Eknath Khadse
-
‘ఆయన నా జీవితాన్ని నాశనం చేశారు’
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై బీజేపీ అసంతృప్త నేత ఏక్నాథ్ ఖడ్సే మరోసారి ఫైర్ అయ్యారు. ఆయన తన జీవితం నాశనం చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘గత నాలుగేళ్లుగా నేను మానసిక ఆందోళనకు గురవుతున్నా. కేవలం మీ కారణంగానే నాకు ఈ దుస్థితి పట్టింది. పార్టీని వీడటం ఎంతో బాధాకరంగా ఉంది. కానీ నాకు వేరే మార్గం లేదు. లైంగిక దాడి కేసులో నన్ను ఇరికించే ప్రయత్నాలు జరిగాయి. దేవేంద్ర ఫడ్నవిస్ నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. పార్టీని వీడే పరిస్థితుల్లోకి నెట్టారు’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఏక్నాథ్ ఖడ్సే ఎన్సీపీలో చేరనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. (చదవండి: బీజేపీకి సీనియర్ నేత ఖడ్సే రాంరాం! ) ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్, మంత్రి జయంత్ పాటిల్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏక్నాథ్ ఖడ్సే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్సీపీలో చేరనున్నారు. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది’’అని పేర్కొన్నారు. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ హయాంలో మంత్రిగా పనిచేసిన, ఏక్నాథ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతీ సందర్భంలోనూ బీజేపీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకుండా ఫడ్నవిస్ అడ్డుకున్నారని, కనీసం విధాన పరిషత్‌కు వెళ్లేందుకు కూడా అవకాశమివ్వలేదని మండిపడ్డారు. కాగా ఖడ్సే స్థానంలో ఆయన కుమార్తె రోహిణీ ఖడ్సేకు బీజేపీ టికెట్ ఇవ్వగా, ఆమె ఓటమి పాలయ్యారు. -
బీజేపీకి సీనియర్ నేత ఖడ్సే రాంరాం!
సాక్షి, ముంబై: బీజేపీలో అసంతృప్తితో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ఎన్సీపీలో చేరడం దాదాపు ఖారారైంది. ఈ నెల 22వ తేదీన పవార్ సమక్షంలో ఎన్సీపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఆయన మద్దతుదారులు ఆనందంలో మునిగిపోయారు. ముంబైలోని ఎన్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీలో చేరుతారని సమాచారం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవి విగ్రహం ప్రతిష్టించే రోజు అంటే ఈ నెల 17వ తేదీన ఆయన ఎన్సీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. చివరకు అదికూడా వాయిదా పడింది. (చదవండి: పార్టీ ఎమ్మెల్యేకు జేపీ నడ్డా స్ట్రాంగ్ వార్నింగ్) మళ్లీ ఈ నెల 22న ముహూర్తం ఖరారైనట్లు సమాచారం రావడంతో ఇప్పుడైనా కార్యరూపం దాలుస్తుందా..? లేదా..? అని ఇరు పార్టీల కార్యకర్తలు ఆయోమయంలో ఉన్నారు. కాగా, ఇంతవరకు తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ముహూర్తం ఎప్పడనేది అధికారికంగా తను ప్రకటించకుండానే మీడియా వదంతులు లేవనెత్తిందని ఖడ్సే దుయ్యబట్టారు. అదేవిధంగా ఖడ్సే రాజీనామా విషయం తనకు తెలియదని, రాజీనామా లేఖ తన వద్దకు ఇంతవరకు రాలేదని బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా ఖడ్సే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, గురువారం ఎన్సీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైందనిసోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఖడ్సే మద్దతుదారులు ఏర్పాట్లు చేయడానికి ముంబైకి బయలుదేరినట్లు సమాచారం. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయిన ఖడ్సే మద్దుతుదారులు, ఎన్సీపీ పదాధికారులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి అయోమయానికి గురిచేస్తున్నారని రాజకీయ పారీ్టలు అంటున్నాయి. ఫడ్నవిస్‌తో కుదరక.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హయాంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏక్నాథ్ ఖడ్సే తరుచూ బీజేపీపై వ్యాఖ్యలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అభ్యరి్థత్వం ఇవ్వకుండా పక్కన బెట్టడానికి ఫడ్నవిస్ కారణమని ఆరోపనలు గుప్పించారు. కనీసం విధాన్ పరిషత్‌కు వెళ్లేందుకు కూడా అవకాశమివ్వలేదు. అందుకు ఫడ్నవిస్ ప్రధాన కారణమని ఆరోపించారు. దీంతో ఖడ్సే, ఫడ్నవీస్ మ«ధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైంది. ఫడ్నవీస్ హాజరైన పార్టీ కార్యక్రమాలకు ఖడ్సే గైర్హాజరయ్యేవారు కాదు. చాలా రోజులుగా ఒకే వేదికపై ఇద్దరు దర్శనమివ్వలేదు. ఇక ఖడ్సే వేరే పార్టీలో చేరతారని అనుకున్నా.. ఏ పారీ్టలో చేరుతారనే దానిపై స్పష్టత రాలేదు. కొద్ది రోజులుగా ఆయన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ కావడంతో అనుమానాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బీజేపీ అధినాయకత్వంపై ఏక్నాథ్ ఖడ్సే కినుక
జల్గావ్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అధినాయకత్వానికి పరోక్ష హెచ్చరికలు పంపారు. ‘అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో నా కుమార్తెతో పాటు మరికొందరు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కారణాలపై ఆధారాలు చూపాను. సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని కోరాను’అని తెలిపారు. ‘పార్టీని వీడి వెళ్లాలనుకోవడం లేదు. పార్టీలో ఇవే రీతిగా అవమానాలు కొనసాగుతుంటే మరో మార్గం ఆలోచిస్తా’అని తెలిపారు. -
