Department of Mines
-
ఇసుక తవ్వకం ‘ప్రైవేటు’కు ఇద్దాం..
సాక్షి, అమరావతి: ఇసుక కొరత ఇంకా ఉందని, దీన్ని అధిగమించేందుకు రీచ్‌ల్లో తవ్వకం, లోడింగ్ ప్రక్రియను ప్రైవేటు ఏజెన్సీలకు కేటాయించే ప్రతిపాదనలతో తన వద్దకు రావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వారికి ఇసుక రీచ్‌లను కేటాయించే వ్యవహారాలను జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పారదర్శకంగా పర్యవేక్షించాలని సూచించారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డులు పెట్టి సరఫరా చేయాలన్నారు. ఉచిత ఇసుకను అందించడం కోసమే సీనరేజి ఛార్జీలను రద్దు చేశామని చంద్రబాబు తెలిపారు. సీనరేజి, జీఎస్టీ రద్దు వల్ల ప్రభుత్వంపై భారం పడినా ఉచిత ఇసుక కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన గనుల శాఖాధికారులతో ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అ నుమతి ఇచ్చామన్నారు ఇందుకోసం స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పక నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు మార్గాల్లో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దాన్ని నివారించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖే‹Ùకుమార్ మీనా, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గనుల శాఖలో బదిలీల ‘వేలం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖలో బదిలీల పర్వం కనక వర్షం కురిపించే కామధేనువులా మారింది. నిబంధనలతో పని లేకుండా.. ఎవరు ఎంత ఎక్కువ ముట్టజెపితే వారికే కీలకమైన పోస్టులు కట్టబెట్టేందుకు వేలం నిర్వహిస్తున్న వైనం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో సాక్షాత్తూ చినబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి తెరవెనుక చక్రం తిప్పుతుండగా.. తెరపై సంబంధింత మంత్రి, ఆయన బంధువు వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.సాధారణంగా బదిలీల ప్రక్రియను ముఖ్య కార్యదర్శి ఆమోదంతో ఆ శాఖ డైరెక్టర్ నిర్వహిస్తారు. అందులో కొన్ని ముఖ్యమైన, కీలకమైన వాటికి రాజకీయంగా సిఫారసు చేసి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ.. ఇప్పుడు ఏకంగా బదిలీల ప్రతిపాదనలన్నీ తనకు పంపాలని సదరు మంత్రి ఆ శాఖ డైరెక్టర్‌కు నోట్ పంపడం చర్చనీయాంశమైంది. తాను చెప్పినట్టు బదిలీలు చేయాలనే దశ దాటిపోయి బదిలీల ప్రతిపాదనలన్నీ తనకు పంపాలని డైరెక్టర్‌ను ఆదేశించడంతో గనుల శాఖలో సీనియర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 4వ తేదీన మంత్రి పేషీ కమిషనర్ అండ్ డైరెక్టర్‌కు ఈ నోట్‌ను అధికారికంగా పంపింది. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారితోపాటు వ్యక్తిగత అభ్యర్థనలు, పరిపాలనా పరమైన అవసరాల కోసం చేసే బదిలీల జాబితాను తనకు పంపాలని అందులో స్పష్టం చేశారు. డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ జియాలజిస్టులు, రాయల్టీ ఇన్స్పెక్టర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మినరల్ రెవెన్యూ ఆఫీసర్లు, ఆఫీసు సూపరింటెండెంట్లు సహా అన్ని బదిలీ ప్రతిపాదనలను ఈ నెల 10వ తేదీలోపు తనకు పంపాలని ఆదేశించారు. వాటిని పరిశీలించి బదిలీలను తాను ఖరారు చేస్తానని మంత్రి అందులో పేర్కొన్నారు.మంత్రి చెప్పినట్టే చేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలుమంత్రి నుంచి బదిలీల కోసం నేరుగా ఇలాంటి నోట్ రావడంతో ఆశ్చర్యపోయిన డైరెక్టర్ అలా చేస్తే ఇబ్బందుల్లో పడతానని భావించినట్టు తెలిసింది. అందుకే.. బదిలీలపై తనకున్న అధికారాలు, మంత్రి సూచనలు ఎంతవరకూ పాటించవచ్చనే అంశంపై న్యాయ సలహా తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత బదిలీల ప్రతిపాదనలు పంపాలని మంత్రి నుంచి నోట్ వచ్చిందని, దీనిపై ఏం చేయాలో తెలపాలని ఆయన ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని క్లారిఫికేషన్ అడిగారు.దీనిపై ఏం చేయాలోనని డైరెక్టర్, ముఖ్య కార్యదర్శి మల్లగుల్లాలు పడుతుండగానే.. చినబాబు సన్నిహితుడు రంగప్రవేశం చేసి ఏమీ ఆలోచించకుండా మంత్రి నోట్‌కి అనుగుణంగా పని చేయాలని ఆర్డర్ వేశారు. ఆయన ఆర్డర్ అనధికారిక రాజముద్రతో కావడంతో ముఖ్య కార్యదర్శి మౌనంగా ఉండిపోయారు. దీంతో బదిలీ ప్రతిపాదనల్ని మంత్రికి పంపడం మినహా డైరెక్టర్‌కి మరో మార్గం లేకుండాపోయింది.విజయవాడ హోటల్లో వేలం పాటమరోవైపు అధికారుల ప్రతిపాదనలతో సంబంధం లేకుండానే మంత్రి బంధువు ఒకరు విజయవాడలోని ఒక హోటల్లో గనుల శాఖ అధికారులు, ఉద్యోగులను పిలిపించుకుని బేరసారాలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల డీడీ, ఏడీ పోస్టుల కోసం పలువురు తీవ్రంగా పోటీ పడుతుండటంతో వారికి వేలం పాట పెట్టినట్టు చెబుతున్నారు. ఆ జిల్లాల విజిలెన్స్ విభాగాల్లోని పోస్టులకు మంచి గిరాకీ ఉండటంతో వాటినీ బేరం పెట్టారు. ప్రకాశం, అన్నమయ్య, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల డీడీ పోస్టుల కోసం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ ఇచ్చేందుకు కొందరు అంగీకరించినట్టు సమాచారం.ఆ జిల్లాల ఏడీ పోస్టులు కూడా రూ.కోటి నుంచి కోటిన్నర పలుకుతున్నా ఇచ్చేందుకు పలువురు వెనుకాడటంలేదు. మిగిలిన పోస్టులకు సైతం రూ.15 లక్షల నుంచి రూ.కోటి వరకూ ధర నిర్ణయించి.. ఎవరు ఎక్కువ ఇస్తానంటే వారిని అక్కడకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా పేరుకు మంత్రి బంధువు చేస్తున్నా తెరవెనుక మాత్రం చినబాబు సన్నిహితుడే అంతా తానై నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వేలం పాటలో ఎక్కువ ముట్టజెప్పుకున్న వారిని బదిలీ చేసేందుకు వీలుగా సంబంధిత ప్రతిపాదనల ఫైలు తనకు పంపాలని మంత్రి డైరెక్టర్‌కు నోట్ పంపినట్టు స్పష్టమవుతోంది. -
చిరుద్యోగిని సస్పెండ్ చేసి.. అక్రమాలపై ‘మట్టి’ కప్పి..
సాక్షి, విశాఖపట్నం: ఎర్రమట్టి దిబ్బల్ని టీడీపీ నేతలు ధ్వంసం చేసిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం విచారణను మమ అనిపించేసింది. ఓ చిరుద్యోగిని బలి చేసి, అసలు పాత్రధారులు, సూత్రధారులైన కూటమి నేతల్ని పక్కకి తప్పించేసింది. భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల్ని పరిరక్షించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బఫర్ జోన్‌ని దాటి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న దారుణాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘మట్టి దిబ్బలు మటాష్.!’ శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడింది. అధికార కూటమి నేతలే ఎర్రమట్టి దిబ్బల్ని హరిస్తుండటంతో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు నాటకమాడింది. ప్రభుత్వ ఆదేశంతో జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) మయూర్ అశోక్, రెవెన్యూ, గనులశాఖ అధికారులు బుధవారం ఆ ప్రాంతాన్ని మొక్కుబడిగా పరిశీలించారు. అక్రమ తవ్వకాలపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా చేస్తున్న పనులను వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణకు ఆదేశించారు. స్థానిక అధికారులదే తప్పని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ హడావుడి చేశారు. ఈ ప్రాంతాన్ని సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించారు. ఎంత విస్తీర్ణంలో తవ్వేశారో గనుల శాఖ అధికారులు కూడా లెక్కలు వేస్తున్నారు. వెంటనే ఇక్కడ తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.చిరుద్యోగిపై చర్యఎర్రమట్టి దిబ్బలు నిడిగడ్డు సచివాలయం పరిధిలో ఉండటంతో ఆ సచివాలయం ఇన్చార్జి ప్లానింగ్ సెక్రటరీ కాగిత అజయ్‌కుమార్ సరిగా స్పందించలేదని ఆయన్ని సస్పెండ్ చేశారు. వాస్తవానికి అజయ్‌కుమార్ భీమిలి తోట వీధి సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ. నిడిగడ్డుకు ఇన్చార్జిగా వచ్చారు. తుది విచారణలోనూ ఉద్యోగుల్నే బలి చేయాలని, నేతల పేర్లు బయటికి తేవద్దంటూ ఇప్పటికే జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బఫర్ జోన్‌కు బయట 70, 80 ఏళ్లుగా జీడి తోటలు వేసుకొన్న రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ చేసిన వ్యవహారంపై బాబు, పవన్ పెద్ద రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చిన నెలలోనే టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై బఫర్‌జోన్ దాటి తవ్వకాలు జరిపి మట్టి తరలించేస్తున్నారు. దీనిపై సాక్షి కథనంతో ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ ఇప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉండి స్పందించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.ప్రభుత్వ పెద్దల సహకారంతోనే తవ్వకాలుకొమ్మాది: ప్రభుత్వ పెద్దల సహకారంతో, స్థానిక కూటమి నేతల మద్దతుతోనే ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం తవ్వకాల వద్ద సెల్ఫీ తీసుకుని ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాబు కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లో భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇదంటూ పోస్టు చేశారు. -
హిందుస్తాన్ జింక్ విభజనకు కేంద్రం నో...
