Greta Thunberg
-
పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం
కోపెన్హాగన్: పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమస్టర్‌డ్యామ్‌లో పర్యావరణానికి సంబంధించిన ర్యాలీలో ఆమె మైక్‌ను ఓ వ్యక్తి బలవంతంగా లాక్కున్నాడు. థన్‌బర్గ్ పాలస్తీనా అనుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. #GretaThunberg gets interrupted at a climate rally after she speaks up about #Palestine the crowd begins to chant " let her speak" pic.twitter.com/XdrdPD4qyW — Arthur Morgan (@ArthurM40330824) November 13, 2023 అణిచివేతకు గురవుతున్నారు.. స్వతంత్య్రం కోసం పోరాడుతున్నారు.. ప్రపంచ శాంతి లేకుండా పర్యావరణ సమతుల్యాన్ని సాధించలేం అని థన్‌బర్గ్ అన్నారు. పాలస్తీనీయులు ధరించినట్లు తలకొప్పు ధరించి.. ఆక్రమిత ప్రాంతాల్లో పర్యావరణం కాపాడలేం అంటూ నినదించారు. ఈ సమయంలోనే ర్యాలీలో ఓ గుంపు పాలస్తీనాకు స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి సంబంధించిన ర్యాలీని థన్‌బర్గ్ రాజకీయ కార్యక్రమంగా మార్చివేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు. రాజకీయ విషయాలు మాట్లాడవద్దంటూ ర్యాలీలో ముందుకు వచ్చి థన్‌బర్గ్ వద్ద ఉన్న మైక్‌ను లాక్కున్నాడు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా గాజాలో కొంతభాగాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పాలస్తీనాకు అండగా నినదిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ చేసేదే సరైనదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ను తొలగించిన రిషి సునాక్ -
మూడు బంగారాల కథ
ఏడేళ్లు నిండి ఎనిమిదో పుట్టిన రోజు జరుపుకొనే పిల్లలు ఏం చేస్తారు? అమ్మా నాన్నలు తెచ్చిన కేకు కోసి తోటి పిల్లలతో పంచుకుని సంతోషిస్తారు. ఆ వయసులో అంతకు మించిన ఆనందం ఏముంటుంది? కానీ సిరిసిల్లకు చెందిన తెలుగమ్మాయి బ్లెస్సీ అలా చేయలేదు. తన ఎనిమిదో పుట్టిన రోజున అడవిలో ఆకుపచ్చ బంగారాలకు ప్రాణం పోసేందుకు విత్తనాలు వెదజల్లేందుకు వెళ్లి మురిసిపోయి మెరిసిపోయింది. పుట్టిన రోజుకు బ్లెస్సీ చేసిన సన్నాహం ఏంటో తెలుసా? బంకమన్ను తెచ్చి దాంతో విత్తన బంతులు తయారు చేస్తూ కూర్చుంది. రెండేళ్ల క్రితమే ఇలా విత్తన బంతులు తయారు చేయడం మొదలు పెట్టిన బ్లెస్సీ ఇప్పటివరకూ ఏకంగా అరవై అయిదు వేల విత్తన బంతులు తయారు చేసింది. తోటి పిల్లలంతా సరదాగా ఆడుకుంటూ ఉంటే బ్లెస్సీ మాత్రం ఎక్కడికెళ్లినా... చెట్ల కింద విత్తనాలు ఏరుకుంటూ ఉండేది. వాటిని ఇంటికి పట్టుకెళ్లి విత్తన బ్యాంకులో ఉంచేది. ఆ తర్వాత దగ్గర్లోని అడవిలో వాటిని వెదజల్లుతూ వచ్చేది. మొదట్లో స్నేహితులు బ్లెస్సీని చూసి నవ్వుకున్నా, రానురానూ ఆమె మనసులోని ఆకుపచ్చ సంకల్పం గురించి తెలుసుకొని మెచ్చుకోవడం మొదలు పెట్టారు. పర్యావరణవేత్త కావడంతో నాన్నను చూసి ప్రకృతిపైనా, పర్యావరణం పైనా ప్రేమ పెంచుకున్న బ్లెస్సీ ఇప్పుడు కోట్లాది మందికి ఓ ఆకుపచ్చ బాట వేసిన స్ఫూర్తి. తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలై పట్టణానికి చెందిన పదో తరగతి చదివే వినీశా ఉమాశంకర్ది మరో స్ఫూర్తి గాథ. అమ్మతో కలిసి ఇంట్లో ఉతికిన బట్టలను ఇస్త్రీ చేయించుకునేందుకు సంచార ఇస్త్రీ బండి వద్దకు వెళ్లేది. బట్టలు ఎలా ఇస్త్రీ చేస్తున్నారో గమనించేంది. చింత నిప్పుల్లా భగ భగ మండే బొగ్గులు వేసిన ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేస్తూ ముచ్చెమటలు పోసుకొనే ఆ రజక దంపతులను గమనించింది. వినీశ మనసు కలుక్కుమంది. మెదడులో ఓ ఆలోచన తళుక్కుమంది. బొగ్గుల మంటతో పర్యావరణం పాడవుతుంది. అదే సమయంలో ఇస్త్రీ చేసేవాళ్లు నరకయాతన పడుతున్నారు. ఆ రెంటినీ దృష్టిలో పెట్టుకుంది. సౌర విద్యుత్తుతో పనిచేసే ఓ ఇస్త్రీ పెట్టెను తయారు చేసింది. అప్పటికి వినీశ వయస్సు పట్టుమని పన్నెండేళ్ళే. కానీ, ఆ ఆవిష్కరణ వినీశకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. స్వీడన్‌కు చెందిన చిల్డ్రన్స్ క్లై్లమేట్ ఫౌండేషన్ వినీశకు అంతర్జాతీయ అవార్డును అందించి భుజం తట్టింది. ఈ విషయం తెలిసిన వెంటనే బ్రిటిష్ ప్రిన్స్ విలియమ్స్ గతేడాది జరిగిన ‘కాప్–26’ సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించారు. ‘‘మాటలు వద్దు, చేతలు కావాలి. శిలాజ ఇంధనాలు, కాలుష్యంపై ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవద్దు. పాత పద్ధతులు ఆపేద్దాం. వినూత్న సృజనలు, ఆవిష్కరణలపై మీ సమయాన్ని, డబ్బును వెచ్చించండి’ అంటూ ఉద్విగ్నభరిత ప్రసంగం చేసింది. ఆ సదస్సులో పదిహేనేళ్ళ బాలిక వినీశ చేసిన ప్రసంగానికి ప్రపంచ ప్రతినిధులంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ అందరు పిల్లల్లా ఎదగలేదు. ఎనిమిదేళ్ల వయసులోనే వాతావరణ మార్పులు చేసే చేటు పైనా, పర్యావరణ మార్పుల పైనా, కాలుష్యం పైనా దృష్టి పెట్టింది. కాలుష్యం కారణంగా వాతావరణంలో చోటు చేసుకుంటోన్న భయానక మార్పుల గమనించి బాధపడేది. చదువుకుంటున్నా సరే... ఎప్పుడూ పర్యావరణంపైనే దృష్టి. తల్లితండ్రులకు ఇది నచ్చేది కాదు. చదువు మానేసి పర్యావరణం అంటూ తిరిగితే ఎలా అనుకున్నారు. అలాగని కూతురి ఇష్టాన్ని అడ్డుకోలేదు. దాంతో చదువుతో పాటు పర్యావరణ అంశాలపై ఉద్యమాల స్థాయికి ఎదిగింది. పదిహేనేళ్ళ వయసులో స్వీడన్ పార్లమెంటు భవనం ఎదుట ఒంటరిగా వాతావరణ మార్పులకు నిరసనగా ఆందోళనకు దిగింది. ఆమెకు మద్దతుగా దేశంలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. ‘మీ తరం వాళ్లు చేస్తోన్న పాపం మీ తర్వాతి తరాలకు శాపంగా మారుతోంది. మీ వల్ల మేము చాలా నష్టపోతున్నాం. దయచేసి ఇప్పటికైనా విధ్వంసాన్ని ఆపండి’ అని గ్రెటా నినదించింది. ఇవాళ పర్యావరణం అంటే ప్రపంచంలో అందరికీ గుర్తొచ్చే చిన్న వయసు ఉద్యమకారిణిగా నిలిచింది. మన కళ్ళెదుట కనిపిస్తున్న ఈ ముగ్గురి కథ మనకు ఏం చెబుతోంది? ఆ సంగతి అతి కీలకం. పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకు ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పాలి? ఎంతసేపూ వాళ్ళ మార్కుల గురించి, వాళ్ళు చేయబోయే ఉద్యోగాల గురించేనా మన ధ్యాసంతా! మార్కులు, కెరీరే కాదు... వారికి తాము ఉన్న ఈ భూగోళం మీద కూడా ప్రేమ, అవగాహన పెంచాలి. అదే ఇప్పుడు మానవాళికి కీలకం. తల్లితండ్రులు తమ పిల్లల మెదడులో ఆకుపచ్చ విత్తనాలు నాటాల్సిన సమయం ఇదే. ప్రస్తుతం ప్రకృతి ఎదుర్కొంటున్న విపత్తులకూ, వినాశనానికీ అదే పరిష్కారం. నిజానికి బ్లెస్సీ, వినీశ, గ్రెటా– ఈ ముగ్గురికీ పర్యావరణాన్ని ప్రేమించమని ఎవరూ నేర్పలేదు. చుట్టూరా ఉన్నా ప్రకృతిని చూసి తమంతట తాముగా ఆ ఆకుపచ్చబాటలో అడుగులు వేశారు. కాకపోతే ముగ్గురి తల్లిదండ్రులూ ఈ బంగారు తల్లుల హరిత ప్రయత్నాలను అడ్డుకోలేదు. అదే ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది. పర్యావరణం కోసం, ప్రకృతి కోసం పసి ప్రాయంలోనే మనసులు పారేసుకున్న ముగ్గురూ అమ్మాయిలే కావడం విశేషం. ఈ ముగ్గురు బంగారు తల్లుల పసిడి ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలి. కోట్లాది మందికి ప్రకృతి పాఠాలు నేర్పాలి. -
మాటలు సరే! చేతల మాటేమిటి?
