Home Work
-
హోమ్‌వర్క్ ఎవరికి కష్టం?
‘పిల్లలు హోమ్‌వర్క్ చేయరు.. తల్లిదండ్రులే చేస్తారు.. ఇది తెలిసీ టీచర్లు హోమ్‌వర్క్ ఇవ్వడంలో అర్థం లేదు’ అని ఒక భారతీయ తల్లి విడుదల చేసిన వీడియో చర్చ లేవదీసింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే జపాన్ తల్లిదండ్రులు వారంలో రెండున్నర గంటలే పిల్లల హోమ్‌వర్క్‌కు కేటాయిస్తుంటే భారతీయులు వారానికి 12 గంటలు కేటాయిస్తున్నారు. కొందరు ఇది భారం అంటున్నా పిల్లలకు హోమ్‌వర్క్ లేకపోతే కలత పడే తల్లిదండ్రులే మన దగ్గర ఎక్కువ. హోమ్‌వర్క్ మంచి–చెడు...‘పిల్లలు హోమ్‌వర్క్ చేయరనీ తల్లిదండ్రులే దానిని పూర్తి చేస్తారని టీచర్లకు తెలుసు. అయినా సరే వారు హాలిడే హోమ్‌వర్క్ ఇస్తారు. పిల్లలు హాలిడే ఎంజాయ్ చేస్తుంటే తల్లిదండ్రులు మాత్రం గంపెడు హోమ్‌వర్క్‌ను ముందేసుకుని కూచోవాల్సి వస్తోంది. ఇక మీదటైనా పిల్లలు సొంతగా ఎంత హోమ్‌వర్క్ చేయగలరో అంతే ఇవ్వండి’ అని ఒక తల్లి చేసిన వీడియో ఇన్‌స్టాలో జూన్ 30న విడుదలైంది. ఈ వీడియోకు చాలామంది స్పందిస్తున్నారు.‘ఎనిమిదవ తరగతి వచ్చే వరకు పిల్లలకు హోమ్‌వర్క్ ఇవ్వరాదు’ అని ఒకరంటే ‘అవును. టీచర్లు మరీ అన్యాయంగా ఉన్నారు. రెండో తరగతి చదువుతున్న మా అబ్బాయిని మానవ శరీరంలోని భాగాలను గీసుకు రమ్మని చె΄్పారు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘నేను వేసవి సెలవుల్లో మా అమ్మాయి హోమ్‌వర్క్‌ను పూర్తి చేయడమే సరిపోయింది’ అని మరొక తల్లి అంది. ‘ఇది మరీ విడ్డూరం. తల్లిదండ్రులకు పిల్లలతో సమయం గడిపే వీలు ఉండటం లేదు. వారితో సమయం గడిపే వీలు హోమ్‌వర్క్ ఇస్తుంది. పిల్లలతో కూచుని సరదాగా ఎంజాయ్ చేస్తూ చదివించాలి. హోమ్‌వర్క్ చేయించాలి’ అని మరొక తల్లి అంది.మన దేశంలోనే..హోమ్‌వర్క్ ఇవ్వడం, తల్లిదండ్రులు పిల్లలతో కూచుని సాయం పట్టడం ప్రతి దేశంలో ఉంది. అయితే మనంత మాత్రం లేదు. హోమ్‌వర్క్‌కు తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తున్నారని 29 దేశాల్లో అధ్యయనం చేస్తే చిట్టచివరి స్థానంలో జపాన్ రెండున్నర గంటలతో నిలిస్తే భారత్ మొదటిస్థానంలో 12 గంటలతో నిలిచింది.అమెరికాలో ఆరు గంటలు, చైనాలో ఏడు గంటలు, ఫ్రాన్స్‌లో నాలుగు గంటలు తల్లిదండ్రులు వెచ్చిస్తున్నారు. అయితే అన్నీ దేశాల్లోని తల్లిదండ్రులు ప్రభుత్వ/ఉచిత బడులలో అందే విద్య మీద విశ్వాసం కనపరచలేదు. అంటే డబ్బు కట్టి చదివించడం, మళ్లీ స్కూల్లో చెప్పే చదువు మీద నమ్మకం లేక తామే చదివించడం, అందుకు హోమ్‌వర్క్‌ను ఒక మార్గంగా ఎంచుకోవడం అన్నీ దేశాల్లో ఉన్నా మన దేశంలో అత్యధికంగా ఉంది.బండెడు హోమ్‌వర్క్..పిల్లలకు ఎంత ఎక్కువ హోమ్‌వర్క్ ఇస్తే అది అంతమంచి స్కూల్ అనే అభి్రపాయం చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చాక ఆడుకుంటూ ఉంటే వారు సమయం వృ«థా చేస్తున్నారని, హోమ్‌వర్క్ చేస్తూ ఉంటే కనుక బుద్ధిమంతులని అనుకోవడం దాదాపు అందరు తల్లిదండ్రుల్లో ఉంది. ‘మన దేశంలో చదువు ద్వారా వచ్చే ఉద్యోగాల గురించే తల్లిదండ్రుల బెంగ. అందుకే స్కూల్లో, ఇంట్లో చదువు గురించి ఒత్తిడి తెస్తారు.దీనివల్ల పిల్లల్లో సహజంగా ఉంటే కళాభిరుచి, క్రీడాప్రతిభ, ఇతర టాలెంట్లు నశించిపోతున్నాయి’ అని కొందరు నిపుణులు అంటున్నారు. ‘హోమ్‌వర్క్ అనేది క్వాలిటేటివ్‌గా ఉండాలి. ‘క్వాంటిటేటివ్గా కాదు. చదివిన పాఠాల గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడం గురించి హోమ్‌వర్క్ ఉండాలి కాని గుడ్డిగా సమయం వెచ్చించేలా ఉండకూడదు’ అని నిపుణులు అంటున్నారు.ఏది... ఎంత?హోమ్‌వర్క్‌లు పిల్లలకు అధికమైనా దానివల్ల తల్లిదండ్రుల సమయం అవసరానికి మించి ఇవ్వాల్సి వచ్చినా ఆ తీరును నిరోధించాల్సిందే. హోమ్‌వర్క్‌లు బడిలో చదివింది మరింత బాగా అర్థం చేయించేలా ఉండాలి... అలాగే తల్లిదండ్రుల ధోరణి ఆ పాఠాలు పిల్లలకు ఏ మాత్రం అర్థమయ్యాయో చూసి అర్థం చేయించడంలో సాయం పట్టేలా ఉండాలి. ఇక ్రపాజెక్ట్ వర్క్ లాంటివి పిల్లలతో పాటు తల్లిదండ్రుకూ ఆటవిడుపుగా ఉండాలి.నిజానికి కుదురు లేని పిల్లలు తల్లిదండ్రుల పక్కన సమయం చేసుకుని కూచోడానికి ఒక మంచి సాధనం హోమ్‌వర్క్. ఆ వంకతో తల్లిదండ్రులు పిల్లలతో కూచోవాలి. వారు ఎలా చదువుతున్నారు, క్లాస్‌రూముల్లో ఏం జరుగుతోంది, ఏ విషయాలకు సంతృప్తిగా ఉన్నారు... ఏ విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి, ఏ సబ్జెక్ట్‌లు వారికి ఇష్టం, కష్టంగా ఉన్నాయి... ఇవన్నీ తెలుసుకోవడానికి హోమ్‌వర్క్ సమయం సాయం చేస్తుంది.హోమ్‌వర్క్ ఒక తప్పనిసరి భారం చేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి ఇంటి నుంచి పారిపోవాలని చూసిన పిల్లలూ ఉన్నారు. అలాగే పిల్లలకు సాయం చేయడానికి సమయంలేక వారి మీద చికాకు పడి ఇంట్లో అశాంతి రేపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ పీటీఎమ్లలో టీచర్లతో చర్చిస్తూ హోమ్‌వర్క్ సమయాలను విజ్ఞాన, వినోదదాయకంగా పిల్లలతో గడిపే క్వాలిటీ సమయాలుగా మార్చుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.‘మన దేశంలో చదువు ద్వారా వచ్చే ఉద్యోగాల గురించే తల్లిదండ్రుల బెంగ. అందుకే స్కూల్లో, ఇంట్లో చదువు గురించి ఒత్తిడి తెస్తారు. దీనివల్ల పిల్లల్లో సహజంగా ఉంటే కళాభిరుచి, క్రీడాప్రతిభ, ఇతర టాలెంట్లు నశించిపోతున్నాయి’ అని కొందరు నిపుణులు అంటున్నారు. -
గృహిణుల సేవలకు వెలకట్టలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇంట్లో గృహిణులు రోజంతా చేసే పనులకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణి బాధ్యతలు ఎంతో గౌరవప్రదమైనవని, డబ్బుతో వాటిని పోల్చలేమని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. 2006లో ఓ మహిళ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె నడిపే వాహనానికి బీమా చేయించలేదు. మృతురాలి భర్త, మైనర్ కుమారుడికి కలిపి రూ.2.5 లక్షలు చెల్లించాలని మోటారు వాహన క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని ఆదేశించింది. దీనిపై మృతురాలి కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. మృతురాలు ఉద్యోగిని కాదు, కేవలం గృహణి మాత్రమే. పరిహారాన్ని ఆమె జీవిత కాలాన్ని, నామమాత్రపు ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తారు’అని పేర్కొంటూ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు నిరాకరిస్తూ 2017లో తీర్పు చెప్పింది. దీనిపై బాధితులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. విచారించిన ధర్మాసనం ‘ఒక గృహిణి సేవలను రోజువారీ కూలీ కంటే తక్కువగా ఎలా నిర్ణయిస్తారు? ఈ విధానాన్ని మేం అంగీకరించడం. గృహిణి విలువను ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు’అని పేర్కొంటూ రూ.6 లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబానికి చెల్లించాలని వాహన యజమానిని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పిల్లలు హోంవర్క్ చేయకుండా మొండికేస్తున్నారా? ఇలా చేయండి
