IT Grids Scam
-
‘ఐటీగ్రిడ్ మాదిరిగా కేసు నమోదు చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను దెబ్బతీస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర వేదిక’పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచార వివరాల్ని 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందించే సమగ్ర నివేదిక ఉద్దేశాలను వెల్లడించాలని అన్నారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రజల ఫుట్‌ప్రింట్ కూడా లభిస్తుందన్న జయేశ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఐటీగ్రిడ్ మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం చోరీ చేసిందని ఐటీగ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారని అన్నారు. మరి తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కేసు పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాల్ని క్రోడీకరించి దుర్వినియోగానికి తెర తీసిందని మండిపడ్డారు. ప్రజల అనుమతి లేకుండా అధికారులు వారి వివరాల్ని క్రోడీకరించడం చట్ట విరుద్ధమన్నారు. వ్యక్తిగత సమాచారం వెల్లడవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆధార్‌ను అన్ని పథకాలకు ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టే ఆదేశించిందని, పౌరుల ఫుట్‌ప్రింట్ కూడా తమవద్ద ఉంటుందని ఐటీ కార్యదర్శి అనడం ఆందోళన కలిగిస్తోందని శ్రవణ్ చెప్పారు. గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్న గ్యారెంటీ ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ కిందకు వచ్చే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. -
‘ఐటీ గ్రిడ్స్’ నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల డేటా, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారనే ఆరోపణలున్న కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డి.అశోక్, ఆ సంస్థ డైరెక్టరైన ఆయన భార్య శ్రీలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తామని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారిద్దరూ దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారించారు. ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.25 వేల విలువైన పూచీకత్తులను ఇద్దరూ సమర్పించాలని, సంబంధిత పోలీస్స్టేషన్లలో రోజూ హాజరుకావాలని, ఏదైనా కోర్టులో పాస్‌పోర్టులు సరెండర్ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించింది. ఐటీ గ్రిడ్స్‌తో టీడీపీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను ఆ కంపెనీకి అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో గత నెల 25న రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ దరఖాస్తులను తిరస్కరించగా ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఐటీ గ్రిడ్స్ స్కాం : అశోక్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆశోక్‌ను ఆదేశించింది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ అశోక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డాటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే రంగారెడ్డి కోరక్టు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో అశోక్, అతని భార్య శ్రీ లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కేసుల రద్దు కోసం ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం , ముంబై , బెంగళూరులో అతని కోసం గాలిస్తున్నారు. -
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
ఐటీ గ్రిడ్స్ నిందితుల బెయిల్ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాకవరం అశోక్, ఆ సంస్థ డైరెక్టర్, ఆయన భార్య శ్రీలక్ష్మి హైకోర్టులో వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డామని పోలీసులు తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, తమను అరెస్ట్ చేసే అవకాశమున్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు రిట్ పిటిషన్లలో కోర్టును కోరారు. ముందస్తు బెయిల్ కోసం వారు చేసుకున్న దరఖాస్తులను రంగారెడ్డి జిల్లాకోర్టు ఈ నెల 25న తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ గ్రిడ్స్‌తో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని భావించిన వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తునకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్, శ్రీలక్ష్మి స్పందించలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
నిందితులకు షెల్టర్‌జోన్‌గా అమరావతి
సాక్షి, అమరావతి: సంచలనం రేకెత్తించిన కీలక కేసుల్లో నిందితులకు అమరావతి షెల్టర్ జోన్‌గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయి, కేసుల్లో చిక్కుకున్న నిందితులు ఆంధ్రప్రదేశ్‌లో దాగుడుమూతలు ఆడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఓటుకు నోటు కేసు, డేటా స్కామ్, టీవీ 9కు సంబంధించిన చీటింగ్ కేసు వంటి వాటిలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి పోయిన వారికి చంద్రబాబు అభయం ఇచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రమేయం ఉన్న కేసుల నుంచి, తన ప్రయోజనం కోసం పనిచేసే వారి కేసుల వరకు నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించేలా పరిణమిస్తున్నాయి. అనేక కేసుల్లో నింది తులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినట్టుగానే తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడైన సినీ నటుడు శివాజీలకు ఏపీలో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై తెలంగాణా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు శివాజీలు టీడీపీ పెద్దల సంరక్షణలో విజయవాడ, ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన వీరిని ప్రకాశం జిల్లాలోని ఒక రిసార్ట్స్‌లోను, మరో ఫామ్‌హౌస్‌లోను రెండు రోజుల క్రితం వరకు సకల సౌకర్యాలతో సాకినట్టు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సంరక్షణలోనే రవిప్రకాశ్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. శివాజీకి కూడా విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు గడువు కావాలంటూ రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించడం గమనార్హం. ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై సంతృప్తి చెందని తెలంగాణ పోలీసులు వారు ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగడం గమనార్హం. ఇప్పటికే రెండు పర్యాయాలు రవిప్రకాశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైన తరుణంలో ఆయన్ను కాపాడేందుకు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండటం విమర్శలకు తావిస్తోంది. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు చంద్రబాబు నేరుగా రామోజీరావును కలవడం కలకలం రేపుతోంది. తన రాజగురువు రామోజీరావు ద్వారా టీవీ 9 యాజమాన్యానికి చెందిన రామేశ్వర్‌కు నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ దొరకని అశోక్ ఆచూకీ.. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ అడ్డగోలుగా డేటా స్కామ్‌కు పాల్పడిన వ్యవ హారంలో ప్రధాన పాత్రధారి ఐటీ గ్రిడ్స్ ఎండీ దాకవరపు అశోక్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దల బండారం బయట పడుతుందనే భయంతో అతన్ని చంద్రబాబు సర్కారే కాపాడుతోందనే అనుమానాలున్నాయి. ఆధార్ డేటాబేస్కు ఏపీ, తెలంగాణకు ప్రజల 7,82,21,397 రికార్డులు లింక్ అయ్యాయని, ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి, ఇప్పటికే ప్రా«థమిక రిపోర్టు ఇచ్చింది. అశోక్‌ను కాపాడేందుకు ఏపీఎస్పీ 6 బెటా లియన్తోపాటు ఇతర రహస్య ప్రాంతాలకు తరలిస్తూ షెల్టర్ ఇస్తున్నట్టు సమాచారం. అశోక్ తెలంగాణ పోలీసులకు దొరక్కుండా ఏపీ సర్కార్ షెల్టర్ ఇవ్వడంతోపాటు ఇంటె లిజెన్స్‌కు చెందిన ఇద్దరు గన్మెన్లను కూడా ఇచ్చి వీఐపీ భద్రత కల్పించినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు షెల్టర్ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికేసిన చంద్రబాబు..ఆ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీకి చెందిన జెరుసలేం మత్తయ్యకు అప్పట్లో విజయవాడలో షెల్టర్ ఇచ్చారు. ఓటుకు కోట్లు కేసును రాజకీయం చేసి దాని నుంచి తప్పించుకునేలా ఏపీలోనూ చంద్రబాబు కేసులు పెట్టించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసి అది కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. గరుడ పురాణం శివాజీకి దన్ను ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీలపై అనేక కట్టుకధలు అల్లిన గరుడ పురాణం సృష్టికర్త శివాజీ కొంతకాలం పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయి ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబుకు నమ్మిన బంటులా వ్యవహరిస్తున్న సినీనటుడు శివాజీ గరుడ పురాణం స్క్రిప్ట్ అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఒక మంత్రి సహకారంతో సిద్ధం చేసినట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయపరమైన అనిశ్చితిని కల్పించేలా, ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వంపైన అభూతకల్పనలతో ఆయన చెప్పిన గరుడ పురాణం గుట్టు విప్పేలా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలన్న డిమాండ్ రావడంతో ముందు జాగ్రత్తగా ఆయన అదృశ్యమయ్యారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగబోతోందని ముందే చెప్పిన శివాజీ ఆ విషయం ఎలా గుర్తించారు? ఆయనకు టీడీపీ పెద్దలు ముందే లీకులు ఇచ్చి చెప్పించి నెపం వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశారా? అనే అనేక ప్రశ్నలకు ఆయన్ను విచారిస్తేనే జవాబులు తెలుస్తాయనే బలమైన వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కొంతకాలం, అమెరికాలో మరికొద్ది రోజులు ఆయన తలదాచుకోవడం వెనుక టీడీపీ పెద్దల దన్ను ఉందనేది బహిరంగ రహస్యం. -
ఐటిగ్రిడ్ అశోక్‌కు లోకేష్‌కు సంబంధం ఏమిటి?
