de Villiers
-
‘నమ్దే’ ఇంకెప్పుడు?
సాక్షి క్రీడా విభాగం: ‘ఓటములు మమ్మల్ని ఓడించలేవు. పోరాట స్ఫూర్తి మమ్మల్ని సజీవంగా ఉంచుతుంది’... తమ అధికారిక వెబ్సైట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ రాసుకున్న వాక్యం ఇది. అదేంటో గానీ పోరాటాలే తప్ప జట్టు ఖాతాలో విజయాలు మాత్రం లేవు. ఐపీఎల్లో పాపులారి టీ విషయంలో మిగతా జట్లతో పోలిస్తే ఎక్కడా తక్కువ కాదు, పెద్ద సంఖ్యలో అభిమాన గణం, వాణిజ్యపరంగా చూస్తే వహ్వా అనిపించే కంపెనీలతో సహవాసం... స్వయంగా భారత కెప్టెన్ సుదీర్ఘ కాలంగా జట్టును నడిపిస్తుండగా, టి20లో విధ్వంసానికి చిరునామాలాంటి డివిలియర్స్, గతంలో గేల్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌ను ఒక ఊపు ఊపారు. కానీ తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం సున్నా! మూడుసార్లు ఫైనల్లో ఓడిన బెంగళూరు ఇప్పుడైనా ఆ గండాన్ని దాటి కన్నడ అభిమానులతో ‘కప్ నమ్దే ( మనదే)’ అనిపిస్తుందో లేదో వేచి చూడాలి! కొత్తగా వచ్చినవారు ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఇద్దరు ఆటగాళ్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు), ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ. 14.25 కోట్లు)లకు అనూహ్య మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. వేలానికి ముందు విదేశీ ఆల్‌రౌండర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అవసరం ఆ జట్టుకు ఉంది. అందుకు తగినట్లుగానే ఐపీఎల్ అనుభవం ఉన్న మరో ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియాన్ (రూ. 4.80 కోట్లు)ను కూడా తీసుకుంది. ఈ ముగ్గురు కాకుండా మరో ఐదుగురు భారత వర్ధమాన ఆటగాళ్లను కనీసం మొత్తం రూ.20 లక్షలకే సొంతం చేసుకుంది. సచిన్ బేబీ, రజత్ పటిదార్, మొహమ్మద్ అజహరుద్దీన్, సుయాష్ ప్రభుదేశాయ్‌లతో పాటు ఆంధ్ర జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇంత మొత్తం చెల్లించినా... భారత గడ్డపై ఇప్పటి వరకు ఒక్కబంతి కూడా వేయని జేమీసన్, గత కొన్నేళ్లుగా వరుసగా విఫలమవుతున్న మ్యాక్స్‌వెల్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ఒక భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కోసం బెంగళూరు చివరి వరకు ప్రయత్నించినా సరైన ఆటగాడు దక్కలేదు. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, పవన్ దేశ్‌పాండే, షహబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, హర్షల్ పటేల్, సచిన్ బేబీ, రజత్ పటిదార్, మొహమ్మద్ అజహరుద్దీన్, సుయాష్ ప్రభుదేశాయ్, కోన శ్రీకర్ భరత్. విదేశీ ఆటగాళ్లు: డివిలియర్స్, డానియెల్ స్యామ్స్, ఫిన్ అలెన్, జేమీసన్, డాన్ క్రిస్టియాన్, మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్. సహాయక సిబ్బంది: మైక్ హెసన్ (డైరెక్టర్, క్రికెటర్ ఆపరేషన్స్), సైమన్ కటిచ్ (హెడ్ కోచ్), సంజయ్ బంగర్ (బ్యాటింగ్ కన్సల్టెంట్), శ్రీధరన్ శ్రీరామ్ (బ్యాటింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ కోచ్), ఆడమ్ గ్రిఫిత్ (బౌలింగ్ కోచ్). తుది జట్టు అంచనా/ఫామ్ మూడు–కోహ్లి, నాలుగు–డివిలియర్స్, ఐదు–మ్యాక్స్‌వెల్... భారీ మొత్తాన్ని చెల్లించి మ్యాక్సీని తీసుకోవడం ఐదో స్థానంలో ఆడించాలనే వ్యూహంలో భాగమే. కోహ్లి, డివిలియర్స్‌లు కాకుండా ఇన్నింగ్స్ చివర్లో మెరుపు షాట్లు ఆడే ఒక బ్యాట్స్‌మన్ అవసరం ఉన్న టీమ్ ఇప్పుడు ఆసీస్ ఆటగాడిపై ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్‌లో పడిక్కల్‌కు తోడుగా ఫిన్ అలెన్ (కివీస్) బరిలోకి దిగవచ్చు. నాలుగో విదేశీ ఆటగాడిగా జేమీసన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నా యి. రెండో ఓపెనర్‌గా కూడా భారత ఆటగాడి (అజహరుద్దీన్)కే అవకాశం ఇస్తే జంపా, రిచర్డ్సన్లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. వేలం తర్వాత ఇలాంటి కూర్పులో కూడా ఆరో స్థానంలో ఒక భారత బ్యాట్స్‌మన్‌పైనే జట్టు ఆధారపడాల్సి వస్తోంది. మ్యాక్స్‌వెల్ విఫలమైతేనే క్రిస్టియాన్‌కు చాన్స్ లభిస్తుంది. స్పిన్నర్లుగా తుది జట్టులో చహల్, సుందర్ ఖాయం. సిరాజ్, సైనీలలో ఎవరికి ఎన్ని మ్యాచ్‌లు లభిస్తాయనేది చూడాలి. అత్యుత్తమ ప్రదర్శన 3 సార్లు రన్నరప్ (2009, 2011, 2016) 2020లో ప్రదర్శన: పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. లీగ్‌లో తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలిచి ఒక దశలో టాపర్‌గా నిలుస్తుందనుకున్న ఆర్సీబీ, వరుసగా మిగిలిన నాలుగు మ్యాచ్‌లు ఓడింది. చివరకు అతి కష్టమ్మీద నెట్‌రన్‌రేట్‌తో ముందంజ వేయగలిగింది. కోహ్లి తన స్థాయి మేరకు ఆడకపోవడం కూడా (15 ఇన్నింగ్స్‌లలో 121.35 స్ట్రయిక్‌రేట్‌తో 466 పరుగులు) జట్టు అవకాశాలపై ప్రభావం చూపించింది. -
డివిలియర్స్ ధమాకా
అబ్రహాం బెంజమిన్ (ఏబీ) డివిలియర్స్ ఐపీఎల్లో తన విలువేంటో మరోసారి చూపించాడు. ఇతర బ్యాట్స్‌మన్ ఒక్కో పరుగు కోసం శ్రమించిన చోట అతను మెరుపు షాట్లతో చెలరేగిపోయాడు. 220కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో అతను సాగించిన ధాటి బెంగళూరు అభిమానులకు చిన్నస్వామి మైదానాన్ని గుర్తుకు తెస్తే వీక్షకులకు వినోదాన్ని పంచింది. టాప్ గేర్‌లో సాగిన డివిలియర్స్ ఆటకు కోహ్లి సహకారం తోడు కావడంతో భారీ స్కోరు సాధించిన ఆర్సీబీ... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతాను కుప్పకూల్చింది. శుబ్‌మన్ గిల్ ప్రయత్నం మినహా... జట్టులో ఇతర ఆటగాళ్లెవరూ కనీస ప్రదర్శన కూడా ఇవ్వకపోవడంతో విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న ఆ జట్టు ఈసారి ఛేదనలో చేతులెత్తేసింది. షార్జా: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మోమున మళ్లీ చిరునవ్వు! ఐపీఎల్లో నెమ్మదిగా నిలదొక్కుకున్న ఆ జట్టు ఐదో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 82 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. తాజా సీజన్లో ఒక జట్టుకు ఇదే అతి పెద్ద విజయం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (33 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోగా... ఫించ్ (37 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (28 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్), దేవ్‌దత్ పడిక్కల్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుబ్‌మన్ గిల్ (25 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) తప్ప అంతా విఫలమయ్యారు. మోరిస్, సుందర్ చెరో 2 వికెట్లు తీశారు. నరైన్ బౌలింగ్ శైలిపై సందేహాలు వచ్చిన నేపథ్యంలో కోల్‌కతా జట్టు ముందు జాగ్రత్త ప్రదర్శించింది. మరోసారి అంపైర్లు ఫిర్యాదు చేస్తే సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉండటంతో ఇప్పుడు తుది జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టింది. నరైన్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు. అతనికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. ఫించ్ నెమ్మదిగా... బెంగళూరుకు ఓపెనర్లు ఫించ్, పడిక్కల్ శుభారంభాన్ని అందించారు. అయితే పడిక్కల్ వేగంగా ఆడగా, ఫించ్‌లో అది లోపించింది. ఒకదశలో ఏడు బంతుల వ్యవధిలో 4 ఫోర్లతో పడిక్కల్ దూకుడు ప్రదర్శించాడు. 