Fun Day
-
Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు?
సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు.. మంత్రి వసంతుడితో ‘ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్యా! అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు. ఏమంటారు?’ అని అడిగాడు. ‘అలాగే మహారాజా.. మీరన్నట్టే చేద్దాం! నిజాయితీపరుడెవరో తేలుతుంది’ అన్నాడు మంత్రి. మరుసటిరోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మందీ పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికీ ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందినీ పిలిచి ‘పొరపాటున ఉద్యానవనంలో పది వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్లు వాటిని తీసుకెళ్లి రాజు గారికి ఇస్తే వారికి రాజు గారు ఐదు వెండి నాణేలు ఇస్తారు’ అని చెప్పాడు. అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు ‘మనమేమన్నా పిచ్చివాళ్లమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది’ అన్నాడు. ‘అవునవును’ అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు. పదవ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి ‘నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావేంటీ’ అని కసురుకున్నాడు. ‘నాకు పని ముఖ్యం. పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను’ అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య.. విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి ‘మహారాజా! ఇదిగోండి నాకు దొరికిన వజ్రం’ అంటూ రాజుకు ఇచ్చి ‘తోటలో పని ఉంది’ అంటూ వెంటనే వెళ్లిపోయాడు. దారిలో తొమ్మిది మందిలో ఒకడు ‘ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ. అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అన్నాడు. మరొకడు ‘పంట పొలం కొంటాన’న్నాడు. ఇలా మిగిలిన వాళ్లూ తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య ‘ఇవి వజ్రాలు కావు. నాసిరకం రంగు రాళ్లు. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు’ అని తేల్చాడు. ‘ఒరే! మనం పొరబడ్డాము. తిన్నగా కోటకు వెళ్లి వీటిని రాజు గారికి ఇచ్చి వెండినాణేలు దక్కించుకుందాము’ అన్నాడు వారిలో ఒకడు. ‘అవునురా’ అంటూ వంత పాడారు మిగిలిన వాళ్లు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజు గారి కొలువుకు చేరుకొని ‘మహారాజా! ఇవిగోండి.. మాకు దొరికిన వజ్రాలు’ అంటూ ఆ తొమ్మండుగురూ వాటిని రాజుకిచ్చారు. ‘మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే.. అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా’ అని గద్దించాడు రాజు. సమాధానమివ్వలేక పోయారు వాళ్లు. ‘రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది’ అన్నాడు రాజు. ‘నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు. తీసుకుని వెళ్ళండి’ అన్నాడు మంత్రి. తరువాత రామయ్యను పిలిచి ‘వృత్తికి విలువ ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్న మాట ప్రకారం నీకు ఐదు వెండినాణేలు ఇవ్వాలి. కానీ పది బంగారు నాణేలు ఇస్తున్నాను’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు’ అని వందనం చేసి వెళ్లిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి ‘చూశారుగా మంత్రీ.. మన పథకం ఎలా పారిందో!’ అన్నాడు రాజు గర్వంగా. ‘అవును మహారాజా!’ అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా! - యు.విజయశేఖర రెడ్డి -
అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!
తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని ఇది. భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండువేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. -
పిల్లల కథ -‘తెలిసొచ్చింది మహా ప్రభో’
మధిర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనాదక్షుడు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తుండేవాడు. కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు! బద్ధకంతో ఏ పనీ చేయకుండా ఉండేవారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.ఒకరోజు రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అతని వద్దకు అందరూ వెళుతున్నారని.. ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది. మారువేషంలో అతని దగ్గరకు వెళ్లి.. సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు. మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్లి ‘ప్రణామాలు సాధుపుంగవా! మా రాజ్యంలో చాలామంది బద్ధకస్తులున్నారు. ఎన్ని విధాల ప్రయత్నించినా వారు మారడంలేదు. దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు. ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు’ అని ప్రార్థించాడు. ‘దీనికి పరిష్కారం ఉంది’ అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి. ‘సాధువు చెప్పినట్లుగా చేయండి’ అని మంత్రిని ఆదేశించాడు రాజు. ‘అలాగే రాజా’ అని చెప్పి.. ‘రాబోవు దసరా పండుగనాడు ప్రతి ఇంట్లోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. కనుక దసరా రోజున పురుషులంతా.. మన రాజ్యం నడి బొడ్డునున్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలెను. వచ్చేటప్పుడు ప్రతిఒక్కరూ ఒక సంచి, ఒక పొడవాటి కర్ర తెచ్చుకొనవలెను’ అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలకు.. సంచి, కర్ర ఎందుకు తెచ్చుకోమన్నారో అర్థం కాలేదు. దసరా రానే వచ్చింది. ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ బద్ధకస్తులు చాలామంది సంచి, కర్ర, తెచ్చుకోకుండానే వచ్చారు. రాజు.. అక్కడికి వచ్చిన వారినుద్దేశించి ‘మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం. అందులో భాగంగా మీరందరూ.. తెచ్చుకున్న సంచి, కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోకి వెళ్లి.. కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి.. సంచిలో నింపుకొని రావాలి. ఇప్పుడే బయలుదేరి మీకప్పగించిన పని ముగించుకుని సాయంకాలానికల్లా మళ్లీ ఇదే ప్రాంగణానికి రావాలి’ అని చెప్పాడు. చిత్తం అంటూ బయలుదేరారంతా. సంచి,కర్రలు ఉన్నవాళ్లు పండ్లను కొట్టి.. సంచి నింపుకొని వచ్చారు. వాటిని తీసుకెళ్ళని బద్ధకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తెంపుకొని వారు వేసుకున్న చొక్కా లేదా కండువాలో కట్టుకొని వచ్చారు. సంచులు, కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు. అలా తీసుకురాని వారందరినీ వారం రోజులపాటు చెరసాలలో బంధించాలని ఆదేశించారు. వెంటనే రాజ భటులు వారందరినీ తీసుకెళ్లి ఒకొక్కరిని ఒక్కో గదిలో బంధించారు. బద్ధకం వల్ల వారు సంచి, కర్రను తీసుకెళ్లనందువల్ల వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది. చెరసాలలో ఉన్న వారం రోజులూ వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని.. బయట నుంచి వారికి ఇతర ఆహారమేమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు. దాంతో వాళ్లకు ఆ పండ్లు రెండు రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు. బద్ధకించకుండా తామూ సంచి, కర్ర తీసుకువెళ్లి ఉంటే ఈ రోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మథన పడ్డారు. తిండి లేక నీరసించిన వాళ్లను చెరసాల నుంచి బయటకి తీసుకొచ్చారు. అప్పుడు వారినుద్దేశించి రాజు ‘ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా? మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది’ అన్నాడు. వెంటనే వాళ్లంతా ‘క్షమించండి రాజా! తప్పు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేస్తాం’ అన్నారు ముక్తకంఠంతో. ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజు. ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలుపంచుకోసాగారు. ఆ తర్వాత రాజ్యంలో బద్ధకస్తుల జాడే లేకుండా పోయింది. - ఏడుకొండలు కళ్ళేపల్లి -
మంత్ర ఖడ్గం!
పూర్వం ఉజ్జయినిని మహామల్లుడనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే మహాయోధుడు. అయితే ఆయనకు ఒక చింత ఉండేది. ఒక్కగానొక్క కొడుకు మణిదీపుడు యుద్ధ విద్యలందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడుకాదు. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే రాజు తిరుగులేని యోధుడై ఉండాలి అని మహామల్లుడు కొడుక్కి ఎంతచెప్పినా ఫలితం ఉండేదికాదు. మణిదీపుడికి కష్టపడి యుద్ధవిద్యలు నేర్వడం ఇష్టంలేదు. చిన్నప్పుడు విన్న కథల్లోలాగ మంత్రఖడ్గాన్ని సంపాదించి దానితో విజయాలను అందుకోవాలని అతను కలలు కంటుండేవాడు. ఒకరోజు.. రాజుగారి దర్శనానికి ఒక సాధువు వచ్చాడు. తన బాధను సాధువుతో చెప్పాడు మహామల్లుడు. ‘దాని గురించి మీరు చింత పడకండి. మణిదీపుడిని నాతో పంపండి. అతని కోరిౖకైన మంత్రఖడ్గాన్ని ఇచ్చి పంపుతాను. కానీ దానిని ఉపయోగించాలంటే కనీస నైపుణ్యం ఉండాలి కదా! దాన్ని కూడా మణిదీపుడికి ఏమాత్రం కష్టంలేకుండా అతి తక్కువ సమయంలో నేర్పించి పంపిస్తాను’ అన్నాడు. మణిదీపుడి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఇటు యుద్ధవిద్యలూ వస్తున్నాయి. అటు తాను కోరుకున్న మంత్రఖడ్గమూ లభిస్తున్నది. ఇంకేం కావాలి! సాధువు వెంట బయలుదేరి ఆశ్రమం చేరాడు. సాధువు తానే మణిదీపుడికి కత్తియుద్ధం నేర్పించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోతున్న మణిదీపుడితో ‘సాధువుకి క్షత్రియవిద్యలు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నేను వయసులో ఉన్నప్పుడు మనరాజ్య సైన్యంలో పనిచేశాను. వయసయ్యాక ప్రశాంత జీవితం గడపాలని ఆశ్రమం నిర్మించుకున్నాను. అయితే నావద్దకు వచ్చినవారికి కాదనకుండా క్షత్రియ విద్యలు నేర్పిస్తున్నాను’ అన్నాడు. ఆరోజు సాయంత్రం అభ్యాసం అయ్యాక మణిదీపుడి భుజంతట్టి ‘ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేస్తున్నావు. నేననుకున్నదానికంటే ముందే యుద్ధవిద్యలు నేర్చుకోగలవు’ అంటూ ప్రశంసించాడు. మణిదీపుడి మీద సాధువు పొగడ్తలు బాగా పనిచేశాయి. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. యుద్ధవిద్యలు కష్టం అనుకున్నాడు. కానీ అవి తేలికే అని గ్రహించాడు. యుద్ధవిద్యలన్నీ నేర్పి అతనిని తిరిగి రాజధానికి పంపే సమయంలో.. సాధువు మంత్రఖడ్గాన్ని ఇస్తూ ‘ఇది మా పూర్వీకులది. నేను సైన్యంలో పనిచేస్తున్నప్పటి నుండీ నా దగ్గర ఉంది. ఇది నీకు భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది’ అన్నాడు. మణిదీపుడు ఆనందంగా రాజ్యం చేరుకున్నాడు. కొడుకు ప్రయోజకుడై వచ్చినందుకు మహామల్లుడు సంతోషించి పట్టాభిషేకం చేశాడు. రాజయ్యాక కూడా మణిదీపుడు రోజూ అభ్యాసం చేయకుండా ఉండలేకపోయేవాడు! కొంతకాలానికి పొరుగున ఉన్న కోసలరాజుకు దుర్బుద్ధి పుట్టింది. బాగా అభివృద్ధి చెందిన ఉజ్జయినిని జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలని దాడిచేశాడు. తన వద్ద ఉన్న మంత్రఖడ్గంతో మణిదీపుడు యుద్ధరంగాన చెలరేగిపోయాడు. ఘన విజయం లభించాక సాధువుని కలసి ‘మీరు ప్రసాదించిన మంత్రఖడ్గం వల్ల ఇంతటి విజయం లభించింది!’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ‘విజయం ఖడ్గానిది కాదు. నీ నైపుణ్యానిది. యుద్ధవిద్యలంటే ఇష్టంలేని నీవు ఒకసారి వాటిని నేర్చుకోవడం ప్రారంభించాక నీలో ఎక్కడలేని ఆసక్తి కలిగింది. అది సహజం. ఏవిద్య అయినా నేర్చుకోవడం మొదలుపెడితే ఇక దానిని వదలబుద్ధికాదు. ఆ లక్షణమే నీకు యుద్ధంలో విజయం లభించేట్టు చేసింది. ఇందులో మంత్రతంత్రాల ప్రమేయం ఏమీలేదు. నీ మనసులో యుద్ధవిద్యల పట్ల ఆసక్తికలగడానికి నేను మంత్రఖడ్గం అనే అబద్ధం ఆడాను. అది మామూలు ఖడ్గమే! కృషిని నమ్ముకునేవారికి విజయం వెన్నంటే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ మరిచిపోకు’ అన్నాడు. ఆ సాధువు మణిదీపుడిని వెంటబెట్టుకుని మహామల్లుడి వద్దకు వచ్చాడు. ‘ప్రభూ! మీరు నన్ను మన్నించాలి. మణిదీపుడు యుద్ధవిద్యల పట్ల ఆసక్తి చూపడం లేదని మీరు బాధపడుతున్నారని తెలిసి నేను సాధువుగా మీ వద్దకు వచ్చి మంత్రఖడ్గం పేరుతో మణిదీపుడ్ని ఆకర్షించి యుద్ధవిద్యల్లో ఆరితేరేట్టు చేశాను. ఒకప్పుడు నేను మీ సైన్యంలో పనిచేసి మీ ఉప్పు తిన్నవాణ్ణి. ఆ కృతజ్ఞత కొద్దీ మీ బాధ తీర్చాలని భావించాను. సాధువుగా వచ్చి పరదేశినని అబద్ధం చెప్పాను. నేను చేసిందాంట్లో ఏదైనా తప్పుంటే మన్నించండి’ అన్నాడు సాధువు. దానికి మహామల్లుడు ఆనందిస్తూ ‘మీ స్వామిభక్తి ఆశ్చర్య పరుస్తున్నది. మీలాంటివారు ఆస్థానంలో ఉండాలి. ఇకమీదట మీరు మా ముఖ్య సలహాదారునిగా ఉండి రాజ్యరక్షణలో మీ శిష్యునికి తోడ్పడండి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. సాధువు సంతోషంగా అంగీకరించాడు. -డా. గంగి శెట్టి శివకుమార్ -
స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!
‘స్టీలు సామాన్లు కొంటాం.. పాత ఇనుప సామాన్లు కొంటాం..’ అనేది పాతదే. త్వరలోనే ‘స్టీలు ఇళ్లను కొంటాం..’ అని కూడా వినపడొచ్చు. ఎందుకంటే, భవిష్యత్తులో చాలామంది స్టీలు ఇళ్లల్లోనే నివసించనున్నారు. ఈ మధ్యనే వాషింగ్టన్‌లోని ఓ ప్రైవేటు సంస్థ నాలుగు స్టీల్ గ్రెయిన్ హౌస్‌లను నిర్మించింది. చూడటానికి పాతకాలపు ధ్యానపు డబ్బాల్లా ఉన్నాయి. కానీ, వీటిలోపల విశాలమైన బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఇందులోని టెంపరేచర్ సిస్టమ్ పనిచేస్తుంది. పైగా ఇన్‌బిల్ట్ సీసీ కెమెరాలతో పనిచేసే స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిని కంటికిరెప్పలా కాపాడుతుంది. దీన్ని మడతేసి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లచ్చు కూడా. అవుట్డోర్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవారికి ఈ ఇల్లు భలే బాగుంటుంది. అయితే ఈ ఇంటి ధర 1.6 మిలియన్ డాలర్లు (అంటే రూ. 13 కోట్లు). ఈ ఇళ్ల ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ స్టీలు ఇళ్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: కొండను కొంటారా? ఔను! అమ్మకానికి సిద్ధంగా ఉంది!) -
19 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీగానే! ఎవరీ బ్రియానా?
ఈ రంగుల ప్రపంచంలో చీకటి లోకమనేది ఒకటుంటుందని, అందులో దేనికైనా తెగించే మనుషులుంటారని తెలుసుకోలేరు కొందరు. కేవలం తమ కలల ప్రపంచం వైపు పరుగులు తీస్తూ జీవితాలనే పోగొట్టుకుంటుంటారు. బ్రియానా మైట్‌ల్యాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి తన జీవితంలో అదే పొరబాటు చేసింది. అమెరికాలోని బర్లింగ్టన్ వర్మోంట్లో కెల్లీ, బ్రూస్ దంపతులకు 1986లో బ్రియానా జన్మించింది. ఈస్ట్ ఫ్రాంక్లిటన్ అనే చిన్న పట్టణంలో తన అన్నతో కలిసి పెరిగింది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులతో పాటు తమ పొలాల్లోనే పనులకు వెళ్తూ, స్కూల్లో చదువుకునేవారు. ఇంట్లో అంతా ఆమెని ముద్దుగా బ్రీ అని పిలిచేవారు. బ్రీకి తన జీవనశైలి ఏమాత్రం నచ్చేది కాదు. పొలం పనులకు, పల్లె జీవితానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తనకు 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంటికి 15 మైళ్ల దూరంలో ఉన్న ఎనోస్బర్గ్ ఫాల్స్ హైస్కూల్లో చేరతానని పేరెంట్స్‌పై ఒత్తిడి తెచ్చింది. అక్కడే పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటానని పట్టుబట్టింది. మొదట సంకోచించిన పేరెంట్స్ చివరికి బ్రీ కోరికను కాదనలేకపోయారు. ఆరు నెలలు గడిచేసరికి ఆ హైస్కూల్ నుంచి డ్రాప్ ఔట్ అయ్యి.. ఇంకాస్త పైస్థాయికి వెళ్లేందుకు ఎఉఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అందుకోసం మోంట్‌గోమేరీకి దగ్గరల్లో తన చిన్ననాటి స్నేహితురాలు జిలియన్తో కలిసి రూమ్‌లో ఉంటూ, జాబ్ చేసుకుంటూనే చదువుకునేది. తనున్న పట్టణం తన బాయ్ ఫ్రెండ్‌ని కలవడానికి, ఉద్యోగానికి, భవిష్యత్తులో ఎదుగుదలకూ అనువైనదని ఆమె నమ్మింది. 2004 మార్చి 19 శుక్రవారం ఉదయాన్నే తన తల్లిని కలిసిన బ్రీ.. తనకు మరో పార్ట్ టైమ్ జాబ్ దొరికిందని, మర్నాడే డ్యూటీలో జాయి¯Œ అవుతానని చెప్పింది. ఆ ఆనందంలోనే కెల్లీని రెస్టారెంట్‌కి తీసుకెళ్లింది. అప్పుడే తన కెరీర్ గురించి తల్లితో మాట్లాడింది. మధ్యాహ్నం మూడున్నర దాటే సరికి రూమ్ దగ్గర డ్రాప్ చేసి, కెల్లీ వెళ్లిపోయింది. కెల్లీ బ్రీని చూడటం అదే చివరిసారి. అదేరోజు ఈవినింగ్ డ్యూటీకి వెళ్లిన బ్రీ సోమవారం వరకూ రాకపోయేసరికి రూమ్ మేట్ జిలియన్కి భయమేసి బ్రీ కుటుంబానికి, పోలీసులకు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు బ్రీ శుక్రవారం రాత్రి 11:20కే డ్యూటీ నుంచి తన రూమ్‌కు బయలుదేరిందని తెలుసుకున్నారు. డ్యూటీ తర్వాత పార్టీకి రమ్మని పిలిచిన కొలిగ్స్‌తో ‘రేపు ఉదయాన్నే న్యూ జాబ్‌లో జాయిన్ అవ్వాలి, ఇప్పుడు త్వరగా వెళ్లి రెస్ట్ తీసుకోవాలి’ అందట. మరో రెండు రోజులు గడిచేసరికి ఓ షాకింగ్ నిజం అక్కడ మీడియాని షేక్ చేసింది. అప్పటికే కేసు నమోదైన యాక్సిడెంట్ కారు ఎవరిదో కాదని, కనిపించకుండా పోయిన ‘బ్రీ’దేనని తేలింది. మార్చి 20 శనివారం ఉదయానికి మోంట్‌గోమెరీ రోడ్ నం. 118లో పాడుబడిన ఇంటిని చాలా విచిత్రంగా వెనుక నుంచి ఢీ కొట్టి ఉందట ఆ కారు. ఎవరో తాగుబోతు యాక్సిడెంట్ చేసి, పారిపోయి ఉంటాడని భావించిన ఓ పోలీసు దాన్ని స్థానిక గ్యారేజ్‌కి తరలించాడట. ఆ ఇల్లు ఓ నిర్మానుష్యమైన దారిలో పెద్ద మలుపు దాటగానే ఉంటుంది. అదేం ప్రమాదకరమైన మలుపు కూడా కాదు. అయితే ఈ వార్తలు వెలుగులోకి రావడంతో చాలామంది సాక్షులు ఆ కారుని తాము చూశామంటూ ముందుకొచ్చారు. ఆ రాత్రి పన్నెండుంపావుకి ఆ ఇంటిముందు హెడ్ లైట్స్ వెలుగుతున్న కారుని గమనించానని ఒకరు, పన్నెండున్నరకి లైట్స్ వెలగడంతో కారు టర్న్ చేస్తున్నారేమో అనుకున్నానని మరొకరు చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ రాత్రి రెండున్నర తర్వాత బ్రీ మాజీ బాయ్ ఫ్రెండ్ రోబాటియాలే కూడా ఆ కారుని చూశాడు. ఆగి, అక్కడ ఎవరూ లేకపోవడంతో కారు లైట్స్ ఆఫ్ చేసి, డోర్స్ క్లోజ్ చేసి, తన దారిన తాను వెళ్లిపోయాడట. ‘అది బ్రీ కారని నీకు తెలుసా?’ అని అడిగితే అప్పటికి తెలియదని చెప్పాడు. ఏది ఏమైనా 11.20కే కారులో బయలుదేరిన బ్రీ, పన్నెండుంపావుకే ఆ కారులో లేదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశం తన ఆఫీస్‌కి చాలా దగ్గర్లో ఉంది. అంటే గంట సమయంలోనే తను మిస్ అయ్యింది. ఇక మరుసటి రోజు మార్చి 20న ఆ పోలీసు కారుని గ్యారేజ్‌కి పంపించకముందు ఓ బృందం విహారయాత్రకు వెళ్తూ ఆ కారుని చూసి ఆగింది. వారంతా తమ కెమేరాల్లో చాలా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలే తర్వాత ఈ క్రైమ్‌సీన్ కి కీలక సాక్ష్యాలయ్యాయి. అయితే ఆ పర్యాటకులు కారు పక్కనే విరిగిన బ్రేస్లెట్ చూసినట్లు చెప్పారు. కానీ అది పోలీస్ రికార్డుల్లో లేదు. మొదట అనుమానం రోబాటియాలే మీదకు మళ్లింది. అయితే అతడు విచారణ కొనసాగుతుండగానే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో కేసుకు ముందు సాగలేదు. బ్రీ మిస్సింగ్‌కి ఐదువారాల ముందు మౌరా ముర్రే అనే అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లోనే గల్లంతైంది. బ్రీ కారు దొరికిన ప్రదేశానికి సరిగ్గా 90 మైళ్ల దూరంలోనే ముర్రే కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దిశగా విచారణ జరిపినా ఫలితం లేదు. మిస్సింగ్‌కి 3 వారాల ముందు ఒక పార్టీలో బ్రీకి తన మాజీ స్నేహితురాలు లాక్రోస్కి మధ్య గొడవ జరిగిందట. లాక్రోస్ ఆ గొడవలో బ్రీని ముక్కు విరిగేలా కొట్టిందట. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న బ్రీ.. లాక్రోస్పై తన ప్రతాపాన్ని చూపించకుండా వదిలిపెట్టిందట. ఆ కథ తెలుసుకున్న పోలీసులు, లాక్రోస్ని కూడా విచారించారు. కానీ ఏ ఆధారం దొరకలేదు. ఇలా ఎంతమందిని ప్రశ్నించినా? నిజానిజాలు బయటపడలేదు. చాలామంది బ్రీ పారిపోయి ఉంటుందని నమ్ముతారు. కానీ అది నిజం కాదని వాదించేవారు, ఇదో మానవ అక్రమ రవాణా కేసని నమ్ముతారు. బ్రీ ఎవరి నుంచో తప్పించుకునే క్రమంలో కారు వెనక్కి టర్న్ చేసుకునేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, అందుకే లైట్స్ వెలుగుతూ, డోర్స్ ఓపెన్ లోనే ఉన్నాయని ఊహిస్తుంటారు. పైగా కరాటేలో నిష్ణాతురాలైన బ్రీని ఒకరు కిడ్నాప్ చేయలేరని ఎక్కువ మందే ఉండి ఉంటారనేది డిటెక్టివ్స్ మాట. 2022 మార్చి 18న ఇప్పటి దాకా దొరకని కొత్త డీఎన్ఏ దొరికిందని వెళ్లడించడంతో అది క్రిమినల్‌ది అయ్యే అవకాశం ఉండొచ్చని ఆశ మొదలైంది. పదిహేడేళ్లప్పుడు మాయం అయిన బ్రీకి ఇప్పుడు సుమారు 36 ఏళ్లు ఉండి ఉండొచ్చు. అయితే గత 19 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ∙సంహిత నిమ్మన -
11 ఏళ్ల వయసులోనే చాంపియన్.. బ్రిలియంట్ పంకజ్
