Kotturu
-
అర్ధ శతాబ్దపు జ్ఞాపకం
కొత్తూరు: కొత్తూరు పోలీస్ సర్కిల్ ఇక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. 53 ఏళ్ల అనుబంధానికి తెర పడింది. జిల్లాల పునర్విభజన కారణంగా కొత్తూరు పోలీస్ సర్కిల్‌ను ఎత్తివేశారు. ఇంత వరకు ఇక్కడ పనిచేసిన సీఐ సూర్యచంద్రమౌళిని వీఆర్‌లో ఉంచారు. కొత్తూరు సర్కిల్ ఎత్తివేయడంతో కొత్తూరు మండలాన్ని పాతపట్నం పోలీస్ సర్కిల్లో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. కొత్తూరు పోలీస్ సర్కిల్ కార్యాలయానికి ఎంతో చరిత్ర ఉంది. జిల్లాలో 1969 ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం ప్రబలంగా ఉండేది. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి ప్రభుత్వం కొత్తూరు పోలీస్ సర్కిల్‌ను 1969లో ప్రారంభించింది. నాటి నుంచి ఈ సర్కిల్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగానే ఉంది. ఒడిశా సరిహద్దు కావడంతో మా వోలకు ఈ ప్రాంతంలో పట్టు ఉండేది. దీంతో కొత్తూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీసు సి బ్బంది శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు మావోల కదలికలపై కూడా దృష్టి ఉంచేవారు. కొ త్తూరు పోలీస్ సర్కిల్ పరిధిలో సీతంపేట, భామి ని మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలోకి విలీనం కావడంతో కొత్తూరు సర్కిల్లో కేవలం కొత్తూరు మండలం ఉండిపోయింది. దీంతో సర్కిల్ కార్యాలయాన్ని ఎత్తివేశారు. దీంతో 53 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. అయితే కొత్తూరు మండల ప్రజలు పాతపట్నం సర్కిల్‌కి వెళ్లాలంటే రెండు నుంచి మూడు బస్సులు మారాలి. అధికారులు స్పందించి కొత్తూరు, హిరమండలం మండలాలను ఒక సర్కిల్‌గా ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. (చదవండి: రూ.3.5 లక్షలు చోరీ) -
అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్ఎస్లో డబుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఫుల్ జోష్‌లో ఉంది. నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్‌లో అద్భుతమైన విజయంతో డబుల్ సంతోషంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగారు. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక వరంగల్, ఖమ్మం కార్పొఒరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్ జోష్ వచ్చింది. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నకిరేకల్‌లో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 గెలిచారు. ఆ ఇతరుల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. రేపోమాపో వారు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ సంఖ్య పెరగనుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ 7 స్థానాలతో సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 గెలవగా కాంగ్రెస్ 5 డివిజన్లలో గెలిచింది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 గెలిచి చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 డివిజన్లతో సరిపెట్టుకున్నాయి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తోంది. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 సొంతం చేసుకుంది. ఒకటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. ఇతరులు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించగా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది. సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సత్తా చాటారు. కార్పొరేషన్ ఫలితాలు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. చదవండి: థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
విషాదం: ఐదు రోజుల్లోనే అంతా తల్లకిందులు
ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు తన కాళ్ల మీద తాను నిలబడి.. ఊరు కాని ఊళ్లో చెమటోడ్చి పెళ్లాం పిల్లలను పోషించుకుంటున్నాడని తలచి స్థిమితపడ్డ తల్లి, ఒక్కసారిగా తన ఆలోచనలు తలకిందులయ్యేసరికి తట్టుకోలేకపోయింది. మూడు పదులు దాటిన వయస్సులో కుమారుడు మతి తప్పిన తీరులో స్వస్థలానికి చేరుకోవడంతో ఆమె అతలాకుతలమైంది. కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాక.. కృష్ణారామా అనుకోవాల్సిన వయస్సులో.. మీదపడ్డ సమస్య ఆమెను నైరాశ్యం వైపు నెట్టింది. తన బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వస్తుందేమోనన్న బాధతో.. భయంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. పురుగు మందు తాగి ప్రాణాలు విడిచింది. అదే సమయంలో తనయుడు కూడా విషం మింగి.. ఆపై భీతిల్లి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వెంటనే చికిత్స అందించినా అతిడిని కూడా మృత్యువు వెంటాడింది. విధిలీల అర్థం కాదని వ్యథ చెందడం అందరి వంతైంది. కొత్తూరు: కొత్తూరులోని కొత్తపేట కాలనీకి చెందిన కనపాకల చిన్నమ్మడు (70), ఆమె కుమారుడు శ్రీనివాసరావు (35)లు శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ముందు చిన్నమ్మడు చనిపోగా తర్వాత శ్రీనివాసరావుకు వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నమ్మడుకు కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. శ్రీనివాసరావుకు పదేళ్ల కిందట కొత్తూరుకే చెందిన శ్రీదేవితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లిపోయారు. అక్కడే శ్రీనివాసరావు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఐదు రోజుల కిందట శ్రీనివాసరావు ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు కనిపించింది. అర్థం లేకుండా మాట్లాడడం, పిల్లలను ఊరికే కొట్టడం, గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ విడిచి పెట్టడం వంటి పనులు చేసేవాడు. దీంతో భయపడిన అతని భార్య అక్కడే ఉన్న బంధువులకు విషయం చెప్ప డంతో వారు పరిస్థితిని గమనించి రాత్రుళ్లు కాప లా కాయడం కూడా మొదలుపెట్టారు. అయినా శ్రీనివాసరావు ప్రవర్తన అంతు చిక్కేది కాదు. ఒక క్షణం బాగానే ఉన్నా.. మరుక్షణానికి మారిపోయేవాడు. ఈ నెల 25న శ్రీనివాసరావు అక్కడ ఎవరికీ చెప్పకుండా కొత్తూరు వచ్చేశాడు. ఇక్కడ కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వీధుల్లో తిరిగేవాడు. కొడుకు పరి స్థితి చూసి తల్లి చిన్నమ్మడు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇలాగే చనిపోతాడేమో అని బెంగ పెట్టుకుంది. దెయ్యం పట్టిందేమోనని అతడిని కుటుంబ సభ్యులంతా కలిపి ఓ గిరిజన గ్రామానికి కూడా తీసుకెళ్లారు. కానీ వారు ఆదివారం పూజ చేస్తామని చెప్పి వీరిని పంపించేశారు. శనివారం ఇంటిలో ఉన్న వారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. తల్లీ కొడుకులు మాత్రం కొత్తూరు నాలుగు రోడ్ల కూడలికి వచ్చి గడ్డి మందును కొన్నారు. వారి ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి ఇద్దరూ ఆ పురుగు మందు తాగేశారు. అయితే పురుగు మందు తాగాక శ్రీనివాసరావు పరుగులు పెడుతూ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. తల్లి అక్కడే పడిపోవడంతో అటుగా వెళ్తున్న ఉపాధి వేతనదారులు ఆమెను గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీ కొడుకులకు స్థానిక సీహెచ్‌సీ వైద్యాధికారి దీప్తి వైద్యం అందించారు. తల్లి పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆమె అక్కడే చనిపోయారు. శ్రీనివాసరావును కూడా పాలకొండ తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అర్థరాత్రి తర్వాత ఆయన కూడా తనువుచాలించాడు. చిన్నమ్మడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ వై.