19 పరుగుల వద్ద ఫించ్ ఇచ్చిన క్యాచ్‌ను నాగర్కోటి వదిలేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 47 పరుగులకు చేరింది. రసెల్ బౌలింగ్‌లో పడిక్కల్ బౌల్ట్ కావడంతో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. కొద్ది సేపటికే ఫించ్‌ను ప్రసిధ్ కృష్ణ బౌల్డ్ చేశాడు. విధ్వంసం సాగిందిలా... ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ మూడో బంతికి డివిలియర్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో జట్టు స్కోరు 90/1. అప్పటి వరకు చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి కట్టడి చేసిన కోల్‌కతా ఏబీ దూకుడు ముందు తేలిపోయింది. ప్రసిధ్ ఓవర్లో ఫోర్‌తో ఖాతా తెరిచిన డివిలియర్స్... నాగర్కోటి ఓవర్‌తో దూసుకుపోయాడు. ఈ ఓవర్లో అతను 2 సిక్సర్లు, ఫోర్ కొట్టాడు. ఇక కమిన్స్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా అతను ఇలాగే 2 సిక్సర్లు, ఫోర్ బాదాడు. రసెల్ ఓవర్లో వరుసగా కొట్టిన 4, 6తో 23 బంతుల్లోనే ఏబీ అర్ధ సెంచరీ పూర్తయింది. వికెట్ల మధ్య కూడా చురుగ్గా పరుగెడుతూ ఐదుసార్లు రెండేసి పరుగుల చొప్పున సాధించిన అతడు... రసెల్ వేసిన చివరి ఓవర్లో మరో సిక్స్, ఫోర్‌తో ముగించాడు. నాగర్కోటి బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్ స్టేడియం బయట రోడ్డుపై వెళుతున్న కారుపై పడగా... ఆఖరి ఓవర్లో రసెల్ వేసిన యార్కర్‌ను పాయింట్ దిశగా ఫోర్‌గా మలచిన షాట్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. కోహ్లి ప్రేక్షకుడిలా... వరల్డ్ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ కోహ్లి బ్యాటింగ్ చేస్తుంటే సాధారణంగా మరో ఎండ్‌లోని ప్లేయర్ ఆధిపత్యం ప్రదర్శించడం అరుదు. గతంలో గేల్, డివిలియర్స్‌లు భీకరంగా ఆడిన సమయంలో కోహ్లి కూడా దాదాపుగా వారితో పరుగుల కోసం పోటీ పడేవాడు. కానీ ఈ మ్యాచ్‌లో భిన్నమైన దృశ్యం కనిపించింది. అతని ఆట చాలా నెమ్మదిగా సాగింది. చెన్నైతో ఆడిన గత ఇన్నింగ్స్‌తో పోలిస్తే ఎక్కడా ఆ దూకుడు కనిపించలేదు. డివిలియర్స్ ఊచకోత కోస్తుండగా, కోహ్లి మాత్రం సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. జోరు మీదున్న డివిలియర్స్‌కే ఎక్కువగా బ్యాటింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒకే ఒక ఫోర్ తాను ఆడిన 25వ బంతికి వచ్చింది! డివిలియర్స్, కోహ్లి భాగస్వామ్యంలో మొత్తం 47 బంతులు ఉండగా... ఇందులో 33 ఏబీ, 14 మాత్రమే కోహ్లి ఆడారు. సమష్టి వైఫల్యం... కేకేఆర్ మొత్తం ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయంటే జట్టు బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఏ దశలో కూడా జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. కొత్త ఆటగాడు బాంటన్ (8)ను సైనీ బౌల్డ్ చేయగా, నితీశ్ రాణా (9)ను సుందర్ ఇలాగే వెనక్కి పంపించాడు. మోర్గాన్ (8)తో సమన్వయ లోపంతో గిల్ రనౌటైన తర్వాత నైట్‌రైడర్స్ పతనం వేగంగా సాగింది. రెండు పరుగుల వ్యవధిలో దినేశ్ కార్తీక్ (1), మోర్గాన్ వెనుదిరిగారు. సగం వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే భారం రసెల్ (16), రాహుల్ త్రిపాఠి (16)లపై పడింది. ఉదాన ఓవర్లో వరుసగా 4, 6, 4 బాది దూకుడు పెంచినట్లు కనిపించిన రసెల్ అదే ఓవర్లో అవుటయ్యాడు. దాంతో కోల్‌కతా గెలుపు ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈ దశలో 31 బంతుల్లో 106 పరుగులు చేయాల్సి ఉండటంతో మిగిలిన ఇన్నింగ్స్ లాంఛనమే అయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫించ్ (బి) ప్రసిధ్ 47; దేవ్‌దత్ పడిక్కల్ (బి) రసెల్ 32; కోహ్లి (నాటౌట్) 33; డివిలియర్స్ (నాటౌట్) 73; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–67; 2–94. బౌలింగ్: కమిన్స్ 4–0–38–0; ప్రసిధ్ కృష్ణ 4–0–42–1; రసెల్ 4–0–51–1; వరుణ్ 4–0–25–0; నాగర్కోటి 4–0–36–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: బాంటన్ (బి) సైనీ 8; గిల్ (రనౌట్) 34; రాణా (బి) సుందర్ 9; మోర్గాన్ (సి) ఉదాన (బి) సుందర్ 8; కార్తీక్ (బి) చహల్ 1; రసెల్ (సి) సిరాజ్ (బి) ఉదాన 16; త్రిపాఠి (సి) మోరిస్ (బి) సిరాజ్ 16; కమిన్స్ (సి) పడిక్కల్ (బి) మోరిస్ 1; నాగర్కోటి (బి) మోరిస్ 1; వరుణ్ (నాటౌట్) 7; ప్రసిధ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 112. వికెట్ల పతనం: 1–23; 2–51; 3–55; 4–62; 5–64; 6–85; 7–89; 8–99; 9–108. బౌలింగ్: మోరిస్ 4–0–17–2; సైనీ 3–0–17–1; సిరాజ్ 3–0–24–1; సుందర్ 4–0–20–2; చహల్ 4–0–12–1; ఉదాన 2–0–19–1. -
కరోనాపై పోరు: ఐపీఎల్ కిట్ల వేలం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి సాయం అందించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ ముందుకు వచ్చారు. ఇందుకోసం తమ ఐపీఎల్ కిట్లను వేలం వేయాలని నిర్ణయించారు. కోహ్లితో కలిసి నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో డివిలియర్స్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2016లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన గ్రీన్ డే మ్యాచ్ కిట్లను వేలం వేయాలని వీరిద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు పచ్చని రంగు దుస్తులతో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన ఆడిన కోహ్లి, డివిలియర్స్ సెంచరీలు సాధించారు. ‘2016 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మేమిద్దరం శతకాలు బాదాం. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఆ రోజు ఆటను బాగా ఆస్వాదించాం. నేను 120 పరుగులు చేశాను. నువ్వు సెంచరీ సాధించావు. పర్యావరణ పరిక్షణ పట్ల చైతన్యం కలిగించడానికి గ్రీన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో మనం ఆడిన కిట్లను వేలం వేద్దాం. దీని ద్వారా వచ్చిన నగదును కోవిడ్-19 ఫండ్‌కు ఇద్దాం. అభిమానులూ.. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి. వేలంలో ఎంత ఎక్కువ డబ్బు వస్తే అంత ఎక్కువ మందికి మేలు జరుగుతుంద’ని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. కరోనా: ఢిల్లీలో పులి మృతి కలకలం -
