Grain purchases
-
వడ్లు కొనమంటే నోట్ల లోడ్ ఎత్తుతున్నారు
మర్రిగూడ: రాష్ట్రంలో రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీరు రావడం వల్ల 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వల్ల నల్లగొండలో కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. హరీశ్‌రావు బుధవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, రైతులకు అవసరమైనన్ని గన్నీ బ్యాగులను అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించు కోకపోవడంతో రైతులు రూ.1,800కే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివర కు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న వడ్లనూ కొన్న పాపాన పోలేదన్నారు. వడ్లు కొనకపోతే అధికారులను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కాని మ ద్యం తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మా త్రం మెమోలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదన్నారు. పక్క రాష్ట్రం నుంచి దళారులు వచ్చి తెలంగాణ రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రాజ్యంలో రైతులు రోదిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాగా, గతంలో ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకల్లో రూ.48 లక్షలు అవినీతి చోటుచేసుకోగా.. కొనుగోలు డబ్బులు నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదని రైతు మోదుగు రాజేందర్.. హరీశ్‌రావుకు చెబుతుండగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సర్కారుపై బీజేపీ సమరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు బీజేపీ వేగంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే ఈ నెల 9, 11, 13 తేదీల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు మద్దతు ప్రకటించిన ఆ పార్టీ నేతలు, 16, 17 తేదీల్లో మూసీ ప్రాజెక్టు బాధితుల సమస్యలు తెలుసుకొనేందుకు ‘మూసీ నిద్ర’కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దానికి కొనసాగింపుగా మరో భారీ కార్యాచరణను సిద్ధం చేశారు.రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వారంపాటు ఈ పాదయాత్రలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నాయకత్వం వహించనుండగా, బీజేపీలోని కింది స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నేత వరకు అందరూ తప్పనిసరిగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు వరుస కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపైనే పోరాట కార్యాచరణ చేపడుతున్నది.పాదయాత్రలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే బీజేపీ నేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలకు చేరుకునే వీలును బట్టి ఐదు నుంచి ఏడురోజుల పాటు పాదయాత్రలు నిర్వహించనున్నారు. రోజుకు 15 నుంచి 17 కి.మీ. యాత్ర నియోజకవర్గాల్లో రోజుకు 15 నుంచి 17 కి.మీ. దూరం పాదయాత్ర కొనసాగేలా రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో రోజుకు అంతకంటే ఎక్కువ దూరం యాత్ర చేసే వీలుండటంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కొందరు నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేసి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారు. ప్రతిరోజు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యాత్ర నిర్వహించాలి? నైట్ హాల్ట్ ఎక్కడ ఉండాలి? అనే అంశాలన్నింటినీ ఈ బృందాలు చూసుకొంటాయి. వచ్చే నాలుగేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజాసమస్యలపై పోరాడేందుకు పార్టీ పరంగా వివిధ రూపాల్లో చేపట్టబోయే నిరసనలు, ఆందోళ నలకు ఈ పాదయాత్ర పూర్వరంగంగా ఉపయోగ పడుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభు త్వం మొగ్గుచూపినా, చూపకపోయినా... గ్రామ, మండల స్థాయిల్లో బీజేపీ బలపడేందుకు ఈ పాదయాత్రలు దోహదపడతాయని భావిస్తున్నారు.25 ప్రాంతాల్లో మూసీ నిద్ర ఈ నెల 16 నుంచి 17వ తేదీ ఉదయం వరకు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని 25 ప్రాంతాల్లో మూసీ నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలతో కలిసి భోజనం చేసి బస చేస్తామని వెల్లడించారు. ప్రక్షాళన పేరుతో ఇళ్లను కూలి్చతే ఊరుకోబోమని హెచ్చరించారు. బుల్డోజర్లను తమపై నుంచి ఎక్కించిన తర్వాతే ప్రజల ఇళ్లను ముట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు. -
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పోరాటానికి సిద్ధమయ్యారు. శనివారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండల కేంద్రంతో పాటు రేవన్నపల్లి గ్రామంలో కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, బూర నర్సయ్యగౌడ్, గూడూరు నారాయణరెడ్డి తదితరులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు.నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో డా. లక్ష్మణ్ , బంగారు శ్రుతి, సంకినేని వెంకటేశ్వరరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్‌బాబు పర్యటించనున్నారు. 11వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్, బోడిగె శోభ, జి.మనోహర్‌రెడ్డి, రాణీ రుద్రమ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో డీకే అరుణ, మాజీఎంపీ పి.రాములు, చింతల రామచంద్రారెడ్డి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎం.ధర్మారావు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీ రఘునందన్‌రావు, మాజీ ఎంపీ బీబీపాటిల్, జె.సంగప్ప, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాటిపట్టి వెంకటరమణారెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి దాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తారు. 13న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాకేష్‌రెడ్డి, సూర్యనారాయణగుప్తా, డి.ప్రదీప్‌కుమార్ ఇతర నేతలు పాల్గొంటారు. -
ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. గత నెల మూడోవారం నుంచే నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కూడా కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో పౌరసరఫరాల సంస్థ బిజీగా ఉంది. మార్చి 25వ తేదీ నుంచే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభించిన 443 కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఒకటి రెండు రోజుల తర్వాత కోతలు పెరిగి ..ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేనా..? కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లర్ల జోక్యం పెరిగింది. కొనుగోలు కేంద్రాలలోనే తరుగు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. తీరా ధాన్యం మిల్లులకు పంపిన తర్వాత కూడా రంగు మారిందని, తాలు, తేమ అధికంగా ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు నేరుగా రైతులకు ఫోన్లు చేయించి వేధించి తరుగు తీయడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం తప్ప, కొర్రీలు పెడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మిల్లులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు, హమాలీ పేరుతో కిలోల కొద్దీ ధాన్యం రైతుల నుంచి దోచుకునే విధానానికి స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు. అందుబాటులో 14 కోట్ల గన్నీ సంచులు రాష్ట్రంలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, ఈసారి దిగుబడి, ధాన్యం విక్రయాల తీరును బట్టి చూస్తే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులలోపే ధాన్యం సేకరణ జరిగే అవకాశముందని పౌరసరఫరా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈసారి వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. అందులో ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులను పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ గన్నీ బ్యాగులు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఇవి సరిపోతాయి. మిగతా గన్నీ బ్యాగులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా, వాటి అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్‌కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్‌లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
వడ్ల పైసలస్తలేవు..!
సాక్షి, కామారెడ్డి: ధాన్యం కాంటా వేసిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో అమలు కావడంలేదు. ధాన్యం కొనుగోళ్లు నేటితో ముగియనున్నాయి. అయితే నెల క్రితం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సకాలంలో ధాన్యం డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లో యాసంగిలో సోమవారం నాటికి 3,52, 418.600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ. 725.98 కోట్లు. కాగా ఇప్పటి వరకు రైతులకు రూ. 401.14 కోట్లు చెల్లించారు. అంటే ఇంకా రైతులకు రావాల్సిన బకాయిలు రూ. 325 కోట్లు ఉన్నాయి. వడ్ల పైసలు వస్తే డబ్బులు ఇవ్వాల్సిన వారికి ఇచ్చేయా లని రైతులు ఎదురుచూస్తున్నారు. వరి కోతలు, పంట నూర్పిడి, రవాణా, లేబర్ ఖర్చులకు తెచ్చిన అప్పులు, అప్పటికే పంట సాగు కోసం చేసిన అప్పులు రైతులకు భారంగా మారాయి. డబ్బుల గురించి అధికారులను ఎప్పుడు అడిగినా రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయనే సమాధానం చెబుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసలు రాక ఇబ్బందులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెగుళ్లతో దెబ్బతినడం, వడగళ్ల వానలతో వడ్లు రాలిపోవడం, కోతలకు చైన్ మిషన్లకు అడ్డగోలుగా వెచ్చించాల్సిన పరిస్థితి ఆపై దిగుబడులు తగ్గిపోవడం, కేంద్రాల వద్ద ధాన్యం నానిపోయి రోజుల తరబడి జాగారం చేయాల్సిన పరిస్థితుల్లో రైతులు అనేక అవస్థలు పడ్డారు. ఎలాగోలా ధాన్యం కాంటా అయి మిల్లులకు చేరి రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడం రైతులకు సమస్యగా మారింది. దాదా పు అందరు రైతులు పంట సాగుకోసం అప్పలు చేసి పెట్టుబడులు పెట్టిన వారే. పంట చేతికి వచ్చిన తర్వాత అప్పులు చెల్లించడం, మళ్లీ పంట సాగుకోసం అప్పులు చేస్తుంటారు. ఈ సారి వడ్ల పైసలు రాకపోవడంతో అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు అమ్మినా అప్పు కట్టడం లేదంటూ చాలామంది రైతులను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు రాలేదని సర్ది చెప్పలేక అవస్థలు పడుతున్నారు. వెంటనే వడ్ల డబ్బులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. వానాకాలం సాగుకు కష్టాలు యాసంగిలో సాగు చేసిన వరి దెబ్బతిని దిగుబడులు పడిపోయి పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితుల్లో రైతులు వానాకాలం సాగుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో వరికి తెగుళ్లు, వడగళ్ల వానలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. చాలా మంది రైతులకు దిగుబడి పడిపోయి పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితి లేదు. వానాకాలం సీజన్ దగ్గర పడుతోంది. ముందస్తుగా పంటలు సాగు చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేయడం, దున్నకాలకు పెట్బుడులు ఎక్కడి నుంచి తేవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరాకు ఇచ్చే రూ. 5వేలు కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో రైతులకు వానాకాలం సాగు ఇబ్బందికరంగా మారింది. నెల రోజులైనా పైసలు రాలేదు మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. నెల రోజుల క్రితమే వరి కోసి వడ్లను కేంద్రానికి తీసుకువెళ్లాను. 150 బస్తాలు అయ్యాయి. అమ్మి నెల రోజులైనా డబ్బులు రాలే దు. పంట సాగు కోసం, కోతకు అప్పులు చేసిన. డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్లీ వానాకాలం పంట వేయడానికి సమ యం దగ్గర పడుతోంది. ఎప్పుడు వస్తయో ఏమో తెలుస్తలేదు. – కిష్టారెడ్డి, రైతు, డబ్బులు జమ కాలేదు నేను 36 రోజుల కిందట కొనుగోలు కేంద్రంలో 83 బస్తాల వడ్లు అమ్మినా. ఇప్పటికీ నయాపైసా రాలేదు. డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు వస్తయో చెప్తలేరు. లాగోడీకి తెచ్చిన డబ్బులు సర్దుబాటు చేయాల్సి ఉంది. వానాకాలం సీజన్ కూడా ముంచుకు వచ్చింది. తొందరగా డబ్బులు ఇవ్వాలి. -