మన దేశంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఆరాధించే ఆటగాళ్ల జాబితాలో అతను ఉండడు..! ఎందుకంటే అతను క్రికెటర్ కాదు! అతను సాధించిన విజయాలపై అన్ని వైపుల నుంచీ ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు..! ఎందుకంటే అతనేమీ ఒలింపిక్స్ పతకం గెలవలేదు! పాపులారిటీ పరంగా చూస్తే ఆ జాబితాలో అతని పేరు ఎక్కడా కనిపించదు! కానీ.. అతను విశ్వ వేదికలపై నమోదు చేసిన ఘనతలేమీ చిన్నవి కావు! అసాధారణ ఆటతో అతను చూపించిన ఫలితాలు అసమానం! బిలియర్డ్స్, స్నూకర్ టేబుల్స్‌పై అతను అందుకున్న విజయాలు నభూతో..! ‘క్యూ’ స్పోర్ట్స్‌లో విశ్వవ్యాప్తంగా వేర్వేరు వేదికలపై వరుస విజయాలతో సత్తా చాటిన ఆ దిగ్గజమే పంకజ్ అద్వానీ! ఏకంగా 25 వరల్డ్ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన స్టార్. పంకజ్ అద్వానీకి అప్పుడు సరిగ్గా ఐదేళ్లు.. తండ్రి వ్యాపారరీత్యా ఆ కుటుంబం కొన్నేళ్లుగా కువైట్‌లోనే స్థిరపడిపోయింది. దానికి సంబంధించిన ఒక పని కోసం పంకజ్ తండ్రి అర్జున్ అద్వానీ కుటుంబంతో సహా వారం రోజుల పాటు బెల్గ్రేడ్కు వెళ్లాడు. పని ముగిసిన తర్వాత వారంతా తిరిగి కువైట్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడే హోటల్ యాజమాన్యం వీరి గదికి వచ్చి ‘మీరు కువైట్ వెళ్లే అవకాశం ఇక ఏమాత్రం లేదు. కువైట్‌లో యుద్ధం జరుగుతోంది. ఆ దేశాన్ని ఇరాక్ ఆక్రమించింది. విమానాలన్నీ బంద్. మీరు ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు’ అని చెప్పేశాడు. దాంతో పంకజ్ తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో వ్యాపారం మొత్తం వదిలేసి నేరుగా భారత్‌కు వచ్చేశాడు. ముందుగా ముంబై చేరిన ఆ కుటుంబం ఆపై బెంగళూరులో స్థిరపడింది. అయితే దాన్నే తన జీవితంలో కీలకమైన మలుపుగా పంకజ్ చెప్పుకున్నాడు. కువైట్‌లో ఉండుంటే తాను బిలియర్డ్స్ వైపు వెళ్లకపోయేవాడినని, వ్యాపారంలోనే మునిగిపోయేవాడినని అతను అన్నాడు. తన సన్నిహితులు కొందరి కారణంగా, సరదాగా ఆ ఆట వైపు ఆకర్షితుడైన తను భవిష్యత్తులో అదే ఆటలో స్టార్‌గా ఎదుగుతానని పంకజ్ కూడా ఏనాడూ ఊహించలేదు. జూనియర్ స్థాయి నుంచే.. ఒక్కసారి ‘టేబుల్’ ఓనమాలు నేర్చుకున్న తర్వాత పంకజ్‌కు ఏనాడూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 11 ఏళ్ల వయసులోనే రాష్ట్ర స్థాయిలో బిలియర్డ్స్ టైటిల్ గెలిచిన తర్వాత 15 ఏళ్ల వయసులో జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ కూడా సొంతం చేసుకున్నాడు. జాతీయ జూనియర్ స్థాయి బిలియర్డ్స్, స్నూకర్ టైటిల్స్ మాత్రమే కాదు.. 17 ఏళ్లకే జాతీయ సీనియర్ స్నూకర్ ట్రోఫీ గెలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తుది ఫలితాలు మాత్రమే కాదు.. అతని ఆటను చూసినప్పుడే మున్ముందు పెద్ద విజయాలు సాధించగలడని, గత తరం భారత బిలియర్డ్స్ దిగ్గజం గీత్ సేథీ సాధించిన ఘనతలను అధిగమించగలడని ‘క్యూ’ స్పోర్ట్స్ నిపుణులు పంకజ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత వాస్తవరూపం దాల్చడం విశేషం. ఒకటి తర్వాత మరొకటి.. అపార ప్రతిభ ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీ కారణంగా పంకజ్‌కు ఆరంభంలోనే విశ్వ వేదికలపై విజయాలు దక్కలేదు. అయితే 14 ఏళ్లకే ఇంగ్లండ్‌లో వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్లో పాల్గొని అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరో నాలుగేళ్ల తర్వాత తొలిసారి వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్లో గెలవడంతోనే అతను ఏమిటో అందరికీ తెలిసింది. 18 ఏళ్ల వయసులో సాధించిన ఈ తొలి టైటిల్‌తో పంకజ్ విజయప్రస్థానం ఘనంగా మొదలైంది. ఆ తర్వాత ఎదురులేకుండా సాగిన అతని జోరు ఏకంగా 25వ ప్రపంచ టైటిల్ వరకు సాగింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా అతని ఆటకు ట్రోఫీలన్నీ దరి చేరాయి. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలను అందుకున్న పంకజ్ తన పేరిట పలు రికార్డులను నమోదు చేశాడు. స్టీవ్ డేవిస్, జాన్ హిగిన్స్, జడ్ టంప్, డింగ్హుయ్.. ఇలా అప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన దిగ్గజాలను పంకజ్ వరుసగా ఓడిస్తూ వచ్చాడు. వరల్డ్ బిలియర్డ్స్‌లో ఒక అరుదైన రికార్డు పంకజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రీడలో ఉన్న రెండు ఫార్మాట్లు (టైమ్ అండ్ పాయింట్)లలో విశ్వ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఒకే సమయంలో వరల్డ్ చాంపియన్ , కాంటినెంటల్ (ఆసియా) చాంపియన్ గా కూడా ఉన్న ఏకైక ఆటగాడిగా పంకజ్ నిలిచాడు. ఒలింపిక్స్ ఒక్కటే గొప్ప కాదు దురదృష్టవశాత్తూ బిలియర్డ్స్, స్నూకర్లలో ఏ ఆటకు కూడా ఒలింపిక్స్‌లో చోటు లేదు. పంకజ్ ఇన్నేళ్ల ప్రదర్శనను చూస్తే ఒలింపిక్స్‌లో అతను కచ్చితంగా పతకాలు సాధించగలిగేవాడని ఎవరైనా చెప్పగలరు. ఇదే విషయాన్ని గతంలో ఒక అభిమాని పంకజ్‌కు గుర్తు చేశాడు. ఇన్ని ఘనతలతో పాటు ఒలింపిక్స్ పతకం సాధించి ఉంటే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అయ్యేవాడివి అంటూ అతను వ్యాఖ్యానించాడు. దీనిపై పంకజ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘అంతా బాగుంది అంటున్నారు సరే.. ఏ క్రీడాకారుడైనా ఒలింపిక్స్ పతకం గెలిస్తేనే గొప్పా, అది లేకపోతే తక్కువా?! నాలుగేళ్లకు ఒకసారి చూపించే ప్రదర్శనను బట్టి ఒక క్రీడాకారుడి గొప్పతనాన్ని అంచనా వేస్తారా? నా దృష్టిలో దానికంటే నా దేశం తరఫున వరుసగా నాలుగేళ్ల పాటు నాలుగు వరల్డ్ చాంపియన్ షిప్‌లు గెలవడం కూడా గొప్పే. నేను దానిని ఇష్టపడతాను’ అంటూ అతను జవాబిచ్చాడు. విజయాల జాబితా (మొత్తం 25 ప్రపంచ టైటిల్స్) వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (పాయింట్ ఫార్మాట్) – 8 వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ (లాంగ్ ఫార్మాట్) – 8 వరల్డ్ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ – 1 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (15 రెడ్స్) – 3 వరల్డ్ స్నూకర్ చాంపియన్ షిప్ (6 రెడ్స్) – 2 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ కప్ – 1 స్నూకర్ వరల్డ్ టీమ్ చాంపియన్య్ షిప్ – 1 ఆసియా క్రీడలు – 2 స్వర్ణాలు (2006, 2010) ఆసియా చాంపియన్ షిప్‌లు – 12 జాతీయ చాంపియన్ షిప్‌లు – 34 -
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.. 310 వారాలు వరల్ట్ నెం1.. దటీజ్ రోజర్ ఫెడరర్
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడమే అతని ఘనత కాదు... 310 వారాలు వరల్డ్ నంబర్‌వన్ గా ఉండటమే అతని గొప్పతనాన్ని చెప్పదు... పురుషుల టెన్నిస్ ఆట కూడా అందంగా ఉంటుందని, అలా ‘సాఫ్ట్ టచ్’తో కూడా అద్భుతాలు చేయవచ్చని అతను చూపించాడు. ఒక్క పాయింట్ కోల్పోతేనే రాకెట్ నేలకేసి విసిరికొట్టే ఈ తరం ఆటగాళ్లతో పోలిస్తే, దాదాపు పాతికేళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో వివాదాస్పద మాట పెదవి దాటకుండా పనిపైనే దృష్టి పెట్టిన రుషి అతను.. మైదానం బయట కూడా సామాజిక బాధ్యత మరవని మంచితనం అతని సొంతం.. కోర్టులో అతనితో భీకరంగా తలపడిన ప్రత్యర్థులు అందరూ ఆట ముగియగానే అతని అంత మంచివాడు ఎవరూ లేరని ముక్తకంఠంతో చెప్పగల ఒకే ఒక్క పేరు.. రోజర్ ఫెడరర్.. టెన్నిస్ ప్రపంచంలో అన్నీ సాధించిన పక్కా జెంటిల్మన్ . ఎనిమిదేళ్ల వయసులో ఫెడరర్ మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టాడు. సరదాగా మాత్రమే ఆట మొదలు పెట్టినా, సహజ ప్రతిభ ఎక్కడికి పోతుంది? అందుకే కావచ్చు.. తాను ఎక్కువగా శ్రమించకుండానే వరుస విజయాలు వచ్చి పడ్డాయి. అండర్12 స్థాయిలో రెండు జాతీయ టైటిల్స్‌తో అతను మెరిశాడు. అయితే అసలు కష్టం రోజర్‌కు ఇప్పుడొచ్చింది. స్విస్ జాతీయ టెన్నిస్ సమాఖ్య అతని ఆటను ప్రత్యేకంగా గుర్తించింది. వెంటనే నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో చేర్చించమని తల్లిదండ్రులకు సూచించింది. తానుండే బాసెల్ నుంచి డెవలప్మెంట్ సెంటర్ ఉన్న ఎక్యూబ్లె¯Œ ్స దాదాపు 200 కిలోమీటర్లు. అమ్మా, నాన్నని వదిలి వెళ్లలేనంటూ ఆ చిన్నారి ఏడ్చేశాడు. చివరకు ఒప్పించి అక్కడికి పంపించారు. కానీ తీరా వెళ్లాక ఆ సెంటర్లో అంతా ఫ్రెంచ్ భాషనే! తనకేమో ఇంట్లో నేర్చిన జర్మన్ స్విస్ భాష తప్ప ఏమీ రాదు. పైగా క్యాంప్‌లో అందరికంటే చిన్నవాడు. బాధ మరింత పెరిగింది! కానీ ప్రతిరోజు ఫోన్ లో అమ్మతో మాట్లాడుతూ తెచ్చుకున్న ధైర్యానికి తన పట్టుదల జోడించి అక్కడి గట్టిగా నిలబడ్డాడు. అదే వేదిక భవిష్యత్ అద్భుతాలకు పునాదిగా నిలిచింది. దేశ నిబంధనల ప్రకారం తప్పనిసరి అయిన ‘9 ఏళ్ల స్కూల్ చదువు’ ముగించిన తర్వాత రోజర్ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి దూసుకుపోయాడు. ఎడ్బర్గ్, బెకర్లను ఆరాధిస్తూ పెరిగిన ఆ కుర్రాడు మునుముందు తాను వారందరినీ మించి శిఖరాన నిలుస్తాడని ఊహించలేదు. వెనక్కి తగ్గకుండా... ‘ఎప్పుడూ కింద పడకపోవడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ పడ్డ ప్రతీసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ స్ఫూర్తిదాయక మాట ఫెడరర్‌కు అక్షరాలా వర్తిస్తుంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. సుదీర్ఘ కెరీర్లో పదుల సంఖ్యలో అతడు గాయపడ్డాడు. శరీరంలో భుజాల నుంచి కాలి మడమల వరకు వేర్వేరు గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. కానీ అతను తన ఆటను ఆపలేదు. ఫెడరర్ పని అయిపోయిందనుకున్న ప్రతీసారి మళ్లీ బలంగా పైకి లేచాడు. మళ్లీ గొప్ప విజయాలతో దూసుకుపోయాడు. అతనిలో ఈ గొప్పతనమే అందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే 36 ఏళ్ల వయసులో అతను మళ్లీ నంబర్‌వన్ అయ్యాడు. 24 ఏళ్లు అంతర్జాతీయ టెన్నిస్ ఆడినా..1526 సింగిల్స్, 224 డబుల్స్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకోలేదు. అది అతని పట్టుదలకు నిదర్శనం. ఒక్కసారి ఆట మొదలు పెడితే అది గెలుపో, ఓటమే తేలిపోవాల్సిందే తప్ప మధ్యలో ఆయుధాలు పడేసే రకం కాదు అతను. డబుల్స్.. మిక్స్డ్ డబుల్స్.. ‘ఆమె లేకపోతే నా ఆట ఎప్పుడో ముగిసిపోయేది. ఎన్నో క్లిష్ట సందర్భాల్లో నేను టెన్నిస్ ప్రయాణం ఆపేయాలని అనుకున్నా, తాను అండగా నిలిచి నాలో స్ఫూర్తి నింపింది’ అని భార్య మిరొస్లావా (మిర్కా) గురించి ఫెడరర్ తరచూ చెప్పేవాడు. ఆమె కూడా అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయరే. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు 2000 సంవత్సరం.. సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆటగాళ్లుగా అక్కడే తొలి పరిచయం.. అదే టోర్నీలో తొలి ముద్దు కూడా! అయితే 2002లో గాయంతో ఆటకు దూరమైన మిర్కా ఆ తర్వాత ఫెడరర్ సహాయక సిబ్బందిలో భాగమైంది. ఆ సమయంలోనే ఆమె వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన ఫెడరర్ మనసు పారేసుకున్నాడు. 2009లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు.. వారిద్దరూ రెండు జతల కవలలు కావడం విశేషం. మైలా, చార్లిన్ అనే అమ్మాయిల జంట.. వారికంటే ఐదేళ్లు చిన్నదైన లియో, లెన్నీ అబ్బాయిల జంటతో రోజర్ కుటుంబ ఆనందం నాలుగింతలైంది. అన్నట్లు ఫెడరర్‌కు రెండేళ్లు పెద్దదైన అక్క డయానా కూడా ఉంది. దాతృత్వంలో మేటి అక్షరాలా 19 లక్షల 80 వేలు.. ఫెడరర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా సదుపాయాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య అది. తన ఫౌండేషన్ ద్వారా సొంత దేశం స్విట్జర్లాండ్‌లో పలు విరాళాలు అందించిన ఫెడరర్ అంతకంటే మెరుగైన పని తాను చేయాల్సి ఉందని గుర్తించాడు. అందుకు తన అమ్మమ్మ దేశమైన దక్షిణాఫ్రికాను ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో పాటు పొరుగు దేశాలు లెసొతొ, మలావి, నమీబియా, జాంబియా, జింబాబ్వేలలో పాఠశాల విద్యను మెరుగుపరచడంలో అతని నిధులు ఉపయోగపడుతున్నాయి. ఇందు కోసం గత కొన్నేళ్లలో అతని సంస్థ సుమారు రూ. 569 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 10 వేల పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచింది. ఫెడరర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ యజ్ఞంలో అతని వ్యక్తిగత స్పాన్సర్లంతా భాగం పంచుకొని సహకారం అందించారు. రోజర్ ఆటతో పాటు ఇలాంటి దాతృత్వం అతడిని ఇతర స్టార్లకంటే ఒక మెట్టు పైన ఉంచింది. వివాదమా.. నీవెక్కడ? అంతర్జాతీయ స్టార్ ఆటగాడంటే ఒక రేంజ్లో ఉండాలి. ఆటలోనే కాదు, మాటల్లో కూడా పదును కనిపించాలి. అప్పుడప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా ‘తానేంటో’ గుర్తించేలా నాలుగు పరుష పదాలు వాడటమో, లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలో చేస్తుండాలి. కానీ ఫెడరర్ గురించి గూగుల్ చేసి చూడండి. వివాదం అన్న పదం కూడా కనిపించదు! గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నా, ఓడినప్పుడు ప్రత్యర్థిని అభినందించినా ఎక్కడా మాటలో, ప్రవర్తనలో కట్టు తప్పలేదు. అదే అతడి గొప్పతనాన్ని రెట్టింపు చేసింది. కావాలంటే 21 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్‌ను చూడండి.. 21కి తగ్గని వివాదాలు ఉంటాయి. కానీ ఈ స్విస్ స్టార్ మాత్రం ఎప్పటికీ వాటికి దూరమే. ఫెడరర్ ఎక్స్‌ప్రెస్ ►వరుసగా 237 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ ► గెలిచిన మొత్తం టైటిల్స్ 103 ► స్విట్జర్లాండ్ దేశం ఫెడరర్ పేరిట పోస్టల్ స్టాంప్‌తో పాటు నాణేలపై కూడా అతని ఫొటోను ముద్రించింది. ఆ దేశంలో బతికి ఉండగానే అలాంటి గౌరవం అందుకున్న ఏకైక వ్యక్తి. ► సొంత నగరం బాసెల్‌లో ‘ఫెడరర్ ఎక్స్‌ప్రెస్’ అని ఒక రైలుకు పేరు పెట్టారు. ► ఆట ద్వారా సుమారు 130 మిలియన్ డాలర్లు ఆర్జిస్తే, ప్రకటనల ద్వారా మరో 100 మిలియన్లకు పైగా రోజర్ సంపాదించాడు. 30 ఏళ్ల ‘ఫోర్బ్స్’ చరిత్రలో నంబర్‌వన్ గా నిలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్. -
వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ
పట్టణాల్లో నాగరికత రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడల్లో లే అవుట్లై..అండర్‌గ్రౌండ్ డ్రైనేజై.. కూడళ్లలో పార్కులై.. కుళాయిలై.. బడులు.. కాలేజీలు.. కాలక్షేపానికి థియేటర్లు.. షాపింగ్ మాల్సై కనపడుతుంది! వానలు.. వంతలు వచ్చినప్పుడు వరదలై ఉప్పొంగుతుంది కూడా! కానీ ఈ పల్లెలో నాగరికత.. ఇళ్లల్లో ఇంకుడు గుంతలై.. కూడళ్లలో పరిశుభ్రతై.. ఆలోచనల్లో విజ్ఞత, విచక్షణై.. నడక, నడతల్లో సంస్కారమై.. కొలుపులు, కొట్లాటలకు నిర్వాసితై.. స్త్రీ, పురుష సమానత్వమై వెల్లివిరుస్తోంది! అదెక్కడో అభివృద్ధి ఆకాశాన్నంటిన.. హ్యాపీ ఇండెక్స్‌లో పైనున్న దేశాల్లో లేదు! తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నూరు కిలోమీటర్ల పై దూరంలో ఉంది! పేరు.. వెంకంపల్లి! దాని గురించిన వివరాలను తెలుసుకునేందుకు వెల్కమ్ చెప్తోంది!! భగవంతుడి మీద నమ్మకం.. ఆధ్యాత్మికత.. ఈ రెండూ మనిషిని మనిషిగా నిలబెట్టే ప్రయత్నాలు.. మార్గాలు కూడా! ఈ మార్గాలను అనుసరించే మనిషి .. సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాడు. మాటలతో కాదు చేతలతో! అలా భక్తిని.. ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకుని వ్యక్తిగత పరివర్తనతో పాటు పరిసరాల అభివృద్ధికీ పాటుపడ్డ.. పడుతున్న ఊరే వెంకపల్లి! మంజీర ఒడ్డున ఉన్న ఓ చిన్న పల్లెటూరు ఇది. తెలంగాణలోని కామారెడ్డి – మెదక్ జిల్లాల సరిహద్దుల్లోని మారుమూల గ్రామం. చుట్టూరా పచ్చని పంట పొలాలతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇదివరకు ఇది తాండూర్ పంచాయతీ పరిధిలో ఉండేది. పంచాయతీల పునర్విభజన జరిగి 2018 ఆగస్టు 2న పంచాయతీగా ఏర్పడింది. 172 కుటుంబాలు నివాసం ఉంటాయిక్కడ. పురుషుల సంఖ్య మూడు వందల యాభై మూడు, మహిళల సంఖ్య మూడు వందల డెబ్భై తొమ్మిది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఇది లింగ వివక్ష లేని ఊరని! గ్రామస్థుల ప్రధాన వృత్తి వ్యవసాయం. సూర్యోదయంతోనే పొలాన్ని చూసుకోనిదే వాళ్ల దినచర్య మొదలవదు. ఊళ్లో అందరూ ఎంతో కొంత చదువుకున్నవారే! ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేస్తున్నవారూ ఉన్నారు. మంజీర ముంచేసింది.. 1989లో కురిసిన భారీ వర్షాలకు మంజీర పొంగి వెంకంపల్లిని చుట్టేసింది. ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో గ్రామస్థులంతా ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగులు తీశారు. పైభాగన ఉన్న ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో పెద్దగా వ్యవసాయం నడిచేది కాదు. ఇళ్లన్నీ నీట మునగడంతో ఎగువ భాగాన ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. 1990 ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం అందించిందని గ్రామస్థులు చెప్పారు. అలా ఇళ్లు కట్టుకొని తమ ఊరిని పునర్నిర్మించుకున్నారు. ఏదో పొలం పనులు చేసుకుంటూ మునుపటిలాగే జీవనం సాగించేవారు. పరిసరాల శుభ్రత.. ఊరును ఓ జట్టుగా ఉంచుకునే వంటి వాటి మీద అవగాహన.. ప్రయత్నంలాంటివి లేకుండా! ఆ సమయంలోనే అంటే 1994లో.. వెంకపల్లిని బాన్స్వాడ పట్టణానికి చెందిన తాడ్కొల్ గంగారం, ఆర్ఎంపీ డాక్టర్ నాగభూషణం ఆధ్వర్యంలోని స్వాధ్యాయ బృందం సందర్శించింది. వాళ్లకు ఈ గ్రామంలో.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక.. ఎక్కడ పడితే అక్కడ మురికి నీటి గుంటలు కనిపించాయి. ఇళ్లు..చుట్టూ పరిసరాలు కూడా దోమలు, ఈగలకు ఆలవాలంగా అనిపించాయి. ఆధ్యాత్మిక వచనాల కన్నా ముందు గ్రామానికి పరిశుభ్రత పాఠాలు అవసరమని గ్రహించింది స్వాధ్యాయ బృందం. వాన నీటి సంరక్షణకే కాదు.. మురికి నీటిని తోలేందుకూ ఇంకుడు గుంతలే పరిష్కారమని బోధించింది. ఆ ఊళ్లో చక్కటి డ్రైనేజీ వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఆ సమస్య తీరాక స్వాధ్యాయ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. ఆ బృందం ఆశించినదాని కంటే గొప్ప ఫలితాలనే చూపించడం మొదలుపెట్టింది ఆ ఊరు. పరిసరాల పరిశుభ్రతలోనే కాదు.. ఊరి అభివృద్ధిలో కూడా! భక్తిని మూఢ విశ్వాసంగా కాకుండా దైనందిన జీవితానికి అన్వయించడం తెలుసుకున్నారు. స్వాధ్యాయ నేర్పిన ఆధ్యాత్మికతను తమ గ్రామ ప్రగతికి సోపానంగా మలచుకున్నారు. క్రమశిక్షణను అలవరచుకున్నారు. కష్టించి పనిచేయడాన్ని మించిన దైవారాధన లేదని నమ్మారు. తోటి వారిని గౌరవించడాన్ని మించిన మతం లేదనే విశ్వాసాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఒకరికొకరు సాయంగా ఉంటే ఊరంతా బాగుంటుందనే సత్యాన్ని అమలు చేయడం ఆరంభించారు. అదే ఆ ఊరికి నిర్ణయించని కట్టుబాటుగా మారింది. ప్రతిఒక్కరూ వారి ఇళ్ల వద్ద స్వచ్ఛందంగా ఇంకుడుగుంతలను నిర్మించు కున్నారు. దీనివల్ల గ్రామంలో భూగర్భజలాలు పెరగడంతో పాటు మురుగు సమస్య లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ గ్రామంలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఆవరణలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాల్సిందే! ఆధ్యాత్మిక చింతనలో భాగంగా సొంతడబ్బులతో గ్రామస్థులు 2001లో అమృతాలయాన్ని కట్టుకున్నారు. దానికి ప్రత్యేకంగా పూజారి అంటూ ఎవరు ఉండరు. ప్రతి 15రోజులపాటు ఉదయం, సాయంత్రం గ్రామానికి చెందిన ఒక జంట(దంపతులు) ఆ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. ఈ 15రోజులూ ఆ దంపతులు మాంసం, మద్యం ముట్టుకోరు. గ్రామానికి చెందిన స్వాధ్యాయ భక్తులు కొందరు తీర్థయాత్రల పేరిట వారంరోజులపాటు ఇతరప్రాంతాలకు వెళ్లి స్వాధ్యాయ కార్యక్రమాలు, అందులో భాగంగా స్వయం సమృద్ధి, స్వావలంబన మీద అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పుడు ఆ ఊళ్లో.. .. ఎక్కడా మురికి కాలువలు కనిపించవు. వంట గదిలో వాడిన నీరైనా, బాత్రూమ్లోంచి వెళ్లే మురికి నీరైనా భూమిలోకి ఇంకిపోతాయి. బయట మురికి కాల్వలు లేకపోవడంతో దోమలు, ఈగల బెడద లేదు. ఏ ఇంటికి వెళ్లినా ఇంటి ఆవరణలో కూరగాయలు, ఆకు కూరల మొక్కలు కనిపిస్తాయి. సీజనల్ పండ్ల చెట్లూ పలకరిస్తుంటాయి. టేకు చెట్లు, కొబ్బరి చెట్లను కూడా పెంచుతున్నారు. కరివేపాకు చెట్టు లేని ఇల్లు లేదంటే నమ్మండి! అందరూ ఆర్థికంగా ఎదిగినవారే. పిల్లలంతా ఉన్నత చదువులు చదివిన.. చదువుతున్నవారే. దాదాపు ఇంటికొకరు అన్నట్టుగా దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే. జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో 15 మంది పనిచేస్తుండగా, మరో 30 మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అలాగే ఇంకొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామంలో దాదాపు ఇంటికొకరు అన్నట్టుగా ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతున్న వారు మరో నలభై మంది వరకు ఉన్నారు. ఇంజనీరింగ్ వైపే ఎక్కువ మంది వెళ్లారు. ఒకరిద్దరు మెడిసిన్ వైపు వెళ్లినట్టు గ్రామస్థులు పేర్కొన్నారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు యువతులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఊళ్లో యాభై ఏళ్లు పైబడిన వాళ్లే కనిపిస్తారు. అంతా కలసిమెలసి ఉంటారు. సాగులో ఆదర్శం.. వెంకంపల్లి అంటేనే వ్యవసాయం. ఇక్కడ ఆదర్శ సేద్యం చేస్తారు. ఈ గ్రామస్థులకు వెంకంపల్లి సహా తాండూర్, లింగంపల్లి కలాన్ గ్రామాలతో కలిపి దాదాపు 780 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. అప్పట్లో చెరకు పంట ఎక్కువగా సాగయ్యేది. రైతులంతా బెల్లం తయారు చేసేవారు. అనకాపల్లి బెల్లం తయారీలో వెంకంపల్లి రైతులు ముందుండేవారు. పుట్లకొద్ది బెల్లం వండి మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. ప్రభుత్వం బెల్లంపై ఆంక్షలు విధించిన తరువాత బెల్లం తయారీ నిలిచిపోయింది. గతంలో నాలుగైదు వందల ఎకారల్లో చెరకు సాగయ్యేది. ఇప్పుడు కేవలం వంద ఎకరాల్లోనే సాగవుతోంది. చెరకును గాయత్రీ చక్కెర కర్మాగారానికి తరలిస్తారు. అయితే చెరకు సాగుకు కూలీల సమస్య, గిట్టుబాటు లేకపోవడంతో చాలా మంది రైతులు వరివైపు మొగ్గుచూపారు. ఇప్పుడు గ్రామంలో దాదాపు 550 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో చెరకును సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో ఆరుతడి పంటలు సాగవుతాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఇక్కడి రైతులు. రెండు చెరకు హార్వెస్టర్లు, పది వరకు వరి కోత మిషన్లు, 30 వరకు ట్రాక్టర్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ గడప తొక్కరు.. గొడవలు.. గట్టు పంచాయతీలు.. గృహ హింస లేని ఊరుగా వెంకంపల్లిని పేర్కొనవచ్చు. గొడవలకు ఆస్కారమే లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ మాటే రాదు ఆ ఊళ్లో. చిన్న చిన్న సమస్యలు ఎదురైతే ఊర్లోనే కూర్చుని మాట్లాడుకుంటారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న సంఘటనలు తక్కువే. ఎన్నికల సమయంలో పోటాపోటీ రాజకీయాలు ఉంటాయి. తరువాత ఎవరి పని వారు చేసుకుంటారు. ఏదైనా సమస్య తలెత్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లినా గ్రామ పెద్దలు కూర్చుని సమస్యను పరిష్కరించేస్తారు. కుటుంబాల్లో తగాదాలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టే తమ ఊరు వివాదాలు, తగాదాలకు అతీతమైందని చెప్తారు వెంకంపల్లి వాసులు. ఇంతకన్నా గొప్ప ప్రతిష్ఠ ఏం ఉంటుంది!! మా వాళ్లకు హక్కుల కన్నా బాధ్యతలు బాగా తెలుసు. అందుకే మా ఊరు క్రమశిక్షణ, శ్రమ, ఐకమత్యానికి మారుపేరుగా నిలిచింది. ఇంతకన్నా గొప్ప ప్రతిష్ఠ ఏం ఉంటుంది ఏ ఊరికైనా! – శుభాకర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ పండగవేళ సందడే సందడి.. గ్రామంలోని దాదాపు అన్ని ఇళ్లూ ఆధునిక సౌకర్యాలతో కట్టినవే. బంధువులు, స్నేహితులు వస్తే పార్టీ చేసుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసుకున్నారు. ఏదేని పరిస్థితుల్లో కరెంటు పోతే ఇన్వర్టర్లు వాడతారు. ఫ్రిజ్‌లు, టీవీలు లేని ఇళ్లు దాదాపు లేవు. గ్రామంలో 45 వరకు కార్లు ఉన్నాయి. వందకు పైగా ద్విచక్ర వాహనాలున్నాయి. పట్టణాల్లో, విదేశాల్లో ఉన్న పిల్లలంతా పండుగల సమయంలో ఊరికి వస్తారు. అప్పుడు వెంకంపల్లి అంతా సందడిగా మారుతుంది. ఇలా ఎప్పుడో జానపద కథల్లో విన్నట్టుగా.. ఊహల్లో కన్నట్టుగా ఉన్న ఈ ఊరు కనిపిస్తున్న సత్యం! ఆల్ ఈజ్ వెల్.. ఫీల్ గుడ్ను భావనల్లోనే కాదు ప్రాక్టికల్‌గా సాక్షాత్కరింపచేసుకుని వెంకంపల్లి ఇతర పల్లెలకే కాదు.. నాగరికతకు చిహ్నంగా భావించే నగరాలకూ స్ఫూర్తి! కులం, మతం పేరుతో మనుషులను దూరం చేస్తున్న సిద్ధాంతాలకు, మూఢభక్తితో నేరప్రవృత్తిని పెంచుతున్న, పెంచుకుంటున్న తత్వాలకు చెంప పెట్టు ఈ పల్లె! ∙సేపూరి వేణుగోపాలచారి సాక్షి, కామారెడ్డి -
ఇండోనేసియాలో ఇంటిపంటలకు కోవిడ్ కిక్కు!