పంజాబ్‌పై కోహ్లి జట్టు గెలుపు
-
గెలిచి నిలిచిన ఆర్సీబీ
బెంగళూరు: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్సీబీ.. ఆ తర్వాత బౌలింగ్‌లో చెమటోడ్చి మ్యాచ్‌ను కాపాడుకుంది. దాంతో ప్లే ఆఫ్ ఆశల్ని ఆర్సీబీ సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ కడవరకూ పోరాడి ఓడింది. లక్ష్యం భారీగా ఉండటంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. విలియమ్సన్(81; 42 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), మనీష్ పాండే(62 నాటౌట్; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, అలెక్స్ హేల్స్‌లు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన తర్వాత ధావన్(18;15 బంతుల్లో 2 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆపై 17 పరుగుల వ్యవధిలో హేల్స్(37;24 బంతుల్లో 2 ఫోర్లు,3 సిక్సర్లు) సైతం పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 64 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-మనీష్ పాండేలు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకున్నారు. ఒకవైపు విలియమ్సన్ తన సహజ శైలికి భిన్నంగా విరుచుకుపడి ఆడితే, మనీష్ పాండే సమయోచితంగా బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరి ఓవర్ మొదటి బంతికి విలియమ్సన్ ఔట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో సన్‌రైజర్స్ విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా, 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్(69;39 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్), మొయిన్ అలీ(65;34బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)లు చెలరేగి ఆడగా, గ్రాండ్ హోమ్ (40; 17 బంతుల్లో1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టు భారీ స్కోరులో సహకరించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పార్థీవ్ పటేల్, కోహ్లిలు ఆరంభించారు. వీరిద్దరూ స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పార్థీవ్ పటేల్(1) తొలి ఓవర్ ఆఖరి బంతికి పెవిలియన్ చేరగా, ఐదో ఓవర్ ఐదో బంతికి విరాట్ కోహ్లి(12) ఔటయ్యాడు. ఆ తరుణంలో ఏబీ డివిలియర్స్-మొయిన్ అలీల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే రషీద్ ఖాన్ వేసిన 15 ఓవర్లో డివిలియర్స్, మొయిన్ అలీలు పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 14.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆపై గ్రాండ్ హోమ్ మెరుపులు మెరిపించగా, సర్ఫరాజ్ ఖాన్(22 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మకు వికెట్ దక్కింది. -
ఏబీ డివిలియర్స్ అద్భుతమైన క్యాచ్
-
ఏబీ సెన్సేషనల్ క్యాచ్
బెంగళూరు: ప్రపంచ క్రికెట్లో ఏబీ డివిలియర్స్‌ది ప్రత్యేకస్థానం. బ్యాట్స్‌మన్‌గానే కాదు.. కీపర్‌గా, ఫీల్డర్‌గా చెరగని ముద్ర అతని సొంతం. ఐపీఎల్ తాజా సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో మెరిసిన డివిలియర్స్.. ఆపై అద్భుతమైన క్యాచ్‌ను పట్టి ఫీల్డింగ్‌లో కూడా తనదైన మార్కును మరోసారి చూపెట్టాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ బౌలర్ మొయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతిని అలెక్స్ హేల్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డివిలియర్స్ గాల్లో అమాంతం ఎగిరి క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. ఆ క్రమంలోనే బౌండరీ లైన్ తాకకుండా తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఏబీ సెన్సేషనల్ క్యాచ్‌తో చిన్నస్వామి స్టేడియం మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏబీ డివిలియర్స్(69;39 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్), మొయిన్ అలీ(65;34బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)లు చెలరేగి ఆడగా, గ్రాండ్ హోమ్ (40; 17 బంతుల్లో1 ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరకు నమోదు చేసింది. -
డివిలియర్స్ అవుట్
సెంచూరియన్: భారత్‌తో జరుగుతున్న చివరిదైన ఆరో వన్డేలో దక్షిణాఫ్రికా మూడో వికెట్‌ను నష్టపోయింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్(30) మూడో వికెట్‌గా అవుటయ్యాడు. స్నిన్నర్ చాహల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా 105 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు మర్క్రామ్(24), హషీమ్ ఆమ్లా(10)లు పెవిలియన్‌కు చేరారు. ఈ మూడు వికెట్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా, చాహల్‌కు వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరో వన్డేలో భారత జట్టు పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు దక్షిణాఫ్రికా రెండు మార్పులతో పోరుకు సిద్దమైంది.జేపీ డుమిని స్థానంలో జాండో జట్టులోకి రాగా, డేవిడ్ మిల్లర్ స్థానంలో బెహర్దియన్‌ను తీసుకున్నారు. -
మొన్న ఏబీ... నిన్న డు ప్లెసిస్... నేడు డికాక్
కేప్‌టౌన్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓటములతో పాటు గాయాలతోనూ విలవిల్లాడుతోంది. వన్డేల్లో కోహ్లి సేన చేతిలో వరుస పరాజయాలు... గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవడంతో సఫారీ జట్టు కుదేలవుతోంది. ఇప్పటికే ఏబీ డివిలియర్స్ తొలి మూడు వన్డేల్లో ఆడట్లేదు. డు ప్లెసిస్ ఏకంగా భారత్‌తో సిరీస్‌కే దూరమయ్యాడు. వీళ్లిద్దరు చేతి వేలి గాయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు వికెట్ కీపర్–బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ ఈ జాబితాలో చేరాడు. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా అతని ఎడమ మణికట్టుకు గాయమైంది. దీంతో అతను మిగతా నాలుగు వన్డేలతో పాటు టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. డికాక్ పూర్తిగా కోలుకునేందుకు రెండు నుంచి నాలుగు వారాలు పడుతుందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. బుధవారం కేప్‌టౌన్‌లో జరిగే మూడో వన్డేతో అతని కెరీర్ మొదలవనుంది. ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. -
నాలుగులో రహానే..!