మహారాష్ట్రలో బీజేపీ విజయకేతనం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 25 కార్పొరేషన్లలోనూ అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖ మంత్రి గిరీశ్ మహాజన్ భార్య సాధనా మహాజన్ ఎన్సీపీ అభ్యర్థి అంజలి పవార్‌పై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గిరీశ్ మహాజన్.. అన్నాహజారే దీక్ష, మహా రైతుల ర్యాలీ సమయంలో ఏర్పడిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఫడ్నవిస్‌కు సలహాలు ఇవ్వడం ద్వారా ట్రబుల్ షూటర్‌గా పేరు పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భార్య గెలుపొందడం ద్వారా మహా రాజకీయాల్లో పట్టు సాధించడం ఆయనకు మరింత సులభంగా మారింది. సొంత పార్టీలోనే శత్రువుగా భావించే ఏక్నాథ్ ఖడ్సేపై పై చేయి సాధించినట్టయింది. ఇది ప్రజా విజయం : గిరీశ్ మహాజన్ జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై గిరీశ్ మాట్లాడుతూ.. జామ్నర్లో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఎన్సీపీ నాయకుల కుల రాజకీయాలు ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చారు : ఎన్సీపీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ డబ్బు వెదజల్లిందని ఎన్సీపీ నాయకులు ఆరోపించారు. గిరీశ్ మహాజన్ ఇంటింటికీ తిరిగి ఓటుకు 5 వేల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. -
అంజలిపై అసభ్య వ్యాఖ్యలు.. బీజేపీ నేతపై కేసు
సాక్షి, ముంబై: ఓ ఉద్యమకారిణిపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సే పై కేసు నమోదు అయ్యింది. ఓ పబ్లిక పంక్షన్ లో ఆయన ప్రసంగిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అంజలి అనే ఉద్యమకారిణి వకోలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంజలి దమానియా ఆప్ లో క్రియాశీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఏక్నాథ్ తన పుట్టినరోజు సందర్భంగా జలగావ్లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రసంగిస్తున్న వేళ అంజలిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె సన్నిహితుడొకరు ఆమెకు సమాచారం అందించగా, వకోలా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 509(మహిళలను కించపరిచేలా వ్యవహరించటం) ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఘటన జలగావ్లో చోటుచేసుకోవటంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వకోలా అధికారులు తెలిపారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏక్నాథ్ చెబుతుండగా, తన దగ్గర వీడియో సాక్ష్యం ఉందని అంజలి వెల్లడించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏక్‌నాథ్‌పై గతేడాది అవినీతి ఆరోపణలు వినిపించగా, అంజలి మరికొందరితో కలిసి ఆ అంశంపై ప్రజా ప్రయోజన దాఖలు చేశారు. చివరకు ఆరోపణలు రుజువు కావటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. -
ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ఒక దేశద్రోహి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడిన హార్థిక్ పటేల్ పై గుజరాత్ ప్రభుత్వం పెట్టిన దేశద్రోహం అభియోగాలను ఎత్తివేయాలని, ఆ అభియోగాలను ఖడ్సేపై పెట్టాలని ఆయన ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్న ఖడ్సే ఒక దేశద్రోహి అని ధ్వజమెత్తారు. దావూద్‌తో సెల్‌ఫోన్ సంభాషణలు, భూ అక్రమాల ఆరోపణలతో ఖడ్సే శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఆరోపణలు రుజువైతే రాజకీయాలకు గుడ్‌బై
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న సీనియర్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. పుణెలో ప్రభుత్వ భూమి కొనుగోలులో అక్రమాలు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఫోన్‌కాల్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణల వల్ల తనపై మచ్చ రాకూడదనే రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. 'ఫోర్జరీ పత్రాలతో నన్ను ఇరికించారు. నాకు వ్యతిరేకంగా చీప్ పబ్లిసిటీ స్టంట్ సృష్టించారు' అని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రజల అభిమతానికి అనుగుణంగానే రాజీనామా చేశానని, తన రాజీనామా కొందరు స్వార్థపరులకు చెంపపెట్టు లాంటిందని అన్నారు. గత 40 ఏళ్లుగా బీజేపీ అభివృద్ధి కోసమే తాను పనిచేశానని, తనపై నిరాధార ఆరోపణలు మోపారని చెప్పారు. మరోవైపు రాజీనామా చేసిన ఖడ్సేకు బీజేపీ అండగా నిలిచింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయేవరకు ఆయన మంత్రిగా కొనసాగబోరని పేర్కొంది. -
మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా
మహారాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత సీనియర్ మంత్రి అయిన ఏక్నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు వెళ్లిన ఆయన.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఓ లేఖను అందించారు. అక్రమ భూకేటాయింపులలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నేరుగా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడి, ఈ ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాంతోపాటు దావూద్ ఇబ్రహీం ఫోన్ రికార్డులలో కూడా ఖడ్సే నెంబరు చాలాసార్లు ఉందని ఒక హ్యాకర్ ఆరోపించడం సైతం ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కూడా రెవెన్యూ మంత్రి అయిన ఏక్నాథ్ ఖడ్సే డుమ్మాకొట్టారు. గత సోమవారం నుంచి ఆయన తన ఎర్రబుగ్గ కారును కూడా వాడటం మానేశారు. గత ఏప్రిల్ నెలలో ఖడ్సే భార్యకు, అల్లుడికి దాదాపు రూ. 23 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3 కోట్లకే ఇచ్చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్నామని.. మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్ డ్యూటీ కట్టామని ఖడ్సే అంటున్నారు. -