17 వేల ద్వీపాల సమాహారమైన ఇండోనేసియా నగరాలు, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహారపు అవసరాలు తీర్చడంలో, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అర్బన్ ఫార్మింగ్ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోంది. కరోనా అనంతర కాలంలో వైవిధ్య భరితమైన, రసాయనిక అవశేషాల్లేని ఆహారం కోసం అర్బన్ ఫార్మింగ్ చేపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. సకియా నసుషన్ తన రెండంతస్తుల మేడపైన ఏడాది క్రితం నుంచి సేంద్రియ పంటలు పండిస్తున్నారు. సుమత్రా దీవిలో అతిపెద్ద నగరం మెడాన్ నివాసి ఆమె. ముగ్గురు బిడ్డల తల్లి అయిన సకియా స్థానిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రం బోధిస్తున్నారు. సాగు మెలకువలు తెలిసినప్పటికీ కోవిడ్ మహమ్మారి తాకిడి తర్వాతనే ఆమె ఇంటిపైన పంటలు సాగు చేయటం ప్రారంభించారు. ‘ఇప్పుడు మా ఇంటిల్లిపాదికీ అవసరమైన కూరగాయలన్నీ పండించుకుంటున్నాం. ఆకుకూరలైతే అసలు బయట కొనాల్సిన అవసరమే రావటం లేదు’ అంటారామె. కాలీఫ్లవర్స్, పాలకూర, టొమాటోలు, లెట్యూస్, జపనీస్ మస్టర్డ్ గ్రీన్స్, కీరదోస, పసుపు, అల్లం వంటి అనేక పంటలను టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతుల్లో పండిస్తున్నారు సకియా. ఆమెను చూసి పరిసరాల్లోని అనేక ఇళ్లపైన కూడా కిచెన్ గార్డెన్లు పుట్టుకొచ్చాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇండోనేసియాలో ఆహారోత్పత్తుల ధరలు అమాంతంగా 30–40% పెరగటం కూడా ప్రజలను సేంద్రియ ఇంటిపంటల దిశగా నడిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పండ్లు సాధ్యమైనంత వరకైనా పండించుకోవాలన్న స్పృహ నగరవాసుల్లో విస్తరిస్తోంది. ‘ఇంటిపంటల సాగు దిశగా ప్రజలు కదలటం ఆహారోత్పత్తిలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంద’ని వెస్ట్ జావా రాష్ట్రంలో గరుట్ జిల్లాకు చెందిన నిస్సా వర్గడిపుర అనే సామాజిక కార్యకర్త అంటున్నారు. నిస్సా అనేక ఏళ్ల క్రితమే అత్–తారిఖ్ సేంద్రియ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌ను నెలకొల్పి రసాయనాలు వాడకుండా పంటలు పండించడంలో యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కృషికి గాను నాలుగేళ్ల క్రితం ఓ పురస్కారాన్నీ అందుకున్నారు నిస్సా. ఇండోనేసియాలో ఆహార భద్రతకు చిన్న, సన్నకారు రైతుల కుటుంబ సేద్యం మూల స్తంభం వంటిది. అనేక రకాల కూరగాయ పంటలు పండించి స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అర్బన్ ఫార్మింగ్ దోహదం చేస్తోంది అంటున్నారు నిస్సా. స్కూల్‌కు అనుబంధంగా ఉన్న రెండున్నర ఎకరాల క్షేత్రంలో 450 రకాల బహువార్షిక, ఏకవార్షిక, సీజనల్ పంటలను నిస్సా సాగు చేస్తుండటం విశేషం. సెంట్రల్ జావా రాష్ట్రంలోని సురకర్త (దీన్ని ‘సోలో’ అని కూడా పిలుస్తారు) నగరం అర్బన్ ఫార్మింగ్‌కు పెద్ద పీట వేస్తోంది. నగరంలో ఇళ్లపైన, ప్రభుత్వ/ప్రైవేటు ఖాళీ స్థలాల్లో ఎత్తు మడులపై, కుండీల్లో సేంద్రియ ఇంటిపంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. మరోవైపు, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఆకుకూరలు, టొమాటోలు పండించడం అర్బన్ యూత్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. ప్రత్యేక శిక్షణ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. సోలో నగర పొలిమేర ప్రాంతాల్లో హెక్టారు కన్నా తక్కువ క్షేత్రాల్లో అర్బన్ ఫార్మర్స్ వాణిజ్య స్థాయిలో పంటలు పండిస్తున్నారు. పెరటి కోళ్ల పెంపకం, ఇళ్ల దగ్గరే చిన్న సిమెంటు ట్యాంకుల్లో క్యాట్‌ఫిష్ సాగు కనిపిస్తోంది. కూరగాయలు, పండ్లతో పాటు తేనెకు మంచి గిరాకీ ఉందని సోలో సిటీ ఫార్మర్స్ చెబుతున్నారు. ఇండోనేసియా ప్రభుత్వం నగరప్రాంత ప్రజల ఆహార భద్రతకు ప్రత్యేక చట్టాలు చేసి అర్బన్ అగ్రికల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. ఫుడ్ సెక్యూరిటీ కౌన్సిల్ అర్బన్ అగ్రికల్చర్ పథకానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు చేసింది. దీని అమలు తీరును సోలో నగర మేయర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మహిళా అర్బన్ రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుండటం విశేషం. – పంతంగి రాంబాబు కోవిడ్ నేర్పిన గుణపాఠం వల్ల రోగాలను పారదోలే కార్యకలాపాలకు ఇల్లే కేంద్రంగా మారింది. అందుకే ఇప్పుడు అర్బన్ ఫార్మింగ్ ఊపందుకుంది. మాకు అవసరమైన ఆకుకూరలు, కూరగాయలను ఇంటిపైనే పండించుకుంటున్నాం. – సకియా, అర్బన్ ఫార్మర్, అగ్రికల్చర్ లెక్చరర్, మెడాన్, ఇండోనేసియా -
'డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్'.. మిస్టరీ స్టోరీ
అది 2006 జనవరి 25.. లండన్‌లోని మెట్రోపాలిటన్ హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వకేట్స్‌తో కలసి తమ ఆధీనంలో ఉన్న బెడ్సిట్ అపార్ట్మెంట్స్లోని ఓ ఫ్లాట్ ముందు నిలబడి.. కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. బెడ్సిట్ ఫ్లాట్స్ అంటే.. వసతి గృహాలు లాంటివి. గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలు. ఎంతసేపటికీ తలుపు తియ్యకపోవడంతో.. అనుమానం వచ్చిన వారంతా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తలుపు తెరవగానే.. గుమ్మం ముందే కుప్పలు తెప్పలుగా పడున్న ఉత్తరాలు చూసి షాక్ అయ్యారు. చీకటిగా ఉన్న ఎంట్రెన్స్ గేట్ నుంచి కిచెన్‌లోకి వెళ్లారు. సింక్ నిండా చాలారోజులగా కడగని సామాన్లే. గది అంతా కుళ్లిన వాసన. అక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళ్లేసరికి హాల్లో టీవీ ఆన్‌లోనే ఉంది. టీవీ ముందు సోఫాలో ఓ మహిళ కూర్చుని ఉన్నట్లు కనిపించింది. దగ్గరకు వెళ్లేసరికి గుప్పుమన్న దుర్గంధం నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వలేదు. అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్లుగా ఉన్న ఆ శవం.. ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న మహిళదే అని గుర్తించడానికి వారికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె కాళ్ల దగ్గర ఓ షాపింగ్ బ్యాగ్ పడుంది. కాస్త దూరంలో కొన్ని క్రిస్మస్ గిఫ్ట్స్ ప్యాక్ చేసున్నాయి. ఫ్రిజ్‌లోని ప్రొడక్ట్స్ 2003 ఎక్స్‌పెయిరీ డేట్‌తో కనిపించాయి. అంటే ఆమె చనిపోయి ఆరోజుకి మూడేళ్లు కావస్తోందా? టీవీ అప్పటి నుంచి ఆన్‌లోనే ఉందా? ఆ షాక్‌తో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి.. విచారణ మొదలుపెట్టారు. నిజానికి హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వొకేట్స్తో ఆ అపార్ట్మెంట్కి రావడానికి కారణం మూడేళ్లుగా ఆ మహిళ అద్దె కట్టకపోవడమే. కేసు విచారణలో భాగంగా ఆ మహిళ ఊరు, పేరు, వయసు అన్నీ ట్రస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలను ఆమె అపార్ట్మెంట్లో సేకరించారు. మరునాడు ఉదయం పత్రికల్లో ‘మూడేళ్లకు బయటపడిన మహిళ శవం’ అనే వార్తతో పాటు.. చనిపోయిన ఆ మహిళ పేరు జాయిస్ కరోల్ విన్సెంట్ అని, ఆమె వయసు 38 ఏళ్లని, మీలో ఎవరికైనా ఆమె గురించి తెలుసా? తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండంటూ ప్రకటనలూ వచ్చాయి. శరీరం పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరం మాత్రమే మిగలడంతో.. ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. తలుపు వేసి ఉన్న ఇంట్లో.. టీవీ చూస్తున్న మహిళ.. కూర్చున్న చోటే ఎలా మరణించింది? అనేది ఎవ్వరికీ అంతుపట్టలేదు. పైగా ఆ ఫ్లాట్స్‌లో ఎంతో మంది ఉంటున్నారు. ‘మూడేళ్లుగా ఏ ఒక్కరికీ కుళ్లిన వాసన రాలేదంటే ఆశ్చర్యమే?’ అదే ప్రశ్న ఆ అపార్ట్మెంట్స్ వాళ్లను అడిగితే.. కిందే పేరుకున్న డంప్ యార్డ్‌ని చూపించారు. ఆ కుళ్లిన వాసన.. కిందున్న చెత్త వల్లే వస్తుందనుకున్నామని చెప్పారు. ఇక ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యేసరికి.. జాయిస్ విన్సెంట్ మాజీ కొలీగ్స్, బాయ్‌ఫ్రెండ్స్, స్నేహితులు ఇలా ఒక్కొక్కరూ బయటికి వచ్చారు. వాళ్లకు తెలిసిన సమాచారాన్ని అందించారు. జాయిస్ 1965 అక్టోబరు 19న లండన్‌లోని హ్యామర్‌స్మిత్ ప్రాంతంలో జన్మించిందని, తండ్రి లారెన్స్.. ఆఫ్రికన్ సంతతికి, తల్లి లిరిస్.. భారత సంతతికి చెందినవారని, తన పదకొండేళ్ల వయసులో తల్లి మరణించిందని, తర్వాత తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూశారని, పదహారేళ్ల వయసులో పాఠశాలను విడిచిపెట్టి.. మ్యూజిక్ వైపు దృష్టిసారిస్తూనే లండన్‌లోని ౖఇఔలో సెక్రటరీగా పని చేసిందని, ఎర్నెస్ట్లోని ట్రెజరీ డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలకు పైగా పని చేసి.. 2001 మార్చిలో ఉన్నట్టుండి రాజీనామా చేసిందని.. ఆమె జీవితంలో నెల్సన్ మండేలా వంటి గొప్పవారిని కలుసుకుందని.. ఇలా కొన్ని వివరాలు సేకరించగలిగారు పోలీసులు. అదే 2001లో తనకు ఎంతో ఇష్టమైన తండ్రి మరణ వార్త ఆమెను చాలా కుంగదీసిందని కొందరు సన్నిహితులు చెప్పారు. నిజానికి జాయిస్ తండ్రి లారెన్స్ 2004లో చనిపోయాడు. అతడి కంటే ముందే జాయిస్ చనిపోయిందన్న విషయం లారెన్స్‌కు తెలియదు. జాయిస్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత బెడ్సీట్ ఫ్లాట్స్‌లో ఆశ్రమం పొందుతూ డబ్బుల కోసం హోటల్లో క్లీనర్‌గా మారింది. ఈక్రమంలోనే ఆమె తన కుటుంబానికి, స్నేహితులకు దూరమైంది. తన వాళ్లు ఇంతమంది ఉన్నా.. తను చనిపోయిన విషయం ఏ ఒక్కరూ గుర్తించకపోవడమే ఈ కథ విన్న ప్రతిఒక్కరినీ కదిలించింది. 2003 నవంబర్‌లో ఆమె కడుపులో పుండు కారణంగా రెండు రోజుల పాటు నార్త్ మిడిల్సెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందిందని, ఉబ్బసంతో బాధపడిందని, పెప్టిక్ అల్సర్ అటాక్ అవ్వడం వల్లే చనిపోయిందని అధికారులు భావించారు. ఎలాంటి విషప్రయోగం జరగలేదని రిపోర్ట్ రావడంతో.. సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. టెలివిజన్ అన్నేళ్లుగా పనిచేయడానికి కారణం.. ఆటోమేటిక్ డెబిట్ సిస్టమ్ యాక్టివ్‌లో ఉండటమేనని నిర్ధారించారు. అన్నేళ్లుగా టీవీ సౌండ్ వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధాకరమే.అయితే ఈ వార్తను మీడియాలో ఫాలో అయిన కరోల్ మోర్లీ అనే ప్రముఖ దర్శకురాలు.. దీనిపై డాక్యుమెంటరీ తియ్యాలనే ఉద్దేశంతో జాయిస్ స్నేహితులను, బంధువుల్ని కలసినప్పుడు జాయిస్ చనిపోయిందన్న విషయం తెలిసి వాళ్లు షాకయ్యారట. 2011లో మోర్లీ డైరెక్షన్లో వచ్చిన ‘డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ జాయిస్ జీవితాన్ని చూపిస్తూనే.. ఒంటరి జీవితంపై ఎందరినో ఆలోచింపచేసింది. జాయిస్ విన్సెంట్ కథ ఎంత వింతగా ఉంటుందో అంతే విషాదకరమైనది. ‘మనిషికి జీవిత భాగస్వామే అసవరం లేదు.. కనీసం తన అనుకునే మనిషి.. తనకోసం ఆలోచించే మనిషి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం’ అని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. ఏదిఏమైనా కూర్చున్న మనిషి కూర్చున్నట్లే ప్రాణాలు విడవడంతో.. ఆమె మరణానికి సరైన కారణాన్ని తేల్చకపోవడంతో ఈ కథ మిస్టరీగానే మిగిలింది. ∙సంహిత నిమ్మన -
'ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్'.. ప్రపంచంలోనే అతిపెద్ద సంబరం!
ఇంగ్లండ్‌లో ఏటా ఆగస్టు నెలలో జరిగే ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతిపెద్ద సంబరం. రకరకాల కళా సాంస్కృతిక ప్రదర్శనలతో ఏకంగా పాతికరోజుల పాటు జరిగే సుదీర్ఘ సంబరం కూడా. ప్రస్తుతం ఆగస్టు 5 నుంచి 29 వరకు ఈ సంబరాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఇదివరకు ఎడిన్‌బరో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగేది. దీనిని 1947 నుంచి ఎడిన్‌బరో ఫ్రింజ్ ఫెస్టివల్‌గా మార్చారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, జాతులకు చెందినవారు ఈ సంబరాల్లో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనల వంటివి జరుగుతాయి. వీటితో పాటే వీధుల్లోనూ రకరకాల ప్రదర్శనలు, విచిత్రవేషధారణలు, విన్యాసాలు, సాము గరిడీలు చేస్తూ వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. వేదికలపై 3,548 ప్రదర్శనలతో పాటు, ఆరుబయట వీధుల్లో దాదాపు 55 వేలకు పైగా ప్రదర్శనలు ఈ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ. ఈ సంబరాల్లో హాస్య ప్రదర్శనలకే అగ్రతాంబూలం. హాస్య ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచిన వారికి ఏటా ‘ఎడిన్‌బరో కామెడీ అవార్డ్స్’తో సత్కరిస్తారు. ‘కరోనా’ కారణంగా 2020లో ఈ సంబరాలను నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 6–30 తేదీల్లో నిర్వహించినా, ‘కరోనా’ తీవ్రత కారణంగా 673 ప్రదర్శనలు మాత్రమే జరిగాయి. ‘కరోనా’ భయం చాలావరకు కనుమరుగవడంతో ఈసారి పూర్తిస్థాయిలో సంబరాలు జరుగుతుండటంతో జనాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. విచిత్రవేషధారులతో, సర్కస్ విన్యాసాల ప్రదర్శనలతో ఎడిన్‌బరో వీథులన్నీ కళకళలాడుతున్నాయి. చదవండి: ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా? -
ఆజాద్ హింద్ ఫౌజ్.. ఖుషీ కే గీత్ గాయే జా..!