సాధారణంగా చాలామంది పిల్లలు ఆడుకోవడంలోనూ, ఫోన్లో వీడియోలు చూడటంలోనూ, వీడియో గేమ్‌లు లేదా ఆటలు ఆడుకోవడంలోనూ చూపినంత శ్రద్ధ చదువుకోవడంలో, హోంవర్క్ చేయడంలో చూపించరు. కొందరు సిసింద్రీలు మాత్రం హోం వర్క్ చేయడానికి మొండికేస్తుంటారు. అలాంటి గడుగ్గాయిలతో హోం వర్క్ చేయించడానికి తంటాలు పడలేక అదేదో మనమే చేసేస్తే పోలా... అనుకుని కొందరు పేరెంట్స్ పిల్లలకిచ్చిన హోమ్ వర్క్‌ను తామే చేసేస్తుంటారు. అయితే అది చాలా పొరపాటు. మీ చిన్నారి హోంవర్క్ చేయడానికి మొండికేస్తుంటే.. ఈ చిట్కాలు పాటించి చూడండి! పని వాతావరణాన్ని సృష్టించండి.. పిల్లల చదువులో హోంవర్క్ కీలకమైన అంశం. ఇది క్లాస్ రూమ్ అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది, అధ్యయన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, బాధ్యతను అలవాటు చేస్తుంది. అందువల్ల మీ పిల్లల హోమ్‌వర్క్‌ను మీరు చేయొద్దు. దానిబదులు వాళ్లు హోంవర్క్ చేయడానికి తగిన వాతావరణాన్ని సృష్టించండి. వారికి అవసరమైన పెన్నులు, బుక్స్, పేపర్స్, రిఫరెన్స్ మెటీరియల్స్ వంటివాటిని అందుబాటులో ఉంచండి. అప్పుడు వారే హోమ్‌వర్క్ చేయడానికి ఇష్టపడతారు. దండించ వద్దు సాధారణంగా చాలామంది పేరెంట్స్ చేసే పని.. పిల్లలు హోంవర్క్ చేయనని మొండికేస్తే తిట్టడం లేదా కొట్టడం. ఇలా చేస్తే పిల్లలు దారికి రారు సరికదా, మరింత మొండిగా తయారవుతారు కాబట్టి వారిని తిట్టి లేదా నాలుగు దెబ్బలు వేసి బలవంతానా హోం వర్క్ చేయించడానికి బదులు ప్రేమగా మాట్లాడుతూనే ఇంటి పని పూర్తి చేసేలా చూడటం చాలా మేలు చేస్తుంది. అలవాటుగా మార్చేయండి! చాలామంది పిల్లలు హోం వర్క్ అనగానే ఆడుకున్న తరవాత చేస్తాం, తిన్న తర్వాత చేస్తాం, పొద్దున్నే లేచి పూర్తి చేస్తాం.. అంటూ రకరకాల సాకులు చెబుతుంటారు. హోమ్ వర్క్‌ను వాయిదా చేయకుండా.. రోజూ ఒకే పద్ధతి ఫాలో అయ్యేలా తయారు చేయడం మంచిది. కొందరు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు, కొందరు ఆడుకున్న తర్వాత హోం వర్క్ చేయాలనుకుంటారు. మీ పిల్లలకు నచ్చిన సమయంలోనే వర్క్ చేసుకునేలా సెట్ చేయండి. రోజూ దీనినే అనుసరిస్తుంటే అదే అలవాటుగా మారిపోతుంది. తేలికవి ముందుగా... స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అవగానే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టి ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకోండి. ఆ మాటల్లోనే హోం వర్క్ ఏమిచ్చారో కనుక్కోండి. తేలిగ్గా లేదా తక్కువగా ఉన్న వర్క్‌ని ముందుగా చేసేయమని చెప్పండి. కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే పనులను మెల్లగా చేయించండి. సాయం చేయండి కానీ... మీరు చేయద్దు! పిల్లలు హోం వర్క్ చేయకపోతే రేపు బడికెళ్లగానే టీచర్లు కొడతారని కొంతమంది తల్లులే చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు హోం వర్క్ చేయడానికి ఆసక్తి చూపించరు. వాళ్లలో నేర్చుకునే శక్తి కూడా తగ్గుతుంది. వాళ్లకు సహాయం కావలిస్తే చేయాలి గానీ మీరు మాత్రం చేయవద్దు. ఏ రోజుది ఆ రోజే! హోమ్‌వర్క్ ఏమీ ఇవ్వకపోతే రీడింగ్ వర్క్ చేయించండి. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే కలిగే లాభాల గురించి తెలియజెప్పి ఎప్పటి పాఠం అప్పుడు చదువుకునేలా చేయండి. -
ఎనిమిదేళ్ల గర్విత్.. మిస్టర్ కూల్
ఫరీదాబాద్: మనం వెళ్తున్న లిఫ్ట్ హఠాత్తుగా ఆగిపోతే ఏం చేస్తాం? ఒక్కసారిగా కంగారుపడతాం. కేకలు వేస్తాం. ఎప్పుడు బయటపడతామా అని క్షణక్షణం ఎదురుచూస్తాం. లిఫ్ట్ తలుపులు తెరుచుకుని క్షేమంగా బయటకువచ్చేదాకా ఆందోళన తగ్గదు. కానీ, హరియాణాలో లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఎనిమిదేళ్ల బాలుడు గర్విత్ ఏమాత్రం టెన్షన్ పడకుండా రెండు గంటలపాటు చక్కగా హోంవర్క్ పూర్తిచేసుకున్నాడు. మిస్టర్ కూల్ అనిపించుకున్నాడు. హరియాణా రాష్ట్రం గ్రేటర్ ఫరీదాబాద్‌లోని సెక్టార్–86లో ఉన్న ఒమాక్సీ హైట్ సొసైటీ అపార్టుమెంట్ నాలుగో అంతస్తులో గర్విత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు ట్యూషన్ కోసం అదే అపార్టుమెంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు లిఫ్ట్‌లో బయలుదేరాడు. రెండో అంతస్తుకు చేరుకోగానే లిఫ్ట్ ఆగిపోయింది. కాసేపు ఎదురుచూసినా లిఫ్ట్ కదల్లేదు. ఇక చేసేదిలేక హోంవర్క్ చేసుకోవడం ప్రారంభించాడు. గర్విత్ ఇంకా రాలేదంటూ ట్యూషన్ టీచర్ అతడి తండ్రి పవన్‌కు ఫోన్ చేసింది. దాంతో ఆందోళనకు గురైన పవన్ అపార్టుమెంట్ అంతటా గాలించడం మొదలుపెట్టాడు. రెండో అంతస్తుకు చేరుకొని బిగ్గరగా పిలవడంతో గర్విత్ స్పందించాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయానని బదులిచ్చాడు. రాత్రి 7 గంటలకు ఇతరుల సాయంతో లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరవగా, గర్విత్ నవ్వుతూ బయటకువచ్చాడు. హోంవర్క్ లిఫ్ట్‌లో పూర్తి చేసుకున్నానని చెప్పాడు. పిల్లాడి ధైర్యం చూసి అపార్టుమెంట్‌వాసులు ఆశ్చర్యపోయారు. -
నోటు పుస్తకాలేవి?.. స్కూళ్లు ప్రారంభమై 20 రోజులైనా పత్తాలేని ఉచిత నోట్‌బుక్స్
వికారాబాద్ అర్బన్: సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్‌ను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తుండగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈసారి నోట్ బుక్స్ కూడా ఇస్తామని ప్రకటించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. కానీ నోట్‌బుక్స్ అందజేతలో జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫ్రీగా ఇస్తారని చెప్పడంతో చాలా మంది పేద తల్లిదండ్రులు నోట్‌బుక్స్ కొనివ్వలేదు. పదిశాతం మందికే.. స్కూళ్లు ప్రారంభమై దాదాపుగా 20 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు పది శాతం మంది విద్యార్థులకు కూడా నోట్‌బుక్స్ అందలేదు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా 1నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి మూడు వర్క్ బుక్స్ (ఒకే పుస్తకంలో టెక్ట్స్ బుక్, నోట్‌బుక్) ఇస్తామని చెప్పారు. ఈ లెక్కన జిల్లాకు 1,42,377 నోటు పుస్తకాలు రావాలి. కానీ ఇప్పటి వరకు వీటి పత్తా లేదు. 6నుంచి 10వ తరగతి విద్యార్థులు కూడా నోట్‌బుక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తరగతుల ఆధారంగా ఎన్ని నోట్‌బుక్స్ ఇవ్వాలనేది నిర్ణయించారు. అధికారుల లెక్కల ప్రకారం 6నుంచి 10వ తరగతి వరకు 4,24,374 నోట్‌బుక్స్ అవసరం. ఇప్పటి వరకు 60,700 మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం నోట్‌బుక్స్ ఇస్తుందా..? లేక ఎప్పటిలాగే మార్కెట్లో కొనుగోలు చేసి ఇవ్వాలా..? అనే విషయంలో తల్లిదండ్రులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది కొనివ్వగా వారు హోం వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ నోట్‌బుక్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వెనకబడిపోతున్నారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఈ విషయంలో మరింత ఆందోళన చెందుతున్నారు. 91,494 వేల మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 91,494 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ అధికారుల లెక్క ప్రకారం వీరికి 5.6 లక్షలకుపైగా నోట్‌బుక్స్ రావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 60,700 మాత్రమే వచ్చాయి. మొదటి విడతగా ‘మన ఊరు మనబడి’ కింద ఎంపికై న 32 పాఠశాలల్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యా దినోత్సవం రోజున నోటు పుస్తకాలు అందజేశారు. మిగిలిన స్కూళ్లలో ఎక్కడా ఇవ్వలేదు. పాఠాల బోధన వేగంగా సాగుతున్నప్పటికీ నోట్‌బుక్స్ లేకపోవడంతో హోం వర్క్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోట్‌బుక్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. రాగానే పంపిణీ చేస్తాం ఇప్పటి వరకు వచ్చిన 60వేల పైచిలుకు నోట్‌బుక్స్ పంపిణీ చేశాం. మిగతావి కూడా మరో మూడు నాలుగు రోజుల్లో రావచ్చు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇచ్చే వర్క్ బుక్స్ ప్రింటింగ్ కూడా పూర్తయినట్లు మాకు సమాచారం ఉంది. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. – రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి త్వరగా ఇవ్వాలి ప్రభుత్వం నోట్‌బుక్స్ ఉచితంగా ఇస్తుందని సార్లు చెప్పడంతో ఇప్పటి వరకు కొనుక్కోలేదు. కొందరు నోట్‌బుక్స్ తెచ్చుకున్నారు. కొనాలా వద్దా అనేది తెలుస్తలేదు. త్వరగా ఇస్తే అందరిలా నోట్స్ రాసుకోవడం, హోం వర్క్ చేసుకోడానికి వీలుంటుంది. నోట్‌బుక్స్ త్వరగా ఇవ్వాలి. – శ్రవణ్‌కుమార్, 8వ తరగతి, మదన్‌పల్లి -
Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?!
