెప్టెన్ -
నేడే తొలి సెమీఫైనల్.. భారత్ వర్సెస్ కివీస్
‘భారత్ సెమీఫైనల్ ప్రత్యర్థి న్యూజిలాండ్’ శనివారం అర్ధరాత్రి దాటాక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం వచ్చాక సగటు టీమిండియా అభిమానిని ఒకింత సంతోషపర్చిన మాట ఇది! కివీస్‌తో పోరు అనగానే ఇక గెలుపు ఖాయం అన్నట్లుగా అన్ని వైపుల నుంచి ఫ్యాన్స్ నిశ్చింతంగా కనిపిస్తున్నారు. ఫైనల్ ప్రత్యర్థి గురించి మాత్రమే చర్చిస్తున్నారు. మరి నిజంగా ప్రపంచ కప్ సెమీఫైనల్ మాత్రం అంత ఏకపక్షంగా సాగుతుందా? అద్భుత విజయాలతో ఊపు మీదున్న భారత జట్టు నాకౌట్ ఒత్తిడిని అధిగమించి అలవోకగా న్యూజిలాండ్‌కు చెక్ పెడుతుందా? ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక ఓటమి మినహా ఏడు సాధికారిక విజయాలతో సెమీస్ చేరిన జట్టు మనదైతే... పాక్‌తో సమానంగా ఐదు విజయాలే సాధించినా, వరుసగా గత మూడు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా రన్‌రేట్ రూపంలో అదృష్టం కలిసొచ్చి ముందంజ వేసిన టీమ్ న్యూజిలాండ్. బలబలాల పరంగా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్న కోహ్లి సేనకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐసీసీ టోర్నీలో అనూహ్య ప్రదర్శన కనబర్చడం అలవాటుగా మార్చుకున్న కివీస్ అంత సులువుగా లొంగుతుందా? ఫుట్‌బాల్ సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం మాంచెస్టర్ మొత్తం నీలి రంగు పులుముకుంది. విండీస్‌తో మ్యాచ్ తర్వాత కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. అంతకుముందు ఇదే మైదానంలో పాకిస్తాన్‌తో పోరులో కూడా ‘మెన్ ఇన్ బ్లూ’ అభిమాన సంద్రం తరలి వచ్చింది. ఒక రకంగా సొంతగడ్డలా కనిపిస్తోన్న ఓల్డ్ ట్రఫోర్డ్‌లో కోహ్లి సేన ముందు ‘బ్లాక్ క్యాప్స్’ నిలవగలదా? మూడోసారి జగజ్జేతగా నిలిచేందుకు రెండడుగుల దూరంలో ఉన్న భారత్‌కు లార్డ్స్ ప్రయాణంకంటే ముందు కివీస్ సవాల్ ఎదురుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇక అందరి కళ్లూ భారత్–న్యూజిలాండ్ తొలి సెమీస్‌పైనే ఉన్నాయి. మాంచెస్టర్: ప్రపంచ కప్ లీగ్ దశలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ‘ఫేస్ టు ఫేస్’లో ఆధిపత్యం ఎవరిదో తేలలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మనపై కివీస్ చెలరేగినా అది అసలు సమరం మాత్రం కానే కాదు. ఇప్పు డు ఇరు జట్లు నేరుగా నాకౌట్ మ్యాచ్‌లోనే తలపడుతున్నాయి. నేడు ఇక్కడి ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఎదుర్కోనుంది. 2015లోనూ భారత్ సెమీస్ చేరి ఆసీస్ చేతిలో ఓడగా... కివీస్ తుదిపోరుకు అర్హత సాధించి అక్కడ కుదేలైంది. ఇటీవలే కోహ్లి, బుమ్రా లేకుండానే కివీస్‌ను వారి సొంతగడ్డపైనే వన్డే సిరీస్‌లో 4–1తో చిత్తు చేసిన భారత్‌కు ప్రత్యర్థి బలహీనతలపై పక్కా అవగాహన ఉందనడంలో సందేహం లేదు. మార్పులు ఉంటాయా... వరుస విజయాలతో జోరు మీదున్న జట్టు నాకౌట్ మ్యాచ్‌కు వెళుతుంటే సహజంగానే మార్పులకు ఆస్కారం ఉండదు. భారత జట్టు కూడా దాదాపు అదే తరహాలో ఆలోచిస్తోంది. అనితర సాధ్యమైన రీతిలో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ చెలరేగి ఆడుతుండగా, కోహ్లి ఈసారి సహాయక పాత్రలో సమర్థంగా రాణించాడు. ఓపెనర్‌గా రాహుల్ సఫలం కావడం కూడా భారత్‌లో ఆందోళన తగ్గించింది. అయితే