English Premier League
-
'ఏ జట్టును కొనడం లేదు'.. ఆడుకోవడానికి మేమే దొరికామా!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. వ్యాపార రంగంలో దూకుడుగా కనిపించే మస్క్.. తాజాగా బుధవారం ఉదయం ఒక ట్వీట్లో సంచలన ప్రకటన చేశాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్)లో అత్యంత ప్రజాధరణ కలిగిన మాంచెస్టర్ యునైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాన్ మస్క్ ఫుట్‌బాల్ టీంను కొనుగోలు చేస్తున్నాడన్న దానిపై సోషల్ మీడియాలో విభిన్న వాదనలు వచ్చాయి. కొందరు మస్క్‌ను ట్రోల్ చేయగా.. మరికొందరు మాత్రం మస్క్ రాకతో మాంచెస్టర్ యూనైటెడ్ జట్టు రూపురేఖలు మారతాయని పేర్కొన్నారు. ఇలా ఒక్క ట్వీట్‌తో ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసిన ఎలాన్ మస్క్.. మూడు గంటల తర్వాత తాను ఎలాంటి జట్టును కొనుగోలు చేయడం లేదంటూ మరో ట్వీట్‌తో చావు కబురు చల్లగా చెప్పాడు. టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ.. తమ సీఈవో ఎలాన్ మస్క్ ను ఇదే విషయమై అడిగారు. ''మీరు చెబుతున్నది నిజమేనా..?''అని ప్రశ్నించారు. అప్పుడు మస్క్.. ''లేదు. అది (మస్క్ మాంచెస్టర్ జట్టును కొనుగోలు చేస్తున్నాడని) ట్విటర్ లో చాలా కాలంగా జోక్ ప్రచారంలో ఉంది. నేను ఏ జట్టును కొనుగోలు చేయడం లేదు'' అని పేర్కొన్నాడు. మస్క్ స్పష్టతనిచ్చాక కూడా ట్విటర్ లో అతడిపై మీమ్స్ వర్షం కురుస్తూనే ఉంది. ''ఆడుకోవడానికి నీకు మేమే దొరికామా'' అంటూ ఘాటైన విమర్శలు చేశారు. Are you serious? — Tesla Owners Silicon Valley (@teslaownersSV) August 17, 2022 No, this is a long-running joke on Twitter. I’m not buying any sports teams. — Elon Musk (@elonmusk) August 17, 2022 చదవండి: ఎలాన్ మస్క్ మరో సంచలనం! ఫుట్‌బాల్ టీమ్‌ను కొంటున్నా! -
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్
క్రీడా ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంచలనాలకు కేంద్ర బింధువుగా మారింది. 15 ఏళ్ల కాలంలో ప్రపంచంలో మేటి లీగ్‌లకు ధీటుగా నిలిచి అత్యంత ప్రజాధరణ పొందిన లీగ్‌గా అవతరించిన క్యాష్ రిచ్ లీగ్.. తాజాగా మీడియా హక్కుల పరంగా మరో రికార్డును బద్దలు కొట్టింది. విశ్వవ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్.. విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్‌గా నిలిచింది. ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్ ఈపీఎల్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. ఈపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా, ఐపీఎల్లో అది రూ. 107.5 కోట్లకు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు) చేరుకుంది. గతంలో ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండేది. తాజాగా జరిగిన మీడియా హక్కుల వేలం ద్వారా ఐపీఎల్ విలువ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. టీవీ ప్రసారాలు (రూ. 57.5 కోట్లు), డిజిటల్ (రూ. 50 కోట్లు) హక్కుల ద్వారా ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం మ్యాచ్ విలువ పరంగా అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ అయిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఐపీఎల్ కంటే ముందుంది. ఎన్ఎఫ్ఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు (17 యూఎస్ మిలియన్ డాలర్లు)గా ఉంది. ఇదిలా ఉంటే, గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాలో రూ. 44,075 కోట్లు చేరాయి. లీగ్ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే (ఏ, బీ) ఇప్పటి వరకు ఇంత ఆదాయం సమకూరింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్‌కు సంబంధించి టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ (రూ.23,575 కోట్లు) దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది. చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్–18..! -
'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్
ఇంగ్లండ్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ లారెన్స్ బూత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో 1/3 వంతును ఐపీఎల్ ఆక్రమిస్తుందని.. దీనివల్ల ఆటగాళ్ల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిపాడు. లారెన్స్ వ్యాఖ్యలను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూ ట్యూబ్ వేదికగా ఖండిస్తూ ధీటుగా బధులిచ్చాడు. ''ఐపీఎల్ 1/3 వంతును ఆక్రమిస్తోందంటూ లారెన్స్ బూత్ వ్యాఖ్యలు చేశాడు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మరి మీ దేశంలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్) కనీసం ఆరు నెలల పాటు జరుగుతుంది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు. ఐపీఎల్లో ఆటగాళ్లకు మంచి రెస్ట్ దొరుకుతుంది. వారానికి ఒక జట్టు గరిష్టంగా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. ఏదో ఒక దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఆటగాళ్లకు రెండురోజలు విశ్రాంతి దొరుకుతున్నట్లే. కనీసం పరిజ్ఞానం లేకుండా అనవసర వ్యాఖ్యలు చేయొద్దు. వాస్తవానికి ఈపీఎల్ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలిసిపోతున్నారేమో చూసుకో. వీలైతే ఈపీఎల్పై నీ విమర్శనాస్త్రాలు సంధించు. సోయి లేకుండా మాట్లాడొద్దు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల వల్ల కొంతమంది ఆటగాళ్లు పేరుతో పాటు తమ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన అశ్విన్‌ను ఈసారి మెగావేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మరి ఈ వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్ 2022లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి. ఇప్పటివరకు అశ్విన్ ఐపీఎల్లో 167 మ్యాచ్‌లాడి 456 పరుగులతో పాటు 145 వికెట్లు తీశాడు. చదవండి: Virat Kohli 100th Test: మరో 38 పరుగులు.. దిగ్గజాల సరసన మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే! -
పిల్లలు పుట్టరని వ్యాక్సిన్ వేయించుకోవట్లేదట..!