పూర్తి కాని కొనుగోళ్లు..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం తలపెట్టిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడం రైతులను కలవరపెడుతోంది. చాలా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అమ్ముడుకాకపోవ డంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఓవైపు రుతుపవనాలు సమీపిస్తుండటం, రబీ సీజన్ మొదలవుతుండటం.. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అమ్ముడుపోకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. మిల్లర్లు కుమ్మక్కై చాలాచోట్ల క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోత పెడుతున్నారు. అయినా సరే రైతులు కోతలకు సమ్మతించినా.. మిల్లర్లు చాలా చోట్ల కొర్రీలు పెడుతుండటం, ధాన్యాన్ని మిల్లుల్లో దింపకుండా అలాగే ఉంచడంతో లారీలు కొనుగోలు కేంద్రాలకు సరిగా వెళ్లడం లేదు. దీంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. మరో 4.55 లక్షల మెట్రిక్ టన్నుల దూరంలో.. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 62.16 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీలు) ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,192 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూన్ 6 నాటికి అందులో 3,181 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. కానీ, మధ్యలో మిల్లర్ల కొర్రీలు, అకాల వర్షాలు, లారీల కొరత తదితర కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 57.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, మరో 4.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ధాన్యం విలువ రూ.11,843 కోట్లుగా ఉంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా? ఏరువాక ఉత్సవాలతో రబీ సీజన్ మొదలైంది. ఈసారి రబీని నవంబరు నాటికి పూర్తి చేసి, యాసంగి పంట కోతలను మార్చి నాటికి ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి వేసవిలో అకాల వర్షాలు రైతులకు గత వందేళ్లలో ఏనాడూ చూడని నష్టాన్ని కలగజేశాయి. దీనికితోడు వేసవిలో కోతలు ఏప్రిల్ వరకు సాగితే, వరి నుంచి మర ఆడిస్తే నూక అధికంగా వస్తుంది. ఈ సమస్యలను అధిగమించి మార్చి నాటికి కోతలను ముగిస్తే.. రైతుకు ప్రకృతి విపత్తులు, నూకల బెడద తప్పుతుందన్నది ప్రభుత్వ వ్యూహం. కానీ, కొనుగోళ్ల ప్రక్రియ జాప్యమవడంతో రబీ, యాసంగి సీజన్ల పంట ఆలస్యమయ్యే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల్లో పూర్తి మరో మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం. ఎక్కడా రైతులకు ఇబ్బంది రానీయం. 95% ధాన్యం కొనుగోలు చేశాం. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమవుతాయి. –మంత్రి గంగుల కమలాకర్ కొనుగోళ్ల వేగం పెంచాం రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంగళవారం ఒక్కరోజే 1,31,703 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. అకాల వర్షాలు, సాంకేతిక సమస్యల కారణంగా కొంచెం జాప్యమైన మాట వాస్తవమే. రెండు మూడు రోజుల్లో మిగిలిన 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సైతం కొనేస్తాం. –సర్దార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల శాఖ, చైర్మన్ -
అన్నదాతల్లో ‘ధర’హాసం
గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి వరదా ఎస్వీ కృష్ణకిరణ్ : రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు వెల్లువలా కొనసా గుతున్నాయి. అకాల వర్షాల సమయంలో కోసిన ధాన్యాన్ని.. కోసినట్టుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. తడిసిన, నూక ధాన్యాన్ని సైతం (బ్రోకెన్ రైస్) ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టాల ఊబి నుంచి రైతులను గట్టెక్కించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలిసారిగా జయ రకం (బొండా లు) ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేట్ మార్కెట్లో ఆ పంటకు మంచి ధర పలుకుతోంది. బుధవారం సాయంత్రానికి రూ. 2,541.51 కోట్ల విలువైన 12.45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా ప్రభుత్వం కొనుగోలు చే సింది. ఇందులో ధాన్యం విక్రయించిన 1.38 లక్షల మంది రైతులకు గాను 96 వేల మందికి రూ.1,673 కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి చేసింది. బాయిల్డ్ మిల్లులకు తరలింపు వరి కోతలు ప్రారంభమైన దశలో అకాల వర్షాలు కు రవడం.. ఆ తరువాత అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య తలెత్తింది. దీనిని సా కుగా చూపించి రైతులను మిల్లర్లు మోసం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ కోనసీ మ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున.. ఏలూరు, కాకినా డ, తూర్పు గోదావరి జిల్లా ల్లో బ్రోకెన్స్ అధికంగా వ స్తు న్న ప్రాంతాల్లో మొబైల్ మి ల్లులను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. రైతులు ముందుగా నే శాంపిళ్లను మొబైల్ మి ల్లు ల్లో మరాడించి.. అక్కడ ఇచ్చే రశీదు ఆధారంగా ధా న్యాన్ని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. ముక్క విరుగు డు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. జయ రకం (బొండాలు) ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుండటంతో మార్కెట్లో పోటీ పెరిగింది. ప్రైవేట్ వ్యాపారులు మంచి ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. జయ రకం ఎక్కువగా పండించిన ప్రాంతంలో కళ్లాల్లోకి వచ్చి మరీ బస్తా (75 కేజీలు) రూ.1,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ రకాన్ని తక్కువ పండించిన ప్రాంతాల్లో అయితే.. బస్తాకు రూ. 1,600–రూ.1,700 కూడా చెల్లిస్తున్నారు. రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు వేగంగా మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఉమ్మడి గోదావరి పరిధిలోని 5 జిల్లాలకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్ల కార్పస్ ఫండ్‌ను ముందుగానే విడుదల చేసింది. ఫలితంగా ఆయా జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితు లకు అనుగుణంగా వాహనాలు, కూలీలను ఏ ర్పాటు చేస్తూ రైతులకు భారాన్ని తగ్గిస్తున్నారు. ఒకవేళ రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే ఆ మొత్తాన్ని కూడా మద్దతు ధరతో కలిపి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వాస్తవ పరిస్థితి ఇదీ.. ♦ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో ఇంకా కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం శివరామ్ చెప్పారు. ♦ తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల టన్నుల దిగుబడిలో సగానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. బొండాలు రకం సాగు చేసిన రైతులు బయట మార్కెట్లోనే ఎక్కువగా విక్రయిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి కుమార్ తెలిపారు. ♦ కాకినాడ జిల్లాలో 10 శాతం విస్తీర్ణంలో కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం పుష్పమణి చెప్పారు. ♦ ఏలూరు జిల్లాలో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య అధికంగా ఉంది. ఆ ధాన్యాన్ని కృష్ణా జిల్లాలోని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం భార్గవి చెప్పారు. చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి, పోలవరం ప్రాంతాల్లో కోతలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం ఇంకా పొలాలు, కళ్లాల్లోనే ఉంది. ఇక్కడ పంటను వేగంగా కొనుగోలు చేసేందుకు వీలుగా దగ్గర మిల్లులకే ధాన్యం తరలించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం సాగర్ తెలిపారు. మొత్తంగా అన్నిచోట్లా జూన్ రెండో వారంలోగా కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు వర్షాల్లోనూ కొన్నారు ఇటీవల కురిసిన వర్షాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తీరు రైతుల్లో భరోసా నింపింది. అంత యుద్ధప్రాతిపదికన ఎక్కడి ధాన్యాన్ని అక్కడే ఆఫ్‌లైన్‌లో కొనేసి వెంటనే మిల్లులకు తరలించారు. నేను కూడా ఆ సమయంలో కొంత, వారం కిందట 582 బస్తాల (ఒక్కో బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని విక్రయించాను. డబ్బులు కూడా చాలా వేగంగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. – సూర్య నారాయణరాజు, లొల్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎంతైనా కొంటాం అకాల వర్షాల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేశాం. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఇంకా కోతలు చేయాల్సి ఉంది. రైతులు తెచి్చన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ రైతులు నష్టపోకుండా చర్యలు ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఫీడ్‌బ్యాక్ కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా వ్యవస్థలో జవాబుదారీ పెంచడం, రైతులు నష్టపోకుండా కాపాడటమే ప్రధాన ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ను ఆయా జిల్లాలకు పంపిస్తున్నాం. రైతులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా మిల్లులను కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తున్నాం. జేసీలకు చెప్పి ఆ మొత్తాన్ని రైతులకు వెనక్కి ఇప్పిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
అప్పట్లో ‘కొనుగోళ్లు’ కతలెన్నో! ధాన్యం కొనుగోళ్లు అంతా రికార్డుల్లోనే..