సెమీఫైనల్ ఆరంభ ఓవర్లలో వీరంతా బౌల్ట్‌ను సమర్థంగా ఎదుర్కోవడం ముఖ్యం. బౌల్ట్‌కు అవకాశమిస్తే అతను మొత్తం బ్యాటింగ్‌ను కుప్పకూల్చగలడు. నాలుగో స్థానంలో పంత్ సామర్థ్యంపై కొంత అపనమ్మకం కనిపిస్తున్నా, అతని స్థానానికి ఢోకా లేదు. పాండ్యా దూకుడును కొనసాగించాల్సి ఉండగా... ధోని ఈసారి ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడకపోతాడా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. లంకతో మ్యాచ్‌లో ధోనికి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఓవరాల్‌గా తన బ్యాటింగ్‌పై అత్తెసరు మార్కులే వేయించుకున్న మాజీ కెప్టెన్ కూడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. ఇద్దరు రెగ్యులర్ పేసర్లతోనే ఆడితే గత మ్యాచ్‌లాగే రవీంద్ర జడేజా కొనసాగే అవకాశం ఉంది. అయితే పిచ్‌ను బట్టి అవసరమైతే ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా పనికొస్తాడు కాబట్టి దినేశ్ కార్తీక్ స్థానంలో కేదార్ జాదవ్ తిరిగి రావచ్చు. అయితే లంకతో మ్యాచ్‌లో పాండ్యా కూడా పూర్తి పది ఓవర్ల కోటా వేశాడు కాబట్టి ఈ మార్పు సందేహమే. విలియమ్సన్ మినహా... టోర్నీ ఆరంభంలో చెలరేగిన న్యూజిలాండ్ ఆ తర్వాత తడబడింది. తమ చివరి మూడు మ్యాచ్‌లలో పరాజయాలే అందుకు నిదర్శనం. సరిగ్గా చెప్పాలంటే ఒక్క కెప్టెన్ విలియమ్సన్ మినహా మిగతా వారంతా అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. సీనియర్ రాస్ టేలర్ కూడా వరుసగా విఫలమవుతుండటంతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. గప్టిల్ ఘోరంగా ఆడుతుండగా... రెండో ఓపెనర్‌గా మార్చి మార్చి మున్రో, నికోల్స్‌లను ఆడించినా ఇద్దరూ చేతులెత్తేశారు. మిడిలార్డర్లో కీపర్ లాథమ్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్రౌండర్లుగా నీషమ్, గ్రాండ్‌హోమ్ తమ విలువను చూపిస్తే కివీస్ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సౌతీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ రావడం ఖాయమైంది. మూడో పేసర్ హెన్రీ స్థానంలో లెగ్ స్పిన్నర్ సోధికి అవకాశం ఇవ్వాలని కూడా కివీస్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో సాన్ట్నర్ను తప్పించి రెండో స్పిన్నర్ లేని కొరత ఆ జట్టులో బాగా కనిపించింది. పోరాటపటిమలో ఎక్కడా తగ్గని న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలని పట్టుదలగా ఉంది. సెమీఫైనల్ రోజున మాంచెస్టర్‌లో కొంత వర్షసూచన ఉన్నా, అది మ్యాచ్‌కు అంతరాయం కలిగించకపోవచ్చు. ఒకవేళ మంగళవారం మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే బుధవారం దానిని నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు (భారత్) ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. మ్యాచ్ రోజున ఒక జట్టు ఇన్నింగ్స్ పూర్తయి రెండో జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమై మధ్యలో ఆగిపోతే (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోనూ విజేత తేలకపోతే)... ఎక్కడ ఆట ఆగిపోయిందో అక్కడి నుంచే మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున కొనసాగిస్తారు. ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్ ‘టై’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు టి20 తరహాలో ‘సూపర్ ఓవర్’ నిర్వహిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రోజు సూపర్ ఓవర్ సాధ్యపడకపోతే రిజర్వ్ డే రోజున సూపర్ ఓవర్ వేయిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున కూడా సూపర్ ఓవర్ వీలుకాకపోతే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు (భారత్) ఫైనల్‌కు చేరుతుంది. పిచ్, వాతావరణం ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే ఇక్కడ పాక్, విండీస్లపై గెలవగా... కివీస్ చేతిలో విండీస్ త్రుటిలో ఓడింది ఇక్కడే. మోర్గాన్ 17 సిక్సర్లు ఇదే స్టేడియంలో బాదాడు. అయితే ఈ మ్యాచ్‌కు కొత్తగా వేసిన పిచ్‌ను వాడుతున్నారు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం ఖాయం. ఈ ప్రపంచకప్‌లో ఈ మైదానంలో జరిగిన 5 లీగ్ మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ప్రపంచ కప్ రెండో దశకు వచ్చేసరికి పిచ్‌లు జీవం కోల్పోయి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిపోయింది. గత 20 మ్యాచ్‌లలో రెండోసారి బ్యాటింగ్ చేసిన టీమ్ 4 మ్యాచ్‌లే గెలవగలిగింది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పంత్, ధోని, పాండ్యా, కార్తీక్/జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, బౌల్ట్, హెన్సీ/సోధి. బౌల్ట్ X రోహిత్ రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో ఇప్పటికే 647 పరుగులు సాధించాడు. సచిన్ చేసిన ఆల్‌టైమ్ వరల్ట్ కప్ రికార్డు (673)ని దాటేందుకు కేవలం 27 పరుగుల దూరంలో ఉన్న అతను సెమీస్‌లోనూ చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. కాబట్టి అతడిని ఆపేందుకు కివీస్ తమ ‘ట్రంప్ కార్డ్’ ట్రెంట్ బౌల్ట్‌ను ప్రయోగిస్తుందనడంలో సందేహం లేదు. బౌల్ట్ బౌలింగ్‌లో రోహిత్ రికార్డు గొప్పగా లేదు. ముఖ్యంగా లెఫ్టార్మ్ పేసర్లు వేసే ఇన్‌స్వింగర్లను ఎదుర్కోవడంలో అతని బలహీనత చాలా సార్లు బయటపడింది. వార్మప్ మ్యాచ్‌లో కూడా బౌల్ట్ సరిగ్గా ఇలాంటి బంతితోనే రోహిత్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఈసారి రోహిత్ అతడిని ఎంత బాగా ఎదుర్కొంటాడో చూడాలి. వన్డేల్లో బౌల్ట్ బౌలింగ్‌లో 136 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 64.7 స్ట్రయిక్ రేట్‌తో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగుసార్లు అతని బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3-3 ప్రపంచకప్‌లో ఆరుసార్లు సెమీఫైనల్ చేరిన భారత్ 3సార్లు ఓడి (1987, 1996, 2015) మూడుసార్లు ఫైనల్ చేరింది. ఇందులో 2003 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడగా.. 1983, 2011లలో విజేతగా నిలిచింది. 1-6 ప్రపంచ కప్‌లో ఏడుసార్లు సెమీస్ చేరిన న్యూజిలాండ్ 2015లో ఫైనల్ చేరడం మినహా మిగతా ఆరు సార్లు (1975, 1979, 1992, 1999, 2007, 2011) సెమీస్‌లోనే ఓడింది. అత్యధికంగా ఆరు సార్లు సెమీస్‌లో ఓడిన రికార్డు కివీస్ పేరిటే ఉంది. 4-3 ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయం దక్కింది. ఈ రెండు జట్లు 2003 తర్వాత మళ్లీ ఓ ప్రపంచకప్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండటం విశేషం. 2003 ప్రపంచకప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఏడు వికెట్లతో గెలిచింది. -
ఎవరిదో నాకౌట్ పంచ్?