మంత్రిపై మరక.. పార్టీ చీఫ్ సీరియస్
మహారాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత సీనియర్ మంత్రి అయిన ఏక్నాథ్ ఖడ్సే పదవికి ఎసరు వచ్చేలా ఉంది. అక్రమ భూదందాలలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం ఒక ఎత్తయితే.. తాజాగా ఆయన కాల్ రికార్డులలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆయన మాట్లాడినట్లు తేలడంతో బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. అవినీతిని ఏమాత్రం సహించబోమన్న పార్టీ విధానానికి అనుగుణంగా.. ఖడ్సే మీద వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ మహారాష్ట్ర శాఖను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. ఖడ్సే వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం ఫడ్నవిస్.. రెవెన్యూమంత్రి ఖడ్సేను గత సోమవారం పిలిపించి దీనిపై చర్చించారు. వాస్తవానికి సోమవారమే ఖడ్సే రాజీనామా చేస్తారన్న కథనాలు వచ్చినా, ఆయన చేయలేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు అన్నారు. ఈరోజు కాకపోతే రేపైనా ఆయన తప్పుకోక తప్పదని చెబుతున్నారు. ఈ వ్యవహారం నేపథ్యంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఏక్నాథ్ ఖడ్సే డుమ్మాకొట్టారు. అంతేకాదు.. సోమవారం నుంచి ఆయన తన ఎర్రబుగ్గ కారును కూడా వాడటం మానేశారు. తొలుత ఒక హ్యాకర్, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఖడ్సేపై ఈ ఆరోపణలు చేశాయి. కానీ దావూద్‌తో ఖడ్సే మాట్లాడారనేందుకు ఆధారాలు ఏమీ లేవని బీజేపీలోనే కొన్నివర్గాలు అంటున్నాయి. దావూద్ ఇబ్రహీం ఫోన్లను ట్యాప్ చేసేందుకు మహారాష్ట్రలో ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ క్రైంబ్రాంచి కూడా ఖడ్సేతో దావూద్ మాట్లాడాడనడానికి ఆధారాలేమీ లేవని అంటోంది. అయితే తాను దావూద్ ఇబ్రహీం ఫోన్ రికార్డులను హ్యాక్ చేశానని, అందులో ఖడ్సే నెంబరు కూడా ఉందని మనీష్ భంగాలే అనే హ్యాకర్ చెబుతున్నాడు. ఇంకా.. గత ఏప్రిల్ నెలలో ఖడ్సే భార్యకు, అల్లుడికి దాదాపు రూ. 23 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3 కోట్లకే ఇచ్చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్నామని.. మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్ డ్యూటీ కట్టామని ఖడ్సే అంటున్నారు. -
దావూద్ కాల్స్ వివాదం: ఆ నంబర్ నాదే!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం నుంచి తనకు నిత్యం ఫోన్ కాల్స్ వస్తున్నట్టు వచ్చిన ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సే తోసిపుచ్చారు. దావూద్ భారత్‌కు తరచూ కాల్స్ చేసే జాబితాలో ఉన్న ఫోన్ నంబర్ తనదేనని, అయితే తనకు దావూద్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న దావూద్ భారత్‌లో అధికంగా కాల్ చేసిన ఫోన్ నంబర్లు తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో బీజేపీ నేత ఖడ్సే పేరు ఉండటం కలకలం రేపుతోంది. ఈ వివాదంపై ఖడ్సే స్పందిస్తూ 'వారికి దావూద్ ఫోన్ నంబర్ తెలిస్తే మొదట పోలీసులకు ఆ విషయం ఎందుకు తెలియజేయలేదు. ఎందులో ఏదో గూడుపుఠాణి ఉన్నట్టు కనిపిస్తోంది. నా మీద ఆరోపణలు చేసిన వారికి దావూద్ నంబర్ ఎలా తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపాలి. గత ఏడాది కాలంలో నా ఫోన్‌కు విదేశీ కాల్స్ రావడం, విదేశాలకు ఫోన్ చేయడంగానీ చేయలేదు' అని చెప్పారు. దావూద్ భారత్‌కు తరచూ కాల్ చేస్తున్న నాలుగు ఫోన్ నంబర్ల ఖడ్సే పేరు మీద తీసుకున్న నంబర్ కూడా ఉందని వడోదరకు చెందిన ఎథికల్ హ్యాకర్ మనీష్ భంగాలే హ్యాకింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దావూద్ నంబర్ ను హ్యాక్ చేయడం ద్వారా ఈ వివరాలు బయటపెట్టారు. ఈ నంబర్ల గురించి జాతీయ చానెళ్లలో కథనాలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దావూద్ నిత్యం కాల్ చేస్తున్న ఫోన్ నంబర్లపై దర్యాప్తు జరుపుతామని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. -
టాప్ పొలిటిషన్‌కు నిత్యం దావూద్ కాల్స్!
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం నిత్యం ఫోన్‌కాల్స్ చేసేవాడా? అంటే తాజాగా కథనం ఔననే అంటున్నది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న దావూద్ భారత్‌లో అధికంగా కాల్ చేసిన ఫోన్ నంబర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో బీజేపీ నేత ఖడ్సే పేరు ఉండటం కలకలం రేపుతోంది. దావూద్ భారత్‌కు తరచూ కాల్ చేస్తున్న నాలుగు ఫోన్ నంబర్ల ఖడ్సే పేరు మీద తీసుకున్న నంబర్ కూడా ఉంది. వడోదరకు చెందిన ఎథికల్ హ్యాకర్ మనీష్ భంగాలే హ్యాకింగ్ చేయడం ద్వారా ఈ నాలుగు నంబర్లు బయటపెట్టారు. ఈ నంబర్ల గురించి జాతీయ చానెళ్లలో కథనాలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దావూద్ నిత్యం కాల్ చేస్తున్న ఫోన్ నంబర్లపై దర్యాప్తు జరుపుతామని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. -
రూ. 30 కోట్లు లంచమడిగి.. దొరికిన మంత్రిగారి పీఏ