సాక్షి అమలాపురం: తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లను గాలికొదిలేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నీతులు వల్లిస్తుండడంపై అన్నదాతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అప్పట్లో రైతులకు కావల్సిన కనీస అవసరాలేవీ అమలులో లేవు. రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే)గానీ, ఈ–క్రాప్ విధానం కానీ, మద్దతు ధర కానీ వీటి గురించి చంద్రబాబు కనీస ఆలోచన కూడా చేయలేదు. ఇవేకాదు.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం అన్న ఊసు కూడా ఎక్కడాలేదు. పైగా.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి స్థానిక రైతుల పేరు మీద చూపించి అడ్డుగోలుగా దోపిడీ చేశారు. మిల్లులు అధికంగా ఉన్నచోట ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ దోపిడీ తతంగాన్ని నడిపారు. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పల్లెపల్లెలో ఆర్బీకేలను ఏర్పాటుచేసి రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు అక్కడ నుంచే కల్పించడం, ఈ–క్రాప్ విధానం ప్రవేశపెట్టడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం చేస్తుంటే అన్యాయం, ఘోరం జరిగిపోయిందని టీడీపీ వెర్రెక్కిపోతూ గుండెలు బాదుకుంటోంది. నిజానికి.. చంద్రబాబు హయాంలో కొనుగోళ్ల తీరుతెన్నులు ఎలా ఉండేవంటే.. టీడీపీ హయాంలో ఇలా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2014 నుంచి 2019 వరకు వరి ధాన్యం కొనుగోళ్లు తీసుకుంటే రైతులు ఎంతో నష్టపోయారు. ఉదాహరణకు.. ► 2015లో ఖరీఫ్ దిగుబడి 12 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులలోపు మాత్రమే. అంటే దిగుబడిలో మూడోవంతే. కొనుగోళ్లలో 90 శాతం రికార్డుల్లోనే. కొన్నది లేదు సరికదా.. రికార్డుల్లో చూపినదంతా తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి దొడ్డిదారిన తెచ్చిన ధాన్యం. ► అలాగే.. స్థానికంగా తక్కువ ధరకు కొనుగోలు చేసింది. అప్పట్లో ధాన్యం పండించిన చోట ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కన్నా, మిల్లులు ఎక్కువగా ఉన్న బిక్కవోలు, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, అనపర్తి, రాయవరం వంటి కేంద్రాల్లో కొనుగోళ్లు అధికంగా ఉండడానికి కారణం ఈ దొడ్డిదారి వ్యవహారమే. ► అప్పట్లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.1,057 ఉండేది. కానీ, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేసే అవకాశంలేక రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. ► వీరి ధాన్యాన్ని తేమ, నూకలు, తాలూ తప్పల పేరుతో క్వింటాల్ ధాన్యాన్ని రూ.600ల నుంచి రూ.800లు చొప్పున కొనుగోలు చేయడంవల్ల రైతులు ఎంతగానో నష్టపోయారు. ► వీటిని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చూపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,057 పొందేవారు. ► కొనుగోలు లేకున్నా కొన్నామని చూపించడం ద్వారా కేంద్రాల నిర్వాహకులు సైతం ప్రభుత్వం నుంచి క్వింటాల్‌కు రూ.32 కమీషన్ రూపంలో నొక్కేసేవారు. ► రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఖర్చులను, కూలీ ఖర్చులను కూడా స్వాహా చేసేవారు. ► అంతేకాక.. అప్పట్లో ఈ–క్రాప్ లేనందున ఇష్టానుసారం బుక్ ఎంట్రీ చేసే వీలు ఉండేది. మిల్లర్లు ధాన్యం బహిరంగంగా కొనుగోలు చేసినా కొనుగోలు కేంద్రాల్లో తమకు తెలిసిన రైతుల చిరునామాలను, సర్వే నెంబర్లు మీద ధాన్యం కొనుగోలుగా చూపించేవారు. అప్పట్లో వీటిల్లో టీడీపీ నేతల హవా ఉండడంతో దోపిడీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. 2015లో ధాన్యం కొనుగోలు అక్రమాలపై నాడు సాక్షిలో వచ్చిన కథనం (ఫైల్ ఫోటో) వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. టీడీపీ హాయాంలో జరిగిన విధానంలో ధాన్యం కొనుగోళ్ల తీరుతో రైతులు నష్టపోతున్న విషయాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుర్తించారు. తన ప్రభుత్వం వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్బీకేల ద్వారా క్షేత్రస్థాయిలో నేరుగా ధాన్యం సేకరణ సమర్ధవంతంగా జరుగుతోంది. ఎలాగంటే.. ► రైతులకు అడుగడుగునా అండగా నిలిచే రైతుభరోసా కేంద్రాలు ఊరూరా వెలిశాయి. ► ఈ–క్రాప్ విధానంవల్ల దిగుబడిపై పక్కాగా లెక్కలు వస్తున్నాయి. ఇప్పుడు తప్పుడు రికార్డులు సృష్టించే అవకాశమేలేదు. ► క్షేత్రస్థాయిలో కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ.. సమస్యలను అధిగమిస్తూ ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేయడంవల్ల రైతుకు కనీస మద్దతు ధరకు ఢోకా లేకుండా పోయింది. ► చివరకు మిల్లుల వద్ద రైతులకు సమస్యలు రాకుండా కస్టోడియన్ అధికారులను ఏర్పాటుచేశారు. ► ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుత రబీలోనే కాదు.. గత ఖరీఫ్‌లో సైతం రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసింది. ► ఉమ్మడి ‘తూర్పు’లో 7.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, 7.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంటే.. 97.84 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసింది. రైతులకు రవాణా చార్జీల రూపంలో రూ.6.51 కోట్లు సైతం చెల్లించడం విశేషం. ► ఇక ప్రస్తుత రబీ విషయానికొస్తే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ► ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికెళ్లి పరిష్కరిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై నిరంతర సమీక్ష చేస్తున్నారు. ► అయినప్పటికీ టీడీపీ నేతలు ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళనకు దిగడం చూసి రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నెల 6వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తడిచిన ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు ఎగుమతి చేస్తున్న దృశ్యం నాటి విధానంతో నష్టమనే మార్పులు.. టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోలు విధానంవల్ల రైతులు నష్టపోయారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోలుపై సమీక్ష జరుపుతున్నారు. సమస్యలను ఆహ్వానిస్తున్నారు. ప్రతిపక్షాలు, దళారులు, ఒక వర్గం మీడియా చేస్తున్న రాజకీయాలవల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదనే విష ప్రచారంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. – జిన్నూరి రామారావు (బాబీ), ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు, అల్లవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా -
Telangana: వాన పడి.. కంటతడి
సాక్షి నెట్వర్క్: అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తీవ్ర వేగంతో వీస్తున్న ఈదురుగాలులు దాటికి చాలా చోట్ల వరి నేలకొరిగింది. వరి గింజలు రాలిపోయాయి. మరోవైపు వరి కోతలు పూర్తిచేసి.. ధాన్యాన్ని కల్లాలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కళ్ల ముందే ధాన్యం తడిసిపోతున్నా, నీటిలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక కన్నీళ్లు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పాట్లు పడుతున్నారు. వానకు తడిసిన ధాన్యాన్ని ఆరబోయడం, మళ్లీ వానకు తడిసిపోవడం, మళ్లీ ఆరబోయాల్సి రావడంతో అరిగోస పడుతున్నారు. వరుసగా వానలతో తడిసే ఉంటుండటంతో.. చాలాచోట్ల ధాన్యంలో మొలకలు వస్తున్నాయి. మరోవైపు మామిడి పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర, నువ్వుల పంటలకు నష్టం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజులూ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కొనుగోళ్లలో ఆలస్యంతో.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సమస్యగా మారిందని.. కొనుగోళ్లు ఊపందుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదని రైతులు అంటున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూడా వర్షాలు తెరిపినివ్వడం లేదని.. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పలుచోట్ల కొనుగోళ్లు జరుగుతున్నా తేమ, తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు మెలిక పెడుతున్నారు. లేకుంటే క్వింటాల్‌కు నాలుగైదు కిలోలకుపైగా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. అకాల వర్షం మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి 19,568 ఎకరాల్లో పంటలు నష్టపోగా.. అందులో 17 వేల ఎకరాల్లో వరి పంటే దెబ్బతిన్నది. ఇంకా పంట నష్టం సర్వే కొనసాగుతూనే ఉంది. ఇక వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో 40వేల టన్నులకుపైగా ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. టార్పాలిన్లు అందుబాటులో లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకలెత్తుతోంది. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కథలాపూర్, సారంగాపూర్, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానతో భారీగా ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. అన్ని పంటలు కలిపి 1,52,577 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో భారీగా వరి చేన్లు నీట మునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. అకాల వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను కొలుకోలేని దెబ్బతీశాయి. సిద్దిపేట జిల్లాలో సుమారు 91,569 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 13,947 వేల ఎకరాల్లో, సంగారెడ్డిలో 5,682 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోతకొచ్చే దశలోని వరి నేలకొరిగింది. మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం గణనీయంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 42వేల మంది రైతులకు చెందిన 60,289 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతినగా.. అందులో వరి 19,500 ఎకరాలు, నువ్వులు 4,500 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో 52 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,905 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 8,014 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి పంట దెబ్బతిన్నది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 40వేల క్వింటాళ్ల ధాన్యం తడిసినట్టు అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు, వలిగొండ మండలాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరితోపాటు మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరితోపాటు మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 15,494 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏన్కూరు, ఖమ్మం అర్బన్, కూసుమంచి, సత్తుపల్లి, వేంసూరు, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో వరి నేలవాలింది. జిల్లాలో ఇప్పటివరకు 197 కొనుగోలు కేంద్రాలను తెరవగా.. 102 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు ధాన్యాన్ని తీసుకురాగా.. వానలకు తడిసిపోతోందని వాపోతున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలకు 3,299 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వరితోపాటు మామిడికి నష్టం వాటిల్లింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాను వడగళ్ల వానలు వణికిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో పంటలు చేలలోనే దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆదివారం రాత్రి కొందుర్గు మండలంలో వడగళ్ల వానకు వరి, మామిడి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. -