ఆ ప్రశ్న ఎందుకు వేశానా అనిపించింది. అలా అడిగాక మొదట అతడు చేసిన పని, తటాల్న నాకేసి చూడడం. నన్ను చూస్తూనే బుగ్గల మీద ఎడం చేత్తో రాసుకున్నాడు, కొన్ని సెకన్లు. దంతాలు ఊడి లోతుకుపోయిన బుగ్గలు. ఓ నిమిషం తరువాత అతడి ముఖంలో చిన్న నవ్వు. అప్పుడే కళ్లూ మెరిశాయి, ఒక్కసారిగా. ‘చూశాను బాబూ!’ స్థిరంగా అన్నాడతడు. అతని గొంతుపెగిలాక నా మనసు శాంతించింది. పాట అందుకుంటే రెండు వీధుల అవతల ఉన్నా ఖంగుమంటూ వినిపించే ఆ గొంతు అంత మార్దవంగా, అంత మంద్రంగా స్పందించడం కొంచెం వింతే. ఎంత గొప్పగా పాడతాడో ఆ పాటలన్నీ ‘కదం కదం బఢాయే జా, ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందగీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ ఒళ్లు గగుర్పొడుస్తుంది. సాగిపో సాగిపో మున్ముందుకు, ఆనందగీతికలను ఆలపిస్తూ సాగిపో, నీ జీవితాన్ని మాతృభూమి కోసం అర్పించుకో ఎంత బలమైన భావన. ఇదే కాదు శుభ్ సుఖ్ చైన్ కీ బర్ఖా బర్సే, ఎక్ల చొలో, హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ వంటి పాటలూ పాడతాడు. శ్రీరాములు, కొల్లి శ్రీరాములు.. ఒంటి మీద ఖాకీ మిలటరీ యూనిఫారవ్ు. టక్ చేసుకున్నాడు. అప్పటిదే కాబోలు ఆ యూనిఫారవ్ు. శిథిలమైపోయినట్టున్నా, రంగు మాత్రం వెలిసిపోలేదు. అతడు ఒక వయసులో ఎలా ఉన్నాడో చెబుతూ, ఆ శరీరం మీద ఇప్పుడు వేలాడిపోతోంది. దాని వయసు కనీసం యాభయ్ ఏళ్లు. కాళ్లకి బూట్లతోనే బాసిం పట్టు వేసుకుని నేల మీద కూర్చున్నాడు. బూట్లు కూడా అప్పటివేనేమో! స్లాబ్ పనివాళ్ల బూట్లలా ఉన్నాయి. ఆ రూపం చిన్నతనం నుంచి మేం చూస్తున్నదే. మామూలు బట్టల్లో ఏనాడూ చూసిందిలేదు. జుట్టు మరీ ముగ్గుబుట్ట కాలేదు. కొద్దిగా నల్ల వెంట్రుకలూ ఉన్నాయి. నడినెత్తి మీద నుంచి వెనక్కే. ముందంతా బట్టతల, వెనక జులపాలు. నల్లటి శరీరం. నుదురు కింద లోతుకు పోయిన కళ్లు. ఆ మహావ్యక్తిని చూసిన కళ్లు ఇవే! అదృష్టం చేసుకున్నాయి! ‘ఎక్కడ చూశావు శ్రీరాములు?’ ‘బర్మాలో బాబూ!’ ఏదో లోకంలో ఉన్నట్టే ఆ మాటలన్నాడు. నేను ఐదో తరగతిలో ఉండగా, ఓ ఆగస్ట్ 15 పండుగకి ఒక సన్నివేశంలో అతడిని చూసినప్పటి నుంచి నాకు ఓ రకమైన సానుభూతి.. శ్రీరాములంటే. నాన్నగారు చెప్పినదానిని బట్టి గౌరవం కూడా. మా ఇంటి బయటకొచ్చి నిలబడినా మేం చదువుకున్న ఆ స్కూలు కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం ఇవతలే అమ్మవారి గుడి. దానికి దగ్గరగా గ్రామ పంచాయతీ కార్యాలయం. ఆ ఘటన జరిగింది ఆ కార్యాలయం ముందే. శ్రీరాములుకి గుర్తుందో లేదో! దారే కాబట్టి ఆ కార్యాలయం ముందు నుంచి పాడుకుంటూ అతడు ఎప్పుడు నడిచి వస్తున్నా, వెళుతున్నా నాకు మాత్రం ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది. తరువాత అతడిని చూస్తున్న కొద్దీ నాకూ అనిపించేది, ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు. ఎందరికో ఉన్న అభిప్రాయమే. అలా చూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడచిపోయాయి. పదిరోజులకీ, పదిహేను రోజులకీ ఒకసారి ఇంటిముందుకొచ్చి అరుస్తాడు, అటెన్షన్లో నిలబడే, ‘బోసుబాబు అనుచరుడినొచ్చానయ్యా! ధర్మం చెయ్యండి!’ బిచ్చగాళ్లు వచ్చినప్పుడు వేయడానికి సావిట్లో నల్లటి రేకు డబ్బా ఉంటుంది, బియ్యంతో. రెండు కేజీల వరకు పడుతుంది. అంతకంటే పెద్ద డబ్బాలో వడ్లు ఉంటాయి. కొందరికి బియ్యం, కొందరికి ధాన్యం. ఎవరికైనా దోసెడు. నాన్నగారు ఎప్పుడో చెప్పేశారు, శ్రీరాములిని అలా చూడకండని. అందుకే ఎప్పుడొచ్చి నిలబడినా డబ్బా నిండుగా బియ్యం పట్టుకొచ్చి అతడి పాత్రలో పోస్తాం. శ్రీరాములుని చూడగానే ‘జైహింద్’ అనేవారు పిల్లలు. అతడు ఉరిమినట్టు ఇంకా గట్టిగా అనేవాడు, కాలుని నేలకి బలంగా తాటించి, సెల్యూట్ చేస్తూ. ఆ నినాదం ఇచ్చినందుకు పిల్లలని సంతోషపెట్టడం తన కర్తవ్యం అనుకునేవాడు కాబోలు. ఒక్కొక్క వస్తువుని లేదా జంతువుని కొన్ని భాషలలో ఏమంటారో చెప్పేవాడు. ‘కుక్క.. తెలుగులో కుక్క, హిందీలో కుత్తా, ఇంగిలీసులో డాగ్, బర్మాలో హావె, తమిళంలో నాయీ, బెంగాలీలో కుకురో..’ అంటూ చెప్పేవాడు. కానీ ఈ ప్రవర్తనే అతడి మీద మతి స్థిమితం లేనివాడి ముద్ర వేసింది. అది నిజమే, శ్రీరాములుకి మతి చలించిందని నాన్నే చెప్పారు. అలా జరిగిందీ ఒక సందర్భంలోనే. ఇలా కథలు కథలుగా చెప్పుకునేవారు. ఎప్పటి నుంచో శ్రీరాములుతో మాట్లాడాలని చూస్తుంటే, అనుకోకుండా ఈ రోజు సాధ్యపడింది, నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు. అతడి మీద ఇంకాస్త వృద్ధాప్యం పడింది. అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టు, పై జేబులోంచి బంతిలా చుట్టిన ఒక గుడ్డ తీశాడు, ఖాకీదే. మడత విప్పాక తెలిసింది, అది ఖాకీ టోపీ. ఎంతో భక్తిగా, పద్ధతిగా శిరస్సున అలంకరించుకున్నాడు. ఆ టోపీతో ముఖం ఏదో ప్రత్యేకతని సంతరించుకుంది. సుభాష్‌చంద్ర బోస్ రూపం నా దృష్టిపథంలోకి వచ్చి నిలిచింది వెంటనే. అలాంటిదే టోపీ. ఔను, శ్రీరాములు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేసి వచ్చాడు. లోపలికి రమ్మని పదిసార్లు పిలిస్తే మొత్తానికి వచ్చాడు. దూరంతో కూడిన చనువు, మా ఇంట్లో. నేరుగా పెరట్లోకి వెళ్లాం. బావి చూడగానే నీళ్లు తోడుకుని తాగాడు. తడి ముఖంతో, చేతులతో అక్కడే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నేల మీద చతికిలపడ్డాడు. కాస్త ఎత్తుగా ఉండే నూతిపళ్లెం అంచున నేను కూర్చున్నాను. ‘విలేకరుగారు, అమ్మగారు..?’ ఉన్నారా అన్నట్టు అడిగాడు. ‘లేరు, పెళ్లికెళ్లారు. ఏమైనా చెప్పాలా?’ అన్నాను. విలేకరుగారంటే మా నాన్నగారే. ఆ చుట్టుపక్కల ఆయనకు అదే పేరు. ఆంధ్రప్రభకి గ్రామీణ విలేకరి. ఏమీ లేదన్నట్టు తలాడించి, మళ్లీ మౌనం దాల్చాడు శ్రీరాములు. వాస్తవానికి అతడు ఏదో జ్ఞాపకపు గాలానికి చిక్కుకున్నాడనాలి. రెండు నిమిషాల తరువాత మళ్లీ అడిగాను. ‘సుభాష్ బోస్ ఎలా ఉండేవారు?’ ‘శివాలయంలో నందంత అందంగా, కొట్టొచ్చినట్టు ఉండేవారు బాబూ!’ ఒక ఉద్యమ నేత మీద ఎంత గౌరవం ఉంటుందో బాగా అర్థమయింది. ఆ మాట అంటున్నప్పుడు అతడి రెండు చేతులూ నమస్కరిస్తున్నట్టు కలసి గాల్లోకి లేచాయి. నేత్రాలు అర్ధనిమీలితాలయ్యాయి. మద్దూరి అన్నపూర్ణయ్య గారని, ఆయన సుభాష్‌చంద్ర బోస్‌ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు శ్రీరాములు మొదటిసారి విన్నాడట ఆ పేరు. ఈ బోస్గారే సింగపూర్‌లో ఐఎన్ఏతో ఉద్యమం మొదలుపెట్టాడని తెలిసిందట. ఒక వేకువన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడట. ఇంకొకరు ఎవరో చెబితే కలకత్తా వెళ్లి, అక్కడి నుంచి బర్మా చేరుకుని మొత్తానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడట. ఎవరో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుడు రాసిన స్వీయానుభవమే ఎక్కడో చదివాను. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమితో ఫౌజ్ సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీ తీసుకువచ్చి ఎర్రకోటలో సైనిక విచారణ పేరుతో హింసించారు. యుద్ధఖైదీల్లా కాదు, నేరగాళ్లని చూసినట్టు చూశారు. రెండురోజులకీ మూడురోజులకీ ఒకసారి తిండి పెట్టేవారు. అలాంటి పరిస్థితిలో కొందరిని పరుగెట్టమని, వెనక నుంచి కాల్చి చంపారు కూడా. బతికి బయటపడి ఢిల్లీ నుంచి శ్రీరాములు కోనసీమలో తన స్వగ్రామానికి వచ్చాడని నాన్నగారు చెప్పేవారు. ఆ ఒక్కరోజే అతడు హీరో. ఎలా వెళ్లాడో, ఎలా వచ్చాడో! స్వాతంత్య్రం వచ్చింది. ఊరూవాడా ఉత్సవాలు జరిగాయి. స్వాతంత్య్ర పోరాటం తరువాత చాలామంది స్వాతంత్య్ర సమరయోధులకి జీవనపోరాటం ఎదురైంది. అలాంటి వాళ్లలో శ్రీరాములూ ఉన్నాడు. అసలు ప్రశ్న. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం శ్రీరాములుకి స్పృహలో ఉందో లేదో! నాకు ఎప్పటికీ గుర్తుంటుందన్న ఆ సందర్భం ఆగస్ట్ 15నే జరిగింది. అంటే శ్రీరాములు అనే ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవితంలో ఆ రోజు కూడా భిక్షాటనతోనే గడిచింది. శ్రీరాములు గాథంతా నాన్నగారు వార్తాకథనంగా రాశారు. చాలామంది సమరయోధులకి పింఛను వచ్చింది. భూములు దక్కాయి. ఉచిత ప్రయాణాలు అమరాయి. తామ్రపత్రాలూ వచ్చాయి. దేశం కోసం జవానుగా మారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన శ్రీరాములుకి ఏమీ రాలేదు. కారణం, అతడు దేశం కోసం దేశం బయట నుంచి పోరాడాడట. అది నిజమేనని చెప్పే రికార్డేదీ లేదట. ప్రస్తుతం అతడికి భుక్తి గడవడం కష్టంగా ఉందనీ, ఇస్తే ఏ ఉద్యోగమైనా చేస్తాడంటూ కథనం ముగించారట నాన్న. ఎవరో సహృదయుడు స్పందించాడట. మద్రాస్‌లో ఉంటాడట. పెద్ద ఆఫీసరట. నూట యాభయ్ రూపాయల జీతంతో, ఉండడానికి క్వార్టర్స్ సహా అన్నీ ఇస్తానని పత్రికా కార్యాలయానికి ఉత్తరం రాస్తే, అది నాన్నగారికి చేర్చారు వాళ్లు. ఎందుకో ఏమో, అప్పుడే మూడువారాలైనా మా ఊరివైపు రాలేదట శ్రీరాములు. విషయం చెప్పి, ఇంటికే కబురు చేశారు నాన్న. శ్రీరాములు భార్యే కాబోలు ఎవరితోనో కబురు పెట్టింది, ఇప్పుడు అతడిని అంత దూరం పంపలేమన్నదే దాని సారాంశం. నాన్న వాకబు చేశారు. శ్రీరాములుకు మతి చలించిందని తెలిసింది. బోస్ బతికే ఉన్నాడా? విమాన ప్రమాదంలో మరణించాడా? ఇదే ధ్యాసట కొంతకాలం. కారణం దేశమంతా ఇదే చర్చట. ఎలా తెలుసుకున్నాడో, ఏం తెలుసుకున్నాడో, అంతిమంగా బోస్ మరణించడమే నిజమన్న నిర్ణయానికి వచ్చాడట శ్రీరాములు. అప్పటి నుంచి మనిషి మారిపోయాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే చేతికి భిక్షాపాత్ర వచ్చింది. బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించిన సైన్యం తన కవాతులో పాడుకున్న దేశభక్తి గీతాలు భిక్షాపాత్రా, కడుపూ నింపుకోవడానికి అభ్యర్థనలుగా ఉపయోగపడుతున్నాయి. ‘మా పొలాలు చూడు అని నీకు చెప్పడానికి మనసొప్పక చెప్పలేదయ్యా శ్రీరాములు. నీకేమిటీ ఖర్మ? వచ్చి మా పొలం పనుల్లో సాయపడు. ఎంతో కొంత ఇస్తాను.’ నాన్నది చిన్నపాటి సేద్యమే అయినా, సాటి స్వాతంత్య్ర సమరయోధుడికి సాయం చేయాలనుకుని, ఈ మాట అన్నారట. ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయాడట. భిక్షాటనలోనే ఉండిపోయాడు. ‘ఇదిగో! ఇది ఉంచు!’ అని పది రూపాయలు, నా పాకెట్ మనీ, అతడి చేతిలో పెట్టాను. మళ్లీ మొహమాటం. ‘తీసుకో ఫరవాలేదు’ అంటే, జేబులో పెట్టుకుని లేచాడు. ‘సెలవిప్పించండి!’ అన్నాడు, సెల్యూట్ భంగిమలో. నేను కూడా లేచాను. సింహద్వారం దాకా వెళ్లాను. నెమ్మదిగా మెట్లు దిగి వీథిలోకి వెళ్లిపోయాడు శ్రీరాములు. ఎదురుగా కనిపిస్తోంది పంచాయతీ కార్యాలయం. ముందు నుంచే నడిచి వెళుతున్నాడతడు. ఆ రోజూ, అతడు పాడిన సందర్భం ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే గుర్తుకు వచ్చాయి. ఆ ఆగస్ట్ 15కి కూడా బడి దగ్గర నుంచి మమ్మల్నందరినీ ఉరేగింపుగా తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయం ముందు బారులు తీర్చారు. తరగతుల వారీగా నిలబెడుతున్నారు. ఆ పనంతా వీరస్వామి మాస్టారిదే. పిల్లలంతా సిరా నీలం రంగు నిక్కరు, తెల్లచొక్కాలతో, ఆడపిల్లలు కూడా అలాంటి కూడికతోనే గౌన్లు, స్కర్టులతో ముచ్చటగా ఉన్నారు. మా పైనంతా రంగురంగుల కాగితపు జెండాల తోరణాలు. నిటారుగా ఉన్న ఒక సరుగుడు కర్రని కార్యాలయం ముందు పాతిపెట్టారు. దానికే వేలాడుతోంది మువ్వన్నెల జెండా. జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. గోలగోలగా ఉందంతా. కార్యాలయం లోపల ఊరి పెద్దలు పది పన్నెండు మంది ఖద్దరు దుస్తుల్లో తిరుగుతున్నారు, హడావిడి చేస్తూ. బడిపిల్లల గోల కంటే ఎక్కువే ఉంది. ఉదయం తొమ్మిది గంటల వేళకి సర్పంచ్‌గారు కష్టపడి జెండా ఎగరేశారు. వెంటనే వీరాస్వామి మేస్టారు ‘జెండా ఊంఛా రహే హమారా.. విజయీ విశ్వతిరంగా ప్యారా’ అంటూ పిడికిలెత్తి ఉద్విగ్నంగా పాడితే మేమంతా ఉత్సాహంగా అనుసరించాం. ఇంకొద్ది సేపటికి మేం ఎదురుచూస్తున్న చాక్లెట్ల పంపకం మొదలయింది. అప్పుడే లోపల పెద్దల చేతికి తలొక ప్యాకెట్ వచ్చింది. ఇడ్లీ కాబోలు. చాక్లెట్లు చేతుల్లో పడినవాళ్లు పరుగెత్తుతున్నారు. ఐదో తరగతి వాళ్లందరం చివర్న ఉన్నాం. లోపల పెద్దలు తినడం పూర్తి చేసి బయటకొచ్చి చేతులు కడుగుతున్నారు. ఒకళ్ల తరువాత ఒకళ్లు.. ఆ నీళ్లు నెమ్మదిగా ముందుకొస్తున్నాయి, సరిగ్గా జెండా కర్ర దిశగా, ఆ మహానుభావుల ఫొటోలు ఉన్న కుర్చీల కిందకే. వీరాస్వామి మాస్టారు, సరోజినీ టీచరమ్మ, మార్తమ్మ టీచరు, హెడ్మాస్టరు శివలపంతులు గారు, ఆయా వెంకమ్మ అట్టపెట్టెలలో తెచ్చిన చాక్లెట్లు పంచుకుంటూ వస్తున్నారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీరాములు. నేరుగా పంచాయతీ కార్యాలయం ముందుకెళ్లి గట్టిగా అరిచాడు, ‘బాబూ! బోసుబాబు అనుచరుణ్ణొచ్చాను. నాక్కూడా ఓ పొట్లం ఇప్పించండి బాబూ!’ ఒక్క నిమిషం ఆగి మళ్లీ అరిచాడు శ్రీరాములు. చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చిన ఓ ఖద్దరుధారికి ఆ అరుపు చిర్రెత్తించింది. ఏదో అనబోయాడు గాని, గొంతులో నీళ్లు దిగేదాకా ఆగాడు. ఈసారి పాట అందుకున్నాడు శ్రీరాములు. ‘హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ..’ ‘ఛ, అవతలకి పో!’ భరించలేనట్టే అసహనంతో అరిచాడు పెద్దమనిషి. పెద్దలకి కలిగిన అసౌకర్యానికి భయపడిన ప్యూను వెంటనే ప్రత్యక్షమై, ‘పైకెళ్లు.. పో, పైకెళ్లు..’ మీదకెళుతూ అన్నాడు, పొమ్మని బిచ్చగాళ్లకి చెప్పేమాట. అలాంటి చీదరింపులకి అలవాటు పడిపోయినట్టు నిర్లిప్తంగా ఉండిపోయాడు శ్రీరాములు. అంతా అటే చూశారు. నిమిషం తరువాత భారంగా కదిలాడు శ్రీరాములు. పంచాయతీ కార్యాలయం దాటి, ముందుకు వెళ్లిపోయాడు. చెట్లపల్లి వారి ఇంటి పక్క నుంచి వెళ్లే కాలిబాటని అనుసరించాడు. రెండు మూడు నిమిషాల తరువాత గాలి మోసుకొచ్చింది పాట. ‘కదం కదం బఢాయే జా.. ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందతీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ సావిట్లోకి అడుగుపెట్టిన తరువాత దూరం నుంచి శ్రీరాములు కంఠం లీలగా. గెలవాలన్న నిశ్చయం, ఓడిపోతున్నానన్న దిగులుతో కలసి జుగల్బందీ చేస్తున్నట్టుంది. ‘.. ఖుషీ కే గీత్ గాయే జా.. కదం కదం బఢాయే జా..’ జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. ∙డా. గోపరాజు నారాయణరావు -
సరదాగా.. సండేఫన్డే
కవాడిగూడ: నగర వాసుల ఆహ్లాదం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘సండే..ఫండే’ సందర్శకులతో హుషారుగా సాగింది. సండే ఫండేను గతంలో ప్రారంభించినప్పటికీ కరోనా నేపథ్యంలో నిలిపి వేశారు. 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై సండేఫండేను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ను విద్యుత్ కాంతులు, జాతీయ జెండాలతో అలంకరించారు. నగర వాసులు కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. చిన్నారులకు ఇష్టమైన తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. యువత జాతీయ జెండాలతో దేశభక్తి చాటుతూ సెలీ్ఫలు దిగారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొదటి సండే వర్షం ప్రభావం వల్ల సండేఫండేకు అధిక సందర్శకులు హజరు కాలేకపోయారు. సండేఫండే సందర్శంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపి వేశారు. (చదవండి: జనాభాను మించి ఆధార్! ) -
క్రైమ్ స్టోరీ: రెండు పిట్టలు.. ఒకే దెబ్బ!
18 నవంబర్ 1996. ఆ రోజు దినపత్రిక చదువుతున్న సీఐ ష్రఘ్వీ తన స్టేషన్ పరిధిలో ఉన్న సహన ఫార్మాస్యూటికల్ కంపెనీ డైరెక్టర్ సరితాదేవిని ఎవరో హత్య చేశారని ఫోన్ రావడంతో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. హత్య జరిగిన గదిలోకి వెళ్లి, అన్నీ పరిశీలించి, పోస్ట్‌మార్టమ్, ఫింగర్ ప్రింట్స్ ఏర్పాట్లు చూడమని, అక్కడ ఉన్న అన్ని వస్తువులూ, ఫైల్స్ కూడా స్టేషన్‌కి పంపమని అక్కడ నుండి బయటకు వచ్చాడు సీఐ. బయట ఉన్న మేనేజర్ని కలుసుకుని, కొన్ని విషయాలు సేకరించి, ఇంకో డైరెక్టర్ నరేష్ రూమ్ వద్దకు వెళ్లాడు సీఐ.. రాత్రి పడిన వర్షానికి చిత్తడిగా ఉన్న నేల మీద నెమ్మదిగా నడుస్తూ. ‘ఈ కంపెనీ, చనిపోయిన ఈవిడదేనా? ఈ క్వార్టర్లో ఈవిడతో పాటు ఎవరు ఉంటారు? కొంచెం వివరంగా చెప్పండి’ నరేష్‌ని అడిగాడు సీఐ ష్రఘ్వీ, ‘సార్, ఐదేళ్ల క్రితం సరితాదేవి, హరనాథ్, నరేష్ అనే నా పేరునూ కలిపి, మా పేర్లలో మొదటి అక్షరాలు కలిసి వచ్చేలా కంపెనీకి సహన అని పేరు పెట్టి ప్రారంభించాం. సరిత ఒక్కరే ఈ క్వార్టర్లో ఉంటారు. హరనాథ్ చెన్నైలో ఉంటాడు. నేను ఇక్కడే సిటీలో ఉంటాను’ చెప్పాడు నరేష్. ‘మిస్టర్ నరేష్, గదిలో ఎటువంటి వస్తువులు చోరీకి గురి కాకపోవడం చూస్తూంటే, నిందితుడు కేవలం ఆమెను చంపడానికే వచ్చినట్టుంది. సూటిగా అడుగుతున్నా.. సరితాదేవికి కుటుంబ సభ్యులనుంచి కానీ, బిజినెస్ పరంగా కానీ ఎవరైనా శత్రువులున్నారా?’ ‘ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. తల్లి కూడా ఈ మధ్యనే మరణించింది. ఇక బిజినెస్ పరంగా అంటే, మా పార్ట్నర్ హరనాథ్ తనను తరచూ ఫోన్లో బెదిరిస్తున్నాడు అని చెబుతూండేది. ఇంకో విషయం, అతను కాలేజీ రోజుల నుంచి కూడా ఆమెను ప్రేమించేవాడు. అమె అతడిని దూరంగా ఉంచింది. అందుకే అతను ఇక్కడ ఇమడలేక చెన్నైలో ఉంటున్నాడు. అంతే కాదు, మొన్న జనవరిలో అయితే ఏకంగా ఓ బెదిరింపు లెటర్ వచ్చిందని కూడా చెప్పింది’ చెప్పాడు నరేష్. ‘ఆమె హత్య వలన హరనాథ్‌కి ఏమిటి ప్రయోజనం?’ ‘ఏముంది సార్, మా బిజినెస్ బావుంది. దాని మీద ఇతని కన్ను పడింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఆమెను హత్య చేసి, ఆ నేరం ఇదే ఊర్లో ఉంటున్న నా మీదకు తోసేసి, మా ఇద్దరినీ అడ్డు తొలగించి, కంపెనీ తన అధీనంలోకి తీసుకోవచ్చుగా?’ ‘అయితే, ఆయనే హత్య చేశాడంటారా?’ అడిగాడు సీఐ. ‘లేదు, చేయించి ఉంటాడు. ఎందుకంటే నిన్ననే అతను చెన్నై నుంచి వచ్చి, లాడ్జిలో ఉన్నాడు. రాత్రి నాకు ఫోన్ చేసి, ‘నేను వేరే బిజినెస్ పనిమీద ఇక్కడకు వచ్చేను. నీకు తెలుసుగా, సరితకు చెన్నై సాంబార్ అంటే ఇష్టమని. ఓ సాంబార్ పౌడర్ ప్యాకెట్ తెచ్చాను. అది ఆమెకు అందచేయాలి. మీ మనిషిని పంపిస్తావా?’ అని అడిగాడు. దానికి నేను, ‘ఎవరూ లేరు. అయినా వర్షం వస్తోంది కుదరదు’ అని చెప్పాను. అయినా కానీ రాత్రి ఎవరో మనిషిని ఇచ్చి పంపేడుట. నాకు తెలిసి, ఆ వచ్చిన మనిషి కిరాయి హంతకుడు అయి ఉండవచ్చు’ చెప్పి కంటి నీరు తుడుచుకున్నాడు నరేష్. నరేష్ రూమ్‌లోంచి బయటకు వచ్చిన ష్రఘ్వీ, సెక్యూరిటీ ఆఫీస్ వద్దకు వచ్చి, ‘రాత్రి మేడమ్ గారిని కలుసుకోవడానికి ఎవరు వచ్చారో చెప్పగలవా?’ రాత్రి డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డుని అడిగాడు. అతను చెప్పిన వివరాలు అన్నీ సేకరించి, చివర్లో ‘అతడిని గుర్తు పట్టగలవా?’ అడిగాడు సీఐ. ‘చలి మూలంగా మొహం అంతా మఫ్లర్ చుట్టుకున్నాడు, గుర్తు పట్టలేను సార్. అయితే నేను ఇక్కడ చేరి పదిరోజులే అయ్యింది సార్’ చెప్పాడు గార్డు. ఆ రోజు సాయంత్రం అంతవరకూ లభించిన ఆధారాలతో, లాడ్జిలో ఉన్న హరనాథ్‌ను అదుపులోకి తీసుకుని, స్టేషన్లో విచారణ మొదలెట్టాడు ష్రఘ్వీ. ‘సీ.. మిస్టర్ హరనాథ్! ఏ విధంగా చూసినా సరితాదేవి హత్యలో మీ ప్రమేయం కనబడుతోంది. ఆఫీసులో ఫోన్ బిల్లులు వెరిఫై చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆవిడ మిమ్మల్ని తిరస్కరించిందన్న కోపంతో, ఆమెను కంపెనీ షేర్లు అమ్ముకుని బయటకు పొమ్మని బెదిరిస్తూ తరచుగా ఫోన్ చేస్తున్నారని’ చెప్పాడు సీఐ. ‘సార్, అంతా అబద్ధం. ఆమెను ప్రేమించి, ఆమెచే తిరస్కరించబడ్డది నేను కాదు, నరేష్! అతను లైంగికంగా వేధిస్తున్నాడని తరచుగా ఫోన్లో నాతో చెప్పుకుని బాధపడేది. నేను ధైర్యం చెప్పేవాడిని. అందుకే మా ఫోన్ బిల్లుల మీద మీకు అనుమానం వచ్చి ఉంటుంది’ చెప్పాడు హరనాథ్. ‘ఇదే విషయం నీ గురించి నరేష్ కూడా చెప్పాడు కానీ, మరి నిన్న రాత్రి ఆమెను హత్య చేసిన ఆ కిరాయి హంతకుడిని ఎందుకు పంపినట్లు?’ అడిగాడు సీఐ. ‘సార్, సరితాదేవిని హత్య చేయమని నేను ఏ మనిషినీ పంపలేదు. నరేష్ తన డ్రైవర్ని పంపడం కుదరదని చెప్పడంతో నేను హోటల్లో ఉన్న ఓ కుర్రాడికి ఓ ప్యాకెట్ ఇచ్చి పంపించాను. కానీ మార్గమధ్యంలో ఎవడో బైకుతో ఆ కుర్రాడిని ఢీకొట్టి, ఆ ప్యాకెట్‌తో ఉడాయించాట్ట. నాకు ఆ విషయం ఈ ఉదయమే తెలిసింది. ప్రస్తుతం ఆ కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు’ అసలు విషయం చెప్పాడు హరనాథ్. ‘సరే, అది అలా ఉంచు. మరి నువ్వు సరితాదేవిని బెదిరిస్తూ రాసిన ఈ లెటర్ మాట ఏమిటి?’ అడిగాడు ష్రఘ్వీ, ఆ లెటర్ హరనాథ్ చేతికిచ్చి. తన ఇంటి అడ్రసుతో ఉన్న లెటర్ హెడ్ మీద తెలుగులో ఉన్న ఆ లెటర్ చదవడం మొదలెట్టాడు హరనాథ్. చెన్నై ,30.12.1995. డియర్ సరితా, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నీకు మొన్న ఫోన్లో చెప్పిన విధంగా, కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా, కంపెనీలో నీ వాటాలు విక్రయించి డైరెక్టర్ పోస్ట్‌కు రాజీనామా చేసి వెడతావని ఆశిస్తున్నా. తరువాత బాధపడి ప్రయోజనం లేదు. ఇట్లు (ఏ.హరనాథ్) ‘సరే, లెటర్ చదివేవు కదా! ఇప్పుడు చెప్పు, ఇది నువ్వు పంపినదేనా?’ అడిగాడు సీఐ ష్రఘ్వీ. ‘ఈ లెటర్ హెడ్ నాదే కానీ, సంతకం నాది కాదు. ఎవరో ఫోర్జరీ చేసినట్లు ఉంది. ఈ లెటరూ నేను పంపలేదు’ ఆశ్చర్యంగా చెప్పాడు హరనాథ్. ‘నిజానిజాలు త్వరలో తెలుస్తాయి కానీ, అంతవరకూ మా అధీనంలో ఉండాలి. ఔనూ ఇంతకీ నిన్న సరితాదేవికి పంపిన ఆ ప్యాకెట్ ఏమిటి? అందులో ఉన్నది సాంబార్ పౌడరేనా లేక..’ అడిగాడు సీఐ. ‘ఒహ్.. అదా సార్? ఆ ప్యాకెట్లో..’ అంటూ మొత్తం విషయం వివరించాడు హరనాథ్. ‘ఓ ఐసీ. ఆ ప్యాకెట్ ఇంకా మా దగ్గరే ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదు’ అంటూ స్టేషన్ నుంచి బయటకు నడిచాడు సీఐ ష్రఘ్వీ. ∙∙l మర్నాడు ఉదయం, పక్కా ఆధారాలు, సాక్ష్యాలు లభించడంతో నరేష్ ఇంటికి వెళ్లి, అతడిని అరెస్టు చేశాడు ష్రఘ్వీ. ‘దారుణం, నాకేమీ తెలియదు. కావాలనే ఆ హరనాథ్ నన్ను ఇందులో ఇరికిస్తున్నాడు’ భోరుమని విలపించసాగేడు నరేష్. ‘నీ దొంగ ఏడుపు ఆపు మిస్టర్ నరేష్. అసలు జరిగింది ఏమిటో నేను చెబుతాను విను. హరనాథ్ తన సొంత పనిమీద హైదరాబాద్ వస్తున్నాడన్న విషయం నీకు మూడు రోజుల ముందే తెలిసింది. వెంటనే సరితాదేవిని హత్య చేసి ఆ నేరం హరనాథ్ మీదకు మళ్లేలా పథకానికి రూపకల్పన చేశావు. అందులో భాగంగా నీ దగ్గర ఉన్న హరనాథ్ కొత్త లెటర్ హెడ్ మీద పాత తేదీతో, మొన్ననే ఓ లెటర్ సృష్టించావు.’ ‘అంతా అబద్ధం’ గట్టిగా అరిచాడు నరేష్. ‘కంగారు పడకు. నాకు అనుమానం వచ్చి, నేను అదే లెటర్‌ను మళ్లీ మీ టైపిస్ట్ చేత ఈరోజు టైప్ చేయించా. మీ ఆఫీసు టైప్ మిషన్‌లో ‘ర’, ‘ ?’ అనే అక్షరాలకు దుమ్ము పట్టేయడం వలన మూడు రోజుల క్రితం నువ్వు సృష్టి్టంచిన లెటర్ మీద, అలాగే ఈరోజు లెటర్ మీద కూడా ఒకలాగే వచ్చాయి. మీ టైపిస్ట్‌ను గట్టిగా అడిగేసరికి అతను మీరే ఈ పని చేయించారని ఒప్పేసుకున్నాడు. అతను ప్రస్తుతం మా అధీనంలో ఉన్నాడు.’ ‘బ్రహ్మాండంగా అల్లారు క«థని. ఇంకెందుకు ఆలస్యం. ఆ కిరాయి హంతకుడిని కూడా నేనే పురమాయించేను అని చెప్పండి’ అన్నాడు ఉడికిపోతూ. ‘ఔను. అదీ నిజమే. ఎప్పుడైతే హరనాథ్ మీ మనిషి కోసం ఫోన్ చేశాడో, నువ్వు అనుకోని అదృష్టం కలసివచ్చిందని భావించి, మీ కంపెనీకి తరచూ అద్దెకు టాక్సీని నడిపే కిరాయిహంతకుడు అప్పారావుని ఈ పనికి పురమాయించేవు. మాకు లభ్యమైన ఆధారాలతో అతడిని కస్టడీలోకి తీసుకున్నాం. మా పద్ధతిలో విచారించేసరికి, అతడు జరిగింది అంతా చెప్పి లొంగిపోయాడు’ చెప్పాడు ష్రఘ్వీ. అంతా విన్న నరేష్ చేసేదేమీ లేక మౌనంగా తల వంచుకున్నాడు.‘సీ, మిస్టర్ నరేష్! నేరస్థుడు ఎప్పటికైనా దొరక్కపోడు. కానీ, ఆ ఫోర్జరీ లెటర్, అలాగే కిరాయి హంతకుడు విషయంలో నువ్వు చేసిన పొరబాట్లే నిన్ను పట్టించేశాయి.’ ‘ఔనా! ఏమిటి సార్ ఆ పొరబాట్లు?’ అమాయకంగా అడిగాడు నరేష్. ‘అవీ..’ అంటూ మొత్తం అంతా చెప్పాడు ష్రఘ్వీ. చేసేదేమీ లేక పోలీస్ జీపు ఎక్కాడు నరేష్. ‘మిస్టర్ నరేష్, నిన్ను చూస్తే జాలేస్తోంది. హత్య జరిగిన ఆ ఒక్క రోజూ నువ్వు కొంచెం ఓపిక పట్టి, కొంచెం తెలివి ఉపయోగించుంటే, నువ్వు ‘ఒక్క దెబ్బ’ వేయనక్కర లేకుండానే ఆ ‘రెండు పిట్టలు’ ఎగిరి పోయేవి’ స్టేషన్‌లోపలికి వస్తూ చెప్పాడు సీఐ ష్రఘ్వీ. ‘ఏంటి సార్ మీరనేది?’ కుతూహలంగా అడిగాడు నరేష్. ‘ఔను. సరితాదేవి హత్య జరిగిన రోజు సాయంత్రం, హరనాథ్ ఆమెకు ఫోన్ చేసి, కంపెనీ డైరెక్టర్‌గా తను రిజైన్ చేస్తున్నాననీ, షేర్లు కూడా అమ్మేస్తున్నానీ వాటికి సంబందించిన కాగితాలు ఒక ప్యాకెట్లో పెట్టి, ఓ కుర్రాడితో పంపిస్తున్నానీ, వీలైతే ఆమెను కూడా రిజైన్ చేసి బయటకు వచ్చేయమనీ చెప్పడంతో ఆమె కూడా అంగీకరించిందట. ఇవిగో ఆ సాంబారు పౌడర్ ప్యాకెట్‌తో పాటు ఉన్న రాజినామా కాగితాలు’ అంటూ చూపించాడు. ∙∙l మర్నాడు ట్రైనీ ఎస్సైలతో సమావేశం అయిన సీఐ ష్రఘ్వీ, ఈ కేసు గురించి చెప్పి ‘ఓకే, ఫ్రెండ్స్ అంతా విన్నారుగా! ఇప్పుడు చెప్పండి. నేను ఈ కేసును సునాయాసంగా సాల్వ్ చేయగలిగేలా, నరేష్ చేసిన ఆ రెండు తప్పులు ఏమిటి?’ అడిగాడు. ‘పాత తేదీతో లెటర్ క్రియేట్ చేయడం’ చెప్పాడు ఓ యస్సై. ‘ఆ కిరాయి హంతకుడి వేలిముద్రలు’ చెప్పాడు వేరొకతను. ‘మీరు చెప్పింది కొంచెం వాస్తవమే కానీ, అసలు విషయమేమిటంటే ఆ ఫోర్జరీ లెటర్ తయారు చేసింది 30.12.1995 తేదీతో. అప్పటికి మద్రాసు అనే పేరే వాడుకలో ఉంది. చెన్నై పేరు అమల్లోకి వచ్చింది 17.07.1996 నుంచి. అంటే, ఇతను మర్చిపోయి, రెండు నెలలు క్రితం హరనాథ్ కోసం వేయించిన కొత్త లెటర్ హెడ్ మీద పాత తేదీతో ఆ మేటర్ టైప్ చేయించాడు’ చెప్పాడు సీఐ ష్రఘ్వీ. ‘సార్, అతను చేసిన రెండో తప్పు?’ అడిగాడు ఇంకో ఔత్సాహికుడు. ‘మీరన్నట్టు హంతకుడి వేలిముద్రలు ఎక్కడా లేవు. కిరాయి హంతకుడు కాబట్టి, ముందుగానే జాగ్రత్త పడ్డాడు. కానీ, ఆ రోజు రాత్రి, వర్షంలో తడిసిన రైన్ కోటు, రైన్ షూస్ గేట్ వద్దే విప్పి వెళ్లమని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో, బూట్లు లేకుండా మట్టి కాళ్లతో మేడమ్ రూమ్‌లోకి వెళ్లడం వలన అక్కడ అతని పాద ముద్రలు దొరికాయి. ఆ పాదముద్రలను చూపించి, కంపెనీలో వారిని ఎంక్వయిరీ చేస్తే కొంతమంది గుర్తుపట్టి చెప్పారు అతను తరచూ వచ్చే టాక్సీ డ్రైవర్ అప్పారావని’ చెప్పాడు సీఐ. ‘వాళ్లు, పాదముద్రలు బట్టి ఎలా గుర్తు పట్టేరు సార్?’ ఆశ్చర్యంగా అడిగాడు ఓ ఎస్సై. ‘ఆ కిరాయిహంతక డ్రైవర్ రెండు పాదాలకీ నాలుగో వేలు భూమికి ఆనకుండా కొంచెం పైకి లేచి ఉంటుంది’ అసలు విషయం చెప్పాడు ష్రఘ్వీ . -
యోగర్ట్ షాప్ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
అమెరికన్స్‌ను వణికించిన అపరిష్కృత మిస్టరీల్లో ఈ కథొకటి. అది 1991 డిసెంబర్ 6. రాత్రి 11 దాటింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ‘ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ యోగర్ట్’ అనే క్లోజ్ చేసి ఉన్న షాపులోంచి మంటలు రావడం పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, కొద్దిసేపటికే ఫైర్ ఇంజన్ల మోతమోగింది. మంటలార్పేటప్పుడు కనిపించిన భయంకరమైన దృశ్యాలు సంచలనానికి తెరతీశాయి. షాపు వెనుక గది మధ్యలో ఒక అమ్మాయి నగ్నంగా శవమై ఉంది. తన చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. ఆమె బట్టలతోనే ఆమెని ఎవరో బంధించారు. షాపులో చెలరేగిన మంటలకు సగానికి పైగా శరీరం కాలిపోయింది. వెనుక గదికి వెళ్లి చూస్తే, మరో ముగ్గురు అమ్మాయిలు అదే రీతిలో నగ్నంగా ఓ మూలన పడి ఉన్నారు. తెల్లారేసరికి చనిపోయిన వారి వివరాలను తేల్చేశారు పోలీసులు. మరునాడు దేశమంతా ఇదే వార్త. చనిపోయిన నలుగురిలో జెన్నిఫర్ హార్బిసన్(17), ఎలీజా థామస్(17) ఇద్దరూ ప్రాణస్నేహితులు. అదే షాపులో పార్ట్‌టైమ్ ఉద్యోగులు. ఆ రాత్రి నైట్ షిప్ట్‌లో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో సారా హార్బిసన్(15) జెన్నిఫర్ సొంత చెల్లెలు. మరో అమ్మాయి అమీ అయర్స్(13) సారా స్నేహితురాలు. ఈ నలుగురూ జీవితంలో తమకంటూ ప్రత్యేకత ఉండాలని కలలు కన్నవారే. సారా, జెన్నిఫర్ ఇద్దరూ స్పోర్ట్స్‌లో ఎన్నో అవార్డ్స్ సాధించారు. ఇద్దరూ అక్కా చెల్లెల్లా కాకుండా స్నేహితుల్లా కలిసుండేవారు. అమీ కూడా ఎప్పుడూ వారి స్నేహాన్నే కోరుకునేది. తను చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికురాలు. ఫిషింగ్, హార్స్ రైడింగ్, పెట్స్ ట్రైనింగ్.. ఇలా తనదో ప్రత్యేక ప్రపంచం. ఇక ఎలీజా చాలా అందగత్తె. మోడల్ కావాలని కలలు కనేది. మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు కావలసిన డబ్బుల కోసమే పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ కష్టపడేది. ఒక్కోక్కరిదీ ఒక్కో కల. కానీ రాత్రికిరాత్రే అంతా తారుమారై, జీవితాలే ముగిసిపోయాయి. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో నలుగురినీ తీవ్రంగా హింసించి, లైంగిక దాడి చేశారని, తర్వాత తలలపై తుపాకీలతో కాల్చి చంపారని తేలింది. నేరస్థులు షాపు వెనుక డోర్ నుంచి పారిపోయినట్లుగా నిర్ధారించారు. కొన్ని సాక్ష్యాలు కాలి బూడిదైతే, మరికొన్ని మంటలార్పే క్రమంలో కొట్టుకుపోయాయి. దాంతో ఎవ్వరినీ అరెస్ట్ చేయలేకపోయారు. 1999 నాటికి బాధిత కుటుంబాల పోరు పెరిగింది. కేసు దర్యాప్తు చేసే అధికారులూ మారారు. అనుమానితుల్లో మారిస్ పియర్స్, ఫారెస్ట్ వెల్బోర్న్, మైకేల్ స్కాట్, రాబర్ట్ స్ప్రింగ్స్టీన్ అనే పాతికేళ్లలోపు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎవరో కాదు హత్యలు జరిగిన ఎనిమిదో రోజు తుపాకీతో పట్టుబడి, తగిన సాక్ష్యాలు లేక విడుదలైన వాళ్లే! ఈసారి మెక్సికన్ అధికారులు విచారించినప్పుడు నేరాన్ని ఒప్పుకున్నారు. అయితే, కీలకమైన మరే సాక్ష్యాధారాలు లేకపోవడంతో.. ఆ తర్వాత పోలీసులే తమతో బలవంతంగా ఒప్పించారని చెప్పారు. ఇలాంటి సాక్ష్యం చెల్లదని కోర్టు కొట్టేసింది. పైగా అదే ఏడాది అమీ లైంగిక దాడిలో బయటపడిన డీఎన్ ఏ ఆ నలుగురిలో ఏ ఒక్కరితోనూ సరిపోలేదు. మరి అసలు నేరస్థులెవరని కోర్టు అధికారులను నిలదీసింది. ఈ నలుగురిపై అభియోగాలను కొట్టేసింది. అయితే 2010 డిసెంబర్ 25 రాత్రి 11 గంటల సమయంలో మారిస్ పియర్స్ పెట్రోలింగ్ పోలీసుల కంటపడ్డాడు. అతడి కంగారు చూసి... పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, కత్తిదూశాడు. అధికారుల్లో ఒకరైన ఫ్రాంక్ విల్సన్ తుపాకీతో కాల్చి అతడ్ని చంపేశాడు. జెన్నిఫర్, ఎలీజాల డ్యూటీ తర్వాత పార్టీకి వెళ్లాలనేది ఆ నలుగురు అమ్మాయిల ప్లాన్. అందుకే అమీ, సారాలూ వాళ్లతో ఉన్నారు. షాప్ క్లోజ్ చేసే టైమ్‌కి చివరిగా ఉన్న కస్టమర్స్‌ని కూడా పోలీసులు విచారించారు. సుమారు 52 మంది ఆ సమయంలో షాప్‌కి వచ్చి పోయారని ప్రత్యక్షసాక్షుల కథనం. అయితే క్లోజింగ్ టైమ్ కాబట్టి షాప్ ఫ్రంట్ డోర్ జెన్నిఫర్ మూసేసి, ఇతర కస్టమర్స్ లోనికి రాకుండా చేసిందని, ఆ టైమ్‌లో ఓ వ్యక్తి వాష్‌రూమ్ లోపలికి వెళ్లడం గమనించినా, తిరిగి రావడం తాము చూడలేదని కొందరు చెప్పారు. మరోవైపు చివరిగా షాప్ నుంచి బయటపడిన ఓ జంట.. షాప్‌లో ఇద్దరు మగవాళ్లు నక్కి నక్కి ఉన్నట్లు అనిపించిందని, వారిలో ఒకరు గ్రీన్ కలర్ జాకెట్, మరొకరు బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నారని చెప్పారు. అయితే విచారించిన కస్టమర్స్‌లో ఆ ఇద్దరూ మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లే ఈ ఘాతుకానికి ఒడికట్టి ఉంటారని అంచనాలు వేశారు. మరోవైపు సీరియల్ కిల్లర్స్ పాత్రపై దర్యాప్తు చేసినా, ఫలితం దక్కలేదు. పైగా ఈ ఘటన జరిగిన రోజు షాప్‌లో 540 డాలర్లు గల్లంతైనట్లు యాజమాన్యం గుర్తించింది. అయితే అది నేరస్థుల డైవర్ టెక్నిక్‌లో భాగమేనని, వాళ్లు వచ్చింది డబ్బులు కోసం కాదని, అమ్మాయిల కోసమేనన్నది డిటెక్టివ్స్ నమ్మకం. అయితే ముప్పయ్యేళ్లు దాటినా ఈరోజుకీ నేరుస్థులెవరో తేలలేదు. నేటికీ యోగర్ట్ షాప్ పక్కనుంచి వెళ్లే వాళ్లు అక్కడ ఓ క్షణం ఆగుతారు. ఆ నలుగురు అమ్మాయిల స్మారక ఫలకంపై పూలు ఉంచి, ఎప్పటికైనా న్యాయం గెలవాలని కోరుకుంటారు. ∙సంహిత నిమ్మన -
‘సీలాండ్'.. దేశ జనాభా 27 మంది మాత్రమే!
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సఫోక్ సముద్ర తీరానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వింతదేశం పేరు ‘సీలాండ్’. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై పూర్తిగా మానవ నిర్మిత ప్రదేశం ఇది. ఒక మానవ నిర్మిత ప్రదేశమే దేశంగా ఏర్పడటం దీని ప్రత్యేకత. ఇది 1967 సెప్టెంబర్ 2న ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి యూకే ప్రభుత్వం సముద్రం మధ్య రెండు భారీ రాతి స్తంభాలను కలుపుతూ ఇక్కడ తన రక్షణ అవసరాల కోసం కోటను నిర్మించుకుంది. యుద్ధం ముగిశాక ఖాళీగా మిగిలిన ఈ కోటకు జాక్ మూరే, అతని కూతురు జేన్ చేరుకున్నారు. వాళ్లిద్దరూ ‘వండర్ఫుల్ రేడియో లండన్’ అనే పైరేట్ రేడియో స్టేషన్ తరఫున ఇక్కడకు వచ్చారు. ఆ పైరేట్ రేడియో స్టేషన్ అధినేత ప్యాడీ రాయ్ బేట్స్ 1967 సెప్టెంబర్ 2న ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయగీతం కూడా ఉన్నాయి. ఈ దేశం తన పౌరులకు పాస్‌పోర్టులూ ఇస్తోంది. ఈ దేశ జనాభా 27 మంది మాత్రమే! చదవండి: World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే! -
చియోంగ్ సిస్టర్స్ మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
కొన్నిసార్లు కథ ఏదో.. కట్టుకథ ఏదో తేల్చలేం! ఎవరిది నేరమో.. ఎవరిది న్యాయపోరాటమో.. గుర్తించలేం! ఏవి కన్నీళ్లో.. ఏవి కపటనాటకాలో ఊహించలేం. ఎవరు బాధితులో.. ఎవరు నిందితులో.. కనిపెట్టలేం! చియోంగ్ సిస్టర్స్ మిస్టరీ అలాంటిదే. అది 1997 జూలై 16. మారిజోయ్ చియోంగ్(21), జాక్వెలిన్ చియోంగ్(23) ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఫిలిప్పీనో–చైనీస్. సాయంత్రం ఆఫీస్ కాగానే.. ఇంటికి కలసి వెళ్లేందుకు.. ఫిలిప్పీన్స్‌లోని సెబు సిటీలో ఉన్న అయాలా మాల్ బయట కలుసుకున్నారు. కానీ రాత్రి పది దాటినా వాళ్లు ఇంటికి రాకపోయేసరికి.. మిస్టర్ డియోనిసియో, మిసెస్ థెల్మా చియోంగ్ దంపతులు పోలీస్‌స్టేషన్‌కి పరుగుతీశారు. అక్కడ ఆ వయసు పిల్లలు.. వారానికి ఒకసారి ఇంటికి రావడమే గొప్ప. దాంతో పోలీసులు కేసైతే నమోదు చేసుకున్నారు కానీ, పెద్దగా శ్రద్ధ చూపించలేదు. సరిగ్గా రెండు రోజులకు కార్కార్ సిటీకి చెందిన రూడీ లసాగా అనే స్థానికుడి నుంచి.. సెబు సిటీ సమీప లోయలో ఓ స్త్రీ మృతదేహం కనిపిస్తోందని పోలీస్‌స్టేషన్‌కి మరో కేసు వచ్చింది. కుళ్లిన దేహంపైన ఉన్న బట్టలను చూసి.. అవి మా అమ్మాయి మారిజోయ్వే అంటూ నెత్తినోరు బాదుకున్నారు చియోంగ్ దంపతులు. పోస్ట్‌మార్టమ్ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, బలవంతంగా లోయలోకి తోయడం వల్లే చనిపోయిందని తేలింది. మరి జాక్వెలిన్ ఏమైంది? ఫ్రాన్సిస్కో జువాన్ లారానాగా(పాకో), జోస్మాన్ అజ్నార్, రోవెన్ అడ్లావాన్, అల్బర్టో అలెన్ కానో, ఏరియల్ డెనిస్ రష్యాలతో పాటు జేమ్స్ ఆండ్రూ ఉయ్, జేమ్స్ ఆంథోనీ ఉయ్, (ఇద్దరూ సోదరులు, ఒకరు మైనర్) అనే ఏడుగురు యువకుల్ని అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాకో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పది నెలల తర్వాత 1998 మే 8న నిందితుల్లో ఒకరైన డెనిస్ రష్యా నోరు విప్పాడు. ‘పాకో ప్రోత్సాహంతో ఆ రోజు అక్కాచెల్లెళ్లిద్దరినీ బలవంతంగా కారులోకి లాగారు. వెంటనే మేము ఏడుగురం వాళ్లని ఓ ఇంటికి తీసుకెళ్లి, వారిని రేప్ చేశాం నాతో సహా. తర్వాత వాళ్లంతా... ఆ అమ్మాయిలకు కళ్లగంతలు కట్టి.. సెబుకొండ లోయ దగ్గరకు తీసుకెళ్లి.. మారిజోయ్ని బలవంతంగా లోయలోకి తోసేశారు. జాక్వెలిన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. కారుతో వెంబడించి పట్టుకుని, ఆమెను రోవెన్ కొట్టాడు. తర్వాత అయాలా సెంటర్ దగ్గర నన్ను దించి, వెళ్లిపోయారు. ఆమెను ఏంచేశారో నాకు తెలియదు. ఈ మొత్తం కేసులో అమ్మాయిల కిడ్నాప్, హత్యలతో నాకు ఏ సంబంధం లేదు’ అంటూ సాక్ష్యం చెప్పాడు. అయితే పాకో, జోస్మాన్లు అసలు ఈ డెనిస్ ఎవరో తమకు జైలుకు వచ్చేవరకూ తెలియదని వాదించారు. థెల్మా.. డెనిస్‌ను కలసి.. సాక్ష్యం చెప్పినందుకు అతడికి బహుమతులు కూడా ఇచ్చింది. అది చాలామందికి గిట్టలేదు. డెనిస్ ఇచ్చిన వాగ్మూలంతో కేసు కీలక మలుపు తిరిగే సమయంలో.. ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి మార్టిన్ ఓకాంపో ఓ హోటల్లో 1999 అక్టోబర్ 9న.. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఓకాంపోది కచ్చితంగా హత్యేనన్నది చాలామంది నమ్మకం. ఎందుకంటే డెనిస్ రష్యాను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న సమయంలో ఓకాంపో.. డెనిస్ తరపున ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. పైగా పాకో జూలై 16న సెబులో లేనేలేడని, మనీలాలోని పాఠశాలలో ఉన్నాడని 40 మంది సాక్ష్యం చెప్పారు. అయితే వారంతా పాకో సన్నిహితులేనన్న కారణంతో ఆ సాక్ష్యాలు చెల్లవని ఓకాంపో తీర్పునిచ్చాడు. మొత్తానికి 2004లో పాకో బృందాన్ని నేరస్థులుగా నిర్ధారిస్తూ.. మైనర్, డెనిస్ రష్యాకు మినహా మిగిలిన వారికి మరణశిక్ష విధించింది ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టు. దాంతో ఈ తీర్పుపై స్పెయిన్ ప్రభుత్వం కలగజేసుకుంది. దానికి కారణం పాకో... ఫిలిప్పినో–స్పానిష్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన వ్యక్తి కావడమే. ఈ క్రమంలోనే మరో అంశం తెరమీదకు వచ్చింది. మిస్టర్ డియోనిసియో.. మాదకద్రవ్యాల వ్యాపారవేత్త పీటర్ లిమ్స్ దగ్గర కొన్నాళ్లు పని చేశాడని, చియోంగ్ సిస్టర్స్ మిస్ అవ్వడానికి ముందు.. మిస్టర్ చియాంగ్ లిమ్స్కి వ్యతిరేకంగా డ్రగ్స్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డాడని, మిస్సింగ్ తర్వాత సాక్ష్యమివ్వడానికి నిరాకరించా డని తేలింది. దాంతో మానవహక్కుల సంఘం పాకో వెనుకే నిలబడింది. స్పెయిన్ ప్రభుత్వ ప్రభావంతో 2006లో వారి మరణశిక్ష రద్దు అయింది. పైగా 2011లో ‘గివప్ టుమారో’ అంటూ పదిహేనేళ్ల పాటు నిర్దోషి అయిన పాకో శిక్ష అనుభవిస్తున్నాడని.. ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది అతడి కుటుంబం. దాంతో సగానికి సగం మంది పాకో తప్పు చేసి ఉండడని నమ్మడం మొదలుపెట్టారు. నిజంగానే చియోంగ్ కుటుంబం ఏదో దాస్తోందనే అనుమానాలు బలపడ్డాయి. సరిగ్గా అప్పుడే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అవేంటంటే.. మారిజోయ్, జాక్వెలిన్ పోలికల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. తమ భర్తలతో, పిల్లలతో కలసి దిగిన ఫొటోలు. ఆ ఫొటోల్లో.. థెల్మా, డియోనిసియోలు కూడా ఉన్నారు. వాటిని చూసి.. ఈ కథ తెలిసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ‘చియోంగ్ సిస్టర్స్ బతికే ఉన్నారా? పెళ్లిళ్లు కూడా చేసుకున్నారా? వేరీజ్ జస్టీస్?’ అంటూ నిందితుల వర్గం విస్తృత ప్రచారం చేసింది. అయితే అదంతా మార్ఫింగ్ మాయాజాల మని కొట్టి పారేసేవారూ లేకపోలేదు. చివరికి ద్వంద్వ పౌరసత్వాన్ని ఉపయోగించుకుని పాకో.. స్పెయిన్ జైలుకు బదిలీ అయ్యాడు. మిగిలిన వారు ఫిలిప్పీన్స్‌లోనే శిక్ష అనుభవిస్తున్నారు. శిక్ష పూర్తి అయ్యేసరికి పాకోకి 61 ఏళ్లు వస్తాయి. అయితే పాకో.. స్పెయిన్‌లో శిక్షను అనుభవిస్తూనే.. కొన్ని ఆంక్షల మధ్య.. పార్ట్‌టైమ్‌గా ఓ హోటల్లో షెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతడ్ని నమ్మేవాళ్లు, అతడ్ని స్ఫూర్తిగా తీసుకునేవాళ్లు ఫిలిప్పీన్స్‌లో చాలామందే ఉన్నారు. ఈ కథలో చియోంగ్ స్టిస్టర్ తల్లి థెల్మా ఎంత ఏడ్చిందో.. పాకో తల్లి మార్గరీటా కూడా అంతే ఏడ్చింది. అంతే పోరాటం చేసింది. ఏది ఏమైనా ఈ కథలో పాకో దోషో, నిర్దోషో తేలనే లేదు. చియోంగ్ సిస్టర్స్ బతికే ఉన్నారా? అనే ప్రశ్నలకి ఆ ఫొటోలు తప్ప మరో సాక్ష్యం లేదు. నిజంగానే పాకో బృందం నేరం చేసి ఉంటే.. జాక్వెలిన్ ఏమైంది? చియోంగ్ సిస్టర్స్ బతికే ఉంటే.. ఆ రోజు దొరికిన మృత దేహం ఎవరిది? ఇలా వేటికీ సమాధానాలు లేవు. ∙సంహిత నిమ్మన -
బాక్స్ ఆఫ్ బోన్స్.. ఇప్పటికీ మిస్టరీగానే..!
