Gram Panchayat elections
-
ఇక ‘పంచాయతీ’ సమరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిమగ్నమైంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ (పీఆర్) సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి ముందే, నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పీఆర్ సంస్థల టర్మ్ ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతో జనవరిలో లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల షెడ్యూల్‌తో సహా ప్రతిపాదనలు పంపించనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది. అయితే వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలుండటం, ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఈలోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. కొత్త సర్కార్ కుదరదంటుందా? పంచాయతీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కావడంతో, వెంటనే మరో ఎన్నికల సమరానికి కొత్త ప్రభుత్వం మొగ్గు చూపక పోవచ్చుననే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని, ఆరు నెలల్లో దీనికి సంబంధించి బీసీ కమిషన్ నివేదిక తెప్పించుకున్నాక తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. వరుసగా జీపీ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్ పోల్స్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుత గ్రామ పంచాయతీ (జీపీ), ఆ తర్వాత కొన్ని నెలలకే మండల, జిల్లా ప్రజా పరిషత్ (ఎంపీపీ, జెడ్పీపీ), మరికొన్ని నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. జీపీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది ఎంపిక, నియామకం అనేది కీలకమైన నేపథ్యంలో ఈ నెల 30 లోగా దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన విధానంపై, ఈ ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సర్క్యులర్ పంపించారు. పోలింగ్ బూత్‌లలో 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని నియమించాలని సూచించారు. 201 నుంచి 400 ఓటర్ల దాకా ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులను, 401 నుంచి 650 వరకు ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని తెలిపారు. ఏదైనా వార్డులో ఓటర్ల సంఖ్య 650 దాటితే రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ప్రతి జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తున్నందున, మొదటి దశలో ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్, ప్రిసైడింగ్, పోలింగ్ ఆఫీసర్ల సేవలను మూడో దశ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు. -
థాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ.. జోష్‌లో బీజేపీ
ముంబై: న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్నారు శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. ఈ తరుణంలో.. తాజాగా థాక్రే శిబిరానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అక్కడ జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా.. థాక్రే సారథ్యంలోని శివ సేన నాలుగో స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్రంలో మొత్తం 28,813 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. తాజాగా గురువారం 62 మండలాల్లోని 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. అందులో పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని గ్రామాలు సైతం ఉన్నాయి. శుక్రవారం వాటికి కౌంటింగ్ జరగ్గా.. ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 82 స్థానాలు దక్కించుకోగా.. ఎన్సీపీ 53 స్థానాలు, శివ సేన(షిండే వర్గం) 40 స్థానాలు కైవం చేసుకుంది. ఇక శివ సేన(ఉద్దవ్ థాక్రే వర్గం) 27, కాంగ్రెస్ 22, ఇతరులు 47 చోట్ల విజయం సాధించారు. ఈ విజయంతో బీజేపీ సంబురాలు చేసుకుంది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ బీజేపీ నెంబర్ వన్ పార్టీ అని, బీజేపీతో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివ సేన బాగా పని చేసిందని ట్వీట్ చేశారు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌ను, కార్యకర్తలను అభినందించారాయన. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ సైతం స్పందిస్తూ.. ఇది ప్రజాతీర్పు అని, ప్రజావ్యతిరేక కూటమికి(మహా వికాస్ అగాఢిని ఉద్దేశించి) ఇది ప్రజలు ఇచ్చిన తిరస్కారం, మునుముందు ఇదే కొనసాగుతుంది అంటూ పరోక్షంగా థాక్రే వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ్నవీస్‌కు! -
నేటి నుంచి గ్రామాల్లో సర్పంచ్ల పాలన
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో శనివారం నుంచి సర్పంచ్ల పాలన మొదలు కాబోతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రాష్ట్రమంతటా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు రెండున్నర ఏళ్లుగా ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు పని చేస్తున్నాయి. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2020 మార్చిలో ఇతర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నించగా, అప్పటి ఎస్ఈసీ కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13,097 గ్రామ పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఏప్రిల్ 3వ తేదీన కొత్తగా ఎన్నికైన సభ్యులతో తొలి సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో తాజాగా గ్రామాల్లో మళ్లీ సర్పంచ్ల పాలన కొనసాగబోతుంది. ప్రమాణ స్వీకారం.. ప్రతిజ్ఞ ► కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు శనివారం నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించి ఘనంగా జరిపేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిర్ణయించారు. ► అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించాలని నిర్ణయించారు. ► శనివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, వర్షపు నీటి సంరక్షణపై అన్ని గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రతిజ్ఞ చేస్తారు. ► 12.15 గంటలకు పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కొత్తగా ఎన్నికైన సభ్యుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. అన్ని చోట్ల కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారితో గ్రామ పంచాయతీల మొదటి çసమావేశం నిర్వహిస్తారు. -
పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు లేవు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎటువంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కరెంట్ నిలిపివేసి ఫలితాలను తారుమారు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల రీకౌంటింగ్ నిర్వహించారని ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్ నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు కమిషన్ తెలిపింది. కొన్ని చిన్న సంఘటనలు జరిగినప్పటికీ, వాటిలో తీవ్రంగా పరిగణించాల్సినవి ఏమీ లేవని పేర్కొంది. ఎక్కడా కూడా కరెంట్ నిలిపివేసి ఫలితాలను మార్చినట్టు నిర్ధారణ కాలేదని తెలిపింది. గుంటూరు జిల్లాలో నాలుగు పంచాయతీల్లో ఎక్కువ ఓట్ల తేడా ఉన్నా, రీ కౌంటింగ్ నిర్వహించినట్టు తెలిసిందని, వాటిపై జిల్లా కలెక్టరు నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకున్నానని, రీకౌంటింగ్‌లో ఎటువంటి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కాలేదని వెల్లడించింది. ఓట్ల లెక్కింపుపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు; మూడో విడత ఏకగ్రీవాల జోరు
సాక్షి, అమరావతి: మూడో విడత ఎన్నికలలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. 579 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం అధికారికంగా ప్రకటించింది. మూడో విడత 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 13 జిల్లాల నుంచి సమాచారం అందాక, ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం శనివారం అధికారికంగా విడుదల చేసింది. 579 సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మూడో విడత 2,640 సర్పంచ్ స్థానాలకు (రెండు స్థానాల్లో నామినేషన్ దాఖలు కాలేదు) ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం పేర్కొంది. 7,756 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరుగుతుందని తెలిపింది. కాగా, మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత 11,732 వార్డులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. 19,607 వార్డులలో 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలిపింది. కాగా, 177 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. నాలుగో విడత సర్పంచ్ పదవులకు 20,156 నామినేషన్లు నాలుగో విడతలో 3,228 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 20,156 నామి నేషన్లు, వార్డు పదవులకు 88,285 నామి నేషన్లు దాఖలు అయ్యాయి. ఈ గ్రామ పంచా యతీల్లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది. -
నాలుగో సింహానికి నాలుగు సవాళ్లు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖ ఇప్పుడు నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆలయాలకు బందోబస్తు, వ్యాక్సిన్ భద్రత, రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ.. ఇలా అన్నింటినీ ఒకేసారి సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగిన దేవుడి విగ్రహాల ధ్వంసం కేసుల చిక్కుముడులను చాకచక్యంగా విప్పి శభాష్ అనిపించుకున్నారు. సున్నితమైన మతపరమైన అంశాల ద్వారా అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్రలను ఛేదించడమే కాకుండా.. ఆలయాలపై నిరంతర నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి.. జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ భద్రతా చర్యలను కూడా పోలీసులే చేపట్టారు. వైద్య ఆరోగ్య, మున్సిపల్ తదితర సిబ్బందికి వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా వచ్చి పడిన పంచాయతీ ఎన్నికల విధులకు కూడా పోలీస్ శాఖ వెంటనే సిద్ధమైంది. నామినేషన్లు మొదలు.. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలన్నింటికీ బందోబస్తు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది. విధుల కోసం వ్యాక్సిన్ వాయిదా.. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన పోలీసు శాఖలోని దాదాపు 73 వేల మంది సిబ్బంది, 16 వేల మంది హోంగార్డులకు ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ వేయాలని అధికారులు తొలుత నిర్ణయించారు. కానీ వారికి వ్యాక్సిన్ వేస్తే నెల రోజులపాటు ఎలాంటి రియాక్షన్ లేకుండా పరిశీలనలో ఉంచాలి. అయితే రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ, వ్యాక్సిన్ భద్రత, ఎన్నికల విధులకు విఘాతం కలుగుతుందని భావించిన అధికారులు, సిబ్బంది.. వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మార్చి 5లోపు వీరికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. పోలీసు సిబ్బందికి సలామ్ చేస్తున్నా.. త్యాగాలకు ఏపీ పోలీసులు వెనుకాడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం వ్యాక్సిన్ కూడా వాయిదా వేసుకొని.. సేవలందిస్తున్నందుకు పోలీస్ బాస్‌గా వారికి సలామ్ చేస్తున్నాను. – డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ కుటుంబ ఒత్తిడి.. అయినా బాధ్యత ముఖ్యం కోవిడ్ విధులు మొదలైనప్పటి నుంచి కుటుంబసభ్యులు మా గురించి భయపడుతున్నారు. అయినా కూడా కుటుంబాలకు దూరంగా, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం సేవలందిస్తున్నాం. 14,362 మంది పోలీసులు కోవిడ్ బారిన పడగా, 109 మందిని కోల్పోయాం. దీంతో కనీసం వ్యాక్సిన్ వేయించుకుంటే.. ప్రశాంతంగా ఉంటాం కదా అని కుటుంబసభ్యులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయం తీసుకుని విధులు నిర్వహిస్తున్నాం. –జె.శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు -
టీడీపీ దాడులు.. దౌర్జన్యాలు