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్.. వేదాంతా ప్రతిపాదిత హిందుస్తాన్ జింక్ కంపెనీ విభజనకు గనుల శాఖ నో చెప్పింది. హిందుస్తాన్ జింక్‌ను రెండు విభిన్న సంస్థలుగా విడదీసేందుకు వేదాంతా గ్రూప్ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు మైన్స్ సెక్రటరీ వీఎల్ కాంతారావు తాజాగా వెల్లడించారు. వాటాదారుగా కంపెనీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలియజేశారు. వెరసి విభజన ప్రతిపాదనను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కంపెనీలో ప్రభుత్వం 29.54 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పెంచుకునే బాటలో జింక్, సిల్వర్‌సహా బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ జింక్ ఇంతక్రితం ప్రతిపాదించింది. కాగా.. బిజినెస్‌ల విభజనకు సలహాదారు సంస్థను నియమించుకునే యోచనలో ఉన్నట్లు గతంలో హిందుస్తాన్ జింక్ ప్రకటించింది. కంపెనీ విలువను మెరుగుపరచేందుకు కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను రెండు చట్టబద్ధ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇంతక్రితం నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. -
'ఇసుక' అనుమతులు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటు ధరలో ఇసుకను అందించాలని అధికారులను గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక వెలికితీతకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న మైనింగ్, క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు తదితర అంశాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో గనుల శాఖ సాధించిన పురోగతిని పరిశీలించారు. ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వీలుగా పర్యావరణ అనుమతులను వేగవంతం చేయాలని.. గనులు, చిన్న తరహా మైనింగ్ లీజులపై మరింత మంచి విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. లీజులో ఉండి పని నడవని గనులను క్రియాశీలం చేయాలని, జిల్లాల వారీగా మినరల్ రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన 127 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడేళ్లలో ఇసుక విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,444 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. -
ఇసుక తవ్వకాలపై నిషేధం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీ పరీవాహక ప్రాంతాల్లో బి–2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరీలో 18 ఓపెన్ ఇసుక రీచ్‌లకు ఇచ్చిన అనుమతులను మాత్రమే కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేశామని తెలిపారు. మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను ఆ సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆ 18 రీచ్‌ల్లో తవ్వకాలు జరపవచ్చని తెలిపారు. పర్యావరణానికి విఘాతం కలిగించారంటూ ఈ రీచ్‌లపై ఎన్జీటీ విధించిన జరిమానాపైనా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో బి1, బి2 కేటగిరీల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణ శాఖ పునఃసమీక్షించాలని కోర్టు సూచించిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, పర్యావరణానికి విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణ రంగానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని చోట్లా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి, ప్రభుత్వంపై తప్పుడు వార్తలను ప్రచురించడమే పనిగా పెట్టుకున్న ఈనాడు దినపత్రిక ఇష్టారాజ్యంగా వక్రీకరణలతో అర్థంలేని రాతలు రాయడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే దందా అంటూ ఇసుక ఆపరేషన్స్‌పై మళ్ళీ, మళ్ళీ తప్పుడు ఆరోపణలతో వార్తా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు. పర్యావరణ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించిన రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నామని వెంకటరెడ్డి వివరించారు. -
అక్రమ మైనింగ్‌పై చర్యలు వేధింపులా?
సాక్షి, అమరావతి: ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పని చెప్పాలి. నేరం చేస్తే నేరమని చెప్పాలి. ఈనాడు పత్రిక నేరమే కరెక్టు అంటుంది. తప్పులు చక్కగా చేయొచ్చంటుంది. తప్పు చేసే వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వేధింపులంటూ రాతల్లో రోత పుట్టిస్తుంది. రాష్ట్రంలో ‘మైనింగ్’పై ఇలాంటి రోత కథనమే మరొకటి రాసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు గనుల శాఖ చేపట్టిన తనిఖీలు, విధిస్తున్న జరిమానాలపైనా వక్రభాష్యాలు చెబుతోంది. అడ్డగోలుగా గనులను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకుంటే కక్ష సాధింపుగా, వేధింపులుగా చిత్రీకరిస్తోంది. ఇలా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ సోమవారం ఓ తప్పుడు కథనం ప్రచురించింది. మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ, తనిఖీలు గనుల శాఖ ప్రధాన విధి. దాన్ని కూడా తప్పు పడుతూ ఈనాడు పత్రిక రాజకీయాలు అంటగడుతోంది. అక్రమ క్వారీయింగ్ చేసే వారు రాజకీయ నేతలైతే వారికి మినహాయింపు ఇవ్వాలనే ధోరణిలో వాదిస్తోంది. మైనింగ్ అక్రమార్కులపై ఆ పత్రిక ఒక్క ముక్క రాయకపోగా, అక్రమార్కులను ప్రోత్సహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇవీ వాస్తవాలు ► నెల్లూరు జిల్లాలో 5 ఎకరాలు లీజుకు తీసుకుని దాదాపు 50 ఎకరాల్లో అక్రమంగా తవ్వేస్తుంటే స్థానికులు ఫిర్యాదు చేశారు. గనుల శాఖ అధికారులు అక్కడ క్వారీలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కళ్లు చెదిరే దారుణాలు, అక్రమ తవ్వకాలు బయటపడ్డాయి. వాటన్నింటి విలువ రూ.142 కోట్లుగా తేలింది. ఆ మొత్తాన్ని అధికారులు జరిమానాగా విధించారు. ఈ చర్య ఈనాడుకు తప్పుగా, కక్ష సాధింపుగా కనపడుతోంది. ► సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ఎన్‌హెచ్ – 42లో ముదిగుబ్బ బైపాస్ ప్రాంతంలో నితిన్ సాయి సంస్థ రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉన్న కొండ ప్రాంతాన్ని తొలుస్తోంది. దాన్నుంచి వచ్చిన రాయిని మొబైల్ క్రషర్ ద్వారా బయటికి తరలించి, విక్రయిస్తోంది. ఈ సమాచారం తెలిసి గనుల శాఖ అధికారులు తనిఖీ చేశారు. సుమారు రూ.15 కోట్ల విలువైన మెటల్‌ను అక్రమంగా విక్రయించినట్లు తేలింది. దీనిపై చర్యలు తీసుకోవడాన్ని తప్పుపట్టడం ఈనాడు వక్రనీతికి అద్దం పడుతోందని గనుల శాఖాధికారులు వ్యాఖ్యానిస్తన్నారు. ► అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్ వద్ద ఉన్న కొన్ని కంకర క్వారీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. గతంలో వాటికి జరిమానాలు విధిస్తూ అధికారులు నోటీసులిచ్చారు. వీటిపై కొందరు కోర్టుకు వెళ్లారు. అక్కడ వారి వాదన చెల్లలేదు. జరిమానాలు చెల్లించకపోవడం, న్యాయస్థానాల నుంచి కూడా అనుకూలంగా ఉత్తర్వులు రాకపోవడంతో చాలా క్వారీల్లో మైనింగ్ జరగడంలేదు. దీన్ని కూడా ఆ పత్రిక వక్రీకరించింది. క్వారీలను వేధిస్తున్నారంటూ అడ్డగోలుగా రాసింది. గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లోనూ అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులు రావడంతో గనుల శాఖ తనిఖీ చేసింది. ఉల్లంఘనలు బయటపడడంతో కేసులు నమోదు చేసింది. ఇది కూడా ఈనాడుకు కక్ష సాధింపుగా కనపడింది. అక్రమాలను నిస్సిగ్గుగా సమర్ధించింది. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం విజిలెన్స్ స్క్వాడ్లతో అక్రమ మైనింగ్‌పై ఉక్కు పాదం మోపుతుంటే దాన్ని వక్రీకరిస్తూ కథనాలు రాయడం సరికాదు. మైనింగ్ అక్రమాలపై టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599 కు వచ్చే అన్ని ఫిర్యాదులపైనా తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. 2014 – 2019 మధ్య అక్రమ మైనింగ్‌పై కేవలం 424 కేసులు నమోదైతే, 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లలోనే 786 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు రాజకీయ ఉద్దేశాలను ఆపాదించేలా ఈనాడు పత్రిక కథనం ప్రచురించడం దారుణం. అక్రమ మైనింగ్‌పై గనుల శాఖ చర్యలు తీసుకోవడం నేరమా? తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని వేధింపుల కింద ఈనాడు పత్రిక చిత్రీకరిస్తోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే రాజకీయ దురుద్దేశాలను అంటగడతారా? ఇటువంటి తప్పుడు కథనాల వల్ల ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. – మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి -
తప్పుడు రాతలెందుకో.. చెప్పవే ‘సిలికా’
సాక్షి, అమరావతి: తప్పుడు కథనాల్లో ఈనాడుది అందె వేసిన చేయి. అదే కోవలో సిలికా శాండ్ విక్రయాలపై మరో కట్టు కథనం ప్రచురించింది. గనుల శాఖకు సంబంధం లేని విషయాలను ఆ శాఖకు ముడిపెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. పరస్పర విరుద్ధ వాదనలతో కథనాన్ని అల్లింది. ఈనాడు కథనమంతా పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని గనుల శాఖ స్పష్టం చేసింది. సిలికా శాండ్ మైనింగ్‌పై అసలు వాస్తవాలను ఆ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వివరించారు. అసత్యాలు, వక్రీకరణలతో ప్రభుత్వంపై బురదచల్లేలా ఈ కథనం ఉందని చెప్పారు. సిలికా శాండ్ మైనింగ్, రవాణా, విక్రయాలు, జీఎస్టీ చెల్లింపులపై ఆ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. గనుల శాఖ నలుగురికే అనుకూలంగా ఉందన్న ఆరోపణా అసత్యమని చెప్పారు. ఆ నలుగురికే అనుకూలంగా ఉంటే ఇటీవల కొత్తగా 11 మందికి ఎలా లీజులు జారీ చేస్తామని ప్రశ్నించారు. ఈ అంశంపై సోమవారం ఆయన మీడియాతో చెప్పిన వివరాలు.. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే.. సిలికా శాండ్ లీజు అనుమతులు, చెల్లింపులు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. సిలికా శాండ్‌కు లీజుదారుల నుంచి సీనరేజీ, డీఎంఎఫ్, మెరిట్, కన్సిడరేషన్ మొత్తాలను గనుల శాఖ ఆన్లైన్లోనే స్వీకరిస్తుంది. అన్ని అనుమతులున్న లీజుదారులకు రవాణా పత్రాలను కూడా ఆన్లైన్లోనే జారీ చేస్తుంది. లీజుదారులు మైనింగ్ చేసిన మెటీరియల్‌ను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా> బహిరంగ మార్కెట్లో ఎవరికైనా అమ్ముకోవచ్చు. లీజుదారులు వారికి అనుకూలమైన సంస్థలకే మినరల్‌ను విక్రయించుకుంటారు. ఇందులో గనుల శాఖ ప్రమేయం ఉండదు. ఒత్తిడి చేసే అవకాశమే ఉండదు. నష్టం వచ్చేలా ఎవరైనా వ్యాపారం చేస్తారా? వ్యాపార రంగంలో విస్తరించి ఉన్న ఈనాడు సంస్థకు ఈ విషయం తెలియదా? ఆసక్తి ఉంటే ఈనాడు యాజమాన్యం కూడా నిబంధనల ప్రకారం సిలికా శాండ్ లీజులు పొందవచ్చు, అలాగే లీజుదారుల నుంచి శాండ్‌ను కొనుక్కోవచ్చు. నిబంధనల ప్రకారం అవసరమైన సహకారాన్ని అందిస్తాం. నిష్పాక్షికతకు నిదర్శనమిది కేవలం నలుగురు డీలర్లకే మేలు చేకూర్చేలా, లీజుదారులు సిలికా శాండ్‌ను వారికి మాత్రమే విక్రయించేలా గనుల శాఖ జరిమానాల పేరుతో వారిపై ఒత్తిడి తెచ్చిందనడం పూర్తిగా నిరాధారం. ఇటీవల గనుల శాఖ కొత్తగా 11 మందికి సిలికా శాండ్ మైనింగ్ లీజులు జారీ చేసింది. నిజంగా ఆ నలుగురికే మేలు చేసే ఉద్దేశం ఉంటే ఈ లీజులు వారే దక్కించుకొని ఉండే వారు. కొత్త వారికి అవకాశం లభించేదా? గనుల శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించబట్టే కొత్త వారికి లీజులు లభించాయి. గనుల శాఖకేం సంబంధం? లీజుదారులు డీలర్లకు విక్రయిస్తున్న సిలికా శాండ్‌కు సగం మొత్తాన్ని ఆన్లైన్లో, మిగిలిన దాన్ని నగదుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గనుల శాఖకు ఎటువంటి బాధ్యత ఉండదు. లీజుదారులు, విక్రయదారుల మధ్య జరిగే లావాదేవీల్లో గనుల శాఖ జోక్యం చేసుకోదు. నిబంధనల ప్రకారమే లీజుదారులు జీఎస్టీ చెల్లింపులు చేస్తున్నారు. ఏడాదికి సగటున 20 లక్షల టన్నులు సిలికా శాండ్ విక్రయిస్తున్నారు. దానిలో సగం మాత్రమే ఆన్లైన్లో స్వీకరిస్తూ, దానికి మాత్రమే జీఎస్టీ చెల్లిస్తున్నారంటూ చేసిన ఆరోపణకు ఆధారాలున్నాయా? పరస్పర విరుద్ధ వాదనలేమిటి? సిలికా శాండ్ మైనింగ్‌లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూనే, మరోవైపు గనుల శాఖ జరిమానాలు విధించిందని, ఆ తర్వాత వాటిని సర్దుబాటు చేసిందని పరస్పరం విరుద్ధంగా రాస్తున్నారు. జిల్లా స్థాయిలో విజిలెన్స్ స్క్వాడ్, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్ట్‌లు, కీలక ప్రాంతాల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా సిలికా శాండ్ మైనింగ్‌లో అక్రమాలను గనుల శాఖ పూర్తి స్థాయిలో నియంత్రిస్తోంది. ఆరోపణలు వచ్చిన చోట తనిఖీలు చేసి, జరిమానాలు విధిస్తున్నాం. ఈ జరిమానాలపై లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇది అన్ని మినరల్స్ మైనింగ్‌లోనూ సర్వసాధారణంగా జరుగుతుంది. అథారిటీ ఆ జరిమానాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు జరిమానాలను సర్దుబాటు చేశారని రాయడం తప్పు. తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని 1150.975 హెక్టార్లలో 73 సిలికా శాండ్ లీజులున్నాయి. శుద్ధి చేయని సిలికా శాండ్‌ను టన్ను రూ.700 కి విక్రయిస్తారు. శుద్ధి చేసిన ఇసుకను దానికి అయిన వ్యయాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. శుద్ధి చేయని ఇసుకకు లీజుదారులు టన్నుకు రూ.100 సీనరేజీ, కన్సిడరేషన్ కింద రూ.212, డీఎంఎఫ్ కింద రూ.30, మెరిట్ కింద రూ.2 కలిపి రూ.346 ప్రభుత్వానికి చెల్లించాలి. కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నాం సిలికా శాండ్ మైనింగ్‌పై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాం. 2019లో 73 లీజులను గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి ఉల్లంఘనలు గుర్తించి 61 లీజులకు జరిమానా విధించారు. వారిలో 52 మంది లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకున్నారు. అథారిటీ వాటిని సమీక్షించి పరిష్కరించింది. సిలికా శాండ్ మైనింగ్, రవాణాపై మూడంచెల నిఘా వ్యవస్థ కొనసాగుతోంది. ఇంటర్నల్ బృందాలు, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ తనిఖీలు, జిల్లా విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. ఆకస్మిక తనిఖీల ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతి జిల్లా మోమిడి, బల్లవోలు, వేల్లపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూముల్లో అక్రమ సిలికా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అవాస్తవం. తిరుపతి జిల్లా తడ మండలం బీవీ పాలెం వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంగా నిఘా బృందాలు ఎప్పటికప్పుడు సిలికా శాండ్ మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. సిలికా శాండ్ మైనింగ్‌లో లీజుదారులది ప్రేక్షక పాత్రని, వందల కోట్ల దందా జరుగుతోందని, కొందరు పెద్దలకు ఈ మొత్తాలు చేరుతున్నాయంటూ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ఈనాడులో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఖండిస్తున్నాం. నిబంధనల ప్రకారమే మైనింగ్, విక్రయాలు, రవాణా జరుగుతుంటే, అక్రమాలు, పెద్దల పాత్రంటూ ఊహాత్మక అంశాలను జోడించి, అసత్య కథనాలు రాయడం మానుకోవాలి. -
రాజస్థాన్‌లో భారీగా బయటపడ్డ లిథియం నిక్షేపాలు.. ఇక చైనాకు చెక్ పడ్డట్టే!