డర్బన్: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ గురువారం టీమిండియాతో ఆరంభమైన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. డర్బన్ మైదానం స్వతహాగా బ్యాటింగ్ ట్రాక్ కావడంతో ముందుగా డు ప్లెసిస్ బ్యాటింగ్ తీసుకునేందుకు ప్రధాన కారణం. తొలి మూడు వన్డేలకు ఏబీ డివిలియర్స్ దూరం కావడంతో అతని స్థానంలో మొదటి వన్డేలో మర్‌క్రామ్‌ను తుది జట్టులో తీసుకున్నారు. నాలుగులో రహానే.. నాల్గో స్థానంలో నమ్మదగిన బ్యాట్స్‌మన్ అయిన అజింక్యా రహానేపైనే టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. మనీశ్‌పాండే పోటీలో ఉండటంతోనాలుగో స్థానంపై ప్రధానం చర్చ సాగింది. అయితే ఆ స్థానంలో రహానే కరెక్ట్ అని భావించిన యాజమాన్యం అతన్నే తుది జట్టులోకి తీసుకుంది. లంకతో సిరీస్‌లో రాణించిన శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ బెంచ్‌కే పరిమితం అయ్యారు. కాగా, భారత జట్టు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్, చాహల్‌ను జట్టులోకి తీసుకుంది.కాగా, వీరిద్దరితో కలిసి పార్ట్‌టైమ్ స్పిన్నర్ కేదర్ జాదవ్ స్పిన్ విభాగాన్ని పంచుకోనున్నాడు. దక్షిణాఫ్రికా తుది జట్టు: డు ప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీ కాక్, మర్క్రామ్, జేపీ డుమినీ, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, ఫెలూక్వాయో, రబడా, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహీర్ భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రహానే, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, చాహల్ -
దక్షిణాఫ్రికా అదే జోరు
బ్లూమ్ఫొంటీన్: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ రాత టి20ల్లోనూ మారలేదు. గత మ్యాచ్‌లతో పోలిస్తే కాస్త పోరాటపటిమ కనబర్చినా... చివరకు ఓటమి తప్పలేదు. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 20 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (27 బంతుల్లో 49; 8 ఫోర్లు) చెలరేగగా, డి కాక్ (44 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. చివర్లో బెహర్దీన్ (17 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడు ప్రదర్శించాడు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులే చేయగలిగింది. ప్యాటర్సన్, హెండ్రిక్స్, ఫ్రైలింక్, ఫెలుక్వాయో తలా 2 వికెట్లు తీశారు. -
ఆ షాట్ ను అతని నుంచే నేర్చుకున్నా:ఏబీ
లండన్:ప్రస్తుతమున్న విధ్వంసకర క్రికెటర్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఒకడు. బంతిని సునాయాసంగా బౌండరీ దాటించడంతో పాటు అనేక రకాల షాట్లను ఆడటంలో ఏబీ సిద్ధహస్తుడు. స్వీప్, రివర్స్ స్వీప్, అప్పర్ కట్, రివర్స్ స్కూప్ ఇలా ఏ షాట్ నైనా ఏబీ చాలా ఈజీగా ఆడగలడు. అయితే స్వీప్ షాట్ ను ఆడటాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ నుంచి ఏబీ నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని ఏబీనే స్వయంగా వెల్లడించాడు. 'నెమ్మదిగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్ట్రైయిట్ గా ఆడితే వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఎక్కువ. అందుకు నేను ఇష్టపడను. అలాంటి బంతిని స్వీప్ షాట్ ద్వారా బౌండరీకి తరలించేందుకు యత్నిస్తా. ఆ షాట్ ను నేర్చుకున్నది యూనిస్ ఖాన్ నుంచి అనే కచ్చితంగా చెప్పగలను. యూనిస్ ఆ షాట్ ఆడే విధానం బాగుంటుంది. అతని వద్ద నుంచి స్వీప్ షాట్ ను ఆడటం నేర్చుకున్నా'అని ఏబీ పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యలపై యూనిస్ స్పందించాడు. కొంతమంది ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించడం సాధారణంగా జరుగుతూ ఉంటుందని యూనిస్ అన్నాడు. అసలు స్వీప్ షాట్లు ఆడటానికి చాలా ధైర్యం కావాలన్నాడు. ఆ షాట్లు ఆడేటప్పుడు అవుటైతే మనకు విమర్శలు కూడా తప్పవన్నాడు. తాను టెస్టుల్లో పదివేల పరుగుల మార్కును చేరేటప్పుడు కూడా స్వీప్ షాట్ నే ఆడినట్లు యూనిస్ తెలిపాడు. మరొకవైపు తాను కూడా డివిలియర్స్ నుంచి కొన్ని షాట్లు ఆడటాన్ని నేర్చుకున్నట్లు యూనిస్ తెలిపాడు. -
నాకో చాన్స్ ఇవ్వండి, వరల్డ్ కప్ గెలుస్తా: కెప్టెన్
లండన్: చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇలా ఆడితే మ్యాచ్‌లను ఫినిష్ చేయలేం. ఎంతో అసంతృప్తిగా ఉంది. మొదటి 15-20 ఓవర్లలోనే టీమిండియా పట్టు సాధించింది. ఈ మ్యాచ్ క్రెడిట్ వాళ్లదే. గొప్ప అకుంఠిత దీక్ష చూపించారు. ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఆడారు’ అని డివిలియర్స్ చెప్పాడు. సెమీస్ చేరాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయి.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి దక్షిణాఫ్రికా తప్పుకున్న నేపథ్యంలో డివిలియర్స్ మీడియాతో మాట్లాడాడు. ‘నేను మంచి కెప్టెన్. జట్టును ముందుండి నడిపించగలను. నా సారథ్యంలో వరల్డ్ కప్ విజయాన్ని అందించగలనని అనుకుంటున్నా. ఈ టోర్నమెంటులో ఏ జరిగిందనేది ఇక్కడితోనే ముగిసిపోయింది. ఇకముందు మెరుగ్గా రాణిస్తాం’ అని డివిలియర్స్ చెప్పాడు. భారత్‌తో మ్యాచ్‌లో కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నా.. జట్టు మాత్రం మ్యాచ్ ఆసాంతం నింపాదిగానే ఆడిందని చెపుక్చొచ్చాడు. -
ఒక్క గేమ్ కూడా మిస్సవను
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ న్యూఢిల్లీ: తాను జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రమంలో ఏ ఒక్క మ్యాచ్‌ను కూడా వదులుకోవడానికి ఇష్టపడనని దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–10లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే పలు మ్యాచ్‌లను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయిన డివిలియర్స్ దానిపై తాజాగా స్పందించాడు. ‘‘నా తొలి ప్రాధాన్యత జాతీయ జట్టుకే. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లు మిస్సయి ఉండవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా తరపున ఒక్క గేమ్ కూడా మిస్ కావడానికి నేను అంగీకరించను. జాతీయ జట్టుకు ఆడటాన్ని ఎప్పుడూ వదులుకోను. నా ఫామ్‌పై ఎటువంటి ఆందోళన లేదు. మీరు ఆశించినా, ఆశించకపోయినా నా ఫామ్‌పై బెంగ లేదు. కొన్ని మంచి షాట్లతో ఇన్నింగ్స్ ఆరంభిస్తే, ఫామ్‌ను అందుకోవడం కష్టమేమీ కాదు. నేను సెంచరీ చేయకపోయినప్పటికీ, బంతిని హిట్ చేయడంలో నాది ఎప్పుడు ఒకటే పద్ధతి’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. -
ప్రతి మ్యాచ్ ఓ తొలి అవకాశం: డివిలియర్స్
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ను తొలి అవకాశంగా భావించాలని ఆ జట్టు సీనియర్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ సహచరులకు సూచించాడు. ఆదివారం కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు చిత్తుగా ఓడి ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్తరికార్డును నమోదు చేసింది. ఈ ఓటమితో ఒత్తిడికి లోనైన ఆటగాళ్లలో స్పూర్తిని కలిగించే ఓ వీడియోను బెంగళూరు జట్టు ఫేస్ బుక్ అఫీషియల్ పేజిలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోలో డివిలియర్స్ ఆటగాళ్లను ఓటిమిపై ప్రతి ఒక్కరు అద్దంలో చూసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నాడు. ఇప్పటికి 7 మ్యాచ్ లే అయ్యాయని, మరో 7 మ్యాచ్ లు ఆడాల్సి ఉందన్నాడు. ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ను తొలి అవకాశంగా భావించి విజయాలతో రాణించాలని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఈ స్పార్క్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నుంచే కొనసాగలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కోల్ కతా మ్యాచ్ లో కోహ్లీ గొల్డెన్ డక్, డివిలియర్స్, మిగతా బ్యాట్స్ మెన్సంతా సింగిల్ డిజిట్ కు పరిమితమవడంతో బెంగళూరు 49 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. -
పంజాబ్ చేతిలో బెంగళూరు ఓటమి
-
డివిలియర్స్ మోత సరిపోలేదు