అది 1992 మార్చి 30. అమెరికాలోని వ్యోమింగ్‌లోని థర్మోపోలిస్లో నివాసముంటున్న న్యూవెల్ సెషన్స్ ఇంట్లో ఉన్నట్టుండి గందరగోళం మొదలైంది. న్యూవెల్, అతడి స్నేహితులు కలసి.. ఓ పాత ట్రంకు పెట్టె తాళాన్ని పగలగొడుతున్నారు. గత ఆరేళ్లుగా అందులో ఏముందనే వారి కుతూహలం.. ఆ పనికి ఉసిగొల్పింది. తాళం ఊడింది. తలుపు తెరుచుకుంది. పాక్షికంగా కప్పిన ప్లాస్టిక్ కవర్‌ను తీసి చూస్తే.. అందులో ఒక బ్యాగ్.. ఆ బ్యాగ్‌లో ఓ మనిషి అస్థిపంజరం విడి భాగాలు ఉన్నాయి. అంతా షాక్. ఒక్కమాటలో చెప్పాలంటే గజగజా వణికిపోయారు. ఆ షాక్‌లోనే న్యూవెల్ భార్య డైసీ.. ‘ఇప్పుడు ఏం చేద్దాం’ అంది. ‘గొయ్యి తవ్వి పూడ్చిపెట్టడం బెటర్’ అన్నారంతా. అది మరింత నేరం కావచ్చని డైసీ హెచ్చరించింది. దాంతో న్యూవెల్.. ఆ ట్రంక్ పెట్టెను అక్కడ వదిలిపోయిన తన స్నేహితుడు గాబీ కోసం పరుగుతీశాడు. గాబీ ఎదురు పడగానే.. ట్రంక్ పెట్టె గురించి ఆరా తీసి.. అతడి హావభావాలను గమనించాలనుకున్నాడు. గాబీ 1986లో న్యూవెల్‌కి ఓ షెడ్‌ని అప్పగించాడు. వెళ్తూ వెళ్తూ కొన్ని వస్తువుల్ని అందులో వదిలేసి వెళ్లాడు. వాటిలో ట్రంకు పెట్టె ఒకటి. వదిలేసిన వస్తువుల్ని తీసుకెళ్లడానికి గాబీ చాలా సార్లు షెడ్‌కు వచ్చాడు కానీ..ఆ ట్రంక్ పెట్టెను తీసుకెళ్లే ప్రయత్నమైతే చెయ్యలేదు. ‘ఎందుకు?’ అని న్యూవెల్ అడగనూ లేదు. ఇప్పుడు గాబీని కలసిన న్యూవెల్.. ‘షెడ్లో నువ్వు వదిలిపెట్టిన ట్రంక్ పెట్టె గుర్తుందా?’ అని అడిగాడు. ‘గుర్తుంది.. కానీ దాన్ని నేనెప్పుడూ తెరవలేదు. కొన్నప్పుడే దాని తాళంచెవి మిస్ అయ్యింది. డమ్మీ కీస్‌తో చాలా సార్లు ట్రై చేశా.. కానీ ఓపెన్ కాలేదు..’ అంటూ ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చాడు గాబీ. అందులో మనిషి అస్థిపంజరం ఉందని న్యూవెల్ చెప్పగానే.. ‘వేళాకోళాలు వద్దు బ్రదర్’ అంటూ పెద్దగా నవ్వాడు గాబీ. తాను తమాషా చేయడం లేదని నమ్మించడానికి న్యూవెల్‌కి చాలా సమయమే పట్టింది. అయితే గాబీ సమాధానాల మీద న్యూవెల్‌కి నమ్మకం కుదరలేదు. వెంటనే న్యూవెల్.. జాన్ లమ్లీ అనే అధికారి సాయాన్ని కోరాడు. అతడి సమక్షంలోనే వివిధ పరీక్షల కోసం అస్థిపంజరం ల్యాబ్‌కి తరలింది. ఎడమ పుర్రెలో, ఎడమ భుజంలో బుల్లెట్స్ ఉన్నట్లు ఎక్స్‌రేలు తేల్చాయి. దాంతో పుర్రె ఆకారాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి ఊహచిత్రాలను గీయించి .. విడుదల చేశారు పోలీసులు. దీనిపై పత్రికలు కూడా ప్రత్యేక శ్రద్ధచూపించాయి. లమ్లీ వెంటనే.. గాబీని కలసి, తన స్టైల్లో ప్రశ్నించాడు. అప్పుడు కూడా గాబీ తడబడలేదు. ‘చాలా సార్లు పెట్టె ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. దాన్ని ఎక్కడ కొన్నానో గుర్తులేదు. కానీ.. అది 1973 నాటి పెట్టె’ అని బదులిచ్చాడు. దాంతో వెంటనే లమ్లీ.. అస్థిపంజరాన్ని చెయెన్నేలోని వ్యోమింగ్ స్టేట్ క్రైమ్ ల్యాబ్‌కు అప్పగించాడు. అక్కడి ల్యాబ్ అధికారి శాండీ మేస్.. ఆ అస్థిపంజరం ఒక పురుషుడిదని, సుమారు 5.9 పొడవు ఉంటాడని తేల్చాడు. అప్పుడే దర్యాప్తు చేస్తున్న అధికారులకు.. గాబీ మిసిసిపీలో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందింది. దాంతో ఈ హత్యకు గాబీకి కచ్చితంగా సంబంధం ఉందని తేలినా.. గాబీ లేకుండాపోవడంతో ట్రంక్ పెట్టె కేసుకు బ్రేక్ పడినట్టయింది. అప్పట్లో లయోవా వాసి షెల్లీ స్టాట్లర్(16), ఆమె తండ్రి ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘బహుశా ఆ అస్థిపంజరం మీ తాత జోసెఫ్ ముల్వానీది కావచ్చ’ని స్టాట్లర్ తండ్రి పదేపదే అనుమానించాడు. అయితే అప్పట్లో స్టాట్లర్ పెద్దగా పట్టించుకోలేదు. ఏళ్లు గడిచేకొద్ది.. స్టాట్లర్కు తన కుటుంబ చరిత్రపై ఆసక్తి పెరిగింది. ఒకసారి తన అమ్మమ్మ మేరీ అలైస్.. తన భర్త జోసెఫ్ ముల్వానీని తన కొడుకు జాన్ డేవిడ్ మోరిస్ చంపేసి ఉంటాడని బాధపడింది. తన తాత గురించి ఎన్నో ఎంక్వైరీలు చేసిన స్టాట్లర్కు 2017 వచ్చేసరికి.. ఆ అస్థిపంజరం తన తాత జోసెఫ్దేననే నమ్మకం బలపడింది. వెంటనే తన తల్లి కేథరిన్ డీఎన్ఏతో సరిచూడాలని అధికారులకు సిఫారసు చేసింది. అదే ఏడాది అక్టోబర్ 19న కేథరిన్ నుంచి డీఎన్ఏ నమూనా తీసుకున్నారు అధికారులు. అనుకున్నట్లే ఆ అస్థిపంజరం జోసెఫ్ ముల్వానీదే కావడంతో జాతీయస్థాయిలో ఈ కేసు మరోసారి వార్తలకు ఎక్కింది. జోసెఫ్ ముల్వానీ ఎవరో కాదు. 1941 నాటి ఇల్లినాయిస్ నేషనల్ గార్డ్‌లోని 130వ పదాతిదళంలో సభ్యుడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పసిఫిక్ థియేటర్‌కి పోరాటయోధుడిగా వెళ్లాడు. తర్వాత కాలిఫోర్నియాలో రైల్రోడ్ వర్కర్ అయ్యాడు. మేరీ అలైస్‌ను వివాహం చేసుకున్నాడు. కేథరిన్, ఓఓ, పాట్రిక్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మరి మోరిస్ ఎవరు? మేరీ అలైస్ మొదటి భర్త కొడుకే జాన్ డేవిడ్ మోరిస్. 1963లో జోసెఫ్ లయోవాలో ఇల్లు కొని, అందులోకి కుటుంబంతో సహా మాకాం మార్చాడు. ఉన్నట్టుండి జోసెఫ్ అదృశ్యమయ్యాడు. అప్పుడే 16 ఏళ్ల మోరిస్.. జోసెఫ్‌ను హత్య చేసి పాతిపెట్టి ఉంటాడని, ఆ తర్వాత తవ్వి శరీరభాగాలను పెట్టెలో పెట్టి.. థర్మోపోలిస్ తీసుకుని వెళ్లి ఉంటాడని స్టాట్లర్ కుటుంబం భావించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోరిస్, గాబీ ఒక్కరే కావడం. మోరిస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చలామణీ అయ్యాడని దర్యాప్తులో తేలింది. దాంతో గాబీ ఆత్మహత్య కూడా ఒక డ్రామా కావచ్చనే అనుమానాలు బలపడ్డాయి. అయితే నిజం బయటపడక మునుపే.. న్యూవెల్(ట్రంక్ పెట్టె ఓపెన్ చేసిన వ్యక్తి) 2003న, 2009లో మేరీ అలైస్(జోసెఫ్ భార్య) కన్నుమూశారు. 2019 మార్చి 29న వ్యోమింగ్‌లోని బల్లార్డ్ ఫ్యునరల్ హోమ్‌లో జోసెఫ్ కుటుంబ సమక్షంలో పూర్తి సైనిక స్మారక లాంఛనాలతో గౌరవప్రదంగా జోసెఫ్ అంత్యక్రియలు జరిగాయి. మొత్తానికీ ఈ కథలో గాబీ అలియాస్ మోరిస్ ఏమయ్యాడు? అసలు స్టెప్ ఫాదర్ అయిన జోసెఫ్‌ను ఎందుకు చంపాడు? అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన చదవండి: Alzheimers Disease: ఇవి కూడా అల్జైమర్స్ లక్షణాలేనట!! -
లేడీ ఇన్ బ్లాక్.. చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.. ఇప్పటికి మిస్టరీగానే
రెండు విరుద్ధమైన వాదనలెప్పుడూ కథను సుఖాంతం చేయవు. ఏది నిజం? ఏది అబద్ధం? అనే ప్రశ్నలను రగిల్చి, అపరిష్కృతంగా విడిచిపెడతాయి. మిస్టరీలుగా మిగిలిపోతాయి. సరిగ్గా నలభై రెండేళ్ల క్రితం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఐ–74 రోడ్డుపై జరిగిన ఘటన అలాంటిదే. అది 1980 జూన్ నెల. కటిక చీకటి, కారుమబ్బులకు హోరుగాలి తోడైంది. రాబర్ట్ డేవిడ్సన్ అనే వ్యక్తి బైక్ మీద ఇండియానాపోలిస్ లోని తన కూతురు ఇంటికి బయలుదేరాడు. వర్షం మొదలయ్యేలోపు అక్కడికి చేరుకోవాలని ఆయన ఆత్రం. కానీ అలా జరగలేదు. ఉన్నపళంగా జోరువాన మొదలైంది. నిజానికి కొన్ని గంటల ముందు నుంచే తుఫాను హెచ్చరికలు సాగుతున్నాయి. ఆ క్రమంలో రాబర్ట్ ఐ–74 రోడ్డుపైకి వచ్చేసరికి వర్షం పెరగడంతో బైక్ బాక్స్‌లోని రెయిన్ జాకెట్ తీసి వేసుకోవడానికి రోడ్డు పక్కకు బండి ఆపాడు. జాకెట్ తీసి, ధరించేలోపు.. ఉరుము ఉరిమి రాబర్ట్‌ను తాకింది. దారిన పోయేవారికి రాబర్ట్ కుప్పకూలడం స్పష్టంగా కనిపించింది ఆ మెరుపులో. చుట్టుపక్కలున్నవారికి అతడి ఆర్తనాదమూ వినిపించింది. పిడుగు దాడిలో 2,00,000 వోల్టుల కరెంటు ఒక్కసారిగా అతనిపై ప్రవహించడంతో రాబర్ట్‌లో ఉలుకూ పలుకూ లేదు. బతికే ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. సమాచారం అందిన కొంతసేపటికే అంబులెన్స్ అక్కడికి వచ్చేసింది. హుటాహుటిన అంబులెన్స్ ఎక్కించారు. రాబర్ట్ పరిస్థితిని గమనించిన వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్సలోనే అతడు ఇక బతకడని నిర్ధారించారు. అతడిలో ఎలాంటి స్పందనా లేదు. ఏ అవయవం పనిచేయట్లేదు. గాలివాన మరింతగా పెరిగిపోతోంది. ఉన్నట్టుండి అంబులెన్స్‌లోని ఎలక్ట్రిక్ పరికరాలన్నీ పని చేయడం మానేశాయి. చుట్టూ ఉన్న వీధి దీపాలు కూడా ఆరిపోయాయి. కరెంట్ పోయిందని అనుకున్నారంతా. మరి అంబులెన్స్‌కి ఏమైంది? రెండు బ్యాకప్ బ్యాటరీలు ఉండగా ఇలా ఎందుకు జరిగింది? అనే అయోమయంలో ఉన్నారా సిబ్బంది. ఇంతలో ఓ అలికిడి. పైనుంచి కింద దాకా నల్లటి వస్త్రాలను ధరించిన ఓ స్త్రీ మూర్తి అక్కడికి వచ్చింది. అంత పెద్ద హోరు వానలో.. ఆమె ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. చుట్టూ చూడగా... అక్కడ అంబులెన్స్, ఫైరింజిన్, రాబర్ట్ బైక్ తప్ప ఇంకేమీ లేవు. ఆమె చాలా చొరవగా రాబర్ట్‌కు దగ్గరగా వచ్చి.. ‘నేనొకసారి ఇతణ్ణి తాకొచ్చా?’ అని అడిగింది. నిర్ఘాంతపోయారు అక్కడున్నవారు. అంబులెన్స్ సిబ్బందిలో ఒకరు.. ‘ఏదైనా మంచి జరగబోతుందేమో?’ అనుకుంటూ ఆమెకు అనుమతి ఇచ్చారు. దాంతో ఆమె రాబర్ట్‌ని తాకింది. అతడి తలపై చేయి పెట్టి.. ఏవో మంత్రాలు చదివింది. రాబర్ట్‌నే చూస్తూ... మనసులో ఏదో అనుకుంది. కొంత సమయం గడిచాక.. ఆమె అంబులెన్స్ దిగి వెళ్లిపోయింది. ‘మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తుఫాన్లో ఎలా వెళ్తారు?’ లాంటి ఎన్నో ప్రశ్నలను సంధించారు అక్కడున్నవారు. కానీ ఆమె స్పందించలేదు. ఆమె అలా వెళ్లగానే ఇలా అంబులెన్స్‌లో లైట్లు వెలిగాయి. అప్పుడే రాబర్ట్లోనూ స్పందన కనిపించింది. దాంతో అంబులెన్స్ ఆసుపత్రివైపు కదిలింది. ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్నప్పుడు కూడా రాబర్ట్ స్పృహలో లేడని... దాదాపు చనిపోయినట్లే అని వైద్యులు భావించారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయాడని ప్రకటించారు. రెండు నెలలు గడిచాయి. అతను కోమా నుంచి బయటకు వచ్చాడు. అతడు ఇలా బతికి ఉన్నాడంటే ఆమే కారణం అన్నారు నాటి ప్రత్యక్షసాక్షులు. ఆమె ఎవరు అని అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదు. నిజానికి అంత పెద్ద పిడుగు పాటుకి గురైన వ్యక్తి బతికి బట్టకట్టడం అనేది మిరాకిల్. అందుకే చాలామంది ఆ సిబ్బంది మాటలను నమ్మసాగారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ధరించిన దుస్తులు 1980 నాటివి కావని, 1800 కాలం నాటివని నాడు అంబులెన్స్‌లో ఉన్న పారామెడికో సిబ్బందిలో ఒకరు బయటపెట్టారు. ఆ విషయం ఆమెని అడుగుదామనుకుంటే.. ఆమె చాలా గంభీరంగా కనిపించిందని.. అడగటానికి భయమేసిందని అతడు చెప్పుకొచ్చాడు. దాంతో ఆ మహిళ ఎవరు అనేదానిపై చర్చ మొదలైంది. ఆమె అనేది అబద్ధమని.. పారామెడికోలు కట్టుకథ అల్లారనే వాదనలు ఒకవైపు నడుస్తుండగానే.. ఆమె దెయ్యమని కొందరు, కాదు దేవదూత అయ్యి ఉంటుందని మరికొందరు వాదనలకు దిగారు. అందుకు తగ్గ ఆధారాలను ఈ కథకు లింక్ చేశారు. ఆమె వచ్చిన సమయంలో అంబులెన్స్‌తో సహా చుట్టూ లైట్స్ ఆరిపోయాయి కాబట్టి.. ఆమె దెయ్యమేనని, పైగా ఆమె ధరించిన దుస్తులు 1800 కాలం నాటివని ప్రత్యక్షసాక్షి చెబుతున్నాడు అందుకని ఆమె కచ్చితంగా దెయ్యమేనని చెప్పుకొచ్చారు చాలామంది. అయితే మరికొందరు మాత్రం ఆమె దేవదూత అనే దానికి ప్రత్యేక కారణం కూడా చెప్పారు. రాబర్ట్‌కి ప్రమాదం జరిగిన రోడ్డు పక్కనే పెద్ద మైదానం ఉందని, అక్కడ 19వ శతాబ్దంలో మతపరమైన ప్రార్థనలు జరిగేవని, వేలమంది ఆ ప్రార్థనల్లో పాల్గొనేవారని, అందువల్ల ఆమె.. దేవదూతేనని వాదించారు. దెయ్యం లేదా దేవదూత లేదా మత ప్రబోధకురాలు కావచ్చు అని కొందరు భావించారు. మొత్తంగా ఆమె ఎవరన్నది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. చావు అంచుల దాకా వెళ్లిన రాబర్ట్‌ని బతకించేంత శక్తి ఆమెకు ఎలా వచ్చింది? అసలు ఆమె ఎవరు? అనేది నేటికీ తేలలేదు. రాబర్ట్ పునర్జన్మ మాత్రం మెడికల్లీ మిస్టరీనే. ∙ఎస్.ఎన్ -
రష్మిక మందన్నా ఫెవరెట్ బుక్ ఏంటో తెలుసా..?
ది ఛేంజ్–మైఖేల్ క్రోగరస్, రోమన్ షాప్లర్ ఫ్రీలాన్స్ రైటర్ మైఖేల్ క్రోగరస్ తన కాలేజి ఫ్రెండ్ రోమన్ షాప్లర్‌తో కలిసి రాసిన పుస్తకం ఇది. తెల్లారి లేచింది మొదలు ప్రశ్నలతోనే మన జీవితం మొదలవుతుంది. మార్పు వేగంగా సంభవించే ఈ ప్రపంచంలో మనం ఎలా మారాలి? పుస్తకం చదవడానికైనా, పదేపదే వాయిదా పడుతున్న పనిచేయడానికైనా టైమ్ ఎందుకు దొరకడం లేదు? కొందరు నిజాయితీ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తారు? బయోటెక్నాలజీ అనేది పరిశ్రమల భవిష్యత్‌గా ఎలా మారనుంది...ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 176 పేజీల ఈ పుస్తకంలో ఎక్కడో ఒకచోట జవాబు దొరకుతుంది. ‘ఆర్థిక ప్రపంచం’ అనే మాట వినబడగానే అక్కడే ఉండే మనకు అది మనది కాని ప్రపంచం అనిపిస్తుంది. అయోమయానికి గురి చేసే అంకెలు, అర్థం కాని నిర్వచనాలు దీనికి కారణం అనేది తెలియదుగానీ ఈ పుస్తకంలోకి వెళితే అలాంటి భయాలు మనల్ని వీడుతాయి. ది మోనోగమి మోడల్, ది స్వార్మ్ ఇంటెలిజెన్స్ మోడల్, ది మీనింగ్ ఆఫ్ లైఫ్ మోడల్, ఛేంజ్ మోడల్....ఇలా రకరకాల మోడల్స్‌ను ఆసక్తికరంగా వివరిస్తారు. మన వ్యక్తిగత జీవితం నుంచి సామాజిక,ఆర్థిక,పర్యావరణరంగాల వరకు రకరకాల మార్పులు వస్తూనే ఉన్నాయి. మన జీవితాల్లో మార్పు అనేది ఎలా సంభవిస్తుంది, దానితో ఎలా వ్యవహరించాలి అనేది తెలుసుకోవచ్చు. నిజానికి ‘మార్పు’ అనేది మనకు కొత్త కాదు. బాల్యం నుంచి అది మన వెంటే ఉంది. చిన్నప్పుడు మన ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు...మొదలైన వాటిలో మార్పులు వేగంగా జరిగేవి. ఈ క్రమంలోనే మార్పుకు సంబంధించి మన జీవితంలోని చిన్న చిన్న సంఘటనల నుంచి మొదలు ప్రపంచచరిత్ర వరకు ఎన్నో ఉదాహరణలు ఇస్తారు. ‘ఛేంజ్ ఈజ్ నాట్ ఏ చాయిస్...ది వోన్లీ చాయిస్ ఈజ్ డూ యూ డూ ఇట్’ అని చెప్పే ఈ పుస్తకం ప్రాథమిక స్థాయిలో మార్పు గురించి చెబుతుంది. స్వేచ్ఛ–హద్దు అనేవి రెండు విరుద్ధ అంశాలుగా కనిపించిన్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మన స్వేచ్ఛకు హద్దులు నిర్ణయించుకోవాలి. ఉదా: నెట్లో విహరించడం అనేది మన స్వేచ్ఛ అనుకుంటే...‘ఇంత సమయం మాత్రమే’ అంటూ దానికొక కాలపరిమితి ఉండాలి. మార్పు అనేది అపరిచితుడిలాగా కనిపించి అయోమయానికి గురి చేస్తుంది. దీనిలో నుంచి అభద్రత కలుగుతుంది. అభద్రతకు గురైనప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. సంతోషానికి దూరం చేస్తుంది.‘మార్పు’ అనేది కేంద్రబిందువుగా సాగే ఈ పుస్తకంలో వివిధ విషయాలలో నిపుణుల సలహాలు, సంక్లిష్టమైన సిద్ధాంతాలను సరళీకరించి చెప్పడంలాంటివి ఆకట్టుకుంటాయి. చదవండి: Fashion: నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు.. వన్నె తగ్గని సౌందర్యం! -
ఎవరీ సింథియా.. 42 ఏళ్లుగా మిస్సింగ్.. అసలేం జరిగింది?