ముంబై: భూమి కేటాయింపులకు సంబంధించి రూ. 30 కోట్ల లంచం డిమాండ్ చేసిన మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే పీఏను ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త రమేశ్ జాదవ్.. తన భూమికి సంబంధించిన ఎన్ఓసీ ఇవ్వాలంటూ మంత్రి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. ఖడ్సే పీఏగా చెప్పుకొంటున్న గగన్ జన్ పాటిల్ లంచం డిమాండ్ చేశారు. థానే జిల్లాలోని కళ్యాణ్ తాలుకాలో ఉన్న నిల్జే గ్రామంలో భూముల వివరాల కోసం జాదవ్ ను పాటిల్ 30 కోట్ల రూపాయలు కోరినట్లు తెలిపారు. 2004 లో నిల్జే తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం 37 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలానికి సంబంధించిన కాగితాలు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో ఎన్ఓసీ కోసం గత కొద్ది రోజులుగా జాదవ్ పాటిల్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు వివరించారు. మొదట్లో కోటి రూపాయల నగదుతో పాటు ఫ్లాట్ ఇవ్వాలని కోరిన పాటిల్ తర్వాత రేటు పెంచేశాడని తెలిపారు. దీంతో జాదవ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను ఆశ్రయించగా.. పోలీసులు పాటిల్ ను పట్టుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఖడ్సే ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పాటిల్ తన నియోజకవర్గంలో చికిత్సల కోసం వచ్చే వారిని ముంబైకి తీసుకువచ్చే ఒక కార్యకర్తగా మాత్రమే తనకు తెలుసునని అన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు పరంగా పాటిల్ ను తన కార్యాలయంలో నియమించుకోలేదని వివరించారు. -
మంత్రి హెలికాప్టర్ కోసం నీరు వృధా
ముంబై: మహారాష్ట్రలోని లాతూర్‌లో తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు అలమటిస్తుంటే అక్కడ ఓ రాష్ట్ర మంత్రిగారి హెలికాప్టర్ దిగేందుకు అధికారులు ఏకంగా 10 వేల లీటర్ల నీటిని వినియోగించడం వివాదాస్పదమైంది. కరవు కాటకాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమీక్షించడానికి వచ్చిన రెవెన్యూ మంత్రి ఎక్నాథ్ ఖడ్సే హెలికాప్టర్ కోసమే నీటిని దుర్వినియోగం చేయడం పెద్ద ఐరనీ. లాతూర్ జిల్లాలోని బెల్కుండ్ గ్రామానికి శుక్రవారం మంత్రి వచ్చినప్పుడు ఈ ఉదంతం చోటుచేసుకుంది. హెలికాప్టర్ వల్ల దుమ్మురేగకుండా ఉండడం కోసమే తాము నీటితో నేలను తడిపామని అధికారులు సమర్థించుకుంటున్నారు. నీళ్లతో హెలిపాడ్‌ను తడపకపోయినట్లయితే దుమ్మురేగి చుట్టుపక్కలున్న ప్రజలకు, హెలికాప్టర్ పెలైట్‌కు బ్రీతింగ్ సమస్యలు వచ్చేవని, పైగా ఆ సమయంలో మంత్రి కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్సీ షైనా వివరణ ఇచ్చారు. ఇది చిన్న విషయమని, పెద్దిదిచేసి చూపించవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. కరవు కాటకాలతో అల్లాడిపోతున్న లాతూరు ప్రాంతానికి ఇటీవలనే ముంబై నుంచి ఐదు లక్షల లీటర్ల మంచినీటిని రైలులో సరఫరా చేసిన విషయం తెల్సిందే. నీటి ఎద్దడి కారణంగానే మహారాష్ట్రలో తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లను బాంబే హైకోర్టు రద్దు చేసిన విషయం తెల్సిందే. మంత్రి ఏక్నాథ్ చర్య అసమంజసమని, ఇలా నీటిని వృధా చేయడానికి బదులు ఆయన రోడ్డు మార్గాన వెళ్లి ఉండాల్సిందని కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ వ్యాఖ్యానించారు. అంతలా హెలికాప్టర్లో వెళ్లాలనుకుంటే లాతూర్ హెలిపాడ్ 47 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, అక్కడ దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లాల్సిందని ఆయన విమర్శించారు. -
స్మగ్లింగ్ కేసులో 56 గాడిదల అరెస్ట్!
ముంబై: సాధారణంగా చర్చలు, వాదోపవాదాలతో ఎపుడూ హాట్‌హాట్‌గా ఉంటాయి చట్టసభలు. ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లే సభల్లో అపుడపుడూ నవ్వులు పూయడం కూడా మామూలే. ఇలాగే మహారాష్ట్ర శాసనసభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇసుక మైనింగ్ మాఫియాపై సీరియస్‌గా చర్చ నడుస్తుండగా మహారాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే చెప్పిన విషయం విన్న సభ్యులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారనే నెపంతో ఎవరిని అదుపులోకి తీసుకున్నారో తెలిస్తే మనం కూడా ఔరా అనాల్సిందే! ఇంతకీ ప్రభుత్వం అరెస్టు చేసింది గాడిదలను... అవును అక్షరాలా 56 గాడిదలను. చంద్రభాగా నదీతీరంలోని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 56 గాడిదలను అదుపులోకి తీసుకున్నామని మంత్రి ప్రకటించారు. ఇసుక బస్తాలను మోసుకెళ్తున్నందుకే వాటిని అరెస్టు చేశామన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని హోమ్‌లో వాటి ఆలన పాలన చూస్తున్నామని తెలిపారు. వాటికి మంచి ఆహారాన్నందిస్తూ కాపాడుతున్నామని ప్రకటించారు. ఇసుక మాఫియాను అడ్డుకునే క్రమంలో ఒక్క సాక్ష్యాన్ని కూడా విడిచిపెట్టకూడదు... మంచి పనిచేశారంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ సోపాల్ చమత్కరించారు. పాపం, గాడిదలకు ఏమి తెలుసు, తాము మోస్తోంది, బంగారమో లేక ఇసుకో.. అంటూ కామెంట్ చేశారు. వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది... అన్ని వసతులు కల్పించాల్సిందే అని కూడా వ్యాఖ్యానించారు. దీంతో సభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. దీనికి మంత్రి సమాధానం చెబుతూ గాడిదల సంక్షేమం కోసం ఆదేశాలిచ్చాం... నిజానికి వాటి యజమానులమంటూ ఎవరూ ముందుకు రాకపోయినా వారికోసం వెతుకుతున్నాం. అంతేగానీ.. ఇక్కడ ఉన్నారన్నామా అంటూ విపక్షాల వ్యంగ్యాన్ని తిప్పికొట్టారు. -
మదర్సాల గుర్తింపు రద్దు: మహారాష్ట్ర