46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 89 నాటౌట్ ► పంజాబ్ చేతిలో బెంగళూరు ఓటమి ► రాణించిన ఆమ్లా, మ్యాక్స్‌వెల్ ఇండోర్: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తమ జోరును మరింత పెంచింది. ఐపీఎల్ పదో సీజన్లో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (38 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి చెలరేగగా... సోమవారం హోల్కర్ మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. క్రిస్ గేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన డివిలియర్స్ (46 బంతుల్లో 89 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ బెంగళూరు జట్టుకు ఉపయోగపడలేకపోయింది. పొదుపుగా బౌలింగ్ చేసిన పంజాబ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిక్సర్ల వర్షం... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. ప్రారంభం నుంచే ఈ జట్టు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. తొలి ఓవర్లో వాట్సన్ అవుటయ్యాక డివిలియర్స్ క్రీజ్‌లోకి రాగా... మరోవైపు విష్ణు వినోద్, కేదార్ జాదవ్ వెంటవెంటనే అవుటవ్వడంతో బెంగళూరు పవర్‌ప్లేలో 23 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మన్దీప్ సింగ్ (34 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి డివిలియర్స్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 14వ ఓవర్లో మన్దీప్ అవుట్ కావడంతో డివిలియర్స్‌తో నాలుగో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 17వ ఓవర్ నుంచి బెంగళూరు ఆటలో వేగం పెరిగింది. డివిలియర్స్ ఓ భారీ సిక్సర్‌తో 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. మోహిత్ వేసిన 18వ ఓవర్లో స్టువర్ట్ బిన్నీ (20 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఓ సిక్స్, ఫోర్ కొట్టగా డివిలియర్స్ ఓ సిక్స్ జత చేయడంతో 19 పరుగులు వచ్చాయి. ఇక 19వ ఓవర్లో డివిలియర్స్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో రెచ్చిపోయి వరుసగా 4,6,6 బాదడంతో మరో 19 పరుగులు వచ్చాయి. అయితే మోహిత్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చినా ఆఖర్లో డివిలియర్స్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆమ్లా నిలకడ 149 పరుగుల స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. లక్ష్యం తక్కువగానే ఉన్నా తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. మూడో ఓవర్లో సిక్స్ కొట్టిన మనన్ వోహ్రా ఆ తర్వాత ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి 50 పరుగులు జట్టు ఖాతాలో చేరాయి. అయితే ఆరో ఓవర్లో మిల్స్ ఓపెనింగ్ జోడిని విడదీయడంతో తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అక్షర్ (9) అవుటయ్యాక... ఆమ్లా, మ్యాక్స్‌వెల్ జోడి బెంగళూరు బౌలర్లను ఆటాడుకుంది. ఇద్దరు ఆటగాళ్లు బౌండరీలతో విరుచుకుపడటం తో పరుగులు ధారాళంగా వచ్చా యి. 32 బంతుల్లో ఆమ్లా అర్ధ సెంచరీ చేశాడు. 14వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మ్యాక్సీ ఆ తర్వాత ఓవర్లో భారీ సిక్స్‌తో జట్టుకు విజయాన్ని అందించా డు. ఆమ్లా, మ్యాక్స్‌వెల్ మూడో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (బి) అక్షర్ 1; వినోద్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ 7; డివిలియర్స్ నాటౌట్ 89; కేదార్ జాదవ్ ఎల్బీడబ్ల్యూ (బి) వరుణ్ ఆరోన్ 1; మన్దీప్ (సి) సాహా (బి) వరుణ్ ఆరోన్ 28; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–2, 2–18, 3–22, 4–68. బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–12–1, సందీప్ శర్మ 4–0–26–1, మోహిత్ శర్మ 4–0–47–0, వరుణ్ ఆరోన్ 4–0–21–2, నటరాజన్ 1–0–13–0, స్టోయినిస్ 3–0–28–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: వోహ్రా ఎల్బీడబ్ల్యూ (బి) మిల్స్ 34; ఆమ్లా నాటౌట్ 58; అక్షర్ (బి) చహల్ 9; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 43; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14.3 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–62, 2–78. బౌలింగ్: స్టాన్లేక్ 4–0–41–0, ఇక్బాల్ అబ్దుల్లా 2–0–19–0, వాట్సన్ 2–0–28–0, మిల్స్ 2–0–22–1, చహల్ 3.3–0–29–1, పవన్ నేగి 1–0–7–0. -
ఏబీ డివిలియర్స్ విశ్వరూపం
ఇండోర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న ఏబీ డివిలియర్స్ పరుగుల మోత మోగించాడు. సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. 46 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో చెలరేగి ఆడి 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒకవైపు బెంగళూరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో డివిలియర్స్ ఒంటరి పోరాటం చేశాడు. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో కింగ్స్ పంజాబ్ బౌలర్లపై డివిలియర్స్ విరుచుకుపడ్డాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయి ఆడి అభిమానులకు పండుగ చేశాడు. బౌలర్ ఎవరైనా తన సహజసిద్ధమైన ఆట తీరుతో ప్రేక్షకులకు కనువిందు చేశాడు డివిలియర్స్. ఏబీ బ్యాటింగ్ విన్యాసాలకు కింగ్స్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 18 పరుగులకే ఓపెనర్లు షేన్ వాట్సన్(1), విష్ణు వినోద్(7) వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ.. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో కేదర్ జాదవ్(1)వికెట్ ను నష్టపోయింది. దాంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ఆపై మన్ దీప్ సింగ్(28) కాస్త ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ స్కోరు బోర్డు కుదుటపడింది. అయినప్పటికీ ఆర్సీబీ రన్ రేట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. అయితే ఆపై ఐదు ఓవర్లలో ఆర్సీబీ స్కోరు మరీ మందగించింది. 15 ఓవర్లలో నాలుగు వికెట్లకు 71 పరుగులు చేసి అత్యల్ప రన్ రేట్ తో ముందుకు సాగింది. కాగా, డివిలియర్స్ క్రీజ్ లో ఉన్నాడనే ప్రేక్షకుల ధీమాను అతను వమ్ము చేయలేదు. చివరి ఓవర్లలో డివిలియర్స్ బ్యాట్ కు పని చెప్పాడు. బంతి వేయడం సిక్స్ కు తరలించడం అన్న చందంగా సాగింది డివిలియర్స్ బ్యాటింగ్. ఈ క్రమంలోనే 34 బంతుల్లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకాన్నిసాధించాడు ఏబీ. ఏబీ హాఫ్ సెంచరీ చేసే సమయానికి 17.0 ఓవర్లు పూర్తవ్వగా, అప్పటికి ఆర్సీబీ స్కోరు 96/4. ఆ తరుణంలో ఏబీ విధ్వంసకర ఆట తీరును ప్రదర్శించాడు. చివరి మూడు ఓవర్లలో డివిలియర్స్ ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఏబీ దూకుడుతో ఆఖరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. అతనికి స్టువర్ట్ బిన్నీ(18 నాటౌట్) సహకారం అందివ్వడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. -
క్రిస్ గేల్ అవుట్
ఇండోర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ ను తప్పించారు. గత రెండు మ్యాచ్ ల్లో గేల్ నిరాశపరచడంతో ఈ జమైకా స్టార్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్-10 సీజన్ లో ఏబీకి ఇదే తొలి మ్యాచ్. గాయం కారణంగా గడిచిన మ్యాచ్ ల్లో ఏబీ డివిలియర్స్ పాల్గొనలేదు. అయితే డివిలియర్స్ అందుబాటులోకి వచ్చినా ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ గా షేన్ వాట్సనే కొనసాగనున్నాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ రెండు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. ఒకదాంట్లో ఓడగా, మరొక మ్యాచ్ లో గెలిచింది. మరొకవైపు ఆడిన తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణి కొట్టిన కింగ్స్ పంజాబ్ రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఆర్సీబీ తుది జట్టు: షేన్ వాట్సన్(కెప్టెన్), విష్ణు వినోద్, ఏబీ డివిలియర్స్, కేదర్ జాదవ్, మన్ దీప్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగీ, ఇక్బాల్ అబ్దుల్లా, తైవాల్ మిల్స్, స్టాన్ లేక్, చాహల్ కింగ్స్ తుది జట్టు: గ్లెన్ మ్యాక్స్ వెల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హషీమ్ ఆమ్లా, వోహ్రా, సాహా, స్టోనిస్,అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ, వరుణ్ అరోన్, నటరాజన్ -
బ్యాటింగ్ స్టైలే వేరు.. మిగతాదంతా సేమ్ టూ సేమ్.