కేసీఆర్.. ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి చూడు
గుండాల: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కార ణంగా రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాల పాలవుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన మాటముచ్చట సమావేశంలో మాట్లాడుతూ.. వరి కోతలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని పక్షం రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించినా చాలాచోట్ల మొదలుకాలేదన్నారు. ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు నష్టపోకుండా వడ్ల సంగతి తేల్చాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఔరంగాబాద్‌లో కాదని.. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి చూడాలని, అక్కడ మార్కెట్లలోకి వచ్చిన ధాన్యాన్ని గంటలోనే మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. ఇది నిజం కానట్లయితే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. నిజమైతే నీ పదవికి రాజీనామా చేస్తావా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సమ్మేళనాలు పెట్టి ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటమాడుతోందని ఆరోపించారు. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: గత సీజన్లో రైస్‌మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద పౌరసరఫరాల శాఖకు అప్పగించని మిల్లర్లకు యాసంగి ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంఆర్ కోసం 18 నెలల పాటు గడువు ఇచ్చినా, ధాన్యాన్ని మర పట్టించి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న రైస్ మిల్లులను ఇక బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఈ మేరకు మంత్రులు టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతస్థాయి అధికారులు సోమవారం బీఆర్కే భవన్లో జిల్లాల అదనపు కలెక్లర్లు, డీఎంలు, డీఎస్ఓలు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ కేటాయింపు, రైతులకు ఉపయోగకర అంశాలు వంటి వాటిపై చర్చించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని కొనుగోళ్ళకు సిద్దం కావాలని, రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇందు కోసం యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో మొదలైన కోతలు, ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముగ్గురు మంత్రులు అధికారులకు దిశా నిర్శేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ళకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలని, వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. యాసంగికి సీజన్ సీఎంఆర్ అప్పగింతకు ఆఖరు తేదీగా ఈ నెల 30వ తేదిని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగా మిల్లర్లు నుంచి సీఎంఆర్‌ను పూర్తి స్థాయిలో సేకరించాలని ఆదేశించారు. ఇక నుంచి సీఎంఆర్ అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్‌ని అప్పగించిన తరువాతే ఈ సీజన్ కు సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు సీఎంఆర్‌లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. రెండు సీజన్లలో పూర్తి ధాన్యాన్ని సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణనే... దేశ వ్యాప్తంగా రెండు సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణా మాత్రమేనని మంత్రులు హరీష్‌రావు, గంగుల, సింగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నుంచి అదనపు కలెక్టర్లు ఆయా జిల్లా స్థాయిలలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాధనలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి రాష్ట్రంలో రోజురోజుకూ ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు. 2014–15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020–21 నాటికి రూ.26 వేల 600 కోట్లతో ధాన్యం సేకరించగలిగామని చెప్పారు. 9 సంవత్సరాలలో ఆరు రెట్ల ధాన్యం కొనుగోలు పెరగగా , ఈ రబీ(యాసంగి)లో దేశంలో సగం పంట తెలంగాణలో మాత్రమే ఉండడం మనకు గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు రూ.1,773.98 కోట్లు జమ చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం రూ.926.90 కోట్లను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినట్టు పేర్కొన్నారు. దాదాపు 16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలు అన్నింటికీ నగదు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 3,10,791 మంది రైతుల నుంచి రూ.3,578.43 కోట్ల విలువైన 17.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటి వరకు 1.67 లక్షల మంది రైతులు మద్దతు ధర నగదును అందుకున్నట్టు వివరించారు. త్వరలోనే మిగిలిన రైతులకూ మద్దతు ధరను ఖాతాల్లో వేస్తామని తెలిపారు. రైతులకు గోనె సంచులు, హమాలీ, రవాణా ఖర్చుల కింద రూ.17.66 కోట్లు అందించినట్టు వివరించారు. -
ధాన్యం సేకరణ అంతంత మాత్రమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు మొదలైనా తొలి మూడు వారాల్లో నిర్దేశిత లక్ష్యంలో సేకరణ కేవలం 10 శాతమే పూర్తయినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఇప్పటిదాకా 53 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, 2004లో ఇదే సమయానికి 35.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఇంత తక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరగడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నిజానికి దేశంలో వరిసాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5.5 శాతం తగ్గింది. 3.67 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యింది. సాగు విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటాయని కేంద్రం అంచనా వేసింది. ఈ నెల నుంచే సేకరణ ప్రారంభించింది. అయితే, పంజాబ్, హరియాణాలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో సేకరణ జరిగింది. పంజాబ్‌లో 1.50 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 18.94 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయ్యింది. అధిక తేమశాతంతో ఇబ్బందులు ప్రతికూల వాతావరణం కారణంగానే ధాన్యం సేకరణ మందగించిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ధాన్యంలో తేమశాతం పరిమితిని 17 శాతంగా నిర్ణయించగా, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఇది 22 శాతం వరకూ ఉంటోంది. దీంతో ఆశించినంత వేగంగా సేకరణ జరగడం లేదు. వరి అధికంగా పండించే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఆయా రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఫలితంగా పంటల సాగులో జాప్యం జరిగింది. -
ఆర్బీకేల వద్ద వే బ్రిడ్జిలు
సాక్షి, అమరావతి: పంట కొనుగోళ్లను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దళారీలు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గత వ్యవసాయ సీజన్ నుంచి ధాన్యంతో పాటు అన్ని రకాల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలుచేస్తున్నారు. ఖరీఫ్‌లో రూ.7859.30 కోట్ల విలువైన 40.38 లక్షల టన్నులు, రబీలో రూ.5245.23 కోట్ల విలువైన 26.98 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 85.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని అంచనా. రైతన్నలు నష్టపోకుండా... ధాన్యంలో తేమ శాతాన్ని ఆర్బీకేల్లో ప్రస్తుతం మాయిశ్చర్ మిషన్ ద్వారా పరీక్షిస్తున్నారు. కొనుగోలు తేదీలను రైతులకు వెల్లడిస్తూ గన్నీ బ్యాగ్‌లు కూడా సరఫరా చేస్తున్నారు. ఆ సమయానికి రైతులు ధాన్యాన్ని గోతాల్లో నింపి కల్లాల వద్దే తూకం వేసి ఆర్బీకే పరిధిలోని రైసు మిల్లులకు తరలిస్తున్నారు. అయితే కల్లాల వద్ద రైతు వేసిన తూకానికి, మిల్లువద్ద వేసే తూకానికి వ్యత్యాసం వస్తోంది. కల్లాల వద్ద వెయ్యి కిలోలున్న ధాన్యం బస్తాలు మిల్లు వద్ద తూకం వేస్తుంటే 900–950 కేజీలే ఉన్నట్లు మిల్లర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తూకాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసి రైతులు పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధర లభించాలన్న సంకల్పంతో అవసరమైన చోట ఆర్బీకేల వద్ద వేబ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యేలోగా తొలిదశ వే బ్రిడ్జిల ఏర్పాటుకు అధికారుల సిద్ధమయ్యారు. ఐదు సెంట్ల స్థలంలో.. ఒక్కో వే బ్రిడ్జికి ఐదు సెంట్ల స్థలం అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు స్థలాలు అందుబాటులో ఉన్న ఆర్బీకేలకు తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు చెందిన 28 గోదాముల వద్ద ఇప్పటికే వే బ్రిడ్జిలుండగా కొత్తగా మరో 35 గోదాముల వద్ద వే బ్రిడ్జిల నిర్మాణానికి అనువైన స్థలాలున్నట్లు గుర్తించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రెండు గోదాములతో పాటు 16కిపైగా వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాముల వద్ద కొత్తగా వే బ్రిడ్జిలను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితోపాటు వరి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో కనీసం 40 ఆర్బీకేల పరిధిలో కొత్తగా వే బ్రిడ్జిల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మొత్తమ్మీద 93 చోట్ల కొత్తగా వే బ్రిడ్జిల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్బీకేల పరిధిలో వీలైనంత మేరకు మరిన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ నాటికి సిద్ధం! 60 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఒక్కో వే బ్రిడ్జి కోసం రూ.19.95 లక్షలు వ్యయం కానుందని అంచనా. ఈ మొత్తంతో 9 గీ 3 మీటర్ల పిట్‌లెస్ టైప్ వే బ్రిడ్జి, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, యూపీఎస్, సిబ్బంది ఉండేందుకు వీలుగా ఎంఎస్ క్యాబిన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌కల్లా వీటిని అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు జరుగుతోంది. -
అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది?
అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది? పతాక శీర్షికల్లో చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? మీరేం రాస్తే అది నిజమైపోవటానికి ఇవి వైస్రాయ్ రోజులనుకున్నారా రామోజీరావు గారూ? కూలీల ఫొటోలు తీసి వారు రైతులంటూ.. దోపిడీకి గురయ్యారంటూ దుర్మార్గపు రాతలు రాస్తే ఎలా? వారి చేతికందిన సొమ్మును కూడా అందలేదని రాస్తే ఎలా? ఏది నిజమో... ఏది మీ నైజమో చెప్పటానికి మరో మీడియా లేదనుకున్నారా? ఫోటోలతో సహా మీరు వేసిన అబద్ధాలను... వీడియోలతో సహా వివరించడానికి ‘సాక్షి’ ఉందిక్కడ. మీ ‘బాబు’ కోసం జనం మెదళ్లలో ప్రభుత్వంపై విద్వేష భావాలు నాటడానికి ఈ వయసులో కూడా ఇన్ని కాకిలెక్కలు మీకు అవసరమా? కనీసం ఇన్నాళ్లు మీ పత్రికను నమ్మిన జనం కోసమైనా నిజాలు చెప్పరా? ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాలకు పొరుగు రాష్ట్రాలే కాదు.. కేంద్రంతో పాటు అంతర్జాతీయ సమాజమూ సలాం కొడుతోంది. ‘విత్తు నుంచి విక్రయం వరకూ’ అనే నినాదంతో ఊరూరా రైతన్నకు భరోసాగా నిలుస్తున్న ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. అందుకే రామోజీ పథకం ప్రకారం గురువారం ‘ఈనాడు’ పతాక శీర్షికలో ‘ధాన్యంలో దోపిడీ’ అంటూ వీలైనన్ని అబద్ధాలు పోగేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతకు భరోసాయే దక్కటం లేదంటూ మొత్తం వ్యవస్థపైనే విషం గక్కారు. విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో రైతు భరోసా కేంద్రాల మాట అటుంచి.. రైతుకు భరోసాయే లేదు. ధాన్యం సేకరించాలంటూ రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే అప్పుడు కొనుగోళ్లకు ఉపక్రమించిన చరిత్ర బాబుది. ఆయన ఐదేళ్ల పాలనలో 2.81 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ఇందుకు రూ.43,134 కోట్లు అయితే, ఇందులోనుంచి రూ.4,838 కోట్లను ఎన్నికల్లో గెలుపుకోసం పసుపు కుంకుమకు మళ్లించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్ ఆ బకాయిలనూ తీర్చి రైతులను గట్టెక్కించారు. అంతేకాదు.. జగన్ ఈ మూడేళ్లలోనే 2.33 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి, ఏకంగా 43,549 కోట్లు చెల్లించారు. రామోజీది ఎంత నిఖార్సయిన జర్నలిజం అంటే.. బాబు ఏమిచేసినా ఆయనకు తప్పు అనిపించదు. ఇప్పుడు ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. నిజాలు ఎప్పుడూ చెప్పరు!!. అప్పట్లో సేకరించలేదనికానీ... ఇప్పుడు సేకరిస్తున్న విషయాన్ని కానీ నిజాయితీగా అంగీకరించరు. ఈ ఏడాది ఇప్పటికే ప్రభుత్వం 6.68 లక్షల రైతులకి చెందిన 52.54 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందంటే రైతులకు ఎంత దన్నుగా నిలుస్తున్నదో అర్థమవుతుంది. ఆర్బీకే అంటేనే... భరోసా పంట విక్రయానికి సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాలన్నదే ఆర్బీకేల లక్ష్యం. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నేరుగా కొనుగోలు చేయడానికే ఈ ఏర్పాటు. ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు అమ్మాలనుకున్న రైతులు తొలుత వారి పంట, బ్యాంకు ఖాతా వివరాలను ఈ–క్రాప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవటం తప్పనిసరి. దీన్నిబట్టే ఆర్బీకేలు సేకరణ మొదలెడతాయి. ఇక రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆన్లైన్లో నగదు చేరిపోతుంది. 16నే మేకా సూర్యనారాయణకు హమాలీ చార్జీని చెల్లించిన చెక్కు ఈ మేరకు వీలు కల్పించే ధాన్యం సేకరణ పోర్టల్‌ను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా టీసీఎస్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోకున్నా... కౌలు రైతు కార్డు లేకున్నా అలాంటి వారు ఒకరో ఇద్దరో ఇబ్బంది పడొచ్చు. కానీ దాన్ని సార్వత్రికం చేస్తూ... యావత్తు రైతాంగం దోపిడీకి గురయిపోతున్నారని రామోజీ ఆక్రోశించటమే దుష్ప్రచార యుద్ధంలో కీలక ఘట్టం. ఆర్బీకేల ద్వారా సమీకరించేందుకు అవసరమైన గోనె సంచులను ప్రభుత్వమే సరఫరా చేయటంతో పాటు... హమాలీ చార్జీలనూ అందజేస్తోంది. అందరి ఖాతాల్లోనూ ఈ సొమ్ము పడుతున్నా... ఎవ్వరికీ దీని గురించి తెలియదన్నట్లుగా రాయటమే చిత్రాతిచిత్రం. నాణ్యమైన బియ్యం కోసం.. బాబు హయాంలో సేకరించటమే అరకొరయితే... అలా సేకరించిన దాన్లో ముక్కిపోయిన, నూకలుగా మారిపోయిన బియ్యాన్ని మాత్రమే రేషన్ డిపోలకు సరఫరా చేసేవారు. అప్పట్లో రేషన్ బియ్యం తినేవారు అతితక్కువ. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయటానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలూ తీసుకోవటంతో... దీనికి అవసరమైన సార్టెక్స్ రైస్‌ను మిల్లింగ్ చేయడానికి రైస్ మిల్లులకు అదనంగా క్వింటాలుకు రూ.110 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఫోర్టిఫైడ్ బ్లెండింగ్ కోసమూ అదనపు మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తున్నారు. అందుకే నాణ్యమైన బియ్యం రేషన్ కార్డు దారులకు చేరుతోంది. వారంతా తమ ఇళ్లలో వీటిని వాడుతున్నారు. కాకపోతే ఈ నిజాలేవీ ‘ఈనాడు’ రాయదు. రైతు కూలీల్ని ఫోటోలు తీసి... రైతులంటూ అబద్ధపు రాతలు మాత్రం రాస్తుంది. ఎందుకంటే రామోజీ లక్ష్యం... అడ్డూ అదుపూ లేని దుష్ప్రచారం మరి!!. రామోజీ రాసిన ఈ రైతుల సంగతి చూస్తే... ఇన్నాళ్లూ అబద్ధాలను ‘ఈనాడు’ ఎంత అందంగా అచ్చేసిందో అర్థమవుతుంది. ఒక్కో రైతు కథనూ చూస్తే... ‘ఈనాడు’ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉండవల్లి వీరభద్రరావు నాలుగెకరాల్లో వరి వేశారు. షావుకారులే కొంటున్నారని, బస్తాకు రూ.1,380 ఇస్తామన్నారని, అంతకన్నా ఎక్కువ జమయితే తెచ్చి కమీషన్ దారుకు ఇవ్వాలన్నారని ఆయన చెప్పినట్లు రాశేశారు. పోయిన పంటకూ ఇలాగే చేసారని, హమాలీ, రవాణా చార్జీలు ఇస్తారనే విషయం తమకు తెలియదన్నట్లు కూడా రాశారు. కానీ నిజమేంటో తెలుసా? ఉండవల్లి వీరభద్ర రావు పేరిట పొలం లేదు. ఆయన భార్య ఉండవల్లి పద్మావతి పేరిట పొలం ఉండటంతో అమ్మిన ధాన్యం సొమ్ము ఈ ఏడాది జనవరి 3న NPCI ద్వారా నేరుగా రైతు ఖాతాలో (యూనియన్ బ్యాంక్ ) జమ అయింది. హమాలీ చార్జీల రూపేణా ఈ నెల 4న రూ.1,740 జమయింది. దీన్ని పద్మావతి స్వయంగా చెప్పారు. ఐదు నెలల కిందట సొమ్ము జమైనా... నెల కిందట హమాలీ చార్జీలు వచ్చినా... ఈ అబద్ధపు రాతలెందుకు? ఎవరిని నమ్మించడానికి? రామోజీ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మేకా వీర సూర్యనారాయణ 12 ఎకరాల్లో వచ్చిన ధాన్యం అమ్మారు. లిస్టులో పేరున్నా డబ్బులివ్వడం లేదు. అమ్మి 5 నెలలైనా ఇప్పటిదాకా హమాలీ చార్జీలు ఇవ్వలేదు. డీసీసీబీకి వెళ్లినా పనికాలేదు!!. ఆర్బీకే ఇచ్చిన రసీదు ఇక వాస్తవం చూద్దాం... రైతు మేకా వీర సూర్యనారాయణ అమ్మిన ధాన్యము యొక్క హమాలీ చార్జీలు రూ.2,520 ఈ నెల 16నే చెక్కు రూపంలో ఆయనకు అందాయి. ఇది ఆయనే అంగీకరించారు. కానీ.. రామోజీ తనకు తోచినట్లు రాసేశారు. ‘ఈనాడు’ కథనం మేరకు... రాయవరం మండలం నదురుబాద గ్రామానికి చెందిన కొండపల్లి వెంకట సత్యనారాయణ అనే రైతు ఐదున్నర ఎకరాల్లో వరి వేశారు. బస్తా రూ.1,380కి అమ్మారు. తామే మిల్లుకు తీసుకెళితే బస్తాకు రూ.1,455 ఇస్తారన్నారని, లేకుంటే రూ.1,380 ఇస్తామన్నారని, ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లాక నెమ్ము చేరిందన్నారని, ఎంత తరుగు తీసేస్తారో తెలియడం లేదని ఆయన వాపోయినట్లు రాసిపారేశారు. కానీ వాస్తవమేంటో తెలుసా? కొండపల్లి వెంకట సత్యనారాయణ కౌలు రైతు అని ‘ఈనాడు’ రాసింది తప్ప... ఆయన ఎక్కడ కౌలు రైతుగా నమోదు చేసుకున్నారో రాయలేదు. ఆయన కూడా... తానెక్కడా నమోదు చేసుకోలేదని, తనకు సీసీఆర్సీ కార్డు కూడా లేదని స్పష్టం చేశారు. మరి ఈ–క్రాప్‌లో నమోదు కాకుండా ఆ పంటనెలా కొంటారు? సీసీఆర్సీ కార్డు లేనిదే కౌలు రైతు ఎలా అవుతారు? రాసేముందు ఈ మాత్రం చూసుకోవద్దా రామోజీరావు గారూ? ఇక రామోజీ రాతల్లో డొల్లెంతో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రత్తిపాడు గ్రామంలో మన్యం గోపాలకృష్ణ ఐదెకరాల్లో వరి వేసారని, ఎకరాకు 30–35 బస్తాలొస్తుండగా 3 రోజులుగా ఎండబెడుతున్నారని రాశారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఈ తిప్పలు పడలేరు, కమీషన్.దారులకు ఇచ్చేయమన్నారని... మిల్లులకు తీసుకెళితే తేమ, నూక తేడా ఉంటే బస్తాకు రూ.200/– కోత పెడతామన్నారని, ఆర్బీకేల్లో సంచులు ఇవ్వడం లేదని ఆయన , చెప్పినట్లుగా రాసేశారు. అందుకే కమీషన్ దారులకు ధాన్యం ఇస్తున్నారని సూత్రీకరించారు. ‘ఈనాడు’ రాయని నిజమేంటంటే మన్యం గోపాల కృష్ణ వ్యవసాయ కూలీ. తనకు పొలం లేదు. ఆయన పొలంలో ధాన్యం పట్టుబడి చేస్తుంటే ‘ఈనాడు’ బృందం వెళ్లి ఫోటో తీసుకుంది. పేపర్లో ఏం రాశారో తనకు తెలియదని, తానైతే వాళ్లతో ఏమీ చెప్పలేదని ఆయన వాపోయాడు. తమ గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటున్నారని, సంచుల కొరత లేదని కూడా చెప్పాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరిస్తున్నాయి.. జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక రైతుల కోసం రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, అధిక మద్దతు ధర, ఉచిత విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన, కస్టమ్ హైరింగ్ సెంటర్ల వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల రైసు మిలర్ల పాత్ర వల్ల రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో మొత్తం వ్యవస్థ తప్పుగా ఉందని నేనన్నట్లు వక్రీకరించి రాశారు. ఇది సరికాదు. నేను ఈ అంశాన్ని చెప్పిన వెంటనే వ్యవసాయ మంత్రి, పౌర సరఫరాల మంత్రులు నాతో మాట్లాడి దీనిపై విచారణ చేయిస్తామని చెప్పారు. – పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ నిజానికి రైతు భరోసా కేంద్రాలు ఎంత అండగా నిలుస్తున్నాయో ఏ ఊళ్లో ఏ రైతును కదిలించినా తెలుస్తుంది. అలాంటి కొందరు రైతుల అభిప్రాయాలివీ.. పంట నష్టం కూడా అందింది... మాకు రామచంద్రపురం మండలం చోడవరంలో మూడెకరాల వరిపొలం ఉంది. ప్రతి సీజన్లో పంట నమోదు చేస్తున్నా. మూడేళ్లుగా రైతు భరోసా రూపంలో పెట్టుబడి సాయం అందుతోంది. తొలకరిలో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయినా... ఆర్బీకేలోని గ్రామ వ్యవసాయ సహాయకుడు దాని వివరాలు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందింది. నేను పండించిన ధాన్యాన్ని మూడేళ్లుగా ఆర్బీకే ద్వారానే విక్రయిస్తున్నా. ఖరీఫ్‌లో క్వింటాలుకు రూ.1940 ధాన్యం సొమ్ము గతంలో 21 రోజులకు అందింది. హమాలీ ఖర్చులు క్వింటాలుకు రూ.25 చొప్పున చోడవరం సొసైటీ ద్వారా చెక్కు రూపంలో అందజేశారు. ఎరువుల కోసం తిప్పలు లేకుండా ఆర్బీకే నుంచే యూరియా, డీఏపీ అందాయి. – గుణ్ణం రామకృష్ణ, రైతు, చోడవరం, కోనసీమ జిల్లా తూకం.. లెక్కల్లో తేడాలు లేవు.. ఐదెకరాలు కౌలుకు తీసుకుని రబీ పంట సాగు చేశా. రెండెకరాల్లో కోత కోశా. 