ప్రపంచంలోని 20 భారీ ఆర్థిక వ్యవస్థలు... అంతా కలిపితే అంతర్జాతీయ వాణిజ్యంలో 75 నుంచి 80 శాతం ఉన్న దేశాలు... ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల జనాభాకూ, ప్రపంచ భూభాగంలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాల అధినేతలు ఒక్కచోట కలిస్తే? ప్రపంచ పరిణామాలు, పర్యావరణ, వాణిజ్య సమస్యలపై రెండు రోజులు చర్చిస్తే? ఐరోపా సమాజం, మరో 19 దేశాల అంతర్ ప్రభుత్వవేదికగా ఏర్పాటైన ‘జి–20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ప్రాధాన్యం అందుకే! ఇటలీ రాజధాని రోమ్‌లో అక్టోబర్ చివర 2 రోజులు జరిగిన ఈ సదస్సులో గత రెండేళ్ళలో తొలిసారిగా దేశాధినేతలు వ్యక్తిగతంగా కలిశారు. మరి, ఈ సదస్సు ఆశించిన ఫలితాలు అందించిందా అంటే అవుననలేం. భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీల లోగానే నియంత్రిస్తామంటూ నేతలు లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. కానీ, కర్బన తటస్థతను సాధించేందుకు కచ్చితమైన తుది గడువు పెట్టనే లేదు. కేవలం ఉద్గారాల్ని తగ్గిస్తే చాలదని తెలిసినా, కార్యాచరణ శూన్యం. అందుకే, ‘ప్రజలు, ప్రపంచం, సౌభాగ్యం’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సుతో కొంత ఆశ, ఎంతో నిరాశ మిగిలాయి. 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి తగ్గట్టు దీర్ఘకాలిక పర్యావరణ లక్ష్యాలను పెట్టుకోవాలనీ, శుద్ధమైన విద్యుత్ జనకాలకు త్వరితగతిన మారాలనీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని పేర్కొన్నారు. కానీ, ప్రపంచంలో మూడింట రెండు వంతులకు పైగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు కారణమైన ఈ 20 దేశాల గ్రూపు స్పష్టమైన తుది గడువుతో ముందుకు రాలేదు. కోవిడ్‌పై పోరు, ఆరోగ్య వసతుల మెరుగుదల, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం లాంటి వివిధ అంశాలపై ప్రపంచ నేతలు చర్చించారు. కానీ, రష్యా, చైనాలు తమ ప్రతినిధుల్ని ఈ సదస్సుకు పంపనే లేదు. వివిధ కారణాలతో మెక్సికో, జపాన్, దక్షిణాఫ్రికా నేతలు హాజరు కానే లేదు. వర్ధమాన దేశాలు పర్యావరణహిత ఇంధన లక్ష్యాన్ని చేరుకొనేలా ఏటా 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.49 లక్షల కోట్లు) సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్టు ‘జి–20’ ప్రకటించింది. కానీ, బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలకు అంతర్జాతీయ ఆర్థిక సాయం ఆపేస్తామన్న నేతలు తమ దేశంలో అలాంటి విద్యుదుత్పత్తికి ఎప్పుడు స్వస్తి పలుకుతారో మాట ఇవ్వనే లేదు. ప్రపంచ నేతలు ఎంతసేపటికీ బరువైన మాటలతో గారడీ చేస్తున్నారన్నది గ్రేటా థన్‌బెర్గ్ లాంటి పలువురు పర్యావరణ ఉద్యమకారుల వాదన. ‘జి–20’ సదస్సులో అధినేతల తుది ప్రకటన సైతం వారి వాదనకు తగ్గట్టే ఉంది. అదే విచారకరం. సదస్సు ముగింపు వేళ... పర్యావరణ సంక్షోభంలో తరచూ విస్మరణకు గురయ్యే మూడు మౌలిక అంశాలను గుర్తు చేస్తూ ఉద్యమకారులు థన్‌బెర్గ్, వానెస్సా నకాటే బహిరంగ లేఖ రాశారు. పర్యావరణ సంక్షోభంపై జాగు చేయడానికి లేదన్నారు. ఏ పరిష్కారమైనా సరే పర్యావరణ మార్పు వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేసేదిగా ఉండాలన్నారు. అత్యంత భారీగా కాలుష్యం చేస్తున్నవారు తమ ఉద్గారాలపై అసంపూర్ణమైన గణాంకాలు చెప్పి, తప్పించుకుంటున్నారని ఆరోపించడం గమనార్హం. ఈ 16వ ‘జి–20’ సదస్సుకు హాజరైన భారత ప్రధాని మోదీ విడిగా పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధాని సహా పలువురితో సమావేశమయ్యారు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని హరిత ప్రాజెక్టులకు అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక శాతం ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మోదీ పేర్కొన్నారు. చైనా వ్యతిరేకించడంతో ఆగిన న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూప్ సభ్యత్వాన్ని భారత్‌కు ఇవ్వాలనీ, అలాగే అవసరమైన సాంకేతికతను అందించాలనీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను భారత్ చేరుకోవడం వాటితో ముడిపడి ఉందనీ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తేల్చేశారు. భారత్ అలా తన వాదన వినిపించడం బాగానే ఉంది. సదస్సు ఫలవంతమైందన్న మోదీ మాటలను ఆ మేరకే అర్థం చేసుకోవాలేమో! ఎందుకంటే, పర్యావరణ అంశాలపై పెట్టుకున్న అనేక ఆశలను ‘జి–20’ సదస్సు నెరవేర్చనేలేదని సాక్షాత్తూ ఐరాస ప్రధాన కార్యదర్శే అనేశారు. వెనువెంటనే గ్లాస్గోలో జరుగుతున్న ‘కాప్–26’ సదస్సులోనైనా మెరుగైన ఫలితాలు వస్తాయన్నదే ఇక మిగిలిన ఆశ. ఈ ఏడాది చివరికే జనాభాలో 40 శాతానికి కోవిడ్ టీకాల లాంటి మాటలైతే ‘జి–20’ దేశాధినేతలు అన్నారు. ధనిక, బీద దేశాల మధ్య టీకాల అందుబాటులో తేడాలను తగ్గించే వ్యూహం లేదు. ప్రస్తుతం ప్రపంచం ముంగిట ఉన్న పర్యావరణ అత్యవసర పరిస్థితి పరిష్కారంలోనూ అదే ధోరణి. రోమ్ నుంచి నేరుగా గ్లాస్గోలో ‘కాప్–26’కు వారు హాజరవుతున్నారు. అక్కడ 100కు పైగా దేశాల నేతలతో రెండు రోజులు చర్చలు... గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించే బృహత్ ప్రణాళికపై రెండు వారాల పాటు అధికారుల మల్లగుల్లాలు. కానీ, పర్యావరణ సంక్షోభంపై విజయం సాధించాలంటే ప్రగాఢమైన వాంఛ, మరింత పకడ్బందీ కార్యాచరణ అవసరం. వివిధ దేశాధినేతల సమష్టి రాజకీయ సంకల్పంతోనే అది సాధ్యం. అందుకు ప్రధాన భాగస్వామ్యదేశాల మధ్య నమ్మకం కీలకం. కానీ, ప్రపంచంలో అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలకు కారణమైన చైనా పక్షాన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘కాప్–26’కు హాజరవడం లేదు. లిఖితపూర్వక ప్రకటనతోనే సరిపెడుతున్నారు. ఇలాంటివి ఎన్నో. అందుకే, నిన్నటి ‘జి–20’ లానే, నేటి ‘కాప్–26’లోనూ అద్భుతమైన ఫలితాలు ఆశించడం కష్టమే. సదస్సులన్నీ అరుదైన ఫోటో సందర్భాలుగానే మిగిలితే, అసలు సమస్యలు తీరేదెలా? -
గ్రేటా: భారత్‌లో కరోనాను అడ్డుకోవాలి.. ప్రపంచ దేశాల సహాయం అవసరం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోగులు ఆక్సిజన్, బెడ్ల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. భారత్‌లో కరోనా పరిస్థితులపై ప్రపంచ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ స్పందించారు. ఇండియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో భారత్‌కు ప్రపంచ దేశాలు సహాయం చేయాలని కోరారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్.. ఫస్ట్ వేవ్ మించి విధ్వంసం సృష్టిస్తోందనే చెప్పాలి. ఏప్రిల్ నెలలో వరుసగా నాలుగవ రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇక దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లోని ఈ దారుణ పరిస్థితి చూసి స్పందిస్తూ గ్రెటా థన్‌బర్గ్ ఆవేదన చెందుతూ.. భారత్ ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, ఈ ఆపద నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు భారత్‌కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. "భారతదేశంలో కరోనా కారణంగా జరుగుతున్న దారుణ పరిణామాలను చూసి ఇండియాకు అవసరమైన సహాయాన్ని వెంటనే ప్రపంచ దేశాలు అందించాలి" అని గ్రేటా ట్వీట్ చేశారు. దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత తీవ్రంగా ఏర్పడిందని..దీంతో అనేక మంది రోగులు మరణిస్తున్నారని తెలిపింది. కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి జాతీయ రాజధానితో సహా పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు వైద్య ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ( చదవండి: కరోనా: 24 గంటల్లో కొత్తగా 3,46,786 కేసులు ) Heartbreaking to follow the recent developments in India. The global community must step up and immediately offer the assistance needed. #CovidIndia https://t.co/OaJVTNXa6R — Greta Thunberg (@GretaThunberg) April 24, 2021 -
దిశ రవి.. ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే ఏమిటి?