సాక్షి నెట్వర్క్: పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొడవలు సృష్టించాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు ఈ ఎన్నికలకు పార్టీ రంగు పూస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా బెదిరింపులకు పాల్పడగా పలుచోట్ల మాజీ మంత్రుల అనుచరులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. అచ్చెన్నాయుడు తన స్వగ్రామం నిమ్మాడలో తమకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకుండా ఫోన్లో బెదిరించడమేగాక ఆయన సోదరుడు, సోదరుడి కుమారుడు, టీడీపీ కార్యకర్తలు ఆదివారం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో ఆదివారం నామినేషన్ కేంద్రాల వద్ద హల్చల్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు తన కారుతో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఢీకొట్టిన విషయం విదితమే. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం బద్రిపల్లెలో ఆదివారం రాత్రి దళితులపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. 9వ వార్డు మెంబరు పదవికి నామినేషన్ వేసిన డేగల చంద్రలీల నామినేషన్ ఉప సంహరించుకునేందుకు వీల్లేదంటూ నెర్రవాడకు చెందిన టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ మేకల బాబు, బుర్రి నాగరాజు, టీడీపీ మద్దతుతో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి భర్త గుత్తి వీరనారాయణ, మేకల సుదర్శన్ మరో ఐదుగురు తమ మనుషులతో కలసి దళితులపై బెదిరింపులకు పాల్పడుతూ దాడికి యత్నించారు. దీనిపై దళితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దళిత తహసీల్దార్‌పై దాడికి యత్నం చిత్తూరు జిల్లా పాకాల తహసీల్దార్ లోకేశ్వరిని టీడీపీ పాకాల మండల మాజీ అధ్యక్షుడు నాగరాజునాయుడు శనివారం ఫోన్లో అంతుచూస్తానంటూ బెదిరించాడు. దళితురాలైన ఆమెను కులం పేరుతో దూషించాడు. అనుచరులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆమె మీద, సిబ్బంది మీద దాడికి ప్రయత్నించాడు. తహసీల్దార్ పాకాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాగరాజు, మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పాకాల ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. నిమ్మాడలో జరిగిన దౌర్జన్యకాండలో అరెస్టు చేసిన వారిని కోర్టుకు తరలిస్తున్న పోలీసులు పరిటాల సునీత అనుచరుల బెదిరింపులు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం మాదాపురంలో ‘మాపైనే పోటీ చేస్తావా.. మీ అంతుచూస్తాం’ అంటూ పరిటాల వర్గీయులు వీరంగం చేశారు. సర్పంచి పదవికి నాగరాజు భార్య నిర్మలమ్మ పోటీచేస్తోంది. టీడీపీకి చెందిన మాదాపురం శంకర్ భార్య గంగమ్మ బరిలో ఉన్నారు. సోమవారం గ్రామ వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తుండగా టీడీపీ నాయకుడు మాదాపురం శంకర్ తమ వారికి ఇంతవరకు ఎందుకు పింఛన్లు ఇవ్వలేదని వలంటీర్లపై విరుచుకుపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికుడు బోయ నాగేంద్ర సర్దిచెప్పబోయాడు. మాపైనే మీ వదినను పోటీకి నిలుపుతావా? మీ అంతు చూస్తాం.. అంటూ శంకర్ బెదిరించాడు. బాధితులు రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిమ్మాడ ఘటనపై ఎస్ఈసీకి ఫిర్యాదు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్నతో పాటు ఆయనకు అండగా వెళ్లిన తనపైన కూడా అచ్చెన్నాయుడు వర్గీయులు దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ఆయన నిమ్మగడ్డను కలిశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు. పరారీలో కింజరాపు హరిప్రసాద్, సురేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాకా అయిన నిమ్మాడలో ఆదివారం జరిగిన దౌర్జన్యకాండకు సంబంధించి 12 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన కింజరాపు అప్పన్న నామినేషన్ వేసేందుకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి వెళ్లగా.. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సర్పంచ్ అభ్యర్థి సురేష్, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా బీభత్సం సృష్టించటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. ఈ సంఘటనపై బాధితుడు కింజరాపు అప్పన్న కోట»ొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ రవికుమార్ నేతృత్వంలో 12 మందిని అరెస్టు చేసి కోటబొమ్మాళి కోర్టుకు తరలించారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ను విధించటంతో అంపోలు జైలుకు తరలించారు. ఘటనలో ప్రధాన సూత్రధారులైన కింజరాపు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్ పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నామినేషన్ కేంద్రం రిటర్నింగ్ అధికారి యు.శ్రీనివాసరావు కూడా కోటబొమ్మాళి ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. నిమ్మాడ ఘటనలో కేసు నమోదు:డీజీపీ సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ పంచాయతీ నామినేషన్ల సందర్భంగా.. నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, జన సమీకరణ చేసి శాంతిభద్రతల సమస్య సృష్టించడం వంటి వాటిపై కేసు నమోదు చేసినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన పోలీసు ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో కలిసి డీజీపీ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలను రాజకీయాలు చేస్తూ కొందరు నేతలు వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. రాజకీయ జోక్యంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేవారిని సాంకేతిక పరిజ్ఞానం ఇట్టే పట్టిస్తుందన్నారు. నిమ్మాడలో ఒక అభ్యరి్థకి ఫోన్ చేసి బెదిరించిన ఒక పార్టీ నాయకుడి ఆడియో టేపు లీకవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎన్నికల అనంతరమే టీకా వేయించుకోవాలని పోలీసులు నిర్ణయించినట్లు చెప్పారు. డీజీపీతో చర్చల అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్, గౌరవాధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా రాజకీయ నేతలు చేస్తున్న విమర్శలు మానాలని కోరారు. -
స్థానిక ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించిన సర్కార్
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తలుపు తట్టింది. గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్‌ను సవాలు చేస్తూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, బదిలీల నిలిపివేత తదితర చర్యలన్నింటినీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొసీడింగ్స్‌తో సహా తదుపరి చర్యల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఎన్నికల తేదీని ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్ ముందుంచాలని ఆదేశించిందని ద్వివేదీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు తాము తమ అభ్యంతరాలన్నింటినీ ఆధారసహితంగా ఎన్నికల కమిషనర్ ముందు ఉంచామని వివరించారు. ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన కాపీ అందుబాటులోకి రాక ముందే, సంప్రదింపులకు రావాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ కమిషనర్లకు నిమ్మగడ్డ రమేశ్ లేఖలు రాశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. పిటిషన్‌లోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. సంప్రదింపుల వెనుక చిత్తశుద్ధి లేదు.. – రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేశ్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ నెల 8న సంప్రదింపులకు రావాలని అధికారులను ఆదేశించారు. – హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం 8న సాయంత్రం ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. మా బృందం కలిసి వచ్చిన కొద్ది గంటలకే ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. – ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేగాన్ని చూస్తే, సంప్రదింపుల ప్రక్రియ కేవలం ఓ ఫార్స్ అన్న సంగతి ఇట్టే అర్థమవుతోంది. సంప్రదింపుల విషయంలో కోర్టు ముందు అంగీకరించిన దానికి భిన్నంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీనిని బట్టి షెడ్యూల్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నారని స్పష్టమవుతోంది. – తన పదవీ విరమణ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చేసిన ప్రకటనే, ఈ మొత్తం విషయాన్ని చెబుతోంది. ఆ ప్రకటనే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేలా చేసింది. – రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెప్పడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి మాత్రమే ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరిపారే తప్ప, చిత్తశుద్ధితో జరపలేదు. సంప్రదింపుల ప్రక్రియను, కోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అపహాస్యం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని చెప్పినా వినలేదు – ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనేందుకు ప్రభుత్వం చెప్పిన కారణాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరిస్తూ అందజేసిన ఆధారాలను నిమ్మగడ్డ పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేశారు. – కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర హోం శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి. సాధారణ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో అలా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. – ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయాలని కోరుతోంది. ఈ నెల 11న ప్రధాన మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ వ్యాక్సిన్ సన్నద్దత, విధి విధానాలు తదితరాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. – ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రధాన మంత్రి ప్రకటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కూడా కోరాం. ఇప్పటికే వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను జారీ చేసిన విషయాన్ని కూడా కమిషనర్‌కు వివరించాం. పోలీసులతో సహా మొత్తం అధికార యంత్రాంగం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంత ముఖ్యమో తెలియజేశాం. దురుద్దేశంతోనే ఈ నిర్ణయం – వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ దురుద్దేశంతో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని వెనుక నిమ్మగడ్డకు కుటిల ఉద్దేశాలున్నాయి. ఎన్నికలను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిస్థితులను, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. – దీనికి, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ నేతల జోక్యం ఉండదు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పారు. – నిమ్మగడ్డ రమేశ్ తన నోటిఫికేషన్లో బీహార్, కేరళ, అమెరికాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కేరళలో ఎన్నికలను నోటిఫై చేసిన నవంబర్ నాటికి 4.50 లక్షల కేసులు ఉంటే, మూడో దశ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6.50 లక్షలకు చేరింది. – ఈ రోజుకు (శనివారం) కేరళలో కోవిడ్ కేసులు 8.01 లక్షలు. అమెరికా విషయానికొస్తే, అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు జరిగే నాటికి అక్కడ కోవిడ్ కేసులు 97.53 లక్షలు. ఇప్పుడు ఆ సంఖ్య 2.21 కోట్లకు చేరింది. – ఇదే రీతిలో రాజస్తాన్, బీహార్లలో కూడా ఎన్నికల తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించే నాటికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం కాలేదు. మార్గదర్శకాలు కూడా జారీ కాలేదు. నిమ్మగడ్డ ఇష్టాయిష్టాలకు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం – రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోదు. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్రానికి ఆపార గౌరవం ఉంది. ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. – ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ఇష్టానుసారం తీసుకునే నిర్ణయాలకు ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టలేదు. పౌరుల, ప్రభుత్వాధికారుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – దేశం మొత్తం ఇప్పుడు జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయడం సరికాదు. దీనిపై మా అభ్యంతరాలను పట్టించుకోలేదు. – నిమ్మగడ్డ రమేశ్ ప్రభుత్వ వ్యతిరేక భావనతో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ జారీ వెనుక సదుద్దేశాలు, హేతుబద్ధత ఎంత మాత్రం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదన్న విషయాన్ని నిమ్మగడ్డ రమేశ్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. -
ఫిబ్రవరిలో ‘పంచాయతీ’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు ఈమేరకు ఉత్తర్వులు పంపారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనరే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణపై ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో తదుపరి ఎన్నికల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా 2021 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించిందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొంటూ దీనికి కొనసాగింపుగా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత విడుదల చేస్తామని అదే ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేదని, తాము ప్రకటించనున్న ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచి కోడ్ అమలులోకి వస్తుందని ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందని, గతంలో రోజూ 10 వేలకుపైగా నమోదైన కేసులు ఇటీవల 2 వేలకు తగ్గాయని, మొదటిసారిగా కేసులు వెయ్యి లోపు మాత్రమే ఉన్నాయన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈనెల 30వతేదీ వరకు సెలవులో ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. మరోవైపు గురువారం ఆయన గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిసింది. ఆకస్మిక ప్రణాళిక రూపొందించండి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అకస్మిక (కంటింజెన్స్) ప్రణాళికలు రూపొందించాలంటూ ప్రొసీడింగ్స్‌లో కలెక్టర్లకు నిమ్మగడ్డ సూచించారు. కరోనా పరిస్థితులలోనూ బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రస్తావించారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 28న తనకు లేఖ అందజేశారని అయితే రాజకీయ పార్టీలతో జరిపిన సంప్రదింపుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల నిర్వహణకు అత్యధికులు మొగ్గు చూపారన్నారు. గ్రామాల్లో కరోనా కట్టడిలో స్థానిక ప్రభుత్వాల అవసరం, ఆర్థిక సంఘం నుంచి నిధుల విడుదలకు ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అత్యవసరమన్నారు. కరోనా నేపధ్యంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకు అవకాశం లేకుండా ఎన్నికలు జరిపేందుకు వైద్య ఆరోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు డీజీపీ తగిన చర్యలు చేపట్టాలన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవ్వండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని.. ఇందుకు యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఓటర్ల జాబితాలు, బ్యాలెట్ బాక ్స్ల వంటి ఎన్నికల సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి 70 కాపీల వరకు ఓటర్ల జాబితాల అవసరం ఉంటుందని, ఆ మేరకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విడతల వారీగా ఎన్నికలు జరిపినప్పటికీ, రాష్ట్రంలో సరిపడినన్ని బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో లేని కారణంగా కేరళ నుంచి రప్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ బూత్ గుర్తింపు, సిబ్బంది నియామకంలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఏవీ సత్య రమేష్ పాల్గొనగా.. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డీవోలు, ఎన్నికల విధుల్లో ఉండే ఇతర అధికారులు హాజరయ్యారు. పరీక్షలకు ఆటంకం లేకుండా ఎన్నికల తేదీలు మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నందున వాటికి ఆటంకం కలగకుండా ఎన్నికల తేదీలు ఖరారు చేసే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యా శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏయే తేదీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉన్నాయో విద్యా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలేజీలు, స్కూళ్లలో పోలింగ్‌తో పాటు ఎన్నికల కౌంటింగ్ వల్ల విద్యార్థులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటే.. అలాంటి విద్యా సంస్థలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నిధుల విడుదలలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు. -
లెక్కలు చెప్పాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సిందే. నామినేషన్లు దాఖలు చేసిన వారంతా గెలుపోటములు, విరమణ, ఏకగ్రీవ ఎన్నికవంటి వాటితో సంబంధం లేకుండా తాము చేసిన వ్యయాన్ని చూపించాలి. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని నియమ నిబంధనలకు అనుగుణంగా 45 రోజుల నిర్ణీత గడువులోగా లెక్కలు చూపకపోతే ఆ అభ్యర్థులు పంచాయతీరాజ్ ఎన్నికల్లో మూడేళ్లపాటు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తారు. గెలుపొందిన వారి విషయానికొస్తే వారు తమ స్థానాన్ని కోల్పోవడంతో పాటు మూడేళ్లపాటు పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ ఏడాది జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగడంతో పాటు ఆ మూడురోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు విడతల్లో ఫలితాలు వెలువడిన నాటి నుంచి 45రోజుల్లోగా నామినేషన్లు సమర్పించిన వారంతా తాము చేసిన వ్యయంపై తుది రిటర్న్స్‌ను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) శనివారం ఆదేశించింది. అభ్యర్థులు సమర్పించిన వ్యయ వివరాలను ఎంపీడీవోలు తమ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుంది. అభ్యర్థులు చేసిన వ్యయానికి సంబంధించిన పత్రాలను జిరాక్స్ ఖర్చులను చెల్లించడం ద్వారా ఎవరైనా ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆ వివరాలు పొందవచ్చు. అభ్యర్థుల ఖర్చుపై, వారు సమర్పించిన రిటర్న్స్‌పై అభ్యంతరాలుంటే, సరైన ఆధారాలతో జిల్లాల పర్యటనలకు వ్యయ పరిశీలకులు వచ్చినపుడు వారి దృష్టికి తీసుకురావచ్చు. మొదటి విడతకు 6వ తేదీలోగా గత నెల 20న తొలివిడత పంచాయతీ ఫలితాలు వెలువడినందున, అభ్యర్థులు ఈ నెల 6లోగా రిటర్న్స్ దాఖలు చేయాలని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. రెండో విడతకు సంబంధించి ఈనెల 10లోగా, మూడో విడతకు సంబంధించి ఈనెల 15లోగా నామినేషన్ దాఖలు చేసిన వారంతా లెక్కలు సమర్పించాలని సూచించారు. -
2న గ్రామ పంచాయతీల తొలి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21, 25, 30 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ జిల్లా మినహా) జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొం దిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఫిబ్రవరి 2ను అపాయింట్మెంట్ డేగా నిర్ణయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శనివారం (ఫిబ్రవరి 2న) కొత్త గ్రామపంచాయతీలు కొలువుదీరనున్నాయి. ఈ సందర్భంగా కొత్త గ్రామపంచాయతీల తొలి సమావేశం జరగనుంది. అదే రోజున సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు చేపడతారు. ఆ రోజు నుంచి వారి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నోటిఫికేషన్లకు అనుగుణంగా మూడు దశలుగా ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో అంతకు ముందు, ఈ నెల 30న ఎన్నికలు జరగని పంచాయతీలు, ఇంకా గడువు ముగియని పంచాయతీలకు పంచాయతీరాజ్‌శాఖ విడిగా అపాయింటెడ్ డేను ప్రకటించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా గ్రామస్థాయిల్లోని పంచాయతీ సర్పంచ్‌లకు కొత్త పంచాయతీరాజ్ చట్టంతో సహా గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం తదితర కార్యక్రమాల గురించి సమగ్ర అవగాహన కల్పించి, క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 11 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ.. రాష్ట్రవ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్‌లకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు ఆయా జిల్లాల వారీగా విభజించి మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో విడతలో రెండు బ్యాచ్‌లుగా వంద మందికి శిక్షణ ఇస్తారు. తొలి విడత శిక్షణను ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు, రెండో విడత శిక్షణను ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు, మూడో విడత శిక్షణను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ముందుగా శిక్షకులకు శిక్షణ (ట్రైనింగ్ టు ట్రైనర్స్) కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన.. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ అనంతరం వారి పనితీరుకు అనుగుణంగా సర్పంచ్‌లకు గ్రేడింగ్‌లు ఇస్తారు. -