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలకు పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనతో కొత్తూరులో విషాదం అలముకుంది. -
వైఎస్సార్సీపీ అభిమాని హత్య.. నిందితుల అరెస్టు
కొత్తూరు: వైఎస్సార్సీపీ అభిమాని కామక జంగం(60)ను అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచి.. కర్రలతో దాడిచేయడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మండలంలోని కుంటిబద్ర కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. పరారీలో ఉన్న నిందితులు అగతమూడి బైరాగి నాయుడు, టి.జగదీష్, కొవ్వాడ రాజు, కె.ఎర్రయ్య, కె.జమ్మయ్య, పి.మన్మదరావు, కె.తిరుపతి రావును కొత్తూరు పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అరుణ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. (చదవండి : వైఎస్సార్సీపీ కార్యకర్తను హతమార్చిన టీడీపీ వర్గీయులు) వివరాలు.. కుంటిభద్ర కాలనీకి చెందిన కామక జంగం వైఎస్సాసీపీ అభిమాని. ఆయనతోపాటు అన్నదమ్ములు, వారి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అదే కాలనికి చెందిన కొవ్వాడ రాజు, ఎర్రయ్యలు చెప్పారు. జంగంతోపాటు ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి తాము వైఎస్సార్సీపీ వెంట ఉంటామని తెలియజేశారు. మాట వినలేదని కొవ్వాడ రాజు అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. చిన్న, చిన్న విషయాలకు తగాదాలకు దిగేవాడు. జంగంకు చెందిన గడ్డివాము (కల్లంలో) దగ్గర పుట్టగొడుగులు మొలిశాయి. పుట్టగొడుగులు ఎందుకు తీశారని కొవ్వాడ రాజుతోపాటు ఆయన అన్నదమ్ములను జంగం నిలదీశారు. అప్పటికే కొట్లాటకు సిద్ధంగా ఉన్న కొవ్వాడ రాజు తన వద్ద ఉన్న బరిసె(బల్లెం)తో జంగం పొట్టపై పొడిచాడు. అక్కడే ఉన్న కొవ్వాడ ఎర్రయ్య, జమ్మయ్య, తిరుపతిరావు కర్రలతో దాడి చేయడంతో జంగం అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. జంగంను తొలుత కొత్తూరు సీహెచ్‌సీకి, అక్కడ నుంచి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇక ఇదే ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. -
మాజీ ఎమ్మెల్యే తనయుడి వీరంగం
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మండలంలోని మాతల గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమారుడు సాగర్ తన అనుచురులతో కలిసి వీరంగం సృష్టించాడు. వైఎస్సార్సీపీ వర్గీయులతోపాటు ఇద్దరు గ్రామ వలంటీర్లపై మూకుమ్మడిగా మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ వర్గీయులు కలమట శ్రీరాములు, పప్పలు తిరుపతిరావులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సామాజిక భవనంలో గ్రామ సచివాయం ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు భవనానికి రంగులు వేసేందుకు వెళ్లిన కార్మికులతోపాటు కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన అనుచరులతో కలిసి అడ్డుకున్నాడు. భవన నిర్మాణానికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం చెల్లించనందున రంగులు వేయవద్దంటూ అడ్డుకున్నాడు. కులం పేరుతో ధూషించి దర్భాషలాడాడు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇది కొట్లాటకు దారి తీసింది. వైఎస్సార్సీపీ వర్గీయులు కలమట శ్రీరాములు, పప్పల తిరుపతిరావు, గ్రామ వలంటీర్లు గుంట రూపశంకర్, బూరాడ నాగరాజు, మజ్జి రాజశేఖర్లపై దాడి చేశారు. ఈ మేరకు పాలకొండ డీఎస్పీ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. గ్రామంలో శాంతిభద్రత దృష్ట్యా ప్రత్యేక బలగాలు పహారా కాస్తున్నాయి. టీడీపీ శ్రేణులు కలమట సాగర్, రేగేటి సూర్యారావు, రమేష్, యుగంధర్, వినోద్, రామారావు, జగదీష్, భాస్కరరావు గంగివలస తేజేశ్వరరావు కలమట చంద్రరావుతోపాటు 14 మందిపై గుంట రూపశంకర్ ఫిర్యాదు చేశాడు. ప్రతిగా టీడీపీకి చెందిన కాని తవిటయ్య వైఎస్సార్సీపీకి చెందిన కలమట శ్రీరాములు, కాగితపల్లి వెంకటేష్, రమేష్‌లతోపాటు 18 మందిపై ఫిర్యాదు చేశాడు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఎస్ఐ బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్పందించిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి సంఘటనపై ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొత్తూరు చేరుకున్న ఎస్పీ మాతల సంఘటనపై ఆరా తీశారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటుకు సహకరించాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ మాతల ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. కొత్తూరు సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇరువర్గాలు అట్రాసిటీ కేసులు పెట్టుకున్నందున దర్యాప్తు చేయాలని పాలకొండ డీఎస్పీకి ఆదేశించామన్నారు. మాతలలో పికెటింగ్ ఏర్పాటు చేయాలని సీఐకు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాల్లో తగాదాలు రాకుండా ముందస్తుగా ఎస్ఐలు రాత్రిబస చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అంతకుముందు కొత్తూరు, పాతపట్నం సర్కిల్ పరిధిలో నేరాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో సీఐలు ఎల్ఎస్ నాయుడు, రవికుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
గిరిజనులకు ఆరోగ్య సిరి
సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటు వల్ల కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గైనికాలజిస్టు, ఆర్ధోపెడిక్, చిల్డ్రన్ స్పెషలిస్టులతోపాటు పలు రకాల వైద్య నిపుణుల నియామకం జరుగుతుంది. అంతే కాకుండా అత్యాధునికమైన సీటీ స్కాన్, ఎక్స్‌రే, డయాలసిస్ యంత్రాలతోపాటు పలు రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తారు. సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పనుంది. ఇందుకోసం కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ ఆస్పత్రి స్థాయి పెంచి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అవగాహన రాహిత్యంతో నాటు వైద్యులను ఆశ్రయిస్తారు. వారిని ఒప్పించి ఆస్పత్రులకు తీసుకువచ్చినా ఉన్నత వైద్యం అందుబాటులో ఉండదు. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు వారు అంగీకరించరు. అందుచేత వారి చెంతనే అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటూ అందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో పాతపట్నం నియోజవర్గం పరిధిలోని కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనుంది. కొత్తూరు ఆస్పత్రే ఎందుకంటే.. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటుకు స్థల పరిశీలన చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీడీఏ అధికారులకు ఇటీవల ఆదేశాలు వచ్చాయి. దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు. కొత్తూరు సీహెచ్‌సీ ఆస్పత్రి ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం కొత్తూరుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసింది. ఇక్కడ ఆస్పత్రి నెలకొల్పితే సీతంపేట భామిని, హిరమండలం, పాతపట్నం, ఎల్ఎన్ పేట, మెళియాపుట్టి మండలవాసులకు అందుబాటులో ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయడం వల్ల విజయనగరం జిల్లాలోని గిరిజనులకు సైతం ఉపయోగపడుతుంది. జిల్లాలో రెండో పెద్దాస్పత్రి ఇంతవరకు జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం శ్రీకాకుళంలోని రిమ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇదే జిల్లాలోని రెండో పెద్దాస్పత్రి అవుతుంది. ఇక మీదట వైద్యం కోసం గిరిజనవాసులు శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లనవసరం ఉండదు. ఈ ఆస్పత్రి జిల్లాలోని గిరిజన ప్రజలతోపాటు మైదాన ప్రాంతవాసులకు సైతం ఉపయోగపడుతుంది. ఐటీడీఏ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో నరేష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొత్తూరు సీహెచ్‌సీని పరిశీలించామన్నారు. సీహెచ్‌సీ ఆవరణ ఇందుకు అనువుగా ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు నివేదిక అందివ్వడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. సూపర్ స్పెషాలటీ ఆస్పత్రికి సుమారు రూ. 20 కోట్లు ఖర్చవుతుందన్నారు. -
ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు?
-
‘ప్రజలతోనే వైఎస్ జగన్ పొత్తు’
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌కు ప్రజలతోనే పొత్తు అని విజయమ్మ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. సింహం సింగిల్‌గానే వస్తుందని.. వైఎస్ జగన్ తీసుకువచ్చే నవరత్నాలు అందరికీ మేలు చేస్తాయని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూడు దఫాలుగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇంకా విజయమ్మ మాట్లాడుతూ..‘ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నా. తన పాలన కాలంలో ఏం చేశారో చెప్పి ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓట్లు అడిగారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు?. ఎన్ని కష్టాలు పెట్టినా.. వైఎస్ జగన్ ప్రజల మధ్యలోనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. హోదా కోసం వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షలు చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిందంతా మోసం.. మళ్లీ అవే అబద్ధాలతో మీ ముందుకు వస్తున్న చంద్రబాబును నమ్మకండి. ఇసుక నుంచి గుడి భూముల వరకు టీడీపీ నాయకులు అన్నీ దోచేశారు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత లేదు. తాగునీరు దొరకడంలేదు.. ప్రతి ఒక్కరినీ మోసం చేయడమే చంద్రబాబు లక్ష్యం. అన్ని వర్గాలకు మేలు చేసింది వైఎస్సార్ మాత్రమే. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. మాట మీద నిలబడే వ్యక్తిత్వం చంద్రబాబుది కాదు. పొదుపు సంఘాల రుణాలు 26 కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. పసుపు కుంకుమ పేరుతో మరో డ్రామా ఆడుతున్నారు. 13 జిల్లాలో సాగునీరు గురించి పక్కన పెడితే.. తాగునీరు దొరకని పరిస్థితి. గ్రామాల్లో తాగునీరు దొరక్కపోయిన.. మద్యం ఎంతకావాలో అంత దొరుకుతుంది. ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి ఇచ్చినట్టుగా కనిపించడం లేదు. ఎన్నికల వేళ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. మళ్లీ 108 వస్తుంది... ప్రజలపై భారం పడకుండా, ధరలు పెంచకుండా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌ది మాత్రమే. వైఎస్సార్ పాలనలో అందరికి అండగా ఉన్న 108 మళ్లీ వైఎస్ జగన్ అధికారంలో రాగానే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉంటుంది. నవరత్నాలతో వైఎస్ జగన్ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతారు. డ్వాక్రా రుణాలు మహిళల చేతుల్లోకి నేరుగా అందేలా వైఎస్ జగన్ ఏర్పాటు చేస్తారు. వైఎస్ జగన్ చెప్పకుండా ఉంటే చంద్రబాబు ఎన్నికలకు ముందు పింఛన్‌ను 2 వేల రూపాయలు చేసేవారా?. వైఎస్ జగన్ పింఛన్ 3వేల రూపాయలకు చేరుస్తారని ప్రతి అవ్వ తాతకు చెప్పండి. వైఎస్ జగన్ హామీలనే చంద్రబాబు అనుకరిస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది. ఎక్కడున్నా పులి.. పులే. అన్నదాతలు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి.. చంద్రబాబు పాలనలో పింఛన్ కోసం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నదాతలు సైతం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. 2014 ఎన్నికల సమయంలో 600కు పైగా వాగ్ధానాలు ఇచ్చి చంద్రబాబు అధికారం దక్కించుకున్నారు. అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. చంద్రబాబుకు మానవత్వం లేదు. 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలి. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరిజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. అంతేకాకుండా గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12, 500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. గ్రామా సచివాలయాల ద్వారా ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే పూర్తి చేసేలా చూస్తాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 7లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌లను అత్యధిక మోజారిటీతో గెలిపించండ’ని కోరారు. -
కట్నపు జ్వాలలో సమిధ!