న్యూఢిల్లీ: జూలై 2020న బహు తక్కువ మందికి పరిచయం ఉన్న మూడు చిన్న పర్యావరణ పరిరక్షణా బృందాలకు చెందిన వెబ్సైట్లను మూసివేసి, వారిపైన ఉపా చట్టం ప్రయోగిస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించినప్పుడు మొదటసారి వీరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి ప్రస్తుతం టూల్‌కిట్ కేసులో అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న దిశ రవికి సంబంధించిన వెబ్సైట్. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’’ఇండియా చాప్టర్‌కి దిశరవి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఖలిస్తానీ సానుభూతి పరులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వీరిని అరెస్టు చేసిన విషయం తెలిసందే. ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్ ? అసలింతకీ ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్? ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా అనేది∙పర్యావరణ పరిరక్షణా సంస్థ. ఇది ప్రాజెక్టులకు అనుమతులు తదితరాలపైనా, పర్యావరణ సమస్యలపైనా, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చే నోటిఫికేషన్లపైనా ఈమెయిల్ క్యాంపెయిన్ చేస్తుంది. మతవిద్వేష అంశాలు.. అయితే ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా వెబ్సైట్ ‘‘భారత సార్వభౌమాధికారానికి, శాంతికి, ప్రశాంతతకు, ప్రమాదకరంగా మారింది’’అని ఢిల్లీ పోలీసులు జూలై8, 2020న వెబ్సైట్ బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. అలాగే వెబ్సైట్లో ‘‘మతపరమైన విద్వేషపూరిత అంశాలు, మెటీరియల్’’ఉన్నదని, ఇది సెక్షన్ 18 ప్రకారం(తీవ్ర వాద చర్యకు ఉసిగొల్పేదిగా, లేదా అందుకు కుట్రపన్నేదిగా)ఉన్నదని, ఇది అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్(యుఏపీఏ)కిందకి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అయితే ఆ తరువాత వెంటనే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఎఫ్ఎఫ్ వెబ్‌సైట్‌ని తిరిగి తెరిచేందుకు అనుమతించారు. ఆ తరువాతి రోజు నుంచి వెబ్సైట్ తిరిగి ఆరంభించారు. అయితే అప్పటి నుంచి ఆ వెబ్‌సైట్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఎఫ్ఎఫ్ఎఫ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అని అర్థం. అంటే మన భవిష్యత్తు కోసం శుక్రవారాన్ని కేటాయించండి అని. ప్రభుత్వాల చైతన్యం కోసం శుక్రవారాన్ని కేటాయించండి అన అర్థం. ప్రభుత్వ వర్గాల్లో పర్యావరణ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి శుక్రవారం విద్యార్థులు నిరసన తెలిపే లక్ష్యంతో స్వీడన్‌కి చెందిన పర్యావరణ ఉద్యమకారణి గ్రేటాథన్బర్గ్ 2018లో ఎఫ్ఎఫ్ఎఫ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఏడాదికి ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా చాప్టర్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలోని పలు నగరాల్లో ఉంది. దేశవ్యాప్తంగా 150 మంది పూర్తిస్థాయి పర్యావరణ కార్యకర్తలు ఇందులో పనిచేస్తున్నారు. ఇతర దేశాల్లోని ఏకీభావం ఉన్న పర్యావరణ పరిరక్షణా సంస్థలతో కలిసి ఎఫ్ఎఫ్ఎఫ్ పనిచేస్తుంది. అటవీ సంరక్షణకోసం ప్రచారోద్యమం గోవాలోని మొల్లెం అటవీప్రాంత పరిరక్షణ, జమ్మూలోని రైకా ఫారెస్ట్ పరిరక్షణోద్యమం, మధ్య ప్రదేశ్‌లోని దుమ్నా నేచర్ పార్క్‌ల పరిరక్షణలు ఈ పర్యావరణ సంస్థ చేపట్టిన ప్రచారకార్యక్రమాల్లో ప్రధానమైనవి. అరే కాలనీలో మెట్రో ప్రాజెక్టుకోసం వేలాది చెట్లను నరికివేస్తున్నప్పుడు 2019, అక్టోబర్‌లో, ఎఫ్ఎఫ్ఎఫ్ కార్యకర్తలకీ పోలీసులకీ మధ్య ఘర్షణ తలెత్తడంతో ఎఫ్ఎఫ్ఎఫ్కార్యకర్తలను కొందరిని అరెస్టు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం ‘‘పర్యావరణ న్యాయం కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం’’(గ్లోబల్ పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ క్లైమేట్ జస్టిస్) అనే నినాదంతో తమ వెబ్సైట్ లక్ష్యాన్ని ఈ ఎఫ్ఎఫ్ఎఫ్ సంస్థ సుస్పష్టంగా వెబ్సైట్లో ఉంచింది. ‘‘సమగ్ర, పర్యావరణ సమతుల్యత కోసం నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉద్యమం నిర్వహిస్తామని, పర్యవారణ సమతుల్యత కోసం అహింసా మార్గంలో క్లైమేట్ స్ట్రయిక్, లేదా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తామని, తద్వారా రాష్ట్రప్రభుత్వాలు పర్యావరణ సంక్షోభాన్ని నిలువరించే చర్యలు చేపట్టేలా ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా కృషి చేస్తుందని ఈ సంస్థ తన వెబ్సైట్లో స్పష్టం చేసింది. కుట్రదారులంటోన్న పోలీసులు ఏది ఏమైనా, దిశ, నికితా జాకబ్, శాంతాను ములుక్ లు రైతుల ఆందోళనకు మద్దతు పలికే గ్రేటాథన్ బర్గ్ టూల్‌కిట్ ని ట్వీట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రైతుల ఆందోళనను అవకాశంగా తీసుకొని భారత దేశాన్ని అస్థిరపరిచే ‘అంతర్జాతీయ కుట్ర’గా దీన్ని పోలీసులు అభివర్ణిస్తున్నారు. గ్లోబల్ క్లైమేట్ స్ట్రయిక్ 2019 సెప్టెంబర్‌లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంస్థ వాతావరణ మార్పులపై గ్లోబల్ క్లైమేట్ స్ట్రయిక్ కార్యక్రమంలో భాగంగా భారత్‌లో సైతం పలు ప్రదర్శనలు నిర్వహించింది. మొదట పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన ఈ సంస్థకు చెందిన కార్యకర్తలు అనంతరం ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ ఉద్యమాల్లో ఎఫ్ఎఫ్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతోన్న రైతు ఆందోళనకి సైతం తమ మద్దతు తెలిపారు. అయితే వీరి ప్రథాన లక్ష్యం మాత్రం పర్యావరణ పరిరక్షణే. వీరంతా వాతావరణ మార్పులపై చైతన్యం తీసుకొచ్చే ప్రచార కార్యక్రమాల్లో భాగమై ఉంటారు. అందులో భాగంగా వీరు సరస్సులను శుభ్రపరచడం, పార్కులను పరిశుభ్రం చేయడం, సమస్యాత్మకంగా మారిన పర్యావరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారు. చదవండి: #AT21: ఆ వయసులో నేను.. చదవండి: దిశ రవి అరెస్టుపై స్పందించిన ఆమె స్నేహితుడు -
వైరల్: గ్రెటా నిజస్వరూపం ఇదేనా?