జైపూర్: అత్యంత ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు రాజస్తాన్‌లో భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో డేగానా(నాగౌర్)లోని రెన్వాత్ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), మైనింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్తాన్‌లో అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మన దేశ అవసరాల్లో 80 శాతం అవసరాలను రాజస్తాన్‌లోని నిల్వలు తీర్చగలవని అన్నారు. భారత్ లిథియం కోసం ప్రధానంగా చైనాపై ఆధారపడుతోంది. తాజాగా బయటపడిన నిల్వలతో చైనా గుత్తాధిపత్యానికి తెరపడడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోనే ఈ ఖనిజం ఉంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీలో లిథియం ఉపయోగిస్తున్నారు. -
Andhra Pradesh: గాడినపడ్డ ఆదాయం
సాక్షి, అమరావతి: కోవిడ్ ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాష్ట్ర సొంత ఆదాయం గాడిన పడుతోందని, నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను చేరుకుంటున్నట్లు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదించారు. దేశ సగటుతో పాటు పలు ధనిక రాష్ట్రాల కంటే అధికంగా జీఎస్టీ స్థూల (గ్రాస్) వసూళ్ల వృద్ధి నమోదవుతున్నట్లు వివరించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ స్థూల వసూళ్లలో దేశ సగటు వృద్ధి రేటు 24.8 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 26.2 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వృద్ధి రేటు పలు ధనిక రాష్ట్రాల కంటే అధికమని, తెలంగాణ (17.3%), తమిళనాడు (24.9%), గుజరాత్ (20.2 %) కంటే మెరుగైన వసూళ్లు నమోదవుతున్నాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయనేందుకు నిదర్శనమన్నారు. ఆదాయార్జన శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు, అధికారులు పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు గతేడాది జనవరి నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.26,360.28 కోట్లు కాగా ఈ ఏడాది జనవరి నాటికి రూ.28,181.86 కోట్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ టాక్స్లతో కలిపి రూ.46,231 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా 94 శాతం అంటే రూ.43,206.03 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. గతంలో సూచించిన విధంగా పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తెచ్చామని, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. విధానాలను సరళీకరించడం, డేటా అనలిటిక్స్ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నట్లు వివరించారు. సిబ్బంది సమర్థత పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలను చేపట్టడంతోపాటు పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందించే విధంగా టాక్స్ అసెస్మెంట్ను ఆటోమేటిక్ పద్ధతుల్లో అందించే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డివిజన్ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మనకన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వాటి అమలు అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. 100 శాతం లక్ష్యం చేరుకున్న గనుల శాఖ గనులు, ఖనిజ శాఖ ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6వతేదీ వరకు రూ.3,649 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి గనుల శాఖ ఆదాయం రూ.2,220 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.5 వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామని చెప్పారు. నిర్వహణలో లేని గనుల్లో కార్యకలాపాలు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రవాణా శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి రూ.3,852.93 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.3,657.89 కోట్లను ఆర్జించినట్లు వెల్లడించారు. రవాణా రంగంలో కోవిడ్ సంక్షోభ పరిస్థితులు సమసిపోయి నెమ్మదిగా గాడిలో పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను మూడు దశల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, రవాణాశాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయలు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, అటవీ అభివృద్ధి సంస్ధ సీజీఎం ఎం.రేవతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పరివర్తన’ ఫలించేలా
సాక్షి, అమరావతి: గంజాయి సాగు, అక్రమ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టి కేసుల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్ఈబీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలన చర్యలు చేపడుతూనే ఉపాధి మార్గాలు చూపాలని అధికార యంత్రాంగానికి సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. ఎక్సైజ్, అటవీ, గనులు, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. అటు ఉక్కుపాదం.. ఇటు ఉపాధితో ఊతం పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చేయూత, ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి ఊతమివ్వాలని, ఆదాయం సమకూరే దిశగా ఉపాధి చూపాలని నిర్దేశించారు. అప్పుడే అక్రమ మద్యం తయారీ లాంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనతోపాటు ఉపాధి మార్గాలు కల్పించాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా, ఎవరైనా అర్హులు మిగిలిపోతే తనిఖీ చేసి వారికి కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించాలని ఆదేశించారు. తద్వారా పట్టాలు అందుకున్న రైతులకు రైతు భరోసా సాయం లభిస్తుందన్నారు. వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. అప్పుడే ఆశించిన స్ధాయిలో మార్పు వచ్చి అక్రమ మద్యం, గంజాయి సాగు నుంచి దూరం అవుతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరింత సౌలభ్యంగా పన్ను చెల్లింపులు పన్ను చెల్లింపులకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని పన్ను చెల్లింపుదారులకు వివరించాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. అవగాహన పెంపొందించి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై.. రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తూ శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న చోట్ల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై విస్తృత అవగాహన కలిగించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎలాంటి డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. నిర్వహణలో లేని గనులపై దృష్టి గనుల శాఖ కార్యకలాపాలపై సమీక్ష సందర్భంగా నిర్వహణలో లేని గనులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సూచించారు. సమీక్షలో విద్యుత్, అటవీ పర్యావరణ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలు తగ్గాయి గతంతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని సీఎం జగన్ వెల్లడించారు. బెల్టు షాపులను తొలగించడం, పర్మిట్ రూమ్‌ల రద్దు లాంటి పలు చర్యల వల్ల మద్యం విక్రయాలు తగ్గాయని చెప్పారు. దీంతో పాటు మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేందుకు షాక్ కొట్టేలా రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పరివర్తన కార్యక్రమం అమలు తీరుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. -
శాశ్వత భూసర్వే కోసం పెద్ద ఎత్తున సర్వేరాళ్ల తయారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతుల్లో జరుగుతున్న జగనన్న భూహక్కు భూరక్ష పథకం కోసం పెద్ద ఎత్తున సర్వే రాళ్లను గనులశాఖ సమకూరుస్తోందని ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల గ్రానైట్ పరిశ్రమల్లో సర్వేరాళ్లు తయారుచేస్తున్నారని వెల్లడించారు. గతంలో ఆర్డర్లు లేక, ఆర్థికంగా చితికిపోయి మూతపడిన వేలాది గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం సర్వేరాళ్ల తయారీ ఆర్డర్ ఇవ్వడంతో ఆ పరిశ్రమలకు తిరిగి జీవం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు రావాలని ప్రభుత్వపరంగా అనేక రాయితీలు ప్రకటించారని, స్లాబ్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. దానికి అదనంగా సర్వేరాళ్ల తయారీని కూడా పరిశ్రమ నిర్వాహకులకు అప్పగించడం ద్వారా వారికి మరింత పనికల్పించారని పేర్కొన్నారు. సర్వేరాళ్లు గమ్యానికి చేరుకున్న వెంటనే బిల్లుల చెల్లింపు ముడిసరుకును గ్రానైట్ పరిశ్రమలకు అందించి, వారినుంచి నిర్దేశిత నమూనాలో సర్వేరాళ్లను తయారు చేయిస్తున్నామని తెలిపారు. సిద్ధమైన రాళ్ల నాణ్యతాప్రమాణాలను పరీక్షించి, వాటిని సూచించిన గమ్యస్థానానికి చేర్చిన వెంటనే గ్రానైట్ పరిశ్రమలకు బిల్లులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క పరిశ్రమకు కూడా బిల్లుల బకాయిలు లేవని స్పష్టం చేశారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకుల్లో ఆందోళన అంటూ పత్రికల్లో వచ్చిన వార్త పూర్తిగా అసత్యమని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్కో సర్వేరాయికి రూ.300 గతంలో సిద్ధం చేసిన ఒక్కో సర్వేరాయికి ప్రభుత్వం రూ.270 చెల్లించేదని, దాన్ని ఇప్పుడు రూ.300కు పెంచామని అధికారులు తెలిపారు. దీంతో మరింత ఎక్కువమంది ఆర్డర్లు కా వాలని ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్నారు. సర్వేరాళ్ల తయారీ, విక్రయాలు, రవాణా అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్లు పేర్కొన్నా రు. ఈ యాప్‌లో అన్ని వివరాలు ఉంటాయని, గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు కూడా దీన్లో లాగిన్ అయి తాము విక్రయించిన సర్వేరాళ్లకు బిల్లుల చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కల్పించామని వివరించారు. సర్వేరాళ్ల తయారీలో గ్రానైట్ యజమానులపై ఆర్థికంగా భారం పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సర్వేరాళ్లకు అవసరమైన బ్లాక్‌లను స్వయంగా గ్రానైట్ పరిశ్రమ యజమానులకు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కేవలం ఆ రాయిని సర్వేరాళ్లుగా తీర్చిదిద్దడం వరకే గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. ఇది పూర్తిచేసిన వెంటనే వారికి బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఇక చకచకా లీజులు