కొత్తూరు (అర్ధవీడు): వరకట్నం వేధింపులకు వివాహిత బలైంది. ఈ సంఘటన మండలంలోని కొత్తూరులో శనివారం తెల్లవారు జామున జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కొత్తూరుకు చెందిన పల్లెబోయిన ఆవులయ్యకు ఎర్రగొండపాలెం మండలం గంగుపల్లెకు చెందిన రాజేశ్వరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆవులయ్య తన భార్య రాజేశ్వరిని నిత్యం అదనపుకట్నం తెమ్మని వేధిస్తుంటాడు. పలు పర్యాయాలు ఆమె అలిగి తన పుట్టిల్లు వెళ్లింది. తల్లిదండ్రులు తమ కుమార్తెకు సర్ది చెప్పి మళ్లీ భర్త వద్దకు కాపురానికి పంపేవారు. భర్తతో పాటు అత్త ఆదిలక్ష్మమ్మ, మామ ఎర్రయ్యలు ఇటీవల వేధింపులు ఎక్కువ చేశారు. తీవ్ర మనస్తాపం చెందిన రాజేశ్వరి రెండు రోజుల క్రితం దోమల నివారణకు వాడే ఆలౌట్ ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన అత్తమామలు.. కోడలు చనిపోతే కేసు తమ మీదకు వస్తుందని భయపడి ఆమెను తొలుత అర్ధవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన తన వల్ల కాదని చెప్పడంతో కంభంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గుంటూరు తీసుకెళ్లారు. కోలుకున్న అనంతరం శుక్రవారం సాయంత్రం తిరిగి కొత్తూరు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ కుమార్తెను భర్త, అత్తమామలు కలిసి సంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జి ఎస్ఐ రామానాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అనుమతులు లేని పరిశ్రమలు
కొత్తూరు ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండానే వెలుస్తున్నాయి. ఏవైనా ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరిగే వరకు ఇలాంటి పరిశ్రమలు కొనసాగుతున్నాయనే విషయం ఉన్నతాధికారులకు తెలియడం లేదు. స్థానిక అధికారుల ఉదాసీనతతోనే ఇలాంటి పరిశ్రమలు వెలుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు తీసుకోకపోవడంతో ప్రభుత్వానికి అయా పన్నుల రూపంలో రావాల్సిన లక్షల రూపాయలు కూడా రావడం లేదు. ప్రస్తుతం షాద్‌నగర్ నియోజకవర్గంలో 313 పరిశ్రమలు కొనసాగుతుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నట్లు పరిశ్రమల శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. – కొత్తూరు కొత్తూరు: హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భా గంగా నగర సమీపంలోని కాలుష్యకారక పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని అధికారులు ఇప్పటికే నిర్వాహకులకు నోటీసులు అందించారు. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తూ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అయితే, వ్యవసాయ భూములను కొనుగోలు తర్వాత ప్రభుత్వానికి నిర్ణీత పన్నులు చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ, పదెకరాలు కొనుగోలు చేస్తే కేవలం రెండు, మూడెకరాలు మాత్రమే వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీతో పాటు అన్ని శాఖల నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ మాత్రం బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందేందుకు వీలుగా ఉండే అనుమతులు మాత్రమే పొందుతున్నారు. పరిశ్రమల నిర్మాణాలను సంబంధించిన పత్రాలను పంచాయతీకి అందిస్తే వారు ఆ నిర్మాణాల ఆధారంగా ప్రతి ఏడాది పన్నులు వసూలు చేస్తారు. కాగా నిర్వాహకులు పూర్తిసా ్థయి నిర్మాణ పత్రాలను ఇవ్వడం లేదు. దీంతో పన్నులు తక్కువగా వసూలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతోన్న పరిశ్రమల్లో తదుపరి అవసరాల కోసం కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అనుమతులు తీసుకోవడంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాము టీఎస్ ఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్నాం.. అన్ని అనుమతులు ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ గేటు బయట పరిశ్రమల పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు. పట్టించుకోని అధికారులు..... ప్రభుత్వ అనుమతులు లేకుండా చిన్న షెడ్డును నిర్మించిన వారిపై చర్యలు తీసుకునే సంబంధిత శాఖ అధికారులు ఏకంగా పరిశ్రమలను స్థాపించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్తూరు మండలంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న గోదాములు, పరిశ్రమలు, అప్పటికే కొనసాగుతున్న వాటి వివరాలు అధికారులకు తెలిసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదిస్తాం... అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసే పరిశ్రమలు, గోదాముల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పరిశ్రమలపై మాకు సమాచారం లేదు. – సాధన, ఈవోపీఆర్డీ, కొత్తూరు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొత్తూరు : మండలంలోని పారాపురం గ్రామానికి చెందిన అల్లు గోవిందరావు(28) శ్రీకాకుళం రూరల్ మండలం ఆర్టీసీ క్రాంతినగర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో పారాపురంలో విషాదం అలముకొంది. మోటారు సైకిల్ ప్రమాదంలో మృతి చెందిన గోవిందరావుకు ఏడాదిన్నర కిందట వివాహమైంది. ఈయనకు భార్య రోహిణి, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. మృతుడు కొత్తూరులో ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాడు. గోవిందరావు మృతితో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. -
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం?