గ్రెటా థన్‌బర్గ్.. కొద్ది రోజులుగా ఈ పేరు భారత్‌లో మారుమోగుతోందీ. కారణం ఆమె ఢిల్లీలో ఉద్యమించిన రైతులకు మద్దతు తెలపడమే కాదు. ఎప్పుడెప్పుడు ఏయే ఉద్యమాలు చేయాలో రాసి ఉన్న టూల్‌కిట్ రిలీజ్ చేసి వివాదానికి తెర లేపడమే! దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఈ టూల్‌కిట్‌తో సంబంధం ఉన్నవాళ్ల గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో గ్రెటా ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డొక్క ఎండుకుపోయి ఉన్న పేద పిల్లల కళ్లెదురుగా గ్రెటా థన్‌బర్గ్ సుష్ఠుగా భోజనం చేస్తోంది. వారు ఆత్రంగా ఆమె వైపు, అక్కడ ఉన్న ఆహార పదార్థాల వైపు దీనంగా చూస్తున్నట్లుందీ ఫొటో. గ్రెటాకు, ఆ పేద పిల్లలకు మధ్య ఓ అద్దపు కిటికీ అడ్డుగా ఉంది. ఈ ఫొటో చూసిన చాలామంది ఇదే నిజమనుకుని నోరెళ్లబెట్టారు. అంతేకాదు, పైకి నీతులు చెప్పే ఆమె అసలు అవతరాం ఇదీ అని ఎగతాళి చేశారు. ఆమెను నానారకాలుగా తిట్టిపోశారు. కానీ ఇది ఫేక్ ఫొటో. రెండు వేర్వేరు ఫొటోలను ఒకే దగ్గర చేర్చి అందరినీ బురిడీ కొట్టించారు. 2007లో ఆఫ్రికాలో తీసిన బక్కచిక్కిన పేద పిల్లల ఫొటో ఒకటి కాగా, గతేడాది డెన్మార్క్‌లో గ్రెటా మధ్యాహ్న భోజనం చేస్తుండగా దిగిన ఫొటో మరొకటి. ఈ రెండింటినీ కలిపేసి ఫేక్ ఫొటో సృష్టించి కావాలని దాన్ని వైరల్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కోసారి కంటికి కనిపించేదంతా నిజం కాదు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని అన్నదాతలు కొన్ని రోజులుగా రోడ్లమీదకొచ్చి నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ ఆందోళనల సెగ ప్రపంచానికి తాకింది. దీంతో ఎందరో విదేశీ సెలబ్రిటీలు రైతులకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్‌ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని గ్రెటా ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని పేర్కొనడం గమనార్హం. చదవండి: దిశను అందుకే అరెస్టు చేశారు: విన్సెంట్ గ్రెటా టూల్‌కిట్: బెంగళూరు యువతి అరెస్ట్ -
దిశ రవికి మద్దతుగా యువత వినూత్న నిరసన
ముంబై: ప్రస్తుతం దేశంలో టూల్‌కిట్ వివాదం నడుస్తోంది. రైతుల ఉద్యమానికి సంబంధించిన ఈ టూల్‌కిట్‌ని గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేశారు. అయితే దీన్ని బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి ఎడిట్ చేశారని.. ఫలితంగా జనవరి 26న ఎర్రకోట వద్ద హింస చెలరేగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దిశ రవితో పాటు శాంతను ములుక్, నికితా జాకోబ్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిపై నాన్ బెయిల్‌బెల్ వారెంట్ జారీ చేశారు. అయితే ప్రభుత్వ చర్యలపై దేశ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం డిజిటల్ మీడియా వేదికగా యువత ‘‘ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో ఆందోళనను అణచివేస్తోంది’’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది యువత. ఈ మేరకు ‘‘ఫింగర్ఆన్యువర్లిప్స్’’, ‘‘ఫ్రీదిశారవి’’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నోటిపై వేలు ఉంచిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్నారు నెటిజనులు. ఫోటోలతో పాటు మరికొందరు ‘‘మీకిది తెలుసా.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వ చర్యల గురించి అస్సలు మాట్లాడొద్దు’’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఫోటోలు, కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా పర్యావరణ కార్యకార్త ఒకరు మాట్లాడుతూ.. ‘‘పెదవులపై వేలు ఉంచుకోవడం అనేది ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడానికే కాక దిశ రవితో పాటు అరెస్ట్ అయిన మిగతా వారికి సంఘీభావం తెలపడానికి ప్రతీక. వీరిని ప్రభుత్వం కఠినమైన యూఏపీఏ ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసింది. వారికి సంఘీభావంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెదవుల మీద వేలు ఉంచుకుని నిరసన తెలపుతున్నాం. మన దేశంలో ఎవరైనా నిరసన తెలిపితే.. ఉద్యమం చేస్తే.. వారిని సంఘ విద్రోహక శక్తులుగా ముద్రిస్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. నిరసన తెలుపుతున్న వారంతా ప్రజల స్థితిగతులు మార్చాలని.. అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్న వారు’’ అన్నారు. ‘‘దేశంలో మిడతల దాడి, గత పదేళ్లుగా రైతుల ఆత్మహత్యలు, ఒక్క రోజులోనే ఉల్లి ధర మూడు సార్లు పెరగడం వంటి విషయాల గురించి మీకు తెలిసినప్పుడు.. మీరు దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. జస్ట్ మీ పెదవుల మీద వేలు ఉంచుకోండి.. కామ్‌గా ఉండండి. నియమ్‌గిరి పర్వతాల్లో, గోవాలో అక్రమ మైనింగ్ గురించి తెలిసినా.. మొలెం అడవుల్లో కార్చిచ్చు రగిలిందని తెలిసినా.. వచ్చే ఆరేళ్లలో మన భవిష్యత్తు ఒకేలా ఉండదని తెలిసినా మీరు కామ్‌గా ఉండండి.. ఏం మాట్లడకుండా.. మీ పెదవుల మీద వేలు పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే దేశంలోని ఏ అంశం మీదనైనా మీరు స్పందిస్తే.. మీ మాటల్ని వక్రీకరించి.. మిమ్మల్ని చట్ట ప్రకారం దోషులుగా ప్రకటించి కోర్టులో నిలబెడతారు. కనుక ఏం జరిగినా కామ్‌గా ఉండండి.. ప్రశ్నించొద్దు’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు నెటజనులు. ‘‘ఫింగర్స్ఆన్యువర్లిప్స్’’ అనేది శాంతియుతమైన డిజిటల్ నిరసన ప్రదర్శన. ‘‘సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా యువత తమ స్వరాన్ని వినిపిస్తుంది. మౌనంగా ఉండమని వారిని భయపెట్టలేం. అలా చేసిన కొద్ది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకలు పెరుగుతాయి’’ అని తెలియజేయడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశం. చదవండి: దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే టూల్‌కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు -
‘టూల్‌కిట్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా కొందరు ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. అందులో స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ కూడా ఉన్నారు. రైతు ఉద్యమానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో గ్రెటా థన్‌బర్గ్ ఒక టూల్‌కిట్‌ని షేర్ చేశారు. ఇది రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు థన్‌బర్గ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ఇక జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ వివాదం కారణంగా బెంగుళూరుకు చెందిన 22 ఏళ్ల దిశ రవి అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కూడా పై సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నిటింకి మూల కారణం టూల్‌కిట్. అసలు ఏంటీ టూల్‌కిట్.. దీనిపై అంతర్జాతీయంగా వివాదం తలెత్తడానికి గల కారణాలేమిటి.. అందులో దిశ రవి పాత్ర ఏమిటి.. అనే విషయాలు తెలుసుకుందాం.. టూల్‌కిట్.. ‘టూల్‌కిట్’ అంటే ఓ డాక్యుమెంట్. దేని గురించి అయినా వివరించే ఓ పత్రం, బ్లూ ప్రింట్ లాంటిది అని చెప్పవచ్చు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి. కొన్ని ప్రపంచ గతినే మార్చేశాయి. తాజాగా గతేడాది అమెరికాలో ‘‘బ్లాక్ లైవ్స్ మాటర్’’, పర్యావరణానికి సంబంధించి క్లైమేట్ స్ట్రైక్ క్యాంపెయిన్ లాంటివి ఉన్నాయి. ఒకప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరిగితే అందుకు సంబందించిన కార్యాచరణ, వ్యూహాలకు సంబంధించిన ప్రణాళికను కాగితాల మీద ముద్రించేవారు. దానిని ఆ ఉద్యమానికి మద్దతు తెలిపే వారికి చేరేలా చూసేవారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆ స్థానంలోకి టూల్కిట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఉద్యమం అయినా సరే దానికి సంబందించిన ఒక డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తారు. దీనినే టూల్‌కిట్ అంటారు. ఆ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, దానిపై ఆసక్తి ఉన్నా వారు ఎవరైనా సరే ఈ టూల్‌కిట్‌ని చదివితే ఉద్యమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే ఉద్యమంలో ఏ రోజున ఎలాంటి కార్యక్రమం ఉంటుంది.. ఎక్కడెక్కడ ర్యాలీలు, దీక్షలు ఉంటాయి.. ఉద్యమం ఎలా ముందుకు వెళ్తోంది అనే సమాచారం టూల్‌కిట్ ద్వారా తెలుస్తుంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి.. ఉద్యమానికి మద్దతు పెంచడానికి ఈ టూల్‌కిట్‌ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుంటారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మద్దతుదారులను ఏకం చేయడంలో ఈ టూల్‌కిట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. గ్రేటా థన్‌బర్గ్ పాత్ర ఇలాంటి టూల్కిట్నే గ్రేటా థన్‌బర్గ్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో దేశరాజధానిలో జరుగుతున్న ఉద్యమం ఏంటి.. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు ఏంటి అనే వివరాలు ఉన్నాయి. ఈ టూల్కిట్లో ‘‘రైతులు సంపన్నలుగా, స్వాలంభన సాధించడానికి ఉద్దేశించిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ చట్టాలు అమల్లోకి వస్తే.. వ్యవసాయం కార్పొరేట్, అంతర్జాతీయ సంస్థల గుప్పిట్లోకి వెళ్తుంది. వాటి ప్రధాన లక్ష్యం లాభాలు. దాని కోసం ప్రకృతిని దోచుకుంటారు’’ అని దీనిలో ఉంది. దిశ పాత్ర ఏంటి అయితే రైతులకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ని దిశ రవి ఎడిట్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని దిశ రవి అంగీకరించినట్టుగా చెప్తున్నారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. టూల్‌కిట్‌లోని రెండు మూడు లైన్లను ఎడిట్ చేసిన దిశ రవి ఆ తర్వాత అందులో అభ్యంతరకర విషయాలు ఉన్నాయంటూ తిరిగి గ్రేటాకు ట్వీట్ చేసింది. రైతులకు మద్దతివ్వడం కోసం ఇలా చేసానని ఆమె విచారణలో వెల్లడించారు. అంతేకాకుండా జనవరి 11న దిశ రవి, శాంతాను, నికితా అంతా జూమ్ యాప్‌ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. చదవండి: టూల్‌కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి -
దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే
న్యూఢిల్లీ/బెంగళూరు: ‘‘దిశ వాళ్లకు సాఫ్ట్ టార్గెట్. తను ఒక పోస్టర్ గర్ల్ లాంటిది. కాబట్టి తనను అరెస్టు చేస్తే మిగతా వాళ్లు గొంతెత్తాలంటే కాస్త వెనకడుగు వేస్తారు కదా. అందుకే ఇలా చేశారు’’ అని బెంగళూరుకు చెందిన యువ పర్యావరణవేత్త దిశ రవి స్నేహితుడు వినీత్ విన్సెంట్ అన్నారు. మ్యుజీషియన్‌గా పనిచేస్తున్న ఆయన, తన ఫ్రెండ్‌ను అరెస్టు చేయడం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో భాగంగా, ఢిల్లీలో జనవరి 26న జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వీడిష్ యువకెరటం గ్రెటా థంబర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ టూల్‌కిట్ వివాదానికి దారి తీసింది. ఈ అంశంపై దృష్టి సారించిన ఢిల్లీ పోలీసులు దిశ రవి, శాంతను ములుక్, నికితా జాకబ్ అనే ముగ్గురు యువతులపై అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రెటా షేర్ చేసిన టూల్‌ను ఎడిట్ చేసి హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలతో దిశ రవి, నికితను అరెస్టు చేశారు. శాంతను కోసం గాలిస్తున్నారు. వీరి అరెస్టు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దిశ రవి ఫ్రెండ్ విన్సెంట్.. ‘‘దిశ అరెస్టు విషయం నన్ను షాక్‌కు గురిచేసింది. అదే సమయంలో జరిగేది ఇదే కదా అని కూడా అనిపించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను అంతతేలికగా తీసుకోలేం. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితే మీరు అరెస్టు అవుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని జైళ్లో పెడతారు. అంతే కదా. దిశకు ఇలా జరిగిందంటే.. మనం కూడా ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని అర్థమవుతోంది. ఏదేమైనా, అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పిన దిశకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా. దిశకు జీవ హింస ఇష్టం ఉండదు. గోవులను వధిస్తే తను తట్టుకోలేదు. అంతేకాదు, వాటి నుంచి పాలు సేకరిస్తూ, ఓ వస్తువులా భావించడం వంటి అంశాలకు తను వ్యతిరేకం. అందుకే మొక్కల ఉత్పత్తుల ద్వారానే ఇలాంటి అవసరాలు తీరే ఉద్దేశంతో నెలకొల్పిన కంపెనీలో తను పనిచేస్తోంది. దయచేసి యువత ఉద్దేశం ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఇదొక్కటే. దిశ లాంటి వాళ్లను అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. తనతో ఒక్కసారి మాట్లాడి చూడండి. తనేమీ ఎక్కడికి పారిపోవడం లేదు కదా. తను అలాంటి పిరికి మనస్తత్వం కలది కాదు. ఆలోచించండి’’ అని విన్సెంట్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. దిశ అరెస్టును ఆయన ఈ సందర్భంగా ఖండించారు. చదవండి: టూల్‌కిట్ కేసు : కీలక విషయాలు వెల్లడి -
టూల్‌కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : టూల్‌కిట్ వ్యవహారంలో ముగ్గురు యువతుల అరెస్ట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. అరెస్ట్‌ల ప్రక్రియను షూరు చేశారు. తొలుత ఓ యువతిని అరెస్ట్ చేయగా.. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యవరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్‌కిట్‌తో ఈ ముగ్గురు యువతులు (దిశరవి, శాంతాను, నికితా జాకబ్) ఎడిట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బెంగళూరుకు చెందిన యువ యాక్టివిస్ట్ దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. 24 గంటలు గడవకముందే శాంతాను, నికితాలపై ఢిల్లీ హైకోర్టు నాన్‌బెయిల్‌వారెట్ జారీచేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు నికితను అరెస్ట్ చేయగా.. శాంతాను పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అరెస్ట్ నుంచి నాలుగు వారాల పాటు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ నికితా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన ఘటనలో ఈ ముగ్గురు యువతుల పాత్రపై ఢిల్లీ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా వివరాలు తెలిపారు. ‘జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనతో దిశరవి, శాంతాను, నికితా జాకబ్‌కు ప్రత్యక్షంగా సంబంధముందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. స్వీడన్ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ తయారుచేసిన టూల్‌కిట్‌ను తొలుత దిశరవి ఎడిట్ చేశారు. అనంతరం శాంతాను, నికితా దీనిలో భాగస్వామ్యం అయ్యారు. కెనడాకు చెందిన చెందిన ఓ యువతి అందించిన సలహాలు, సూచనల ఆధారంగా సోషల్ మీడియాలో ఆ టూల్‌కిట్‌ను షేర్ చేశారు. టూల్‌కిట్‌ను టెలిగ్రామ్ ద్వారా గ్రెటా వీరికి షేర్ చేశారు. టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు. అంతేకాకుండా జనవరి 11న వీరంతా జూమ్ యాప్‌ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతాం. మరికొన్న విషయాల కోసం విచారణ జరుపుతున్నాం’ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్‌పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. టూల్‌కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు -
టూల్‌కిట్ వివాదం: నికితాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
సాక్షి,న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్‌తో రాజుకున్న టూల్ కిట్ వివాదం మరింత ముదురుతోంది. 'టూల్‌కిట్ కేసు'లో దిశా రవిని అరెస్టు చేసిన ఢిలీ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ముంబై హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్, శాంతనులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం స్పెషల్ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లినపుడు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఆ రోజు సమయాభావం వల్ల నికితను ప్రశ్నించలేదు. మళ్లీ వస్తామని చెప్పామనీ, అప్పటినుంచి నికిత పరారీలో ఉందని ఆరోపిస్తూ వారెంట్ ఇష్యూ చేశారు. నికితా జాకబ్, దిశా రవి ఇతరులు పాల్గొన్న ఒక జూమ్ సమావేశంలో రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, నిరసన కారుల్లో ఆందోళనన పెంచేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశా రవి అరెస్ట్‌ను ఖండించారు. ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే థన్‌బర్గ్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఆదివారం అరెస్ట్ చేశారు. దేశద్రోహ కుట్ర కేసు నమోదు చేసి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బెంగళూరు ఐటీ సిటీకి చెందిన దిశా రవి రైతు ఆందోళనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేశానని దిశా పోలీసు విచారణలో వెల్లడించారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరారని వివరణ ఇచ్చారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో కీలక వ్యక్తిగా దిశ ఉన్నారు. దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసింది. ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా గ్రెటా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు) చదవండి : రైతు ఉద్యమం : వారికి భారీ ఊరట Arrest of 21 yr old Disha Ravi is an unprecedented attack on Democracy. Supporting our farmers is not a crime. — Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021 -
ఢిల్లీ పోలీసుల అదుపులో దిశ
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవి (22)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ‘టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్‌ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు’అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డాక్యుమెంట్లో ట్విట్టర్లో తీవ్ర ప్రచారోద్యమం సహా రైతు సంఘాలకు మద్దతుగా చేపట్టాల్సిన వివిధ చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యకార్యాలయాల వద్ద నిరసనలు వంటివి ఉన్నాయి. దేశంలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చేందుకు ఆమె కుట్ర పన్నిందనే ఆరోపణలకు అసలైన సాక్ష్యం ఆ టూల్‌కిట్‌నేనని అంటున్నారు. ఆమె ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు. దిశను ఢిల్లీ పోలీసులు బెంగళూరులోని నివాసంలో ఉండగా శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. టూల్‌కిట్‌ను ఈ నెల 3వ తేదీన దిశ ఎడిట్ చేశారనీ, ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో దిశ కన్నీరు పెట్టుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్ చేశానని ఆమె తెలిపారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరినట్లు కూడా వెల్లడించారు. మేజిస్ట్రేట్ దేవ్ సరోహా ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్‌కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో టూల్‌కిట్ రూపకర్తల సమాచారం అందించాలంటూ గూగుల్, ట్విట్టర్లను కోరారు. ఆ రెండు సంస్థలు ఇచ్చిన వివరాల మేరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన అలజడులను సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఈనెల 4వ తేదీన ఖలిస్తాన్ అనుకూల పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, దిశా రవి ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’అనే క్యాంపెయిన్‌కు సహ వ్యవస్థాపకురాలు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసి ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్ పనిచేస్తున్నారు. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో దిశా నివాసం ఉంటున్నారు. కాగా, దిశ అరెస్టును సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
గ్రెటా టూల్‌కిట్: బెంగళూరు యువతి అరెస్ట్
సాక్షి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రిపబ్లిక్ డే హింసాత్మక ఘటనలో పోలీసులు మరో ముందడుగు వేశారు. గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చెలరేగిన హింసకు సంబంధించి బెంగుళూరుకు చెందిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో హింస చెలరేగే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 21 ఏళ్ల దిశరవి అనే పర్యవరణ ఉద్యమకారినిని ఆదివారం అరెస్ట్ చేశారు. స్వీడన్‌కు చెందిన పర్యవరణ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న దీక్షలకు గ్రేటా మద్దతు తెలపడం, ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ దేశంలో పెను ప్రకంపనలు రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు గ్రేటా షేర్ చేసిన టూల్‌కిట్ ఖలికిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తయారు చేసినట్లు ఉందంటూ ఢిల్లీ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రైతు దీక్షలకు మద్దతు తెలుపుతూ.. దేశ అంతరిక వ్యవహారాల్లో తలదూర్చారని ఆరోపిస్తూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే గ్రెటా టూల్‌కిట్‌తో సంబంధముందని భావిస్తున్న బెంగళూరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యవరణ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆమెపై ఢిల్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
నాటి రాళ్లు నేటి పూలు.. మన్నించు మారియా!