ఐదు వార్డుల్లో రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల గుర్తుల కేటాయిం పులో జరిగిన పొరపాటు కారణంగా ఒక పంచాయతీ సర్పంచ్ ఎన్నిక, దాని పరిధిలోని ఐదు వార్డులకు రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లపల్లి గ్రామ పంచాయతీకి రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా, అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను పొరపాటుగా కేటా యించడంతో రీపోలింగ్ జరగనుంది. దీంతో మూడో విడతలో భాగంగా ఈ నెల 30న జల్లపల్లి సర్పంచ్ స్థానానికి 3, 4, 5, 6, 7, 8 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 30న సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిం చాక ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సూచిం చారు. మిర్యాలగూడ మండలం ముల్కలచెరు వు గ్రామ పంచాయతీలోని ఐదో వార్డు స్థానానికి రిజర్వేషన్ ఖరారులో పొరపాటు చోటుచేసుకుం ది. దీంతో ఈ నెల 25న జరిగిన ఎన్నిక ప్రక్రియను రద్దు చేసి, ఫిబ్రవరి 8కి ఎస్ఈసీ రీషెడ్యూ ల్ చేసింది. 8న ఐదో వార్డులో ఫలితాన్ని ప్రకటిం చాక ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలంది. సోమవారం శివ్వారం ఫలితం ప్రకటన.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సోమవారం ఉదయం 11.30కి ఫలితాన్ని ప్రకటించాలని ఎస్ఈసీ సూచించింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని, ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఇది జరగకపోతే మరుసటిరోజు ఈ ఎన్నికను నిర్వహించవచ్చని పేర్కొంది. -
రెండో విడతా గులాబీదే
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. తొలివిడతలో సింహభాగం పంచాయతీలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ రెండో విడతలోనూ అదేజోరును ప్రదర్శించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,135 గ్రామ పంచాయతీలకు గాను 4,130 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు పంచాయతీలకు నామినేషన్లు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు జరిగిన వాటిలో టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 2,865 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. 770 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. టీడీపీ 39 పంచాయతీల్లో, 43 పంచాయతీల్లో బీజేపీ, 12 పంచాయతీల్లో సీపీఐ, 22 పంచాయతీల్లో సీపీఎం పార్టీలు పాగా వేశాయి. మరో 379 గ్రామ పంచాయతీల్లో స్వతంత్రులు విజేతలుగా నిలిచారు. నామినేషన్లు రాని కారణంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలు ఆదిలాబాద్, ఖమ్మం, జయశంకర్భూపాలపల్లిలో ఒక్కో పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక్కోవార్డు స్థానాల లెక్కింపుపై అస్పష్టత నెలకొనడంతో వాటి ఫలితాలు నిలిపివేశారు. ఈనెల 30న తుది విడత ఎన్నికలతో పాటు ఈరెండు వార్డుల ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘యాదాద్రి భువనగిరి’లో 93% పోలింగ్ గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 88.26 శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 93.71 శాతం ఓటింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 92.82 శాతం, మెదక్ 92.52 శాతం, సిద్దిపేట 92.34 శాతం, నల్లగొండ జిల్లాలో 92.01 శాతం, ఖమ్మం 91.91 శాతం, మహబూబాబాద్ 91.05 శాతం, జనగామ 90.52 శాతం, నాగర్‌కర్నూల్ 90.17 శాతం, కామారెడ్డి జిల్లాలో 90.04 శాతం ఓటింగ్ నమోదైంది. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 80.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగ్గా... మొత్తం 37,76,797 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వీరిలో 19,08,889 మంది మహిళలు, 18,67,898 మంది పురుషులున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. -
16 మంది వెలి
బయ్యారం: గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థి ఓటమికి పరోక్షంగా కారణమయ్యారనే నెపంతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచనపల్లికి చెందిన కాంగ్రెస్ శ్రేణులను న్యూడెమోక్రసీ నాయకులు వెలివేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన కాచనపల్లిలో సర్పంచ్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ముడిగ వజ్జయ్య, కాంగ్రెస్ నుంచి భూక్యా రమేశ్, న్యూడెమోక్రసీ పార్టీ నుంచి కొట్టెం వెంకటేశ్వర్లు పోటీ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన ముడిగ వజ్జయ్య న్యూడెమోక్రసీ పార్టీ బలపర్చిన అభ్యర్థి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రమేశ్, వజ్జయ్యకు మద్దతు ఇవ్వడం వల్లనే తమ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యాడని ఆరోపిస్తూ న్యూడెమోక్రసీ సర్పంచ్ అభ్యర్థి కొట్టెం వెంకటేశ్వర్లుతో పాటు కొట్టెం రామారావు, సీతారాములు, రమేశ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన కొట్టెం పాపారావు, కొట్టెం చిన్నవెంకన్న, కొట్టెం లక్ష్మయ్య, కృష్ణ, రాందాస్, పాపారావుతో పాటు పలువురిని వెలివేశారు. ఇతరులతో మాట్లాడిన, తాగునీరు పట్టుకున్న, తమ పశువులను తోలుకెళ్లినా రూ.15 వేల జరిమానా విధిస్తామని తీర్మానించారని బాధితులు వాపోయారు. కాగా ఈ విషయంపై కాచనపల్లికి చెందిన 16 కుటుంబాల వారు బయ్యారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ముగిసిన రెండో విడత పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. మరో గంట తరువాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గత సోమవారం తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నేడు రెండు విడతల పోలింగ్ జరగగా ఈనెల 30వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతం ఖమ్మం 73.35 శాతం నల్లగొండ 65 శాతం సూర్యపేట 77 శాతం పెద్దపల్లి 67.30 శాతం రంగారెడ్డి 65.3 శాతం కరీంనగర్ 64 శాతం యాదాద్రి 63 శాతం కామరెడ్డి 81.78 శాతం నిజామాబాద్ 69.38 శాతం వనపర్తి 80 శాతం నాగర్ కర్నూల్ 76 శాతం జోగులాంబ గద్వాల 78 శాతం వరంగల్ అర్బన్ జిల్లా 87 శాతం జనగామ 90 శాతం భూపాల్ పల్లి 83 శాతం -
రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్
-
రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్టానికి సంబంధించి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తంగా రెండో దశలో 4135 సర్పంచ్ స్థానాలకు 783 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,342 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 10,668 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. 26, 191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగగా..రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. -
రెండో విడత ‘పంచాయతీ’ నేడే
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం(నేడు) జరగనున్నాయి. మండల, గ్రామస్థాయిల్లో ఎన్నికల వ్యయపరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు సోదాలు, నిఘా కొనసాగుతున్నా కిందిస్థాయిలో డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. బుధవారం వరకు దాదాపు రూ. రెండున్నర కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)కు పోలీసు శాఖ నివేదికలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, పోలీసులకు పట్టుబడిన డబ్బు, మద్యం నామమాత్రమేనని, రెండోవిడత ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వం కొనసాగుతున్నట్టుగా గ్రామస్థాయిల నుంచి సమాచారం వస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. అనివార్య కారణాలతో ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే, మరుసటిరోజు దానిని నిర్వహించాల్సి ఉంటుందని ఎస్ఈసీ ఇదివరకే తెలియజేసింది. ఎన్నికల విధుల నిర్వహణకు పెద్దసంఖ్యలో అధికారులు, సిబ్బందితోపాటు బం దోబస్తు కోసం 20 వేల మందికిపైగా పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారు. రెండోవిడత ఎన్నికల్లో భాగంగా 29,964 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు, 673 చోట్ల వెబ్ కాస్టింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఓటింగ్ స్లిప్పులు అందనివారు టీపోల్ యాప్‌తో తమ ఓటరు స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కమిషన్ కల్పించింది. 26,191 వార్డులకు ఎన్నికలు... మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరగనున్న రెండోదశలో మొత్తం 4,135 సర్పంచ్‌స్థానాలకు 783 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 36,602 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయించాక మొత్తం 3,342 సర్పంచ్ స్థానాలకు 10,668 మంది, 26,191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రెండో విడతలో భాగంగా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఐదు పంచాయతీల్లో, 94 వార్డుల్లో ఎన్నికలు జరగడంలేదు. మూడో విడతలో573 సర్పంచ్‌లు ఏకగ్రీవం ఈ నెల 30న జరగనున్న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 373 సర్పంచ్ అభ్యర్థులు, 8,956 మంది వార్డుమెంబర్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎస్ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో భాగంగా 4,116 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నోటిఫై చేయగా 573 ఏకగ్రీవాలు కావడం, పది చోట్లా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఎన్నికలు జరగడంలేదు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మొత్తం 3,529 సర్పంచ్ స్థానాలకు 11,667 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో విడతలో మొత్తం 36,729 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వాటిలో 8,956 వార్డులు ఏకగ్రీవం కాగా, వివిధ కారణాలతో 185 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. దీంతో మొత్తం 27,583 వార్డు మెంబర్ స్థానాలకు 67,516 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
‘పంచాయతీ’ పోరులో రూ.కోటి నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రూ.కోటి 78 లక్షల మేర నగదు, రూ.36 లక్షలకు పైగా విలువైన మద్యం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బుధవారం ఒక్కరోజే వనపర్తి జిల్లాలో రూ.20 లక్షల నగదుతో పాటు, వివిధ జిల్లాల్లో మొత్తం రూ.3.85 లక్షల విలువైన మద్యాన్ని (1500 లీటర్లకు పైగా మద్యం) పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఇప్పటిదాక అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ మేరకు నగదుతో పాటు వివిధ వస్తువులు దొరికినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదికలు పంపించారు. ఈ నివేదికల ప్రకారం ఇప్పటివరకు 289 ఫిర్యాదులు నమోదుచేసి, వాటిలో 288 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. 139 కేసుల్లో చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడైంది. రాజకీయపార్టీలు, అభ్యర్థుల మధ్య సంబంధాలపై ఆరా తీయగా మొత్తం 40 వరకు బయటపడ్డాయని, వాటిలో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 14, మెదక్ జిల్లాలో 4, నిర్మల్, భద్రాద్రి, నల్లగొండ, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో ఉదంతం బయటపడినట్లు ఈ నివేదికను బట్టి తెలుస్తోంది. -
ఊరూ గులాబీదే
సాక్షి, హైదరాబాద్: పల్లెపోరులోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఊరిలోనూ కారు జోరు కొనసాగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. తొలివిడత ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. సోమవారం 4,470 పంచాయతీలకు (ఏకగ్రీవంతో కలిపి) ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందేసరికి టీఆర్ఎస్ ఏకంగా 2,769 పంచాయతీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 917 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 66, టీడీపీ 29, సీపీఎం 33, సీపీఐ 14 చోట్ల గెలుపొందాయి. ఇతరులు 642 పంచాయతీల్లో పాగా వేశారు. ప్రశాంతంగా పోలింగ్... తొలివిడత పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. తొలివిడత పంచాయతీల పరిధిలో మొత్తం 48,46,443 మంది ఓటర్లున్నారు. వీరిలో 41,56,414 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 85.76శాతం ఓటింగ్ నమోదైంది. ఓటేసినవారిలో మహిళలు 20,36,782 మంది, పురుషులు 21,19,624 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 95.32శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఖమ్మం(93.92%), రంగారెడ్డి (92.67%), సూర్యాపేట(92.45%), నల్లగొండ(91.28%) జిల్లాలున్నాయి. తక్కువ పోలింగ్ జరిగిన జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల(78.47%), నిజామాబాద్(78.56%), మహబూబ్‌నగర్(81.15%), కామారెడ్డి(81.29%), జగిత్యాల(81.80%) ఉన్నాయి. 9 జిల్లాల్లో నో పోలింగ్... వాస్తవానికి తొలివిడతలో 4,479 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉండగా..9 పంచాయతీల్లో నామినేషన్లు రాలేదు. దీంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. వీటిలో మంచిర్యాల జిల్లాలో రెండు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో రెండు, నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలున్నాయి. ఇక 769 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. 12,202 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వార్డు సభ్యుల కేటగిరీలో 192 స్థానాలకు నామినేషన్లు రాలేదు. 10,654 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 28,976 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా చోట్ల 70,094 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. -
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్
-
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. మరో గంట తరువాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మిగతా రెండు విడతల పోలింగ్ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది. -
పంచాయతీ ఎన్నికల్లో.. అత్తాకోడళ్ల పోరు
నిడమనూరు (నాగార్జునసాగర్) : మండలంలోని బంకాపురంలో వరుసకు అత్తా కోడలు అయిన ఉన్నం కౌసల్య, ఉన్నం శోభ ఎన్నికల బరిలో నిలిచారు. బంకాపురం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేయించారు. ఇక్కడ గత సర్పంచ్‌గా పనిచేసిన ఉన్నం శోభ తిరిగి పోటీ చేస్తుండగా ఆమె అత్త అయిన ఉన్నం కౌసల్య కొత్తగా బరిలో నిలిచారు. ఉన్నం శోభ భర్త కాంగ్రెస్ పార్టీకి చెందగా, కౌసల్య భర్త ఉన్నం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ నాయకుడు. ఉన్నం చిన వెంకటేశ్వర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. జనరల్ మహిళ కావడంతో తన సతీమణిని రంగంలోకి దింపి గెలుపుకోసం పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల బరిలో బాబాయి, అబ్బాయి త్రిపురారం : త్రిపురారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కోసం సొంత బాబాయి, అబ్బాయి పోటీపడుతున్నారు. ఇంటి పేరుతో పాటు వారి పేర్లు కూడా ఒక్కటే కావడం విశే షం. తెలంగాణ ఉద్యమకారుడిగా పేరు న్న అనుముల శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. త్రిపురారం సొసైటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనుముల శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచారు. వీరిద్దరు సొంత బా బాయి, కుమారుడు వరస అవుతారు. వీరితో పాటు చల్లబట్ల వెంకట్రామ్రెడ్డి స్వ తంత్య్ర అభ్యర్థిగా, మరో ముగ్గురు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నారు. కాగా సొంత బాబాయి, అబ్బాయి ఎన్నికల బరిలో నిలవడంతో ఎవ రు గెలుస్తారోననే ఉత్కంఠ నెలకొంది. -
అభ్యర్థులకు గుర్తుల గుబులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఓటర్లు సులభంగా గుర్తుపట్టడానికి అనువుగా లేని, దగ్గర పోలికలు గల గుర్తులు ఉండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఫోర్క్, చం చా, గ్యాస్ స్టౌ, గ్యాస్ సిలిండర్,బ్యాట్, విమానం వంటి దగ్గరి పోలికలున్న గుర్తులను కేటా యించారు. దాంతో ఓటర్లకు వాటిని ఎలా వివరించాలో తెలియక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాలెట్æలో ఊరు, పేరు, ఫొటో ఉండకపోవడం, తికమకపెట్టేలా గుర్తులు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్ని కల్లో కొందరు అభ్యర్థుల గెలుపు, ఓటములను ‘ట్రక్కు’ గుర్తు తారుమారు చేసిన విషయం తెలి సిందే. పంచాయతీ ఎన్నికల్లోనూ తికమకపెట్టే గుర్తులతో తమకు చిక్కులు వస్తాయేమోనని అభ్యర్థులు భయపడుతున్నారు. సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేవారికి వరుసగా ఉంగరం, కత్తెర, బ్యాట్, కప్పుసాసర్, విమానం, పుట్‌బాల్, షటిల్‌కాక్, కుర్చి, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, హ్యాండ్‌బ్యాగ్, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్æ, బ్యాటరీ లైట్, బ్రష్, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్, వేణువు, ఫోర్క్, చంచా ఇలా 30 రకాల గుర్తులు నిర్ణయించారు. పోటీలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే ‘నోటా’కు వేసుకోవచ్చు. వార్డులకు ఇలా... వార్డు స్థానాలకు వరుసగా జగ్గు, గౌను, గ్యాస్‌స్టౌ, స్టూల్æ, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, విజిల్æ, కుండ, డిష్ యాంటీనా, గరాట, మూ కు డు, కేటిల్æ, విల్లుబాణం, పోస్టల్æ కవర్, హాకీస్టిక్, బంతి, నెక్‌టై, కటింగ్ ప్లేయర్, పోస్ట్‌డబ్బా ఇలా 19 రకాల గుర్తులతో పాటు నోటా కూడా ఉంటుంది. ఓటర్లు గుర్తించే, సులువుగా అర్థమయ్యే గుర్తులెన్నో ఉన్నాయి. అలాంటి వన్నీ వదిలేసి క్లిష్టమైనవి గుర్తులుగా పెట్టడంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థులకు మొదటిస్థానంలో ఉంగరం గుర్తు ఉంది. అది చూడగానే అందరికీ సులువుగా అర్ధం అవుతుంది. ఏడోస్థానంలో ఉన్న షటిల్ కాక్ గుర్తు దక్కే అభ్యర్థికి దానిని ప్రచారం చేసుకోవడం ఇబ్బందిగా మారింది. బ్యాలెట్ పేపర్లో మూడోస్థానంలో ఉన్న బ్యాట్, ఐదో స్థానంలో ఉన్న విమానం గుర్తులు దగ్గరి పోలికలతో ఉన్నాయి. వీటి విషయంలో వృద్ధులు పొరబడే అవకాశాలున్నాయి. బ్యాలెట్æ పేపర్లో 29వ స్థానంలో ఉన్న ఫోర్కు, 30వ స్థానంలో ఉన్న చంచా గుర్తులు దాదాపు ఒకేలా ఉన్నాయి. దాంతో ఒకదానికి బ దులు మరొకదానికి ఓటు వేసే అవకాశం లేకపోలేదు. వార్డు సభ్యుల ఎన్నికకు ఉపయోగించే బ్యాలెట్లో మూడోస్థానంలో గ్యాస్‌పొయ్యి, ఐదో స్థానంలో గ్యాస్ సిలిండర్ గుర్తులున్నాయి. పొరపాటున గ్యాస్‌పొయ్యికి పడే ఓట్లు సిలిండర్‌కు పడే అవకాశం ఉంది.