కొత్తూరు: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. ఏదో ఓ చోట నిత్యం వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొత్తూరులో ఓ గుర్తుతెలియని మానవమృగం ముద్దులొలికే ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కి చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా చిరువ్యాపారం చేసుకుంటూ కొత్తూరులో నివాసం ఉంటుంది. ఏడేళ్ల తన కూతురిని స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదివిస్తోంది. కాగా, ఈ నెల 10వ తేదీన రాత్రి 8గంటల సమయంలో కూతురు కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన పాప, జరిగిన విషయం తల్లికి చెప్పింది. తర్వాతి రోజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం ఏఎస్పీ కల్మేశ్వర్ సింగనవర్, రూరల్ సీఐ మధుసూదన్, ఎస్ఐలు శ్రీశైలం, వీరబాబు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించామని, వైద్యుల రిపోర్టు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని సీఐ మధుసూదన్ పేర్కొన్నారు. -
కొత్తూరులో కిడ్నాప్ కలకలం
కొత్తూరు : కొత్తూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆర్ఎంపీ (ఆయుర్వేదిక్) వైద్యుడిని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కిడ్నాప్ చేశారన్న వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగి 24 గంటలు గడిచినప్పటికీ సదరు వైద్యుడిని ఎవరు తీసుకువెళ్లారన్న విషయంలో స్పష్ట త కొరవడింది. మంగళవారం వైద్యుడి కుటుంబ సభ్యులు కొత్తూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్టు తెలియవచ్చింది. ఈ ఆర్ఎంపీ వైద్యుడు ఎవరు ? ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విషయమై కొత్తూరు పీఎస్సై జనార్దనరావు వద్ద ప్రస్తావించగా.. కిడ్నాప్ ఘటనపై తమ కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. హల్చల్ చేస్తున్న ఉదంతాలు... ఇటీవల సీతంపేట ఏజెన్సీ దొనుబాయి కేంద్రంగా పురాతన రాగి నాణేలు క్రయ, విక్రయాల జరిగిన విషయం బయట పడటంతో పోలీసులు నిఘా పెంచారని వదంతులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనుమానితులను పోలీసులు ఆదుపులోకి తీసుకుంటున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యుడితో పాటు సీతంపేట, కొత్తూరు మండలాలకు చెందిన మరికొంత మందిని కూడా పోలీసులు ఆదుపులోకి తీసుకొన్నారని వందలు వినిపిస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులు సైతం పాలకొండ, సీతంపేట, వీరఘట్టాం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. -
కొత్తూరులో ఉద్రిక్తత
కొత్తూరు: వైవీఆర్ ఫైనాన్స్ బాధితులు రోడ్డెక్కారు. తప్పించుకు తిరుగుతున్న ఫైనాన్స్ యజమానిని పట్టుకున్నారు. తమ డబ్బులు చెల్లించాలని నిలదీశారు. వందలాది మంది బాధితులు ఆయన చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి యజమానిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటన గురువారం ఉదయం కొత్తూరులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హిరమండలం మండలం కొండరాగోలు గ్రామానికి చెందిన యాళ్ల వెంకటరావు సుమారు 10ఏళ్ల నుంచి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. వైవీఆర్(యాళ్ల వెంకటరావు) ఫైనాన్స్ పేరుతో కొత్తూరు, హిరమండలం, పాతపట్నంతో పాటు ఒడిశా రాష్ట్రంలోని బొత్తవ, బూదర, విస్తల గ్రామాల్లో ప్రజల నుంచి వడ్డీ చెల్లిస్తామని డబ్బులు సేకరించాడు. సుమారు రూ. 2 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బులు తిరిగి చెల్లించకుండా గత నాలుగు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. దీనిని గమనించిన బాధితులు కొందరు కొండరాగోలులోని ఆయన ఇంటికి గురువారం తెల్లవారుజామున చేరుకున్నారు. ఇచ్చిన అప్పు తీర్చాలని నిలదీశారు. అక్కడ నుంచి ఆయనను కొత్తూరు తీసుకొచ్చారు. ఈ సమాచారం తెలియడంతో వందలాది మంది బాధితులు చేరుకున్నారు. తీసుకున్న అప్పు తీర్చాలని వెంకటరావును నిలదీశారు. సమాధానం చెప్పకపోవడంతో కొందరు ఆయనపై చేయిచేసుకున్నారు. బాధితులంతా ఫైనాన్స్ యజమాని చుట్టుముట్టడంతో కొత్తూరులోని రాజవీధిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక దశలో తోపులాట చోటు చేసుకొంది. తీసుకొన్న అప్పు తీర్చేవరకు విడిచిపెట్టేది లేదన్నారు. అప్పుకు హామీ ఇవ్వాలని, కుటుంబ సభ్యులను పిలవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ విషయం ఎస్పీకి తెలియడంతో స్థానిక ఎస్ఐ విజయకుమార్‌ను సంఘటన స్థలం వద్దకు పంపించారు. ఎస్ఐ వచ్చి ఫైనాన్స్ యజమానితో మాట్లాడి స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. కోట్ల రూపాయలు అప్పలు తీసుకొన్న వెంకటరావును మా దగ్గరే ఉంచి న్యాయం చేయాలని బాధితులు పట్టుపట్టారు. స్టేషన్‌కు తీసుకెళ్లే యత్నాన్ని ప్రతిఘటించారు. దీంతో ఎస్ఐ బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు బాధితులకు నచ్చజెప్పి ఫైనాన్స వ్యాపారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పుచేసిన సొమ్ము ఏం చేశారన్నదానిపై ఆరా తీస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జరిగిన సంఘటనపై బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. వెంకటరావు గతంలో కూడా పలు మండలాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేసినట్టు పలువురు చెబుతున్నారు. వడ్డీలు చెల్లించి నష్టపోయా ఈ సంఘటనపై వైవీఆర్ ఫైనాన్స్ యజమాని యాళ్ల వెంకటరావును ‘సాక్షి’ ప్రశ్నించగా ప్రజలు దగ్గర తీసుకొన్న అప్పుకు వడ్డీలు చెల్లించి నష్టపోయినట్టు చెప్పారు. ఇతరులకు ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడంతో నష్టపోయినట్టు తెలిపారు. -