ఆరేళ్ల క్రితం.. ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని టెన్నిస్ తార మారియా షరపోవా అన్నందుకు ఆగ్రహించిన సచిన్ అభిమానులు ఇప్పుడు ఆ షరపోవాకే.. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు నీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని ఆమె ఫేస్బుక్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఆమెకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విదేశీ ప్రముఖుల్ని హెచ్చరిస్తూ.. ‘ఇది మా సొంత విషయం’ అని సచిన్ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా రైతు ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు తమ మెడకు ఉరి వంటివి కనుక వాటిని రద్దు చేయాలని రైతుల డిమాండ్. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎన్ని విడతలుగా చర్చలు జరిగినా ఒక ఫలవంతమైన ముగింపు రావడం లేదు. ఈలోపు వివిధ కారణాల వల్ల కనీసం 170 మంది ఉద్యమ రైతులు మరణించారని వస్తున్న వార్తలతో ప్రపంచం నలుమూలల నుంచి రైతుల డిమాండ్‌కు ట్వీట్ల ద్వారా మద్దతు లభిస్తోంది. స్వీడన్ నుంచి పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, బార్బడోస్ పాప్ గాయని రిహాన్నా వంటివారు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. విదేశీ సానుభూతి పరులకు వ్యతిరేకం గా పెట్టిన ట్వీట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది. ‘భారత్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీకి రానవసరం లేదు. బయటి శక్తులు వీక్షకులుగా ఉండొచ్చు కానీ, భాగస్వాములు కాదగరు’ అని థన్‌బర్గ్, రిహాన్నాలను ఉద్దేశించే సచిన్ ఆ ట్వీట్ పెట్టారు. ∙∙ నిప్పు జ్వాల గాలి దిశను బట్టి వ్యాíపిస్తుంది. ఆగ్రహ జ్వాల ఎటువైపు అధాటున మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. సచిన్‌ను ‘క్రికెట్ దేవుడు’ అని ఆరాధించిన ఆయన అభిమానులు.. రైతులకు మద్దతు ఇస్తున్న విదేశీయుల్ని సచిన్ ‘హద్దుల్లో ఉండండి’ అని అర్థం వచ్చేలా హెచ్చరించినందుకు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన నేరుగా లేదు. పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఉన్నప్పటికీ శక్తిమంతంగా ఉంది. రష్యన్ టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ‘సచిన్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నందుకు ఆగ్రహోదగ్రులైన భారతీయులు, ముఖ్యంగా మలయాళీలు షరపోవా ఫేస్బుక్ వాల్‌పై కూర్చొని ఆనాడు ఆమెను అనరాని మాటలు అన్నారు. చాలావరకు అవి భారతీయ భాషల్లో ఉన్నాయి కనుకు షరపోవాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇంగ్లిష్‌లో ఉన్న కామెంట్స్నైనా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఇప్పుడు అదే సచిన్ అభిమానులు.. అదే షరపోవా ఫేస్ బుక్ వాల్ మీదకు వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు మీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకరైతే.. ‘మారియా, ఇండియా రండి. నా రెస్టారెంట్లో మీ కోసం ప్రత్యేకంగా షవర్మా, కుళిమంతీ (బిర్యానీ) చేయించి పెడతాను’ అని ఆమెను ఆహ్వానించారు. నాడు మారియాపై పడిన రాళ్లే, ఇప్పుడు పూలుగా మారుతున్నాయి. ‘డియర్ మారియా, వి ఆర్ సారీ. సచిన్‌కి సపోర్ట్ చేస్తూ ఆనాడు మీపై సైబర్ అటాక్ చేసినందుకు బాధపడుతున్నాం’ అని ఒకరు; ‘మారియా, ఆరోజు నాకు పరిణతి లోపించింది. సచిన్ తెలియదు అన్నందుకు నిన్ను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించు’ అని ఇంకొకరు పోస్టు పెట్టారు. ఒక మహిళ అయితే.. ‘సారీ సిస్టర్, యువర్స్ ట్రూలీ’ అంటూ షరపోవాకు లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ప్రేమ జ్వాల అంతకంతకూ పెరిగిపోయి, సచిన్ ఉండే ముంబై మీదుగా రైతులు పోరాడుతున్న ఢిల్లీ వరకు వ్యాపించేలా మారియాపై పూల వర్షం కురుస్తోంది. ఆ పూల వానను రైతుల పోరాటానికి ఆశీస్సులనే అనుకోవాలి. రిహాన్నా, గ్రెటా థన్‌బర్గ్ -
గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు నమోదు!
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో పోరాటం కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్లు చేసిన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్‌ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ గ్రెట్గా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని స్పష్టం చేస్తూ మరో ట్వీట్ చేశారు. బెదిరింపులు, కేసులు తన వైఖరిని మార్చలేవని తేల్చిచెప్పారు. భారత్‌లో రైతన్నల ఆందోళనలు, నిరసనలపై రెండు రోజుల క్రితం థన్‌బర్గ్ చేసిన ట్వీట్లు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. ఆమెను తప్పుపడుతూ భారత్‌లో పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదంటూ హితవు పలికారు. థన్‌బర్గ్ ట్వీట్లు వివాదాస్పదం కావడంతో ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు వీటిపై దర్యాప్తు ప్రారంభించారు. థన్‌బర్గ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. ‘థన్‌బర్గ్‌కు సాహస బాలిక అవార్డివ్వాలి’ గ్రెటా థన్‌బర్గ్‌కు భారత ప్రభుత్వం సాహస బాలిక పురస్కారం ప్రదానం చేయాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ గురువారం పేర్కొన్నారు. దేశాన్ని అస్తిరపర్చేందుకు జరుగుతున్న కుట్రకు సంబంధించిన పత్రాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు గ్రెటా థన్‌బర్గ్‌కు ఈ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు పేరిట భారతదేశాన్ని అస్తిరపర్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యానికి విదేశీ సర్టిఫికెట్ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కేనని అన్నారు. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. విదేశీ శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. విదేశీ శక్తులకు పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఆమోదించిన చట్టం విషయంలో విదేశీయుల జోక్యం ఏమిటని బీజేపీ నేత అమిత్ మాలవియా ప్రశ్నించారు. -
రైతులకు మద్దతు : గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు పలికిన ప్రముఖ స్వీడిష్ యువ పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్ (18)పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 120-బీ, 153-ఏ సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనంటూ ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ ట్వీట్లు చేసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతదేశంలో రైతు ఉద్యమంపై స్పందించిన గ్రెటా భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఒక కథనాన్ని కూడా షేర్ చేశారు. ఆ తర్వాత గూగుల్ డాక్యుమెంట్ ఫైల్‌ను షేర్ చేస్తూ చేసిన మరో ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ‘టూల్‌కిట్’ సహాయం చేయాలనుకునే వారి కోసం అని రాశారు. దీంతో భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే కార్యాచరణ ప్రణాళికను వివరించే లింక్ ఈ ఫైల్లో ఉందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. గ్రెటా తర్వాత పాత పోస్ట్‌ను తొలగించి, అప్డేట్ చేసిన ట్వీట్ షేర్ చేసింది.కానీ, అప్పటికే చాలామంది ఆ నోట్‌ను డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులకే తన మద్దతు అంటూ ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన కొద్ది నిమిషాల తరువాత గ్రెటా మరోసారి నొక్కి వక్కాణించారు. ద్వేషం, బెదిరింపులు, మానహక్కుల ఉల్లంఘనలు ఇవేవీ తనను మార్చలేవంటూ ట్వీట్ చేశారు I still #StandWithFarmers and support their peaceful protest. No amount of hate, threats or violations of human rights will ever change that. #FarmersProtest — Greta Thunberg (@GretaThunberg) February 4, 2021 మరోవైపు గ్రెటా, రిహన్నాకు సపోర్ట్‌గా నిలిచిన బాలీవుడ్ నటులు, క్రికెటర్లపై సినీ నటి కంగన రనౌత్ విరుచుకుపడుతోంది. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న వారు రైతులు కాదు, వారు ఉగ్రవాదులంటూ నోరు పారేసుకుంది. అలాగే ఇండియాను అస్థిరపరిచేందుకు జరుగుతున్న అంతర్జాతీయ రహస్య పత్రాన్ని షేర్ చేసి గ్రెటా అతిపెద్ద తప్పు చేసింది..పప్పూ టీంలో అందరూ జోకర్లే...అంటూ విమర్శించింది. అటు రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన తాప్సీపై కూడా ‘బీ’గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. -