ముంబై: మదర్సాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఓ నిర్ణయానికి వచ్చింది. మదరసాలతో పాటు ఇస్లాం మత బోధనలు చేసే సంస్థల గుర్తింపు రద్దుచేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన విధానాలను పాటించని సంస్థలు, మదర్సాలను ఇతర పాఠశాలల మాదిరిగా గుర్తించనవసరం లేదని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి దిలీప్ కాంబ్లీ గురువారం నాడు ప్రకటించారు. ఇతర పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటుగా ఈ మతపర సంస్థలలో చదివే విద్యార్థులను సమానంగా పరిగణించనవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మదర్సాలలో కూడా ఇతర స్కూళ్లలో మాదిరిగా తరగతులు నిర్వహిస్తేనే నిధులు కేటాయిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం నెల రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కానీ అటువంటి విద్యాసంస్థల్లో మతపరమైన అంశాలు నేర్చుకునే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మదర్సాలలో కూడా సైన్స్, గణితం, సాంఘీక శాస్త్రము వంటి సబ్జెక్టులు బోధించాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే గతంలోనే సూచించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మదర్సాల గురించి మాట్లాడుతూ 'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ముస్లిం విద్యార్థులు బాగుపడాలంటే అటువంటి సంస్థలపై నిషేధం విధించాలని గత మే నెలలో ఆయన సూచించిన విషయం తెలిసిందే. -
రూ.10 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలి
మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్ నాగపూర్: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువుపరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం అసెంబ్లీలో ఈ విషయమై మాట్లాడారు. నాగపూర్ విధాన సభలో బుధవారం సమావేశం మొదలవ్వగానే కాంగ్రెస్ పక్ష డిప్యూటీ నాయకుడు విజయ్ వడ్డేటివార్ మాట్లాడుతూ.. కరువు, రైతు ఆత్మహత్యలపై చర్చ జరపాలని కోరారు. కాగా, సదరు అంశాలపై చర్చకు రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అంగీకరించారు. స్పీకర్ అనుమతి ఇచ్చిన అనంతరం పవార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడి సోయ, పాడి రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల భార్యలకు వితంతు పింఛను మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాడి రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. లీటర్ మంచినీళ్లు రూ.20 ఉంటే, లీటర్ పాలు రూ.17 ఉన్నాయని, దీన్ని బట్టే పాడి పరిశ్రమ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. కౌన్సిల్లో గందరగోళం..: కాగా, కరువు, రైతు సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో విధాన మండలిలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు కొన్నిసార్లు వెల్‌లోకి దూసుకురావడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ గందరగోళంలోనే కౌన్సిల్ నాయకుడిగా ఏక్నాథ్ ఖడ్సేను, డిప్యూటీ నాయకుడిగా చంద్రకాంత్ పాటిల్ పేర్లను ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం తన మంత్రివర్గ సహచరులను సభకు పరిచయం చేశారు. కాగా, శీతాకాల సమావేశాలు ప్రారంభమై మూడు రోజులైనా ప్రతిపక్ష నేతను ఖ రారుచేయకపోవడంపై షేత్కారీ కాంగార్ పక్ష (ఎస్కేపీ)కి చెందిన ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ప్రశ్నించారు. ప్రతిపక్షనేత లేకుండా సభ నడవడం చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది సరైన సంప్రదాయం కాదని ఆయన ఆరోపించారు. పాటిల్‌కు మద్దతుగా కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు నిలిచారు. కాగా, ఒకటి, రెండు రోజుల్లో ప్రతిపక్ష నేతను చైర్మన్ నిర్ణయిస్తారని డిప్యూటీ చైర్పర్సన్ వసంత్‌రావ్ దావ్‌ఖరే ప్రక టించారు. కాగా, ప్రతిపక్ష నేతను ఏ విధానంపై నిర్ణయించనున్నారో తెలపాలని ఎన్సీపీ నేత సునీల్ తత్కారే డిమాండ్ చేశారు. తమపార్టీ తరఫున ధనంజయ్ ముండే పేరును ఇప్పటికే ప్రతిపాదించామన్నారు. కాగా, కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. మొదట ఎన్సీపీ తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ‘గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉంటామని ప్రకటించారు.. ఇప్పుడు ప్రతిపక్ష నేత సీటు కావాలంటున్నారు..’ అని వ్యాఖ్యానించారు. కాగా ప్రతిపక్ష నేత పదవి కోసం బీజేపీ నుంచి ధనంజయ్ ముండే, కాంగ్రెస్ నుంచి మాణిక్‌రావ్ ఠాక్రే పేర్లను ప్రతిపాదిస్తూ తనకు లేఖలు అందినట్లు మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఓటమి తర్వాతే రైతులు గుర్తుకొచ్చారా..: అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలకు రైతులు గుర్తుకువస్తున్నారని శివసేన విమర్శించింది. 15 యేళ్లుగా వారే రాష్ట్రాన్ని పాలించారు.. వారి అవినీతి పాలనే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించింది. మూడు రోజులుగా వారు అసెంబ్లీ సమావేశాల్లో డ్రామా నడుపుతున్నారని బుధవారం నాటి సామ్నా సంపాదకీయంలో తీవ్రంగా దుయ్యబట్టింది. -
మాటలొద్దు.. పని చేయండి: రాజ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: కరువు ప్రాంతాల బాధితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చే స్తూ కాలయాపన చేసే బదులు వారికి ఉపయోగపడే పనులేవైనా చేస్తే ఎవరైనా హర్షిస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే హితవు పలికారు. ఆయన బుధవారం ఔరంగబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను హేళన చేసే విధంగా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఖడ్సే వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవహరించాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది.. పంటలు పండక రైతులు బేజారవుతున్నారు.. చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి బాధాకరమైన సమయంలో రైతులను కించపరిచే విధంగా ఖడ్సే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మంత్రి ఖడ్సేకు ‘సెల్’ బహుమతి.. రైతులపై రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే చేసిన వ్యాఖ్యలు ఇంతట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. జితేంద్ర జనావలే అనే శివసైనికుడు బుధవారం ఖడ్సేకు ఏకంగా ఓ మొబైల్ ఫోన్ బహుమతిగా పంపాడు. కరువు పీడిత ప్రాంత రైతులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఖడ్సేకు శాంతాకృజ్ పోస్టు ఆఫీస్ నుంచి ఈ ఫోన్ పంపినట్లు చెప్పాడు. -