వంశధార కాల్వ పనుల వద్ద ఉద్రిక్తత
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనబద్ర కాలనీ వద్ద వంశధార రిజర్వాయరు వరదకాల్వ పనులను బుధవారం ఉదయం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ కాలనీని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ గ్రామస్తులతో చర్చించారు. ఇంజనీరింగ్ అధికారులతో సర్వే చేయించి ముంపు ప్రాంతం అని తేలితే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. -
అక్కడ కోడి కూత వినబడదు
పల్లెల్లో కోడి కూస్తే తెల్లారినట్టు.. కోడి కూతతోనే గ్రామీణులు మంచాలు దిగుతారు. అందుకే ఆ కూతను జగతికి మేలుకొలుపుగా వర్ణించాడో సినీ కవి. కానీ కొత్తూరు మండలం ఎన్ని రామన్నపేటలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ ఊళ్లో కోడి కూతే వినబడదు. కోడి జాడే కనిపించదు. సుమారు 40 సంత్సరాలు క్రితం గ్రామంలో కోడి పెంపకాలను పెద్దలు నిషేధించారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఏడాదికోసారి వచ్చే అమ్మవారికి మొక్కులకు మాత్రం చిన్నపాటి మినహాయింపు. అది కూడా ముందు రోజు రాత్రి తీసుకొచ్చి తెల్లవారుజామున చడీచప్పుడు లేకుండా కోడిని కోస్తారు. ఇక్కడ జనాభా సుమారు 500 మంది ఉంటారు. కోళ్లు పంటలకు నష్టం కలిగిస్తున్నాయని తరచూ వివాదాలు చెలరేగడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామానికి చెందిన జి.సింహచలం, రామయ్య తెలిపారు. కోడిమాంస ప్రియులు మాత్రం పొరుగూరుకు వెళ్లి చికెన్ తెచ్చుకుంటున్నారు. -కొత్తూరు -
రేపే సువిధ ప్రాజెక్ట్ ప్రారంభం!
కొత్తూరు, షాద్‌నగర్ ప్రాంతాల్లో పలు ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిన శతాబ్ది టౌన్షిప్ ప్రై.లి. మహేశ్వరం మండలంలోని అమీర్‌పేట్ గ్రామంలో సువిధ పేరుతో మెగా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనుంది. ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్న ఈ వెంచర్ విశేషాలను సంస్థ ఎండీ కే శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ఆయనేమన్నారంటే.. ♦ 60 ఎకరాల్లో సువిధ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫేజ్-1లో 25 ఎకరాలకు హెచ్ ఎండీఏ అనుమతి కూడా పొందాం. ఇందులో 165-400 గజాల మధ్య ఓపెన్ ప్లాట్లుంటాయి. గజం ధర రూ.4,000. కేవలం ప్లాట్ల అమ్మకాలే కాకుండా తొలి విడతగా 100 ఇళ్లను కూడా నిర్మించాలని నిర్ణయించాం. ♦ ప్రాజెక్ట్ ప్రత్యేకతేంటంటే.. 60 ఫీట్ల వెడల్పుండే ప్రధాన రహదారిలో మొత్తం సోలార్ వీధి దీపాలే. కొనుగోలుదారుల ఆరోగ్యం దృష్ట్యా ప్రాజెక్ట్‌లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. 2 వేల గజాల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ♦ గతంలో కొత్తూరులో 15 ఎకరాల్లో మగధ, ఇదే ప్రాంతంలో 45 ఎకరాల్లో శతాబ్ది వ్యాల్యూ వెంచర్లను పూర్తి చేశాం. షాద్‌నగర్‌లో 40 ఎకరాల్లో వసుధ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతమిందులో 15 ఎకరాల్లో అమ్మకాలున్నాయి. గజం ధర రూ.2 వేలు. -
లేఆఫ్ ఎత్తివేయాలని కార్మికుల ధర్నా
కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని జూట్ మిల్లు లేఆఫ్ ప్రకటించడంతో కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. లేఆఫ్ ఎత్తివేయాలని, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై తహశీల్దారు చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో 60 మంది కార్మికులు పాల్గొన్నారు. -
ఇద్దరు ఉపాధిహామీ సిబ్బంది సస్పెన్షన్
కొత్తూరు (శ్రీకాకుళం) : అవినీతికి పాల్పడిన ఇద్దరు ఉపాధి హామీ సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహం గురువారం కొత్తూరు మండల కేంద్రంలో జరిగిన ఉపాధి హామీ ప్రజా వేదికలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. -
కొత్తూరులో భారీ వర్షం
శ్రీకాకుళం (కొత్తూరు) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. అరటి చెట్లు నేలకూలాయి. -
జల్లెడ పడుతున్న పోలీస్‌లు
కొత్తూరు/భామిని:మావోయిస్టుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కావడంతో పాటు కొత్తూరు-భామిని మండలాలకు అనుకొని ఉన్న తివ్వకొండలు మావోలకు సేఫ్ జోన్ కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. స్థానిక సీఐ కె.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కొత్తూరు నాలుగు రోడ్ల కూడలితో పాటు బత్తిలి రోడ్డు నుంచి వచ్చిన ప్రతి వాహనాన్ని గురువారం నిశితంగా పరిశీలించారు. ఒడిశా నుంచి వచ్చే వాహనాలను మరింత జాగ్రత్తగా తనిఖీ చేపట్టారు. అపరిచిత వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు స్థానిక సర్కిల్ పరిధిలో మొహరించాయి. సీతంపేట, భామిని మండలాలతో పాటు ఒడిశాకు చెందిన కొన్ని గ్రామాలకు కొత్తూరు ప్రధాన కేంద్రం కావడంతో మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సర్కిల్ పరిధిలోని కొత్తూరు, దోనుబాయి, సీతంపేట, బత్తిలి పోలీస్ స్టేషన్లు పూర్తిగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా చర్యలు చేపట్టారు. సీతంపేట, భామిని ఏజెన్సీ ప్రాంతాల్లో కూబింగ్లు నిర్వహిస్తూ జల్లేడ పడుతున్నారు. లాడ్జీలను సైతం గురువారం రాత్రి పోలీసులు పరిశీలించారు. తనిఖీల్లో ఎస్సై వి.