లండన్: రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. బ్రిటన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరడంతో ఇప్పటికే వీకెండ్ మ్యాచ్‌లను వాయిదా వేశారు. మరోవైపు ఆటగాళ్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహకులకు తలనొప్పిగా మారింది. రెండు డోసుల వ్యాక్సిన్, అలాగే బూస్టర్ డోస్ వేయించుకునేందుకు ఆటగాళ్లు ససేమిరా అంటున్నట్లు నిర్వహకులు తెలిపారు. లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లలో కేవలం 68 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ డబుల్ డోస్ వేయించుకున్నారని, ఇంత తక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ జరగడం వల్లే భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని నిర్వహకులు వాపోతున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ఆటగాళ్లపై ఒత్తిడి చేయడం లీగ్ నిబంధనలకు విరుద్ధం కావడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నట్లు పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్ నిరాకరణకు ఆటగాళ్లు చెబుతున్న కారణాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయని వారంటున్నారు. మెజారిటి శాతం వ్యాక్సిన్‌పై నమ్మకం లేదని చెబుతుండగా, శాకాహారులకు టీకా అవసరం లేదని కొందరు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మరికొందరు వ్యాక్సిన్‌ను నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలు పుట్టరనే భయంతో కొందరు ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకోవట్లేదని, ఈ నిరాధారమైన అపోహని వారు గుడ్డిగా నమ్ముతున్నారని లీగ్ నిర్వహకులు తెలిపారు. చదవండి: ధోని ఈజ్ బెస్ట్, తర్వాత ఆ ఇద్దరు.. అశ్విన్ లిస్ట్‌లో పంత్కి దక్కని చోటు -
బీఎల్ఎమ్ స్థానంలో నో రూమ్ ఫర్ రేసిజమ్
లండన్: నేటి నుంచి ఆరంభమయ్యే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జట్లు ‘జాత్యహంకారానికి తావు లేదు (నో రూమ్ ఫర్ రేసిజమ్)’ అనే బ్యాడ్జీలతో బరిలోకి దిగనున్నాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ (బీఎల్ఎమ్)’ స్థానంలో ఈ నినాదాన్ని వాడనున్నట్లు ఈపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ మాస్టర్స్ తెలిపారు. ఈ ఏడాది మేలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి బలి కావడంతో ‘బీఎల్ఎమ్’ ఉద్యమం ఊపిరిపోసుకుంది. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఈపీఎల్ జట్లు తమ జెర్సీలపై ‘బీఎల్ఎమ్’ లోగోను ముద్రించుకొని గత సీజన్లో మ్యాచ్‌లను ఆడాయి. 2020–21 సీజన్లో నినాదం మారినా... వివక్ష ఏ రూపంలో ఉన్నా అది అంతం కావాలనే మేం కోరుకుంటామని రిచర్డ్ పేర్కొన్నారు. గతంలోలాగే మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని జాత్యహంకారానికి నిరసన తెలియజేస్తారని ఆయన తెలిపారు. (చదవండి: సెరెనా మరో ‘సారీ’) ‘బ్లాక్ లైవ్స్...ముగిసిపోయిందా’ మాంచెస్టర్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లపై వెస్టిండీస్ పేస్ దిగ్గజం, కామెంటేటర్ మైకేల్ హోల్డింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ (బీఎల్ఎమ్)’ ఉద్యమానికి చరమగీతం పాడారా...! అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లలో ‘బీఎల్‌ఎమ్‌కు’ మద్దతుగా మ్యాచ్‌కు ముందు మోకాలిపై ఉన్న ఆటగాళ్లు... ఇప్పుడు అలా ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు. కనీసం ‘బీఎల్ఎమ్’ లోగోలను కూడా తమ జెర్సీలపై ధరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెస్టిండీస్ జట్టు తమ పర్యటనను ముగించుకొని స్వదేశానికి వెళ్లిపోగానే ‘బీఎల్ఎమ్’ ముగిసిపోయిందని మీరు భావిస్తున్నారా... అంత నిర్లక్ష్య ధోరణి తగదంటూ వారికి హితవు పలికారు. ‘ఇది ఎంత మాత్రం నల్లజాతీయులకు, శ్వేత జాతీయులకు మధ్య జరిగే పోరాటం కాదు. ఇది మానవత్వానికి, సమాన హక్కులకు సంబంధించినది. అంతేకాకుండా ‘బీఎల్ఎమ్’ అనేది అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. అలా అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్లే’ అని హోల్డింగ్ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ఒక సమావేశంలో మాట్లాడిన ఆసీస్ కెప్టెన్ ఫించ్... మ్యాచ్‌కు ముందు తాము మోకాలిపై ఉండబోమని స్పష్టం చేశాడు. నిరసన కంటే దాని గురించి వ్యక్తుల్లో అవగాహన పెంచడం ముఖ్యమంటూ అతడు వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించిన హోల్డర్ ‘నీకు మద్దతు ఇవ్వాలని ఉంటే ఇవ్వు... లేదంటే ఊరికే ఉండు. అంతే కానీ కుంటి సాకులు చెప్పకు’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. -
30 ఏళ్ల నిరీక్షణకు తెర
లండన్: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తెరదించింది. ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) 2019–2020 సీజన్ చాంపియన్‌గా ఆవిర్భవించింది. డిఫెండింగ్ చాంపియన్ మాంచెస్టర్ సిటీ జట్టు శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 1–2 గోల్స్‌తో చెల్సీ ఎఫ్‌సీ చేతిలో ఓడటంతో లివర్‌పూల్ టైటిల్ కల సాకారమైంది. టైటిల్ రేసులో నిలవాలంటే ఓటమి తప్పించుకోవాల్సిన మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ ఓడిపోవడంతో కరోనా విరామం అనంతరం బరిలోకి దిగకుండానే లివర్‌పూల్‌కు టైటిల్ లభించింది. ఈ సీజన్లో ఈపీఎల్‌లో ఉన్న 20 జట్లకు తలా ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా... లివర్‌పూల్ 86 పాయింట్లు, మాంచెస్టర్ సిటీ 63 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన ఏడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా పాయింట్ల పట్టికలో లివర్‌పూల్‌ను ఏ జట్టూ అందుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ జట్టుకు టైటిల్ ఖాయమైంది. 1989–90 సీజన్లో చివరిసారిగా లివర్‌ఫూల్ విజేతగా నిలిచింది. ఈపీఎల్ చరిత్రలో ఓ జట్టు ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే చాంపియన్‌గా అవతరించడం ఇదే తొలిసారి. -
అద్భుతం : 30 ఏళ్ల నిరీక్షణకు తెర
ఫుట్‌బాల్ చరిత్రలో గురువారం రాత్రి ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టైటిల్‌ను గెలవడం కోసం 30 ఏళ్లుగా నిరీక్షిస్తున్న లివర్‌పూల్ కల నెరవేరింది. గురువారం రాత్రి మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో లివర్‌పూల్ మొదటిసారి ఇంగ్లీష్ ప్రీమియర్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. అయితే ఒక దశలో జుర్గెన్ క్లోప్ ఆధ్వర్యంలోని లివర్‌పూల్ టైటిల్ గెలవడానికి మరో మ్యాచ్‌కోసం ఎదురుచూడాల్సి వస్తుందేమోనన్న అనుమానం కలిగింది. కానీ చెల్సియా జట్టులోని క్రిస్టియన్ పులిసిక్, విలియమ్ సీల్డ్ ఆఖరి నిమిషంలో గోల్స్ చేయడంతో చెల్సియా జట్టు 2-1 తేడాతో మాంచెస్టర్ సిటీని ఓడించింది. మరోవైపు మాంచెస్టర్ సిటీ నుంచి కెవిన్ డిబ్రూయిన్ ఒక గోల్ చేశాడు. (మైదానంలోకి రోహిత్ శర్మ) ఈ విజయం చెల్సియాకు తరువాతి సీజన్లో జరగనున్న ఛాంపియన్స్ లీగ్‌లో స్థానం సాధించడంతో జట్టును మరింత బలోపేతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బ్లూస్(చెల్సియా) అభిమానులు ఈ ఫలితంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు లివర్‌పూల్ క్లబ్ మొదటిసారి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడం వెనుక చెల్సియా మ్యాచ్ ఎంతగానో ఉపయోగపడిందని లివర్‌పూల్ అభిమానులు పేర్కొన్నారు. 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత వారి కల సాకారం అయినందుకు లివర్‌పూల్ క్లబ్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. కాగా లివర్‌పూల్ తరువాతి మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీని ఎదుర్కోనుంది. గార్డ్ ఆఫ్ ఆనర్ కింద ఈ మ్యాచ్ జరగనుంది. -
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్... ఇలా మళ్లీ మొదలైంది..!