రైతును చులకనగా చూడొద్దు
నాందేడ్, న్యూస్‌లైన్: రైతులను అవమానించేలా వ్యాఖ్యలుచేస్తే సహించేదిలేదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. రైతులును అవహేళన చేయవద్దు, లేదంటే అజిత్ పవార్ మాదిరిగానే ప్రజలు మిమ్నల్ని కూడా ఇంటికి పంపించేస్తారని వ్యాఖ్యానించారు. ‘సెల్ ఫోన్ల బిల్లులు కట్టేందుకు డబ్బులు ఉంటాయి... కాని విద్యుత్ బిల్లులు ఎందుకు కట్టడంలేదని ఏక్నాథ్ ఖడ్సే రైతులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. మంత్రి వ్యాఖ్యలు రైతులను అవమానించేలా ఉన్నాయని, ఆయన వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. కాగా, తీవ్రనీటి ఎద్దడితో సతమతమవుతున్న మరాఠ్వాడా పర్యటనలో భాగంగా ఉద్ధవ్‌ఠాక్రే సోమవారం నాందేడ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆదుకునేదిపోయి చులకనచేసి మాట్లాడడం సబబుకాదని ఏక్నాథ్ ఖడ్సేకు హితవుపలికారు. ‘సెల్ ఫోన్లకు నిరంతరం నెట్వర్క్ ఉంటుంది.. కాని విద్యుత్ సరఫరా నిరంతరం ఉంటోందా అని ఆయన మంత్రిని ప్రశ్నించారు. రైతులను అవహేళన చేసిట్టయితే ప్రజలు అజిత పవార్‌ను పంపించినట్టుగానే మిమ్నల్ని కూడా ఇంటికి పంపిస్తారని ఖడ్సేకు చురకలంటించారు. అనంతరం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులతో ఉద్ధవ్ భేటీ అయ్యారు. వారిని ఓదార్చుతూ ఇకపై రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. రాజకీయంపై ఓడిన ‘విక్రాంత్’: శివసేన ముంబై: శత్రుదేశంపై యుద్ధంలో దేశాన్ని గెలిపించిన విక్రాంత్ యుద్ధనౌక తన అస్థిత్వం కాపాడుకోవడానికి చేసిన యుద్ధంలో మాత్రం ఓడిపోయిందని శివసేన ఆవేదన వ్యక్తం చేసింది. ‘సామ్నా’ పత్రిక సోమవారం నాటి సంపాదకీయంలో శివసేన పైవిధంగా వ్యాఖ్యానించింది. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా, 1997 డిసెంబర్ నుంచి ఈ నౌక సేవలను నిలిపివేశారు. అనంతరం దీన్ని మ్యూజియంగా మార్చాలా లేక స్క్రాప్ కింద మార్చివేయాలా అనే విషయమై పెద్ద చర్చే జరిగింది. దీని నిర్వహణ భారాన్ని తాము మోయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. కాగా, రూ. 100 -150 కోట్ల ఖర్చుతో దీన్ని స్క్రాప్ కింద మార్చకుండా మ్యూజియంగా మార్చేందుకు అవకాశముందని పలువురు మేధావులు సూచించగా, ఆ మేరకు నిధులు కూడా తాము ఖర్చు పెట్టలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. కాగా, ఈ నౌకను స్క్రాప్ కింద మార్చేందుకు వీలులేదని ఈ ఏడాది జవనరిలో బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే అది కోర్టులో వీగిపోవడంతో గత వారం నౌకను స్క్రాప్‌గా మార్చే ప్రక్రియ మొదలైంది. మన దేశ వారసత్వ సంపదగా నిలవగలిగే విక్రాంత్‌ను కాపాడుకోవడానికి కేవలం రూ.100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయిందని ప్రభుత్వంపై శివసేన మండిపడింది. -
నగరానికి దమణ్‌గంగా, పింజార్ నదీ జలాలు
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. తాగునీటి కష్టాలనుంచి త్వరలో కొంతమేర ఉపశమనం లభించనుంది. ఇందుకు కారణం ఖాందేశ్ పరిధిలోని దమణ్ గంగా, పింజార్ నదులను అనుసంధానించి నగరానికి నీటిని సరఫరా చేసేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక మంజూరు ఇచ్చింది. దాదాపు రూ.12 వందల కోట్లు ఖర్చుకానున్న ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే డిమాండ్ చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన మూడు రోజులుగా జరుగుతున్న ‘జల్ మంథన్’ చర్చ సమావేశంలో పాల్గొన్న ఖడ్సే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోయారు. నగరంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు దమణ్‌గంగా, పింజార్ నదులను అనుసంధానం చేయడమొక్కటే సరైన మార్గం. ఈవిధంగా చేయడం ద్వారా 40-60 టీఎంసీల నీరు నగరానికి తీసుకురావడం సాధ్యమవుతుంది. ఇందువల్ల 25-50 సంవత్సరాల వరకు తాగు నీటి సమస్య తలెత్తదని ఖడ్సే అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉమా భారతి సానుకూలంగా స్పందించారు. తాత్కాలికంగా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.1200 కోట్లు ఖర్చవుతాయని అంచనావేశారు. -
ఖడ్సేకు డిప్యూటీ సీఎం చాంబర్
సాక్షి, ముంబై: రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు మంత్రాలయలోని ఆరో అంతస్తులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి క్యాబిన్‌ను కేటాయించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో తనకు ఉపముఖ్యమంత్రి పదవి రావచ్చని ఖడ్సే ఊహించారు. అయితే రెవెన్యూ శాఖ కేటాయించడంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా, ఆయనను ఈ విషయంలో కొంత శాంతింపజేయడానికే మాజీ ఉప ముఖ్యమంత్రి వినియోగించిన క్యాబిన్‌ను కేటాయించి ఉంటారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు క్యాబిన్లు, చాంబర్లు, బంగళాలు కేటాయించవచ్చని అందరూ భావించారు. కాని ఫడ్నవిస్ అలా చేయలేదు. సమావేశ మనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ క్యాబిన్‌ను ఖడ్సేకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు మొదటి అంతస్తులో ఉన్న ఆర్.ఆర్.పాటిల్ క్యాబిన్, గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండేకు నాలుగో అంతస్తులో ఉన్న అదే శాఖ మాజీ మంత్రి జయంత్ పాటిల్ క్యాబిన్ కేటాయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