సాక్షి, అమరావతి: గ్రానైట్ లీజుల ఈ–వేలానికి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 500కిపైగా గ్రానైట్ గనులకు ఈ–వేలం నిర్వహించనుంది. మైనింగ్ నిబంధనలు సరళతరం చేస్తూ ప్రభుత్వం ఇటీవల కొత్తగా పారదర్శక విధానాన్ని తీసుకువచ్చింది. ఎలక్ట్రానిక్ వేలం (ఈ–ఆక్షన్) ద్వారా రాష్ట్రంలోని ఖనిజ వనరుల మైనింగ్ కోసం ఉత్సాహం ఉన్న ఎవరైనా లీజులు పొందే అవకాశం కల్పించింది. నూతన విధానం ద్వారా తొలి దశలో 234 ఖనిజాల లీజుకు గనుల శాఖ ప్రభుత్వం ఇంతకు ముందే జిల్లాలవారీగా టెండర్లు పిలిచింది. అందులో 169 కలర్ గ్రానైట్‌వే. కానీ ఈ–వేలం నిర్వహించవద్దని గ్రానైట్ అసోసియేషన్ హై కోర్టుకు వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధానం సరైనదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో గ్రానైట్ లీజుల వేలానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తొలి దశలో 200 గ్రానైట్ గనుల లీజుకు ఈ–వేలం నిర్వహించనున్నారు. 6 నెలల్లో వివిధ రకాల ఖనిజాలకు చెందిన వెయ్యి క్వారీల లీజులకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో గ్రానైట్‌వే సగం ఉన్నాయి. ఈ వెయ్యి లీజుల ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ.500 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. గుత్తాధిపత్యానికి చెక్ గతంలో మైనింగ్ రంగంలో గుత్తాధిపత్యం ఉండేది. పలుకుబడి కలిగిన వ్యక్తులే క్వారీలను శాసించేవారు. కొత్తవారికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. 55 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ విధానంలో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి లీజులు కేటాయించేవారు. పైగా, లీజుకు తీసుకున్నప్పటికీ, వాటికి అనుమతులు తీసుకొనేవారు కాదు. లీజు దరఖాస్తుల నుంచి క్వారీయింగ్ ప్రారంభం వరకు అనేక అవకతవకలు జరిగేవి. పదేళ్లు, ఇరవై ఏళ్లకు కూడా తవ్వకాలు మొదలయ్యేవి కావు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడేది. గతంలో ఖనిజ వనరులను గుర్తించడం, వాటికి ఎన్వోసీల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, తర్వాత లీజులు తెచ్చుకోవడం ఒక ప్రహసనంలా ఉండేది. అనుమతులకూ పారదర్శక విధానం లేకపోవడంతో ఇబ్బందులు నెలకొనేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి అక్రమాలకు, ఆలస్యానికి తావు లేకుండా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ముందుగా వచ్చిన వారికే లీజుల విధానాన్ని రద్దు చేసింది. రాష్ట్రంలో ఖనిజ వనరులను గనుల శాఖ ద్వారా గుర్తించి, వాటిలో క్వారీయింగ్ చేసే ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఈ–వేలం విధానాన్ని తెచ్చింది. దీనివల్ల ఎవరైనా సులువుగా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఇప్పటికే గనుల లీజు పొంది క్వారీయింగ్ చేస్తున్న వారు, పట్టా భూముల్లో క్వారీయింగ్ చేస్తున్న వారు, అటవీ భూముల్లో లీజు పొందిన వారి ప్రయోజనాలను కూడా కాపాడుతూ కొత్త విధానాన్ని తెచ్చింది. ప్రస్తుతం క్వారీయింగ్ చేస్తున్న వారికి వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం కల్పించింది. లీజు గడువు ముగిసిన తరువాత ఆ ప్రాంతాల్లో రెవెన్యూ భూముల్లో ఖనిజాలకు వేలంలో ఎంత విలువ నిర్ధారణ అవుతుందో దానిని చెల్లిస్తే, వారికే లీజు అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. -
కడప స్టీల్‌కు ఇనుప గనుల కేటాయింపు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సమీపంలో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) సరఫరా చేయనుంది. ఇందుకోసం అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని సిద్ధాపురం తండా, అంతరాగంగమ్మ కొండ ప్రాంతాల్లోని 25 హెక్టార్లను ఏపీఎండీసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ గని నుంచి తవ్విన ముడి ఇనుమును కడప స్టీల్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ గనులకు సంబంధించిన సరిహద్దులను సూచిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేందుకు మరో రెండు గనులను కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జమ్మలమడుగు మండలంలో ఏటా 3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే యూనిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించే ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019, డిసెంబర్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత కరోనా రావడంతో పనులు అనుకున్నంత వేగంగా జరగలేదని, ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. -
త్రిశూల్ సిమెంట్స్ వ్యాజ్యం ధర్మాసనానికి
సాక్షి, అమరావతి: పరిమితికి మించి ఖనిజాన్ని తవ్వినందుకు పెనాల్టీ కట్టాలంటూ గనుల శాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ త్రిశూల్ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి సోమవారం ధర్మాసనానికి నివేదించారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామంలో లైమ్‌స్టోన్ లీజు పొంది, పరిమితికి మించి ఖనిజాన్ని తవ్వి రవాణా చేసినందుకు గనుల శాఖ రూ.100.24 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ పెనాల్టీ చెల్లించాలంటూ 2020 మే 7న డిమాండ్ నోటీసు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ త్రిశూల్ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రావు రఘునందన్‌రావు సోమవారం మరోసారి విచారణ జరిపారు. త్రిశూల్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. మనుగడలో లేని కంపెనీ పేరు మీద నోటీసు ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలని కోర్టు భావిస్తే, తమకు కొంత రక్షణ కల్పించాలని కోరారు. త్రిశూల్ సిమెంట్స్ అక్రమాలపై పోరాటం చేస్తున్న తాడిపత్రికి చెందిన వి.మురళీప్రసాద్‌రెడ్డి తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ, తాము దాఖలు చేసిన వ్యాజ్యంతోనే త్రిశూల్ అక్రమాలపై ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యం ధర్మాసనానికి వెళ్లడమే సముచితమన్నారు. ఆ ఆధారాలను చూస్తే కోర్టు వారిని ఉరి తీస్తుంది అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. త్రిశూల్ అక్రమాలపై పెద్ద సంఖ్యలో ఆధారాలున్నాయంటూ ఓ పెద్ద పుస్తకాన్ని చూపారు. ఇందులోని ఆధారాలను పరిశీలిస్తే త్రిశూల్‌కు చెందిన వారిని ఈ కోర్టు ఉరి తీస్తుందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా మొదలైన కొన్ని అంశాలను వ్యాజ్యంలో లేవనెత్తారని, అందువల్ల ధర్మాసనమే విచారించడం సబబు అని చెప్పారు. ఈ వ్యాజ్యం ఫైళ్లన్నింటినీ త్రిశూల్ సిమెంట్స్‌పై దాఖలైన వ్యాజ్యాలతో జత చేసే విషయంలో పరిపాలన పరమైన ఆదేశాల నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. త్రిశూల్ సిమెంట్స్‌పై రెండు వారాలపాటు ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. -