స్త్రీల ఇంటిపనికి ఎలాంటి గుర్తింపు, వేతనం ఉండదు. ఇదే విషయమై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయనం చేసింది. పేద, ధనిక దేశాలలోనూ ఈ విషయంలో అంతరాలనూ చూపించింది. గుర్తింపు లేని పని కారణంగా స్త్రీలలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు, ఇంటి పనితో పాటు ఉపాధి పొందుతున్న మహిళలపై పడుతున్న అధిక భారం గురించి కూడా చేసిన ఈ అధ్యయనం అన్నివర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది. ఇంటి పనులు, బాధ్యతలను సమతుల్యం చేయడం మహిళల నైతిక బాధ్యతగా అంతటా వాడుకలో ఉన్నదే. దీని వల్ల కలుగుతున్న నష్టాలనూ, భాగస్వామ్యంతో ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా ఈ సంస్థ తెలిపింది. తేలిక భావన మహిళకు ఉదయం లేస్తూనే ఒక సాధారణ రోజుగా ప్రారంభమవుతుంది. ఊడవడం, తుడవడం, కడగడం, కుటుంబ సభ్యులకు భోజనం సిద్ధం చేయడం... ఈ రొటీన్ పనులన్నీ వీటిలో ఉండవచ్చు. వీటన్నింటి మధ్య వారు తమ భర్త లేదా పిల్లలు లేదా పెద్దలైన కుటుంబ సభ్యుల అవసరాలను చూస్తుంటారు. ఇక బయట ఉద్యోగం చేసే మహిళలైతే, ఇంటి పనులు పూర్తిచేయడంతో పాటు తమను తాము సిద్ధంగా ఉండటానికి సమయం కేటాయించాలి. ఆఫీస్ లోకి వచ్చాక ఆఫీస్ వర్క్ తో ముడిపడి ఉండాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లినప్పుడు గృహిణులు ఊపిరి పీల్చుకోవడం లేదు. చేయాల్సింది చాలా ఉంటుంది. ఇంటి పనులను చూసుకోవడం, చేయడం మహిళలు మాత్రమే చేయదగినపనిగా పరిగణించబడుతోంది. దీనిని దాదాపు అందరూ స్త్రీలను తేలికగానే తీసుకుంటారు. ‘కాలక్రమేణా, వేతనంలేని శ్రమ కారణంగా పురుషుల కంటే స్త్రీలు మానసిక ఆందోళనకు గురవుతున్నార’ని హెల్త్ షాట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ మాలినీ సబా తెలియజేస్తున్నారు. డబుల్ బైండ్ ఇంటి యజమానులుగా గుర్తించే మగవారు కార్యాలయంలో పెద్దగా పనులు చేయనప్పటికీ వారు చాలా బిజీగా ఉంటారు. కానీ ఇంటిపని, పిల్లల సంరక్షణతో సహా వేతనంలేని పనికి ఉపాధి పొందుతున్న మహిళలు బాధ్యత వహిస్తారు. డాక్టర్ సబా ప్రకారం, ‘గుర్తించబడని మహిళల శ్రమ రెండు రూపాలుగా ఆమెను సవాల్ చేస్తోంది. ఒకటి ఆమె శారీరక ఆరోగ్య సంరక్షణ తగ్గుతోంది. దీంతో పాటు మానసిక భారం అధికమవుతోంది.’ అసమానతకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగ మహిళలు జీతం లేని పనికి ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపించింది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2021లో పురుషుల 59 అదనపు గంటలతో పోలిస్తే మహిళలు 173 అదనపు గంటలు చెల్లింపు లేని ఇంటిపని, పిల్లల సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ అంతరం మరింత పెరిగింది. ఈ దేశాలలో మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ గంటలు ఇల్లు, పిల్లలను చూసుకున్నారు. భారాన్ని పెంచిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి ఆఫీసు పని చేయడం చాలా మంది మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మహిళలు వంట చేయడం, శుభ్రపరచడం, పిల్లలు, పెద్దవారిని చూసుకోవడం.. వంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇంటి నుండి ఆఫీసు పని చేయడం అనేది చాలా మందికి కష్టతరమైనది. దాంతో ఎంతో సమయాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల స్త్రీలకు ఏ విధమైన వినోదం, విశ్రాంతి లేదా కోలుకోవడానికి సమయం దొరకడం లేదు. శారీరక, మానసిక వేధింపుల కథనాలలో ఒకటైన వైద్యం అందుబాటులో లేకపోవడం కూడా సమతుల్యత దెబ్బతింటుంది. మహమ్మారి సమయంలో పరిమిత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, పిల్లల సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాలను చూసుకోవడం కోసం తమ వృత్తిని విడిచిపెట్టారని నిపుణులు గుర్తించారు. ఇది ముఖ్యంగా నెలవారీ తక్కువ ఆదాయం కలిగిన తల్లులలో ఎక్కువగా ఉంది. (క్లిక్ చేయండి: తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!) న్యాయమైన వాటా పురుషులు ఇల్లు, పిల్లల పనుల్లోనూ వారి న్యాయమైన వాటాను తీసుకుంటే మహిళలపై చెల్లింపు లేని పని భారం తగ్గుతుంది. కలిసి పనులు చేసుకోవడంలోని అన్యోన్యత స్త్రీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వారి ఆదాయ వనరుల అవకాశాలను కూడా పెంచుతుంది. భావోద్వేగ ఒత్తిడి కూడా తగ్గుతుంది. పురుషులకు అనువైన ఏర్పాట్లను సాధారణం చేస్తే, పితృస్వామ్య, పెట్టుబడిదారీ డిమాండ్లను చర్చించడంలో స్త్రీలకు సమయం కలిసివస్తుంది. -
ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయిస్తా: ప్రియాంక గాంధీ
తన పిల్లలకు హోం వర్క్ చేయడం సహయపడతానని కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్పారు. తాను ఎన్నికలో ప్రచారంలో ఉన్నప్పుడూ కూడా తన పిల్లలకు హోం వర్క్ చేయడంలో సహాయం చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా జరిగిన లైవ్ చాట్ సెషన్లో ఒక నెటిజన్ మీ పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు. అంతేకాదు ప్రియాంక తన పిల్లలకు హోం వర్క్‌లో సహయం చేయడమే కాక ఆంటీ అంటూ వచ్చే తన పిల్లల స్నేహితులకు కూడా సహాయం చేస్తానని చెప్పారు. పైగా ఈ రోజు కూడా తాను తన కుమార్తె అసైన్‌మెంట్‌లో సహాయం చేశానని తెలిపింది. ఒక్కోసారి ఎన్నిఇకల ప్రచారం నుండి తిరిగి వచ్చినప్పుడూ తమ పిల్లల హోంవర్క్ పూర్తైయిందో లేదో నిర్ధారించడానికి తెల్లవారుజామున 3 లేక 4 గంటలకు కూర్చోవలసి వచ్చేదని చెప్పారు. అంతేగాక తన చిన్నతనంలో సోదరుడు రాహుల్ గాంధీతో తీవ్రంగా గొడవపడేదాన్ని అని అన్నారు. కానీ బయటివాళ్లు ఎవరైన జోక్యం చేసుకుంటే మాత్రం తాము ఒక్కటైపోయే వాళ్లం అని చెప్పుకొచ్చారు. అయితే కోవిడ్ కారణంగా రాజకీయ పార్టీలు ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో చాలా పార్టీలు ఓటర్లను కనక్ట్ అవ్వడానికి వినూత్న రీతిలో ఇలా ఆన్లైన్ ఫ్లాట్ ఫాంలను ఆశ్రయించాయి. View this post on Instagram A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra) (చదవండి: చైనా అక్రమ వంతెన: మోదీ ప్రారంభిస్తారని భయంగా ఉంది!) -
వాట్సాప్‌లో హోంవర్క్
మోర్తాడ్(బాల్కొండ): కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పాఠశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం ఇంకా తేదీని ఖరారు చేయలేదు. నెలల తరబడి పాఠశాలలు బంద్ ఉండడంతో గతంలో నేర్చుకున్న పాఠాలను విద్యార్థులు మరిచిపోకుండా ఉండడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు వినూత్న పంథాను ఎంచుకున్నారు. వాట్సాప్‌ను వేదికగా చేసుకుని తన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రోజూ హోంవర్క్ ఇచ్చి వారికి పాఠాలు జ్ఞాపకం ఉండేలా చొరవ తీసుకుంటున్నారు. ఆయనే బాల్కొండ మండలం బస్సాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బోయిడ నర్సయ్య. తమ పాఠశాలలో 110 మంది విద్యార్థులు ఉండగా వారి తల్లితండ్రుల వాట్సాప్ నంబర్లను సేకరించారు. వాట్సాప్ నంబర్లతో తరగతుల వారీగా గ్రూపులను ఏర్పాటు చేసి విద్యార్థులకు రోజూ హోం వర్క్‌ను ఇస్తున్నారు. సోమవారం తెలుగు, మంగళవారం ఇంగ్లిష్ బుధవారం గణితం, గురువారం సైన్స్, శుక్రవారం సాంఘిక శాస్త్రం, శనివారం డ్రాయింగ్ హోంవర్క్‌లను విద్యార్థులకు ఇస్తున్నారు. వాట్సాప్‌లలో హోంవర్క్ ఇచ్చిన తరువాత మరుసటి రోజున ఆ హోంవర్క్ కాపీలను మళ్లీ వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయిస్తున్నారు. అలా రోజువారీగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి మార్కులు వేస్తున్నారు. ఆన్లైన్లో పాఠాలను చెప్పవద్దని ప్రభుత్వం చెబుతుందని అయితే విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలను మరిచిపోకుండా ఉండడానికి సామాజిక మాద్యామాల ద్వారా హోంవర్క్ చేయిస్తున్నానని నర్సయ్య వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించడంతో ఇప్పటి వరకు విద్యార్థులు పాఠాలను జ్ఞాపకం ఉంచుకున్నారని నర్సయ్య వివరించారు. తమ చిన్నారుల చదువుపై ఉపాధ్యాయుడు నర్సయ్య చూపిన శ్రద్ధ ఎంతో బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. విద్యార్థులు పాఠాలను మరిచిపోవడం లేదు ఏప్రిల్ నుంచి రోజు హోంవర్క్‌ను వాట్సాప్‌లో సంబంధిత స్కూల్ ఉపాధ్యాయుడు పోస్టు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మేము మా చిన్నారులతో హోంవర్క్‌ను రాయి స్తున్నా. దీంతో పాఠాలను ఎవరూ మరచిపోకుండా ఉన్నారు. ఉపాధ్యాయుల చొరవ మరువలేనిది. – గజ్జెల భాస్కర్, ఎస్ఎంసీ చైర్మన్ విద్యార్థులకు మేలు జరిగింది లాక్డౌన్ వల్ల బడులు ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఉపాధ్యాయుడు నర్సయ్య తీసుకున్న చొరవతో విద్యార్థులకు మేలు జరిగింది. ఉపాధ్యాయుడు నర్సయ్యకు కృతజ్ఞతలు. – భోగ లతాశ్రీ, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ -
హోంవర్క్ చేయలేదని 450 గుంజీలు
థానె: హోంవర్క్ చేయలేదని 450 గుంజీలు తీయమని విద్యార్థిని ఆదేశించిన టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానె జిల్లాలోని మీరా రోడ్డు ఏరియా శాంతినగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక థానె జిల్లా పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఆమె తన ట్యూషన్ టీచర్ ఇచ్చిన హోంవర్క్‌ను పూర్తి చేయలేకపోయింది. దీంతో టీచర్ ఆ విద్యార్థినిని ఏకంగా 450 గుంజీలు తీయమని ఆదేశించింది. బాలిక సరిగ్గా నడవలేకపోతుండటంతో పాటుగా రెండు కాళ్లు వాచిపోయి ఉండటాన్ని తల్లి గుర్తించింది. దీంతో ఆమె తల్లి పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం టీచర్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోహెల్ పఠాన్ తెలిపారు. -
హోంవర్క్ చేయలేదని
మీర్‌పేట: హోంవర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థి చేతిపై ఐరన్ స్కేల్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ డీఎన్ఆర్ కాలనీకి చెందిన రమావత్ హత్తిరాం, అనిత దంపతుల కుమారులు మీర్‌పేటలోని సత్యం కిడ్స్ ప్లే స్కూలో చదువుతున్నారు. చిన్న కుమారుడు సాయితేజ(8) 3వ తరగతి చదువుతున్నాడు. గత నెల 31న పాఠశాలకు వెళ్లిన సాయితేజను సైన్స్ టీచర్ సుజాత హోంవర్క్ చేయలేదని ఐరన్ స్కేల్‌తో చేతివేళ్లపై కొట్టడంతో వాపు వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారి ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సాయితేజను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు వేళ్లు విరిగినట్లు తెలిపారు. టీచర్ సుజాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హత్తిరాం బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలి.. చిన్నారి సాయితేజపై క్రూరంగా వ్యవహరించిన టీచర్ సుజాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్ చేశారు. టీచర్‌ను అరెస్ట్ చేయాలని మీర్‌పేట సీఐని కోరారు. సత్యం కిడ్స్ ప్లే స్కూల్‌కు గుర్తింపు లేదని, వెంటనే పాఠశాలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వైరలవుతోన్న ఓ తండ్రి వెరైటీ ఆలోచన