రైతుల కోసం రిహన్నా.. ఫూల్ అన్న కంగనా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవం నాడు ఉద్యమం ఉద్రిక్తతంగా మారి హింస చేలరేగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతునిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా చేరారు. ట్విట్టర్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న రిహన్నా.. అన్నదాతలు చేస్తోన్న ఉద్యమంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్లో రైతుల ఉద్యమానికి సంబంధించని ఓ న్యూస్ ఆర్టికల్ క్లిప్‌ని షేర్ చేస్తూ.. మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు రిహన్నా. ఇక ఈ పేపర్ క్లిప్ సీఎన్‌ఎన్‌ది కాగా.. దీనిలో గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు రైతు ఉద్యమం ఉద్రిక్తంగా మారడం.. హింస చేలరేగడంతో ఢిల్లీ చుట్టుపక్కల ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని తెలిపే కథనానికి సంబంధించింది. అలానే మయన్మార్‌లో ఆర్మీ దురగతాలను కూడా ప్రశ్నించారు రిహన్నా. (చదవండి: 6న దేశవ్యాప్త చక్కా జామ్) why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S — Rihanna (@rihanna) February 2, 2021 ఇక రిహన్నా ట్వీట్‌కు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రిప్లై ఇచ్చారు. ‘‘దీని గురించి ఎవరు మాట్లాడటంలేదు ఎందుకంటే వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు. వీరు దేశాన్ని విభజిస్తే.. చైనా దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా లాంటి ఓ కాలనీని తయారు చేయాలని ఎదురు చూస్తోంది. నోర్మూసుకుని కూర్చో ఫూల్.. మీలాంటి డమ్మీలకు మా దేశాన్ని అమ్మం’’ అంటూ కంగనా ఘాటుగా రిప్లై ఇచ్చారు. No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA... Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a — Kangana Ranaut (@KanganaTeam) February 2, 2021 ఇక రైతుల ఉద్యమానికి యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ మద్దతు తెలిపారు. భారతదేశంలోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నాము అంటూ ట్వీట్ చేశారు. ఇక అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ కూడా రైతులకు మద్దతు తెలిపారు. -
నోబెల్ అవార్డు నామినేషన్లలో ట్రంప్ పేరు!
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి అవార్డు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో బహుకరించే ఈ శాంతి పురస్కారం రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోబెల్ అవార్డు నామినేషన్లో ట్రంప్ పేరు వినిపించడం ఆసక్తిని రేపుతోంది. ఆయనతో పాటు ఈ అవార్డు నామినేషన్లో స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక, పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్, రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లు కూడా ఉన్నాయి. కాగా బాల పర్యావరణ వేత్తగా గ్రెటా పలు కార్యక్రమాలు చేపుడుతున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ... అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగించడమే గాక పర్యావరణ అంశాలపై ధైర్యంగా ఆమె గళం విప్పుతోంది. చిన్న వయసులోనే పర్యావరణంపై ఆమెకు ఉన్న అవగాహన, ఇతరులను కూడా పర్యావరణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులకు అందుకుంది. (చదవండి: అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్..?) అలాగే రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా రష్యాలో శాంతియుత ప్రజాస్వాయ్యం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవల విషయ ప్రయోగం కూడా జరిగింది. దీంతో అయిదు నెలల పాటు ఆయన జర్మనీలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరిగి రష్యా వచ్చిన నావల్నీని అరెస్టు చేయడంతో రష్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే వీరితో పాటు ఈసారి నామినేషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండటం విశేషం. అంతేగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రామ్ కూడా ఈ అవార్టు నామినీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోబెల్ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. (చదవండి: గ్రెటా థంబర్గ్ : లక్ష డాలర్ల భారీ విరాళం) -
ట్రంప్‌కు దిమ్మదిరిగే పంచ్!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి స్వీడిష్ యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. గతంలో ఒకసారి చిల్ ట్రంప్ చిల్ అంటూ ట్రంప్‌పై కౌంటర్ ఎటాక్ చేసిన గ్రెటా తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్‌కు గట్టి కౌంటర్) లాస్ట్ పంచ్ నాదైయితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుగా లాస్ట్ పంచ్‌తో అదరగొట్టేశారు గ్రెటా. ట్రంప్‌పై తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆయనపదవీ విరమణ సమయాన్ని కరెక్టుగా వాడుకున్నారు. గ్రెటా ట్వీట్‌ను పరిశీలించినవారు ఎవరైనా ఇదే ఫీల్ అవుతారు. తన ట్వీట్లో గ్రెటా ఏమన్నారంటే.. 'ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న సంతోషవంతమైన వృద్దుడిలా ట్రంప్ కనిపిస్తున్నారు. ఇలా చూడటం చాలా బాగుంది.' అంటూ గ్రెటా థన్ బర్గ్ ట్వీట్ చేశారు. దీనికి ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడుతున్న ఫోటోను షేర్ చేయడం విశేషం కాగా గత ఏడాది సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించిన గ్రెట్ ప్రపంచ పర్యావరణ అంశాన్ని ప్రపంచాధినేతలు నిర్లక్క్ష్యం చేస్తున్నారని నిర్భయంగా వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదంటూ అగ్రనేతలకు ఆమె చురకలంటించారు. అయితే దీనిపై స్పందించిన అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ 'ఆమె ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చాలా సంతోషవంతమైన యువతిలా ఉంది. చూడటానికి చాలా బాగుంది.' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు 'టైమ్' మేగజీన్ 2019 సంవత్సరానికి గాను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా గ్రెటా పేరును ప్రకటించినప్పుడు చిల్ గ్రెటా చిల్!' అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా చిల్ చిల్ డొనాల్డ్ అంటూ గట్టి చురకలే అంటించిన సంగతి తెలిసిందే. కానీ తాజా పరిణామంలో ఆసక్తికర విషయం ఏమిటంటే ట్విటర్ ట్రంప్‌ను శాశ్వతంగా ఇప్పటికే నిషేధించింది.. సో.. లాస్ట్ పంచ్ కిక్ గ్రెటాదే కదా! He seems like a very happy old man looking forward to a bright and wonderful future. So nice to see! pic.twitter.com/G8gObLhsz9 — Greta Thunberg (@GretaThunberg) January 20, 2021 -
‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్‌కు గట్టి కౌంటర్
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాకిస్తూ.. డెమొక్రాట్ జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో స్వీడిష్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ (17) ప్రతీకారం తీర్చుకున్నారు. గతంలో తనను అపహాస్యం చేసిన ట్రంప్‌కు సోషల్‌మీడియాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. 'చిల్, డోనాల్డ్, చిల్' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ అవకాశం కోసం గ్రెటా 11 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. (పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే) తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగులుతున్న సమయం చూసి ట్రంప్‌పై ఆమె సెటైర్లు వేశారు. ముఖ్యంగా ఓటమిని అంగీకరించలేక "స్టాప్ ది కౌంట్!" అంటూ కుపితుడైపోతున్న ట్రంప్‌ను ఆమె ట్రోల్ చేశారు. "చాలా హాస్యాస్పదం. డొనాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్ సమస్యపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ థన్‌బర్గ్ గురువారం ట్వీట్ చేశారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రంప్‌ను భారీగా ట్రోల్ చేస్తున్ననెటిజన్లు గ్రెటా ట్వీట్‌తో మరింత హంగామా చేస్తున్నారు. వ్యంగ్య కామెంట్లతో హల్ చల్ చేస్తున్నారు. లక్షల కొద్దీ 'లైక్'లు, వేలాది రీట్వీట్లతో సందడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పర్యావరణ హితం కోసం విశేష కృషి చేస్తున్న గ్రేటా థన్‌బర్గ్‌ను 2019లో టైమ్ మ్యాగజైన్ ఇయర్ ఆఫ్ ది పర్సన్ పేరుతో సత్కరించింది. ఈ సందర్బంగా చిల్ గ్రెటా అంటూ గ్రెటాను ట్రంప్ ఎగతాళి చేశారు. "చాలా హాస్యాస్పదం గ్రెటా తన యాంగర్ మేనేజ్మెంట్పై పని చేయాలి, ఆపై స్నేహితుడితో మంచి పాత ఫ్యాషన్ చిత్రానికి వెళ్లండి!! " అంటూ ట్వీట్ చేశారు. దీంతో మనసునొచ్చుకున్న గ్రెటా మంచి సమయం కోసం వేచి చూసి గట్టి కౌంటర్ ఇచ్చిందన్నమాట. కాగా తాజా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA — Greta Thunberg (@GretaThunberg) November 5, 2020 Greta held onto this for 11 MONTHS and dropped an absolute precision missile strike. pic.twitter.com/0MxnWSNKZ3 — Jim Harper (@NewsroomJim) November 6, 2020 -
జేఈఈ, నీట్‌లపై గళమెత్తిన గ్రెటా థన్‌బెర్గ్