77 బస్తాల ధాన్యం వచ్చింది. ఆర్బీకేలో గురువారం విక్రయించాను. బస్తాకు రూ.1,455 చొప్పున 77 బస్తాలకు రూ.1,12,035 నగదు ఇస్తామని రసీదు ఇచ్చారు. హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.25 ఇస్తున్నారు. తూకం, లెక్కల్లో తేడాల్లేవు. అదే ధాన్యాన్ని గ్రామంలోని దళారి వద్దకు తీసుకెళితే బస్తాకు రూ.1,300 ఇస్తానన్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే న్యాయం జరుగుతోంది. మిగిలిన మూడెకరాలూ కోత కోశాక ఆర్బీకేలోనే విక్రయిస్తా. – మొర్త అప్పారావు, కేశనకుర్రు గ్రామం, పెదలంక -
హస్తినలో వరి యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు సిద్ధమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొని కేంద్ర వైఖరిని ఎండగట్టనున్నారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా రెండు వేల మందికిపైగా నిరసనలో పాల్గొననున్నారు. ఈ దీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే ఢిల్లీకి వచ్చారు. మిగతావారు సోమవారం ఉదయం చేరుకోనున్నారు. బహుముఖ వ్యూహంతో.. రైతుల సమస్య తీర్చడంతోపాటు రాష్ట్రంలో బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవడమనే బహుముఖ లక్ష్యాలతో సీఎం కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ దీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీక్ష జరిగేది ఇలా.. ► ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’గా పేరు పెట్టారు. ► ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా 2 వేల మంది వరకు దీక్షలో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ► ‘ఒకే దేశం.. ఒకే సేకరణ విధానం’ నినాదంతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, జెండాల ఏర్పాటు చేశారు. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’తో.. తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్దినెలలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాయిల్డ్‌రైస్ (ఉప్పుడు బియ్యం) తీసుకోబోమని.. రా రైస్ చేస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేయగా.. ధాన్యం కొనాల్సిందేనని టీఆర్ఎస్ సర్కారు పట్టుపడుతోంది. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లోనూ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయినా సానుకూల నిర్ణయం రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. సోమవారం ఢిల్లీలో ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరిట ఆందోళనకు సిద్ధమైంది. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’ డిమాండ్‌తో రాష్ట్రంలో పండే ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనుంది. ఢిల్లీలో దీక్షావేదిక రాజకీయ వ్యూహంతోనూ.. ఈ నిరసన దీక్ష ద్వారా అటు రైతులకు మేలు చేసే లక్ష్యంతోపాటు.. ఇటు రాజకీయ కోణంలోనూ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని, రైతులను ఇబ్బందిపెడుతోందని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా.. రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా పావులు కదుపుతోంది. ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలంటూ గత ఏడాది డిసెంబర్లో స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కేంద్రం తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానిస్తోందంటూ ఢిల్లీలోనే దీక్ష చేపడుతోంది. ఈ దీక్ష సందర్భంగా తదుపరి కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రానికి..! దేశ పాలనలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందంటూ సీఎం కేసీఆర్ కొంతకాలంగా ప్రకటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలతో వరుసగా సమావేశమయ్యారు. తెలంగాణ సాధనకోసం దేశవ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టి విజయం సాధించామని.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీపైనా పోరు సాగించేందుకు ముందు వరుసలో ఉంటామని కూడా ప్రకటించారు. తాజాగా ఢిల్లీ దీక్ష ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయపక్షాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. వారం రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్ పంటి నొప్పితో బాధపడుతున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. శస్త్రచికిత్స, అనంతరం విశ్రాంతి కోసం వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే సమయంలో నిరసన దీక్ష ఏర్పాట్లపై టీఆర్ఎస్ ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతా గులాబీమయం తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ ఢిల్లీ అంతటా కనిపించేలా ఇండియాగేట్, తెలంగాణ భవన్ చుట్టూ దారులను హోర్డింగులు, ఫ్లెక్సీలతో నింపేశారు. ‘ధాన్యంపై కేంద్రం మొండి వైఖరి వీడాలి, మొత్తం ధాన్యాన్ని కొనాలి, రైతులను ఆదుకోవాలి’ అనే నినాదాలను వాటిపై రాశారు. ► తెలంగాణ భవన్‌లోని దీక్షావేదికను గులాబీ మయం చేశారు. కేసీఆర్, ఇతర నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ధర్నా వేదిక, ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ పర్యవేక్షించారు. ఆదివారం ఈ ఏర్పాట్లను మంత్రులు, ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ► తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ► ఢిల్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులందరికీ మధ్యాహ్నం భోజనం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయగా, రాత్రి ఎంపీ బీబీ పాటిల్ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. నేతలెవరికీ ఇబ్బందులు రాకుండా ఎంపీలు సమన్వయం చేస్తున్నారు. కేంద్రం దిగి వస్తుంది కేసీఆర్ నాయకత్వంలో చేపట్టబోయే దీక్ష చరిత్రాత్మకం అవుతుంది. వాజ్‌పేయి ప్రభుత్వహయాంలోనూ ఎఫ్‌సీఐ, కేంద్ర ఆహార మంత్రి ఇలాగే ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తే.. పంజాబ్ ప్రభుత్వం ఆందోళనకు దిగింది. కేంద్రం ముందుకొచ్చి కొనుగోళ్లు చేపట్టింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే విషయంలో రైతులను క్షోభ పెట్టొద్దు. కేంద్రం మొండి వైఖరి వీడాలి. – మంత్రి నిరంజన్‌రెడ్డి బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు: రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రైతుల ఆందోళనతో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. ధాన్యం సేకరణ విషయంలోనూ కేంద్రం మొండి వైఖరి వీడాలి. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తేవాలి. – ఎమ్మెల్సీ కవిత -
సకాలంలో ధాన్యం డబ్బుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2.96 లక్షల మంది రైతుల నుంచి 21.04 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 1.42 లక్షల మంది రైతులకు రూ.1,969 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా రైతు పొలం ముంగిట నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా ఆధార్ ఆధారిత నగదు జమ పద్ధతులను అవలభిస్తున్నట్టు చెప్పారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో రైతులకు కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో ఐదు వేల టన్నుల సేకరణ లక్ష్యం కాగా.. 376 మంది రైతుల నుంచి 2,748 టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. 46 మంది రైతులకు రూ.60 లక్షలు జమ చేసినట్టు వివరించారు. అయితే కొన్ని పత్రికలు(సాక్షి కాదు) వాస్తవాలు గ్రహించకుండా రైతులకు చెల్లింపులు జరపట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇలాంటి వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వీరపాండియన్ హెచ్చరించారు. -
వడ్లు దగ్గరవడ్డయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దగ్గరపడుతున్నాయి. 13 జిల్లాల్లో సేకరణ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6,875 కేంద్రాలకు గాను 1,657 కేంద్రాల్లోనే కొనుగోళ్లు నడుస్తున్నాయి. శుక్రవారం రాత్రి వరకు రాష్ట్రంలో 12.21 లక్షల మంది రైతుల నుంచి 67 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ రూ. 13,093 కోట్లు కాగా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ. 10,619 కోట్లు చేరింది. సంక్రాంతికల్లా కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వొచ్చని, కొన్నిప్రాంతాల్లోనే ఇంకాస్త ఆలస్యమవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నాట్లు వేయడంలో జాప్యమవడం, సాగు నీటిని ఆలస్యంగా విడుదల చేయడం వల్ల కోతలు ఆలస్యంగా మొదలయ్యాయని అంటున్నారు. మూతబడ్డ 5,218 కేంద్రాలు రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణకు 32 జిల్లాల్లో 6,875 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయి కేంద్రాలను పూర్తిగా మూసేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జనగాం, నల్లగొండ, యాదాద్రి, మహబూబ్‌నగర్‌ల్లోనూ కొనుగోళ్లు చాలా వరకు పూర్తయినా అక్కడక్కడ మిల్లర్ల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులతో కేంద్రాలను కొనసాగిస్తున్నారు. మొతం్తగా ఇప్పటివరకు 5,218 కొనుగోలు కేంద్రాలు మూతబడ్డాయి. సాగునీటిని ఆలస్యంగా విడుదల చేయడం, నాట్లు ఆలస్యమవడం లాంటి కారణాలతో ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో వరి కోతలు ఆలస్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ట్రాన్స్‌పోర్టు సమస్యతో పాటు గోడౌన్లు ఖాళీ లేవంటూ మిల్లర్లు ధాన్యం తీసుకోవట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల లోపు ధాన్యం సేకరించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ లెక్క కడుతోంది. -