ప్రపంచకప్‌లో లీగ్ దశకు తెర పడింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. వరుసగా 38 రోజుల్లో మొత్తం 45 లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో అన్ని జట్లకు సెమీఫైనల్ చేరే అవకాశాలు సమానంగా లభించాయి. కానీ సెమీఫైనల్లో మాత్రం అలాంటి చాన్స్ ఉండదు. విశ్వవిజేతను నిర్ణయించే ఫైనల్ పోరుకు అర్హత పొందేందుకు ఈ నాలుగు జట్లకు సెమీఫైనల్స్ రూపంలో ఒక్కో అవకాశమే లభించనుంది. ఈ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓడితే ఇంటిదారి పడతారు కాబట్టి నాలుగు జట్లూ ఈ కీలక మ్యాచ్‌ల్లో పైచేయి సాధించేందుకు పక్కా వ్యూహాలతో సమాయత్తం అవుతున్నాయి. – సాక్షి క్రీడావిభాగం టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగిన భారత్ ప్రస్థానం సెమీఫైనల్ వరకు రాజసంగా సాగింది. ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో పరాజయం... వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు కావడం మినహా... మిగతా ఏడు మ్యాచ్‌ల్లో భారత్ అదరగొట్టింది. శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయాలతో మధ్యలోనే వైదొలిగినా వారి నిష్క్రమణ ప్రభావం టీమిండియా ప్రదర్శనపై అంతగా పడలేదు. రోహిత్ శర్మ ఐదు సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉండటం పెద్ద ఊరట. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ శతకంతో ఫామ్‌లోకి రావడం... కెప్టెన్ కోహ్లి నిలకడ... వెరసి భారత టాపార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు భారత మిడిలార్డర్‌కు సరైన పరీక్ష ఎదురుకాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో టాపార్డర్ ప్రదర్శన కీలకం కానుంది. భారత్ భారీ స్కోరు చేయాలన్నా... లక్ష్య ఛేదన సాఫీగా సాగాలన్నా రోహిత్, రాహుల్, కోహ్లిలో ఒకరు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ఒకవేళ వీరు విఫలమైతే మిడిలార్డర్లో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ధోని బాధ్యతాయుతంగా ఆడాలి. బౌలింగ్ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. బుమ్రా 17 వికెట్లు, షమీ 14 వికెట్లు తీశారు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 11 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్ కూడా తమవంతుగా రాణిస్తున్నారు. ఒకరిద్దరిపైనే భారం... అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్న న్యూజిలాండ్‌కు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేసే అలవాటు ఉంది. 1975, 1979, 1992, 1999, 2007, 2011 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్లో నిష్క్రమించిన కివీస్... 2015 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి తుదిమెట్టుపై చతికిలపడింది. ఈ ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు పరాజయం ఎదురుకాలేదు. అయితే పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల్లో కివీస్ జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ విభాగాల్లో ఎక్కువగా ఒకరిద్దరి ప్రదర్శనపైనే ఆధారపడుతోంది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, రాస్ టేలర్... బౌలింగ్‌లో ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ నిలకడగా ఆడుతున్నారు. విలియమ్సన్, టేలర్ తక్కువ స్కోర్లకే ఔటైతే మాత్రం న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశ తప్పదేమో. ముఖాముఖి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొత్తం 106 మ్యాచ్‌లు జరిగాయి. 55 మ్యాచ్‌ల్లో భారత్, 45 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’కాగా... ఐదు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఏడు సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. మూడుసార్లు భారత్‌ను విజయం వరించగా, నాలుగుసార్లు న్యూజిలాండ్ గెలుపు రుచి చూసింది. ఈ రెండు జట్లు చివరిసారి 2003 ప్రపంచకప్‌లో తలపడటం గమనార్హం. వారిద్దరి సారథ్యంలోనే మళ్లీ... విరాట్ కోహ్లి నేతృత్వంలో భారత జట్టు 2008లో అండర్–19 ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది. మలేసియాలో జరిగిన నాటి టోర్నీలో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై మూడు వికెట్ల తేడాతో భారత్ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. నాటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుకు ప్రస్తుత సీనియర్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్ల మధ్య ప్రపంచకప్ సెమీఫైనల్ పోరు జరగనుండగా... యాదృచ్ఛికంగా కోహ్లి, విలియమ్సన్ ఈసారి సీనియర్ జట్లకు సారథులుగా ఉన్నారు. నాటి జూనియర్ న్యూజిలాండ్ జట్టులో సభ్యులుగా ఉన్న ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ... భారత జూనియర్ జట్టులో సభ్యుడైన రవీంద్ర జడేజా ప్రస్తుతం సీనియర్ జట్టులోనూ ఉన్నారు. అడ్డంకి దాటాలంటే... 