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లిని సహాచర ఆటగాడు సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పొగడ్తలతో ముంచెత్తాడు. క్రికెట్‌పై పిచ్చి తగ్గకుండా కోహ్లి సహాయం చేశాడాని అభిప్రాయ పడ్డాడు. ఒత్తిడిని ఎలా అధగిమించాలో ఐపీఎల్ సహచరుడు కోహ్లి నుంచి నేర్చుకున్నానని డివిలియర్స్ తెలిపాడు. డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లగా కోహ్లితో ఉన్నాను. నేను కోహ్లి ఒకేలా ఉంటాము. ఆట పట్ల అంకితభావం, ఆటలోని నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు, కష్టపడేతత్వం, ఓటమిని సహించకపోవడం అన్నిలక్షణాలు ఒకటే అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కోహ్లికి క్రికెట్‌పై పిచ్చి మరింత ఎక్కువని అలా అతన్ని చూడటం ఇష్టమని డివిలియర్స్ అన్నాడు. ఈ వయసులో ఆటపై మక్కువ తగ్గకుండా ఉన్నానంటే అది కోహ్లీ వల్లనే అని డివిలియర్స్ తెలిపాడు. ఒత్తిడిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కోహ్లి నుంచే నేర్చుకున్నానన్నాడు. నేను గొప్ప బ్యాట్స్‌మన్ అనుకోవడం లేదని, అన్ని ఫార్మాట్లు ఆడలేదన్నాడు. కానీ కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అని, అతను అన్ని ఫార్మట్లు ఆడాడని డివిలియర్స్ తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో టాప్-5 ర్యాంకు పొందినపుడు ఆట అంటే ఎమిటో తెలుస్తుందని చెప్పాడు. డివిలియర్స్ టెస్టుల్లో 10,000 పరుగులకు చేరువలో 8074 పరుగులతో ఉన్నాడు. ఇది గొప్ప విషయం కాదని, ఇతరులు పట్ల గౌరవం లేనప్పుడు ఎన్ని పరుగులు చేసిన వృధా అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. గాయంతో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు దూరమైన డివిలియర్స్, 33 ఏళ్ల వయసులో కోలుకోవడం పెద్ద సమస్య కాదని వ్యాఖ్యానించాడు. ప్రాకి్టస్ చేస్తాను కాని సిల్లీ షాట్లు సాధన చేయనని ఏబీ తెలిపాడు. -
ఏబీ కాదు.. వాట్సన్!
హైదరాబాద్: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ ను ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా పూర్తిగా జట్టుకు దూరం కాగా, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా పలు మ్యాచ్‌ల నుంచి వైదొలుగుతున్నాడు. అతను భుజం గాయం నుంచి ఇంకా కోలుకోపోవడంతో ఆర్సీబీ ఆరంభపు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. దాంతో విరాట్ స్థానంలో ఆ జట్టు తాత్కాలిక సారథిగా ఏబీ డివిలియర్స్ కు బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ తొలుత భావిచింది. ఈ మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్ తో బుధవారం జరిగే మ్యాచ్‌కు తమ కెప్టెన్ ఏబీ అంటూ ఆ జట్టు ప్రధాన కోచ్ డానియల్ వెటోరి కూడా ఒక ప్రకటన చేశాడు. అయితే ఏబీ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్(సీఎస్ఏ) చేసిన ట్వీట్ ఆందోళనలో పడేసింది. ప్రస్తుతం ఆర్సీబీతో డివిలియర్స్ కలిసినప్పటికీ ప్రారంభపు మ్యాచ్‌లో అతను పాల్గొనడం లేదు. అతని స్థానంలో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆర్సీబీ జట్టులో కోహ్లి, డివిలియర్స్ లు గైర్హాజరీ అయితే వారి స్థానాన్ని వాట్సన్ భర్తీ చేయనున్నట్లు వెటోరి తెలిపాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న డివిలియర్స్ కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమన్నాడు. ఇదిలా ఉంచితే ఆ జట్టు డాషింగ్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా గాయంతో టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. -
అవును... ఆలోచిస్తున్నా
రెండు మూడేళ్లుగా పని ఒత్తిడి తగ్గించుకోవడం గురించి ఆలోచిస్తున్నానని, ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకునే ఆలోచన కూడా ఉందని దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డివిలియర్స్ తెలిపాడు. ‘ప్రస్తుతం ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టుల మీదే నా దృష్టి. ఈ సిరీస్ తర్వాత మళ్లీ ఆరు నెలల వరకు మాకు టెస్టులు లేవు. ఈ సమయంలో ఏదైనా జరగొచ్చు’ అని డివిలియర్స్ అన్నాడు. -
మళ్లీ ‘తిప్పుడే’!
తొలి టెస్టులో ‘స్పిన్’ అస్త్రంతో దక్షిణాఫ్రికాకు మంత్రం వేసిన భారత్... రెండో టెస్టుకూ అదే ‘తంత్రాన్ని’ ఉపయోగించనుంది. సాధారణంగా పేస్, బౌన్స్‌కు అనుకూలించే చిన్నస్వామి వికెట్‌పై ఈసారి మాత్రం బంతిని గింగరాలు తిప్పేందుకు రంగం సిద్ధం చేసింది. అవసరమైతే నాలుగో స్పిన్నర్‌తో అదును చూసి ప్రొటీస్‌ను దెబ్బతీయాలని టీమిండియా భావిస్తుంటే... ఎలాగైనా భారత్ ‘త్రయాన్ని’ నిలువరించాలని సఫారీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. * నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు * ఆత్మవిశ్వాసంలో కోహ్లిసేన * తుది జట్టులో ఇషాంత్! * లెక్కసరిచేయాలని ప్రొటీస్ తాపత్రయం ఉ.గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం బెంగళూరు: స్పిన్ వికెట్‌పై తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన భారత జట్టు మరోసారి దాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. నేటి (శనివారం) నుంచి చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభంకానున్న రెండో టెస్టులో సఫారీలతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. మూడు రోజు ల్లోనే తొలి టెస్టును ముగించి ఆత్మవిశ్వాసంతో ఉన్న కోహ్లిసేన ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌లో పైచేయి సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం తుది జట్టులో ఒక మార్పు చేయనుంది. పేసర్లలో వరుణ్ ఆరోన్ స్థానంలో ఇషాంత్‌ను తుది జట్టులోకి తీసుకురానుంది. అయితే అనూహ్యంగా జట్టులోకి వచ్చిన గురుకీరత్‌ను నాలుగో స్పిన్నర్‌గా ఆడిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఆల్‌రౌండర్‌గా గురుకీరత్‌కు అవకాశం ఇస్తే మిశ్రా బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఓపెనింగ్‌లో శిఖర్ ధావన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను డకౌట్ కావడంతో ఒత్తిడి మరింత పెరిగిపోయింది. శిఖర్ స్థానంలో లోకేశ్ రాహుల్‌ను తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నా.. విరాట్ ఇప్పటికిప్పుడు మార్పు కోరుకోకపోవచ్చు. రెండో ఓపెనర్‌గా మురళీ విజయ్ ఆకట్టుకుంటున్నాడు. వన్‌డౌన్‌లో