బీచ్ శాండ్ మైనింగ్ ఎక్కడాలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తాజాగా వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మైనింగ్ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి ఎక్కడా బీచ్ శాండ్ మైనింగ్ జరగడంలేదని స్పష్టంచేశారు. అసలు మైనింగ్ ఆపరేషన్స్ జరగనప్పుడు మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2019కి ముందు రెండు ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాయని.. 2019లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో హెవీ మినరల్ బీచ్ శాండ్ మైనింగ్ పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇటీవల బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర గనుల శాఖను అణు ఇంధన శాఖ కోరిందని తెలిపారు. ఐబీఎం విచారణలో ఆ సంస్థలు మైనింగ్ నిర్వహించిన కాలంలో ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. అక్రమాలు వాస్తవమని నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆ రెండింటి అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు ఇక బీచ్ శాండ్ మైనింగ్ కోసం గత ఏడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డీఏఈ)కు ఏపీఎండీసీ 16 ప్రతిపాదనలను సమర్పించిందని వెంకటరెడ్డి తెలిపారు. దానిలో విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణాజిల్లా మచిలీపట్నం తీరప్రాంతంలో 1,978.471 హెక్టార్లలో రెండు బీచ్ శాండ్ డిపాజిట్లకు ఏపీఎండీసీని ప్రాస్పెక్టివ్ లెస్సీగా డీఏఈ నియమించిందని తెలిపారు. ఇక్కడ మైనింగ్ జరిపేందుకు అనుమతుల కోసం ఏపీఎండీసీ దరఖాస్తు చేసుకుందన్నారు. అయితే, ఆ అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంవల్ల కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బ్లాక్‌లలో ఇప్పటివరకు ఎటువంటి మైనింగ్ ప్రారంభం కాలేదని ఆయన స్పష్టంచేశారు. హెవీ మినరల్ బీచ్ శాండ్‌లో మొనాజైట్ అవశేషాలు జీరో శాతం మాత్రమే ఉండాలని, అంతకుమించి ఉన్నట్లు నిర్ధారణ అయితే సదరు మైనింగ్ లీజులను రద్దుచేయాలంటూ కేంద్రం 2019 మార్చి ఒకటిన మెమో ద్వారా రాష్ట్రానికి ఆదేశాలు ఇచ్చిందన్నారు. దాని ప్రకారం మన రాష్ట్రంలోని బీచ్ శాండ్‌లో మొనాజైట్ శాతం కేంద్రం నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉన్నందున అన్ని బీచ్ శాండ్ లీజులను గనుల శాఖ రద్దుచేసిందని వెంకటరెడ్డి ఆ ప్రకటనలో వివరించారు. కేంద్రానికి ఏపీ సమగ్ర వివరణ ఇక బీచ్ శాండ్ మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యక్తంచేసిన సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12న కేంద్ర అణు ఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ జరుగుతోందని, దాని ద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్ చట్టాలకు విఘాతం, మొనాజైట్ అక్రమ రవాణా జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే స్పష్టంచేసిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
234 ఖనిజ లీజులకు ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి లీజు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ–వేలం కొనసాగుతోంది. తొలి దశలో 234 ఖనిజాలకు క్వారీ లీజులు ఇచ్చేందుకు గనుల శాఖ జిల్లాలవారీగా టెండర్లు పిలిచింది. అందులో 169 కలర్ గ్రానైట్‌వే. మిగిలినవి క్వార్‌ట్ట్జ, బ్లాక్ గ్రానైట్, బెరైటీస్, సిలికా శాండ్, ప్రొఫలైట్ ఖనిజ లీజులు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 70 క్వారీ లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 54, విజయనగరం జిల్లాలో 35, వైఎస్సార్ జిల్లాలో 31, కర్నూలు జిల్లాలో 18, నెల్లూరు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 8 లీజులకు వేలం నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్నిటికి ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేశారు. మరికొన్నింటికి త్వరలో మంజూరు చేయనున్నారు. గతంలో ఉన్న మైనింగ్ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేసేవారు. అలాంటివి 2,162 లీజులు ఉన్నట్లు గుర్తించారు. అనుమతిచ్చిన ఈ క్వారీల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. అప్పటికీ సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆ లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వెయ్యి క్వారీలను తిరిగి ఆపరేషన్లోకి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి దశలో 234 లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఇందులో అనుమతి పొందిన వారికి రెవెన్యూ శాఖ నుంచి త్వరితగిన నిరభ్యంతర పత్రాలు ఇప్పించంతోపాటు ఇతర అనుమతులూ త్వరగా వచ్చేలా చూస్తున్నారు. -
లండన్ కోర్టులో ఏపీ గెలుపు
సాక్షి, అమరావతి: లండన్ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. విశాఖపట్నం ప్రాంతంలో బాక్సైట్ ఒప్పందానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, యుఏఈకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా) మధ్య ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన అధికారులు, న్యాయ నిపుణులు తమ వాదనలను బలంగా వినిపించారు. భారతదేశం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించిన వాదనలతో ఆర్బిట్రేషన్ కోర్టు ఏకీభవిస్తూ, ఈ కేసు తమ పరిధిలోది కాదని పేర్కొంటూ కొట్టేసింది. గిరిజనుల డిమాండ్ మేరకు బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రాకియాతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం రాకియా తన జాయింట్ వెంచర్ సంస్థ ఎన్రాక్తో కలిసి ఏర్పాటు చేసే అల్యూమినియం పరిశ్రమకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాక్సైట్ సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. అయితే, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన సంస్కృతికి విఘాతం ఏర్పడుతుందని ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో బాక్సైట్ సరఫరా వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెద్దగా లేదని, గిరిజన ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఇండియా, యుఏఈల మధ్య ఉన్న బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ (బీఐటీ) ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని రాకియా సంస్థ తమకు బాక్సైట్ సరఫరా చేయకపోవడం వల్ల నష్టపోయామంటూ లండన్ మధ్యవర్తిత్వ కోర్టులో కేసు వేసింది. ఏపీ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం తమకు బాక్సైట్ ఇవ్వకపోవడం వల్ల తాము అల్యూమినియం పరిశ్రమ కోసం పెట్టిన పెట్టుబడిని నష్టపోయామని, ఇందుకు నష్టపరిహారం ఇవ్వాలని వాదించింది. ఈ కేసులో దాదాపు 273 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా.. ఈ అంశంపై రాకియా సంస్థ కోర్టుకు వెళ్లక ముందే చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రభుత్వం తరఫున ప్రతినిధులు పలుసార్లు రాకియాతో సంప్రదింపులు జరిపినా అంగీకరించలేదు. దీంతో సీఎం వైఎస్ జగన్ సూచనలతో అధికారులు పకడ్బందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం నుంచి గనుల శాఖ ఉన్నతాధికారులు, ఏపీ ఎండీసీ అధికారులు, న్యాయ నిపుణులు లండన్ కోర్టులో బాక్సైట్ ఒప్పందాల రద్దు పర్యవసానాలను బలంగా వినిపించారు. లండన్ న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ.. ఈ కేసు తమ పరిధిలోకి రాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఇది అతి పెద్ద విజయమని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ‘సాక్షి’కి తెలిపారు. లండన్‌లో ఉన్న ఆయన తుది విచారణ సందర్భంగా లండన్ కోర్టుకు వెళ్లారు. తీర్పు ఏపీకి అనుకూలంగా రావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
చిన్నతరహా ఖనిజాల లీజులకు ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చిన్నతరహా ఖనిజాల లీజులకు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్ వేలం జరగనుంది. ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా గనుల శాఖ వేలం ప్రక్రియ నిర్వహించనుంది. తొలివిడతగా ఈ నెలలో 200 లీజులకు ఈ–వేలం నిర్వహించి అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేశారు. గనుల రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా చిన్నతరహా ఖనిజాలకు ఈ–వేలం ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఈ–వేలంలో పాల్గొనేందుకు వీలుగా గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ–వేలం నిర్వహించే లీజుల వివరాలు, అవసరమైన టెండర్ పత్రాలు ఈ నెల 11వ తేదీ నుంచి ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ https://tender.apeprocurement.gov.inలో అందుబాటులో ఉంచుతారు. లీజులకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.mines.ap. gov.in/ miningportal లద్వారా తెలుసుకోవచ్చు. ఈ–వేలంలో ఎక్కువ మొత్తానికి బిడ్ కోట్ చేస్తారో ఆ బిడ్డర్ (ప్రిఫర్డ్ బిడ్డర్) తాను కోట్ చేసిన మొత్తాన్ని 15 రోజుల్లో గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్ము చెల్లించిన వెంటనే వారికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తారు. ఆ తర్వాత బిడ్డర్ తాను కోట్ చేసిన క్వారీకి సంబంధించిన మైనింగ్ ప్లాన్, పర్యావరణ అనుమతి, సీఎఫ్ఈ సమర్పించిన వెంటనే లీజులు మంజూరు చేస్తారు. అనవసర జాప్యం ఉండదు తొలివిడతలో 200 లీజులకు ఈ–వేలం ద్వారా అనుమతులు మంజూరు చేస్తాం. ఎక్కడా అనవసర జాప్యం లేకుండా, పారదర్శకంగా లీజుల జారీ ప్రక్రియ ఉంటుంది. ఇప్పటివరకు మైనింగ్ రంగంలోకి రావాలనే ఆసక్తి ఉండి, అవకాశాలు దక్కని వారు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం ద్వారా మైనింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎక్కువ మైనింగ్ క్వారీలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు ఖనిజాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. మైనింగ్ కార్యక్రమాల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
బ్రహ్మదియా బొగ్గును తెచ్చేద్దాం