1992 తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఇంగ్లండ్‌పై ఈసారి భారీగా అంచనాలు ఉన్నాయి. భారీ హిట్టర్లు ఉండటం.. అందరూ ఫామ్‌లోకి రావడం... బౌలింగ్ పదును పెరగడం... వెరసి ఇంగ్లండ్‌ను ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా చేశాయి. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... చావోరేవోలాంటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాలని పట్టుదలగా ఉంది. పోరాటపటిమకు మారుపేరైన ఆసీస్‌ను ఓడించాలంటే ఇంగ్లండ్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. ఇంగ్లండ్ నుంచి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో జో రూట్, బెయిర్‌స్టో రెండేసి సెంచరీలు చేయగా... జేసన్ రాయ్, మోర్గాన్, బట్లర్ ఒక్కోసెంచరీ సాధించారు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ (17 వికెట్లు), మార్క్ వుడ్ (16 వికెట్లు), క్రిస్ వోక్స్ (10 వికెట్లు) హడలెత్తిస్తున్నారు. అయితే లీగ్ దశ ప్రదర్శన ఇప్పుడు చరిత్రే. నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి ఓపెనర్లు శుభారంభం అందించాలి. మిడిలార్డర్ కుదురుగా ఆడాలి. ఆ తర్వాత బౌలర్లు మిగతా బాధ్యతను నిర్వర్తించాలి. కీలక మ్యాచ్‌లో కలిసికట్టుగా ఆడితేనే గట్టెక్కుతామన్న సంగతి ఇంగ్లండ్‌కూ తెలుసు కాబట్టి రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగడం ఖాయం. ముఖాముఖి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఓవరాల్‌గా 148 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 82 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలవగా... 61 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు విజయం దక్కింది. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఎనిమిదిసార్లు పోటీపడ్డాయి. ఆరు సార్లు ఆస్ట్రేలియా నెగ్గగా... రెండుసార్లు ఇంగ్లండ్ గెలిచింది. 1992 ఈవెంట్ తర్వాత ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ మ్యాచ్‌లో విజయం దక్కలేదు. కంగారూ పడొద్దంటే... ప్రపంచ కప్ సెమీస్ ముంగిట డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే షాన్ మార్‡్ష మోచేతి గాయంతో ప్రపంచ కప్‌కు దూరం కాగా, తాజాగా ఉస్మాన్ ఖాజా తొడ కండరాల గాయంతో ప్రపంచ కప్ నుంచి వైదొలిగాడు. ఖాజా స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్‌ను ఎంపిక చేశారు. మరోవైపు ఆల్ రౌండర్ స్టొయినిస్ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతను సెమీఫైనల్లో ఆడేది లేనిది మరో రెండు రోజుల్లో తేలనుంది. స్టొయినిస్‌కు బ్యాకప్‌గా మిచెల్ మార్‡్షను ఎంపిక చేశారు. లీగ్ దశ ఆరంభంలో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి... చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడింది. ఆస్ట్రేలియా విజయమంత్రాల్లో సమష్టి ప్రదర్శన ప్రధానం. ఏ ఒక్కరిపైనో ఆ జట్టు అతిగా ఆధారపడటం లేదు. వార్నర్, ఫించ్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ జోరు మీదుండగా... మ్యాక్స్‌వెల్ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. ఇక బౌలింగ్‌లో మిషెల్ స్టార్క్ 26 వికెట్లతో టోర్నీ టాపర్‌గా కొనసాగుతున్నాడు. కమిన్స్ 13 వికెట్లు, బెహ్రెన్‌డార్ఫ్ తొమ్మిది వికెట్లు తీశారు. లీగ్ దశలో ఇంగ్లండ్‌పై నెగ్గిన ఆస్ట్రేలియా నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. తొలి సెమీఫైనల్ జూలై 9 భారత్ X న్యూజిలాండ్ వేదిక: మాంచెస్టర్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం రెండో సెమీఫైనల్ జూలై 11 ఆస్ట్రేలియా X ఇంగ్లండ్ వేదిక: బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం 2008లో కోహ్లి, విలియమ్సన్ -
భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్
మాంచెస్టర్: ప్రపంచ కప్ ఆసాంతం నిరాశజనక ప్రదర్శన కనబర్చిన దక్షిణాఫ్రికా తమ ఆఖరి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది. శనివారం ఇక్కడ జరిగిన ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలవడం 1992 తర్వాత ఇదే తొలిసారి. 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (117 బంతుల్లో 122; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీ చేసినా... అలెక్స్ క్యారీ (69 బంతుల్లో 85; 11 ఫోర్లు, సిక్స్) మెరిసినా ఫలితం లేకపోయింది. ఫించ్ (3), స్మిత్ (7), స్టొయినిస్ (22), మ్యాక్స్‌వెల్ (12) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ (3/56), ప్రిటోరియస్ (2/27), ఫెలుక్వాయో (2/22) రాణించారు. 4 వికెట్లకు 119 పరుగులతో కష్టాల్లో పడిన ఆసీస్‌ను వార్నర్ ఆదుకున్నాడు. అలెక్స్ క్యారీతో కలిసి ఐదో వికెట్‌కు 108 పరుగులు జోడించాడు. దక్షిణాఫ్రికా శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే 40వ ఓవర్లో ప్రిటోరియస్ బౌలింగ్‌లో మోరిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో వార్నర్ ఔటయ్యాడు. దాంతో ఆసీస్ జట్టు విజయంపై ఆశలు వదులుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (94 బంతుల్లో 100; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీ సాధించాడు. డుసెన్ (97 బంతుల్లో 95; 4 ఫోర్లు, 4 సిక్స్‌ల) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. ఓపెనర్ డికాక్ (51 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ (2/59), లయన్ (2/53) రెండేసి వికెట్లు తీశారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక భారత్ 15 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలువగా... 14 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. 12 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో, 11 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఈనెల 9న మాంచెస్టర్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్; బర్మింగ్‌హామ్‌లో 11న జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా తలపడతాయి. -
ఆనందం ఐదింతలు
వేర్వేరు ప్రత్యర్థులు... వేర్వేరు మైదానాలు, పిచ్‌లు... ప్రపంచ కప్ మెగా టోర్నీ ఒత్తిడి... వేటినీ రోహిత్ గురునాథ్ శర్మ లెక్క చేయడు... పక్షి కన్నుకు గురి పెట్టిన అర్జునుడిలా అతని దృష్టి అంతా పరుగుల వరద పారించడంపైనే... అందుకే రికార్డులు అతని ముందు మోకరిల్లుతాయి. గణాంకాలు గజ్జె కట్టుకొని అతని ముందు ఆడతాయి. తన అత్యద్భుత వన్డే కెరీర్లో ఎన్నో కీర్తికిరీటాలను పదిలపర్చుకున్న ‘హిట్‌మ్యాన్’ ఇప్పుడు మరో శిఖరాన్ని అధిరోహించాడు. పన్నెండు ప్రపంచ కప్‌ల చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఒకే టోర్నీలో ఐదు సెంచరీలతో అతను ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అనితర సాధ్యమైన రీతిలో మూడు వన్డే డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్ ఇప్పుడు మరో రీతిలో చరిత్రను తిరగరాశాడు. రోహిత్ రికార్డుకు తోడు రాహుల్ కూడా సెంచరీతో అండగా నిలవడంతో లీగ్ దశను భారత్ భారీ విజయంతో ముగించింది. ఏమాత్రం పోటీనివ్వలేని రీతిలో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితం కాగా... టీమిండియా తమకు అలవాటైన రీతిలో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. లీడ్స్: ప్రపంచ కప్‌లో భారత్ తమ ఆధిపత్యాన్ని మళ్లీ ప్రదర్శిస్తూ మరో సాధికారక విజయాన్ని సాధించింది. శనివారం ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (128 బంతుల్లో 113; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా, తిరిమన్నె (68 బంతుల్లో 53; 4 ఫోర్లు) రాణించాడు. బుమ్రా 37 పరుగులకే 3 వికెట్లు తీయడం విశేషం. అనంతరం భారత్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 265 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (94 బంతుల్లో 103; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (118 బంతుల్లో 111; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు బాది జట్టును సునాయాసంగా గెలిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించడం విశేషం. వరుసగా మూడో శతకం బాదిన రోహిత్‌కు వన్డేల్లో ఇది 27వ సెంచరీ. కీలక భాగస్వామ్యం... భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లు పూర్తి కాక ముందే జట్టు స్కోరు 55/4 వద్ద నిలిచింది. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వని బుమ్రా... కరుణరత్నే (10)ను ఔట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. మరో రెండు ఓవర్లకు కుశాల్ పెరీరా (18) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న రవీంద్ర జడేజా తన మొదటి ఓవర్లోనే కుశాల్ మెండిస్ (3) పని పట్టగా... పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో అవిష్క ఫెర్నాండో (20) కూడా ఔటయ్యాడు. ఈ స్థితిలో మాథ్యూస్, తిరిమన్నె భాగస్వామ్యం లంకను ఆదుకుంది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 82 పరుగుల ఇన్నింగ్స్ మినహా ఇతర అన్ని మ్యాచ్‌లలో విఫలమైన మాథ్యూస్ కీలక సమయంలో తన అనుభవాన్ని ప్రదర్శించాడు. ప్రపంచ కప్‌లో తొలి అర్ధ సెంచరీతో తిరిమన్నె అతనికి అండగా నిలిచాడు. నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్న అనంతరం ఈ జంట కొన్ని చక్కటి షాట్లు ఆడింది. 61 పరుగుల వద్ద మాథ్యూస్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను భువనేశ్వర్ వదిలేశాడు. ఎట్టకేలకు తిరిమన్నెను కుల్దీప్ ఔట్ చేయడంతో 124 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 115 బంతుల్లో మాథ్యూస్ సెంచరీ పూర్తయింది. అతని కెరీర్లో ఇది మూడో సెంచరీ కాగా మూడూ భారత్‌పైనే వచ్చాయి. రాహుల్ హిట్... కెరీర్ తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన రాహుల్ మూడేళ్ల తర్వాత తన 22వ వన్డేలో మరో శతకం సాధించగలిగాడు! గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 77 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చిన అతను దానిని ఇక్కడా కొనసాగించాడు. ఈ క్రమంలో లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. ఆరంభంలో ఐదు బంతుల వ్యవధిలోనే మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించిన రాహుల్, ఆ తర్వాత రోహిత్‌కు అండగా నిలిచాడు. డి సిల్వా వేసిన ఒక ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన అతను 67 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ వెనుదిరిగిన కొద్ది సేపటి తర్వాత మలింగ బౌలింగ్‌లో సింగిల్ తీయడంతో 109 బంతుల్లో రాహుల్ తొలి ప్రపంచ కప్ సెంచరీ పూర్తయింది. జట్టు విజయానికి 21 పరుగుల దూరంలో రాహుల్ ఔట్ కాగా... విరాట్ కోహ్లి (41 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అజేయంగా నిలిచి టీమ్‌ను గెలుపు తీరం చేర్చాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: కరుణరత్నే (సి) ధోని (బి) బుమ్రా 10; కుశాల్ పెరీరా (సి) ధోని (బి) బుమ్రా 18; అవిష్క ఫెర్నాండో (సి) ధోని (బి) పాండ్యా 20; కుశాల్ మెండిస్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 3; మాథ్యూస్ (సి) రోహిత్ (బి) బుమ్రా 113; తిరిమన్నె (సి) జడేజా (బి) కుల్దీప్ 53; ధనంజయ డి సిల్వా (నాటౌట్) 29; తిసారా పెరీరా (సి) పాండ్యా (బి) భువనేశ్వర్ 2; ఉదాన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–17, 2–40, 3–53, 4–55, 5–179, 6–253, 7–260. బౌలింగ్: భువనేశ్వర్ 10–0–73–1, బుమ్రా 10–2–37–3, హార్దిక్ పాండ్యా 10–0–50–1, జడేజా 10–0–40–1, కుల్దీప్ 10–0–58–1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) కుశాల్ పెరీరా (బి) మలింగ 111; రోహిత్ (సి) మాథ్యూస్ (బి) రజిత 103; కోహ్లి (నాటౌట్) 34; పంత్ (ఎల్బీ) (బి) ఉదాన 4; పాండ్యా (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (43.3 ఓవర్లలో 3 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–189, 2–244, 3–253. బౌలింగ్: మలింగ 10–1–82–1, రజిత 8–0–47–1, ఉదాన 9.3–0–50–1, తిసారా పెరీరా 10–0–34–0, ధనంజయ డి సిల్వా 6–0–51–0. 1: ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా రోహిత్ శర్మ ఘనత వహించాడు. 1: ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు కొట్టిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (44 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు) సరసన రోహిత్ (16 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు) చేరాడు. ఐదేసి సెంచరీలతో రికీపాంటింగ్ (ఆస్ట్రేలియా), కుమార సంగక్కర (శ్రీలంక) రెండో స్థానంలో ఉన్నారు. 