-
‘ఆడపిల్లల సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉంది’
సాక్షి, హైదరాబాద్: ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉందని మండిపడ్డారు. మహిళల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్లు తదితర వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఠా దగ్గర ఉన్నాయని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్స్‌కు ప్రజల డేటా చేరిందన్నారు. చంద్రబాబు బినామీలకే పలు ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పజెప్పారని విమర్శించారు. అభయ యాప్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారని సూటిగా ప్రశ్నించారు.దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ఉపయోగించిన టెక్నాలజీకి పేరు మార్చి సీఎం డ్యాష్ బోర్డు అంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘2016లో జే సత్యనారాయణ యూఐడీఏ చైర్మన్ అయిన తర్వాత ఆధార్ డేటాను ఈ ప్రగతికి లింక్ చేశారు. సంక్షేమ పథకాల కోసం డేటాను ఈ ప్రగతికి లింక్ చేసినట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రగతి నుంచి ఆధార్ డేటాను టీడీపీ సేవామిత్ర యాప్‌కు మళ్లించారు. సేవామిత్ర యాప్‌ను ఐటీ గ్రిడ్స్ సంస్థ రూపొందించింది. డేటా చోరీ జరిగినట్టు ఫిర్యాదు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్‌పై కేసు నమోదు చేశారు. ప్రజల ఫోన్లలో ఉండే సమాచారాన్ని సేవామిత్ర యాప్‌తో ట్రాక్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, ఆయన బినామీ అశోక్‌తో ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రజల ఫోన్ స్టోరేజీ డేటా కూడా వారి వద్దకు వెళ్లిపోయింది. చంద్రబాబు, అశోక్ ద్వారా దేశానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు. మహిళలకు అభద్రతా భావం కల్పించారు. సేవామిత్ర యాప్‌తోనే టీడీపీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్‌లు అశోక్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. అశోక్ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?. టీడీపీ ప్రభుత్వం బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే తాము ఏం చేశామో చెప్పాల్సిన బాధ్యత సిట్‌పై ఉంది. టీడీపీ ప్రభుత్వ దొంగతనాన్ని దాచడానికే సిట్ వేశారా?. ఈ ప్రగతి, సీఎం డ్యాష్ బోర్డుల పేరిట టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాంకేతికతను ఉపయోగించుకోకుండా చంద్రబాబు తన బినామీలకు టెక్నాలజీ అప్డేట్ పేరిట కాంట్రాక్టులు అప్పజెప్పారు. బాలసుబ్రహ్మణ్యం సతీమణి నిర్వహిస్తున్న గ్రీన్ ఆర్గ్, ఓటీఎస్ఐ కంపెనీలకు ఆర్టీఏ వెబ్సైట్ సాంకేతిక బాధ్యతలను అప్పగించారు. రూ. 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభయ యాప్ పైలెట్ ప్రాజెక్టును తీసుకువచ్చారు. అయితే అభయ యాప్ ద్వారా ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారు?. బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖ కమిషనర్‌గా ఉండటం వల్లనే ఆ రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి.. అందులో ఏవరైతే టీడీపీకి అనుకూలంగా ఉండరో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. తమకు అనుకూలంగా లేని ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ ఆ పార్టీ వెబ్సైట్లోనే నాయకులను ఆదేశించింది. అశోక్ ఎక్కడున్నారో చంద్రబాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావులను అడగాలి. ఇటీవల అశోక్ పలువురు హ్యాకర్లతో ఢిల్లీలో సమావేశమై.. కౌంటింగ్ రోజు ఎలా హ్యాక్ చేస్తే టీడీపీ అనుకూలంగా ఫలితాలు రాబట్టవచ్చనే అంశం మాట్లాడినట్టు తెలిసింది. ఇంతా జరుగుతున్నా ఏపీ, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కౌంటింగ్ రోజున భద్రతా చర్యల గురించి ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. టీడీపీ నాయకులు శాంతి భద్రతల సమస్య సృష్టించే అవకాశం ఉందని తెలిపాం. వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు అరెస్ట్ అయినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి ఎదైయినా జరిగిందంటే దాని వెనుక టీడీపీ హస్తం ఉండే అవకాశం ఉంద’ని తెలిపారు. -
ఆపరేషన్ అశోక్ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో కీలక నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్ కోసం సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తమ డేటా కూడా చోరీ చేశారని ఆధార్ సంస్థ కూడా తాజాగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ‘సేవా మిత్ర’యాప్ కోసం దాన్ని నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆధార్ సర్వర్ నుంచే సమాచారాన్ని తస్కరించి ఉంటుందన్న అనుమానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆధార్ సమాచారం కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందని సిట్ బృందం గుర్తించింది. అశోక్ కోసం ప్రత్యేక బృందాలు.. గత ఫిబ్రవరి 27 తరువాత అశోక్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అప్పుడే ఏపీకి పారిపోయిన అతను అక్కడ ఏపీ పెద్దల సంరక్షణలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విచారణకు రావాలని పోలీసులు మూడుసార్లు నోటీసులు జారీ చేయడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో సిట్ కొన్ని ప్రత్యేక బృందాలను ఏపీకి, కర్ణాటకకు పంపింది. ఐటీ గ్రిడ్స్ సంస్థలపై దాడులు చేసినప్పుడు పోలీసులు దాదాపు 60 హార్డ్ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటిలో సమాచారం డిలీట్ చేసి ఉంది. దాదాపు 40 హార్డ్ డిస్క్‌ల నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సమాచారాన్ని రీట్రైవ్ చేయగలిగింది. తెలంగాణ, ఏపీ ప్రజల ఆధార్ వివరాలు తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తేల్చడంతో మిగిలిన డిస్క్‌ల్లో ఏముందోనన్న ఉత్కంఠ నెలకొంది. వాటిలో కీలక అంశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