తెగేదాక లాగొద్దు: ఖడ్సే
సాక్షి, ముంబై: త్యాగానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని తెగేవరకు లాగకూడదని బీజేపీ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే శివసేన నాయకులకు హితవు పలికారు. లోక్‌సభ, రాజ్యసభ కోసం బీజేపీ ఏడు స్థానాలు శివసేనకు వదలిపెట్టింది. కాని ఇప్పటి వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో శివసేన ఒక్క స్థానం కూడా బీజేపీకి వదలలేదు. ఇలా తరుచూ తామే త్యాగాలు చేయడాన్ని బీజేపీ కార్యకర్తలు అంగీకరించడంలేదని ఆయన అన్నారు. ముంబైలో శుక్రవారం ఓ సందర్భంలో ఖడ్సే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొదటిసారిగా శివసేన, బీజేపీలు కాషాయకూటమిగా ఏర్పడినప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 35 స్థానాల్లో పోటీ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాని వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. శివసేన 22, బీజేపీ కేవలం 26 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాని గత 25 ఏళ్లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఒక్కసారి కూడా గెలవని అనేక స్థానాలున్నాయి. వాటిపై చర్చించాల్సిన అవసరం ఎంతైన ఉందని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ స్థానాల్లో శివసేన ఓడిపోవడంవల్ల కాంగ్రెస్, ఎన్సీపీలు లబ్ధిపొందుతున్నాయి. ఆ అవకాశం ఆ పార్టీలకు ఇచ్చే బదులు తమకిస్తే గెలిచే ప్రయత్నాలు చేస్తామని ఖడ్సే అభిప్రాయపడ్డారు. సేనకు బీజేపీ తాజా ప్రతిపాదన పొత్తు భగ్నమయ్యే దిశగా సాగుతున్న సీట్లపంపిణీ గొడవను ముగించేందుకు గాను శివసేనకు మరో తాజా ప్రతిపాదన పంపాలని బీజేపీ నిర్ణయించింది. ‘‘మేము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల సంఖ్యపై శివసేనకు ఓ ప్రతిపాదన పంపుతాం. గత 25 ఏళ్లలో శివసేన ఎన్నడూ గెలుపొందని సీట్లు 59 ఉన్నాయి. అలాగే బీజేపీ కూడా గెలవని సీట్లు 19 ఉన్నాయి. ఈ వాస్తవాన్ని పరిశీలించాలని శివసేను కోరుతున్నాం. ప్రతి సీటుపై చర్చ జరగాలి’’అని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ ముంగంటివార్ చెప్పారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రితంసారి (2009) తాము పోటీ చేసిన 119 సీట్లనే శివసేన తమకు కేటాయించాలనుకున్నట్లు మీడియా ద్వారానే తెలిసిందని ఆయన చెప్పారు. పొత్తు కొనసాగాలనుకుంటున్నామని, అయితే తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి స్నేహ సంబంధాలను కొనసాగించబోమని ముంగంటివార్ తేల్చి చెప్పారు. శివసేన కోరిన విధంగా గతంలో ఆరు లోక్‌సభ సీట్లు అదనంగా కేటాయించామని గుర్తు చేశారు. ఎన్డీయే తీసుకున్న అధికార వైఖరికి విరుద్ధంగా శివసేన వెళ్లినప్పటికీ తాము అభ్యంతరం చెప్పలేదని అన్నారు. రాష్ట్రపతి పదవికి ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీకి మద్దతునిచ్చినా సహించామన్నారు. ప్రధాన మంత్రి పదవికి శరద్ పవార్‌కు కూడా శివసేన మద్దతునిచ్చిందని, అప్పుడు కూడా తాము సంయమనం పాటించామని ముంగంటివార్ పేర్కొన్నారు. -
బీజేపీలోకి ఎన్సీపీ నేత గావిత్
ముంబై: ఎన్సీపీ మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే గావిత్‌కు స్వాగతం పలికారు. కాగా విజయ్‌కుమార్ వైద్య విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై గావిత్ మాట్లాడుతూ కోర్టులో లేదా సిట్‌తో దర్యాప్తు జరిపించి ఆరోపణలు రుజువు చేయాలని, అలా చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ గావిత్‌పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయన్నారు. -
ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు
రెండుమూడు రోజుల్లో అధికారిక ఆదేశాలు ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరుపనుంది. ముండే ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగుందా? అనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ముండే మృతి కేసును త్వరలో సీబీఐకి అప్పగించనున్నారని అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే మంగళవారం తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... ‘ఇవాళ ఉదయం(మంగళవారం) హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేశారు. ముండే బలిగొన్న ప్రమాదం గురించి మాట్లాడారు. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెప్పారు. రెండుమూడు రోజుల్లో అధికారిక ఆదేశాలు వెలువడతాయని చెప్పారు. ముండే మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన వెంట భద్రతా సిబ్బంది ఎందుకు లేరు? చిన్నపాటి గాయానికే ఆయన ఎలా మరణిస్తారు? తదితర కోణాల్లో కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరముందని రాజ్‌నాథ్‌కు సూచించారు. సంయమనం పాటించండి: పంకజ తండ్రి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టమేనని, ఆయన అభిమానులు కూడా సంయమనం పాటించాలని ముండే కూతురు పంకజ రాష్ట్ర ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోడీపై తనకు పూర్తిగా విశ్వాసముందని, మరణం వెనుక ఏవైనా కుట్రలు దాగి ఉంటే అవి సీబీఐ విచారణలో బయటపడతాయన్నారు. -
మాతో ఆటలా ?