-
కూతురు హోం వర్క్ కోసం కుక్కకు ట్రైనింగ్
బీజింగ్ : పిల్లలతో హోం వర్క్ చేయించడం తల్లిదండ్రులకు ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క చోట కుదురుగా కూర్చుని.. బుద్ధిగా హోం వర్క్ పూర్తి చేస్తే.. ఆ రోజుకు గండం గడిచినట్లే. కానీ మన చిచ్చరపిడుగులు అలా చేయరు కదా. హోం వర్క్ చేస్తూ.. వేరే పనిలో పడటం.. ఫోన్ చూస్తూ గడపటం వంటివి చేస్తారు. ఇక వారి గోల తట్టుకోలేక ట్యూషన్లకి పంపిస్తుంటారు. కానీ చైనాకు చెందిన ఓ తండ్రి మాత్రం కూతురుతో హోం వర్క్ చేయించే బాధ్యతను ఓ నయా ట్యూటర్‌కి అప్పగించాడు. ఆ ట్యూటర్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఆ ట్యూటర్ ఓ కుక్క కాబట్టి. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. జూ లియాంగ్ అనే వ్యక్తి తన కూతురి చేత హోం వర్క్ చేపించే బాధ్యతను పెంపుడు కుక్కకు అప్పగించాడు. ఇందుకోసం దానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. దాంతో జూ కుమార్తె హోం వర్క్ చేసుకునేటప్పుడు.. ఆ కుక్క ఆమెకు ఎదురుగా నిల్చుని పర్యవేక్షిస్తుంటుంది. ఒక వేళ ఆ అమ్మాయి గనక హోం వర్క్ పూర్తి చేయకుండా మధ్యలో ఫోన్‌తో ఆడటంలాంటివి చేస్తే.. మాత్రం ఊరుకోదు. తన యజమానురాలు హోం వర్క్ పూర్తి చేసిందని భావిస్తేనే.. ఫోన్‌ని టచ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ విషయం గురించి జూ లియాంగ్ మాట్లాడుతూ.. ‘తొలుత ఈ కుక్కకు పిల్లి నుంచి ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనే అంశంపై ట్రైనింగ్ ఇచ్చాను. ఈ క్రమంలో ఓ రోజు నా కుమార్తె హోంవర్క్ పూర్తి చేయకుండా గోల చేయడం చూశాను. దాంతో నా కూతురి చేత హోం వర్క్ చేపించే బాధ్యత నా కుక్కకు ఇవ్వాలనుకున్నాను. అందుకు అనుగుణంగా నా పెంపుడు కుక్కను ట్రైన్ చేశాను. ఇప్పుడది నా కూతురు హోం వర్క్ చేసేటప్పుడు.. తన ఎదురుగా నిల్చుని గమనిస్తుంది. ఒక వేళ నా కూతురు హోం వర్క్ మధ్యలో వదిలేసి ఫోన్‌తో ఆడాలని చూస్తే.. వెంటనే మొరుగుతూ తనను భయపెట్టడానికి ట్రై చేస్తుంద’ని వెల్లడించారు. ఈ విషయం గురించి జూ కూతురు మాట్లాడుతూ.. ‘నా కుక్కతో కలిసి హోం వర్క్ చేయడం చాలా బాగుంది. ఇంతకు ముందు హోం వర్క్ చేయాలంటే చాలా బోర్‌గా ఫీలయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నేను చాలా శ్రద్ధగా హోం వర్క్ పూర్తి చేస్తున్నాను’ అని తెలిపింది. వీడియో: (వైరలవుతోన్న ఓ తండ్రి వెరైటీ ఆలోచన) -
‘హోమ్‌వర్క్ చాలా ఉంది.. హెల్ప్ చేస్తారా’
అమెరికా అత్యవసర విభాగం 911లో పనిచేస్తున్న ఆంటోనియా బండీ రోజులాగే ఇండియానాలో తన విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి ఒక చిన్నారి గొంతు. ‘నా మాటలు మీకు వినిపిస్తున్నాయా’ అంటూ ఓ పిల్లాడు చాలా బాధగా ప్రశ్నించాడు. పాపం ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందేమో అని భావించిన ఆంటోనియా ‘ఆ వినిపిస్తున్నాయి.. చెప్పు’ అని అడిగింది. అప్పుడు ఆ చిన్నారి ఈ రోజు నిజంగా ‘నాకు చాలా చెడ్డ రోజు స్కూల్లో ఏం సరిగా జరగలేదు’ అన్నాడు. దాంతో మరింత ఆందోళన చెందింది ఆంటోనియా. ‘నువ్వు ఇంత బాధపడే సంఘటన ఏం జరిగింది స్కూల్లో చెప్పు’ అని అడిగింది. అప్పుడు ఆ పిల్లాడు ‘ఈ రోజు స్కూల్లో నాకు టన్నుల కొద్ది హోం వర్క్ ఇచ్చారు. నిజంగానే ఇది చాలా బ్యాడ్ డే’ అన్నాడు. ఈ మాటలు వినడంతోనే ప్రమాదం ఏం లేదని ఊపిరి పీల్చుకుంది ఆంటోనియా. వెంటనే ‘మరి నేను నీకు ఏం సాయం చేయాల’ని ప్రశ్నించింది. అప్పుడు ఆ పిల్లాడు ‘నేను లెక్కల్లో చాలా పూర్. ఒక ప్రాబ్లంను సాల్వ్ చేయలేకపోతున్నాను. సాయం చేస్తారా’ అని అడిగాడు. ఆ ప్లేస్‌లో మరొకరు ఉంటే ఆ పిల్లాడిని నాలుగు మాటలు తిట్టి ఫోన్ కట్ చేసేవారు. కానీ ఆంటోనియా అలా చేయలేదు. కాల్ కట్ చేసి సరాసరి ఆ కుర్రాడి ఇంటికి వెళ్లింది. ఆమెను చూసి సంతోషించిన ఆ కుర్రాడు ‘నాకు 3/4 + 1/4 = ఎంతో తెలియడం లేదు’ అని చెప్పాడు. వెంటనే ఆంటోనియా అతనికి అర్థమయ్యేలా వివరించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. హోం వర్క్ పూర్తయ్యాక ఆ పిల్లాడు.. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టింనందుకు క్షమించండి’ అని కోరాడు. అందుకు ఆంటోనియా పర్వాలేదు.. ‘మేం ఉన్నది మీకు సాయం చేయడానికే. కానీ ఇక మీదట ఇలాంటి సమస్య వస్తే.. మీ టీచర్ని లేదా మీ తల్లిదండ్రులను అడుగు’ అని చెప్పి వెళ్లిపోయింది. ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆంటోనియా చేసిన పనిని అభినందిస్తున్నారు నెటిజన్లు. Our dispatchers never know what the next call might be.They train for many emergency situations, homework help is not one they plan for. We don't recommend 911 for homework help but this dispatcher helped a young boy out and brightened his day.@PoliceOne @apbweb @wlfi @WTHRcom pic.twitter.com/w3qCYfJP7O — LafayetteINPolice (@LafayetteINPD) January 25, 2019 -
విద్యార్థిని చితకబాదిన ప్రైవేట్ టీచర్
అనంతపురం న్యూసిటీ: హోంవర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ప్రైవేట్ టీచర్ చితకబాదిన ఘటన గురువారం సాయంత్రం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాయినగర్‌లోని కేశవరెడ్డి స్కూల్లో హరిచరణ్ నాల్గో తరగతి చదువుతున్నాడు. హోంవర్క్ చేయలేదని టీచర్ జిగిని హరిచరణ్‌పై చేయి చేసుకుంది. ఈ క్రమంలో హరిచరణ్ చేతిలో పెన్సిల్ ఉంది. కిందకు పడ్డ విద్యార్థి చేతిలోకి పెన్సిల్ దూసుకెళ్లింది. దీంతో పెన్సిల్ ముక్కలు చేతిలోకి వెళ్లాయి. తీవ్ర రక్తస్రావంతో విద్యార్థి విలవిల్లాడిపోయాడు. పాఠశాల నిర్వాహకులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసి పెన్సిల్ ముక్కలను తొల గించారు. శుక్రవారం ఉదయం విద్యార్థి కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత టీచర్ జిగినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల నుంచి టీచరు తొలిగింపు విద్యార్థి హరిచరణ్‌ను చితకబాదిన ఘటనపై విచారణ చేపట్టేందుకు అనంతపురం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి దేవరాజు శుక్రవారం కేశవరెడ్డి స్కూలుకు వెళ్లారు. డిప్యూటీ డీఈఓ ఆదేశాల మేరకు టీచరు జిగినిని విధుల నుంచి తప్పిస్తూ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై స్కూల్‌కు ఉప విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
నో బ్యాగ్.. నో హోంవర్క్
గుంటూరు ఎడ్యుకేషన్: బుడి బుడి అడుగులు వేసుకుంటూ పాఠశాలకు వెళ్లే చిన్నారులకు పుస్తకాల బ్యాగుల భారం తొలగనుంది. ఉదయాన్నే పుస్తకాల బ్యాగులను భుజానికెత్తుకుని, పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వీపులు ఒంగిపోయే రీతిలో అవే బ్యాగులను మోసుకురావాల్సిన అవసరం ఇకపై ఉండదు. మోయలేని భారంగా మారిన బ్యాగులు, ఇంటికి వెళ్లాక సైతం వదలని హోంవర్క్ భారం నుంచి చిన్నారులకు ఉపశమనం కలిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేప«థ్యంలో జిల్లాలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలల్లో వీటిని అమలు చేయాల్సి ఉంది. ఒకటి, రెండు తరగతులు చదువుతున్న చిన్నారులకు బండెడు పుస్తకాలతో నిండిన బ్యాగులు, హోం వర్క్ కారణంగా వారిలో ఎదిగే వయసులో సహజంగా బయటకు రావాల్సిన సృజనాత్మకత నైపుణ్యాలు దెబ్బతిని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో 6,7 ఏళ్ల వయసు చిన్నారులకు ఇది ఎంత మాత్రం సరైనది కాదని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు సైతం వారితో ఏకీభవించి, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీబీఎస్ఈ బోర్డును ఆదేశించింది. సీబీఎస్ఈ బోర్డు ఉత్తర్వుల ప్రకారం 1, 2వ తరగతుల చిన్నారులకు నో బ్యాగ్... నో హోం వర్క్‌ను అమలు పర్చాల్సి ఉంది.ఈ విధానంపై సీబీఎస్ఈ బోర్డు గతంలోనే మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ దేశ వ్యాప్తంగా అమలుకు నోచుకోలేదు. ర్యాంకులు, మార్కుల వేటలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ విధానానికి విరుద్ధంగా వ్యహరిస్తున్నాయి. దీంతో సీబీఎస్ఈ బోర్డు ఉత్తర్వులు అటకెక్కాయి. దీనిపై పలువురు విద్యావేత్తలు ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి వాదనలతో ఏకీభవించింది. ఒకటి, రెండో తరగతులకు అమలు సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే పూర్తిస్థాయిలో అమలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపధ్యంలో జిల్లాలోని ఆయా పాఠశాలల్లో అమలు పర్చే విధానంపై అధికార యంత్రాంగం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా జిల్లాలో సీబీఎస్ఈ బోర్డు గుర్తింపు పొందిన పాఠశాలలు 40 ఉండగా, గుంటూరు నగర పరిధిలోని కేంద్రీయ విద్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు యాజమాన్యంలో మరో 39 పాఠశాలలు ఉన్నాయి. చర్యలు చేపడతాం సీబీఎస్ఈ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో సీబీఎస్ఈ సిలబస్ నిర్వహిస్తున్న పాఠశాలలకు ఆదేశాలు జారీ చేస్తాం. సీబీఎస్ఈ బోర్డు ఉన్నతాధికారులను సంప్రదించి సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షిస్తాం. సీబీఎస్ఈ సిలబస్‌లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు ఈ విధానాన్ని విధిగా అమలు పర్చాల్సిందే. – ఆర్ఎస్ గంగాభవానీ,జిల్లా విద్యాశాఖాధికారి -
1, 2 తరగతులకు నో హోంవర్క్
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1, 2 తరగతులు చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే హోంవర్క్ బాధ తప్పనుంది. ఆ తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకుండా పాఠశాలలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ‘నో హోంవర్క్’ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం వెల్లడించారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009కు అనుగుణంగా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని, ఇది ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1, 2 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించడంతోపాటు వారికి ఎలాంటి హోంవర్క్ ఇవ్వకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీచేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు గత నెల 30న కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే ఈ తరగతుల విద్యార్థులకు భాష, గణితం తప్ప మరే ఇతర సబ్జెక్టు బోధించకుండా అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లెర్న్ విత్ ఫన్ అనే విధానాన్ని తాను విశ్వసిస్తానని ఆయన చెప్పారు. -