సాక్షి, అమరావతి: మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ).. ఇప్పుడు జార్ఖండ్‌లోని బ్రహ్మదియా బొగ్గు గనిపై దృష్టి సారించింది. ఈ గనిలోనూ సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్రం 2021లో నిర్వహించిన బిడ్డింగ్‌లో పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి మరీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాక్‌ను దక్కించుకుంది. ఇందులో ఉన్న అత్యంత నాణ్యమైన కోకింగ్ కోల్‌ను ఉక్కు కర్మాగారాల్లో వినియోగిస్తారు. దీన్ని ఉత్పత్తి చేస్తే.. బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రహ్మదియాలో వీలైనంత త్వరగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏపీఎండీసీ చర్యలు చేపట్టింది. అనుమతుల కోసం ప్రయత్నాలు.. బ్రహ్మదియాలో తవ్వకాలు జరిపేందుకు అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. దీనిపై జార్ఖండ్ పర్యావరణ అథారిటీ స్పందించాల్సి ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీఎండీసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. నాలుగైదు నెలల్లో అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈలోపు మైనింగ్ లీజు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు సాధించేందుకు చర్యలు చేపట్టారు. త్వరలో అవి కూడా వస్తాయని ఏపీఎండీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈలోగా అవసరమైన భూ సేకరణపై దృష్టి కేంద్రీకరించారు. ఏడాదికి 5 లక్షల టన్నులు తవ్వేలా.. బ్రహ్మదియా గని నుంచి ఏడాదికి లక్షన్నర టన్నుల బొగ్గును 14 సంవత్సరాలపాటు ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్సు ఇచ్చింది. కానీ స్థానికంగా అక్రమ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మదియాలోని బొగ్గు నిల్వలను తక్కువ సమయంలోనే మైనింగ్ చేయాలని ఏపీఎండీసీ భావిస్తోంది. ఏడాదికి లక్షన్నర టన్నులకు బదులు ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నాలుగైదేళ్లలోనే ఈ గనిలో బొగ్గు తవ్వకాలు పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో మైనింగ్ ప్రారంభిస్తాం.. సుల్యారీలో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్ ఇండియా సరసన నిలిచాం. పర్యావరణ అనుమతులు సాధించి త్వరలో బ్రహ్మదియాలోనూ ఉత్పత్తి ప్రారంభిస్తాం. దీని వల్ల మన రాష్ట్ర అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి బొగ్గును కొనుగోలు చేయాల్సిన అవసరముండదు. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ -
ఏపీలో సత్ఫలితాలిస్తోన్న మైనింగ్ సంస్కరణలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనింగ్ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో నూతన విధానాలకు రూపకల్పన చేశారు. పారదర్శకతతో అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఖనిజ ఆదాయంలో గనుల శాఖ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చదవండి: ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3765 కోట్ల ఆదాయం వచ్చింది. 60 శాతం వృద్ధి రేటుతో గత ఏడాది కన్నా అదనంగా రూ.1425 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లీజు అనుమతులు మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచ్చింది. తద్వారా లీజులు పొంది.. ఏళ్ల తరబడి క్వారింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేసే విధానానికి స్వస్తి పలికారు. ముఖ్యంగా లీజుల కేటాయింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తుందని గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్పారు. -
సచివాలయాల్లోనూ ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: ఇసుక రవాణాను మరింత సులభతరం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇసుక డోర్ డెలివరీకి ఇది బాగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు ఈ బుకింగ్ బాధ్యతను అప్పగించారు. వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో డబ్బు కడితే అక్కడి నుంచే చలానా వస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన అడ్రస్‌కు ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అమ్మకాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఆంధ్రా శ్యాండ్ పేరుతో వెబ్ పోర్టల్ www. andhrasand.com మొబైల్ యాప్ andhrasand app ద్వారా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆఫ్‌లైన్ విధానంలో రవాణా చేసే వ్యక్తులు మధ్యవర్తులుగా మారి ఎక్కువ రేటుకు ఇసుక విక్రయిస్తుండడంతో ఆన్లైన్ డోర్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు (ఆదివారం, సెలవులు మినహా) మ.12 గంటల నుండి సా.6 గంటల వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. రీచ్, డిపో నుండి 20 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ఉన్న బుకింగ్‌కు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడి ఇసుకనైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. బుకింగ్ ఇలా.. ► సాధారణ వినియోగదారుడు మొబైల్ నెంబర్‌తో, బల్క్ వినియోగదారుడు మొబైల్, ఈ–మెయిల్, పాన్, జీఎస్టీ నెంబర్‌తో ఇసుకను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ► డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో ఆన్లైన్లోనే డబ్బు చెల్లించే ఏర్పాటుచేశారు. ► డిపోలో ఇసుక లోడ్ చేసిన తర్వాత వినియోగదారునికి జీపీఎస్ నావిగేషన్ ప్రారంభమవుతుంది. బుక్ చేసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు రవాణా చేసే వాహనాన్ని ట్రాక్ చేస్తారు. వెబ్ పోర్టల్, యాప్, కస్టమర్ కేర్ కాల్ సెంటర్ ద్వారా కూడా వినియోగదారులు బుకింగ్ ఆర్డర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. ► ఏమైనా ఇబ్బందులు వస్తే కస్టమర్ కేర్ కాల్ సెంటర్ 9700009944కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న రోజే డెలివరీ ప్రస్తుతం 147 డిపోలు, 215 రీచ్‌లలో ఇసుక విక్రయాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరుగుతాయి. పీక్ స్టేజ్‌లో ఇది కోటిన్నర క్యూబిక్ మీటర్లు ఉంటుంది. గతంలో బుక్ చేసుకున్న రెండు, మూడు రోజులకు ఇసుక వచ్చేది. కానీ, ఇప్పుడు బుక్ చేసుకున్న రోజే డెలివరీ చేస్తున్నారు. అలాగే, నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లను ఇప్పటికే ప్రకటించారు. రీచ్‌లు, డిపోల వద్ద ధరల పట్టిక, హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. మధ్యవర్తులు ఎక్కువ రేటుకి అమ్మకుండా ఈ చర్యలు చేపట్టారు. బ్లాక్ మార్కెటింగ్‌ను సహించం వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరసమైన రేటుకు, నాణ్యమైన ఇసుకను సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండూ విధానాలు పెట్టాం. మధ్యవర్తులు ఎక్కువ రేటుకు అమ్మకుండా చూసేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను సహించం. ఫలానా రీచ్‌లోనే బుక్ చేసుకోవాలనేది లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షల్లేవు. వినియోగారులకు ఇంకా సులభంగా ఇసుకను అందించేందుకు ప్రయత్నిస్తాం. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ -
ప్రభుత్వోద్యోగులు అంకితభావం చూపాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావం చూపి తీరాల్సిందేనని, అలా చూపకపోవడం దుష్ప్రవర్తన కిందకే వస్తుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఉద్యోగులు తప్పుడు నివేదికలు ఇవ్వడమంటే తమ విధులపట్ల అంకితభావం చూపకపోడమే అవుతుందని పేర్కొంది. ఇలా తప్పుడు నివేదికలు ఇచ్చి ఖజానాకు రూ.215.06 కోట్ల మేర నష్టం కలిగించినందుకు గనుల శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు వారి సస్పెన్షన్‌ను మరికొంత కాలం పాటు కొనసాగించడాన్ని సమర్థించింది. సస్పెన్షన్‌లో ఉన్న అధికారులు విచారణకు సహకరించనప్పుడు వారి సస్పెన్షన్‌ను పొడిగించడంలో ఎలాంటి దోషంలేదని పేర్కొంది. ఆ ఉద్యోగుల సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదీ వివాదం.. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో ఎంఎస్పీ గ్రానైట్స్ సంస్థ 4.517 హెక్టార్లలో మైనింగ్ లీజు తీసుకుంది. ఈ కంపెనీ తవ్వితీసిన ఖనిజం ఎంతో తేల్చేందుకు గనుల శాఖ అధికారులు 2020లో సర్వే నిర్వహించారు. ఈ కంపెనీ 1.45 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వితీసిందని గనుల శాఖలో అసిస్టెంట్ మైన్స్ అధికారులుగా పనిచేస్తున్న ఆనందరావు, వెంకటేషు, సర్వేయర్ కుసుమ శ్రీధర్‌లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.విజిలెన్స్ అధికారులు సర్వేచేసి 4.18 లక్షల క్యూబిక్ మీటర్ల మేర సదరు సంస్థ తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. ఈ నివేదికలను పరిశీలించిన గనుల శాఖ ఉన్నతాధికారులు.. ఆనందరావు తదితరులు ఎంఎస్పీ గ్రానైట్స్‌తో కుమ్మక్కై తప్పుడు నివేదిక ఇచ్చారని తేల్చారు. తాము 4.18 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వినట్లు ఎంఎస్పీ గ్రానైట్స్ అంగీకరించింది. దీంతో ఆనందరావు తదితరుల తప్పుడు నివేదికవల్ల ఖజానాకు రూ.215 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చి ఆనందరావు తదితరులను సస్పెండ్ చేశారు. దీనిని సవాలు చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. సింగిల్ జడ్జి వీరి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు ఇచ్చిన తప్పుడు నివేదికవల్ల లీజుదారు నుంచి రూ.215.06 కోట్ల మేర పెనాల్టీ రాకుండా పోయిందన్నారు. తద్వారా వారు ఖజానాకు నష్టం కలిగించారని వివరించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఇటీవల ఈ తీర్పు వెలువరించింది. -
అక్రమ మైనింగ్ బాధ్యులపై కొరడా