డేటా దొంగలకు ఢిల్లీ లింక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు దీర్ఘకాలిక పన్నాగాన్ని పక్కాగా అమలు చేసినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని అంత పక్కాగా తస్కరించగలిగారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2015 నుంచే పన్నాగం... 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం టీడీపీ గుప్పిట్లోకి వచ్చేలా 2015లోనే చంద్రబాబు పథక రచన చేశారు. ముందస్తు వ్యూహంతోనే ఆధార్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వ ఈ–గవర్నెన్స్, ఐటీ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఇలా జోడు పదవుల్లో ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. టీడీపీ కార్యాలయానికి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. దాన్ని రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ద్వారా టీడీపీకి అనుబంధంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరవేసింది. సాధికారిక సర్వేలో సేకరించిన సమాచారాన్ని మించి ప్రజల వ్యక్తిగత వివరాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహం రచించింది. తెలంగాణ ప్రజల సమాచారం ఏపీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్న విధంగానే ఢిల్లీలోని ఆధార్ అథారిటీ నుంచి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం లభించినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా టీడీపీకి చేరవేశారు. పేర్లు, చిరునామా, బ్యాంకు ఖాతాలు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా మొత్తం వ్యక్తిగత సమాచారం అనధికారికంగా టీడీపీ కార్యాలయానికి చేరిపోయింది. సైబర్ నేరాలకు ఊతం తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు చేరడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో శాస్త్రవేత్తలు, రక్షణ పరిశోధనా సంస్థలు, త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది వివరాలు కూడా ఉండటంతో ఈ వ్యవహారం అత్యంత సున్నితంగా మారింది. ఇది సైబర్ నేరాలకు ఊతమివ్వడంతోపాటు దేశ రక్షణకు ప్రమాదకరంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శత్రు దేశాలకు ఈ సమాచారం చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి లోకేష్‌తో అశోక్ (ఫైల్) ఇంటి దొంగల హస్తం! ప్రజల వ్యక్తిగత సమాచారం అనధికారిక వ్యక్తుల చేతికి చిక్కడం అంటే పార్లమెంటులో చేసిన ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆధార్ సమాచారం బయటకు పొక్కడంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అథారిటీ రంగంలోకి దిగి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ అథారిటీ డేటా చోరీపై ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగవంతం.. డేటా చోరీపై తెలంగాణా పోలీసుల దర్యాప్తుతోపాటు ఆధార్ అథారిటీ అంతర్గత విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆధార్ అథారిటీ, పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. డేటా తస్కరించిన పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఈఏఎస్ శర్మ,, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరడం వెనుక ఆధార్ అథారిటీ పెద్దల పాత్ర కచ్చితంగా ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఆధార్ అథారిటీ అధికారుల పాత్ర లేకుండా కీలక సమాచారం అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి చేరడం అసంభవమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖకు ఓ లేఖ రాశారు. ఆధార్ అథారిటీ చైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను గతంలోనే కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ సత్యనారాయణ నియామకాన్ని పునఃసమీక్షించకపోవడాన్ని తప్పుబట్టారు. ఐటీ గ్రిడ్స్‌తోపాటు ఆధార్ అథారిటీ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన రాజకీయ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్ అథారిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సర్వర్లు భద్రం: యూఐడీఏఐ తమ సర్వర్లు పూర్తి భద్రంగానే ఉన్నాయని ఆధార్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ బుధవారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోసిటరీ (సీఐడీఆర్), ఇతర సర్వర్లు సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది. తమ సర్వర్ల నుంచి ఎలాంటి డేటా చౌర్యానికి గురి కాలేదని అందులో పేర్కొంది. ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు టీడీపీ సర్కార్ షెల్టర్ డేటా చోరీ కేసులో టీడీపీ సేవామిత్ర యాప్‌ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో డేటా చోరీ కేసులో దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ డి.అశోక్ కుమార్‌తోపాటు తెరవెనుక సూత్రధారులపై తెలంగాణ సిట్ దృష్టి సారించింది. ఆధార్‌తోపాటు మరో 17 రకాల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు కొద్ది రోజుల క్రితం ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీప్రసాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలతో అశోక్ కోసం తెలంగాణ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా అశోక్ లొంగిపోకపోవడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. అశోక్‌తోపాటు ఆయనకు సహకరించిన మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏబీ పర్యవేక్షణలోనే ఆశ్రయం! మరోవైపు అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆయన్ను టీడీపీ సర్కారే కాపాడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం సేవామిత్ర యాప్ కోసం తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దోషులుగా నిలబడే పరిస్థితి రావడంతో అశోక్‌ను రహస్య ప్రదేశంలో దాచినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలోనే అశోక్‌కు ప్రభుత్వం షెల్టర్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వ్యక్తి మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలో తొలుత అశోక్‌ను ఉంచినట్టు ప్రచారం జరిగింది. అనంతరం విజయవాడ గొల్లపూడిలోని ఇంటెలిజెన్స్ అతిధిగృహంలో అశోక్‌ను పోలీసుల రక్షణ నడుమ కొద్ది రోజులు దాచినట్టు తెలిసింది. తరువాత ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో అశోక్‌కు షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత నిఘా చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా చంద్రబాబు కోసం అశోక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని షెల్టర్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. పోలింగ్‌కు