స్వార్థపూరితమైన ఆలోచనలు కక్షగడితే.. ఆనవాళ్లు, అవశేషాలు కూడా దొరకవనేందుకు సింథియా ఆండర్సన్ కథే సాక్ష్యం.అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో టోలీడోలోని.. ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయే సింథియా. మైఖేల్ ఆండర్సన్ దంపతులకు..1961 ఫిబ్రవరి 4న జన్మించింది. మత సంప్రదాయాల్ని కచ్చితంగా పాటించే మైఖేల్‌కి కూతురు సింథియా అంటే ప్రాణం. సింథియాకూ తండ్రంటే అంతే గౌరవం. ఏనాడూ తండ్రి మాటకు ఎదురు చెప్పిందిలేదు. సహజంగానే అందగత్తెన సింథియాకు మేకప్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే మేకప్ వేసుకోవడమో, నవలలు చదవడమో చేసేది. మొదటి నుంచీ ఆమెకు స్నేహితులు ఎక్కువ. అయినా సరే తండ్రి చెప్పినట్టుగా.. తనకంటూ కొన్ని హద్దులు ఏర్పరచుకుని నడుచుకునేది. తన కుటుంబ గౌరవానికి తలవంపులు తేవద్దనే తలంపుతోనే ఉండేది. ఆమెకు తన 19వ ఏట ఒక కలొచ్చింది.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. తనని ఎత్తుకెళ్లి క్రూరంగా చంపేసినట్లు. బెదిరిపోయి ఇంట్లో వాళ్లకి చెప్పింది. తల్లి, సోదరి ఇద్దరూ సింథియాకు ధైర్యం చెప్పారు. అయితే ఆ కల ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. రోజుల తరబడి వెంటాడడంతో సింథియా కలవరపడింది. తనకు ఏదో జరగబోతోందని శంకించింది. నిత్యం ఆ భయంతోనే గడపసాగింది. కొన్ని రోజులకు అదో మానసిక రుగ్మతగా మారింది. ఓ పక్క కుటుంబ నియమాల ప్రకారం ప్రతిరోజూ ప్రార్థన సమావేశాలు, క్యాంపింగ్ ఈవెంట్స్‌కు హాజరవుతూనే లీగల్ సెక్రెటరీగా ఉద్యోగం చేసేది సింథియా. ఆమె పని చేసే కార్యాలయంలో తను కూర్చునే డెస్క్ ఎదురుగా ఉండే గోడపైన ఓ ఆకతాయి.. ‘ఐ లవ్యూ సిండీ.. బై జీడబ్ల్యూ’ అని స్ప్రే పెయింట్ చేశాడు. సిండీ అనేది సింథియా ముద్దుపేరు. అప్పటికే సింథియా.. పీడ కలతో సతమతమవు తుండటంతో ఆ రాసింది ఎవరనే దానిపై దృష్టి పెట్టలేకపోయింది. తనకొచ్చిన కల ఎక్కడ నిజమవుతుందోనన్న భయంతో తన డెస్క్ దగ్గర ఎమర్జెన్సీ బజర్ ఏర్పాటు చేయించుకుంది. ఎందుకంటే ఉదయం పూట అంతపెద్ద ఆఫీస్‌లో సింథియా ఒక్కత్తే ఉండేది. మిగిలిన కొలీగ్స్ అంతా మధ్యాహ్నం వచ్చేవారు. అది 1981, ఆగస్టు 4.. సింథియా జీవితాన్ని చరిత్రలో కలిపేసిన రోజది. అప్పటికి ఆమెకు ఇరవై ఏళ్లు. మరో రెండువారాల్లో తను చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి.. బైబిల్ కాలేజీకి వెళ్లాలనేది ఆమె నిర్ణయం. కానీ అలా జరగలేదు. ఆగస్టు 4న ఉదయం ఎనిమిదిన్నరకి.. బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకుండానే ఆమె తన కారులో ఆఫీస్‌కి బయలుదేరింది. ఎప్పటిలా కాకుండా ఆ రోజు తొమ్మిది నలభై ఐదుకి అంటే కాస్త ఆలస్యంగా ఆమె ఆఫీస్‌కు వచ్చినట్టుగా గమనించాడు వాచ్‌మన్. మధ్యాహ్నం 12 గంటలకు తతిమా సహోద్యోగులు ఆఫీస్‌కి వచ్చేసరికి సింథియా అక్కడ లేదు. తలుపులు తీసే ఉన్నాయి. కారు పార్కింగ్‌లోనే ఉంది. కారు తాళంచెవి, హ్యాండ్ పర్స్ మాత్రం కనిపించలేదు. ఫోన్ రిసీవర్ పక్కకు తీసిపెట్టి ఉంది. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. రేడియో మోగుతూనే ఉంది. అప్పుడే నెయిల్ పాలిష్ వేసుకున్నట్లు.. ఆ వాసన ఇంకా ఆఫీస్ వాతావరణంలో తచ్చాడుతూనే ఉంది. మరో విచిత్రం ఏమిటంటే.. ఆమె క్యాబిన్లో ఓ రొమాంటిక్ నవల తెరిచి ఉంది. అందులో.. ‘అతను వచ్చి కత్తితో బెదిరించి.. ఆమెని ఎత్తుకుపోయాడు’ అనే వాక్యం ఉంది. కానీ ఎక్కడా కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు లేవు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు మొదలుపెట్టారు. పేరెంట్స్‌కి తెలియకుండా సింథియాకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడు చర్చిలో సభ్యుడని, బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాడని.. అందుకే సింథియా కూడా ఉద్యోగం మానేసి.. బైబిల్ కాలేజీలో జాయిన్ కావాలనుకుందని.. ఇలా ఏవేవో విషయాలు బయటికి లాగారు. సింథియా ఆఫీస్‌లో.. జీడబ్ల్యూ (ఐ లవ్యూ కింద ఉన్న లెటర్స్) పేరున్న వ్యక్తిని కూడా ప్రశ్నించారు. అతడికీ, ఈ కేసుకు ఏ సంబంధం లేదని తేలింది. మరోవైపు సింథియాకి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఏవేవో బెదిరింపు కాల్స్ వచ్చేవని, వాటితో ఆమె చాలా ఇబ్బంది పడేదని కొందరు కొలీగ్స్ చెప్పుకొచ్చారు. కొన్ని రోజులకు ఓ అజ్ఞాత మహిళ.. పోలీసులకు ఫోన్‌చేసి ‘మా పక్కింటి అబ్బాయి.. సింథియాని బలవంతంగా బంధించాడు. అతడి తల్లిదండ్రులు అతడితో లేరు. పక్కిల్లే కావడంతో ఆ విషయం నాకు తెలిసింద’ని చెప్పింది. పూర్తి వివరాలు అడిగేసరికి ఆమె భయపడి ఫోన్ కట్ చేసింది. దాంతో పోలీసులు అనుమానాస్పదమైన కొన్ని ఇళ్లను సోదా చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మరోవైపు.. సింథియా పనిచేసే లా ఆఫీస్‌లో రిచర్డ్ నెలర్ అనే న్యాయవాదికి మాదకద్రవ్యాలకు సంబంధించిన నేర చరిత్ర ఉంది. ఈ క్రమంలో నెలర్కి సంబంధించిన చట్టవిరుద్ధమైన డ్రగ్ యాక్టివిటీ గురించి సింథియాకి ఏమైనా తెలిసిందా? అదే ఆమెకు శాపమైందా? అనే యాంగిల్ల్లోనూ విచారణ కొనసాగింది. కానీ కేసు ముందుకు కదల్లేదు. ఇంట్లో కఠినమైన నియమనిబంధనలను తాళలేక ఇంట్లోంచి తప్పించుకునేందుకు సిం«థియానే అలాంటి నాటకమాడిందనే వాదనా బలంగా వినిపించింది. అదే నిజమైతే.. సింథియా అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. వాటిని వినియోగించినట్లు ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. ఎప్పటికైనా సింథియా తిరిగి వస్తుందని ఆశపడ్డాడు తండ్రి మైఖేల్. ఫోన్ నంబర్ మార్చినా, ఇళ్లు మారినా సింథియా తిరిగి రావాలనుకుంటే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో అదే ఇంట్లో, అదే ఫోన్ నంబర్‌తోనే గడిపింది ఆ కుటుంబం. చివరికి ఆమె వివరాలు తెలుసుకోకుండానే చనిపోయారు సింథియా తల్లిదండ్రులు. అసలు ఆ రోజు ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరైనా చంపేశారా? లేక సింథియానే కుటుంబాన్ని వదిలి పారిపోయిందా? మానసిక రుగ్మతతో ఏ ఆత్మహత్యకైనా పాల్పడిందా? అనేది నేటికీ మిస్టరీనే. సంహిత నిమ్మన -
గులాబీ రంగు అమ్మాయిలకే కాదు బ్రిటిష్ ఆర్మీకీ ఇష్టమే!.. పింక్ పాంథర్స్ విశేషాలు తెలుసా!
అమ్మాయిలకు గులాబీలన్నా.. గులాబీ రంగన్నా ఇష్టం అంటారు. నిజానికి గులాబీ రంగు బ్రిటిష్ ఆర్మీకి ఇష్టమట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎడారి ప్రాంతాల్లోని సైనిక దళాలకు సహాయం చేసిన వాహనాల రంగు ఈ గులాబీనే. వీటికి ‘పింక్ పాంథర్స్’ లేదా ‘పింకీస్’అని పేరు. సాధారణంగా అడవులు, కొండల్లో కాపలాకాసే సైనికులను, శత్రువులు త్వరగా గుర్తించకుండా ఉండటానికి ఆర్మీ ఎక్కువగా ఆకుపచ్చ, గోధుమరంగులను ఉపయోగిస్తుంది. కానీ, ఈ రంగులు ఎడారి ప్రాంతాల్లో ఉపయోగపడవు. ఇందుకోసం 1968– 1984 బ్రిటిష్ ఎస్ఏఎస్ ఈ పింక్ పాంథర్ జీప్లను ఉపయోగించింది. ఈ ఉపాయం బాగా పనిచేసింది. దగ్గరగా చూస్తే కాని కనిపించని ఈ వాహనాలు ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడాయి. తర్వాత ఇదే ఉపాయాన్ని ఇంకొన్ని దేశాలు కూడా ఉపయోగించాయి. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వినియోగం ఆగిపోయింది. అప్పట్లో మిగిలిపోయిన వాటిలో ఇరవై వాహనాలను ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 2019లో నిర్వహించిన ఓ వేలంలో 1968 ల్యాండ్‌రోవర్ 2ఏ పింక్ పాంథర్ రూ. 64 లక్షలకు అమ్ముడుపోయింది. మిగిలినవి మ్యూజియంలో ప్రదర్శనల్లో ఉపయోగిస్తున్నారు. చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..! -
సౌది అరేబియా కథ: హాస్యగాడు అబునువాస్
పూర్వపు వాళ్లలోను, ఇప్పటి వాళ్లలోను మనం జ్ఞాపకం ఉంచుకో తగిన ఉపాయశాలులందరిలో గొప్పవాడెవడో చెప్పగలరా? కొందరు ఒకడు గొప్పవాడు అంటే మరికొందరు ఇంకొకడు మరీ గొప్పవాడంటారు. కానీ నిజం తెలిసినవాళ్లంతా అబునువాస్ పేరే చెబుతారు. అబునువాస్ జీవితమంతా హాస్యకథలుగా, తమాషాపనులతో, మంచి మంచి ఉపాయాలతో నవ్వుల మాటలతో గడచిపోయింది. అంతేకాదు ఎన్నోసార్లు తన యుక్తితో హాస్యంతో ఎన్నో చిక్కుల్లోంచి బయటపడ్డాడు. ఆయన ఎవ్వరినైనా సరే నవ్వించాలనుకున్నాడా.. తమాషా మాటల్తో కడుపుబ్బేట్టు నవ్వించేవాడు. ఎంత తెలివిగలవాడినైనా చాదస్తుడనిపించాలంటే ఏదో యుక్తిపన్ని బోల్తా కొట్టించేసేవాడు. మామూలు మనుషుల్నే కాదు మహారాజుల్నీ లెక్కలేకుండా హాస్యమాడేవాడు. ఈ అబునువాస్కు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకి నీళ్లు పెట్టటానికి ఒక పెద్దపళ్లెం కావలసివచ్చింది. పొరుగింటి వాళ్లను అడిగాడు. వాళ్లు అబునువాస్కు రాగిపళ్లెం ఇచ్చారు. దాన్ని మూడురోజులు తన వద్దే ఉంచుకున్నాడు. నాలుగోరోజున ఆ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం పెట్టి ఆ రెండిటినీ తీసుకెళ్లి పొరుగింటివాళ్లకు ఇచ్చాడు. పక్కింటి పెద్ద మనిషి తమ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం కూడా ఉడడం చూసి ‘అయ్యో ఈ చిన్నపళ్లెం మాది కాదే!’ అన్నాడు. దానికి అబునువాస్ ‘మీరిచ్చిందేదో మీకు తిరిగి ఇచ్చేశాను. మీ రాగిపళ్లెం నా దగ్గర ఉన్నప్పుడు దానికి ఈ చిన్నపళ్లెం పుట్టింది. ఇది రాగిపళ్లెం బిడ్డ కాబట్టి ఈ రెండూ మీవే’ అని చెప్పాడు. అబునువాస్ తెలివి తక్కువతనానికి నవ్వుకుని ఇంకో పళ్లెం కూడా వస్తూంటే పోనివ్వటమెందుకని ‘మీరు చెప్పింది నిజమే! మా పళ్లానికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇదీ మాదే. పళ్లాలకు కూడా బిడ్డలు పుట్టే చల్లని ఇల్లు మీది’అన్నాడు పొరుగింటాయన. మూడురోజులు పోయాక అబునువాస్ మళ్లీ వాళ్లింటికి వెళ్లి ఆ పళ్లమే ఇంకోసారి అరువడిగాడు. ఈసారి ఇంకో మంచి బిడ్డను తీసుకొస్తుందనే సంతోషంతో వెంటనే ఆ ఇంటి యజమాని ఆ పళ్లాన్ని తెచ్చిచ్చాడు. అబునువాస్ నవ్వుకుంటూ ఆయనకు నమస్కారం పెట్టి రాగిపళ్లెం చంకనబెట్టుకొని ఇంటికి పోయాడు. ఈసారి పళ్లెం తీసుకుపోయి ఎన్నాళ్లయినా తిరిగి ఇవ్వలేదు. పొరిగింటాయన వచ్చి పళ్లెం కావాలని అడిగాడు. అబునువాస్ ఎంతో విచారంగా‘ఏం చేయమంటారు బాబూ.. మీకు పుట్టెడు దుఃఖవార్త చెప్పాల్సి వచ్చింది. మీ పళ్లెం చచ్చిపోయింది బాబూ’ అని చెప్పాడు. ‘ పళ్లెం చచ్చిపోవడమేమిటి?’ విస్తుపోయాడు పొరుగింటి మనిషి. ‘ఈ విషయం మీకు చాలా దుఃఖం కలుగజేస్తుందనే నేను మీకు ఇన్నాళ్లూ చెప్పలేదు. ఏం చెయ్యను? చివరికి చెప్పక తప్పలేదు’ అన్నాడు అబునువాస్. ఆ మాటకు పొరుగింటి పెద్దమనిషికి తగని కోపం వచ్చింది. ‘తమాషాగా ఉందా? రాగిపళ్లెం చావటమేమిటి?నన్ను పిచ్చివాణ్ణనుకుంటున్నావా?’ అంటూ మండిపడ్డాడు. ‘ఆ రాగిపళ్లమే కదండీ ఇంతకుముంద బిడ్డను కనిందీ..’ గుర్తుచేశాడు అబునువాస్.‘అవును’ చెప్పాడు పొరుగింటాయన. ‘ఈ సృష్టిలో బిడ్డల్ని కనేవన్నీ ఏనాడో ఒకనాడు చచ్చిపోకమానవు బాబూ? ఎటొచ్చీ మీ రాగిపళ్లెం పాపం పరాయింట్లో చచ్చిపోవటమే చాలా విచారకరం. ఏం చేస్తాం.. దానికి అలా రాసిపెట్టి ఉంది’ అని ఓదార్చాడు అబునువాస్. అలా ఆ రాగిపళ్లాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఇంకోసారి ఒకడు అబునువాస్ దగ్గరకు వచ్చి అతని గాడిదను అరువు అడిగాడు. పని మీద తన గాడిద ఊరికి వెళ్లిందని అబునువాస్ చెప్తూండగానే పెరట్లోంచి గాడిద ఓండ్రపెట్టింది. ‘దొడ్లో గాడిద అరుస్తూంటే ఊరెళ్లిందని చెప్తున్నావ్.. నువ్వేం పెద్దమనిషవయ్యా?’ అంటూ నిలదీశాడతను. ‘నీకు కావలసింది మా గాడిదా? దాని అరుపా? గాడిదైతే ఇక్కడలేదు. దాని అరుపు కావాలంటే తీసుకుపో’ అంటూ గాడిదలాగా ‘ఈ.. ఓర్.. ఈ ..ఓర్’ అంటూ ఓండ్రపెట్టి ‘ఇదిగోనయ్యా.. గాడిద అరుపు. దానిమీద ఎక్కి నీ దారిన నువ్వు పో త్వరగా’ అని చెప్పాడు. తెల్లబోయాడు ఆ పెద్దమనిషి. ఇంకోసారి ఇంకా మంచి తమాషా జరిగింది. అబునువాస్ రెండంతస్తుల మేడ కట్టాడు. అంతా కట్టిన తరువాత ఆ మేడ అమ్మాలని బేరం పెట్టాడు. అంత పెద్దమేడ ఎవరికీ అవసరం లేకపోయింది. అడిగినవాళ్లే లేకపోయారు. చివరికెట్లాగో అబునువాస్ తన మేడ మీది అంతస్తు మాత్రం ఒక వ్యాపారస్తుడికి అమ్మగలిగాడు. వర్తకుడు మేడ మీద ప్రవేశించాక కిందిభాగం కూడా కొనమని అతణ్ణి అడగసాగాడు అబునువాస్. వ్యాపారస్తుడు మాత్రం తనకు అక్కర్లేదని చెప్పేశాడు. ఒకనాటి ఉదయం అబునువాస్ చాలామంది కూలీలను పిలిపించి తన ఇంటి గోడలు పగలగొట్టమన్నాడు. ఈ గడబిడ ఏమిటా అని పైనున్న వర్తకుడు కిటికీలోంచి కిందికి తొంగి చూశాడు. అంతమంది కూలీలు అబునువాస్ చెప్పినట్టే మేడ గోడలను కూలగొట్టసాగారు. కంగారుపడుతూ ఆ వర్తకుడు ‘ఏం చేస్తున్నారు?’ అంటూ అరిచాడు. ‘కింది అంతస్తు అమ్ముతానంటే ఎవరూ కొనలేదు. అందుచేత పగలగొట్టించేస్తున్నాను. నీ పై అంతస్తును జాగ్రత్తగా చూసుకో. నీ మేడ విరిగి నా కూలీల మీద పడి వాళ్లకు దెబ్బలు తగిలితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు అబునువాస్. ‘పగలగొట్టించకండి.. కింది అంతస్తు కూడా నేనే కొంటాను’ అంటూ ఆ వర్తకుడు కింది అంతస్తు కూడా కొన్నాడు విధిలేక. ఆఖరికి ఆ ఊరి రాజుకూడా అబునువాస్ హాస్యపుదెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒకనాటి రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. అబునువాస్ ఇంటి కింద.. భూమిలో వెండినాణాలతో నిండిన బిందెలు ఉన్నట్టు రాజుకి కలలో కనబడింది. తెల్లవారే ఆ బిందెలను తవ్వుకురమ్మని పదిమంది పనివాళ్లను అబునువాస్ ఇంటికి పంపాడు రాజు. అప్పుడు అబునువాస్ ఇంట్లోలేడు. పనివాళ్లు ఇంటి కింది నేలను తవ్వేస్తూంటే ఏమీ చేయలేక ఏడుస్తూ దూరంగా నిలబడింది అబునువాస్ భార్య. ఎంత పెళ్లగించినా వెండిబిందెలు కనబడలేదు. రాజుగారి కూలీలు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అబునువాస్ ఇంటికి రాగానే అతని భార్య ఏడుస్తూ సంగతంతా చెప్పింది. ‘మరేమీ పరవాలేదులే. రాజుగారికి తగిన శాస్తి నే చేస్తాగా! నువ్వు దిగులు పడకు’ అంటూ భార్యను ఓదార్చాడు అబునువాస్. వండిన అన్నాన్ని కొంత తీసి ఒక పళ్లెంలో వేసుకుని దాని మీద ఒక తువాలు కప్పాడు. తువాలు మీద చాలా ఈగలు వాలాయి. అందులో కొన్ని లోపలికి దూరి అన్నం తినటానికి ప్రయత్నించాయి. మరునాడు తెల్లవారగానే తువాలు కప్పిన అన్నపు పళ్లాన్ని రాజుగారి కోటకు తీసుకెళ్లాడు. ‘ప్రభూ.. నాదొక ఫిర్యాదు. కొందరు నా ఇంటికి పిలవకుండానే వచ్చి నా ఆహారాన్ని తినేస్తున్నారు. వాళ్లను దండించ కుండా ఎట్లా ఊరుకోమంటారో మీరే చెప్పండి’ అని రాజుగారిని అడిగాడు. అబున్వాస్ ఏదో కట్టుకథలాంటిది చెబుతున్నాడేమో అనుకున్నాడు రాజు. తన పనివాళ్లు అతని ఇంట్లో నేలను పెళ్లగించిన విషయం చెబుతున్నాడేమోనని కూడా రాజుకి అనుమానం కలిగింది. ‘ఇంతకీ నువ్వు ఫిర్యాదు చేస్తున్నది ఎవరి మీద?’ అని అడిగాడు రాజు. తను తెచ్చిన అన్నపు పళ్లెం మీద కప్పిన తువాలు తీశాడు అబునువాస్. వెంటనే మూడు ఈగలు ఎగిరిపోయాయి. ‘వీటి మీదే నా ఫిర్యాదు’ అన్నాడు అబునువాస్ ఆ ఈగలను చూపిస్తూ. రాజుకి నవ్వు వచ్చింది. ‘ఈగల మీదా నీ ఫిర్యాదు? సరే. నన్ను ఏం చేయమంటావో చెప్పు’ అన్నాడు. ‘చట్టంప్రకారం నాకు న్యాయం చెయ్యమంటున్నాను. ఈగల్ని దండించడానికి మీరు నాకు అనుమతి ఇవ్వాలి. అంతే ప్రభూ’ అన్నాడు అబునువాస్. ‘భేష్.. ఈగలను దండించటానికి నీకు అనుమతి ఇచ్చాను. ఈగలు ఎక్కడ కనిపించినా నీ ఇష్టం వచ్చినట్టు దండించు’ అన్నాడు రాజు నవ్వుతూ. రాజుగారు ఈ తీర్పుని ఒక కాగితం మీద కూడా రాసి సంతకం చేసి అబునువాస్కి ఇచ్చాడు. అబునువాస్ ఈగలను దండించటానికి పెద్ద దుడ్డుకర్ర చేయించాడు. ఆ కర్ర చివర గట్టి ఇనుప పొన్ను వేయించాడు. ఎక్కడ ఈగ కంటబడితే అక్కడ కర్రతో కొట్టేసేవాడు. బజారుకు వెళ్లినప్పుడు ఖర్జూరపు పళ్ల బుట్టల మీద ఈగలు వాలటం చూసి దుడ్డుకర్ర విసిరేవాడు. పళ్లన్నీ చితికిపోయేటట్టు కర్రతో బాదేవాడు. అంగడివాళ్లు ‘ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు?’ అని గదమాయించి అడిగితే ‘నేనేమీ మీ పళ్లను కొట్టటం లేదయ్యా! వాటి మీద వాలిన ఈగల్నే దండిస్తున్నాను’ అని జవాబు చెప్పి రాజుగారు ముద్రవేసి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించేవాడు. వాళ్లు ‘ఇదేం మేళంరా!’ అనుకుంటూ ఊరుకునేవాళ్లు. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అబునువాస్ వెర్రి చేష్టలకు విసుక్కునేవాళ్లు విసుక్కుంటున్నారు. నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటున్నారు. రాజుగారు కూడా ఈ వింత చేష్టలన్నీ విని విరగబడి నవ్వాడు. చివరకు ఒకనాడు రాజుగారు రాజసభలో తీర్పులు చెబుతున్నాడు. అబునువాస్ కూడా వెళ్లి రాజుగారికి దగ్గరగా కూర్చున్నాడు. రాజుగారు ఏదో నేరాన్ని విచారణచేశాడు. గంభీరంగా తీర్పు చెబుతుండగా రాజుగారి వీపు మీద ఈగ వాలింది. చటుక్కున తన దుడ్డుకర్రతో రాజుగారి వీపు మీద గట్టిగా బాదాడు అబునువాస్. అతని ఆ చర్యకు సభంతా ఘొల్లుమంది. అబునువాస్ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. రాజుగారిని కొట్టినందుకు అతనిని శిక్షించాలని పట్టుబట్టారు. ‘అబునువాస్.. ఏమిటీ పిచ్చి? రాజుగారిని కొడతావా?’ అని అధికార్లు అబునువాస్ మీద మండిపడ్డారు. జంకుగొంకు లేకుండా అబునువాస్ ‘నేను తప్పేం చేయలేదే? నన్ను శిక్షించడం న్యాయంకాదు. నేను రాజుగారి వీపు మీద వాలిన ఈగను కొట్టానుగాని, రాజుగారిని కొట్టలేదు. రాజుగానే ఈగల్ని చంపటానికి నాకు అనుమతి ఇచ్చారు’ అని చెప్పాడు. రాజుగారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అనుమతి పత్రం జేబులోంచి తీసి అందరికీ చూపించాడు. ఇంకేం మాట్లాడతారు? అతను చెప్పిందంతా నిజమే. అతనిని నిర్దోషిగా వదలక తప్పిందికాదు. ‘వెధవ ఈగలకి తగిన శాస్తి జరిగింది. అవి నా ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యంగా నా సొమ్మును తీసుకోటానికి ఎందుకు ప్రయత్నించాలి?’ అన్నాడు అబునువాస్. మరోసారి ఇంకో విచిత్రమైన సంగతి జరిగింది. పట్నంలో ఒక భాగ్యవంతుడైన వర్తకుడు మేకమాంసం వండించి మంచి విందు తయారు చేస్తున్నాడు. విందు భోజనం వండేటప్పుడు ఒక బిచ్చగాడు అక్కడ ఏమి జరుగుతూందో చూద్దామని వచ్చాడు. పాపం.. వాడు కాస్త దూరంగా వంటలు తయారుచేసే చోటు నుంచి వచ్చే ఘుమఘుమలాడే ఆ గాలిని పీల్చుకుంటూ కూచున్నాడు. వాసనే ఇంత కమ్మగా ఉంటే ఆ భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందోనని విందు గురించి ఊహించుకోసాగాడు. అయితే ఆ ధనవంతుడు, ఆ బిచ్చగాడికి పిడికెడు అన్నం కూడా పెట్టించలేదు. మరునాడు ఆ వర్తకుడు కనిపించినప్పుడు ‘అయ్యా.. మీరెంత మంచివారో.. మీ వంట పందిరి దగ్గరైనా నన్ను కూచోనిచ్చారు! మీ విందులోని పసందైన మేకమాంసం కూరల కమ్మని వాసన పీల్చేటప్పటికే నాకు సంతృప్తిగా భోజనం చేసినట్టయింది’ అన్నాడు. ‘సరి..సరి.. అందుకేనేమో నిన్న మా మేకమాంసం రుచీపచీ లేకుండా పోయింది. ఆ కమ్మని వాసనంతా నువ్వే పీల్చేసి ఉండాలి సందేహం లేదు’ అన్నాడు వర్తకుడు. అంతటితో ఊరుకోక రాజు వద్దకు వెళ్లి తన మేకమాంసం కూరల కమ్మని వాసనంతా అపహరించుకుపోయాడని బిచ్చగాడి మీద అన్యాయంగా ఫిర్యాదు చేశాడు. రాజు.. వర్తకుల పక్షపాతి కాబట్టి అతడు చెప్పిన ఫిర్యాదు నమ్మి ఆ నేరం చేసినందుకు బిచ్చగాడు పన్నెండు వెండి నాణాలు ఆ వర్తకుడికి ఇచ్చి తీరాలని తీర్పు చెప్పాడు. బిచ్చగాడి చేతిలో పైసా లేదు. పాపం ఏడుస్తూ వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు వాడికి అబునువాస్ ఎదురుపడ్డాడు. రాజుగారి అన్యాయపు తీర్పు సంగతి చెప్పాడు. అబునువాస్ జాలిపడి ‘నేను నీకు సాయం చేస్తాను దిగులుపడకు. నీ అప్పు తీర్చిపారెయ్యటానికి రేపు ఉదయం కలుసుకుందాంలే’ అని ధైర్యం చెప్పాడు. మరుసటి దినం అబునువాస్ బిచ్చగాడితో సహా రాజసభకు వెళ్లాడు. వర్తకుడు కూడా తన పైకాన్ని తీసుకోటానికి వచ్చాడు. అబునువాస్ వర్తకుణ్ణి చూసి ‘నీ డబ్బు చెల్లిస్తే పుచ్చుకోటానికి సిద్ధంగా ఉన్నావయ్యా?’ అని అడిగాడు. ‘ఆ సిద్ధంగానే ఉన్నాను. ఇవ్వండి’ అన్నాడు వర్తకుడు. అబునువాస్ పన్నెండు వెండి నాణాలు తీసి బిచ్చగాడి చేతికిచ్చాడు. ‘ఇదిగో.. వీటిని భూమి మీద పడెయ్యి’ అన్నాడు అబునువాస్. అట్లాగే బిచ్చగాడు ఆ నాణాల్ని నేల మీద పడేశాడు. అవి రాతి నేల మీద పడగానే గణగణమని మోగాయి. ‘విన్నావా? ఆ నాణాల టింగు టింగు మోత!’ అన్నాడు అబునువాస్. ‘ఆ విన్నాను..’ చెప్పాడు వర్తకుడు. ‘ఆ వెండినాణాల్లో నీకు రావలసిన భాగం ఆ టింగ్ టింగే. తీసుకో’ అన్నాడు అబునువాస్. ‘నీ భోజనం కమ్మదనం వాసన చూసినంత మాత్రాన నువ్వు నష్టపోతే ఆ బిచ్చగాడి డబ్బు గణగణ ధ్వని నువ్వు విన్నావు గనుక అది నీకు ముట్టినట్టే. ఇక వెళ్లు’ అన్నాడు అబునువాస్. అతను చెప్పిన న్యాయం ప్రకారం బిచ్చగాడు వర్తకుడికి పన్నెండు కాసులూ చెల్లించినట్టే అని రాజుగారు కూడా ఒప్పుకున్నారు. తగాదా తీరిపోయింది. (‘వేటగాడి కొడుకు ఇతర విదేశ కథలు’ సంకలనం నుంచి) చదవండి: బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..! -
కథ: ఫిబ్రవరి 14.. ప్రేమా.. నీ విలువెంత..?