ముంబై: అనుకున్నట్టుగానే అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడివాడిగా మొదలయ్యాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. తాజాగా కేబినెట్లో చేరిన మంత్రుల ప్రమాణ స్వీకార తేదీ, సమయాలను ఇష్టమొచ్చినట్టు మార్చడంపై వాగ్యుద్ధం జరిగింది. సర్కారు తమతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోందని బీజేపీ, శివసేన పేర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారిందని విమర్శించాయి. సభలో విపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ఈ విషయమై మాట్లాడుతూ ‘ఇద్దరు మంత్రులు ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎస్ఎంఎస్లు పంపించారు. కాదు..కాదు..ఈ రోజు ఉదయం 9.30 గంటలకు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు మేం పనులను వాయిదా వేసుకున్నాం. మాతో ఇష్టమున్నట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ ఏశారు. దీనికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ సమావేశాల ఒత్తిడి వల్ల తాను ఢిల్లీలోనే ఆదివారం సాయంత్రం ఆరింటి వరకు ఉన్నానని పేర్కొన్నారు. ముంబైకి తిరిగి వచ్చాక ఎమ్మెల్యేలందరికీ తేనీటి విందు ఇచ్చి, ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారం గురించి గవర్నర్‌కు తెలియజేశానని వివరించారు. ఆదివారం మధ్యాహ్నమే ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ తన కార్యాలయం నుంచి ఎస్ఎంఎస్లు వచ్చిన మాట నిజమేనని అంగీకరించారు. దీనిపై విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. అయితే లిఖిత పూర్వకంగా అందినది మాత్రమే అధికారిక ఆహ్వానం అవుతుందని విశదీకరించారు. దీనికి శివసేన సభాపక్ష నాయకుడు సుభాశ్ దేశాయ్ స్పందిస్తూ ‘ఇక నుంచి వచ్చే ఎస్ఎంఎస్లను అధికార సమాచారంగా భావించకూడదా ? శాసనసభ వ్యవహారాల గురించి మాకు తరచూ ఎస్ఎంఎస్లు వస్తాయి. వాటిని నమ్మకూడదా ?’ అంటూ సీఎంను నిలదీశారు. ప్రమాణ స్వీకారం గురించి ప్రజలను తప్పుదోవపట్టించినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఖడ్సే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తగు చర్య తీసుకోవాలని స్పీకర్ దిలీప్వల్సే పాటిల్ ముఖ్యమంత్రికి సూచించారు. అయినా శాంతించని విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించడంతో ఆయా పార్టీ సభ్యులంతా తలకు కాషాయం తలపాగాలు చుట్టుకొని సభకు వచ్చారు. ఇక కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు జితేంద్ర అవాడ్, అబ్దుల్ సత్తార్, అమిత్ దేశ్‌ముఖ్, రిసోడ్ ఎమ్మెల్యే అమిత్ జనక్‌ను సీఎం సభ్యులకు పరిచయం చేశారు. కేబినెట్లోకి మరో ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాడ్‌కు ఇటీవలే మంత్రివర్గంలో స్థానం కల్పించిన పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం.. సోమవారం మరో ఇద్దరికి అవకాశం ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ దివంగత నాయకుడు విలాస్ దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్, అబ్దుల్ సత్తార్‌తో గవర్నర్ శంకర నారాయణన్ సోమవారం ప్రమాణం చేయించారు. వీరిద్దరూ మరాఠ్వాడా ప్రాంతవాసులే. సత్తార్ కేబినెట్ మంత్రిగా, దేశ్‌ముఖ్ సహాయమంత్రిగా వ్యవహరిస్తారు. దేశ్‌ముఖ్ లాతూర్కు చెందిన వారు కాగా, సతార్ ఔరంగాబాద్‌లోని సిల్లోడ్వాసి. ఎమ్మెల్యే పదవికి ఎంపీల రాజీనామా ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఏడుగురు రాష్ట్ర ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. సభ ప్రారంభమైన కాసేపటికి స్పీకర్ పాటిల్ వారి జాబితాను విడుదల చేశారు. రాజీనామా చేసినవ వారిలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, రాజీవ్ సతావ్ (కాంగ్రెస్), రాజన్ విచారే, సంజయ్ జాదవ్ (శివసేన), గోపాల్ శెట్టి, నానా పటోలే, చింతమాన్ వంగా (బీజేపీ) ఉన్నారు. చవాన్ నాందేడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ హోదాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ కూడా సోమవారం సమావేశాలకు హాజరయ్యారు. తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. -
జనరంజకంగా!
నేటినుంచి బడ్జెట్ సమావేశాలు సాక్షి, ముంబై: ప్రజాసామ్యకూటమి (డీఎఫ్) ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ప్రభావం ఈ సమావేశాల్లో కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం ప్రతిపాదించే జనాకర్షణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఓటర్లను ఆకట్టుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా అధికారపక్షం అందరికీ అనుకూలమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే విధంగా కొన్ని అంశాలను తెరమరుగు చేసేందుకు యత్నించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇలాంటి విషయాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడమనేది సర్వసాధారణం. ఆదర్శ్ కుంభకోణం, టోల్ వసూలు, శాంతి భద్రతలు, అక్రమ నిర్మాణాలు తదితర అంశాలతోపాటు విద్యుత్, జలవనరుల శాఖల్లో అవినీతి ఆరోపణలు ఈ సమావేశాల్లో గందరగోళాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా 2000 సంవత్సరం వరకు మురికివాడల క్రమబద్ధీకరణ అంశం చర్చల్లోకి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు అధికారపక్షానికి చెందిన ఇతర నాయకులు ఈ అంశంపై ప్రజలకు హామీలిచ్చారు. దీంతో ఎన్నికలకు ముం దు జరగనున్న ఈ బడ్జెట్లో 2000వ సంవత్సరం వరకు ఏర్పాటైన మురికివాడలను క్రమబద్ధీరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రతిపాదించనున్నా రు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1995 నాటికి మురికివాడల సంఖ్య 10 లక్షలు కాగా 2011 నాటికి అది ఏకంగా 27 లక్షలకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మురికివాడలను క్రమబద్ధీకరించాలని అధికార పక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఇబ్బంది ఉండదని కొందరు కాంగ్రెస్ నాయకులు సూచిం చినట్టు తెలిసింది. దీంతో ఈ సమావేశాల్లో మురికివాడల క్రమబద్ధీకరణకు సంబంధించి ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా మురికివాడల క్రమబద్ధీకరణ నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు పలికే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. తేనీటి విందు బహిష్కరణ సరికాదు: సీఎం శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు ఇచ్చే తేనీటి విందుకు ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం శోచనీయమని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ పేర్కొన్నారు. తేనీటి విందులో పాల్గొన్న అనం తరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తేనీటి విందును బహిష్కరించడం పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధం. ప్రభుత్వం లేవనెత్తే అంశాలపై చర్చలు జరి పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రతిపక్షాలు ఆవిధంగా వ్యవహరించాయి. ప్రచార లబ్ధి పొందేందుకే ఇలా చేశాయి’ అని ఆయన అన్నారు. ఆదర్శ్’పై జవాబు కోరతాం: ఏక్నాథ్ ఖడ్సే ముంబై: ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అశోక్చవాన్పై ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయమై గవర్నర్ జవాబుకోరతామని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన ఇక్కడ మీడియా తో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఆదర్శ్ కుంభకోణంతోపాటు వివిధ అంశాలను సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందనే విషయం చెప్పాలంటూ డిమాండ్ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా లేవని, ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లోనూ నిలదీస్తాయన్నారు. సమావేశాల వ్యవధిని పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. కాగా సమావేశాల ప్రారంభానికి ముందురోజు ముఖ్యమంత్రి ఇచ్చే సంప్రదాయ తేనీటి విందును విపక్షాలు బహిష్కరించాయి.