మాంచెస్టర్: కరోనా విరామం తర్వాత ఎట్టకేలకు ఒక ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ మళ్లీ వచ్చింది. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా బుధవారం ఇంగ్లీష్ ప్రీమియర్ పోటీలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, స్టార్ ఆటగాళ్లు ఉన్న లీగ్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ లీగ్‌లో మార్చి 8న చివరి మ్యాచ్ జరిగింది. పునఃప్రారంభంలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోరులో ఆస్టన్ విల్లాతో షెఫీల్డ్ యునైటెడ్ తలపడింది. కోవిడ్–19కు సంబంధించిన అన్ని నిబంధనలను మైదానాల్లో పాటిస్తూ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు ఇంగ్లండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో అడుగడుగునా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా ఇదంతా కొత్తగా కనిపించింది. ఈ స్వీయ నియంత్రణ నిబంధనలు ఐపీఎల్ జరిపేందుకు బీసీసీఐకిదారి చూపిస్తున్నట్లుగానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే... ► ఆటగాళ్లు, సిబ్బంది, సెక్యూరిటీ అంతా కలిపి మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో 300 మందికి మించి ఉండరాదు ► స్టేడియంను రెడ్, అంబర్, గ్రీన్ జోన్లతో విభజించారు. మ్యాచ్ జరిగే చోటు, డ్రెస్సింగ్ రూమ్, టెక్నికల్ ఏరియా రెడ్‌జోన్‌లో ఉంటాయి. మ్యాచ్‌కు కనీసం ఐదు రోజుల ముందు జరిగిన కోవిడ్ టెస్టులో నెగెటివ్‌గా వచ్చినవారినే రెడ్ జోన్లోకి అనుమతిస్తారు. ► మ్యాచ్ ఆడే బంతి, గోల్‌పోస్ట్, డగౌట్లు, కార్నర్ పోల్స్, ఫ్లాగ్స్, సబ్స్టిట్యూషన్ బోర్డులు మొత్తం శానిటైజ్ చేస్తారు. ► 20 క్లబ్‌లకు చెందిన ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వారంలో రెండు సార్లు కరోనా టెస్టులు చేస్తారు. ఎవరైనా పాజిటివ్‌గా తేలితే సెల్ఫ్ ఐసోలేషన్‌కు పంపిస్తారు. జట్టు మొత్తాన్ని క్వారంటైన్ చేయరు. కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న తరహాలోనే అన్ని ఏర్పాట్లతో ఇద్దరు వైద్యులు మైదానంలో ఉంటారు. ► మైదానంలో ఉమ్మడం, ముక్కు శుభ్రం చేసుకోవడం నిషేధం. గోల్ చేసినప్పుడు కూడా ఆటగాళ్లు దూరం పాటించాలి. షేక్హ్యాండ్లు చేయరాదు. ప్లేయర్లు మాస్క్ ధరించనవసరం లేదు. ► బాల్ బాయ్స్ ఉండరు. మైదానంలోనే అన్ని వైపుల అదనపు బంతులు పెడతారు. ఆటగాళ్లే వెళ్లి తీసుకోవాలి. ముగ్గురికి బదులు ఐదుగురు సబ్స్టిట్యూట్లను అనుమతిస్తారు. ► రెండు అర్ధ భాగాల్లోనూ ఒక్కో నిమిషం చొప్పున మాత్రమే డ్రింక్స్ బ్రేక్ ఇస్తారు. ఆటగాళ్లు ఎవరి బాటిల్లో నీళ్లు వారే తెచ్చుకొనితాగాలి. -
ప్రతీ మ్యాచ్‌లో గట్టిగా పోరాడతాం
ఆదివారం టాటెన్‌హామ్‌తో జరిగే మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే విషయంలో మాంచెస్టర్ యునైటెడ్ కాస్త డైలమాలో పడింది. ఎందుకంటే యూరోపా లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఆ మ్యాచ్ కోసం తమ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలా? లేక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్–4లో నిలిచేందుకు పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలా? అనేది తేల్చుకోలేకపోతోంది. ఈ జట్టు యూరోపా లీగ్ నెగ్గితే నేరుగా చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు యూరోపా లీగ్ సెమీస్‌లో జట్టును గెలిపించిన డిఫెండర్ మాటియో డార్మియాన్ మాత్రం టాటెన్‌హామ్‌తో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. మీ జట్టు ఇప్పుడు యూరోపా లీగ్ ఫైనల్‌కు చేరింది. గెలిస్తే చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధిస్తారు. ఒత్తిడి పెద్దగా లేకపోవడంతో టాటెన్హామ్పై విశ్రాంతి తీసుకుంటారా? అలా ఏం లేదు. ఫైనల్‌కు వెళ్లిన మాట నిజమే అయినా ఈపీఎల్‌లో మాకు ఇంకా మూడు మ్యాచ్‌లున్నాయి. ముందు అవి గెలవాల్సి ఉంది. విజయం సాధించిన ఉత్సాహంతో యూరోపా లీగ్ ఆడితే ఆ మజా వేరుగా ఉంటుంది. అయితే ఆదివారం మ్యాచ్‌లో నీవు పాల్గొంటున్నావా? కచ్చితంగా... మా జట్టు ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించేందుకే బరిలోకి దిగుతుంది. ఈపీఎల్‌లో మేం ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంది. యూరోపా లీగ్ సెమీస్‌లో మీ ఆటగాళ్లు గాయాలబారిన పడ్డారు. ఇప్పుడు టాటెన్‌హామ్‌తో మ్యాచ్ చాలా కష్టంగా మారనుందా? అవును. ఎందుకంటే గాయాల నుంచి కోలుకునేందుకు మాకు ఎక్కువ సమయం లభించలేదు. అలాగే టాటెన్హామ్ పటిష్ట జట్టు. అయితే ఇందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. అదీగాకుండా వైట్ హార్ట్ లేన్ మైదానంలో ఇదే చివరి మ్యాచ్. దీని తర్వాత స్టేడియం పునర్నిర్మాణం కాబోతుంది. అందుకే ఇది మాకు ప్రత్యేక మ్యాచ్. యూరోపా లీగ్ ఫైనల్లో అజాక్స్‌తో జరిగే మ్యాచ్‌లో మీరే ఫేవరెట్టా? అది ఇప్పుడే చెప్పలేం. అజాక్స్ చాలా పెద్ద క్లబ్. అలాగే చాలా గట్టిపోటీదారు. అయితే ఫైనల్‌కు చేరడం మాకు గర్వంగా ఉంది. దీంతో కచ్చితంగా కప్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే వచ్చే సీజన్లో చాంపియన్స్ లీగ్‌కు కూడా అర్హత సాధిస్తాం కాబట్టి ఆ మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. -
ఇక ప్రతీ మ్యాచ్ కీలకమే
మైకేల్ కారిక్ ఇంటర్వ్యూ ఈసారి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) సీజన్ తమ జట్టుకు మిశ్రమంగా ఉందని 11 ఏళ్లుగా మాంచెస్టర్ యునైటెడ్ జట్టు తరఫున ఆడుతున్న మిడ్‌ఫీల్డర్ మైకేల్ కారిక్ తెలిపాడు. అయినా తాము టాప్–4లో కచ్చితంగా చోటు దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. విజయాలతో పాటు పరాజయాలు ఎదుర్కొంటున్న ఈ జట్టు ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండగా మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆదివారం అర్సెనల్‌తో జరిగే కీలక పోరులో తలపడబోతున్న యునైటెడ్ జోస్ మౌరిన్హో పర్యవేక్షణలో దూసుకెళుతుందని గాయంతో బాధపడుతున్న కారిక్ చెబుతున్నాడు. ప్రస్తుతం మీ జట్టుకు కఠిన మ్యాచ్‌లు ఎదురవుతున్నాయి. మాంచెస్టర్ సిటీ తర్వాత ఇప్పుడు అర్సెనల్ను ఎదుర్కొనబోతున్నారు. ఆ తర్వాత టాటెన్హమ్తో తలపడాల్సి ఉంది. ఇదంతా జట్టుకు కష్టంగా సాగబోతుందా? మేము అలా భావించడం లేదు. దీన్ని ఓ అవకాశంగా తీసుకుని పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. విజయాలు సాధించి జట్టు పాయింట్లు పెంచడంపైనే మా దృష్టి ఉంది. అదే జరిగితే ఈ సీజన్ మాకు మేలు చేస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లను ఒత్తిడిగా భావించడం లేదా? లేదు. ఈ సీజన్‌ను మెరుగ్గా ముగించేందుకే మేం ఎదురుచూస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవాలని కోరుకుంటున్నాం. టాప్–4లో నిలవాలంటే అర్సెనల్‌తో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారా? ఇక మా చేతుల్లో ఎక్కువగా మ్యాచ్‌లు లేవు. అందుకే టాప్–4లోకి వెళ్లాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమే. ఇప్పుడు విజయాలు మాకు అవసరం. ఈ సీజన్లో మీ జట్టు ఎక్కువగా ‘డ్రా’లు సాధించింది. విజయానికి దగ్గరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇది మీకు నిరాశ కలిగించిందా? అవును. ముఖ్యంగా సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌ల్లో ఇలాంటి ఫలితం రావడం చికాకు తెప్పించింది. సీజన్లో మా ఫామ్‌పై ఆందోళన లేదు. అద్భుతంగా ఆడుతున్నా ఫలితం అనుకూలంగా రావడం లేదు. దీంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. -