అదే ఘోరమైన తప్పు ఇవాళ మళ్ళీ చేశాను. అదేదో నేను కావాలని చేయలేదు. ఎవరో నా మట్టిరంగు శరీరంలో ఉండి, ఆ క్షణంలో నా సమస్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుని, వాళ్ళే నా రక్షకులైనట్టు, నా జీవితాన్ని చైతన్యవంతం చేసే ఉత్ప్రేరకాలు అయినట్టు, నా ఆత్మను వెలిగించే దైవత్వం ఏదో వాళ్లలో నిండి ఉన్నట్టు ఆ క్షణంలో కళ్ళు మూసుకునిపోయి చేయడం వలన ఇప్పుడు ఒంటరిగా మిగిలాను. ఆ తప్పిదం వలన నా కలలన్నీ నీటి బుడగల్లా పేలిపోయాయి. నేనొంటరిగా అలా పక్కమీద వాలిపోయాను. ఈ బాధను ఎవరితో ఎలా పంచుకోవాలి? ప్రేమలో నా అపజయాలను, నా ఓటమిని, నాతో దీర్ఘకాలం ప్రయాణం చేయలేని నా స్నేహితులను, నేను ఫ్రిజిడిటీతో బాధపడుతున్నాను అని భావించే నేను ఇష్టపడిన మగవాళ్ళను, వాళ్లు నన్ను ఎక్సయిట్ చేయలేక పడిన నిరుత్సాహాన్నీ ఎవరితో ఎలా పంచుకోను? ఈ బాధ.. కాలం గడుస్తున్న కొద్దీ నన్ను అలసటకు గురిచేయసాగింది. నిస్సందేహంగా పరిణతి చెందిన పురుషులు, మనం నివసిస్తున్న సమాజంలో తమదైన ముద్ర వేయగల పురుషులంటే నా కిష్టం అని చెప్పగలను. చాలామంది చెప్తారు.. ప్రేమకు హద్దులు లేవని. నేనూ అలాగే అంటాను. ప్రేమకు హద్దుల్లేవు అని. నన్ను నన్నుగా ప్రేమించే పురుషుడు పెళ్లయిన వాడా? పెళ్లికాని వాడా? ధనికుడా? డబ్బులేని వాడా? సామాజిక స్థాయిలో ఉన్నత, నిమ్న అంశాలు ఇవన్నీ నాకు పెద్దగా పట్టించుకోవలసిన అంశాలు కానేకావు. ఇంతా చెప్పాక నన్ను ప్రేమించే వాడు నాకు ఎంత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తానో మీకు చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను. అతడికి నా ప్రేమను కూడా అంతే ప్రత్యేకంగా మూటకట్టి మరీ ఇస్తాను. మేమిక్కడికి, ఈ ఫిబ్రవరి 14 సాయంత్రం పూట ఈ పండుగ వాతావరణాన్ని సంపూర్తిగా హృదయంలో నింపుకోవడానికి వచ్చాము. ఈ పూట మా ప్రేమ ప్రయాణంలో ఏ అవరోధమూ, ఆటంకమూ లేకుండా సాయంత్రమంతా గడపడానికి ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాము. ఈ మూడు నక్షత్రాల హోటల్ టెర్రస్ మీద కూర్చుని చూస్తుంటే ఈ ప్రపంచం ఎంత బావున్నది? కొన్ని వేల నియాన్ దీపాలు వెదజల్లుతున్న కాంతిలో చీకటి రాత్రి అన్ని వైపుల నుండీ పువ్వులు వెదజల్లుతున్న పరిమళాలతో సౌందర్య భరితంగా కనిపిస్తున్నది. మనోల్లాసకరమైన మంద్ర సంగీతానికి అంతే మంద్రంగా నాట్యం చేస్తున్న యువతీ యువకులు. ప్రతి యువతీ ఒక రాజకుమారిలాగా, ప్రతి యువకుడూ ఒక రాకుమారుడిలాగా కనిపిస్తూ వాతావరణంలో ఒక ప్రేమ రాజసాన్ని నింపుతున్నారు. బయట వాలంటైన్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి కొన్ని సమూహాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వుంది. ప్రేమికులు కనిపిస్తే చాలు బలవంతంగా తీసుకుని వెళ్లి తాళి కట్టించే సమూహాల నుండి దూరంగా, ఏ ఆటంకమూ లేని ఈ ప్రదేశంలో అతడితో నా బంధం మొదలుకావడానికి ఇదొక అద్భుతమైన, అందమైన సమయం. దేశపు తూర్పు ప్రాంతంలో ఇది వసంత సమయం. అవును నా జీవితంలో కూడా ఇది వసంత సమయమే. అతడు చాలా ఫార్మల్ సూట్లో ఎర్ర టై కట్టుకుని, కోట్ ముందు గుండీలు పెట్టుకునే బొత్తాంలో ఎర్రగులాబీ తురుముకుని ఒక అరిస్టోక్రాట్లాగా వచ్చాడు. తన జీవితంలో దుష్ట గ్రహాలు కలుగచేసే దుష్ట ప్రభావాలను తొలగించడానికి మూడువేళ్ళకు మూడు రంగురాళ్ల ఉంగరాలు ధరించి వచ్చాడు. నన్ను చూడగానే అతడి మొహంలో ఒక చిన్న ఆశాభంగం కనిపించింది. బహుశా నేను ప్రత్యేకంగా తన కోసమే తయారై ట్రెండీగా వస్తానని ఊహించి ఉంటాడు. అతడలా ఎందుకు ఊహించాడో నాకు తెలియదు.. కానీ అలంకరణ విషయంలో నేను చాలా పొదుపు. మా అమ్మ లాగా, ఇతర ఆడవాళ్ళలాగా నేను గంటల తరబడి అద్దం ముందు గడపను. ఈ క్షణాన నేను ఎర్రగులాబీ రంగు చీర కట్టుకుని వున్నాను. మేడలో చిన్న లాకెట్. ఎప్పటిలాగే జుట్టు లూజుగా వదిలివేశా. కొంచెంగా నాకు ఇష్టమైన ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ అద్దుకున్నా . చెవులకు చిన్న జూకాలు. ప్రత్యేకమైన సందర్భాల కోసం ప్రత్యేకంగా తయారవడం కన్నా ఇలా సింపుల్‌గా ఉండటమే నా కిష్టం. నా ప్రేమను చాలా డాంబికంగా ప్రదర్శించే శక్తిని ఆ సమయంలో నాలో వున్నదో లేదో నాకు తెలియదు. ‘నువ్వు చాలా అందంగా, ప్రత్యేకంగా, ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత ఆకర్షణీయమైన స్త్రీలా కనిపిస్తున్నావు. కానీ ఎందుకింత సింపుల్‌గా డ్రెస్ చేసుకున్నావు?’ మెరిసే కళ్ళతో అతడు అడిగిన ప్రశ్నకు నేను నవ్వి ఊరుకున్నాను. మా టేబుల్‌కి కాస్త దూరంలో మరొక టేబుల్ దగ్గర ఒక జంట తమ ఇద్దరు పిల్లలతో కూర్చుని వుంది. ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరు.. మరొకరికి ఎనిమిదేళ్ళు వుంటాయేమో! పిల్లలు ఇద్దరూ ఫోర్క్‌లు, కత్తులతో కుస్తీ పడుతున్నారు. అతడు తరచూ ఆ పిల్లల వంక చూస్తూ నా వైపు చూస్తున్నాడు. మిగిలిన జీవితం తన వెనుక మిగల్చబోయే ఒకానొక జ్ఞాపకం గురించి అతడు పరధ్యానంలో పడి పోయాడేమో. అతడి ఆలోచన గురించి ఇప్పుడు నేను చెప్పడం కాస్త అసంబద్ధంగా ఉంటుంది. ఈ క్షణం నాది. ఈ అద్భుతమైన క్షణం నాది. ఈ పారవశ్యం నాది. ఈ క్షణం మోహంతో మొదలై ఆత్మీయతగా పరిణతి చెంది, గౌరవంగా కుదురుకుని, అనుబంధంగా పండి కలకాలం వీడలేని బంధంగా మారిపోయే పరిణామశీలతకు ఇది నాంది. అతడు లేని జీవితం అలసి సొలసి విశ్రమించిన ఎడారి! నేను ఇష్టపడి కొనుక్కున్న హైదరాబాదీ పర్సులో నుండి ఒక డార్క్ చాకోలెట్ తీసి అతడికి ఇచ్చాను. ఆ చాకోలెట్ నేను ఢిల్లీలో కొని ఈ రోజు కోసం ఫ్రిజ్‌లో దాచి వుంచాను. ఆ పింక్ కలర్ ర్యాపర్‌ను నేను తాకనైనా తాకకుండా అతడికోసమే దాచి వుంచాను. ఎవరు చెప్పారో సరిగ్గా గుర్తు లేదు కానీ జపనీస్ తమకు ఇష్టమైన పురుషులకు ఈ ప్రత్యేకమైన వాలంటైన్స్ డే రోజున చాకోలెట్స్ బహుమతిగా ఇస్తారట. సరిగ్గా నెల రోజుల తరువాత మార్చ్ 14 నాడు పురుషులు తమ స్త్రీలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట. అతడు ఆ పింక్ కలర్ ర్యాపర్‌ను జాగ్రత్తగా సున్నితంగా విప్పి ఒక చిన్న బిట్ మునిపంటితో కొరికి ‘రుచికరం’ అన్నాడు. వెంటనే మళ్ళీ ‘ నువ్వు నా కోసం ప్రత్యేకంగా చేదుగా, వగరుగా వుండే ఈ చాకోలెట్ కొన్నావు కదూ! నువ్వు బయటకి చాలా గట్టిగా సాధించలేని శిఖరంలా కనిపిస్తావు కానీ లోపల చాలా సున్నితం’ అన్నాడు. మేము ఒకరి చేతిలో మరొకరం చేతిని బంధించి ఉంచాము. మా చేతి వేళ్ళు ఒకదానితో మరొకటి పెనవేసుకున్నాయి. చుట్టూ జనంతో ఉత్సహంగా , ఉల్లాసంగా , సంతోష సంబరాలతో ఉద్విగ్నంగా వున్న ఆ వాతావరణంలో మాలో ఒకరిపట్ల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి దారిదొరకలేదు మాకు. అతడు మెల్లగా ‘అందుకే మనకు కాస్త ప్రయివసీ కావాలి అన్నాను. కేవలం నువ్వు, నేను మాత్రమే ఉండగలిగే చోటు. నీ సాహచర్యాన్ని నేను మాత్రమే అనుభూతించగలిగే చోటు. ఇక్కడ ఇలా మనలని ఎవరైనా చూస్తే జరిగే పరిణామాలు నేనూహించగలను. నా బాధ నా గురించి కాదు. నీ గురించే! నీ రెప్యుటేషన్ గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు. నన్ను మాత్రం గాలి అలలలో తేలి వస్తున్న బ్రయాన్ ఆడమ్ ‘Everything I do, I do it for you’ పాట పూర్తిగా లీనం చేసుకున్నది. అతడికి అర్థం అయ్యేట్లు నేనెలా చెప్పాలి.. ‘కొండల మీద నుండి దూకే ఒక జలపాతాన్ని నేను’ అని! శతసహస్ర రేకులుగా విచ్చుకున్న ప్రేమ కుసుమం నుండి రెక్కలన్నీ ఒక్కసారిగా రాల్చేస్తే ప్రేమను పొందడమూ, అపురూపంగా జ్ఞాపకాల వెన్నెల భరిణలో దాచుకోవడమూ, అప్పడప్పుడూ ఆ భరిణ తీసి ఆ మధుర, మంజుల ముద్ర శ్వాసను ఆఘ్రాణించడమూ కష్టమని! అతడిది నిర్మల హృదయమే. సమాజంలో వివిధ స్థాయిలలో ఉన్న రకరకాల వ్యక్తులతో ఉండే వైయక్తికమైన స్నేహసౌరభాలను అతడు అనుభూతించగలడు. ఈ ప్రత్యేకమైన సందర్భం సెలబ్రేట్ చేసుకోవడానికి అతడు నా కోసం ఒక చిన్న ఎర్ర గులాబీని కూడా తీసుకుని రాలేదు. ప్రేమికుల రోజున ఎర్ర గులాబీ ఇచ్చుకోవడం సంప్రదాయం. అతడా సంప్రదాయాన్ని పాటించలేదు. ఈ వాతావరణాన్ని మత్తిల్ల చేయడానికి ఒక పెర్ఫ్యూమ్‌నైనా అతడు కానుకగా ఇవ్వలేదు. మా మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ బంధానికి భవిష్యత్తు లేదని అతడికి తెలుసేమో. అయినా మేమిద్దరమూ ప్రేమికులరోజు గురించి చాలా అభిప్రాయాలను, ఉటంకింపులను పంచుకున్నాము. ప్రేమ, విధేయత రెండూ ఒకటేనని.. ప్రేమ ఒక రక్షణ కవచంలా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఇద్దరమూ అంగీకరించాము. చాలా రోజుల తరువాత మా ఇద్దరికీ ఇలా కలిసే అవకాశం దొరికింది. నేను మెల్లగా ఒక సాధారణ స్త్రీగా మారిపోతున్నాను ఈ మత్తిల్లిన వాతావరణంలో. రాత్రి మెల్లగా చిక్కబడుతున్నది. క్యాండిల్ లైట్ డిన్నర్‌కి మూడు నక్షత్రాల హోటల్ సిద్ధం అవుతున్నది. అతడు తన కోటు బటన్ విప్పి లోపల దాచిన ఒక సన్నటి పాకెట్ బయటకు తీశాడు. అది గిఫ్ట్ ర్యాపర్‌తో చుట్టిలేకపోవడంతో నేను చాలా తేలికగా పోల్చుకోగలిగాను. అదొక వేణువు. ఎక్కడో అరణ్యగర్భంలోని వెదురు చెట్టు నుండి లేలేత వెదురుముక్కను కోసీ, నదీ తీరంలోని గులక రాళ్ళతో పదును తేల్చి, నీళ్లలో నానబెట్టి సున్నితంగా చేసి, ఓ అద్భుతమైన కళాకారుడు తన ఆత్మనంతా ఆ వెదురులోకి ఒంపి, నిలువెల్లా గాయాలతో శ్వాస నింపి, ప్రతి అద్భుతమైన భావానికి అపురూపమైన ప్రాణ శబ్దాన్ని ఇవ్వగల వేణువు. ఆకుపచ్చదనం పండితే మధురమై, ఆ తీవ్ర మాధుర్యంలో మనలని మనం కోల్పోతామట. అది సాధ్యమేనా? నా ఎదురుగా ఉన్న అతడు, అత్యంత నాగరీకమైన దుస్తులు ధరించి లోలోపల అంత దైవత్వాన్ని కలిగివున్నాడా? బహుశా ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆ వేణువు మీద అతడు పాడే పాటలో నేను కరిగి, నీరై, నా లోని నిశ్చలత్వం పారిపొయ్యెలా చేసే రసవిద్య అతడిలో ఉన్నదా? ఒకానొక మార్మికమైన గూడు ఏదో నా చుట్టూ అల్లుకుంటున్న భావన. నా కళ్ళు కృతజ్ఞత తో చెమర్చాయి. అతడి వెచ్చనైన గొంతు మెల్లగా వినిపిస్తున్నది.. ‘నీ స్వచ్చమైన, సుందరమైన అభిరుచి నాకు తెలిసీ ఇలాంటి గిఫ్ట్ తీసుకుని వచ్చానని నవ్వుతావేమోనని మొదట నాకు చాలా భయమేసింది. నిన్ను దేనితోనూ కొనలేనని నువ్వన్నమాట నాకు గుర్తున్నది. నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన రసవిద్య తెలిసి ఉండాలి. గతనెల నేను ఇన్స్పెక్షన్ పని మీద జార్ఖండ్ వెళ్ళాను. ఆ రాత్రి.. కొద్ది దూరం నుండి వినిపిస్తున్న వేణుగానాన్ని విన్నాను. అలాంటి వేణునాదాన్ని ఇంతకుముందెప్పుడూ నేను విని ఉండలేదు. ఎంత మధురమైన నాదం అంటే బహుశా ఆ కోయిల గానానికి కూడా అంత మాధుర్యం ఉండదేమో! అప్పుడే అనిపించింది .. ఆ అద్భుతమైన వేణువునే ఈ రోజు నేను నీకు ఇవ్వగల అపురూపమైన కానుక అని. ఆ మరునాడే మావాళ్లను పిలిచి ఆ వేణువు ఊదే వ్యక్తిని తీసుకుని రమ్మని చెప్పాను. అతికష్టం మీద వాళ్లు అతడిని పట్టుకున్నారు. అతడొక చిన్నపిల్లాడు. పేదరికం వలన తన వయసుకు రెండింతల పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. అన్నం తిని ఎన్నిరోజులు అయిందో పొట్ట వీపుకు అతుక్కొని ఉంది. ఆ పిల్లాడి తల్లి తండ్రులు చనిపోయారట. ఆ అబ్బాయి ఈ భూమి మీద బతికి ఉండటానికి కావల్సిన ఒక్క కారణం కూడా లేదు. నేను ఆ పిల్లాడికి రెండు వందల రూపాయలు ఇచ్చి ముందు కడుపు నిండా అన్నం తినమన్నాను. మందు తాగితే అస్సలు ఊరుకోను అని చెప్పాను. ఎందుకంటే గిరిజనులు చేతిలో డబ్బు పడగానే మద్యం షాప్‌కే పరుగెడతారు. ఆ పిల్లాడు మద్యం షాప్‌కి వెళ్లకుండా ఒక కన్ను వేసి ఉంచమని మా వాళ్లతో చెప్పాను. అప్పుడు చూశాను ఆ పిల్లాడి నడుముకు వేళ్ళాడుతున్న వేణువును. ‘నాకు ఆ వేణువు అమ్ముతావా?’ అని అడిగాను. వెంటనే ఆ పిల్లాడు వేణువును దాచేసుకున్నాడు. నేనా పిల్లాడితో ‘వేణువు ఇస్తే మరొక రెండువందలు ఇస్తాను’ అన్నాను. వాడు ఒప్పుకోలేదు. చివరకు వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాను. వాడికి నా ఆఫర్‌ను కాదనే శక్తి లేదు. మార్కెట్లో యాభై రూపాయలు కూడా చేయని వేణువుకు వెయ్యి రూపాయలు. కానీ బహుమతిగా ఇచ్చే వేణుగానం విలువ వాడికి ఎలా తెలుస్తుంది? ఆ వేణువులాంటి దానివే నువ్వు కూడా. నువ్వూ అమూల్యం. ఒక అమూల్యమైన నీకు, నీలాంటి అమూల్యమైన వేణువును మించిన బహుమతి కచ్చితంగా సరిపోతుంది’ అతడి మాటలు నేను ఎంతోసేపు వినలేక పోయాను. అకస్మాత్తుగా నా ప్రపంచం అంతా ఒక విషాదంతో నిండిపోయింది. ఆ వేణువు నా హృదయంలో ఒక దుఃఖ గీతం పాడసాగింది. ఎప్పటిలాగే నా లోలోపలి ఆత్మ మేలుకున్నది. ప్రేమ గురించిన నా భౌతికమైన వాంఛలన్నీ ఒక్కసారిగా కొట్టుకునిపోయాయి. ఆ వేణువు ఊదే పాపడికి ప్రేమ విలువ తెలియదా? నేను ప్రేమించిన ఈ మనిషికి ప్రేమ విలువ తెలుసా? ప్రేమ విలువ తెలియడానికి, ప్రేమ విలువ తెలియకపోవడానికి ఒక మనిషికి కావలసినది ఏమిటి? డబ్బేనా? ఇతడికి డబ్బు వుంది కనుక ప్రేమ విలువ తెలుస్తుందా? డబ్బు లేదు కనుక వేణువు ఊదే పాపడికి ప్రేమ విలువ తెలియదా? అంటే డబ్బు వున్నది కనుక అతడు ఏదైనా కొనగలడా? నేను ఒక ఎనిగ్మాటిక్ పరిమళంలోకి ప్రయాణిస్తున్నాను. మామిడిపళ్ళ మాధుర్యంలోకి, కొండలమీద నుండి దూకే చిన్న జలపాతంలోకి ప్రయాణిస్తున్నాను. నా స్పృహ, అస్తిత్వం ఒక గొప్ప వరదలో కొట్టుకుని పోతున్నదా? నా శరీరం మొత్తం నిరసనతో వణికిపోతున్నది. నేను మరొక్క మాట కూడా మాట్లాడలేక పోయాను. త్వరగా డిన్నర్ ముగించి త్వరగా వెళ్ళిపోదామని చెప్పాను. ఎక్కడో ఏదో జరగకూడనిది జరిగింది అన్న విషయాన్ని అతడు పసిగట్టినట్టున్నాడు. నేను మూర్ఖురాలినా? భౌతికమైన ఆనందాలు, సంతోషాలు పొందే క్రమంలో అవన్నీ చాలా అల్పమైన విషయాలని తెలియచెప్పే ఒక హింసాత్మక డెమి ఉమన్ నేనా? నేనెవరిని? అతడు ఎంచుకున్న మనిషినా? అతడి మనిషినా? బంధాల భవిష్యత్తును ముందుగానే గుర్తించగలిగితే మనమెవరమూ బహుశా బంధాలలోకి ఎప్పటికీ స్వయంగా వెళ్ళమేమో! ఒరియా మూలం : మోనాలిసా జెనా తెలుగు సేత : వంశీకృష్ణ