ముందు రోజు సేవామిత్రతో సూచనలు డేటా స్కామ్ బయట పడిన మరుక్షణమే మూసివేసిన టీడీపీ సేవామిత్ర యాప్‌ను పోలింగ్‌కు ఒక రోజు ముందు మళ్లీ పని చేయించడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లకు ఓటింగ్‌పై సూచనలు ఇచ్చేందుకు సేవామిత్ర యాప్‌ను వినియోగంలోకి తెచ్చారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్ డైరెక్షన్లోనే మళ్లీ సేవామిత్ర యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలంగాణ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా అశోక్‌ను ఎక్కడకు తరలించారనే అంశంపై తెలంగాణ పోలీసు ప్రత్యేక బృందాలు దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కేసులో కీలకంగా మారిన అశోక్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన స్వచ్ఛందంగా లొంగిపోతే మంచిదనే చర్చ ఏపీ పోలీసు వర్గాల్లోనే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల డేటా సైతం చోరీ సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికలో ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ఆధార్ వివరాలు కూడా ఉన్నట్లు తెలంగాణ సిట్ బృందం గుర్తించింది. దీంతో ఇన్నాళ్లూ భావించినట్లుగా ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా కూడా ఉండటంతో కేసు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరస్థుల గాలింపు కోసం పలు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆధార్ వివరాలు కోరినా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అంగీకరించలేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) కూడా దాదాపుగా ఇలాంటి విజ్ఞప్తే చేసినా నిరాకరించింది. ఆధార్ సెక్షన్ 29 ప్రకారం పౌరుల వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అత్యంత అరుదైన కేసుల్లో సెక్షన్ 33 ప్రకారం మాత్రమే పరిమిత సమాచారం ఇస్తామని పేర్కొంది. -
డేటా చోర్‌పై నిఘా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత డేటా చోరీలో కీలక సూత్రధారిగా ఉన్న డాకవరం అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూసిన రెండు నెలల నుంచి అతను అజ్ఞాతంలోనే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సిట్ బృందం అశోక్ జాడను గుర్తించడం కోసం రంగంలోకి టీమ్‌లు దింపిన క్రమంలో అతని స్వస్థలం అల్లూరులో మళ్లీ అలజడి రేగింది. అశోక్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అతని మూలాలపై జిల్లాలో చర్చ సాగుతోంది. అనతి కాలంలలో బడా వ్యక్తిగా ఎదగడం వెనుక రాజకీయంగా జిల్లాలో ఎవరి సహకారం ఉంది. స్థానికంగా సహకరిస్తున్నది ఎవరనే దానిపై జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రజల ఆధార్ కార్డులతో పాటు వ్యక్తిగత డేటా చోరీ చేసిన డాకవరం అశోక్ కావలి నియోజకవర్గం అల్లూరుకు చెందిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబం నుంచి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ముఖ్యంగా అశోక్ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత జిల్లాలో పొలాలు భారీగా కొనుగోలు చేశాడు. అశోక్ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం, బీద సోదరులతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని ఓటర్ల ఆధార్ డేటాతో పాటు వ్యక్తిగత వివరాల డేటాను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా లిమిటెడ్ తస్కరించిదనితెలంగాణ సిట్ బృందం నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలల క్రితం కేసు నమోదైంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడ, ఎన్నికల ప్రక్రియ జరగటంతో పోలీసులు కేసును పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికలు ముగిసిపోవడంతో ఆధార్ డేటా వ్యవహారం తెరపైకి రావడంతో అశోక్ కోసం అన్వేషణ మొదలైంది. ముఖ్యంగా అశోక్ గడిచిన నాలుగు నెలల కాలంలో జిల్లాకు వచ్చారా? అనే దానిపై పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించినట్లు సమాచారం. వాస్తవంగా గతంలో అశోక్ ఏటా మూడు నాలుగు సార్లు అల్లూరుకు వచ్చి వెళ్తుండేవాడు. గడిచిన నాలుగు నెలలుగా జిల్లాకు రాలేదని ప్రాథకంగా నిర్ధారించారు. అల్లూరులో అశోక్ బంధువులు, సన్నిహితులు ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బీద టూ నారా లోకేష్ అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన బీద సోదరుల సహకారంతో సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు అశోక్ సన్నిహితుడుగా మారాడు. టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను అశోక్ సంస్థే రూపొందించింది. అల్లూరుకు చెందిన డాకవరం బుజ్జయ్య కుమారుడు అశోక్. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచిన బుజ్జయ్య మండలంలో ఉప్పు సాగు చేసే సాధారణ రైతు. ఆర్థికంగా నష్టపోయాడు. ఈక్రమంలో బుజ్జయ్య కుమారుడు అశోక్ కు టీడీపీ నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రతో సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో బుజ్జయ్య కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. అశోక్ అల్లూరులో ఇంటర్మీడియట్, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కొత్త టెక్నాలజీ పేరుతో బీద రవిచంద్ర ద్వారా సీఎం చంద్రబాబునాయుడ్ని, ఆయన కుమారుడు లోకేష్‌ను కలిశారు. తద్వారా కొద్ది నెలలకే వారికి సొంత మనిషిగా మారిపోయాడు. దీనికి టీడీపీ నేతలుగా ఉన్న బీద సోదరులు వారధిగా నిలిచారు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ‘ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను ప్రారంభించాడు. లోకేష్ మంత్రిత్వ శాఖలోని విభాగాలకు సంబంధించి సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ డెవలప్ చేసింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ యాప్, పంచాయతీరాజ్ విభాగం, డ్రిప్ ఇరిగేషన్, గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం తదితర ప్రభుత్వ వైబ్‌సైట్లతో పాటు వాటికి సంబంధించి సాంకేతిక సహకారం వీరే అందిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను తయారు చేసి, ఈ యాప్‌ను టీడీపీ నాయకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో పని చేసే విధంగా సాంకేతికతను తయారు చేశారు. -
డేటా ఇచ్చిందెవరు?
-
‘ఐటీ గ్రిడ్స్’కు డేటా ఇచ్చిందెవరు?