మా ఆశలు సజీవం
హ్యారీ కేన్ ఇంటర్వ్యూ టొటెన్హామ్ హాట్స్పర్స్ స్టార్ ప్లేయర్ హ్యారీ కేన్. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ స్ట్రయికర్ తమ జట్టుకు టైటిల్ అవకాశాలు సజీవంగా ఉన్నాయని చెప్పాడు. అర్సెనల్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తమ సత్తా చాటుతామన్నాడు. ఈ సీజన్లో ఇంకా ఐదు మ్యాచ్‌లే మిగిలిండటంతో ప్రతీ మ్యాచ్ తమకు కీలకమన్నాడు. ఇంకా ఏమన్నాడంటే... టైటిల్ రేసులో ఉన్న టొటెన్హామ్ సొంతగడ్డపై అర్సెనల్‌తో పోరుకు సిద్ధమేనా? ఒక్క అర్సెనల్‌తో మ్యాచే కాదు. మిగతా మ్యాచ్‌ల్ని కూడా ఇప్పుడు ఒకేలా చూస్తాం. అగ్రస్థానంలో ఉన్న చెల్సీని చేరాలంటే మేం మిగిలున్న మ్యాచ్‌లన్నీ తప్పక గెలవాల్సిందే. ఇదే మా లక్ష్యం. దానిపైనే దృష్టిపెట్టాం. మీ మ్యాచ్ రోజే చెల్సీ... ఎవర్టన్తో తలపడనుంది. దీనిపై కూడా ఓ కన్నేశారా? నిజాయితీగా చెబుతున్నా... ఈ కీలక తరుణంలో నేను మా జట్టు ప్రదర్శనపైనే ఫోకస్ చేశాను. చెల్సీ పోరుపై కాదు! మాకిపుడు ఐదు మ్యాచ్‌లు క్లిష్టమైనవి. అవన్నీ గెలవడంపైనే దృష్టిసారించాం. మిగతా జట్ల సంగతి మాకు అనవసరం. ఎఫ్ఏ కప్ సెమీఫైనల్లో చెల్సీతో ఓటమి మీ అభిమానుల మదిలో ఇంకా మెదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవుతారు? నిజమే అది ఊహకందని ఫలితం. హోరాహోరీ సమరంలో మేం బాగా పోరాడాం. కానీ ఈసారి అలా జరగనివ్వం. అభిమానులను సంతోషపెట్టే ఫలితాల్ని సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నాం. ఈ సీజన్లో మీ జట్టు టైటిల్ గెలుస్తుందనుకుంటున్నారా. నాటకీయంగా చెల్సీ తడబడితే మీకే ఆ అవకాశముంటుందా? నేను చెప్పేదొక్కటే. అంత తేలిగ్గా దేన్నీ వదులుకోం. ఎవరికీ తలవంచం. గత సీజన్ గుణపాఠాలతో ఈ లీగ్‌లో పటిష్టమైన స్థితిలో నిలవాలనుకుంటున్నాం. దీని కోసం ఒక్కో మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. ఇప్పటికే 26 గోల్స్ చేసిన మీరు ఎవర్టన్ ఆటగాడు రొమెలు లుకాకు (30 గోల్స్)ను అధిగమించాలనుకుంటున్నారా? ఇందులో సందేహమే లేదు. టాప్ స్కోరర్‌గా నిలవాలని ఎవరికుండదు? ఓ స్ట్రయికర్‌గా ఆ స్థానం దక్కాలనే కోరుకుంటా. కానీ లుకాకు చాలా బాగా ఆడుతున్నాడు. నేను ఇంకాస్త మెరుగ్గా ఆడితేనే ఆ ఛాన్స్ ఉంటుంది. -
యునైటెడ్‌తో మ్యాచ్ ఫైనల్‌లాంటిది
యాయా టురె ఇంటర్వూ 2010 నుంచి మాంచెస్టర్ సిటీ తరఫున ఆడుతున్న యాయా టురెకు తమ ప్రధాన ప్రత్యర్థి మాంచెస్టర్ యునైటెడ్‌తో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను ఆడిన అనుభవముంది. అయితే నేడు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ మాత్రం ఫైనల్‌ను మించిన పోరుగా అతను భావిస్తున్నాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో ఈ రెండు జట్లు నాలు గో స్థానం కోసం పోటీపడుతున్నాయి. దీంతో వచ్చే సీజన్లో చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించవచ్చు. మరో ఆరు మ్యా చ్‌లు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సిటీ జట్టు ఇప్పు డు నాలుగో స్థానంలో ఉంది. యునైటెడ్ ఒక్క పాయింట్ తేడాతో ఐదో స్థానంలో ఉంది. ఈ దశలో విజయం రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది. దీంతో చిరకాల శత్రువుపై విజయంతో మాంచెస్టర్ సిటీ తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాలి. నేటి మ్యాచ్‌లో ఫలితం తారుమారైతే నాలుగో స్థానం నుంచి పడిపోతారు. మీ ప్రధాన ప్రత్యర్థికి ఆ స్థానం అప్పగించాల్సి ఉంటుంది. ఇది మీలో ఒత్తిడి పెంచుతుందా? మేము అలా జరగనివ్వం. యునైటెడ్‌తో ఎప్పుడు మ్యాచ్ ఆడినా మాకు ప్రత్యేకమే. ఈసారి అంతకుమించిగానే భావిస్తున్నాం. నావరకైతే యునైటెడ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ ఫైనల్‌లాంటిది. సిటీ ఆటగాళ్లకు మీరిచ్చే సందేశం? చాంపియన్స్ లీగ్‌లో ఆడాల్సిన అవసరం మాకుంది. గత ఆరేళ్ల నుంచి మేం అర్హత సాధిస్తున్నాం. అందుకే గురువారం మ్యాచ్ మాకు చాలా కీలకం. అయితే ఈసారి యునైటెడ్‌తో మ్యాచ్ చాలా కష్టమేమో.. ఎందుకంటే గత అక్టోబర్ నుంచి వారు ఓటమి లేకుండా ఆడుతున్నారు? నాకు తెలుసు. వారి ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. జోస్ మౌరిన్హోలాంటి అద్భుత మేనేజర్ పర్యవేక్షణలో ఉన్న జట్టది. అందుకే ఇది యుద్ధంగా భావిస్తున్నాం. ఎఫ్ఏ కప్‌లో పరాజయం తర్వాత మేం తిరిగి విజయాల బాట పట్టాల్సిన అవసరం ఉంది. అలాగే టాప్–3లో ఉండాలనుకుంటున్నాం కాబట్టి విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. ఎఫ్ఏ కప్‌లో అర్సెనల్ చేతిలో ఓడిన అనంతరం మీ ఆటగాళ్లు ఎలా ఫీలయ్యారు? మానసికంగా మీరు కోలుకున్నట్టేనా? ఆ మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలు మాకు వ్యతిరేకంగా వచ్చా యి. అయితే ఈ ఆటలో ఒక్కోసారి అలా జరగడం సహజం. అక్కడితో ఆ విషయం మరిచిపోయి యునైటెడ్‌తో మ్యాచ్‌పై దృష్టి పెట్టడం ముఖ్యం. ఒక్క గెలుపుతో అన్నీ వెనక్కి వెళతాయి. అయితే ఓడితే పరిస్థితి మరింత దిగజారుతుంది. -
టాప్–4లో చేరడమే లక్ష్యం
ఆండర్ హెరీరా ఇంటర్వ్యూ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెల్సీపై గత ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 2–0తో నెగ్గింది. ఇందులో ఆండర్ హెరీరా కీలక పాత్ర పోషించడమే కాకుండా ఓ గోల్ కూడా సాధించాడు. తాజాగా నేడు (ఆదివారం) బర్న్లీతో జరిగే మ్యాచ్‌లోనూ నెగ్గి టాప్–4లో చోటు కోసం ఎదురుచూస్తున్నట్టు హెరీరా తెలిపాడు. ఆరంభంలో అంతగా విజయాలు దక్కకపోయినా ప్రస్తుతం తమ జట్టు దూసుకెళుతోందని, ఈ దూకుడు మున్ముందు కూడా కొనసాగుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. గత నెల రోజులుగా మీ జట్టు విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఓటములు లేకున్నా ‘డ్రా’లు బాగానే ఎదురవుతున్నాయి. ఇది టైటిల్ వేటలో ఇబ్బందిగా మారనుందా? కొంతవరకు ఇది నిజమే. మా జట్టుకు ‘డ్రా’లు ఎదురవుతున్నా మా ఆటతీరు చాలా మెరుగ్గా ఉంది. మా మేనేజర్ సూచనలతో ఎప్పటికప్పుడు తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళుతున్నాం. ఇంకా చాలా పాయింట్లు సాధించాల్సి ఉంది. చెల్సీపై గత వారం భారీ విజయం సాధించారు. ఈ సీజన్లో ఇది పెద్ద ఫలితంగా భావిస్తున్నారా? ఖచ్చితంగా.. మా వరకైతే అది చాలా కీలక మ్యాచ్. టాప్–4లో చోటు దక్కించుకోవడమే కాకుండా వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించాలని భావిస్తున్నాం. ఇలాగే విజయాలను కొనసాగిస్తాం. ఆ గెలుపును ఎలా వర్ణిస్తారు. మీ జట్టు ఇటీవలి పురోగతిపై మీ కామెంట్? చెల్సీ ఎలాంటి జట్టో మనకు తెలుసు. వారు ప్రీమియర్ లీగ్‌లో టాప్‌లో ఉన్నారు. టైటిల్ దక్కించుకునేందుకు వారికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి జట్టును ఓడించాలంటే మా నుంచి ఎలాంటి ప్రదర్శన రావాలో కూడా తెలుసు. అదే నిరూపించాం. అయితే మున్ముందు కూడా ఇలాంటి ఆటతీరునే ప్రదర్శించడం అవసరం. మీ ఆట మెరుగుదలలో మేనేజర్ మౌరిన్హో పాత్ర ఎలాంటిది? మౌరిన్హో అగ్రస్థాయి మేనేజర్ అనే విషయం అందరికీ విదితమే. నన్ను తుది జట్టులో చేర్చుకోవడమే కాకుండా చాలా ఆత్మవిశ్వాసాన్ని అందించాడు. తన దృష్టిలో నేను చాలా ముఖ్యమైన ఆటగాడినని చెప్పారు. ఇంత పెద్ద క్లబ్ తరఫున ఆడటం గౌరవంగా భావిస్తున్నాను. -
గెలుపుబాట పడతాం
జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ ఇంటర్వ్యూ ఈ సీజన్ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో జోరు మీదున్న మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ తమ జట్టు మళ్లీ గెలుపుబాట పడుతుందని చెప్పాడు. వరుస ‘డ్రా’లతో అభిమానులను నిరాశపరిచినప్పటికీ... మెరుగైన ఆటతీరుతో మళ్లీ పుంజుకుంటామన్నాడు. 42 మ్యాచ్‌లాడిన అతను 27 గోల్స్‌తో సత్తా చాటుకున్నాడు. తదుపరి సందర్లాండ్తో జరిగే మ్యాచ్‌లో జట్టు రాణిస్తుందన్నాడు. ఇంకా ఏమన్నాడంటే... వ్యక్తిగతంగా ఈ సీజన్ మీకు సంతృప్తికరంగా సాగుతోంది. 35 ఏళ్ల వయసులో యువకులకు దీటుగా ఆడటంపై ఎలా స్పందిస్తారు? చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఏడాది ఎలా రాణిస్తానో ఈ సీజన్లో కూడా అలాగే ఆడాను. కానీ దీన్ని కొందరు విమర్శకులే అంగీకరించరు. నాకైతే వయస్సుపై బెంగలేదు. నా సామర్థ్యమేంటో నాకు తెలుసు. ఈ సీజన్లో నా ప్రదర్శన చక్కగా ఉంది. ఇంకా ఎన్నేళ్లు ఆడాలనుకుంటున్నారు? 40 ఏళ్ల దాకా ఆడతారా? అదెలా చెప్పగలను. ఇబ్రహిమోవిచ్ మునుపటిలా రాణించడం లేదంటే ఆడను. నా ప్రదర్శన బాగా లేకపోయినా, గోల్స్ సాధించే సత్తా తగ్గినా ఆడను. ఫలితాలు తెచ్చే సామర్థ్యమున్నంత వరకు బరిలోకి దిగుతాను. తదుపరి సీజన్లో ఎవరితో ఉంటారు? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ సీజన్లో ఇంకా రెండు నెలల సమయముంది. ఆ తర్వాతే తేలుతుంది. క్లబ్‌లు నా నుంచి ఏం ఆశిస్తాయో... నేను ఏం చేస్తానో... ఇప్పుడైతే ఏం చెప్పలేను. వరుస ‘డ్రా’లు మాంచెస్టర్‌ను, అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయిగా? నిజమే. మేం ఇందులో మెరుగవ్వాల్సిందే. గెలవాల్సిన మ్యాచ్‌ల్ని ‘డ్రా’లతో ముగించడం ఎవరికైనా నిరాశను పెంచేదే! ఇప్పుడీ గుణపాఠాలతో మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. గోల్స్ చేసేందుకు మరింత కష్టపడతాం. మ్యాచ్‌లో గెలిచే అవకాశాల్ని సృష్టించుకుంటాం. -
నా ఫామ్‌పై సంతృప్తిగా ఉన్నాను
జువాన్ మటా ఇంటర్వూ మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ జువాన్ మటా ఈ సీజన్లో పది గోల్స్ సాధించి అద్భుత ఫామ్‌తో కొనసాగుతున్నాడు. అయితే ఇబ్రహీమోవిక్తో కలిసి జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న మటా గాయం కారణంగా ఈ నెలలో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో చాలా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కానీ ఇప్పటికే తన ఆటతీరుతో జట్టును ఐదో స్థానంలో నిలపగలిగాడు. గత శనివారం వెస్ట్ బ్రోమ్‌తో జరిగిన మ్యాచ్‌ను 0–0తో డ్రాగా ముగించిన అనంతరం బుధవారం ఎవర్టన్తో జరిగే మ్యాచ్‌లో యునైటెడ్ సత్తా చూపిస్తుందని మటా చెబుతున్నాడు. ఈ సీజన్లో ఎక్కువగా మ్యాచ్‌లను గెలవలేకపోయిందనే విమర్శలు యునైటెడ్‌పై ఉన్నాయి. ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? నిజానికి ఎవరైనా మ్యాచ్‌లను గెలవాలనే కోరుకుంటారు. ఇటీవలి కాలంలో మా ఆటతీరు చాలా మెరుగుపడింది. అందుకే చివరి ఐదు మ్యాచ్‌ల్లో మాకు ఓటమి లేదు. అయితే ఓ జట్టుగా సాధించాల్సింది ఇంకా ఉంది. ట్రోఫీలను గెలుచుకుంటూ చాంపియన్స్ లీగ్‌లో ఆడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లీగ్ కప్ గెలిచాం. అయితే మరిన్ని మ్యాచ్‌లతో పాటు కప్‌లను గెలవాల్సిన అవసరం ఉంది. మాంచెస్టర్ యునైటెడ్‌కు ఈ నెల ఎంత కీలకం కాబోతుంది. ముఖ్యంగా మీ గైర్హాజరీలో జట్టు ఎలా ఆడబోతోంది? ఏప్రిల్ మాకు చాలా ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. అలాగే ప్రీమియర్ లీగ్ సీజన్, యూరోపా లీగ్‌లో కూడా ఇది నిర్ణయాత్మకమైన సమయం. మేం కచ్చితంగా మెరుగ్గా సిద్ధం కావాల్సి ఉంది. ఈ సీజన్లో యునైటెడ్ తరఫున 10 గోల్స్ సాధించడమే కాకుండా వరుసగా మూడో ఏడాది ఈ మార్కును అందుకున్నారు. ఇప్పుడు ఈ గాయానికి ముందు వరకు మీరు సాధించిన దానిపై అభిప్రాయం? నా ఫామ్‌పై చాలా సంతోషంగా ఉన్నాను. గత రెండు సీజన్లలోనూ పదేసి గోల్స్ చేశాను. గాయం నుంచి కోలుకున్నాక మరిన్ని గోల్స్ సాధిస్తాననే నమ్మకం ఉంది. యునైటెడ్ జట్టుకు ఈ సీజన్ కాస్త కఠినంగానే సాగినా మీ ఫామ్ మాత్రం అద్భుతంగా సాగడంపై ఎలా అనిపిస్తుంది? ఇంకా చాలా సాధించాల్సి ఉన్నా సంతోషంగానే ఉన్నాను. నా చుట్టూ అద్భుత ఆటగాళ్లున్నారు. వారు కూడా ఈ సీజన్లో మెరుగ్గానే ఆడారు. నేను ఆడిన మ్యాచ్‌లు, చేసిన గోల్స్‌ను బట్టి చూస్తే ఈ సీజన్‌పై సంతృప్తిగానే ఉన్నాను. -
టాప్–4లో నిలవడమే లక్ష్యం
యాయా టురీ ఇంటర్వ్యూ మాంచెస్టర్ జట్టులో కీలక ఆటగాడు యాయా టురీ. ఏడేళ్లుగా ఈ జట్టుతో అనుబంధమున్న అతను... ఈ సీజన్లో టైటిల్ అవకాశాలు దాదాపు కోల్పోవడంతో ఇక జట్టును టాప్–4లో నిలపడమే లక్ష్యమని చెప్పాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో తదుపరి అర్సెనల్‌తో జరిగే మ్యాచ్‌లో రాణిస్తామన్నాడు. ఈ సీజన్ ముగిసిన వెంటనే జరిగే ఎఫ్ఏ కప్‌లో మాంచెస్టర్ సిటీకి టైటిల్ అందించేందుకు శ్రమిస్తామని చెప్పిన టురీ ఇంకా ఎమన్నాడంటే... టైటిల్ అవకాశాలు కోల్పోయిన నేపథ్యంలో ఇక సీజన్లో మీ తదుపరి టార్గెట్ ఏంటి? ఈ సీజన్లో జట్టును మెరుగైన స్థితిలో నిలపడమే మా ముందున్న లక్ష్యం. టైటిల్ అవకాశాలు చేజారినంత మాత్రాన మిగతా మ్యాచ్‌లపై అలసత్వమేమీ ఉండదు. మా పోరాటంలో మార్పు ఉండదు. ఈ చాంపియన్స్ లీగ్‌లో తొలి నాలుగు స్థానాల్లో మా జట్టును నిలుపుతాం. మా అభిమానులకు ఆ తృప్తి అయినా మిగిలిస్తాం. అర్సెనల్‌తో జరిగే తదుపరి మ్యాచ్ మీకు కీలకమనే భావిస్తున్నారా? ఆటలో ప్రతి మ్యాచ్, ఫలితం కీలకమైనదే. ఈ సీజన్లో మేం సొంతగడ్డపై కంటే బయటే బాగా ఆడాం. ఇతర వేదికలపై స్వేచ్ఛగా ఆడేందుకు పరిస్థితులు కలిసొచ్చా యి. ఈ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందడుగు వేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెల్సీ జట్టునెవరూ చేరుకోలేరా? నిజమే. మిగతా జట్లన్ని చెల్సికి చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జట్టు ఆధిక్యానికి ఢోకా లేదు. అలాగని మిగిలిన జట్లు నిరాశ పడాల్సిన పనిలేదు. సాధ్యమైనంత వరకు స్థిరమైన విజయాలతో గట్టి పోటీనిచ్చేందుకు చెమటోడ్చాలి. వచ్చే సీజన్లోనైనా మాంచెస్టర్ మెరుగైన స్థితిలో నిలుస్తుందా? టాప్‌లో ఉండాలనే ఆశిస్తున్నా. ప్రస్తుత మేనేజర్ మౌరిన్హో మార్గదర్శనంలోనే వచ్చే సీజన్‌కూ సిద్ధమవుతాం. జట్టు కోసం ఆయన చాలా కష్టపడ్డారు. భవిష్యత్తులో పటిష్టమైన జట్టుగా మాంచెస్టర్ సిటీ బరిలోకి దిగుతుంది. -
చెల్సితో అంత ఈజీ కాదు: యయ టౌర్
మాంచెస్టర్ సిటీ స్టార్ డిఫెండర్ యయ టౌర్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లివర్‌పూల్‌తో కీలకమైన సమరానికి సిద్ధమైన అతను టైటిల్ అవకాశాలపై మాట్లాడుతూ చెల్సి ఆధిక్యంలో ఉన్నా... తాము రేసులోనే ఉన్నామని చెప్పాడు. నాకౌట్ దశకు చేరిన ఈ టోర్నమెంట్లో తమ జట్టు డిఫెన్స్‌లో తప్పులను సరిదిద్దుకొని ముందంజ వేస్తుందని అన్నాడు. ఇంకా అతడేమన్నాడంటే... మాంచెస్టర్ ఇటీవల బాగా రాణిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తారా? మైదానంలో మా శక్తిమేర రాణించడం... మాకంటూ కొత్త చరిత్రను లిఖించడమే లక్ష్యంగా కదం తొక్కుతున్నాం. ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ కీలకమైన నాకౌట్ పోరు దాకా వచ్చాం. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. కానీ డిఫెన్స్‌లో పదేపదే చేసే పొరపాట్లు జట్టును కలవరపెడుతున్నాయి. ఇలా అయితే టైటిల్ సాధ్యమేననుకుంటున్నారా? ఎందుకు సాధ్యం కాదు. సమష్టిగా రాణిస్తే ఏదైనా సాధ్యమే. అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్న వెంటనే తేరుకొని గోల్స్ చేస్తున్నాం. కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లంతా క్లబ్ కోసం కష్టపడుతున్నారు. వీరంతా మ్యాచ్‌ల్నే కాదు ట్రోఫీని కూడా గెలిపిస్తారు. ఈ వారాంతంలో జరిగే మ్యాచ్‌లో చెల్సి జట్టును ఓడిస్తారా? ఇదంత సులభం కాదు. చెల్సి జట్టు మాకంటే మెరుగైన స్థితిలో వుంది. ఇప్పటిదాకా ఈ టోర్నీ ఆసాంతం బాగా ఆడింది. అయితే మేం మ్యాచ్‌లో నిలకడైన ప్రదర్శన కనబరిస్తే గెలిచే అవకాశాలుంటాయి. ఇప్పుడైతే మేం పాయింట్ల పట్టికలో చెల్సి తర్వాత రెండో స్థానంపై కన్నేశాం. మాంచెస్టర్‌కు ఈ సీజన్ గొప్పగా ముగుస్తుందనే భావిస్తున్నారా? అవును. ఈ ప్రీమియర్ లీగ్‌లో మేం టైటిల్ రేసులోనే ఉన్నాం. ఎఫ్ఏ కప్‌లోనూ ఇలాగే ఆడతాం. మా మేనేజర్‌కు ఏం కావాలో దాన్ని ప్రతిరోజు మేం నేర్చుకుంటున్నాం. ఇదే పోరాటంతో ఈ సీజన్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. -
కఠోర శ్రమతోనే తిరిగొచ్చాను
ఒలివియర్ గిరూడ్ ఇంటర్వూ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) సీజన్ ఆరంభం నుంచి అర్సెనల్ స్ట్రయికర్ ఒలివియర్ గిరూడ్ గాయాలతో ఇబ్బంది పడుతూ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితుల నుంచి త్వరగానే కోలుకుని తన చివరి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో సత్తా చాటుకున్నాడు. మరోవైపు బయేర్న్ మ్యూనిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–5తో ఓడిపోవడంతో ఈ జట్టు టాప్‌లో ఉన్న చెల్సీ కన్నా 13 పాయింట్లు వెనకబడింది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) లివర్‌పూల్‌తో మ్యాచ్‌కు అర్సెనల్ సిద్ధమవుతోంది. సీజన్ ఆరంభంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను అధిగమించి... అద్భుత ఫామ్‌ను ఎలా అందుకున్నారు? అది కేవలం నా అంకితభావం, కఠోర శ్రమ ద్వారానే సాధ్యమైంది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నేను కాస్త నిస్పృహగానే ఉన్నాను. ఎందుకంటే గాయాల కారణంగా ఎక్కువ మ్యాచ్‌లను ఆడలేకపోయాను. అయితే నాలో ఉన్న ఆ బాధ, ఆవేదనను సరికొత్త ఉత్తేజంగా మార్చుకున్నాను. ఇప్పటికే మీ ఫామ్ చాటుకున్నారు. జట్టు కోసం మీరు చేసిన గోల్స్ ఎంతమేరకు ఉపయోగపడినట్టుగా భావిస్తున్నారు? జట్టులో ఉన్న స్ట్రయికర్ పని గోల్స్ చేయడమే. నేను బరిలోకి దిగాక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఫలితం సాధించగలిగాను. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాను. ఇదే జోరుతో ముందుకెళ్లి ఈ సీజన్లో మేం అనుకున్నది సాధిస్తాం. జట్టులో స్థానం కోసం సహచరుడితోనే పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తోంది? ఇది మీ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందా? అలా ఏమీ జరగదు. మంచి స్ట్రయికర్లతో సమతూకంతో ఉన్న జట్టు మాది. మైదానంలో మా మధ్య మంచి అవగాహన ఉంటుంది. అయినా పోటీ ఉండటం మంచిదే. అయినా నేను గోల్స్ సాధిస్తున్నప్పుడు జట్టు బయట ఎందుకు ఉంటాను? తుది జట్టులో మీకు చోటుపై ఇంకా అస్పష్టతే ఉన్నప్పుడు మరోసారి అర్సెనల్తోనే ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఎందుకంటే నేను అర్సెనల్ తరఫునే ఆడాలనుకుంటున్నాను. ఈ క్లబ్ తరఫున ప్రీమియర్ లీగ్‌తో పాటు మరిన్ని ట్రోఫీలు గెలవాలనుకుంటున్నాను. నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను. -
చెల్సీ జట్టును అధిగమిస్తాం
హ్యారీ కేన్ ఇంటర్వూ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) టైటిల్ రేసులో చెల్సీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టోటెన్హామ్ హాట్స్పర్ నేడు (శనివారం) లివర్‌పూల్‌తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ స్ట్రయికర్ హ్యారీ కేన్ మరోసారి రాణించి జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తోంది. ఇప్పటికే అతను ఈ సీజన్లో 16 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న హాట్స్పర్ మరో విజయంతో చెల్సీపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. లివర్‌పూల్‌తో ఈ మ్యాచ్ మీకు ఎంత కీలకంగా భావిస్తున్నారు? ఈపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెల్సీకి మాకు తొమ్మిది పాయిట్ల తేడా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి దీన్ని మరింత తగ్గించి వారిపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాం. మేం వారిని అందుకోవాలంటే ఈ మ్యాచ్ కీలకమే. ఇది జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మా ప్రయత్నం మేం చేస్తాం. కొన్ని పాయింట్లు వారు కోల్పోతారని ఆశిస్తున్నాం. లివర్‌పూల్ జట్టు హల్, అర్సెనల్, వాట్ఫోర్ట్ల చేతిలో ఓడింది. ఇది ఎవరు ఊహించారు? అందుకే ఎలాంటి అవకాశాన్ని కూడా మేం కోల్పోం. వారిని అందుకోవడం సాధ్యమే. ఇక లివర్‌పూల్ మీకు ఎలాంటి పోటీ ఇస్తుందనుకుంటున్నారు? మా చివరి మ్యాచ్ మిడిల్స్బరోలా కాకుండా ఇది మరింత పోటాపోటీగా ఉండనుంది. ఆ జట్టులో నాణ్యమైన అటాకింగ్ ఆటగాళ్లున్నారు. వారితో ప్రమాదమే. మేం కూడా మా శక్తిసామర్థ్యాల మేరకు ఆడగలిగితే విజయం సులభంగానే లభిస్తుంది. టోటెన్హామ్తో ఒప్పందం కుదుర్చుకున్నాక జట్టుకు కీలకంగా మారారు. మున్ముందు ఇదే జట్టుతో కొనసాగాలనుకుంటున్నారా? కొత్తగా ఏదైనా చేయడానికి ఇది మంచి చోటని భావిస్తున్నాను. ప్రపంచ అత్యుత్తమ మేనేజర్లలో ఒకరు మాతో ఉన్నారు. అలాగే త్వరలోనే మాకు కొత్త స్టేడియం రాబోతోంది. భవిష్యత్ చాలా బాగుండే అవకాశం ఉంది. ఈ క్లబ్‌కు ఆడుతున్నందుకు సంతోషంగా ఉన్నాను. అలాగే చాలా ఏళ్లపాటు ఇక్కడే ఆడాలని కోరుకుంటున్నాను. -
ప్రతీకారం తీర్చుకుంటాం
నెమాంజా మాటిక్ ఇంటర్వూ్ ఈ సీజన్‌కు ముందు అర్సెనల్ చేతిలో చెల్సీ జట్టు 0–3తో దారుణంగా ఓడింది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం చెల్సీకి దక్కింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో భాగంగా నేడు (శనివారం) ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే కచ్చితంగా మా స్థాయి ఆటతీరుతో వారికి బదులిస్తామని చెల్సీ మిడ్‌ఫీల్డర్ నెమాంజా మాటిక్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆ ఓటమి అనంతరం చెల్సీ జట్టు లీగ్‌లో ఇప్పటిదాకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోచ్ ఆంటోనియో కాంటే ఈ మ్యాచ్ కోసం వ్యూహాలు మారుస్తున్నారు. ఇక 2014లో చెల్సీ జట్టులో చేరిన 28 ఏళ్ల మాటిక్ మరోసారి తన మేజిక్‌ను ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అర్సెనల్‌పై బదులు తీర్చుకుని అప్పటి చేదు అనుభవాన్ని తుడిచేయాలని భావి స్తున్నాడు. అర్సెనల్‌పై ఇంతకుముందు ఓడటం జట్టుపై కీలక ప్రభావం చూపిందనుకుంటున్నారా? అవును అది నిజం. నిజంగా ఆ మ్యాచ్ ఫలితం మాలో చాలా మార్పును తీసుకువచ్చింది. మమ్మల్ని మరింత జాగ్రత్తగా ఆడేలా చేసిందనడంలో సందేహం లేదు. ఆ తర్వాత మా జట్టు వరుసగా 13 మ్యాచ్‌లు గెలిచింది. ఒక్కోసారి మనం స్పృహలోకి రావాలంటే ఇలాంటి ఓటమి ఎదురుకావాల్సిందే. మరోసారి అలాంటి పరాభవాలను దరిచేరనీయం. అసలు ఆ మ్యాచ్‌లో ఎలాంటి తప్పులు జరిగాయంటారు? వాస్తవానికి ఎవరైనా మ్యాచ్ ఓడిపోవచ్చు. అయితే ఆ ఓటమిని ఎలా తీసుకుంటారనేది ముఖ్యం. అర్సెనల్‌తో మేం మైదానంలో సరిగా స్పందించలేకపోయాం. అయితే నేటి మ్యాచ్ మాత్రం దీనికి విభిన్నంగా ఉండబోతోంది. ఇంత ప్రతిష్టాత్మకమైన క్లబ్ తరఫున ఆడుతూ 0–3తో ఓడటాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో జట్టు సభ్యులు ఉన్నారా? మీలో అసలు సత్తా ఏమిటో చూపించాలనుకుంటున్నారా? అవును. ఓ జట్టుగా మా స్థాయి ఏమిటో వారికి చూపించాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ మా సొంతగడ్డపై జరగబోతోంది. కచ్చితంగా గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఆ జట్టులోనూ నాణ్యమైన ఆటగాళ్లున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తారు. అయితే మేం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాం. అటు అభిమానులు కూడా ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తారని భావిస్తున్నాను. అర్సెనల్ తమ చివరి మ్యాచ్‌లో వాట్ఫోర్డ్ చేతిలో ఓడింది. ఇది మీకు అనుకూలిస్తుందను కుంటున్నారా? వారి ఓటమి మమ్మల్ని ఆనందపరిచింది. ఈ దశలో వారు పాయింట్లు కోల్పోతారని ఊహించలేదు. అయితే ఈ ప్రీమియర్ లీగ్‌లో ఏదైనా సాధ్యమే. ప్రతీ మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అర్సెనల్‌పై విజయం సాధిస్తే చెల్సీ జట్టు టైటిల్ రేసులో బాగా ముందుకెళుతుంది కదా? మాపై ఓడి వారు పాయింట్లు కోల్పోతే మంచిదే. ఎందుకంటే ఇంకా 15 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు మేం సీజన్ రెండో భాగంలో ఉన్నాం. ఇక్కడ ప్రతీ పాయింటు ముఖ్యమైనదే. మేం గెలిస్తే 12 పాయింట్ల ఆధిక్యంలో ఉంటాం. -
టైటిల్‌పై కాదు... మ్యాచ్‌లపైనే మా దృష్టి
గ్యారీ కాహిల్ ఇంటర్వూ్య చెల్సీ క్లబ్ కొత్త కెప్టెన్ గ్యారీ కాహిల్. 2012 నుంచి చెల్సీ చరిత్రలో భాగమైన అతను ఇప్పుడు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈపీఎల్ సహా ఎఫ్ఏ కప్, చాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ ట్రోఫీలు గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన గ్యారీ ఇప్పుడు మరో టైటిల్‌పై కన్నేశాడు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ ఉన్నపళంగా టైటిల్‌పై కాకుండా ముందుగా ఒక్కో మ్యాచ్‌పైనే తమ ఫోకస్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే... లీగ్ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉన్న మీరు లివర్‌పూల్‌పై గెలిచి ఆధిక్యాన్ని చాటుకుంటారా? అవును. ప్రస్తుత లక్ష్యమదే. మాకు ఈ మ్యాచ్‌కు ముందు చాలా విశ్రాంతి లభించింది. దీంతో తదుపరి మ్యాచ్‌లపై దృష్టి కేంద్రీకరించేందుకు సరైన సమయం దొరికింది. లివర్‌పూల్‌తో మ్యాచ్ తర్వాత సొంతగడ్డపై అర్సెనల్‌తో ఆడాల్సి ఉంది. దీంతో మాకు ఈ వారం చాలా కీలకమైంది. ఇప్పటికే రేసులో ఉన్న మీరు టైటిల్‌పై ఆశలుపెట్టుకున్నారా? ఇప్పుడైతే మీరే ఈ టోర్నీలో పెద్ద ఫేవరెట్ కదా? అలా ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పటికిప్పుడు మేం గ్రౌండ్లో మ్యాచ్‌లపైనే ఫోకస్ పెట్టాం తప్ప టైటిల్‌పై కాదు. మైదానంలో చెమటోడ్చడం ఆశించిన ఫలితాన్ని సాధించడమే మా ముందున్న లక్ష్యాలు. ముఖ్యంగా లివర్‌పూల్‌తో మ్యాచ్ అంత ఆషామాషీ కాదు. గట్టిపోటీ తప్పదనే అనుకుంటున్నా. మాకు గతంలో అక్కడ పెను సవాళ్లే ఎదురయ్యాయి. గతవారం లివర్‌పూల్... స్వాన్సీ చేతిలో ఓడింది. మాంచెస్టర్, స్పర్స్ మ్యాచ్ డ్రా అయింది. ఇలాంటి తరుణంలో మీరి మ్యాచ్ గెలిస్తే మీకు తిరుగే లేదేమో? నిజమే. ఇలాంటి ఫలితాలు జట్టుకు కలిసొస్తాయి. వీటిని అనుకూలంగా మలుచుకొని పైచేయి కొనసాగిస్తే చెప్పేదేముంటుంది. అయితే ఇది ఒక వారంతో ముగిసే ప్రక్రియ కాదు. నెలలకొద్దీ సాగే ఈ టోర్నీలో ఏవైనా జరగొచ్చు. మంచి ఫలితాలొస్తే ఎవరికైనా సంతోషమే. ఇది ఇలాగే కొనసాగాలని మాత్రం ఆశిద్దాం. మాజీ సారథి జాన్ టెర్రీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన మీరు బాధ్యతలకు సిద్ధమేనా? ఇలాంటి మేటి జట్టుకు కెప్టెన్ కావడం గర్వంగా ఉంది. కొన్నేళ్ల పాటు జాన్ టెర్రీ జట్టు కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమయ్యాడు. అతని వారసుడిగా జట్టును సమర్థంగా నడిపిస్తాననే విశ్వాసంతో ఉన్నాను. -
అగ్రస్థానంలోకి దూసుకొస్తాం
ఎరిక్సన్ ఇంటర్వ్యూ డానిష్ స్టార్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సన్ . ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో టాటెన్ హామ్ హాట్స్పర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సాకర్ స్టార్... ఈ సీజన్ ట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అజేయమైన చెల్సీకి బ్రేకులేసిన టాటెన్ హామ్ ఇప్పుడు తదుపరి పోరులో మాంచెస్టర్ సిటీతో సమరానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో ఎరిక్సన్ తమ జట్టు విశేషాల్ని ఇలా చెప్పుకొచ్చాడు. జోరుమీదున్న చెల్సీకి షాకిచ్చారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో మాంచెస్టర్ సిటీని ఓడిస్తారా? మేం ప్రతి మ్యాచ్‌లో బాగా ఆడుతున్నాం. దీంతో మా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది. చెల్సీపై ఫలితం చెప్పుకోదగింది. కానీ ఇక్కడితో ఆగం. తదుపరి మ్యాచ్‌లో 4–0తో గెలవాలనే లక్ష్యంతో ఉన్నాం. కాబట్టి మా జోరు కొనసాగిస్తాం. టాటెన్ హామ్ టైటిల్ అవకాశాలెలా ఉన్నాయి? ఇప్పుడే చెబితే తొందరపాటవుతుంది. ఈ సీజన్ లో ఇంకా ఆడాల్సింది ఎంతో ఉంది. అయితే మా ప్రయాణం సానుకూలంగా సాగుతోందని చెప్పగలను. మా వాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరే సత్తా మా జట్టుకు వుంది. అయితే త్వరలో చెల్సీని అధిగమిస్తారా? వారిపై గెలిచిన మీరు టైటిల్ రేసులో ఉన్నారనే అనుకుంటున్నారా? అధిగమిస్తామనే ఆశిస్తున్నా. కానీ వారు బాగా ఆడుతున్నారు. ఎట్టకేలకు ఈ సీజన్ లో మా జోరుతో వారి జైత్రయాత్రకు బ్రేకులేశాం. దీంతో ఎవరైనా సరే చెల్సీని ఓడించేయొచ్చని మిగతా జట్లు తెలుసుకునేలా చేశాం. వారి మైండ్‌సెట్‌ను మార్చాం. ఇప్పటికైతే మేం మెరుగైన స్థానంలోనే ఉన్నాం. ఇలాగే మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆరు గోల్స్ చేసిన మీరు వ్యక్తిగతంగా మీ ఫామ్‌పై సంతృప్తితో ఉన్నారా? నిజానికి నేను మరిన్ని గోల్స్ చేయాల్సింది. అయితే మిగతా వాళ్లూ గోల్స్ చేయడానికి సహాయ పాత్ర పోషించినందుకు సంతోషంగానే ఉంది. మా జట్టు విజయాలకు సమష్టిగా కష్టపడినందుకు సంతృప్తిగా ఉంది. -
మా జోరును ఆపలేరు
డేవిడ్ లూయిజ్ ఫుట్‌బాల్‌కు సంబంధించి డేవిడ్ లూయిజ్ ఖాతాలో ఎన్ని టైటిళ్లు ఉన్నా ఇప్పటిదాకా ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) మాత్రం అందుకోలేకపోయాడు. చెల్సీకి ఆడుతున్న ఈ బ్రెజిల్ డిఫెండర్ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. వరుసగా 13 విజయాలు సాధించిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో ‘టాప్’లో ఉంది. అయితే గత వారం టాటెన్హామ్ చేతిలో తొలి ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) డిఫెండింగ్ చాంపియన్ లీస్టర్ సిటీతో తలపడనుంది. మరోసారి విజయాల బాట పట్టడం ఖాయమని లూయిజ్ భావిస్తున్నాడు. చెల్సీ వరుస విజయాల రికార్డుకు టాటెన్హామ్ అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు లీస్టర్తో మ్యాచ్‌కు ముందు అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జనవరి మాత్రమే. ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో మే నెలకు ప్రాధాన్యం ఉంటుంది. ఫిబ్రవరి, మార్చిలో ఎవరూ టైటిల్ గెలవగా నేను చూడలేదు. ఇప్పటికైతే మేం చాలా బాగా ఆడుతున్నాం. మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మా జోరును ఆపలేరు. తిరిగి విజయాల బాట పట్టేందుకు చెల్సీ ఏం చేయాల్సి ఉంటుంది? ఇందులో మార్చుకోవాల్సిందేమీ లేదు. పట్టికలో మేమే టాప్‌లో ఉన్నాం. ఇప్పటిదాకా మేమంతా ఎలాంటి దృక్పథంతో ఆడామో అలాగే ముందుకెళ్లాల్సి ఉంది. లీగ్‌లో ప్రతీ మ్యాచ్ విభిన్నమైందే కాకుండా కఠినంగానూ ఉంటుంది. ఇప్పటిదాకా టాప్‌లో ఉన్నా మీకు ఎదురైన తొలి ఓటమితో ఇతర జట్లు కూడా టైటిల్ రేసులోకి వచ్చాయని భావించాలా? టాటెన్హామ్ కూడా పోటీలో ఉందంటారా? కచ్చితంగా. సీజన్ ఆరంభం నుంచే వారిని నేను ప్రత్యర్థిగా భావిస్తున్నాను. అయితే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎవరైనా పోటీలోకి రావచ్చు. చాలామంది చెల్సీయే టైటిల్ ఫేవరెట్ అని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు గత సీజన్ చాంపియన్‌ను ఎదుర్కొనబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? టైటిల్ గెలవడం అంత సులువు కాదు. ఇంటా, బయటా ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా కఠినంగానే సాగుతాయి. ఇప్పుడే టైటిల్ గురించి మాట్లాడుకోవడం తొందరపాటే. ప్రతీ రోజు కష్టపడి ప్రాక్టీస్ కొనసాగిస్తుండాలి. అయితే కచ్చితంగా ఈసారి చాంపియన్ కావాలని కోరుకుంటున్నాను. -
రికార్డు విజయం ఖాయం
థియాబౌట్ ఇంటర్వూ్య ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) తాజా సీజన్లో చెల్సీ గోల్ కీపర్ థియాబౌట్ కౌర్టియస్ తన కెరీర్లోనే అత్యంత భీకర ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ప్రత్యర్థుల గోల్స్ ప్రయత్నాలకు అడ్డుగోడలా నిలవడంతోపాటు 13 వరుస విజయాల రికార్డును తమ జట్టు సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెల్సీ గురువారం టాటెన్‌హామ్‌తో పోటీపడనుంది. ఈ నేపథ్యంలో చెల్సీకి మరో విజయం ఖాయమని కౌర్టియస్ భావిస్తున్నాడు. ఆరంభంలో కాస్త కష్టపడినా ప్రస్తుతం మీ జట్టు విజయపథంలో దూసుకెళుతోంది. ఈ అద్భుత ప్రయాణం ఎలా అనిపిస్తోంది? మేం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం అంతా బాగానే సాగుతోంది. పాయింట్ల పరంగానూ మేం టాప్‌లో ఉన్నాం. అయితే మేమింకా సహనంతో ఉండడంతో పాటు కష్టపడాల్సిందే. టాటెన్‌హామ్‌తో పోటీ అంత సులువేమీ కాదు. ఆ తర్వాత మా మ్యాచ్ లీస్టర్తో ఉంటుంది. రెండూ కఠిన జట్లే. కచ్చితంగా చెల్సీ అప్రమత్తంగా ఉండాల్సిందే. గతేడాదిలో మీ జట్టు ఈపీఎల్ టైటిల్ గెలవడం అందరికీ అసాధ్యంగా అనిపించింది. ఇప్పుడు మీరే ఫేవరెట్లుగా ఉన్నారు. దీన్ని ఎలా అంచనా వేస్తారు? 2015–16 సీజన్ మాకు నిరాశ కలిగించింది. అయితే తాజా విజయాలతో మేం ఇప్పుడు మెరుగ్గా ఉన్నాం. అప్పటి పాయింట్లతో పోలిస్తే ఇప్పుడు మేం చాలా సాధించి టాప్‌లో ఉన్నాం. కానీ ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా పోరాడాల్సి ఉంది. చెల్సీ వరుసగా 13 విజయాలతో దూసుకెళుతోంది. ఈ సమయంలో ప్రత్యర్థులకు మీరు నాలుగు గోల్స్ మాత్రమే ఇవ్వగలిగారు. ఎలా అనిపిస్తోంది? నిజంగా ఇది అద్భుతమే. శిక్షణ సమయంలో మేం పడిన కఠిన శ్రమకు ఫలితమిది. కచ్చితంగా మేం మరింత పటిష్టంగా ప్రత్యర్థి జట్లకు పోటీనిస్తాము. జట్టులో నెలకొన్న మంచి వాతావరణం వల్లే ఇది సాధ్యమైంది.. -
కష్టపడితే టైటిల్ గెలుస్తాం
జ్లాటన్ ఇబ్రహిమోవిచ్ ఇంటర్వూ్య మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహిమోవిచ్. స్వీడన్‌కు చెందిన ఈ ఆటగాడు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో విశేషంగా రాణిస్తున్నాడు. 26 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేసిన ఇబ్రహిమోవిచ్ వయస్సు 35 అయినా తన దూకుడుకు 20 ఏళ్లే అంటున్నాడు. తన దృష్టిలో వయస్సనేది కేవలం ఒక అంకెననీ... దాని గురించి బెంగే లేదన్నాడు. ఫిట్‌గా ఉంటే తను 50 ఏళ్లయినా ఆడగలనని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో 26 మ్యాచ్‌లాడిన మీరు కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవచ్చుగా? నాకెందుకు విశ్రాంతి. నేనొచ్చిందే ఆడేందుకు. నేనిప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిలా తాజాగా మైదానంలోకి దిగుతున్నాను. ఈ ఫిట్నెస్నే ఇకముందు కొనసాగించాలని... మరిన్ని మ్యాచ్లాడాలని ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తున్నాను. గతేడాది (2016) మీ ప్రదర్శన బాగుంది. ఈపీఎల్ సహా ఇతర టోర్నీలు కలిపి చూస్తే ఇప్పటికే 50 గోల్స్ చేశారు. ఇదే జోరు కొనసాగిస్తారా? నిజమే. నా ఆటతీరుపట్ల సంతృప్తిగానే ఉంది. కానీ గోల్స్ ఒక్కటే నా లక్ష్యం కాదు. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తాను. జట్టు ట్రోఫీ గెలిచేందుకు ఎలాంటి పాత్రయినా పోషిస్తాను. ఎందుకంటే ఒక ఆటగాడు గోల్స్పైనే దృష్టిపెట్టాడంటే తనొక్కడే ఫోకస్ కావాలని లక్ష్యం అందులో కనిపిస్తుంది. కానీ నేను మాత్రం అలా కాదు. కొత్త ఏడాదిలో మీరేమైనా లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? ఈ ఏడాది నేను మైదానంలో మరింత మెరుగైన సహాయక పాత్ర పోషించాలనుకుంటున్నాను. సహచరులు గోల్స్ చేసేందుకు చురుగ్గా స్పందించేందుకు కసరత్తు చేస్తున్నాను. గోల్‌పోస్టే లక్ష్యంగా బంతిని వేగంగా పాస్ చేయడం ద్వారా సహచరుల స్కోరింగ్ కూడా పెరుగుతుంది. మీరు టైటిల్ రేసులో ఉన్నారా? కష్టపడితే రేసులోకి వస్తాం. ముందుగా మేం బాగా ఆడాలి. అలాగే ప్రత్యర్థి జట్లు పొరపాట్లు చేస్తే వాటి నుంచి లబ్దిపొందే అవకాశాలను మెరుగుపర్చుకుంటేనే మళ్లీ గాడిన పడతాం. అంతిమంగా... నా జట్టుకు టైటిల్ అందించడమే నా లక్ష్యం.