రమేష్, ఏఎస్ఐ ప్రసాద్, ప్రత్యేక పోలీస్ బలగాలు పాల్గొన్నాయి.భామిని మండలంలో బత్తిలి ఎస్ఐ సీహెచ్ రామారావు ఆధ్వర్యంలో సాయుధ పోలీసు బలగాలతో ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. జామిగూడ, ఇప్పమానుగూడ, మాసగూడ, ఘనసర పరిసరాల్లో ఎస్టీఎఫ్ దళాలతో కూంబింగ్ చేపట్టారు. సరిహద్దులో అనుమానితులపై నిఘా పెంచారు. అనంతరం ఏబీ రోడ్డు వెంబడి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. -
కష్టమే వచ్చిందో..కడతేర్చారో?
తల్లీ, కూతుళ్లు అనుమనాస్పద మృతి హత్యేనని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ, పోలీసులకు ఫిర్యాదు కష్టమే వచ్చిందో.. కడతేర్చారో తెలియదుగాని తల్లీ, కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఉరిపోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారో, ఎవరో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారో తెలియదుగాని శవాలై చెట్టుకు వేలాడారు. ఈ విషాద ఘటన కొత్తూరు మండలంలోని కర్లెమ్మ పంచాయతీ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. కొత్తూరు: కర్లెమ్మ పంచాయతీ పరిధిలోని ఎన్ఎన్ కాలనీలో ఉంటున్న అగ్నిమాపకశాఖ మాజీ ఉద్యోగి పి.సుందరనారాయణ తన మొదటి భార్య చనిపోవడంతో ఒడిశా రాష్ట్రంలోని జీబ గ్రామానికి చెందిన సరోజినిని (35) ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండో తరగతి చదువుతున్న సంజినీ (7) కుమార్తె ఉంది. శనివారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన సరోజిని కుమార్తె సంజినీ తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై సరోజిని కన్నవారింటికి ఫోన్లు చేయగా రాలేదని సమాధానం వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లీ, కుమార్తె కర్లెమ్మ గ్రామ సమీపంలో మామిడితోటలోని ఓ చెట్టుకు చీర కొంగుతో ఉరిపోసుకొని వేలాడుతూ శవాలై ఆదివారం ఉదయం కనిపించారు. చీరను రెండు ముక్కలు చేసి ఒక కొంగుతో సరోజిని, మరో కొంగుతో చిన్నారి సంజినీ వేర్వేరు చెట్లకు ఉరిపోసుకొని ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. సంజినీ మృతదేహం నేలకు తాకుతూ ఉంది. కిందని బిస్కెట్ ప్యాకెట్, తల్లీ కుమార్తె చెప్పులు ఉన్నాయి. విషయాన్ని వీఆర్వో కృష్ణచంద్ర పట్నాయక్‌కు తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్చార్జి ఎస్సై రామకృష్ణ , ఆర్ఐ వై.కూర్మనాయుకులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సుందరనారాయణ, అతని మొదటి భార్య కుమార్తెలే తన కుమార్తె సరోజిని, మనమరాలు సంజినీ హత్య చేసి చెట్టుకు వేలాడదీసేశారని అనుమానం వ్యక్తం చేస్తూ సరోజిని తండ్రి దుర్జన కొత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఇన్చార్జి ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎన్నో అనుమానాలు! తల్లీ, కూతురు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరోజిని తెలియని, నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో తల్లీ, బిడ్డలను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శవాలను మామిడి తోటలోకి తీసుకొచ్చి చెట్లకు వేలాడిదీసి ఉంటారనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుందరనారాయణ, ఆయన మొదటి భార్య కుమార్తెలు కలిసి తల్లీ కూతురును నిత్యం వేధిస్తుండేవారని, కన్నవారి ఇంటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడంతోపాటు సూటిపోటు మాటలతో ఇబ్బందులకు గురి చేయడంతో పలుమార్లు విషయాన్ని సరోజని తన తండ్రి దుర్జనకు తెలిపినట్లు సమాచారం. కాగా సరోజిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుందరనారాయణ, అతని తొలి భార్య కుమార్తెలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సరోజని కూతురుతో కలసి ఇంటి నుంచి వచ్చిన గంట ముందు లెట్రిన్ ట్యాంకు విషయమై కుటుంబ సభ్యులతో వివాదం జరిగినట్టు సమాచారం. కాగా సరోజని, కుమార్తెలతో కలిసి సుందరనారాయణ ఇటీవల వారం రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్లి.. రాజమండ్రి పుష్కర స్నానాలు ఆచరించి ఈ నెల 14 తేదీ రాత్రే ఇంటికి చేరారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో గ్రామస్తులు తీవ్ర విషాదానికి గురయ్యారు. -
గజరాజుల హల్చల్