హోం వర్క్ రద్దు
సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ మేరకు విద్యా బోధనలు సాగిస్తున్న ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇక మీదట హోం వర్క్‌ను రద్దుచేస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలుజారీచేసింది. పుస్తక భారం మళ్లీ పెరుగుతుండడంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది.ఎన్సీఈఆర్టీ నిబంధనల్ని సీబీఎస్ఈ విద్యా సంస్థలు తప్పనిసరిగాఅమలుచేయాల్సిందేని హుకుం జారీచేసింది. సాక్షి, చెన్నై : ఇటీవల రాష్ట్రంలో సీబీఎస్ఈ విద్యా సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఇందుకు కారణం అన్నీ నీట్ మయం కావడమే. నీట్ తరహా శిక్షణ అంటూ ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల మీద భారాన్ని మోపే రీతిలో సీబీఎస్ఈ విద్యా సంస్థలు విద్యాబోధనల్ని సాగిస్తున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) నియమ నిబంధనల్ని తుంగలో తొక్కి మరీ సీబీఎస్ఈ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు బయలుదేరాయి. నిర్ణీత పుస్తకాల కంటే, ప్రైవేటు పుస్తకాలను సైతం విద్యార్థుల మీద రుద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. వివిధ పోటీ పరీక్షలు అన్నట్టుగా ప్రైవేటు పుస్తకాల ప్రభావాన్ని విద్యార్థులు మీద మోపుతుండడాన్ని చెన్నైకి చెందిన న్యాయవాది పురుషోత్తమన్ పరిగణనలోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఎస్ఈలోనూ పుస్తకాల మోత పెరిగిందని, ప్రాథమిక విద్యను అభ్యషిస్తున్న విద్యార్థులు సైతం తమ వయసుకు మించిన పుస్తకాలను మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆధారాలతో కోర్టుకు వివరించారు. విద్యార్థులు అత్యధిక బరువు మోయకూడదని, తక్కువ పుస్తకాలను, ఎంపిక చేసిన పుస్తకాలను మాత్రమే ఉపయోగించాలని ఎన్సీఈఆర్టీ నిబంధనలు పేర్కొంటున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులకు హోం వర్క్, అసైన్మెంట్ అంటూ రకరకాల భారాన్ని ఇంటివద్ద సైతం మోపుతున్నారని వివరించారు. ఆని రకాల నియమ నిబంధనల్ని తుంగలో తొక్కి మరీ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నాయని, దీనిని కట్టడి చేయాలని కోరారు. కోర్టు ఆగ్రహం ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించి, ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈలకు నోటీసులు జారీ చేసింది. ఇందుకు ఎన్సీఈఆర్టీ కార్యదర్శి హర్షకుమార్ వివరణ ఇచ్చారు. ప్రాథమిక స్థాయిలో ఒకటి, రెండు తరగతులకు హోంవర్క్ ఇవ్వకూడదన్న నిబంధన ఉందన్నారు. అలాగే, మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు వారంలో రెండు గంటలు మాత్రమే హోం వర్క్ ఇవ్వాల్సి ఉందన్నారు. పుస్తకాలు సైతం తక్కువ సంఖ్యలోనే ఉపయోగించాల్సి ఉందని, అది కూడా తాము ఎంపిక చేసిన పుస్తకాలు మాత్రమేనని వివరించారు. విద్యార్థుల మీద ఒత్తిడి, భారం ఉండ కూడదన్న నిబంధనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కార్తికేయన్ బెంచ్ ముందు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదన వినిపించారు. ఇక, సీబీఎస్ఈ వర్గాలు తమ తరఫున నిబంధనల్ని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటిని పరిశీలించి మంగళవారం న్యాయమూర్తి కృపాకరణ్ తీర్పు ఇచ్చారు. పుస్తక భారం తగ్గించాలి న్యాయమూర్తి కృపాకరణ్ తీర్పు వెలువరిస్తూ, విద్యార్థులకు పుస్తకాలు భారం అని పేర్కొంటూ, ఇందుకు తగ్గ ముసాయిదా ఒకటి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. ఈ దృష్ట్యా, పుస్తక భారం తగ్గింపు వ్యవహారంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఎంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటే, విద్యార్థులకు అంత శ్రేయస్కరం అని అభిప్రాయ పడ్డారు. సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్, ఇతర సిలబస్ అనుసరిస్తున్న వారందరికీ ఈ తీర్పు వర్తిస్తుందని పేర్కొంటూ, ఒకటి, రెండు తరగతి విద్యార్థులకు హోం వర్క్‌ను రద్దుచేస్తున్నామని ప్రకటించారు. అలాగే, ఎన్సీఈఆర్ నిబంధనల్ని తప్పనిసరిగా అనుసరించాల్సిందేని విద్యా సంస్థలకు హుకుం జారీచేశారు. ఆ నియమ నిబంధనల మేరకు ఎంపిక చేసిన పుస్తకాలను ఉపయోగించాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తీర్పు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. ఏమేరకు అమలు చేశారో నాలుగు వారాల్లోపు సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్, స్టేట్ సిలబస్(రాష్ట్ర ప్రభుత్వం) నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే, హోం వర్క్ రద్దు చేశారా? లేదా, చాప కింద నీరులా హోం వర్క్‌ను విద్యార్థులకు ఇస్తున్నారా..? అని నిఘా వేసే రీతిలో ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించాలని తీర్పు వెలువరించారు. -
హోంవర్క్ చేయలేదని..
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు.. మనిషిననే విషయాన్ని మరిచి పశువులా ప్రవర్తించాడు.. పసి పిల్లలని కూడా చూడకుండా చితకబాదాడు. హోంవర్క్ చేయలేదని కోపంతో నలుగురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు ఇష్టమొచ్చినట్లు కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ స్థానిక మహాత్మా జ్యోతాబాపూలే ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో హోంవర్క్ చేయలేదనే కారణంగా నలుగురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన ఐదు రోజుల క్రితం జరుగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. తమ పిల్లలను ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడని తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సముద్రాల గ్రామానికి చెందిన భాస్కుల ప్రేమ్, జఫర్గడ్ మండలం íహిమ్మత్‌నగర్‌కు చెందిన అనుముల సాయికిరణ్, బి.నితిన్, సందీప్ స్థానిక ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 7వతరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలలలో హిందీ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న నవీన్ ఐదు రోజుల క్రితం పిల్లల హోంవర్క్‌లను పరిశీలించాడు. ప్రేమ్, సాయికిరణ్, నితిన్, సందీప్‌లు హోంవర్కు చేయకపోవడంతో ఆగ్రహంతో వారిని పీవీసీ ప్లాస్టిక్ పైప్‌తో చేతులు, కాళ్లు, తొడలపై కొట్టాడు. దాంతో విద్యార్థుల తొడలపై తీవ్రంగా వాతలు వచ్చాయి. అయితే ఉపాధ్యాయుడికి భయపడిన విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. కాగా పిల్లలను చూసి వెళ్దామని పాఠశాలకు వచ్చిన ప్రేమ్ తల్లిదండ్రులు యాదగిరి, రేణ, సాయికిరణ్ తండ్రి అనుముల సోమయ్య విద్యార్థుల తొడలపై ఉన్న వాతలు చూసి విషయం తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు సోమవారం సెలవులో ఉన్నాడు. పాఠశాలను సందర్శించిన డీటీ విద్యార్థులను టీచర్ కొట్టిన విషయమై తల్లిదండ్రులు ఆర్డీఓ రమేష్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ రాజు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఓను ఆదేశించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి.. విచక్షణరహితంగా విద్యార్థులను పైప్‌తో చితకబాదిన ఉపాధ్యాయుడు నవీన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయమై పాఠశాల ఎస్ఓ(స్పెషల్ ఆఫీసర్) మల్లయ్యతో వారు వాగ్వాదానికి దిగారు. పిల్లలు హోంవర్క్ చేయకుంటే నోటితో బెదిరించాలని, చదువులో వెనుకబడితే పేరెంట్స్ దృష్టికి తీసుకురావాలన్నారు. కానీ అలా కాకుండా పిల్లలను కొట్టే హక్కు అతడికి ఎవరు ఇచ్చారని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటాం విద్యార్థులను దండించవద్దని, నోటితో బెదిరించాలని ఉపాధ్యాయులకు పదేపదే సూచిస్తుంటా. ఏడో తరగతి విద్యార్థులను హిందీ ఉపాధ్యాయుడు నవీన్ దండించిన విషయం ఆదివారం తెలిసింది. ఈ విషయమై అతడిని ఫోన్లో మందలించాను. బంధువుల వివాహం ఉందని సోమవారం అతడు సెలవు పెట్టాడన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై తగిన చర్యలు తీసుకుంటా. – మల్లయ్య, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ -
అందరూ సూసైడ్ నోట్ రాయండి!
లండన్: సాధారణంగా స్కూల్లో పిల్లలకు టీచర్లు హోంవర్క్ ఇవ్వడం సహజం. కానీ లండన్‌లో ఓ ఇంగ్లీష్ టీచర్ అత్యుత్యాహం చూపించారు. తరగతి గదిలో విద్యార్థులకు ఓ వింత హోంవర్క్ ఇచ్చాడు. సుమారుగా 60మందికి సూసైడ్ నోట్ రాయాలని సూచిస్తూ హోంవర్క్ ఇచ్చాడు. దీంతో విస్తుపోయిన విద్యార్థులు ఏమీ చేయాలో దిక్కుతోచక తల్లిదండ్లులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలముందు నిరసనకు దిగారు. లండన్, కిడ్బ్రూక్ లోని థామస్ తాలీస్ అనే పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తమకు ఇష్టమైన వారితో బాగా ఆనందంగా గడిపిన సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ, షేక్స్ఫియర్ రాసిన నవల్లో ఆత్మహత్య చేసుకున్న మాక్బెత్ పాత్ర తరహాలో సూసైడ్ నోట్ రాయమని ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇది పిల్లలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనాలోచిత హోంవర్క్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓ విద్యార్థి తల్లి మాట్లాడుతూ తన కూతురు ఇది వరకు ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని, ఇప్పుడు ఇలా చేస్తే వారిపై ఈ సంఘటనలు ప్రభావం చూపిస్తాయని వాపోయారు. అయినా విద్యార్థులతో సూసైడ్ నోట్ రాయమని ఎలా చెప్తారని ప్రశ్నించారు. దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. ఇలాంటి పరిస్థితులు పురావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది. -
వారిది ‘హోం వర్క్’... మనది ‘నో వర్క్’
సాక్షి క్రీడావిభాగం : ప్రత్యర్థిని చితక్కొట్టడమే తెలిసిన జట్టుకు ప్రత్యర్థి చేతిలో చిత్తవడం కొత్తగా అనిపిస్తోంది. వందల పరుగుల ఆధిక్యం అందుకోవడం, ఆ తర్వాత స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను పట్టేయడం అలవాటుగా మార్చుకున్న టీమ్ అదే వలలో పడి విలవిల్లాడటం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. గింగిరాలు తిరిగే బంతిని ఎదుర్కొనేందుకు ఇక్కడికి వచ్చే ప్రతీ విదేశీ ఆటగాడు తనదైన స్థాయిలో ఎంతో కొంత సన్నద్ధమయ్యే వస్తాడు. అది ఫలితాన్నిస్తుందా లేదా తర్వాత సంగతి. కానీ స్పిన్ కోసమే తయారయ్యాను అన్నట్లుగా పుణే పిచ్ ఎదురుగా కనిపిస్తుంటే భారత బ్యాట్స్‌మెన్ ఏ రకంగా సిద్ధమయ్యారు? దిగ్గజ స్పిన్ బౌలర్ కోచ్‌గా ఉన్న జట్టు స్పిన్‌ను అసలు ఆడలేకపోవడం ఏమిటి? మన బ్యాటింగ్ ఇంతేనా...? ‘భారత్‌లో నేను ఎన్నో టర్నింగ్ ట్రాక్‌లను చూశాను. కానీ ఇలాంటి పిచ్‌ను అసలు ఎప్పుడూ చూడలేదు’... ఈ పిచ్ వల్ల రాబోతున్న ప్రమాదాన్ని రవిశాస్త్రి ముందే ఊహించినట్లున్నాడు. తొలి రెండు రోజులు బ్యాటింగ్ చేయగలిగి ఉండి ఆ తర్వాత మూడో రోజు నుంచి పిచ్‌పై స్పిన్ ప్రభావం చూపించడం, మన బౌలర్లు చెలరేగిపోవడం భారత్‌లో సాధారణం. ఈ సీజన్లోనైతే అశ్విన్, జడేజాలు ఇలాంటి పిచ్‌లపై వికెట్ల మూటలు కట్టుకున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఇదే ఫార్ములా ముందు చేతులెత్తేశాయి. కొన్నాళ్ల క్రితం నాగపూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు తరహా నాసిరకం పిచ్‌లు కాకుండా కాస్త జీవం ఉన్న వికెట్లు ఉండటంతో ఈ సీజన్లో భారత్‌పై ఎలాంటి విమర్శలు కూడా రాలేదు. అయినా సరే మరోసారి స్పిన్ పిచ్ మంత్రాన్నే జట్టు ఎంచుకుంది. క్యురేటర్‌కు బీసీసీఐ ఏదైనా సూచనలిచ్చిందా లేదా తెలీదు కానీ స్పిన్‌తోనే ఆస్ట్రేలియా పని పట్టేయవచ్చని భారత్ ఆత్మ (అతి)విశ్వాసంతో కనిపించింది. కానీ ఇదే పిచ్‌పై మన బ్యాటింగ్ గురించి మాత్రం పెద్దగా ఆలోచించినట్లు లేదు. ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చేయాలంటే కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌లో అత్యుత్తమ నైపుణ్యం ఉండాలి. రెండు ఇన్నింగ్స్‌లలోనూ మనోళ్లు అవుటైన తీరు, వారి బలహీనతను బయట పెట్టింది. టర్న్ అవుతున్న బంతిని ఎదుర్కోలేక క్లోజ్ ఇన్ ఫీల్డర్లకే అంతా క్యాచ్‌లు ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లోనైతే ఐదు ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ స్పిన్నర్‌ను స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఒక్కసారి ఎదుర్కోకపోవడం వల్ల కూడా ఈ హఠాత్ పరిణామానికి నిస్సహాయులై చూస్తుండిపోయారు. సాన్‌ట్నర్, సోధి, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఎవరిలో కూడా బంతిని పెద్దగా టర్న్ చేయగలిగే సామర్థ్యం లేదు. ఓకీఫ్ కూడా గొప్ప స్పిన్నరేమీ కాదు కానీ పిచ్ అతనికి బాగా కలిసొచ్చింది. వరుస విజయాలతో ఊపు మీద ఉండటంతో తమలో ఇంకా బయటపడని లోపాల గురించి టీమిండియా పట్టించుకోలేదు. మొదటి ఇన్నింగ్స్ వైఫల్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో కప్పిపుచ్చగలరని భావించినా, అదీ సాధ్యం కాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బ్యాటింగ్ చూస్తే పిచ్‌లో మాత్రమే సమస్య లేదని, మన ఆటగాళ్లకే చేత కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది. సన్నాహకాలతో సిద్ధంగా... నాలుగేళ్ల క్రితం 0–4తో అవమానకర రీతిలో ఓడిన సమయంలో పరాభవంతో పాటు ‘హోం వర్క్’ వివాదాన్ని కూడా వెంట తీసుకొచ్చిన ఆస్ట్రేలియా ఈసారి అసలైన ‘హోం వర్క్’తో సన్నద్ధమైంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎలాగూ స్పిన్ వికెట్ ఇవ్వరని తెలుసు కాబట్టి దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో తన సన్నాహాలు చేసింది. భారత్‌లో వికెట్లను రూపొందించేందుకు వాడే మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించిన పిచ్‌లపై ఆ జట్టు కఠోర సాధన చేసింది. సాధారణంగా స్పిన్‌లో షార్ట్‌లెగ్, సిల్లీ పాయింట్లాంటి స్థానాల్లో క్యాచ్ ఇచ్చే అవకాశం ఎక్కు వగా ఉంటుంది కాబట్టి బంతి ఏ రకంగా వచ్చినా ఆ స్థానాల్లోకి ఆడకుండా బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేశారు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా కోల్పోయిన 20 వికెట్లలో ఎవరూ క్లోజ్ ఇన్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాకపోవడం విశేషం. ఆ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్ జట్టుతో ఈ వికెట్లపై ప్రాక్టీస్ చేయించాడు. ఓకీఫ్ బౌలింగ్ మెరుగు పడటంతో అతనిదే కీలక పాత్ర. 2012లో ఇంగ్లండ్ తరఫున భారత్‌ను దెబ్బ తీసిన మాంటీ పనెసర్ కూడా ఆసీస్‌ను సిద్ధం చేయించడంలో ఆ జట్టుకు సహకరించాడు. భీకరమైన పుణే పిచ్‌పైనే ఆసీస్ చేసిన స్కోర్లు... స్మిత్, రెన్షా ఆట చూస్తే సాధారణ స్పిన్ పిచ్‌పై వారు అలవోకగా ఆడగలిగేవారేమో అనిపిస్తుంది. బెంగళూరులో ఎలా... ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం పిచ్ రూపంలోనే భారత్ ముందు పెద్ద సవాల్ నిలిచింది. పూర్తిగా స్పిన్ పిచ్ ఉంటే ఫలితం ఎలా ఉంటుందో పుణే చూపించింది. అలా అని బ్యాటింగ్ వికెట్ చేస్తే ఆసీస్‌లో కూడా మెరుగైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. పేస్ లేదా స్వింగ్‌కు అనుకూలించే విధంగా ఉంటే మన ఉమేశ్, ఇషాంత్ కంటే కచ్చితంగా స్టార్క్, హాజల్‌వుడ్ ఎక్కువ ప్రమాదకారిగా మారగలరు. సొంతగడ్డపై తొలి టెస్టు ఓడి భారత్ సిరీస్‌లో వెనుకబడిన సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి స్థితి నుంచి కోలుకొని మనోళ్లు ఎలా రాణిస్తారనేది చూడాలి. 5 సొంతగడ్డపై ఐదేళ్ల తర్వాత టెస్టుల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. చివరిసారి భారత్ 2012లో కోల్‌కతాలో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత భారత్‌కు వరుసగా 20 టెస్టుల్లో పరాజయమే లేదు. ఇందులో 17 టెస్టుల్లో గెలుపొందగా... మూడు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. 7 పుణేలో విజయానికి ముందు భారత గడ్డపై ఆస్ట్రేలియా వరుసగా ఏడు టెస్టుల్లో ఓడిపోయింది. 2 పరుగుల పరంగా (333) స్వదేశంలో భారత్‌కిది రెండో పెద్ద ఓటమి. 2004లో నాగ్‌పూర్‌లో ఆసీస్ చేతిలోనే భారత్ 342 పరుగులతో ఓడటం అతి పెద్ద ఓటమిగా ఉంది. 212 సొంతగడ్డపై రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 20 వికెట్లు కోల్పోయి భారత్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 74 స్వదేశంలో భారత్ 20 వికెట్లు కోల్పో యిన మ్యాచ్‌లో ఆడిన అతి తక్కువ ఓవర్లు. 1 కెప్టెన్‌గా భారత్‌లో కోహ్లికిది తొలి ఓటమి. 2 ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్; 13/106... 1979–80 సీజన్) తర్వాత పర్యాటక జట్టు బౌలర్లలో రెండో ఉత్తమ ప్రదర్శన (12/70) చేసిన బౌలర్ ఓకీఫ్. 24 ఆసీస్ తరఫున ఇద్దరు స్పిన్నర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 1993లో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో షేన్ వార్న్, టిమ్ మే ఐదేసి వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు. 13 స్వదేశంలో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి తక్కువ పరుగులు చేయడం కోహ్లికిదే తొలిసారి. ఇంతకుమందు కోహ్లి 2012లో ఇంగ్లండ్ చేతిలో కోల్‌కతాలో ఓడిన టెస్టులో 26 పరుగులు చేశాడు. -
తూకం తప్పుతోంది
‘‘నాన్నా...’’ రాత్రి పొద్దుపోయాక వచ్చిన ప్రసాద్‌ను ఆప్యాయంగా పలకరించింది పదేళ్ళ చిన్నారి రమ్య. ప్రసాద్ ముఖంలో జీవం లేని చిరునవ్వు! ఓపిక లేకనో ఏమో, కూతుర్ని దగ్గరకు తీసుకోను కూడా లేదు. బూట్లు, సాక్సులు విప్పేసి, అలసటగా హాలులో నుంచి తన పర్సనల్ బెడ్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. రమ్య ముఖం చిన్నబోయింది. ఆ మనసులో తెలియని బెంగ. రోజూ పొద్దున్న 6.30 కల్లా తాను స్కూలుకు వెళ్ళేటప్పుడు నిద్ర లేవని నాన్న... ఇంట్లో అమ్మ, తను నిద్రపోయాక, రాత్రి పొద్దుపోయి ఆఫీసు నుంచి వచ్చే నాన్న... ఎప్పుడూ ఆఫీసు పనిలో మునిగి తేలుతూ, ఇంటి ధ్యాస పట్టని నాన్న... అప్పటికి అయిదారురోజులుగా నాన్నను చూడలేదనే బెంగ. ఆ రోజు ఎలాగైనా చూడాలనే... అమ్మ వద్దన్నా అంతసేపు మెలకువగా ఉంది. కానీ... నాన్న... ఇలా.... బెంగుళూరులో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ప్రసాద్‌కు కూతురంటే ప్రేమే! కానీ, రోజూ ఏదో ఒక ఆఫీసు పని. ఉన్న ఓపికంతా ఆఫీసులోనే హరీ. ఇంటికొచ్చినా, ఏవో ఆఫీసు ఫోన్లు... మొబైల్, మెసేజ్‌లు... మెయిల్స్... ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య ప్రసాద్ సమతూకం పాటించలేకపోతున్నాడు. ఈ రకమైన ప్రవర్తన ప్రసాద్ కుటుంబ సభ్యులకే కాదు... చివరకు ప్రసాద్‌కే తన మీద తనకు చీకాకు అనిపిస్తోంది. ఇండియాలో పెరుగుతున్న సమస్య! ఒక్క ప్రసాదే కాదు... ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్న సమస్య – ఇంటి పని, ఆఫీసు పని మధ్య బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం! ప్రపంచం మొత్తం మీద చూస్తే, భారతదేశంలోనే వారంలో ఎక్కువ రోజులు ఉద్యోగులు పని చేస్తారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ పెరిగిపోవడంతో, ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా... ఆఫీసుకూ, ఆఫీసు పనికీ అందుబాటులో ఉన్నట్లే. అలా ఆఫీసు పనికీ, తీరిక వేళలకూ మధ్య గీత క్రమంగా చెరిగిపోతోంది. గడచిన అయిదారేళ్ళుగా ఇలా ఆఫీసు పనితో తల మునకలై, ఇంటిని అశ్రద్ధ చేస్తున్నవారి సంఖ్య మన దేశంలో గణనీయంగా పెరుగుతున్నట్లు ప్రసిద్ధ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ (ఇ.వై) సంస్థ వారి సర్వేలో తేలింది. ‘వర్క్ – లైఫ్ బ్యాలెన్స్’ గురించి భారతదేశంతో సహా ఎనిమిది దేశాల్లో ఆ సంస్థ గత ఏడాది సర్వే చేసింది. ఒకపక్క ఆఫీసు పనినీ, ఇటు కుటుంబ, వ్యక్తిగత బాధ్యతలనూ – రెండిటినీ సమతూకం చేసుకుంటూ ముందుకు సాగడం చాలా కష్టంగా మారినట్లు 30 శాతం భారతీయులు చెప్పారు. సెలవులున్నాయ్! వాడుకొనే తీరిక లేదు!! ఇటీవలి కాలంలో ‘మీ పని టైమింగ్స్ ఏమిటి?’ అని ఎవరినైనా అడిగి చూడండి. ఒక నవ్వు నవ్వేసి, ‘ఆల్వేస్ ఆన్ డ్యూటీ’ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో జరిపిన సర్వేలో తేలింది ఏమిటంటే... ఉద్యోగుల్లో సగటున సుమారు 10 శాతం మంది సెలవుల్లో కూడా రోజూ ‘ఒకటికి పది సార్లు’ ఇ–మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారట! ఆ మేరకు అందరూ పని ఒత్తిడిని అనుభవిస్తున్నారన్న మాట! అధికారికంగా మంజూరైన సెలవులు వాడుకోవడం కూడా చాలా దేశాల్లో తక్కువే. ఆస్ట్రియా, బ్రెజిల్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇచ్చిన సెలవులన్నీ వాడేసుకుంటున్నారు కానీ, మన దేశంలో మాత్రం సగటున 21 రోజుల సెలవులిస్తే, 15 రోజులే వాడుకోగలుగుతున్నారు. జపాన్‌లో అయితే, సగటున 20 రోజుల సెలవులిస్తే, 10 రోజులే వాడుకుంటున్నారు. ప్రపంచస్థాయిలో పూర్ ర్యాంక్ భారతదేశంలో దుకాణాల్లో పని చేసేవారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్నట్లు తేలింది. వ్యక్తిగత జీవితాన్ని తాకట్టుపెట్టి మరీ ఆఫీసుల్లో అధిక గంటలు పనిచేసే దుఃస్థితి. ఆమ్స్టర్డామ్కు చెందిన ఒక కన్సల్టెన్సీ సంస్థ ప్రపంచంలోని 100 ప్రధాన నగరాల్లో ఇటీవల ఒక సర్వే జరిపింది. అప్పుడు మనదేశంలోని 5 ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబయ్, ఢిల్లీలు వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌లో అతి తక్కువ ర్యాంకుల్లో ఉన్నట్లు తేలింది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతాల ర్యాంకులు 70లలో ఉంటే, ముంబయ్ 86వ ర్యాంకులో, ఢిల్లీ 87వ ర్యాంకులో నిలిచాయి. వర్క్ – లైఫ్ బ్యాలెన్స్‌ను లెక్క కట్టడం కోసం ఆ సంస్థ ప్రతి నగరంలో సగటు వార్షిక పని గంటల లెక్క తీసింది. దాన్ని బట్టి ఈ అంశంలో అగ్రశ్రేణి మూడు నగరాల్లో ఒకటిగా నిలిచిన హ్యామ్‌బర్గ్‌లో సగటున ఏటా 1,473 గంటలే పనిచేస్తారు. కానీ, భారతీయులు సగటున ఏటా 2,195 గంటలు పనిచేస్తున్నారు. ఆడాళ్ళూ... మీకు జోహార్లు! మన దేశంలో ఉద్యోగినులు అటు గృహిణిగా తమ బాధ్యతలు తగ్గకుండానే, ఇటు ఆఫీసు పనిలో ఎక్కువ గంటలు వెచ్చిస్తూ, విపరీతమైన ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తోంది. అలా వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ తప్పుతోంది. చెన్నై శివార్లలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అపర్ణ సమస్యా ఇలాంటిదే. ఒకపక్క ఏడేళ్ళ బాబు ఆలనాపాలన, మరోపక్క ఉద్యోగం. ఇంటి సంగతి పట్టకుండా ప్రైవేట్ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి సతమతమయ్యే భర్త. బాబు పుట్టాక కొద్దిరోజులు విజయవాడలోని పుట్టింటి నుంచి అమ్మానాన్న వచ్చి, ఆమెకు కొంత సాయపడ్డారు. ఆ తరువాత వాళ్ళు తప్పనిసరై విజయవాడకు వెళ్ళిపోవాల్సి రావడంతో, అపర్ణ ఇప్పుడు బాబు సంరక్షణ కోసం ఇంట్లోనే ఉండే ఆయాను పెట్టుకోవాల్సి వచ్చింది. దానికి తోడు కంపెనీకి బిజినెస్ క్లయింట్స్ ఉన్న అమెరికా లాంటి ఇతర టైమ్ జోన్లతో సమన్వయం చేసుకుంటూ, పని చేయాల్సి రావడంతో జీవితం నరకంగా మారుతోంది. ఆఫీసు పని – ఇంటి బాధ్యతల మధ్య నలిగిపోతున్న ఉద్యోగుల ఒత్తిడిని క్రమంగా సంస్థలు కూడా అర్థం చేసుకుంటున్నాయి. హిందుస్తాన్ లీవర్, ఇన్ఫోసిస్, జి.ఇ. లాంటి వివిధ రంగాల్లోని ప్రముఖ సంస్థలు పని గంటల విషయంలో వెసులుబాటు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇంటి నుంచే ఆఫీసు పని చేసే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ లాంటి అవకాశాలిస్తున్నాయి. ఆఫీసు దగ్గర చైల్డ్ కేర్ లాంటి వసతులు కల్పిస్తున్నాయి. అలాగే, బిడ్డ పుట్టినప్పుడు మగవాళ్ళకు ఇచ్చే ‘పెటర్నిటీ లీవ్’, ఆడవారికి ఇచ్చే ‘మెటర్నిటీ లీవ్’లను కూడా మునుపటి కన్నా పెంచాయి. అంతా మన చేతుల్లోనే! నిజానికి పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా... దాన్నీ, కుటుంబ బాధ్యతల్నీ బ్యాలెన్స్ చేసుకోవడం మన చేతుల్లోనే చాలా భాగం ఉందని నిపుణుల మాట. పెరిగిపోయిన సాంకేతిక, సమాచార సాధనాలు కూడా తెలియని ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇవాళ స్మార్ట్ఫోనే మాట్లాడడానికీ, మెయిల్స్‌కూ, వాట్సప్కూ – అన్నిటికీ మార్గం కావడంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు అధ్యయనవేత్తలు తేల్చారు. మొబైల్ ఫోన్లను అతిగా వాడితే తెలియకుండానే డిప్రెషన్లోకి జారిపోతామని అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ వారు జరిపిన పరిశోధనలో తేలింది. కాబట్టి, రోజూ కనీసం గంట సేపైనా ఫోన్ స్విచ్చాఫ్ చేస్తే మంచిది. అలాగే, మనకు ఇష్టమైన వ్యాపకం ఏదైనా పెట్టుకొని, పని దినాల్లోనే వారంలో ఏదో ఒక రోజున దానికి కాస్తంత టైమ్ కేటాయించాలి. ఇక, మనదేశంలో వర్కింగ్ జనాభాలో దాదాపు 26 శాతం మంది ప్రతి రోజూ గంటన్నర పైగా టైమ్ ఉద్యోగాలకు ప్రయాణం చేయడంలోనే గడిపేస్తున్నారని ఒక లెక్క. కాబట్టి, ఆఫీసుకు కాస్తంత దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకొని ఉండడం మంచిదని నిపుణుల సలహా. ఆఫీసుకు వెళ్ళి, వచ్చే ప్రయాణసమయాన్ని తగ్గించుకోగలిగితే, ఆ మిగిలిన టైమ్‌ని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు. మీతో మీరు గడపడానికీ, మీ కుటుంబంతో గడపడానికీ వీలుంటుంది. అలా మానసికంగా ఉల్లాసంగా ఉంటేనే... ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మన చుట్టూ వాతావరణం బాగుంటుంది. సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తిగత బాధ్యతలైనా, ఆఫీసు బాధ్యతలైనా సంతృప్తిగా చేయగలుగుతాం. సో... లెటజ్ ట్రై టు బి మోర్ బ్యాలెన్స్›్డ! అద్భుతమైన అరగంట టెక్నిక్ ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా సామర్థ్యం పెరగాలంటే, దానికి నిపుణులు ఒక టెక్నిక్ చెప్పారు. ప్రతి పనికీ అరగంటేసి వంతున టైమ్ కేటాయించాలి. ఏ పని మీద అయినా 25 నిమిషాల చొప్పున ఏకాగ్రతతో దృష్టి పెడితే, ఎఫెక్టివ్‌గా ఉంటుందని నిపుణుల మాట. 25 నిమిషాలు కాగానే, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. దీని వల్ల పనిచేస్తూనే, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకొని, పుంజుకున్నట్లు అవుతుంది. ఆ తరువాత చేసే అరగంట పనికి కొత్త శక్తి వస్తుంది. అయితే, మధ్యలో విరామం అయిదు నిమిషాలు మించి, పక్కవాళ్ళతో పూర్తిగా ముచ్చట్లలో పడిపోతే లాభం లేదు. టైమ్ మేనేజ్మెంట్లో ‘పొమొడోరో టెక్నిక్’గా పేర్కొనే ఈ అరగంటేసి పనుల టెక్నిక్ చాలా ఎఫెక్టివ్ అని ప్రపంచంలో చాలామంది అంగీకరించారు. దీని వల్ల పనీ అవుతుంది. పని కాలేదనే ఒత్తిడీ తగ్గుతుంది. ఇంటి పనికీ, ఆఫీసు పనికీ మధ్య బ్యాలెన్స్ కుదురుతుంది. ఇక... వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్కే! వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి – ట్రాఫిక్. ఈ మాట సశాస్త్రీయంగా నిపుణులు తేల్చిన సంగతి. మన దేశంలోని నగరాలు ఇప్పటికే జనంతో కిక్కిరిసి ఉన్నాయి. వచ్చే 2050 నాటి కల్లా ఈ నగర జనాభా మరో 30 కోట్లు పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. మన సిటీల్లో ఇప్పటికే రవాణా సౌకర్యాలు అంతంత మాత్రం. ఇంకా జనాభా పెరిగితే ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు! ఉదాహరణకు, ముంబయ్ పరిసరాల్లో ఇప్పటికే చాలామంది ఉద్యోగులు ఆఫీసుకు వెళ్ళి రావడానికే రోజూ ఎనిమిదేసి గంటలు పడుతోంది. ఇక, ‘భారతదేశపు సిలికాన్ వ్యాలీ’గా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్ ఇప్పటికే ఎంత దారుణంగా ఉందంటే, ఉద్యోగుల జీవితంలో ప్రతి రోజూ సగటున రెండేసి గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణానికే సరిపోతోంది. అంటే, ప్రతి ఉద్యోగీ ఏటా 470 గంటలు ఈ రద్దీ ప్రయాణాల్లోనే గడిపేస్తున్నారన్నమాట! ఇప్పుడిక ‘వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్’ అనే ఆప్షన్ వస్తుందని ఆ మధ్య ఒక జోక్ ప్రచారంలోకి వచ్చింది. ఆ మాటకొస్తే, ట్రాఫిక్‌లో ఇరుక్కున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు క్యాబ్‌లో కూర్చొనే ల్యాప్‌టాప్ మీద పనిచేస్తున్న సంఘటనలు ఇప్పటికే చూస్తున్నాం కదా! ట్రాఫిక్‌తో ఆఫీసు పని మొదలవడమే ఆలస్యమవుతుంటే, సాయంకాలం సుదీర్ఘంగా సాగే మీటింగ్‌లతో పని ఆలస్యం కావడం, ఇంటికి ఆలస్యంగా చేరడం షరా మామూలే! ఇలా చేస్తే... అంతా బ్యాలెన్స్! వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ కుదరాలంటే... కొన్ని మార్గాలు ఇవీ... ⇔ఇష్టమైన వ్యాపకం ఏదైనా పెట్టుకొని, దానికి కాస్తంత టైమ్ కేటాయిస్తే, మానసికంగా ఉత్సాహం వస్తుంది. అది ఇల్లు, ఆఫీసు మధ్య సమతూకానికి సాయపడుతుంది ⇔ ఉద్యోగంలో పై స్థాయికి వెళుతున్న కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి, కష్టపడి పనిచేయడంతో పాటు, సులువుగా, చులాగ్గా ఎలా పనిచేయాలన్నది నేర్చుకోవడం చాలా ముఖ్యం ⇔ ప్రతి రోజూ ఉదయం లేవగానే ఆ రోజు ఆఫీసులో, ఇంట్లో చేయాల్సిన పనులేమిటో జాబితా రాసుకోండి. వాటిలో ఏది యమ అర్జెంట్, ఏది అర్జెంట్, ఏది ముఖ్యమైనది, ఏది తాపీగా చేయవచ్చో చూసుకొని, ప్రాధాన్యాల ప్రకారం పని చేయండి. ఈ పద్ధతిని అనుసరిస్తే, ముఖ్యమైన పనులేవీ ఆగవు. అవి ఇంకా కాలేదే అన్న మానసిక ఒత్తిడి ఉండదు ⇔ వారానికి కనీసం రెండు సార్లయినా ఆఫీసుకు డ్యూటీ కన్నా ఒక అరగంట ముందే వెళ్ళండి. ప్రశాంతంగా ఆలోచించి, ఆనాటి రెగ్యులర్ వర్క్ మొదలవడాని కన్నా ముందే కీలకమైన ఇ–మెయిల్స్ వగైరా చూసి, సమాధానాలివ్వండి ⇔ ఆఫీసులో పని చేసే టైమ్‌లో దాని మీదే ఏకాగ్ర దృష్టి పెట్టండి. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకుంటూ, ఆఫీసు టైమ్‌లోనే పని మొత్తం పూర్తయ్యేలా చూసుకోవాలి. మధ్యలో ముచ్చట్లు పెట్టుకొని, డ్యూటీ టైమ్ అయిపోయాక పనిచేయడం, ఎక్కువ సేపు పనిచేస్తున్నామని ఆ తర్వాత వాపోవడం లాంటివి శుద్ధ వేస్ట్ ⇔ సెలవు రోజుల్లో ఆఫీసు మెయిల్స్, స్మార్ట్ఫోన్లలో ఛాటింగ్లకు దూరంగా ఉండాలి. దానివల్ల ఇంట్లో వాళ్ళతో క్వాలిటీ టైమ్ గడపగలుగుతాం. ఒళ్ళు బాగుంటే... ఇల్లు బాగుంటుంది! ⇔ శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లోనూ, ఆఫీసులోనూ ఉత్సాహంగా ఉంటామని గ్రహించాలి. అందుకు ప్రతిరోజూ పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. అదీ టైమ్‌కి తినాలి ⇔ రోజూ రాత్రి పూట కనీసం 7 గంటలు బాగా నిద్ర పోవాలి. గాఢమైన నిద్ర అలసిపోయిన శరీరానికీ, మనస్సుకూ మంచి టానిక్ ⇔ రోజూ వ్యాయామం చేయాలి. జిమ్‌కు వెళ్ళడం కుదరకపోతే, కనీసం వాకింగ్ అయినా చేయాలి. వాకింగ్ వల్ల మానసిక ఆందోళన స్థాయి తగ్గుతుంది ⇔ వారానికి కనీసం నాలుగు రోజులైనా, ప్రతిసారీ కనీసం ముప్పావు గంట వంతున యోగా, ధ్యానం లాంటివి చేయాలి. ప్రాణాయామం కూడా చాలా మంచిది. వీటివల్ల శారీరకంగా, మానసికంగా ఉత్తేజం కలుగుతుంది ⇔ స్ట్రెస్ మేనేజ్మెంట్లో మరో ముఖ్యమైన విషయం – మనకు బాగా ఆప్తులైన మిత్రుల్నీ, చుట్టాల్నీ కలవడం, అడపాదడపా ఫోన్లో మాట్లాడడం. అలా మీ మనసులోని భావాలు మరొకరితో పంచుకోవడం వల్ల భారం తగ్గుతుంది. అయితే, అది మరీ అతిగా ఆధారపడడంగా మారిపోకూడదు ⇔ మనకు మనం అందంగా, ఆహ్లాదంగా కనిపించడం కూడా ముఖ్యం. అందుకని, అడపాదడపా ఫేషియల్స్, మసాజ్‌ల లాంటివి చేయించుకోవాలి. ఇనుమడించిన అందంతో, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయని గమనించాలి. -
ఓవెన్ కొంటున్నారా?