పుజారా నిలకడను చూపెడుతున్నా... కోహ్లి, రహానే ఇంకా గాడిలో పడాల్సి ఉంది. ఈ ఇద్దరి పేలవ ఫామ్‌తో భారత్ భారీ స్కోరు చేయలేకపోతోంది. గత నాలుగు టెస్టులో టీమిండియా 400 స్కోరు దాటకపోవడం కూడా విరాట్‌ను కలవరపెడుతోంది. ఆల్‌రౌండర్‌గా జడేజా పూర్తి న్యాయం చేస్తున్నాడు. ప్రధాన స్పిన్నర్ అశ్విన్‌పై ఒత్తిడి తగ్గించడమే కాకుండా కీలక సమయంలో బ్యాట్‌తో పరుగులూ చేస్తున్నాడు. ఈ ఇద్దరికి తోడు మిశ్రా ఇంకాస్త కుదురుకుంటే ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం నల్లేరు మీద నడకే. తొలి టెస్టుల్లో ఈ త్రయం 19 వికెట్లు తీయడంతో మరోసారి ఆశలన్నీ వీరిపైనే ఉన్నాయి. జడేజా తర్వాత లోయర్ ఆర్డర్లో అశ్విన్, మిశ్రా, ఉమేశ్‌లు బ్యాటింగ్ చేయలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డుమిని సిద్ధం మరోవైపు టి20, వన్డే సిరీస్‌ల్లో జోరు చూపెట్టిన దక్షిణాఫ్రికాను గాయాలు వేధిస్తున్నాయి. ప్రధాన బౌలర్లు, స్టెయిన్, ఫిలాండర్‌లు ఇప్పటికే జట్టుకు దూరం కావడంతో పేస్ అటాక్ బాగా బలహీనపడింది. టి20, వన్డే సిరీస్‌ల్లో ప్రభావం చూపిన రబడ ఈ ఫార్మాట్లో తేలిపోతున్నాడు. హార్మర్ స్థానంలో అబాట్‌ను తీసుకోవాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది. తొలి టెస్టుకు దూరమైన డుమిని రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యింది. కెరీర్లో ‘వందో టెస్టు’ ఆడబోతున్న డివిలియర్స్ కు గెలుపు కానుకగా ఇవ్వాలని ఆమ్లా భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేటట్లు లేదు. ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమవుతున్నారు. డు ప్లెసిస్, ఆమ్లా, విలాస్‌లు భారీ స్కోరు చేయాలని భావిస్తున్నా... స్పిన్ పిచ్ ఎదురైతే వీళ్లు ఎలా ఆడతారన్నది వేచి చూడాలి. ప్రధాన స్పిన్నర్ తాహిర్ మ్యాజిక్ చూపెడుతున్నా.. పార్ట్టైమర్లు సరైన సహకారం అందించడం లేదు. ఓవరాల్‌గా మరోసారి స్పిన్ పిచ్‌పైనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, సాహా, జడేజా, మిశ్రా, అశ్విన్, ఉమేశ్, ఇషాంత్. దక్షిణాఫ్రికా: ఆమ్లా (కెప్టెన్), ఎల్గర్, వాన్ జెల్, డు ప్లెసిస్, డివిలియర్స్, డుమిని, విలాస్, హార్మర్ / అబాట్, రబడ, మోర్నీ మోర్కెల్, తాహిర్. పిచ్ సాధారణంగా బెంగళూరులో తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్ ఉంటుంది. అయితే ఈసారి ఇక్కడ కూడా స్పిన్నర్లకు సహకారం లభించేలా రూపొందించారని సమాచారం. అయితే ఎంత స్పిన్ వికెట్ అయినా తొలి రోజు బ్యాటింగ్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేయొచ్చు. వాతావరణం గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. శని వారం కూడా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ నివేదిక. ఓవరాల్‌గా ఏదో ఒక దశలో వర్షం మ్యా చ్‌కు అంతరాయం కలిగించవచ్చు. -
డివిలియర్స్ ‘వంద’నం
సెంచరీ టెస్టు ఆడనున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ బెంగళూరు: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ అబ్రహాం డివిలియర్స్ కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. శనివారంనుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్ అతనికి 100వది కానుంది. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించనున్న ఏడో ఆటగాడు అతను. ప్రధానంగా పరిమిత ఓవర్లలో విధ్వంసక ఆటగాడిగా గుర్తింపు ఉన్నా... టెస్టు క్రికెట్లోనూ డివిలియర్స్ ఖాతాలో అనేక గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. కెరీర్ తొలి టెస్టునుంచి వరుసగా 98 మ్యాచ్‌లు ఆడిన ఏబీ, విరామం లేకుండా వంద మ్యాచ్‌లు ఆడిన రికార్డు సృష్టించేవాడు. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాలతో బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం కావడంతో అతనికి ఈ ఘనత దక్కలేదు. టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా వందవ మ్యాచ్ ఆడుతున్న ఏడో ఆటగాడు డివిలియర్స్ కావడం విశేషం. డివిలియర్స్ 99 టెస్టుల్లో 51.92 సగటుతో 7685 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. 278నాటౌట్ (పాకిస్తాన్) డివిలియర్స్ అత్యధిక స్కోరు. ఏ పిచ్‌కైనా సిద్ధం: ఏబీ సొంతగడ్డపై భారత్ ఎలాంటి పిచ్‌లు తయారు చేసుకున్నా అది తప్పు కాదని, తమ జట్టు అన్నింటికీ సిద్ధమై వచ్చిందని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. ‘చిన్నస్వామి పిచ్ టర్న్ అవుతుందని మాకు బాగా తెలుసు. వాండరర్స్ వికెట్లా ఎలాగూ ఉండదు. సొంత జట్టు ఎలా తయారు చేసుకున్నా ఎదురుదాడి చేయగల బ్యాట్స్‌మెన్ మా వద్ద ఉన్నారు. తొలి టెస్టులో కూడా మేం బాగానే ఆడినా ఎక్కువ సేపు దానిని కొనసాగించలేకపోయాం. ఈ మ్యాచ్‌లో పరిస్థితి మారుతుందని నమ్ముతున్నా. జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది’ అని డివిలియర్స్ అన్నాడు. ఫిలాండర్ అవుట్ తొలి టెస్టుకు ముందే మోర్కెల్‌కు గాయం...టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టెయిన్ బౌలింగ్‌కు దూరం...ఈ దెబ్బలతో ఇప్పటికే బలహీనపడిన దక్షిణాఫ్రికా పేస్ బలగానికి కొత్త సమస్య ఎదురైంది. మూడో ప్రధాన పేసర్ వెర్నాన్ ఫిలాండర్ సరదాగా ఆడిన ఫుట్‌బాల్ అతడిని టెస్టు సిరీస్‌కు దూరం చేసింది. ఎడమ కాలి మడమకు గాయమైన ఫిలాండర్ స్వదేశం తిరిగి పయనమవుతున్నాడు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా సఫారీ ఆటగాళ్లంతా ఫుట్‌బాల్ ఆడారు. సహచరుడు ఎల్గర్‌ను ఢీకొనడంతో ఫిలాండర్ పడిపోయాడు. అతడిని సహాయక సిబ్బంది మోసుకుపోవాల్సి వచ్చింది. ఎంఆర్ఐ స్కాన్‌లో గాయం నిర్ధారణ కావడంతో అతడికి కనీసం ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చారు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా కైల్ అబాట్‌ను ఎంపిక చేసింది. అబాట్ చివరిసారిగా గత ఏడాది డిసెంబర్లో టెస్టు మ్యాచ్ ఆడాడు. స్టెయిన్ కోలుకుంటాడా! పిచ్ ఏదైనా తమ పేస్‌ను నమ్ముకొన్న దక్షిణాఫ్రికా జట్టులో ఇప్పుడు రబడ ఒక్కడే పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్ ఆడని మోర్కెల్ కోలుకుం టున్నాడు. అయితే మొహాలీ టెస్టులో గాయపడిన స్టెయిన్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు రోజు శుక్రవారం ఫిట్నెస్ టెస్ట్ తర్వాతే అతను బరిలోకి దిగుతాడా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పటికే తొలి టెస్టు కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో ప్రధాన ఆటగాడు డుమిని కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. -