సాక్షి, అమరావతి/శాంతిపురం: అక్రమ మైనింగ్‌కు బాధ్యులైన వారిని వదిలిపెట్టేదిలేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. పర్యావరణానికి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్న పలు అక్రమ క్వారీలను మూసివేశామని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ముద్దనపల్లి రెవెన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్న ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రకాష్, ఏడీ పీ వేణుగోపాల్‌తో కలిసి గురువారం శాంతిపురం, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ క్వారీయింగ్ ప్రాంతాన్ని వారు తనిఖీ చేశారు. అటవీశాఖ ఆధీనంలోని ఈ భూముల్లో అక్రమంగా కొందరు వ్యక్తులు మైనింగ్ చేస్తున్నారని, సమాచారం అందిన ప్రతీసారి దాడులు నిర్వహించి, వాహనాలు, యంత్రాలు, గ్రానైట్ సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు వెంకట్‌రెడ్డికి వివరించారు. శాంతిపురం, ముద్దనపల్లె ప్రాంతంలో గత అక్టోబర్ 25, 28, డిసెంబర్ 23న ఇదే ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సర్వే నంబరు 104, 213 పరిధిలోని అటవీ భూముల్లో భారీగా గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామన్నారు. మహాచెక్‌లో భాగంగా ఇటీవల ఇదే ప్రాంతంలో 4 బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో 40 గ్రానైట్ దిమ్మెలు, 6 కంప్రెసర్లను, 2 హిటాచీ యంత్రాలను సీజ్ చేసినట్లు వారు చెప్పారు. ఈ ప్రాంతాలను పరిశీలించి వీజీ వెంకటరెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. అవి.. ► అటవీశాఖ పరిధిలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌పై ఆ శాఖ ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. అటవీ శాఖ డీఎఫ్‌ఓకు లేఖ రాయడంతో పాటు ఇక్కడి పరిస్థితిని వివరించి అటవీ అధికారుల నిఘాను పెంచేలా చూడాలి. ► ఫారెస్టు యాక్ట్–1980 ప్రకారం.. అక్రమార్కులపై కేసులు నమోదయ్యేలా చూడాలి. ఆ భూముల్లోకి ఎవరూ వెళ్లకూడదు ద్రవిడ వర్సిటీ పరిధిలోని భూముల్లో అక్రమ మైనింగ్‌పై గతంలో దాడులు చేసి 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేసినట్లు అధికారులు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ..వర్సిటీలోని హరప్పా భవనం సమీపంలో ఉన్న భూముల్లోకి ఎవరూ వెళ్లకుండా గాడి కొట్టించి, భద్రతా సిబ్బందిని నియమించాలని.. అనుమతిలేకుండా ఎవరినీ ఈ ప్రాంత పరిధిలోకి రాకుండా చూడమని వర్సిటీ అధికారులను కోరాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో ప్రత్యేక నిఘా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, గనుల శాఖ అధికారుల బృందాలతో మొబైల్ తనిఖీలు కూడా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ ఇతర రాష్ట్రాలకు ఖనిజాలను తరలించకుండా చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశామన్నారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా గనుల శాఖ ఈ మధ్యకాలంలో రూ.5 కోట్ల విలువైన 555 గ్రానైట్ బ్లాక్‌లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. వీటిని వేలం ద్వారా విక్రయిస్తామన్నారు. ప్రభుత్వ అనుమతితో దీనిపై ఓ యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
అత్యంత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ అత్యంత పారదర్శకతతో నిర్వహిస్తున్నామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. వినియోగదారులకు అందుబాటు ధరలో ఇసుక విక్రయానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, దాని ప్రకారమే విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవగాహన లేకుండా కొన్ని మీడియాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయంపై అసత్య కథనాలను ప్రచురిస్తున్నారని అన్నారు. జేపీ సంస్థదే బాధ్యత: ద్వివేది ‘ఇసుక ఆపరేషన్స్‌ను పారదర్శకంగా నిర్వహించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా టెండర్ల ప్రక్రియను నిర్వహించింది. ఎంఎస్టీసీ నిర్వహించిన టెండర్ల లో జేపీ పవర్ వెంచర్స్ సంస్థను ఎంపిక చేశాం. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం నిర్ణయిం చిన రేటుకు ఇసుక విక్రయాలు జరుపుతున్నాం. రెండేళ్ల కాలానికి ఇసుక ఆపరేషన్స్ కాంట్రాక్ట్‌ను జేపీ సంస్థకు ఇచ్చాం. ఇతర రాష్ట్రాల్లో ఏపీఎండీసీ గనులను నిర్వహిస్తోంది. అక్కడ ఆపరేషన్స్ కోసం సబ్ కాంట్రాక్ట్‌లకు కొన్ని పనులు అప్పగించాం. ఇసుక టెండర్ల నిబంధనల్లో కూడా లీజు అనుమ తులు పొందిన సంస్థ సబ్ కాంట్రాక్ట్ కింద కొన్ని పనులు ఇతరులకు ఇవ్వవచ్చు. అయితే మొత్తం ఇసుక ఆపరేషన్స్‌కు జేపీ సంస్థ మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరిగితే జేపీ సంస్థపైనే చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లను జేపీ సంస్థ నిర్వహిస్తు న్నందున వారు సబ్ కాంట్రాక్ట్ కింద ఇతరుల సేవలను తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి నిబం ధనల ఉల్లంఘనా లేదు. కొత్తగా ఏర్పాటైన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇసుకను తీసుకువచ్చే బాటకు కొందరు స్థానికులు డబ్బు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోప ణల నేపథ్యంలో దానిపై ఎవరైనా సరే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటివి అటు జేపీ సంస్థ దృష్టికి వచ్చినా, లేదా మా దృష్టికి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరతాం. వినియోగదారులకు సరైన రేటుకు, నిర్దిష్టమైన నాణ్యతతో కూడిన ఇసుక అందుతుందా లేదా అనేదానిపైనే మేం దృష్టి సారిస్తున్నాం. జేపీ సంస్థ ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ బుకింగ్‌లు చేస్తోంది. ఆన్లైన్ ద్వారా కూడా చేయాలని çసూచించాం. ప్ర జలకు ఇబ్బంది లేకుండా మంచి సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేయడానికి ఆ సంస్థ రూపొం దించిన ఫోన్ యాప్‌ను కూడా పరిశీలిస్తున్నాం. గతంలో ఆన్లైన్ విధానంలోని లోపాలవల్ల విని యోగదారులు ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా సాఫ్ట్వేర్ ఉండేలా చూస్తాం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని, అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. గతంలో పట్టా భూము ల్లో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల నాణ్యత లేదనే ఫిర్యాదులు చాలా వచ్చాయి. వాటికి అనుమతులు రద్దు చేశాం. ప్రస్తుతం వందకు పైగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదల వల్ల కొన్ని రీచ్‌ల ప్రారంభంలో జాప్యం జరిగింది. త్వరలోనే దాదాపు 150 రీచ్‌లు ప్రారంభమవుతాయి’ అని ద్వివేది చెప్పారు. అవాస్తవాలు ప్రచురించారు: వెంకటరెడ్డి ‘ఇసుక విక్రయాలపై అవగాహన లేకుండా ఒక మీడియా సంస్థ అవాస్తవాలను ప్రచురించింది. గతంలో ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్న సమయంలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక లభించలేదు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లింది. దీనిని నియంత్రించడానికే ఈ ప్రభుత్వం సుస్థిర ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ చేశాం. కొత్త ఇసుక విధానంలోని లోటుపాట్లను పరిష్కరించేందుకు మెరుగైన విధానం కోసం సీఎం జగన్ మంత్రుల కమిటీని వేసి ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చారు. జేపీ సంస్థ ఎక్కడా సబ్ లీజులు ఇవ్వలేదు. నిబంధనల ప్రకారమే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దానినే జేపీ సంస్థ అనుసరిస్తోంది. కొత్తగా పుట్టిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని అంటూ ఒక మీడియాలో వచ్చిన కథనంలో వాస్తవం లేదు. జేపీ సంస్థ నగదుతో పాటు యూపీఐ. బ్యాంకు ఖాతాల ద్వారా సొమ్ము జమ చేసిన వినియోగదారులకు కూడా ఇసుకను విక్రయిస్తోంది. అందుకోసం 26 బ్యాంకు ఖాతాలను జేపీ సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఆ బ్యాంకు ఖాతాల్లో వినియోగదారులు సొమ్ము డిపాజిట్ చేసి ఇసుకను తీసుకోవచ్చు. బాట చార్జీల పేరుతో స్థానిక నేతలు ఎక్కడ డబ్బు వసూలు చేస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా కథనాలు రాస్తున్నారు. దానిపై పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతివారం నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లపై ప్రకటనలు జారీ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ రేటును ఎవరైనా డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ పాయింట్లలో ఇసుక సిద్ధంగా ఉంది. ప్రతి రీచ్‌లోనూ మైనింగ్ ప్లాన్ తయారు చేస్తాం. దానికి పర్యావరణ అనుమతులు తీసుకుంటాం. దానికి అనుగుణంగానే సరిహద్దులు గుర్తించి జియో కోఆర్డినేట్స్ ప్రకారం లీజుదారులకు మైనింగ్ ప్రాంతాన్ని అప్పగిస్తాం. ఈ ప్రాంతం మినహా మరెక్కడైనా ఇసుక ఆపరేషన్స్ చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏడాదికి రెండు కోట్ల టన్నుల వరకు ఇసుక తవ్వాలని జేపీ సంస్థకు నిర్దేశించాం. ప్రతి నెలా ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాల వివరాలను తీసుకుంటున్నాం. దీనిని గనులశాఖ ఏడీ, డీడీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జేపీ సంస్థ మాన్యువల్‌గానే బిల్లులు ఇస్తోంది. ఆన్లైన్ కావాలని వినియోగదారులు కొందరు కోరుతున్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నాం. అధికారుల నుంచి నిర్దిష్టమైన అంశాలపై వివరణ కోరకుండానే మీడియాలో కథనాలను ప్రచు రించడం తగదు’ అని వెంకటరెడ్డి చెప్పారు.