10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 50 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంలో ఇప్పటికే 20.64 శాతం పూర్తయింది. బుధవారం నాటికి రూ.2,007.46 కోట్ల విలువైన 10,32,039 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తద్వారా 1,36,745 మంది రైతులు మద్దతు ధర పొందారు. 10 జిల్లాల్లోని 8,557 ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరద కారణంగా పంట దెబ్బతినగా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కోతలు ఆలస్యమయ్యాయి. ఈ జిల్లాల్లో స్వల్పంగా 1.35 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. పారదర్శకంగా చెల్లింపులు రైతులకు చెల్లింపులు పక్కదారి పట్టకుండా, జాప్యాన్ని నివారించడానికి పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా ఆధార్ నంబరు ప్రకారం నగదును జమచేస్తోంది. తొలిసారిగా ఫామ్–గేట్ (పొలాల వద్ద ధాన్యం కొనుగోలు) విధానం ద్వారా రైతులపై ఒక్క రూపాయి రవాణా ఖర్చు పడకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోతాల్లో నింపి నేరుగా మిల్లులకు తరలిస్తోంది. సడలింపునకు కేంద్రానికి వినతి రాష్ట్ర వ్యాప్తంగా 7,38,369 టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,31,946 టన్నులు, గుంటూరులో 1,53,472, పశ్చిమగోదావరిలో 78,848, చిత్తూరు జిల్లాలో 61,633 టన్నుల ధాన్యం దెబ్బతిని రంగుమారింది. మొలకలొచ్చాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 1.77 లక్షల టన్నుల ధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో రైతులు తమ పంట విలువను నష్టపోకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు నిబంధనల్లో సడలింపులు కోరుతూ కేంద్రానికి నివేదిక పంపించింది. దెబ్బతిన్న, రంగుమారిన, విరిగిన ధాన్యం కొనుగోలులో 5 శాతం ప్రమాణాలు పాటిస్తుండగా దాన్ని కర్నూలు జిల్లాలో 8 శాతం, వైఎస్సార్ కడపలో 15 శాతం, ప్రకాశంలో 30 శాతం, మిగిలిన జిల్లాల్లో 10 శాతానికి పెంచాలని కోరింది. ఏ ఒక్క రైతుకు నష్టం రానివ్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌరసరఫరాలశాఖ ద్వారా లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాం. ఈ క్రమంలోనే దెబ్బతిన్న ధాన్యం వివరాలను కేంద్రానికి పంపించి, కొనుగోలు ప్రమాణాల్లో జిల్లాల వారీగా సడలింపులు కోరాం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా నష్టం రానివ్వం. ఇప్పటికే 20 శాతానికిపైగా కొనుగోళ్లు పూర్తిచేశాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
ప్రతి రైతుకూ ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి రైతన్నకూ కచ్చితంగా ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) దక్కేలా చూడటం, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, అధికారులు కృషి చేయాలని సూచించారు. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతులకు చెల్లింపులు జరగాలని నిర్దేశించారు. రైతన్నలపై రవాణా వ్యయం, గోనె సంచుల కొనుగోలు, హమాలీ ఖర్చుల భారం పడకూడదని ఆదేశించారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి సమస్యలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఉండాలని, పంటల కొనుగోలు బాధ్యతను ఆర్బీకేల్లో ఐదుగురు సిబ్బందికి అప్పగించాలని సూచించారు. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. రైతులకు సేవలందించడంలో అలసత్వం వహించరాదు. సమాచార లోపం ఉండకూడదు. తరచూ రైతులతో మాట్లాడాలి. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గతంలో ఎవరూ ముందుకొచ్చిన దాఖలాలు లేవు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతన్నలకు గరిష్టంగా వీలైనంత మేర ప్రయోజనం కల్పిస్తున్నాం. వారికి భరోసా కల్పిస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి. ధాన్యం నాణ్యత పరిశీలనలో రైతులు మోసాలకు గురి కారాదు. విదేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చర్యలు చేపట్టాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. ఆర్బీకేలో ఐదుగురు సిబ్బందిదే బాధ్యత.. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌తోపాటు ఇతర సిబ్బంది ముగ్గురు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఆర్బీకేలో కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి. రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడి కొనుగోలుకు సంబంధించి అవసరమైన బాధ్యతలన్నీ వారే నిర్వర్తించాలి. గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను ఈ ఐదుగురు సిబ్బందే ఏర్పాటు చేయాలి. వాటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదు. ఆ భారం రైతులపై పడకుండా చర్యలు తీసుకోవాలి. కృష్ణా జిల్లా గొల్లపూడిలోని రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తున్న మహిళ నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయి పర్యటనలు.. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా చెల్లింపులు జరిపి రైతులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలి. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అనే అంశంపై దృష్టి పెట్టండి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారో లేదో పరిశీలించండి. కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును నిశితంగా గమనించండి. వీటన్నిటిపై వచ్చే మూడు నాలుగు రోజులు దృష్టి పెట్టండి. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి మీ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలి. సీసీఆర్సీ కార్డ్స్‌పై మరింత అవగాహన కౌలు రైతులకు సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్) కార్డుల జారీపై అవగాహన కల్పించాలి. సీసీఆర్సీ కార్డుల వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న విషయాన్ని చెప్పాలి. ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక బోనస్ రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన పెంపొందించండి. అలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై కార్యాచరణ సిద్ధం చేయండి. వాటి కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని తెలియచేయాలి. రైతులకు మంచి ఆదాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. సగటున 42,237 టన్నుల కొనుగోలు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రోజుకు సగటున 42,237 మెట్రిక్ టన్నులకు చేరినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. సమీక్షలో మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, సీఎస్ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధనరెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎస్.డిల్లీరావు, సివిల్ సఫ్లైస్ ఎండీ జి.వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్ పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో నంబర్ ఏర్పాటు చేయాలి. ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలి. క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలి. దీనివల్ల సమస్య తీవ్రత తెలియడంతోపాటు పరిష్కార మార్గాలు లభిస్తాయి. రైతులతో అధికారులు నిరంతరం సంప్రదించాలి. జేసీల నుంచి కూడా పంటల కొనుగోలుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. -
ఉదారంగా విపత్తు సాయం