కరోనా కరాళ నృత్యం చేస్తుంటే విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ జేఈఈ, నీట్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం మాత్రం పరీక్షలకు పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ 1-6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) జరగనున్నట్లు వెల్లడించింది. మరోవైపు వచ్చే నెల 13న నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్–2020) పరీక్ష జరుగుతుండగా, కరోనా అనుమానితులకు ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్ గదులు ) తాజాగా స్వీడిష్ యువ కెరటం, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ విద్యార్థుల తరపున గళమెత్తారు. కరోనా కాలంలో భారత విద్యార్థులను జాతీయ పరీక్షలకు హాజరు కావాల్సిందేనని చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికే అక్కడ లక్షలాది మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. కాబట్టి జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కాగా ఇప్పటికే విద్యార్థులను కరోనా భయం వెంటాడుతుంటే, మరోవైపు అస్సాం, బిహార్, గుజరాత్, చత్తీస్ఘడ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కూడా కష్టమేనన్నది ప్రతిపక్షాల వాదన. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలోనే పరీక్షలు నిర్వహించి తీరుతామని కేంద్రం తేల్చి చెప్పడం గమనార్హం. (చదవండి: జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు) -
గ్రెటా థంబర్గ్ : లక్ష డాలర్ల భారీ విరాళం
స్టాక్‌హోం: కరోనాపై పోరుకు ప్రముఖ స్వీడిష్ యువకెరటం, పర్యావరణ వేత్త గ్రెటా థంబర్గ్ లక్షడాలర్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. డానిష్ ఫౌండేషన్ నుంచి గెలుచుకున్న ఈ మొత్తాన్ని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) కు ఇస్తున్నట్లు గురువారం పేర్కొంది. కరోనా సంక్షోభం పిల్లలపై పెను ప్రభావం చూపిస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది దీని భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. వాతావరణ సంక్షోభం లానే ఈ కరోనా పిల్లలపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్న 17 ఏళ్ల గ్రెటా..పిల్లల విద్య, ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ తమ వంతుగా సహాయం చేయాలని కోరింది. గ్రెటా విరాళంపై స్పందించిన యూనిసెఫ్.. లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి వాటికి కొరత రాకుండా నిధులు సమకూర్చడానికి ఇది ఎంతో సహాయపడతాయని పేర్కొంది. ఇక వాతావరణ మార్పులపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న గ్రెటా ఇటీవలె యూరప్‌లో పర్యటించారు. కరోనా లక్షణాలు బయటపడటంతో ఇంట్లోనే సెల్ప్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా: ‘స్వీడన్లో ఆ వెసులుబాటు లేదు’ ) -
కరోనా సోకలేదు.. కానీ.. : గ్రెటా థంబర్గ్
స్టాక్‌హోం: కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని స్వీడిష్ యువకెరటం, పర్యావరణ వేత్త గ్రెటా థంబర్గ్ తెలిపారు. వాతావరణ మార్పుపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న గ్రెటా.. వివిధ దేశాల్లో పర్యటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల మధ్య యూరప్‌లో పర్యటించారు. ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తనతో పాటు ప్రయాణించిన తన తండ్రిలో వైరస్ లక్షణాలు వృద్ధి చెందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. యువతలో కరోనా లక్షణాలు అంత త్వరగా బయటపడవని.. కాబట్టి వారు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించి మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎదుటివారిని ప్రమాదంలో పడేయవద్దని సూచించారు. (చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?) ఆ వెసులుబాటు లేదు ‘‘గత రెండు వారాలుగా నేను ఇంట్లోనే ఉన్నాను. మధ్య యూరప్‌లో పర్యటించిన తర్వాత స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. నాతో పాటు నాన్న కూడా ప్రయాణించారు. మేమిద్దరం అమ్మా, సోదరికి దూరంగా వేరే అపార్టుమెంటు తీసుకుని బస చేస్తున్నాం. పది రోజుల క్రితం నాలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గొంతు నొప్పి వస్తోంది. జలుబు చేసింది. అయితే నాన్న పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. తీవ్రమైన జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడేంత వరకు స్వయంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు స్వీడన్లో లేదు. చాలా మంది తమకు అనారోగ్యంగా ఉందని చెబుతున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు. నేనింత వరకు కరోనా పరీక్ష చేయించుకోలేదు. కానీ నాలో లక్షణాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. మీ కారణంగా ఎవరికీ ఇబ్బంది రానీయకండి’’అని గ్రెటా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది. (ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?) -
ఆ దేశాలు తప్ప.. మిగిలినవన్నీ..
గ్రెటా థన్‌బర్గ్.. ఈ పేరు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. స్పీడన్ దేశానికి చెందిన ఈ బాలిక.. ‘‘మీ అవసరాల కోసం మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీకెంత ధైర్యం’’ అంటూ ప్రపంచ దేశాలను ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రశ్నించింది. అభివృద్ది పేరుతో విచ్చలవిడిగా కార్భన్ ఉద్గారాలను విడుదల చేస్తూ పోతున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటని నిలదీసింది. కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పులు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న వేళ.. ఇందుకు సంబంధించిన తాజా నివేదిక.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ప్రపంచంలోని చాలా సంపన్న దేశాలు భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ తమ తాజా నివేదికలో తెలిపాయి. గ్లోబల్ వార్మింగ్, కర్భన ఉద్గారాలు భావితరాల ఆరోగ్యంపై, అభివృద్దిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలోని ఏ దేశం కూడా పిల్లల అభివృద్ధి, భవిష్యత్తు, సమానత్వం విషయంలో సత్ఫలితాలను సాధించలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది లాంసెట్ జర్నల్, యునిసెఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక కమిషన్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం నార్వే, సౌత్ కొరియా, నెదర్లాండ్‌లో పిల్లలకు ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం లభిస్తున్నాయని వెల్లడించింది. అధిక పరిమాణంలో ఉద్గారాలను వెదజల్లుతున్న అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉన్నాయని పేర్కొంది. కమిషన్ సభ్యులు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలకు ఆరోగ్యం, విద్య, రక్షణ కల్పించడమే కాకుండా వారికి సురక్షిత భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రపంచ దేశాలపై ఉందని పేర్కొన్నారు. గత ఐదు శతాబ్దాలుగా బాలల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని.. అయితే అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగాయని తెలిపారు. మరోవైపు భూగోళం వేడెక్కడం, పర్యావరణానికి హాని కలిగించడం భవిష్యత్ తరాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని నివేదికలో తెలిపారు. పర్యావరణ క్షీణత పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుపై అత్యంత ప్రభావం చూపుతుందని కమిషన్ సభ్యులు సునీత నారయణ్ పేర్కొన్నారు. చేయని తప్పునకు వారు బలికాబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగాయని తెలిపారు. ఆఫ్రికాలోని రెండు దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాలు పిల్లల ఆరోగ్యం, విద్య విషయంలో వెనుకబడి ఉన్నాయని రిపోర్టులో తెలిపారు. -
నేను నేనే
లిసీప్రియా కంగుజం వయసు 8 ఏళ్లు. వాతావరణ కాలుష్యం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకుంది. ఆ వయసుకు కంకణం అనేది పెద్ద మాటే కానీ.. లిసీప్రియా మాటల్ని వింటే అది చాలా చిన్నమాటగా అనిపిస్తుంది. లిసీ మణిపూర్ అమ్మాయి. గ్రెటా థన్‌బర్గ్‌లా ఈ భూగోళాన్ని కాలుష్యం నుంచి కాపాడే ఉద్యమాన్ని చేతుల్లోకి ప్లకార్డులా తీసుకుంది. దాంతో మీడియా ఆమెను ‘గ్రెటా థన్‌బర్గ్ ఆఫ్ ఇండియా’ అని కీర్తిస్తోంది. ఇదే నచ్చడం లేదు లిసీకి! నాకో పేరు లేదా? నాకో వ్యక్తిత్వం లేదా? నాకో గుర్తింపు లేదా? అని మీడియాపై కోపగించుకుంటోంది ఆ చిన్నారి. ‘‘స్వీడన్ అమ్మాయి గ్రెటా 2019లో మాత్రమే క్లెయిమేట్ ఉద్యమం చేపట్టింది. నేను అంతకంటే ముందరే 2018 జూలై నుంచీ మన ప్రధానికి, దేశాధినేతలకు లేఖలు రాస్తున్నాను. కనుక ఇక నుంచీ నన్ను ‘గ్రెటా ఆఫ్ ఇండియా’ అని పిలవకండి’’అని ట్వీట్ పెట్టింది. ‘‘మా ఇద్దరి లక్ష్యాలూ ఒకటే అయినా నేను నేనే’’ అని కూడా అంది! చూస్తుంటే లిసీప్రియా గ్రెటాను మించిపోయేలా ఉంది.