క్రికెట్ డెవిల్
మనమంతా సచిన్ టెండూల్కర్ ఆటను చూశాం. ఏ షాట్ ఆడినా కళాత్మకం. సాంకేతికతకు పెట్టిందిపేరు. లెక్కలేనన్ని రికార్డులు. పుస్తకాల్లో రాసిన షాట్లను మైదానంలో ఆడి చూపించాడు. కోట్లాది మందికి క్రికెట్ ‘దేవుడు’ అయ్యాడు. ఇప్పుడు డివిలియర్స్‌ను చూస్తున్నాం. సాంకేతికతతో పనిలేదు. తాను ఆడిందే షాట్... వల్లించిందే వేదం. ఏమాత్రం బౌలర్లంటే కనికరం లేదు. జాలి అనే మాటే తెలియదు. బౌలర్లను ఊచకోత కోస్తూ... ప్రత్యర్థి ఆటగాళ్లను భయపెడుతూ క్రికెట్ ‘దెయ్యం’లా తయారయ్యాడు. అవును అబ్రహం బెంజమిన్ డివిలియర్స్... ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ దక్షిణాఫ్రికా స్టార్... రికార్డులన్నీ తన ఖాతాలో చేర్చుకుంటున్నాడు. తాజాగా భారత్‌తో వన్డే సిరీస్‌లో అతని విధ్వంసం ఆకాశాన్నంటింది.సాక్షి క్రీడా విభాగం: ‘బ్యాటింగ్ చేసేటప్పుడు నేను పెద్దగా శ్రమించను. సింపుల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా’... ముంబై వన్డే తర్వాత డివిలియర్స్ వ్యాఖ్య ఇది. సింపుల్‌గా ఉండటమే ఇలా ఉంటే... మరి కాస్త ‘కష్టపడి’ ఆడితే ఎలా ఉంటుందనేది సగటు క్రికెట్ అభిమానికి వచ్చే సందేహం. ఒక మ్యాచ్ కాదు, రెండు మ్యాచ్‌లు కాదు...గత కొన్నేళ్లలో డివిలియర్స్ బ్యాటింగ్ చూస్తే అతను ఒంటిచేత్తో విజయాలు అందించినవి, బౌలర్లకు చుక్కలు చూపిం చినవి ఎన్నో ఉన్నాయి. తాజాగా బాధితుల జాబితాలో చేరింది మాత్రం భారత జట్టే. సకల కళా వల్లభుడిలాగా గోల్ఫ్, రగ్బీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్... ఇలా ఎన్నో క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న ఏబీకి చివరి మజిలీ క్రికెట్ అయింది. ఆ నిర్ణయం ప్రపంచానికి కొత్త తరహా వినోదాన్ని పంచింది. ఇలా కూడా ఆడవచ్చా... డివిలియర్స్ ముద్దు పేరు మిస్టర్ 360... నిజంగానే క్రికెట్ ప్రపంచంలో 360 డిగ్రీల కోణంలో షాట్లు ఆడటం అతనికి మాత్రమే సొంతమైన ప్రతిభ. అప్పుడెప్పుడో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సచిన్ అప్పర్కట్లో ఆఫ్‌సైడ్‌లో కొట్టిన సిక్సర్‌కు అచ్చెరువొందాం. అలాంటి షాట్లు ఏబీకి మంచినీళ్ల ప్రాయం. అందుకే మాస్టర్ కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయినట్లున్నాడు. ఆధునిక క్రికెట్లో కొందరు ఆటగాళ్లకు తమదైన ట్రేడ్‌మార్క్ షాట్లు ఉంటాయి. దాంతోనే వారు సాధ్యమైనన్ని పరుగులు రాబడతారు. కానీ డివిలియర్స్‌కు అలాంటి షాట్ ఏమీ లేదు. ఎందుకంటే వారందరి షాట్లూ తానొక్కడే ఆడేయగలడు. తన బుర్రతో మరి కాస్త కొత్తగా ఆలోచించి అతను కనుగొన్న షాట్లకు ఎవరూ పేరు కూడా పెట్టలేకపోయారు! బాసింపట్టు వేసినట్లుగా కూర్చొని కూడా భారీ సిక్సర్ బాదడం, రివర్స్ స్వీప్‌తో అలవోకగా స్టాండ్స్‌లోకి బంతిని పంపించడం, స్విచ్ హిట్‌తో ప్రత్యర్థి బౌలర్ మైండ్ బ్లాంక్ చేయడం... ఒకటేమిటి ఇలా కొత్తదనానికి చిరునామాగా అతను మారిపోయాడు. కళాత్మకంగా అతను ఆడే డ్రైవ్ మాత్రమే కాదు...ఆన్ సైడ్‌లో మిడ్ వికెట్ మీదుగా లెక్క లేనన్ని సార్లు కొట్టిన సిక్సర్లు చూస్తే పుల్ షాట్ కూడా ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. టి20లో వీర బాదుడు, వన్డే అయితే క్లాసిక్ ఇన్నింగ్స్, టెస్టు కోసమైతే కొసరి కొసరి కుదురైన, తెలివైన ఇన్నింగ్స్... ఇలా ఆచితూచి లెక్కగట్టి ఆడటం డివిలియర్స్‌కే చెల్లుతుంది. ఆరంభం అంతంత మాత్రమే చాలా మంది దిగ్గజాలలాగే డివిలియర్స్ కెరీర్ కూడా సాదాసీదాగానే ఆరంభమైంది. తొలి టెస్టులోనే ఓపెనర్‌గా దిగిన అతను పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా రోజుల వరకు అందరిలో ఒకడిగానే ఉండిపోయాడు. జట్టు అవసరం కొద్దీ ఒకటో నంబర్‌నుంచి ఎనిమిదో స్థానం వరకు కూడా అతను బ్యాటింగ్‌కు దిగాడు. అయితే 2008లో అహ్మదాబాద్‌లో భారత్‌పై డబుల్ సెంచరీ చేసిన తర్వాతే అతనికి టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు దక్కింది. ఈనాడు విధ్వంసకారుడిగా కనిపిస్తున్న డివిలియర్స్ వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడిన రెండున్నరేళ్లకు గానీ మొదటి సెంచరీ కొట్టలేకపోయాడు. అది కూడా 2007 ప్రపంచకప్‌లో ఘోరమైన ఫామ్‌తో మూడు డకౌట్ల తర్వాత వచ్చిన శతకం! ఆ తర్వాత నిలకడ కొనసాగించినా... మరో రెండేళ్లకు అతనిలోని అసలైన హిట్టర్ బయటికి వచ్చాడు. చరిత్రలో స్థానం డివిలియర్స్ ఆటను, శైలిని వర్ణించేందుకు సాధారణ విశేషణాలు సరిపోక పదాలు తడుముకునే పరిస్థితి. అయితే గొప్ప ఆటగాడు, దిగ్గజం అనే మాటలకు మించి అతనిలో ఏదో మాయ ఉంది. ప్రస్తుతం వన్డేల్లో 50కు పైగా సగటు, 100కు పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక క్రికెటర్ అతను. కొంత కాలం ఇదే జోరును కొనసాగిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఒకప్పుడు ఇలా ఆడే క్రికెటర్ కూడా ఉండేవాడు... అని భవిష్యత్ తరాలు చెప్పుకునే కథల్లో అతను నాయకుడిగా నిలిచిపోవడం మాత్రం ఖాయం. రికార్డులే రికార్డులు... 2009లో నవంబర్‌లో కేప్‌టౌన్‌లో ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్. దూకుడైన బ్యాటింగ్‌తో 75 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతే...అంతకు ముందు సాధించిన 3 సెంచరీలతో పోలిస్తే తర్వాతి 20 సెంచరీలు ఏబీ భీకర బ్యాటింగ్‌కు నిదర్శనంగా నిలిచాయి. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న తరుణంలో రావడం... అంతలోనే తుఫాన్‌లా మార్చేయడం డివిలియర్స్‌కు దినచర్యగా మారిపోయింది. కేప్‌టౌన్ మ్యాచ్‌నుంచి భారత్‌తో ఐదో వన్డే వరకు డివిలియర్స్ 100 ఇన్నింగ్స్‌లు ఆడి 5454 పరుగులు చేశాడు. సగటు 69.03 కాగా, స్టైక్‌రేట్ 110.51గా ఉండటం అతని సత్తా ఏమిటో చూపిస్తుంది. కెరీర్‌లోని 23 సెంచరీలు కూడా 100కు పైగా స్ట్రైక్‌రేట్‌తో చేయడం ఒక్క ఏబీకే సాధ్యమైంది. 25వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు దిగి కూడా ఐదు సార్లు శతకం మార్క్‌ను చేరుకోవడం మరే క్రికెటర్ వల్ల కాలేదు. ఈ ఏడాదైతే అతను పరుగుల పండగ చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతులు), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతులు), ఫాస్టెస్ట్ 150 (64 బంతులు)... ఇలా ప్రతీ రికార్డు అతని చెంతకే చేరింది.