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు మానవతా ధృక్పథంతో ఉదారంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని కోరారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన కేంద్ర అధికారులతో మాట్లాడుతూ... ఈ విపత్తు హృదయ విదారకరమన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదు. వాస్తవాలు ఎలా ఉంటే అలా ఇచ్చాం. ఎందుకంటే నష్టం అంచనాల తయారీకి మాకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలున్నాయి. ప్రతి రైతు పండించే పంటా ఇ–క్రాప్‌లో నమోదవుతోంది. సోషల్ ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం. ఇ– క్రాప్‌కు సంబంధించి రైతులకు రశీదులు కూడా ఇచ్చాం., నష్టపోయిన పంటలపై కచ్చితమైన, నిర్ధారించిన లెక్కలున్నాయి’’ అని ఆయన వివరించారు. తాత్కాలిక ప్రాతిపదికన నిధులివ్వాలి క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను అందచేశామని, కోవిడ్ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందువల్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయనే విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి మీకు (కేంద్ర బృందానికి) వివరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పనులు సాఫీగా జరగాలంటే నిధులు అవసరమని, వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన విడుదలకు సహకారం అందించాలని కేంద్ర బృందాన్ని కోరారు. మీ సూచనలు పరిగణలోకి కేంద్ర బృందం సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని చేపట్టామని, దీనిద్వారా పెద్ద మొత్తంలో వేగంగా తరలించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రిజర్వాయర్లు, డ్యామ్‌లపై పరిశీలన జరిపి తగిన చర్యలు చేపడతామని, ఆటోమేటిక్ వాటర్ గేజ్ సిస్టంపైనా దృష్టిపెడతామని చెప్పారు. చేతికందే పంట నీటి పాలైంది... వైఎస్సార్ కడప జిల్లాలో మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బతిన్నాయని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం సభ్యుడు, ఎన్ఎండీఏ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట అపార నష్టం జరిగిందన్నారు. తాగునీటి సరఫరా, ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని, పంట చేతికందే సమయంలో నీటి పాలైందని, శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు నిబంధనలు సడలించాలి ధాన్యం కొనుగోలు నిబంధనలను సడలించేలా కృషి చేయాలని కేంద్ర బృందాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నందున తేమ, ఇతర నిబంధనల విషయలో సడలింపులు ఇచ్చి ఉదారంగా వ్యవహరించాలని అభ్యర్థించింది. మీ వేగం.. బాగుంది విపత్తు సమయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని, మీ (ముఖ్యమంత్రి జగన్) నాయకత్వంతో ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం పేర్కొంది. విద్యుత్ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయని, అత్యవసర సేవలను వెంటనే పునరుద్ధరించారని తెలిపింది. అంకితభావంతో పనిచేసే అధికారులు మీకున్నారని, క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలన్నీ బాగున్నాయని అభినందించింది. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం సభ్యులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియచేశారు. తమ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను కలుసుకున్నామని, ప్రతి ఒక్కరూ వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారని చెప్పారు. వెంటనే నిధుల విడుదలతో తక్షణ సాయం.. ‘ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇంత త్వరగా విద్యుత్తు పునరుద్ధరణ సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. సహాయ కార్యక్రమాల కోసం కలెక్టర్లకు వెంటనే నిధులిచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఈ డబ్బులతో బాధితులను తక్షణమే ఆదుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు’ అని కేంద్ర బృందం సభ్యుడు, ఎన్ఎండీఏ, కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. జేసీబీలను తరలించి అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారని, సహాయక శిబిరాలను ప్రారంభించి ముంపు బాధితులను ఆదుకున్నారని చెప్పారు. యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులున్నారని అభినందించారు. అధికారులంతా తమకు చక్కటి సహకారాన్ని అందించారన్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు భారీ నష్టం తన పర్యటన సందర్భంగా వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని కునాల్ సత్యార్థి తెలిపారు. పశువులు మృత్యువాత పడ్డాయని, రోడ్లు, భవనాలు, లాంటి మౌలిక సదుపాయాలతోపాటు ప్రాజెక్టులు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆనవాయితీగా వరదలొచ్చే ప్రాంతాలు కావు.. అవి సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదని, అలాంటి చోట ఊహించని రీతిలో వర్షాలు కురిశాయని కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. ఈ స్థాయిలో వరద ప్రవాహాన్ని మోసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదని చెప్పారు. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయని, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యామ్‌లు కూడా ఆ ప్రాంతంలో లేవన్నారు. ఉన్న డ్యామ్‌లు, రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావన్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయని, కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. తీరం దాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదని, అది చాలా రోజులు కొనసాగిందని చెప్పారు. మావంతు సహకారాన్ని అందిస్తాం వరదల వల్ల జరిగిన నష్టంలో 40 శాతం రోడ్లు, భవనాలు రూపేణా జరిగిందని, 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగిందని, ఇరిగేషన్ స్కీమ్‌ల రూపేణా 16 శాతం మేర నష్టం జరిగిందని కేంద్ర బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ను వీలైనంత మేర ఆదుకునేలా తమ వంతు సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది. -
రైతులకు బాసటగా నిలవండి.. పార్టీ కేడర్‌కు బండి సంజయ్ పిలుపు
ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నందున రైతులకు బాసటగా నిలవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డులను సందర్శించి కొనుగోళ్లు జరిపేలా అధికారులపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ చేపడుతున్న ఆందోళన, నిరసనలు విజయవంతం కావడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో పార్టీలోని అన్ని విభాగాలు తమ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలన్నారు. సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు చేపట్ట కుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతార హితంగా వ్యవహరిస్తున్నందున రైతులకు బాసటగా నిలవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డు లను సందర్శించి కొనుగోళ్లు జరిపేలా అధికారు లపై ఒత్తిడి తీసుకురావాలని సూచిం చారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లపై పార్టీ చేపడుతున్న ఆందోళన, నిరసనలు విజయవంతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అనుబంధ మోర్చా లు, అన్ని విభాగాలు తమ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సీఎం రెచ్చ గొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు, టీఆర్ఎస్ నాయకుల దాడులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ కార్యక్రమా లపై.. పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేం దర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులతో బండి సంజయ్ చర్చిం చారు.పార్టీ నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి ప్రేమేం దర్‌రెడ్డి ఒకప్రకటనలో మీడియాకు తెలియజేశారు. పెట్రోధరలు తగ్గించాలని రేపు నిరసనలు:రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు వాట్‌ను తగ్గించి పెట్రోధరలను తగ్గించడం ద్వారా ప్రజలపై కొంత మేర భారాన్ని తగ్గించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనవరి 26న దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రేమేందర్ తెలిపారు. జిల్లా స్థాయిలో డిసెంబర్ 1 నుంచి 15 వరకు, మండల స్థాయిలో డిసెంబర్ 16 నుండి 30 వరకు పార్టీ నాయకులకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
రైతన్నకు అండగా నిలవండి
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు చేపట్ట కుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతార హితంగా వ్యవహరిస్తున్నందున రైతులకు బాసటగా నిలవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డు లను సందర్శించి కొనుగోళ్లు జరిపేలా అధికారు లపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లపై పార్టీ చేపడుతున్న ఆందోళన, నిరసనలు విజయవంతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అనుబంధ మోర్చా లు, అన్ని విభాగాలు తమ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సీఎం రెచ్చ గొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు, టీఆర్ఎస్ నాయకుల దాడులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ కార్యక్రమా లపై.. పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేం దర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులతో బండి సంజయ్ చర్చిం చారు.పార్టీ నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి ప్రేమేం దర్‌రెడ్డి ఒకప్రకటనలో మీడియాకు తెలియజేశారు. పెట్రోధరలు తగ్గించాలని రేపు నిరసనలు:రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు వాట్‌ను తగ్గించి పెట్రోధరలను తగ్గించడం ద్వారా ప్రజలపై కొంత మేర భారాన్ని తగ్గించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనవరి 26న దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రేమేందర్ తెలిపారు. జిల్లా స్థాయిలో డిసెంబర్ 1 నుంచి 15 వరకు, మండల స్థాయిలో డిసెంబర్ 16 నుండి 30 వరకు పార్టీ నాయకులకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
రూ.10 వేల కోట్లతో వడ్లు కొనలేరా?
సాక్షి, హైదరాబాద్: వడ్ల కొనుగోలుకు ఈ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు వెచ్చించలేదా అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర రైతాంగానికి ఆ మాత్రం చేయలేరా అని నిలదీశారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనాలంటూ టీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాల్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నిజంగా వరి రైతులపై ప్రేమ ఉంటే ఆయన ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద దీక్ష ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టి అయినా రాష్ట్రంలోని ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాల్సిం దేనని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీ వార్‌రూంలో ఏఐసీసీ నేతల సమక్షంలో అర్థవంతమైన చర్చ జరిగిందని చెప్పారు.