సాక్షి, హైదరాబాద్: ఏపీతో పాటు తెలంగాణకు చెందిన దాదాపు 7 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ చేతిలో పెట్టిందెవరు? దీని చుట్టూనే ఇప్పుడు సిట్ దర్యాప్తు సాగుతోంది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ (సీఐడీఆర్), స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వద్ద భద్రంగా ఉం డాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా లీకయిందన్నది వారికి సవాలు విసురుతోంది. ఈ లీకేజీ వెనక ఏపీ సర్కారు పెద్దల హస్తం ఉండొ చ్చని యూఐడీఏఐ అనుమానిస్తోంది. ఇలాంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆయా సంస్థల్లో పనిచేసే విచక్షణ ఉన్న ఏ అధికారీ ఇవ్వడని, ప్రలోభాలకు లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. తొలుత వేటు పడేది అధికారులపైనే.. ఈ కేసులో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న 40కిపైగా హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సాయంతో విశ్లేషించిన సంగతి తెలిసిందే. డేటా చౌర్యం జరిగిందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇవ్వడంతో సిట్ దర్యాప్తు స్పీడు పెంచింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళ్లడం ద్వారా సేవామిత్ర యాప్‌లో ఉన్న వివిధ శాఖల సమాచారం ఎలా వచ్చిందన్న విషయంపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ స్కాంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే తొలి ముద్దాయిలు వారే అవుతారని తెలుస్తోంది. -
దొంగలపాలైన ‘ఆధార్’
చీకటి పనులకు అలవాటు పడకుండా ఉండాలేగానీ...ఆ ఊబిలోకి దిగబడ్డాక ఇక పైకి రావడమంటూ ఉండదు. స్వల్ప శాతం ఓట్ల తేడాతో 2014లో అధికారంలోకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అయిదేళ్లూ ఇష్టానుసారం పాలించారు. చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు వీటిపై ఎప్పటికప్పుడు నిలదీసినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఇది దేనికి దారితీసిందో తెలంగాణ పోలీసులకు అందిన తాజా ఫిర్యాదు తేటతెల్లం చేసింది. సాక్షాత్తూ ఆధార్ ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ టి. భవానీ ప్రసాద్ ఈ ఫిర్యాదు చేశారు. ఆధార్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు 7 కోట్ల 83 లక్షలమంది ప్రజానీకానికి సంబంధించిన డేటా చోరీకి గురయిందని, ఇది దేశభద్రతకే ముప్పు కలిగిస్తుందని ఆ ఫిర్యాదు సారాంశం. ఇందులో అత్యంత ప్రమాదకరమైనదేమంటే...ఈ డేటాను నిందితులు అమెజాన్ క్లౌడ్ సర్వీస్‌లో నిక్షిప్తం చేశారు. ఆ సర్వీస్‌ను ప్రపంచంలో ఏమూలనున్న నేరగాళ్లయినా హ్యాక్ చేశారంటే కోట్లాదిమంది పౌరుల సమాచారం వారి చేతుల్లో పడుతుంది. దాన్ని ఉపయోగించుకుని వారు ఏంచేయడానికైనా ఆస్కారం ఉంది. గత నెల మొదట్లో తొలిసారి ఈ డేటా చోరీ వ్యవహారం వెలుగులోకొచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన సహచరులు చేసిన హడావుడి, దీన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు చేసిన యత్నం వెనకున్న వ్యూహమేమిటో ఇప్పుడు అందరికీ అర్ధమవుతుంది. (చదవండి : ఇది దేశ భద్రతకే సవాల్) జరిగిన నేరం ఎంత తీవ్రమైనదో, దాని పర్యవసానాలేమిటో చంద్రబాబుకు తెలుసు. అందువల్లే డేటా చోరీ వ్యవహారం బయటకు పొక్కగానే ఏపీ పోలీసులు క్షణాల్లో హైదరాబాద్‌కొచ్చి వాలారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని అపహరించుకుపోవడానికి ప్రయత్నించారు. తెలంగాణ పోలీసులు అడ్డుకోనట్టయితే ఆయన్ను ఏపీకి తరలించేవారే. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్‌కు పోటీగా చంద్రబాబు రెండు సిట్లు వేసి పక్కదోవ పట్టించాలని చూశారు. జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణపై ఎదురుదాడికి దిగారు. లోకేశ్వర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడున్నర కోట్లమంది ఓటర్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించి దాన్ని తెలుగుదేశం కార్యకర్తల ఫోన్లలో ‘సేవామిత్ర’ యాప్ కింద లభ్యమయ్యే ఏర్పాటు చేశారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితా, ఇటు ఆధార్ డేటా అనుసంధానించి దీన్ని రూపొందించారని అప్పుడు బయటికొచ్చింది. కానీ తాజాగా భవానీ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మరింత తీవ్రమైనది. ఒక్క ఏపీ ప్రజల డేటా మాత్రమే కాదు...తెలంగాణ ప్రజల డేటా సైతం ఈ దొంగల చేతుల్లో పడిందని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాల ప్రజానీకం తాలూకు 18 రకాల వ్యక్తిగత సమాచారం సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తల సెల్ఫోన్లకు అందుబాటులో ఉందంటే వీరు ఎంతకు తెగించారో తేటతెల్లమవుతుంది. దీన్ని రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ ఇంతవరకూ ఆచూకీ లేకుండా పోయాడు. అతగాడు ఎవరి రక్షణలో సేదతీరుతున్నాడో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. ఆధార్ డేటాకు కట్టుదిట్టమైన భద్రత ఉన్నదని, అది బయటికి పోయే ప్రసక్తే లేదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) చాన్నాళ్లనుంచి బల్లగుద్ది చెబుతోంది. సుప్రీంకోర్టులోనూ ఈ వాదనే వినిపించింది. సంస్థ సీఈఓ అజయ్ భూషణ్ పాండే డేటా చౌర్యం ఎందుకు అసాధ్యమో ధర్మాసనానికి సాంకేతికంగా వివరించి చెప్పారు. ఆయనిచ్చిన వివరణతో అది సంతృప్తిపడినట్టే కనిపించింది. అందుకే కావొచ్చు...పౌరుల వ్యక్తిగత గోప్యతకు ముప్పు కలుగుతుందన్న పిటిషనర్ల వాదన సరికాదని నిరుడు సెప్టెంబర్‌లో వెలువరించిన తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది. కానీ ఇప్పుడేమైంది? స్వయానా యూఐడీఏఐ సంస్థే తమ డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. ఎంత ఘోరం? ఆ సంస్థకు చెందిన నిపుణులు ఇన్నాళ్లనుంచీ ఘనంగా చెప్పుకుంటున్న భద్రత ఐటీ గ్రిడ్స్ పుణ్యమా అని గాలికి కొట్టుకుపోయింది. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వ ప్రాపకంతో, ఆయన పార్టీ ప్రయోజనం కోసం చడీచప్పుడూ లేకుండా సాగిపోయింది. తాను, తన పార్టీ ప్రయోజనాలే తప్ప ఎవరేమైపోయినా ఫర్వాలేదనుకునే మనస్తత్వం ఉన్న నాయకులుంటే ఎంతటి కీలక సమాచారమైనా బజారున పడుతుందని ఈ డేటా చోరీ వ్యవహారం వెల్లడించింది. వాస్తవానికి సైబర్ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ అనుపమ్ శరాఫ్ ఆధార్ డేటాను ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానించడం వల్ల మున్ముందు సమస్యలు తలెత్తే అవకాశమున్నదని... ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో నింపి, నిజమైన ఓటర్ల పేర్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను, ఫలితాలను తారుమారు చేసే ప్రమాదమున్నదని హెచ్చరించారు. దాన్ని అటు ఆధార్ ప్రాధికార సంస్థ, ఇటు ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలా లేదు. అనుపమ్ మాటల్లో ఎంత నిజమున్నదో ఇప్పుడు చంద్రబాబు అండ్ కో నిరూపించారు. తాజా ఎఫ్ఐఆర్నుబట్టి చూస్తే సేవామిత్ర యాప్‌లో రెండు రాష్ట్రాలకూ చెందిన ఆధార్ డేటా, ఓటర్ల జాబితాలు ఉన్నాయి. తమకు ఓటేయరని అనుమానం వచ్చిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ యాప్ ద్వారా అవకాశమున్నదని ఎఫ్ఐఆర్ చెబుతోంది. డేటా దొంగలు ఈ మొత్తం డేటాను దేన్నుంచి కైంకర్యం చేశారో తేలాల్సి ఉంది. అలాగే దుండగులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో సరిపెట్టారా లేక ఇతర రాష్ట్రాల డేటాను సైతం తస్కరించారా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. దీంతోపాటు టీడీపీ సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించి ఆ యాప్‌తో ఏమేం చేశారో రాబట్టవలసి ఉంది. ఈ డేటా చౌర్యం లోతు, విస్తృతి ఎంతో... ఎవరెవరు ఇందులో భాగస్వాములో సాధ్యమైనంత త్వరగా కూపీ లాగి, నిందితులను అరెస్టు చేయాలి. -
ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
ఐటీ గ్రిడ్ కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసుపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ డేటా చోరీపై ఇప్పటికే ఆధార్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై ఆధార్ అధికారులు కూడా మాదాపూర్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల కి చెందిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని అందులో ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టేందుకు సిట్ అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే దాదాపు 40 హార్డ్ డిస్క్‌లను ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు నోటిసులు ఇచ్చామన్నారు. అశోక్‌తో పాటు మరికొంత మందిని అరెస్ట్చేసేందుకు రంగం సిద్దం చేసింది. -
డేటా దొంగ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా, ఆధార్ వివరాల చౌర్యం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగియడం, ఈ కేసులో అదనంగా ఆధార్ కేసు కూడా తోడవడంతో నేరం తీవ్రత మరింత పెరిగింది. అశోక్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలు రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్న సిట్... న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పౌరుల డేటా చోరీ చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించడం తెలిసిందే. అరెస్టుకు సరిపడా ఆధారాలు.. ఈ కేసులో సిట్ అధికారులు పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌సంస్థ అధినేత దాకవరం అశోక్ అరెస్టుకు సరిపడా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా.. అశోక్ అజ్ఞాతం వీడటం లేదు. పైగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పాత్ర స్పష్టంగా కనిపిస్తుండటం, సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే నిందితుడిని వెనకేసుకు రావడంతో ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అప్పట్లో అశోక్‌ను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. విజయవాడ, నెల్లూరులో అశోక్ ఉన్నట్లు సమాచారం కూడా అందింది. నిందితులెవరైనా వదిలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యానించడంతో అశోక్ అరెçస్టు తప్పదన్న వాదనలు బలపడ్డాయి. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ఇంతకాలం ఈ కేసు కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ఆధార్ ఫిర్యాదుతో మళ్లీ సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. రాజకీయ కారణాలతోనే ఆగుతున్నారా? ఈ కేసులో నిందితుడికి ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆశ్రయమిస్తున్నారంటూ ప్రచారం జరగడం సమస్యగా మారింది. అశోక్ ఆచూకీ తెలిసినా అతన్ని అరెస్టు చేయడానికి తెలంగాణ సిట్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకొన్ని రోజులు వేచి చూసి న్యాయస్థానం ద్వారానే అశోక్‌ను పట్టుకోవాలన్నది సిట్ యోచనగా తెలుస్తోంది. వారి జాప్యానికి రాజకీయ పరిణామాలు కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఓటుకు కోట్లు కేసులోనూ నిందితులను వెనకేసుకొచ్చిన సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేశ్‌లు ఈ కేసులోనూ అదే తరహాలో వ్యవహరిస్తుండటం గమనార్హం. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు..! మొదటి నుంచి ఏపీ మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ అశోక్... ఆ సాన్నిహిత్యంతోనే పార్టీ కార్యక్రమాల నిర్వహణ దక్కించుకున్నాడని సమాచారం. సేవామిత్ర యాప్‌లో సర్వే కోసం ఉపయోగించిన ప్రతి అంశం ఎలాగైనా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేలా ఉందన్న ఆరోపణలు ముమ్మరమయ్యాయి. చంద్రబాబు, లోకేశ్‌లతో ఉన్న పరిచయాల కారణంగానే ప్రభుత్వం... సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, ఆధార్ సమాచారం, ఓటరు లిస్టు తదితరాలు అశోక్‌కు యాక్సెస్ చేసుకునే వీలు కల్పించిందన్న విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్కే పరిమితమా..? ఈ కేసులో అత్యంత గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత సమాచారం వివరాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఆధార్ సెక్షన్ల ప్రకారం నేరం. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర పౌరుల ఆధార్ డేటా కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉండటంతో ఇది జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. గోప్యతను భద్రంగా ఉంచాల్సిన ప్రభుత్వాలే ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే వ్యక్తిగత సమాచారానికి రక్షణ ఎక్కడని పలువురు వాపోతున్నారు. ఒకవేళ ఈ డేటా శత్రు దేశాల చేతిలో పడితే అది దేశ భద్రతకే ముప్పు అని యూఐడీఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీ గ్రిడ్స్ దాదాపు రెండు రాష్ట్రాలకు చెందిన 7 కోట్ల మందికిపైగా సమాచారం సేకరించి ఆమెజాన్ క్లౌడ్ స్టోరేజీలో దాచింది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యానికి పాల్పడిన విషయం వాస్తవమేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) కూడా ధ్రువీకరించింది. ఇప్పుడు ఈ డేటా ఐటీ గ్రిడ్స్ కంపెనీ నుంచి ఇంకెక్కడికైనా లీక్ అయిందా? ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా? అన్న విషయాలపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశాలకు చెందిన క్లౌడ్ కంపెనీలో స్టోర్ చేయడం చట్ట విరుద్ధం. ఇది జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉండటంతో అధికారులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. -
ఐటీగ్రిడ్స్ ప్రకంపనలు : ఐటీ కార్యదర్శికి ఈఏఎస్ శర్మ లేఖ