2: విరాట్ కోహ్లి తర్వాత వన్డేల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టిన రెండో భారతీయ క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్‌గా 11వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సంగక్కర 2015 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టాడు. 2: అంతర్జాతీయ క్రికెట్లో (టెస్టు, వన్డే ఫార్మాట్) ఓ సిరీస్‌లో లేదా ఓ టోర్నమెంట్లో ఐదు సెంచరీలు కొట్టిన రెండో క్రికెటర్ రోహిత్. 1955లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో విండీస్ బ్యాట్స్‌మన్ క్లయిడ్ వాల్కట్ ఐదు సెంచరీలు కొట్టాడు. 3: ప్రపంచకప్ మ్యాచ్‌లో ఓ జట్టు తరఫున ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున దిల్షాన్, ఉపుల్ తరంగ (జింబాబ్వే, ఇంగ్లండ్‌లపై) రెండుసార్లు ఈ ఘనత సాధించారు. 3: వన్డేల్లో ఎంజెలో మాథ్యూస్ చేసిన మూడు సెంచరీలు భారత్‌పైనే వచ్చాయి. అయితే మాథ్యూస్ సెంచరీ చేసిన మూడుసార్లూ శ్రీలంక ఓడిపోవడం గమనార్హం. 27: మరో 27 పరుగులు చేస్తే ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ ఘనత వహిస్తాడు. ఈ జాబితాలో సచిన్ (673 పరుగులు–2003లో), హేడెన్ (659 పరుగులు–2007లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ 647 పరుగులతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. రోహిత్ స్పెషల్... మంచినీళ్లప్రాయంగా సెంచరీలు బాదుతున్న రోహిత్ నుంచి మరో సునాయాస శతకం జాలువారింది. శ్రీలంక బౌలర్లను అసలు ఏమాత్రం లెక్క చేయకుండా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నంత సునాయాసంగా రోహిత్ బ్యాటింగ్ సాగింది. రజిత వేసిన రెండో ఓవర్లో కొట్టిన ఫోర్‌తో మొదలైన పరుగుల ప్రవాహం సెంచరీ వరకు సాగింది. మలింగ ఓవర్లో రెండు వరుస ఫోర్ల అనంతరం రజిత తర్వాతి ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టి రోహిత్ దూసుకుపోయాడు. సిల్వా వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచి 48 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ అదే ఓవర్లో మరో భారీ సిక్సర్ బాదాడు. ఉదాన ఓవర్లో రెండు బౌండరీలతో 90ల్లోకి చేరుకున్న రోహిత్... రజిత బౌలింగ్‌లో పుల్ షాట్‌తో ఫోర్ కొట్టి అరుదైన శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఒకే ప్రపంచకప్‌లో ఐదో సెంచరీతో కొత్త ఘనతను అందుకున్నాడు. మొత్తం ఇన్నింగ్స్ అనాయాసంగా, శ్రమ లేకుండా సాగడం చూస్తే రోహిత్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా ప్రదర్శనతో రోహిత్ ఈ ప్రపంచ కప్‌లో 647 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే అందులో ఐదు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉండటం విశేషం. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ స్కోర్లు రాహుల్, మాథ్యూస్ రోహిత్ భార్య రితిక -
పాక్‌కు ఊరట గెలుపు
లండన్: ప్రపంచ కప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల ఆట ముగిసింది. శుక్రవారం జరిగిన నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో పాక్ 94 పరుగులతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ (100 బంతుల్లో 100; 7 ఫోర్లు) సెంచరీ సాధించాడు. బాబర్ ఆజమ్ (98 బంతుల్లో 96; 11 ఫోర్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. పేసర్ ముస్తఫిజుర్ (5/75) టోర్నీలో రెండోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. అద్భుత ఫామ్ కొనసాగిస్తూ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (77 బంతుల్లో 64; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించినా ఇతరుల నుంచి సహకారం కరవవడంతో ఛేదనలో బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. ఈ కప్‌లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేస్తూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, షాహీన్ అఫ్రిది (6/35) ప్రత్యర్థి వెన్నువిరిచాడు. మొత్తం 9 లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పాకిస్తాన్ 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా కివీస్‌కు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది.