freedom 251
-
‘ఫ్రీడం 251’ మోహిత్ గోయల్ మళ్లీ అరెస్ట్
నాలుగేళ్ల క్రితం డెడ్ చీప్‌గా స్మార్ట్‌ఫోన్ అందిస్తానంటూ ప్రకటన చేసిన మోహిత్ గోయల్ గుర్తున్నాడా? దేశం మొత్తం కుదిపేసిన ‘ఫ్రీడం 251 ఫోన్’ స్కాం ప్రధాన నిందితుడైన ఈ మోహిత్‌ను ఇప్పుడు పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని 41 లక్షలకు ముంచడంతో పాటు చంపేందుకు ప్రయత్నించిన నేరారోపణలపై గ్రేటర్ నోయిడా పోలీసులు మోహిత్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గోయల్‌తో పాటు మరో ఐదుగురిపైనా 41 లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీల మోసంపై ఇందిరాపురం చెందిన వికాస్ మిట్టల్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం గ్రేటర్ నోయిడాలోని గోయోల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ అమ్మకాలకు సంబంధించిన వ్యహారంలో మోసం చేయడమే కాకుండా.. డబ్బుల గురించి నిలదీస్తే చంపేస్తానని వికాస్‌ను చెదిరించాడు గోయల్. అంతేకాదు కారుతో ఢీ కొట్టి చంపేందుకు ప్రయత్నించాడని వికాస్ ఆరోపిస్తున్నాడు. దీంతో వికాస్ ఫిర్యాదు మేరకు మోహిత్ గోయల్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మోసం, దోపిడీ, చంపేస్తానని బెదిరించడం, గాయపర్చడం.. ఇలా పలు నేరాలకుగానూ ఐపీసీ సెక్షన్లతో మోహిత్‌పై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే 2017లో రింగింగ్ బెల్ అనే కంపెనీ ద్వారా ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ల అమ్మకం ప్రకటన ద్వారా సంచలనానికి తెరలేపిన మోహిత్.. భారీ స్కామ్‌తో వార్తల్లోకి ఎక్కి అరెస్టైన విషయం తెలిసిందే. ఆపై దుబాయ్ డ్రై ఫఫ్రూట్స్ అండ్ స్పైసిస్ పేరుతో ఓ ఆఫీస్ తెరిచి.. సుమారు 200 కోట్ల స్కాంకు పాల్పడ్డాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ డ్రై ఫ్రూట్స్ వ్యవహారంలో పలు రాష్ట్రాల నుంచి అతనిపై 35 కేసులు నమోదు అయ్యాయి. చదవండి: సిండికేట్ బ్యాంక్‌లో మోసం కేసులో సీబీఐ చార్జ్‌షీట్ -
'ఫ్రీడం 251' డైరెక్టర్‌పై చీటింగ్ కేసు
స్మార్ట్ఫోన్లను కేవలం రూ. 251కే ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి, అనేక మందితో డబ్బులు కట్టించుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అతడిని పోలీసులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు. రింగింగ్ బెల్స్ సంస్థ తమను రూ. 16 లక్షల మేర మోసం చేసిందంటూ అయామ్ ఎంటర్ప్రైజెస్ అనే ఘజియాబాద్ సంస్థ ఫిర్యాదు చేయడంతో గోయల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై విచారించేందుకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఘజియాబాద్ డిప్యూటీ ఎస్పీ మనీష్ మిశ్రా తెలిపారు. 2015 నవంబర్ నెలలో గోయల్, ఇతరులు కలిసి ఫ్రీడమ్ 251 ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాల్సిందిగా తమను కోరారని అయామ్ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఇందుకుగాను ఆర్టీజీఎస్ ద్వారా తాము రూ. 30 లక్షలు చెల్లించామని, ఆకనీ ఇప్పటివరకు కేవలం రూ. 13 లక్షల విలువైన ఫోన్లు మాత్రమే వచ్చాయని చెప్పింది. ఆ తర్వాత ఎంతగా ఫాలో అప్ చేసినా కేవలం రూ. 14 లక్షల విలువైన డబ్బు, ఫోన్లు మాత్రమే అందాయన్నారు. మిగిలిన 16 లక్షల రూపాయల గురించి పదే పదే అడిగితే చంపేస్తామని కూడా తమను బెదిరించినట్లు అయామ్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్న రింగింగ్ బెల్స్ సంస్థ గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి వెబ్సైట్ ద్వారా బుకింగులు మొదలుపెట్టింది. దాదాపు ఏడు కోట్ల మంది వరకు ఆ ఫోన్ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఫోన్లు వచ్చింది మాత్రం చాలా తక్కువ మందికే కావడంతో చాలామంది కంపెనీపై అనుమానాలు వ్యక్తం చేశారు. -
రింగింగ్ బెల్స్ కథ ఇక కంచికేనా?
నోయిడా: ప్రపంచంలో అతి చవకైన ఫోన్ అంటూ ప్రకంపనలు పుట్టించిన రింగింగ్ బెల్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. రూ.251కే ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ అంటూ దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిన సంస్థ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ మోహిత్ గోయల్ సంస్థ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అన్నదమ్ములు మోహిత్, అన్మోల్ మధ్య ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో మోహిత్ తో పాటు సంస్థ సీఈవో, మోహిత్ భార్య ధార్న గోయల్ కూడా సంస్థకు రాజీనామా చేశారు. దీంతో 2016 ఆరంభంలో(ఫిబ్రవరి)లో అలజడి రేపిన రింగింగ్ బెల్స్ కథ 2016 తో పాటే ముగిసిపోనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం రింగింగ్ బెల్స్‌కు మరో డైరెక్టర్ , మోహిత్ సోదరుడు అన్మోల్ కంపెనీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అశోక్ చడ్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు తెలిపింది. తమ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని అన్మోల వెల్లడించారు. తమ స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ తెలిపారు. మరోవైపు కంపెనీ నుంచి బయటకు వచ్చిన మోహిత్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక నూతన సంస్థను ప్రారంభించ బోతున్నట్టు సమాచారం. కాగా అతి చవగ్గా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు రింగింగ్ బెల్స్ ప్రకటించడంతో దాదాపు ఏడుకోట్లకు పైగా ఈ మొబైల్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఏకంగా కంపెనీ అధికారిక వెబ్ సైట్ కూడా క్రాష్ అయింది. అనంతరం సీబీఐ దాడులు,ఆందోళన తదితర పరిణామాలు తెలిసిన విషయాలే. అయితే బుక్ చేసుకున్నవాళ్లల్లో ఎంతమందికి ఈ ఫోన్లను అందించిందీ స్పష్టత లేదు. -
251 ఫోను పర్వాలేదట!
ఈ రోజుల్లో 251 రూపాయలు పెడితే ఏమొస్తుంది.. మహా అయితే మల్టీప్లెక్స్‌లలో ఓ సినిమా చూసి, ఇంటర్వెల్లో కొంచెం పాప్ కార్న్ తిని రావచ్చు అంతే. కానీ ఆ ధరలో స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారంటే.. అసలు అందులో ఏముందో, ఎలా పనిచేస్తోందో అనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదూ. ఇప్పటికే దాదాపు 5వేల ఫోన్లను డెలివరీ చేశారు కాబట్టి వాటి పనితీరు ఎలా ఉందన్న విశ్లేషణలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉంది. 4 అంగుళాల డిస్ప్లే, 3.2 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రస్తుతం అంతా 13 మెగాపిక్సెళ్ల వెనక కెమెరా, 5 మెగాపిక్సెల్ వరకు ఫ్రంట్ కెమెరాల యుగం నడుస్తుండటంతో.. కెమెరా విషయంలో కొంత అసంతృప్తి తప్పదు. కానీ, ఫోన్ మాత్రం బాగానే పనిచేస్తోంది. ఇందులో 1 జీబీ ర్యామ్ ఉంది, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజికి 8 జిబి స్పేస్ ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్. వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో లాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ఫోనుకు సమీపంలో ఏవైనా విద్యుదయస్కాంత క్షేత్రాలు ఉన్నాయేమో గమనించేందుకు ప్రాగ్జిమిటీ సెన్సర్ ఒకటి ఉంది. అలాగే కీప్యాడ్ లాక్ చేసి ఉన్నప్పుడు దాన్ని అన్‌లాక్ చేయాలంటే పవర్ బటన్ ఒత్తాల్సిన అవసరం లేదు.. స్క్రీన్ మీద వేలు ఆడిస్తే చాలు.. పాస్వర్డ్ అడుగుతుంది. వాట్సప్ కాలింగ్, మెసేజిలు, పాటలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ లాంటివన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఫోను వేడెక్కడం కూడా లేదు. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే ఒకటిన్నర రోజుల పాటు ఉంటోంది. ఆటోమేటిగ్గా హిందీలోకి.. అయితే ఇందులో ఓ చమక్కు కూడా కనిపిస్తోంది. బ్యాటరీ లో అయినప్పుడు టెక్స్ట్ సెట్టింగులు ఆటోమేటిగ్గా హిందీలోకి మారిపోతున్నాయి. వాటిని మనం మళ్లీ వెతుక్కుని ఇంగ్లీషులోకి మార్చుకోవాల్సి వస్తోంది. బహుశా రాబోయే ఫోన్లలో దీన్ని సరిచేస్తారేమో చూడాలి. మిగిలిన అన్న విషయాలు చూస్తే మాత్రం 251 రూపాయల ధరలో ఈమాత్రం స్మార్ట్ ఫోనురావడం ఎక్కువేనంటున్నారు. -
రెండోవిడత ఫ్రీడమ్ ఫోన్ లక్కీ కస్టమర్లు ఎవరో..?
ఎన్నో వాయిదాల పర్వం అనంతరం తొలి విడతగా 5000 యూనిట్ల ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్లను డెలివరీ చేసిన రింగింగ్ బెల్స్ సంస్థ, మరిన్ని స్మార్ట్ఫోన్ల పంపిణీ చేపట్టిందట. ఈ పంపిణీని లాటరీ నుంచి ఎంపికచేసిన వినియోగదారులకు అందిస్తోందట. అయితే ఈ విడతలో అందుకోబోతున్న లక్కీ కస్టమర్లు ఎవరో అన్ని వినియోగదారుల్లో ఆతృత చోటుచేసుకుంది. లాటరీ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రర్ వినియోగదారులను ఎంపికచేసి, రెండోవిడతగా మరో 65వేల ఫ్రీడమ్ 251 స్మార్ట్ఫోన్ల డెలివరీ ప్రారంభించామని రింగింగ్ బెల్స్ సోమవారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, న్యూఢిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖాండ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ డెలివరీ చేపట్టినట్టు వెల్లడించింది. బడా బడా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు షాకిస్తూ ఎవరూ ఊహించినంతగా కేవలం 251 రూపాయలకే ఫ్రీడమ్ స్మార్ట్‌ఫోన్‌ను రింగింగ్ బెల్స్ విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ధరకు స్మార్ట్‌ఫోన్ వస్తుండటంతో, ఒక్కసారిగా ఈ ఫోన్‌కు 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తాయి. చాలా రోజులు ఊరిస్తూ వచ్చిన రింగింగ్ బెల్స్ ఆఖరికి గత నెలలో మొదటి డెలివరీ కింద 5000 స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. తాజాగా మరో 65వేల యూనిట్ల డెలివరీతో, మొత్తం షిప్పిమెంట్ను 70వేలకు చేర్చుకోనుంది. కొన్ని రోజుల కిందట లాటరీ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రర్ వినియోగదారులను ఎంపికచేశామని, ప్రస్తుతం వారికి ఈ ఫోన్లను డెలివరీ చేస్తున్నామని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. తక్కువ ధరకు క్వాలిటీ ఫోన్‌ను అందించడంపై కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. వారి సంతృప్తికరమైన స్పందన తమకు అపారమైన ఆనందాన్ని చేకూర్చిందన్నారు. కనీసం రెండు లక్షల రిజిస్ట్రర్ యూజర్లకు ఈ ఫోన్లను డెలివరీ చేయాలనుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది. మరో రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను, నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను, 31.5 ఎల్ఈడీ టీవీని రింగింగ్ బెల్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
రూ.251 ఫోన్లను పంపేస్తున్నాం
ఎప్పటినుంచో ఊరిస్తున్న ఫ్రీడమ్ 251 ఫోన్లు ఎట్టకేలకు వినియోగదారుల చెంతకు చేరబోతున్నాయి. మొదటి విడతగా మొత్తం 2,240 ఫోన్లను పంపినట్లు నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ సంస్థ తెలిపింది. పశ్చిమబెంగాల్ వినియోగదారులకు మొత్తం 540 ఫోన్లు, హర్యానాకు 390 యూనిట్లు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 605, బిహార్‌కు 484, ఉత్తరాఖండ్‌కు 221 ఫోన్లను పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో ఇస్తామన్న మొత్తం 5వేల ఫోన్లలో మిగిలినవాటిని శనివారం పంపుతామని చెప్పారు. ఫోన్లు అందుకున్నవాళ్లు మొత్తం రూ. 291 చెల్లించాలని, అందులో ఫోను ఖరీదు రూ. 251 కాగా, మిగిలిన 40 రూపాయలు డెలివరీ చార్జి అని కంపెనీ సీఈవో మోహిత్ గోయల్ తెలిపారు. ఈ ఫోన్ల కోసం మొత్తం 7.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, లాటరీ ద్వారా మొదటి బ్యాచ్ వినియోగదారులను ఎంపిక చేశామని అన్నారు. 31.5 అంగుళాల ఎల్ఈడీ టీవీని, నాలుగు ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను కూడా రింగింగ్ బెల్స్ సంస్థ ఆవిష్కరించింది. ఫ్రీడమ్ 251 ఫోన్ల తయారీకి మొత్తం రూ. 1180 ఖర్చవుతుందని, అందులో రూ. 700-800 వరకు యాప్ డెవలపర్ల నుంచి తీసుకుంటున్నామని గోయల్ తెలిపారు. 251 రూపాయలకు ఫోన్ అమ్మినా, ఇంకా ఒక్కో సెట్ మీద రూ. 180 నుంచి 270 వరకు నష్టం వస్తుందని చెప్పారు. -
రూ. 251 ఫోన్లాగే.. చవగ్గా టీవీ ఇస్తాం!
ఫ్రీడమ్ 251.. ఈ పేరుతో అత్యంత చవగ్గా కేవలం 251 రూపాయలకే ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తామంటూ ఊదరగొట్టిన రింగింగ్ బెల్స్ సంస్థ ఇప్పటివరకు ఆ ఫోన్లనయితే డెలివరీ చేయలేదు గానీ, అప్పుడే మరో సంచలన ప్రకటన మాత్రం చేసింది. ఎల్ఈడీ స్క్రీన్, హెచ్డీ రిజల్యూషన్‌తో ఇంతవరకు ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఫ్రీడమ్ టీవీని గురువారం ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు బుధవారమే ఫ్రీడమ్ 251 ఫోన్లు అందాల్సి ఉంది. కానీ అది మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. ఇదే అంశంపై గురువారం నాడు కంపెనీ ఎండీ మోహిత్ గోయల్ ఓ ప్రకటన కూడా చేస్తారని రింగింగ్ బెల్స్ తెలిపింది. 251 రూపాయలకు ఫోన్ ఇస్తామన్నవాళ్లు ఇక టీవీని మరెంత తక్కువ ధరకు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఫోన్ ఇవ్వడానికే ఇంత ఆలస్యం చేసి.. ఇన్ని వాయిదాలు వేసినవాళ్లు ఇక టీవీలు అందించడానికి ఇంకెంత ఆలస్యం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. మరొక్క రోజు ఆగితే ఫ్రీడమ్ టీవీల విషయం కూడా తెలిసిపోతుంది. -
మళ్లీ నిరాశపర్చిన ఫ్రీడమ్ 251
న్యూఢిల్లీ: 251కే స్మార్ట్‌ఫోన్ అంటూ.. ఫోన్ లవర్స్ ను ఊరించిన ఫ్రీడం ఫోన్ల పంపిణీ మరోసారి వాయిదా పడింది. అనేక వివాదాల నేపథ్యంలో ఈ స్మార్ట ఫోన్ ఇప్పటివరకు వినియోగదారుల చేతికి రాలేదు. జూన్ 30నుంచి పంపిణీకి సర్వం సిద్ధమని చెప్పుకొంటూ వచ్చిన రింగింగ్ బెల్స్ మరోసారి నిరాశ పర్చింది. ఫోన్ల డెలివరీ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా వేసి జులై 7నుంచి ఫోన్లు డెలివరీ చేయనున్నట్లు రింగింగ్‌బెల్స్ ప్రకటించింది. బ్యాటరీ సమస్యల వల్ల డెలివరీ ఆలస్యమైందని రింగింగ్‌బెల్స్ సీఈవో, వ్యవస్థాపకుడు మోహిత్ గోయల్ వివరణ ఇచ్చారు. జులై 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. జులై 7న ఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసి.. డెలివరీని ప్రారంభిస్తామని గోయల్ తెలిపారు. అంతేగాక.. అమ్మకాలు ప్రారంభించే ముందుగా ప్రధాని నరేంద్రమోదీని కలిసి తమ ఫోన్లకు మద్దతివ్వాల్సిందిగా కోరనున్నట్లు మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా తమకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరనున్నామని... ప్రధానితో సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను పంపామని గోయల్ తెలిపారు. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రావడంతో లక్కీ డ్రా పద్ధతి ద్వారా కొనుగోలు దారులను ఎంపికచేయనున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో జూన్ 30 నుంచి జులై 5 వరకు లక్కీ డ్రా నిర్వహించి.. ఫ్రీడం ఫోన్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే.. అత్యధికంగా 2కోట్ల రిజిస్ట్రేషన్లు రాగా.. ఆ రాష్ట్రానికి 10వేల ఫోన్లను కేటాయించినట్లు తెలిపారు. కాగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ అందిస్తామని నోయిడాకు చెందిన రింగింగ్‌బెల్స్ సంస్థ ప్రకటించింది. విషయం తెలిసిందే. ఫ్రీడమ్ 251 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్లపై అప్పట్లో పెద్ద దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. -
ఫ్రీడం రూ.251 ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
ముంబై: అతి చవకగా...రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ ఇటీవల సంచలనానికి తెరతీసిన రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవహారం గుర్తుందా. కోట్లాదిమంది ఎగబడి మరీ తమ పేర్లను నమోదు చేసుకున్న ఈ వివాదా స్పద ఫోన్లు ఎట్టకేలకు వినియోగదారులను మురిపించేందుకు రడీ అవుతున్నాయి. ఈ నెలలోనే ఆయా ఫోన్లను అందించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. జూన్ 28వ తేదీ నుంచి తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని కంపెనీ డైరెక్టర్ మొహిత్ గోయల్ సోమవారం ప్రకటించారు. తమ ఫ్రీడం ఫోన్ల కోసం దాదాపు ఏడు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 30వేలమంది కాఫ్ ఆన్ డెలివరీ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. రూ.251కే స్మార్ట్‌ఫోన్ అందజేస్తానని ప్రకటించి ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో చేసిన సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా ప్రపంచంలోనే అతి చౌకగా ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ల విక్రయానికి గత ఫిబ్రవరిలో కంపెనీ ఆన్లైన్లో బుకింగ్‌కు ప్రకటన ఇచ్చింది. రూ.2,500 విలువైన స్మార్ట్ ఫోన్‌ను రూ.251కే అందిస్తున్నాని తెలిపింది. దీంతో ఫోన్ లవర్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. కుప్పలు తెప్పలుగా నమోదు చేసుకోవడం, తదనంతర పరిణామాలు వివాదానికి దారి తీశాయి. చివరికి టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోక్యం చేసుకుని ఐటి శాఖను కల్పించుకోవాల్సిందిగా కోరారు. ఐటి దాడులు జరిగాయి. అనేక విమర్శలు కూడా వెల్లువెత్తడంతో పాటు కంపెనీ పైన కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరి మరోసారి వివాదానికి తెర తీస్తుందా.. లేక వినియోగదారులను ఆకట్టుకుని మరో సంలచనానికి దారితీస్తుందా? వేచి చూడాల్సిందే. -
ఫ్రీడమ్ 251 తయారీదారులకు ఊరట!
అలహాబాద్: ఫ్రీడమ్ 251 మొబైల్ తయారీదారులకు శుక్రవారం అలహాబాద్ హై కోర్టులో ఊరట లభించింది. ఫ్రీడమ్ 251 మొబైల్ తయారీ సంస్థ.. రింగింగ్ బెల్స్ ప్రతినిధులపై నమోదైన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అప్రస్తుతమని అని తెలిపింది. రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్, కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్దాపై భారతీయ జనతా పార్టీకి చెందిన కిరిట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చిలో దాఖలైన ఎఫ్ఐఆర్లో 420 సెక్షన్‌ను నమోదు చేశారు. అయితే వీరిపై సెక్షన్ 420 నమోదు చేయడానికి గల కారణాలు తెలపాలని కోర్టు కోరింది. దీనిపై ప్రాసిక్యూషన్ వివరణతో సంతృప్తి చెందని కోర్టు.. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్లు తమ పాస్‌పోర్టులను తిరిగి పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించింది. కోర్టు తీర్పుతో సంతృప్తిగా ఉన్నామని రింగింగ్ బెల్స్ సంస్థకు చెందిన అభిషేక్ విక్రమ్ వెల్లడించారు. సంస్థ ఉత్పత్తులను ఆలస్యం చేయాలనే దురుద్దేశంతోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కంపెనీకి సంబంధించిన ఇతర ఉత్పత్తులను ఇప్పటికే 28,000 యూనిట్లను అమ్మినట్లు ఆయన తెలిపారు. 251 రూపాయలకే కస్టమర్లకు స్మార్ట్ ఫోన్‌ను అందించడానికి భిన్న వ్యూహాలతో కంపెనీ ముందుకు పోతుందని వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని విక్రమ్ తెలిపారు. -
ఫ్రీడం 251:రింగింగ్ బెల్స్ ఆఫీస్ క్లోజ్!
న్యూ ఢిల్లీ: ఫ్రీడమ్ 251 పేరుతో ఇండియాలో అత్యంత చౌకయిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలకు ఆర్డర్లు తీసుకున్న తయారీ సంస్థ రింగింగ్ బెల్స్‌కు సంబంధించిన నోయిడా కార్యాలయం బుధవారం మూసివేసి ఉన్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఆఫీస్‌కు సంబంధించిన అద్దెను చెల్లించడంలో విఫలమైనందున ఆ కార్యాలయానికి తాళాలు పడినట్లు తెలుస్తోంది. అయితే రింగింగ్ బెల్స్ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా మాత్రం తాము పూర్తి స్థాయిలో వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని, ఎక్కడికి పారిపోవడం లేదని వెల్లడించారు. రింగింగ్ బెల్స్ సంస్థ సీఈవో మోహిత్ గోయల్‌ను ఫ్రీడమ్ 251 మొబైల్ ధరను గురించి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. మొబైల్ల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న కస్టమర్ల డబ్బు విషయంలోనూ ఈడీ విచారణ చేపట్టినట్లు సమాచారం. దిగ్గజ సంస్థలకు సైతం సాధ్యం కానటువంటి అత్యంత చౌకయిన ధరకు స్మార్ట్ మొబైల్‌ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ముందుకు రావడంతో ఈ సంస్థపై ఇప్పటికే ప్రజల్లో పలు అనుమానాలున్న నేపథ్యంలో ఆఫీసును మూసేశారన్న వార్తలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. -
రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి..
న్యూఢిల్లీ: చౌక స్మార్ట్‌ఫోన్ (రూ.251) ఫ్రీడమ్‌పై వివాదాల నేపథ్యంలో.. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డబ్బును వాపసు చేస్తానని ప్రకటించిన తయారీ సంస్థ మంగళవారం నుంచి ఆ పనిని మొదలుపెట్టింది. సదరు ఫోన్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్.. తన వెబ్ సైట్ ద్వారా చెల్లింపులు చేస్తోంది. రూ.251 స్మార్ట్ ఫోన్ కోసం ముందుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న 30,000 మందికి నగదు తిరిగి ఇచ్చేస్తామన్న తయారీ కంపెనీ ఇప్పటివరకు 14,800 మంది కస్టమర్లకు రూ.84 లక్షలను వెనక్కి ఇచ్చేసినట్లు అవెన్యూ ఇండియా సీఈవో విశాల్ పటేల్ 'ఎకనామిక్స్ టైమ్స్'కు తెలిపారు. కాగా రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ భారీ ప్రచారం చేసిన రింగింగ్ బెల్స్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించింది. కంపెనీ, దాని ప్రమోటర్ల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను ఈడీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ నోటీసుల్లాంటివేవీ జారీకాలేదు. ఆదాయ పన్ను విభాగం కూడా కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తుండటం తెలిసిందే. -
రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి
న్యూఢిల్లీ: చౌక స్మార్ట్‌ఫోన్ (రూ.251) ఫ్రీడమ్‌పై వివాదాల నేపథ్యంలో.. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డబ్బును వాపసు చేస్తానని ప్రకటించిన తయారీ సంస్థ మంగళవారం నుంచి ఆ పనిని మొదలుపెట్టింది. సదరు ఫోన్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్.. తన వెబ్ సైట్ ద్వారా చెల్లింపులు చేస్తోంది. రూ.251 స్మార్ట్ ఫోన్ కోసం ముందుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న 30,000 మందికి నగదు తిరిగి ఇచ్చేస్తామన్న తయారీ కంపెనీ ఇప్పటివరకు 14,800 మంది కస్టమర్లకు రూ.84 లక్షలను వెనక్కి ఇచ్చేసినట్లు అవెన్యూ ఇండియా సీఈవో విశాల్ పటేల్ 'ఎకనామిక్స్ టైమ్స్'కు తెలిపారు. కాగా రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ భారీ ప్రచారం చేసిన రింగింగ్ బెల్స్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించింది. కంపెనీ, దాని ప్రమోటర్ల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను ఈడీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ నోటీసుల్లాంటివేవీ జారీకాలేదు. ఆదాయ పన్ను విభాగం కూడా కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తుండటం తెలిసిందే. -
'బీజేపీ హయాంలోనే భారీ కుంభకోణం'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఫ్రీడమ్ 251' మొబైల్స్ వ్యాపారం మిలినియమ్ లోనే భారీ కుంభకోణమని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ఆరోపించారు. న్యూఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ మీడియాతో మాట్లాడారు. కేవలం రూ.251 కే స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం అనేది మిలినియంలో బీజేపీ పాలనలోనే బిగ్గెస్ట్ స్కామ్ అంటూ అధికార ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రింగింగ్ బెల్స్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన సొమ్మును భద్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. తప్పుల తడకగా మారి ఇతర ముబైల్ కంపెనీలకు భారీగా నష్టం కలిగించిన 'ఫ్రీడమ్ 251' ముబైల్ ఫోన్స్ విషయంలో నిజనిజాలు ఏంటన్నది బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని రాజ్యసభలో పేర్కొన్నారు. రింగింగ్ బెల్స్ కంపెనీ కేవలం బీజేపీ ప్రభుత్వం సహకారంతోనే కేవలం 251 రూపాయలకే లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్స్ తయారుచేసుందుకు సిద్ధపడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 'ఫ్రీడమ్ 251' వెబ్ సైట్లో ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారిలో కేవలం 25 లక్షల మందికే ఈ చౌక ఫోన్లను అందిస్తామని కంపెనీ అధ్యక్షుడు అశోక్ చద్ధా ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ ఫోన్స్ రాకపోతే..
చర్యలు తప్పవు: రవి శంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు అందించడంలో విఫలమైతే.. అది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీడమ్ 251’ ఉదంతాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడవ్ 251’ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా తయారు చేస్తుంది? రూ.251లకు ఆ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందా? బీఐఎస్ సర్టిఫికేట్ ఉందా? లేదా? వంటి తదితర అంశాలపై తమ మంత్రిత్వశాఖ విచారణ జరుపుతోందని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ కూడా రింగింగ్ బెల్స్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తోంది. -
రింగింగ్ బెల్స్‌పై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: వివాదాస్పద చౌక స్మార్ట్‌ఫోన్ ‘ఫ్రీడం’ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ కార్యకలాపాలపై ఎక్సైజ్, ఆదాయ పన్ను విభాగాలు దృష్టి సారించాయి. కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఐటీ విభాగం కొన్ని కీలక పత్రాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్, ఐటీ విభాగం అధికారులు వచ్చిన సంగతి వాస్తవమేనని, వారు కొన్ని మార్గదర్శకాలు సూచించారని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్ధా పేర్కొన్నారు. ఫ్రీడం బ్రాండ్ పేరిట రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ఊదరగొట్టడం, దీని సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తమవడం తెలిసిందే. మరోవైపు, ఈ చౌక స్మార్ట్‌ఫోన్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం (డైటీ) కార్యదర్శి అరుణ శర్మను టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. ఫ్రీడం ఫోన్ ధరపై సందేహాలు లేవనెత్తుతూ బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య రాసిన లేఖకు స్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రీడం ఫోన్ విక్రయాలు తమపై ప్రభావం చూపబోవని మరో కంపెనీ డేటా విండ్ స్పష్టం చేసింది. ఫ్రీడమ్ 251 ఫోన్‌కి భారీ డిమాండ్ రావడంతో బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. తొలి రోజున 3.7 కోట్లు, రెండో రోజున 2.47 కోట్ల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించింది. -
'ఫ్రీడం 251'తో లాభాలు కూడా వస్తాయట!
'ఫ్రీడం 251'.. ఇప్పుడు సాకేంతిక ప్రపంచంలో ఓ పెద్ద దుమారమే రేపుతోంది. అత్యాధునిక ఫీచర్లున్న 'త్రీజీ' స్మార్ట్‌ఫోన్‌ను అక్షరాల రూ. 251కే అందిస్తామంటూ ముందుకొచ్చిన రింగింగ్ బేల్స్ ప్రకటనపై ఇటు విమర్శలు అటు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్న స్మార్ట్‌ఫోన్ అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు? నిజంగా రూ. 251కే ఇస్తారా? ఆ ధరకు స్మార్ట్‌ఫోన్ అమ్మడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు, అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇది సాధ్యమే అంటోంది రింగింగ్ బేల్స్ కంపెనీ. యాడ్‌కామ్ కంపెనీకి చెందిన ఐకాన్ 4 స్మార్ట్‌ఫోన్‌ను 'ఫ్రీడం 251'గా రీబ్రాండ్ చేసి అమ్ముతారని తెలుస్తోంది. ప్రస్తుతం 'ఐకాన్ 4' రూ. 4వేలకు లభిస్తున్నది. దీని ఉత్పత్తి ధర మొత్తంగా చూసుకుంటే రూ. 2,546గా ఉంటుందని ఒక అంచనా. ఈ మొత్తంలో పదిశాతానికే మొబైల్ ఫోన్ అందిస్తామంటోంది రింగింగ్ బేల్స్. ఇదెలా సాధ్యం? ఇదేమన్నా మార్కెటింగ్ జిమ్మిక్కా?.. అంటే దీనిపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆ కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్దా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం రూ. 251కే అందించాలన్న సంకల్పంతో తాము ఈ సాహసానికి సిద్ధమయ్యామని ఆయన తెలిపారు. ఎంతో పరిశోధన చేసి.. ఎంతగానో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు. అర్ధరాత్రి దాబాలో ఐడియా! సాధారణంగా ఇలాంటి ఫీచర్లు ఉన్న ఓ స్మార్ట్‌ఫోన్ రూ. 2,300 లేదా రూ. 2,400లకు లభిస్తుందని, ఈ నేపథ్యంలో రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందించాలన్న ఆలోచన ఝాన్సీ హైవేలో అర్ధరాత్రి వేళ ఓ దాబా వద్ద తనకు, తన సహోద్యోగి మోహిత్ గోయల్ (రింగింగ్ బేల్స్ డైరెక్టర్)కు వచ్చిందని ఆయన చెప్పారు. వెంటనే డ్రాయింగ్ రూమ్‌కు వచ్చి ఈ ఆలోచనపై కసరత్తు చేశామని, తుది లెక్కల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ కనీస ధరను రూ. 800 వరకు తగ్గించవచ్చునని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. 'మేకిన్ ఇండియా'లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురావడం వల్ల 13.8శాతం సుంకం (దాదాపు రూ. 450 నుంచి రూ. 470 వరకు) భారం తగ్గే అవకాశముంది. ఇక భారీగా ఉత్పత్తి చేపట్టడం వల్ల వ్యయం గణనీయంగా తగ్గి రూ. 530 వరకు ఆదా అయ్యే అవకాశముంది. దీనికితోడు ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే అమ్ముతుండటంతో మార్కెటింగ్, అమ్మకాల కోసం పెట్టే ఖర్చు దాదాపు రూ. 460 వరకు ఆదా అవుతుంది. ఈ లెక్కల ఆధారంగా ఒక మొబైల్‌ఫోన్‌ను రూ. 800 కనీస ధరకు అందించడం సాధ్యమేనని ఆయన చెప్పారు. అయితే, ఈ కనీస ధరకు అమ్మకం ధర రూ. 251కి మధ్య భారీగానే తేడా ఉంది. అయితే ఈ వ్యత్యాసాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని ఆయన చెప్ప్తున్నారు. ఈ పద్ధతిలో 'ఫ్రీడం 251'ను రూ. 251కే అందిస్తామని, దీనివల్ల తమకు భారీగా లాభాలు రాకపోయినా.. సహేతుకమైన ఆదాయం, లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్టు అశోక్ చద్దా చెప్తున్నారు. తాము స్థాపించబోయే మార్కెట్ వేదికను 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్‌లో బిల్ట్ ఇన్ యాప్‌గా రూపొందిస్తామని, ఈ మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు భాగస్వామ్యులకు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. -
'ఫ్రీడం 251'కు ఐదుకోట్ల రిజిస్ట్రేషన్లు!
న్యూఢిల్లీ: కేవలం రూ. 251కే అమ్ముతామని చెప్తూ ముందుకొచ్చిన 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్ చుట్టూ ఎన్ని సందేహాలు ముసురుతున్నా.. రిజిస్ట్రేషన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. అంత తక్కువ ధరకు అసలు ఇస్తారా? లేదా? అని ఎన్ని ప్రశ్నలు చుట్టుముడుతున్నా.. దానిని కొనాలన్న ప్రజల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఆన్లైన్లో ముందస్తు బుకింగ్ కోసం కేవలం రెండురోజుల్లోనే ఐదు కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయని రింగింగ్ బేల్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా 25 లక్షల 'ఫ్రీడం 251' ఫోన్లను ప్రజలకు అందించాలని కంపెనీ నిర్ణయించిన నేపథ్యంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంకా కొనసాగించాలా? వద్దా? అనేది పునరాలోచిస్తున్నట్టు రింగింగ్ బేల్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా తెలిపారు. ఈ కారుచౌక మొబైల్ ఫోన్ ముందస్తు బుకింగ్ కోసం ఈ నెల 21వ తేదీ రాత్రి 8 గంటలవరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తెరిచి ఉంచాలని కంపెనీ మొదట నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఐదు కోట్లకు రిజిస్ట్రేషన్లు చేరిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఇంకా కొనసాగించాలా? వద్దా? అన్నది ఆలోచిస్తున్నామని అశోక్ చద్దా చెప్పారు. అత్యాధునిక త్రీజీ ఫీచర్స్ తో, ఆధునిక హంగులతో 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్ ను రూ. 251కే అందిస్తామని ప్రకటించి మొబైల్ ఫోన్ మార్కెట్లో రింగింగ్ బేల్స్ కంపెనీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. నరేంద్రమోదీ తలపెట్టిన 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే తాము కారుచౌక ధరకు మొబైల్ ఫోన్ అందివ్వనున్నట్టు ఆ కంపెనీ చెప్పుకొస్తున్నది. -
ఫ్రీడం 251 కంపెనీలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చవకైన ఫోన్ అంటూ సంచలనం సృష్టించిన మొబైల్ కంపెనీ రింగింగ్ బెల్స్ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఆదాయపన్ను శాఖ అధికారులు నోయిడాలోని ఫీడ్రం 251 కంపెనీ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత పత్రాలను తనిఖీ చేశారు. సిబ్బందిని విచారించారు. ఈ విషయం తెలిసి.. ఫోన్ బుక్ చేసుకున్న వందలాది మంది వినియోగాదారులు రింగింగ్ బెల్స్ కార్యాలయం ముందు గుమిగూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కాగా నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ ఫోన్ ను బుధవారం సాయంత్రం ఆవిష్కరించింది.. 'ఫ్రీడమ్ 251'గా పేర్కొన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర అక్షరాల రూ. 251 అంటూ ప్రకటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. కేంద్రం అందించిన భారీ మద్దతుతో ఫ్రీడమ్ 251 ఫోన్‌ను తయారు చేశామని, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే ఈ విజయం సాధించామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించింన సంగతి తెలిసిందే. -
సగం ఫోన్ కూడా కొనచ్చా?
మనం ఆన్లైన్లో ఏమైనా కొనాలంటే ఎన్ని కావాలనే 'క్వాంటిటీ' అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందులో కనీసం 1 నుంచి మొదలుపెట్టి, మనకు ఎన్ని కావాలో చెప్పాలి. సాధారణంగా ఫోన్లలాంటివి అయితే ఒక ఈమెయిల్ ఐడీ నుంచి ఒకటి కంటే ఎక్కువ కొనే అవకాశం ఉండదు కాబట్టి కేవలం 1 అనే అంకె మాత్రమే అక్కడ వేయాల్సి ఉంటుంది. కొన్ని ఈ-కామర్స్ సైట్లయితే డీఫాల్ట్‌గానే 1 అనే క్వాంటిటీ అక్కడ పేర్కొంటాయి. దాన్ని మార్చడానికి కూడా ఉండదు. అదే, ఇతర వస్తువులు గానీ, దుస్తులు గానీ అయితే ఒకటి కంటే ఎక్కువ కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ.. ఎప్పుడైనా సగం వస్తువు ఆర్డర్ చేయడానికి మీరు ప్రయత్నించారా? అసలు అలా కుదురుతుందో లేదో చూశారా? భారతదేశాన్ని.. ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని ఊదరగొడుతున్న 'ఫ్రీడం 251' ఫోన్ మాత్రం సగం కూడా బుక్ చేయొచ్చట. ఈ విషయాన్ని సాంకేతిక నిపుణులు గుర్తించారు. వాస్తవానికి వెబ్సైట్ రూపకల్పన చేసేటప్పుడే.. దానికి సంబంధించిన ఆల్గరిథమ్ సరిగ్గా రూపొందించుకోవాలి. 'మినిమమ్' అనే లాజిక్ ఒకటి ఇవ్వాలి. కానీ అది సరిగా ఇవ్వకపోవడంతో ఇలా సగం ఫోన్ కూడా బుక్ చేసుకోడానికి 'ఫ్రీడమ్ 251' అవకాశం కల్పించిందని తెలుస్తోంది. మళ్లీ సైట్ గోవిందా తొలిరోజు గురువారం నాడు సెకనుకు 6 లక్షల మంది తమ సైట్‌ను సందర్శించారని, అంత భారాన్ని సెర్వర్లు తట్టుకోలేకపోవడం వల్లే అది పనిచేయకుండా పోయిందని రింగింగ్‌బెల్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ శుక్రవారం కూడా సైట్ సగం సగమే పనిచేసింది. ఉదయం కాసేపటి వరకు బాగానే ఉండి, బుకింగ్ కూడా అయింది గానీ.. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రయత్నించినవాళ్లకు సైట్ మొత్తం ఖాళీగా తెల్లగా కనిపించడం మొదలైంది. అసలు ఎలాంటి ఎర్రర్ మెసేజి గానీ, అక్కడి నుంచి రీడైరెక్ట్ కావడం గానీ ఏమీ లేదు. దాంతో వినియోగదారులు విసుగెత్తి ఊరుకున్నారు. -
రూ.251 ఫోన్‌కు ఆర్డరిచ్చే ముందు జాగ్రత్త!
నోయిడా: ఆశ.. దోశ.. అప్పడం.. వడ అన్నతీరుగా ఉంది రింగింగ్ బెల్స్ కంపెనీ వ్యవహారం. కేవలం రూ.251కే స్మార్ట్ ఫోన్ విడుదల చేసి మొబైల్ రంగాన్ని ఓ కుదుపుకుదిపేసినట్లు కనిపించిన ఆ సంస్థ గురువారం చేతులెత్తేసి విమర్శలు రావడంతో తిరిగి శుక్రవారం ఫోన్ బుకింగ్ కోసం అవకాశం కల్పించింది. బుధవారం ఈ ఫోన్ విడుదల చేసిన ఆ సంస్థ తమ ఫోన్ బుకింగ్లకోసం అనూహ్య స్పందన వచ్చిందంటూ బుకింగ్ అవకాశాలను గురువారం తాత్కాలికంగా నిలిపేసింది. అయితే, ఇలా నిలిపేయడంపట్ల సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు చెందిన ఫ్రీడమ్ 251 మొబైల్ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో వాటిని తాత్కాలికంగా నిలిపేసి తిరిగి శుక్రవారం ప్రారంభిస్తున్నామని చెప్పింది. అయితే, శుక్రవారం ఈ ఫోన్ బుక్ చేసుకునే వారు కొన్ని విషయాలు ముందే తెలుసుకుంటే మంచిది. బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి 1. రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లో నాణ్యత ఎంతమేరకు ఉంటుందనే విషయం అంచనా వేయడం సాధ్యం కాదు. 2. మొబైల్ ఫోన్ షిప్పింగ్‌కు నాలుగు నెలలు సమయం పడుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఫోన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, బుక్ చేసుకున్న వారందరికీ ఈ ఫోన్ డెలివరీ వస్తుందని మాత్రం అనుకోలేం. 3. ఫోన్ లాంచింగ్ సమయంలో ఫ్రీడమ్ 251 కు ఒక సంవత్సరంపాటు వారంటీ ఉంటుందని చెప్పింది. కానీ, వెబ్ సైట్లో మాత్రం రిటర్న్ పాలసీ వివరాలేవీ పెట్టలేదు. 4. ఫోన్ ధర రూ. 251 కాగా, చేరవేతకు అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. 5. ఈ ఫోన్లు కేవలం భారత్‌లో మాత్రమే డెలివరీ చేస్తారు. బయట దేశాల్లో ఉండే భారతీయులకు అందుబాటులో ఉండదు. -
రూ.251 ఫోను.. రెండువేల లొసుగులు!!
♦ ఉదయం 6 గంటలకే మొరాయించిన వెబ్సైట్ ♦ 30వేల మొబైల్స్‌ను విక్రయించామని చెబుతున్న కంపెనీ ♦ సెకనుకు 6 లక్షల హిట్స్ వచ్చాయన్న సంస్థ ♦ ఈ రేటుతో నష్టమే... ‘వినూత్న’ పద్ధతుల్లో అధిగమిస్తామని వెల్లడి సాక్షి బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి అత్యాధునిక ఫీచర్లున్న త్రీజీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.251కే విక్రయిస్తానని చెప్పిన రింగింగ్ బెల్స్ సంస్థ తొలిరోజే చేతులెత్తేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచీ తన వెబ్సైట్లో వీటిని బుక్ చేసుకోవచ్చని సంస్థ చెప్పటంతో... ఫోనొస్తుందో రాదో అని అనుమానాలున్నా... పోనీ రూ.251 మాత్రమేగా!! అనుకుంటూ లక్షల మంది బుక్ చేయటానికి ప్రయత్నించారు. కాకపోతే మొదట పేరు, చిరునామా వివరాలు నింపిన తరవాత... చివరగా పేమెంట్ బటన్ దగ్గర ప్రెస్ చేయగా... మళ్లీ వివరాలు నింపాలంటూ రావటం అందరికీ పట్టలేని చిరాకు తెప్పించింది. ‘‘నేను 251 సార్లు నా వివరాలు నింపా... 251 సార్లు సబ్మిట్ చేశా. 251 సార్లు పేమెంట్ బటన్ నొక్కా... అయినా బుకింగ్ కాలేదు’’ అని ఒకరు... ‘‘బుక్ చేశా... వీకెండ్‌కు రైలు టికెట్‌ని’’ అని మరొకరు... ఇలా ట్విటర్లో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ఇక రింగింగ్‌బెల్స్ సంస్థ మాత్రం... 30వేల బుకింగ్‌లు తీసుకున్నామని, దేశీ యంగా తయారీకి ప్లాంటు పెడతామని, తయారు చేసిన అనంత రం వీరికి డెలివరీ చేస్తామని చెప్పింది. ‘ఎన్డీటీవీ’ ఇంటర్వ్యూలో సంస్థ ప్రెసిడెంట్ అశోక్‌కుమార్ చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సెకనుకు 6 లక్షల హిట్స్ వచ్చాయి. దాన్ని మా సర్వర్లు తట్టుకోలేకపోయాయి. అందుకే 30వేల బుకింగ్‌లే తీసుకోగలిగాం’’ అన్నారాయన. ట్విటర్ సందేశాలు చూసినపుడు మాత్రం ఒక్కరు కూడా తాము ఫోను బుక్ చేసినట్లు పేర్కొనకపోవటం గమనార్హం. అంత చీప్‌గా ఎలా ఇస్తామంటే... రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్‌కుమార్ చద్దా మాట్లాడుతూ... ఫోను ఖరీదు రూ.2,500 వరకూ అవుతోందని, తమకు దీనిపై నష్టమేనని చెప్పారు. ‘‘మేం భారీగా విక్రయాలు చేయటం ద్వారా, దేశీయంగా తయారు చేయటం ద్వారా, డిస్ట్రిబ్యూషన్‌కు వినూత్న మార్గాలు అనుసరించటం ద్వారా దీన్ని అధిగమిస్తాం’’ అని చెప్పారు. నిజానికి దేశీయంగా తయారు చేయడానికి ఈ సంస్థకు ప్లాంట్లేమీ లేవు. దేశీయంగా ప్రస్తుతం ఏ కంపెనీ సెల్‌ఫోన్ పరికరాలు తయారు చేయటంలేదన్నది కూడా ఇక్కడ గమనార్హం. మరో 24 గంటల్లో మళ్లీ బుకింగ్‌లు మొదలెడతామని పేర్కొంది. బుక్ చేసినవారికి జూన్‌లో డెలివరీ చేస్తామనటం గమనార్హం. రూ.999కే ఇవ్వలేని డేటావిండ్! దేశంలో ఇలా చీప్‌గా ఇస్తామని చేసిన ప్రకటనలు ఇప్పటికే ఫెయిలయ్యాయి. 10 డాలర్లలోపు ల్యాప్‌టాప్ తెస్తామని 2008లో ప్రభుత్వం ప్రకటించింది. తీరా అది తయారయ్యేసరికి ధర 100 డాలర్లయింది. ఆ తరువాత 20డాలర్లలోపు ధరకే ఆకాశ్ ట్యాబ్లెట్లు ఇస్తామంటూ డేటావిండ్ ప్రకటించింది. దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా తీసుకుంది. కానీ ఆ సబ్సిడీ డబ్బు, ఇటు బుకింగ్‌ల డబ్బు అన్నీ తీసుకుని చేతులెత్తేసింది. ఇదే డేటావిండ్ సంస్థ... రిలయన్స్‌తో జట్టుకట్టి రూ.999కే స్మార్ట్‌ఫోన్ తెస్తామని గతంలో ప్రకటించింది. ఏడాదైనా ఇది రాలేదు. మెటీరియల్ ధరే రూ.2,700: ఐసీఏ నిజానికి ఈ కంపెనీ చెప్పిన స్పెసిఫికేషన్లతో ఫోన్ విక్రయించాలంటే కనీసం రూ.4,000 ధర ఉండాలి. కాకపోతే రూ.251కే ఫోన్ విక్రయిస్తామంటూ... ఆ మోడళ్లను కొన్ని పత్రికలకు కంపెనీ పంపింది. కాకపోతే అవన్నీ వేరే కంపెనీల ఫోన్లు. అదేమంటే.. అసలు ఫోన్ వేరే ఉంటుందని పేర్కొంది. దీన్లో నిజానిజాలను తెలుసుకోకుండానే.. రూ.251కే స్మార్ట్‌ఫోన్ అంటూ మీడియా ఊదరగొట్టేసింది. 3 రోజుల కిందటి వరకూ ఎవ్వరికీ తెలియని ఈ కంపెనీ.. ఒక్కసారిగా హాట్టా పిక్ అయిపోయింది. వందల కోట్ల విలువైన ప్రచారాన్ని ఫ్రీగా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ కంపెనీకి బ్రాండ్ వచ్చింది కనక పెట్టుబడులు రావటంకష్టమేమీ కాదని, ఆ డబ్బుతో ప్లాంటు పెట్టి భవిష్యత్తులో ఖరీదైన ఫోన్లు అమ్మే అవకాశముందని ఓ విశ్లేషకుడు చెప్పారు. ప్రస్తుత బుకింగ్‌లకూ ఫోన్లు డెలివరీ చేయకపోవచ్చని, అసలు బుకింగ్‌లే తీసుకుని ఉండకపోవచ్చని చెప్పారాయన. దీనిపై ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ బుధవారం ప్రభుత్వానికి హెచ్చరిక చేయగా... దాంతో ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ గైర్హాజరయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కూడా టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను ఐసీఏ కోరింది. -
సెకనుకు 6 లక్షల హిట్లు.. సైట్ క్రాష్!
ఫ్రీగా వస్తోందంటే చాలు.. దేనికైనా వెంటపడతారు. వేల రూపాయల విలువైన వస్తువు వందల్లోనే వస్తోందన్నా అంతే. సరిగ్గా ఇప్పుడు కూడా అదే అయ్యింది. దాదాపు రూ. 3-4 వేల ఖరీదుచేసే స్మార్ట్‌ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామని చెప్పేసరికి జనం ఒక్కసారిగా ఆ సైట్ మీద పడ్డారు. ఒక్క సెకనులోనే 6 లక్షల హిట్లు రావడంతో దెబ్బకి ఫ్రీడమ్251 వెబ్సైట్ కాస్తా క్రాష్ అయ్యింది. గురువారం తెల్లవారుజామున 6 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని చెప్పడంతో, ఒక్కసారిగా నెటిజన్లు ఆ సైట్ మీద పడ్డారు. దాంతో తమ సైట్ క్రాష్ అయ్యిందని రింగింగ్ బెల్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అద్భుతమైన స్పందన కనబర్చినందుకు థాంక్స్ అని, అయితే ఇంత భారాన్ని తట్టుకోలేక తమ సెర్వర్లు మూలపడ్డాయని ఆ సంస్థ తెలిపింది. తమ సెర్వర్ అప్‌గ్రేడ్ చేసుకుని, 24 గంటల్లో మళ్లీ వస్తామని చెప్పింది. 4 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3.2 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామనడంపై పలు వర్గాల నుంచి సందేహాలు వెల్లువెత్తాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ తొలుత ప్రకటించింది. జూన్ 30వ తేదీ నాటికి ఫోన్లు డెలివరీ చేస్తామని అంటూ.. డెలివరీ చార్జీల కింద మరో రూ. 40 కూడా వసూలు చేస్తోంది. -
'ఫ్రీడం 251'.. గూడుపుఠాణి ఏంటో తేల్చండి!
న్యూఢిల్లీ: కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నోయిడాకు చెందిన ఓ కంపెనీకి ముందుకురావడంపై మొబైల్ ఫోన్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సత్యాసత్యాలను వెలికితీయాలని కోరుతూ కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ (ఐసీఏ) లేఖ రాసింది. ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చినా స్మార్ట్‌ఫోన్‌ను రూ. 3,500 కన్నా తక్కువ ధరకు అమ్మడం అసాధ్యమని, ఈ నేపథ్యంలో కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామనడం వెనుక ఉన్న రహస్యాలేమిటో వెలికితీయాలని ఐసీఏ తన లేఖలో కోరింది. ఈ మొబైల్ అమ్మకం వ్యవహారంలో పలు వివాదాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ చౌకైన మొబైల్ ఫోన్ ఆవిష్కరణకు ప్రభుత్వ పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరుకావడాన్ని తప్పుబట్టింది. అత్యాధునిక ఫీచర్స్ ఉన్న త్రీజీ ఫోన్ 'ఫ్రీడం 251'ను రూ. 251కే అందిస్తామంటూ రింగింగ్ బేల్స్ కంపెనీ బుధవారం దీనిని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి మొబైల్ ఫోన్ ప్రాడక్ట్‌ను రూపొందించడానికి కనీసం చౌక ఉత్పత్తి ధర 40 డాలర్లు (రూ. 2,700) అవుతుందని, దీనికి పన్నులు, సుంకాలు, పంపిణీ ఖర్చులు, రిటైల్ మార్జిన్ కలుపుకొంటే.. కనీసం ఎంతలేదన్న రూ. 4,100 ధర అవుతుందని, దీనిని ఎలా రూ. 251కి అందిస్తారని ఐసీఏ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మొహిందరో తన లేఖలో పేర్కొన్నారు. ఇలా చౌక ధరకు అందిస్తామనడం ప్రస్తుతం బూమ్ మీద ఉన్న భారత మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్‌ను దెబ్బతీయడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
మక్కీకి మక్కీ ఐఫోన్లా.. 'ఫ్రీడం 251'!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా 'ఫ్రీడం 251' దుమారం రేపుతోంది. నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఈ ఫోన్ ను రూ. 251కి అందిస్తామని ప్రకటించింది. గురువారం నుంచి ఆ కంపెనీ వెబ్సైట్లో దీని అమ్మకాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నది. అయితే ఈ కంపెనీ మీడియా కోసం విడుదల చేసిన శాంపిల్ యూనిట్ రివ్యూలో అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ డిజైన్‌ను 'ఫ్రీడం 251'లో పూర్తిగా కాపీచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యాపిల్ నుంచి దీనికి కాపీరైట్ సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. బుధవారం సాయంత్రం విడుదలైన 'ఫ్రీడం 251' యూనిట్లో పలు సమస్యలు కూడా సమీక్షల్లో నిపుణులు గుర్తించారు. అయితే దీనిపై కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. 'ఫ్రీడం 251'లో ఉన్న చాలావరకు బిల్ట్ ఇన్ యాప్స్.. ఐఫోన్ నుంచి నేరుగా కాపీ చేసినవి కావడం గమనార్హం. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లలో కనిపించే సఫారీ వెబ్ బ్రౌజరే ఇందులోనూ కనిపిస్తున్నది. అంతేకాకుండా కంపెనీ వెబ్సైట్లో చూపించిన 'ఫ్రీడం 251' మోడల్ ఫొటోలకు, అది విడుదల చేసిన మొబైల్‌ఫోన్‌కు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. 'ఫ్రీడం 251' పూర్తిగా ఐఫోన్‌ను పోలినట్టు కనిపించడమే కాకుండా.. ఐఫోన్ హోమ్ బటన్ తరహాలోనే దీనికి కూడా హోమ్ బటన్ రౌండ్‌గా కనిపిస్తున్నది. మేడ్ ఇన్ ఇండియానా? ఈ స్మార్ట్‌ఫోన్‌పైన 'ఫ్రీడం 251' అని పెద్దగా రాసి ఉన్నప్పటికీ.. దీని అసలు బ్రాండ్ నేమ్ 'యాడ్‌కామ్' అని తెలుస్తున్నది. ఒరిజినల్ బ్రాండ్ పేరును వైట్నర్తో చెరిపేసి.. 'ఫ్రీడం 251' అని రాసినట్టు కనిపిస్తున్నది. 'యాడ్‌కామ్' అనేది న్యూఢిల్లీకి చెందిన ఐటీ దిగమతుల కంపెనీ. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లు అమెజాన్, స్నాప్‌డీల్, గాడ్జెట్స్ 360 వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో సుమారు రూ. 4వేలకు లభిస్తున్నాయి. ఇక 'ఫ్రీడం 251'లో స్వచ్ఛ భారత్, మహిళల భద్రత, యూట్యూబ్, వాట్సప్, ఫేస్బుక్ వంటి యాప్స్ ఉంటాయని అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నప్పటికీ.. ఈ మోడల్లో అలాంటి యాప్స్ ఏమీ లేకపోవడం గమనార్హం. అయితే మీడియాకు అవగాహన కోసం విడుదల చేసిన ఈ మోడల్ శాంపిల్ మాత్రమేనని, వినియోగదారులకు అమ్మబోయే 'ఫ్రీడం 251' మొబైల్ ఫోన్లలో తాము పేర్కొన్న అన్ని ఫీచర్స్, యాప్స్ ఉంటాయని రింగింగ్ బేల్స్ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.