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాలకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్ డేటా, ఓటర్ ఐడీ సహా వ్యక్తిగత వివరాలు టీడీపీ యాప్‌ను డెవలప్ చేసిన ఐటీగ్రిడ్స్ వద్ద ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించడంపై భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. డేటా చోరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్ వద్ద 7.82 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ఉండటం ఆందోళనకరమని ఐటీ కార్యదర్శి సాహ్నీకి రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. ఐటీగ్రిడ్స్ అభియోగాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఏఐ, ఈసీ తీవ్రంగా పరిగణించాలని కోరారు. యూఐడీఏఐ, ఈసీఐల పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతను ఐటీగ్రిడ్స్ దెబ్బతీసిందని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కధనాన్ని ఉటంకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మటికీ పౌరుల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనేనని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ డేటా చోరీతో ఏ రాజకీయ పార్టీ దాన్ని దుర్వినియోగం చేసిందనే వ్యవహారంతో సంబంధం లేకుండా యూఐడీఏఐ, ఈసీలు తెలుగు ప్రజలకు సంతృప్తికర వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.డేటా చోరీ, ఐటీ గ్రిడ్స్ నిర్వాకంపై యూఐడీఏఐ, ఈసీలు తమ బాధ్యత నుంచి తప్పించుకోజాలవన్నారు. యూఐడీఏఐ చైర్మన్ జే సత్యనారాయణ, ఏపీలో టీడీపీ ప్రభుత్వ ఈ గవర్నెన్స్, ఐటీకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తుండటంపై గతంలో తాను రాసిన లేఖను సమాచార సాంకేతిక శాఖ విస్మరించిందని శర్మ గుర్తుచేశారు. తెలుగు రాష్ర్టాల ప్రజల వ్యక్తిగత వివరాలను నిక్షిప్తం చేసిన ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో స్ధానిక యూఐడీఏఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసులో సరిపోదని పేర్కొన్నారు. యూఐడీఏఐ అధికారుల ప్రమేయం లేకుండా ఐటీగ్రిడ్స్ 7.82 కోట్ల మంది ఆధార్ వివరాలు, ఓటర్ ఐడీ వంటి డిజిటల్ రికార్డులను సమీకరించడం సాధ్యం కాదని అన్నారు. ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కై ఈ తతంగంలో పాలుపంచుకున్న యూఐడీఏఐ అధికారులందరిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని తేలితే ఆయా బాధ్యులపైనా కేసు నమోదు చేయాలన్నారు. ఐటీగ్రిడ్స్ వ్యవహారంలో సరైన చర్యలు చేపట్టడంలో ఐటీ మంత్రిత్వ శాఖ విఫలమైతే తాము న్యాయస్ధానాలను ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
డేటా చోరి కేసులో సంచలన నిజాలు
-
ఇది దేశ భద్రతకే సవాల్
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ‘సేవా మిత్ర యాప్’ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పాల్పడిన డేటా స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్ చోరీ నిజమేనంటూ ఆధార్ (యుఐడీఏఐ) అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ టి.భవానీ ప్రసాద్ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్ జిల్లాలోని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 278/ 2019లో సెక్షన్ 37, 38,(ఎ)(బి)(జి), 40, 42, 44 ఆధార్ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేశారు. 18 రకాల వ్యక్తిగత సమాచారం చోరీ ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్ డేటా బేస్‌కు లింక్ అయ్యి ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్‌నకు లింక్ చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల ఆధార్ డేటాను నిందితుడు అక్రమంగా అమెజాన్‌లో స్టోర్ చేశాడని, ఈ సున్నితమైన డేటా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ముప్పని పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆధార్ అథారిటీ డీడీ భవానీప్రసాద్ పేర్కొన్న భాగం ఫిర్యాదుదారుడైన తుమ్మల లోకేశ్వరరెడ్డితో పాటు ముద్దనలాలిగారి జయరామిరెడ్డి, అక్కల మద్దిలేటిరెడ్డి, ఆకుల రవికుమార్, అబ్దాస్ వెంకటప్రతాప్లను నమూనాలుగా తీసుకుని డేటా స్కామ్ తీగ లాగారు. దీంతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్ గుట్టురట్టు అయ్యింది. ప్రజలకు చెందిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. వాటిలో ఆధార్ (యూఐడీ) నంబర్‌తోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్(ఈఐడీ) నంబర్, కలర్ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, పౌరుని పేరు, స్థానికంగా పిలుచుకునే పేరు, జెండర్, ఫోన్ నంబర్, వారి తండ్రి, సంరక్షకుడు, భర్త పేరు, కేరాఫ్ పేరు, పుట్టిన రోజు, గ్రామం, మండలం, జిల్లా పేరు, జిల్లా ఐడీ, పిన్‌కోడ్, వీటీసీ కోడ్, రాష్ట్రం పేరు, రాష్ట్రం కోడ్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం.. ఆధార్ ఆథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) భవానీ ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆందోళన కలిగించే అంశాలను ప్రస్తావించారు. ‘యూనిక్ ఐడీ(ఆధార్) అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిది. పౌరుల ఆధార్ ఐడీని టీడీపీ సేవామిత్ర యాప్ కోసం లింక్ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చూడకూడదు. ఈ రెండు రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్, తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగింది. ఈ సమాచారం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయ మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆధార్‌తోపాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలా ఐటీ గ్రిడ్స్‌కు ఇవ్వడం పెద్ద నేరం. అసలు సేవామిత్ర అప్లికేషన్‌పైనే గట్టి అనుమానాలున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలి’అని భవానీప్రసాద్ తన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ప్రధాన నిందితుడికి ప్రభుత్వ పెద్దల షెల్టర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీలను ఓ వ్యూహం ప్రకారం టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చౌర్యం చేసింది. ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అక్రమ మార్గాల్లో అందరి వ్యక్తిగత వివరాలను సేకరించింది. అయితే ఈ సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పినదంతా తప్పు అని ఇప్పుడు స్పష్టమైంది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలందరి వ్యక్తి గత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్ మేరకు ప్రభుత్వమే ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చిందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు ఏపీ ప్రభుత్వ పెద్దలే షెల్టర్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం వల్ల ఈ వ్యవహారం ఏపీలోని పలువురు అధికారుల మెడకు చుట్టుకోనుందని తెలుస్తోంది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ(సీఐడీఆర్), రాష్ట్రానికి చెందిన స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వంటి వాటి వద్ద భద్రంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతుల్లోకి వెళ్లడం తీవ్ర నేరం. సీఐడీఆర్, ఎస్ఆర్డీహెచ్లకు చెందిన ప్రతినిధులు విధుల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు చెందిన సమాచారాన్ని బయటకు లీక్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆధార్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 సెక్షన్ 28(5) ప్రకారం నేరం. ప్రభుత్వ పథకాలు, సర్వేల కోసం కాంట్రాక్టులో భాగంగా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా ఇతర ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 29(3) ప్రకారం నేరం. ఇతర ప్రయోజనాల కోసం, సర్వేలు, ఫలితాలు, ఓటర్ల జాబితాలో తొలగింపులు వంటి తదితర అక్రమాలకు ప్రజల వ్యక్తిగత డేటాను మళ్లించడం సెక్షన్ 38(జి) ప్రకారం నేరం. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దాన్ని తమ అవసరానికి అనుగుణంగా చేర్పులు, మార్పులు, తొలగింపులు చేయడం, విలువైన డేటాకు భంగం కలిగించి వేరే ప్రయోజనాలకు వాడుకోవడం సెక్షన్ 38(హెచ్) ప్రకారం నేరం. ఇందుకు సెక్షన్ 40 ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.పది లక్షలు జరిమానా ఉంటుంది. ఆధార్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంతోపాటు దాన్ని ఇంటర్నెట్లో వాడుకోవడం, ఇతర వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ డేటాను ట్రాన్స్‌మీట్ చేయడం, రహస్యంగా దాచడం తీవ్రమైన నేరం. ప్రభుత్వ పెద్దల దన్నుతో డేటా స్కామ్‌కు పాల్పడిన ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆ డేటాను అమెజాన్ (అమెరికా) వెబ్ సర్వీసులోని క్లౌడ్ సర్వర్‌లో పెట్టడం తీవ్ర నేరం. సెక్షన్ 44 ప్రకారం దీనిని దేశం బయట జరిగే నేరం (అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తున్నారు. ఈ డేటా మన శత్రుదేశమైన పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చిక్కినా, ఆంతర్జాతీయ నేరస్తులకు చిక్కినా దేశ భద్రతకు పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సాధికార (పల్స్) సర్వే పేరుతో సేకరించిన సున్నితమైన సమాచారంతో అనుసంధానమై ఉండటం ఐటీ యాక్ట్ – 2008 సెక్షన్ 72(ఎ), సెక్షన్ 65, సెక్షన్ 66(బి) కింద పూర్తిగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం. ఆధార్ డీడీ రిపోర్టుకు కారణం ఇదే.. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డేటా స్కామ్‌కు పాల్పడుతున్న వైనంపై ఈ ఏడాది మార్చి 2న ఫిర్యాదు రావడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర మార్చి 15న కేంద్రం పరిధిలోని ఆధార్ అథారిటీ (యూఐడీఏఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సంబంధించిన పూర్తి వివరాలు విచారించిన ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) టీవీ భవానీ ప్రసాద్ ఈ నెల 12న మాదాపూర్ పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. -
ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకులపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసుపై మరోకేసు నమోదైంది. ఆదార్ సంస్థ పలు సెక్షన్ల కింద ఐటీ గ్రిడ్స్‌పై కేసులు వేసింది. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఆధార్ సమాచారంపై యూఐడీఏఐ కేంద్ర అధికారులను సిట్ వివరణ కోరింది. ఈ మేరకు ఆధార్ యాక్ట్‌లోని 37,38,40,42,44 సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సిట్‌కు బదిలీ చేశారు. -
బాధితులు ఏడు కోట్ల మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల డేటా చోరీ కేసులో బాధితులు ఎన్నికలు సంఘం, ఆధార్ సంస్థ కాదని, 7 కోట్ల మంది ఓటర్లని, వారి వ్యక్తిగత సమాచారాన్నే ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చోరీ చేసిందని సీని యర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. కీలక సమాచారం తమ వద్ద ఉందన్న విషయంతో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ విభేదించడం లేదన్నారు. ఇక్కడ ప్రధాన ప్రశ్నలు, ఎవరు చెబితే ఈ సమాచారాన్ని చోరీ చేశారు.. ఎవరి కోసం చోరీ చేశారు.. ఏం ఆశించి ఇలా చేశారన్నదే ముఖ్యమన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తే కుట్ర మొత్తం బహిర్గతమవుతుందని ఆయన తెలిపారు. అందువల్ల నిబంధనల ప్రకారం బాధితుల వాదన వినాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, ఈ వ్యాజ్యంలో కొత్తగా ప్రతివాదులుగా చేర్చబడిన ఎన్నికల సంఘం, ఆధార్, ఏపీ ఆధార్ నమోదు ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామంది. ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణార్హత, కేసు పూర్వాపరాలపై ఏప్రిల్ 22న విచారిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల డేటా చోరీకి సంబంధించి ఎస్ఆర్ నగర్, మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం విచారణ జరిపారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు పిటిషనర్ ఈ వ్యాజ్యాల్లో ఎన్నికల సంఘం, ఆధార్ సంస్థ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ సందర్భంగా డేటా చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, డేటా చోరీ వెనుక భారీ కుట్ర ఉందన్నారు. పిటిషనర్ న్యాయవాది ఈ వ్యవహారంలో ఆధార్, ఎన్నికల సంఘాన్ని బాధితులుగా చెబుతున్నారని, వారు కేవలం ప్రజల సమాచారాని కి సంరక్షకులు మాత్రమేనని తెలిపారు. తమ సమాచారాన్ని కోల్పోయిన ఓటర్లే ఇక్కడ బాధితులన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఆధార్, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ, ముందు ఈ వ్యాజ్యాల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తరువాత అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, రాజకీయ దురుద్దేశాలతో పిటిషనర్‌పై కేసులు నమోదు చేశారన్నారు. ఎన్నికల సంఘం, ఆధార్ వద్ద ఉండాల్సిన సమాచారం బహిర్గతమైందని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, ఇక్కడ ఆ రెండు సంస్థలే బాధితులని తెలిపారు. బాధితులైన ఆ సంస్థలు ఫిర్యాదు చేయలేదన్నారు. సమాచారం చోరీకి గురైందో లేదో ఈ సంస్థలే చెప్పాలని, అందువల్లే వారిని ప్రతివాదులు గా చేర్చామన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఈసీని, ఆధార్ సంస్థను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేశారు. -
ఐటీగ్రిడ్స్ కేసు: నలుగురికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసుకు సంబంధించి బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా ఇంప్లీడ్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ఎన్నికల అధికారులను ఇంప్లీడ్ చేయవద్దని పిటిషనర్ లోకేశ్వరరెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే ఇంప్లీడ్ పిటిషన్లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రధాన అధికారికి, ఆధార్ అథారిటీ అధికారులుకి, ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు, డేటా ఎన్‌రోలింగ్ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పీపీ, లోకేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. (చదవండి: ఐటీగ్రిడ్స్‌పై వాడీవేడి వాదనలు)