కొత్తూరు : ఏజెన్సీలోని గూడల్లో రోజూ ఏదో ఒక ప్రాంతంలో గజరాజులు హడావుడి చేస్తున్నాయి. గిరిజనుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కొత్తూరు మండలం లబ్బ పంచాయతీ పరిధి ఎగువ దొండమామిడిగూడలో హల్చల్ చేశాయి. గిరిజనగూడ శివారున ఉన్న సవర పంచారకు చెందిన పూరిపాక గోడను తోసి ధ్వంసం చేశాయి. ఏనుగుల ఘీంకారాలతో గ్రామం మార్మోగింది. దీంతో గిరిజనులు ఆందోళన చెంది రాత్రంతా ప్రాణాలు అరచేతపట్టుకుని జాగారం ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఇంట్లోకి చొరబడతాయేమోనని రాత్రంతా కాపలాకాశారు. అదే గ్రామానికి చెందిన సవర సన్నాయి, కుమారి, సింహాద్రి, గయారిలకు చెందిన అరటి, పైనాపిల్, కొండచీపురు పంటలను నాశనం చేశాయి. ఏనుగులు నష్టపరిచిన పంటలను, ధ్వంసం చేసిన గోడను పాతపట్నం ట్రైనీ రేంజర్ మురళీకృష్ణ శనివారం పరిశీలించారు. గిరిజనులకు జరిగిన నష్టాలను నమోదు చేసుకున్నారు. ఏనుగుల గుంపు కనిపించినప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఏనుగుల గుంపుపై రాళ్ళు విసరొద్దన్నారు. ఆయనతో పాటు ఏనుగుల ట్రాకర్స్ ఉన్నారు. రూ. 5.5 లక్షల పరిహారం ఏనుగులు నష్టపరిచిన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ.5.5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఫారెస్టు సెక్షన్ అధికారి, ట్రైనీ రేంజర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ నిధులతో హిరమండలం, సీతంపేట మండలాల్లో నష్టపరిచిన పంటలకు ముందుగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఏనుగులు గిరిజన గ్రామాల్లోకి చొరబడకుండా కందిరీగల శబ్దం వచ్చే మెషీన్లతో చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఆ శబ్దం వస్తే ఏనుగులు అటువైపు రావని చెప్పారు. గతంలో కారప్పొడితో మంటలు పెట్టామన్నారు. ఈ సారి నూతనంగా వచ్చిన కందిరీగ శబ్దాలతో ఏనుగులను అడవుల్లోకి పంపిస్తున్నామని తెలిపారు. -
ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు
నూతన ఇసుక విధానం వచ్చినా... నివగాం సమీప వంశధార నదిలో రెండు నెలల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనివెనుక ‘ఉపాధి’ పథకంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తుండగా, అక్రమ తవ్వకం దారుల నుంచి.. దేవుడి పేరిట వసూళ్లకు పాల్పడుతూ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తూరు: మండలంలోని నివగాం గ్రామ సమీప వంశధార నది వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. రెండు నెలల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతన్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది. తవ్వకందారుల నుంచి కొం తమంది దేవుడు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ తంతుపై ‘సాక్షి’లో పలు దఫాలు కథనాలు వచ్చినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అక్రమ తవ్వకాల దందా రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో రోజూ వేలాది రూపాయులను దేవుడు పేరుతో కొంత మంది జేబులు నింపుకుంటున్నారు. సూత్రధారి ఈయనే.... అక్రమ వసూళ్ల వెనుక గ్రామంలో ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పాత్ర ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నివగాంలో పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇసుక తవ్వకందారుల నుంచి కొందరు రోజూ కొంతమొత్తం వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నా రు. వీరిని ఇటీవల గ్రామస్తులు కొందరు నిలదీయంతో పెద్ద వివాదమే ఏర్పడిం దని, అయినా ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడంలేదని చెబుతున్నారు. దేవుడి పేరిట వసూలు చేస్తున్న మొత్తంలో కొం త సంబంధిత అధికారులకు చెల్లిస్తున్నామని, తవ్వకాలను ఎవ్వరూ అడ్డుకోలేరని సదరు అక్రమ తవ్వకందారులు బరి తెగించి చెబుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. రెండు నెలల నుంచి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఇంత వరకు పోలీస్, రెవెన్యూ అధికారుల నిఘాలేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక లోడ్లను పట్టపగలే బహిరంగంగా తీసుకెళ్తున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చర్యలు తీసుకుంటా... నివగాం వద్ద జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రాతపూరకంగా ఫిర్యాదు అందితే పరిశీలించి తగు చర్యలు తీసు కుంటానని కొత్తూరు తహశీల్దార్ డి. చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు నిఘా వేయాలని వీ ఆర్వో, వీఆర్ఏలను ఆదేశించామన్నారు. -
ఒక్క అర్హుడ్ని కూడా వదలం... : కేసీఆర్
మహబూబ్‌నగర్ : అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆసరా' పథకాన్ని శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందన్నారు. అర్హులైనవారికి పింఛన్లు రాకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. 'ఒక్క అర్హుడ్ని కూడా వదలం...ఒక్క అనర్హుడ్ని రానీవ్వం' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు పెన్షన్లపై తమాషా చేశాయని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. 30ఏళ్ల వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు ఇచ్చారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో అనర్హులకు ఇచ్చిన పింఛన్లు రద్దు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇకపై రేషన్ కార్డుపై రూపాయికి కిలో చొప్పున మనిషికి ఆరుకిలోలు బియ్యం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అర్హులైనవారి రేషన్ కార్డులు తొలగించే ప్రసక్తే లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తామని కేసీఆర్ తెలిపారు. గ్రామీణ రోడ్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.