సాక్షి, హైదరాబాద్ : ఈరోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఓవెన్ తప్పనిసరి అయింది. అయితే ఎలాంటి ఓవెన్ కొనాలో తెలుసుకోవాలంటే ముందుగా కొంత హోం వర్క్ చేయకతప్పదు. ♦ బేసిక్ టైప్, గ్రిల్‌తో కూడిన ఓవెన్, కన్వెన్షన్ వంటి మూడు రకాల ఓవెన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ♦ రీ హీట్ కోసమైతే బేసిక్ ఓవెన్ ఉత్తమం. బేకింగ్, గ్రిల్లింగ్ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్ విత్ గ్రిల్ కొనడం మంచిది. ♦ మెకానికల్ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువగా వాడినా.. రఫ్‌గా వినియోగించినా ఇబ్బంది ఉండదు. ♦ సింగిల్ టచ్ రోటరీ ప్యానల్ కూడా మెకానికల్ కంట్రోల్స్‌ని పోలి ఉంటుంది. కాకపోతే వాడుతున్నప్పుడు ఇది కాస్త సున్నితంగా అనిపిస్తుంది. ♦ ఎలక్ట్రానిక్ ప్యానల్ ఉన్న ఓవెన్లో విద్యుత్ స్థాయిలను కూడా సూచిస్తుంటుంది. ♦ అంధులు, కంటి చూపు సమస్య ఉన్నవారూ టాక్టైల్ కంట్రోల్ ఓవెన్లు ఎంతో సహాయపడతాయి. -
ఆటలు.. వికాసానికి బాటలు
కేరెంటింగ్ ‘‘హోమ్ వర్క్ ఎందుకు చెయ్యలేదు? చెయ్యి చాచు’’ అంటూ బెత్తంతో అవతలి వారి చేతిలో దెబ్బ వేసే బుల్లి టీచర్లనో, ఇయర్ ఫోన్లో, ఉత్తుత్తి స్టెతస్కోపో చేత పుచ్చుకుని, అవతలి వారి గుండెను పరీక్షించే చిన్నారి డాక్టర్లనో, డిష్యూం డిష్యూం అంటూ ఫైటింగ్ చేసే చిన్నారి కథానాయకుడినో చూస్తే భలే ముచ్చటేస్తుంది కదూ! అలాగే ఉత్తుత్తి గిన్నెల్లో ఉట్టుట్టి పప్పు, కూర, పులుసు, స్వీట్లు వండి, ఉట్టుట్టి కంచాల్లో కొసరి కొసరి వడ్డన చేసే చిన్నారి తల్లుల్ని చూసినా కడుపు నిండిపోతుంది. ఇంకా బస్ కండక్టర్‌లా టికెట్లు చించి ఇచ్చే ఆటను కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు. అప్పట్లో చిన్నారులే పెళ్లి పెద్దలుగా మారి, బొమ్మల పెళ్ళిళ్లు చేసేవారు. పిల్లలు ఆడుకునే ఇటువంటి ఆటలనే రోల్ ప్లేయింగ్ గేమ్స్ అంటారు. ఇలా రోల్ ప్లే గేమ్స్ ఆడుకుంటూ పెరిగే పిల్లల్లో పెద్దయ్యాక నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయని, ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల వారిలో మేధోవికాసం కనిపిస్తుందని పిల్లల మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఊహాకల్పన విద్యకన్నా, విజ్ఞానం కన్నా గొప్పది. విద్యకు, విజ్ఞానానికి ఎల్లలు ఉంటాయేమో కానీ, తలపులకు తలుపులు ఉండవు. ఊహలు రెక్కలు కట్టుకుని ప్రపంచమంతా పర్యటిస్తాయి. చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుతూ పెరిగిన పిల్లలు పెద్దయ్యాక మంచి ప్రతిభావంతులవుతారట. సమాజంలో తొందరగా కలిసిపోతారట. ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకంంటారట! సమష్టిగా చేసే పనుల్లో మంచి పాత్ర పోషించగలరట. ఇవన్నీ ఉట్టుట్టికే గొప్పకోసం చెప్పుకుంటున్న మాటలు కావు.. బాలల వ్యక్తిత్వ వికాస శిక్షకుడు, అమెరికాకు చెందిన సుప్రసిద్ధ మనస్తత్వ నిపుణుడు గ్రాన్విల్లే స్టాన్లీ హాల్ అనేక పరిశోధనల అనంతరం వెలిబుచ్చిన అభిప్రాయాలే సుమీ! రోల్ ప్లే గేమ్... సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే దొంగా పోలీసాట లేదా అమ్మా నాన్నా ఆట అని చెప్పుకోవచ్చు. డ్రాయింగ్ మాస్టర్లుగా, హీరోలుగా, విలన్లుగా... డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా.. ఇలా వారు ఆడే ఆటలను బట్టి వారిలో మానసిక వికాసం ఉంటుందట. అందుకే పెద్దవాళ్లు తమ పిల్లలు విడియోగేమ్సో, సెల్ఫోన్లో స్కోరింగ్ గేమ్సో ఆడుతుంటే చూసి మురిసిపోవద్దు. చక్కగా రోల్ ప్లే గేమ్ ఆడేందుకు ప్రోత్సహించండి. ఏ సూపర్ మార్కెట్‌కో, పోలీస్ స్టేషన్‌కో, డాక్టర్ దగ్గరకో వెళ్లినప్పుడు వారు అక్కడి వాతావరణాన్ని, మనుషులను నిశితంగా గమనించి, ఇంటికొచ్చిన తర్వాత తమ తోటిపిల్లలతో వారిలాగే ఆటలు ఆడటం మొదలు పెడతారు. అటువంటప్పుడు వారిని కసురుకోకుండా, దూరంగా ఉండి గమనిస్తూ ఉండండి. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాలి. అదేవిధంగా చిన్నారులను ఏ సూపర్ మార్కెట్‌కో, షాపింగ్ మాల్స్కో తీసుకె ళుతుంటారు కదా.. ఇంటి కి వచ్చాక వారిని అక్కడ ఏమేమి గమనించారో చెప్పమనండి. చేతికి కాగితం, కలం ఇచ్చి వారు గమనించిన వాటి జాబితా రాయమనండి. ఉత్సాహంగా ముందుకొస్తారు. ‘‘రోల్ ప్లే గేమ్స్ వల్ల పిల్లల్లో సంభాషణా చాతుర్యం పెరుగుతుంది. భాషాపరమైన అభివృద్ధి కలుగుతుంది. భిన్న సంస్కృతులకు త్వరగా అలవడతారు. అవతలివారు చెప్పే దాని మీద దృష్టి పెట్టడం నేర్చుకుంటారు. తమ భావాలను చక్కగా వ్యక్తం చేయగలుగుతారు’’ అని బాలల మనస్తత్వ శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో చెబుతున్నారు. మనం వారి మాటలను చెవిన వేసుకుందాం. మన పిల్లలను ఆ ఆటలు ఆడేలా ప్రోత్సహిద్దాం. -
'ఎంత ప్రాధేయ పడినా విడిచిపెట్టలేదు'
బీజింగ్: హోం వర్క్ చేయలేదని తన కుమారుడిని కొట్టిందని చైనాలోని ఓ కోర్టు ఓ తల్లికి జైలు శిక్ష విధించింది. ఆమె ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నాంజింగ్ పట్టణానికి చెందిన 'లీ' అనే మహిళ అనూయి ప్రావిన్స్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన బాలుడిని దత్తతకు తీసుకుంది. ఆ పిల్లాడు గ్రామంలో ఉంటే సరిగా విద్య దొరకదని ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా అతడిని బంధువైన లీకి దత్తతకు ఇచ్చారు. అయితే, గత ఏప్రిల్ నెలలో ఆమె ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు హోం వర్క్ చేయలేదని చావు దెబ్బలు కొట్టింది. తాడుతో కట్టేసి మరి కొట్టింది. దీంతో అతడి ఒళ్లంత పుండ్లమయం కావడంతోపాటు చర్మమంతా రక్తపు చారికలతో భయంకరంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేసి స్థానికుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ కేసును టేకప్ చేసిన పోలీసులు చాలా రోజులపాటు విచారణ జరిపి కోర్టులో ప్రవేశ పెట్టగా ఆమెకు కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది. ఈ శిక్ష వేసే సమయంలో ఆ అబ్బాయి అసలు తల్లిదండ్రులు, లీ, కుమారుడు ఎంత బ్రతిమాలినా కోర్టు వారి మాటలు పట్టించుకోలేదు. తనకు తన కుమారుడు అంటే ఎంతో ఇష్టమని, అతడిని క్రమ శిక్షణ పెట్టేందుకే అలా కొట్టాను తప్ప గాయపరచాలనే ఉద్దేశంతో కాదని లీ వాపోయింది. అయినా ఆమె విన్నపాన్ని తోసిపుచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. -
నేను హోం వర్కు చేస్తా.. ఆయన చేయరు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే సందర్భంలో.. ''మేం ఈ జనరేషన్, చంద్రబాబు పాత జనరేషన్. ఆయనకు తెలియని చాలా విషయాలు మాకు తెలుసు. మేం హోంవర్కు చేస్తాం.. ఆయన స్టడీ చేయరు, ఆయనకు ఓపిక లేదు'' అన్నారు. దాంతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేచి తన సహజ శైలిలో పాత విషయాలు తవ్వితీస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురద చల్లేందుకు ప్రయత్నించారు. తన మీద ఉన్న కేసుల విషయమై హోం వర్కు చేస్తారన్నారు. దానికి వెంటనే వైఎస్ జగన్ దీటుగా స్పందించారు. చంద్రబాబు ఈమధ్య ఓటుకు కోట్లు కేసు గురించి ఎక్కువగా హోం వర్కు చేస్తున్నారని ఆయన అనగానే ఒక్కసారిగా సభ మొత్తం నవ్వులతో మునిగిపోయింది.